శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీ వైష్ణవులు తమ రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానార్ వంగి పురత్తు నంబికి వివరించారు. వంగి పురత్తు నంబి ఈ ఉపదేశాలను వాటి వ్యాఖ్యానమును ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పరిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.
ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.
1. స్వర్గత్తుక్కు సంసారం విరోధి – సంసారం (ఈ సందర్భంలో – ఈ శరీరానికి సంభందించినది) స్వర్గపు సుఖాలకు విరోధి.
సాధారణంగా స్వర్గం అంటే దేవతల స్వర్గపు గ్రహాలని అర్థం. ఇంద్రుని గ్రహం స్వర్గం అని పిలువబడుతుంది. స్వర్గలోకం ఈ భూమిపైన కనిపించని అనేక సుఖాలతో నిండి ఉంది. కానీ స్వర్గమార్గాన్ని అనుసరించడానికి అనేక తపస్సులు చేయవలసి ఉంటుంది. ఈ సందర్భంలో భూలోకంపైన (సంసారంలో) జీవితం వారి వారి కర్మ ఫలితంగా లభిస్తుందని సూచన. సాధారణంగా వాటిని తపస్సుకు అడ్డంకులుగా పరిగణిస్తారు. వారి శరీరం, బంధువులు (భార్య, పిల్లలు, మొదలైనవి), ఆస్తులు (భూమి, సంపద మొదలైనవి) వారి తపోనిష్ఠకి అడ్డంకులు, కావున వాటిని పరిత్యజించాలి.
అనువాదకుని గమనిక: “ౙ్యోతిష్థోమేన స్వర్గ కామో యజేత” స్వర్గాన్ని కోరుకునే వారు ౙ్యోతిష్థోమం చేయవలిన అవసరం ఉంది – ఈ హోమానికి కఠినమైన నిష్ఠ అవసరం.
2. స్వర్గేచ్చువుక్కు ఐహిక సుఖం విరోధి – పరలోక సుఖాలను కోరేవారికి ఈ భూలోక సుఖాలు విరోధి.
మునుపటి సూత్రానికి సరూపముగా, పరలోక సుఖాలను ఆస్వాదించే కోరిక ఉన్నవారికి, ఈ భూలోక ప్రపంచంలోని వ్యవహారాలు / సుఖాలు అడ్డంకులుగా ఉంటాయి. భూలోక సుఖాలపై ఎక్కువ మక్కువ ఉన్నట్లయితే, అది పరలోక నివాసాలను కోరేవారి నిష్ఠను భంగపరుస్తుంది.
అనువాదకుని గమనిక: ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది – స్వర్గానుభవం గురించి ఇక్కడ ఎందుకు ప్రస్తావించబడింది అని? ఇది ప్రపన్నులకు ఎలా సంబంధించినది అని? ఇది కేవలం ఒక అభ్యుదయ మార్గంలో, (స్వర్గానుభవాది) చిన్న కోరికల నుండి చివరికి అత్యున్నతమైన భాగవత సేవా ప్రాప్తి వరకు, ఉన్న వివిధ అడ్డంకుల గురించి వివరించుటకు అని అర్థం చేసుకోవాలి.
3. ఆత్మానుభవత్తుక్కు స్వర్గానుభవం విరోధి – స్వర్గపు సుఖ అనుభవం వారి ఆత్మ ఆనందానికి అడ్డంకి.
స్వర్గపు ఆనందాలు – ఆత్మానుభవానికి అడ్డంకి
అత్మానుభవం అనేది కైవల్యం అనే ఒక రకమైన మోక్షంగా పిలవచ్చు. కైవల్యం అనగా, ఆత్మ భౌతిక శరీరం నుంచి ఉపశమనం పొంది విరజా నదిని దాటి శ్రీవైకుంఠం చేరుకొని పూర్తిగా తనను తాను (జీవాత్మ) ఆనందించడం అన్నమాట. సంసారం (లీలా విభూతి – భౌతిక ప్రపంచం) లో పునర్జీవితం లేనందున ఇది కూడా ఒక రకమైన మోక్షంగా పరిగణించబడుతుంది. స్వర్గంలో సుఖాలు మన పుణ్యాలు ఉన్నంతవరకు మాత్రమే సాగుతాయి. పుణ్యం క్షీణించిన తరువాత, భూమండలంపైకి వచ్చి వారి ప్రయాణాన్ని తిరిగి కొనసాగించాలి అని “క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి” లో వివరించారు.
4. ఆత్మానుభావకామనుక్కు స్వర్గం విరోధి – ఆత్మానుభావం కోరేవారికి స్వర్గలోకాలను ఆనందించాలనే కోరిక అడ్డంకి.
(దయచేసి మునుపటి సూత్రం యొక్క వివరణను చూడండి.)
5. భగవత్ అనుభవత్తుక్కు ఆత్మానుభవం విరోధి – ప్రతివారి ఆత్మానుభవం భగవత్ అనుభవానికి విరోధి.
భగవత్ అనుభవం అనగా భగవానుని సుందర రూపాన్ని, కళ్యాణ గుణాలతో, ఉభయ విభూతి ఐశ్వర్యం (రెండు లోకాలను నియంత్రించే సామర్థ్యం ఉన్న వాడు) – నిత్య విభూతి (ఆధ్యాత్మిక ప్రపంచం) మరియు లీలా విభూతి (భౌతిక ప్రపంచం) మొదలైనవి, ఇటువంటి ఆనంద అనుభవం భగవానునిపై ప్రీతి (భక్తి, ప్రేమ, అనుబంధం) కలిగింపజేస్తుంది. ఇటువంటి ఆనంద అనుభవం నుండి పుట్టిన అనుబంధం భగవత్ కైంకర్యానికి (సేవ) దారి తీస్తుంది. ఇటువంటి పరమానందమును పరమపదంలో (శ్రీవైకుంఠంలో) అపరిమిత పరమానంద మోక్షం అని అంటారు. అత్మానుభవం పరమానందం అయినప్పటికిని భగవత్ అనుభవంతో పోల్చితే, అది చాలా స్వల్పమైనది. అందువల్ల, తనను తాను ఆస్వాదించే (ఆత్మానుభవం) కోరిక భగవత్ అనుభవానికి ఒక ఆటంకము.
అనువాదకుని గమనిక: జీవాత్మ సహజంగానే జ్ఞానమయం (జ్ఞానంతో నిండినవాడు) మరియు ఆనందమయం (ఆనందంతో నిండినవాడు). కాబట్టి, అత్మానుభవం ఒక ఆసక్తికరమైన అంశముగా ఉండవచ్చు, అయినా అది చాలా స్వల్పమైనది. ఎందుకంటే ఆత్మ అణుప్రాయమైనది (అణు స్వభావం). ఆత్మ యొక్క పరిమిత జ్ఞానం మరియు ఆనందంతో పోలిస్తే భగవాన్ విభుడు (సర్వవ్యాపి, ప్రబలమైనవాడు), వారి జ్ఞానం మరియు ఆనందం అపరిమితమైనవి.
6. భగవత్ అనుభవ కామనుక్కు ఆత్మానుభవ ఇచ్చై విరోధి – భగవత్ అనుభవాన్ని కోరినవారికి, తమను తాము ఆనందించడం ఆటంకము.
(దయచేసి మునుపటి సూత్రం యొక్క వివరణను చూడండి.)
7. గుణానిష్ఠనుక్కు గుణి విరోధి – భగవానుని కళ్యాణ గుణాలపై నిష్ఠ ఉంచినవారికి, భగవత్ స్వరూపం ఆటంకము.
భగవాన్ స్వరూపాన్నిఆనందించడం – భగవత్ కళ్యాణ గుణ అనుభవం గుణనిష్ఠకి అడ్డంకి – “సదా పరగుణావిష్ఠ” లో చెప్పినట్లుగా, “నిరంతరం భగవానుని పవిత్రమైన గుణాలను అనుభవిస్తున్న వ్యక్తి అని అర్థం. శృతిలోని “సోస్నుతే” అన్న ప్రమాణం, జీవాత్మ పరమాత్మను వారి పవిత్ర కళ్యాణ గుణాలతో పాటు ఆస్వాదిస్తాడు, ఆనందిస్తాడు అని తెలియజేస్తుంది. “రాసోవై సః” అంటే మాధుర్యాన్ని రూపుదిద్దుకున్నవాడు అని అర్థం. దీనిని అనుభవించడం ద్వారా ముక్తాత్మ (ముక్తి పొందిన ఆత్మ) ఆనందం పొందుతాడు. ఎమ్బెరుమాన్ తన కళ్యాణ గుణాలను అనేక దివ్య కార్యకలాపాల ద్వారా బహిర్గతం చేస్తారు. తిరువిరుత్తం 98వ పాసురం “నెంజాళ్ నినైప్పరిత్తాళ్ – వెణ్ణేయుణెన్నుం ఇరచ్ చొళ్ళే”, తిరువాయ్మొళి 1.3.1 వ పాసురం “ఎత్తిఱాం! ఉరలినోడు ఇణైన్తిరుంతేంగియ ఎళివే” మొదలైన పాసురాల ద్వారా, నమ్మాళ్వార్ భగవద్ గుణాల అనుభవాన్ని అర్థంచేసుకోవచ్చు. ఇది పెరియ తిరువందాది 86 లో “చీర్ కాలంత చోల్” గా (అనగా భగవాన్ యొక్క పవిత్రమైన లక్షణాలతో నిండిన పదాలు) వివరించబడింది. గుణి అంటే భగవాన్ యొక్క దివ్య స్వరూపం (అనగా, గుణం ఉన్నవాడు గుణి). ఈ భగవత్ స్వరూపం అర్థమగుట గొప్ప యోగులకు కూడా చాలా కష్టమైన విషయం. భగవత్ స్వరూపంపై దృష్టి కేంద్రీకరించడం భగవత్ గుణాలను అనుభవించడానికి, ఆనందించడానికి ఒక అడ్డంకిగా ఉంటుంది. ఇది తరువాతి సూత్రానికి సమానంగా ఉంది.
8. కైంకర్యనిష్ఠనుక్కు భగవత్ సౌందర్యం విరోధి – భగవానుడికి సేవ అందించడంలో దృష్టి సారించినవారికి, భగవానుడి యొక్క సౌందర్యం ఒక అడ్డంకి.
భగవాన్ యొక్క సౌందర్యంపై దృష్టి కేంద్రీకరించడం – సేవ అందించడంలో అడ్డంకి (ఇళయ పెరుమాళ్ నిరంతరం పెరుమాళ్ సేవలో నిమఘ్నమై ఉండేవారు.)
కైంకర్యనిష్ఠులు – ఇళయ పెరుమాళ్ (లక్ష్మణ) “అహం సర్వం కరిష్యామి” (మీకోసం ఏదైనా చేస్తాను), అన్ని సమయాల్లో సాధ్యమైన విధాలుగా సంపూర్ణ దృష్టి భగవానునిపై పెట్టి ఉన్నవాడు. ఒకసారి అతని దివ్య సౌందర్యాన్ని అనుభవించటం మొదలుపెడితే, మన దృష్టి, మనస్సు అతనిపై స్థిరపడి మరియు పూర్తిగా అబ్బురపోతారు. ఈ భావన ఎమ్బెరుమాన్ సేవను ప్రభావితం చేస్తుంది. అందువల్ల పిళ్ళై లోకాచార్యులు ముమ్ముక్షుపడి సూత్రం 187 లో ” సౌందర్యం అంతరాయం” అంటే భగవానుని సౌందర్యం ఆటంకము. సహజంగా – భగవనుడు యజమాని, జీవాత్మ దాసునిగా ఉంటారు. భగవానుని యొక్క లక్షణాలను అనుభవించడం ద్వారా, జీవాత్మకు భగవానునిపై అనుబంధం అభివృద్ధి చెంది తద్వారా అటువంటి కళ్యాణ గుణాలు ఉన్న ఎమ్బెరుమానకి సేవ చేయాలనే కోరికను పొందుతాడు. ఇది శేషత్వమైన (సేవకుడు/దాసుడు) జీవాత్మ స్వభావానికి సరితూగుతుంది, ఇది కోరదగినదే. ఇది ఎంతో అవసరం. కాని ఒకసారి భగవానుడి దివ్య సౌందర్యముపై దృష్టి మరలితే, అది కైంకర్యం జరగకుండా అడ్డుకుంటుంది. అందువల్ల, కైంకర్య నిష్ఠులకు భగవానుని సౌందర్యం అడ్డంకి అని చెప్పవచ్చు.
9. భాగవత కైంకర్య నిష్ఠనుక్కు భగవత్ కైంకర్యం విరోధి – భాగవత (భక్తులు) కైంకర్యంలో శ్రద్ధ వహించేవారికి భగవత్ కైంకర్యం (భగవాన్ సేవ) ఆటంకము.
భగవత్ కైంకర్యం పై కేంద్రీకరించడం – భాగవత కైంకర్యంలో అడ్డంకి.
జీవాత్మ యొక్క సహజ వ్యక్తిత్వం భగవత్ దాస్యత్వం (భగవానుని సేవకుడు), ఎమ్బెరుమాన్ కు సంపూర్ణ దాసుడిగా ఉండాలి. ఇంకా ప్రాముఖ్యమైనది – స్వరూప యాథాత్మ్యం (నిజ స్వభావ తత్వము) – భాగవత శేషత్వం (భాగవతుల యొక్క సేవకుడు). పెరియ తిరువాయ్మొళి 8.10.3 లో, తిరుమంగై ఆళ్వార్ తిరుమంత్రం యొక్క సారాంశాన్ని స్వయంగా ఎమ్బెరుమాన్ కు తెలియజేస్తూ ఇలా అన్నారు ” నిన్ తిరువెట్టెళుత్తుం కఱ్ఱు ణన్ ణాన్ ఉఱ్ఱతుం ఉన్నడియార్కడిమై కణ్ణపురత్తుఱైయమ్మానే ” – తిరుకణ్ణపురం లోని ప్రియమైన భగవానుడా! తిరుమంత్రం యొక్క సారాంశాన్ని తెలుసుకున్న తర్వాత నేను మీ భక్తుల సేవకుడనని అర్థం చేసుకున్నాను. తిరుమళిశై ఆళ్వార్ నాన్ముగన్ తిరువన్తాధి 18 వ పాసురంలో “ఏత్తియిరుప్పారై వెల్లుమే మాఱ్ఱవరైచ్ చాత్తియిరుప్పార్ తవం” – భక్తుల పట్ల భక్తి భగవానునిపై భక్తి కన్నా ఎక్కువ). ఏత్తియిరుప్పార్ – భగవత్ శేష భూతర్ – భగవానునికి శరణాగతి చేసినవాడు. అటువంటి భక్తులకు శరణాగతి చేసినవారి స్థితి చాలా ఉన్నతమైనది. శ్రీ రామాయణంలో, లక్ష్మణ భరతులు శ్రీరాముడికి పూర్తిగా శరణాగతులై ఉండేవారు. శత్రుఘ్నాళ్వారులు భరతుడే సర్వస్వంగా ఉండేవారు. శ్రీ రామాయణంలో “శత్రుఘ్నొ నిత్యశతృఘ్నః” (శాశ్వతమైన ఆటంకాన్ని జయించిన వాడు) అని చెప్పబడింది. మన పూర్వాచార్యులు ఇలా వివరించారు “శత్రుఘ్నాళ్వారులు శ్రీరాముని యొక్క సౌందర్యాన్ని మరియు పవిత్రమైన కళ్యాణ గుణాలను విస్మరించి పూర్తిగా భరతుని సంపూర్ణ సేవలో నిమఘ్నమై ఉండేవారు. తిరువాయ్మొళి 8.10.3 పాసురంలో నమ్మాళ్వార్ “అవనడియార్ సిఱుమామనిసరాయ్ ఎనీ ఎన్నైయాణ్డార్”. సిఱుమామనిసర్ భగవానునికి శరణాగతి చేసినవాడు, పరిమాణంలో చిన్నగ ఉన్న వారు కానీ జ్ఞానం, ఆచరణలో గొప్పవారు. ఇటువంటి భక్తులే నా యజమానులు అని నమ్మాళ్వార్ అన్నారు. అటువంటి భక్తులు ఉనికిలో ఉన్నప్పుడు, వారిని విస్మరించి ఎమ్బెరుమాన్ చరణ కమలాలనే ఎలా సేవించగలం? జీవాత్మ నిజమైన స్వభావమునకు, భాగవత కైంకర్యం మరింత సముచితమైనది. అందువల్ల భగవత్ కైంకర్యం భాగవత కైంకర్యానికి అడ్డంకి అని చెప్పవచ్చు.
తదుపరి విభాగాన్ని మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
హిందీలో : http://ponnadi.blogspot.com/2013/12/virodhi-pariharangal-1.html
మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org