చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 3

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 2

గత అధ్యాయములో (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/12/01/charamopaya-nirnayam-ramanujar-our-saviour-2/) భగవద్రామానుజుల ఉత్తారకత్వ ప్రభావము పెద్దలు పొందిన కొన్ని అనుభవాల మూలముగా తెలుసుకున్నాము! ఇక ఈ అధ్యాయములో స్వామి వారి ఉత్తారకత్వ వైభవమును మరి కొన్ని ఐతిహ్యముల ద్వారా తెలుసు కుందాము!!

ఒకనాటి రాత్రి ఎంబార్ భగవద్ గుణానుభవము గావిస్తూ తిరు వీధులలో నడుస్తూ ఉండగా భట్టర్ వారిని సమీపించి అంజలి ఘటించి, “ద్వివిధములైన ఆచార్యత్వము (స్వాను వృత్తి ప్రసన్నాచార్యత్వము, కృపా మాత్ర ప్రసన్నాచార్యత్వము) మరియు తద్విషయ స్వీకారత్వమున్ను (స్వగత స్వీకారము, పరగత స్వీకారము) ద్వి విధములై ఉన్నందున ఎందులో చరించవలెనో దేవరవారే అనుగ్రహించ వలసింది!”, అని ప్రార్థించగా ఎంబార్, “కృపా మాత్ర ప్రసన్నాచార్యత్వము, పరగత స్వీకారమే ఉత్తమమైన మార్గములు! అవి ఉడయవర్ల విషయములో మెండుగా ఉన్నవని మేము గ్రహించితిమి! మీరు కూడా మిమ్ములను శ్రీ రంగనాధుడు తమ పుత్రునిగా స్వీకరించాడని, పరమ భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నులైన కూరత్తాళ్వాన్ పుత్రుడనని, సకల విద్యా పారంగతుడనన్న అహంకారము ఇత్యాది జాడ్యములను దరి చేరనీయక మా వలె ఉడయవర్లే ఉత్తారకులుగా నమ్మి వారి వద్ద ఉత్తారక ప్రతి పత్తి చేయండి!”, అని బదులిచ్చెను!

భట్టర్ నంజీయరుకు తిరువాయ్మొళి వ్యాఖ్యానమును కాలక్షేపమును అనుగ్రహించి నపుడు “ప్రత్యక్షే గురవః స్తుల్యః – ప్రత్యక్షములో ఆచార్యులు స్తుతించదగినవారు”, అను విధముగా నంజీయర్ భట్టర్ ను పలు విధములుగా స్తుతించి, “దాసుని శిరస్సుపై దేవర వారి శ్రీ చరణాల నుంచి దాసుని అనుగ్రహించి తరింప చేయండి!”, అని ప్రార్థించగా భట్టర్ అటులనే ఏకాంతముగా నంజీయర్ శిరస్సుకు తమ పాద స్పర్శనము చేసి ఇటులనిరి, “ఈ పాదాలు కాదు మీరు శరణు వేడవలసింది! ఆచార్య కటాక్షముపై మీకు నమ్మకము కలుగచేయుట కొరకే మేమెటులచేసితిమి! మీకు, మాకు, మిగిలినవారందరికి ఉడయవర్లే ఉత్తారకులు! వారే జీవులకు చరమోపాయము! ఈ సత్యమును మనస్సులో ఉంచుకుని తదేక నిష్ఠులై జీవించండి! లేక పోతే నిత్య సంసారిగా మిగిలి పోతారు జాగ్రత్త!” దీనివల్ల మనకు తెలియునదేమనగా ఉడయవర్ల శ్రీ చరణాలను ఆశ్రయించుటయే ఉజ్జీవనమునకు హేతువు! మిగిలినవి ఉజ్జీవకములుగా భావించుట అజ్ఞానము!

ఈ అర్థమును అముదనారు “ఇరామానుశ నూఱ్ఱందాది”లో చక్కగా అనుగ్రహించారు!

పొయ్యై చ్చురక్కుమ్ పొరుళై త్తురందు
ఇంద ప్పూదలత్తే మెయ్యై పురుక్కుమ్ ఇరామానుశన్ నిర్క
వేఱు నమ్మై ఉయ్యక్కొళ్ళవల్ల దైవ మిన్గు యాదెన్ఱు ఉలర్న్దు
అవమే అయ్యప్పడానిఱ్పర్ వైయ్యత్తుళ్ళోర్ నల్లఱి విళిన్దే! – 79వ పాశురము

భావము – అసత్య ప్రచారములు (వేదమును అంగీకరించని మతాలు) చేయు బాహ్యములను, మరియు కుదృష్టులను (వేదమును అంగీకరించియును తప్పుడు అర్థమును బోధించెడి మతములు) రూపు మాపి జనులకు నిజమైన జ్ఞానమును అందించుటకు శ్రీ రామానుజులు సిద్ధముగా ఉండగా ఈ లోకులు ఎందులకు వేరే దైవము వచ్చి తమను ఉద్ధరిస్తుందని ఎదురు చూస్తారు?

అని చెప్పడం చేత ఉడయవర్ల తరువాత జనులను ఉజ్జీవింపజేసేది ఇక భగవానుడే! అయితే చరమపర్వమగు ఉడయవర్లు వేంచేసి ఉండగా, ప్రథమపర్వమగు భగవంతుని ఆశ్రయించుట అజ్ఞాన కార్యమగును! మనవద్దకొచ్చిన చరమపర్వమును విడిచిపెట్టి విప్రకృష్టమగు ప్రథమ పర్వమును పట్టుకొనుట అజ్ఞానమే కదా!

ఎట్ట ఇరుంద కురవై ఇఱై ఎన్ఱు అన్ఱు విట్టు
ఓర్ పరనై విరుప్పురుతల్
పొట్టనైత్తన్ కణ్ సెంబళిత్తు కై తుఱత్తి నీర్ తూవి
అంబుదత్తై పార్తిరుప్పాన్ అన్ఱు -జ్ఞాన సారము – 33వ పాశురము

భావము – తనకు చేరువనున్న గురువును కాదని ఎక్కడో మనకు కనపడని దూరములో నున్న దైవమును ప్రార్థించుట ఎటులన్న దాహము గొన్నపుడు దరిలో నీరుండగా ఆకాశముకేసి చూసి వానకై నిరీక్షించి నట్టు ఉండును!
అని దృష్టాంత సహితముగా అరుళాళప్పెరుమాళ్ ఎమ్బెరుమానార్ అనుగ్రహించారు కదా!

(గమనిక – ఈ పాశురమును వ్యాఖ్యానించు సమయములో స్వామి మణవాళ మహాముణులు ఒక శ్లోకము చెప్పియున్నారు! అది “చక్షుర్గుమ్యం గురుం త్యక్త్వా శస్త్రగమ్యం తు యః స్మరేత్! కరహస్తం ఉదకమ్ త్యక్త్వా కా నస్థం ఆభివాఛతి !!” మహాముణులు జ్ఞాన సారము యొక్క గొప్పతనమును అవతారికలో అద్భుతముగా చెప్పియున్నారు! గ్రంథ కర్త అయిన అరుళాళ ప్పెరుమాళ్ ఎమ్బెరుమానార్ ఉడయవర్లకు ప్రత్యక్షంగా శుశ్రూష చేసి వారి వద్ద నేర్చుకున్న అత్యంత క్లిష్టతరమైన చరమోపాయమును బహు సులభముగా సామాన్యులకు అర్థమగు నట్లు చిన్న చిన్న ఉదాహారణలతో విశదీకరించి యున్నారు!)

“చరమపర్వమునకు తగనివాడు ప్రథమ పర్వమునకు కూడా తగడు!”, అని వంగి పురత్తు నంబి గారి సూక్తి! తదీయ శేషత్వ జ్ఞానము లేని వాడికి తచ్చేషత్వ జ్ఞానము కూడా లేకుండా ఉండును! భగద్విషయము నందు జ్ఞానము లేనివాడు దాన్ని పొందుటకు ఆచార్యుని ఆశ్రయించ వలెను! ఆచార్యాభి మాననిష్ఠుడు ప్రథమ పర్వ మందు తలదూర్చడు! ఆచార్యాభిమానము కోల్పోయిన వాడు భగవద్కృతమైన స్వరూప సంకోచమును పొందుతాడు! ఈశ్వరాభిమానమును కోల్పోయినవా డు ఆచార్యాభిమాన మందు ఒదిగి ఉండవలెను! చరమోపాయ నిష్ఠునకు ఈశ్వరాభిమానము అవసరం లేదని ఇక్కడ చెప్ప వచ్చు ! దీని బట్టి చెప్ప వచ్ఛేదేమిటంటే ఉడయవర్ల అభిమానము పొందని వానిని ఈశ్వరుడు కూడా విడిచి పెడతాడు! ప్రథమ పర్వమైన ఈశ్వరుడు దోషదర్శనము చేత చేతనుని విడిచి పెడతాడు! కానీ, చరమ పర్వమైన ఆచార్యుడు, అనగా, ఉడయవర్లు మాత్రం విడిచి పెట్టరు! ఉడయవర్ల శ్రీ చరణ సంబంధము పొందాక ఇక సద్గతి కొరకు భగవంతుని ప్రార్థన చేయ నక్కరలేదు కదా – అని అర్థము! “తేవు మత్తఱియేన్ మేవినేన్ అవన్ పొన్నడి మెయిమ్మయే – వేరొక దైవమెరుగను ! శ్రీ  శఠకోపుల బంగారు పాదములాశ్రయించాను (కణ్ణినుణ్-2)” అనువిధముగా జీవించినట్లైతే సద్గతి తప్పక కలుగును కదా! ఎందు కంటే ఆశ్రయించెడి చరణాలు “పొన్నడి – బంగారు పాదాలు” కనుక! ఈ విధముగా అన్ని ప్రకారములుగా అందరికి ఉత్తారకులు ఉడయవర్లే కనుక కొరత చెందే పని లేదు ! అటువంటి ఉడయవర్ల యొక్క అభిమానమును మనసారా పొందనివారు నిత్య సంసారులుగానే మిగిలిపోతారు!

ఉడయవర్ల శ్రీ చరణాలు ఆశ్రయించిన వారు వారి తిరు నామమును నిత్యమూ స్మరించు కోవాలి! అముదనార్లు ఉడయవర్ల యొక్క తిరునామము యొక్క గొప్పతనమును వారి యొక్క శ్రీ చరణ కమల ప్రావణ్య జనకముగా ఈ విధముగా చెప్పియున్నారు, “ఇరామానుశన్ చరణారవిందం నామ్ మన్ని వాళ నెంజే! సొల్లువోమ్ అవన్ నామంగళే! – ఇరామానుశ -1” అని చెబుతూ, “నామ్ మన్ని వాళ  అవన్ నామంగళే సొల్లువోమ్!” అని చెప్పుట వలన ఉడయవర్ల యొక్క నామజపము చేయని యెడల వారి యందు భక్తితో జీవించ లేమని అర్థము! వారిని ఆశ్రయించి జీవిస్తున్నట్లైతే శ్రీ రామానుజ నామస్మరణ అనుసంధించవలెనని అదే వారి శ్రీ పాద కమలాల యందు ప్రావణ్యమును పెంపొందింప జేయగలదని అర్థము! ఈ విధముగా ఉడయవర్ల తిరునామమును అనుసంధించు కొనుచు వారి శ్రీ చరణాలను ఆశ్రయించిన వారికి ప్రాప్య ప్రాపకములు రెండూ వారే కదా! “పేఱొన్ఱు మత్తిల్లై నిన్ చరణన్నిఅప్పేఱళిత్తర్కు యారొన్ఱుమిల్లై మత్త చ్చరణన్ని- ప్రాప్యము ఏది లేదు నీ శ్రీచరణాలు తప్ప! ఆ ప్రాప్యమును ఇచ్చునట్టి ప్రాపకమూ వేరేదీ లేదు నీ శ్రీ చరణాలు తప్ప – ఇరామానుశ – 45” అని ప్రాప్య ప్రాపకములు రెండూ ఉడయవర్ల యొక్క శ్రీ చరణాలే అని ఉద్ఘాటించారు అముదనార్లు!

వడుగ నంబి ఒకనాడు ఉడయవర్ల సభలోకి ప్రవేశించి ఉడయవర్లకు దండం సమర్పించి నిలుచుంటే, ఉడయవర్లు వారిని ఉద్దేశించి, “మన మధురకవులు వచ్చారు!” అన్నారుట! నమ్మాళ్వారుకు ఒక మధురకవులు ఉన్నారు కదా! అంత అభిమానము వడుగ నంబి మీద ఉడయవర్లకు! వడుగ నంబి కూరత్తాళ్వార్లను, ముదలియాణ్డాన్ ను ఉద్దేశించి, “ఇరుకఱైయర్- ఇరుతీరాలవారు”, అని పిలిచేవారుట! అంటే శ్రీ రామానుజులు, భగవంతుడు అంటే రెండు తీరాలను పట్టుకుని ప్రవహించే శుద్ధ గంగానది వంటి వారని వారి ఉద్దేశ్యము!

ఒకనాడు ఉడయవర్లు వడుగ నంబిని పిలిపించి, “వడుగా! ఆచార్యాభిమాన నిష్ఠుడు ఎలా ఉండవలెను?”, అని అడుగగా నంబి, “వేంబిన్ పుళుపోలే ఇరుప్పన్ – వేపలోని పురుగువలె ఉంటాడు”, అన్నారుట! దానికి అర్థము వేప చెట్టును పట్టుకుని బ్రతికే పురుగు వేపరుచి తప్ప వేరు రుచి ఎరుగదు!  “కఱుమ్బిన్ ఫుళు – చెఱకులోని పురుగు” వలె అన్య ఆస్వాదనాలాలస కలుగనిదై ఉండును! అదే విధముగా ఆచార్యాభిమాన నిష్ఠుడు కూడా వేప పురుగు వలె ఒక ఆచార్యుని మాత్రమే ఆశ్రయించి వారి అనుగ్రహము చేత ముక్తిని పొందుతాడు తప్ప వేరు ఆలోచన కూడా మనసుకు రానీయడు! మరి ఇక్కడ చెఱకు పురుగు అంశం ఎందుకంటే ఆచార్యుడు ఎంత దయాళువై ఉన్ననూ తననే నమ్ముకుని ఉన్న శిష్యుని పట్ల విరసభావమును పొంది ఘాతుక దశలో ఉన్ననూ, “నానున్నై యన్ఱి ఇలేన్ (నాన్ముగన్ తిరు -7 ) – నిన్ను వదిలి నేను ఉండలేను” అనువిధముగా ఆచార్యుడు లేకపోతే వేరు గతి లేదను ప్రగాఢ నమ్మకంతో, “కళైకణ్ మఱ్ఱిలేన్ (తిరువాయ్మొళి-5-9-8) – వేరు రక్షకుడు లేనివాడను”, అన్నంత ఆచార్య అభిమాన నిష్ఠ కలిగి ఉండవలెను! అందుచేత ఉడయవర్ల విషయములో ఒదిగి ఉన్నవాడు తదేక నిష్టుడై ఉండి తద్వ్యతిరిక్త విషయములలో ఆసక్తి లేనివాడై ఉండవలెనని అర్థము! అత్యంత గొప్పదైన పరమోత్కృష్టమైన వస్తువు సొంతమైతే ఇంక మిగిలిన విషయములు అవసరము లేదు కదా! “పల్లుయిఱ్కుమ్ విణ్ణిన్ తలైనిన్ఱు వీడళిప్పాన్ నమ్మిరామానుశన్ -(ఇరామానుశ – 95) పలు జీవులకు పరమపదములో తన పురుషకారము చేత చోటు ఇప్పిస్తారు శ్రీ రామానుజులు” అని ఉడయవర్ల యొక్క  గొప్పతనమును చెప్పారు కదా సకల శాస్త్ర ప్రావీణ్యులైన అముదనార్లు!

నంబిళ్ళై ఒకనాడు ఉడయవర్ల సన్నిధికి వెళ్లి దండము సమర్పించి, నూఱ్ఱందాది అనుసంధించి, “ఈనాడు దాసుడుకి ఒక హితమును అనుగ్రహించండి!”, అని ప్రార్థించారుట! ఆనాటి రాత్రి ఉడయవర్లు స్వప్నములో దర్శనమిచ్చి తమ తిరువడిగళ్లను నంబిళ్ళై శిరస్సుపై ఉంచి ‘మీకు హితము చేకూరవలెననిన మా పాదాలే రక్షకముగా భావించండి! మిమ్మలను ఆశ్రయించినవారికి కూడా వీటినే రక్షకములుగా ఉపదేశించండి! దీనిని మించిన హితము లేదు!'”, అని ఉపదేశించిరి! నిదురలేచిన నంబిళ్ళై ఆనంద బాష్పాలతో పరవశులై తమ కుమారుడైన పెరియ వాచ్చాన్ పిళ్ళైని పిలిచి స్వప్న వృత్తాన్తమును చెప్పి సంతోష పడిరి! నంబిళ్ళై చరమ దశలో ఉండగా వారి కుమారులు సమీపించి తమకు దిక్కేది బాధపడు చుండగా నంబిళ్ళై, “ఎమ్బెరుమానార్ల శ్రీ చరణాలు మనకు రక్షకములు! వేరు హితమేమి అవసరము? వారి అభిమాన మందు అన్తర్భూతులై ఉంటే మన హితము కొరకు ఆలోచించాల్సిన అవసరము రాదు! అదే నిష్ఠతో జీవితము గడపండి! నేను పొందే పరమపదము మీకు కూడా లభిస్తుంది!”, అని ఉపదేశించారుట !
ఇక వచ్చే అధ్యాయములో ఈ గ్రంథము యొక్క ముగింపు విషయములను తెలుసుకుందాము!

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము:  https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujar-our-saviour-3.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s