Monthly Archives: July 2015

చరమోపాయ నిర్ణయం- పరిచయము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

మన సంప్రదాయములో ఆచార్యుని శ్రీచరణములే చరమోపాయముగా చెప్పబడుచున్నది. “చరమ” అనగా అంత్యము లేదా చిట్టచివర అని అర్థం. ఏ “సాధనము” లేక “దారి” చేత మనము పొందవలసినదాన్ని పొందుతామో దానికి “ఉపాయము” అని పేరు. పొందబడే వస్తువుకి “ఉపేయము” అని పేరు. అంటే మన పూర్వాచార్యుల శ్రీసూక్తుల ప్రకారం, “ఉపేయమైన భగవద్సాన్నిధ్యమును పొందుటకు ఆచార్యుడే చరమోపాయము”. అయితే మన సంప్రదాయములో ఉపాయము, ఉపేయము రెండూ ఒకటే. అది ఆచార్యుడే. అంటే, ఆచార్యుని సాన్నిధ్యమే భగవద్సాన్నిధ్యము. భగవంతుని వద్దకు జీవులను చేర్చే ఉపాయమూ ఆచార్యుడే. అందుకనే ఆచార్య కైంకర్యమే ముక్తికి చరమోపాయము అని చెప్పుట అతిశయోక్తి కాదు.భగవద్రామానుజులు – శ్రీ పెరుంబుదూర్

పెరియవాచ్చాన్ పిళ్ళై “మాణిక్క మాలై” లో ఈ విధంగా చెప్తారు, “వడుగ నంబి శ్రీ సూక్తి ప్రకారం,”ఆచార్యపదము చాల ప్రత్యేకమైన స్థానము. కేవలము భగవద్రామానుజులవారికే ఆ ఆచార్య స్థానమును అలంకరించే అధికారము కలదు!”. పెరియ వాచ్చాన్ పిళ్ళై తిరు క్కుమారులైన (దత్తతగొన్న పుత్రులు) నాయనారాచ్చాన్ పిళ్ళై గొప్ప సంప్రదాయస్థులు. ఉభయవేదాంత పండితులు. వీరు “చతుశ్శ్లోకి” కి అద్భుతమైన వ్యాఖ్యానం అనుగ్రహించినారు. వీరు రచించిన “చరమోపాయ నిర్ణయం” అనెడి ఈ గ్రంథం ద్వారా భగవద్రామానుజుల యొక్క ఆచార్యఅధికారకత్వమును, శ్రియఃపతి మరియు పూర్వాచార్యుల శ్రీ సూక్తుల ఆధారంగా నిరూపించినారు. పెరియ వాచ్చాన్ పిళ్ళై – తిరుచేంగనూర్

పిళ్ళై లోకాచార్యుల “శ్రీ వచన భూషణము” గ్రంథము యొక్క ప్రారంభ సూత్రము, “వేదార్థం అఱుదియిడువదు స్మృతి ఇతిహాస పురాణంగళాలే”. అంటే, “వేదార్థముల యొక్క సారము స్మృతి ఇతిహాస పురాణముల ద్వారా మాత్రమే అవగతమవుతుంది.” అదే గ్రంథములో 447వ సూత్రము,”ఆచార్య అభిమానమే ఉత్తారకము”. అంటే,”ఆచార్యుని పట్ల ఉండెడి అభిమానమే శిష్యునికి ఉత్తారకము. “ఈ సూత్రములను సమన్వయిస్తే మనకు తెలిసే విషయం, “ఆచార్యాభిమానమే శిష్యునికి చరమోపాయము. ఈ నిజమును నిరూపించుటే వేదార్థముల యొక్క ఉద్దేశ్యము”.శ్రీ  పిళ్ళై లోకాచార్యులు, శ్రీ మణవాళ మహాముణులు – శ్రీ పెరుంబుదూర్

నమ్బెరుమాళ్ ప్రతిపాదించినట్టుగా శ్రీ వైష్ణవ సంప్రదాయమును “ఎమ్బెరుమానార్ దరిశనమ్” (భగవద్రామానుజ దర్శనం) అని మణవాళ మహాముణులు గుర్తించారు.

“ఎమ్బెరుమానార్ దరిశనమ్ ఎన్ఱె ఇదర్కు
నమ్బెరుమాళ్ పేరిట్టు నాట్టి వైత్తార్
అమ్బువియోర్ ఇంద దరిశనత్తై  ఎమ్బెరుమానార్ వళర్త
అన్ద చ్చెయల్ అఱిగైక్కా”

సామాన్య అనువాదము – సనాతనమైన శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రతిష్ట చేసిన భగవద్రామానుజుల (ఎమ్బెరుమానార్) ప్రాశస్త్యమును బయలుపరుచుటకు శ్రియఃపతి అయిన నమ్బెరుమాళే స్వయంగా, “ఈ సంప్రదాయం ఎమ్బెరుమానార్ దర్శనం అని విఖ్యాతి నొందుగాక !” అని ప్రతిపాదించారు.
సంసార సాగరంలో పడి అలమటిస్తున్న జీవుల పట్ల నిర్హేతుక కృప కలిగి భగవద్రామానుజులు రహస్య త్రయములోని నిగూఢ రహస్యములను తెలుసుకోవలెనని ఆశ కలిగిన వారికందరికీ ఉపదేశించినారు.

శ్రీ శైలేశుల (తిరువాయ్మొళి ప్పిళ్ళై) శిష్యులైన మణవాళ మహాముణులు తన “ఉపదేశ రత్నమాల” ప్రబంధములోని మొదటి పాశురములో చెప్తారు, “శిష్యుడు భగవద్విషయమును ఆచార్యముఖతః తెలుసుకొనవలెను”. అదే ప్రబంధం చివరి పాశురంలో చెప్తారు, “ఆచార్యుని వద్ద పొందిన శ్రీ సూక్తులని ధ్యానమందుంచి ఆచారణలో (అనుష్టానం) పెట్టిన శిష్యుణ్ణి భగవద్రామానుజులు తమ అనుగ్రహ దృష్టి చేత కరుణించి పరమపదములో శ్రియఃపతి శ్రీ చరణాల వద్దకు చేరవేస్తారు”.
అటువంటి పరమ కృపా కటాక్ష పూర్ణులైన భగవద్రామానుజుల యొక్క వైభవమును నాయనారాచ్చాన్ పిళ్ళై ఈ “చరమోపాయ నిర్ణయం” అనే గ్రంధంలో అద్భుతంగా విశదపరచినారు.

ఇటువంటి మహోత్కృష్ట గ్రంథమును అస్మదాచార్య కృప చేత, శ్రీమత్ పరమహంస పరివ్రాజకేత్యాది పట్టర్పిరాన్ రామానుజ జీయర్ (29వ పట్టము, వానాచాలము (వానమామలై)) వారి పాదారవిందముల వద్ద సభాక్తి పూర్వకముగా సమర్పిస్తూ ఈ అనువాదము ప్రారంభించడమయినది.

ఈ గ్రంధము మూలము “మణిప్రవాళ ” (తమిళము, సంస్కృతము కలిసి) లో రచించబడినది. దీనిని ఉ.వే. శ్రీమాన్ తోతాద్రి సారథి స్వామి ఆంగ్లములోకి అనువదించినారు. వీరు ఇదివరకు ఈ గ్రంధమును ఉ.వే. శ్రీమాన్ ఇళయ విల్లి భూవరాహాచార్య స్వామి వారి వద్ద కాలక్షేపము సేవించి ఉన్నారు. భగవద్రామానుజ ఆచార్య అధికారకత్వమును నిరూపించుటకు ఇంత కన్నా గొప్ప గ్రంథము మన సంప్రదాయ వాఙ్మయములో లేదంటారు పెద్దలు.  నాయనారాచ్చాన్ పిళ్ళై ఈ గ్రంథము ద్వారా “భగవద్రామానుజులే జగద్గురువులు” అని మెట్టు మెట్టుగా నిరూపిస్తూ సిద్దాన్తీకరించినారు. ఆ దివ్య పథములో మనమూ పయనించి ఆచార్య తిరువడిని చేరదాము రండి!

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: http://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-introduction.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు)– http://srivaishnavagranthams.wordpress.com
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org