Monthly Archives: March 2017

చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 2

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 1

గత అధ్యాయములో (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/12/01/charamopaya-nirnayam-ramanujar-our-saviour-1/) భగవద్రామానుజుల ఉత్తారకత్వ ప్రభావము కొన్ని అనుభవాల మూలముగా తెలుసుకున్నాము! ఇక ఈ అధ్యాయములో స్వామి వారి ఉత్తారకత్వ వైభవమును మరి కొన్ని ఐతిహ్యముల మూలముగా తెలుసుకొనెదము!!

ఒకానొకప్పుడు అరుళాళ ప్పెరుమాళ్ ఎమ్బెరుమానార్ల శిష్యులైన అనంతాళ్వాన్, ఎచ్చాన్, తొండనూర్ నంబి, మరుదూర్ నంబి మొదలైనవారు ఉడయవర్లను ఆశ్రయించి ఒక సందేహమడిగినారు, “ఈ ఆత్మకు ఆచార్యుడు ఒకరా? పలువురా? ఇంతమంది ఎందులకు?”  దానికి ఉడయవర్లు ఆ శిష్యులను వెళ్లి పొన్నాచ్చియార్ అను వారిని అడుగ వలసిందిగా చెప్పారు! అప్పుడు వారందరు పొన్నాచ్చియార్ అమ్మగారి తిరుమాళిగకు చేరుకొని తమ సందేహాన్ని వారి వద్ద విన్నవించారు! అప్పుడు పొన్నాచ్చియార్ అమ్మగారు తమ శిరోజాలని ముడి విప్పి విదిలించి మరల ముడి వేసుకుని, “ఈ సందేహమును దాసురాలు తీర్చజాలదు! అబలయైన దాసురాలికి అంత జ్ఞానమేమున్నది? స్వామి వారే మీ సందేహము తీర్చగలరు? ” అని వారికి సమాధానము చెప్పి నేలపై పడియున్న ఒక నూలు పోగును తల మీద పెట్టుకుని లోపలి వెళ్లిపోయారు! శిష్యులు చేసేది లేక మరల ఉడయవర్ల వద్దకు వచ్చి నిలబడిరి! ఉడయవర్లు వారితో, “కార్యము నెరవేరినదా?”అని అడుగగా వారు లేదని బదులిచ్చిరి! అంతట ఉడయవర్లు వారితో, “మీరు వెళ్ళి నప్పుడు వారు ఏమి చేసినారు?” అని అడుగగా వారు పొన్నాచ్చియార్ తమ జుత్తు ముడిని విప్పి జుత్తు విదిలించి తిరిగి ముడి వేసుకున్నారని, నేలపై పడియున్న ఒక నూలు పోగు శిరస్సుపై వేసుకుని లోపలి వెళ్లిపోయారని బదులిచ్చారు! దానికి ఉడయవర్లు, “అయితే మీకు సమాధానం దొరికింది! ఆమె తన చేష్టల ద్వారా మీకు సమాధానం చెప్పారు! మీకు అర్థం కాలేదే?”, అనగా శిష్యులు వారికి సాష్టాంగ దండం సమర్పించి, “మా అజ్ఞానాన్ని మన్నించి సవివరంగా దేవరవారే తెలియజేవలసింది!” అని ప్రార్థించిరి! దానికి ఉడయవర్లు వారి పట్ల వాత్సల్యము గలవారై వారితో ఇటుల చెప్పిరి, “ఆమె తమ జుట్టు ముడి విప్పి జుత్తు విదిలించడమంటే – ఈ ఆత్మకు ఆచార్యులు పలువురు ఉండవచ్చును (తల్లిదండ్రులు, చదువు చెప్పే గురువులు, ఈ ప్రకృతి ఇలా జీవుడికి రకరకాల గురువులు ఉండవచ్చును )! అయితే ఆత్మకు ప్రాప్యమును కలిగించే (అంటే మోక్షమును ఇచ్చు) ఆచార్యుడు మాత్రం ఒక్కరే! అదే ఆమె తిరిగి తన జుత్తు ముడి వేసుకొనుటకు అర్థము! నేలపై పడి ఉన్న కావినూలు తీసి శిరస్సుపై ధరించుటలో అర్థం ఆత్మకు ప్రాప్యమును కలిగించే ఆచార్యుడు చతుర్థాశ్రమమైన సన్యాసమును స్వీకరించి కాషాయ త్రిదండ ధారుడైన ఎమ్బెరుమానార్ అనగా మమ్ములను సూచించారు! అక్కడ ఉండ కుండా లోపలి వెళ్ళుటలో అంతరార్థం అటువంటి ఆచార్యుని గుట్టుగా మనస్సులో స్థిరంగా నిలుపుకుని ‘పేణి క్కొణర్న్దు పుహుదు వైత్తుక్కొండేన్’ (ఆదరించి తీసుకువచ్చి విశ్లేషించకుండా హృదయంలో నిలుపుకున్నాను) అనునట్లు ప్రేమతో ఆచార్యుని ఆరాధిస్తూ వారి నామస్మరణ చేయుటయే శిష్యునికి ఉపాయము అని పొన్నాచ్చియార్ మీకు చేసి చూపించారు! కనుక మీరందరు అదే విధమైన నిష్ఠను కలిగి జీవించండి! ” అని బదులిచ్చిరి!

ఒకనాడు ఉడయవర్లు ఏకాంతంలో ఉన్న సమయములో ఎంబార్, వడుగనంబి వారి వద్దకు వెళ్లి, “మధురకవియాళ్వార్ నమ్మాళ్వార్ల విషయములో ‘తేవు మత్తఱియేన్’ – నీవు తప్ప వేరు దైవమెరుగను – అని శేషత్వ – శరణ్యత్వ – ప్రాప్యత్వములు ఆళ్వార్లే అని నిశ్చయించుకుని ప్రథమ పర్వమును (భగవత్స్మరణం) సైతం విడిచి పెట్టి తదేక నిష్ఠులై ఉన్న అటువంటి శ్రద్ధ మాకు కూడా కలిగేలా దేవరవారు ఆశీర్వదించవలసింది!”, అని ప్రార్థించగా ఉడయవర్, “మధురకవులు నమ్మాళ్వార్ల వద్ద కలిగి ఉన్న నిష్ఠను మీకు ఇదివరకే అనుగ్రహించి యున్నాను కదా? ఇంకేమి సంశయము?”, అని అడుగగా వారు,”అటువంటి నిష్ఠ యావదాత్మభావిగా జీవితాంతం కలిగియుండేలా అనుగ్రహించ వలసింది! ” అని ప్రార్థించిరి! ఉడయవర్లు పరమ సంతోషముతో శిష్యులంటే ఇటులకదా ఉండవలెనని మనస్సులో భావించి, “‘ఉపాయోపేయ భావేన తమేవ శరణం వ్రజేత్’ – ఉపాయము ఉపేయము నీవేనను భావముతో శరణు వేడవలెను – అను రీతిలో ఉపాయోపేయ రూపములు రెండునూ మా వద్ద ఉండుట చేత “తేవు మత్తఱియేన్ ” అను రీతిలో మాకు శరణు వేడిన మీకు లోటు ఉండదు! ఇది మీకే గాక మీ సంబంధి సంబంధులకు వర్తించగలదు” అని బదులిచ్చెను!

గమని : ఇక మిగిలిన వ్యాసంలో  ఆళవందార్లు మరియు నాథమునుల సంబంధమును నిశితంగా తెలియజేయడమైనది.

మనకు ఒక సందేహము కలుగవచ్చు , “మనము ఆశ్రయించెడి ఆచార్యునకు ఈ లీలా విభూతిలో ఉన్న రోజులలో ఉపాయత్వము మాత్రమే కాక, ప్రాప్య భూమి అనబడే పరమపదంలో కూడా ఉపాయత్వము కలదా?” అంటే ప్రాప్య భూమి యందు కూడా ఆచార్యునకు ఉపాయత్వము కలదు! దీనిని స్వామి ఆళవందార్లు స్తోత్ర రత్నములో ఈ విధముగా అనుగ్రహించారు :

తస్మై నమో మధుజిదంఘ్రి సరోజ తత్వ
జ్ఞానానురాగా మహిమాతిశయాంత శీమ్నే!
నాధాయ నాథమునయే అత్ర పరత్రచాపి
నిత్యం యదీయ చరణౌ శరణం మదీయం !!

అర్థము – మధుమర్దియైన శ్రీమన్నారాయణుని శ్రీ చరణముల పట్ల అచంచలమైన ప్రేమ, భక్తి కలిగి నిజజ్ఞాన పూర్ణులైన నాథమునులే నాకు యజమాని! వారి దివ్య సన్నిధి ఈ భూలోక మందు మరియు పరమపద మందును నాకు ఆశ్రయము!

మరియు విష్ణుపురాణ సూక్తియగు, “సాధ్యభావే మహా బాహో! సాధనైః కిం ప్రయోజనం?” అనగా – సాధ్య భావం సిద్ధించినపుడు ఇక సాధనములతో ఏమి ప్రయోజనం ? (అంటే దక్కవలసింది దక్కి నపుడు ఇక సాధనాలతో ఏమి ప్రయోజనం?).
కానీ, భట్టర్ అనుగ్రహించిన శ్రీ రంగరాజ స్తవములో ఈ విధముగా తెలిపారు (87వ శ్లోకము – ఉత్తర శతకం)

ఉపాదత్తే సత్తాస్థితి స్వనియమానాద్యైశ్చిదచితౌ
స్వముద్దిశ్య శ్రీమానితి వదతి వాగుపనిషదీ !
ఉపాయోపేయత్వే తదిహ తవ తత్త్వం నతు గుణౌ
అతస్త్వామ్ శ్రీరంగేశయ! శరణమవ్యాజ్యమభజం !!

అర్థము – ఓ శ్రీ రంగేశ! శ్రీమన్నారాయణుడివై నీవు భూజాతులైన చిత్తులు (బుద్ధి జీవులు ) అచిత్తుల (బుద్ధి రహిత జీవులు) యొక్క సేవలను సృష్టి, స్థితి, నియమములనెడి పరికరముల ద్వారా స్వీకరించెదవని ఉపనిషత్తులు ఘోషించుట చేత చేతనులకు నీవే ఉపాయము మరియు ఉపేయము అనుట అతిశయోక్తి కాదు! అది సత్యము ! అటువంటి నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను!

అన్నందు వలన ఈ ఉపాయోపేయములు రెండు భగవానుడి స్వరూపములు! అయితే ఉపాయము బయటికి ప్రకాశిస్తుంది ఉపేయము అంతర్గతముగా  ఉండును! అయితే ఈ స్వరూపములు భగవానుడి విషయములోనే కదా? అంటే ఆచార్యుని విషయములో కూడా స్వీకరించ వచ్చును ! ఆళవందార్లు శాయించిన, “ఉపాయోపేయ భావేన…. ” అన్న విధముగా ఆచార్యునకు ఉపాయోపేయత్వములు రెండూ స్వరూపములై ఉండును! అందుకనే “అత్ర పరత్రాచాపి…” అని చెప్పబడింది ! మరియు “త్వమేవ..” అనుటలో భావం ఇటువంటి స్వరూపములు ఆచార్యుని యందు “మాత్రమే” ప్రకాశించును అని రూఢి చేసినట్లు ఉన్నది! కనుక చరమపర్వ మందు ఇతర సహాయ సంబంధములను సహించనిదై ఉండును! (అనగా చరమోపాయ నిష్టలో ఆచార్యుడు తప్ప ఇక వేరే ఇతర సహాయములు పనిచేయవు అని అర్థము)! కార్యకాలములో చరమపర్వము (చరమోపాయ నిష్ఠ) అన్నిటి కంటే ఉత్తమమై ఉండును! కనుక చరమపర్వము ప్రథమ పర్వము కన్నా ఏ విధముగా గొప్పదో క్లుప్తముగా చూద్దాం:

 •  భగవానుడు తనను ఆశ్రయించిన భక్తులను తన యొక్క సర్వతంత్ర స్వతంత్రత చేత మోక్షములోనో లేక తిరిగి సంసారములోనో ఉంచును! కనుక భగవానునిని ఆశ్రయించిన భక్తునికి మోక్షము తథ్యమని నమ్మరాదు (ఉడయవర్ల కాలములో సింహాచలంలో పరమ నృసింహ భక్తుడైన కృష్ణమాచార్యుని గాథ ద్వారా తెలియ వచ్చును)! కానీ ఆచార్యుడు తన శిష్యుడు ఏ విధంగానైనా తరించాలని తపనపడి తమ యొక్క నిర్హేతుక కృప చేత భగవానునికి పురుషకారము చేత మోక్షమును ఇప్పించును!
 • భగవానుడు ఆచార్య సంబంధము కలిగిన భక్తుని మాత్రమే స్వీకరించును ! కానీ కృపా పూర్ణుడైన ఆచార్యుడు ఎవరినైనా తన శిష్యునిగా స్వీకరించి భగవంతునితో సంబంధమును కలిగించును!
 • ఆచార్యుడు అజ్ఞాని అయిన తన శిష్యునికి భగవద్విషయమును తానే ఉపదేశించి భగవంతుని సేవించే విధమును నేర్పును కానీ శిష్యుని జ్ఞానార్జనలో ఒంటరిగా విడిచి పెట్టడు! కానీ భగవానుడు జ్ఞానవంతుడై ఆచార్య సంబంధము కలిగిన జీవుని మాత్రమే అనుగ్రహించును!
 • కనుక మోక్షము విషయములో మనలోని సంశయములు దూరం చేసి తనను ఆశ్రయించిన వారికి పరమపదము తథ్యమని ఉపదేశించిన ఉడయవర్ల చరణయుగళాన్ని ఆశ్రయించి మధురకవియాళ్వార్లు నమ్మాళ్వార్ల పట్ల కలిగియుండిన “తేవు మత్తఱియేన్…” అనెడి నిస్సంశయ, అన్యధా శరణ నాస్తి అనెడి నిర్దుష్టమైన భక్తి ప్రపత్తులు ఉడయవర్ల సన్నిధిలోనూ కలిగియుండుటలో ఎటువంటి ఆలోచన చేయనక్కరలేదు!

అయితే మనకు ఇంకొక సందేహము కలుగవచ్చు! పూర్వాచార్యులైన ఆచార్యులందిరికినీ ఉడయవర్లే ఉత్తారుకులని చెప్పుకున్నప్పుడు, మరి ఆళవందార్లు నాథమునుల విషయములో ఉపాయత్వమును నిశ్చయించుకున్నదెట్లు? దానికి సమాధానం – నాథమునులే కదా నమ్మాళ్వార్ల వద్ద రహస్యార్థములన్నీయును మరియు స్వప్నార్థములను భవిష్యదాచార్య విగ్రహముతో సహా పొంది తమ అంత్యకాలమందు వాటిని తమ శిష్యులైన ఉయ్యాక్కొండారుకు ఇచ్చి భవిష్యత్తులో అవతరించబోవు ఆళవందార్ల విషయమును వారికి చెప్పి, “ఈశ్వరమునులకు కలుగబోవు కుమారునికి రహస్యార్థములను ఉపదేశించ వలసింది! ” అని తెలిపినందువల్ల వారు అలాగే వేచియుండి తమ కాలమందు ఆళవందార్లు అవతరించక పోవుట చేత తమ శిష్యులైన మణక్కాల్ నంబికి ఆ బాధ్యతను అప్పజెప్పగా మణక్కాల్ నంబి ఆచార్య దివ్యాజ్ఞను అనుసరించి తమ కాలములో అవతరించిన ఆళవందార్లకు రహస్యార్థములను ఉపదేశించి మరియు భవిష్యదాచార్య విగ్రహమును వారికి అనుగ్రహించిరి! దానికి ఆళవందార్లు నాథమునుల వల్లనే కదా తమకు శ్రీ సంప్రదాయ విద్య అబ్బినదని సంతోషించి, “తాము పుట్టక మునుపే గర్భములోనే సంపదను పొందిన రీతిగా విశేష కటాక్షమును పొంది, సంప్రదాయ అర్థములను తెలియ పరచి, భవిష్యదాచార్య విగ్రహమును చూపి ఆ భవిష్యదాచార్యులైన ఉడయవర్లు తమకాలములోనే అవతరించగా వారిని దర్శించే భాగ్యాన్ని కలుగ చేసి సద్వారకముగా స్వప్న దర్శనమును అనుగ్రహించి ఇంత ఉపకారమును ఒనర్చిన నాథమునులకు నేనేమి ప్రత్యుపకారము చేయగలనని” చింతించి ఆళవందార్లు నాథమునుల పట్ల ఉండెడి ప్రత్యుపకార భావము యావదాత్మభావిగా ఉండునని తెలియ పరచ గోరి, “నాథమునులు నిశ్చయించిన విషయము వరకు ఎందుకు, నాకు ఇంత ఉపకారము చేసిన నాథమునులే నాకు సర్వస్వము కదా!”, అని పలికారు ఆళవందార్లు ! అదే దాని భావము! నిజానికి నాథమునుల మనోభావమే ఆళవందార్ల మనోభావము !

అలా ఆళవందార్లు నాథమునుల పట్ల ప్రాప్యమునకు తగిన ఉపాయత్వభావమును పొందుటయే కాక  నమ్మాళ్వార్ల పట్ల కూడా, “సర్వం యదేవ నియమేవ మదన్వయానాం! ఆద్యస్య నః కులపతేర్వకుళాభిరామం శ్రీమత్తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా!!” (స్తోత్ర రత్నం -5), (నా వంశమునకు చెందిన వారి కందరికిని శ్రీ శఠకోపుల పాదద్వయమే సమస్తమో ఆ శ్రీ చరణయుగళాన్నే ఆశ్రయిస్తున్నాను!) అని అందరికి, తమకు ఆళ్వార్ల శ్రీ చరణాలే ఉపాయముగా నిశ్చయించుకున్నట్లు అయినది! అక్కడే “మదీయ శరణం.. ” అన్నందు వలన తామొక్కరినే చెప్పి ఉపాయత్వమును చెప్పుటచే ఆళ్వార్లు తమకు చేసిన ఉపకారమునకు బద్ధులై తత్సమృద్ధి సూచకంగా చెప్పినట్లు స్పష్టమవుచున్నది !!

ఇక తరువాతి వ్యాసములలో ఉడయవర్ల యొక్క ఉత్తారకత్వమును నిరూపించే మరి కొన్ని ఐతిహ్యములను చెప్పుకుందాము!

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము:  https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujar-our-saviour-2.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిక – అపచారములు – అపచారముల నిర్మూలన

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<< ఐదు ముఖ్యమైన అంశములు

చాణ్డిలి – గరుడ సంఘటన (చాణ్డిలి అనే మహాభక్తురాలు ఒక పర్వతముపై నివసిస్తు భగవ ధ్యానం చేసుకొనేది. ఒక సమయమున గరుడాళ్వార్ ఆ పర్వతం మీదుగా వెళ్తూ ఈవిడని చూసి ‘ఏమిటి ఈ తపస్విని దివ్య దేశములోకాని పవిత్ర క్షేత్రములోకాని నివసిస్తు ధ్యానం చేసు కోవచ్చుగా అని తలచారు (భాగవతాపచారం) వెంటనే తన రెక్కలకు అగ్ని అంటుకుంటుంది. అనగా భాగవతులు ఏ ప్రదేశములో నివసిస్తే అదే గొప్ప క్షేత్రం – ఈ శ్రీ సూక్తి శ్రీ వచన భూషణం లోనిది )

ఈ వ్యాసము నందు వివిధ రకముల అపచారములు వాటిని శ్రీ వైష్ణవులు తొలగించుకొనే విధానములను తెలుసుకుందాము.

శ్రీవైష్ణవులకు శాస్త్రం పరమ ప్రమాణం – అన్ని విధులను శాస్త్రమునే ఆధారంగా తీసుకొని చేస్తారు. శాస్త్రం అనగా మనం ఏది చేయాలో (విధి) ఏది చేయకూడదో (నిషిద్ధమో) తెలుపుతుంది. సాధారణంగా శాస్త్రం మనకు నిత్య కర్మలను మరియు నైమిత్తిక కర్మలను అనుష్ఠించాలని అలాగే ఆస్తేయం (దొంగతనం), ఇతరుల సంపదను ఆశించడం, హింస మొదలైనవి చేయకూడదని విధిస్తుంది. మన  పూర్వాచార్యులు శాస్త్రసారమును గ్రహించి మనకై అందించారు.

పిళ్ళై లోకాచార్యులు తమ శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రమున సూత్రం 300 నుండి 307 వరకు నాలుగు విషయముల యందు అశక్తులుగా (చేయకుండ) ఉండాలని సూచించారు.

 • అకృత్య కరణం – శాస్త్ర నిషిద్ధమైన వాటిలో అనాసక్తిగా ఉండడం.
 • భగవదపచారం – భగవంతుని ఎడల అపచార పడడం.
 • భాగవతాపచారం – భాగవతుల యందు (భక్తుల యందు) అపచార పడకుండా ఉండడం.
 • అసహ్యాపచారం – ఏ కారణం లేకుండానే భగవత్ / భాగవతులందు అపచార పడడం.

వీటిని విపులంగా తెలుసుకుందాం:

అకృత్య కరణం:- శాస్త్రం మనకు వీటి నుండి దూరంగా ఉండమని నిర్ధేశిస్తుంది.

పరహింస: జీవహింస కూడదు. అనగా  వృక్షమునకు గాని చీమగాని హాని కలిగించ రాదని శాస్త్ర వచనం.

పర స్త్రోత్రం: మనకు భగవానుడు కంఠం అనుగ్రహించినది తనని తన భక్తులని కీర్తించడానికే కాని ఇతరులను కాదు.

పరదార పరిగ్రహణం: పరుల భార్యలను చెరపట్టరాదు / ఏవిధంగా నైనను వారి యందు దుష్ఠ ఆలోచనలు చేయ కూడదు.

పరద్రవ్య అపహరణం: ఒకరు ఇచ్చే వరకు వారి సంపదను గాని ధనమును కాని ద్రవ్యమును కాని ఆశించ రాదు.

అసత్య కథనం: సత్యమునకు వ్యతిరేకముగా పలుకరాదు.

అభక్షభక్షణం: తినే ఆహార పదార్థములు 3 రకముల దోషములను కలిగి ఉంటాయి. జాతి దుష్ఠములు, ఆశ్రయ దుష్ఠములు మరియు నిమిత్త దుష్ఠములు. దీనికై ఆహార నియమాలు (http://ponnadi.blogspot.in/2012/07/SrIvaishNava-AhAra-niyamam_28.html అనే  వ్యాసమును చూడండి.

ఇంకా చాల నియమ నిబంధనములు మనకు మనుస్మృతిలో లభిస్తాయి.

శ్రీవైష్ణవులు ప్రధానంగా సామన్య శాస్త్ర విధులను నిర్వర్తించి నిషేధ విధులను త్యజించాలి.

భగవద పచారం:‌ పిళ్ళై లోకాచార్యులు క్రమంగా నిషేధ విధులను తెలుపుతు భగవదపచారం గురించి విశేషంగా  తెలుపుతున్నారు. దీనికి ఆచార్య సార్వభౌములైన మణవాళ మాముణులు విశేషమైన వ్యాఖ్యానమును అనుగ్రహించారు. ఈ క్రిందివి భగవదపచారములు.

 • దేవాంతరములతో (ఇతర దేవతలతో)  శ్రీమన్నారాయణున్ని సమానముగా తలచ రాదు. శ్రీవైష్ణవులుశ్రీమన్నారాయణుడే సర్వేశ్వరుడని ధృడముగా విశ్వసించాలి. ఎవరైతే సర్వేశ్వరుడైన (బ్రహ్మ, శివ, ఇంద్ర వరుణ అగ్ని మొదలైనవారికి కూడ), అంతర్యామో (లోపల ఉండి అన్నీ నడిపించే వాడో), శ్రీమన్నారాయణుడికి సమానులు లేదా వారిని మించిన వారు ఉండరు. ఈ విషయ పరిఙ్ఞానం చేత దేవాంతరములకు దూరంగా ఉండాలి.
 • అవతారములను అనగా రామ కృష్ణాది అవతారములను సామాన్య మానవులుగా తలచ రాదు. భగవానుడు ఈ సాంసారిక లోకం (భౌతిక జగత్తు)లో పరమపదములో ఉన్నట్లు అన్ని కళ్యాణ గుణములతో ప్రకాశిస్తాడని తెలుసు కోవాలి. స్త్రీ గర్భమున జన్మించడం, దినమున జన్మించడం, వనవాస క్లేశములను అనుభవించడం మొదలైనవి అతని లీలలు మాత్రమే కాని మనలాగా కర్మ బంధములు కావు. ఈ సంసార క్లేశములు అనుభవిస్తున్న జీవాత్మల ఉద్ధరణకై తన ఇచ్ఛతో చేయు నటువంటివి. కావున మనకై ఈ కష్ఠములను అనుభవిస్తున్నాడు, అంత మాత్రమున మనవలె మానవ జన్మ అని తలచరాదు.

వర్ణాశ్రమ ధర్మములు:

ప్రతి ఒక్కరు వర్ణాశ్రమ ధర్మములను విధిగా పాటించాలి. కారణం భగవానుడు ఇలా అన్నాడు “శ్రుతి స్మృతి మమ ఏవ ఆఙ్ఞా.. ఆఙ్ఞా చేధి మమ ద్రోహి, మత్ భక్తోపి న వైష్ణవః” –  శ్రుతి స్మృతి రెండు కూడ నా ఆఙ్ఞలే కావున వీటిని ప్రతి ఒక్కరు విధిగా అనుసరించాలి, వీటిని పాటించని వారు నా భక్తులైనప్పటికి వారు నా ద్రోహులు, వీరు అవైష్ణవులుగా పరిగణింపబడతారు. ఈ ప్రత్యేక సందర్భమును పురస్కరించు కొని మాముణులు  శ్రీవైష్ణవులు తిరువారాధన చేసే సమయమున వినియోగించు వైదిక మంత్రాలను తెలిపారు, సన్యాసులు వక్కపొడిని సేవించుట వంటి శాస్త్ర నిషిద్ధ విషయాలను కూడ తెలిపారు.

అర్చా మూర్తి విలువను తెలుపుతు – అది ఏ లోహముతో తయారైనదని పరిశీలించడం –  భగవానుడు భక్తుల సౌలభ్యార్థం మరియు ప్రీతి కోసం మనం కోరిన రూపాన్ని ధరిస్తాడు – మనం ఈ అర్చా విగ్రహం బంగారముతో తయారైనదని చాలా గొప్పదని – ఇది రాతితో తయారైనదని – ఇది కేవలం చిత్రమేనని భేదములు చూపుట భగవదపచారం. ఇలా మూర్తి యొక్క విలువను గణించడం మన మాతృ మూర్తి పవిత్రతను గణించటం వంటిది అని శాస్త్ర వచనం.

జీవుడు స్వత్రంతుడు అని భావిస్తే – మన స్వాత్రంత్య బుద్దే అన్నీ పాపములకు మూల కారణం. శాస్త్రరీత్యా ఇది క్షమింపరాని దొంగతనం. కాని ఈ జీవుడు భగవంతునికి పరతంత్రుడు కావున భగవానుని ప్రకారమే నడుచు కోవాలి.

భగవానుని ద్రవ్యమును అపహరించుట – అతని భోగము (ఆహారపదార్థం), తిరు ఆభరణములను, వస్త్రములను, అలాగే అతని స్థిరాస్తులైన స్థలం మొదలైన వాటిని అపహరించుట. నేడు ఇవి సర్వ సాధారణమైనవి.

 • వీటిని అపహరించు వానికి సహాయపడడం కూడ అపచారమే. అపహరించిన వాని దగ్గరనుండి గ్రహించినా, అపహరించమని ప్రోత్సహించినా కూడ భగవదపచారమే. “ఆ వస్తువులు మనం అడగడంలేదు, అయినా వాడు ఇస్తున్నాడు, స్వీకరించుటలో దోషమేమి లేదు కదా!” అని అనుకొన్నా భగవదపచారమే. ఇంకా చాలా భగవదపచారములను శాస్త్రం పేర్కొన్నది.

భాగవతాపచారం:

ప్రాథమికంగా ఇతర శ్రీవైష్ణవులను తనతో సమానమని కాని వారికన్న తాను అధికుడనని  భావించడం భాగవతాపచారం. ఇతర శ్రీవైష్ణవులకన్న తాను అల్ఫుడనని భావించాలి. ఈ విషయమున శ్రీ పిళ్ళై లోకాచార్యులు ఇలా అనుగ్రహిస్తున్నారు – మన శ్రీ వైష్ణవత్వ వృద్ధికి భాగవతాపచారం పరమ విరోధి. శ్రీ వచన భూషణం 190 నుండి 207 సూత్రం వరకు ఈ  భాగవతాపచారములను పేర్కొన్నారు, వాటి సారమును పరిశీలిద్దాం‌‌ –

 • బాహ్యముగా శ్రీవైష్ణవవేషం ధరించి (వస్త్ర ధారణ, ఊర్ధ్వ పుండ్ర ధారణ మొదలైనవి) భాగవతాపచారమున చేయుట. ఎలాగేతే చక్కగా మడత పెట్టిన ఒక వస్త్రం అగ్నికి ఆహుతి అయినప్పుడు బాహ్యంగా చూడడానికి అలాగే మడతపెట్టి ఉంటుంది. కాని గాలి వీచినప్పుడు చెల్లా చెదురవుతుంది.
 • వరాహ, నరసింహ, రామ, కృష్ణ మొదలైన భగవతారముల యందు హిరణ్య కశిపుడు, రావణుడు తన భక్తుల యందు చేసిన అపచారములను చూసి భగవానుడు సహింప లేక పొయ్యాడు. ఎందుకనగా ఈ సంసారమందు తన భక్తుల వేదనను సహింపలేని భగవానుడు  వివిధ అవతారములను ఎత్తాడు. భక్తుల రక్షణార్థం తాను ఎత్తిన అవతారముల రహస్యమును భగవద్గీత 4వ అధ్యాయమున ఇలా చెప్పుకున్నాడు – “యధా యధాహి” “పరిత్రాణాయ సాధూనామ్”  “బహూని మే వ్యతీతాని”, “అజోపి సన్” మరియు “జన్మ కర్మచ మే దివ్యాని”. గీతా భాష్యమున భగవద్రామానుజాచార్యులు మరియు తాత్పర్యచంద్రికలో వేదాంతాచార్యులు ఈ శ్లోకములను ఉదాహరిస్తు  తమ భాష్యమును రచించారు.

భాగవతాపచారములు:

 • జన్మ చేత కాని, ఙ్ఞానం చేత కాని, వృత్తి చేత కాని, ఆహార పదార్థముల భక్షణ చేతకాని, బంధువుల సంబంధము చేత కాని, జన్మించిన స్థలం చేత కాని, నివాస స్థలం చేత కాని  మొదలైన విషయముల ఆధారంగా  భక్తులను అవమానించడం / వివక్షత చూపడం భాగవతాపచారం.
 • వీటన్నింటిలో జన్మనాధారంగా చేసుకొని అవమానించడం చాలా అపచారం. ఇది భగవానుని అర్చావిగ్రహం ఏ లోహంతో తయారు చేయబడిందో అని విలువ కట్టడమంత దోషం. (మాతృ మూర్తి పవిత్రతను అవమానించడమంత దోషం)
 • మన పూర్వాచార్యులు శ్రీవైష్ణవులతో  వ్యవహరించేటప్పుడు, ప్రవర్తించు విషయ మందు చాలా కఠినమైన ప్రమాణాలను పాటించేవారు. వారితో చాలా అప్రమత్తంగా / జాగరూకతతో మెలగాలి. ఉదాహరణకు ఆచార్యులు కూడ తమ శిష్యులతో ఇలానే వ్యవహరించాలి. ఇలాంటి గౌరవాన్ని పాటించేవారు మన పూర్వాచార్యులు. కాని ఈ నాటి పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. శిష్యులెవరు తమ స్వాచార్యులకు కనీస మర్యాదను కూడ ఇవ్వడం లేదు కదా , “అతను అంత ఙ్ఞాని కాదు” “కావున అతనికి ఎలా మర్యాదనివ్వడం” అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. కావున ప్రతి ఒక్కరు తమ ఆచార్యులను విధిగా గౌరవించాలి ఇది భగవానుని గౌరవించడంతో సమానం.

భగవదపచార ఫలితములను ఇక్కడ చెప్పబడ్డాయి:

 • త్రిశంఖు ఇక్కడ ఉదాహరణంగా చెప్పబడుతున్నాడు – ఇతను తన ఆచార్యుడైన వశిష్ఠున్ని మరియు అతని కుమారులను ఈ పాంచ భౌతిక దేహంతో తనను స్వర్గమునకు పంపించాలని పట్టుబట్టాడు. కాని వారు దీనికి నిరాకరించి ఆగ్రహముతో అతనిని చండాలుడి (కుక్క మాంసం తినేవారు) గా మారమని శపించారు. అతనికి ఙ్ఞానమును అందించిన యఙ్ఞోపవీతమే చండాలుడు ధరించే పట్టీగా మారిపోయినది. ఇలా ఉన్నత స్థితిలో ఉండి శ్రీవైష్ణవులు తప్పుచేయుటకు ఉపక్రమిస్తే శాస్త్ర ప్రకారం చాలా తీవ్రమైన దండనను అనుభవించవలసి వస్తుంది. ఎలాగంటే దేశ ప్రధాన మంత్రి అవినీతిలో భాగం పంచుకుంటే అతనిని నీచంగా చూస్తారు, అదే సామాన్య పౌరుడు చేస్తే అంతగా పట్టించుకోరు.
 • తొండరడిపొడి ఆళ్వార్ ఇలా అంటున్నారు, “త్తమర్గళిల్ తలైవరాయ శాది అందణర్గళేలుం” – ఒకడు శ్రేష్ఠమైన బ్రాహ్మణ జాతిలో జన్మించి బ్రహ్మోపదేశం (గాయత్రి మంత్రోపదేశం) పొంది, వేదా భ్యాసం పూర్తి చేసుకొని పండితుడైనప్పటికీ ఒక వేల శ్రీవైష్ణవునికి (ఇతర ఙ్ఞానాష్ఠానములు లేక కేవలం భగవానుడే రక్ష అని విశ్వసించేవాడు)  అపచారం చేస్తే అతనికి  బ్రాహ్మణత్వం పోయి వెంటనే చండాలుడైపోతాడు. శ్రీవైష్ణవులకు ఎన్ని అపచారములు చేసినా నాకేమి కాలేదు అని భావించ రాదు. బాహ్యంగాగాని శారీరకంగా కాని  మార్పు కనబడక పోవచ్చు.
 • చాణ్డిలి – గరుడ సంఘటన (గరుడాళ్వార్ ఒక ఏకాంత ప్రదేశంలో / పర్వతంపై నివసిస్తున్న చాణ్డిలిని చూచి స్మరించినప్పుడు తన రెక్కలు కాలి పోయాయి – చాణ్డిలి అనే మహా భక్తురాలు ఒక పర్వతముపై నివసిస్తు భగవ ధ్యానం చేసుకొనేది. ఒక సమయమున గరుడాళ్వార్ ఆ పర్వతం మీదుగా వెళ్లుతూ ఈవిడని చూసి ‘ఏమిటి ఈ తపస్విని దివ్య దేశములో కాని పవిత్ర క్షేత్రములో కాని నివసిస్తు ధ్యానం చేసుకోవచ్చుగా అని తలచారు (భాగవతాపచారం) వెంటనే తన రెక్కలకు అగ్ని అంటుకుంటుంది. అనగా భాగవతులు ఏ ప్రదేశములో నివసిస్తే అదే గొప్ప క్షేత్రం – ఈ శ్రీ సూక్తి శ్రీ వచన భూషణం లోనిది)
 • పిళ్ళై పిళ్ళై ఆళ్వాన్ అనే వారు చాలా సార్లు భాగవతాపచారం చేయగా కూరత్తాళ్వాన్ వారికి భాగవత వైభవముని తెలిపి వారిని సరిదిద్ది  మరలా భాగవతాపచారం చేయకుండా నిరోధించారు.

చివరగా ప్రధానమైన విషయమమేమనగా, కేవలం ఆచార్య సంబంధము వలననే మనకు మోక్షం లభిస్తుంది, మన ఙ్ఞానానుష్ఠానముల చేత కాదు. అదే క్రమమున ఙ్ఞానానుష్ఠానమున్నను అపచారం చేయడం  వలన  సంసారమున అథోగతిని పొందుతాము.

అసహ్యాపచారం – సహ్యమనగా ఏ కారణం లేకుండ అని అర్థం. భగవంతునికి, ఆచార్యునికి లేదా శ్రీవైష్ణవులకు ఏ కారణం లేకుండ వారి యందు అపచారమునకు ఉపక్రమించుట.

 • భగవంతుని విషయ మందు- హిరణ్యకశిపు తాను భగవద్ వైభవాన్ని వినదలచు కోలేదు, భగవానుడు కూడ అతని యందు ఏ ద్వేష భావనను ఉంచు కోలేదు.
 • ఆచార్యుని విషయ మందు – అతని సూచనలు అనుకరించకపోవుట. అతడు సంపద, అదృష్ఠముల యందు అసమర్థుడని భావించుట.
 • భాగవతుల విషయ మందు- శ్రీవైష్ణవుల యందు అసూయపడరాదు.

ఈ అపచారములు ఉత్తరోత్తరం బలీయమైనవి. అనగా ముందు చెప్పిన అపచారముల కంటే తర్వాత చెప్పినవి పెద్ద అపచారములు. అకృత్య కరణముకన్న భగవదాపచారం, భగవదాపచారం కన్నా భాగవతాపచారం, భాగవతాపచారం కన్నా అసహ్యాపచారం బలీయమైనవి.

మన పూర్వాచార్యులందరు శాస్త్రముల యందు గౌరవ భావమునుంచే వారు, అలాగే ఎలాంటి అపచారమునకు ఉపక్రమించేవారు కాదు. మన గురుపరపరంలోని ఆచార్యులందరు తమ అవసాన దశలో తమ శిష్యులను ఇతర శ్రీవైష్ణవులను పిలిచి వారకి క్షమా ప్రార్థన చేసేవారు. వారి యందు  అపచారపడక పోయినను మన్నింప మని ప్రార్థన చేసేవారు. ఇదీ వారికి శాస్త్రముపై ఉన్న వినమ్రత, గౌరవం మరియు నమ్మకం.

ఈ అనుష్ఠానమే మనకు మార్గదర్శకం. మన జీవితమున దీనిని పాటించాలి. అనుష్ఠానము వలన ఙ్ఞానాధిక్యమగును. అనుష్ఠానమునకు ఉపకరించేదే ఙ్ఞానం. ఏ ఙ్ఞానమైతే అనుష్ఠానమునకు ఉపకరించలేదో అది అఙ్ఞానమే.

మనం స్పష్ఠముగా తెలుసుకోవలసినది ఏమనగా శ్రీవైష్ణవుల యందు ససేమిరా అపచారపడరాదు.  శ్రీవైష్ణవ అపచారం చేయరాదని శాస్త్రము నందు చెప్పిన విషయములను అనుష్ఠించి గ్రంథస్థం చేశారు మన పూర్వాచార్యులు. పూర్వాచార్యులు  మరియు సమకాలీన ఆచార్యులు మనం ఎలా జీవించాలో అనే విషయముపై చాలా గ్రంథాలు వ్రాశారు. ఈ గ్రంథములను చదివి  ఙ్ఞానము పెంచుకొని అనుష్ఠించాలని వారి అభిమతం.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాసు

మూలం : http://ponnadi.blogspot.com/2015/12/simple-guide-to-srivaishnavam-apacharams.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
చిన్నారుల కోసం శ్రీవైష్ణవం  – http://pillai.koyil.org