Monthly Archives: December 2018

ద్రమిడొపనిషత్ ప్రభావ సర్వస్వం 8

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 7

 

 

పుండరికాక్షనే పరబ్రహ్మం (పుండరీకాక్షుడే  పరమాత్మ )

చాందోగ్యోపనిషత్తులో  పుండరీకాక్షుడే పరమాత్మ అని, ‘తస్య యదా కప్యాసం పుండరీకాక్షిణి’ అన్న వాక్యంలో చెప్పబడింది. స్తోత్రరత్నంలో ఆళవందార్లు పరమాత్మను వర్ణించే సందర్భంలో ‘కః పుండ రీకాక్ష నయనః’ అని అన్నారు. కావున కమల నయనుడైన వాసుదేవుడే పరబ్రహ్మం అని శృతి వాక్యం.

తిరువెళ్ళరై – పుండరీకాక్ష భగవాన్

వివరణలో వచ్చిన చర్చలు :

యాదవప్రకాషులు

ఈ చాందోగ్యోపనిషత్తు శ్లోకం గురించి విస్తృత చర్చ జరిగింది. దీనికి యాదవ ప్రకాశులు పరమాత్మ కన్నులు ఎర్రగా మర్కటం పృష్ఠభాగం లాగా ఉంటుంది అని వివరించారు. ఈ వివరణ పరమాత్మను కించపరిచేదిగాను, తక్కువ చేసినదిగాను ఉంది. భగవద్రామానుజులకు మనఃక్లేశాన్ని కలిగించింది అని చరిత్ర .

 

శ్రీశంకరాచార్యుల  వివరణ:

శ్రీశంకరాచార్యులు ఈ విషయంగా వివరిస్తూ పరమాత్మ కళ్ళను మర్కటం పృష్ఠభాగంతొ పోల్చరాదు అన్నారు. ఇంకా పరమాత్మ కళ్ళను తామరతో పోల్చతగినది అన్నారు.  ఈ విధంగా శ్రీశంకరాచార్యులు పరమాత్మ కళ్ళను తామరతో పోల్చి పరమాత్మ పుండరీకాక్షుడని నిరూపించటం వలన ఉన్నతమైన పరమాత్మ లోని ఒక అవయవాన్ని నీచమైన మర్కటం పృష్ఠభాగంతొ పోల్చనీయకుండా విజయం సాధించారు, శృతి ఈ విషయంగా తామరను గురించి మాత్రం చెప్పితే సరిపోతుంది కదా, ఇంకా మర్కటం పృష్ఠభాగం గురించి ఎందుకు చెప్పిందని తృప్తికరంగా వివరించలేదు .

భగవద్రామానుజుల వివరణ:

కప్యాసం అన్న శబ్దం తామరకు ఎలా సరిపోతుందో వివరించి రామానుజులవారు ఈ చర్చకు ముగింపు చెప్పారు. అది ఎలాగంటే పరబ్రహ్మం పుండరీకాక్షుడని ప్రస్పుటంగా చెప్పటమే వేదాంతము యొక్క ఉద్దేశ్యము. మర్కటం పృష్ఠభాగం అన్న విరోధ భావానికి మారుగా ఉపనిషత్తు పరమాత్మ కళ్యాణ గుణాలను విభ్రమంగా చూసింది. భగవద్రామానుజుల చక్కటి వ్యాఖ్య వలన కుద్రుష్టుల భారి నుండి వేదాంతం తప్పించుకో కలిగింది.

 

భగవద్రామానుజులు అనుగ్రహించిన మూడు అర్థాలు;

  1. కం పిబతి ఇతి కపి= ఆదిత్యః  తేన్ అస్త్యతే క్షిప్యతే వికాసతే ఇతి కప్యాసం

సూర్యుడిచే  వికసింప బడిన  తామర పువ్వు

నీటిని తాగేది కపి. సూర్యుడు నీటిని పీల్చడం వలన కపి  అని పిలవ బడుతున్నాడు. కప్యాసం అనగా సూర్యుడి వలన వికసింపచేసేది. తామరకు సంకేతంగా ఉండి అప్పుడే సూర్యుడిచే  వికసింప బడిన  తామర అన్న అర్థం వస్తుందని చెప్పారు.

 

 

  1. కం పిబతి ఇతి కపి= నాళం ,తస్మిన్ అస్తే ఇతి కప్యాసం .

బలమైన తూడులుగల తామర

కపి అంటే నీటిని తాగేది ఎదో అది కపి. తామర తూడు నీటిని తాగుతుంది అందు వలన అది కపి. కప్యాసం పుండరీకం అంటే నీటిలో ఉండి తూడుచే భరించ బడుతున్నదానిని చెపుతున్నది.

 

3. కం జలం ఆచ ఉపవేసనే ఇతి జలేపి ఆస్తే ఇతి కప్యాసం

నీటిలో  ఒక అందమైన తామర

కం అంటే జలము. నీటిలో నిలబడేది కప్యాసం. ఇక్కడ కప్యాసం పుండరీకం అంటే నీటిలో ఉన్న ఒక అందమైన తామర అని అర్థం .

 

ద్రమిడాచార్యులు తమ వ్యాఖ్యానంలో ఆరు అర్థాలను చెప్పినట్లు శ్రుత ప్రకాసిక వలన తెలుస్తున్నది. ఇందులో మూడు మర్కటం సంబందంగా ఉండటం వలన అవి పూర్వ పక్షం చేయబడ్డాయి. మిగిలిన మూడు పరబ్రహ్మాన్ని పుండరీకాక్షుడుగా చెప్పటం వలన అవి యుక్తముగా ఉన్నవని  స్వీకరించబడ్డాయి. ఈ అర్థాలు రామానుజులచే అందంగా శృతి యుక్తంగా చక్కగా వివరించబడ్డాయి.

వేదర్తసంగ్రహంలో ఈ అర్థాలు చాలా సులభంగా చెప్పారు.

‘గంభీరాంపశ్చముద్భూత సమృష్ట నాళ రావికర వికసిత పుండరీక తలామలాయతేక్షణ ‘

‘ కప్యాసం’  అంటే పై పై అర్థం చూస్తే ఈవిశేష విషయాలు స్పురించవు. మరి రామానుజులు ఈ అర్థాలను  ఎలా చెప్పారని ఆశ్చర్యం కలగడం సహజం. ఆళ్వార్ల శ్రీసూక్తులను అనుభవించటం వలననే ఈ అర్థాలు స్పురిస్తాయనడం లో సందేహం లేదు.  ఆళ్వార్ల శ్రీసూక్తులలో  ఈ విషయానికి సంబందించిన పాశురాలను అనుభవించి నప్పుడు ఈ విషయం చక్కగా బోధపడుతుంది.

రామానుజుల ఆళ్వార్ల శ్రీసూక్తులలో ఏ ఏ భాగాలను అవగాహన చేసుకొని ఈ వివరణ ఇచ్చారన్నది తరువాతి భాగాలలో అనుభావించవచ్చు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/05/dramidopanishat-prabhava-sarvasvam-8/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

 

ద్రమిడొపనిషత్ ప్రభావ సర్వస్వం 7

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 6

కళ్యాణ గుణ సాగరం

           పూర్వాచార్య గ్రంధాలలొ భగవంతుడిని సకలకల్యాణగుణ పరిపూర్ణుడుగా  వర్ణించారు. అవి ఎంత అంటే సముద్ర మంత అనిచేప్పుకోవాల్సిందే .

           స్వామి రామానుజులు పలుసందర్భాలలో పరమాత్మా గురించి చెప్పేటప్పుడు అసంఖ్యాక కళ్యాణగుణ ములు అని వర్ణించడం తెలిసిన విషయమే .

           శ్రీభాష్యంలో ‘అనంత గుణసాగరం’  అని  ‘అపరిమితోధార గుణసాగరం’ అని ప్రయోగించారు. ఉదాహరణకు శ్రీభాష్యం రెండవ అధ్యాయం అవతారికలో

‘ప్రధమే అధ్యాయే ప్రత్యక్షాది ప్రమాణ గోచరాత చేతనాత్ తత్సంసృష్టాత్ వియుక్తాచ్చ చేతనాత్ అర్థాంతరభూతం నిరస్త నిఖిల అవిధ్యాది అపురుషార్థగంధం అనంత జ్ఞానందైకతానం అపరి మితోధార గుణసాగరం నిఖిల జగత్కారణం సర్వాంతరాత్మభూతం పరం బ్రహ్మం వేదాంతం ఇత్యుక్తం .’

దీని భావము: …..వేదాంత సూత్రములోని మొదటి అధ్యాయంలో పరబ్రహ్మ ఇంద్రియములకు అందక భౌతిక రూపంతో ఉండే జీవాత్మల నుండి వేరుగా, ఈ వస్తువుల నుండి విడివడి, అజ్ఞానము వంటి సకల దోషములకు అతీతముగా, అంతులేని జ్ఞానానందములకు మూలస్థానమై  గుణరత్నాకరమై సమస్త చరాచరములకు తాను ఒక్కడే కారణమై సకల పదార్థాలకు అంతర్యామియై ఉన్నాడని  వేదాంతములు తెలియచేస్తున్నది .

             ఈ వాక్యంలో పరబ్రహ్మ అని ప్రధామావిభక్తిలో ఉంది కానీ ద్వితీయా విభక్తిలో లేదు. ఈ దృష్టితోనే ఈ పంక్తినిలోని పాదాలకు అర్థాలను చూడవలసి ఉంది.  ‘ అపరిమిత ఉదార గుణ సాగరం’ అన్న పదం తత్పురుష సమాసములో చూడకూడదు. ఎందుకంటే ‘గుణ సాగరః’  అన్న పదములో ‘సాగరం‘ అన్నది పుంలింగ ప్రయోగము. కావున ‘అపరిమిత ఉదార గుణ సాగరః’ అని వుండాలి. కానీ ఇక్కడ ‘గుణ సాగరం‘ అని నపుంసక లింగలో వుంది. అందువలన దీనిని తగిన బహువ్రీహి సమాసం ’ ‘అపరిమిత గుణ సాగరః  యస్య తత్’ అని కానీ  ‘అనంత  గుణ సాగరః యస్య తత్’  అని వుండాలి. శ్రుత ప్రకాశికాచార్యులు కూడా దీనిని బహువ్రిహిగానే స్వీకరించారు.

            ఈ రెండు విగ్రహవాఖ్యాలకు అర్థము మారుతుంది.  భగవంతుడే సముద్రము, నీటి సముద్రము కాదు. దివ్యగుణ సాగరము అని తత్పురుష సమాసార్థము. బహువ్రీహి  సమాసార్థములో గుణములే సాగరము, ఆ సముద్ర మంత గుణములు కలవాడు భగవంతుడు. రెండవ అర్థమే ఇక్కడ సరిపోతుంది.

            పలు సందర్భాలలో భగవంతుడు గుణసాగరంగా  వర్ణించబడటం జరిగింది. కానీ అయన గుణములను సముద్రంగా కొన్ని సందర్భాలలోనే చెప్పబడింది. ఆచార్యుల వ్యాఖ్యానాలలోను. రామానుజులవారి రచనలలోను మాత్రమే ఇలా వర్ణించబడింది.  ఎవరైనా ఆచార్యులు భగవంతుడి గుణములను సముద్రంతో  పోల్చివర్ణించారంటే వారు శ్రీవైష్ణవ ఆచార్య పరంపరకు చెందిన వారు అని బోధపడుతుంది.

        రామానుజులవారు దీనిని ఒక ఉదాహరణగా ఉపయోగించలేదు. వారు ఆళ్వార్ల శ్రీసూక్తులను  లోతుగా మదించినవారు. కావున వారు ఇలా రాయలేరు. పెరియ తిరువందాదిలో నమ్మాళ్వార్లు ‘మికుం తిరుమాల్ సీర్కడలై యుళ్ పోదిమ్డ సింద నైయేన్’  (69 ) అని అన్నారు. ఇందులో పరమాత్మ దివ్యగుణాలను సముద్ర ముతో పోలుస్తున్నారు. అగస్త్యులు ఉప్పు సముద్రాన్ని తాగారు. మేగాలు సముద్రపు నిరు తాగినట్లు  ఆళ్వార్లు ఆచార్యులు భగవంతుడి గుణముల సముద్రాన్ని తాగారు. ఈ విషయాన్ని తెలియజేయటం కోసమే స్వామి బహువ్రీహిని ప్రయోగించారు.

       

                 
నాథముని              ఆలవందార్లు                నమ్మాల్వార్లు        తిరుమంగై ఆళ్వారు

పెరియ వాచ్చాన్ పిళ్ళై

ఇక్కడ ఇలాంటిదే మరొక వివరణ కూడా చూదగినది. స్తోత్రరత్నంలో ఆళవందార్లు నాధమునులను ‘అగాధ  భగవద్భక్తి’ నాధమునుల భక్తి అగాధమైనదని చెప్పారు. ఇక్కడ నాధమునులే ‘భక్తిసముద్రమా?’  (తత్పు రుష) లేక భక్తి అనే సముద్రము కలవాడా? (బహువ్రీహి) అన్న ప్రశ్న ఉదయిస్తుంది. వ్యాఖ్యాన చక్రవర్తి పెరియ వాచ్చాన్ పిళ్ళై ఆళ్వార్ల మనసెరిగి బహువ్రీహిగానే నిర్వహించారు. దానికి వారు నమ్మాళ్వార్ల ‘కాదల్ కడలిన్ మిహ పెరిదు (ప్రేమ సముద్రము చాలా పెద్దది) ‘(తిరువాయిమోళి 7 -3 -6)  అన్న పాశురంలో తిరుమంగై ఆళ్వార్ల ‘ఆసై ఎన్నుం కడలిల్’ (ప్రేమ అనే సముద్రము)  (పెరియ తిరుమొళి 4-9-3) అన్న పాశురాన్ని ఉదాహరణగా చూపించారు. ఇది శ్రీవేదాంత దేశికులచే ఆదరించబడినది. వారు తమ వ్యాఖ్యానంలో ముందు తత్పురుష అర్థాన్ని తరువాత బహువ్రీహిని  చెప్పారు. ‘భక్తింవా సిందుత్వేన  రూపయిత్వాబహువ్రీహి’ భక్తిని ఒక సముద్రంలా వివరించారు.                 

అడియేన్ చూడామణి రామానుజ దాసి 

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/05/dramidopanishat-prabhava-sarvasvam-7/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 6

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 5

ఆళ్వార్లు – భగవద్రామానుజాచార్యలు – 2

 

పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ……

                     భగవద్గీత నాలుగవ అధ్యాయంలో ‘ పరిత్రాణాయ సాధూనాం..’ అన్న శ్లోకం ఉంది. దీని అర్థము సామాన్యులకు కూడా సులభంగా అర్థమవుతుంది. మంచిని రక్షించి చెడును తోగించి ధర్మమును స్థాపించటానికి  ప్రతి యుగంలోను అవతరిస్తాను అని పరమాత్మ చేతనులకు దృడంగా చెపుతున్నాడు.’ మంచి, రక్షణ ,నాశము , చెడు,ధర్మము  అన్న పదాలను ఇందులో అర్థం చేసుకోవలసిఉంది. వీటి అర్థాలను ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు చెప్పుకోవచ్చు. కాని భగవద్గీతలో ఏ అర్థంతో చెప్పారో తెలుసుకోవలసి వుంది. స్వామి 

రామానుజులు భగవద్గీత మొత్తం దృష్టిలో వుంచుకొని ఈ శ్లోకానికి అర్థం చెప్పారు.

 

‘సాధు జనులు ఎవరు?’

              కృష్ణుడిచే రక్షింపబడు  సాధు జనులు ఎవరు? అని తెలుసుకోవటం చాలా రసవత్తరమైన

12 ఆళ్వారులు

విషయము. స్వామి రామానుజులు ఈ విషయాన్ని వివరించేటప్పుడు అళ్వార్లను స్మరించారనడమే న్యాయంగా ఉంటుంది. వారు సాధు జనుల గురించి చెప్పేటప్పుడు అళ్వార్లకు సంబంధించిన పలు సుగుణాలను చెప్పారు.అవి , శ్రీవైష్ణవులకే కాక సామాన్యులకు కూడా తెలియజేయాలని భావించి చెప్పినవి.

 

గీతా భాష్యంలో స్వామి ఈరకంగా వివరించారు.

సాధువు: ఉక్తలక్షణము – ధర్మశీలా వైష్ణవాగ్రేసరాః మత్సమాశ్రయణే ప్రవృత్తాః మన్నామకర్మ-స్వరూపాణాం వాగ్మనసాగోచారతయా మద్దర్శనేన వినా స్వాత్మధారణపోషణాదికమలభమానాః క్షణమాత్రకాలం కల్పసహస్రం మన్వానాః ప్రశిథిల-సర్వ-గాత్రా భవేయురితి మత్స్వరూప చేష్టితావలోకనాలాపాదిదానేన తేషాం పరిత్రాణాయ!’

ధర్మశీలా—వారు నియమింపబడిన ధర్మాన్ని తమ అర్హతగా కలిగిఉన్నవారు. ” ధర్మ ” అనే ప్రయోగంలో  సాధారణ  ధర్మాన్ని స్వీకరించవచ్చు. లేక విశేష వైష్ణవ ధర్మాన్ని తెలియ జేసేదిగాను స్వీకరించవచ్చు’ అని ఉండటం వలన ముందు చెప్పిన అర్థము , తరవాత ‘ వైష్ణవాగ్రేసరాః ‘ అని ఉండటము వలన తరువాత చెప్పిన అర్థము కూడ అన్వయిస్తుంది.

వైష్ణవాగ్రేసరాః  — వీరు వైష్ణవులలో ప్రధములు. ఇదే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడిన విషయము. రామానుజ సంప్రదాయంలో ఆళ్వార్లే ఉన్నతమైన శ్రీవైష్ణవులుగా చెప్పబడ్డారు. వైష్ణవాగ్రేసరాః అన్న ప్రయోగం వారి ఉన్నతమైన స్థానాన్ని చూపిస్తుంది.

మత్సమాస్రయేణ పవిత్రాః —నన్నే ఆశ్రయించాలని తలచినవారు. ఇది ‘ తుయరఱు సుడరడి తొళుదెళు’, (దుఃఖాన్ని  తొలగదోసే ప్రకాశమానమైన శ్రీపాదాలు)   ‘ ఆళివణ్ణ నిన్ అడియిణైయై అడైందేన్ ‘ (మెఘవర్ణా నీ శ్రీపాదాలను చేరాను) వంటి ఆళ్వార్ల శ్రీసూక్తిగా చెప్పబడినవి.

మన్నామక్రమ స్వరూపాణాం వాగ్మనసాగోచరతయా —— ‘ఎన్ సొల్లిసొల్లుహేన్? ‘ (ఏమని చెప్పను)   ‘ నెంజాల్ నినైప్పరిదాల్ వెణ్ణెయై ఊణ్ ఎన్నుం ఈనచొల్లే’ (మనసులో స్మరించ లేనందున వెన్నను కూడా ఆహారం అని హీనమైన మాట) అని ఆళ్వార్లు పరమాత్మ దివ్య నామాలు, దివ్య చేష్టితాలు మనసును,  మాటను చిలికినవని గ్రహించినవారు.

మద్దర్శనేన వినా స్వాత్మధారణపోష్ణాదికమలభమానాః —–ఆళ్వార్లు  పరమాత్మను స్మరించకుండా, చూడకుండా తరింపలేరు. ‘ తొల్లై మాలై కణ్ణార కండు కళివదోర్ కాదలుఱ్ఱార్క్కుం ఉండో కణ్గళ్ తుంజుదలే ‘(పొద్దు మాపు కనులార కాంచి కరగిపోయాక ప్రేమించినవారికి కనులు వాలుతాయా!), ‘ కాణవారాయ్ ఎన్నెండ్రు కణ్ణుం వాయుం తువర్దు ‘ (కానరావా అని కళ్ళు నోరు తెరుచుకొని) అన్న పాశుర భాగాలలో ఈ విషయం స్పష్టమవుతుంది.

 క్షణమాత్రకాలంకల్పసహస్రం మన్వానాః—ప్రమాత్మను క్షణకాలమైనా వీడి వుండటాన్ని  ఆళ్వార్లు ఒక యుగకాలంగా భావిస్తారు. వారి మాటలలో ‘ ఒరు పగల్ ఆయిరం ఊళియాలో ‘(ఒక పగలు వేయి యుగాలు కావా)   ‘ ఊళియిల్ పెరిదాయ్ నాళికై ఎన్న్మ్’ (యుగమంత దీర్గమైన రోజు), ‘ఊయుం పొళిదిన్ఱి ఊళియాయ్ నీండదాల్ ‘ (వాలే పొద్దు యుగంలాగా దీర్గంగా) అన్న పాశురభాగాలను చూడవచ్చు.

 ప్రశితిల సర్వగాత్రాః—-పరమాత్మతో చెరినప్పుడు ఆళ్వార్ల తిరుమేని అలసి సొలసి పోయిందట. కలసినప్పుడు ఆనందం వలన అలసట, దూరమైనప్పుడు దుఃఖంతో సొలసి పోవటం. ‘కాలాళుం, నెంజళీయుం, కణ్ సుళలుం’ , ‘కాలుం ఎళా కణ్ణ నీరుం నిల్లా ఉడల్ సోర్దు నడుంగి కురల్ మేలుం ఎళా మయిర్కూచ్చమఱా ‘ , ‘ ఉళ్ళెళ్ళాం ఉరుక్కి కురల్తళుత్తుళిందేన్ ‘ , ‘ ఉరోమ కూపంగళాయ్కణ్ణ్నీర్గళ్ తుళ్ళ శోరత్తుయిలణై కొళ్ళేణ్ అని అన్నారు.

సంగ్రహంగా ‘ఒక సాధు వైష్ణవ గొష్టిలో నాయకులుగా ఉంటారు, ధర్మ పరిపాలనలో ప్రధములుగా, కృష్ణుడిగా నన్నే శరణమని తలచేవారు, నా నామాలు చేష్టితాలను దివ్యమైనవిగా, మనసులోను, మాటలోను నిండి వున్నవిగా భావించేవారు,  వీటి అనుభవము లేక పోతే తరించలేని వారు, నా స్వరూప స్వభావాన్ని తరించలేని వారు, నా వియోగాన్ని ఒక క్షణాన్ని యుగముగా భావించేవారు, సాదు వైష్ణవులు. పరమాత్మతో ఉన్న సంబంధము అంతరంగమైనదిగా భావిస్తారు.

          దయామయుడైన పరమాత్మ కృప చూపి దుఃఖాన్ని పోగొట్టడం కోసం యుగయుగాలుగా ఎన్నో అవతారాలనెత్తాడు, ఆయన తనను తన భక్తులకు చూపిస్తున్నాడు. వారికి తన దివ్య దర్శనాన్ని ఇచ్చి తన దివ్య చేష్టితాలను చూపి వారితో దగ్గరి సంబంధాన్ని నేర్పి ఉజ్జీవింపచేస్తాడు. దీనినే సాధు సమ్రక్షణం అంటారు.

ఈ వ్యాఖ్యానము యొక్క ముఖ్య ఉద్దేశ్యము:

                            ఈ వ్యాఖ్యానము భగవద్గీతలోని అంతరార్థాన్నిపోలి ఉన్నది .  అందువలన వైష్ణ వ తత్వానికి బయట ఉన్న వారికి కూడా స్వామి  వ్యాఖ్యానము కృష్ణుడి తత్వము సుబోధకంగా ఉంటుంది.

                   సాధు భక్తితో పాటు ఆళ్వార్ల తత్వాన్ని కూడా చెప్పడం వలన సామాన్యులకు కూడా అర్థమయ్యే ఒక ఉన్నతమైన  వ్యాఖ్యానంగా అమరింది .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/04/dramidopanishat-prabhava-sarvasvam-6/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org