తత్త్వత్రయం – శ్రీ పిళ్ళైలోకాచార్యులు అనుగ్రహించిన తత్వ త్రయము గ్రంథ పరిచయము

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

మనము ఇంతవరకు అయిప్పసి (తులా మాసము) మాసములో అవతరించిన ఆళ్వారాచార్యుల దివ్యానుభవములను తెలుసుకుంటున్నాము. మరిన్ని వివరముల కొరకు https://srivaishnavagranthamstelugu.wordpress.com/thathva-thrayam/ లింక్ చూడవచ్చును. ఇప్పుడు మనము పరమ కారుణికులు,దివ్య వైభవము కలిగిన శ్రీపిళ్ళైలోకాచార్యుల గురించి మరియు వారు రచించిన చిన్న శ్రీభాష్యమైన “తత్వత్రయము” గ్రంథము, దానికి స్వామి మణవాళ మహామునులు అనుగ్రహించిన వ్యాఖ్యానావతారికను తెలుసుకుందాము.

ఎమ్బెరుమానార్, శ్రీపిళ్ళైలోకాచార్యులు, స్వామి మణవాళ మహామునులు -తిరుప్పవళ వణ్ణం దివ్య దేశం
“తత్వత్రయము” అను ఈ గ్రంథము “చిన్న శ్రీభాష్యము” గా మన సంప్రదాయములో ప్రసిద్ధి గాంచినది. శ్రీభాష్యకార బిరుదాంకితులైన భగవద్రామానుజులు బ్రహ్మ సూత్రములకు అద్భుతమైన, సరళమైన వ్యాఖ్యానమును అనుగ్రహించారు. ఆ వ్యాఖ్యానమే “శ్రీభాష్యము” గా సుప్రసిద్ధమైనది. విశిష్టాద్వైత సిద్ధాంతమునకు అవసరమైన అన్ని ప్రధాన ప్రమాణములు ఇందులో ఇమిడియున్నవి. అయితే శ్రీభాష్యము సంస్కృతములో ఉండుట చేత సంస్కృత భాషాప్రవేశము లేనివారికి శ్రీభాష్యమునందలి విషయములు తెలుసుకొనుటకు కష్టసాధ్యముగానుండెను. శ్రీపిళ్ళైలోకాచార్యులవారు శ్రీభాష్యము యొక్క సారమును “తత్వ త్రయము” అను గ్రంథములో పొందుపరిచి ద్రావిడ భాషలో సామాన్యులకు సైతం సులభముగా అర్థమగు రీతిలో రచించారు. ఈ గ్రంథములో వేదాంతమునందలి ప్రాథమిక విషయములైన చిత్తు, అచిత్తు, మరియు ఈశ్వరుడు అను మూడు విషయములగూర్చి విశదీకరించుట జరిగినది. తత్వత్రయం గ్రంథము యొక్క సారాంశము ఈ లింకులో చదువుకొనవచ్చును.

ఇక స్వామి మణవాళ మహామునులు ఈ గ్రంథమునకు అనుగ్రహించిన ఉపోద్ఘాతమును చూద్దాము

“అనాది మాయయా సుప్తః”అనునట్లు, అనంతకోటి సంవత్సరాలుగా ఎడతెగని ఈ కాలచక్రములో జీవుడు పంచభూతాత్మకమైన ఈ ప్రకృతి సంబంధము చేత కర్మలు ఆచరించుచూ వాటి వల్ల సంక్రమించే పుణ్య పాపముల ఫలితముగా జననమరణ చక్రములో పడి అలమటిస్తున్నాడు. అజ్ఞానమనెడి అంధకారంలో చిక్కుకున్న జీవుడు తాను వేరు ప్రక్రుతి వేరు అన్న సత్యమును (తెలిసినచో కేవలము భగవత్కళ్యాణ గుణములనే స్మరిస్తూ భగవంతుని అనుభవిస్తూ ఈ ప్రకృతిని విస్మరించెడివాడు) మరచి తానూ ప్రకృతిలో ఒకనిగా భావించి ఈ ప్రకృతినే అనుభవిస్తూ కాలము గడుపుతున్నాడు. అటువంటి అజ్ఞానముతో జీవుడు
 • “దేహోZహమ్, మనుష్యోహమ్”, నేను దేహిని, మనుష్యుడును – అనే మాయలో దేహము తానూ ఒకరే అని భ్రమపడుతున్నాడు.
 • “ఈశ్వరోZహమ్ అహం భోగి”, నేనే ఈశ్వరుడను, స్వతంత్రుడను – తానూ శరీరమూ వేరన్న భావము జీవునికి కలిగిననూ, తానే భగవంతుడనని భావించి, తాను స్వతంత్రుడనని భ్రమిస్తున్నాడు.
 • తాను పరతంత్రుడనని భావించిననూ, భగవంతుని సేవకుడైన జీవుడు, తగు భగవత్కైంకర్యములను చేయక ప్రాపంచిక భోగములలో మునిగి తేలుచున్నాడు.

“యోzన్యథా సంతమానం అన్యథా ప్రతిపద్యతే, కిమ్ తేన న కృతం పాపమ్ చోరేణాత్మాపహారినా”, జీవుడు తన యొక్క స్వరూపజ్ఞానమును (తాను భగవంతుని దాసుడనన్న సత్యమును) విస్మరించి ప్రాపంచిక కార్యకలాపములందు నిమగ్నుడగుట ఆత్మచౌర్యమే అవుతుంది. తనది కాని వస్తువైన ఆత్మను తనదిగా భావించి తనది కాని శరీరమునకు ఆత్మను ఆపాదించి అశాశ్వతమైన, కర్మప్రదమైన ప్రాపంచిక సుఖములనుభవించుట పాపములలోకెల్లా మహా పాపమైనదని దీని భావము.

“విచిత్ర దేహ సంపత్తిర్ ఈశ్వరాయ నివేదితుం, పూర్వమేవ కృతా బ్రహ్మన్ హస్తపాదాది సంయుతా”, అని చెప్పినట్లు పూర్వము ప్రళయ సముద్రమునందు విశ్వము గాఢాంధకారమైయుండి, సృష్టి చేయునపుడు, సర్వేశ్వరుడు తన యొక్క నిర్హేతుక కృప చేత అప్పటివరకు అస్థిత్వము లేని జీవునికి శరీరమును, ఇంద్రియములను ఇచ్చి వాటి ద్వారా తనకు దాస్యము చేసి తరించి చివరికి తన శ్రీచరణాలను చేరమని  ఆశీర్వదించెను.

శ్రీనమ్మాళ్వారులుశ్రీరంగనాథుని యందు జీవులను అనుక్షణం ప్రేమతో అనుగ్రహించెడి  “వ్యూహ సౌహార్ద్రత” అను కళ్యాణగుణమును బాగుగా అనుభవించియున్నారు.
తిరువాయిమొళి, 3.2.1 లో, “అన్నాళ్ నీ తంద అక్కైయిన్ వాళి ఉళల్వేన్” అని  చెప్పినట్టుగా, జీవుడు భగవదనుగ్రహము చేత పొందిన శరీరేంద్రియములను దుర్వినియోగపరుచుచూ భౌతికసుఖలోలుడై కాలము గడుపుచున్నాడు. నది దాటుటకు పడవను పొంది నది దాటకపోగా, ఆ పడవలో సముద్రములోనికి పోయి అలలాడినట్లు, ఈ జీవుడు పాంచభౌతిక శరీరమును తానేయని భ్రమించి స్వార్థపూరిత కర్మలు ఆచరించుచూ సంసారసాగరములో కొట్టుమిట్టాడుచున్నాడు. చేసిన కర్మల ఫలితముగా మరల మరల జన్మించుచూ తాపత్రయగ్రస్థుడై గర్భస్థ, జన్మ, కౌమార, యవ్వన, మరణ అనెడి దశలను గడిపి చేసిన పాప కర్మల ఫలితముగా నరకముననుభవించి, పుణ్య కర్మల ఫలితముగా ఉత్తమ జన్మలెత్తుతూ అలా పడుతూ లేస్తూ ఈ జననమరణ చక్రములో తిరుగుచున్నాడు. “ఏవం సంస్మృతి చక్రస్థే భ్రామ్యమాణే స్వకర్మభిః జీవే దుఃఖాకులే కృపా కాపి ఉపజాయతే “, అనునట్లు భగవానుడైన శ్రీమహావిష్ణువు జీవులపట్ల తనకుగల నిర్హేతుక కృప చేత జీవులను సంసారసాగరము నుంచి ఉద్ధరించుటకు అనేక అవతారాల ఎత్తి ధర్మ రక్షణ, శిష్ట రక్షణ చేస్తూనే ఉన్నాడు. “జాయమానమ్ యమ్ పశ్యేన్ మధుసూదనః సాత్విక స్సతు విజ్ఞేయః సవై మోక్షార్థ చిన్తకః”, జీవుడు తల్లి గర్భములో జనించునపుడు తాను ఎటుల తరించవలెనో తెలుసుకుని సత్యమైన జ్ఞానమును పొంది సాత్వికుడై విష్ణువును ఆశ్రయించి మెలిగినపుడే ముముక్షుత్వము సాధించినవాడు అవుతాడు.   

సత్యమైన నిజ జ్ఞానము పొందేందుకు రెండు దారులు కలవు : 1) శాస్త్రము 2) ఉపదేశము (ఆచార్యోపదేశముగా పొందేది )

శాస్త్రాధ్యయనము వలన కొన్ని ఇబ్బందులు కలవు,
 • “శాస్త్ర జ్ఞానం బహు క్లేశం “, అనునట్లు శాస్త్రాధ్యయనము బహు క్లిష్టతరమైనది. అందు విషయము అంత సులభముగా అవగతపడదు. పదములకు గల నానార్థముల వలన శాస్త్ర వాక్యాలకు వివిధములైన అర్థములు స్ఫురించి ఏ అర్థమును అన్వయించుకొనవలెనో తెలియక చివరికి అజ్ఞానావస్థలోనే మిగిలిపోయే ప్రమాదం కలదు.
 • ఒకవేళ అంత శ్రమను ఓర్చి శాస్త్రజ్ఞానము సొంతముగా పొందగోరిననేమి, “అనంత భారమ్ బహు వేదితవ్యం అల్పచ్చ కాలో బహవశ్చ విఘ్నా:”, అనునట్లు జీవుడు తనకు గల పరిమిత జీవిత కాలములో మరియు, పరిమితమైన బుద్ధి చేత అనంత సాగరమైన శాస్త్రమును తెలియగోరుట అసాధ్యమే అవుతుంది.
 • చివరగా జీవులలో ఆడవారు, శూద్రులు శాస్త్రాధ్యయనమునకు నిషిద్ధులు. అయితే ముముక్షుత్వమునకు వారు అర్హులు.

అయితే శాస్త్రాధ్యయనము చేసిన పెద్దలైన ఆచార్యులను ఆశ్రయించి వారి వద్ద శాస్త్రజ్ఞానమును ఉపదేశముగా పొందవచ్చును. దానికి ఎటువంటి ఆంక్షలు లేవు. శాస్త్రజ్ఞులైన గురువులు అపారమైన శాస్త్రజ్ఞానమును అవపోశన పెట్టినవారు గనుక శిష్యుని యొక్క బుద్ధి పరిమితులను బట్టి శిష్యుడు సుకరముగా తరించుటకు ఎంత జ్ఞానము అవసరమో అంతే ఉపదేశిస్తారు. ఏ భాషలో (అంటే అత్యంత క్లిష్టమైన భాషలో శాస్త్రమున్ననూ దానిని సంస్కరించి శిష్యునికి అర్థమగునట్లు లలితముగా చిన్న చిన్న పదాలతో ఆళ్వార్లు రచించిన పాశురముల వలె గురువు శాస్త్రార్థములను శిష్యునికి ఉపదేశిస్తాడు.) చెబితే శిష్యునికి అర్థమవుతుందో ఆ భాషలో గురువు ఉపదేశిస్తాడు.

అందువలన పరమ కారుణికులైన శ్రీపిళ్ళైలోకాచార్యులు వేదాంత శాస్త్రమును ఆసాంతం అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞులైననూ జీవుల పట్ల గల నిర్హేతుక కృప చేత అందరికీ అర్థమగునట్లు లలితమైన భాషలో వేదాంతమునకు మూల వస్తువులైన చిత్తు, అచిత్తు మరియు ఈశ్వరుడు అను మూడు విషయముల గూర్చి ఈ తత్వ త్రయమను గ్రంథమును రచించియున్నారు.
పూర్వాచార్యులైన నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్, మరియు పెరియ వాచ్చాన్ పిళ్ళై వంటివారు కూడా క్లిష్టతరమైన వేదాంతశాస్త్రమును సులభరీతిలో జనులకు అర్థమగునట్లు తమ గ్రంథములు ద్రావిడభాషలో రచించుటకు కారణం జీవులపట్ల తమకు గల నిర్హేతుక కృప మాత్రమే. ఎందుకంటే మన పూర్వాచార్యులు
 • అహంకార రహితులు
 • జీవుల పట్ల ఎల్లప్పుడూ అక్కర కలిగినవారు
 • ఎప్పుడూ తమ స్వార్ధము, గొప్పతనము చూసుకోనివారు

మరి ఇందరు ఆచార్యులు ఒకే విషయముపై ఇన్ని గ్రంథములు రచించుట ఎందులకు? ఒకరు రచించిన గ్రంథమునే మిగిలిన వారందరునూ ఒప్పుకొని అన్వయించవచ్చును కదా? దీనికి స్వామి మణవాళ మహామునులు అనుగ్రహించిన వివరణ చూద్దాము:

 • ఆళ్వార్లు ఏకకంఠులు (అంటే శరీరములు వేరువేరైననూ పాడిన పాశురములు ఒక్కటే), ఒకే విషయమగు భగవద్గుణానుభవము గురించి పన్నెండుగురు ఆళ్వార్లు ప్రతిపాదించుట చేత శరణాగతి సిద్ధాంతము మరింత స్థిరీకరించబడినది. ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధమందలి మూల వస్తువు శరణాగతి తత్వమే కదా.  అదే విధముగా పూర్వాచార్యులు కూడా ఏకకంఠులు అగుట చేత దుష్కరమైన వేదాంత తత్వమును వివిధ గ్రంథముల ద్వారా ఒకే విషయమును ఒకే విధముగా ఒక గ్రంథమునకు ఇంకొక గ్రంథము భావ వ్యత్యాసము లేకుండా అంగీకృతముగా నుండు విధమున అనుగ్రహించారు. అందుచేత సిద్ధాంత ప్రమాణములుగా ఈ గ్రంథములు విలసిల్లుచున్నవి.
 •  ఒక గ్రంథమున క్లుప్తముగా వివరించిన విషయము మరొక గ్రంథములో విస్తారముగా చెప్పియుండును. ఇందువలన ఒకదానికి మరొకటి సామరస్యముగానుండును.

ఇదే సూత్రము ఒకే ఆచార్యుడు రచించిన అనేక గ్రంథములకూ వర్తించును. ఒక గ్రంథమందు ప్రతిపాదించిన విషయములను మరొక గ్రంథము ఆదరించుచూ సమన్వయముగలవైయుండును.

శ్రీపిళ్ళైలోకాచార్యులు, స్వామి మణవాళ మహామునులు – శ్రీపెరుంబుదూరు

 

ఈ విధముగా పరమాద్భుతమైన తత్వత్రయ గ్రంథము యొక్క పరిచయము చెప్పబడినది. విశిష్టాద్వైత సిద్ధాంతమందలి క్లిష్టమైన వేదాంత సూత్రములు ఈ గ్రంథములో అత్యంత సులభతరంగా వివరించబడినవి. స్వామి మాణవాళ మహామునుల యొక్క వ్యాఖ్యానము ఈ గ్రంథమునకు మరింత వన్నె తెచ్చినది. ఈ గ్రంథము నిజానికి ఒక ఆచార్యుని ఆశ్రయించి వారి ముఖేన వినదగిన శాస్త్రము. ఆ అవకాశము లేని వారికి ఈ అనువాదం ఒక సుగమవారధిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. పరమకృపాపూర్ణులైన మన పూర్వాచార్యుల దివ్య శ్రీచరణాలను మనసా స్మరించి ఈ గ్రంథములోని మరిన్ని విషయాలను వచ్చే అధ్యాయాలలో తెలుసుకుందామ్!

మూలము : http://ponnadi.blogspot.in/2013/10/aippasi-anubhavam-pillai-lokacharyar-tattva-trayam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Advertisements

సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిక – సూచికలు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక

<< దినచర్య – ప్రధానాంశాలు

వివిధ రకములైన ప్రమాణసూచికలు వివిధ భాషలలో ఉన్నవి అవసరమైన విషయం  సులభగ్రాహ్యమునకు ఇక్కడ విషయాసూచికలను ఇవ్వడం  జరిగింది.

సాధారణ అనుసంధానములు (links)

 • http://koyil.org/index.php/portal/ – శ్రీవైష్ణవ వెబ్ సైట్ ప్రవేశ ద్వారం (portal)
 • http://acharyas.koyil.org–గురుపరంపర పోర్టల్ – అనుసంధానం(links) –ఆళ్వారుల,ఆచార్యుల జీవిత చరితం ఆంగ్లభాషతో కలుపుకొని వివిధ భారతీయ భాషలలో(తెలుగు, హింది, కన్నడం, మలయాళం మరియు తమిళం)లభించును
 • http://divyaprabandham.koyil.org-దివ్యప్రబంధం పోర్టల్ – వివిధభాషల్లో భాషాంతరీకరణం
 • http://pillai.koyil.org/– శ్రీవైష్ణవ పరిఙ్ఞానం/బాలకుల పోర్టల్
 • http://githa.koyil.org– భగవద్గీత మరియు సంబంధిత వ్యాసములు
 • http://srivaishNavagranthams.wordpress.com– సంప్రదాయ వ్యాసములు వివిధ భాషల్లో (ఆంగ్లం, తెలుగు,హింది,కన్నడం,మలయాళం మరియు తమిళం)
 • http://ponnadi.blogspot.in, https://srivaishnavagranthamstelugu.wordpress.com/ – సంప్రదాయముపై పలు వ్యాసములు ఆంగ్లభాషయందు

 ప్రత్యేక అనుసంధానములు

ప్రత్యే విషయములు

ఆచరణాత్మక మార్గదర్శకత్వం

శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే |                                                                                           శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీః నిత్య మంగళమ్||

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలం : http://ponnadi.blogspot.in/2016/01/simple-guide-to-srivaishnavam-references.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
చిన్నారుల కోసం శ్రీవైష్ణవం  – http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – అనుబంధము-సింహావలోకనము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< ముగింపు

చరమోపాయ నిర్ణయం అనెడి ఈ గ్రంథములో గత అధ్యాయాలలో చూచిన అనేక విషయములను సంక్షిప్తముగా సింహావలోకనము చేసుకుందాం :

 • నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై తమ గురువులైన పెరియ వాచ్చాన్ పిళ్ళైని కీర్తించి వారి అనుగ్రహము చేత ఈ గ్రంథము చేయుట జరిగినది. జగదాచార్యులైన శ్రీరామానుజుల దివ్యగుణవైభవమును చెబుతూ వారి అనుగ్రహమే శ్రీవైష్ణవులను తమ చరమ గమ్యమైన పరమపదమునకు కొనిపోవుటకు హేతువు అన్న సత్యమును ప్రధాన భూమికగా చేసి ఈ గ్రంథము చెప్పటం జరిగినది.
 • ఆచార్య రత్నమాలలో ఎమ్బెరుమానార్లు మధ్యలో ప్రకాశించెడి అద్వితీయమైన వజ్రముగా చెప్పబడుచున్నారు.
 • స్వానువృత్తి మరియు కృపామాత్ర ప్రసన్నాచార్యుల తత్వములు ఈ గ్రంథములో వివరించిరి. అందులో ఎమ్బెరుమానార్లు కృపామాత్ర ప్రసన్నాచార్యులుగా జగదోద్ధారకులుగా చెప్పబడినారు.
 • ఎమ్బెరుమానార్ల తిరుముడి సంబంధము చెప్పబడినది.
 • “పొలిగ!పొలిగ!” అను పాశురము ద్వారా నమ్మాళ్వార్లు శ్రీరామానుజుల భవిష్యదవతారము గూర్చి చెప్పటమే కాక నాథమునులకు స్వప్నములో భవిష్యదాచార్యుని రూపములో దర్శనమిచ్చి నిజరూపములో భవిష్యదాచార్య విగ్రహమును చెక్కించి ఇచ్చి అనుగ్రహించారు!
 • నాథమునులు ఆ భవిష్యదాచార్య విగ్రహమును ఉయ్యక్కోండార్ కు అనుగ్రహించారు!
 • ఉయ్యక్కోండార్ల నుంచి ఆ విగ్రహము మణక్కాల్ నంబికి దక్కినది!
 • మణక్కాల్ నంబి ఆ విగ్రహమును మరియు పారంపర్యముగా భవిష్యదాచార్య అవతారము గూర్చి వచ్చెడి రహస్య విషయములను ఆళవందార్లకు అనుగ్రహించారు!
 • ఆళవందార్లు ఇళయాళ్వారును తమ తరువాత శ్రీవైష్ణవ ధర్మప్రవక్తకులుగా అనుగ్రహించి ఆశీర్వదించిరి!
 • ఆళవందార్లు భవిష్యదాచార్య విగ్రహమును తత్సంబంధిత రహస్యములను తిరుక్కోష్టియూర్ నంబికి అనుగ్రహించారు!
 • తమ వంశములో ఒక శ్రీవైష్ణవుడు జన్మించుటచే పితృదేవతలు ఎలా సంతోషపడతారో అలాగే శ్రీరామానుజుల మునుపు అవతరించిన ఆచార్యులందరూ శ్రీరామానుజులు ప్రపన్నకులములో అవతరించుట చేత పరమ సంతోషపడిరి!
 • భగవానుడు, నమ్మాళ్వార్లు, ఎమ్బెరుమానార్లు ఉత్తారకాచార్యులుగా నిరూపింపబడిరి! అందులో ముఖ్యముగా ఎమ్బెరుమానార్ల యొక్క ఉత్తారకత్వము పరమ విశేషముగా వివరింపబడినది!
 • ఎమ్బెరుమానార్ల ఆచార్యపంచకమైన పెరియ నంబి, పెరియ తిరుమల నంబి, తిరుక్కోష్టియూర్ నంబి, తిరువరంగ పెరుమాళ్ అరయర్, తిరుమాలైయాణ్డాన్ తమ ఉపదేశముల ద్వారా ఇతర అనుభవముల ద్వారా ఎమ్బెరుమానారే ఉత్తారకులుగా నమ్మి తమ పిల్లలను సైతం ఎమ్బెరుమానార్లకు శిష్యులుగా చేసినారు!
 • తిరుక్కచ్చి నంబి ద్వారా వరదరాజ పెరుమాళ్ళు ఎమ్బెరుమానార్ల గొప్పతనమును లోకానికి చాటినారు! ఎలాగైతే పెరుమాళ్ళు రామకృష్ణాది అవతారములలో విశ్వామిత్ర, సాందీపని మొదలగు మహర్షుల వద్ద విద్య నేర్చుకున్నారో ఎమ్బెరుమానార్లు కూడా తమ అవతారములో భాగంగానే ఆళవందార్ల శిష్యులను ఆచార్యులుగా స్వీకరించి వారి వద్ద విద్య నేర్చినారని వరదరాజ పెరుమాళ్ళు చెప్పినారు!
 • వేదవేదాంతములకు వక్రభాష్యములు చెప్పి భగవత్తత్వమును పక్కదారి పట్టించిన అద్వైతమును మరియు వేదమును వ్యతిరేకించిన శూన్య మాయావాదుల సిద్ధాంతములను ఖండించి వేదాంతమునకు సరియైన భాష్యము చెప్పి పరమాత్మ అస్తిత్వాన్ని కాపాడిన ఎమ్బెరుమానార్లే నిజమైన ఉత్తారకాచార్యులు! కనుక వారిని ఆశ్రయించుటలో మనకు ఎటువంటి సందేహము అవసరంలేదు! ఎందుకంటే భగవంతునికే ఉత్తారకాచార్యుడు శ్రీఎమ్బెరుమానార్లు కనుక!
 • ఎమ్బెరుమానార్ల అవతార రహస్యము బహిర్గతము చేయటమైనది! వారి అసలు రూపము నిత్యసూరులకు నాయకుడైన ఆదిశేషుడని తిరుమాళిరుంశోలై అళగర్, క్షీరాబ్ది నాధుడు, సరస్వతి మరియు తామే పలు సందర్భాలలో చెప్పినట్టు ఐతిహ్యములు చెప్పబడినవి!
 • దేవ పెరుమాళ్, నమ్మాళ్వార్, కూరత్తాళ్వాన్ మొదలగువారి మూలముగా ఉడయవర్ల గొప్పతనము చెప్పటం జరిగినది! ఎమ్బెరుమానార్ల పట్ల శిష్యులకు ఉన్న ప్రేమాతిశయము ఎటువంటిదంటే వారి పరమపద వార్త విని ఎంతోమంది శిష్యులు తత్క్షణమే ప్రాణము విడిచి వారూ పరమపదము చేరిరి!
 • శ్రీరామానుజుల ఉత్తారకత్వము ఎవ్వరెవ్వరి చేత నిరూపింపబడినదంటే:
  • పలు సందర్భాలలో వారే చెప్పుకొనుట
  • అరుళాళ పెరుమాళ్ ఎమ్బెరుమానార్
  • తిరువేంగడముడైయాన్
  • తిరుక్కురుంగుడి నంబి
  • నడాదూర్ అమ్మాళ్
  • సోమాసియాణ్డాన్
  • కణియనూర్ సిరియాచ్చాన్
  • పొన్నాచ్చియార్  (పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ గారి భార్య )
 • ఆళవందార్లకు నాథమునుల మీద మరియు ఎమ్బెరుమానార్ల మీద గల ప్రేమాతిశయము వివరించడం జరిగినది! ఆళవందార్లు ఎమ్బెరుమానార్ల ఉత్తారకత్వమును ప్రతిపాదించుట చెప్పటం జరిగినది!
 • ప్రథమపర్వ నిష్ఠ కన్నా చరమపర్వ నిష్టకున్న గొప్పతనమును వివరంచటం జరిగినది!
 • శ్రీరామానుజుల ఉత్తారకత్వమును ప్రతిపాదించిన వారు:
 • చివరిగా తిరువరంగత్తు అముదనార్లు “ఇరామానుశ నుత్తన్దాది ” గ్రంథములో చెప్పిన చరమోపాయ నిష్ఠుడు పాటించవలసిన ధర్మ సూత్రములు:
  • ఎమ్బెరుమానార్ల యొక్క భక్తుల సన్నిధే మన పెన్నిధి!
  • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్యగుణానుభవమే మన నిత్యవిధి!
  • ఎమ్బెరుమానార్ల గొప్పతనమును కీర్తించనివారి సాంగత్యమును విసర్జించవలెను!
  • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్య నామ సంకీర్తనమే (రామానుజ! భాష్యకారా! ఎతిరాజా! ఉడయవరే! ఎమ్బెరుమానారే!) మన జిహ్వకు ఉద్యోగము!
  • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్యరూపమే మనకు ధ్యాన చిత్రము!
  • ప్రేమ భావముతో ఎమ్బెరుమానార్ల యొక్క భక్తులకు సేవ చేయాలి!
  • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్యమంగళ విగ్రహముతో ఆత్మ సంబంధము కలిగివుండాలి !
  • ఎమ్బెరుమానార్ల యొక్క శ్రీచరణాలపై పెట్టిన నమ్మకమే వారి సన్నిధికి మనలను చేరుస్తుంది! అనుమానము శాశ్వత సంసారములోనికి పడదోస్తుంది!

నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం

పెరియ వాచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం

ఆళ్వార్, ఎమ్బెరుమానార్, జీయర్ తిరువడిగళే శరణం

జీయర్ తిరువడిగళే శరణం

 

— అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము :   https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-summary-of-events.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – దినచర్య – ప్రధానాంశాలు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక

<< అపచారముల నిర్మూలన

శ్రీవైష్ణవుల దినచర్యలో ఈ క్రింది అంశములు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నవి మరియు చాలా ప్రయోజనకరమైనవి.

 

 1. వర్ణ-ఆశ్రమ-ఙ్ఞాన భేధం చూడకుండ శ్రీవైష్ణవులను గౌరవించాలి. భగవంతుడు తాను మొదటగా ఆకాంక్షించేది    భాగవతులను(భక్తులను) గౌరవించడం.
 2. అహం మరియు స్వార్థచింతనారహిత జీవితాన్ని గడపాలి. ఆత్మస్వరూపం మరియు భగవానుని వైభవం తెలిసినప్పుడు మనం మన స్వార్థచింతనను మానివేస్తాము.
 3. క్రమం తప్పకుండ ఆచార్యున్ని దర్శించడం శిష్యుని ప్రధానలక్షణం. ఆచార్యుని   భౌతికజీవనం    గడపడానికి అవసరమైన వస్తువులను మరియు ఆర్ధికావసరాలను ఏర్పాటుచేయడం శిష్యుని విధి.
 4. .నిత్యకర్మానుష్ఠానములైన స్నాన-ఊర్ధ్వపుండ్రధారణ-సంధ్యావందనములను వారివారి     వర్ణాశ్రమధర్మాలనుబట్టి       ఆచరించాలి. ఈ ధర్మాలను ఆచరించువారు బాహ్యాంతరశుద్ధులను పొంది ఙ్ఞానసముపార్జనకు సంసిద్ధులవుతారు.
 5. సదా శ్రీచూర్ణతిరుమణ్లను ధరించాలి. ఇది భగవద్దాసులమని తెలుపు ప్రాథమికస్వరూపం. కావున ఈ స్వరూపమును నిత్యము నిర్భయముగా మరియు లజ్జారహితముగా ధరించాలి.
 6. వర్ణ-ఆశ్రమ-లింగధర్మములను అనుకరిస్తు సాంప్రదాయ వస్త్రములను ధరించాలి. మగవారైతే పంచకజ్జమును(గోచి పెట్టిన ధోవతి) ఆడవారయితే మడిసార్(గోచి పెట్టిన చీరకట్టు)ను ధరించాలి. దీనికి సిగ్గుపడనవసరం లేదు. మన సాంప్రదాయ పరంపరావైశిష్ఠ్యమును మనం గ్రహించాలి.
 7. ఆళ్వారులందరు శ్రీమన్నారాయణున్ని సదా సేవించడంలో నిమగ్నులై ఉంటారు. ఆళ్వార్లు మరియు మన పూర్వాచార్యులందరు దేవతాంతర (రుద్ర, ఇంద్ర, వరుణ, అగ్ని మరియు నవగ్రహములు మొదలైనవారు) ఆరాధనను నిరసించారు. మన పూర్వాచార్యులు ఈ విషయానికి అధికప్రాధాన్యతను ఇచ్చారు. భగవానునికి మరియు ఈ జీవాత్మకు మధ్యన ఉండు నవవిధ సంబంధములలో భర్తృభార్యాసంబంధం విశేషమైనది. ప్రాయశముగా అన్ని జీవాత్మలు స్త్రీప్రాయములే. భగవానుడు మాత్రమే పరమపురుషుడు. కావున ఈ సంబంధం భగవానుని యందు  విశ్వాస్యతను మనయందు ఏర్పరుస్తుంది. ఇది మిగితా దేవతాంతరములతో సంబంధం నెరపుటను నిరోధిస్తుంది.
 8. శ్రీవైష్ణవుని నిత్యవిధులలో గృహతిరువారాధన చాలా ప్రధానమైనది. మన గృహములందు తనను ఆరాధించుకోవడానికి భగవానుడు పరమకృపతో అర్చారూపమున దిగివచ్చాడు. దీనిని విస్మరించుట భగవానున్ని అవమానపరచడమే. భగవానుని మరచిపోవడం మన ఆధ్యాత్మికప్రగతిని నష్ఠపరచుకోవడమే. ప్రయాణంలో కూడ మన తిరువారాధన భగవానునిమోసుకపోవచ్చు. ఒకవేళ అది వీలుకాకపోతే ఇతర శ్రీవైష్ణవులు మన గృహమునకు వచ్చి ఆరాధనచేయుటను ఏర్పరచాలి అలాగే దానికి తగిన ఏర్పాటును కూడా చేయాలి లేదా ఇతర శ్రీవైష్ణవగృహములయందు ఉంచి వెళ్ళవచ్చు. ఆరాధన లేకుండ గృహమునకు తాళంవేసిఉంచడం భగవానుని అగౌరవపరచడమే. తిరువారాధన  వివరణాత్మక చర్చను ఇక్కడ పరిశీలించవచ్చు . http://ponnadi.blogspot.in/2012/07/srivaishnava-thiruvaaraadhanam.html.
 9. వారి వారి వర్ణాశ్రమధర్మాలను ఆధారంగా శాస్త్రం ఏర్పరచిన ఆహారనియమములను పాటించాలి. మొదట ఆహారపదార్థాలను భగవానునికి , ఆళ్వారాచార్యులకు నివేదన చేసిన తర్వాతనే మనం స్వీకరించాలి. భగవానుని నివేదనకు నిషిద్ధమైన పదార్థములను సమర్పించరాదు. ఆహారనియమ వివరణాత్మక చర్చను ఇక్కడ పరిశీలించవచ్చు http://ponnadi.blogspot.in/2012/07/srivaishnava-aahaara-niyamam_28.html and http://ponnadi.blogspot.in/2012/08/srivaishnava-ahara-niyamam-q-a.html.
 10. శ్రీవైష్ణవుల సాంగత్యమును ఆశించాలి. ఈ సాంగత్యం వలన  ఆధ్యాత్మికభావనాప్రవాహం వృద్ధిచెంది ఉజ్జీవనమునకు దారితీయును.
 11. మన జీవితంలో దివ్యదేశములు, ఆళ్వారుల మరియు ఆచార్యుల అవతారస్థలములు మరియు అభిమానస్థలముల దర్శనమునకు ప్రాధాన్యతనివ్వాలి. దివ్యదేశములయందు కైంకర్యమును చేయవలెను. ఒకవేళ ప్రస్తుతం కైంకర్యము చేయవీలుకాకపోతే కనీసం దివ్యదేశయాత్రనైన తరచుగా చేయాలి. భవిష్యత్తులోనైన ఈ కైంకర్యం చేయాలని ప్రయత్నించాలి.
 12. శ్రీవైష్ణవులకు దివ్యప్రబంధము చాలాముఖ్యమైన అంశం. పాశురములను అభ్యసించి, పూర్వాచార్యుల వ్యాఖ్యానముననుసరించి వాటి అర్థములను తెలుసుకొని అనుష్ఠానమున పెట్టవలెను. ఈ మూడు విషయములు శ్రీవైష్ణవత్వమును పెంపొందిస్తాయి. దివ్యప్రబంధఙ్ఞానం ప్రాపంచిక సుఖములయందు అశ్రద్ధను, భగవంతుని మరియు భాగవతులయందు శ్రద్ధను నిలుపుటకు తోడ్పడతాయి.
 13. పూర్వాచార్యుల జీవన అనుష్ఠానం మనకు ఙ్ఞానార్జనకు మరియు  ప్రేరణకు తోడ్పడతాయి. ఈ రోజు మనమందరం విషమ పరిస్థిలను/ సంధిగ్ధావస్థలను దాటి  నిలబడ్డామంటే అది పూర్వాచార్యులు తమ జీవన అనుష్ఠానములో ప్రదర్శించిన కరుణ మరియు  సౌలభ్యమే .
 14. పూర్వాచార్యుల సాహిత్యపఠనం చాలా విశేషం. ప్రతిఒక్కరు ప్రతిదినమునందు కొంత సమయమును ఈ లభిస్తున్న సాహిత్యనిధిని పఠించుటకు కేటాయించాలి. ఈ సాహిత్యం మనకు వేదాంతం,దివ్యప్రబంధం , స్తోత్రగ్రంథములు ,వ్యాఖ్యానములు మరియు చారిత్రాత్మక సంఘటనలు అనే రూపములో లభిస్తున్నాయి.  ఈ విషయపరిఙ్ఞానము ఈ వెబ్ సైట్ నందు లభించును http://koyil.org/index.php/portal/
 15. ఆవశ్యకమైన సూత్రములను విద్వాంసుల నుండి కాలక్షేపముగా శ్రవణం( మూలమును అనుసరించి చెప్పు వ్యాఖ్యాన ప్రవచనం)చేయడం చాలా అవసరం. ప్రస్తుత కాలములో చాలా ప్రవచనములు CD మరియు  websites నందు విరివిగా లభిస్తున్నాయి. ప్రవచనములను ప్రత్యక్షముగా  విననివారు ఈ లభిస్తున్న వాటిని ఉపయోగించుకోవాలి. అవకాశం దొరికినప్పుడు సమయానుకూలతను  బట్టి వీటిని ఉపయోగించుకోవచ్చు.
 16. కైంకర్యమునందు సదా నిమగ్నమై ఉండాలి. “ కైంకర్యము చేయకుంటే శేషత్వం లోపించును” అనేది శాస్త్రవచనం. కావున శ్రీమన్నారాయణునియందు,ఆళ్వారాచార్యులయందు దాసత్వం ప్రదర్శించాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక కైంకర్యమును విధిగా చెయ్యాలి. అది భౌతిక, మానసిక , ఙ్ఞానసంబంధిత కైంకర్యము కావచ్చును. ఇలా కైంకర్యమునందు చాలా విధములున్నవి. ప్రతి ఒక్కరు ఏదో ఒక కైంకర్యమునందు నిమగ్నమై ఉండాలి. ఇది భగవంతుని యందు భాగవతులయందు స్థిరమైన కైంకర్యబుద్ధిని ఉండేలా చేస్తుంది.
 17. భగవానుని యందు మరియు ఆళ్వారాచార్యులయందు కైంకర్యఙ్ఞానం ఉన్న భాగవతులకు మరియు ఇతరులకు సహాయం చెయ్యవలెను. ఇలాంటి స్థిరమైన(విచ్చిత్తిలేని కైంకర్యఙ్ఞానం)ఙ్ఞానం కలవారితో సంపర్కం వలన పరస్పరం  ప్రయోజనం ఉంటుంది, అనగా చెప్పేవారు వినేవారు ఇద్దరు గుణానుభవం చేస్తారు. ప్రతిఒక్కరు ఉజ్జీవించాలనే ఏకైక పరమప్రయోజనముగా  ఈ ఙ్ఞానమును మన పూర్వాచార్యులు పరంపరగా అందించారు. కావున  మనమందరం ఈ ఙ్ఞానమును సరైన మార్గదర్శకత్వములో జాగ్రత్తగా చదివి మన కుటుంబసభ్యులకు, బంధువులకు,మిత్రులకు మరియు అభిలాష ఉన్న వారందరికి అందించాలి. ఇదే మన  కర్తవ్యం.
 18. ఆత్మస్వరూపగుణమగు నిత్యానందమును పొందడానికి ప్రయత్నంచేయవలెను. నిజమైన శ్రీవైష్ణవుడు మృత్యువుకు భయపడడు, కారణం శ్రీవైకుంఠమునందు  భగవానుని  నిత్యకైంకర్యము చేయు భాగ్యంలభిస్తుంది దీనివల్లనే. మన ఆళ్వారులు మరియు ఆచార్యులందరు నిత్యవిభూతి యందు ఉన్నప్పుడు భగవద్భాగవత కైంకర్యమును చేసేవారు, ఆ తర్వాత పరమపదమునకు వెళ్ళినను భగవద్భాగవత కైంకర్యమునే ఆశించేవారు.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాసు

మూలం : http://ponnadi.blogspot.in/2016/01/simple-guide-to-srivaishnavam-important-points.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
చిన్నారుల కోసం శ్రీవైష్ణవం  – http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – ముగింపు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 3

గత మూడు అధ్యాయాలలో జగదాచార్యులైన ఎమ్బెరుమానార్ల యొక్క ఉత్తారకత్వమును అనుభవించియున్నాము! ఇక ఇంత అద్భుతమైన గ్రంథము యొక్క ముగింపు చూద్దాము!

(గమనిక : ఈ ముగింపు భాగము తిరువరఙ్గత్తాముదనార్లు రచించిన “ఇరామానుశ నూత్తన్దాది” అను ప్రబంధమును ఆధారముగా చేసుకొని చెప్పడం జరుగుతున్నది! అముదనార్లుకు ఉడయవర్లపై గల అసాధారణ మరియు నిరుపమాన భావానుభూతులు ఈ ప్రబంధము ద్వారా మనం తెలుసుకొనవచ్చును! ఈ ప్రబంధమును నాలాయిరప్రబంధములలో చేర్చవలెనని మరియు తిరువీధులలో స్వామి పురప్పాడు (ఊరెరిగింపు) జరుగునపుడు ఈ ప్రబంధమును ఆచార్యపురుషులు అనుసంధించవలెనని సాక్షాత్తు శ్రీరంగనాధుడే (నమ్పెరుమాళ్) ఆజ్ఞ చేసాడు! దీని వలన భగవంతునికి కూడా ఈ ప్రబంధము పట్ల ఉన్న అభిమానము స్పష్టమగుచున్నది! ఈ ప్రబంధమునకు “ప్రపన్న గాయత్రి” అని పేరు! ఈ ప్రబంధమును స్త్రీ పురుష వర్ణ వయో భేదములు లేక రామానుజ దాసులైన వారెల్లరూ గాయత్రి అనుష్టానము వలె దీన్ని అనుసంధించుకోవచ్చునని ఆర్యోక్తి !! అంటే గాయత్రి ఎంత జపిస్తే అంత శక్తిమంతమో ఈ ప్రబంధము కూడా ప్రపన్నులైన రామానుజ దాసులకు ఎంత పాడుకుంటే అంత రామానుజ కటాక్షము!!

జగదాచార్యులైన స్వామి రామానుజులు -శ్రీపెరుంబుదూరు

 

గతములో తెలుసుకున్నట్లు ఎమ్బెరుమానార్లే జగదాచార్యులు, ఉత్తారకాచార్యులు! ఉడయవర్లు ఈ ఘోర కలిలో సామాన్య జనులకు  సైతం మోక్షార్హత కల్పించి వారిని సంసారము నుండి కాపాడి సద్గతులనిచ్చు ఒక ప్రత్యేక అవతారముగా వచ్చినటువంటి పరమ ప్రేమైకమూర్తి! వారి శ్రీచరణాలే పరమమని నమ్మి జీవించెడి చరమపర్వనిష్ఠులైన శ్రీవైష్ణవులకు నిస్సందేహముగా వారే ఉపాయము మరియు ఉపేయమున్నూ!

 • 105వ పాశురములో చెప్పినట్లు, “ఇరామానుసనై తొళుమ్ పెరియోర్ ఎళుందిరైత్తాడుమ్ ఇడం అడియేనుక్కు ఇరుప్పిడమే- పెద్దలైన శ్రీవైష్ణవులు ఎక్కడైతే రామానుజుల దివ్యవైభవాన్ని గానం చేస్తారో అక్కడే నాకు స్థానమ “, అని చెప్పినట్లు ప్రపన్నులు ఉండదగిన చోటు రామానుజ వైభవము కీర్తించెడి పెద్దల సాంగత్యములోనే.
 • 94వ పాశురములో “ఉవందరుందేన్ అవన్ సీర్ అన్ఱి యానోన్ఱుమ్ ఉళ్ మగిళ్ న్దే – రామానుజుల వైభవ కీర్తనము తప్ప మరేదీ మనసులో నిలుపజాలను”, అని చెప్పినట్లు చేయవలసిన కార్యము నిరతము రామానుజ దివ్యగుణ కీర్తనమే! ఇదే అర్థము 2వ పాశురములో కూడా ధ్వనిస్తుంది, “ఇరామానుశన్ మిక్క సీలమల్లాల్ ఉళ్ళాదు ఎన్నెన్జు – రామానుజ తత్వముపై తప్ప తక్కిన విషయములపై నిలువదు నా మనసు ” ! కనుక చరమాధికారుల (ఆచార్య నిష్టులు) పరమ గమ్యము రామానుజుల దివ్యగుణ స్మరణమే!
 • 15వ పాశురములో చెప్పినట్లు, “ఇరామానుసన్ తన్ పిరంగియశీర్ సారా మనిసరై చ్చేరేన్ ఎనక్కెన్న తాళ్వినైయే – రామానుజుల దివ్యగుణములను అనుభవించని మనుష్యులతో చేరను! వారితో నాకేమి లాభము? “, అని చెప్పినట్లు రామానుజ గుణానుభవము చేయని వారి సాంగత్యమును విసర్జించవలెను! “అటువంటి వారితో చేరకపోవుట చేత నాకెటువంటి నష్టము లేదు!” అని అముదనార్లు పాశురములో చెప్పుటచే, “రామానుజ గుణానుభవత్యక్తుల సాంగత్యము మనకు నష్టమును కలిగించును”, అని అర్థము చేసుకొనవలెను! దీనివలన స్వరూప నాశనము జరుగునని రూఢి అగుచున్నది!
 • 28వ పాశురములో, “ఇరామానుశన్ పుగళ్ అన్ఱి యెన్ వాయ్ కొంజిప్పరవగిల్లాదు – రామానుజుల గుణవైభవ కీర్తనము తప్ప నా నోరు పక్క దారి పట్టి ఎగురలేదు! ” అని చెప్పినట్లు ఎల్లప్పుడూ రామానుజుల గుణానుభవ కీర్తనమే జిహ్వకు ఉద్యోగముగా చేయవలెనని అర్థము!
 • 35వ పాశురములో చెప్పిన విధముగా, “ఇరామానుశన్ మన్ను మామలర్ తాళ్ అయరేన్ – రామానుజుల దివ్యచరణ కమలాలను ఎన్నటికీ మరువను”, అనునట్లు సదా రామానుజుల చరణసరోజములను ధ్యానమందు నిలుపుకొనవలెనని అర్థము! ఎందుకంటే ఆ చరణములు సకలపాప హరణములు! అంతర్బాహ్య శుద్ధి కరణములు ! వాటిని ఎన్నటికీ మరువరాదు!
 • 107వ పాశురములో, “ఉన్ తొండర్గట్కె అన్బుత్తిరుక్కుమ్ బడి ఎన్నై యాక్కి అంగాట్పడుత్తే – నీ దాసులయందు ప్రియము కల్గి ఉండునట్లు నను నీవే చేసి అనుగ్రహించుము “, అని చెప్పినట్లు చరమపర్వ నిష్టుల కర్తవ్యము (స్వరూపము) రామానుజుల దాసులైన శ్రీవైష్ణవుల పట్ల అభిమానము కలిగి వారి యెడల సేవాభావముతో జీవించుట!
 • 104వ పాశురములో చెప్పినట్లు, “ఉందన్ మెయ్యిల్ పిరంగియ శీర్అన్ఱి వేణ్డిలన్ యాన్….. ఇవ్వరుళ్ నీ సెయ్యిల్ తరిప్పన్ ఇరామానుసా – నీ దివ్యమంగళ విగ్రహ సందర్శనము తప్ప వేరేదీ కోరేవాడను కాను – అది నాకు అనుగ్రహిస్తే తరిస్తాను”, అని చెప్పినట్లు రామానుజుల దివ్యమంగళ విగ్రహమును సందర్శనమే మనస్సుకు పరమౌషధముగా భావించవలెను!
 • 80వ పాశురములో, “ఇరామానుశన్ తిరునామం నమ్బవల్లార్ తిరత్తై ….శైయ్వన్ సోర్విన్ఱియే – రామానుజుల తిరునామము జపించెడి ఉత్తములైన శ్రీవైష్ణవులను మనసా వాచా కర్మణా సేవిస్తాను”, అని చెప్పినట్లు రామానుజ ధ్యానపరాయణులైన శ్రీవైష్ణవ శిఖామణులను ఎల్లపుడు సేవిస్తూ వారికి మనసా వాచా కర్మణా సేవ చేయవలెను! మరియు 46వ పాశురములో, “ఇరామానుశన్ తిరునామమ్ నమ్బిక్కల్లార్ అకలిడత్తోర్ ఎదు పేరెన్ఱు కామిప్పరే – రామానుజుల తిరునామము నమ్మని వారికి ఈ లోకములో ఏది గతియని చూపించండి చూద్దాం?”, అని చెప్పుటలో రామానుజులను నమ్మని మూఢులకు లోకములో మోక్షము కొరకు వేరు గతి ఉండదని తెలుసుకోవాలి!

 

కూరత్తాళ్వార్లను సేవించెడి తిరువరఙ్గత్తాముదనార్లు – అముదనార్లు కూరత్తాళ్వార్ల వద్ద సమాశ్రయణము రామానుజసంబంధమును పొందారు

అముదనార్లు ఈ అద్వితీయమైన ప్రబంధమును శ్రీరామానుజులు వేంచేసి ఉన్న కాలములోనే రచించి గానము చేసినారు! శ్రీరామానుజుల చేత మరియు నంబెరుమాళ్ళయిన శ్రీరంగనాథుని చేత ఆమోదించబడిన ఈ గ్రంథములో చెప్పిన చరమపర్వస్థ నియమాలు సూత్రాలు నిస్సందేహముగా పాటించదగినవని పూర్వాచార్యుల ఉవాచ! ఎందుకంటే :

సత్యం సత్యం పునస్సత్యం యతిరాజో జగద్గురుః !

స ఏవ సర్వలోకానామ్ ఉద్ధర్తా నాత్ర సంశయః !!

అర్థము : సత్యం! సత్యం! మరల సత్యం ! యతిరాజులే జగద్గురువులు ! వారే సర్వలోకులను ఉద్ధరించగలరు ! ఇందులో సందేహములేదు!

ఇరామానుశన్ మన్ను మామలర్ తాళ్ పొరుందానిలై యుడై ప్పున్మయిలోర్కు

ఒన్ఱుమ్ నన్మై శెయ్యా ప్పెరుందేవరై ప్పరవుమ్ పెరియోర్ తమ్ కళల్ పిడిత్తే  – 62వ పాశురము

అర్థము – రామానుజుల శ్రీచరణాలను ఆశ్రయించని దుర్మార్గులకు కొంచెము కూడా సహాయపడని గొప్ప దేవతలైన పెద్దల శ్రీచరణాలను ఆశ్రయిస్తాను!

చరమోపాయ నిర్ణయము ముగిసినది !!

నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం

పెరియ వాచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం

ఆళ్వార్, ఎమ్బెరుమానార్, జీయర్ తిరువడిగళే శరణం

జీయర్ తిరువడిగళే శరణం

మదాచార్య తిరువడిగళే శరణం

— అడియేన్ శ్రీనివాస రామానుజదాసన్

మూలము:   https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-conclusion.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 3

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 2

గత అధ్యాయములో  (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/12/01/charamopaya-nirnayam-ramanujar-our-saviour-2/) భగవద్రామానుజుల ఉత్తారకత్వ ప్రభావము పెద్దలు పొందిన కొన్ని అనుభవాల మూలముగా తెలుసుకున్నాము! ఇక ఈ అధ్యాయములో స్వామివారి ఉత్తారకత్వ వైభవమును మరి కొన్ని ఐతిహ్యముల ద్వారా తెలుసుకుందాము!!

 

ఒకనాటి రాత్రి ఎంబార్ భగవద్గుణానుభవము గావిస్తూ తిరువీధులలో నడుస్తూ ఉండగా భట్టర్ వారిని సమీపించి అంజలి ఘటించి, “ద్వివిధములైన ఆచార్యత్వము (స్వానువృత్తి ప్రసన్నాచార్యత్వము, కృపామాత్ర ప్రసన్నాచార్యత్వము) మరియు తద్విషయస్వీకారత్వమున్ను (స్వగత స్వీకారము, పరగత స్వీకారము) ద్వివిధములై ఉన్నందున ఎందులో చరించవలెనో దేవరవారే అనుగ్రహించవలసింది!”, అని ప్రార్థించగా ఎంబార్, “కృపామాత్ర ప్రసన్నాచార్యత్వము, పరగత స్వీకారమే ఉత్తమమైన మార్గములు! అవి ఉడయవర్ల విషయములో మెండుగా ఉన్నవని మేము గ్రహించితిమి! మీరు కూడా మిమ్ములను శ్రీరంగనాధుడు తమ పుత్రునిగా స్వీకరించాడని, పరమ భక్తిజ్ఞానవైరాగ్య సంపన్నులైన కూరత్తాళ్వాన్ పుత్రుడనని, సకల విద్యాపారంగతుడనన్న అహంకారము ఇత్యాది జాడ్యములను దరి చేరనీయక మా వలె ఉడయవర్లే ఉత్తారకులుగా నమ్మి వారి వద్ద ఉత్తారకప్రతిపత్తి చేయండి! “, అని బదులిచ్చెను!

భట్టర్ నంజీయరుకు తిరువాయిమొళి వ్యాఖ్యానమును కాలక్షేపమును అనుగ్రహించినపుడు “प्रत्यक्षे गुरवस्स्तुत्याः – ప్రత్యక్షములో ఆచార్యులు స్తుతించదగినవారు”, అను విధముగా నంజీయర్ భట్టర్ ను పలువిధములుగా స్తుతించి, “దాసుని శిరస్సుపై దేవరవారి శ్రీచరణాలనుంచి దాసుని అనుగ్రహించి తరింపచేయండి!”, అని ప్రార్థించగా భట్టర్ అటులనే ఏకాంతముగా నంజీయర్ శిరస్సుకు తమ పాదస్పర్శనము చేసి ఇటులనిరి, “ఈ పాదాలు కాదు మీరు శరణు వేడవలసింది! ఆచార్య కటాక్షముపై మీకు నమ్మకము కలుగచేయుట కొరకే మేమెటులచేసితిమి! మీకు, మాకు, మిగిలినవారందరికి ఉడయవర్లే ఉత్తారకులు! వారే జీవులకు చరమోపాయము! ఈ సత్యమును మనస్సులో ఉంచుకుని తదేకనిష్ఠులై జీవించండి! లేకపోతే నిత్యసంసారిగా మిగిలిపోతారు జాగ్రత్త!” దీనివల్ల మనకు తెలియునదేమనగా ఉడయవర్ల శ్రీచరణాలను ఆశ్రయించుటయే ఉజ్జీవనమునకు హేతువు! మిగిలినవి ఉజ్జీవకములుగా భావించుట అజ్ఞానము!

ఈ అర్థమును అముదనారు “ఇరామానుశ నుత్తన్దాది”లో చక్కగా అనుగ్రహించారు!

పొయ్యై చ్చురక్కుమ్ పొరుళై త్తురందు
ఇంద ప్పూదలత్తే మెయ్యై పురుక్కుమ్ ఇరామానుశన్ నిర్క
వేఱు నమ్మై ఉయ్యక్కొళ్ళవల్ల దైవ మిన్గు యాదెన్ఱు ఉలర్న్దు
అవమే అయ్యప్పడానిఱ్పర్ వైయ్యత్తుళ్ళోర్ నల్లఱి విళిన్దే! – 79వ పాశురము

భావము – అసత్య ప్రచారములు (వేదమును అంగీకరించని మతాలు) చేయు బాహ్యములను, మరియు కుదృష్టులను (వేదమును అంగీకరించియును తప్పుడు అర్థమును బోధించెడి మతములు) రూపు మాపి జనులకు నిజమైన జ్ఞానమును అందించుటకు శ్రీరామానుజులు సిద్ధముగా ఉండగా ఈ లోకులు ఎందులకు వేరే దైవము వచ్చి తమను ఉద్ధరిస్తుందని ఎదురు చూస్తారు?

అని చెప్పడం చేత ఉడయవర్ల తరువాత జనులను ఉజ్జీవింపజేసేది ఇక భగవానుడే! అయితే చరమపర్వమగు ఉడయవర్లు వేంచేసి ఉండగా, ప్రథమపర్వమగు భగవంతుని ఆశ్రయించుట అజ్ఞానకార్యమగును! మనవద్దకొచ్చిన చరమపర్వమును విడిచిపెట్టి విప్రకృష్టమగు ప్రథమపర్వమును పట్టుకొనుట అజ్ఞానమే కదా!

ఎట్ట ఇరుంద కురవై ఇఱై ఎన్ఱు అన్ఱు విట్టు
ఓర్ పరనై విరుప్పురుతల్
పొట్టనైత్తన్ కణ్ సెంబళిత్తు కై తుఱత్తి నీర్ తూవి
అంబుదత్తై పార్తిరుప్పాన్ అన్ఱు -జ్ఞాన సారము – 33వ పాశురము

భావము – తనకు చేరువనున్న గురువును కాదని ఎక్కడో మనకు కనపడని దూరములోనున్న దైవమును ప్రార్థించుట ఎటులన్న దాహముగొన్నపుడు దరిలో నీరుండగా ఆకాశముకేసి చూసి వానకై నిరీక్షించినట్టు ఉండును!
అని దృష్టాంత సహితముగా అరుళాళప్పెరుమాళ్ ఎమ్బెరుమానార్ అనుగ్రహించారు కదా!

(గమనిక – ఈ పాశురమును వ్యాఖ్యానించు సమయములో స్వామి మణవాళ మహామునులు ఒక శ్లోకము చెప్పియున్నారు! అది “चक्षुर्गम्यं गुरुं त्यक्त्वा शस्त्रगम्यं तु यस्स्मरेत् ! करहस्तम् उदकम् त्यक्त्वा का नस्थम् अभिवाञ्चति !!” మహామునులు జ్ఞానసారము యొక్క గొప్పతనమును అవతారికలో అద్భుతముగా చెప్పియున్నారు! గ్రంథకర్త అయిన అరుళాళ ప్పెరుమాళ్ ఎమ్బెరుమానార్ ఉడయవర్లకు ప్రత్యక్షంగా శుశ్రూష చేసి వారి వద్ద నేర్చుకున్న అత్యంత క్లిష్టతరమైన చరమోపాయమును బహు సులభముగా సామాన్యులకు అర్థమగునట్లు చిన్న చిన్న ఉదాహారణలతో విశదీకరించియున్నారు!)

“చరమపర్వమునకు తగనివాడు ప్రథమపర్వమునకు కూడా తగడు! “, అని వంగిపురత్తు నంబిగారి సూక్తి! తదీయశేషత్వజ్ఞానము లేనివాడికి తచ్చేషత్వ జ్ఞానము కూడా లేకుండా ఉండును! భగద్విషయము నందు జ్ఞానము లేనివాడు దాన్ని పొందుటకు ఆచార్యుని ఆశ్రయించవలెను! ఆచార్యాభిమాననిష్ఠుడు ప్రథమపర్వమందు తలదూర్చడు! ఆచార్యాభిమానము కోల్పోయినవాడు భగవద్కృతమైన స్వరూప సంకోచమును పొందుతాడు! ఈశ్వరాభిమానమును కోల్పోయినవాడు ఆచార్యాభిమానమందు ఒదిగి ఉండవలెను! చరమోపాయనిష్ఠునకు ఈశ్వరాభిమానము అవసరంలేదని ఇక్కడ చెప్పవచ్చు ! దీనిబట్టి చెప్పవచ్ఛేదేమిటంటే ఉడయవర్ల అభిమానము పొందనివానిని ఈశ్వరుడు కూడా విడిచిపెడతాడు! ప్రథమపర్వమైన ఈశ్వరుడు దోషదర్శనము చేత చేతనుని విడిచిపెడతాడు! కానీ, చరమపర్వమైన ఆచార్యుడు, అనగా, ఉడయవర్లు మాత్రం విడిచిపెట్టరు! ఉడయవర్ల శ్రీచరణ సంబంధము పొందాక ఇక సద్గతి కొరకు భగవంతుని ప్రార్థన చేయనక్కరలేదు కదా- అని అర్థము! “తేవు మత్తఱియేన్ మేవినేన్ అవన్ పొన్నడి మెయిమ్మయే – వేరొక దైవమెరుగను ! శ్రీశఠకోపుల బంగారు పాదములాశ్రయించాను (కణ్ణినుణ్-2)” అనువిధముగా జీవించినట్లైతే సద్గతి తప్పక కలుగును కదా! ఎందుకంటే ఆశ్రయించెడి చరణాలు “పొన్నడి – బంగారు పాదాలు” కనుక! ఈ విధముగా అన్ని ప్రకారములుగా అందరికి ఉత్తారకులు ఉడయవర్లే కనుక కొరత చెందే పనిలేదు ! అటువంటి ఉడయవర్ల యొక్క అభిమానమును మనసారా పొందనివారు నిత్యసంసారులుగానే మిగిలిపోతారు!

ఉడయవర్ల శ్రీచరణాలు ఆశ్రయించినవారు వారి తిరునామమును నిత్యమూ స్మరించుకోవాలి! అముదనార్లు ఉడయవర్ల యొక్క తిరునామము యొక్క గొప్పతనమును వారి యొక్క శ్రీచరణకమల ప్రావణ్య జనకముగా ఈ విధముగా చెప్పియున్నారు, “ఇరామానుశన్ చరణారవిందం నామ్ మన్ని వాళ నెంజే! సొల్లువోమ్ అవన్ నామంగళే! -ఇరామానుశ -1” అని చెబుతూ, “నామ్ మన్ని వాళ  అవన్ నామంగళే సొల్లువోమ్!” అని చెప్పుట వలన ఉడయవర్ల యొక్క నామజపము చేయని యెడల వారి యందు భక్తితో జీవించలేమని అర్థము! వారిని ఆశ్రయించి జీవిస్తున్నట్లైతే శ్రీరామానుజ నామస్మరణ అనుసంధించవలెనని అదే వారి శ్రీపాదకమలాల యందు ప్రావణ్యమును పెంపొందింపజేయగలదని అర్థము! ఈ విధముగా ఉడయవర్ల తిరునామమును అనుసంధించుకొనుచు వారి శ్రీచరణాలను ఆశ్రయించినవారికి ప్రాప్యప్రాపకములు రెండూ వారే కదా! “పేఱొన్ఱు మత్తిల్లై నిన్ చరణన్నిఅప్పేఱళిత్తర్కు యారొన్ఱుమిల్లై మత్త చ్చరణన్ని- ప్రాప్యము ఏది లేదు నీ శ్రీచరణాలు తప్ప! ఆ ప్రాప్యమును ఇచ్చునట్టి ప్రాపకమూ వేరేదీలేదు నీ శ్రీచరణాలు తప్ప – -ఇరామానుశ -45” అని ప్రాప్యప్రాపకములు రెండూ ఉడయవర్ల యొక్క శ్రీచరణాలే అని ఉద్ఘాటించారు అముదనార్లు!

వడుగ నంబి ఒకనాడు ఉడయవర్ల సభలోకి ప్రవేశించి ఉడయవర్లకు దండం సమర్పించి నిలుచుంటే, ఉడయవర్లు వారిని ఉద్దేశించి, “మన మధురకవులు వచ్చారు!” అన్నారుట! నమ్మాళ్వారుకు ఒక మధురకవులు ఉన్నారు కదా! అంత అభిమానము వడుగనంబి మీద ఉడయవర్లకు! వడుగనంబి కూరత్తాళ్వార్లను, ముదలియాణ్డాన్ ను ఉద్దేశించి, “ఇరుకఱైయర్- ఇరుతీరాలవారు”, అని పిలిచేవారుట! అంటే శ్రీరామానుజులు, భగవంతుడు అంటే రెండు తీరాలను పట్టుకుని ప్రవహించే శుద్ధ గంగానది వంటి వారని వారి ఉద్దేశ్యము!

ఒకనాడు ఉడయవర్లు వడుగనంబిని పిలిపించి, “వడుగా! ఆచార్యాభిమాననిష్ఠుడు ఎలా ఉండవలెను?”, అని అడుగగా నంబి, “వేంబిన్ పుళుపోలే ఇరుప్పన్ – వేపలోని పురుగువలె ఉంటాడు”, అన్నారుట! దానికి అర్థము వేప చెట్టును పట్టుకుని బ్రతికే పురుగు వేపరుచి తప్ప వేరు రుచి ఎరుగదు!  “కఱుమ్బిన్ ఫుళు – చెఱకులోని పురుగు” వలె అన్య ఆస్వాదనాలాలస కలుగనిదై ఉండును! అదే విధముగా ఆచార్యాభిమాననిష్ఠుడు కూడా వేప పురుగు వలె ఒక ఆచార్యుని మాత్రమే ఆశ్రయించి వారి అనుగ్రహము చేత ముక్తిని పొందుతాడు తప్ప వేరు ఆలోచన కూడా మనసుకు రానీయడు! మరి ఇక్కడ చెఱకు పురుగు అంశం ఎందుకంటే ఆచార్యుడు ఎంత దయాళువై ఉన్ననూ తననే నమ్ముకుని ఉన్న శిష్యుని పట్ల విరసభావమును పొంది ఘాతుక దశలో ఉన్ననూ, “నానున్నై యన్ఱి ఇలేన్ (నాన్ముగన్ తిరు -7 )- నిన్ను వదిలి నేను ఉండలేను” అనువిధముగా ఆచార్యుడు లేకపోతే వేరు గతి లేదను ప్రగాఢ నమ్మకంతో, “కళైకణ్ మఱ్ఱిలేన్ (తిరువాయిమొళి-5-9-8)- వేరు రక్షకుడు లేనివాడను”, అన్నంత ఆచార్య అభిమాననిష్ఠ కలిగి ఉండవలెను! అందుచేత ఉడయవర్ల విషయములో ఒదిగి ఉన్నవాడు తదేకనిష్టుడై ఉండి తద్వ్యతిరిక్త విషయములలో ఆసక్తి లేనివాడై ఉండవలెనని అర్థము! అత్యంత గొప్పదైన పరమోత్కృష్టమైన వస్తువు సొంతమైతే ఇంక మిగిలిన విషయములు అవసరము లేదు కదా! “పల్లుయిఱ్కుమ్ విణ్ణిన్ తలైనిన్ఱు వీడళిప్పాన్ నమ్మిరామానుశన్ -(ఇరామానుశ-95) పలు జీవులకు పరమపదములో తన పురుషకారము చేత చోటు ఇప్పిస్తారు శ్రీరామానుజులు” అని ఉడయవర్ల యొక్క  గొప్పతనమును చెప్పారు కదా సకలశాస్త్ర ప్రావీణ్యులైన అముదనార్లు!

నంబిళ్ళై ఒకనాడు ఉడయవర్ల సన్నిధికి వెళ్లి దండము సమర్పించి, నూత్తన్దాది అనుసంధించి, “ఈనాడు దాసుడుకి ఒక హితమును అనుగ్రహించండి!”, అని ప్రార్థించారుట! ఆనాటి రాత్రి ఉడయవర్లు స్వప్నములో దర్శనమిచ్చి తమ తిరువడిగళ్లను నంబిళ్ళై శిరస్సుపై ఉంచి ‘మీకు హితము చేకూరవలెననిన మా పాదాలే రక్షకముగా భావించండి! మిమ్మలను ఆశ్రయించినవారికి కూడా వీటినే రక్షకములుగా ఉపదేశించండి! దీనిని మించిన హితములేదు!'”, అని ఉపదేశించిరి! నిదురలేచిన నంబిళ్ళైఆనందబాష్పాలతో పరవశులై తమ కుమారుడైన పెరియవాచ్చాన్ పిళ్ళైని పిలిచి స్వప్నవృత్తాన్తమును చెప్పి సంతోషపడిరి! నంబిళ్ళైచరమదశలో ఉండగా వారి కుమారులు సమీపించి తమకు దిక్కేది బాధపడుచుండగా నంబిళ్ళై, “ఎమ్బెరుమానార్ల శ్రీచరణాలు మనకు రక్షకములు! వేరు హితమేమి అవసరము? వారి అభిమానమందు అన్తర్భూతులై ఉంటే మన హితముకొరకు ఆలోచించాల్సిన అవసరము రాదు! అదే నిష్ఠతో జీవితము గడపండి! నేను పొందే పరమపదము మీకు కూడా లభిస్తుంది!”, అని ఉపదేశించారుట !
ఇక వచ్చే అధ్యాయములో ఈ గ్రంథము యొక్క ముగింపు విషయములను తెలుసుకుందాము!

— అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము:  https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujar-our-saviour-3.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 2

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 1

గత అధ్యాయములో  (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/12/01/charamopaya-nirnayam-ramanujar-our-saviour-1/) భగవద్రామానుజుల ఉత్తారకత్వ ప్రభావము కొన్ని అనుభవాల మూలముగా తెలుసుకున్నాము! ఇక ఈ అధ్యాయములో స్వామివారి ఉత్తారకత్వ వైభవమును మరి కొన్ని ఐతిహ్యముల మూలముగా తెలుసుకొనెదము!!

ఒకానొకప్పుడు అరుళాళ ప్పెరుమాళ్ ఎమ్బెరుమానార్ల శిష్యులైన అనంతాళ్వాన్, ఎచ్చాన్, తొండనూర్ నంబి, మరుదూర్ నంబి మొదలైనవారు ఉడయవర్లను ఆశ్రయించి ఒక సందేహమడిగినారు, “ఈ ఆత్మకు ఆచార్యుడు ఒకరా? పలువురా? ఇంతమంది ఎందులకు? ” ! దానికి ఉడయవర్లు ఆ శిష్యులను వెళ్లి పొన్నాచ్చియార్ అను వారిని అడుగవలసిందిగా చెప్పారు! అప్పుడు వారందరు పొన్నాచ్చియార్ అమ్మగారి తిరుమాళిగకు చేరుకొని తమ సందేహాన్ని వారి వద్ద విన్నవించారు! అప్పుడు పొన్నాచ్చియార్ అమ్మగారు తమ శిరోజాలని ముడివిప్పి విదిలించి మరల ముడి వేసుకుని, “ఈ సందేహమును దాసురాలు తీర్చజాలదు! అబలయైన దాసురాలికి అంత జ్ఞానమేమున్నది? స్వామివారే మీ సందేహము తీర్చగలరు? ” అని వారికి సమాధానము చెప్పి నేలపై పడియున్న ఒక నూలు పోగును తల మీద పెట్టుకుని లోపలి వెళ్లిపోయారు! శిష్యులు చేసేది లేక మరల ఉడయవర్ల వద్దకు వచ్చి నిలబడిరి! ఉడయవర్లు వారితో, “కార్యము నెరవేరినదా?”అని అడుగగా వారు లేదని బదులిచ్చిరి! అంతట ఉడయవర్లు వారితో, “మీరు వెళ్ళినప్పుడు వారు ఏమి చేసినారు?” అని అడుగగా వారు పొన్నాచ్చియార్ తమ జుత్తు ముడిని విప్పి జుత్తు విదిలించి తిరిగి ముడి వేసుకున్నారని, నేలపై పడియున్న ఒక నూలు పోగు శిరస్సుపై వేసుకుని లోపలి వెళ్లిపోయారని బదులిచ్చారు! దానికి ఉడయవర్లు, “అయితే మీకు సమాధానం దొరికింది! ఆమె తన చేష్టల ద్వారా మీకు సమాధానం చెప్పారు! మీకు అర్థం కాలేదే?”, అనగా శిష్యులు వారికి సాష్టాంగ దండం సమర్పించి, “మా అజ్ఞానాన్ని మన్నించి సవివరంగా దేవరవారే తెలియజేవలసింది!” అని ప్రార్థించిరి! దానికి ఉడయవర్లు వారి పట్ల వాత్సల్యము గలవారై వారితో ఇటుల చెప్పిరి, “ఆమె తమ జుట్టు ముడి విప్పి జుత్తు విదిలించడమంటే – ఈ ఆత్మకు ఆచార్యులు పలువురు ఉండవచ్చును (తల్లిదండ్రులు, చదువు చెప్పే గురువులు, ఈ ప్రకృతి ఇలా జీవుడికి రకరకాల గురువులు ఉండవచ్చును )! అయితే ఆత్మకు ప్రాప్యమును కలిగించే (అంటే మోక్షమును ఇచ్చు) ఆచార్యుడు మాత్రం ఒక్కరే! అదే ఆమె తిరిగి తన జుత్తు ముడి వేసుకొనుటకు అర్థము! నేలపై పడి ఉన్న కావినూలు తీసి శిరస్సుపై ధరించుటలో అర్థం ఆత్మకు ప్రాప్యమును కలిగించే ఆచార్యుడు చతుర్థాశ్రమమైన సన్యాసమును స్వీకరించి కాషాయత్రిదండ ధారుడైన ఎమ్బెరుమానార్ అనగా మమ్ములను సూచించారు! అక్కడ ఉండకుండా లోపలి వెళ్ళుటలో అంతరార్థం అటువంటి ఆచార్యుని గుట్టుగా మనస్సులో స్థిరంగా నిలుపుకుని ‘పేణి క్కొణర్న్దు పుహుదు వైత్తుక్కొండేన్ ‘(ఆదరించి తీసుకువచ్చి విశ్లేషించకుండా హృదయంలో నిలుపుకున్నాను) అనునట్లు ప్రేమతో ఆచార్యుని ఆరాధిస్తూ వారి నామస్మరణ చేయుటయే శిష్యునికి ఉపాయము అని పొన్నాచ్చియార్ మీకు చేసి చూపించారు! కనుక మీరందరు అదే విధమైన నిష్ఠను కలిగి జీవించండి! ” అని బదులిచ్చిరి!

ఒకనాడు ఉడయవర్లు ఏకాంతంలో ఉన్న సమయములో ఎంబార్, వడుగనంబి వారి వద్దకు వెళ్లి, “మధురకవియాళ్వార్ నమ్మాళ్వార్ల విషయములో ‘తేవు మత్తఱియేన్’-నీవు తప్ప వేరు దైవమెరుగను- అని శేషత్వ-శరణ్యత్వ-ప్రాప్యత్వములు ఆళ్వార్లే అని నిశ్చయించుకుని ప్రథమపర్వమును (భగవత్స్మరణం) సైతం విడిచిపెట్టి తదేకనిష్ఠులై ఉన్న అటువంటి శ్రద్ధ మాకు కూడా కలిగేలా దేవరవారు ఆశీర్వదించవలసింది!”, అని ప్రార్థించగా ఉడయవర్, “మధురకవులు నమ్మాళ్వార్ల వద్ద కలిగి ఉన్న నిష్ఠను మీకు ఇదివరకే అనుగ్రహించియున్నాను కదా? ఇంకేమి సంశయము? “, అని అడుగగా వారు,”అటువంటి నిష్ఠ యావదాత్మభావిగా జీవితాంతం కలిగియుండేలా అనుగ్రహించవలసింది! ” అని ప్రార్థించిరి! ఉడయవర్లు పరమ సంతోషముతో శిష్యులంటే ఇటులకదా ఉండవలెనని మనస్సులో భావించి, “‘ఉపాయోపేయ భావేన తమేవ శరణం వ్రజేత్’-ఉపాయము ఉపేయము నీవేనను భావముతో శరణు వేడవలెను- అను రీతిలో ఉపాయోపేయ రూపములు రెండునూ మా వద్ద ఉండుట చేత “తేవు మత్తఱియేన్ ” అను రీతిలో మాకు శరణు వేడిన మీకు లోటు ఉండదు! ఇది మీకే గాక మీ సంబంధిసంబంధులకు వర్తించగలదు” అని బదులిచ్చెను!

గమనిక : ఇక మిగిలిన వ్యాసంలో  ఆళవందార్లు మరియు నాథమునుల సంబంధమును నిశితంగా తెలియజేయడమైనది.

మనకు ఒక సందేహము కలుగవచ్చు , “మనము ఆశ్రయించెడి ఆచార్యునకు ఈ లీలావిభూతిలో ఉన్న రోజులలో ఉపాయత్వము మాత్రమే కాక, ప్రాప్య భూమి అనబడే పరమపదంలో కూడా ఉపాయత్వము కలదా?” అంటే ప్రాప్యభూమి యందు కూడా ఆచార్యునకు ఉపాయత్వము కలదు! దీనిని స్వామి ఆళవందార్లు స్తోత్ర రత్నములో ఈ విధముగా అనుగ్రహించారు :

తస్మై నమో మధుజిదంఘ్రి సరోజ తత్వ

జ్ఞానానురాగా మహిమాతిశయాంత శీమ్నే!

నాధాయ నాథమునయే అత్ర పరత్రచాపి

నిత్యం యదీయ చరణౌ శరణం మదీయం !!

అర్థము – మధుమర్దియైన శ్రీమన్నారాయణుని శ్రీచరణముల పట్ల అచంచలమైన ప్రేమ,భక్తి కలిగి నిజజ్ఞాన పూర్ణులైన నాథమునులే నాకు యజమాని! వారి దివ్యసన్నిధి ఈ భూలోకమందు మరియు పరమపదమందును నాకు ఆశ్రయము!

మరియు విష్ణుపురాణ సూక్తియగు, “సాధ్యభావే మహా బాహో! సాధనై: కిం ప్రయోజనం ? ” అనగా – సాధ్యభావం సిద్ధించినపుడు ఇక సాధనములతో ఏమి ప్రయోజనం ? (అంటే దక్కవలసింది దక్కినపుడు ఇక సాధనాలతో ఏమి ప్రయోజనం ?).
కానీ, భట్టర్ అనుగ్రహించిన శ్రీరంగరాజస్తవములో ఈ విధముగా తెలిపారు (87వ శ్లోకము – ఉత్తర శతకం)

ఉపాదత్తే సత్తాస్థితి స్వనియమానాద్యైశ్చిదచితౌ
స్వముద్దిశ్య శ్రీమానితి వదతి వాగుపనిషదీ !

ఉపాయోపేయత్వే తదిహ తవ తత్త్వం నతు గుణౌ

అతస్త్వామ్ శ్రీరంగేశయ! శరణమవ్యాజ్యమభజం !!

అర్థము – ఓ శ్రీరంగేశ! శ్రీమన్నారాయణుడివై నీవు భూజాతులైన చిత్తులు (బుద్ధి జీవులు ) అచిత్తుల (బుద్ధి రహిత జీవులు) యొక్క సేవలను సృష్టి, స్థితి, నియమములనెడి పరికరముల ద్వారా స్వీకరించెదవని ఉపనిషత్తులు ఘోషించుట చేత చేతనులకు నీవే ఉపాయము మరియు ఉపేయము అనుట అతిశయోక్తి కాదు! అది సత్యము ! అటువంటి నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను!

అన్నందువలన ఈ ఉపాయోపేయములు రెండు భగవానుడి స్వరూపములు! అయితే ఉపాయము బయటికి ప్రకాశిస్తుంది ఉపేయము అంతర్గతముగా  ఉండును! అయితే ఈ స్వరూపములు భగవానుడి విషయములోనే కదా? అంటే ఆచార్యుని విషయములో కూడా స్వీకరించవచ్చును ! ఆళవందార్లు శాయించిన, “ఉపాయోపేయ భావేన…. ” అన్న విధముగా ఆచార్యునకు ఉపాయోపేయత్వములు రెండూ స్వరూపములై ఉండును! అందుకనే “అత్ర పరత్రాచాపి…  ” అని చెప్పబడింది ! మరియు “త్వమేవ… ” అనుటలో భావం ఇటువంటి స్వరూపములు ఆచార్యునియందు “మాత్రమే” ప్రకాశించును అని రూఢి చేసినట్లు ఉన్నది ! కనుక చరమపర్వమందు ఇతర సహాయ సంబంధములను సహించనిదై ఉండును ! (అనగా చరమోపాయ నిష్టలో ఆచార్యుడు తప్ప ఇక వేరే ఇతర సహాయములు పనిచేయవు అని అర్థము) ! కార్యకాలములో చరమపర్వము (చరమోపాయ నిష్ఠ) అన్నిటికంటే ఉత్తమమై ఉండును! కనుక చరమపర్వము ప్రథమపర్వము కన్నా ఏ విధముగా గొప్పదో క్లుప్తముగా చూద్దాం :

 •  భగవానుడు తనను ఆశ్రయించిన భక్తులను తన యొక్క సర్వతంత్ర స్వతంత్రత చేత మోక్షములోనో లేక తిరిగి సంసారములోనో ఉంచును! కనుక భగవానునిని ఆశ్రయించిన భక్తునికి మోక్షము తథ్యమని నమ్మరాదు (ఉడయవర్ల కాలములో సింహాచలంలో పరమ నృసింహ భక్తుడైన కృష్ణమాచార్యుని గాథ ద్వారా తెలియవచ్చును )! కానీ ఆచార్యుడు తన శిష్యుడు ఏ విధంగానైనా తరించాలని తపనపడి తమ యొక్క నిర్హేతుక కృప చేత భగవానునికి పురుషకారము చేత మోక్షమును ఇప్పించును!
 • భగవానుడు ఆచార్య సంబంధము కలిగిన భక్తుని మాత్రమే స్వీకరించును ! కానీ కృపాపూర్ణుడైన ఆచార్యుడు ఎవరినైనా తన శిష్యునిగా స్వీకరించి భగవంతునితో సంబంధమును కలిగించును!
 • ఆచార్యుడు అజ్ఞాని అయిన తన శిష్యునికి భగవద్విషయమును తానే ఉపదేశించి భగవంతుని సేవించే విధమును నేర్పును కానీ శిష్యుని జ్ఞానార్జనలో ఒంటరిగా విడిచిపెట్టడు! కానీ భగవానుడు జ్ఞానవంతుడై ఆచార్య సంబంధము కలిగిన జీవుని మాత్రమే అనుగ్రహించును!
 • కనుక మోక్షము విషయములో మనలోని సంశయములు దూరం చేసి తనను ఆశ్రయించిన వారికి పరమపదము తథ్యమని ఉపదేశించిన ఉడయవర్ల చరణయుగళాన్ని ఆశ్రయించి మధురాకవియాళ్వార్లు నమ్మాళ్వార్ల పట్ల కలిగియుండిన “తేవు మత్తఱియేన్…. ” అనెడి నిస్సంశయ, అన్యధా శరణ నాస్తి అనెడి నిర్దుష్టమైన భక్తి ప్రపత్తులు ఉడయవర్ల సన్నిధిలోనూ కలిగియుండుటలో ఎటువంటి ఆలోచన చేయనక్కరలేదు!

అయితే మనకు ఇంకొక సందేహము కలుగవచ్చు! పూర్వాచార్యులైన ఆచార్యులందిరికినీ ఉడయవర్లే ఉత్తారుకులని చెప్పుకున్నప్పుడు, మరి ఆళవందార్లు నాథమునుల విషయములో ఉపాయత్వమును నిశ్చయించుకున్నదెట్లు? దానికి సమాధానం – నాథమునులే కదా నమ్మాళ్వార్ల వద్ద రహస్యార్థములన్నీయును మరియు స్వప్నార్థములను భవిష్యదాచార్య విగ్రహముతో సహా పొంది తమ అంత్యకాలమందు వాటిని తమ శిష్యులైన ఉయ్యాక్కొండారుకు ఇచ్చి భవిష్యత్తులో అవతరించబోవు ఆళవందార్ల విషయమును వారికి చెప్పి, “ఈశ్వరమునులకు కలుగబోవు కుమారునికి రహస్యార్థములను ఉపదేశించవలసింది! ” అని తెలిపినందువల్ల వారు అలాగే వేచియుండి తమ కాలమందు ఆళవందార్లు అవతరించకపోవుట చేత తమ శిష్యులైన మణక్కాల్ నంబికి ఆ బాధ్యతను అప్పజెప్పగా మణక్కాల్ నంబి ఆచార్య దివ్యాజ్ఞను అనుసరించి తమ కాలములో అవతరించిన ఆళవందార్లకు రహస్యార్థములను ఉపదేశించి మరియు భవిష్యదాచార్య విగ్రహమును వారికి అనుగ్రహించిరి! దానికి ఆళవందార్లు నాథమునుల వల్లనే కదా తమకు శ్రీసంప్రదాయ విద్య అబ్బినదని సంతోషించి, “తాము పుట్టక మునుపే గర్భములోనే సంపదను పొందిన రీతిగా విశేష కటాక్షమును పొంది, సంప్రదాయార్థములను తెలియపరచి, భవిష్యదాచార్య విగ్రహమును చూపి ఆ భవిష్యదాచార్యులైన ఉడయవర్లు తమకాలములోనే అవతరించగా వారిని దర్శించే భాగ్యాన్ని కలుగచేసి సద్వారకముగా స్వప్నదర్శనమును అనుగ్రహించి ఇంత ఉపకారమును ఒనర్చిన నాథమునులకు నేనేమి ప్రత్యుపకారము చేయగలనని ” చింతించి ఆళవందార్లు నాథమునుల పట్ల ఉండెడి ప్రత్యుపకార భావము యావదాత్మభావిగా ఉండునని తెలియపరచగోరి, “నాథమునులు నిశ్చయించిన విషయమువరకు ఎందుకు, నాకు ఇంత ఉపకారము చేసిన నాథమునులే నాకు సర్వస్వము కదా!”, అని పలికారు ఆళవందార్లు ! అదే దాని భావము! నిజానికి నాథమునుల మనోభావమే ఆళవందార్ల మనోభావము !

అలా ఆళవందార్లు నాథమునుల పట్ల ప్రాప్యమునకు తగిన ఉపాయత్వభావమును పొందుటయే కాక  నమ్మాళ్వార్ల పట్ల కూడా, “సర్వం యదేవ నియమేవ మదన్వయానాం! ఆద్యస్య నః కులపతేర్వకుళాభిరామం శ్రీమత్తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా!!” (స్తోత్ర రత్నం -5), (నా వంశమునకు చెందినవారికందరికిని శ్రీశఠకోపుల పాదద్వయమే సమస్తమో ఆ శ్రీచరణయుగళాన్నే ఆశ్రయిస్తున్నాను!) అని అందరికి, తమకు ఆళ్వార్ల శ్రీచరణాలే ఉపాయముగా నిశ్చయించుకున్నట్లు అయినది! అక్కడే “మదీయ శరణం.. ” అన్నందువలన తామొక్కరినే చెప్పి ఉపాయత్వమును చెప్పుటచే ఆళ్వార్లు తమకు చేసిన ఉపకారమునకు బద్ధులై తత్సమృద్ధి సూచకంగా చెప్పినట్లు స్పష్టమవుచున్నది !!

ఇక తరువాతి వ్యాసములలో ఉడయవర్ల యొక్క ఉత్తారకత్వమును నిరూపించే మరికొన్ని ఐతిహ్యములను చెప్పుకుందాము!

— అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము:  https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujar-our-saviour-2.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org