విరోధి పరిహారాలు – 9

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పరిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

38. ఆవశ్యక విరోధి  – సూత్రాలను జ్ఞాపకం ఉంచుకొని అవి చేయుట మానుకొనే క్రమంలో అవరోధాలు

తప్పనిసరిగా ఈ అడ్డంకులు గుర్తుంచుకొని మరియు వాటిని చేయుట మానుకోవాలి. మన లాలాజలము దేనినైనా తాకినప్పుడు ఆ వస్తువు కలుషితమవుతుంది. మన శరీరం నవ ద్వారాలు కలిగి ఉంటుంది (మన శరీరం నవ ద్వార పట్టణంగా పిలువబడుతుంది – తొమ్మిది ద్వారాల నగరం – 2 కళ్ళు, 2 చెవులు, నోరు, 2 ముక్కు రంధ్రములు, మల మూత్ర రంధ్రములు). మన చేతులు ఆ భాగాల్లో దేనితో  అయినా సంపర్కములోకి వచ్చినప్పుడు, మన చేతులు కలుషితమవుతాయి, వాటిని శుద్ధి చేయాలి. నీటితో చేతులు కడిగి శుద్ధి చేయవచ్చు. మన చేతులు మన పాదాలను తాకినప్పుడు కూడా ఇంకేదైనా తాకే ముందు మన చేతులను కడిగి శుద్ధిచేసుకోవాలి.

అనువాదకుని గమనిక:ఈ విషయం మరియు తర్వాత కొన్ని అంశాలు  ఆశుద్ధికి సంబంధించినవి. ఇప్పటి ఆధునిక సంస్కృతిలో, ఆశుద్ధి పట్ల పెద్దగా పట్టింపు  లేకుండా నిర్లక్ష్యమైన వైఖరి ఉంది. సాధారణంగా, నోటిని / పెదాలను అంటుకుంటూ చేతితో తినడం / తాగడం (నాలుకతో నాకుట వంటివి) ఆశుద్ధిగా పరిగణించబడింది. అటువంటి అశుచికి అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి.

 • తినడం / తాగడం
  • ఎంగిలి చేతితో వంట గిన్నెలు/వడ్డించే గిన్నెలను  తాకడం.
  • ఎడమ చేతితో తినడం / తాగడం.
  • చెంచాలు/ స్ట్రాలతో తినడం / తాగడం కూడా అశుద్ధిగా పరిగణించబడుతుంది.
  • భోజనం తరువాత ఆ స్థలాన్ని శుభ్రపరచకపోవుట. ఆవు పేడతో అలికి శుభ్రపరచాలి.
  • భోజనం తరువాత మన కాళ్ళు, చేతులు, నోరు నీళ్ళతో కడిగి శుద్ధిచేసుకోవాలి.
 • విళుప్పు (కలుషితమైన బట్టలు/దుస్తులు)
  •  రాత్రి సమయంలో నిద్రపోయే మంచాన్ని తాకినా లేదా   మనం ధరించిన వస్త్రాలు నిద్రపోయిన తరువాత (ధోతి/చీర) కలుషితమవుతాయి. ఇక ఆ దుస్తులు ఉతకటానికి వేయాలి. స్నానం చేసిన తర్వాత మరళా ఆ దుస్తులను తాకరాదు.
 • చావు/ప్రసవం
  • తండ్రికి సంబందించిన బంధువుల ప్రసవం/చావు సమయంలో, ఆశౌచం వస్తుంది, ఆ సమయంలో ఏ కైంకర్యంలో పాల్గొనకూడదు (ఇంట్లో పెరుమాళ్ తిరువారాధనం తో సహా ). అయినప్పటికీ ఆశౌచ సమయంలో కూడా సంధ్యా వందనమును చేయుట మానకూడదు. అ
 • జుట్టు కత్తిరించుకోవడం కోసం మంగలి వద్దకు, ఆస్పత్రులు మొదలైన వంటి చోట్లకు వెళ్ళినపుడు మనం ఆశుద్దులమవుతాము. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయాలి (లేదా నది, సరస్సు, మొదలైన నీటిలో స్నానం చేసిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకోవాలి).
 • మల విసర్జన తరువాత మనం అపవిత్రమవుతాము,  స్నానం చేసి శుద్ధికావాలి.
 • ఋతుస్రావం సమయంలో మహిళలు, ఇంట్లో విడిగా ఉండి  విశ్రమించాలి. ఇంట్లో మిగిలిన సభ్యులతో కలవకూడదు.
 • అశుద్ధమైన వారిని తాకినప్పుడు లేదా వారు దగ్గరిగా రావడం కూడా అశుద్ధ౦ యొక్క ఒక అంశంమే మరియు అలాంటి సందర్భాలలో తనను తాను శుద్ధి చేసుకోవలసిన అవసరం ఉంది.

ఈ అంశం గురించి ఇంట్లో పెద్దల నుండి నేర్చుకోవాలి, సాధ్యమైనంత వరకు కలుషితం కాకుండా నివారించాలి. ఇప్పుడు ఈ అంశంపై వాటిల్లే అడ్డంకులను చూద్దాము.

 • శ్రీవైష్ణవులు మరియు ఆచార్యుల యొక్క నివాసాల పరిసర ప్రాంతాన్ని కలుషితం (ఉమ్మడం ద్వారా, మొదలైనవి) చేయుట. అనువాదకుని గమనిక: వీధుల్లో ఉమ్మడం ఇప్పుడు చాలా సాధారణం అయిపోయింది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి, ఇది ఒక పెద్ద తప్పిదం అయినందువలన అలాంటి చర్యను మానుకోవాలి.
 • ఎమ్పెరుమాన్ (ఊరేగింపు సమయంలో) మరియు శ్రీవైష్ణవుల ద్వారా సందర్శించబడిన వీధులను కలుషితం చేయడం.
 • ఎమ్పెరుమాన్ సేవకై నిత్యసూరులు పుష్పాలుగా విచ్చుకునే పూల తోటలను  కలుషితం చేయుట. అనువాదకుని గమనిక: కులశేఖర ఆళ్వార్ తమ పెరుమాళ్ తిరుమొళిలో కీర్తిస్తూ “ఊనేఱు సెల్వం” 4వ పడిగం “ఎమ్పెరుమాన్ పోన్మలైమేల్ ఏత్తేనం అవేనే” – పవిత్రమైన తిరువేంకటగిరిపైన నేనేమైన కావాలి. శ్రీరంగరాజ స్తవంలో పరాశర భట్టార్ వివరిస్తూ –  నిత్య సూరులు (ఎమ్పెరుమాన్ తో నిత్యం పరమపదంలో నివసించేవారు) దివ్య దేశాలకు దిగివచ్చి ఆ తోటలలో మరియు వీధులలో ఎమ్పెరుమాన్ ఆనందం కోసం పుష్పాల రూపంగా మరియు వృక్షాల రూపంగా ఉంటారు.
 • ఆచార్యుల ఉన్న స్థలాన్ని కలుషితం చేయుట.
 • అశుద్ధ స్థితిలో, ఆచార్యులతో ఉండుట లేదా వారికి నీరు వగైరా అందించుట.
 • అశుద్ధ స్థితిలో, మనం చేయకూడనివి
  • ఎమ్పెరుమాన్ అర్చా మూర్తిని తాకుట
  • భాగవతులను తాకుట
  • భాగవతులకు దూరంగా వెళ్ళకపోవుట
  • భాగవతుల తోటలలోకి, ఇండ్లలోకి వెళ్ళుట

39. శరీర శుద్ధి విరోధి – మన శరీరాన్ని శుద్ధి చేయడంలో అవరోధాలు

శారీర శుద్ధి అనగా తమ స్వంత శరీర స్వచ్ఛతను నిర్వహించుట. ఇతరుల స్వచ్ఛతను కాపాడుటలో కూడా ఇది వర్తిస్తుంది. అశుద్ధి కలిగించే ఏ చర్య అయినా అడ్డంకులుగా పరిగణించబడినవి, అలాంటి చర్యను మానుకోవాలి.

 • భగవాన్ కైంకర్యముకై  వాడే జలాశయాలను (నదులు, సరస్సులు వగైరా) తెలిసి తెలిసి కలుషితం చేయుట.  అలాంటి జలాశయాల స్వచ్ఛత విషయంలో జాగ్రత్త వహించాలి.
 • ఆచార్యులు మరియు శ్రీవైష్ణవుల కోసం సేకరించి ఉంచిన నీటిని ఉపయోగించుట. వ్యక్తిగత ఉపయోగం కోసం అలాంటి నీటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించకూడదు.
 • శ్రీవైష్ణవులు ఉపయోగించిన తర్వాత మిగిలిన నీటిని “శేషం” అని పిలుస్తారు. ఆ నీరు చాలా స్వచ్ఛమైనవిగా భావిస్తారు. వాటితో చేతులు, కాళ్ళు మొదలైనవాటిని కడగడానికి వాడకూడదు. అనువాదకుని గమనిక:  శ్రీవైష్ణవుల యొక్క అవశేషాలు జాగ్రత్తగా సేకరించి శ్రీపాద తీర్థంగా (చరణామృతంగా) స్వీకరించబడుతుంది.
 • ఆచార్యులు మరియు శ్రీవైష్ణవుల ఆ శ్రీపాద తీర్థాన్ని మన కాళ్ళు కడగటానికి వాడకూడదు.
 • ఆచార్యులు వారి చేతులు కడుక్కునే ప్రదేశాన్ని పవిత్రముగా పరిగణించబడుతుంది. ఆ స్థలంలో శిష్యులు  వారి చేతులు లేదా కాళ్ళు కడగకూడదు.
 • నోరు కడుక్కునే క్రమంలో వారి ఎంగిలి నీళ్ళు మరొక శ్రీవైష్ణవునిపై చిందకుండా జాగ్రత్త పడాలి.
 • భాగవతులు చూపు లేదా ముట్టుకోవడం అనేది మనల్ని శుద్ధి చేస్తుంది. శ్రీవైష్ణవులు చూపు పడ్డతరువాత లేదా ముట్టుకున్న తర్వాత తమ శరీర శుద్ధికై ఇతర మార్గాలను వెతకడం ఒక అడ్డంకి.

40. స్నాన విరోధి  – స్నానంలో అడ్డంకులు

స్నానం అనగా నదీ, సరస్సు మొదలైన జలాశయాలలో  పూర్తిగా నీటిలో మునిగి, శరీర మలినాన్నితొలగించుట. తమిళంలో నీరాట్టం లేదా తీర్తమాడుతల్ గా కూడా చెప్పబడింది.  ఒక బ్రాహ్మణుని (ఇతరులు కూడా) యొక్క రోజువారీ నిత్యకృత్యాలలో స్నానము ఒక ముఖ్యమైన క్రియగా  పరిగణించబడింది.  అవగాహన స్నానం (నది, సరస్సు, నీటిలో పూర్తిగా మునుగుట) నిజమైన స్వచ్ఛతను ఇస్తుంది అని మన పెద్దలు గుర్తించారు. మన ప్రస్తుత కాలంలో, ఇటువంటి స్నానం చాలా తక్కువ అయిపొయింది – చెంబు ఉపయోగించి తమపై తాము నీళ్ళు పోసుకొనే స్నానపు గదులలో స్నానానికి పరిమితమైపోయింది.

 • మనం కేవలం మన శరీరాన్ని శుభ్రం చేయడానికి స్నానం చేయకూడదు. శాస్త్ర నియమాలు నిబంధనల ప్రకారం స్నానం చేయాలి.
 • ప్రపన్నులు, ప్రత్యేక సందర్భాలలో పూణ్యమును ఆశించి స్నానం చేయడం అనేది అడ్డంకి. కొన్ని ప్రత్యేక  సందర్భాలైన సంగమణం, ఆయణం (దక్షిణాయణ పుణ్య కాలం, ఉత్తరాయణ పుణ్య కాలం) , గ్రహణం మొదలైనవి. ప్రపన్నుడైన వ్యక్తి, ఇప్పటికే తమ రక్షణ బాధ్యతను ఎమ్బెరుమాన్ యొక్క చారణ కమలాల వద్ద సమర్పించాడు. కాబట్టి, పుణ్య ఆర్జించుటకై  ఈ సందర్భాలలో స్నానం చేసే ప్రశ్న లేదు – అది జీవాత్మ యొక్క నిజమైన స్వభావానికి వ్యతిరేకమైనది.
 • ప్రపన్నుల సూత్రాలకు విరుద్ధంగా కొన్ని కార్యములు చేసి సంప్రదాయమును కాపాడే ఉదేశ్యంతో, అది శరీరంలో కట్టుబడి ఉండుట వలన, అలాంటి పనులు చేయవలసి వచ్చింది అని విచారించాలి. అలాంటి చర్యలకు భయపడక పోవుట ఒక అడ్డంకి. ఇది స్పష్టముగా స్నానానికి సంబంధించినది కాదు.
 • ఎమ్బెరుమాన్ కైంకర్యం కోసం జలము తీసుకువెళ్ళే నదీ తీరాల వద్ద స్నానమాచరించుట అడ్డంకి అవుతుంది. అనువాదకుని గమనిక: నమ్మాల్వార్ తమ తిరువిరుత్తం 1 వ పాసురంలో, మన శరీరం చాలా మలినమైనది అని వివరించారు. తిరుమంగై ఆళ్వార్ తమ తిరుక్కుఱుంతాణ్దగంలో మన శరీరాన్ని వివరిస్తూ ఇవే పదాలను వాడారు. అందువల్ల, ఎమ్పెరుమాన్ కైంకర్యం కోసం జలము తీసుకువెళ్ళే నదీ తీరాల వద్ద స్నానమాచరించకూడదు. ఆ స్థలాన్ని వీలైనంత స్వచ్ఛముగా ఉంచాలి.
 •  సంసారులు (లౌకికంగా ఆలోచించే వాళ్ళు) స్నానం చేసిన రేవు గట్లలో స్నానం చేయుట ఒక అడ్డంకి. సంసారులు స్నానం చేసిన నీరు మనకు అంటుకునేటట్టుగా ఒకే రేవు గట్టుపైన  స్నానం చేయకూడదు. దీనికి సంబంధించి ఒక సంఘటన, ఆచార్య అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తమ ఆచార్య హృదయం 32వ చూర్ణికలో సంభోదిస్తూ “సాధన సాధ్యంగళిళ్ ముతలుం ముడివుం వర్ణధర్మిగళ్ దాసవ్రుత్తిగలేన్ఱు తుఱైవేఱివిడువిత్తతు” – కర్మం (ఉపాయం/మాధ్యమం లోని మొదటి మెట్టు) మరియు కైంకర్యం (ఉపేయం/లక్ష్యం లోని ఆఖరి మెట్టు) మధ్య వ్యత్యాసం అర్థమైన వారు అంటారు “మీరు వర్ణ ధర్మం యొక్క సాధారణ అనుచరులు, మేము భగవత్ దాసత్వం (ఎమ్బెరుమాన్ యొక్క దాసులం)  యొక్క అనుచరులము  అని అంటున్నారు – కాబట్టి మేము మీతో కలిసి సమానంగా రేవు గట్లలో స్నానం చేయలేము అని ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోవాలి  అని అంటారు. మణవాళ మామునులు తిరువహింద్రపురంలో జరిగిన ఒక అందమైన సంఘటనను ఇక్కడ  కీర్తిస్తూ సంభోదిస్తున్నారు – ఒక శ్రీవైష్ణవుడు (సన్యాసి/జీయర్ లేదా ఒక గొప్ప విద్వాంసుడు) ఉండేవారు, వారి పేరు “విల్లిపుత్తూర్ పగవర్”, వారు ప్రత్యేకమైన రేవు గట్టులో వారి అనుష్టానమును నిర్వహిస్తున్నారు,  ఒక స్థానిక బ్రాహ్మణుడు మరొక రేవు గట్టులో వారి అనుష్టానమును నిర్వహిస్తున్నారు.  విల్లిపుత్తూర్ పగవర్ స్వామిని ఆ బ్రాహ్మణుడు వారి గట్టులోని రమ్మని విన్నపిస్తారు.  విల్లిపుత్తూర్ పగవర్ స్వామి ప్రత్యుత్తరంగా ఒక ప్రమాణమును ప్రస్తావిస్తూ, “మేము శ్రీమన్నారాయణుని యొక్క దాసులము మరియు భక్తులము, మీరు వర్ణ  ధర్మ అనుచరులు. మన ఇద్దరం కలిసే ప్రశ్నేలేదు” అని బదులిచ్చి ఆ స్థలం వదిలి వెళ్ళిపోతారు.
 • నదులలో స్నానం చేస్తున్నప్పుడు, సంసారులు ఉపయోగించిన రేవునీరు మన గట్టువైపు వస్తున్న ప్రదేశంలో స్నానం చేయకూడదు. అనువాదకుని గమనిక: దీని అర్థం సంసారులు ఉపయోగించిన నీటి అవశేషాలలో మనం స్నానం చేయుట అనుకూలమైనది కాదు.
 • ఒకవేళ, మనం స్నానం చేసిన రేవు నీరు ప్రవహించి  శ్రీవైష్ణవులు  ఉపయోగించే గట్టులోకి ప్రవహింస్తే ఆ రేవు గట్టులో స్నానం చెయ్యకూడదు. శ్రీవైష్ణవులు స్నానం చేసిన తరువాత  మనం స్నానం చేయాలి. ఈ సంబంధంలో మణవాళ మాముణుల జీవితంలో నుండి ఒక సంఘటనను చూద్దాము. పెరియ జీయర్ (మణవాళ మాముణులు) స్నానం కోసం కావేరి నదికి వెళ్ళేవారు. శ్రీరంగనాథుని సేవించే తిరుమంజన అప్పా అన్న ఒక శ్రీవైష్ణవుడు నిత్యం క్రమం తప్పకుండా మణవాళ మాముణులు స్నానం చేసిన తరువాత వారు స్నానం చేసే వారు, ఆవిధంగా వారు జ్ఞానం మరియు వైరాగ్యం మొదలైన అనుగ్రహానికి పాత్రులైనారు. మణవాళ మాముణులు స్నానం చేసిన తరువాత వీరు స్నానము చేసిన ఒక ఈ చిన్న చర్యతో మణవాళ మాముణులను ఆచార్యులుగా స్వీకరించేందుకు దారితీసింది.
 • మంత్రాలను ధ్యానిస్తూ స్నానం చేయుట. సాధారణంగా స్నానం చేసే సమయంలో కొన్ని మంత్రాల (ప్రణవం మొదలైనవి) అనుసంధానం చేస్తారు.  అవైష్ణవ మంత్రాల అనుసంధానం చేయకుండా జాగ్రత్తగా పడాలి.
 • ఇది సాధారణంగా “ఇమమ్మే గంగే యమునే సరస్వతీ” శ్లోకం స్నానం చేసే ముందు చదవబడుతుంది. ప్రపన్నులు అలా చేయకూడదు. శ్రీరంగనాథుని “తిరువరంగ ప్పెరునగరుళ్ తెణ్ణీర్పొన్నిత్తిరైక్కైయాళ్ అడివరుడప్పళ్ళి కొళ్ళుం కారుమణి” అని పిలుస్తారు. శ్రీరంగంలో విశ్రమిస్తున్న ఆ నల్లని మణి (ఆదిశేషుని పై)ని  స్వచ్ఛమైన కావేరి నదీ అలలు నెమ్మదిగా తాకుతున్నాయి”. పెరుమాళ్ తిరుమోళి 1 వ పాసురంలో,” గంగైయిల్ పునితమాయ కావేరి” – గంగా కన్నా కావేరీ ఎక్కువ పవిత్రమైనది “అని చెప్పాలి. పరమపద సరిహద్దుల్లో  ప్రవహించే  విరజా నదిని స్నానం సమయంలో గుర్తుంచేసు కోవడం జీవాత్మ యొక్క నిజమైన స్వభావం అని చెప్పుకోవచ్చు  (ఎందుకంటే మోక్షానికి ముందు ఈ నదినే మనం దాటాలి).
 • ఎమ్బెరుమాన్, ఆళ్వారుల మరియు ఆచార్యుల ఉత్సవాల నుండి తిరిగి  వచ్చిన తరువాత స్నానం చెయ్యడం సరైనది కాదు. సేవార్తులను (ఉత్సవ సమయాల్లో దర్శనం కోసం వచ్చేవారు) తాకిన తరువాత కూడా స్నానం చేయకూడదు. ఎమ్పెరుమాన్, ఆళ్వారుల మరియు ఆచార్యుల యొక్క దివ్య సమక్షంలో, ఆ సమూహములో ఏదైనా అమంగళము / ఆశుద్ది  తొలగించబడుతుంది.
 • శ్రీవైష్ణవుల (సన్యాసులు మరియు ఇతర గొప్ప శ్రీవైష్ణవులు) వారి శరీరాన్ని  విడిచిపెట్టినప్పుడు – వారి శరీరాలను “విమల చరమ విగ్రహం” – పవిత్రమైన అంతిమ శరీరంగా భావించాలి. అటువంటి తుది తిరుమేని (శరీరం)ని ఎమ్పెరుమాన్ యొక్క అర్చా విగ్రహానికి సమానంగా పరిగణిస్తారు. అందువల్ల అటువంటి శరీరానికి అశౌచం /శుష్టి (కలుషితము) అని భావించుట పూర్తిగా అజ్ఞానం, మానుకోవాలి. తుది ఆచారాలను పూర్తి చేసిన తర్వాత, ఒక వ్యక్తి స్నానం చేయవచ్చు – కానీ అది అవబ్రుత స్నానం (పవిత్ర స్నానం – ఉత్సవం ఆఖరున చేసే పవిత్ర స్నానం) లాగానే పరిగణించాలి.
 • అవైష్ణవులు / అభాగవతులు సంసారులు (లౌకికంగా ఆలోచించే వాళ్ళు) చేత తాకినప్పుడు స్నానం చేసి, తనను తాను శుద్ధి చేసుకోవాలి. అలా చేయక పోవడం ఒక అడ్డంకి.
 • ఆచార్యుల తిరువధ్యయనం రోజు (పరమపదాన్ని అధిరోహించిన ఉత్సవం రోజున), శిష్యులు స్నానం చేసి, భగవతారాధానం మరియు భాగవతారాధానం  తగినంతగా చేయాలి.  అనువాదకుని గమనిక: ఆచార్య యొక్క తిరునక్షత్రము, తీర్థం మఠం / తిరుమాళిగలో జరుపుకుంటారు, శిష్యులు భౌతికంగా మరియు ఆర్థికంగా  పాల్గొంనాలి.  ఆచార్యుల  యొక్క తిరునక్షత్రము మరియు తీర్థం నిర్వహించడం శిష్యుల యొక్క ప్రాధమిక విధి.
 • స్నానం చేసిన తరువాత మన తల, మొదలైనవి ఆరపెట్టుకోవడానికి విదిలించ కూడదు, మన శరీరంపైనున్న  నీళ్ళు దగ్గరలో ఉన్న శ్రీవైష్ణవుల మీద చిమ్మకుండా జాగ్రత్త పడాలి.
 • శ్రీవైష్ణవులను వేదకప్పోన్ (గీటురాయి) గా చెప్పబడ్డారు – వారిని తాకినప్పుడు మనం పవిత్రులము అవుతాము. వారి తాకిడిని అపవిత్రముగా భావించి స్నానమాచరించుట అది ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక:  శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో  పిళ్ళై లోకాచార్య సూత్రం 221 లో “వేదకప్పోన్ పోళే ఇవర్గళోటై సంబంధం” – శ్రీవైష్ణవులతో సంబంధం కలిగి ఉండుట గీటురాయిని తాకుట వంటిది – ఒక గీటురాయి ఇనుముని తాకినప్పుడు, ఇనుప ముక్క బంగారం అవుతుంది. అదేవిధంగా, శ్రీవైష్ణవులను తాకినప్పుడు మనం పవిత్రులమవుతాము.
 • ఎమ్పెరుమాన్ తిరుమంజనం చేసిన అనంతరం స్నానం చేయడం ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక:  తిరుమంజనం చేసే సమయంలో పాలు, పెరుగు, తేనె మొదలైనవి మనపై పడతాయి/ఒలుకుతాయి. ఇది గొప్ప అదృష్టం. అశుబ్రంగా భావించకూడదు, తమను తాము శుభ్రపరచే ప్రయత్నం చేయరాదు.
 • మన ఇంటికి వచ్చిన శ్రీవైష్ణవులను  పంపించిన తరువాత స్నానం చేయుట సరైనది కాదు.
 • స్నానం కేవలం శరీరాన్ని శుభ్రం చేయడానికి (ఆరోగ్యవంతమైన జీవనశైలిగా) అని భావించుట ఒక అడ్డంకి. స్నానం యొక్క ఆధ్యాత్మిక అంశాన్ని గుర్తుపెట్టుకొని స్నానమాచరించాలి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/01/virodhi-pariharangal-9.html

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

1 thought on “విరోధి పరిహారాలు – 9

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s