Monthly Archives: July 2019

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 23

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 22

భగవద్రామానుజులు అనుగ్రహించిన గ్రంధాల లోతైన అధ్యయనము:

                  భగవద్రామానుజుల గ్రంధాలను లోతుగా అధ్యయనము చేస్తేగాని అర్థం కావు.  వారి మాటలలోని అంతరార్థాలను తెలుసుకోకుండా పై పై పదాలను మాత్రమే చదివితే అర్థం కావు. ఆళవందార్లు, ఆళ్వార్లు , భట్టరు , వేదాంతదేశికులు మొదలైన వారి రచనలతో పోల్చి చూసినప్పుడు వీరి శైలి, పదవిన్యాసంలో, వాక్యనిర్మాణంలో అంతరార్థాల  విషయంలో ఈ భేదం స్పష్టంగా కనపడుతుంది.

                  భగవద్రామానుజుల గ్రంధాల అధ్యయనము చేయడానికి ఉద్యమించినవారు పదాలకూర్పును, చెప్పే శైలిని చూసి మురుసిపోయి అక్కడే ఆగిపోతే అంతరార్థాలు బోధపడవు, రామానుజుల మనసు అర్థంకాదు. భగవద్రామానుజుల గ్రంధాలు నమ్మాళ్వార్ల రచనలనే కాక ఇతర గ్రంధాలను కూడా ఎంత విస్తారంగా ప్రతిధ్వనిస్తున్నాయో ఒక్కసారి చూద్దాము.

గీతా భాష్యం ప్రారంభంలో భగవద్రామానుజులు ఆళవందార్లను స్తుతిస్తూ చేసిన తనియన్ ను మొదట చూద్దాం .

యత్పదాంభోరుహధ్యానవిద్వాస్తాశేషకల్మషః  !

వస్తుతాముపయాతోహం యామునేయం నమామితం !!

               భగవద్రామానుజులు పంచాచార్య పదాశ్రితులన్న విషయం జగద్విదితం. ఎందుకు వీరు పంచా చార్యులను ఆశ్రయించారంటే ఆళవందార్లను ప్రత్యక్షంగా ఆశ్రయించలేక పోయారు. భగవద్రామానుజులు శ్రీరంగం చేరక ముందే ఆళవందార్లు పరమపదించటం వలన వారి దగ్గర అధ్యయనం చేయలేక పోయారు. ఆళవందార్లు అప్పటికే తమ ప్రియశిష్యులు ఐదు గురిని రామానుజులకు శ్రీవైష్ణవ సాంప్రదాయ విషయాలన్నింటిని విశదపరచమని ఏర్పాటు చేశారు.  శ్రీకృష్ణుడికి సాందీపుడు అరవై నాలుగు కళలు నేర్పినట్లు ఐదుగురు ఆచార్యులు రామానుజులకు సంప్రదాయ రహస్యాలను బోధించారు. అర్థాత్ భగవద్రామానుజులు ఆళవందార్ల మనోభావాలను ఐదుగురు ఆచార్యుల ముఖంగా అందుకున్నారు. అందువలననే గీతాభాష్య ప్రారంభంలో తమకు ప్రత్యక్షంగా బోధించిన ఆచార్యులను కాక తమ పరమాచార్యులైన ఆళవందార్లను స్తుతించారు.

                  కూరత్తాళ్వాన్,  పరాశరభట్టర్, వేదాంత దేశికులవారు వారి గ్రంధాలలో గురుపరంపరతో సహ ఆచార్యులందరిని ప్రస్తావించారు.  రామానుజులు మాత్రం ఎందుకు గురుపరంపరను, తమ ఆచార్యులను స్తుతించలేదన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది.

            రామానుజులు ఈ తనియన్లో వారందరిని ప్రత్యక్షంగా ప్రస్తావవించకపోయినా పరోక్షంగా ప్రస్తావన చేశారన్నది స్పష్టంగా కనపడుతుంది. అదెలాగంటే …….

              “యత్పదాంబోరుహ”  అన్న పదంలో “య్, అ, త్ , ప్, అ, త్, అ, మ్, ప్,  ఓ, ర్, ఉ, హ్, అ” అన్న పద్నాలుగు అక్షరాలు ఉన్నాయి. వాటిని ఏడు పాదాలజంటలకు సంకేతంగా తీసుకోవాలి. ఈ ఏడుగురు ఎవరంటే వారి ఆచార్యులైన ఐదుగురు, ఆళవందార్లు , నమ్మాళ్వార్లవిగా స్వీకరించాలి .

                 ఇదే విషయాన్ని మరొక విధంగా చూస్తె “యత్పదాంబోరుహ”  అన్న పదం షష్టి తత్పురుష సమాసంగా తీసుకుంటే ‘యస్య- పదాంబోరుహ ’ అని విడదీయాలి . “ఎవరి పాద పద్మాలో !….” అన్న అర్థం లో

దీనికి  మళ్ళి మూడు రకాలుగా  అర్థం చెప్పుకోవచ్చు .

  1. ఆళవందార్ల శ్రీపాద పద్మాలను వారి తిరుమేనిలో చూసి నమస్కరించటం .
  2. ఆళవందార్ల శ్రీపాదాలు – అంటే … వారిచే అర్చించబడ్డ పరమాత్మ .
  3. ఆళవందార్ల శ్రీపాదాలు – అంటే …  శిష్యులను ఆచార్యుల శ్రీపాదాలుగా భావించడం మన సంప్రదాయం కావున  ఆళవందార్ల శ్రీపాదాలంటే వారి శిష్యులైన రామానుజుల ఆచార్యులు ఐదుగురు.

* “పదాంబోరుహ” అన్న శబ్దం ‘ప’ అన్న అక్షరంతో మొదలవుతుంది. పెరియనంబులు రామానుజులకు పంచ సంస్కారం చేసి మంత్రోపదేశం చేశారు. వారి తిరునామం పరాంజ్ఞుశ దాసులు, ఇక్కడ ‘ప’ అన్న అక్షరం పరాంజ్ఞుశ దాసులకు సంకేతంగా స్వీకరించాలి .

                            పై వివరణ ప్రకారం రామానుజులు తమ గీతా భాష్యంలోని ఆచార్య తనియన్లో గురుపరం పరను స్మరించారని పెద్దలు నిర్వహం చేశారు. కూరత్తాళ్వాన్ శిష్యులైన తిరువరంగత్తముదనార్లు తమ రామానుస నూత్తందాదిలో రామానుజులకు వారి పూర్వాచార్యులతో ఉన్న సంబంధాన్నే ప్రముఖంగా ప్రస్తావించారు.

                           జ్ఞాన సంపన్నుల లక్షణము ఇక్కడ చక్కగా వవరించబడింది. సాధారణ కవులయితే పదముల అర్థంతో ఆగుతారు. జ్ఞానుల రచనలలో అంతరార్థాలను తరచి చూడకపోతే విషయం బోధపడదు. రామానుజులవారు అనుగ్రహించిన గ్రంధాలకు కాలం ఎంత పెరిగినా అర్థాలు మాత్రం నిత్య నూతనంగానే ఉంటాయి.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/21/dramidopanishat-prabhava-sarvasvam-23/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 22

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 21

 

ఆళ్వార్లను ప్రకాశింపచేసిన శ్రీభాష్యం 

              శ్రీభాష్య ప్రారంభంలో చేసిన మంగాళాశాసనము శ్రీనివాసుడికే కాదు నమ్మాళ్వార్లకు కూడా వర్తిస్తుంది. అది ఎలాగా అన్నది చూద్దాం :

అఖిల-భువన-జన్మ-స్తేమ -భంగాది – లిలే

అఖిల-భువన-జన్మ-స్తేమ –భంగాదులుగా వుండువాడు భగవంతుడు. “తేన సహ లీలా యస్య” ఈ పరమాత్మతో ఆయనదే అయిన లీలను ఆడువాడు నమ్మాళ్వార్లు. అందువలన అఖిల-భువన-జన్మ-స్తేమ -భంగాది – లీల నమ్మాళ్వార్లకు కూడా వర్తిస్తుంది.

భగవంతని లీలలను ఆళ్వార్లే పాడారు. ఎన్నుడైయ పందుం కళలుం తంతు పోగు నంబి”  (నా బంతి, కాలు ఇచ్చిపో నంబి )అని, విళైయాడ పోదుమిన్ ఎన్న పొందమై” (ఆట లాడదానికి ఎంత బాగా వస్తున్నావు) అని పాడారు.

ఈ మాటలు మరొక వ్యాఖ్యానానికి హేతువవుతున్నది. – భువన జన్మ  స్తేమ భంగాది లీలా అఖిలం యస్య” భువన జన్మ స్తేమ భంగాది లీలయే ఈ అండ సృష్టికి ప్రధాన కారణము. అర్థాత్ భగవంతుడు అందరికి అన్నీ అయి ఉన్నాడంటే, ఆళ్వార్లు మాత్రము ఉణ్ణుం శోరుం పరుగుం నీరుం, తిన్నుం వేట్రిలైయుం ఎల్లాం కణ్ణన్” అని అన్నారు? మనకు బతకడానికి కొన్ని వస్తువులు, పెరగడానికి కొన్ని వస్తువులు, అనుభవానికి కొన్ని వస్తువులు అవసరమవుతాయి. కానీ ఆళ్వార్లకు అన్నింటికి కృష్ణుడు ఒక్కడే చాలు.

వినత-వివిధ-భూత-వ్రాత-రక్షైక –దీక్షె

సమస్త భువనాలను రక్షించువాడు భగవంతుడే అయినా భక్తుడి దృష్టిలో భగవంతుడు పూర్ణుడుగా కనపడటంలేదు. (స్తనంజయ ప్రజకు) స్తన్యపానంచేసే పిల్లలకు ఆకలి తీరడానికి పాలు  లభించటం వలన  ఆబిడ్డ చూపు తల్లి స్తనములమీదే వుంటుంది. అలాగే భగవత్కైంకర్యం చేసే దాసులకు ఆయన శ్రీపాదలమీదే దృష్టి వుంటుంది .

కోవెలలో భగవంతుడి  శ్రీపాదాలే శ్రీశఠారి లేక శఠగోపురం అని నమ్మాళ్వార్లను  పిలుస్తారు. అంటే నమ్మాళ్వార్లకు భగవంతుడి శ్రీపాదాలకు బేధం లేదు, రెండు ఒక్కటే అని బోధపడుతుంది. రక్ష కావాలని కోరుకునే దాసవర్గానికి భగవంతుడి శ్రీపాదరూపంలో  ఆళ్వారులే లభిస్తారు.

శృతి శిరసి విదీప్తే…..

శృతి శిరస్సుగా పిలవబడేది వేదాంతము.

శృతి శిరసి విదీప్తే అనగా వేదాంతములో బాగా ఆరితేరిన వారు అని అర్థము. వేదాంతము పరబ్రహ్మను తెలుసుకోవటము కొరకేనని నమ్మినవారు ఆళ్వార్లు . అందువలన ఈ ప్రయోగము వారికి సరిపోతుంది.

వేదమే ఆళ్వార్లను, తత్ విప్రాసో విపన్యవో జాక్రవాక్మస్సమింతతే”.  విప్రా అన్న పదం ఆళ్వార్లకే వర్తిస్తుంది. “న సూద్రా భగవద్భక్తా విప్రా భాగవతాస్మ్రుతా”  అన్నట్లు దాసులుగా ఉన్న ఒకరు మాయాలోకంలో చిక్కి ప్రవర్తించరు .  “ఫణస్తుతౌ“, “విపన్యవ” అంటే పరబ్రహ్మ కల్యాణగుణాలను కీర్తించేవారు అన్న అర్థం  ఉన్నందున ఆ పద్దతిలో అసమానమైన పాశురాలను పాడిన ఆళ్వార్లనే సంకేతిస్తుంది. ” తేవిర్ శిరంద తిరుమార్కు తక్క తైవ కవిజ్ఞర్“.   “జాగ్ర వాగ్మస” …..ఎప్పుడు జాగ్రదవస్తలో ఉండటం.  పరమాత్మను తప్ప వేరేవారిని చూడని, వాడిని తప్ప మరేది తలచని , వాడినే అనుభవించే వారు ఆళ్వార్లు .  పై వాక్యానికి అర్థము, వ్యాకరణము కూడా ఆళ్వార్లె.  “కణ్ణార కండుకళివదోర్  కాదలుత్రర్క్కుం ఉండో  కణ్ గళ్ తుంజుదలే” అని పాడారు.

ఈ వేదవాక్యంలోని వి” అనే ప్రయోగాన్ని శ్రీభాష్య శ్లోక చివరి శబ్దమైన “సమిందతే “ లోని  సమ్” ను స్పురింప చేస్తుంది.

బ్రహ్మణి

అన్నింటిలోను పెద్దదని చూపే బృ”  అన్న పదముతో ప్రారంభమవుతున్న ప్రయోగము బ్రహ్మము. పరబ్రహ్మమే ఆళ్వార్ల దగ్గర ప్రేమతో కట్టుబడటమే ఆయన ఔన్నత్యము . పెరియ తిరువందాదిలో ఆళ్వార్లు దీనిని   “యాన్ పెరియన్ , నీ పెరియై ఎన్పడనై  యార్ అరివార్” అని పాడారు. అందువలన పరబ్రహ్మనికి సరిఅయిన పర్యాయపదం పెద్ద.

శ్రీనివాసే

ఆళ్వార్లకు శ్రియః పతిత్వం లేనందున శ్రీనివాసే  అన్న పదాన్ని ఆళ్వార్ల పరంగా అన్వయించటం కుదరదు అనవచ్చు . శ్రియఃపతిత్వం పరమాత్మకు ఎకదేశ హక్కు అయనప్పటికీ ఆళ్వార్లు  శ్రీనివాసులే….ఇంకా తరచి చూస్తే సాంప్రదాయంలో పలువురు శ్రీనివాసులున్నారు .

లక్ష్మణో లక్ష్మీసంపన్న ….లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు

సతునాగవర శ్రీమాన్ ……గజేంద్రుడు కూడా శ్రీమంతుడే ,

అంతరిక్షగత శ్రీమాన్ ……విభీషణుడు నడి సముద్రం మీద నిలబడ్డాడు. అయినా అయన  శ్రీమంతుడే, ఇక్కడ ఉదాహరించిన వారి శ్రీ ఒక్కోక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పబడింది. అది ఎలాగంటే లక్ష్మణుడికి శ్రీ అంటే కైంకర్యం. గజేంద్రుడుకి శ్రీ అంటే ఆయన శ్రీమన్నారాయణునికి తన చేతిలోని పుష్పాన్ని సమర్పించాలని భావించిన మనఃనైర్మల్యం , విభీషణుడికి తన సమస్తసంపదలను, బందువులని వదిలివేసి శ్రీరాముడిని శరణాగతి చేయటం శ్రీ అవుతుంది.

ఇక ఆళ్వార్ల విషయానికి వస్తే. వ్యాఖ్యాతలు వారి దగ్గర శ్రీ ఉండటం కాదు వారె శ్రీ కదా అని చాలా అందంగా చెప్పారు. ఇంకా ఆళ్వార్లు పాడిన పాశురాలలో ప్రపన్నాధికారుల గుణాలన్నీ ఉండటం వలన శ్రీనివాసుడు తానే అమ్మవారిలా మారారు. అప్పుడు ఆళ్వార్లె  శ్రీనివాసునిగా మారారు అని కూడా భావించవచ్చు .

ఈ విధంగా భగవద్రామానుజులు శ్రీమన్నారాయణుని అనుభవించినట్లుగా ఆళ్వార్లను అనుభవించారు అని స్పష్టమవుతున్నది.  భగవద్రామానుజుల శ్రీభాష్య రచనలో ప్రారంభం నుండి చివరిదాకా ఆళ్వార్ల ప్రభావం స్పష్టంగా కనపడుతుంది.

శ్రీభాష్యంలోని చివరి సూత్రమైన అనావృత్తిశబ్దాద్ అనావృత్తిశబ్దాద్‘. ఇందులోని అనావృత్తి శబ్దానికి అర్థం ఈ మాయా బంధనాలు వదిలి ముక్తిని పొందిన జీవాత్మ ఈలోకానికి తిరిగి రాదు .

తిరిగి రానందుకు కారణము , శబ్దాత్” అంటే వేదం చెపుతున్నది కావున …వేదం , న చ పునరావర్తతే  న చ పునరావర్తతే “ అంటుంది. ఈ మాయా బంధనాలు వదిలి వెళ్ళిన జీవాత్మ తిరిగి రావటం లేదు. ఇది వేదాంత సూత్రం, కానీ ఉన్నతమైన జ్ఞానం గలవారు, సాంప్రదాయబద్దమైనవారు అయిన రామానుజులు ఈ సూత్రానికి వ్యాఖ్యాతలలా కాక  ఒక ముఖ్యమైన విషయాన్ని దర్శించారు. పరబ్రహ్మనికే ఎందుకు శృతి కట్టుబడి వుంది? వేదాంతులందరికి జీవుడు మొదలైన విషయాలలో భేద భావం ఉన్నా అంతిమంగా మోక్షము లేక విడుదలనే ఎందుకు కోరతారు? అద్వైతికి అవిద్య వలన బాధింపబడిన బ్రహ్మము, ముక్తి  వలన బాధింప బడకుండా ఉంది అన్న విషయాన్ని వివరించటమే పెద్దసమస్య. బ్రహ్మము మునుపే అవిద్యచే బాధింప బడకుండా ఉంటే దానికి బహు అన్న భావమే రాదు. బ్రహ్మము ఒక్కటే. జీవాత్మ తిరిగి రాదు అన్నది మొత్తంగా కాక పరస్పర సంబంధం పరంగానే అంటే బ్రహ్మసూత్రం, వేదాంతం మొత్తం తప్పవుతుంది. అందువలన  బ్రహ్మసూత్రం జీవుడు తిరిగి వస్తాడా? అన్న ప్రశ్నను లేపి వేదము చెప్పటం వలన రాదు అని ప్రకటిస్తున్నది. ఈ సూత్రకారులు అద్వైతంలో దీనిని ఏమాత్రం అంగికరించలేదని ఈ అనుమానాన్ని తోలగదోయటం వలననే తెలుస్తున్నది.   స్వతంత్రమైన పరబ్రహ్మాన్ని నమ్మే ద్వైతికి ఆ పరబ్రహ్మను ఒక శృతి వాక్యంతో కట్టడి చేయటం సాధ్యమా అన్నది ప్రశ్న. పరబ్రహ్మ స్వతంత్రుడు, ఆయన కోరుకుంటే జీవాత్మను  మళ్ళీ ఈలోకానికి పంపగలడు అని భావిస్తాడు..

కానీ ఒక విశిష్టాద్వైతికి ఈ ప్రశ్న తీసివేయ తగినది కాదు, జవాబు చెప్పటం కూడా కష్టమే. ఎందుకంటే జీవాత్మ పరబ్రహ్మానికి ప్రకారము, అందువలన పరబ్రహ్మనికి ప్రకారము అయినవాడు మళ్ళీ ఈలోకానికే రావటమంటే, ఆ విద్యలో ఈ లోకము తెలియుటే అవుతుంది. అయినా, విశిష్టాద్వైతంలో పరబ్రహ్మ మాత్రమే స్వతంత్రుడు, జీవుడిని కట్టడి చేయగల శక్తి గలవాడు.  పరమాత్మా జీవుడిని ఎందుకు మళ్ళీ పంపకూడదు. ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవటానికి రామానుజులు వేదాంతాన్ని కూడా దాటి వెళ్ళి, పరిశోధించారు. శృతి ఎందుకు ఇలా చెప్పింది అన్నవిషయాన్ని తర్కించి, పురాణ, లౌకిక విషయాలకు అనుగుణంగా జవాబు చెప్పారు.

పరబ్రహ్మకు జీవుడికి మధ్య సంబంధం అంశ/అంశి భావాన్ని దాటి నిజమైన అనుభవం లభించే విధంగా ప్రేమికుడు /ప్రేయసి అనే స్థితి కూడా ఉంది. పరబ్రహ్మకు జీవుడికి ఉండే సంబంధము కేవలం జ్ఞానానికి సంబందించిందేకాక అలౌకికానుభవం కూడా వుంటుంది. ఇది పరమ చేతనుడు చేతనుడిని  ప్రేమతో ఆలింగనం చేసుకునే స్థితి. జీవుని స్థితిని గురించి తెలుసుకోకుండా కేవలం ఆధారంగా ఉండే స్థితిని దాటి పరమ చేతనుడు చేతనుని పొందటంలో అనేక ప్రయత్నాలు, స్థాయిలు ఉన్నాయి. ఆయన అత్రుప్తామ్రుతుడు, అపారమైన ప్రేమ కలవాడు. ఎప్పటికి వదలని అచ్యుతుడు. జీవుడు నాకు ప్రేమప్రదుడని ఊరికే అంటాడా?

దీనికి నమ్మాళ్వార్లు తమ పాశురాలలో జవాబును పొందారు. అనుభవంలో  నమ్మాళ్వార్ల అనుభవానికి సాటి మరొకటి ఉంటుందా? ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకునే రామానుజులు న చ పరమపురుష సత్య సంకల్ప అత్యర్త  ప్రియం జ్ఞానినం లభ్ద్వా కదాచిత్ ఆవర్తయిష్యతి”

స్థిరసంకల్పుడైన పరమపురుషుడు తనకు ప్రియమైన, తనపై మరులు గొన్న చేతనుని ఎంతో శ్రమించి పొందిన తరువాత వదులుతాడా! కృష్ణుడిని తాను తిన్న వెన్నను తిరిగి ఇవ్వమంటే ఇస్తాడా?

చేతనుడిని పొంది అనుభవించటంలో పరమాత్మ కోరిక ఎంతటిదో నమ్మాళ్వార్లు తమ పాశురాలలో ఇలా వివరించారు. ఎన్నిల్ మున్నం పారిత్తు తానెన్నై ముట్ర  ప్పరుగినాన్” అన్నారు. వాడు నన్ను పూర్తిగా అనుభవించాడు. ఈ ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. అనుభవిస్తేగాని అర్థం కాదు. ఈ విధంగా ప్రేమరోగంలో మునిగివున్న వాడు పొందిన జీవుడిని వదులుతాడా?

     వాసుదేవస్సర్వం ఇతి స మహత్మా  సుదుర్లభః” అని శ్రీకృష్ణుడు గీతలో నిర్వేదంగా చెప్పిన మాటలను శ్రీభాష్యంలో స్వామి రామానుజులు ఉదాహరించి నమ్మాళ్వార్లు పాడిన ఉణ్ణుం చోరుం పరుగుం నీర్ తిన్నుం వెత్తిలైయుం ఎల్లాం కణ్ణన్”  అని అన్నారు. కృష్ణుడు కోరుకున్నదానికి నమ్మాళ్వార్ల పాట జవాబుగా అమరింది.

శ్రీభాష్యం అర్థం చేసుకోవటానికి, అనుభవం పోందటానికి ఆళ్వార్ల శ్రీసూక్తి అనుభవం ఎంతో అవసరం అని రామానుజులవారు తెలియజేసారు.

ఆళ్వార్ల, ఏమ్బెరుమానార్ల, జీయర్ల శ్రీపాదాలే శరణం.

 

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/20/dramidopanishat-prabhava-sarvasvam-22/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

 

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 21

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 20

శ్రీభాష్యం మంగళ శ్లోకము-దివ్య ప్రబంధ అనుభవం –రెండవ భాగము

వినత-వివిధ-భూత-వ్రాత-రక్షైక-దీక్షే

పై శ్లోక భాగానికి అర్థమేమిటో చూద్దాం …..

వినత = సమర్పించబడ్డ

వివిధ = వేరువేరుగా ఉన్న (పలు విధాలుగా ఉన్న)

భూత = జీవాత్మలు

వ్రాత = గుంపులు

రక్షైకదీక్షే= వీటి రక్షణ మాత్రమే లక్ష్యంగా ఉన్నవాడు.

        ఇది పరమాత్మకు మాత్రమే అపాదించదగిన మాట, ( పలు విధాలుగా ఉన్న జీవాత్మలను రక్షణ మాత్రమే తమ లక్ష్యంగా కలవాడని అర్థం.

       ఇది రామానుజులు చెప్పిన అర్థం కాదు . శ్రుత ప్రకాశికా భట్టరు, వేదాంత దేశికులు కూడా వేరు వేరు అర్థాలను చెప్పారు.

       సంస్కృతంలో ఈపదాల అర్థం చూద్దాం . ‘ వ్రాత ‘ అన్న పదానికి సమూహ, పరిషత్  అనే పదలు సమానార్థకాలు. ఇది ఒక గుంపు లేక జాతిని తెలియజేస్తుంది. ఉదాహరణకు  బ్రాహ్మాణ సమూహము…. పెద్ద బ్రాహ్మాణ సమూహాలను  బ్రాహ్మాణులు గుంపుగా ఉన్నచోటును తెలియజేస్తుంది. ఈ సమాసపదము షష్టి తత్పురుషలో ఉంది. రాజపరిషత్ అనే మరొక పదము యొక్క అర్థము రాజుల సమూహము. మంత్రులు,  ప్రజలు, వంటి అందరు ఉండి రాజు అధ్వర్యంలో నడుస్తున్నసభ. ఈ సమాసపదము కూడా షష్టితత్పురుషలో ఉన్నా బ్రాహ్మణ సమూహము వంటిది కాదు.

       అందువలన ఇలాంటి పదాలు ఒక సమూహము, గుంపు  అనే అర్థాలనే కాక రాజుకి, మంత్రికి కుడిన వేరు వేరు అర్థాలను తెలియజేస్తాయి.

      ‘వ్రాత’ అన్న పదము దాసుల సమూహాన్ని మాత్రమే కాకా వారితో సబంధం ఉన్న వాటిని కూడా తెలియజేస్తుంది. ‘వివిధ’  అన్న సంకేతం వీటిని చూపిస్తున్నది. అలాంటి దాసులతో సంబంధం గల వేరు వేరు గుణాలు, స్థితులు, విభజనలు కలిగి వుండవచ్చు అని తెలుస్తున్నది. అయినప్పటికీ అలాంటి భేద భావము చూపకుండా పరమాత్మ అందరిని రక్షిస్తున్నాడు .

దీనిని నిరూపించే ప్రమాణమును చూదాము.

పసుర్ మనుష్యపక్షిర్వా ఏ చ వైష్ణవ సమార్చయాః

తేనైవ తే ప్రయాస్యంతి తద్విష్ణోః పరమం పదం !

           ఒక జంతువో, మనిషో, పక్షియొ ఒక వైష్ణవుడి దగ్గర ఆశ్రయం పొందితే ఆ సంబంధం చేతనే ఆ జీవి ఉన్నతమైన పరమపదమును పొందగలడు. మనిషి అన్న ప్రయోగము జంతువులు, పక్షులు మొదలైన వాటి మధ్య ఉండటమే  పై శ్లోకములోని  గొప్పదనము. మనిషి అన్న ప్రయోగము ప్రత్యేకముగా లేదు, కానీ సంబంధము మాత్రమే ముఖ్యము అని తెలుస్తున్నది.  పరమాత్మ వీడు మనిషి తెలివి గలవాడు అనో, ఇవి జంతువులు తెలివి లెనివనో  భావించక సంబంధము మాత్రమే చూసి రక్షిస్తాడు. ‘ఏవ’ అన్న పదము ఇతరములేవి ముఖ్యము కావు  అని తెలియజేస్తున్నది.

          ఈ అర్థము చాలా ముఖ్యము ఎందుకంటే, ఇది పరమాత్మ యొక్క ఉన్నతమైన గుణాలలో ఒకగుణ విశేషణాన్ని తెలియజేస్తుంది. తమదాసులను కూడా దాటి వారి సంబంధీకులకు కూడా తమకరుణను చూపువాడు అని అర్థము . ఈ అర్థమును గ్రహించ కుంటే ‘వివిధ వ్రాత’ అన్న పదాలు అర్థరహితమైపోతాయి .

          ఈ అర్థమే రామానుజులు కోరుకున్నది, దానినే ఆళ్వార్లు కూడా మనసారా తమ పాశురాలలో పాడారు. ఉదాహరణకు ‘పిడిత్తార్ పిడిత్తార్ వీత్తిరుందు పెరియ వానుళ్ నిలావువారే’ (తిరువాయిమోళి 6-10-11 ), “ఏమర్ కీళ్ మెల్ ఎళుపిరప్పుం విడియా  వెన్నరకత్తు ఎన్నుం సేర్దాల్ మారినరే” అని పలు సందర్భాలలో ఆళ్వార్లు చెప్పారు.

శ్రీనివాస…..

          బ్రహ్మసూత్రాలలో ఎక్కడా లక్ష్మి సంబంధం ప్రత్యేకించి చెప్పినట్లు కనపడదు. కానీ   రామానుజులు గ్రంధ సంగ్రహంగా అనుగ్రహించిన ప్రారంభ శ్లోకంలో పరమాత్మ శ్రీనివాసుడని చెప్పారు. ఇది ఆళ్వార్లందరి కంటే ఉన్నతుడైన  పరమాత్మను శ్రీఃయపతిగా దర్శించి నందు వలన, ‘శ్రీ’ లేని స్వామిని దర్శించలేకపోవటం చేత చెప్పి ఉండవచ్చు.

భక్తి రూపా శేముషీ భవతు …..

          జ్ఞానులకు ఇది ఒక విచిత్రమైన ప్రార్థన. శ్రీనివాసుని గురించిన జ్ఞానము వృద్ది చెందాలనో, శ్రీనివాసుని పై నేను భక్తి కలిగి వుండాలనో కాక శ్రీనివాసునిపై నామనసు భక్తిగా మారాలని కోరుకుంటున్నారు.

          ఈ ఒక్క పదంతో రామనుజులు ఆళ్వార్ల నిష్టను గ్రహించి విశిష్టాద్వైత జీవగర్ర లాంటి తత్వాన్ని ప్రవచించారని బోధపడుతుంది . మనకు జ్ఞానమార్గమని భక్తిమార్గమని రెండు మార్గాలున్నాయి. చారిత్రకంగా ఈ రెండు మార్గాలకు ఉన్న భేదాల గురించి విస్త్రుతంగా చర్చించబడింది.  భగవద్రామానుజుల విశిష్టాద్వైత వేదాంతాన్ని భక్తి మార్గమని తప్పుగా నిర్వచించారు.  ఇందులో ఉన్న గందరగోళం ఏమిటంటే భక్తి మార్గము నిస్సారమైన, వదిలి వేయవలసిన జ్ఞాన మార్గములోని భేదము. జ్ఞాన మార్గము భక్తి అనే ఉత్త భావావేశమైనది అని చెప్పవచ్చు.

         విశిష్టాద్వైతం జ్ఞానం మార్గం, భక్తి మార్గం రెండూ  విభిన్నమార్గాలని చెప్పదు, రెండు ఒకటేనని చెపుతుంది. ఆత్మ విషయంలో జ్ఞానం భక్తి రూపమైనది, వేరే రూపమైనది కాదు . అందువలన జ్ఞానము నిస్సారమైన సూత్రాల సమాహారం కాదు.  భక్తి ఉత్త భావావేశమైనది కాదు. నిరతిశయ, నిరవధిక కల్యాణ గుణములతో మన మనసును ఆకర్షించు స్వరూప రూపములతో అందరిని పాలించు ప్రేమ స్వరూపముగా నిర్హేతుకమైన కృపా సముద్రుడు అనే జ్ఞానమే భక్తి .

         భక్తి అంటే పక్వముకాని జ్ఞానహీనుల కోసం ఏర్పాటైన మార్గమని లోకంలో ఒక అపప్రద ఉంది (తాము జ్ఞానవంతులమన్న ఊహ వలన ఇటువంటి ప్రచారము చేసారేమో). ఇది వారు తమను తాము గొప్పగా భావించి చెప్పుకున్న విశేషములు. దీనికి శాస్త్రములో ప్రమాణములు లేవు అని సప్రమాణముగా చెప్పవచ్చు. ఇదే ఆళ్వార్ల ‘మదినలం’ అన్న మాట యొక్క అర్థము .

   

 

రామానుజుల ‘శేముషీ’ ….అమరకోశములో ‘మది’,  ‘శేముషీ’ రెంటికి ఒకే అర్థము చెప్పబడింది. ‘నలం’ (మంచి) అంటే భక్తి .  ఆళ్వార్లు, పరామాత్మ తమకు చేసిన ఉపదేశాల వలన జ్ఞానము జనించింది, భక్తి అంటే పరామాత్మను గురించిన జ్ఞానము అని అంటున్నారు. ఆళ్వార్లు చూపిన మార్గాన్ని రామానుజులు గట్టిగా పట్టుకున్నారు, లోకానికి ప్రకాశవంతమైన మార్గాన్ని చూపించారు, ఆళ్వార్లు వారికి మర్గానిర్దేశకులుగా నిలిచారు.

 

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/19/dramidopanishat-prabhava-sarvasvam-21/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

విరోధి పరిహారాలు – 13

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/07/07/virodhi-pariharangal-12/.

 దివ్య దేశ అర్చావతార ఎమ్పెరుమాన్ –  దివ్యప్రబంధము యొక్క లక్ష్యము
నమ్మాళ్వారు, ఎమ్పెరుమానార్,  మామునిగళ్ దివ్యప్రబంధ ముఖ్య విస్తారకులు

44. సంకీర్తన విరోధి – మన గానంలో, వాక్కులో వచ్చే విరోధులు (భగవాన్ మరియు భాగవతులను కీర్తించే సమయంలో)

సంకీర్తనము అనగా పాడటం లేదా మాట్లాడటం లేదా చెప్పడం అని అర్థము. ఇది సాధారణంగా వాచిక (పదాలు) కైంకర్యాన్ని సూచిస్తుంది (అనువాదకుని గమనిక: కైంకర్యము మన మనస్సు, పదాలు / ప్రసంగం మరియు శరీరం ద్వారా చేయవచ్చు).

  •  భగవాన్ యొక్క సౌలభ్యాన్ని (సరళత) గురించి చర్చిస్తున్నపుడు వారి ఆధిపత్యము గురించి మాట్లడుట ఒక అడ్డంకి. గుణ కీర్తనం – ఎమ్పెరుమాన్ యొక్క అద్భుతమైన గుణాలను స్మరించుట మరియు వాటి గురించి చర్చించుట. ఎమ్పెరుమానునికి రెండు ప్రత్యేక లక్షణాలు (ఇంకెవరికీ లేనివి) ఉన్నాయి – సంపూర్ణ పవిత్రమైన లక్షణాలతో ఉండుట మరియు అపవిత్ర గుణాలు లేకుండుట. వారి పవిత్ర గుణాలు రెండు వర్గాలు – భగవానుని పరత్వాన్ని (ఆధిపత్యాన్ని) సూచించే గుణాలు మరియు భగవానుని సౌలభ్యాన్ని (సరళతను) సూచించే గుణాలు.  మనం నమ్మాళ్వార్ తిరువాయ్మొళి పాశురం 1.3.4లో జ్ఞాపకము చేసుకోవచ్చు, “యారుమోర్ నిలైమైయనేన ఆఱివరియ ఎమ్పెరుమాన్ యారుమోర్ నిలైమైయనేన ఆఱివెళియ ఎమ్పెరుమాన్” – ఎమ్పెరుమాన్ ని సులభంగా అవగతం చేయలేమని (పరత్వం) చూపిస్తారు మరియు వారిని సులభంగా అవగతం చేయగలమని(సౌలభ్యం) కుడా చూపిస్తారు. వారి పరత్వానికి గరిష్ట పరిమితి లేదు, అలాగే వారి సౌలభ్యానికి కానిష్ట పరిమితి లేదు. వారి సరళత్వం రెండు లక్షణాలలో చూడవచ్చు: సౌలభ్యం (సులభంగా అందుబాటులో ఉండటం / చేరుకోవడం) మరియు సౌశీల్యం (తనకున్న ఆధిపత్య గుణాన్ని అలక్ష్యం చేసి ఇతరులతో కలసిపోవుట). వారు పవిత్రమైన మరియు సుప్రసిద్ధ లక్షణాలతో వివిధ అవతారాలలో దిగి వచ్చినప్పటికీ, వారి సరళత కారణంగా తెజోమయులై ప్రకాశించారు. వారి సరళత కారణంగా వారి భక్తుల హృదయాలను కరిగించివేస్తారు. నమ్మాళ్వారు తిరువాయ్మొళి 1.3.2 లో  “ఇళైవరుమియల్వినన్” అని అన్నారు. తిరువాయ్మొళి 1.3.1లో, ఆళ్వార్ వెన్న దొంగిలించి నందుకు యశోదాదేవి కట్టివేసిన కృష్ణుడిని గుర్తుచేసుకుంటున్నారు. “ఎత్తిఱం! ఊరాలినోడు ఇణైన్తిరుంతు ఏ౦గియ ఎళివే” (ఇది ఎలా సాధ్యం?  ఇంత సులభంగా రోలుకి కట్టబడ్డాడు, వారి నిస్సహాయ స్వభావమును ప్రదర్శిస్తున్నారు  (సర్వోపరి అయినప్పటికే కూడా) అని సుదీర్ఘకాలం వరకు మూర్ఛపోతుంది అని చెప్పబడింది.  తిరుప్పావైలో, ఆండాళ్ నాచియార్  వివరిస్తూ అన్నారు గోవిందా (ఆవుల మంద – పశువులను కాపే పశుకాపరి) అన్న పేరు  కృష్ణుడికి చాల ప్రియమైన పేరు, పెద్ద పేరు కుడా (ఇది అతని సరళత్వం వివరిస్తుంది).  “నారాయణ” (వారి ఆధిపత్య గుణాన్ని తెలుపుతుంది) అనే పేరు చిన్నది.  గోపికలు “చిఱుప్పేరళైత్తానవుం చీఱి అరుళతే ఎమిఱైవా” ఓ! స్వామి, చిన్న పేరుతో మేము మిమ్మల్ని పిలిస్తే, దయచేసి మాపై కోపగించుకోకండి. గుణవాన్ (వాల్మికీ రచించిన శ్రీ రామాయణంలో శ్రీ రాముని సుగుణాలలో ఒకటి) శ్రీ రాముడు సౌలభ్యానికి (సులభమైన సౌలభ్యం) మరియు సౌశీల్యానికి నిధి వంటి వారు అని వివరించబడింది (అందరితో కలిసిపోయే). కాబట్టి, సరళత మీద దృష్టి కేంద్రీకరించే లక్షణాల గురించి మాట్లాడుతున్నప్పుడు, తన ఆధిపత్యాన్ని చర్చించకూడదు – ఇది ఎప్పటికీ తగదు.
  • భగవానుని స్వయం ప్రయోజనంగా భావించి కీర్తించ కూడదు (ఎమ్పెరుమాన్ని స్తుతించుటయే  మన లక్ష్యం – భగవాన్ నుండి ప్రతిఫలం ఆశించి ప్రార్ధించరాదు). సంపద లేదా ఖ్యాతిని ఆశించి భగవానుని ప్రార్ధించట ఒక అడ్డంకి.  భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను చెప్పిన/పాడిన చెప్పేవారిని, వినేవారికి ఇద్దరికీ ఆనందకరమైన రీతిలో కీర్తించాలి.
  • అసంపూర్ణమైన / లోపమున్న వ్యక్తిత్వాలను మహిమపరచుట అనేది ఒక అడ్డంకి. ఇది దేవతాన్తరములకు దూరంగా ఉండమనే సంకేతంగా మనం అర్థం చేసుకోవాలి. అనువాదకుని గమనిక: ఎమ్పెరుమాన్ అన్ని పవిత్రమైన గుణాలకు నివాసం, అపవిత్రమైన గుణాలకు విరుద్ధంగా ఉంటారు. పూర్తిగా భగవాన్, భగవతాలకు అంకితమై ఉన్న శ్రీవైష్ణవులు కూడా మనం స్తుతించేందుకు పూర్తి అర్హులు. కానీ రుద్రుడు, బ్రహ్మ, ఇంద్రుడు, స్కందుడు, ధర్గ, తదితరులు వంటి ఇతర దేవతలు ఈ సంసార బంధంలో చిక్కుకున్న ఆత్మలుగా ఉంటారు. ఈ సంసారలో కొన్ని అంశాలపై భగవాన్ చేత అధికారం ఇవ్వబడినప్పటికీ, వారు పరిమితులై అనేక సార్లు రజస్సు తమస్సు గుణాల అధీనులై ఉన్నారు. కాబట్టి, వారు శ్రీవైష్ణవులచే కీర్తించబాడడానికి అర్హులు కారు.
  • భగవాన్ యొక్క స్తుతిని కేవలం అవి సంస్కృతంలో లేవని తిరస్కరించుట. భగవంతుడిని ఏ భాషలోనైనా స్తుతించవచ్చు. అనువాదకుని గమనిక: సంస్కృతం దేవ భాషగా (దివ్య భాష)  ప్రశంసించారు. వేదం సంస్కృత  భాషలో ఉంది, పూర్తిగా ఎమ్పెరుమాన్ కీర్తి ప్రతిష్టలతో కూడి ఉంది. కానీ ఎన్నో ఇతర భాషల్లో ఎమ్పెరుమాన్ని మహిమపరిచే అనేక సాహిత్యాలు ఉన్నాయి. అళగీయ మణవాళ పెరుమాళ్ నాయనార్ (పిళ్ళై లోకాచార్యుల యొక్క దివ్య సోదరుడు) ఒక అద్భుత ప్రబంధ (గద్యం) మైన ఆచార్య హృదయం అనే గ్రంథం, అనేక సూత్రాల సమీకరణ, తమిళంలో రచించారు. ఈ ప్రబంధంలో, ఆళ్వారుల పుట్టుకకు సంబంధం లేకుండా, వారి కీర్తి అపరిమితమైనది అని చెప్పబడింది. ఎందుకంటే వారు స్వయంగా ఎమ్పెరుమాన్ చేత ఆశీర్వదించబడ్డారు, అందువలన ఆళ్వారులు పూర్ణ శరణాగతులు; వారు వ్రాసిన భాషతో సంబంధం లేకుండా (తమిళ్), 4000 దివ్యప్రబంధములు దివ్యమైనవి, ఎందుకంటే అవి కేవలం ఎమ్పెరుమాన్ని మాత్రమే స్తుతిస్తున్నాయి, ఎందుకంటే అవి నాలుగు వేదాల సారం కాబట్టి. అందువలన వారు ఆళ్వారులను మరియు వారి దివ్యప్రబంధముల యొక్క మహిమను స్థాపించి, ప్రతి శ్రీవైష్ణవుడు అభ్యాసం చేయాలని నిరూపించారు.
  • లౌకిక ప్రవృత్తి కల వ్యక్తులను (శ్రీమంతులు, రాజకీయంగా శక్తివంతులు, మొదలైన వారిని ) పొగుడుట. భగవంతుడిని స్తుతించవలసిన నాలుక/నోరుతో ఇతర దేవతాంతరులను కీర్తించుట ఒక అడ్డంకి.  నమ్మాళ్వారు తిరువాయ్మొళి 3.9.1 లో అన్నారు ” ఎన్నావిళ్ ఇంకవి యాన్ ఒరువర్క్కుం కొడుక్కిలేన్, ఎన్నప్పన్ ఎమ్పెరుమాన్ ఉళనాగవే” –  నా నాలుక ఎమ్పెరుమాన్ తప్ప ఇంకెవ్వరినీ స్తుతించదు, ఎమ్పెరుమాన్ నా తీయని స్తుతి కోసం వేచి ఉంటారు.
  • సర్వాధికారాన్ని (అందరికీ అర్హతఉన్న) అధికృధాదికారంగా (యోగ్యమైన వ్యక్తులకు మాత్రమే అర్హత) భావించుట. ఉదాహరణకు, వేదం త్రైవర్ణికులు (మొదటి 3 వర్ణముల వారు – బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) నేర్చుకోవచ్చు మరియు చదవవచ్చు. అయితే దివ్యప్రబంధము చదువుటకు, మంగళాశాసనం చేయుటకు ప్రతి ఒక్కరూ అర్హులు. అనువాదకుని గమనిక: అదే సూత్రాన్ని అళగీయ మణవాళ పెరుమాళ్ నాయనార్ ఆచార్య హృదయం చూర్ణిక 73 లో వివరించారు – మృత్ గతం పోలన్ఱే పొఱ్కుడం – ఒక మట్టి కుండ బంగారు కుండ వంటిది కాదు. బంగారం సహజంగా స్వచ్ఛమైనది. అది ఎప్పుడైనా ఎవరైనా ముట్టుకోవచ్చు. కాని మట్టి కుండకు అనేక నిబంధనలు ఉన్నాయి, కొంతమంది మాత్రమే కొన్ని సందర్భాలలో మాత్రమే తాక వచ్చు – అనధికారిక సమయంలో అనధికార వ్యక్తులు తాకినప్పుడు, అవి పవిత్ర కార్యలకు పనికిరావు. బంగారపు పాత్రలకు అలాంటి నిబంధనలు లేవు. అదేవిధంగా, ఆళ్వార్ల పాసురాలు పవిత్రమైనవి,  ఏ వ్యక్తి అయినా అనుసంధానం చేయవచ్చు.
  • ఒక శ్రీవైష్ణవునిగా మారిన (సత్ సాంప్రదాయ సూత్రాల సరైన అవగాహనతో) ​​తరువాత, ఆళ్వారుల మరియు ఆచార్యులచే వ్రాయబడని పాసురాలను చదువుట ఒక అడ్డంకిగా చెప్పవచ్చు. అనువాదకుని గమనిక: ఆళ్వారులు ఎమ్పెరుమానునిచే కలుషితం లేని జ్ఞానంతో ఆశీర్వదించబడ్డారు. మన పూర్వాచార్యులు  ఆళ్వారులచే  ఆశీర్వదించబడ్డారు. వారు రాసినది ఏది కూడా సొంత స్వార్థం లేకుండా పూర్తిగా స్వచ్ఛమైనవి. కాబట్టి, మన ఆచార్యులు మరియు ఆళ్వారులచే వ్రాయబడిన వాటిని ఖచ్చితంగా చదవాలి మరియు పాటించాలి. ఇతర వ్యక్తుల స్థితిలో (ఎమ్పెరుమానుని భక్తులైనప్పటికీ, శుద్ధ సాంప్రదాయ ఆచార్య పరంపరను పాటించని వారు) వారి సొంత నిష్ఠపై, అవగాహనపై ఆధారపడతారు, ఆ సందర్భంలో కొంతవరకు ఉపాయాంతరములు (కర్మ, జ్ఞాన, భక్తి యోగములు మొదలైన ఉపాయములుగా) , ప్రయోజనాంతరం (శ్రీమన్నారాయణకు నిస్వార్థ కైంకర్యమునకు బదులుగా ఇతర లాభాలను ఆశించుట) మరియు దేవతాంతరములు (ఇతర దేవతల స్తుతి) కలవచ్చు. కాబట్టి, అటువంటి సాహిత్యానికి దూరంగా ఉండటం ఉత్తమం, ఎందుకంటే,  స్వచ్ఛమైన మరియు మిశ్రమ (కలిసిన) సాహిత్యానికి మధ్య వ్యత్యాసాన్ని మనం గుర్తించలేని స్తితిలో ఉంటాము.
  • ఇటువంటి ఆళ్వారుల, ఆచార్యుల సాహిత్యమును సరైన ఆచార్యుల ఆధ్వర్యం లో నేర్చుకోవాలి.  మనం సొంతంగా  వాటిని అధ్యయనం చేయుట లేదా అధికారం లేని వారి నుంచి నేర్చుకొనుట ఒక అడ్డంకి.
  • భగవాన్ యొక్క నామ సంకీర్తనం పరిశుద్దీకరణ ప్రక్రియగా కాకుండా ఆనందకరమైన ప్రక్రియగా సంతోషంగా చేయాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి. భగవాన్ నామాలను పలికితే స్వచ్ఛమైన బ్రహ్మానందానికి దారితీస్తుంది. మధురకవి ఆళ్వార్ వారి కణ్ణినుణ్ చిఱుతాంబు 1 లో “కురుగూర్ నంబి  ఎన్ఱక్కాల్ అణ్ణిక్కుం అముదూఱుం ఎన్నావుక్కే” అని అన్నారు – నేను నమ్మాళ్వార్ నామమును పలికినప్పుడు నా నాలుకపై స్వచ్ఛమైన తేనె రుచి యొక్క అనుభవం కలుగుతుంది. నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 7.9.11లో “ఎంగనే సొల్లిలుం ఇన్బం పయక్కుమే” – అయితే నేను ఎమ్పెరుమానుని ఎలా స్తుతించినా అది బ్రహ్మానందానికి దారితీస్తుంది అని అన్నారు. అనువాదకుని గమనిక: తొండరడిప్పొడి ఆళ్వార్ తిరుమాలైలో నామ సంకీర్తనం యొక్క పూర్తి మహిమలను తెలిపారు. పెరియ వాచ్చాన్ పిళ్ళై  ఈ ప్రబంధం యొక్క అద్భుతమైన అర్థాన్ని వారి వ్యాఖ్యానంలో వ్రాసారు. మొదటి పాశురంలో, నామ సంకీర్తనం యొక్క పావనత్వాన్ని(వాటి పవిత్రతను మరియు కీర్తించువారిని పవిత్రం చేసే సామర్థ్యం గురించి) కీర్తించారు.  రెండవ పాశురంలో, నామ సంకీర్తనం యొక్క భోగ్యత్వాన్ని(తీయనిది, పరమ భోగ్యమైనది) కీర్తించారు.  రెండు అంశాలు ముఖ్యమైనవి. పెరియ వాచ్చాన్ పిళ్ళై వారు ముందు పావనత్వానికి తరువాత భోగ్యత్వాన్ని ఉంచడానికి కారణాన్ని అందంగా వివరిస్తున్నారు – నామ సంకీర్తనంతో పరిశుద్దులు అయిన తరువాత సంపూర్ణమైన బ్రహ్మానందము సరిగ్గా పొందగలము.
  • భాగవతుల నామాలను పలుకకుండా భగవాన్  నామాలను కీర్తించుట ఒక అడ్డంకి. భగవాన్ నామ సంకీర్తనం మరియు భాగవత నామ సంకీర్తనం రెండూ సమానంగా ఘనమైనవి (వాస్తవానికి భగవాన్ నామ సంకీర్తనం కంటే భాగవత నామ సంకీర్తనం గొప్పది). కాబట్టి, రెండూ చేయాలి. మనము మునుపటి వివరణను గుర్తు తెచ్చుకోవచ్చు – మధురకవి ఆళ్వార్ వారి కణ్ణినుణ్ చిఱుతాంబు 1 లో “కురుగూర్ నంబి  ఎన్ఱక్కాల్ అణ్ణిక్కుం అముదూఱుం ఎన్నావుక్కే” – నేను నమ్మాళ్వారి నామమును పలికినప్పుడు నా నాలుకలో స్వచ్ఛమైన తేనె రుచి యొక్క అనుభవం కలుగుతుంది అని అన్నారు.
  • స్వతంత్రంగా ఆచార్యుల ముందు వారి అనుమతి లేకుండా మాట్లాడట /పఠి౦చుట మొదలు పెట్టడం, వారు అనుమతి ఇచ్చిన తరువాత పఠి౦చక పోవుట అడ్డంకి. అనువాదకుని గమనిక: పిళ్ళై లోకాచార్యుల వారి “అర్ధ పంచకం” చివరిలో వివరించారు, శ్రీవైష్ణవులు  (ఐదు ముఖ్యమైన సూత్రాలను అర్ధం చేసుకున్నవాడు) కొంతమంది వ్యక్తుల ముందు కొన్ని లక్షణాలను స్పష్టంగా ప్రదర్శించాలి. అందులో, భగవాన్ ముందు వినయం / సాత్వికము ప్రదర్శించాలి.  ఆచార్యుల ముందు అజ్ఞానం స్పష్టంగా ప్రదర్శించాలి (అంటే, తన స్వంత తెలివితేటలను ప్రదర్శించటానికి బదులుగా వారి నుండి ప్రతిదీ నేర్చుకోవాలని కోరుకోవాలి) మరియు భౌతికంగా ఆలోచించే వ్యక్తుల ముందు వాళ్ళకి భిన్న స్వభావం (ఒక శ్రీవైష్ణవుడని) ప్రదర్శించాలి. అంతేగాక, ఆచార్యుల భగవత్ /భాగవత విషయాల గురించి శిష్యులు మాట్లాడటం చూసి, గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు – ఎప్పుడైనా ఆచార్యులు ఎవరినైనా మాట్లాడమని ఆదేశిస్తే ఆ సమయంలో తిరస్కరించకూడదు – ఆ సమయంలో భగవాన్ మరియు భాగవతుల యొక్క మహిమలను గురించి వినయంగా మాట్లాడాలి.
  • గోష్టిలో (సామూహిక పారాయణం) లో ఉన్నప్పుడు, స్వతంత్రంగా మనము పారాయణం మొదలుపెడితే అడ్డంకి అవుతుంది. సాధారణంగా, గోష్తికి నాయకుడు “శాతిత్తరుళ” అంటే మొదలు పెడదాము అని  ఉంటారు. ఆ తరువాత, మనం పారాయణం చేయుట ప్రారంభించాలి. ఇది సరైన మర్యాద.
  • అధిపతులు ప్రారంభించిన తర్వాత మనం తరువాత భాగంతో ప్రారంభించక పోవుట. అనువాదకుని గమనిక: అహంకారంతో, వారు పైనాయకుడిగా ఉన్నామని చూపించడానికి కేవలం వాళ్ళు మాత్రమే ప్రారంభించవచ్చు. అలాంటి వ్యక్తులు, గోష్ఠిలో ఇతరులు మార్గనిర్దేశం చేస్తున్నపుడు దయచేసి వాళ్ళు నోరు మూసుకోవచ్చు. అది మంచి మర్యాద (ప్రవర్తన) కాదు.
  • పాశురం యొక్క రెండవ భాగాన్నిపఠించుటకు సంకోచించుట. అనువాదకుని గమనిక: సాధారణంగా, పండితులు / పై స్థాయిలో ఉన్న అధ్యాపకులు పాశురం యొక్క మొదటి భాగాన్ని పఠించిన తరువాత ఇతరులు (క్రింద స్థాయిలో, మొదలైన వాళ్ళు) పాశురం యొక్క రెండవ భాగాన్ని పఠించాలి. ఈ పద్ధతిలో అంతరాయం లేకుండా పారాయణం కొనసాగించ వచ్చు  మరియు పఠించేవారికి మధ్య మధ్య సరియైన విరామానికి అవకాశం కల్పించి ఎక్కువ సేపు పారాయాణ౦ చేయుటకు కూడా అవకాశం ఉంటుంది. ఇది దివ్యప్రబంధ సేవాకాలంలో ప్రామాణిక పద్ధతి. పరిస్థితిని బట్టి, ఏ సంకోచం లేకుండా రెండవ భాగాన్ని చదివేందుకు ఎవరైనా సిద్ధంగా ఉండాలి.
  • వేగంగా పఠించి అక్షరాలను / పదాలను మ్రింగివేయుట/ తప్పుగా పలుకుట  అనేది ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక:  దివ్యప్రబంధము అందరికీ అర్థం అయ్యి అందారూ చదవ గలిగేలా నెమ్మదిగా చదవాలి.  వారి స్వంత సౌలభ్యము కోసం వేగంగా చదివేసి పదాలను మ్రింగి వేయకూడదు.
  • గోష్ఠిలో ఎవరైనా శ్రీవైష్ణవుడు ఏదైనా తప్పుగా చదివినప్పుడు, వారిపైన నవ్వడంగానీ ఎగతాళి చేయడం కానీ చేయకూడదు.  ఆ వ్యక్తిని బహిరంగంగా సరిదిద్దకూడదు. వినయముతో ఏకాంతముగా వారికి తెలియజేయాలి.
  • ప్రతి ప్రబంధం యొక్క మొదటి మరియు చివరి పాశురం రెండుసార్లు పఠించాలి. అలా చదవక పోవుట ఒక అడ్డంకి.  కొన్నిప్రత్యేక సంధర్భములున్నాయి.  (అనువాదకుని గమనిక: చరమ కైంకర్యం సమయంలో, మొదలైన సమయాల్లో  అన్ని పాసురాలు ఒక్కసారి మాత్రమే చదువుతారు) – మరింన్నివివరాలకు పెద్దలను సంప్రదించండి.
  • శడకోపన్ అని విన్నప్పుడు అంజలి (రెండుచేతులు కలిపి నమస్కరించుట) జోడించక పోవుట ఒక అడ్డంకి. ప్రభంధం / పదిగం యొక్క చివరి పాసురంలో, సాధారణంగా నమ్మాళ్వారు యొక్క పేరును (పాసురంలో భాగంగా) పఠిస్తారు. ఆనవాయితీగా ఆ సమయంలో, మనము దక్షిణ దిశ వైపు తిరిగి (ఆళ్వార్ తిరునగరి భారత దేశం దక్షిణంలో ఉన్నందున) నమస్కరించాలి. అనువాదకుని గమనిక: ఇతర ఆళ్వారులకు కూడా ఇది వర్తిస్తుంది. అళగీయ మణవాళ పెరుమాళ్ నాయనార్ ఈ సూత్రాన్ని కణ్ణినుణ్ చిఱుతాంబు వ్యాఖ్యానంలో మరియు ఆచార్య హృదయములో వివరించారు – నమ్మాళ్వారు యొక్క పేరు వినగానే శ్రీవైష్ణవులు వారు మనకి చేసిన ఉపకారమునకు కృతజ్ఞత తెలుపుతూ తప్పనిసరిగా దక్షిణ దిశ వైపు అంజలి జోడించి నమస్కరించాలి.  బాధాకరమైన విషయమేమిటంటే, ఈ రోజుల్లో గొప్ప నేర్పరులు కూడా సేవాకల సమయంలో నమ్మాళ్వారుల పేరు విన్నప్పుడు నమస్కారం చేయరు.  ఇక్కడ ఈ సందర్భంగా నమ్మాళ్వారు గురించి చెప్పబడింది, ఇదే సూత్రం అందరూ ఆళ్వారులకు వర్తిస్తుంది.
  • దివ్యప్రబంధ పఠనానికి సాఱ్ఱుమురై (సరైన పూర్తయింది) చేయక పోవుట. దివ్యప్రబంధ పారాయణం చేసేటపుడల్లా,  సరైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. మనం సాధారణ౦గా తనియన్లతో మొదలుపెట్టి, ప్రత్యేక క్రమంలో ప్రత్యేకమైన ప్రబంధాలను పఠి౦చి చివర్లో ఆ ఆలయం, మఠం, తిరుమలైగై (నివాసము) పరిపాటి ప్రకారంగా  సాఱ్ఱుమురై చేస్తాము. సరైన నియమం/క్రమం లేకుండా కేవలం దివ్యప్రబంధ౦  పఠి౦చుట సరి కాదు.
  • ఇతరులకు దివ్యప్రబంధ౦ బోధించేటప్పుడు, ప్రతిఫలంగా వస్తువులు / ద్రవ్య లాభాలను ఆశించరాదు. అనువాదకుని గమనిక: దివ్యప్రబంధ యొక్క పూర్తి దృష్టి ఎమ్పెరుమాన్ కైంకర్యం మరియు మంగళాశాసనంపై  పూర్తిగా దృష్టి ఉంటుంది. కాబట్టి, ఇతరులకు దివ్యప్రబంధ౦ బోధన యొక్క పూర్తి  ఉద్దేశ్యము ఎమ్పెరుమానుకి మంగళాశాసనం చేయుటకై ఇతరులను ప్రేరేపించుట.  అది మాత్రమే లక్ష్యం – ఏ ఇతర ఆకాంక్షలకు చోటు లేదు.
  • డబ్బు కోసం దివ్యప్రబంధ౦ పారాయణం చేయకూడదు. వెల కట్టి ఆళ్వారుల దివ్యప్రబంధములను  అమ్మడం లేదా దివ్యప్రబంధ పారాయణం ఉద్యోగంగా చేయుట గొప్ప పాపం. దివ్యప్రబంధ పారాయణం చేసినపుడు కొంత సంభావనం (సమర్పణలు) స్వీకరించ వచ్చు – కాని, పారాయణం చేసిన వారు హక్కుగా భావించి అడగకూడదు.
  • దేవతా౦తర ఆరాధనలో నిమగ్నమై ఉన్న వారి ఇళ్ళలో దివ్యప్రబంధ౦ పారాయణం చేయకూడదు. అలా చేస్తే పారాయణం చేసేవారి స్వరూపాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది భౌతికంగా ఆలోచించే వ్యక్తులు స్నానం చేసే ఒక నదీతీరాన నిత్య కర్మానుష్టానం చేస్తున్నట్లుగా ఉంటుంది –  స్వచ్ఛంగా ఉన్న వారి నిష్ఠను కలుషితం చేస్తుంది. దేవతా౦తర ఆలయ సమీపంలో ఉన్నపుడు నమ్మాళ్వారి పేరు విన్నప్పుడు కూడా, నమస్కారం చేయవలసిన అవసరం లేదు అని చెప్పబడింది (ఎందుకంటే పొరపాటుగా దేవతా౦తరులకు నమస్కారం చేసినట్లగును).
  • విష్ణు సహస్రనామం, ఎళై ఎతలన్ (తిరువాయ్మొళి 5.8), ఆళియెళ (తిరువాయ్మొళి 7.4) పాసురాలను వ్యాధులు నయం కావాలన్న సంకల్పంతో పఠి౦చుట ఒక అడ్డంకి. ఇక్కడ చెప్పబడిన పాశురాలు మరియు  విష్ణు సహస్రనామం పఠించడం వల్ల వ్యాధుల నుండి విముక్తులౌతామని సాధారణంగా వివరించబడింది. కానీ మనం ఏ విధ౦గా కూడా శరీరాన్ని చూడకూడదు, ఇది సరికాదు. కాని ఇతరులను నయం చేయడానికి చదివి వినిపించడం సమంజసమే.
  • ఆచార్యులను స్తుతించకుండా  భగవానుని స్తుతించుట ఒక అడ్డంకి. సాధారణంగా ప్రబంధ౦ పారాయణమునకు ముందు తనియన్లు చదవబడతాయి. ముదలియాండాన్ వివరణను మనము గుర్తు చేసుకోవచ్చు “గురుపరంపరా మంత్రం చెప్పకుండా ద్వయమంత్రాన్ని  పఠించడం  దేవతాంతరులను ఆరాధించి నట్లు౦డును”. అనువాదకుని గమనిక: మనము అనేక పుర్వాచార్య స్తోత్ర గ్రంధాలలో, ఆళవందార్ యొక్క స్తోత్రరత్నం, ఆళ్వాన్ యొక్క స్తవములు, భట్టార్  యొక్క శ్రీరంగరాజ స్తవం మొదలైన వాటిలో గమనించవచ్చు, మొదటి అనేక శ్లోకాలు గురుపరంపర, ఆళ్వారులు మరియు ఆచార్యులను స్తుతించిన తరువాత అసలు  స్తోత్రము ప్రారంభమవుతుంది. పిళ్ళై లోకాచార్యుల ఇదే సూత్రాన్ని శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం సూత్రం 274లో “జప్తవ్యం గురుపరంపరైయుం ద్వాయముం – మనం నిరంతరం గురు పరమపరా మంత్రం (అస్మత్ గురుభ్యో నమః…..శ్రీధరాయ నమః) మరియు ద్వయ మహా మంత్ర జపం చేస్తూ ఉండాలని వివరించారు.  మామునులు వారి వ్యాఖ్యానంలో వివరిస్తూ  – గురుపరంపర అంటే వారి స్వంత ఆచార్యుల నుండి శ్రీమన్నారాయణ (ప్రతి ఒక్కరికి ప్రథమాచార్యులు) వరకు, ద్వయం ఇటువంటి గురుపరంపరాచార్యులు మనకు అనుగ్రహించిన ప్రసాదము అని అర్థం.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/02/virodhi-pariharangal-13.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

విరోధి పరిహారాలు – 12

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/06/30/virodhi-pariharangal-11/ .

ఎమ్బెరుమాన్, ఆళ్వారులు, ఆచార్యులు – మన ధ్యానం మరియు చింతన యొక్క కేంద్ర బిందువులు
43. స్మరణ విరోధి – మన ఆలోచనలలో / ధ్యానంలో / చింతనలో అవరోధాలు.
స్మరణ అంటే ధ్యానం లేదా చింతన అని అర్థం. ఈ విభాగంలో, మనం దేని గురించి ధ్యానం/చింతన చేయాలి మరియు దేని గురించి ధ్యానం/చింతన చేయకూడదో వంటి అంశాలు వివరించబడ్డాయి.
  • శ్రీ విష్ణు పురాణంలో పేర్కొనబడినట్టుగా “అన్యే తు పురుషవ్యాగ్ర  చేతసా యేపి అపాస్రయః అసుద్ధాస్తే సమస్తాస్తూ దేవత్యాః కర్మయోనయః”  – దేవతాంతర అంశములైన రుద్ర, స్కంద, దుర్గ మొదలైన వారిపై ధ్యానం పెట్టరాదు. అత్యంత కళ్యాణ రూపమైన శ్రీమన్నారాయణునిపైన మన పూర్ణ దృష్టి ఉంచాలి. దేవతాంతరులపై చింతన పెట్టడం ఒక అడ్డంకి. పైగా రూపం లేని, పేరు లేనిదేదో వాటిపైన దృష్టి సాధించడం కష్టం. కాబట్టి, ఎమ్బెరుమాన్ అర్చావతార రూపాలపై మరియు వారి దివ్య నామాలపై సంపూర్ణ దృష్టి పెట్టాలి, ఇది చాలా పవిత్రమైనది మరియు ధ్యానం చేయట కూడా చాలా సులభమైనది.
  • మన ఆచార్యుల దివ్య స్వరూపంపై ధ్యానించక పోవుట ఒక  అడ్డంకి. అనువాదకుని గమనిక:  తిరుక్కోష్టియూర్ నంబి ఒకసారి ఉత్సవ సమయంలో శ్రీరంగానికి వెళతారు. ఉత్సవం పూర్తి అయ్యే వరకు అక్కడే ఉంటారు. ఎమ్బెరుమానార్  నంబికి ఉత్సవ సమయమంతటా సేవ చేసుకుంటారు. నంబి వదిలి వెళుతుండగా, ఎమ్బెరుమానార్ “నేను ఆశ్రయం పొందేందుకు మంచి ఉపదేశాలను కొన్నిప్రసాదించండి” అని నంబిని అడుగుతారు. నంబి కొంతసేపు వారి కళ్ళు మూసుకొని, “మనము ఆలవందారుల ఆధ్వర్యంలో శిక్షణ (ఆధ్యాత్మిక విషయాల్లో) పొందుతున్నాము. ఆ సమయంలో, వారు నది స్నానం చేస్తూ తలక్రిందకు మునిగినపుడు, వారి వీపు పైభాగం మెరుస్తూ ఒక అందమైన రాగి పాత్ర లాగా అనిపించేది. నేను ఆ దివ్య రూపాన్ని శరణు వేడుకుంటాను. మీరు కూడా ఆ దివ్య దృశ్యాన్ని శరణు వేడుకోండి”. – ఈ సంఘటన చాలా ప్రసిద్దమైనది. ఈ సంఘటన 6000 పడి గురు పరంపరా ప్రభావంలో కూడా వివరించబడింది. ఈ సంఘటన మన యొక్క దృష్టి ఆచార్యుల యొక్క దివ్య స్వరూపంపైన దృష్టి ఉంచాలని సూచిస్తుంది. నంబి తిరుక్కోష్టియూర్ ఆలయం యొక్క ప్రధాన గోపురం మిద్దెపైన ఉండి ఆళవందారులపైన  ధ్యానం చేస్తూ, “యమునైతురైవర్” (యామునాచార్యులు) అన్న మంత్రంజపం చేసేవారని చెప్పబడింది. ఈ సంఘటన అంతిమోపాయ నిష్ఠలో వివరించబడింది.
  • భాగవతుల దివ్య సంఘం  మీద ధ్యానం చేయక పోవుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: నమ్మాళ్వారు తిరువాయ్మొళిలో ప్రత్యేకంగా పయిలుం చుడరొళి (2.7) మరియు నెడుమాఱ్కడిమై (8.10) పదిగంలో అనేక పాసురాలలో భాగవతులను కీర్తించారు. కుళశేఖర ఆళ్వారులు భాగవతుల పట్ల తమ ప్రేమ మరియు భక్తిని పెరుమాళ్ తిరుమోళి, తేత్తరుం తిఱల్ (2) పదిగంలో  పంచుకుంటాడు. ఇతర ఆళ్వారులు మరియు ఆచార్యలు కూడా భాగవతుల యొక్క దివ్య అంశాలపై ఎల్లప్పుడూ ధ్యానం మరియు చింతన చేయాలని చాటారు.
  • భౌతికంగా ఆలోచించే వ్యక్తుల యొక్క వివిధ అంశాలపై ధ్యానం చేయుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొళి 2.6.1 “నణ్ణాద వాళ్ అవుణార్” పాశురంలో  “నేను ఒక క్షణం కూడా, చల్లని తిరుక్కడల్మల్లై దివ్య దేశంలో నివసిస్తున్న స్థలశయన ప్పెరుమాళ్ పైన  ధ్యానించని వారి గురించి ఆలోచించను”. సంసారులు (భౌతికంగా ఆలోచించే వ్యక్తులు) ఆహారం, వస్త్రాలు, ఉండటానికి సౌకర్యవంతమైన ఇల్లు మొదలైన వాటిపైనే వారి దృష్టి ఉంటుంది కానీ ఆధ్యాత్మిక చింతనపై ఏ విధమైన ఆసక్తి పెట్టరు.
  • భగవాన్ మరియు భాగవతులకు ప్రియమైన దివ్య క్షేత్రాలపై ధ్యానం చేయకుండుట ఒక అడ్డంకి. అంతేకాకుండా, ఎమ్పెరుమాన్, ఆళ్వారులు మరియు ఆచార్యుల సంబంధం లేని ఇతర క్షేత్రాలపై ధ్యానం చేయుట  ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక:  ఎమ్పెరుమాన్ ప్రతి ఒక్కరి పట్లా కరుణాభావంతో వారిని ఉద్దరించడానికి అర్చావతార మూర్తిగా క్రిందకు దిగివస్తారు. వారు ఎన్నో దేవాలయాలు, మఠాలు, తిరుమాలిగలకు (గృహాలు)  గొప్ప కోరిక, ఉత్సాహంతో జీవాత్మకు సహాయ పడాలని వచ్చారు. ఈ క్షేత్రాల్లో, ఆళ్వార్లు పాసురాలు పాడిన వాటిని దివ్య దేశాలు అని పిలవబడ్డాయి. ఆచార్యాలకు ప్రియమైన వాటిని అభిమాన స్థలాలని అంటారు. సాధారణంగా ఇతర శ్రీవైష్ణవులు ప్రియమైన ఎన్నో క్షేత్రాలు  ఉన్నాయి. మన దృష్టి కేవలం భగవాన్, ఆళ్వారులు మరియు ఆచార్యులకు సంబంధం కలిగివున్న క్షేత్రాలపైనే ఉంచాలి.
  • భాగవతులకు ప్రియమైన అంశాలపై చింతన చేయకుండా, సంసారులకు (భౌతికంగా ఆలోచించే వ్యక్తులు) ప్రియమైన అంశాలపై ధ్యానం చేయుట ఒక అడ్డంకి.  అనువాదకుని గమనిక: ఆళ్వారులు మరియు ఆచార్యాల దృష్టి ఎన్నో విధాలుగా ఎల్లప్పుడూ భగవత్ విషయంలో నిమగ్నమై ఉండేది. సంసారుల దృష్టి ఎప్పుడు సంపదను ఆర్జించడంలో, వినోదం, క్రీడలు, లౌకిక సంగీతం మొదలైనవి వంటి ప్రాపంచిక ఆనందాలపై దృష్టి కేంద్రీకరించి ఉంటుంది. ప్రపన్నులుగా, మన ఆళ్వారులు, ఆచార్యాల అడుగుజాడల్లో నడవాలని ఆశించాలి కానీ , సంసారుల అడుగుజాడల్లో కాదు.
  • భగవాన్ మరియు భాగవతుల  యొక్క పవిత్రమైన గుణాలపై చింతన చేయకుండా,  అవైష్ణవుల యొక్క లౌకిక మహిమల గురించి ధ్యానం చేయడం అడ్డంకి.  అనువాదకుని గమనిక: ఉదాహరణకి, భగవాన్ మరియు వారి భక్తులపై దృష్టి కేంద్రీకరించిన ఒక శ్రీవైష్ణవుడిని చూసినప్పుడు, మనము వారి లక్షణాలపై చింతన పెట్టినపుడు, వారిలా పరివర్తనం పొందుతాము. అధిక హోదా వంటి విషయాన్ని, భారీ సంపద (శ్రీవైష్ణవులలో కూడా) వంటి విషయాల్ని మనము చూసినప్పుడు – వారి లౌకిక అభిలాషలకు మనం ప్రభావితం కాకుండా ఉండాలి, అవి మనలను ఈ సంసార బంధాన్ని పెంచుతుంది.
  • ఎమ్పెరుమాన్ అర్చావతార  దివ్య మంగళ విగ్రహము తయారికలో ముడి పదార్థాన్ని విశ్లేషించుట ఒక అడ్డంకి. ఉదాహరణకు, స్వర్ణ విగ్రహం గొప్పదని చెక్క విగ్రహం తక్కువని భావించుట చాలా తప్పు. అనువాదకుని గమనిక:  శాస్త్రంలో అర్చా విగ్రహం యొక్క ముడి పదార్థాన్ని విశ్లేషించడం అనేది సొంత తల్లి యొక్క పవిత్రతను  విశ్లేషించడం వంటిదని  చెప్పబడింది.
  • అదే విధంగా, ఒక శ్రీవైష్ణవుని (భక్తి జ్ఞానంలో పరిపక్వత ఉన్నవాడు)  జన్మ, సంపద, అనుష్ఠానం, మొదలైన వాటిని ప్రశ్నించుట ఒక అడ్డంకి. తిరుమాళైలో, తొండరడిప్పొడి ఆళ్వార్ భాగావతులను చివరిలో ప్రశంసించారు (మేంపొరుళ్ పాశురం తర్వాత).  భాగవతులతో గొప్ప భక్తి  గౌరవాలతో వ్యవహరించాలన్న ఈ పాశురాలను గుర్తుంచుకోవాలి. అనువాదకుని గమనిక: జన్మ ఆధారంగా ఒక శ్రీవైష్ణవుడిని విశ్లేషించుట అనేది ఎమ్పెరుమాన్ అర్చావతార  దివ్య మంగళ విగ్రహము తయారికలో ముడి పదార్థాన్ని విశ్లేషణతో పోల్చ బడినది (ఇది అంతకు ముందే వివరించబడింది) – కాబట్టి అలా చేయుట గొప్ప పాపంగా పరిగణించబడుతుంది .
  • అదేవిధంగా, తమ ఆచార్యులను (వాస్తవానికి వారు భగవాన్ యొక్క అవతారముగా ఉంటారు) కేవలం మానవుడిగా పరిగణనలోకి తీసుకొనుట ఒక అడ్డంకి. ప్రమాణ వాఖ్యం ప్రకారం, “ఆచార్య స్స హరి సాక్షాత్ – చరరూపి నసంశయః” – ఆచార్యులు నడయాడే భగవంతుడు (ఒక చోట స్థిరమైన అర్చావతార ఎమ్పెరుమాన్ లా కాకుండా). ఆచార్యులను ఒక సాధారణ మానవుడని ఎన్నడూ భావించకూడదు.
  • మన ఆచార్యుల పట్ల గొప్ప కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఆ భావం కలిగి ఉండక పోవుట ఒక అడ్డంకి.  అనువాదకుని గమనిక:  శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో, పిళ్ళై లోకాచార్యులు, మనకు ఆచార్యుల  ద్వారా భగవాన్ లభిస్తారని,  భగవాన్ ద్వారా ఆచార్యులు లభిస్తారని తెలుపుతారు. కాబట్టి, ఆచార్యులు భగవంతునితో సరైన సంబంధాన్నికలిగించడం ద్వారా ఈ సంసారము నుండి ఉపశమనం పొందే గొప్ప సహాయం మనకు చేస్తున్నారు. కాబట్టి, ఎప్పటికీ ఈ విషయం గుర్తుంచుకోవాలి. వారి పట్ల  ఎప్పటికీ కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి.
  • భాగవతులను (తమ సొంత ఆచార్యులకు సమానంగా పరిగణిస్తారు) తనకు సమానంగా భావించుట  ఒక గొప్ప అడ్డంకి. అనువాదకుని గమనిక: సాధారణంగా అందరి శ్రీవైష్ణవులను తమ సొంత ఆచార్యులకు సమానంగా భావించాలి. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో పిళ్ళై లోకాచార్యుల వారు వివరిస్తూ భగవంతుని, భాగవతులను, అసహ్యాపచారములను వివరిస్తూ, తమని తాము వేరొక శ్రీవైష్ణవునికి సమానంగా భావించుట పెద్ద భాగవత అపచారము అని అన్నారు. ఇతర శ్రీవైష్ణవులను తనకంటే, భగవానుడుకంటే  ఎక్కువగా భావించాలి  మరియు వారిని ఎప్పుడూ గౌరవించాలి.
  • ఆళ్వారులు పాసురాలను దివ్యప్రబంధము (దివ్య కీర్తనలు) అని పిలుస్తారు.  వాటిని ప్రసిద్ధంగా “అరుళిచెయళ్” అని పిలుస్తారు. అవి తమిళ్ భాషలో సంకలనం చేయబడ్డాయి. కొంతమంది సంస్కృతం దేవ భాష  (దేవతల భాష) అని  తమిళ్ భాషను తక్కువగా చూస్తారు.  కానీ తిరుముంగై ఆళ్వారు “చెన్నిఱత్త తమిళోసై వడచొల్లాగి” – అనగా “అందమైన తమిళ౦ ధ్వనులు సంస్కృతంగా మారాయి” అని అన్నారు. నాయనార్ ఆచార్య హృదయంలో  (ఆగస్త్యముం అనాది) – అగస్త్య ఋషి చేత బహిర్గతం చేయబడిన తమిళ్ భాష శాశ్వత (ఎప్పటికి) మైనది. ఇది అగస్త్య ఋషి చేత వెల్లడి చేయబడినప్పటికీ, ఇది పురాతనమైనది మరియు సంస్కృతానికి తక్కువగా పరిగణించకూడదు. అనువాదకుని గమనిక: అళగీయ మణవాళ పెరుమాళ్ నాయనార్ తమ ఆచార్య హృదయంలో నమ్మాళ్వార్ మరియు వారి దివ్యప్రబంధము యొక్క కీర్తి గురించి వివరించారు. ఈ రచనలో, ఆళ్వార్ జన్మకు సంభంధం లేకుండా, వారు స్వయంగా ఎమ్బెరుమాన్ చేత ఆశీర్వదించబడడం వలన వారి గొప్పతనం అపరిమితమైనది. అదేవిధంగా, భాషకు (తమిళ్ భాష) సంభంధం లేకుండా దివ్యప్రబంధము  యొక్క గొప్పతనం కూడా అపరిమితమైనది. మనం ఏదైనా సాహిత్యాన్ని కేవలం సంస్కృతంలో వ్రాయబడిందని అంగీకరించ వలసి వస్తే , అప్పుడు మనం బౌద్ధ శాస్త్రాన్నిఅంగీకరించాలి. రచయిత యొక్క పుట్టుక  ఆధారంగా మనము తిరస్కరించ వలసి వస్తే , మహాభారతాన్ని (వ్యాస మహర్షి రాసిన) మరియు భగవత్గీత (శ్రీకృష్ణుడు ఉపదేశించిన) ను తిరస్కరించవలసి ఉంటుంది, ఎందుకంటే రచయితలు ఇద్దరూ ఆబ్రాహ్మణులు కాబట్టి. అందువలన, వారు చాలా అందంగా దృవీకరించినది ఏమిటంటే దివ్యప్రబంధము యొక్క కీర్తి  వ్రాసిన భాష లేదా రచయిత యొక్క పుట్టుక మీద ఆధారపడినది కాదు,  దివ్యప్రబంధములో ఉన్న గొప్ప విషయం వల్ల – అనగా,  శ్రీమన్నారాయణుని దృఢమైన భక్తితో (ఇతర దేవతాన్తరులపై దృష్తి లేకుండా) కీర్తిస్తున్నంత వరకు అది ఆమోదయోగ్యమైనది.
  • ఆత్మ యాత్ర (ఆత్మ కార్యాలు) యొక్క ప్రాముఖ్యతను మర్చిపోయి  మరియు దేహ యాత్ర (శరీరం కార్యాలు) పై దృష్టి కేంద్రీకరించడం ఒక  అవరోధం. ఆత్మ యాత్ర జీవాత్మ యొక్క సంక్షేమం కోరి తదనుగుణంగా ప్రవర్తించుట. దేహ యాత్ర  శరీరము యొక్క సంక్షేమం కోరి తదనుగుణంగా ప్రవర్తించడం అని అర్థం. శారీరిక సౌకర్యవంతమైన జీవనంపై దృష్టి పెట్టి ఆత్మ యొక్క శ్రేయస్సును విస్మరించరాదు.
  • భగవత్ అనుభవానికి  సంభందించని గుణాల ఆలోచనలు అడ్డంకులు. భగవంతునికి దాసులుగా ఉండి వారికి ప్రీతి కలిగించే విధంగా వ్యవహరించుట జీవాత్మ యొక్క అసలైన స్వభావం – దానికి విరుద్ధంమైనది ఏదైనా జీవాత్మ యొక్క స్వభావానికి తగినది కాదు.
  • భగవంతుడే మన ఉపాయము అని వారిపైన ఆధార పడుటను మరచుట ఒక అడ్డంకి.  ఎమ్బెరుమానుని సిద్ధ సాధనం అని పిలుస్తారు – అనగా “ఫలించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్న ఉపాయం” అని అర్థము. మనమెప్పుడూ ఆ అంశాన్ని మరచిపోకూడదు.
  • సాధ్య సాధనము (కర్మ, జ్ఞాన, భక్తి యోగములు) లకు దారితీసే ఆలోచలు మన మనస్సులోకి రానించుట.  సాధ్య సాధనము అంటే “తమ సొంత ప్రయత్నం ద్వారా సాధించ వలసిన ఉపాయము”.
  • కేవలం భగవత్ కైంకర్యం పై దృష్టి పెట్టి భాగవత కైంకర్యాన్ని విస్మరించుట ఒక అడ్డంకి.
  • భగవంతునికి, భాగవతులకు (అహంకారంతో) చేసిన సేవల  గురించి గొప్పగా ఆలోచించి పైగా భగవంతునికి, భాగవతులకు మనం చేసిన అనేక ప్రతికూలమైన చర్యల గురించి ఆలోచించక పోవుట.
  •  ప్రత్యేకంగా ఆచార్యులు మనకు చేసిన గొప్ప అనుగ్రహానికి చాలా కృతజ్ఞులై ఉండాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి.
  • అంతిమ స్మృతి  (శరీరాన్నివిడిచి పెట్టే చివరి క్షణాల్లో భగవంతుని గుర్తుచేసుకోనుట) అవసరం అని భావించుట ఒక అడ్డంకి. కర్మ, జ్ఞాన, భక్తి యోగములను పాటించేవారు అనేక జన్మల తరువాత పరమపదం చేరుకుంటారు. అటువంటి వారికి, చివరి క్షణాలలో భగవంతుని స్మరణ ఖచ్చితంగా అవసరం. కానీ పపన్నులకు, అంతిమ స్మృతి అవసరం లేదు. “అహం స్మరిమి మత్ భక్తం” –  తన భక్తుని చివరి క్షణాల్లో నేను వారిని స్మరించి వారిని ఉద్ధరిస్తాను, ఒక పపన్నునికి మోక్షం ప్రసాదించి పరమపదానికి తీసుకువెళ్ళే బాధ్యత భాగావానునిది.  అనువాదకుని గమనిక:  మన పూర్వాచార్యుల యొక్క జీవితాలలో మనము గమనించగలము, వారి తిరుమేని (శరీరము) ని విడిచే సమయంలో, వారు ఎప్పుడూ వారి ఆచార్యుని (ఎమ్బెరుమాన్కి బదులుగా) పై చింతన ఉంచేవారు. కాబట్టి ఇక్కడ మనం నిర్ధారించవలసినది ఏమిటంటే, మన చివరి క్షణాల్లో స్థిరమైన మనస్సుతో ధ్యానం చేయగలిగితే, భగవంతునికి బదులుగా మన ఆచార్యునిపై ధ్యానం ఉంచాలి – శ్రీవైష్ణవులు ఆచార్యాభిమాన నిష్ఠులు (కేవలం ఆచార్యుని కృపాకటాక్షాలపై ఆధారపడి ఉన్న వారు) కాబట్టి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/02/virodhi-pariharangal-12.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org