విరోధి పరిహారాలు – 6

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

<< విరోధి పరిహారాలు – 5

30. విషయ విరోధి  – భగవత్ విషయానికై విరోధాలు
బ్రహాండమైన మకరందం – ఎంతో ఇష్టపడే ఆరావముదన్
సాధారణంగా విషయం అనగా భగవత్ విషయం (భగవానునికి సంబంధించిన విషయాలు) అని అర్థం. దానికి విరుద్ధమైనది ఏదైనా ఒక అడ్డంకి.
 • శబ్ద (ధ్వని), స్పర్స (స్పర్శ), రూప (చూపు), రస (రుచి), గంథ (వాసన) మొదలైన విషయాలు మనకు లౌకిక సుఖాన్ని ఇస్తాయి, అవి భగవత్ విషయానికి విరోధాలు. అనువాదకుని గమనిక: ఇంద్రియ సుఖానుభవంలో నిమగ్నమైనప్పుడు , అవి రజో, తమో గుణాలను తనలో పెంచి క్రమేణా భగవాన్ నుండి ఆ వ్యక్తిని దూరం చేస్తాయి. స్వయంగా ఆళ్వారులు వారి పాసురాలలో శోకించుచూ, ఈ లౌకిక సుఖాలు చాలా శక్తివంతమైనవి అవి నిరంతరం వేధిస్తున్నాయి అని వివరించారు.
 • భగవానుని నామాల శ్రవణం చేయుట జీవాత్మకు మంచి లక్షణము. వారు భగవాన్ నామాలు విన్నా/ఉచ్చరించినా,  జీవాత్మ సుకృతం చేస్తున్నాడని భగవానుడు భావిస్తారు.  భగవానుని పేర్లు వినకుండా ఇతర పేర్లను వినడం ఒక అడ్డంకి.
 • భగవానుని అర్చా విగ్రహాలు (చిత్ర పఠాలు / రేఖా చిత్రాలు) అత్యంత మనోహరమైనవి. భౌతికమైన చిత్రాలు వస్తువులను చూడటం ఒక అడ్డంకి.
 • భగవానుని నామాలకు బదులుగా ఇతర పేర్లను జపించుట ఒక అడ్డంకి.
 • మనకు ఇవ్వబడిన కాళ్ళను భగవానుని యొక్క క్షేత్రాలకి ( దివ్య దేశాలు మొదలైనవి) వెళ్ళడానికి ఉపయోగించాలి. ఇతర దేవత క్షేత్రాలకు వెళ్ళే వాటికి ఉపయోగించుట ఒక అడ్డంకి.
 • నమ్మాల్వారు  తిరువాయ్మొళి 2.7లో  “పయిలుం  చుడరొళి” పదిగం మరియు 8.10 “నెడుమర్కకడిమై” (నెడుమాఱ్కడిమై) పదిగంలో భాగవతుల మహత్యాన్ని గురించి చెప్పారు. ఈ అవగాహనతో, భాగవతులను స్తుతించుట భగవానుని స్తుతించుట కన్నా గొప్పదని తెలుసుకోవాలి. అందువల్ల, భాగవతుల సేవ చేయకుండా కేవలం భగవానుని విగ్రహాన్ని పూజించుట ఒక అడ్డంకి.
 • భాగవతుల నామ జపం చేయకుండా కేవలం భగవానుని నామ జపం చేయుట ఒక అడ్డంకి. ఉదాహరణకు, “రామానుజ” నామం  “నారాయణ” నామం కంటే గొప్పదని మన పూర్వాచార్యులు వివరించారు, కావున ఎమ్బెరుమానార్ యొక్క నామ జపం అత్యంత గొప్పది. కొందరు ఒకసారి “నారాయణ” నామ జపం చేస్తుండగా వడుగ నంబి వారితో, “మనం ‘రామానుజ’ నామజపం చేయాలి, కేవలం ‘నారాయణ’ అనుట ‘నావ కార్యం’ (అనుచిత కార్యం) అవుతుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్లి పోతారు.
 • భాగవతుల చరణాలు ఆశ్రయించడం మంచిది. కానీ సంసారులను చరణాలు తాకడం, వారు మనను తాకుట ఒక పెద్ద అడ్డంకి. అనువాదకుని గమనిక పరాశర భట్టర్ జీవితంలో, ఒక సంఘటనను  ఈ సందర్భంగా వివరించబడింది.  శ్రీరంగం వీధుల్లో నడుస్తున్నప్పుడు, ఒక దేవతాంతర భక్తుడు రంగు పంచను ధరించి భట్టారు దగ్గరికి వచ్చి నిలబడి, అతన్ని తాకమన్నట్లుగా భట్టారుకి సంకేతిస్తారు.  భట్టార్ ఒక్కసారి చాలా కంగారుపడి వారి తల్లి ఆండాళ్ అమ్మ దగ్గరకు వెళ్లి విరుగుడు అడుగుతారు. అప్పుడు ఆండాళ్ అమ్మ, ఉపవీధీ (యజ్ఞోపవీతం) లేని భాగవతుని నుండి శ్రీపాద తీర్థాన్ని స్వీకరించమని భట్టార్నినిర్దేశిస్తారు. భట్టార్ ఎలాగో అలాగ ఒక భాగవతుని నంపెరుమాళ్కి శ్రీపాద కైంకర్యాన్ని చేయమని  ఒప్పింస్తారు. ఆతరువాత వారిచ్చిన శ్రీపాద తీర్థాన్ని స్వీకరించి సంతృప్తి పడతారు. భట్టార్  నంపెరుమాళ్ / నాచియార్ యొక్క దత్త పుత్రుడైన తానే సంసారుల స్పర్శతో అంత భయపడితే, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవాలి.
 • తులసి ఎమ్బెరుమానుకి ఎంతో ప్రీతికరమైనది. కానీ భగవానునికి అర్పించిన తులసి దళాలను మాత్రమే వాసన చూడాలి. భగవనుని పాదాలకు అర్పించని తులసి ఆకుల వాసన చూచుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: చేతనా చేతనమైనవన్నీ భగవదాధీనమైనవి, భగవాదానందం కోసం మాత్రమే ఉనికిలో ఉన్నాయి. వాటిని మొట్టమొదట భగవానుకి అర్పించి ఆ తరువాత ప్రసాదంగా స్వీకరించాలి – మనం స్వతంత్రంగా ఏది కూడా ఆనందించలేము.

31. విశ్వాస విరోధి  – ఉపాయ విశ్వాసంలో విరోధులు

సీతా పిరాట్టి  అత్యంత ప్రతికూల పరిస్థితిలో కూడా శ్రీరామునిపై పూర్తి విశ్వాసం ప్రదర్శించారు

విశ్వాసం అంటే గాఢమైన నమ్మకం. ప్రస్తుత సందర్భంలో మనం మోక్ష ఉపాయంపై ఉండ వలసిన విశ్వాసాన్ని చూస్తున్నాము. మన పూర్వాచార్యులు శాస్త్ర ఆధారంగా ముమ్ముక్షువులకు భగవానుడే తగిన ఉపాయమని వివరించారు. అనువాదకుని గమనిక: పిళ్ళై లోకాచార్య యొక్క ముమ్ముక్షుపడి  సుత్రం 116 “పేఱు తప్పాతెన్ఱు తుణింతిరుక్కైయుం” కి మాముణులు వ్యాఖ్యానిస్తూ – “మనకు నిరంతర భగవత్ కైంకర్య లక్ష్యాన్ని సాధిస్తామని దృఢ నమ్మకం ఉండాలి” అని అన్నారు.

 • ఎమ్బెరుమానుని ఉపాయంగా పెట్టుకొని ప్రార్ధించుటయే ప్రపత్తి. ఇది కేవలం మన మనస్సులో భగవానుని ఉపాయంగా స్వీకరిచుట, ఇది చాలా సరళమైన ఒక ముందడుగు. అయినప్పటికీ, ఇది మన వంతు అవసరమైనది. కాని,  “ఓ! ఇది చాలా సులభమైనది,  భగవానుని ఉపాయం చేయుట ఇంత సామాన్యమైనది ఎలా అవుతుంది?” అని అనుకోకూడదు. అలాంటి ఆలోచనలు కలిగి ఉండుట ఒక అడ్డంకి.
 • ఉపాయాన్ని అనుసరించడంతో ఫలితంగా ఉపేయం లభిస్తుంది. శ్రీ వైష్ణవులకు, పరమపదంలో (శ్రీవైకుంఠం లో) శాశ్వతమైన కైంకర్యమే వారి అంతిమ లక్ష్యం.  పరమపదంలోని ఆ కైంకర్యం చాలా అద్భుతమైనది, మన స్వప్రయత్నాలతో చేరుకుంటామని ఊహించలేము. నమ్మాళ్వార్  తిరువాయ్మొళి 5.1.7 లో “అమ్మాన్ ఆళిప్పిర్పిరాన్ ఎవ్విడత్తాన్ యానార్” (నా భగవాన్ తన చేతిలో చక్రం ధరించి ఉన్నాడు – వారు ఎంత గొప్పవారు నేనెంత అల్పుడను) వారి గొప్పతనంతో నన్ననుగ్రహించారు.  కాబట్టి, వారి గొప్పతనం గురించి ఆలోచించకూడదు మరియు మనం బలహీనులం కాబట్టి వారి కైంకర్యాన్ని పొందలేము అన్న భావన ఒక అడ్డంకి.
 • ఈ సంసారంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులకు భయపడటం ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: మముకుషప్పడి చరమ శ్లోక ప్రకరణంలో, వివరిస్తూ “సర్వ పాపేభ్యో మొక్ష ఇష్యామి మా సుచః”, పిళ్ళై లోకాచార్యులు చాలా అందంగా వ్యాశ్యానిస్తూ  అన్నారు, ” అన్ని అడ్డంకులను భగవానుడు  తొలగిస్తారు, ఇది భాగావానుడి వాగ్దానం”. మాముణులు కూడా ఈ సూత్రాలను చాలా నిపుణంగా వ్యాఖ్యానించారు.
 • చరమోపాయంపై (అత్యుత్తమ ఉపాయంపై) విశ్వాసం ఉండక పోవుట ఒక అడ్డంకి. ప్రపత్తి, ఆచార్య అభిమానం ఈ రెండింటిని చరమోపాయాలుగా పేర్కొన్నారు. ప్రపత్తికి – ఇది చాలా సులభమైనది. ఇంత సరళమైన చర్య మనకు శాశ్వతమైన కైంకర్యాన్నిఎలా ఆర్జించి పెడుతుంది? అని భావించరాదు. ఆచార్య అభిమానం కోసం – ఆచార్య కూడా మనలా ఒక మనిషి అని భావించరాదు, మనం మోక్షం పొందుటకు ఎలా సహాయ పడతారు? అని భావించరాదు. ఈ రెండింటికీ దూరంగా ఉండాలి.  అనువాదకుని గమనిక:  పిళ్ళై లోకాచార్యులు ముమ్ముక్షుపడి చరమ శ్లోక ప్రకరణలో వివరిస్తూ “సర్వ ధర్మాన్ పరిత్యజ్య” గీతా శ్లోకాన్ని చరమ శ్లోకంగా పిలుస్తారు, ఎందుకంటే ఇది చరమోపాయం (శరణాగతి)ని వివరిస్తుంది.  నాయనారాచాన్ పిళ్ళై రచించిన ఒక గ్రంథంలో ఎమ్బెరుమానార్ (ఆచార్యగా) యొక్క కీర్తి ప్రతిష్టలను వివరిస్తూ వ్రాసారు. ఆ గ్రంథం పేరు “చరమోపాయ నిర్ణయం”.
32. ప్రవృత్తి విరోధి – మన పనులకు (కైన్కర్యములకు) అడ్డంకులు 
ఇళయ పెరుమాళ్ (లక్ష్మనుడు) – భగవన్ యొక్క అత్యుత్తమ సేవకులలో మొట్టమొదటగా లెక్కించబడతారు
 • ఎమ్బెరుమానునికి కైంకర్యం చేయుటయే మన ప్రవృత్తికి సరైనదని అర్ధం. కైంకర్యం మన కర్తవ్యం.  క్రింది వివరించిన విధంగా కైంకర్యం చేయుట ఒక అడ్డంకి.
 • కైంకర్యం చాలా ప్రేమతో చేయాలి. నమ్మాళ్వారు తిరువాయ్మొళి 10.8.10లో “ఉగంతు పణి చేయ్తు” (అనగా ప్రేమతో సేవించు). ప్రేమ లేకుండా కైంకర్యం చేయుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: మునుపటి సూత్రాలలో కైంకర్యం యొక్క నిజ స్వభావాన్ని మనం చూసాము – “భగవత్ అనుభవ జనిత ప్రీతి కారిత  కైంకర్యం” – భగవత్ అనుభవాలు మొదలైనవి అనుభవించుట వలన ప్రేమానుభవం పొంది అది కైన్కర్యానికి దారితీస్తుంది. భావం లేకుండా  చేస్తే అది జీవాత్మ యొక్క స్వరూపానికి వ్యతిరేకం అవుతుంది.
 • పారతంత్రియాన్ని ఉల్లేఖిస్తూ కైంకర్య సమయంలో ఆత్రుత చెందక పోవుట ఒక అడ్డంకి. “ఇది ఎమ్బెరుమానుని కైంకర్యం, సరిగ్గా పూర్తిచేయాలి, మనం పొరపాట్లు చేయకూడదు, ఇటువంటి భావాలు సహజంగా ఆందోళనకు దారి తీస్తాయి.  తిరువాదన సమయంలో చివర్లో, ప్రతి ఒక్కరూ “ఉపచారాపదేశేన కృతాన్ – అపచారానిమాం సర్వాం క్షమస్వ పురుషోత్తమ” – నేను మీకు కైంకర్యం చేయటం మొదలుపెట్టాను కానీ ఈ క్రమంలో ఎన్నో పొరపాట్లతో ముగించాను, మీరు పురుషుల్లో ఉత్తముడు, దయచేసి నన్ను క్షమించు. ఏ ఆందోళనా భావం లేకుండా సాధారణం ఉండుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: శ్రీకృష్ణుడు విదిరుని రాజభవనానికి వెళ్ళినపుడు, విదురుడు ఆందోళనా భావంతో నిండి, శ్రీకృష్ణునికి అరటిపండు తొక్క సమర్పిస్తాడు. అయినప్పటికీ కృష్ణుడు విదురుని సేవాభావానికి మెచ్చుకుంటాడు. శ్రీకృష్ణుని ఆసక్తిగా ఆదరించినందుకు వారిని “మహామతి” (ఎంతో జ్ఞానవంతుడైన వ్యక్తి) అని విదురుని పిలుస్తారు –
 • అనుష్టానాలను సాధనంగా (ఉపాయంగా) పరిగణిస్తే అది ఒక  అడ్డంకి. స్వానుష్టానాలు (ఒకరి అనుష్టానాలు)    భగవానుడు నిర్దేశించిన అవసరమైన కర్మలు. అలాంటి చర్యలను అనుసరించక పోవుట పాపము మూట కట్టుకోనునట్లగును. ఆ  కర్మలను అనుసరించుట వలన పుణ్యము కట్టుకోము కాని  అవి తప్పనిసరి కార్యాలు. ఆ కర్మలను చేయుట వలన ఎమ్బెరుమాన్ మనకు మోక్ష ప్రదానం చేస్తారని అనుకోకూడదు. విహిత కర్మలో రోజు మూడుసార్లు సంధ్యావందనం, ఇంటి పెరుమాళ్లకు తిరువారాధనం, పితృ తర్పణం మొదలైనవి.
33. నివృత్తి విరోధి – అస్వీకరణలో అవరోధాలు
పిళ్ళై లోకాచార్యులు మరియు మాముణులు (శ్రీపెరుంబుతూర్) – ముమ్ముక్షుప్పడిలో పునరుద్ధరణ సూత్రం వివరించారు

నివృత్తి అనగా అస్వీకరణ/త్యజించడం అని అర్థం. ఎవరైతే ఎమ్బెరుమానుని మాత్రమే ఉపాయంగా స్వీకరిస్తారో వారు ఇతర ఉపాయాలను త్యజించాలి. భగవాన్ గీతా చరమ శ్లోకంలో అన్నారు, “సర్వ ధర్మాన్ పరిత్యజ్య”  మొదట అన్ని ఉపాయాలని విడిచిపెట్టి, తరువాత “మామేకం చరణం వ్రజ”  నాకు మాత్రమే శరణాగతి చేయి. కాబట్టి, దీని ప్రకారం, అన్ని ఇతర ధర్మాలను (కర్మ, జ్ఞాన, భక్తి యోగములు వంటి ఉపాయములు) పూర్తిగా విడిచి భగవానుని మాత్రమే సర్వోత్తమ ధర్మంగా స్వీకరించాలి. అనువాదకుని గమనిక: మన ఆచార్యులు శ్రీమన్నారాయణుడు మాత్రమే సర్వోత్తమ ధర్మముగా రుజువు చేశారు, మహాభారతంలో “కృష్ణం ధర్మం సనాతనం” అని చెప్పబడింది, శ్రీకృష్ణుడే నిత్య శాశ్వతమైన ధర్మము మరియు శ్రీ రామాయణములో “రామో విగ్రహవాన్ ధర్మ:” – శ్రీరాముడు ధర్మ స్వరూపుడు అని చెప్పబడింది. పిళ్ళై లోకాచార్యులు గంభీరంగా ముమ్ముక్షుపడి సూత్రం 213లో “ధర్మ సంస్థాపనం పణ్ణప్పిఱన్తవన్ తానే ‘సర్వ ధర్మంగళైయుం విట్టు ఎన్నైప్పఱ్ఱు’ ఎంగైయాళే సాక్షాత్ ధర్మం తానే ఇంగిఱతు” లో వివరిస్తూ శ్రీకృష్ణుడు ధర్మ స్థాపన కొరకై అవతరించాడు – ‘అన్ని ఇతర ధర్మాలను విడిచిపెట్టి, నన్ను స్వీకరించు’ అని చెప్పినప్పుడు, అతనే నిజమైన / శాశ్వతమైన ధర్మము అని అర్థం.

 • వీటన్నింటినీ అర్ధం చేసుకున్న తరువాత కూడా, “ఈ ఇతర ఉపాయాలను విడిచిపెడితే నేను  పాపం మూటకట్టుకుంటానేమో?” అన్న భావన ఉండకూడదు. అది ఒక అడ్డంకి. ఇది భగవానునిపై విశ్వాసం లేకపోవడం మాత్రమే చూచిస్తుంది. అలాంటి సంకోచంతో మన లక్ష్యాన్ని సాధించలేము.
 • ఎమ్బెరుమానుపై సందేహాస్పదంగా ఇటువంటి చర్యలు చేయడం కూడా ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: “ఒక వేళ ప్రపత్తి విఫలమైతే? నేను కర్మ, జ్ఞాన లేదా భక్తి యోగాలు కొద్దిగా చేస్తే అవి నన్నాదుకుంటాయేమో” అని భావించరాదు. భగవానుడు బ్రహ్మాస్త్రంగా వివరించబడ్డారు.  బ్రహ్మాస్త్రానికి తిరుగుండదు,శత్రువును సులభంగా చీర్చేస్తుంది. కానీ బ్రహ్మాస్త్ర శక్తిని సందేహించి ఇంకేదో జోడించి ప్రయత్నించినట్లయితే, బ్రహ్మాస్త్రం తనను తాను ఉపసంహరించుకుంటుంది. హనుమంతునిపై బ్రహ్మాస్త్రము ప్రయోగించినపుడు, పైనుంచి రాక్షసులు తాడుతో హనుమానుని కట్టివేస్తారు, బ్రహ్మాస్త్రం హనుమంతుడిని విడిచి పెట్టేస్తుంది. హనుమంతుడు చివరికి రావణుని రాజ భవనానికి వెళ్లి అతన్ని హెచ్చరించి తరువాత లంకా దహనం చేస్తాడు.
 •  ఇతర ఉపాయాలను కేవలం వారి ఆశక్తి (అసమర్థత) కారణంగా విడిచిపెట్టుట ఒక అడ్డంకి.  ఇతర ఉపాయాలు మన స్వరూపానికి సరైనవి కావు కాబట్టి వాటిని విడిచిపెట్టాలి అని పరిగణించాలి.
 • ఇతర ఉపాయాలను కేవలం వారి సామర్థ్యత కారణంగా విడిచిపెట్టుట ఒక అడ్డంకి. పైన సూత్రంలో చెప్పుకున్నట్టుగా ఇతర ఉపాయాలు మన స్వరూపానికి సరైనవి కావు కాబట్టి వాటిని విడిచిపెట్టాలి అని పరిగణించాలి. అనువాదకుని గమనిక: ఉదాహరణకు, ఒకరు కర్మ యోగమును విడిచిపెట్టగలడు, “ఓ! నేను చాలా నియంత్రణలో ఉన్నాను, కాబట్టి నేను కర్మయోగాన్ని త్యాగం చేస్తున్నాను” – అది కూడా మంచిది కాదు.
 • అన్ని ఉపాయాలను త్యాగం చేసి వాటిని గురించి ప్రగల్బాలు పలుకనవసరం లేదు – ఇది కూడా ఒక అడ్డంకి. ఒకవేళ అలా త్యాగం చేయగలిగితే, అది జీవాత్మకి సహజమైన గుణం, ఇవన్నీ ఎమ్బెరుమాన్ మరియు ఆచార్యుల అనుగ్రహంతో జరుగుతాయి – అలా చేసి తనను తానూ మెప్పులు పలుకి ” నేను అన్నీ త్యాగం చేసాను! ఎంత గొప్ప? అని భావించరాదు.

మనం నిత్యం పిళ్ళై లోకాచార్యుల యొక్క ముమ్ముక్షుపడి సూత్రం 271 – “కర్మం కైన్కర్యత్తిలే పుగుం; గ్యానం – స్వరూప ప్రకాసత్తిలే పుగుం; భక్తి ప్రాయ రుచియిలే పుగుం; ప్రపత్తి – స్వరూప యాతాత్మ్య జ్ఞానత్తిలే పుగుం;” అని గుర్తుచేసుకోవాలి. మాముణులు అందంగా వివరిస్తూ, ” ఇటువంటి చర్యలు మొత్తం సమాజానికి ప్రేమ, కరుణతో నిర్వహించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. (గొప్ప మనుషులు ఈ విహిత కర్మలను విడిచిపెడితే, ఇతరులు కూడా అనుసరించి దిగాజారిపోతారు) – అయినప్పటికీ, వాటిని ఎప్పుడూ ఉపాయంగా పరిగణించకూడదు – అవి కైంకర్య పరంగానే చేయాలి. ఏ కర్మలయినా (సంధ్యావందనం మొదలైన వంటివి) – అవి ఎమ్బెరుమానుని కైన్కర్యంలో భాగమవుతాయి. జ్ఞాన యోగం ద్వారా సంగ్రహించిన దేదైనా ఆత్మ యొక్క జ్ఞానోదయానికి దారి తీస్తాయి. భక్తిలో భాగంగా ఏది చేసినా భగవానునిపై ప్రేమానురాగాలు పెరుగుటకు సహాయం చేస్తాయి. అంతిమంగా ప్రపత్తి జీవాత్మ యొక్క అంతర్గత స్వభావానికి సరిపడుతుంది, భగవానుని మాత్రమే ఉపాయంగా స్వీకరించేందుకు సహాయపడుతుంది. 

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

హిందీలో : http://ponnadi.blogspot.com/2013/12/virodhi-pariharangal-6.html

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s