Monthly Archives: December 2015

చరమోపాయ నిర్ణయం – ఉత్తారక ఆచార్యులు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< శిరస్సంబంధం (తిరుముడి సంబంధం)

క్రిందటి అధ్యాయములో చెప్పినట్టుగా రెండు విధముల ఆచార్యులు కలరు-ఉత్తారకాచార్యులు తామే శిష్యులను సంసారము నుంచి ఉద్ధరించి పరమపదమునకు చేర్చగలరు, ఉపకారకాచార్యులు తాము శిష్యుల యొక్క ఉద్ధరణ బాధ్యతను వహింపక వారిని ఉత్తారకాచార్యుల దరికి చేర్చి శిష్యోద్ధరణకు ఉపకరించెదరు.

ఈ భూమియందు ఉత్తారకత్వము మూడు విధములుగా ప్రకటింపబడినది – శ్రియఃపతి అగు సర్వేశ్వరుడు అయిన శ్రీమన్నారాయణుడు (ఎమ్పెరుమాన్), శ్రీ శఠకోపులు (నమ్మాళ్వార్లు) మరియు భగవద్రామానుజులు (ఉడయవర్లు). ఉభయవిభూతులను (నిత్య విభూతి అగు పరమపదము, లీలా విభూతి అగు సంసారము) శాసించగల వారి వద్దనే ఈ ఉత్తారకత్వము ప్రకాశించును. (వేదము భగవానుడైన శ్రియఃపతినే శాసకుడుగా నిర్ధారించగా) శ్రియఃపతి తానే ఉభయవిభూతులకు నాయకునిగా నిర్ధారించుకున్నట్టుగా విష్వక్సేన సంహితలో చెప్పబడినది. అది, “అస్యా మమ చ శేషం హి విభూతిరుభయాత్మికా”, అర్థము- ఉభయవిభూతులు నా యొక్క మరియు పిరాట్టి అగు శ్రీ మహాలక్ష్మి యొక్క ఆధినములో ఉండును.

నామ్మాళ్వార్లు తిరువాయిమొழி 6. 8. 1 లో “పొన్నులగాళీరో పువనముழுదాళీరో” అని చెప్పిరి. అంటే అర్థము- ఓ పక్షులారా! నా అవస్థను పెరుమాళ్ళకు చేరవేయండి.నేను మిమ్ములను ఈ లీలా విభూతిలోనూ మరియు నిత్యవిభూతిలోనూ ఉద్ధరించగలను. ఇక్కడ ఆళ్వార్లు భగవానుని అనుగ్రహము చేత తమను తామే ఉభయవిభూతినాధులని నిర్ధారించిరి.

పెరియ పెరుమాళ్ళగు శ్రీరంగనాధుడు భగవద్రామానుజులకు ఉభయవిభూతి నాధత్వమును ప్రసాదించెను. అందుకనే భగవద్రామానుజులు ఉడయవర్లుగా ప్రసిద్ధులైరి. అందుచేత భగవద్రామానుజులకు కూడా ఉత్తారకత్వము ఆపాదించబడినది.

నమ్బెరుమాళ్ళు భగవద్రామానుజులకు “ఉడయవర్” అను నామమును ఇచ్చి ఉభయవిభూతి నాధత్వము ప్రసాదించుట.

ఈ సంసారములో చిక్కి అలమటిస్తున్న జీవులను ఉద్ధరించి, తన వైపు తిప్పుకొనుటకు శ్రియఃపతి నమ్మాళ్వార్లను ఉపకరణముగా చేయ నిశ్చయించి ఈ భూమిపై అవతరింపచేసెను. అయితే నమ్మాళ్వార్లు తమ యొక్క 32 సంవత్సరముల అవతార వ్యవధిలో శ్రియఃపతి యొక్క ఎడబాటును తాళలేక భక్తి తీవ్రతలో అమితమైన వ్యధతో విలపించిరి. “కూవిక్కొళ్ళుమ్ కాలమ్ ఇన్నుం కురుగాదో! “, అర్థము-నీ ఎడబాటులో కాలము కరుగకున్నదే, “ఎన్నాళ్ యానున్నై ఇని వన్దు కూడువనే!”, అర్థము- ఏనాటికి నిన్ను చేరుకుని నీలో కలిసిపొయెదను. “మంగవొట్టు ఉన్ మామాయై”, అర్థము- నాదేహము యందు నీ ఆపేక్షను విడువుము.(ఎందుకనగా శ్రియఃపతికి  నమ్మాళ్వార్ల జీవ తిరుమేనిపై అమితమైన ప్రేమ ఉండేది.అందుకనే నమ్మాళ్వార్లు తన తిరుమేనిపై గల ఆపేక్షను విడిచినచో తాను పరమపదము చేరి దివ్య తిరుమేని పొందగలనని శ్రియఃపతికి విన్నవించెను). ఈ విధముగా నమ్మాళ్వార్లు తమ యొక్క ఆర్తిని భగవానుని వద్ద వెల్లిబుచ్చుకుని చివరికి ఈ సంసారమును విడిచి పరమపదమును పొందిరి. అయితే శ్రియఃపతి అభిలషించిన జీవోద్ధరణ కార్యము నమ్మాళ్వార్ల చేత జరగలేకపోయింది. ఆ దివ్య కార్యము భగవద్రామానుజుల చేత జరుపబడింది. వారు 120 సంవత్సరముల సుదీర్ఘకాలము వేంచేసి ఉండి ప్రపత్తి మార్గమున జీవోద్ధరణను ఒక ఉద్యమము వలె నలుదిశలా వ్యాప్తి చేసిరి.

భగవద్రామానుజుల యొక్క ఉత్తారకత్వ ప్రభావము చేత చాలా మంది జనులు శ్రీవైష్ణవులైరి. ఈ విషయమును నమ్మాళ్వార్లు తిరువయిమొழி 5.2.1 లో ప్రస్తావిస్తూ, “కడల్వణ్ణన్ బూదంగళ్ మణ్మేల్ ఇశై పాడియాడి ఎంగుమ్ ఉழி దరక్కణ్డోమ్”, అర్థము- మేము భవిష్యత్తును (కలియుగములో) గాంచితిమి.భగవానుని పట్ల అమితమైన ప్రేమ కలిగి, భగవానుని ఎడబాటుని క్షణమైనా సహింపలేక, భగవానుని వైభవమును నిర్భయముగా నలు దిశలా వ్యాప్తి చేసే పరమ భక్తాగ్రేసరులను మేము గాంచితిమి. ఎంతో మంది జనులు శ్రీవైష్ణవులగుటకు కేవలము భగవద్రామానుజుల యొక్క ఉత్తరకత్వమే కారణము. ఇక ఆచార్యత్వ విషయములో కృపామాత్ర ప్రసన్నాచార్యత్వము ఉడయవర్లలో ప్రస్ఫుటముగా కానవచ్చుచున్నది. ఆచార్య పురుషులలో అరుదుగా కనిపించి అపార కరుణ, ఇతరుల కష్టములను తమ కష్టములుగా భావించి బాధపడెడి స్పటికసదృశమగు మనస్సు ఇత్యాది విశేష గుణములు జగదాచార్యులగు ఉడయవర్లలో మనము చూడవచ్చును. స్వానువృత్తి ప్రసన్నాచార్యుడగు శ్రీకృష్ణ పరమాత్ముని అర్జునుడు సమీపించి, “యచ్చ్రేయస్సానిచ్చితమ్ బ్రూహి తన్మే చిష్యస్ తేZహం చాదిమాం త్వమ్ ప్రపన్నమ్ ” (భ.గీ 2.7) అర్థము- కృష్ణా! నేను నీ భక్తుడిని. నాకు ఏది హితమో ఉపదేశింపుము ఆచరించెదను-అని ప్రార్థించెను. అప్పుడు శ్శ్రీకృష్ణ పరమాత్ముడు, “తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః “, అర్థము-తత్వదర్శనము చేసిన జ్ఞానుల వద్ద ప్రణిపాతము, సేవ మరియు పరిప్రశ్న చేత జ్ఞానము పొందవలెను- అని ఉపదేశించెను.

కనుక పైన చెప్పిన విషయముల సారము ఏమనగా శ్రియఃపతి ఉత్తారకత్వమును కలిగి ఉన్ననూ స్వానువృత్తి ప్రసన్నాచార్యుడు అగుట చేత జీవోద్దరణకై సంకల్పించి నమ్మాళ్వార్లను అవతరిమ్పచేసెను. అయితే నమ్మాళ్వార్లు భగవానుని ఎడబాటును తాళలేక తమను వెంటనే పరమపదమునకు గొనిపొమ్మని ప్రార్థించి పిన్న వయస్సులోనే శ్రియఃపతి తిరువడి చేరెను. తరువాత అవతరించిన భగవద్రామానుజులు జీవుల పట్ల అపార కరుణ కలిగినవారై ప్రపత్తి మార్గమున జనులు సులభతరముగా మోక్షమును పొందుటకు విశిష్టాద్వైత సంప్రదాయ బాట వేసి లోకమునకు మహోపకారము చేసిరి. అందుచేత భగవద్రామానుజులను ఉత్తారకాచార్యులు అని పిలుచుట అతిశయోక్తి కాదు.

 

— అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: http://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-uththaraka-acharyas.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు)– http://srivaishnavagranthams.wordpress.com
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org