Monthly Archives: February 2016

చరమోపాయ నిర్ణయం – ఆళవందార్ల శిష్య పంచకము భగవద్రామానుజుల ఉత్తారకత్వమును ప్రతిపాదించుట

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< ఉత్తారక ఆచార్యులు

పూర్వ వ్యాసములో ముగ్గురు ఉత్తారకాచార్యుల ద్వారా భగవద్రామానుజుల ఉత్తారకత్వము ప్రతిపాదించబడిన విధానమును చూచితిమి. ఇక భగవద్రామనుజుల యొక్క పంచ సదాచార్యులైన మహాపూర్ణేత్యాదులు శ్రీ రామానుజ ఉత్తారకత్వమును స్థిరీకరించిన విధమును వారి వారి దివ్య సూక్తుల ద్వారా తెలుసుకొనెదము.

ఉడయవర్ల పంచ సదాచార్యులు – పెరియ నంబి (మహా పూర్ణులు), తిరుక్కోట్టియూర్ నంబి (గోష్టి పూర్ణులు), పెరియ తిరుమల నంబి, తిరుమలై ఆణ్డాన్, తిరువరంగ ప్పెరుమాళ్ అరయర్.

వరాహ పురాణములో చెప్పినట్టుగా “చక్రాధి ధారణం పుంసాం పర సంబంధ వేదనం పతి వ్రతా నిమిత్తం హి వలయాది భూషణం” అనగా – పతివ్రతకు వలయాది ఆభరణ ధారణము ఎటుల మంగళకరమో అటులనే చక్రాంకిత ధారణము పురుషులకు శ్రియఃపతితో గల దివ్య సంబంధమునకు సూచకము, మరియు, “ఏవం ప్రపద్యే దేవేశం ఆచార్య కృపయా స్వయం అథ్యాపయేన్మన్త్రరత్నమ్ సర్షి చ్చన్దోధిదైవతమ్”, అనగా – ఆచార్యుడు శిష్యుని పట్ల గల అపార కృప చేత శిష్యునికి మొదట సమాశ్రయణము ద్వారా భగవద్సంబంధము కలిగించి పిదప ఋషి, చందస్సు మరియు అధిష్టాన దేవత కలిగిన మహామంత్రోపదేశము చేస్తాడు. పైన చెప్పిన సూక్తులను అనుసరించి మహా పూర్ణులు మధురాంతకము నందు వేంచేసి ఉన్న ఏరికాత్త రామర్ (ఏరు కాచిన రాముడు) సన్నిధిలోని వకుళ వృక్షము కింద కూర్చుని ఇళయాళ్వారుకు సమాశ్రయణము చేసి తిరుమంత్రము, ద్వయము ఉపదేశించినారు.

మహాపూర్ణులు ఇళయాళ్వారుతో, “మీకు ఆచార్యుని కావలెనన్న కోరికతో మీకు మంత్రోపదేశము చేయలేదు. మా ఆచార్యులైన ఆళవందార్ల ఆజ్ఞానుసారం మేము ఈ కార్యము నిర్వహించితిమి. నమ్మాళ్వార్లు ఆనతిచ్చినట్టు ‘కలియుం కెడుమ్ కణ్డుకొణ్మిన్’ అని, మీరు ఎంతటి మహానుభావులో ఎరిగిన మాకు మీతో ఈ విధముగా సంబంధము కలిగినందుకు మా జన్మ ధన్యమైనది. ‘వెఙ్గదిరోన్ కులత్తు క్కోర్ విళక్కాయ్ త్తోన్ఱి విణ్ముళుదుమ్ వుయ్యక్కొణ్డవీరన్’, ‘జనకానామ్ కులే కీర్తిమాహరిష్యతి మే సుతా’ అన్న దివ్య సూక్తుల ప్రకారం మీ యొక్క అవతార ప్రభావము చేత ఈ ప్రపన్నకులమే ప్రసిద్ధి పొందబోవుచున్నది”, అని చెప్పెను. ఈ సూక్తులు సంప్రదాయమునకు బహు ముఖ్యముగా పెరియ వాచ్చాన్ పిళ్ళై చేత ఆపాదించబడినది.

భగవద్రామనుజులు పెరియ తిరుమల నంబి వారి తిరుమాళిగలో ఒక పూర్ణ సంవత్సరము వేంచేసి ఉండి ఇతిహాసరాజమైన శ్రీ రామాయమును కాలక్షేపము గావించినారు. ఆ సమయమున, “యస్య రామం నపశ్యేత్తు యఞ్చ రామో నపశ్యతి, నిన్దితః స వసేత్శోకే స్వాత్మాప్యేయమ్ విగర్హతి” (అనగా- ఎవరు రాముని దర్శించరో లేక ఎవరిని రాముడు చూడడో అతనిని పరులే కాక అతని ఆత్మ కూడా శపించును) అన్న శ్లోకము వద్ద భగవద్రామనుజులు, “మరి అటువంటి దౌర్భాగ్య జనులు స్వగత మరియు పరగత స్వీకారమును విడిచి ప్రవర్తించుట చేత తమను తామూ మరియు పరులూ నిందించునట్లు ఉండిన ఇక అటువంటి చేతనులకు ఉత్తారకమేది?” అని తమ ఆచార్యులను ప్రశ్నించగా, “నిత్యసూరులకు నాయకుడగు మీ యొక్క అమోఘమైన అభిమానమే చేతనులకు ఉత్తారకము” అని పెరియ తిరుమల నంబి సెలవిచ్చిరి. పిదప తమ శిష్యుడైన ఎంబార్లను ఉదకపూర్వకముగా ఉడయవర్లకు సమర్పించి పెరియ తిరుమల నంబి ఎంబార్ తో, “ఇక మీరు సదా ఉడయవర్లనే ఆచార్యునిగా స్మరించుకోండి. వారి యొక్క శ్రీ చరణములే చరమోపాయము. వారు సర్వోత్తారకులుగా తిరు అవతరించినారు. మాకు వారితో నేరు సంబంధము లేకపోయిననూ శ్రీ రామాయణ మూలముగా ఒక దివ్య సంబంధము ఏర్పడినది. ఆళవన్దార్లు కూడా వీరిని దర్శించ లేదనే వ్యధతోనే పరమపదస్థులైరి. అటువంటి మహిమాన్వితులగు ఉడయవర్ల సంబంధము కలిగిన మనము నిర్భయులై ఉండవచ్చును. కనుక మీరు వారిని విడువక నీడ వలె వెన్నంటి నిలువుము”, అని ఉపదేశించిరి. అనగా కేవలము నిస్సహాయులగు చేతనుల పట్ల నిర్హేతుక అభిమానము చేత వారిని ఉద్ధరించుటకు అవతరించిన భగవద్రామానుజుల యొక్క శ్రీ చరణములే మనకు రక్షణ అని ఎంబార్ కు పెరియ తిరులమల నంబి ఉపదేశించిన విషయ తాత్పర్యము. ఇదే మన సంప్రదాయము యొక్క మూల సూత్రము.

పిదప ఉడయవర్లు గోష్టిపురమనబడు తిరుక్కోట్టియూరుకు వేంచేసి గోష్టిపూర్ణుల (తిరుక్కోట్టియూర్ నంబి) వద్ద చరమ శ్లోకార్థమును కాలక్షేపము గావించెను. అప్పుడు గోష్టిపుర్ణులు, “ఉడయవరే! మిమ్ములను పద్దెనిమిది మార్లు తిప్పించుకుని ఇంత శ్రమకు గురి చేసినానని తప్పుగా భావించకండి. ఇదంతా మీరు నేర్చుకున్న రహస్యార్థముల యొక్క మహత్తును మీకు తెలియపరుచుట కొరకే! మీరు కారణజన్ములు. నాథమునుల మనస్సులో ఎల్లప్పుడు మీ స్మృతి మెదిలేదట. మీతో దివ్య సంబంధము కలిగి ఉన్నచో ఇక ఉజ్జీవనము గురించి కలత చెందక హాయిగా గుండె మీద చేయి వేసుకుని నిదురించవచ్చు. మా ఆచార్యులైన ఆళవందార్లు కూడా మీతో సమాగమము కొరకు ఎంతగానో ఆరాట పడినారు. వారి శిష్య బృందములో ఎంతోమంది సుశిక్షితులు, సంప్రదయోద్ధారణ చేయగల సమర్థమైన శిష్యులు ఉన్ననూ మీరే ఆ బాధ్యత వహించవలెనన్న సత్సంకల్పముతో కంచి పేరరుళాళ ప్పెరుమాళ్ళను మిమ్ములను అనుగ్రహించ వలసిందిగా ప్రార్థించినారు. మీతో నాలుగు రోజులైననూ గడుపవలెనని ఆశించి ఆ బెంగతోనే తిరునాడు అలంకరించినారు. అటువంటి సర్వోత్కృష్టులైన మీ యొక్క తిరు నామముతోనే ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయము “ఎమ్బెరుమానార్ దరిశనమ్” అని వెలుగొందగలదు” అని ఉడయవర్లకు మంగళాశాసనము చేసినారు.

పిదప ఉడయవర్లకు మరో ఆచార్యులైన తిరుమలై ఆణ్డాన్ గోష్టిపుర్ణుల యొక్క ఆజ్ఞతో ఉడయవర్లకు తిరువాయ్మొళి రహస్యార్థములు ఉపదేశించసాగారు. కాలక్షేపములో ఒక చోట ఉడయవర్లకు, తిరుమలై ఆణ్డాన్ కు మధ్య భావభేదము ఏర్పడుట చేత కాలక్షేపము నిలిచి పోయినది. ఈ విషయము తెలుసుకొన్న గోష్టిపుర్ణులు తిరుమలై ఆణ్డాన్ ను తమ వద్దకు పిలిపించుకుని, “మీరు ఉడయవర్లకు తిరువాయ్మొళి కాలక్షేపము వారికి తెలియదని చెప్తున్నారని అనుకోకండి. శ్రీ కృష్ణుడు సాందీపని మహర్షి వద్ద ఎలా వేదాలు (తనకు అవన్నీ తెలిసిననూ) నేర్చుకున్నాడో ఉడయవర్లు కూడా అట్లే మీ వద్ద తిరువాయ్మొళి రహస్యార్థములను కాలక్షేపము సేవిస్తున్నారు. వారికి ఏ అర్థము తోస్తే అది ఆళవన్దార్లకు తోచినదే అవుతుంది”, అని చెప్పారు. పిదప గోష్టిపూర్ణులు, పెరియ నంబి కూడా కలిసి గోష్టిలో ఉండి కాలక్షేపమును కొనసాగించారు. అప్పుడు, “పొలిగ! పొలిగ!….. కలియుమ్ కెడుమ్”, అన్న పాశురము వద్ద ఉడయవర్ల ముఖములో పరమోత్సాహమును గమనించిన గోష్టి పూర్ణులను ఉడయవర్లు తమను అటుల గమనించుటకు కారణమేమని ప్రశ్నించగా గోష్టిపూర్ణులు, “ఈ పాశురము యొక్క అర్థము మీ యొక్క తిరు అవతార వైభవమే అని మా చేత చెప్పించు కొనుటకే మీరు మమ్ములను ఈ ప్రశ్న వేసినారా? ప్రపన్న కులోద్భవులైన మీరు మావంటి సామాన్య జనులను ఈ సంసార సాగరము నుండి రక్షించి తీరము చేర్చుటకే కదా నిత్య విభూతిని వదిలి ఇచ్చట అవతరించిరి”, అని బదులిచ్చిరి. అది విన్న తిరుమలై ఆణ్డాన్ పరమ సంతోషముతో పులకిత గాత్రులై , “నేడు కదా నా జన్మ ధన్యమైనది. ఉడయవర్లు మా ఆచార్యులు ఆళవందార్ల యొక్క అంశమే. వీరే నన్ను తరింపచేసేది”, అని సెలవిచ్చిరి.

ఉడయవర్లు తిరువరంగ ప్పెరుమాళ్ అరయర్ వారికి సుశ్రూష చేయుచూ వారి వద్ద చరమోపాయ రహస్యములను (ఆచార్యుడే సర్వస్వమను సత్యమును రూఢీ చేయు రహస్యములు) నేర్చుకోనినారు. అరయర్ స్వామి కూడా ఎంతో ప్రేమతో ఉడయవర్లకు రహస్యములను ఉపదేశిస్తూ, “ఉడయవరే! మా వద్ద చరమోపాయ రహస్యములను మీరు నేర్చుకుంటున్ననూ నిజమునకు ఆ రహస్యములే మీ యొక్క తిరు అవతారముగా మూర్తీభవించినవి. ఈ నమ్మకము మాకు నాథమునుల ద్వారా కలిగినది. కనుక మీరు జగదోద్ధారకులనడంలో ఎట్టి సందేహమూ లేదు”, అని ఉద్ఘాటించారు.

ఈ విధముగా ఆళవందార్ల యొక్క పంచ శిష్య రత్నములైన మహాపూర్ణ, గోష్టిపూర్ణ, మహా శ్రీశైల పూర్ణ, మాలాధర, శ్రీ రంగనాధ అలరులు ఉడయవర్లకు విద్య నేర్పించిననూ ఉడయవర్లే ఉత్తారకాచార్యులుగా పలు సందర్భములలో నిరూపించిరి.

గోష్టిపూర్ణులు తమ కుమార్తెను కూడా ఉడయవర్లనే ఆశ్రయించమని ఆదేశించిరి. ఉడయవర్లు తమ యొక్క నిర్హేతుక కృప చేత ఆమెను అనుగ్రహించి తమ శ్రీ చరణములను చూపి, “ఇక నీకు ఈ శ్రీ చరణములే ఉజ్జీవకము!” అని ఉపదేశించెను. అంతట ఆమె, “మా అయ్యగారైన తిరుక్కోట్టియూర్ నంబి వద్ద దేవరవారి ఉత్తారకత్వము గూర్చి విని మనస్పూర్తిగా మీరే రక్షకులను నమ్మితిని. ఇక వేరే ఎవరిని ఆశ్రయించ గలను? మీ శ్రీ చరణములే నా జీవోద్ధారకములు”, అని బదులిచ్చెను.

కాంచి పూర్ణులు వరదరాజ పెరుమాళ్ళకు (పేరరుళాళన్) చామరము వీచే కైంకర్యము (తిరువాలవట్టము) సమర్పిస్తూ, “స్వామి! ఇళయాళ్వానుకు (రామానుజుల పూర్వాశ్రమ నామధేయము) శాస్త్ర సందేహములు కలవుట. నా వద్దకు వచ్చి చెప్పి మీతో విన్నవించమని చెప్పినాడు”, అని విన్నవించగా పెరుమాళ్ళు, “నమ్బీ! ఆ విషయము మాకు ముందే తెలుసును. అతని సందేహములను మేము తీర్చెదము. జగత్కారణభూతుడనైన నేను సర్వజ్ఞుడను. అయిననూ అవతార నియమమును బట్టి ఆయా అవతారాలలో ఋషులను ఆచార్యులుగా స్వీకరిస్తాను. అలా మేము కృష్ణావతారమందు సాందీపనిముని వద్ద విద్యనభ్యసించినట్లే రామానుజులకు కూడా విద్య నేర్చుటకు ఆచార్యుని అవసరము ఒక నెపము మాత్రమే. అతను స్వతః సకల శాస్త్ర పారంగతుడు. అన్ని ధర్మ రహస్యములు ఎరిగినవాడు. నిత్యసూరులకు నాయకుడైన ఆదిశేషుని అంశలో మానవ రూపమున అవతరించినవాడు. ఈ లోకమున జ్ఞాన సౌరభములు వెదజల్లి జీవోద్ధరణ చేయగల జగదాచార్యుడతడు. అతనకి శాస్త్ర సందేహములు కలిగి మీ ద్వారా మమ్మల్ని అడుగుట మాకు బహు ఆశ్చర్యకరముగానున్నది. ” అని సాయించెను.

పేరరుళాళన్ (వరదరాజ పెరుమాళ్ళు) తిరుక్కచ్చి నంబికి వార్తాషట్కమును ఉపదేశించుట

ఇచ్చట ఒక సందేహము కలుగగలదు – ఉడయవర్లు ఆళవన్దార్ల శిష్య పంచకమునకు శిష్యులు. వారు ఆచార్యులై, ఉడయవర్లు శిష్యులై ఉండగా వారు తమ యొక్క చరమోపాయము ‘రామానుజ సంబంధము కలుగుటయే’ అని చెప్పుట ఎట్లు సమంజసము? సామాన్యముగా శిష్యుని చరమోపాయము ఆచార్యుల యొక్క శ్రీ చరణములను ఆశ్రయించుట. కాగా, ఉడయవర్ల విషయములో మాత్రము భిన్నముగా ఆచార్యులే తమ చరమోపాయము శిష్యుడైన ఉడయవర్లతో సంబంధము కలిగియుండుట అని ఉద్ఘాటించినారు.

శ్రీ రామ కృష్ణాది అవతారములలో శ్రియఃపతి విద్య కొరకు మహర్షులైన విశ్వామిత్ర సాన్దీపులను ఆశ్రయించినాడు. శ్రీ రామాయణములో, “కింకరౌ సముపస్స్థితౌ”, “తవాహమ్ దాసభూతోస్మి కిమద్య కరవాణి తే”, అనగా – ఓ విశ్వామిత్ర! మేము మీకు కింకరులమై ఉన్నాము. మీకు దాసభూతుడైన ఉంటిని. ఏమి చేయవలెనో ఆజ్ఞాపించండి! అని చెప్పబడి నట్టుగా విశ్వామిత్ర సాన్దీపనులకు శ్రీ రామ కృష్ణులు శిష్యులై విద్యాభ్యాసము చేసిననూ వారి వల్ల లాభపడినది ఆచార్యులే కానీ వారు కాదు. సర్వతంత్ర స్వతంత్రుడు సర్వవిదాత్ముడైన శ్రియఃపతి అవతార నియమము చేత విద్య నేర్చుకున్ననూ ఆ గొప్ప ఆచార్యులకే కానీ స్వామికి కాదు.ఇదే విధముగా ఆళవందార్ల శిష్యపంచకమునకు ఉడయవర్ల సంబంధముతో ఉజ్జీవనము కలిగినది.

శ్రియఃపతి అవతార నియమములో భాగముగా ఋషులకు శిష్యునిగా మారిననూ, అతని శక్తి యుక్తులను ప్రదర్శించు సమయమున ఋషులది కేవలము ప్రేక్షక పాత్ర మాత్రమే. ఎందుకనగా శ్రియఃపతి మాత్రమే జగదోద్ధారకుడని వారికినీ తెలుసును. మహాభారతములో, “విష్ణుర్మనుష రూపేణ చచార వసుధాతలే”, అనగా – విష్ణువు మానవరూపుడై భూమి యందు సంచరించును. విష్ణు పురాణములో, “ఇదానీమపి గోవింద లోకానాం హితకామ్యయా మానుషం వపురాస్థాయ ధ్వారవత్యామ్ హి తిష్ఠసి”, అనగా- ఓ గోవిందుడా! సర్వ లోకముల హితము కొరకు ఇప్పుడు నీవు ద్వారకలో నివసించు చుంటివి. అన్న ప్రమాణముల చేత ఆచార్యునకు శ్రియఃపతికి గల సంబంధమును చెప్పవచ్చును.

ఇదే సూత్రము ఉడయవర్ల విషయములోనూ వర్తించును. “ఆచార్యస్స హరిస్సాక్షాత్ చరరూపీ న సంశయః”, అనగా – ఆచార్యుడు సాక్షాత్తు పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమైన శ్రీ మన్నారాయణుని రూపమైన ఆచార్యుడు మన ఎదుట సంచరించుచున్నాడు. “గురురేవ పరంబ్రహ్మం”, అనగా-ఆచార్యుడే పరబ్రహ్మ స్వరూపము.”పీదగవాడై ప్పిరానార్ పిరమగురువాగి వన్దు”, అనగా – పసుపురంగు పట్టు వస్త్రము ధరించి సర్వేశ్వరుడు ఆచార్యుడై వచ్చును. “తిరుమామగళ్ కొళునన్ తానే గురువాగి”, అనగా – జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మికి నాధుడైన శ్రియఃపతి తానే ఆదిగురువగుచున్నాడు. ఈ విధముగా ఎలాగైతే శ్రియఃపతి యందు ఆది గురుత్వము కలదో అదే విధముగా ఉడయవర్ల విషయములో కూడా అట్టి ఆచార్య విశేషము కలదు. ఈ నిగూఢ రహస్యమును ఎరిగిన యామున శిష్య పంచకము కూడా కేవలము అజ్ఞాత జ్ఞాపన ద్వారా తాము ఉడయవర్లకు ఆచార్యులుగా ఉన్నప్పటికిన్నీ నాథమునుల నుండి వచ్చిన సంప్రదాయము యొక్క మూల రహస్యమును(ఉడయవర్లు భవిష్యదాచార్యులని) తెలిసినవారు అగుట చేత ఆత్మోజ్జీవన రూపమగు ఉత్తారకత్వమును ఉడయవర్లకు ఆపాదించి వారునూ సద్గతులు పొందినారు.

అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయమును గమనింపవలసి ఉన్నది. ఒక ఆచార్యునికి ఉత్తారకత్వమును ఎట్లు ఆపాదించుట? ఈ సర్వ జగత్తునకు ధర్త, భర్త, త్రాత, హన్త అగువాడు సర్వేశ్వరుడు. ఈ సకల చారచర సృష్టికి తల్లి తండ్రి అయినవాడు అగుట చేత మరి ఉత్తారకత్వమును శ్రియఃపతికే ఆపాదించవలెను కదా? మరి అదెట్లు ఉడయవర్లను ఉత్తారకులుగా మనము చెప్పుకోనుచున్నాము? దీనికి జవాబు – ప్రథమాచార్యుడైన ఆ సర్వేశ్వరునికే ఆచార్యులైన వారు ఉడయవర్లు. దీనిని కొంచెం పరిశీలిద్దాం! ఉడయవర్ల ఉత్తారకత్వము ఎట్లు మిగిలిన ఆచార్యుల కన్నా విశేషమైనది? అసలు ఉత్తారకత్వమనగా నేమి?

ఉత్తారకత్వమనగా  స్వరూప స్వభావములను పోగొట్టుకున్న ఒక వస్తువునకు తిరిగి తన యొక్క స్వరూప స్వభావములు పొందునట్లుగా చేయుట. స్వరుపమగా నిజ తత్వము. స్వభావమనగా విశేష గుణ జాలము. పరమాత్మ యొక్క స్వరూప స్వభావములను పునరావిష్కరించిన ఆచార్యులు ఉడయవర్లు. బాహ్యుల చేత (అనగా వేద శాస్త్రములు ఒప్పుకోని బౌద్ధ, యవనాదులు) మరియు కుదృష్టుల  చేత (వేద శాస్త్రములను ఒప్పుకున్ననూ వాటికి వక్ర,శూన్య భాష్యములు చెప్పిన అద్వైతాదులు) పరమాత్మ యొక్క స్వరూప స్వభావములు అంతరించిపోగా ఉడయవర్లు వేద శాస్త్రములకు సరియైన శ్రీ భాష్యమును చెప్పి ధర్మయుక్తమైన వాదముతో బాహ్య కుదృష్టులను ఓడించి తిరిగి పరబ్రహ్మము యొక్క స్వరూప స్వభావములను ఆవిష్కరించి పరమాత్మను శూన్య తత్వము నుంచి కాపాడి ఉద్దరించారు. కనుకనే ఉడయవర్లు ప్రథమాచార్యుడైన పరమాత్మకే ఆచార్యులై, జగదోద్ధారకులై జగద్గురువులైనారు. ఇంకనూ నారదులవారు శ్రీ కృష్ణుని విషయములో, “గోపాలోయాదవం వంశం స్వయం అభ్యుద్ధరిష్యతి”,(అనగా – గోపాలుడైన శ్రీ కృష్ణుడు స్వయముగా యదువంశమును ఉద్ధరిస్తాడు.) అని చెప్పినట్టుగా ప్రపన్నజన కూటస్థులైన నమ్మాళ్వార్లు ఉడయవర్ల విషయములో “కలియుం కెడుమ్ కణ్డుకొణ్మిన్” (అనగా – ఒక సిద్ధపురుషుని అవతారము చేత కలిబాధలు తొలగిపోగలవు) అని ఉడయవర్ల విషయములో మంగళాశాసనము చేసినారు. అందుచేతనే ఆళవందార్ల మొదలుకొని ఎందరో దర్శన ప్రవర్తకులు ఉడయవర్ల తిరునామ ప్రభావముతో ఎదిగి జ్ఞానధికులు, డెబ్బైనాలుగు మంది శ్రీ వైష్ణవ సింహాసనాధిపతులైన సన్యాసులు, వేలకొలది ఏకాంతులు, జ్ఞానాధికులైన స్త్రీలు కలిగి ఈ నిరవధిక శ్రీ వైష్ణవ శ్రియము ప్రపన్న తత్వ ప్రచారముతో జ్ఞానసుధను వర్షించుచు రామానుజ దర్శనమని నేటికిన్నీ అలరారుచున్నదంటే ఆ దర్శనప్రవర్తకులైన ఉడయవర్లు ఎంత సత్యవంతులో, శక్తివంతులో తెలుసుకొనవచ్చును.

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: http://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujars-acharyas.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org