Monthly Archives: November 2016

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – గురుపరంపర

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<<ఆచార్య – శిష్య సంబంధం

క్రిందటి వ్యాసంలో ఆచార్య శిష్య మధ్యన ఉన్న విశిష్ఠ సంబంధమును తెలుసుకున్నాము.

భగవానునికి మనకు మధ్యన ఆచార్యుని ఆవశ్యకత  ఏమిటి? అని కొందరి వాదన. మరి గజేంద్రున్ని, గుహున్ని, శబరిని, అక్రూరున్ని, త్రివక్రను (కృష్ణావతారమున ఉన్న కుబ్జ) మరియు మాలాకారుడను (పూల వర్తకుడు) మొదలైన వారిని భగవానుడు ప్రత్యక్షముగా అనుగ్రహించాడు కదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

దీనికి మన పూర్వాచార్యుల సమాధానం, భగవానుడు సర్వస్వతంత్రుడు కావున ఒకసారి తన నిర్హేతుక కృపను జీవుని మీద ప్రసరింపచేస్తాడు, అలాగే జీవుల కర్మానుసారం వారికి ఫలితాలనివ్వడం అనే దానికి కూడా కట్టుబడి ఉంటాడు. ఈ స్థితిలో ఆచార్యుని ఆవశ్యకత ఏర్పడును. ఉజ్జీవించు ఙ్ఞానమును అందించి తనను చేరుటకు మార్గమును చూపు ఒక సదాచార్యున్ని ఆశ్రయించేలా అవిశ్రాంతముగా అవకాశాలను సృష్ఠిస్తాడు భగవానుడు (వారి సుకృతమును గణింపక) ఈ జీవాత్మలకు. ఈ జీవాత్మలు కేవలం శ్రీమన్నారాయున్ని ఆశ్రయించి అతని కృప చేతనే ఉజ్జీవింప బడాలని తలచి ఆచార్యుడు పురుషాకార భూతురాలైన శ్రీ మహాలక్ష్మి వలె తాను కూడా భగవానునికి సిఫార్సు చేస్తాడు. భగవానుడు ఈ జీవాత్మల కర్మానుసారం వారికి మోక్షము గాని సంసారము గాని ప్రసాదించేటప్పుడు ఆచార్యుడు జీవాత్మలకు మొక్షము మాత్రమే వచ్చేలా కృషి చేస్తాడు.

భగవానుని స్వయంగా ఆశ్రయించడం కన్నా ఆచార్య తిరువడిని ఆశ్రయించి దాని ద్వారా ఆ భగవానుని శ్రీ పాదములను ఆశ్రయించడం చాలా శ్రేయస్కరం. భగవానుడు జీవాత్మలను తాను స్వయంగా  స్వీకరించడం చాలా అరుదు, అదే ఆచార్య సంభందం ఉన్నవారిని కటాక్షించుట సహజమైనది అని మన పూర్వాచార్యులు అభిమతం.

ఆచార్య వైభవమును ప్రస్తుతించుచున్న సందర్భమున మన ఆచార్య పరంపరను కూడ తెలుసుకొనుట ఉచితం. దీని వల్ల భగవానుని నుండి ఙ్ఞానం ఎలా పరంపరగా వచ్చినదో అవగతమవుతుంది. సాధారణంగా ఇది లోకవిదితమైనదే అయినను కొంత మంది సాంసారికులకు తెలియని విషయము. ఈ శ్రీవైష్ణవ సంప్రదాయం సనాతనమైనది, అనాదిగా కలది మరియు మహానుభావులచే ప్రచారంగా వించబడినది. ద్వాపరాంతమున ఈ సంప్రదాయం దక్షిణ భారతావనిలో పలు నదీ తీర ప్రాంతముల యందు అవతరించిన ఆళ్వార్ల ద్వారా ప్రారంభించబడినది. కొందరు ఆళ్వార్లు మనకు కలియుగారంభమున కూడ కనిపిస్తారు.

లోకోద్ధారణకై భగవత్ ఙ్ఞానమును కలిగి శ్రీమన్నారాయణుని భక్తులగు మహానుభావులు పలు నదీ తీర ప్రాంతముల యందు అవతరిస్తారని వేద వ్యాసులు శ్రీమధ్భాగవతమున సూచించారు. వారు పది మంది. క్రమంగా పోయిగై ఆళ్వార్,  భూదత్తాళ్వార్పేయాళ్వార్తిరుమళిశై ఆళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖరాళ్వార్, పెరియాళ్వార్, తొండరడిప్పొడి ఆళ్వార్,  తిరుప్పాణాళ్వార్, మరియు  తిరుమంగై ఆళ్వార్.   మధురకవి ఆళ్వార్  మరియు ఆండాళ్ పరమ ఆచార్య నిష్ఠను కలిగినవారై ఆళ్వార్ల గోష్ఠిలో చేరిరి. కావున ఆ సంఖ్య  పన్నెండుకు పెరిగినది. ఆండాళ్, భూదేవి అవతారం. ఆళ్వార్లందరు (ఆండాళ్ తప్ప) ఈ సంసారమున జీవాత్మలుగా ఉండి భగవానునిచే ఉద్ధరింప బడినవారు. భగవానుడు తన స్వసంకల్పముచే ఈ ఆళ్వార్లకు తత్త్వ త్రయమును (చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు) విశద పరచు దివ్య ఙ్ఞానమును అనుగ్రహించి మరల భక్తి / ప్రపత్తి మార్గమును పునరుద్ధరింప చేశాడు. వీరికి స్పష్ఠమైన భూత భవిష్యవర్తమానముల ఙ్ఞానమును కూడా అనుగ్రహించాడు. అలా వారు భగవానుని అనుభవించి నప్పుడు పొంగి పొరలిన అనుభవమును నాలాయిర దివ్య ప్రబంధములుగా (అరుళిచ్చెయళ్ అని కూడ  ప్రసిద్ధి చెందినది) అనుగ్రహించారు. ఈ అరుళి చ్చెయళ్ సారమే నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయ్మొళి.

ఆళ్వారుల అనంతరం ఎంతో మంది ఆచార్యులు ఈ సంప్రదాయమును ప్రచారం చేసి విస్తరింప చేశారు. వారు క్రమంగా శ్రీమన్నాథమునులు, ఉయ్యక్కొండార్, మణక్కాల్ నంబి, ఆళవందార్పెరియ నంబి, తిరువరంగ ప్పెరుమాళ్ అరయర్తిరుక్కోష్ఠియూర్నంబిపెరియ తిరుమలై నంబితిరుమలై ఆండాన్,  ఎమ్పెరుమానార్, ఎంబార్, కూరత్తాళ్వాన్, ముదలి యాండాన్, అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్, ఎంగళాళ్వాన్అనంతాళ్వాన్,  తిరువరంగత్తు అముదనార్, నడాదూర్ అమ్మాళ్పరాశర భట్టర్, నంజీయర్, నంపిళ్ళైవడక్కు తిరువీధి పిళ్ళైపిళ్ళై లోకాచార్యులుఅళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్,  తిరువాయ్మొళి పిళ్ళై, వేదాంతాచార్యులు మరియు అళగియ మణవాళ మామునిగల్  మొదలైనవారు సంప్రదాయ ప్రవర్తకులుగా ఉన్నారు.

ఈ ఆచార్య పరంపర 74 సింహాసనాధిపతులచే (ఎమ్పెరుమానార్లచే నియమింప బడ్డవారు) మరియు జీయర్ మఠములచే (ఎమ్పెరుమానార్ మరియు అళగియ మణవాళ మాముణులచే నియమింప బడ్డవారు) ప్రస్తుత కాలం వరకు కొనసాగించ బడుతున్నది. ఈ ఆచార్యులు అరుళిచ్చెయ్యల్కు వ్యాఖ్యాన్నాన్ని మరియు ప్రతి పాశురానికి విశేషార్థ వివరణ చేశారు. ఈ వ్యాఖ్యానములు విశేష అర్థభావమును కలిగి భగవదనుభవమున ముంచి వేస్తాయి. ఆళ్వారుల కృపతో ఈ ఆచార్యులు పాశురములకు సరైన అర్ధ వివరణ వివిధ కోణాల్లో అనుగ్రహించారు.

దివ్య ప్రబంధములను మనం అర్థానుసంధానముతో  అనుభవిస్తున్నామంటే మన పూర్వాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానము వల్లే అని మాముణులు తమ ఉపదేశ రత్నమాలలో అనుగ్రహించారు. ఈ వ్యాఖ్యానములు లేకున్నచో వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్ఠతరం. దివ్య ప్రబంధముల వైభవం తెలిసిన మన పూర్వాచార్యులు గృహములలో మరియు దేవాలయములలో నిత్యాను సంధానమును (ప్రతిరోజు తప్పక పఠించ వలసినవి) ఏర్పాటుచేశారు. దీనిని మనం ఈనాటికి తిరువల్లి క్కేణి వంటి దివ్య దేశముల యందు సేవించ వచ్చును. శుక్ర వారమున జరుగు శిరియ తిరుమడళ్ గోష్ఠిన ఐదారు సంవత్సరముల బాలురు ప్రౌఢ శ్రీవైష్ణవుల కన్నా ఉచ్ఛస్వరమున సేవిస్తారు. అలాగే ఆండాళ్ అనుగ్రహించిన తిరుప్పావైని అతి చిన్న బాలురు కూడ సేవించడం మనం చూస్తున్నాము.

దీని వల్ల మనకు గురు పరంపర ప్రభావం అవగతమవుతుంది. దీనిని రక్షించు కోవడం మన ప్రథాన కర్తవ్యం.

వివిధ భాషల్లో పూర్వాచార్యుల గురించి లోతైన వివరణకై  http://acharyas.koyil.org  దర్శించండి.

ఆళ్వార్గళ్ వాళి  అరుళిచ్చెయళ్ వాళి, తాళ్వాదుమిల్  కురువర్ తామ్ వాళి  (ఆళ్వారులకు మంగళం, దివ్య ప్రబంధములకు మంగళం, దివ్య ప్రబంధములకు వ్యాఖ్యానములను అనుగ్రహించి ప్రబోధించిన ఆచార్యులకు మంగళం) ఉపదేశ రత్న మాల – 3 వ పాశురం.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలము: http://ponnadi.blogspot.in/2015/12/simple-guide-to-srivaishnavam-guru-paramparai.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org