Monthly Archives: June 2016

చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల అవతార రహస్యము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< ఆళవందార్ల శిష్య పంచకము భగవద్రామానుజుల ఉత్తారకత్వమును ప్రతిపాదించుట

పూర్వ వ్యాసములో (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/02/14/charamopaya-nirnayam-ramanujars-acharyas/) ఆళవందార్ల యొక్క శిష్య పంచకము భగవద్రామానుజుల ఉత్తారకత్వము నిరూపించిన విధమును చూచితిమి. ఈ వ్యాసములో ఇంకనూ విపులముగా భగవద్రామానుజుల ఉత్తారకత్వమును మరి కొన్ని దివ్యానుభావాల ద్వారా తెలుసుకొందాం!

ద్వాపర యుగమందు కృష్ణావతారము ధరించి భువికి వేంచేసిన శ్రియఃపతి అయిన శ్రీమన్నారాయణుడు అర్జునుని పట్ల అవ్యాజమైన అభిమానము చేత తన విషయమైన చరమ శ్లోకమును (‘సర్వధర్మాన్ …. మా శుచ!!’) అనుగ్రహించి తానే ప్రథమోపాయముగా నిశ్చయించిన విధముగా భగవద్రామానుజులు కూడా ఈ కలియుగ మందు జనులు గుర్తించ వలసిన చరమోపాయము తామే యని నిశ్చయించిన సందర్భము ఒకటి ఉన్నది. అది ఉడయవర్లు తిరునారాయణ పురమందు వేంచేసి ఉన్న కాలమందు జరిగినది. ఒకనాడు ముదలియాణ్డాన్ (దాశరథి) “యాదవగిరి మహాత్మ్యము” ను పారాయణ చేయుచుండగా ఒక శ్లోకము తటస్థించినది.

“అనంతశ్చ ప్రథమమ్ రూపం, లక్ష్మణశ్చ తతః పరమ్ !
బలభద్రః తృతీయస్తు, కలౌ కశ్చిత్ భవిష్యతి !! ”

అర్థము – ప్రథమ రూపమున అనంతుడై ఉండి పిదప లక్ష్మణ స్వామిగా అవతరించెను. పిదప బలభద్రునిగా అవతరించెను. ఈ కలియుగమున కూడా అవతరించి ఉన్నారు.

ఈ శ్లోకము వచ్చినంతనే పారాయణ ఆగినది. అక్కడ ఉన్న శిష్యులు, పండితులు ఆ శ్లోకములో చెప్పబడి నట్టుగా కలియుగమున అనంతుడు ఎవరి రూపములో అవతరించెను ? అని ముదలి యాణ్డాన్ని ప్రశ్నించెను. అంతట ముదలి యాణ్డాన్ పరమ భక్తి పూర్వకముగా భగవద్రామానుజుల వంక చూచి “ఉడయవర్లే చెప్పాలి!” అనెను. అంతట ఉడయవర్లు ముదలి యాణ్డాన్ మాటను అపేక్షించి “ఆళ్వార్లను ఉద్దేశించి ఋషి చెప్పి ఉంటారు. ” అని బదులిచ్చెను. అయితే ఉడయవర్ల బదులుకు గోష్టి సంతృప్తి చెందక, “మాపై దయుంచి ఇం కొంచెం విపులీకరించ వలసింది! ” అని ఉడయవర్లను వేడుకొనెను. అపుడు ఉడయవర్లు, “ముందు పారాయణము పూర్తి అవ్వనివ్వండి. ఇంకొకమారు చెప్పెదము”, అని విషయము గంభీరముగా దాటవేసెను. ఆనాటి రాత్రి ఉడయవర్ల శిష్యులైన ముదలి యాణ్డాన్, ఎంబార్, తిరునారాయణపురత్తరయర్ , మారుతియాణ్డాన్, ఉక్కలమ్మాళ్ ముదలగువారు ఉడయవర్లను సమీపించి ఆ శ్లోకమునకు అర్థమును తెలియపరచ వలసిందని ప్రార్థించగా, ఉడయవర్లు.”దాని రహస్యార్థమును మీకు తెలియపరచ వలెననిన ఒక షరతు! దీనిని ఎట్టి పరిస్థితులలోనూ ఇంకెవ్వరికీ చెప్పరాదు సుమా! ఋషి ఆ శ్లోకములో చెప్పిన భవిష్యదాచార్యులు మేమే!! మమ్ము ఆశ్రయించుటయే చరమోపాయము. అనంతుని యొక్క దివ్యాంశగా ఈ కలియుగమున జనోద్ధరణకై అవతరించితిమి”, అని బదులిచ్చి వారిని అనుగ్రహించెను. ఈ విషయము పరమ రహస్యముగా ఉన్ననూ బయటకు రాక తప్పలేదు.

ఒకనాడు తిరుమాలిరుంజోలై అళగర్ సన్నిధిలో అధ్యయనోత్సవము జరుగు చుండగా, పెరుమాళ్ళు గోష్టిని ఉద్దేశించి, “నమ్మిరామానుశముడైయార్కు అరుళప్పాడు”- అర్థము: మా రామానుజుల యొక్క శిష్యులను ఆహ్వానిస్తున్నాము, అనెను. అంతట, అందరు శ్రీ వైష్ణవులు, “నాయన్దే!” (నేను నీ దాసుడను), అని ముందుకు వచ్చెను.

శ్రీమన్నారాయణుని మరియు ఆదిశేషుని అవతార పరంపర

కానీ కొందరు మహాపూర్ణుల శిష్యులు మాత్రం లేచి ముందుకు రాలేదు. అప్పుడు అళగర్ పెరుమాళ్ళు వారు రాకపోవుటకు కారణమేమని ప్రశ్నించగా వారు, “దేవరవారు భగవద్రామానుజుల శిష్యులను మాత్రం ఆహ్వానించియున్నారు. భగవద్రామానుజులు మా ఆచార్యులు పెరియ నంబిగారి శిష్యులగుట చేత మేము రాలేదు”, అని బదులిచ్చెను. అప్పుడు పెరుమాళ్ళు వారికి ఈ విధముగా సమాధానమిచ్చెను, “ఎమ్బెరుమానార్ల వారికి మహాపూర్ణులు ఆచార్యులు! అదెట్లనగా మాకు రామావతారములో దశరథునివలె అలాగే కృష్ణ వతారములో వసుదేవుని వలె మేము వారలకు కుమారునిగా జన్మించిననూ మా అవతార కార్యములో వారి పాత్ర నామమాత్రమే! అటులనే ఎమ్బెరుమానార్లు కేవలం సకల జీవోద్ధరణే ప్రథమ కారణముగా అవతరించియున్నారు. సర్వ జీవులు వారిని ఆశ్రయించియే ఉజ్జీవించగలరు. మీరు ఈ నిజమును గుర్తించుము! “.పిమ్మట అళాగర్ పెరుమాళ్ళు ఉడయవర్ల ప్రియ శిష్యులైన కిడంబి ఆచ్చాన్ ను ఆహ్వానించి ఒక పాశురము మధురముగా ఆలపించమని ఆజ్ఞాపించెను. అంతట పరమ వినయశీలులైన ఆచ్చాన్ లేచి నిలబడి ఆళవన్దార్ స్తోత్రమందలి “న ధర్మ నిష్టోస్మి న చ ఆత్మవేదీ న భక్తిమాన్ త్వచ్చరణారవిన్దే ! అకించనోऽనన్య గతిశ్శరణ్యః త్వత్పాదపద్మమ్ శరణం ప్రపద్యే !! ”  అను శ్లోకమును శ్రావ్యముగా ఆలపించెను.

అర్థము – ‘ఓ స్వామి! నేను ధర్మనిష్టుడను కాను! ఆత్మా జ్ఞానిని కాను! నిను ఆశ్రయించుటకు ఏ విధమూ తెలియనివాడను. ఓ సర్వజీవులకు శరణ్యమైనవాడా! ఇదే నీ చరణారవిన్దములను ఆశ్రయించుచున్నాను’,

అంతట అళగర్ పెరుమాళ్ళు, “ఆచ్చాన్! అదేమి ఇలా అంటున్నారు. సకల జీవోజ్జీవకులైన ఉడయవర్లను ఆశ్రయించినాక ఇక ఉజ్జీవనకై భయమేల? మీరు ఒక గొప్ప ఆచార్యుని ఆశ్రయములో జీవించుచున్నారు. మీరు ఇలా అనుట పాడి కాదు”, అని బదులిచ్చిరి.

కాంచిపురములో ఒక బ్రాహ్మణుడికి కలిగిన కుమారుడు ఆరేళ్ళ వయస్సు వచ్చిననూ ఇంకా మాటలు రాక ఉండెను. ఆ బాలుడు రెండు సంవత్సరాలు కనపడ కుండా ఎక్కడికో పోయి తిరిగి వచ్చెను. తిరిగి వచ్చిన ఆ బాలుడు మంచి ముఖవర్చస్సు కలిగి మృదు మధురముగా మాటలాడు చుండెను. ఇంతకాలము ఎక్కడికి వెళ్ళావని అందరూ ఆ బాలుని ప్రశ్నించగా, “నేను క్షీరాబ్దికి వెళ్లి పెరుమాళ్ళను సేవించాను. అక్కడి జనులందరూ ఇలా మాట్లాడుకొను చున్నారు. పెరుమాళ్ళ సేనాపతి విశ్వక్సేనులవారు ఈ కలియుగములో జనులను ఉద్ధరించుటకు ఇళయాళ్వారుగా అవతరించెను.!”, అని చెప్పి ఆ బాలుడు అందరూ చూస్తూండగానే అంతర్ధానమయ్యెను. ఈ విధముగా క్షీరాబ్ది నాధుడైన భగవంతుడు ఆ బాలకుని మూలముగా ఉడయవర్ల జన్మ కారణత్వమును తెలియపరచెను.

ఇళయాళ్వారు యాదవ ప్రకాశుల వద్ద సామాన్య శాస్త్రములను అభ్యసిస్తున్న రోజులలో ఒకనాడు ఆ దేశపు రాజు యొక్క కూతురికి బ్రహ్మ రాక్షస్సు (పూర్వ జన్మ యందు ఈ బ్రహ్మ రాక్షస్సు ఒక బ్రాహ్మణుడై ఉండి వేద, ధర్మ శాస్త్రార్థములకు వక్ర భాష్యములు చెప్పి ఆదాయమును గడించుట వలన అతనికి మరు జన్మయందు బ్రహ్మరాక్షస్సు గతి పట్టెను!) పట్టి తాను యువరాణిని విడిచిపెట్టవలెనన్న ఇళయాళ్వారు వచ్చి తమ పాదములతో తన శిరస్సును తాకి తనకు మోక్షము ఇప్పించవలెనని చెప్పెను. చిన్న పిల్లవాడైన ఇళయాళ్వారు వలన పిశాచి పీడ తొలగించటం ఏమవుతుందని భ్రమించిన యాదవ ప్రకాశులు తామే స్వయముగా రాజు ఆస్థానమునకు వెళ్లి ఎన్నో పిశాచ విమోచన మంత్రములు జపించి  ప్రయత్నించి విఫలమయ్యెను. ఆ బ్రహ్మ రాక్షస్సు, “ఓరి వెర్రివాడా! నీవా నన్ను విడిపించునది? అది నీ వల్ల సాధ్యపడదు! పోయి నీ శిష్యుడు ఇళయాళ్వారుని పంపించుము ! అతను ఎవరో కాదు! శ్రియఃపతి అయిన శ్రీమన్నారాయణుని యొక్క నిత్య సూరులైన గరుడ విశ్వక్సేనాదులకు నాయకుడైన ఆదిశేషుడే మానవ రూపములో ఈ కలియుగములో జీవులను ఉద్ధరించుటకు అవతరించెను. అతడే నన్ను తరింపచేసి నాకు మోక్షము ప్రసాదించగలడు. మూర్ఖుడా! నీకును అతడే దిక్కు ! వెళ్లి అతనినే ఆశ్రయించుము ” అని యాదవప్రకాశులను హేళనగా మాట్లాడి ధిక్కరించెను. పిదప ఇళయాళ్వారు తమ పాదములను యువరాణి తలకు తాకించగా ఆ బ్రహ్మరాక్షస్సు యువరాణిని విడిచిపెట్టి సభలో అందరు చూస్తుండగా ఇళయాళ్వారుకు నమస్కరించి మోక్షమును పొందెను. ఈ విధముగా చిన్న వయస్సులోనే భగవద్రామానుజుల అవతార విశేషము జగద్విఖ్యాతమయ్యెను.

ఉడయవర్లు తాము రాసిన శ్రీ భాష్యమును దేశమంతటా ప్రచారము చేయుచు కాశ్మీరులోని శారదా పీఠమును దర్శించెను. ఆనాడు శారదా దేవి ఉడయవర్లను స్వయముగా ఆహ్వానించి వారు రాసిన శ్రీ భాష్యమును విని పరమ సంతోషపడెను. ముఖ్యముగా ఛాన్దోగ్య ఉపనిషత్తులోని “కప్యాసమ్ పుండరీకమేవమక్షిని” అను వాక్యముకు ఉడయవర్లు శాయించిన, “పరమ పురుషుడైన శ్రీ మన్నారాయణుని నేత్రములు నీరు త్రాగి ప్రకాశించుచున్న సూర్యుని యొక్క కిరణాలు పడి వికసించిన ఎర్రకలువ పుష్పపు రేకులవలే యున్నవి” అన్న వ్యాఖ్యానమునకు పులకితురాలైన సరస్వతీదేవి, “ఉడయవరే! మీరు కారణ జన్ములు. మీ యొక్క నిర్హేతుక కృప చేత ఈ చేతనాచేతన జీవరాశిని ఉద్ధరించి ఉజ్జీవింప చేయుటకే అవతరించినవారు! నేడు నా పుణ్య విశేషము చేత నాకు శ్రీ భాష్యము వినిపించి అనుగ్రహించినారు. మీరే “భాష్యకారులు”గా ప్రఖ్యాతి పొందుదురు గాక! ” అని తెలిపెను. ఈ విధముగా శారదాదేవి కూడా ఉడయవర్ల యొక్క అవతార వైశిష్ట్యమును ప్రకటించెను.

ఇక వచ్చే అధ్యాయములో పూర్వాచార్యులైన పెద్దలు భగవద్రామానుజుల వైభవ ప్రశస్తిని అనుభవించి తరించిన విధమును తెలుసుకొనెదము.

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: http://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujar-avathAra-rahasyam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – ఉపోద్ఘాతం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<<  పాఠక మార్గనిర్ధేశిక

srivaishna-guruparamparai

శ్రీమన్నారాయణుడు  తన నిర్హేతుక కృపా కటాక్షములచే  ఈ సంసారులను ఉజ్జీవింపచేయడానికి సృష్ఠి సమయాన బ్రహ్మకు శాస్త్రములను (వేదాలు) ఉపదేశిస్తాడు. వైదికులకు వేదం అత్యంత ప్రామాణీకరణమైనది. ప్రమాత (ఆచార్యుడు) ప్రమేయమును (భగవానుడు) ప్రమాణం(శాస్త్రం) చేత మాత్రమే  నిర్ణయిస్తాడు. ఎలాగైతే తన అఖిల హేయ ప్రత్యనికత్వం (అన్నిచెడు గుణాలకు వ్యతిరేఖత్వం) మరియు కళ్యాణైకతానత్వం (సమస్త కాళ్యాణ గుణాలకు నిలయం) వంటి గుణాలను వేదం ఈ కళ్యాణ గుణాలను ఇతరమైన వాటి నుండి భేధపరచి కళ్యాణగుణాలను అనుకరిస్తుంది. (ఇతర ప్రమాణముల నుండి భేదపరుస్తుంది)

  • అపౌరుషేయత్వం – ఎవరి చేత కూడా సృష్ఠించబడింది కాదు. (ప్రతి సృష్ఠి యొక్క ఆరంభములో భగవానుడు వేదాన్ని బ్రహ్మకు ఉపదేశించును, అది క్రమంగా అలాగే ప్రచారం గావించబడును) కావున ఇంద్రియఙ్ఞానికి సంబంధించిన లోపాలకు తావు లేదు.
  • నిత్యం – శాశ్వతమైనది. ఆద్యంతములు లేనిది. ఇది కాలాన్ని మరియు భగవానుని సర్వవేదఙ్ఞత్వం గురించి వెల్లడించును.
  • స్వత ప్రామాణ్యత్వం – అన్ని వేదాలు స్వయం ప్రపత్తి కలవి అనగా అన్నియు ఒకే విశ్వాసమును తెలుపును.

అపారమైన వేదసంపత్తును, వేదవ్యాసుడు భవిష్యమానవుల పరిమితమైన ఙ్ఞానాన్ని దృష్ఠిలో పెట్టుకొని ఆ వేదములను ఋక్, యజుర్, సామ మరియు అధర్వ వేదములుగా విభజించాడు.
వేదం యొక్క సారమే వేదాంతం. భగవానుని క్లిష్ఠతరమైన విషయాలను విశదీకరించు ఉపనిషత్తుల సమ్మేళనమే వేదాంతం. వేదం ఆరాధన ప్రక్రియను తెలుపును. వేదాంతం ఆ ఆరాధనకు యోగ్యుడైన వానిని తెలుపును. అలా చాలా ఉపనిషత్తులు ఉన్నప్పటికి కొన్ని మాత్రమే ప్రసిద్ధిగాంచినవి.  అవి

  • ఐతరేయ
  • బృహదారణ్యక
  •  చాంధోగ్య
  • ఈశ
  • కేన
  • కఠ
  • కౌశీతకి
  • మహానారాయణ
  • మాండూక్య
  • ముండక
  • ప్రశ్న
  • సుభాల
  • శ్వేతాశ్వేతర
  • తైత్తరీయ

వేదవ్యాసుడు రచించిన ఉపనిషత్తుల సారమును తెలుపు బ్రహ్మసూత్రములు కూడా వేదాంతముగానే పరిగణింపబడును. వేదం అనంతం. వేదాంతం చాలా సంక్లిష్ఠమైనది, కాని మానవుని ఙ్ఞానం మాత్రము పరమితమైనది (ఇది విపరీతార్థములను మరియు దోషములు చేయుటకు ఆస్కారభూతమైనది), కాని మనం ఈ వేద / వేదాంతములను స్మృతి, ఇతిహాసం (రామాయణ భారతాదులు) మరియు పురాణాల వల్ల  తెలుసుకోవచ్చు.

  • స్మృతి అనగా ధర్మశాస్త్రముల సంకలనం/కూర్పు.  మను, విష్ణు హారిత, యాఙ్ఞవల్క్యాది మహా ఋషుల చేత రచించబడినవి.
  • ఇతిహాసములనగా శ్రీ రామాయణ భారతాదులు. శ్రీ రామాయణం ‘శరణాగతి’ శాస్త్రంగా మరియు మహాభారతం ‘పంచమవేదం’ గా పరిగణింపబడుతున్నాయి (నాలుగు వేదాలు – ఋక్, యజుర్, సామ మరియు అధర్వ వేదములు).
  • 18 పురాణాలున్నవి (బ్రహ్మపురాణం, పద్మ పురాణం, విష్ణు పురాణం, గరుడ పురాణం మొదలైనవి) మరియు బ్రహ్మచే చెప్పబడిన 18 ఉప పురాణాలు కూడ ఉన్నవి. బ్రహ్మ తనకు  సత్త్వగుణం ఉద్భవించినప్పుడు విష్ణు భగవానున్ని, రజో గుణం ఉద్భవించి నప్పుడు తనను, తమోగుణం ఉద్భవించి నప్పుడు శివుణ్ణి , అగ్నిని కీర్తించాడు.

ఇవన్ని ఉన్నప్పటికి మానవుడు శాస్త్రం ద్వారా ఙ్ఞానాన్వేషణ చేసి లక్ష్య సాధన చేయకుండా ప్రాపంచిక విషయాంతరముల యందు ఆసక్తిని ప్రదర్శిస్తాడు. వీరిని ఉద్ధరించుటకై భగవానుడు తానే స్వయంగా అవతరించాడు. అయినను ఈ మానవులు అతనిని నిందిస్తు చివరకు అతనితోనే యుద్ధంకూడా చేశారు. భగవానుడు  ఒక  జీవాత్మచే ఈ జీవులను ఉద్ధరించుటకై నిర్ణయించుకొని (వేటగాడు ఒక జింకను  ఎరవేసి ఇంకొక జింకను పట్టుకున్నట్లు) దోషరహిత ఙ్ఞానాన్ని అనుగ్రహించిన కొన్ని జీవాత్మలను అవతరింపచేసినాడు. వారే ఆళ్వార్లుగా (భగవద్భక్తిలో సదా నిమగ్నమై ఉండువారు) కీర్తింపబడుతున్నారు. వారిలో ప్రసిద్ధిగా ప్రపన్నజనకూటస్థులుగా నమ్మాళ్వార్ పరిగణింపబడుతున్నారు. మిగితావారు – పొయిగై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమళిశై ఆళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, తొండరడిపొడి ఆళ్వార్, తిరుప్పాణాళ్వార్ మరియు తిరుమంగై ఆళ్వార్. అలాగే నమ్మాళ్వార్ శిష్యులగు మధురకవి ఆళ్వార్ మరియు పెరియాళ్వార్ కూతురగు శ్రీ ఆండాళ్ కూడ ఆళ్వారులుగానే పరిగణింపబడతారు. ఈ ఆళ్వార్లు భగవానునిచే కృప చేయబడ్డ దివ్య ఙ్ఞానముచే అనుభవించిన ఆ ఙ్ఞానమును లోపల ఇమడ్చుకోలేక మంగళాశాసన రూపమున కీర్తిస్తారు భగవానున్ని.

ఈ సంసార బంధముల నుండి జీవాత్మలను భగవానుడు ఉజ్జీవింపగోరి, నాథమునుల నుండి మణవాళ మాముణుల వరకు ఆచార్య పరంపరను ఏర్పరిచారు. ఆదిశేషుని అవతారముగా శ్రీభగవద్రామానుజులు ఈ ఆచార్య పరంపరలో మధ్యలో విరాజిల్లుతూ శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని మరియు విశిష్ఠాద్వైతాన్ని శ్రీ పరాశర, వ్యాస, ద్రమిడ, టంక మొదలైన వారిననుసరించి ఏర్పరిచారు. అలాగే వారు 74 సింహాసనాథిపతులను  శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని నిరాంటకంగా ప్రచారం గావించాలని ఏర్పరిచారు. సంప్రదాయానికి వీరు చేసిన విశిష్ఠమైన కృషి మరియు సేవలను పురస్కరించుకొని ఈ సంప్రదాయం ‘శ్రీరామానుజ దర్శనం’ అని ప్రసిద్ధికెక్కినది.  మరళా వీరే మణవాళ మాముణులుగా పునరవతారంచెంది దివ్య ప్రబంధములను వ్యాఖ్యానించి ప్రచారం చేశారు. పెరియ కోయిళ్ శ్రీరంగమున పెరియ పెరుమాళ్  స్వయంగా శ్రీ మణవాళ మాముణులను తమ ఆచార్యులుగా  స్వీకరించి, తనతో ఆచార్య రత్నహారం ప్రారంభమగు నట్లుగా చేసిరి. మణవాళ మాముణుల తదుపరి ఈ సిద్ధాంతం వారి శిష్యులలో ప్రథానులగు పొన్నడిక్కాళ్ జీయర్తో ఆరంభమగు అ ష్ఠదిగ్గజములుగా ప్రసిద్ధి చెంది  ఆచార్య పురుషులచే ప్రచారం చేయబడింది. ఇలా ఎందరో ఆచార్య పురుషులు పూర్వాచార్య కృత ఈ రామానుజ దర్శనమును పరంపరగా ప్రచారం చేశారు.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

మూలము: http://ponnadi.blogspot.com/2015/12/simple-guide-to-srivaishnavam-introduction.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – పాఠక మార్గనిర్దేశిక

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శినిpramanam-sastram

పాఠకుల నిర్ధేశిని/పదకోశం

శ్రీవైష్ణవ ప్రాథమిక పరిభాష

  • ఆచార్యుడు, గురువు – ఆధ్యాత్మికతను అదించువాడు – సాధారణంగా తిరుమంత్రమును ఉపదేశించువారు.
  • శిష్య – శిష్యుడు / అంతేవాసి
  • భగవంతుడు – శ్రీమన్నారాయణుడు
  • అర్చామూర్తి – దేవాలయాల యందు, మఠముల యందు, గృహముల యందు ఆరాధించబడు దయారూపి అయిన భగనవానుని విగ్రహములు.
  • ఎంపెరుమాన్,పెరుమాళ్, ఈశ్వరుడు – భగవానుడు
  • ఎంపెరుమానార్ – భగవానుని కన్నా అతి కరుణామయులు – శ్రీరామానుజులు
  • పిరాన్ – ఉపకారకుడు
  • పిరాట్టి, తాయార్ – శ్రీమహాలక్ష్మి
  • మూలవర్లు – ఆలయం లోపల పవిత్రంగా ప్రతిష్ఠించబడిన భగవానుని అచల (కదలని) రూపం.
  • ఉత్సవర్లు –  తిరు వీథులలో ఊరేగించుటకు ప్రతిష్ఠ చేయబడిన చలరూపి భవగానుడు.
  • ఆళ్వార్లు – భాగవానుని సంపూర్ణ కృపకు పాత్రులై ద్వాపర యుగాంతము నుండి కలియుగ ఆరంభము వరకు దక్షిణ భారతమున నివసించిన వైష్ణవ సన్యాసులు. భగవద్భక్తిలో మునిగి తేలినవారు.
  • పూర్వాచార్యులు – శ్రీవైష్ణవ సాంప్రదాయమున శ్రీమన్నారాయణుని నుండి పరంపరగా వస్తున్న ఆధ్యాత్మిక చక్రవర్తులు.
  • భాగవతులి, శ్రీవైష్ణవులు – భగవానునకు దాస్యము చేయువారు.
  • అరైయర్లు – భగవానుని ముందు దివ్య ప్రభందములను రాగతాళ యుక్తముగా గానము చేయు శ్రీవైష్ణవులు.
  • ఓరాణ్ వళి ఆచార్యులు – పెరియ పెరుమాళ్ నుండి మణవాళ మాముణుల వరకు వేంచేసి ఉన్న ఆచార్య సమూహం.
  1. పెరియపెరుమాళ్
  2. పెరియ పిరాట్టి
  3. విష్వక్సేనులు
  4. నమ్మాళ్వార్
  5. శ్రీమన్నాథమునులు
  6. ఉయ్యకొండార్
  7. మణక్కాల్ నంబి
  8. ఆళవందార్(యామునాచార్యులు)
  9. పెరియనంబి
  10. ఎంపెరుమానార్ (భగవద్రామానుజులు)
  11. ఎంబార్
  12. శ్రీ పరాశర భట్టర్
  13. నఙ్జీయర్
  14. నంపిళ్ళై
  15. వడక్కు తిరువీధి పిళ్ళై
  16. పిళ్ళై లోకాచార్యులు
  17. తిరువాయ్మొళి పిళ్ళై
  18. అళిగియ మణవాళ మాముణులు (వరవరమునులు)
  • దివ్యప్రబంధం – అరుళిచ్చెయళ్గా వ్యవహరింపబడు ఆళ్వారులు అనుగ్రహించిన పాశురములు.
  • దివ్య దంపతులు – శ్రీమన్నారాయణుడు మరియు శ్రీ మహాలక్ష్మి
  • దివ్య దేశములు – ఆళ్వారులచే కీర్తిపబడిన భగవానుడు వేంచేసి ఉన్న క్షేత్రములు /స్థలములు.
  • దివ్య సూక్తులు, శ్రీ సూక్తులు – భాగవానుని / ఆళ్వారాచార్యుల వచనములు.
  • అభిమాన స్థలములు – పూర్వాచార్యులకు అభీష్ఠమైన భగవానుడు వెలసిన క్షేత్రములు.
  • పాశురము – పద్యము / శ్లోకం
  • పదిగం – దశకం (పది పాశురముల కూర్పు)
  • పత్తు – శతకం (వంద పాశురముల కూర్పు)
  • నిర్ధిష్ఠ / ప్రత్యేక అర్థములు (శ్రీవైష్ణవ పారిభాషిక పదాలు)
  1. కోయిళ్- శ్రీరంగం
  2. తిరుమల – తిరువేంగడం, తిరుమాళింరుశోలై
  3. పెరియ కోయిల్ – కాంచీపురం
  4. పెరుమాళ్- శ్రీరాముడు
  5. ఇళయ పెరుమాళ్- లక్ష్మణుడు
  6. పెరియ పెరుమాళ్- శ్రీరంగనాథుడు (మూలవర్లు)
  7. నంపెరుమాళ్- శ్రీరంగనాథుడు (ఉత్సవర్లు)
  8. ఆళ్వార్ – నమ్మాళ్వార్ స్వామి – భగవద్రామానుజులు
  9. జీయర్, పెరియ జీయర్ – అళగియ మణవాళ మాముణులు (వరవరమునులు)
  • స్వరూపం – నిజ స్వభావం / ఆకారం (శాస్త్రం నిర్ధేశించిన లక్షణములు కలిగి ఉండుట)
  • రూపం – రూపం / ఆకృతి
  • గుణం – కళ్యాణ గుణములు
  1. పరత్వం – ఆధిపత్యం
  2. సౌలభ్యం – సులువుగా లభించుట / అందుబాటులో ఉండుట
  3. సౌశీల్యం – ఔదార్యం / అరమరికలు లేని ఉదారస్వభావం
  4. సౌందర్యం – శరీర సుందరత
  5. వాత్సల్యం – అమ్మలాంటి సహనం / ఓర్పు / క్షమా
  6. మాధుర్యం – మధురమైన రుచి (ఒక గుణం)
  7. కృప, కరుణ, దయా, అనుకంపా – అనుగ్రహం, కనికరం.
  • శాస్త్రం – మనను నిర్ధేశించు / మార్గనిర్దేశనం చేయు ప్రామాణిక గ్రంథములు – వేదం, వేదాంతం, పాంచారాత్ర ఆగమం, ఇతిహాసములు (శ్రీరామాయణ భారతాదులు), పురాణములు (విష్ణుభాగవతగరుడాది), ఆళ్వారుల దివ్య ప్రబంధములు, పూర్వాచార్యుల కృతులు – స్తోత్రములు (స్తోత్రరత్నాది) వ్యాఖ్యానములు.
  • కర్మ – చర్య – పాప (దుర్గుణములు) పుణ్యపు (సద్గుణములు) క్రియలు.
  • మోక్షం – భవబంధ విమోచనం / విముక్తి
  1. భగవత్ కైంకర్య మోక్షం – ఈ భవ బంధ విముక్తి జరిగిన పిమ్మట పరమపదమున ఉండు నిత్య కైంకర్యం.
  2. కైవల్యం – ఈ భవ బంధ విముక్తి జరిగిన పిమ్మట ఉండు నిత్య ఆత్మానుభవము..
  • కర్మ యోగ, ఙ్ఞాన యోగ, భక్తి యోగములు – భగవంతున్ని పొందు మార్గములు.
  •  ప్రపత్తి, శరణాగతి – తన భారాన్నంతటిని భగవంతునిపై వేయుట. భవంతున్ని చేరుటకు అతనే మార్గమని నమ్మి ఉండుట.
  • ఆచార్యనిష్ఠులు –  ఆచార్య శ్రీ పాదములను మాత్రమే ఆశ్రయించువారు. వీరినే ప్రపన్నులు అని అందురు.
  • ఆచార్య అభిమానం – ఆచార్యుల కృపకు పాత్రులు అవ్వడం.
  • పంచ సంస్కారములు (సమాశ్రయణములు) – శుద్ధీకరణ ప్రక్రియల ద్వారా ఒక వ్యక్తిని భగవానుని కైంకర్యము నందు (ఈ సంసారము నందు మరియు పరమపదము నందు)  నిమగ్నపరచుట. ఆ ప్రక్రియలు..
  1. తాప – శంఖ చక్రలాంఛనములు – తాపం (వేడి) గావించ బడిన శంఖ చక్ర ముద్రలను మన భుజముల యందు ధరింప చేయుట. దీని వలన మనం ఇకపై భగవంతుని సొత్తుగా పరిగణింపబడతాము. ఎలాగైతే ఒక పాత్రపై యజమాని చిహ్నముచే ముద్రించిన అది వానికి ఎలా చెందునో మనం కూడ ఈ శంఖ చక్ర ముద్రల స్థాపనం వల్ల భగవానునకే చెందిన వారమవుతాము.
  2. పుండ్రం (చిహ్నం) – ద్వాదశ ఊర్ధ్వపుండ్ర ధారణం – శరీరమున పన్నెండు స్థలములలో ఊర్ధ్వపుండ్ర (తిరుమణి మరియు శ్రీ చూర్ణం) ధారణం చేయుట.
  3. నామ – దాస్య నామం – ఒక నూతన పేరు ఆచార్యునిచే పొందుట. (రామానుజ దాస, మధురకవి దాస, శ్రీ వైష్ణవదాస ఇత్యాదులు).
  4. మంత్రం  మంత్రోపదేశం – రహస్య మంత్రములను ఆచార్యుని ద్వారా పొందుట. ఇది మననం చేయువారిని దుఃఖముల నుండి రక్షించును. తిరుమంత్రంద్వయమంత్రం మరియు చరమ శ్లోకములనెడి ఈ మంత్రములు సంసార విముక్తిని కలిగించును. లోతైన విశ్లేషణకై దీనిని చూడండి: http://ponnadi.blogspot.in/2015/12/rahasya-thrayam.html
  5. యాగ – దేవపూజ – తిరువారాధన క్రమమును అభ్యసించుట.
  • కైంకర్యం – భగవానునికి, ఆళ్వారులకు, ఆచార్యులకు, భాగవతులకు సేవ చేయుట.
  • తిరువారాధన – భగవంతున్ని ఆరాధించుట (పూజ)
  • తిరువుళ్ళం – ఇష్ఠ ప్రకారం
  • శేషి – యజమాని
  • శేష – దాసుడు / సేవకుడు
  • శేషత్వం – భగవానునికై దాస్యమునకు  సర్వదా సిద్ధమై ఉండుట. (శ్రీరామునికి సేవ చేయు లక్ష్మణుని వలె)
  • పారత్రంత్యం – భగవానునికి పూర్తిగా ఆధీనపడుట. (భరతాళ్వాన్ వలె శ్రీ రాముని ఆఙ్ఞకు సర్వదా లోబడి ప్రవర్తించుట మరియు ఎడబాటును కూడా సమ్మతించుట)
  • స్వాతంత్ర్యం – తన ఇష్ఠానుసారం నడుచుకొనుట.
  • పురుషాకారం – సిఫార్సు, మధ్యవర్తిత్వం / ఉపశమింపచేయడం – ఈ జీవులు తాము చేసిన పాపకర్మ ఫలితంగా క్షింపబడడానికి అర్హులు కానున్నను పరమదయాస్వరూపిణి అయిన  శ్రీ మహాలక్ష్మి తాను భవగవానుని ఒప్పించి ఈ జీవున్ని అతని కృపకు పాత్రున్ని చేయును కావున తాను పురుషాకారిణి. ఆచార్యులు కూడా ఈ పురుషాకార స్వభావులే. ఈ పురుషాకారం చేయువారికి ముఖ్యంగా మూడు గుణాలు ఉండాలి.
  1. కృప – ఈ కర్మానుభవ జీవునిపై దయ.
  2. పారత్రంత్యం – సర్వం భాగవానునిపై ఆధారపడి ఉండుట.
  3. అనన్యర్హత్వం – భగవానునికే తప్ప ఇతరులకు చెందకుండుట.
  • అనన్య శేషత్వం – భగవానునికి మరియు భాగవతులకు తప్ప ఇతరులకు కైంకర్యం చేయకుండుట.
  • విషయాంతరం – ప్రాపంచిక/ ఐహిక సుఖములు – కైంకర్యము కంటే వేరైనవి / ఇతరములు.
  • దేవతాంతరము – శ్రీమన్నారాయణుడే పరత్వం. ఇతర జీవాత్మలు దేవతాంతరములు (అనగా ఈ జీవాత్మలు భగవానుని ఆఙ్ఞచే ఈ లౌకిక జగత్తులో కొన్ని కార్యములు నెరవేర్చుటకు నియమింపబడతారు. వీరుకూడా కర్మ బద్ధులే).
  • స్వగత స్వీకారం – తమను తాము భాగవానుని/ఆచార్యునిలా భావించడం (నేను అను అహంకారం).
  • పరగత స్వీకారం – భగవానుడు / ఆచార్యుడు తమ ప్రతయ్నం / ప్రార్థన లేకుండానే, అప్రయత్నంముగా మనలను స్వీకరించడం.
  • నిర్హేతుక కృప – ఏ కారణం లేకుండానే చూపే దయ – జీవాత్మ ప్రోద్భలంచేయబడని /పురికొల్పబడని భగవానుని యొక్క ధృడమైన కృప.
  • సహేతుక కృప – జీవాత్మ స్వప్రయత్నము చేసి పురికొల్పబడిన భగవానుని కృప.
  • నిత్యులు – నిత్యసూరులు – పరమపదమున భగవానునికి కైంకర్యము చేయువారు (ఎక్కడైనా ఉన్నను). నిత్యులనగా ఈ భౌతిక సంసార బంధం లేశ మాత్రములేని పవిత్రులు.
  • ముక్తులు – ఒక నాడు ఈ భౌతిక సంసారబద్దులై చివరకు పరమపదమును చేరుకొని పవిత్రులుగా మారి భగవానుని కైంకర్యం చేయువారు.
  • బద్ధులు – ప్రస్తుతం ఈ భౌతిక సంసారమున జీవించువారు. వీరినే సంసారులు అందురు.
  • ముముక్షువులు – మోక్షంకై ప్రయత్నం చేయువారు.
  • ప్రపన్నులు – భగవానుని కైంకర్యమే సర్వమని భావించేవారు. వీరుకూడా ముముక్షువుల వంటివారే.
  1. ఆర్త ప్రపన్నులు – ఒకసారి కష్ఠభూయిష్ఠమైన ఈ భౌతిక సంసారము నుండి విముక్తిని కోరువారు.
  2. దృప్త ప్రపన్నులు – భగవానుని కైంకర్యమే సర్వమని భావించినను ఒకానొకసారి ఈ లౌకిక ప్రపంచమున భగవానునికి మరియు భాగవతులకు కైంకర్యము చేయజాలక పరమపదములో ఈ కైంకర్యమును అభిలషించువారు.
  • తీర్థం – పవిత్ర జలం
  • శ్రీపాద తీర్థం – చరణామృతం – ఆచార్యుల పాద ప్రక్షాళన జలం.
  • భోగం – భగవానునికి సమర్పించుటకు సిద్ధమైన పక్వాపక్వములు.
  • ప్రసాదం – శ్రీవైష్ణవులు స్వీకరించు భగవన్నివేదిత పదార్థములు(పక్వాపక్వములు).
  • ఉచ్చిష్టం – ప్రసాదానికి మరోపేరు. (శేష ప్రసాదం) కొన్ని సార్లు ఇతరులచే సృశింపబడినది (ఇతరుల అథరములచే తాకబడినది) – సందర్భమును బట్టి అర్థం మారును.
  • పడి – భోగములకు ఉపయోగించు నామాంతరం (తమిళ పదం)
  • సాత్తుప్పడి – చందనం
  • శఠారి, శ్రీ శఠకోపమ్ – శ్రీమన్నారాయణుని పాదపద్మములు. నమ్మాళ్వార్, శ్రీ శఠకోపముగా పరిగణింపబడతారు. దీనికి కారణం  వీరు భగవానుని శ్రీ పాద పద్మముల స్థానీయులు.
  • మథురకవులు – నమ్మాళ్వార్ (పాద స్థానీయులు) శ్రీ పాదములకు వ్యవహారనామము.
  • శ్రీ రామానుజం – ఆళ్వార్ తిరునగరిలో నమ్మాళ్వార్ (పాద స్థానీయులు) శ్రీపాదములకు వ్యవహారనామము.
  • శ్రీ రామానుజం – అందరి ఆళ్వారుల (పాదస్థానీయులు) శ్రీ పాదములకు వ్యవహారనామము
  • ముదలిఆండాన్ – శ్రీరామానుజుల (పాదస్థానీయులు) శ్రీ పాదములకు వ్యవహారనామము
  • పొన్నడియామ్ శఙ్కమలం – మామునుల శ్రీ పాదములకు వ్యవహారనామము.
  • సాధారణంగా ప్రధానశిష్యులు శ్రీ పాదములుగా వ్యవహరింపబడతారు. ఉదాహరణకు – ఎంబార్ కు – శ్రీ పరాశర భట్టర్ శ్రీ పాదములు (పాదస్థానీయులు) – శ్రీ పరాశర భట్టర్కు నఙ్జీయర్ శ్రీ పాదములు, నఙ్జీయర్కు నంపిళ్ళై శ్రీ పాదములు మొ.
  • విభూతి – సంపద / ఐశ్వర్యము
  • నిత్యవిభూతి – ఆధ్యాత్మిక జగత్తు (పరమపదం / శ్రీ వైకుంఠము)
  • లీలావిభూతి – లౌకిక జగత్తు (జీవులు నివాసమగు ఈ సంసారం)
  • అడియేన్, దాసుడు – తమను తాము సంబోధించుకొనే సాంప్రదాయక గౌరవ వాచకము (నేనుకు బదులు) వినయపూర్వక తాను.
  • దేవరవారు, శ్రీమాన్ – ఇతర శ్రీ వైష్ణవులను సంబోధించు సాంప్రదాయక గౌరవవాచకము – మీ దయ
  • ఎళుందరళుతల్ – వేంచేయడం (సాంప్రదాయక వచనములు)
  • కణ్ వళరుతళ్ – శయనించడం.
  • నీరాట్టం – స్నానమాడుట.
  • శయనం – నిద్రించడం.
  • శ్రీపాదం – భగవానుని / ఆళ్వారులను / ఆచార్యులను పల్లకిలో మోయుట / మోయువారు.
  •  తిరువడి – శ్రీ పాద పద్మములు (హనుమాన్ కు సాంప్రాదాయక సంబోధన)
  • వ్యాఖ్యానం – స్పష్ఠ వివరణ.
  • ఉపన్యాసం – ప్రసంగం
  • కాలక్షేపం – మూలమును చూచి దానిలోని వరుస వాక్యములకు చదివి దానికి  విస్తృత వ్యాఖ్యానమును అనుగ్రహించుట.
  • అష్ఠదిగ్గజములు – శ్రీ మణవాళ మాహాముణులు శ్రీ వైష్ణవ సత్సాంప్రదాయమును నలుదిశలా భావితరాలకు ప్రచారం చేయుటకు ఏర్పరచిన / స్థాపన చేసిన ఎనిమిది మంది ఆచార్యులు.
  • 74 సింహాసనాధిపతులు –  శ్రీ రామానుజాచార్యులు శ్రీవైష్ణవ సత్సాంప్రదాయమును నలుదిశలా భావితరాలకు ప్రచారం చేయుటకు ఏర్పరచిన / స్థాపన చేసిన డెబ్బై నాలుగు మంది ఆచార్యులు.

వేదాంత / తత్త్వ సంబంధిత పదాలు

  • విశిష్ఠాద్వైతం – చిత్తు అచిత్తుతో కూడుకొని ఉన్న పరతత్త్వమును (భగవంతున్ని) తెలుపు సిద్ధాంతం / తత్త్వశాస్త్రం.
  • సిద్ధాంతం – ఒక నియమమును స్థిరీకరించునది.
  • మిథునం –  శ్రీ లక్ష్మీ నారాయణులు (పెరుమాళ్ మరియు పిరాట్టి)
  • ఏకాయనం – శ్రియః పతిత్వమునునకు. (మహాలక్ష్మికి పతియైన వాడు)  ప్రాథాన్యత ఇవ్వకుండా శ్రీమన్నారాయణుని ఆధిక్యాన్ని అంగీకరించుట.
  • మాయావాదం – ఏక రూపం గల బ్రహ్మమును అంగీకరిస్తు మిగితాదంతా  మిథ్యా(భ్రాంతి- లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భావించడం) అని భావించు ఒక సిద్ధాంతం.
  • ఆస్థికుడు – శాస్త్రమును ప్రమాణముగా అంగీకరించువాడు.
  • నాస్థికుడు – శాస్త్రమును ప్రమాణముగా అంగీకరించనివాడు.
  • బాహ్యులు – శాస్త్రమును ప్రమాణముగా అంగీకరించనివారు
  • కుదృష్ఠులు – శాస్త్రమును తమకు అనుకూలంగా మారుస్తు ప్రమాణముగా అంగీకరించువారు.
  • ఆప్తులు – మన ఉన్నతిని కోరువారు.
  • ప్రమా – ప్రామాణిక ఙ్ఞానం
  • ప్రమేయం – ప్రామాణిక ఙ్ఞానం లక్ష్యము.
  • ప్రమాత – ప్రామాణిక ఙ్ఞానమును రక్షించువాడు.
  • ప్రమాణం – ప్రామాణిక ఙ్ఞానమును ఆర్జించువాడు.
  • ప్రత్యక్షం – ఇంద్రియ(కన్ను, చెవులు మొ) గోచరమైనది.
  • అనుమానం – పూర్వపు పరిశీలన ఆధారముగా ఉత్పన్నమైన ఙ్ఞానం.
  • శబ్దం – శాస్త్ర వచనములు / ప్రామాణిక ఆధారం
  • తత్త్వత్రయం – ప్రపన్నులు స్పష్ఠంగా తెలుసుకోదగ్గ  మూడు అస్థిత్వముల. లోతైన విశ్లేషణకు చూడండి: http://ponnadi.blogspot.in/p/thathva-thrayam.html
  •  చిత్తు అచిత్తు, జీవాత్మ – ఆత్మఙ్ఞానం
  • అచిత్తు, అచేతనం, ప్రకృతి – పదార్థం, జడమైనది.
  • ఈశ్వరుడు భగవాన్ శ్రీమన్నారాయణుడు
  • రహస్యత్రయం – పంచసంస్కార సమయమున ఆచార్యునిచే అనుగ్రహింపబడు మూడు గోప్యమంత్రములు. లోతైన విశ్లేషణకు  చూడండి:  http://ponnadi.blogspot.com/2015/12/rahasya-thrayam.html .
  • తిరుమంత్రం – అష్ఠాక్షరీ మహామంత్రం
  • ద్వయమంత్రం – రెండుగా  ఉన్న మహామంత్రములు.
  • చరమశ్లోకం – సర్వథర్మాన్ పరిత్యజ్య– అను గీతాశ్లోకం: సకృదేవ ప్రపన్నాయ – అను రామ చరమశ్లోకం: స్థితే మనసి– అను వరాహ చరమ శ్లోకములు. సాధారణంగా  – సర్వథర్మాన్ పరిత్యజ్య– అను గీతాశ్లోకమే చరమ శ్లోకముగా రూఢి అయినది.
  • అర్థ పంచకం- ఐదు ప్రధాన నియమాలు- పంచ సంస్కారములు అనుగ్రహించేటప్పుడు ఆచార్యులు ఉపదేశిస్తారు. లోతైన వివరణ కోసం http://ponnadi.blogspot.com/2015/12/artha-panchakam.html దర్శించండి
    • జీవాత్మ – లౌకిక (సంసారిక) జీవులు (మానవులు)
    • పరమాత్మ – భగవానుడు
    • ఉపేయం, ప్రాప్యం – పొందవలసిన లక్ష్యం – చేయవలసిన కైంకర్యం
    • ఉపాయం – ఆ లక్ష్యాన్ని పొందడానికి మార్గం.
    • విరోధి – ఆ లక్ష్యాన్ని పొందడానికి అడ్డంకులు
  • ఆకారత్రయం – ప్రతి జీవాత్మకు ఉండవలసిన మూడు ముఖ్యమైన స్థితులు / లక్షణములు.
  • అనన్యశేషత్వం – భగవంతుడే రక్షకుడని(పరత్వం) నమ్ముట.
  • అనన్య శరణత్వం – భగవంతుడే ఆశ్రయించ తగ్గవాడని నమ్ముట.
  •  అనన్య భోగ్యత్వం – సాధారణ కేవలం భగవంతున్ని మాత్రమే అనుభవించుట” , భగవానుడు మాత్రమే అనుభవించ యోగ్యుడు” అని నమ్మి ఉండుటయే ప్రథాన ఉద్దేశ్యం.
  • సామానాధికరణ్యం – ఒకే ఆథారముతో ఒకటి కన్న ఎక్కువ సంఖ్యలో ఉన్న కారకం / గుణం.  ఒకే పరిధిని వివరించు రెండు అంతకన్నా ఎక్కువ పదాలు. దీనికి ఉదాహరణగా – మృద్గటం (మట్టి కుండ). కుండ తయారు కావడానికి – ఆధారం (మూలం) ఆధేయం (రూపం) కావాలి. అవే మట్టి మరియు ఘటత్వం. వేరొక ఉదాహరణ – “శుక్లపటము” (తెల్లని వస్త్రం) దీనికి రెండు విశేషణములు – ఒకటి తెలుపుదనం రెండవది పటత్వం(వస్త్రం అగుట). వీటి మాదిరిగా – బ్రహ్మా/భగవానుడు సామానాధికరణ్యముగా అన్నిఅస్థిత్వములకు ఆధారం. సంస్కృతం మరియు వేదాంత ఙ్ఞానమున్న పండితుల వద్ద తెలుసుకొనవలసిన లోతైన విశ్లేషణ.
  • వైయాధికరణ్యం – రెండు అంతకన్నా ఎక్కువ అంశాలతో కూడికొని ఉన్న మూలం. ఉదాహరణకు – ఒక కుర్చికి భూమి ఆధారం కావచ్చు మరియు పూలకుండికి ఒక బల్ల ఆధారం కావచ్చు. వేరు వేరు వాటికి (అస్థిత్వాలకు) వేరు వేరు ఆథారాలు ఉంటాయి.
  • సమిష్ఠి సృష్ఠి –  భగవానుడు ఈ సృష్ఠిని పంచభూతము వరకు నిర్వహించి  జీవాత్మను బ్రహ్మలాగా నియమిస్తాడు. ఈ స్థితిని సమిష్ఠి సృష్ఠి అంటారు.
  • వ్యష్ఠి  సృష్ఠి – భగవానుడు బ్రహ్మను మరియు ఋషులను మొదలైన వారిని  నియమించి (తాను అంతర్యామిగా ఉంటూ) అస్థిత్వాలకు వేరు వేరు రూపాలను సృష్ఠిస్తాడు.
  • వ్యష్ఠి సంహారం – భగవానుడు, రుద్రుడు, అగ్నికి  అధికారమిచ్చి (తాను అంతర్యామిగా ఉంటూ) ఈ అస్థిత్వాలను నశింపచేస్తాడు.
  • సమిష్ఠి సంహారం – భగవానుడు తనంతటతానే స్వయంగా పంచభూతములను తనలో కలుపుకొంటాడు

మిగితా వివరాలకు : http://kaarimaaran.com/downloads.html

అడియేన్ నల్లా శశిధర్  రామానుజదాస

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/readers-guide/

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – పంచ సంస్కారములు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<< ఉపోద్ఘాతం

శ్రీరామానుజులవారికి పెరియనంబి గారు పంచ సంస్కారములను అనుగ్రహించుట

 శ్రీవైష్ణవుడిగా ఎలా అవ్వాలి? 

పూర్వాచార్యులను అనుసరించి శ్రీవైష్ణవుడవ్వాలంటే ఒక విధానం ఉన్నది. ఆ విధానమునే “పంచ సంస్కారము” అని అంటారు. (సంప్రదాయమున ఒక దీక్ష). సంస్కారమనగా శుద్ధి క్రియ. అనర్హత యోగ్యున్ని అర్హతాయోగ్యునిగా చేయు ఒక విధానం. ఇది శ్రీవైష్ణవుడగుటకు ప్రథమ సోపానం. బ్రాహ్మణ జాతిలో జన్మించిన వారు ఎలాగైతే బ్రహ్మయాగ్య అనే విధానం ద్వారా బ్రాహ్మణత్వం పొందుతారో అలాగే శ్రీవైష్ణవ కుటుంబములో జన్మించిన వారు పంచ సంస్కారము ద్వారా శ్రీవైష్ణవత్వమును పొందుతారు. కాని ఇక్కడ వాడు బ్రాహ్మణుడైతే బ్రాహ్మణత్వం పొందుటకు అర్హుడవతాడు కారణం అది శరీరానికి సంబంధించినది, కాని శ్రీవైష్ణవుడు అవడానికి వాడు బ్రాహ్మణుడు కానవసరం లేదు. ఇది ఆత్మకు సంబంధించిన ఒక వైష్ణవత్వ విధానం. ఈ క్రియ జాతి, మత, కుల, లింగ, ఉన్నవాడు, లేనివాడు అనే భేధము లేకుండా అందరికి చెందిన విధానం. ఎవరికి మోక్షం పై అభిలాష ఉందో వారందరు అనుసరించ వలసిన విధానం.

శ్రీవైష్ణవత్వం పొందిన పిదప దేవతాంతరములను (భగవానుని ఆఙ్ఞను అనుసరిస్తు ఈ జగత్తులో కొన్ని కార్యములను చేయువారు ఉదా – బ్రహ్మ, శివ, దుర్గ, సుబ్రమణ్య, ఇంద్ర, వరుణాది పాక్షిక దేవతలు – వీరందరికి కూడ భగవానుడే అంతర్యామిగా ఉండి ఈ జగత్తులో కొన్ని కార్యములు చేయుస్తాడు) ఆరాధించుట పూర్తిగా నిషిద్ధం.

 పంచ సంస్కారం

శాస్త్రము విధించినటుల పంచ సంస్కారములు లేదా సమాశ్రయణములు  పొందినవారు  శ్రీవైష్ణవునిగా పరిగణింపబడతారు. ఈ క్రింది శ్లోకం పంచ సంస్కారము గురించి వివరిస్తుంది, “తాపః పుండ్రః తధా నామః మంత్రో యాగశ్చ పంచమః”. ఈ ఐదు క్రియలు పంచ సంస్కార సమయమున జరుపబడతాయి.

  • తాప (అగ్ని సంస్కారం) శంఖచక్రలాంఛనం – వేడిగావించబడిన  శంఖ చక్ర లాంఛనములను భుజములపై ముద్రించుట. దీని వలన మనం భగవానుని సొత్తుగా పరిగణింపబడతాము. ఎలాగైతే ఒక పాత్రపై యజమానికి సంబంధించిన చిహ్నమును గుర్తుగా వేస్తామో అలా భగవానునికి చెందిన ఈ శంఖ చక్ర లాంఛనములు మనం ధరించి అతని వస్తువుగా మారుతాము.
  • పుండ్ర (స్వరూపం) – ద్వాదశ ఊర్ధ్వ పుండ్ర ధారణ – దేహములో పన్నెండు స్థలముల యందు తిరుమణ్ శ్రీ చూర్ణములతో ఊర్ధ్వ పుండ్రములను ధరించుట.
  • నామ (పేరు) – దాస్య నామం – ఒక దాస్య నామం ఆచార్యునిచే అనుగ్రహింపబడును (రామానుజ దాస, మధురకవి దాస, శ్రీవైష్ణవ దాస మొదలైనవి)
  • మంత్ర – మంత్రోపదేశం– ఆచార్యుని నుండి రహస్యముగా మంత్రములను ఉపదేశం పొందుట. మంత్రం అనగా మననం చేయువాడిని రక్షించేది అని అర్థం – తిరు మంత్రం, ద్వయ మంత్రం, చరమ శ్లోకములు ఈ సంసార విముక్తిని గావించునవి.
  • యాగ – దేవపూజ గృహమున భగవానుని ఆరాధించు విధానమును నేర్చుకొనుట.

పూర్వ అర్హతలు

భగవానుని ఆధీనంలోకి రావడానికి ఆకించన్యం (తనకు తాను అనర్హునిగా / అయోగ్యునిగా భావించుట) మరియు అనన్యగతిత్వం – (వేరే దారి లేదిక) అనే రెండు అర్హతలు ఉండాలి. ఉజ్జీవించుటకు కేవలం భగవానుడే గతి అని నమ్మి, అతడు తప్ప వేరొక మార్గం లేదని నిశ్చయంగా భావించడం.

పంచ సంస్కార లక్ష్యం 

తత్త్వ ఙ్ఞానాన్ మోక్షలాభః ” అని  శాస్త్ర వచనం – బ్రహ్మ ఙ్ఞానం పొందుట వలన మొక్షము లభించును. ఆచార్యుని ద్వారా మంత్రోపదేశం పొందు ప్రక్రియలో భాగంగా పొందిన అర్థ పంచక ఙ్ఞానం వలన నిత్య విభూతి యందు శ్రియ పతిఃకి  కైంకర్యం చేయుట అను లక్ష్యమును సాధించుటకు అర్హులవమతాము. భగవానునికి అన్నివిధాలా లొంగి ఉండడమే నిజమైన ఙ్ఞానం. గృహ తిరువారాధన మరియు దివ్య దేశ సందర్శనం చేయాలి. అర్చావతార భగవానునికి  కైంకర్యం, ఆచార్య మరియు శ్రీవైష్ణవ కైంకర్యములు నిరంతరం చేయుచుండాలి. 

  • ఈ సంస్కారములను అందరికి తెలియ పరచి వారందరిని ఆధ్యాత్మిక మార్గమున నడిపించాలి.  శ్రీరామానుజులు అనుగ్రహించిన నిబంధనలలో మొదటిది – శ్రీభాష్యం మరియు తిరువాయ్మొళిని అభ్యసించి దానిని ఆర్తికలవారందరికి ఉపదేశించాలి. ప్రధానంగా ఆచార్యుడు జీవాత్మ పరమాత్మల మేలన నిర్వాహకుడు.  శ్రీరామానుజులు మరియు పూర్వులందరు కూడ ఆచార్య నిష్ఠులుగా గోచరిస్తారు. వీరినే ప్రపన్నులందురు, అనగా అన్ని విధములుగా ఆచార్యుని యందు భారముంచుట.

జీవాత్మకు ఈ పంచ సంస్కారములు అవడం నిజమైన జన్మ లభించడం వంటిది. దీని వల్ల జీవాత్మ తన స్వరూపమును గుర్తించి భగవదాధీనుడవతాడు.ఈ విశిష్ఠ సంబంధము భార్య (జీవాత్మ) భర్తలకున్న (పరమాత్మ) పవిత్ర బంధము వంటింది. ఇది దేవతాంతరములను ఆశ్రయించుటను నిరోధించును.

ఇలా ఈ విశేష శ్రీ వైష్ణవత్వం వలన జీవుడు ఈ సాంసారిక బంధములను ఛేదించు కొని పరమపదమును చేరుకొని  శ్రియఃపతికి అవిచ్ఛిన్నమైన కైంకర్యమును చేస్తాడు.

పంచ సంస్కారములకు అర్హులెవరు? 

శ్రీవైష్ణవ సిద్ధాతం ఆళ్వారాచార్యులచే స్థాపన చేయబడింది. శ్రీరామానుజులు శాస్త్రాధ్యయనం చేసి నాథమునులు, ఆళవందార్లు అనుగ్రహించిన ఆదేశాలను సిద్ధాంతముగా స్థాపన చేశారు.  స్వామి రామానుజులు తమ అనంతరం సంప్రదాయ విస్తరణకై 74 సింహాసినాథి పతులను ఏర్పరిచారు. మోక్షేచ్ఛ ఉన్నవారందరికి పంచ సంస్కారములను అనుగ్రహించమని వీరిని నియమనం చేశారు. ఇలా వంశ పారపర్యంగా వస్తున్న ఆచార్య పురుషులు సమాశ్రయణాన్ని అనుగ్రహిస్తారు. అలాగే మఠములను (మణవాళ మాముణులు కూడా ఇలాంటి ఏర్పాటును చేశారు) ఏర్పరిచి వాటిలో జీయర్లను (శ్రీవైష్ణవ సన్యాసి) నియమించి  వారిచే పంచ సంస్కారములు అయ్యేలా చేసిరి. వీరి పరంపర కూడా పైవారి వలె విధిని నిర్వహించేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

 పంచ సంస్కారం అయ్యే రోజున చేయవలసినవి

  • ప్రాతః కాలముననే మేల్కొనాలి.
  • శ్రీమన్నారాయణున్ని , ఆళ్వార్లను, ఆచార్యులను స్మరించాలి. ఇది మనకు ఙ్ఞాన జన్మను ఇచ్చిన రోజు.
  • నిత్యకర్మలను యధావిధిగా చేయాలి (స్నానం, ఊర్ధ్వ పుండ్ర ధారణ, సంధ్యా వందనం మొదలైనవి)
  • ఆచార్యుని మఠమును / గృహమును దర్శించాలి. దర్శనానికి వెళ్ళే సమయాన అవకాశాన్నిమరియు వీలును బట్టి పూలను, పండ్లను వస్త్రములను (భవానునికి /ఆచార్యునికి) మరియు సంభావనను తీసుకెళ్ళాలి.
  • సమాశ్రయణమును జరిపించుకోవాలి.
  • ఆచార్యుని శ్రీపాద తీర్థాన్ని గ్రహించాలి.
  • ఆచార్యుడు అనుగ్రహించే సూచనలను శ్రద్ధగా శ్రవణం చేయాలి.
  • వారి గృహమున / మఠమున  అనుగ్రహించే ప్రసాదాన్ని స్వీకరించాలి.
  • ఆచార్యుని సన్నిధానమున ఉండి అవకాశాననుసరించి సంప్రదాయ విషయాలను శ్రద్ధగా నేర్చుకోవాలి.
  • సమాశ్రయణం పొందిన తర్వాత ప్రతి రోజు అనుష్ఠానమునకై ఒక సమయాన్ని కేటాయించుకొని విధిగా నిర్వర్తించాలి. గురుపరంపరకు కృతఙ్ఞత నివేదన చేయాలి. ఇలా ప్రతి దినమును దైవ, ఆచార్య చింతనతో ప్రారంభించాలి.

పంచ సంస్కారములు ఆరంభమా లేదా అంత్యమా?

సమాశ్రయణం సాధారణమైన కర్మయని ఇక్కడితో ఇక చాలని చాలా మంది అపోహ పడుతుంటారు. కాని అది సరైనది కాదు. శ్రీవైష్ణవత్వమునకు ఇదే ఆరంభ ప్రయాణం. పూర్వాచార్యులు అనుగ్రహించిన విశేష లక్ష్యమగు (శ్రీ మహాలక్ష్మితో కూడిన శ్రీమన్నారాయణునికి నిత్య కైంకర్యము చేయుట) – ఆచార్యుని ద్వారా తెలుపబడిన భగవానుని అంగీకరించి అతను తెలిపిన నియమాలను పాటించాలి. ఇదే జీవాత్మ ఉజ్జీవించుటకు సహజ స్వరూపం, దీనిని దైనందిత జీవనంలో ఆచరణలో పెట్టాలి.

పిళ్ళై లోకాచార్యులు తమ ముముక్షుపడి సూత్రం116 లో శ్రీ వైష్ణవుని ప్రవర్తనను ఇలా వివరించారు.

  1. పూర్తిగా ప్రాపంచిక విషయాంతరములను త్యజించాలి.
  2. శ్రీమన్నారాయణ్ణున్ని మాత్రమే ఆశ్రయించాలి.
  3. శాశ్వత లక్ష్యమును సాఫల్యం చేయుట యందు పూర్తి విశ్వాసముంచాలి.
  4.  ఆ లక్ష్య సాధనకై ధృడమైన కోరికను కలిగి ఉండాలి.
  5.  దివ్య దేశములను సందర్శిస్తు భగవానుని కళ్యాణ గుణములను అనుభవిస్తు కైంకర్య అభిలాష కలిగి ఉండాలి.
  6. భాగవతుల వైభవం, గుణములును తెలుసుకొని వారిననుసరించాలి.
  7. నిత్యం తిరుమంత్రం మరియు ద్వయ మంత్రము లందు స్థిరమైన అభినివేశం కలిగి ఉండాలి.
  8. స్వాచార్యుల యందు విపరీతాభిమానం కలిగి ఉండాలి.
  9.  భగవానుని యందు ఆచార్యుని యందు సదా ఉపకార బుద్ధిని కలిగి ఉండాలి.
  10.  ఙ్ఞానులైన సాత్విక శ్రీవైష్ణవులతో సదా సత్సంగము చేస్తుండాలి.

అధిక వివరాలకు //ponnadi.blogspot.in/2012/08/srivaishnava-lakshanam-5.html ను వీక్షించండి.

ఈ విషయము నందు మనమందరం భగవద్రామానుజులకు చాలా ఋణ పడి ఉన్నాము. ఈ పంచ సంస్కారములను ఒక క్రమంగా వ్యవస్థీకరించి తర్వాతి తరములకు అందేలా 74 సింహాసనాధిపతులను ఏర్పరచి వారిని  దీనిలో నిమగ్నపరిచారు.

ఈ ప్రాపంచిక సుఖములలో నిమగ్నమై నిజమైన కర్తవ్యమును మరచి భగవానునికి మంగాళశాసనం చేయడం కూడ మరచి అఙ్ఞానముతో అల్లాడుచున్న జీవులకు సరైన మార్గమును ఉపదేశించిన వారు భగవద్రామానుజులే. క్రమంగా ఈ విషయములను తెలుసుకుందాం….

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలము: http://ponnadi.blogspot.in/2015/12/simple-guide-to-srivaishnavam-pancha-samskaram.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org