Monthly Archives: June 2019

విరోధి పరిహారాలు – 11

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్” (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/06/05/విరోధి-పరిహారాలు-10 

42. లక్షణ విరోధి – మన వ్యక్తిత్వం, రూపము మరియు ప్రవర్తనలో వచ్చే అవరోధాలు.

అనేక అంశాలు ఈ భాగంలో చర్చించబడ్డాయి. లక్షణం అనగా ఆకారము, వ్యక్తిత్వం, రూపము అని అర్థాలు. అనువాదకుని గమనిక: మన సంస్కృత సాహిత్యంలో, లక్షణం  అంటే  సాధారణంగా ఒక తత్వము యొక్క గుణాలను మరొక తత్వము నుండి వేరుచేసే ప్రత్యేక లక్షణాలతో ముడిపడి ఉంటుంది. ఈ శీర్షికలో  పంచ సంస్కారంలోని తాపం (తమ భుజాలపై శంఖ చక్రాలను ధరించుట, శరీరంలో 12 భాగాలలో ఊర్ధ్వ పుండ్రాలను ధరించుట), శారీరక రూపం, వస్త్రాధరణ – మొదలైన  కొన్ని అంశాలు వివరించబడ్డాయి . ఈ విభాగంలో చాలా ఆసక్తికరమైన మరియు సూక్ష్మమైన అంశాలు వివరింప బడ్డాయి .

నమ్మాళ్వార్, ఎమ్బెరుమానార్, పిళ్ళై లోకాచార్య, జీయర్ – ఆదర్శ శ్రీవైష్ణవులు

మొట్టమొదటిగా పంచ సంస్కారం (సమాశ్రయణం) లోని భాగమైన తప సంస్కారంపై లోతైన వివరణ చూద్దాము – అది శ్రీవైష్ణవ సాంప్రదాయంలోకి ప్రవేశ ప్రక్రియ.

తప సంస్కారం నిర్వహిస్తున్న ఆచార్యులు 
  • తిరువిలచ్చినై   (భుజాలపై తప ముద్రలు ఉంటే ఆ వ్యక్తికి పంచ సంస్కారం అయ్యిందన్న సూచన) స్పష్టంగా కనిపించాలి.  వేడి చేసిన  శంఖం మరియు చక్రములను ప్రత్యేకమైన మంత్రాలతో భుజాల మీద ఆచార్యులు ముద్రలు వేస్తారు. మొదట్లో కాలిన గాయం లాగా కనిపించవచ్చు, కాని నయం అయ్యి౦తరువాత ఆ గుర్తులు ఎప్పటికీ భుజాలపై ఉండిపోతాయి. ఇంది సమాశ్రయణం (పంచ సంస్కారం) లోని మొదటి సంస్కారం – శ్రీవైష్ణవ సాంప్రదాయంలోకి ప్రవేశమైయ్యే ప్రక్రియ. శ్రీవైష్ణవుల భుజాలపై ఆ ముద్రలు స్పష్టంగా కనిపించుట చాలా అవసరం. భుజాలపై ఆ ముద్రలు స్పష్టంగా కనిపించక పోవుట ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: అనేక ఆచార్య పీఠాలలో, శంఖ చక్రాలను ఒక మాదిరిగా వేడి చేసి భుజాలపై సున్నితంగా ముద్రలు వేస్తారు – అలా చేస్తే భుజాలపై ముద్రలు స్పష్టంగా ఏర్పడవు.  ఈ పద్ధతి అనేక ఆచార్య పీఠాలలో ఆచరణలగా కనిపిస్తున్నందున, ఈ పద్ధతిని షిష్ఠాచారం (మన పెద్దలచే చేయబడుతున్న) గా పరిగణించవచ్చు.
  • తప సంస్కారమును స్వీకరించడానికి మరొక మార్గం ఉంది – పుష్పాలను ఉపయోగించి – దీనిని పుష్ప సమాశ్రయణం / సంస్కారం అని పిలుస్తారు. ప్రస్తుతం మన సాంప్రదాయంలో ఇది అమల్లోలేదు. ఈ ఆచారమును అషిష్ఠులు (మన పూర్వాచార్యులు కాకుండా ఇతరులు) అనుసరిస్తారు,  అందుచే శ్రీవైష్ణవులు ఈ ఆచారమును అనుసరించడం లేదు.
  • వేడి శంఖ చక్రాలను ఉపయోగించి చేసే తప సంస్కారం మాత్రమే సరైన విధానం. అలా చేయక పోవడం ఒక అడ్డంకి.
  • శారీరక వ్యాధులను నయం చేసేందుకు తప సంస్కారము (వేడి శంఖ మరియు చక్రం ఉపయోగించి) చేయించుకొనుట ఒక అడ్డంకి.
  • ఈ పంచ సంస్కారం యొక్క ప్రయోజనం మనలను అతిపెద్ద వ్యాధి అయిన ఈ సంసారము నుండి  (జననం మరియు మరణం యొక్క పునరావృత చక్రంలో ఉండటం) పరమపదంలో శాశ్వతమైన ఆనందకరమైన భగవానుని నిరంతర శాశ్వత సేవకై మనలను  ఉద్ధరించి మనలను ఉపశమనం కలిగిస్తుందని సరిగ్గా అర్థం చేసుకోవడం అవసరం. ఈ అవగాహన లేకుండా ఈ పంచ సంస్కారం చేయించుకొనుట ఒక అడ్డంకి.
  • శంఖ చక్రములు భగవాన్ యొక్క శాశ్వత వ్యక్తిత్వ స్వరూపాలు. వారు తమ ప్రియమైన యజమాని యొక్క చిహ్నాలను ధరిస్తున్నామని  పరమానందముతో వాటిని ధరించాలి. ఆ ఆనందం లేకపోవడం ఒక అడ్డంకి.
  • ఒక శ్రీవైష్ణవునిగా మారిన తరువాత సంసారుల  (లౌకిక ప్రవ్రుత్తి కల మనుషులు) నుండి దూరంగా ఉండాలి. సంసారుల నుండి వేరైనందుకు సిగ్గుపడకూడదు.
  • ఒక శ్రీవైష్ణవునిగా మారిన తరువాత ఇతర శ్రీవైష్ణవులకు దగ్గరవ్వాలి, వారితో ప్రేమగా ఉండాలి. “ఇప్పుడు నన్ను శ్రీవైష్ణవులు స్వీకరిస్తారు” అని ఆలోచిస్తూ గొప్ప ఆనందం అనుభూతిని పొందాలి. అటువంటి ఆనందం కపోవుట ఒక అడ్డంకి.

తరువాత ఊర్ధ్వపుండ్రంపైన విస్తారంగా చర్చించబడింది.  ఈ విభాగంలో అనేక సూక్ష్మ విశేషాలను చర్చించ బడ్డాయి. మొదట ఈ అంశంలో కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాము. తిరుముణ్ – పవిత్రమైన మట్టి. కాప్పు –  ధరించేవారికి రక్షణ. కాబట్టి, ఊర్ధ్వపుండ్రాన్ని తమిళంలో  తిరుముణ్ కాప్పు అని పిలుస్తారు. తిరుముణ్ కాప్పు  త్రిపుండ్రం (3 రేఖలు కలిగి ఉన్నందున) అని కూడా ప్రసిద్ది చెందింది – ఇది క్రింద నుండి పైకి నిలువుగా పెట్టుకుంటారు.  మన పెద్దలు శాస్త్రంలోని తగిన భాగాలు విశ్లేషించి ఊర్ధ్వపుండ్రం గురించి అనేక ముఖ్యమైన అంశాలను నిర్ణయించారు. ఊర్ధ్వపుండ్రం యొక్క గొప్పతనాన్ని శ్రీవైష్ణవులు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు మరియు సరిగ్గా ధరించట్లేదన్న వాస్తవం వారికి సిగ్గు చేటు.

తిరుముణ్ కాప్పు (ఊర్ధ్వపుండ్రం) సరైన పద్ధతిలో (సరైన మూల ఆధారము నుండి నేర్చుకున్న) ఒక స్వచ్ఛమైన మరియు సుందరమైన పద్ధతిలో ధరించాలి. ఈ విషయంలో ఒక సంఘటన గుర్తుకు చేసుకుందాము. చోళరాజు సభలో కూరత్తాళ్వారులు కనుచూపును కోల్పోయిన సంఘటన అందరికి తెలుసు.  శ్రీవైష్ణవులు ఈ సంఘటనతో చాలా భాద పడ్డారు. వారి చూపును కోల్పోయిన సంఘటన గురించి, వారు పడుతున్న పీఢను కూరత్తాళ్వార్ తో పంచుకుంటారు. ఆ సమయంలో, కూరత్తాళ్వార్ గొప్ప వినయపూర్వకంగా అంటారు, “ఇది భాగవత అపచారం యొక్క ఫలితం, నేను ఎవరిదో నుదుట ఊర్ధ్వపుండ్రాన్ని చూసి సరిగ్గా పెట్టుకోలేదని మనస్సులో భావించుంటాను”. కాబట్టి, మన ఊర్ధ్వపుండ్రాన్ని సాధారణంగా / సరికాని రీతిలో పెట్టుకోకూడదు,  పెద్దలు దానిని చూసి బాధను అనుభవిస్తారు. మన పెద్దలకు మరియు ఇతర శ్రీవైష్ణవులకు ఇబ్బంది కలిగించేటట్టుగా మనము ప్రవర్తించ కూడదు. ఇది మన ప్రధాన కర్తవ్యము మరియు బాధ్యత.

తిరుమణ్ స్వచ్చమైన తెల్లని పొడితో తయారు చేస్తారు. దీనిని ధవళ ప్పొడి ( మెరిసే తెల్ల పొడి) అని కూడా పిలుస్తారు. పురాణాల నుండి మనకు అర్థం చేసుకోవలసినది ఏమిటంటే పెరియ తిరువడి నాయనార్  (గరుడాళ్వారులు) శ్వేత ధ్వీపం నుండి ఈ పవిత్ర మట్టిని తెచ్చి భారత దేశంలో కొన్ని ప్రదేశాల్లో ఉంచారు. ఈ కాలంలో తెల్లటి బంకమట్టి రూపంలో తిరునారాయణపురం, అయోధ్య వంటి కొన్ని ప్రదేశాలలో  కనిపిస్తుంది. ఈ తెల్లని బంకమట్టిని తొవ్వి, నీళ్ళల్లో కలిపి, వడకట్టి, ముద్దలుగా చేసి ఎండబెడతారు. అనేక దివ్య దేశాలలో ఇవి కొనుక్కోవచ్చు.

కొన్ని విబేధాలు ఉన్నప్పటికీ – నేను (డాక్టర్ వి. వి. రామానుజం స్వామి) పెద్దల నుండి నేర్చుకున్న మరియు మన సాంప్రదాయానికి సంబంధించిన అనేక సాహిత్యాలలో చదివిన వాటిని మీతో పంచుకున్తున్న్నాను.

పద్మ పీఠం, చెల్వ పిళ్ళై (తిరునారాయణపురం) యొక్క చరణ కమలాలు, చరణ కమలాల వద్ద తాయార్
హరి – పాద – ఆకృతి – పద్మ పీఠానికి ప్రతీక, ఎమ్బెరుమాన్ చరణ కమలాలు, చరణ కమల మధ్యలో తాయార్
  • ఒక పప్పన్నుడు (శ్రీవైష్ణవుడు) తన నుదుటిపై (ఇతర భాగాలతో సహా) శ్వేత మృత్తికా (శ్రీ చూర్ణం) అనే తెల్లని చూర్ణాన్ని ఉపయోగించి ఊర్ధ్వపుండ్రాన్ని ధరించాలి.
  • ఊర్ధ్వపుండ్రాన్ని ధరించేటపుడు భగవాన్ యొక్క తిరునామాలను (దివ్య నామాలు) స్మరించుకోవాలి. ఈ కారణంగా తిరుముణ్ న్ని కూడా తిరునామం అని కూడా పిలుస్తారు (లేదా కొన్నిసార్లు కేవలం నామం అని పిలుస్తారు).
  • నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 2.7 పదిగంలో శ్రీమన్నారాయణుని యొక్క ద్వాదశ నామాలను కీర్తించారు. ఈ పదిగ వ్యాఖ్యానం యొక్క పరిచయ విభాగంలో “వైష్ణవత్వ చిన్హమిఱె తిరుద్వాదశ నామం” – పన్నెండు నామాలు / పుండ్రములు వైష్ణవానికి చిహ్నాలు –  శ్రీమన్నారాయణుని చెందినవని సూచన).
  • శరీరంపై ఈ క్రింది 12 భాగాలలో (క్రింది వరుసలో) 12 పుండ్రములను ధరించాలి అని శాస్త్రంలో వివరించబడింది.
  1. నుదుట
  2. కడుపు మధ్య భాగంలో
  3. ఛాతి మధ్య భాగంలో
  4. మెడ మధ్య భాగంలో
  5. కడుపు కుడి వైపున
  6. కుడి భుజము
  7. మెడ కుడి వైపున
  8. కడుపు ఎడమ వైపున
  9. ఎడమ భుజముపైన
  10. మెడ ఎడమ వైపున
  11. వీపులో నడుము పై భాగమున
  12. మెడ వెనక భాగమున
  • తిరువాయ్మొళి 4.4.7 లో, నమ్మాళ్వార్ అన్నారు, “నీరు చేవ్వేయిడక్కణిళ్ తిరుమాలడియార్ ఎన్రోడుం” – ఒక వేళ ఎవరైనా నిలువు తిలకం (ఊర్ధ్వపుండ్రం) ధరించిన వారిని నేను చూస్తే, వారిని శ్రీమన్నారాయణుని దాసులుగా భావించి మెచ్చుకుంటాను. కాబట్టి,  అర్థం చేసుకోవలసినది ఏమిటంటే మనము నిలువుగా మాత్రమే తిలకం ధరించాలి. అనువాదకుడు యొక్క గమనిక: సాధారణంగా ఇప్పుడు శ్రీవైష్ణవులు కుంకుమ, గంధం, బూడిద అడ్డంగా కూడా పెట్టుకుంటున్నారు. అటువంటి వాటి నుండి దూరంగా ఉండాలి.
  • తిరుమణ్ పాదపీట  పద్మముతో (హరి పాదాలను పట్టుకున్న కమలం) హరి పాద ఆకృతి (శ్రీ హరి చరణకమలాల రూపంలో) గా ధరించాలి .  అనువాదకుని నోట్: నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 4.5.8 “తణ్ తామరై సుమక్కుం పాద ప్పెరుమాన్” (చల్లని తామర పాద పద్మాలను పట్టుకొని ఉన్న భగవాన్) అని వర్ణించారు.
  • నిలువు గీతలగా పెట్టుకోవాలి. రెండు తెలుపు రేఖలు (కుడి, ఎడమ) ఎమ్బెరుమాన్ యొక్క చరణాలను సూచిస్తు౦ది. మధ్యలో ఉన్న ఎరుపు రేఖ శ్రీమహాలక్ష్మిని సూచిస్తుంది, శ్రీ చూర్ణం అని పిలుస్తారు. శ్రీ చూర్ణం పసుపు పొడి నుండి తయారు చేస్తారు. దీనిని హరిద్రా చూర్ణం అని కూడా పిలుస్తారు. దానిని ఎరుపు రంగులో మారుస్తారు. పద్మ పీటం (దిగువన ఉన్న కమలం) ముక్కు మీద తిరుమణ్ తో మాత్రమే వ్రాయాలి. రెండు తెలుపు రేఖల మధ్య (ఇది ఎమ్బెరుమాన్ యొక్క చరణకమలాలను సూచిస్తు౦ది), కనీసం రెండు అంగుళాల దూరం ఉంచాలి. ప్రతి తెలుపు రేఖ ఒక అంగుళం వెడల్పు ఉండాలి.
  • నుదిటిలో మాత్రమే పద్మ పీటాన్ని పెట్టుకోవాలి. అన్ని ఇతర 11 ప్రదేశాలలో, చరణ కమలాలు పీఠం స్పష్టంగా లేకుండా తిరుమన్ని ధరించాలి.
  • శరీరం యొక్క ప్రతి భాగంలో తిరుమణ్ యొక్క పరిమాణానికి పరిమితులు ఉన్నాయి. ఈ అంశంపై దయచేసి పెద్దలను అడిగి మరింత తెలుసుకోండి.
ఇప్పుడు లక్షణ విరోధి ఉపభాగంలోని అడ్డంకులను చూద్దాము.
  • మన పెద్దలు ఆమోదించని ప్రదేశాల నుండి సేకరించిన తిరుమణ్ ని ఉపయోగించుట ఒక అడ్డంకి.
  • మన పెద్దలు ఆమోదించిన దివ్య దేశాల (తిరునారాయణపురం, శ్రీరంగం, అయోధ్య మొదలైన) నుండి తెచ్చిన తిరుమణ్ని ఉపయోగించక పోవుట ఒక అడ్డంకి.
  • తిరుమణ్ తెచ్చిన దివ్య దేశాల యొక్క మాహాత్మ్యమును అర్ధం చేసుకోకుండా తిరుమణ్ ధరించుట ఒక అడ్డంకి.   “ఓ! ఈ తిరుమణ్ అయోధ్య నుండి తెచ్చినది, అద్భుతం!”, అని మన మనస్సులో ఆలోచనతో  ధరించాలి.
  • ఒక ముముక్షువుగా తెల్ల తిరుమణ్  మాత్రమే ధారణ చేయాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి.
  • వివిధ లక్ష్యాలను సాధించడానికి వివిధ రంగుల తిరుమణ్లు (మరియు శ్రీచూర్ణం కూడా) ఉన్నాయి. అటువంటి పద్దతులను పాటించుట ఒక అడ్డంకి.
  • మన పూర్వాచార్యులు హరి పాదాకృతి (ఎమ్బెరుమాన్ యొక్క చరణ కమలాల రూపం) ధరించాలని నిర్దేశించారు. ఇతర రకాల పుండ్రాలు కూడా ఉన్నాయి – కాని మన పూర్వాచార్యులు శాస్త్రాన్ని పూర్తిగా విశ్లేషించిన తరువాత హరి పాదాకృతిని ధరించాలని నిర్దేశించారు.
  • చాలా చిన్నతిరుమణ్ (ఒక చిన్న చుక్క రూపంలో) ధరించుట అవరోధం. అనువాదకుడు యొక్క గమనిక: కొంత మంది తిరుమణ్ యొక్క నాలుగు మూలల్లో కేవలం 4 చుక్కలు మాత్రమే ధరిస్తారు – అలాంటి పద్ధతిని సూచిస్తుంది కాబోలు.
  • తిరుమణ్ చాలా సన్న రేఖలుగా పెట్టుకోకూడదు.  అనువాదకుడు యొక్క గమనిక: ముందు వివరించినట్లుగా రెండు నిలువు తెల్ల రేఖల మధ్య దూరం కనీసం 2 అంగుళాలు ఉండాలి.
  • మన పూర్వాచార్యులు నిర్దేశించిన తిరుమణ్ యొక్క సరైన కొలతలు తెలియకుండా తిలకం పెట్టుకొనుట ఒక అడ్డంకి.
  • తిరుమణ్ ని నిర్దేశించిన  12 శరీర భాగాలపై పెట్టుకోవాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి. అనువాదకుడు యొక్క గమనిక: మన పూర్వాచార్యులు గ్రంథాలలో ఎప్పుడూ తిరుమణ్ కాప్పును ధరించే వివరణ వచ్చినపుడు, ఎప్పుడూ వారు ద్వాదశ ఊర్ధ్వపుండ్రాల (12 తిరుమణ్ ధారణ) గురించి నిర్దేశించారు –  కాబట్టి రోజు శ్రీవైష్ణవులు 12 ఊర్ధ్వపుండ్రాలను పెట్టుకోవాలి.
  • అలాగే, 12 తిరుమణ్లు (ప్రతి భాగానికి తగిన విధంగా ఎమ్బెరుమాన్ నామాలతో) కేశవ నామం నుండి ప్రారంభించి సరైన క్రమంలో (ముందు వివరించిన విధంగా) ధారణ చేయాలి.
  • మొత్తం 12 తిరుమణ్లు శరీరం యొక్క సరైన భాగాలపై ధరించాలి.
  • తిరుమణ్ ధరించిన తర్వాత, వేళ్ళ గోర్లతో సరిచేయ కూడదు.
  • మధ్యలో శ్రీచూర్ణం లేకుండా తిరుమణ్ని ధరించకూడదు. అనువాదకుడు యొక్క గమనిక: ఒక్క చరమ కైంకర్యం (తుది ఆచారాలు), అశౌచ కాల (బంధువుల జన్మ / మరణ  కలుషిత సమయాల్లో) సమయాల్లో మాత్రమే – తిరుమణ్ మాత్రమే ధరించబడుతుంది – అన్ని ఇతర సమయాల్లో, తిరుమణ్ తో పాటు  శ్రీచూర్ణం కూడా పెట్టుకోవాలి. తిరుమణ్ ఎమ్బెరుమాన్ (చారణ కమలాలు) మరియు శ్రీచూర్ణం తాయారుకి ప్రతీక – వారిని ఒకరి నుండి ఒకరిని వేరు చేయకూడదు – అది పెద్ద అపచారం.
  • తిరుమణ్ని చేతిలో కలిపేటప్పుడు మనం శ్రీ శైలేశ దయాపాత్రం తనియన్, ఆచార్య తనియన్లు, రహస్య త్రయం (తిరుమంత్రం, ద్వయం, చరమ శ్లోకం) మొదలైనవి స్మరించుకోవాలి. ఇతర మంత్రములను తిరుమణ్ని కలిపేటప్పుడు స్మరించరాదు.
  • తిరుమణ్ని సొంత వేళ్లతో మాత్రమే ధారణ చేయాలి. ఏ ఇతర పరికరాలను వాడకూడదు.
  • లౌకిక ధోరణి వారు వాడిన జాలంతో కలిపిన తిరుమణ్ని వాడరాదు.
  • భాగవతలచే ఉపయోగించబడిన నీటితో కలపిన తిరుమణ్ని ధరించక పోవుట ఒక అడ్డంకి – అనగా,  తిరుమణ్ని సిద్ధం చేయటానికి భాగవతులు ఉపయోగించిన నీటిని వాడాలి.
  • ఆచార్యుల కొరకై తెచ్చిన జలాన్నిమన తిరుమణ్ని కలపడానికి వాడటం ఒక అడ్డంకి.
  • సంసారుల (లౌకికంగా ఆలోచించే మనుషులు) ముందు తిరుమణ్ ధారణ చేయకూడదు.
  • సంసారుల (లౌకికంగా ఆలోచించే మనుషులు) నుండి తిరుమణ్ని తీసుకోని వాడకూడదు.
  • తిరుమణ్ శ్రీవైష్ణవుల సరైన వ్యక్తిత్వము గుర్తింపుగా భావించి ధరించాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి.
  • కేవలం శాస్త్రంలో ఆదేశించినందున తిరుమణ్ని  ధరించుట ఒక అడ్డంకి  ఉంది. అనువాదకుని గమనిక: అంతకు ముందు వివరించిన విధంగా చాలా సంతోషంగా గర్వంగా పెట్టికోవాలి. 
  • భాగవతులకు చాలా ప్రియమైనదిగా పరిగణించి తిరుమణ్ను పెట్టుకోవాలి, తీసుకోవాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి.
  • తిరుమణ్ పెట్టుకునేటప్పుడు సరిగ్గా రాలేదని మల్లిమల్లి తుడిపి పెట్టరాదు. ఒకేసారి నిదానంగా సరిగ్గా పెట్టుకోవాలి, ఎప్పుడూ తుడపకూడదు.
  • ఆచార్యులు వాడిన  తిరుమణ్, శ్రీచూర్ణముల శేషమును వాడాలి.
  • తిరుమణ్ నేరుగా ఆచార్యుల నుండి కాకపోయినా, వారిని శేష ప్రసాదంగా మార్చామని ధ్యానించి, ప్రార్థన చేయాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి.
  • ఆచార్యుల ఉపయోగం కోసం ఉంచబడిన తిరుమణ్ని మనం వాడకూడదు  మరియు మనం వాడింది ఆచార్యులకై ఉంచకూడదు. అది మహా పాపం.
  • నుదుట తిలకం లేకుండా భగవాన్, భాగవతులు మరియు ఆచార్యుల ఎదుట ఉండకూడదు. అనువాదకుడు యొక్క గమనిక: తిరునారాయణపురంలో ఒక సారి నుదుట తిలకం పెట్టుకోవడానికి తిరుమణ్ లేకపోతే, ఎమ్బెరుమానార్ వారి ముఖాన్ని (ఒక వస్త్రంతో కప్పి) దాచిపెట్టిన సంఘటనను గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఎమ్బెరుమాన్ తిరుమణ్  ఎక్కడ దొరుకుతుందో ఆ ప్రదేశాన్నిఅతనికి చూపించగా, ఎమ్బెరుమానార్ సంతోషంగా అక్కడికి వెళ్లి తిరుమణ్ను సేకరించి వెంటనే ధరిస్తారు. 
తరువాత తుళసి / తామర కొమ్మల మాల (దండలు) మొదలైన వాటి ధారణ గురించి ఇక్కడ వివరణాత్మకంగా చర్చించబడింది.
  • విడి విడిగా తుళసి / తామర కొమ్మల (కాండం) మాలను  ధరించుట ఒక అడ్డంకి. తుళసి మరియు తామర కాండం పూర్తిగా ఎండబెట్టినప్పుడు, చిన్న పూసలుగా తయారు చేసి దండలు చేయడానికి ఉపయోగిస్తారు. వాటిని ఎప్పుడూ కలిపి ధరిస్తారు, విడిగా ధరించరాదు (అంటే ఒకటి లేదా మరొకటి). అనువాదకుడు యొక్క గమనిక: “యే కణ్ట లగ్న తుళసి  నలినాక్ష మాలా; యే బాహు మూల పరిచిన్నిత సంఖ చక్రా; యె వా లలాట ఫలకే లసద్ ఊర్ధ్వ పుండ్రా; తే వైష్ణవా  భువనం ఆసు పవిత్రయంతి” – తుళసి / తామర కాండపు దండలను ధరించే వారు, వారి భుజాలపై శంకచక్రాల చిహ్నములను ధరించిన వారు, నుదుట ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకున్న శ్రీవైష్ణవుల సమక్షంలో ఆ ప్రదేశం పరిశుద్ధమవుతుంది. తరచుగా ఒకటి లేదా ఇతర మాలను (తుళసి / తామర కొమ్మల (కాండం) మాలను) ధరించిన వ్యక్తులను చూస్తుంటాము.  ఇక్కడ వాటిని ఎల్లప్పుడూ కలిసి ధరిస్తారని చెప్పబడింది. శ్రీవైష్ణవులు ఎమ్బెరుమాన్ / ఆళ్వారులు / ఆచార్యులు ధరించిన పవిత్రమాలలను కూడా ధరిస్తారు.
  • నాభి వరకు ధరించక పోవుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక:  నాభి వరకు వేలాడేటట్టుగా ధరించాలి. ఇతర సాంప్రదాయాలలో, మెడ చుట్టూ బిగించి ధరిస్తారు. కానీ మన పూర్వాచార్యులు నాభి వరకు ధరించారు – ఇది ఇప్పటికీ వివిధ ఆలయాలలో పవిత్ర మాలలను ధరించే విధానాన్ని గమనించవచ్చు, వారు నాభి వరకు పొడుగ్గా ధరిస్తారు.
  • చుట్టిన మొలతాడు  ధరించుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: వైధీకులకు మొలతాడు చాలా తప్పనిసరి అయిన అంశం. అది లేకుండా ఎప్పుడూ ఉండకూడదు (తరువాత క్రింద వివరణ ఇవ్వబడింది). ఇక్కడ చుట్టబడిన మొలతాడును మాత్రం ధరించకూడదు అని చెప్పబడింది.
  • మొలతాడు లేకుండా ఉండటం అడ్డంకి. అరై నాణ్ కయిఱుగా అని తమిళంలో పిలుస్తారు – ఇది ఎప్పుడూ ధరించాల్సిన అవసరం ఉంది.
  • అంతరీయం(పంచ), ఉత్తరీయం(అంగవస్త్రం, పంచ పైన చుట్టుకునేది), కౌపీనం ధరించక పోవుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక:ఎప్పుడూ అంతరీయం మరియు ఉత్తరీయంతో ఉండాలి. కొన్ని సందర్భాలలో  కర్మకండలు, తార్పనం చేస్తున్నప్పుడు మాత్రమే అంతరీయం ఒక్కటే ధరించాలి – అటువంటి పరిస్థితులలో ఉత్తరీయం ధరించరాదు. మిగిలిన అన్ని సమయాల్లో రెండు వస్త్రాలు ధరించాలి. ఈ మధ్య కాలంలో , అన్నీ తెలిసిన పండితులు కూడా ఒక పంచ వేసుకొని వెళుతున్నారు – అలా ఎప్పటికీ చేయకూడదు –  ఎల్లప్పుడూ అంతరీయంతో పాటు ఉత్తరీయం కూడా వేసుకొని ఉండాలి. కౌపీనం అనేది నడుము వస్త్రం – ఇది  కుట్టుపని లేని సహజమైన అంగ వస్త్రం. వైదీకులు కుట్టిన వస్త్రాలను ధరించకూడదు – కైంకర్య సమయంలో కేవలం నేసిన వస్త్రాలను మాత్రమే ధరిస్తారు.
  • నలుపు కంబళి/దుప్పటిని ఉపయోగించుట ఒక అడ్డంకి, వాడకూడదు.
  • చిరిగిన బట్టలు లేదా మాసిన బట్టలు ధరించుట ఒక అడ్డంకి.
  • పంచ కట్టుకునేటప్పుడు, పంచ చివరి భాగాలు క్రింది వేలాడేటట్టుగా ధరించరాదు.
  • అంచు లేని వస్త్రాలు (పంచ, చిర మొదలైనవి) ధరించుట ఒక అడ్డంకి.
  • పంచ క్రిందకు జారకుండా దారం/తాడును ధరించక పోవుట ఒక అడ్డంకి.
  • తలని క్షవరం (షేవ్) చేయకుండా శరీరాన్ని క్షవరం చేయుట ఒక అడ్డంకి. అనువాదకుని యొక్క గమనిక: బ్రహ్మచారులకు మరియు సన్యాసులకు, కేవలం తల/ముఖ క్షవరం మాత్రమే అనుమతించబడుతుంది (శరీరం యొక్క ఏ ఇతర భాగాల క్షవర అనుమతి లేదు). గృహస్తులు సర్వాంగ క్షవరం (శరీరంలోని అన్ని భాగాలను తల నుండి కాలి వరకు, వీపుపై భాగం మినహాయించి) ప్రతిసారి  చేయాలి – కేవలం ముఖ క్షవరం / జుట్టు కత్తిరించుకోవడం అనుమతించబడలేదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తల క్షవరం చేసినపుడు, మొత్తం జుట్టు తీసివేయకూడదు – కొంత శిఖ ఉంచాలి. ఈ రోజుల్లో పూర్తి క్షవరం చేస్తున్నారు, మన పెద్దలు ఈ విషయాన్ని అధీకృతం చేయ లేదు – సాధారణంగా, తల పూర్తి క్షవరం అవైధికంగా భావిస్తారు. ఆళ్వార్ల ఎన్నో పాసురాలలో పూర్తిగా క్షవరించన తలను అవైధిక సంప్రదాయములకు సంబంధించారు.
  • మీసం పెంచుకోనుట/కత్తిరించుకోనుట ఒక అడ్డంకి. అనువాదకుని  గమనిక: మన పెద్దలు ఎన్నడూ మీసము మాత్రమే ఉంచుకోలేదు – పూర్తిగా కత్తిరించుకునే వారు (వారి వర్ణాశ్రమం ప్రకారం) లేదా మీసంతో పాటు గడ్డం రెండు ఉంచుకునేవారు (కత్తిరించుకోకుండా). ఉదాహరణకు, దీక్షా  (భార్య గర్భవతి అయితే, తల్లిదండ్రులు పరమపదమైన మొదటి సంవత్సరం, etc) సమయంలో క్షవరం అనుమతిలేదు. కానీ ఒక్క మీసాలను ఉంచుతూ, దాన్ని కత్తిరించడం అనుమతిలేదు.
  • పొడుగ్గా గోర్లును పెంచుకొనుట ఒక అడ్డంకి.  సరిగ్గా కట్టిరించుకోవాలి.

అనువాదకుని గమనిక: పైన పేర్కొన్న కొన్ని అంశాలు వింతగా కఠినంగా అనిపించవచ్చు. కానీ ఇవన్నిటికీ కొన్ని వాస్తవిక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు కైంకర్య సమయంలో గోర్లు పొడుగ్గా ఉంటే అవి వారికి మరియు ఇతరులకు కూడా హాని కలిగించవచ్చు.

తరువాతి చర్చ, సువాసనలు మొదలైనవి ధరించుట గురించి – ఎక్కువగా లౌకిక అనుభవాలకు ఆనందాలకు సంబంధించిన అంశాలు. సందేహం లేకుండా శ్రీవైష్ణవులు ఈ వాడకానికి దూరంగా ఉండాలని అర్ధం చేసుకోవాలి.

  • ముఖానికి అలంకరణ (మేకప్) మొదలైనవి శారీరిక అందంకోసం వేసుకొనుట.
  • ఎక్కువ గంధం (చందనం) మొదలైనవి  పెట్టుకొనుట. ఇక్కడ మితిమీరిన ప్రవ్రుత్తిపైన మన దృష్టి – వర్ణాశ్రమ ధర్మం ప్రకారం గృహస్తులు ఆలయాల్లో పెరుమాళ్ళ ప్రసాదంగా కొంచం గంధం పంచి నపుడు స్వీకరించ వచ్చు.
  • ఎమ్బెరుమానుకి అర్పించని చందనాన్ని ఉపయోగించడం మొదట అడ్డంకి. అనువాదకుని  గమనిక: భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటారు, మనం ఏమి తిన్నా, చేసిన మొదట ఎమ్బెరుమానుకి అర్పించిన తరువాత మాత్రమే మనం తీసుకోవాలి అని. పెరియాళ్వార్ తిరుప్పల్లాండులో  “ఉడుత్తు కళై౦తానిన్ పీతకవాడై ఉడుత్తు..” …) – మనం ఎమ్బెరుమానునికి అర్పించిన వస్త్రాలు / పంచ మాత్రమే ధరించాలి. ఇదే సూత్రం మనం వాడే, తినే అన్నింటినీ వర్తిస్తుంది – అన్ని పదార్థాలు మొదట ఎమ్బెరుమాన్ ఆరగించి / అనుగ్రహించిన తరువాతనే మనం వాటిని వినియోగించాలి / వాడాలి.
  • నంపెరుమాళ్ యొక్క అవశేషములైన  పరిమళం (పుష్పాలు) మరియు చందనాన్ని ప్రత్యేకంగా అడిగి  తీసుకోనుట.  అనువాదకుని గమనిక: భగవత్ ప్రసాదమైనా, భోగ్య బుద్ధితో (స్వార్థంతో) అతిగా  తీసుకోకూడదు. ఎంత అవసరమొ అంత మితంగా తీసుకోవాలి. 
  • శరీర సౌందర్యానికి ఎక్కువ గంధం (చందనం) వాడట. అనువాదకుని  గమనిక: ఒక వ్యక్తి తనను తాను ఆధ్యాత్మిక చింతనలో ఉంచి శారీరక కోరికలు మరియు అనుభవములకు దూరంగా ఉండాలి. ప్రపన్నులుగా మారిన తరువాత, శరీర అనుబంధాన్ని పెంచే చర్యలలో పాల్గొనడం అర్థరహితము. అందుకు  బదులుగా, వ్యక్తి యొక్క నిజమైన స్వభావంమైన భగవాన్ మరియు భాగవతుల సేవపై దృష్టిని కేంద్రీకరించే ప్రయత్నం చేయాలి.
  • ఎమ్బెరుమాన్కి సమర్పించని వక్క మరియు తమలపాకులను గ్రహించి ఆనందించుట. అనువాదకుని  గమనిక: కాని, ప్రసాద రూపంగా పంచినపుడు కొంచం తీసుకోవచ్చు.  ఆకూ వక్కలు కూడా గృహస్తులు మాత్రమే తినవచ్చు. చందనంగా కాకుండా, వీటిని బ్రహ్మచారులు మరియు సన్యాసులు స్వీకరించి ఇతరులకు ఇవ్వ వచ్చు/పంచవచ్చు. కానీ చందనాన్ని మాత్రం బ్రహ్మచారులు, సన్యాసులు స్వీకరించరాదు.
  • చెవులకు వేర్వేరు మరియు బరువైన చెవిరింగులు, పెద్ద పెద్ద పతకాలు ధరించుట. బరువైన దుద్దులతో చెవి రంధ్రాలు సాగిపోయే సంభావన ఉంటుంది. అలాంటి భారీ చెవిరింగులను ధరించుట మానుకోవడం మంచిది.
  • తుళసిని చెవిపైన పెట్టుకొనుట. కొన్ని సమయాల్లో తుళసిని కొంతమంది చెవిలో పెట్టుకొంటారు. అలా చేయకూడదు.

చివరిగా, ఇంకొన్ని అంశాలు ఇక్కడ వివరించ బడ్డాయి. 

  • శుక్రవారం రోజు పళ్ళు తోముకొనుట.  ఈ విషయం వెనక ఉన్న కారణంపై ఎక్కువ స్పష్టత లేదు.
  • కొన్ని రకాల నల్ల సిరా / రంగులు ఇతరులను సమ్మోహించి, నియంత్రించడానికి ఉపయోగిస్తారు. ఇవి సాధారణంగా దేవతాంతరులను పూజించడం ద్వారా పొందబడతాయి. అలాంటి విషయాలకు దూరంగా ఉండాలి.
  • రక్షణ కోసం మెడలో, చేతిలో, కాళ్ళకు తాయత్తులు  ధరించుట. మన రక్షణ తిరుమణ్ కాప్పు (ఊర్ధ్వ పుండ్రం) మరియు భుజాల మీద శంఖ చక్రాలే మన  రక్షణ. అనువాదకుని  గమనిక: శ్రీవైష్ణవులు కుడా తరచూ రక్షణ కోసం ఎరుపు, నల్ల రంగు దారాలు కట్టుకుంటుంటారు. ఎమ్బెరుమాన్ మాత్రమే మన రక్షణ. అలాంటి దారాలు కట్టుకోకూడదు.  శ్రీవైష్ణవులు కేవలం తామర, తుళసి మరియు పవిత్ర మాలలు ధరించవచ్చు – ఇంకేవీ కాదు.
  • వేళ్ళల్లో వెండి ఉంగరాలు ధరించుట.
  • ఆయుధాల సంపర్కములో ఉండుట. మనము ఎమ్బెరుమాన్ ఆయుధాలపైన మాత్రమే ఆధారపడాలి.
  • భగవాన్, భాగవతులు మరియు ఆచార్యుల ముందు పురుషులు వారి శరీరంపై ఆంగ వస్త్రంతో కప్పుకోకూడదు.  అనువాదకుని  గమనిక: ధాస వర్గం (పనిచేసే వారి వర్గం) అంటే నడుము మీద ఆంగ వాస్త్రం కలిగి ఉండటం – అంటే శ్రీవైష్ణవులు ఎప్పుడూ వారి శరీరం మీద అంగ వస్త్రం ఉంచరాదు. కొన్ని దేశాచారాల (నిర్దిష్టమైన ప్రదేశాలకు ప్రత్యేక నియమాలు) ప్రకారం – శీతల ప్రదేశాలలో మనుషులు వారి శరీరాన్ని వస్త్రాలతో, శాలువలతో మొదలైన వాటిలో కప్పు కుంటారు. 
  • లౌకిక ప్రేరణతో సంభాషించుట మరియు అహంకారంతో ఉండుట.
  • కళ్ళల్లో కనికరం/జాలి లేకుండా ఉండుట ఒక అడ్డంకి. మన కళ్ళు ఎప్పుడూ శాంతిని మరియు దయను వెదజల్లుతూ ఉండాలి – ఆగ్రహం, కోపం కాదు. అనువాదకుని  గమనిక: శ్రీవైష్ణవులు సహజంగానే దయ, జాలి కలిగిఉంటారు. కాబట్టి, వారి కళ్ళు సహజంగానే ఆ గుణాలను బహిర్గతం చేస్తాయి. 
  • దివ్య ప్రబంధం (వ్యాఖ్యానములు, స్తోత్రములు, రహస్య గ్రంథాలు, మొదలైనవి) సరిహద్దుల బయట విషయాల గురించి చర్చించుట ఒక అడ్డంకి. అనువాదకుని  గమనిక: మనం ఏమి మాట్లాడినా / చర్చించినా అవి కేవలం పూర్వాచార్యుల శ్రీసుక్తులపై మీద ఆధారపడి ఉండాలి.
  • గట్టిగా మాట్లాడుట ఒక అడ్డంకి. శ్రీరాముని కీర్తించేటపుడు, “మృతు పూర్వంచ భాషతే” (నెమ్మదిగా మాట్లాడుట) – నెమ్మదిగా మాట్లాడటం చాలా మంచిది. 
  • ముచ్చట్లు, వ్యర్థ సంభాషణలు అడ్డంకులు.
  • గట్టిగా నవ్వుట.
  • అంజలితో ఉండకపోవుట ఒక అడ్డంకి. కైంకర్యంలో లేని సమయంలో మన చేతులను అంజలి (నమస్కారం) ముద్రలో ఉంచుకోవాలి.
  • చేతిలో భిక్ష పాత్ర పట్టుకోవడానికి సిగ్గుపడకూడదు. అనువాదకుని  గమనిక: ఆహార ధాన్యాలు కోసం భిక్షాటన చేయుట బ్రాహ్మణ ధర్మం యొక్క భాగం. మన సంప్రదాయంలోని అనేక గొప్ప పండితులు కూరత్తాళ్వార్, వేదాంతాచార్యులు తదితరులు ఉంజ వృత్తి (ఆహార ధాన్యాలు కోసం యాచించడం) చేశారు. 
  • అహంకారముతో ఎత్తైన ఛాతి కలిగిఉండుట – మన ప్రవర్తనలో వినయం ఉండాలి. తలకెక్కిన అహంకారము యొక్క అంశంలో వివరించబడిన దానిలాగానే.
  • కంగారుగా నడుచుట ఒక అడ్డంకి.  నెమ్మదిగా శాంతంగా నడవాలి.
  • పంచను పైకి మడిచి ధరించుట. ఇది అగౌరవప్రదంగా పరిగణించబడుతుంది.
  • భగవాన్ గురించి మనం శ్రవణం చేసినపుడు మరియు భాగవతులను చూసినపుడు సహజమైన అనురాగముతో గొప్ప భావోద్వేగాలను అనుభవించాలి మరియు మన రోమాలు నిక్కపొడుచుకోవాలి. అలాంటి భావం కలుగక పోవుట ఒక ఆటంకం. అనువాదకుని  గమనిక: ఎమ్బెరుమాన్ స్వయంగా వారే తన భక్తుల గురించి వివరించినపుడు ఎనిమిది లక్షణాలను వివరిస్తారు, వాటిలో ఒకటి వారి గురించి శ్రవణం చేసినపుడు  దివ్య అనుభూతులను అనుభవించడం.  భగవాన్ అన్నారు,  “నా భక్తాలు ముఖ్యంగా ఈ ఎనిమిది లక్షణాలు కలిగి ఉంటారు –   1)ఎమ్బెరుమాన్ యొక్క భక్తుల పట్ల నియమ నిరతలేని ప్రేమ,  2) ఎమ్బెరుమాన్ ఆరాధనలో ఆనందాన్ని అనుభవించుట  3) స్వయంగా ఆమెయే/ఆయనే ఎమ్బెరుమాన్ని ఆరాధించుట, 4) ఏ గర్వం లేకుండా ఉండుట, 5) ఎమ్బెరుమాన్ గురించి శ్రవణం / ఆలోచన / చర్చలో ఆసక్తి  చూపుట 6) శారీర స్పందన (రోమాలు నిక్కపొడుచుట) వంటివి (7) ఎల్లప్పుడూ ఎమ్బెరుమాన్ గురించి ఆలోచించుట 8) ఎమ్బెరుమాన్ ఆరాధనకై ప్రతిఫలంగా తిరిగి ఏ ప్రయోజనాలను ఆశించకపోవుట. అటువంటి భక్తులు మ్లేఛ్ఛులు అయినప్పటికీ, వారు బ్రాహ్మణొత్తములచే, కైన్కర్యార్థూలచే మరియు సన్యాసులచే మరియు పండితులచే ఆరాధ్యనీయులు. అటువంటి వారు విద్వాంసుల నుండి జ్ఞానం పొందేందుకు  అర్హులు, ఆ జ్ఞానం పంచిపెట్టేందుకు అర్హులు. అదేవిధంగా, ఒక శ్రీవైష్ణవుడిని చూసినప్పుడు, చంద్రుని (చంద్రునికి ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతారు) చూసిన అనుభూతి చెందాలి, చల్లని గాలిలా (చాలా హాయిగా ఉంటుంది), మంచి చందనాన్ని పెట్టుకున్న అనుభూతిని అనుభవించాలి.
  • భగవాన్ మరియు భాగవతులకు దూరమైనపుడు బాధ పడక పోవుట. నమ్మాళ్వార్ వారి విరహ వేదనను తిరువాయ్మొళి 8.2.1 “న౦గళ్ వరివళై” పదిగంలో పంచుకున్నారు . అనువాదకుని  గమనిక: మనము ఆళవందార్ మరియు వారి శిష్యులైన ధైవవారి ఆండాన్ యొక్క సంఘటనను గుర్తుకు తెచ్చుకోవచ్చు – ఆళవందారులు తిరువనంతపురం వెళ్లినప్పుడు, ఆండాన్ చాలా అనారోగ్యం చెందుతారు, మళ్లీ ఆళవందార్లను చూసిన తరువాత మాత్రమే తిరిగి కోలుకుంటారు.
  • ఒకరి జ్ఞానం, భక్తి, వైరాగ్యం వారి రూపంలో స్పష్టంగా వ్యక్తం కావాలి. ఆ వ్యక్తిని చూడగానే సులభంగా అర్థం కావాలి. అలా ఉండక పోవుట ఒక అడ్డంకి.  అనువాదకుని  గమనిక: కూరత్తాళ్వార్ యొక్కచరిత్ర కథనంలో, ఆళ్వార్ని చూసిన వారు ఎవరైనా పరిశుద్దులవుతారని చెప్తారు – అలాంటివి వారి లక్షణాలు, వారి భౌతిక రూపంలో స్పష్టంగా కనిపిస్తాయి.
  • వైష్ణవత్వం సహజంగా ఒకరి రూపంలో వ్యక్తం కాక పోవుట ఒక అడ్డంకిగా చెప్పవచ్చు. మునుపు వివరణ మాదిరిగానే.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/02/virodhi-pariharangal-11.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

విరోధి పరిహారాలు – 10

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పరిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

<< విరోధి పరిహారాలు – 9

ఎమ్బెరుమానార్ వెలికి తీసిన శాస్త్ర సారాంశం –

దివ్య దేశాల అర్చావతారములుకు కైంకర్యము చేయుట

నిత్య కర్మానుష్టానం

41. అనుష్ఠాన విరోధి  –  రోజువారి పనులలో అడ్డంకులు

అనువాదకుని గమనిక: అసలు అవరోధాలు / అడ్డంకుల అంశంలోకి  ప్రవేశించే ముందు ఈ విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషిద్దాం. ఈ అంశంలో ఏమి చేయాలో ఏమి చేయకూడదో అన్న సందేహాలు, అపార్థములు చాలా ఉన్నాయి.

  • మన అనుష్ఠాన ప్రక్రియలో అనేక అంశాలు ఉన్నాయి. మన సాంప్రదాయ ప్రధాన సూత్రాల ప్రకారం  మన నడవడి ఎలా ఉండాలో ఇక్కడ చర్చించబడింది.
  • అంటే, కర్మము మరియు కైంకర్యం మధ్య ఆంతర్యాన్ని అర్ధం చేసుకొనుట. కర్మము సామాన్య (వర్ణాశ్రమం – శరీర ధర్మం) ధర్మం అయినప్పటికీ, అనుసరించాల్సిన అవసరం చాలా ఉంది, కైంకర్యం విశేష (స్వరూప – ఆత్మ కోసం) ధర్మం, సామాన్య ధర్మం కంటే చాలా ముఖ్యమైన ధర్మం.
  • కర్మము 3 రకాలు
    • నిత్య కర్మ – సంధ్యావందనం వంటి దినచర్యలు మొదలైనవి
    • నైమిత్తిక కర్మ – తర్పణం మొదలైనవి వంటి చర్యలు
    • కామ్య కర్మ – ప్రాపంచిక / భౌతిక ప్రయోజనాల కోసం చేసే చర్యలు
  • కైంకర్యం కూడా 3 రకాలు
    • భగవత కైంకర్యం –  భగవానునికి చేసే సేవ (నిత్య మరియు నైమిత్తిక కర్మములు భగవత కైంకర్యంలోని భాగములే, ఎందుకంటే ఈ కర్మములు భగవానుడు స్వయంగా అందరికి  ఆదేశించిన కాబట్టి)
    • భాగవత కైంకర్యం – భాగవతులకు చేసే సేవ
    • ఆచార్య కైంకర్యం –  ఆచార్యులకు చేసే  సేవ
  • మనము అర్థం చేసుకొని అనుసరించాల్సిన ఈ సూత్రం చాలా ముఖ్యమైనది. వర్ణాశ్రమ ధర్మాన్ని ఎన్నటికీ విడువలేము. ముమ్ముక్షుప్పడి సూత్రం 270 మరియు 271 లో ఈ అంశాన్ని అద్భుతంగా వివరించారు – 270 అవతారిక లో మణవాళ మాముణులు అన్నారు “కర్మ, జ్ఞాన, భక్తి  యోగము యొక్క స్వరూప త్యాగం ఖచ్చితంగా లేదు” (అంటే అది ఉపాయ బుద్ధి త్యాగము మాత్రమే – అనగా, కర్మ చేయుటయే కానీ అది భగవానుని సాధించటానికి ఉపాయంగా/ మధ్యమంగా పరిగణించరాదు, అది కైంకర్యముగా పరిగణించవచ్చు) – మనము ఏదో ఫలమును ఆశించి ఉపాయ స్వరూపంగా ఎదో చేసి భగవానుని మెప్పించము. అన్ని నిత్య (రోజువారీ – సంధ్యావందనం మొదలైనవి) మరియు నైమిత్తిక (తర్పణం మొదలైనవి) కర్మములు కైంకర్యం లాగా చేయాలి. ఇది తరువాతి సుత్రం “కర్మం కైంకర్యత్తిలే పుగుమ్ …” (కర్మం కైంకర్యలోకి వస్తుంది) – ఇది అందంగా పిళ్ళై లోకాచార్యులు మరియు మణవాళ మాముణులు తప్పా ఇంకెవరు వివరించగలరు!
  • కానీ అలాంటి సామాన్య కైంకర్యం అప్రథామంగా ఎప్పుడూ మారుతుంది? మణవాళ మాముణులు దీనిని అళగియ  మణవాళ పెరుమాళ్ నాయనార్ రచించిన ఆచార్య హృదయం వ్యాఖ్యానిస్తూ చూర్ణిక 31లో – “అత్తాణి  చేవగత్తిల్ పొదువానథు నళువుం” అని వివరించారు. మణవాళ మాముణులు వ్యాఖ్యానంలో వివరిస్తూ భగవత్ / భాగవత కైంకర్యంలో నిమగ్నమై ఉన్నప్పుడు, సామాన్య కైంకర్యము యొక్క ప్రాధాన్యం తగ్గి ఆ కర్మలను వాయుదా / దాటివేయవచ్చు.
  • సామాన్యముగా ఈ రోజుల్లో, అనేక శ్రీవైష్ణవులు ప్రాథమిక అనుష్ఠానాలను “ఇది శ్రీవైష్ణవులకు అవసరం లేదు” అని చెప్పి నిర్వహించుట లేదు.
  • కానీ మన పూర్వాచార్యులు సామాన్య కైంకర్యములు (కర్మానుష్టానం) నిర్వహించాల్సిన అవసరాన్ని స్పష్టీకరించారు మరియు వారు క్రమం తప్పకుండా ఆ కర్మలను నిర్వహించారు  – ఎందుకంటే వారు ఖచ్చితంగా శాస్త్రానికి కట్టుబడి ఉండేవారు కాబట్టి. భగవత్ కైంకర్య విషయం వచ్చినపుడు మాత్రమే, తాత్కాలికంగా సామాన్య కైంకర్యం వాయుదా / దాటి వేశారు .
  • 6000 పడి గురు పరంపరా ప్రభావంలో,  మనం దేవతాంతర ఆరాధన చేయనపుడు నిత్య / నైమిత్తిక కర్మలను ఎందుకు నిర్వహించాలని నంపిళ్ళై  ప్రశ్నించబడ్డారు. నంపిళ్ళై గారు నిత్య / నైమిత్తిక కర్మలు వైదిక అనుష్టానాలు (వేదంలో భాగం), మనము నిర్వహించాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టంగా వివరిస్తారు.
  • పెరియ వాచ్చాన్ పిళ్ళై పరంత రహస్యం చరమ శ్లోక ప్రకరణంలో వివరిస్తూ “నమ్మాచార్యర్గళ్ ఇవఱ్రై అనుష్టిప్పారుం అనుష్టియాథారుమాయ్పోరుగిఱతు”  – మన ఆచార్యులు కొందరు వర్ణాశ్రమ విధులను నిర్వర్తించాలని సూచించారు (కైంకర్యంతో సంఘర్షణ లేనప్పుడు) ఇతరులు వర్ణాశ్రమ  విధులను దాటవేయవచ్చు అని చూపారు (కైంకర్యం విరుద్ధంగా ఉన్నప్పుడు). ఈ సూత్రాన్ని ఈ క్రింది సూత్రాల నుండి అర్ధం చేసుకోవచ్చు: ఎమ్బెరుమానార్ సంద్యావందనం నిర్వహించేవారు మరియు 120 సంవత్సరాల వయస్సులో కూడా అర్ఘ్యం నిలబడి (శాస్త్ర ఆదేశం ప్రకారం) ఇచ్చేవారు. భట్టార్ నంబెరుమాళ్ళకి వింజామర కైంకర్యాన్ని చేస్తూ తమ  సంద్యావందన విధిని దాటేసేవారు.  కాబట్టి, సామాన్య కైంకర్యం నిర్వహించాలా లేదా అన్నది మనము భాగావత / భగవత్ కైంకర్యంలో నిమగ్నమై ఉన్నామా లేదా అనేదానిపై ఆధారపడి ఉంటుంది. (నేను సామాన్య ధర్మము చేయాలనుకుంటున్నాను/చేయకూడదు అనుకుంటున్నాను అన్న దానిపైన కాదు).
  • ఈ సిద్ధాంతాన్ని పిళ్ళై లోకాచార్యులు  శ్రీవచన భూషణం దివ్య శాస్త్రంలో సూత్రం 276 నుండి 278 వరకు  వివరించారు. దీనిని మరింత అందంగా మణవాళ మాముణులు వివరించారు.
    • సూత్రం 276 – కైంకర్యము రెండు రకాలు.
    • సూత్రం 277 – మనము తగిన విధులను నిర్వహించుట మరియు తగని విధులను నిర్వహించక పోవుట రెండు రకాలుగా ఉంటాయి.
    • సూత్రం 278 – నిర్వహించాల్సిన మరియు నిర్వహించకూడని విధులు, వర్ణాశ్రమము మరియు వారి ఆత్మ స్వరూపముపై ఆధారపడి ఉంటాయి. ఈ చిన్న సుత్రంపై, మణవాళ మాముణులు వివిధ అంశాలను విశ్లేషించి సుదీర్ఘ సమగ్ర వ్యాఖ్యానం వ్రాశారు. వేర్వేరు కోణాల నుండి సూత్రాన్ని వివరిస్తూ, చివరకు ” వర్ణాశ్రమ ధర్మాన్ని త్యజించుట అవసరమని భావించి నట్లయితే, అది నేరుగా భగవాన్ (మరియు పిరాట్టి) కోరికకు విరుద్ధమవుతుంది. అందువల్ల అది సమంజసం కాదు.  ఇతరుల పట్ల కరుణాభావంతో వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తున్నము అన్నట్టుగా పరిగణించాలి. (అలా చేయుట వలన అందారూ సమిష్టిగా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించి లాభం పొందుతారు  మరియు  శ్రీవైష్ణవులు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించుట వలన  ప్రతి ఒక్కరిని పురోగతిని అందజేసి మేలు చేకూరుస్తారు).
  • చివరిగా, మన పూర్వాచార్యులు పూర్తిగా శస్త్ర ఆదేశాలను అనుసరిస్తూ, నిత్య (రోజువారీ) మరియు నైమిత్తిక (కాలానుగుణంగా) కర్మలను నిర్వహించారు, వారు ఎప్పుడూ కామ్య కర్మలను (లౌకిక ప్రయోజనాలు) చేయలేదు. నిత్య మరియు నైమిత్తిక కర్మలు తప్పనిసరి – వాటిని అనుసరించక పోవుట శాస్త్ర విరుద్ధం. కానీ కామ్య కర్మలు ఐచ్ఛికమైనవి – లౌకికమైన సంపదను ఆశించేవారు కామ్యమైన  చర్యలలో పాల్గొంటారు.
  • అందువల్ల మనం మన పూర్వాచార్యుల అడుగుజాడలను అనుసరించి, వారు చూపించిన సూత్రాలను పాటించాలి.

ఈ విషయంలో వచ్చే అడ్డంకులను ఇప్పుడు చూద్దాం.

  • ఆచార్య కైంకర్యం, భగవత్ కైంకర్యం మరియు భాగవత కైంకర్యం పరిధిలోకి రాని పనులను చేయుట. ఈ మూడిట్లో మనము సహజ స్వరూపంగా పాల్గొనాలి. ఈ మూడు కైంకర్యాల యొక్క సరిహద్దుల లోకి రాని క్రియలన్నీ  అడ్డంకులు.
  • ఇంతకు ముందు పేర్కొన్న 3 కైంకర్యంలో భగవత్ కైంకర్యం మాత్రమే సహజమని, ఆచార్య (భాగవత) కైంకర్యం అదనమైనడని అనుకోకూడదు. భగవత్ కైంకర్యం నిరుపాధికం (సహజమైన- స్పష్టమైన కారణం ఆధారంగా కాదు) మాదిరిగానే, ఆచార్య కైంకర్యం కూడా సహజమైనది. ప్రణవంలో వివరించినట్లుగా జీవాత్మ సహజంగా భగవానుని దాసుడు. ఆచార్యులు/ భాగవతులు ఎమ్బెరుమానునికి చాలా ప్రియమైన వారు, వారికి కైంకర్యం చేయుట కూడా జీవాత్మకు సహజమైనదే. అనువాదకుని గమనిక: పెరియ తిరుమొళి 8.10.3 లో, తిరుమంగై ఆళ్వారు స్వయంగా ఎమ్బెరుమానుకి తిరుమంత్రం (అష్టాక్షరి) యొక్క సారాంశం వివరించారు, “తిరువెట్టెళుత్తుం కఱ్ఱుణాన్ ఉఱ్ఱతుం ఉన్నడియార్కడిమై కణ్ణపురత్తుఱైయమ్మానే ” – తిరుక్కణ్ణపురం ప్రియమైన భగవాన్! తిరుమంత్రం యొక్క సారాంశాన్ని తెలుసుకున్న తరువాత నేను మీ భక్తులకు దాసుడనని.  దీని నుండి సులభంగా అర్థం చేసుకోవలసినది ఏమిటంటే, ఆచార్యులు మరియు భాగవతులకు దాసులుగా ఉండుట అన్న  సూత్రం భగవాన్ కన్నా ముఖ్యమైనది.
  • అనృసంస్యం – కారుణ్య౦. లోక సంగ్రహం – లోక సంక్షేమం (శాస్త్రాన్ని అనుసరించడం ద్వారా).  శ్రీవైష్ణవులు సామాన్య కైంకర్యములు (సాధారణ వర్ణాశ్రమ ధర్మము) అనృసంస్యార్థ౦ (సాటి ప్రజల పట్ల గొప్ప కారుణ్య౦తో) వల్ల కాని లోక  సంగ్రహార్థ౦ (ప్రపంచ సంక్షేమం కోసం శాస్త్ర సూత్రాలను నిర్వహించడానికి) కాదు. భగవద్గీత 3.22 శ్రీకృష్ణుడు అన్నారు, నాకు ఏ విధమైన విధులు సూచించబడి లేవు, అయినప్పటికీ వారు తన వివిధ అవతారాల సమయాల్లో శాస్త్రానికి కట్టుబడి ఉన్న చర్యలలో పాల్గొంటారు. అనువాదకుని గమనిక: మునుపటి శ్లోకం 3.21 లో, సమాజంలో గొప్ప పురుషులు చేసే చర్యలను సామాన్య పురుషులు కూడా వాటినే అనుసరిస్తారని భగవాన్ అన్నారు. కాబట్టి, గొప్ప కరుణాభావంతో సామాన్య కైంకర్యంలో (వర్ణా శ్రమ ధర్మం) మన పూర్వాచార్యులు నిమగ్నమై ఉండేవారు. అనృసంస్యం మరియు లోక సంగ్రహం మధ్య సూక్ష్మ వ్యత్యాసం, మన ఉద్దేశ్యము మరియు వైఖరిలో ఉంది. కరుణాభావంతో చేయుట (అది భగవత్ ప్రీతి మరియు ఆజ్ఞ కొరకై, వర్ణాశ్రమము లౌకిక ప్రపంచ అవసరానికి తప్పనిసరి అని, నాయకులు వాటిని అనుసరిస్తే క్రమేణా అందరూ అనుసరించి ఆధ్యాత్మిక పురోగతిని చెందుతారు), ఆదర్శంప్రాయం కావాలని చేయుట (ఇతరుల అనుసరించి అభివృద్ధి చెందడానికి నేను సంపూర్ణంగా అనుసరిస్తున్నానని, చిన్న రవ్వంత అహంకారంతో).
  • కొన్ని సందర్భాలలో కరుణాభావంతో చేసిన పని జీవాత్మ యొక్క స్వభావానికి విరుద్ధంగా ఉంటుంది, ఆ చర్యలు కైంకర్యంగా పరిగణించబడవు. కైంకర్యంగా భావించుట అడ్డంకి అవుతుంది. అనువాదకుని గమనిక: జీవాత్మ యొక్క నిజమైన స్వభావం భగవాన్ / భాగవతులు నిరంతర సేవ చేయుట – ఆ సరిహద్దులు దాటి  కేవలం కరుణాభావంతో (శాస్త్రానుసారంగా కాకుండా) చేసిన పనులను కైంకర్యంగా పరిగణించరాదు. 
  •  ఎమ్బెరుమాన్ మన ముందు ఉన్నపుడు (ఊరేగింపులో భాగంగా లేదా వారి సన్నిధిలో), వారి సమక్షంలో వారిని నిర్లక్ష్యం చేసి సామాన్య ధర్మము (సంధ్యావందనం మొదలైన వంటివి) చేయకూడదు. ఆ ప్రవర్తన, భగవాన్ కన్నా ఇతరుల పట్ల మన భావనను సూచిస్తుంది. ఎమ్బెరుమాన్ వారి సన్నిధికి తిరిగి చేరుకున్న తరువాత మాత్రమే, మనము వారిని వదిలి, మన  నిత్య చర్యకై తిరిగి వెళ్లాలి. అనువాదకుని గమనిక: ఇది పరమ సంహితం లో వివరించబడింది “యేన యేన ధాతా గచ్చతి తేన సహ గచ్చతి” – ఎక్కడెక్కడికి ఎమ్బెరుమాన్  వెళితే అక్కడక్కడికి వారి భక్తులు (ఈ విషయంలో ముక్తాత్మలు) వారిని అనుసరించాలి. ముందు చెప్పినట్లుగా ఇది భట్టార్ జీవితాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. ఒక సందర్భంలో వారు ఎమ్బెరుమానుకి వింజామర సేవ చేస్తుండగా వారి సంద్యావందన సమయమయ్యి౦ది, ఒక శ్రీవైష్ణవుడు భట్టారుకి ఆ విషయం జ్ఞాపకం చేస్తారు. భట్టార్ ప్రత్యుత్తరంగా “నేను ఎమ్బెరుమానుని వింజామర సేవ చేస్తుండగా , సంద్యావందనము వదిలి వేస్తే, చిత్ర గుప్తుడు (యమ ధర్మరాజు  అనుచరుడు) పాపంగా పరిగణించడు” అని అంటారు. ఎమ్బెరుమాన్ ఉత్సవ ఊరేగింపుగా వెళ్ళినప్పుడు, ప్రతి ఒక్కరూ వారి రక్షింణకై తోడువెళ్ళాలి, వారి సన్నిధికి తిరిగి చేరుకునే వరకు వారికి తోడుగా ఉండాలి. కాబట్టి, మన పూర్వాచార్యుల ప్రకారం, కైంకర్యంలో నిమగ్నమై ఉన్నపుడు, మన కర్మానుష్టానములను కొంత ఆలస్యం చేయవచ్చు.
  • శ్రీవైష్ణవులు భగవాన్ యొక్క దివ్య గుణాలను చర్చిస్తూ / కీర్తిస్తున్నపుడు, సంద్యావందనం మొదలైనవి చేయాలని చెప్తూ గోష్టిని మధ్యలో వదిలివేయలేరు.   ఇతరుల ఉద్ధరణ కొరకై కరుణభావంతో చేస్తున్నప్పటికీ, ఆ చర్య భగవత్ / భాగావత అనుభవం కంటే ఎక్కువ కాదు.
  • ప్రపన్నులకు భగవాన్ మాత్రమే ఉపాయం. కాబట్టి, అనేక కార్యాలు చేసేటప్పుడు, వాటిని ఉపాయంగా పరిగణలోకి తీసుకోకూడదు, అయితే వాటిని కైంకర్యంగా చేయాలి . ఫలమాశించకుండా చేయాలి మరియు ఈ క్రింది అంశాలలో జీవాత్మ సహజంగా పాల్గొనాలి. ఆ అంశాలు:
    • ఊర్ధ్వ పుండ్రము పెట్టుకొనుట (తిరుమణ్/శ్రీచూర్ణం)
    • తీర్థం, ప్రసాదం మొదలైనవి స్వీకరించుట
    • ఎమ్బెరుమానుని చరణ కమలాలకు తిరుమంజనం చేయుట (తిరువారాధనంలోని భాగము)
    • దివ్యప్రబంధ పాసురాలను చదువుట
    • దీపాలు వెలిగించుట (గుడిలో, ఇంట్లో పెరుమాళ్ సన్నిధిలో మొదలైన)
    • పూల దండలు, మాలలు చేసి ఎమ్బెరుమానునికి అర్పించుట
    • భగవత్ కైంకర్యముకై పూల తోటను పెంచుట
    • శ్రీవైష్ణవులకు సేవ చేయుట
    • దివ్యప్రబంధము, రహస్య గ్రంథాలను నేర్చుకొని ఇతరులకు నేర్పించుట.
  • మన పూర్వాచార్యులు అనుసరించని చర్యలలో పాల్గొనుట. ఆండాళ్ నాచియార్ తిరుప్పావై 2వ పాసురంలో “చెయ్యాతన చెయ్యోం” అని అన్నారు.
  • కైంకర్యం ఎమ్బెరుమాన్ ఆనందం కోసం సహజంగా చేయాలి, ఇతర ఏ ప్రత్యేక ప్రయోజనం కోసం చేయరాదు.
  • భగవంతుని ఆనందం కోసం కైంకర్యం చేయాలి కాని మన సొంత ఆనందం కోసం కాదు.  నమ్మాళ్వారు తిరువాయ్మొళి 2.9.4 లో అన్నారు “తనక్కేయాగ ఎనై క్కొళ్ళుం ఈధే” –  మీ ప్రీతి కొరకై మీ సేవలో నన్ను పూర్తిగా నిమగ్నం చేసుకోండి (భగవన్ యొక్క ఆనందానికి పనికిరానిది ఏదైనా నాకూ వద్దు – కైంకర్యం చేసేటపుడు రవ్వంత మాత్రం స్వార్థం కూడా ఉండకూడదు). శ్రీరాముడు మరియు సీతా పిరాట్టి ప్రత్యేకంగా ఇష్టపడే సేవలను తనకు ఆదేశించామని లక్ష్మనుడు (ఇళయ పెరుమాళ్) విన్నపించుకుంటారు. ఆండాళ్ నాచియార్ కూడా తిరుప్పావై చివరిలో అదే విన్నపించుకుంటుంది  “మఱ్రై నం కామంగళ్ మాఱ్ఱు”.

ఈ విధంగా ఈ భాగంలో, కేవలం  భగవత్ ప్రీత్యర్థంపై దృష్టి పెట్టి అన్ని కైంకర్యాలు (భగవత్ ఆగ్యా కైంకర్యాలతో సహా, అంటే నిత్య / నైమిత్తిక కర్మానుష్టానములు) చేసే ప్రాముఖ్యతను మనము చూశాము. ప్రతిఫలం ఆశిస్తూ కైంకర్యం చేయకోడదని – కైంకర్యం ఎమ్బెరుమాన్ ప్రీత్యర్థం కొరకై మాత్రమే చేయాలని, శ్రీవైష్ణవులు చాల సహజంగా కైంకర్యాలలో పాల్గొనవచ్చు అని కూడా చూశాము.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/01/virodhi-pariharangal-10.html

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

విరోధి పరిహారాలు – 9

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పరిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

38. ఆవశ్యక విరోధి  – సూత్రాలను జ్ఞాపకం ఉంచుకొని అవి చేయుట మానుకొనే క్రమంలో అవరోధాలు

తప్పనిసరిగా ఈ అడ్డంకులు గుర్తుంచుకొని మరియు వాటిని చేయుట మానుకోవాలి. మన లాలాజలము దేనినైనా తాకినప్పుడు ఆ వస్తువు కలుషితమవుతుంది. మన శరీరం నవ ద్వారాలు కలిగి ఉంటుంది (మన శరీరం నవ ద్వార పట్టణంగా పిలువబడుతుంది – తొమ్మిది ద్వారాల నగరం – 2 కళ్ళు, 2 చెవులు, నోరు, 2 ముక్కు రంధ్రములు, మల మూత్ర రంధ్రములు). మన చేతులు ఆ భాగాల్లో దేనితో  అయినా సంపర్కములోకి వచ్చినప్పుడు, మన చేతులు కలుషితమవుతాయి, వాటిని శుద్ధి చేయాలి. నీటితో చేతులు కడిగి శుద్ధి చేయవచ్చు. మన చేతులు మన పాదాలను తాకినప్పుడు కూడా ఇంకేదైనా తాకే ముందు మన చేతులను కడిగి శుద్ధిచేసుకోవాలి.

అనువాదకుని గమనిక:ఈ విషయం మరియు తర్వాత కొన్ని అంశాలు  ఆశుద్ధికి సంబంధించినవి. ఇప్పటి ఆధునిక సంస్కృతిలో, ఆశుద్ధి పట్ల పెద్దగా పట్టింపు  లేకుండా నిర్లక్ష్యమైన వైఖరి ఉంది. సాధారణంగా, నోటిని / పెదాలను అంటుకుంటూ చేతితో తినడం / తాగడం (నాలుకతో నాకుట వంటివి) ఆశుద్ధిగా పరిగణించబడింది. అటువంటి అశుచికి అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి.

  • తినడం / తాగడం
    • ఎంగిలి చేతితో వంట గిన్నెలు/వడ్డించే గిన్నెలను  తాకడం.
    • ఎడమ చేతితో తినడం / తాగడం.
    • చెంచాలు/ స్ట్రాలతో తినడం / తాగడం కూడా అశుద్ధిగా పరిగణించబడుతుంది.
    • భోజనం తరువాత ఆ స్థలాన్ని శుభ్రపరచకపోవుట. ఆవు పేడతో అలికి శుభ్రపరచాలి.
    • భోజనం తరువాత మన కాళ్ళు, చేతులు, నోరు నీళ్ళతో కడిగి శుద్ధిచేసుకోవాలి.
  • విళుప్పు (కలుషితమైన బట్టలు/దుస్తులు)
    •  రాత్రి సమయంలో నిద్రపోయే మంచాన్ని తాకినా లేదా   మనం ధరించిన వస్త్రాలు నిద్రపోయిన తరువాత (ధోతి/చీర) కలుషితమవుతాయి. ఇక ఆ దుస్తులు ఉతకటానికి వేయాలి. స్నానం చేసిన తర్వాత మరళా ఆ దుస్తులను తాకరాదు.
  • చావు/ప్రసవం
    • తండ్రికి సంబందించిన బంధువుల ప్రసవం/చావు సమయంలో, ఆశౌచం వస్తుంది, ఆ సమయంలో ఏ కైంకర్యంలో పాల్గొనకూడదు (ఇంట్లో పెరుమాళ్ తిరువారాధనం తో సహా ). అయినప్పటికీ ఆశౌచ సమయంలో కూడా సంధ్యా వందనమును చేయుట మానకూడదు. అ
  • జుట్టు కత్తిరించుకోవడం కోసం మంగలి వద్దకు, ఆస్పత్రులు మొదలైన వంటి చోట్లకు వెళ్ళినపుడు మనం ఆశుద్దులమవుతాము. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయాలి (లేదా నది, సరస్సు, మొదలైన నీటిలో స్నానం చేసిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకోవాలి).
  • మల విసర్జన తరువాత మనం అపవిత్రమవుతాము,  స్నానం చేసి శుద్ధికావాలి.
  • ఋతుస్రావం సమయంలో మహిళలు, ఇంట్లో విడిగా ఉండి  విశ్రమించాలి. ఇంట్లో మిగిలిన సభ్యులతో కలవకూడదు.
  • అశుద్ధమైన వారిని తాకినప్పుడు లేదా వారు దగ్గరిగా రావడం కూడా అశుద్ధ౦ యొక్క ఒక అంశంమే మరియు అలాంటి సందర్భాలలో తనను తాను శుద్ధి చేసుకోవలసిన అవసరం ఉంది.

ఈ అంశం గురించి ఇంట్లో పెద్దల నుండి నేర్చుకోవాలి, సాధ్యమైనంత వరకు కలుషితం కాకుండా నివారించాలి. ఇప్పుడు ఈ అంశంపై వాటిల్లే అడ్డంకులను చూద్దాము.

  • శ్రీవైష్ణవులు మరియు ఆచార్యుల యొక్క నివాసాల పరిసర ప్రాంతాన్ని కలుషితం (ఉమ్మడం ద్వారా, మొదలైనవి) చేయుట. అనువాదకుని గమనిక: వీధుల్లో ఉమ్మడం ఇప్పుడు చాలా సాధారణం అయిపోయింది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి, ఇది ఒక పెద్ద తప్పిదం అయినందువలన అలాంటి చర్యను మానుకోవాలి.
  • ఎమ్పెరుమాన్ (ఊరేగింపు సమయంలో) మరియు శ్రీవైష్ణవుల ద్వారా సందర్శించబడిన వీధులను కలుషితం చేయడం.
  • ఎమ్పెరుమాన్ సేవకై నిత్యసూరులు పుష్పాలుగా విచ్చుకునే పూల తోటలను  కలుషితం చేయుట. అనువాదకుని గమనిక: కులశేఖర ఆళ్వార్ తమ పెరుమాళ్ తిరుమొళిలో కీర్తిస్తూ “ఊనేఱు సెల్వం” 4వ పడిగం “ఎమ్పెరుమాన్ పోన్మలైమేల్ ఏత్తేనం అవేనే” – పవిత్రమైన తిరువేంకటగిరిపైన నేనేమైన కావాలి. శ్రీరంగరాజ స్తవంలో పరాశర భట్టార్ వివరిస్తూ –  నిత్య సూరులు (ఎమ్పెరుమాన్ తో నిత్యం పరమపదంలో నివసించేవారు) దివ్య దేశాలకు దిగివచ్చి ఆ తోటలలో మరియు వీధులలో ఎమ్పెరుమాన్ ఆనందం కోసం పుష్పాల రూపంగా మరియు వృక్షాల రూపంగా ఉంటారు.
  • ఆచార్యుల ఉన్న స్థలాన్ని కలుషితం చేయుట.
  • అశుద్ధ స్థితిలో, ఆచార్యులతో ఉండుట లేదా వారికి నీరు వగైరా అందించుట.
  • అశుద్ధ స్థితిలో, మనం చేయకూడనివి
    • ఎమ్పెరుమాన్ అర్చా మూర్తిని తాకుట
    • భాగవతులను తాకుట
    • భాగవతులకు దూరంగా వెళ్ళకపోవుట
    • భాగవతుల తోటలలోకి, ఇండ్లలోకి వెళ్ళుట

39. శరీర శుద్ధి విరోధి – మన శరీరాన్ని శుద్ధి చేయడంలో అవరోధాలు

శారీర శుద్ధి అనగా తమ స్వంత శరీర స్వచ్ఛతను నిర్వహించుట. ఇతరుల స్వచ్ఛతను కాపాడుటలో కూడా ఇది వర్తిస్తుంది. అశుద్ధి కలిగించే ఏ చర్య అయినా అడ్డంకులుగా పరిగణించబడినవి, అలాంటి చర్యను మానుకోవాలి.

  • భగవాన్ కైంకర్యముకై  వాడే జలాశయాలను (నదులు, సరస్సులు వగైరా) తెలిసి తెలిసి కలుషితం చేయుట.  అలాంటి జలాశయాల స్వచ్ఛత విషయంలో జాగ్రత్త వహించాలి.
  • ఆచార్యులు మరియు శ్రీవైష్ణవుల కోసం సేకరించి ఉంచిన నీటిని ఉపయోగించుట. వ్యక్తిగత ఉపయోగం కోసం అలాంటి నీటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించకూడదు.
  • శ్రీవైష్ణవులు ఉపయోగించిన తర్వాత మిగిలిన నీటిని “శేషం” అని పిలుస్తారు. ఆ నీరు చాలా స్వచ్ఛమైనవిగా భావిస్తారు. వాటితో చేతులు, కాళ్ళు మొదలైనవాటిని కడగడానికి వాడకూడదు. అనువాదకుని గమనిక:  శ్రీవైష్ణవుల యొక్క అవశేషాలు జాగ్రత్తగా సేకరించి శ్రీపాద తీర్థంగా (చరణామృతంగా) స్వీకరించబడుతుంది.
  • ఆచార్యులు మరియు శ్రీవైష్ణవుల ఆ శ్రీపాద తీర్థాన్ని మన కాళ్ళు కడగటానికి వాడకూడదు.
  • ఆచార్యులు వారి చేతులు కడుక్కునే ప్రదేశాన్ని పవిత్రముగా పరిగణించబడుతుంది. ఆ స్థలంలో శిష్యులు  వారి చేతులు లేదా కాళ్ళు కడగకూడదు.
  • నోరు కడుక్కునే క్రమంలో వారి ఎంగిలి నీళ్ళు మరొక శ్రీవైష్ణవునిపై చిందకుండా జాగ్రత్త పడాలి.
  • భాగవతులు చూపు లేదా ముట్టుకోవడం అనేది మనల్ని శుద్ధి చేస్తుంది. శ్రీవైష్ణవులు చూపు పడ్డతరువాత లేదా ముట్టుకున్న తర్వాత తమ శరీర శుద్ధికై ఇతర మార్గాలను వెతకడం ఒక అడ్డంకి.

40. స్నాన విరోధి  – స్నానంలో అడ్డంకులు

స్నానం అనగా నదీ, సరస్సు మొదలైన జలాశయాలలో  పూర్తిగా నీటిలో మునిగి, శరీర మలినాన్నితొలగించుట. తమిళంలో నీరాట్టం లేదా తీర్తమాడుతల్ గా కూడా చెప్పబడింది.  ఒక బ్రాహ్మణుని (ఇతరులు కూడా) యొక్క రోజువారీ నిత్యకృత్యాలలో స్నానము ఒక ముఖ్యమైన క్రియగా  పరిగణించబడింది.  అవగాహన స్నానం (నది, సరస్సు, నీటిలో పూర్తిగా మునుగుట) నిజమైన స్వచ్ఛతను ఇస్తుంది అని మన పెద్దలు గుర్తించారు. మన ప్రస్తుత కాలంలో, ఇటువంటి స్నానం చాలా తక్కువ అయిపొయింది – చెంబు ఉపయోగించి తమపై తాము నీళ్ళు పోసుకొనే స్నానపు గదులలో స్నానానికి పరిమితమైపోయింది.

  • మనం కేవలం మన శరీరాన్ని శుభ్రం చేయడానికి స్నానం చేయకూడదు. శాస్త్ర నియమాలు నిబంధనల ప్రకారం స్నానం చేయాలి.
  • ప్రపన్నులు, ప్రత్యేక సందర్భాలలో పూణ్యమును ఆశించి స్నానం చేయడం అనేది అడ్డంకి. కొన్ని ప్రత్యేక  సందర్భాలైన సంగమణం, ఆయణం (దక్షిణాయణ పుణ్య కాలం, ఉత్తరాయణ పుణ్య కాలం) , గ్రహణం మొదలైనవి. ప్రపన్నుడైన వ్యక్తి, ఇప్పటికే తమ రక్షణ బాధ్యతను ఎమ్బెరుమాన్ యొక్క చారణ కమలాల వద్ద సమర్పించాడు. కాబట్టి, పుణ్య ఆర్జించుటకై  ఈ సందర్భాలలో స్నానం చేసే ప్రశ్న లేదు – అది జీవాత్మ యొక్క నిజమైన స్వభావానికి వ్యతిరేకమైనది.
  • ప్రపన్నుల సూత్రాలకు విరుద్ధంగా కొన్ని కార్యములు చేసి సంప్రదాయమును కాపాడే ఉదేశ్యంతో, అది శరీరంలో కట్టుబడి ఉండుట వలన, అలాంటి పనులు చేయవలసి వచ్చింది అని విచారించాలి. అలాంటి చర్యలకు భయపడక పోవుట ఒక అడ్డంకి. ఇది స్పష్టముగా స్నానానికి సంబంధించినది కాదు.
  • ఎమ్బెరుమాన్ కైంకర్యం కోసం జలము తీసుకువెళ్ళే నదీ తీరాల వద్ద స్నానమాచరించుట అడ్డంకి అవుతుంది. అనువాదకుని గమనిక: నమ్మాల్వార్ తమ తిరువిరుత్తం 1 వ పాసురంలో, మన శరీరం చాలా మలినమైనది అని వివరించారు. తిరుమంగై ఆళ్వార్ తమ తిరుక్కుఱుంతాణ్దగంలో మన శరీరాన్ని వివరిస్తూ ఇవే పదాలను వాడారు. అందువల్ల, ఎమ్పెరుమాన్ కైంకర్యం కోసం జలము తీసుకువెళ్ళే నదీ తీరాల వద్ద స్నానమాచరించకూడదు. ఆ స్థలాన్ని వీలైనంత స్వచ్ఛముగా ఉంచాలి.
  •  సంసారులు (లౌకికంగా ఆలోచించే వాళ్ళు) స్నానం చేసిన రేవు గట్లలో స్నానం చేయుట ఒక అడ్డంకి. సంసారులు స్నానం చేసిన నీరు మనకు అంటుకునేటట్టుగా ఒకే రేవు గట్టుపైన  స్నానం చేయకూడదు. దీనికి సంబంధించి ఒక సంఘటన, ఆచార్య అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తమ ఆచార్య హృదయం 32వ చూర్ణికలో సంభోదిస్తూ “సాధన సాధ్యంగళిళ్ ముతలుం ముడివుం వర్ణధర్మిగళ్ దాసవ్రుత్తిగలేన్ఱు తుఱైవేఱివిడువిత్తతు” – కర్మం (ఉపాయం/మాధ్యమం లోని మొదటి మెట్టు) మరియు కైంకర్యం (ఉపేయం/లక్ష్యం లోని ఆఖరి మెట్టు) మధ్య వ్యత్యాసం అర్థమైన వారు అంటారు “మీరు వర్ణ ధర్మం యొక్క సాధారణ అనుచరులు, మేము భగవత్ దాసత్వం (ఎమ్బెరుమాన్ యొక్క దాసులం)  యొక్క అనుచరులము  అని అంటున్నారు – కాబట్టి మేము మీతో కలిసి సమానంగా రేవు గట్లలో స్నానం చేయలేము అని ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోవాలి  అని అంటారు. మణవాళ మామునులు తిరువహింద్రపురంలో జరిగిన ఒక అందమైన సంఘటనను ఇక్కడ  కీర్తిస్తూ సంభోదిస్తున్నారు – ఒక శ్రీవైష్ణవుడు (సన్యాసి/జీయర్ లేదా ఒక గొప్ప విద్వాంసుడు) ఉండేవారు, వారి పేరు “విల్లిపుత్తూర్ పగవర్”, వారు ప్రత్యేకమైన రేవు గట్టులో వారి అనుష్టానమును నిర్వహిస్తున్నారు,  ఒక స్థానిక బ్రాహ్మణుడు మరొక రేవు గట్టులో వారి అనుష్టానమును నిర్వహిస్తున్నారు.  విల్లిపుత్తూర్ పగవర్ స్వామిని ఆ బ్రాహ్మణుడు వారి గట్టులోని రమ్మని విన్నపిస్తారు.  విల్లిపుత్తూర్ పగవర్ స్వామి ప్రత్యుత్తరంగా ఒక ప్రమాణమును ప్రస్తావిస్తూ, “మేము శ్రీమన్నారాయణుని యొక్క దాసులము మరియు భక్తులము, మీరు వర్ణ  ధర్మ అనుచరులు. మన ఇద్దరం కలిసే ప్రశ్నేలేదు” అని బదులిచ్చి ఆ స్థలం వదిలి వెళ్ళిపోతారు.
  • నదులలో స్నానం చేస్తున్నప్పుడు, సంసారులు ఉపయోగించిన రేవునీరు మన గట్టువైపు వస్తున్న ప్రదేశంలో స్నానం చేయకూడదు. అనువాదకుని గమనిక: దీని అర్థం సంసారులు ఉపయోగించిన నీటి అవశేషాలలో మనం స్నానం చేయుట అనుకూలమైనది కాదు.
  • ఒకవేళ, మనం స్నానం చేసిన రేవు నీరు ప్రవహించి  శ్రీవైష్ణవులు  ఉపయోగించే గట్టులోకి ప్రవహింస్తే ఆ రేవు గట్టులో స్నానం చెయ్యకూడదు. శ్రీవైష్ణవులు స్నానం చేసిన తరువాత  మనం స్నానం చేయాలి. ఈ సంబంధంలో మణవాళ మాముణుల జీవితంలో నుండి ఒక సంఘటనను చూద్దాము. పెరియ జీయర్ (మణవాళ మాముణులు) స్నానం కోసం కావేరి నదికి వెళ్ళేవారు. శ్రీరంగనాథుని సేవించే తిరుమంజన అప్పా అన్న ఒక శ్రీవైష్ణవుడు నిత్యం క్రమం తప్పకుండా మణవాళ మాముణులు స్నానం చేసిన తరువాత వారు స్నానం చేసే వారు, ఆవిధంగా వారు జ్ఞానం మరియు వైరాగ్యం మొదలైన అనుగ్రహానికి పాత్రులైనారు. మణవాళ మాముణులు స్నానం చేసిన తరువాత వీరు స్నానము చేసిన ఒక ఈ చిన్న చర్యతో మణవాళ మాముణులను ఆచార్యులుగా స్వీకరించేందుకు దారితీసింది.
  • మంత్రాలను ధ్యానిస్తూ స్నానం చేయుట. సాధారణంగా స్నానం చేసే సమయంలో కొన్ని మంత్రాల (ప్రణవం మొదలైనవి) అనుసంధానం చేస్తారు.  అవైష్ణవ మంత్రాల అనుసంధానం చేయకుండా జాగ్రత్తగా పడాలి.
  • ఇది సాధారణంగా “ఇమమ్మే గంగే యమునే సరస్వతీ” శ్లోకం స్నానం చేసే ముందు చదవబడుతుంది. ప్రపన్నులు అలా చేయకూడదు. శ్రీరంగనాథుని “తిరువరంగ ప్పెరునగరుళ్ తెణ్ణీర్పొన్నిత్తిరైక్కైయాళ్ అడివరుడప్పళ్ళి కొళ్ళుం కారుమణి” అని పిలుస్తారు. శ్రీరంగంలో విశ్రమిస్తున్న ఆ నల్లని మణి (ఆదిశేషుని పై)ని  స్వచ్ఛమైన కావేరి నదీ అలలు నెమ్మదిగా తాకుతున్నాయి”. పెరుమాళ్ తిరుమోళి 1 వ పాసురంలో,” గంగైయిల్ పునితమాయ కావేరి” – గంగా కన్నా కావేరీ ఎక్కువ పవిత్రమైనది “అని చెప్పాలి. పరమపద సరిహద్దుల్లో  ప్రవహించే  విరజా నదిని స్నానం సమయంలో గుర్తుంచేసు కోవడం జీవాత్మ యొక్క నిజమైన స్వభావం అని చెప్పుకోవచ్చు  (ఎందుకంటే మోక్షానికి ముందు ఈ నదినే మనం దాటాలి).
  • ఎమ్బెరుమాన్, ఆళ్వారుల మరియు ఆచార్యుల ఉత్సవాల నుండి తిరిగి  వచ్చిన తరువాత స్నానం చెయ్యడం సరైనది కాదు. సేవార్తులను (ఉత్సవ సమయాల్లో దర్శనం కోసం వచ్చేవారు) తాకిన తరువాత కూడా స్నానం చేయకూడదు. ఎమ్పెరుమాన్, ఆళ్వారుల మరియు ఆచార్యుల యొక్క దివ్య సమక్షంలో, ఆ సమూహములో ఏదైనా అమంగళము / ఆశుద్ది  తొలగించబడుతుంది.
  • శ్రీవైష్ణవుల (సన్యాసులు మరియు ఇతర గొప్ప శ్రీవైష్ణవులు) వారి శరీరాన్ని  విడిచిపెట్టినప్పుడు – వారి శరీరాలను “విమల చరమ విగ్రహం” – పవిత్రమైన అంతిమ శరీరంగా భావించాలి. అటువంటి తుది తిరుమేని (శరీరం)ని ఎమ్పెరుమాన్ యొక్క అర్చా విగ్రహానికి సమానంగా పరిగణిస్తారు. అందువల్ల అటువంటి శరీరానికి అశౌచం /శుష్టి (కలుషితము) అని భావించుట పూర్తిగా అజ్ఞానం, మానుకోవాలి. తుది ఆచారాలను పూర్తి చేసిన తర్వాత, ఒక వ్యక్తి స్నానం చేయవచ్చు – కానీ అది అవబ్రుత స్నానం (పవిత్ర స్నానం – ఉత్సవం ఆఖరున చేసే పవిత్ర స్నానం) లాగానే పరిగణించాలి.
  • అవైష్ణవులు / అభాగవతులు సంసారులు (లౌకికంగా ఆలోచించే వాళ్ళు) చేత తాకినప్పుడు స్నానం చేసి, తనను తాను శుద్ధి చేసుకోవాలి. అలా చేయక పోవడం ఒక అడ్డంకి.
  • ఆచార్యుల తిరువధ్యయనం రోజు (పరమపదాన్ని అధిరోహించిన ఉత్సవం రోజున), శిష్యులు స్నానం చేసి, భగవతారాధానం మరియు భాగవతారాధానం  తగినంతగా చేయాలి.  అనువాదకుని గమనిక: ఆచార్య యొక్క తిరునక్షత్రము, తీర్థం మఠం / తిరుమాళిగలో జరుపుకుంటారు, శిష్యులు భౌతికంగా మరియు ఆర్థికంగా  పాల్గొంనాలి.  ఆచార్యుల  యొక్క తిరునక్షత్రము మరియు తీర్థం నిర్వహించడం శిష్యుల యొక్క ప్రాధమిక విధి.
  • స్నానం చేసిన తరువాత మన తల, మొదలైనవి ఆరపెట్టుకోవడానికి విదిలించ కూడదు, మన శరీరంపైనున్న  నీళ్ళు దగ్గరలో ఉన్న శ్రీవైష్ణవుల మీద చిమ్మకుండా జాగ్రత్త పడాలి.
  • శ్రీవైష్ణవులను వేదకప్పోన్ (గీటురాయి) గా చెప్పబడ్డారు – వారిని తాకినప్పుడు మనం పవిత్రులము అవుతాము. వారి తాకిడిని అపవిత్రముగా భావించి స్నానమాచరించుట అది ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక:  శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో  పిళ్ళై లోకాచార్య సూత్రం 221 లో “వేదకప్పోన్ పోళే ఇవర్గళోటై సంబంధం” – శ్రీవైష్ణవులతో సంబంధం కలిగి ఉండుట గీటురాయిని తాకుట వంటిది – ఒక గీటురాయి ఇనుముని తాకినప్పుడు, ఇనుప ముక్క బంగారం అవుతుంది. అదేవిధంగా, శ్రీవైష్ణవులను తాకినప్పుడు మనం పవిత్రులమవుతాము.
  • ఎమ్పెరుమాన్ తిరుమంజనం చేసిన అనంతరం స్నానం చేయడం ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక:  తిరుమంజనం చేసే సమయంలో పాలు, పెరుగు, తేనె మొదలైనవి మనపై పడతాయి/ఒలుకుతాయి. ఇది గొప్ప అదృష్టం. అశుబ్రంగా భావించకూడదు, తమను తాము శుభ్రపరచే ప్రయత్నం చేయరాదు.
  • మన ఇంటికి వచ్చిన శ్రీవైష్ణవులను  పంపించిన తరువాత స్నానం చేయుట సరైనది కాదు.
  • స్నానం కేవలం శరీరాన్ని శుభ్రం చేయడానికి (ఆరోగ్యవంతమైన జీవనశైలిగా) అని భావించుట ఒక అడ్డంకి. స్నానం యొక్క ఆధ్యాత్మిక అంశాన్ని గుర్తుపెట్టుకొని స్నానమాచరించాలి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/01/virodhi-pariharangal-9.html

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

విరోధి పరిహారాలు – 8

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పరిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.


36. గతి విరోధి – మన నడవడిలో అడ్డంకులు.

సాధారణంగా గతి అనగా నడుచుట అని అర్ధం (గామనం – వెళ్ళుట), మార్గం (అర్చరాది గతి వంటిది – పరమపదానికి ప్రకాశవంతమైన మార్గం) మరియు ఆశ్రయం / లక్ష్యము (అగతిలో – శరణాగతి లేదు). ఇక్కడ ప్రధాన చర్చినీయాంశము,  శ్రీవైష్ణవుల (ఒక ఆచార్యుల ద్వారా భాగావ్ యొక్క ఆశ్రయం తీసుకున్న ఒకరు) పట్ల, సంసారులు (భౌతిక ప్రవ్రుత్త్తులు కలవారు), మొదలైన వారి పట్ల మనము ఎలా వ్యవహరించాలో చూద్దాము. దీనికి ముందు శ్రీవైష్ణవులు, ముముక్షువులు, సంసారులు మొదలైన వారి   యొక్క వివరణము చర్చించారు – అవసరమైన విధంగా వాటిని గుర్తు చేసుకుందాము.

  • శ్రీవైష్ణవులు పడుకున్న పక్కపైన అడుగుపెట్టుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: శ్రీవైష్ణవులు వాడినదేమైనా పవిత్రంగా భావించి గౌరవించాలి. మన సంప్రదాయంలో, ఏ వస్తువైనా కాలికి తగిలితే అపచారంగా భావిస్తారు. కాలు తగలడం గానీ పైన పెట్టడం గానీ  కాలితో వస్తువులు లాగడం గానీ మొదలైనవి ఇతర సంస్కృతుల్లో చాలా సాధారణమైనప్పటికీ, మన సంప్రదాయంలో మన కాళ్ళు లేదా పాదాలు ఏదైనా వస్తువును తాకితే గొప్ప అగౌరవంగా పరిగణించబడుతుంది.
  • మన దగ్గరకు వస్తున్నా శ్రీవైష్ణవుల నిర్లక్ష్యం చేయరాదు, ఇది అగౌరవంగా పరిగణించబడుతుంది. వినయపూర్వకముగా, వినమ్రంగా వారికి ప్రణామాలు అందించి ముందుకు సాగాలి. అనువాదకుని గమనిక: ఒక శ్రీవైష్ణవుడు మరొక శ్రీవైష్ణవుని కలిసినపుడు  పరస్పరం సాష్టాంగ ప్రణామం చేసి గౌరవించాలని శాస్త్రంలో వివరించబడింది – కానీ ఈ అలవాట్లు ఈ రోజుల్లో వేగంగా కనుమరుగవుతున్నాయి.
  • మునుపటి వివరణకు విరుద్ధంగా, సంసారుల పట్ల అతి వినయంగా ఉండుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: సంసారులు  లౌకిక సుఖాలపై మక్కువ పెంచుతారు –  లౌకిక ప్రయోజనాల కోసం వారి పట్ల వినమ్రంగా ఉంటే మన ఆధ్యాత్మిక పురోగతికి హాని వాటిల్లుతుందని మన పుర్వాచార్యులు వివరించారు – కావున అలాంటి విషయాలపట్లగానీ వారి పట్ల గానీ ఆణుకువగా ఉన్నట్లయితే  మన ఆధ్యాత్మిక పురోగతికి హాని వాటిల్లుతుంది.
  • దేవాలయాల యొక్క విమానాలు, గోపురాలపై మన దృష్టి పడినపుడు, వాటిని నమస్కరించాలి, వాటి అందాన్ని ఆస్వాదించాలి. వాటిని నిర్లక్ష్యం చేసి లేదా హడావిడిగా వాటిని దాటి వెళ్ళడం అనేది ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: పెరియ తిరుమొళి 2.6.6 పాసుర వ్యాఖ్యానంలో, పెరియవాచ్చాన్ పిళ్ళైవారు నంజీయర్ వారి ఒక సంఘటనను కీర్తిస్తూ, వారు తిరునఱైయూర్ అరయర్ మరియు భట్టార్ ఆలయ గోపురాన్ని, శ్రీవైష్ణవుల యొక్క నివాసాలని మొదలైన వాటిని చూస్తూ ఆస్వాదించుకుంటూ ప్రదక్షిణ చేసేవారని వివరించారు.
  • దేవతాంతర (ఇతర దేవతలు) ఆలయాల విమానాలు, గోపురాలు శ్రీవైష్ణవుల దృష్టిలో పడితే, వాటిని పూజించి  ఆస్వాదించ కుండా త్వరగా ఆ ప్రాంతం నుండి తప్పుకోవాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక:ఈ సందర్భంగా ఒక సంఘటనను నంపిళ్ళై తన తిరువాయ్మోళి 4.6.6 పాసురం ఈడు వ్యాఖ్యానంలో వివరించారు. పిళ్ళై ఉఱంగావిల్లి దాసుని యొక్క మేనల్లుళ్ళు వణ్దర్ మరియు చొణ్దర్ ఒకసారి అగళంగ నాట్టాళ్వన్ తో కలిసి నడుస్తునారు. వారిని ఆట పట్టించాలనే ఉద్దేశ్యంతో, అగళంగ నాట్టాళ్వన్ ఒక జైన దేవాలయాన్ని చూపించి, అది ఎమ్బెరుమాన్ ఆలయమని చెప్పి వారిని  నమస్కారం చేయమంటారు. వారు వెంటనే అతను చెప్పినట్టుగా చేస్తారు కానీ అది భగవానుని ఆలయం కాదని గమనించి వారు వెంటనే మూర్చపోతారు. ఇది విని, పిళ్ళై ఉఱంగావిల్లి దాసు అక్కడకు వచ్చి తన పాదాల ధూళిని అందిస్తారు, ఆ ధూళి స్పర్శతో వారు స్పృహలోకి వస్తారు. అంతటి గాఢమైనది వారి విశ్వాసం.
  • ఎమ్బెరుమానుని దేవాలయాన్ని ప్రదక్షణ చేసేటపుడు సవ్యదిశలో (కుడి నుండి ఎడమ పక్కకు గుండ్రంగా) చేయాలి – వ్యతిరేక దిశలో ప్రదక్షణ చేయుట ఒక అడ్డంకి.
  • ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, దివ్య ప్రబందం మొదలైనవి అనుసంధానం వినిపిస్తే, కాసేపు ఆగి విని నెమ్మదిగా అక్కడనుంచి వెళ్ళాలి. ఆ స్థితిలో చాలా హడావిడిగా తొందర్లో  విడిచి వెళ్ళుట సరైన పద్దతి కాదు.
  • ఇతర విషయాలను చర్చించటం లేదా మహిమపరచట వంటివి విన్నప్పుడు, చెవులు మూసుకొని అక్కడినుంచి వెళ్లి పోవాలి.
  • ఆచార్యులు లేదా శ్రీవైష్ణవులతో పాటు నడుస్తున్నపుడు వారి నీడను తొక్కరాదు.
  • మన నీడ వారిపై పడకుండా మనం నడవాలి.
  • అంతేకాక, మన నీడ సంసారులకు తాకకుండా,  సంసారుల నీడ మనకు తాకకుండా జాగ్రత్త పడాలి.
  • భగవత్ / భాగవత అరాధానం కోసం ముడి సరుకుల సేకరణకై వెళ్ళినపుడు, బ్రహ్మ, రుద్రులను ఆరాధించే వారి నివాసాలకు దగ్గరగా వెళ్ళకూడదు. వారి నివాసాలు స్మశానంతో సమానమని శాండిల్య స్మ్రుతిలో వివరించబడింది.
  • దేవతాంతరం ఆరాధనలో ఉపయోగించే పదార్థాలను తాకుట గానీ తొక్కుట గానీ అశౌచంగా భావిస్తారు, చేయకూడదు.
  • పాశండుల ( అవైష్ణవులు, భగవానుని ప్రశంసలను వ్యతిరేకించేవారు) యొక్క సాంగత్యంలో ఉండకూడదు.
  • ప్రయాణాల్లో మనకు తోడుగా వచ్చిన శ్రీవైష్ణవుల పట్ల కృతజ్ఞత భావం చూపాలి. వారిని పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయుట ఒక అడ్డంకి.
  • శ్రీవైష్ణవుల పంపుతున్నప్పుడు, వారిని కొంత దూరం వరకు వెళ్లి, మన కనుచూపు మేర నుండి అదృశ్యమయ్యే వరకు ఉండి రావాలి. మన గుమ్మం వద్దనే వారిని పంపుట సరైన పద్దతి కాదు. అనువాదకుని గమనిక: సాధారణంగ మన పెద్దవాళ్ళు శ్రీవైష్ణవులను, ఊరి పోలిమేరుల్లో ఉన్న నది లేదా సరస్సు దాకా పంపి రమ్మనేవారు.
  • ఆచార్యులు లేదా శ్రీవైష్ణవులు మన వైపు వస్తున్నపుడు, మనం వారి దగ్గరకు వెళ్ళి స్వాగతించాలి. మనం ఉన్నదగ్గరే ఉండి లేదా వారిని స్వాగతించకుండా కూర్చొని ఉండుట సరైన వైఖరి కాదు.
  • సంసారులను వ్యవహరించేటప్పుడు వారిని స్వాగతించేటప్పుడు లేదా వారిని పంపించేటప్పుడు మితిమీరిన శ్రద్ధ వహించడం అనవసరం.
  • ఆర్ధిక లాభాల కోసం సంసారుల గృహాలకు వెళ్ళకూడదు.
  • దివ్య దేశములను “ఉగంతు అరుళిన నిలంగళ్” – భగవానుడు గొప్ప కరుణతో ఇక్కడకి దిగివచ్చారు – ఈ ఆలయాలు ఆళ్వారుల చేత ప్రసంసించబడిన / మహిమపరచబడిన దేవాలయాలు. ఆచార్యులకు కొన్ని క్షేత్రాలపై ప్రత్యేకమైన అనుభందం ఉంది – వీటిని అభిమాన క్షేత్రాలు అని పిలుస్తారు (శ్రీ రామానుజుల వారు తిరునారాయణపురంపై ఎక్కువ అభిమానం చూపేవారు, మణవాళ మాముణులు రాజమన్నార్ కోయిళ్ పై ఎక్కువ అభిమానం చూపేవారు, మొదలైనవి). అలాంటి క్షేత్రాలకు వెళ్లినప్పుడు, భగవంతుని పూజించి, మహిమపరచడంలో సమయాన్ని గడపాలి.  ఆ క్షేత్రాలలో అటూ ఇటూ చుట్టూ ఒట్టిగా తిరుగుట సరైన వైఖరి కాదు. అనువాదకుని గమనిక: తీర్థ యాత్రల (పవిత్ర తీర్థయాత్రలు) యొక్క ఉద్దేశమే, ఎమ్బెరుమానుని పూజించుట, ఇతర శ్రీవైష్ణవుల సాంగత్యం పొందుట.
  • దేహ బంధువుల ఇండ్లకు  పండగలకు / సంబరాలకు వెళ్లడం.
  • ఆత్మ భందువులైన శ్రీవైష్ణవుల యొక్క పూజలు / పండుగలకు వెళ్ళకుండా నిర్లక్ష్యం చేయుట – కైంకర్య పరంగా పూర్తి అంకిత భావంతో ఉన్నవారు.
  • ఎమ్బెరుమాన్ ప్రతి ఒక్కరిలో అంతర్యామి స్వరూపంగా  ఉన్నాడు. కాబట్టి, మనం అనవసరంగా గబగబగా  నడిచి, అంతర్యామి  ఎమ్బెరుమాన్ని కలవర పరచకూడదు. నడకను నెమ్మదిగా ఉంచాలి. అనువాదకుని గమనిక:  ప్రహ్లాదుని పర్వతంపై నుండి క్రిందకు  పడవేసినపుడు,  అతను తన హృదయంలో ఉన్న ఎమ్బెరుమానునికి ఎటువంటి కుదుపు ఉండకూడదని తన హృదయాన్ని గట్టిగా పట్టుకున్నాడని ప్రహ్లాద చరితంలో చెప్పబడింది. అలాగే మన వైఖరి కూడా ఉండాలి.
  • ఎల్లపుడు నిరంతరం మనం సదాచార్యులతో (నిజమైన ఆచార్యులు – పంచ సంస్కారం చేయువారు లేదా భగవత్ విషయంలో విలువైన జ్ఞానాన్ని ఉపదేశించేవారు) ఉండి వారికి సేవలందించాలి. మణవాళ మామునులు ఈ సిద్ధాంతాలను ఉపదేశ రత్న మాల 64, 65 మరియు 66 పాసురాలలో చాల అందంగా వివరించారు. దయచేసి వాటిని చదివి స్పష్టంగా అర్థం చేసుకోండి.అనువాదకుని గమనిక:  65 వ పాసురంలో, మణవాళ మామునులు వివరిస్తూ అన్నారు, శిష్యుల (జీవాత్మ / ఆత్మ) బాగోగులు ఆచార్యుల బాధ్యత, అలాగే ఆచార్యుల యొక్క శారీరక అవసరాలు చూసుకోవడం శిష్యుని బాధ్యత, ఇంకా వివరిస్తూ ఈ సూత్రం పూర్తిగా అర్థం చేసుకొని అమలు చేయడం చాలా కష్టమని వివరించారు. 66వ పాసురంలో, మణవాళ మామునులు వివరిస్తూ, పింభళగియ పెరుమాళ్ జీయర్ నంపిళ్ళై వారి యొక్క అత్యున్నతమైన శిష్యులని వారు నిరంతరం నంపిళ్ళై వారికి సేవలు అందించే వారని ఇంకా వారి ఆచార్యుల సేవ కోసం వారు పరమపదాన్ని కూడా త్యజించారని వివరించారు. వారి హృదయాన్ని ఈ ఉద్దేశ్యాన్ని నిష్ఠగా అనుసరించమని నిర్దేశించారు.
  • భగవత్ / భాగవత కైంకర్యం కాకుండా ఇతర లౌకిక లాభాలకై ఎవరి వెనుకా వెళ్ళకూడదు.
  • సదాచార్యులకు (నిజమైన ఆచార్యులు) పూర్తి అధీనులై  ఉండాలి – ఆచార్యులు వెళ్ళమన్నపుడు వెళ్ళాలి రమ్మన్నపుడు రావాలి –  ప్రశ్నించడం గానీ / నిరాకరించడం గానీ ఉండకూడదు – సదాచార్యులను గుడ్డిగా అనుసరించాలి.
  • ఊరేగింపు సమయంలో దివ్య ప్రబంధ గోష్ఠి (సాముహిక పఠనం) లో ముందుకి వెళ్లాలని ప్రయత్నించకూడదు – ఎల్లప్పుడూ వినయంగా వెనుక ఉండాలి.  సంకోచించకుండా వెనుక పంక్తులలో నడవాలి.
  • అటువంటి గోష్ఠి సమయంలో వేగంగా నడివ లేని వారికి సహాయం చేయాలి. సహాయం అవసరమైన వారిని నిర్లక్ష్యం చేయుట ఒక అడ్డంకి.
  • ఆచార్యులకు సహాయం చేస్తున్నప్పుడు, గౌరవప్రదంగా అభిమానంతో చేయాలి. ఆశ్రద్దగా చేయకూడదు.
37. స్థితి విరోధి  –  మనం ఉంటున్న విధానంలో అవరోధాలు (మరియు ప్రవర్తన)
స్తితి అంటే ఉనికి మరియు కూర్చోవటం అని అర్థం. ఈ అంశం విభిన్న పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో వివరిస్తుంది. సంసారి అనగా వారి నిజమైన స్వభావం ( భగవాన్ మరియు భాగవత దాసులు) గురించి తెలియని వారు. ప్రధానంగా వారి దృష్టి ఎప్పుడూ మంచి ఆహారం, మంచి వస్త్రాలు, మొదలైన వాటిపై  ఉంటుంది. ఈ అంశంపై అడ్డంకుల గురించి తెలుసుకుందాం.
  • సంసారుల ధరించిన దుస్తులను తాకుట. అనువాదకుని గమనిక: ఈ అంశానికి సంభందించిన భట్టర్ జీవితంలోని ఒక సంఘటన గురించి ఇది వరకే చర్చించాము, ఇక్కడ ఒక దేవతాంతర భక్తుని వస్త్రం భట్టర్ని తాకితే అప్పుడు ఒక భాగవతుని యొక్క శ్రీపాద తీర్థాన్ని స్వీకరించి వారు  ప్రాయశ్చిత్తము చేసుకుంటారు.
  • సంసారులు కూర్చున్న ఆసనం లేదా సమానమైన ఆసనముపై కూర్చొనుట.
  • మన వస్త్రాలు శ్రీవైష్ణవులకు తాకుట. అనువాదకుని గమనిక: శ్రీవైష్ణవులకు దగ్గరగా ఉన్నపుడు జాగ్రత్తగా ఉండాలి వారిని తాకకూడదు. కొన్ని సందర్భాలలో వారు ఎమ్బెరుమాన్, ఆచార్యులు, భగవతాల కైంకర్యం మధ్యలో ఉండి ఉండవచ్చు. కొన్నిసార్లు మనం అపవిత్రగా ఉండి ఉండవచ్చు – కాబట్టి మనం శ్రీవైష్ణవులను తాకి వారిని అపవిత్రం చేయకూడదు.
  • ఇతర శ్రీవైష్ణవులకు సమానంగా మనని పరిగణించుట మరియు శ్రీవైష్ణవులతో సమాన ఆసనంలో కూర్చునట. అనువాదకుని గమనిక: శ్రీవాచన భూషణ దివ్య శాస్త్రంలో, పిళ్ళై లోకాచార్యుల చేత గుర్తించబడిన ప్రధాన అపచారం ఏమిటంటే, తమని తాము ఇతర శ్రీవైష్ణవులకు సమానంగా భావించుట. ఎప్పుడూ వినయంగా ఉండి ఇతర శ్రీవైష్ణవుల కన్నా  తమని తాము తక్కువగా భావించాలి.
  • సంసారులను మనకన్నా ఎక్కువగా భావించి వారి కంటే తక్కువ స్థానంలో క్రింద కూర్చోకూడదు. అనువాదకుని గమనిక: సంసారులు అనగా మన శారీరక అనుబంధాలను, అనురాగాలను అనేక రకాలుగా పెంచేవారు. ఏదేమైనా సంసారుల ప్రశంసించుట, వారిపై ఆధారపడుటలో జాగ్రత్తగా ఉండాలి. అది క్రమేణా లౌకిన వస్తువులపై మన ప్రీతిని పెంచి చివరికి ప్రమాదకరమైన ఈ సంసారంలో  జన్మ మృత్యు  చక్రంలో చిక్కుకొని ఉండిపోతాము.
  • సంసారులు నివసించే ఇంట్లో ఉండకూడదు.
  • లౌకిక ప్రయోజనాలు పొందడం కోసం సంసారుల రాకకై ఆత్రుతగా వేచి ఉండకూడదు.
  • సంసారుల సాంగత్యంలో ఉండకూడదు.
  • సంసారుల నిండి ఉన్న ప్రదేశంలో ఉండరాదు (నివసించరాదు).
  • శ్రీవైష్ణవులకు తక్కువ స్థానంలో కూర్చొనుటకు నిరాకరించడం. అనువాదకుని గమనిక: శ్రీవైష్ణవులతో పోల్చినప్పుడు క్రింద స్థానంలో కూర్చొనుటకు సంతోష పడాలి.
  •  శ్రీవైష్ణవుల నివసిస్తున్నఇంట్లో ఉండటానికి సంకోచించుట.
  •  శ్రీవైష్ణవుల రాక కోసం ఆత్రుతగా ఎదురు చోడటానికి సిగ్గుపడుట.
  •  శ్రీవైష్ణవుల సాంగత్యంలో ఉండటానికి ఇష్టపడక పోవుట.
  •  శ్రీవైష్ణవుల నిండి ఉన్నస్థానంలో నివసించుటకు ఇష్టపడక పోవుట.
  • ఆచార్యులు లేదా ఎమ్బెరుమాన్ ఊరేగింపు సమయములో ఇంట్లో ఉండుట మరియు ఇంటి బయటవెళ్ళుట. అనువాదకుని గమనిక: దివ్య దేశాలు మొదలైన ప్రదేశాలలో, దేవాలయంలో చుట్టుపక్కల మాఢవీధుల్లో భగవానుడు ఊరేగింపులో వస్తారు.  భగవానుడు యొక్క గొప్ప కరుణతో ప్రతి ఒక్కరిపై కృపను వర్షించాలనే ఉద్దేశ్యంతో  ఆలయం నుండి బయటికి వస్తారు.   (వృద్ధులు, వ్యాధి గ్రస్తులు, వైకల్యం ఉన్నవారు, ఆలయానికి రాలేనివారు). ఎమ్బెరుమాన్ ఊరేగింపుగా బయలుదేరినపుడు, వారు రాక ముందే ఇంటి బయటికి వెళ్లి వేచి ఉండి, స్థానిక ఆచారాల ప్రకారం (తగిన పండ్లు పువ్వులు మొదలైనవి) సామగ్రితో వారిని స్వాగతించాలి.
  • ఆచార్యులను మరియు శ్రీవైష్ణవులను చూసినప్పుడు వెంటనే లేచి ప్రణామం చేసి స్వాగతించాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి.
  • దీనికి భిన్నంగా, సంసారులు వచ్చినపుడు, వారు బాగా శ్రీమంతులైనప్పటికినీ, వాటిని గడ్డిపోస (యోగ్యమైనది కానిది) తో సమానంగా పరిగణించాలి, మరియు వారికి గొప్ప స్వాగతం ఇవ్వడం మానుకోవాలి.  అనువాదకుని గమనిక:  “యోనిత్యం అచ్యుత …” ఎమ్బెరుమానార్ తనియన్ను గుర్తుచేసుకోవాలి, ఎమ్బెరుమానార్ ఒక్క భగవానుని యొక్క చారణ కమలాల తప్ప మిగిలిన అన్నింటికీ గడ్డిపోసతో సమానంగా భావించేవారు.
  • ఆచార్యులు మరియు శ్రీవైష్ణవుల రాకను సాధారణంగా భావించుట. అనువాదకుని గమనిక: శ్రీవైష్ణవుల రాకకు సంతోషించి వారికి జాగ్రత్తగా సత్కారాలు నిర్వహించాలి.
  • ఎమ్బెరుమాన్ తిరువారాధన సమయంలో శ్రీవైష్ణవులు వస్తే, తిరువారాధనం ఆపి, శ్రీవైష్ణవులను స్వాగతించి కూర్చోపెట్టి సపర్యలు చేసి తిరిగి  తిరువారాధనం కొనసాగించాలి. తిరువారాధనం కారణంగా శ్రీవైష్ణవులను వేచి ఉంచకూడదు. భగవత్ ఆరాధనం కన్నా భాగవత ఆరాధనం ఎంతో ముఖ్యం అని అర్థం చేసుకోవాలి.
  • ఒక శ్రీవైష్ణవుని వద్ద  శ్రీపాద తీర్థం తీసుకుంటున్న సమయంలో మరొక శ్రీవైష్ణవుడు వస్తే, మొదటి శ్రీవైష్ణవుని వద్దనుండి శ్రీపాద తీర్థం  స్వీకరించుట ఆపకూడదు. అప్పుడే   వచ్చిన శ్రీవైష్ణవుని  నుండి క్షమాపణ అడిగి, కొద్దిసేపు వేచి ఉండమని అతనిని కోరి, శ్రీపాద తీర్థం  స్వీకరణ క్రమం ముగించి రెండవ శ్రీవైష్ణవుని నుండి కొనసాగించాలి.
  • శ్రీపాద తీర్థం ఇస్తున్న శ్రీవైష్ణవులు కూడా సరైన శైలిలో సహకరించాలి మరియు అర్థాంతరముగా వదిలివేయకూడదు.
  • జంగమ విమానం అనగా కదిలే వస్తువు అని అర్ధం – ఉత్సవాల సమయంలో కనిపించే వహానాలు మరియు శ్రీవైష్ణవులు (వారి హృదయాల్లో ఎమ్బెరుమానుని భరించేవారు) రెండింటిని సూచిస్తుంది. అజంగమ విమానం అంటే స్థిరమైన వస్తువు – ఆలయ గోపురం. స్థిర మరియు అస్థిరమైన విమానాలు రెండింటి నీడపైన కాలు పెట్టరాదు.
  • దేవతాంతర దేవాలయాల నీడ గానీ ఆలయ గోపుర నీడ గానీ మన మీద పడకుండా నిలబడాలి.
  • దేవతాంతరులకు ప్రియమైన చెట్ల నీడలో నిలబడకూడదు (ఉదాహరణకు వేప చెట్టు). నమ్మాల్వారికి ప్రియమైన చింత చెట్టు యొక్క నీడలో ఉండుట శ్రేష్టం.
  • దేవతాంతరులు ఆధిపత్యం ఉన్న స్థలాలలో మరియు వారికి ప్రియమైన ఆ స్థలాలలో ఉండకూడదు.
  • భాగవతుల గృహాలను నిర్లక్ష్యం చేసి అభాగావతుల (శ్రీమన్నారాయణునికి అంకిత భావం లేనివారు) వద్ద ఉండుట సబబు కాదు. అభాగావతుల వద్ద ఉండట మానుకోవడం ఉత్తమం. అనువాదకుని గమనిక: మహాభారతంలోని ఒక ప్రసిద్ధ సంఘటన నుండి ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణుడు దుర్యోధనుని వద్దకు దూతగా వెళ్ళినప్పుడు, వారు దుర్యోధన, భీష్మ ఇంకా ద్రోణాచార్యుల వద్ద కాక విదురుని భవనంలో బస  చేస్తారు.  విదురుడు, భగవానుని గొప్ప భక్తుడు, వారి రాకకు ఎంతో సంతోషిస్తారు. ఈ విషయం గురించి శ్రీకృష్ణుని దుర్యోధనుడు అడిగినపుడు, ఎమ్బెరుమాన్  సమాధానంగా “పాండవులు నాకు చాలా ప్రియమైన వారు కాబట్టి, వారికి విరుద్ధంగా ఉన్న వారి వద్దకు నేను వెళ్ళలేను.” – ఎమ్బెరుమాన్ తాను స్వయంగా భాగవతుల వద్ద బస ఉండి ఈ సిద్ధాంతాన్ని స్పష్టంగా వివరించారు.
  • ఆచార్యులు నిలబడి ఉన్నప్పుడు, శిష్యులు కూర్చుని ఉండకూడదు.
  • ఆచార్యులు నడుస్తున్నపుడు, శిష్యులు కూర్చుని ఉండకూడదు. ఆచార్యులతో కలిసి నడిచి వారికి అవసరమైన సహాయం చేయాలి.
  • ఆచార్యులు శిష్యుని నిలబడమని ఆదేశిస్తే, నిరాకరించుట అనుచిత వైఖరి.
  • భగవాన్, భాగవతులు మరియు ఆచార్యుల దిశ వైపుగా కాళ్ళు చాచుట సరైన వైఖరి కాదు.
  • దేవాలయాలలో కూడా, శ్రీవైష్ణవులు వచ్చినప్పుడు, లేచి నిలబడి వారిని గౌరవించాలి. వారు దేవాలయాలలో ప్రవేశించుట చూసి కూడా కూర్చుని ఉండటం సరికాదు.
  • భగవాన్ మరియు భాగవతుల (దేవాలయాలలో మొదలైనవి) సమక్షంలో కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోకూడదు. ఎమ్బెరుమాన్, వారి దివ్య సమూహం, ఆ దివ్య సమూహ సౌందర్యం, అద్భుతమైన భాగవతల ఉనికిని పూర్తిగా ఆస్వాదించాలి. భట్టార్ జీవితంలో ఒక సంఘటనను సూచిస్తూ, ఎమ్బెరుమాన్ ముందర కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్న ఒకరిని భట్టార్ గమనిస్తారు, అతని అజ్ఞానానికి విచారించి అతను అద్భుతమైన ఎమ్బెరుమానుని దర్శనం  కోల్పోతున్నాడని ఆ వ్యక్తికి  చెబుతారు. తర్వాత ఆ వ్యక్తి తన కంటి చూపును కోల్పోయాడని కూడా చెప్పబడింది.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/01/virodhi-pariharangal-8.html

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

విరోధి పరిహారాలు – 7

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పరిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

34.శయన విరోధి  – నిద్రించుట/శయనించుట లోని విరోధాలు.
 ఎమ్బెరుమానార్ తో  వంగి పురత్తు నంబి
శయనం  అనగా నిద్రపోవుట, పడుకొనుట, విశ్రాంతి పొందుట అని అర్థం. శ్రీవైష్ణవ పరిభాషలో స్నానాన్ని “నీరాట్టం”  అన్నట్లుగా నిద్రను “కణ్ వళర్గై” అని అంటారు. ఈ అంశంలో కొన్ని అడ్డంకులు ఇవ్వబడ్డాయి. వాటిని ఇప్పుడు చూద్దాము.
  • సంసారుల (లౌకికవాదుల) గృహాలలో నిద్రించుట ఒక అడ్డంకి. మోక్షాన్ని కోరుకునేవాడిని ముమ్ముక్షువు అంటారు. సంసారులు మోక్షాన్ని కోరుకునే వారు కాదు. నమ్మాల్వార్ ఒక సంసారి జీవిత చక్రం గురించి వివరిస్తూ తిరువిరుత్తం మొదటి పాసూరంలో “పోయ్ నిన్ఱ  జ్ఞానముం పొల్లా ఒళుక్కుం అళుక్కుడంబుం” – అజ్ఞానంతో మళ్ళీ మళ్ళీ పాపపు పనులు చేసి ఫలితంగా పదే పదే పుట్టి శరీరాన్ని పొందుతున్నాడు.
  • వాళ్ళతో కలిసి పడుకున్నా లేదా నిద్రపోయినా.
  • వాళ్ళ మంచం పైన పడుకున్నా లేదా నిద్రపోయినా
  • వాళ్ళ కాళ్ళ దగ్గర పడుకున్నా లేదా నిద్రపోయినా
  • సంసారులకు క్రింద గట్టుపై నిద్రపోవుట (ఉదాహరణకు: సంసారులు మంచం పైన, మనం నేలపైన నిద్రపోవుట).
  • వాళ్ళకు నిద్రపోవడానికి స్థలమిచ్చుట.
  • వాళ్ళు నిద్రపోయిన స్థానాన్ని శుద్ధి చేయకపోవుట.
  • శ్రీవైష్ణవుల గృహాలలో నిద్రించక పోవుట. అనువాదకుని గమనిక: శ్రీవైష్ణవుల ఇంట్లో  నిద్రపోయే అవకాశం దొరికినపుడు గొప్ప అదృష్టమని భావించాలి.
  • శ్రీవైష్ణవులు మనకు సమానమని భావించి వారితో పడుకొనుట. అనువాదకుని గమనిక: మనమెప్పుడూ శ్రీవైష్ణవులను మనకంటే ఎక్కువగా భావించాలి.
  • వాళ్ళ పవిత్రమైన మంచంపైన పడుకొనట, ఆ మంచముని గౌరవించక పోవుట.
  • వాళ్ళ చరణాల వద్ద పడుకోవడానికి సంకోచించుట.
  •  వాళ్ళ కంటే ఎత్తులో పడుకొనుట (ఉదాహరణకి: వాళ్ళు నేలపైన మీరు మంచంపైన నిద్రపోవుట).
  • వాళ్లకి నిద్రపోవడానికి సరైన స్థానం అందించకుండా తాను పడుకొనుట.
  • వారు నిద్రపోయి లేచింతరువాత ఆ స్థలాన్ని పవిత్ర పరచడం. అనువాదకుని గమనిక: మామూలుగా మనం నిద్రపోయి లేచిన స్థలాన్ని పగటి సమయంలో ఉపయోగించాల్సిన అవసరం ఉన్నట్లయితే ఆ ప్రదేశాన్ని శుభ్రపరచి / పవిత్రం చేస్తాము, ఇది సాధారణ పద్ధతి. నీరు పోసి ఆ స్థలాన్ని పూర్తిగా శుభ్రపరుస్తాము. కానీ మనం ఇతర శ్రీవైష్ణవులను పవిత్రంగా భావిస్తాము కాబట్టి, వారు నిద్రించినటువంటి ప్రదేశాన్ని పవిత్రం చేయకూడదు.
  •  విహిత విషయం అనగా శాస్త్రంలో సూచించిన / అనుమతించిన సుఖానుభవము/భోగములు – అది కూడా ఒక అడ్డంకి. ఇక్కడ అది ఒక శ్రీవైష్ణవ భార్య (లేదా శ్రీవైష్ణవ భర్త)ని సూచించబడినది. భర్త తన భార్యతో కలిసి నిద్రపోవుట మన శాస్త్రంలో అనుమతించబడిందని భోగించకూడదు. అనువాదకుని గమనిక: పిళ్ళై లోకాచార్యులు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం 101 వ సూత్రంలో వివరిస్తూ “మఱ్ఱ ఐయిరువర్కుం నిషిద్ధ విషయ నివృత్తియే అమైయుం; ప్రపన్ననుక్కు విహిత విషయ నివృత్తి తన్నేఱ్ఱ౦” – మాముణులు ఈ సూత్రాన్ని వారి అందమైన శైలిలో వివరించారు. లౌకిక ప్రయోజనాలను ఆశించేవారు, ఉపాయాంతరాలను (కర్మ, జ్ఞాన, భక్తి యోగములు) అనుసరించేవారు –   ఇతరుల భార్యల నుండి దూరంగా ఉండుట సరిపోతుంది. (అనగా, ఇతరుల భార్యలను కాంక్షిచుట సాధారణంగా శాస్త్రంలో  ఖండించబడినది). ఇతరులు తమ భార్యతో కలిసి తమ ధర్మాన్ని నిర్వర్తించవచ్చు (సంతానం ఉత్పత్తి కోసం), కానీ ప్రపన్నులకు ఇటువంటి కలయిక వారి స్వరూపానికి  అవరోధంగా పరిగణించబడింది, అందువల్ల అటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఎరుమ్బిఅప్పా ద్వారా రచించబడిన విలక్షణ మోక్ష అధికారి నిర్ణయం అను గ్రంథంలో మరింత వివరించబడింది. మన పుర్వాచార్యులు ఉత్తమ ప్రపన్నులు  అయినప్పటికీ, కొద్ది రోజులు మాత్రమే ఈ రకమైన కలయికలో అత్యంత కారుణ్య అనుభూతితో (వ్యక్తిగత అనుభవం లేకుండా) ఒకరు లేదా ఇద్దరు శ్రీవైష్ణవ సంతానోత్పత్తి (పిల్లలు) కోసం పాల్గొనేవారు, తరువాత పూర్తిగా అటువంటి చర్యలకు దూరంగా ఉండి పూర్తి భగవత్ విషయంలో మాత్రమే సమయం గడిపేవారు. ఇది ఒక సంక్లిష్టమైన విషయం కావున, తమ ఆచార్యుల నుండి సూత్రాలను సరిగ్గా వినడం  అవసరం.
  • తమ భార్య కూడా ఒక శ్రీవైష్ణవి అని పరిగణించి, ఏ కోరిక లేకుండా  ఆమెతో పాటు నిదిరించాలి. అలాంటి ఆలోచన ఉండక పోవుట ఒక అడ్డంకి.
  • ఇంద్రియ  సుఖాలను ఆనందాలను ప్రేరేపించే ఆలోచనలతో నిద్రించకూడదు.
  • భగవంతుడిని సంస్మరించకుండా నిద్రపోవటం ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: నిద్రపోయే ముందు పెరియాళ్వార్ తిరుమొళిలోని  (“ఉఱగల్ ఉఱగల్”),  “పానిక్కడలిల్ పళ్ళి కోళై”, “అరవత్తమళియినోడుం” లాంటి మొదలైన పాసురాలను స్మరించాలి.  పంచకాల పారాయణములకు నిద్ర జీవాత్మ మరియు పరమాత్మ యొక్క సంగమం (వైదికంగా ఒక దినము 5 భాగాలకు విభజించబడి ఉంది,  చివరి భాగాన్ని యోగము అని పిలుస్తారు) – భగవానుని నామాలు, రూపాలు, కళ్యాణ గుణాలను నిద్రపోయే ముందు స్మరించుట చాలా ముఖ్యమైనది.
  • వారి ఆచార్యులను మరియు ఇతర పూర్వాచార్యులను స్మరించకుండా నిద్రపోవుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: మునుపటి అంశంలోని వివరణ మాదిరిగా, ఆచార్య తనియన్లు, వాళి తిరునామాలు మొదలైనవి, నిద్రపోయే ముందు మన సంబంధం భగవానునితో ఏర్పరచిన ఆచార్యుల వారిని గుర్తుచేసుకోవడం ఎంతో అవసరం.
  • దేహ సంబంధమైన పనుల ఆలోచనలతో నిద్రపోవుట ఒక అడ్డంకి.
  • ఆత్మ మరియు ఆత్మ స్వభావ సంబంధమైన  ఆలోచనలు లేకుండా నిద్రించుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: మునుపటి అంశంలో చర్చించినట్లు, ఆత్మ భగవాన్ మరియు భాగవతుల యొక్క దాసుడని భావించే ఆలోచనలతో ఉండాలి.
  • పడుకునేటపుడు  భగవానునికి గానీ, భాగవతుల వైపు గానీ, ఆచార్యులవైపు గానీ మన కాళ్ళు చాపకూడదు.
  • నిద్రపోతున్నప్పుడు/పడుకునేటప్పుడు దేవాలయ దిశ వైపుగాని, మన ఇళ్ళల్లోని తిరువారాధనపు గది వైపుగాని, ఆచార్యుల  మఠ౦వైపుగాని / తిరుమాలిగ (నివాసము) వైపుగానీ  చాపకూడదు.
  •  ఆచార్యుల కైంకర్య సమయములో మనం నిద్రపోకూడదు.
  • ఆచార్యులు నిద్రపోకుండా మనం ముందు నిద్రపోకూడదు.
  • ఆచార్యులు మనల్ని ఏదో అవసరంమేరకు నిద్రలేపినపుడు మనం నిద్రపోకూడదు.
  • అనువాదకుని గమనిక: నిద్రపోవడాన్ని ఒక సాధారణ క్రియగా  భావించొచ్చు. కానీ ప్రతి క్రియలోనూ, వివిధ అంశాలను జాగ్రత్తగా విశ్లేషించాలి. ముందు ఉదహరించబడిన విధంగా, ఒక దినమును 5 భాగాలుగా విభజించుటను వైధిక అంటారు – అభిగమనం (ఉదయం  మేల్కొనట, ఉదయం నిత్యకృత్యాలు), ఉపాధానం (తిరువారాధానం కొరకు ముడిపదార్ధాలను సేకరించడం), ఇజ్జా (ఇంట్లో పెరుమాళుని తిరువారాధానం చేయుట), స్వాధ్యాయం (ఉభయ వేదాంతాన్ని నేర్చుకొనుట/నేర్పుట) మరియు యోగం (విశ్రాంతి – జీవాత్మ మరియు పరమాత్మ యొక్క సంగమం). యోగ భాగం సాధారణంగా మనం నిద్రిస్తున్నప్పటి సమయం, ఆ నిద్రను నియంత్రించి  /  సరైన మార్గదర్శనం చేయబడినప్పుడు, తమో గుణం అణిగి సత్వ గుణం పెరుగుతుంది. చాలా నిద్రపోవుట తమో గుణంగా భావిస్తారు, ఉదయాన్నే లేచి, భగవత్ /భాగవత కైంకర్యంలో మన మనస్సును మరియు దేహాన్ని నిమగ్నం చేసే ప్రయత్నం చేయాలి.

35. ఉత్తాన విరోధి  –  మేలుకొనే/ నిద్రలేచే సమయంలోని అడ్డంకులు

మంచం నుండి నిద్రలేయుటను ఉత్తానం అంటారు. ఈ అంశంలోని అడ్డంకులను చూద్దాము.

  • ఆచార్య/ శ్రీవైష్ణవులు మనలను మేల్కొలిపే టప్పుడు  బద్దకంగా / నెమ్మదిగా లేచుట.  అనువాదకుని గమనిక: శ్రీవైష్ణవులు మనల్ని మేల్కొలిపినపుడు, వారిచే మేల్కొలప బదినందుకు పశ్చాత్తాపపడాలి.  అందువలన ఒక్కసారిగా ఉలిక్కి పడి నిద్రలేవాలి.
  • లౌకిక మనస్తత్వం కలవారు నిద్ర లేపినపుడు ఠక్కుమని లేచుట.
  • నిద్రలేచినపుడు  భగవాన్ యొక్క కీర్తి ప్రశంసలు మరియు ఆచార్యుల కీర్తి ప్రశంసలు గుర్తుచేసుకోకపోవుట అనేది ఒక అడ్డంకి.   సాధారణంగా పండితులు “హరి: హరి:” అని స్మరించుకుంటూ  మేల్కొంటారు. “హరిర్ హరతి పాపాని” శ్లోకాన్ని మరియు ద్వయ మహా మంత్రాన్ని స్మరించుట మంచిది. అనువాదకుని గమనిక:  మన శాస్త్రంలో, ఉదయాన్నే  బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, శ్రీమన్నారాయణుని  మహిమలను గుర్తుంచుకోవాలి అని చెప్పబడింది. సాధారణంగా మన పెద్దలు నిద్రలేచే పద్దతిలో, గురు పరంపర మంత్రం “అస్మద్ గురుభ్యో నమః… శ్రీధరాయ  నమః”, రహస్య త్రయం (తిరుమంత్రం, ద్వయం, చరమ శ్లోకం), ఆచార్య తనియన్,  “హరిర్ హరతి పాపాని” శ్లోకం, “కౌసల్యా సుప్రజా” శ్లోకం, నదాతూర్ అమ్మాళ్ పరమార్థ ద్వయ శ్లోకం, గజేంద్ర మోక్షం శ్లోకం, ఇంకా పరత్వాధి పంచక శ్లోకాలను స్మరించుకుంటూ నిద్రలేస్తారు.
  • ఆచార్యులు, లేదా శ్రీవైష్ణవులు మనకోసం వేచి  చూస్తున్నపుడు మనం దివ్య ప్రబందం, స్తోత్రములు, ఇతిహాస / పురాణాలు లేదా జప పఠనం వంటి వారి అనుసంధానంపై దృష్టి ఉంచుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక:  శ్రీవైష్ణవులు మనకొరకు వేచిఉన్నపుడు లేదా మన ఇంటికి వచ్చినప్పుడు, మన నిత్య అనుసంధానం కారణంగా వారిని వేచి ఉంచకూడదు – వీలైనంత త్వరగా పూర్తి చేసి, సంతృప్తికరంగా వారిని పరిచర్యలు చేసిన తరువాత మరళా మన అనుసంధానం కొనసాగించాలి.
  • ఆచార్యులు వారి సిరస్సును మన ఒడిలో పెట్టుకుని విస్రమిస్తుండగా, అకస్మాత్తుగా తన కాలు నెప్పిగా ఉందని లేవకూడదు. ఈ సందర్భంగా భట్టార్-నంజీయార్ సంఘటనను మనం గుర్తుచేసుకోవచ్చు. నంజీయార్ (శిష్యుడు) యొక్క వడిలో తన తలని ఉంచి భట్టార్ (ఆచార్యులు) విశ్రాంతి తీసుకుంటారు – నంజీయర్ చాలాసేపు కదలకుండా ఉంటారు, భాట్టార్ నిద్రలేచి  వారి సేవా భావాన్ని, సంకల్పాన్ని గొప్పగా ప్రశంసిస్తారు. ఈ సందర్భంగా  పరశురామ, కర్ణుని సంఘటనను కూడా మనం గుర్తుచేసుకోవచ్చు.  పరశురాముని వద్ద కర్ణుడు ధనుర్విద్య నేర్చుకునే రోజుల్లో ఒకానొక సమయంలో పరశురాముడు వారి తలను కర్ణుని వొళ్ళో ఉంచి విశ్రాంతి తీసుకుంటుండగా ఆ సమయంలో, ఒక పురుగు కర్ణుని కుట్ట సాగుతుంది కాని అతను కదలకుండా అలాగే ఉంటారు. ఈ సంఘటన మనకు మహాభారతంలో కనబడుతుంది.
  • శ్రీవైష్ణవ గోష్ఠి మధ్యలో నుండి లేచి వెళ్లిపోవుట అమర్యాద, అది గోష్ఠికి అవమానంగా పరిగణించబడుతుంది. అనువాదకుని గమనిక: దివ్య ప్రభంద గోష్ఠి లేదా కాలక్షేప గోష్ఠిలో, ప్రారంభంలో ప్రవేశించి ముగింపు వరకు ఉండుట ఎల్లప్పుడూ మంచిది. మధ్యలో  వచ్చి వెళ్ళే వారి నుంచి ఇతరులకు  ధ్యానభంగం అవుతుంది.
  • శ్రీవైష్ణవులను అరిచి మేల్కొలుపుట ఒక అడ్డంకి. శ్రీవైష్ణవులు మేల్కొలపడానికి లేదా శ్రీవైష్ణవులు ఒకపక్క నుండి మరొక పక్కకు జరగమని వినయంగా చెప్పాలి.
  • ఆచార్యులను నిద్రలేవమని అనుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: ఆచార్యులు నిద్రలేచే ముందే మనం లేచి ఆచార్యులు  మేల్కొనే వరకు వేచి ఉండాలి. ఆచార్యను నిద్ర లేవమని బలవంతం చేయకూడదు. ఈ సందర్భంగా భట్టార్ జీవితంలోని ఒక సంఘటనను మనం గుర్తుచేసుకోవచ్చు. తిరుప్పావై 8 వ పాసురం 4000 పడి ఆయ్ జనన్యాచార్యుల వ్యాఖ్యానంలో, అందరు శ్రీవైష్ణవులు ఉదయాన్నే మేల్కొని, తమను అలంకరించుకొని, వెళ్ళి భట్టార్ ఇంటి గుమ్మం దగ్గిర వేచి ఉండి వారిని అతి వినమ్రంగా  మేల్కొలిపేవారు. భట్టార్ ఆళ్వాన్ / ఆండాళ్ యొక్క ప్రియమైన కుమారుడు మరియు శ్రీరంగనాథుని / శ్రీరంగ నాచియార్ యొక్క దత్తపుత్రునిగా కుమారుడు, సాటిలేని పండితులు మరియు సాంప్రదాయం యొక్క మార్గదర్శకుడైయినందున శిష్యులందరు వారి సమయములో అత్యంత గౌరవ భావంతో సేవించేవారు.
  • ఆచార్యుల మేల్కొనే ముందు మనం నిద్రలేవక పోవడం ఒక అడ్డంకి. ఆచార్యులు నిద్రించిన తరువాత నిద్రపోయి వారు మేల్కొనే ముందే లేచి వారి అవసరాలకు సహాయపడి సంతృప్తిపరచి వారిని సేవించాలి .
  • ఆచార్యుల ఇతర శిష్యులను “సబ్రహ్మచారులు” (సహపాటి) అని పిలుస్తారు. వారితో కూడా గొప్ప గౌరవంతో వ్యవహరించాలి. వారి ముంది ఆవలించకూడదు, వారి ముందు కాళ్ళు చాచుట, వారికి కాళ్ళు తగిలేటట్టుగా కూర్చోవడం వాటివి అపరాధాలుగా పరిగణిస్తారు. అటువంటివి మానుకోవాలి.
  • ఈ సహపాఠులను గౌరవించాలి. వారికి ప్రణామాలు అందించే ముందు, ముందుగా “అడియేన్” అని సంబోధించి వారికి సాష్టాంగ ప్రణామం చేయాలి. అలా చేయక పోవడం ఒక అడ్డంకి.
  • ఆచార్యుల పట్ల, ఆచార్య పత్నిపట్ల (ఆచార్యుల భార్య) మరియు ఆచార్య పుత్ర (ఆచార్యుల కుమారులు) వారి పట్ల గొప్ప గౌరవం ఉండాలి. వారు నిద్ర లేచిన వెంటనే వారికి ప్రణామం చేసి సేవించాలి. అలా చేయక పోవడం ఒక అడ్డంకి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

హిందీలో : http://ponnadi.blogspot.com/2013/12/virodhi-pariharangal-7.html

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org