విరోధి పరిహారాలు – 16

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/08/10/virodhi-pariharangal-15/ .

చదవడానికి ముందు, శ్రీ వైష్ణవ తిరువారాదనంపై  మంచి అవగాహన కలిగి ఉండటాని  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2014/02/03/srivaishnava-thiruvaaraadhanam/ లోకి వెల్లి చదవండి.  ఈ క్రింది మొత్తం వ్యాసం ఈ అంశానికి సంబంధించినది.

47. సమారాధన విరోధి – ఇంట్లో ఎమ్పెరుమాన్కు తిరువారాదనం  చేసేటప్పుడు వచ్చే అవరోధాలు

   ఎమ్పెరుమాన్ యొక్క విభిన్న రూపాలు – పర (పరమపదంలో), వ్యూహ (క్షీరాబ్ది), విభవ (శ్రీ రామ, కృష్ణ, మొదలైన అవతారాలు), అంతర్యామి (అందరిలో ఉన్న పరమాత్మ), అర్చా (ఆలయంలో, ఇండ్లల్లో)

ఇంట్లో తిరువారాదనం

సమారాధనం అంటే ఇక్కడ కైంకర్య రూపంగా మనం ఇంట్లో ఎమ్పెరుమాన్కు చేసే పూజ అని అర్థం. దీనిని సాంప్రదాయకంగా తిరువారాదనం అని అంటారు. భగవత్ ఆరాదనం (తిరువారాదనం) ప్రేమపూర్వక భక్తితో ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. భగవత్ గీత 9.26 లో, భగవాన్ “పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తధహం భక్తి ఉపహ్రుతం అస్నామి ప్రయతాత్మనః” – పండు గానీ, జలం గానీ, పువ్వు గానీ, ఆకు గానీ నాకు భక్తితో సమర్పిస్తే నేను దానిని సంతోషంగా స్వీకరిస్తాను. ఈ విభాగంలో, భగవత్ ఆరాదనం చేసేటప్పుడు మన వైఖరి ఎలా ఉండాలో వివరించబడింది. చివరి భాగంలో, భాగవత ఆరాదనం (భక్తులను ఆరాధించడం) కూడా వివరించబడింది.

అనువాదకుల గమనిక: మన శ్రీవైష్ణవుల దినచర్యలో తిరువారాదనం చాలా ముఖ్యమైన భాగం. భగవాన్ గొప్ప కరుణతో తన భక్తుల ఇళ్లకు అర్చావతార రూపంగా దిగివస్తారు.  అటువంటి భగవానుని,  శ్రీవైష్ణవులు వారి ఇళ్ళల్లో జాగ్రత్తగా చూసుకోవలసిన ప్రాముఖ్యత చాలా ఉంది. మన సమాశ్రయణం (పంచ సంస్కారం) లో భాగంగా, ఆచార్యులు 5 పవిత్ర కార్యములు నిర్వహిస్తారు – 1) తపం (శిష్యుని భుజాలపైన వేడిచేసిన శంఖ చక్ర ముద్రలు వేయుట), 2) పుండ్రం (తిలకం  – తిరుమణ్ –  ఎమ్పెరుమాన్ శ్రీ పాదాలు మరియు మహాలక్ష్మి ఉనికిని సూచిస్తూ నిలువు గుర్తులు, 3) నామం ( దాస్య నామం – శిష్యునికి నామకరణం చేయుట), 4) మంత్రం (రహస్య మంత్రాన్ని ఉపదేశించుట, ఇది శిష్యులను సంసారం బారి నుండి బయటకు పడేస్తుంది) మరియు 5) యాగం (తిరువరాధన ప్రక్రియ) నేర్పుతారు. ఆచార్యులు చేత పంచ సంస్కారం అయిన తరువాత ఒక శిష్యుడు చేయవలసిన అతి ముఖ్యమైన కైంకార్యము ఈ తిరువారాదనం. శిష్యుడు తిరువారాదన ప్రక్రియను ఆచార్యుల నుండి సరిగ్గా నేర్చుకొని, వారి ఇంట్లో పెరుమాళ్కు చేయాలి. ఎమ్పెరుమానార్ వారి  గ్రంధం (సంస్కృతంలో) లో తిరువారాదన క్రమం గురించి వివరించారు. మణవాళ మామునులు వారి జీయర్ పడి తిరువారాదన క్రమం (తమిళం) లో ఇదే విషయాన్ని వివరించారు. తిరువారాదన కీర్తిని  చేయవలసిన పద్దతిని http://ponnadi.blogspot.in/2012/07/srivaishnava-thiruvaaraadhanam.html లో వివరించారు. నిత్యానుష్టానం (రోజువారీ దినచర్యలు) పై మరిన్ని వివరాలను http://ponnadi.blogspot.in/p/anushtanam.html లో చూడవచ్చు.

  • ధర్మశాస్త్రం / నిషేధాలకు భయపడుకుంటూ తిరువారాదనం చేయడం మరియు ఎమ్పెరుమాన్ పట్ల భక్తి, ప్రేమపూర్వకంగా చేయక పోవడం ఒక అడ్డంకి. ఇది మనకు సరైన కైంకర్యం అన్న దృఢమైన  విశ్వాసంతో తిరువారాదనం చేయాలి.  అనువాదకుల గమనిక: భగవాన్ తన భక్తుల ఇళ్లకు ఎంతో కరుణ మరియు ప్రేమతో దిగివస్తారు. మనం చేయవలసింది ఆ ప్రేమకు ప్రతిస్పందించడమే.  తిరువారాదనం చేయడం ద్వారా, మనము వారితో ప్రత్యేకంగా, ప్రత్యక్షంగా సంభాషిస్తాము. ఆ పరస్పర చర్య సరైనదిగా ఉండాలంటే, అపరిమితమైన శుభ లక్షణాలను కలిగి ఉన్నభగవాన్ యొక్క నిజమైన సేవకుడని జీవాత్మ (తాను స్వయం) అర్థం చేసుకోవాలి. ఆ అవగాహనే మనల్ని మన పూర్వాచార్యుల మార్గనిర్దేశం చేసినట్లుగా భగవంతుడిని సేవించడానికి దారి తీస్తుంది.
  • తిరువారాదనం చేసేటప్పుడు సోమరితనంతో ఉండకూడదు. తిరువారాదనం చేసేటప్పుడు ఎంతో ఆనందంతో , ఉత్సాహంతో ఉండాలి. అనువాదకుల గమనిక: తిరువారాదనం భయంతో (తిరువారాదనం సమయంలో, మనం సర్వోపరి భగవంతుడితో వ్యవహరిస్తున్నాం అని  ఎటువంటి పొరపాటులు చేయకూడదు) , ప్రేమపూర్వక భక్తితో (అటువంటి సర్వోపరి భగవాన్ మన ఆరాధనను  స్వీకరించడానికి దిగి వచ్చారు కాబట్టి మనం భక్తితో ప్రవర్తించాలి). అటువంటి వైఖరి ఉంటే, ఒక్క క్షణం కూడా బద్ధకం / సోమరితనానికి ఆస్కారమే ఉండదు.
  • తిరువారాదనం చేయటానికి వేరొకరిని నియమించడం సరైనది కాదు. ఇంట్లో వారి సోంత ఎమ్పెరుమాన్ని జాగ్రత్తగా వారే చూసుకోవాలి. ఇక్కడ ఒక ప్రసిద్ధమైన వాక్యము మనం గుర్తుచేసుకోవాలి,   “అళ్ ఇత్తు అంధి తొళవో” ( మనం సంధ్యా వందనం చేయటానికి  ఎవరినైనా నియమించగలమా? లేదు – ఎవరైనా సరే, వారి నిత్య కర్మలను వారే చేయాలి) మరియు “మహిషీ స్వెతతత్తుక్ ఆళిడువారుణ్డో?” (తన భార్య (రాణి) చెమటను తుడిచిపెట్టడానికి సహాయకుడిని నియమించే రాజు ఎవరైనా ఉంటారా? లేదు – వారే ప్రేమతో చేస్తారు).
  • తిరువారాదనం తగిన సమయంలో చేయాలి –  మనకు సౌకర్యంగా ఉన్నప్పుడు కాదు. అనువాదకుల గమనిక: వరవరముని యొక్క పూర్వ / ఉత్తర దినచర్యలో తిరువారాదనం 3 సార్లు చేయాలని చూపించారు – ఉదయాన్నే సంక్షిప్తముగా ఒకసారి, మధ్యాహ్నం సమయంలో వివరంగా ఒక సారి, సాయంత్రం సంక్షిప్తముగా మరో సారి. సామాన్యంగా, తిరువారాదనం రోజు మధ్యలో జరుపుతారు. వైధికులను పంచ కాలా పరాయణులు అని పిలుస్తారు – రోజును ఐదు విభాగాలుగా విభజించి, ప్రతి విభాగంలో కొన్నికార్యాలు చేస్తారు. ఐదు విభాగాలు ఇవి: అభిగమనం (మేల్కొనడం – ఉదయం శారీరక శుద్దీకరణలు చేయుట), ఉపాదానం (ముడి పదార్థాలను సేకరించడం), ఇజ్జా (దేవ పూజ – సేకరించిన పదార్థాలతో తిరువారాదనం చేయడం), స్వాధ్యాయం – వేదం, వేదాంతం, దివ్య  ప్రబందం మొదలైనవి నేర్చుకోవడం, చివరకు యోగం – ఎమ్పెరుమాన్ ఆలోచనలపై మనస్సు / శరీరాన్ని ధ్యానం చేయడం మరియు విశ్రాంతి తీసుకోవడం. దీని నుండి మనం అర్థం చేసుకోవచ్చు విస్తృతమైన ప్రధాన తిరువారాదనం రోజు మధ్యలోనే జరుగుతుంది. అదేవిధంగా, పిత్రు కార్యములు (శ్రార్ధం మొదలైనవి) మధ్యాహ్నం 2 గంటల తర్వాత చేయాలి – ఇది పితృలకు తగిన సమయం.
  • కీర్తి కోసం తిరువారాదనం చేయడం మరియు ఇతరులు మనలను కీర్తింపజేయడం కోసం చేయడం ఒక అడ్డంకి. ఇది ఎమ్పెరుమాన్ కు కైంకర్యముగా చేయాలి.
  • తిరువారాదనం డబ్బుల కోసం చేయడం ఒక అడ్డంకి. ఉద్యొగ రూపముగా చేయకూడదు, బదులుగా దీనిని స్వయం ప్రయొజనం రూపము (ఎమ్పెరుమాన్ యొక్క పూర్తి ఆనందం కోసం చేయడం) గా చేయాలి.
  • తిరువారాదనం ఇతర కామ్య కర్మల వలె చేయకూడదు (ప్రతి ఫలాన్ని ఆశించే కర్మలు). ఇది ఎలాంటి కామ్యం లేకుండా కైంకర్యంగా చేయాలి. అనువాదకుల గమనిక: ఉదాహరణకు, స్వర్గ లోకం (ఇంద్రుని యొక్క నివాసం) సాధించడానికి, ఒకరు జ్యోతిష్టోమా నిర్వహిస్తారు. తిరువారాదనం అటువంటి భౌతిక ప్రయోజనాలను పొందడం కోసం కాదు – భగవాన్ యొక్క శాశ్వత సేవకుడన్న మన స్వరూపాన్నినిరూపించడం కోసం.
  • మన శరీరం (మరియు ఇంద్రియాలు) భగవానునికి సేవ చేయటానికి మరియు ఉద్ధరింపబడటానికి ఇవ్వబడినవి అన్న అవగాహన భావనతో తిరువారాదనం చేయాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: “విచిత్రా దేహ సంపతిర్ ఈశ్వరాయ నివేదితుం, పూర్వమేవ క్రుతా బ్రహ్మన్ హస్తపాదాది సంయుత” అని చెప్పినట్లుగా, జీవాత్మ  సూక్ష్మస్తితిలొ (లయ స్థితిలో ) ఇంద్రియాలు / శరీరం లేకుండా, ప్రాపంచిక ఆనంద విహీనంగా,  విమోచన ప్రయత్నాలకు దూరంగా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు , పరమ దయతో సర్వేశ్వరుడు, తన యొక్క పాద పద్మాలను సమీపించే ప్రక్రియను ప్రారంభించడానికి జీవాత్మకు ఇంద్రియాలను / శరీరాన్ని ప్రసాదిస్తాడు. జీవాత్మ, ఆ ఇంద్రియాలను / శరీరాన్ని తన ఉద్ధరణకి ఉపయోగించి భగవానుని పొందుటకు బదులుగా, (తిరువాయ్మొళి 3.2.1 లో “నమ్మాళ్వార్” చెప్పినట్లుగా “అన్నాళ్ నీ తంత వళి ఉళల్వేన్”), శారీరక / ఇంద్రియ సుఖాలకై, ఒక వ్యక్తికి నదిని దాటడానికి ఒక తెప్పను ఇస్తే, వాడు ఆ నీటి ప్రవాహంతో పాటు వెళ్లి, చివరకు సముద్రంలో పడిపోయినట్లు , ఈ సంసారం నుండి ఉద్ధరింపబడడానికి జీవత్మాకు ఇచ్చిన ఇంద్రియాలను / శరీరాన్ని సంసారంలో మరింత ఎక్కువగా ఉపయోగిస్తాడు. తిరువరంగతు అముధనార్ కూడా ఇదే సూత్రాన్ని రామానుశనూఱ్ఱందాది పాసురం 67లో “మాయవన్ తన్నై వణంగ వైత్త కరణం ఇవై” అని వివరిస్తున్నారు – భగవాన్ జీవత్మలకు ఈ శరీరాన్ని వారి ఆరాధనకై ఇచ్చాడు. ఈ విధంగా మన పుట్టుక యొక్క నిజమైన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకొని తదనుగుణంగా మెలగాలి.
  • ఎమ్పెరుమాన్ నిత్య దాసుడై ఉండటం జీవాత్మ యొక్క నిజమైన స్వభావానికి సరిపోయే సహజ కార్యము అనే అవగాహనతో మనము ఎమ్పెరుమాన్ని ఆరాధించాలి. ఇది పైపైనగా చేయకూడదు.
  • భగవాన్ని అవాప్త సమస్త కామన్ అని పిలుస్తారు (తన కోరికలన్నీ ఇప్పటికే తీరిపోయినవాడు). వారు ఎవరి నుండి ఏమీ ఆశించరు కనుక వారిని నిరపేక్షుడు (కోరికలు లేనివాడు) అని పిలుస్తారు. మనము మన స్వరూపానికి తగినట్టుగా మన బాధ్యతను నెరవేర్చడానికి తిరువారాదనం చేయాలి. భగవానుడు మనపై ఆధారపడి ఉన్నాడని  మనం అనుకోకూడదు. అనువాదకుల గమనిక: భగవాన్ సర్వ స్వతంత్రుడు (సంపూర్ణ స్వతంత్రుడు). జీవాత్మ పూర్తిగా వారిపై ఆధారపడి ఉంటాడు. కురుక్షేత్ర యుద్ధంలో, భగవానుడు అర్జునుడికి రథసారధిగా (సేవకుడు) ఉన్నాడు. పిళ్ళై లోకాచార్యులు ఈ సూత్రాన్ని ముముక్షుప్పడి చరమ శ్లోక ప్రకరణం సుత్రం 247 లో అందంగా వివరించారు. “కీళిల్ పారతంత్రియముం ఇంత స్వాతంత్ర్యత్తినుడైయ ఎల్లై నిలమిఱే”. ఈ అందమైన వివరణ నుండి మన పూర్వాచార్యుల యొక్క తేజస్సును అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ, ఈ విభాగంలో, పిళ్ళై లోకాచార్యులు “అహం” గురించి చర్చిస్తున్నారు – ఇక్కడ భగవాన్ తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు. పిళ్ళై లోకాచార్యులు దీనిని చరమ  శ్లోకం యొక్క మొదటి వరుసలో “మాం” తో కలుపుతున్నారు, ఇక్కడ శ్రీక్రిష్ణుడు రథసారధిగా (తక్కువైన సేవకుడిగా) తనను తాను చూపిస్తూ అర్జునుడిని తనపై పూర్తిగా ఆధారపడమని చెబుతాడు.  భగవాన్ తన భక్తుల ముందు ఇంత తక్కువ స్థానాన్ని చేపట్టడం వారి అత్యున్నత ఆధిపత్యానికి నిదర్శనమని పిళ్ళై లోకాచార్యులు వివరించారు. అదేవిధంగా, భగవాన్ అర్చా విగ్రాహ రూపాంలో వారి భక్తుల ఇళ్లల్లోకి దిగిరావడం, భక్తులపై పూర్తిగా ఆధారపడటం, వారి యొక్క అత్యున్నత స్వాతంత్ర్యానికి మరియు అత్యున్నత సౌలభ్యానికి నిదర్శనం.
  • భగవాన్ ప్రతి వస్తువుకీ అధిపతి, అన్నింటినీ నియంత్రించువారు అన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. వారు వారి పదార్థాలతోనే తిరువారాదనం స్వీకరిస్తున్నారు అని భావించాలి. మన స్వంత పదార్థాలతో ఎమ్పెరుమాన్ కి తిరువార్ధనం చేస్తున్నామని అనుకోకూడదు. మనం కొన్ని పండ్లు లేదా ఆహారాన్ని అర్పిస్తున్నపుడు “అతను తన సొంత పదార్థాన్నిస్వీకరిస్తున్నాడు, ఏదీ మనకు చెందినది కాదు” అని భావించి అతనికి సేవ చేయాలి. అనువాదకుల గమనిక:    శాస్త్రంలో “స్వత్వం ఆత్మని సంజాతం స్వామిత్వం బ్రహ్మణి స్తితం” అని చెప్పబడింది – జీవాత్మ భగవాన్ సొంతం, భగవాన్ యజమాని. ఇదే సూత్రం అచిత్ కి కూడా వర్తిస్తుంది – ప్రతి వస్తువుకీ భగవాన్ యజమాని. ఒకసారి ఈ జ్ఞానాన్ని జీవాత్మ సరిగ్గా అర్థం చేసుకున్న తర్వాత, అతను ఎమ్పెరుమాన్ కు శాశ్వతమైన సేవ కోసం పరితపిస్తాడు.
  • తిరువారాదనం మనలను శుద్ధి చేసుకోవటానికి చేయాలి కాని ఎమ్పెరుమాన్ని శుద్ధి చేస్తున్నామని అనుకోకూడదు (తిరుమంజనం – దివ్య మంగళ స్నానం చేయడం ద్వారా) మొదలైనవి. భగవాన్ ఎల్లప్పుడూ శుద్ధ స్తితిలో ఉంటారు, వారిని  అందణన్, కుందన్, అమలన్… అని పిలుస్తారు. మనం లోపాలు మరియు మలినాలతో నిండి ఉన్నాము. ఎమ్పెరుమాన్ను ఆరాధించడం ద్వారా, మనం పరిశుద్ధులమౌతాము (మనస్సు నిరంతరం ఎమ్పెరుమాన్ ఆలోచించనలలో నిమగ్నమై ఉండటం వల్ల). అయినప్పటికీ, తిరువారాదనం చేయడానికి ముందు మన శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి, స్నానం చేసి ధౌత వస్త్రం ధరించాలి (సరిగ్గా ఉతికి ఆరబెట్టిన శుభ్రమైన బట్టలు), నిత్యా కర్మానుష్ఠం చేసి మరియు ప్రపన్నల యొక్క నిత్యకృత్యాలను పాటించాలి.  మనం నిత్యారాధనలో పాల్గొనడం వలన శుద్ధి అవుతున్నాము కదా ఇంకే శుద్దీకరణ అవసరం లేదు అని అనుకోకూడదు. అనువాదకుల గమనిక: శరీరం మరియు మనస్సు రెండూ శుద్ధి చేయబడాలి. శరీర శుద్దీకరణ స్నానం మొదలైన వాటి ద్వారా జరుగుతుంది మరియు ఎమ్పెరుమాన్ మరియు వారి కళ్యాణ లక్షణాలను నిరంతరం ధ్యానించడం ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది. ఎమ్పెరుమాన్ స్వచ్ఛమైనందున, జీవాత్మ వారి చింతన / ఆరాధనలో నిమగ్నమైనప్పుడు, జీవాత్మ కూడా పరిశుద్ధుడు అవుతాడు.
  • తిరువారాదనం చేసే సమయంలో భగవానుడు కేవలం మన భావశుద్ధి  మాత్రమే ఆశిస్తాడని అర్థం చేసుకోకపోవడం.
  • భగవాన్ మనం అర్పించే పదార్థాల బట్టి మనల్ని అర్ధం చేసుకుంటారని అనుకోవడం ఒక అడ్డంకి. భగవాన్ వారికి అర్పించే వాటిని బట్టి తీర్మాణించరు – అది ఖరీదైనది కావచ్చు కాకపొవచ్చు. మనం వారిని ప్రేమతో ఆరాధించి సేవ చేయాలి మరియు మన స్థోమతకు తగినంత ఏదైనా  అర్పించ వచ్చు.  నాణ్యమైన నెయ్యి మొదలైన ఖరీదైన పదార్థాలు అర్పించగలిగితే, ఎటువంటి సంకోచం లేకుండా అర్పించాలి. కాని స్తోమత లేనిచో మామూలు ఆహార పదార్థాలైనా అర్పించవచ్చు. భగవాన్ అర్పిస్తున్న పదార్థాలను చూడరు – కాని అర్పించే వారి మానసిక స్థితి, భావనను చూస్తారు. శాస్త్రాంలో “యధన్నః పురుషో భవతి తదన్నస్తస్య దేవతా” – మనం తినే పదార్థాలను తయారుచేసి ముందు వారికి అర్పించి తరువాత మనం ప్రసాదంగా తీసుకోవాలి.  అనువాదకుల గమనిక: ఈ ప్రమాణం చాలా ముఖ్యం. అర్పిస్తున్న వ్యక్తికి తినడానికి తగిన ఏ ఆహార పదార్థాలు అయినా ఎమ్పెరుమాన్కి అర్పించ వచ్చు. ఎమ్పెరుమాన్ ఏ పదార్థమైనా తినగలడు. కానీ ప్రతి వ్యక్తి తన వర్ణం మరియు ఆశ్రమం ప్రకారంగా కొన్ని ఆహార పదార్థాలను మాత్రమే తినవచ్చు. ఉదాహరణకు, గృహస్థుడు  ఆకు / వక్క తినవచ్చు (ఎమ్పెరుమాన్ కు అర్పించిన తరువాత), కాని బ్రహ్మచారి వాటిని తినలేరు (ఇది ప్రసాదమైనా సరే). కాబట్టి, నిర్దిష్ట వస్తువును జాగ్రత్తగా విశ్లేషించి, తాను తినే ముందు ఎమ్పెరుమాన్కు అర్పించ వచ్చో లేదో చూడాలి.
  • తిరువారాదనం చాలా కష్టమైన చర్యగా పరిగణించడం మరియు ఆనందకరమైన చర్యగా పరిగణించకపోవడం. తిరువారాదనం చాలా ఆహ్లాదకరమైన మరియు త్రుప్తి గొలిపే చర్య అని అర్థం చేసుకోవాలి. అందువల్ల చాలా సంతోషంగా చేయాలి.
  • ఎమ్పెరుమాన్ యొక్క అత్యున్నతమైన సౌలభ్యాన్ని(సరళత – సులభంగా ప్రాప్యత) చూసి , వారికి తిరువారాదనం చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు. అనువాదకుల గమనిక: భగవాన్ మన ఇళ్ళల్లో  అర్చా విగ్రాహాన్ని స్వీకరించడమే వారి అత్యున్నతమైన  సౌలభ్యాన్ని సూచిస్తుంది – వారు మన స్వంత ఇంట్లోనే మనకు అందుబాటులో ఉన్నాడు. కానీ వారి సరళతను చూసి అనర్హుడని భావించకూడదు, నిర్లక్షం చేయరాదు  – అది అగౌరవంగా ఉంటుంది.
  • ఇంట్లో అర్చావతార ఎమ్పెరుమాన్ను సర్వోపరిగా పరిగణించకపోవడం,  మరియు వారి సంపూర్ణ ఉనికిని అనుభవించకపోవడం అడ్డంకి. అర్చావతార ఎమ్పెరుమాన్ పరమపదనాథునికి (శ్రీ వైకుంఠంలో కనిపించే సర్వోపరి భగవాన్) సమానమని ఒక నమ్మకం ఉండాలి. ముదల్ తిరువందాదిలో, పోయిగై ఆళ్వార్ పాసురం 44 లో చెప్పారు “తమరుగణ్తతు ఎవ్వురువం అవ్వురువం తానే తమరుగణ్తతు ఎప్పేర్ మఱ్ఱప్పేర్ – ఎమ్పెరుమాన్ వారి భక్తులు ఇష్టపడే రూపాన్ని ధరిస్తారు. వారి భక్తులు ఇష్టపడే నామాలను పెట్టుకుంటారు. నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 3.6.9 లో “నెంజినాల్ నినైప్పాన్యవన్   అవనాగుం నేల్కడల్ వణ్ణానే” – సర్వోపరి భగవాన్ ఎవరో కాదు వారి భక్తులు ఇష్టపడే రుపమే.  
  • మనం మన చేతులను ఆచార్య హస్తాలుగా (ఉప సేవకుడు) భావించి, తమ ఆచార్యుల తరఫున తిరువారాదనం చేయాలి. ఆచార్యుల నుండి అనుమతి పొందిన తరువాత తిరువారాదనం చేయడం ప్రారంభించాలి. సమాశ్రయణం (పంచ సంస్కరం) లో భాగంగా, ఆచార్యులు తిరువారాదనం ఎలా చేయాలో నేర్పుతారు మరియు తిరువారాదనం చేయటానికి అవసరమైన అర్హతతో శిష్యుడిని ఆశీర్వదిస్తారు. మన రోజువారీ తిరువారాదనంలో, మనం ఈ సంకల్పాన్ని స్మరించుకొవాలి “శ్రీ భగవదాజ్ఞయా భగవత్ కైంకర్యరూపం, ఆచార్య హస్తేన భగవతరాదనం కరిష్యే”  – ఆచార్య హస్తాలతో ఈ తిరువారాదనం (వారి దివ్య ఆదేశాల ఆధారంగా భగవానుకి కైంకర్య రూపంగా నిర్వహించుట) నిర్వహించుట. ఈ విధంగా, మనం తమను తాము ఆచార్యుల సేవకుడిగా భావించి, తిరువారాదనం చేయాలి.
  • సంసారుల (భౌతికంగా ఆలోచించే వ్యక్తులు, జ్ఞానం పొందిన వారు కాని ఆ జ్ఞాన సూత్రాలను పాటించనివారు) ఎదుట తిరువారాదనం చేయకూడదు  – అలా చేయడం ఒక అడ్డంకి. అదేవిధంగా, శ్రీవైష్ణవులు (జ్ఞానం ఉన్నవారు మరియు సూత్రాలను సక్రమంగా పాటించేవారు) ఉన్నప్పుడు, మనం చేసే తిరువారాదనం వారికి కనిపించకుండా తెరవేయకూడదు – బదులుగా తిరువారాదనం వారి ముందు చేయాలి.
  • తిరువారాదనం కేవలం ఒక నిత్య దినచర్యగా చేయకూడదు. తిరుప్పావైలో “మేలైయార్ సెయ్వనగళ్” (పెద్దలు చేసిన విధంగా) చెప్పినట్టుగా పెద్దలు చేసిన విధానాన్ని అర్థం చేసుకోవాలి . అనువాదకుల గమనిక: శిష్ఠాచారం (మన పూర్వాచార్యులు పాటించిన సూత్రాలు) మనకు చాలా ముఖ్యమైనవి. వారు శాస్త్ర సారాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవారు, అందులో చాలా ముఖ్యమైన వాటిని ఆచరించినవారు. ఈ విధంగా, మన ఆళ్వార్లు మరియు ఆచార్యలను అనుసరిస్తే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం చాలా సులభం.
  • ఈ క్రింది వాటిని తిరువారాదనం సమయంలో అడ్డంకులుగా పేర్కొన్నారు. 
    • ఇతర మంత్రాలతో తిరువారాదనం చేయడం. మంత్రం అంటే సాధారణంగా తిరుమంత్రం (అష్టాక్షరం) అని అర్థం. తిరునెడుంతాండగం పాసురం 4 లో చెప్పబడింది, “మంతిరత్తై మంతిరత్తాల్ మఱవాతు  ఎన్ఱుం  వాళుతియేల్ వాళలాం” – తిరుమంత్ర జపంతో భగవాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ మన జీవితాన్ని గడపవచ్చు. ఈ తిరుమంత్రాన్ని “మంత్ర    రాజు” (మంత్రాల రాజు) అని అంటారు. ద్వయ మహా మంత్రం తిరుమంత్రం యొక్క విస్తరణ మరియు దీనిని మంత్ర రత్నం అని కూడా అంటారు. తిరువారాదనంలో, ద్వయ మహమంత్రాన్ని అనేక సందర్భాల్లో పఠిస్తారు. దీని అర్థ పూర్తి (సంపూర్ణ స్వభావం – అన్నిగుణాలతో నిండి ఉంది) మరియు సిష్ట పరిగ్రాహం (మన పుర్వచార్యల అంగీకరించి మరియు అభ్యాసించిన) వలన ఈ నారాయణ మంత్రం అగ్రశ్రేణి మరియు సాటిలేని మంత్రం.
    • తిరువారాదనం సమయంలో గురు పరమపర మంత్రాన్ని మొదట పఠించకుండా ద్వయ మంత్రాన్ని పఠించుట. పిళ్ళై లోకాచార్యులు ముమ్ముక్షుప్పడి సూత్రం 4 వ సూత్రంలో వివరించారు –  “మంత్రత్తిలుం మంత్రత్తుక్కు ఉళ్ళిడాన వస్తువిలుం మంత్ర ప్రదనాన ఆచార్యన్ పక్కలిలుం ప్రేమం గనక్క ఉణ్డానాల్ కార్యకామావతు”. మాముణులు చాలా అందంగా వివరిస్తూ , శిష్యుడికి మంత్రంపైన గాఢ విశ్వాసం ఉండాలి, భగవాన్ (మంత్రం యొక్క లక్ష్యం) మరియు ఆచార్యుల (మంత్రంపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నవారు) పై గొప్ప నమ్మకం ఉండాలి మరియు ఈ మూడింటిపట్ల గొప్ప అనుబంధాన్ని పెంపొందించుకోవాలి. అనువాదకుల గమనిక: మనము ఇప్పటికే ఈ సూత్రాన్ని వివరంగా చూశాము.  ద్వయ మహా మంత్రాన్ని పఠించే ముందు గురు పరంపర మంత్రం (అస్మత్ గురుభ్యో నామః … శ్రీధరాయ నామః) ఎప్పుడూ పఠించాలి. ఎమ్పెరుమాన్ చేరుకోవడానికి ముందు మన ఆచార్య పరంపర పట్ల గౌరవం, మన స్వంత ఆచార్యులతో ప్రారంభించి శ్రీమన్నారాయణుడి (ప్రతి ఒక్కరికి మొదటి ఆచార్యలు) వరకు మన కృతజ్ఞతను ఎప్పుడూ చూపించాలి.
    •  తిరువారాదనం సమయంలో ద్వయ మహా మంత్రాన్ని వివరంగా వివరించే ఆళ్వార్ల పాసురములను, అచ్యార్యుల స్తోత్రాలను / వాఖ్యలను కూడా గుర్తుంచుకోవాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: ఆచార్య హృదయంలో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ “ద్వయార్తం దీర్గ చరణాగతి ఎన్ఱాతు సారసంగ్రహత్తిలే” అని చెప్పారు – పిళ్ళై లోకాచార్యులు తిరువాయ్మొళి ( దీర్గ శరణాగతి అని కూడా పిలుస్తారు) ద్వయ మహామంత్రం యొక్క విస్తారమైన వివరణ అని స్థాపించారు. కాబట్టి, ఆళ్వారులు మరియు ఆచార్యల యొక్క పాసురములను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, మనం ద్వయ మహామంత్రాన్ని మరియు దాని అర్ధాలను నిరంతరం చింతన చేస్తూఉంటాము . అలాగే, పుర్వ దినచర్యలో, ఎముంబి అప్పా అంటారు, మణవాళ మామునుల యొక్క పెదవులు ఎల్లప్పుడూ ద్వయ మహ మంత్రాన్ని పఠిస్తూ ఉంటాయని మరియు వారి మనస్సు ఎల్లప్పుడూ వాటి అర్ధాలను  స్మరిస్తూ ఉంటారని అంటారు. కాబట్టి, ఈ అంశంలో మన పూర్వాచార్యులు యొక్క మానసిక స్థితిని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
    • అర్గ్య / పాద్య / ఆచమనముల (ఎమ్పెరుమాన్ చేతులు,  పాదకమలాలు మరియు నోరు శుభ్రం చేయడానికి జలం), స్నపనం (తిరుమంజనం / స్నానం), ధూపం (ధూపం / సుగంధాలు), దీపం, తిరువాలవట్టమ్ (వింజామర సేవ), గంధము సమర్పించుట, పువ్వులు అర్పించడం, భోగం (ఆహారం) మొదలైనవి ఇవ్వడం మన పూర్వాచార్యులు చేసినట్లుగా తగిన స్తోత్రాలను/పాసురాలను స్మరించి /పఠించాలి. వీటిని మామునులు మనకు ఆశీర్వదించిన “జీయర్ పడి తిరువాదన క్రమం” లో చూడవచ్చు. అనువాదకుల గమనిక: ప్రతి ఉపచారానికి దానికి సంబంధించిన పాసురాలు ఉన్నాయి. ఉదాహరణకు, తిరుమంజనం కోసం,  పెరియాళ్వార్ తిరుమోళి పదిగం “వెణ్ణెయ్ అళైంత కుణుంగుం”ను పారాయణం చేస్తాము – ధూపం కోసం తిరువాయ్మొళి పాసురం “పరివతిల్ ఈసనైప్ పాడి”, మొదలైన పాసురాల పఠనం చేస్తారు.
    • బాగా జ్ఞానము గల వ్యక్తులు (మన పూర్వాచార్యులు ) పఠించిన మంత్రాలు, పాసురాలు మొదలైన వాటిని పఠించాలి. సొంత అవగాహన ఆధారంగా సొంతంగా పఠించకూడదు.
  • ఏకాగ్రత లోపంతో తిరువారాదనం చేయుట. మనం ఎమ్పెరుమాన్ పై పూర్తి దృష్టి పెట్టి జాగ్రత్తగా ప్రేమతో తిరువారాదనం చేయాలి.
  • ఆళ్వారులు మరియు ఆచార్యలు ఎమ్పెరుమాన్ కంటే గొప్పవారని పరిగణించాలి మరియు వారికి తిరువారాదనం చేయడం కూడా అంతే లేదా అంత కంటే గొప్ప మహత్వపూర్ణమైన కార్యం అని అర్థం చేసుకోవాలి. అలా చేయక పోవడం ఒక అడ్డంకి. వారిని “విణ్ణుళారిలుం సీరియర్” (పరమపదంలో ఉన్న వారి కంటే గొప్పవారు) గా మహిమపరచబడ్డారు. అలాగే, వారి పాద పద్మాలను ఎమ్పెరుమాన్ చరణ కమలాలకు తక్కువగా భావించి కడగడానికి వెనుకాడటం ఒక అడ్డంకి. భాగవతులను ఆరాధించడం (ఎమ్పెరుమాన్ భక్తులు) భగవాన్‌ను ఆరాధించడం కంటే గొప్పదని శాస్త్రాంలో వివరించబడింది. వారిని భగవానునికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఆదరించాలి.  అనువాదకుల గమనిక: ఈ సంధర్భములో, వడుగ నంబి స్థితిని గుర్తుంచుకోవచ్చు. వడుగ నంబి ఎమ్పెరుమానార్ పట్ల చాలా అంకితభావంతో ఉండేవారు మరియు ఎమ్పెరుమాన్ వైపు తిరగి కూడా చూసేవారు కాదు. ఒకసారి ఎమ్పెరుమానార్తో, ఎమ్పెరుమానార్ యొక్క తిరువారాదనం పెరుమాళ్ తో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, వడుగ నంబి తన తిరువారాదన పెరుమాళ్ని (ఎమ్పెరుమానార్ పాదుకలు), ఎమ్పెరుమానార్ యొక్క తిరువారాదనం పెరుమాళ్ ని ఒకే మూటలో కట్టారు. ఎమ్పెరుమానార్ అది గమనించి ఆశ్చర్యపోయి వడుగ నంబిని విచారించారు. వడుగ నంబి టక్కున జవాబిస్తూ  “నా పెరుమాళ్ మీ పెరుమాళ్ళ కంటే ఏ విధంగా తక్కువ?” అని అడుగుతారు. అందువల్లనే ” వడుగ నంబి యొక్క హృదయపూర్వక దృష్టి మీ పైన ఉన్నట్టుగా నన్ను ఉండనివ్వండి” అని మామునులు ఆర్తి ప్రభాంధంలో ఎమ్పెరుమానార్ కి ప్రార్థన చేసారు.
  • ఎమ్పెరుమాన్ సమర్పణ కోసం తయారుచేసిన భోగం వారి అధరాల (దివ్య పెదవులు) దగ్గర పెట్టి  సమర్పించాలి. సమర్పించేటప్పుడు భోగాన్ని క్రిందకు లేదా దూరంగా ఉంచకూడదు. అనువాదకుల గమనిక: ముందు వివరించినట్లుగా, ఎమ్పెరుమాన్ శారీరకంగా అక్కడ ఉన్నారని అర్థం చేసుకోవాలి.  వారిని నిత్య కర్మలో ఒక పద్ధతిగా నిర్లక్ష్యంగా కాకుండా జాగ్రత్తగా ప్రేమతో చూసుకోవాలి.
  • అచార్యులను ఎమ్పెరుమాన్ కంటే గొప్పగా ఆరాధించాలి మరియు భోగం మొదలైనవాటిని అచార్యులకు సమర్పించెందుకు వెనుకాడకూడదు.
  • సంసారుల  ఇళ్లలో  (భౌతికంగా ఆలోచించే వ్యక్తులు) మరియు శ్రీవైష్ణవుల ఇళ్లలో ఉన్న ఎమ్పెరుమాన్ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. దివ్య దేశాలలో (ఆళ్వారులు పాడిన) మరియు గొప్ప శ్రీవైష్ణవుల ఇళ్లలో ఉన్న ఎమ్పెరుమాన్ చాలా మహిమాన్వితమైన వారని అర్థం చేసుకోవచ్చు.  అనువాదకుల గమనిక: శ్రీవైష్ణవులకు దర్శనం ఇవ్వడానికి, వారి ఉనికిని ఆస్వాదించడానికి, వారి సేవలను స్వీకరించడానికి ఎమ్పెరుమాన్  ప్రత్యేకంగా దిగివస్తారు. భగవత్గీత 4.8 లో, ఎమ్పెరుమాన్ “పరిత్రాణాయ సాదూనామ్, వినాసాయ చ దుష్కృతాం, ధర్మ సంస్తాపనార్థాయ సంభవామి యుగే యుగే” – నా భక్తులను రక్షించడానికి,  శత్రువుల నాశనం చేయడానికి, ధర్మ సంస్థాపనం చేయడానికి మళ్ళీ మళ్ళీ అవతరిస్తాను. ఈ మూడు కారణాలు ఉన్నప్పటికీ, ప్రధాన కారణం తన భక్తులను సంతోషపెట్టడం మరియు రక్షించడం అని గీతా భాష్యంలో, ఎమ్పెరుమానార్ వివరించారు. ఎమ్పెరుమానార్ పూర్తిగా ఆళ్వార్ల పాసురాల ఆధారంగా వివరిస్తూ, నమ్మాళ్వారి తిరువాయ్మొలి 3.1.9 లో చెప్పినట్టుగా, “ఒకవేళ ఎమ్పెరుమాన్  గజేంద్రుడిని రక్షించడానికి రాకపోయి ఉంటే వారి కీర్తి ప్రఖ్యాతులు (వారు ప్రత్యక్షముగా ప్రకటమైయ్యి వారి భక్తులను ప్రసన్నులను చేస్తారు ) ఖచ్చితంగా కోల్పోయేవారు.
  • మన పూర్వాచార్యులచే ఆరాధించబడని ఎమ్పెరుమాన్ యొక్క  భక్తులను ఆరాధించడం ఒక అడ్డంకి. తిరుప్పావైలో చెప్పినట్లుగా, ” మేలైయార్ సెయ్వనగళ్” – మన పెద్దలు చేసిన పనులు మనమూ చేయాలి.  “చెయ్యాతన చెయ్యోం” (ఒకవేళ) – మన పెద్దలు చేయని పనులు మనమూ చేయరాదు. అనువాదకుల గమనిక: ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎమ్పెరుమాన్కి చాలా  చాలా మంది భక్తులు ఉన్నారు. మనం ప్రపన్నులమని ఎల్లప్పుడూ సత్వ గుణంలో ఉంటూ అహంకారానికి స్థానం లేని ఎమ్పెరుమాన్ యొక్క భక్తులను అనుసరించాలని మన పుర్వచార్యులు ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. ఈ సంధర్భంగా తరచుగా వచ్చే మంచి ఉదాహరణ,  రుద్రుడు. సాధారణంగా, రుద్రుడిని జ్యేష్ట భాగవత (గొప్ప భక్తుడు) గా కీర్తిస్తారు. శ్రీ భాగవతంలో, “వైష్ణవానాం యథా సంబుః” అన్నారు. వైష్ణవులలో, శంబు (రుద్రుడు) గొప్పవారు. అయినప్పటికీ, మన పూర్వాచార్యులు వారిని నిషేధించారు, ఎందుకంటే వారు తమో గుణంతో ముడిపడి ఉన్నవారు.  అతను ఎమ్పెరుమాన్తో కూడా పోరాడిన (ఎమ్పెరుమాన్ యొక్క ఆధిపత్యాన్ని తెలుసుకున్న తర్వాత కూడా) సంధర్భాలు కూడా ఉన్నాయి. అజ్ఞానులుగా మారి ఎమ్పెరుమాన్తో పోరాడిన చాలా మంది దేవతాంతరములు ఉన్నారు. సత్వ గుణంలో ఉన్న కొంతమంది భక్తుల విషయంలో కూడా, వారు తమ సొంత భక్తి ద్వారా (ఎమ్పెరుమాన్ దయపై ఆధారపడకుండా) ఎమ్పెరుమాన్ సాధిస్తారని భావించడంలో వారిలో అహంకారం (స్వయం ప్రయత్నం) ఉండవచ్చు. ఈ సందర్భాల్లో కూడా అలాంటి భక్తులను ఆరాధించకపోవడమే మంచిది.
  • ఎమ్పెరుమాన్ను ఆదిత్య మండలం మధ్యలో (ఇది – ప్రతిదానిలో నివసించే ఆత్మ అని అంతర్యామి యొక్క చాలా సాధారణమైన అభివ్యక్తీకరణ) కనిపించే వ్యక్తిగా ఆరాధించాలనుకోవడం, కాని ఎమ్పెరుమాన్ యొక్క ఉత్తమ అభివ్యక్త రూపంలో  మన ముందు మన సొంత ఇళ్ళల్లోనే ఉన్నారు. అనువాదకుల గమనిక: అర్చావతార ఎమ్పెరుమాన్ను    ఆరాధించడం ఏ ఇతర ఆరాధనలకన్నా గొప్పది – ఎందుకంటే ఎమ్పెరుమాన్ తన భక్తుల సంపూర్ణ అధీనులై ఉంటారు.
  • అంతర్ యగం (అంతర్గత ఆరాధన) కన్నా బహిర్ యాగం (బాహ్య ఆరాధన) ఉత్తమమైనదని అర్థం చేసుకోకపోవడం ఒక అడ్డంకి. యాగం “యజ దేవ పూజ” (భగవాన్ ను ఆరాధించడం) నుండి ఉద్భవించింనది.  తెరల మధ్యలో అంతర్గతంగా చేయడం కన్నా అందరి సమక్షంలో బహిర్గతంగా చేయడం ఉత్తమం.  అనువాదకుల గమనిక: ఈ అంశం తిరువారాదనంలో ప్రతి ఒక్కరూ పాల్గొనడాన్ని ప్రోత్సహిస్తుంది. మహిళలు, పిల్లలు మొదలైనవారు అందరూ తమ స్వభావానికి తగిన కైంకర్యాలు చేయవచ్చు. ఉదాహరణకు, మహిళలు ఇంట్లో ఎమ్పెరుమాన్ కొరకై వండటం, పువ్వులల్లి దండలు సిద్ధం చేయడం, ఆ పరిసరాన్ని శుభ్ర పరచడం మొదలైనవి. పిల్లలు స్తోత్రాలు, పాసురములు మొదలైనవి పారాయణం చేయమని ప్రోత్సహించవచ్చు. అంతర్ (అంతర్గత) మరియు బహిర్ (బాహ్య) యొక్క మరొక వివరణ – ఇది మన హృదయంలో అంతర్గతంగా ఆరాధించడం కంటే బాహ్యంగా అర్చావతార రూపంలో ఎమ్పెరుమాన్ను ఆరాధించడం మంచిది – ఎందుకంటే ఎమ్పెరుమాన్ వైభవంగా పూజించబడాలని ప్రత్యేకంగా అర్చావతార రూపంలో దిగి వస్తారు. కాబట్టి, మన హృదయంలో అంతర్గతంగా ఎమ్పెరుమానుని ధ్యానంచేస్తూ ఆరాధిస్తున్నామని చెప్పి మన ఇళ్ళకి దిగి వచ్చిన ఎమ్పెరుమాన్ను విస్మరించరాదు.
  • ఆచార్యుల నుండి ఒక అర్చా విగ్రాహం స్వీకరిస్తే, ఆ విగ్రహాన్ని యదావిధిగా ఆరాధించడం ప్రారంభించాలి. ప్రాణ ప్రతిష్ఠ చేయటానికి ప్రయత్నించకూడదు. అనువాదకుల గమనిక: ఒక శిల్పి చేత తయారు చేయబడిన ఒక అర్చా విగ్రాహం వచ్చినప్పుడు, ప్రాణ ప్రతిష్ఠ (ఆ విగ్రాహంలోకి ఎమ్పెరుమాన్ను ఆహ్వానించడం) చేయటానికి అర్హతగల వ్యక్తితో (పురోహితున్ని) చేయించాలి. ఇంట్లో ఆరాధన కోసం కొత్తగా తయారైన విగ్రహంలోకి ఎమ్పెరుమాన్ను ఆహ్వానించడం కోసం ఆలయంలోని కొన్ని ఉత్సవాలలో (పవిత్రోత్సవం, మొదలైనవి) ఉంచవచ్చు. కాని అచార్యులు (సత్ సాంప్రదాయ సూత్రాలను గట్టిగా అనుసరించే వారు) సమర్పించిన అర్చా విగ్రాహాలకి  ఎటువంటి ఆచారాలు చేయవలసిన  అవసరం లేదు, వెంటనే ఆరాధించవచ్చు. అలాగే, ఈ సూత్రం (ప్రణ ప్రతిష్ఠ) మానవనిర్మిత అర్చా విగ్రహాలకు మాత్రమే వర్తిస్తుంది. సాలగ్రామ ఎమ్పెరుమాన్కు అలాంటి అవసరం లేదు, ఎందుకంటే స్వయంబువు (స్వయంగా వ్యక్తమైన) కాబట్టి. వెంటనే ఆరాధించవచ్చు.
  • ఇక్కడ నుండి, దృష్టి ఆచార్యుల / భాగవత ఆరాధనం వైపుకు మళ్ళుతుంది. ఎమ్పెరుమాన్ని ఆరాధించడం కన్నా ఎమ్పెరుమాన్ని ఆరాధించే వారిని మనం ఆరాధించడం ఎంతో గొప్పదని మనం అర్థం చేసుకోవాలి, చాలా సంతోషముగా చేయాలి. అనువాదకుల గమనిక: ఇది పద్మ పురణం – రుద్రుడు తన భార్య పార్వతికి వివరిస్తూ “ఆరాధనాం సర్వేశం విష్నోర్ ఆరాధనం పరం, తస్మాత్ పరతరం దేవీ తాదీయానాం ఆరాధనం”, అన్ని రకాల ఆరాధనలలో, విష్ణు ఆరాధన ఉత్తమమైనది. అంతకన్నా ఉత్తమమైనది విష్ణు భక్తులను ఆరాధించడం. మన పూర్వాచార్యులు ఈ సూత్రాన్ని అనేక విధాలుగా ఆచరణాత్మకంగా స్థాపించారు. అందువల్ల, భాగవతుల పట్ల కూడా మనం శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం.
  • మన ఉద్ధరణకు  మన ఆచార్యులను ఆరాధించాలని గట్టిగా నమ్మాలి. అనువాదకుల గమనిక: మనతో వ్యక్తిగతంగా సంభాషించని అర్చావతార ఎమ్పెరుమాన్తో పోలిస్తే మనతో సంభాషించగల ఎమ్పెరుమాన్ ఆచార్యులు అని వివరించబడింది (తిరుక్కచి నంబి దేవ పెరుమాళ్తో ప్రత్యక్షముగా సంభాషించే అరుదైన సందర్భాలు తప్పా, మొదలైనవి). ఆ విధంగా, వారిని ఆరాధించడం మరియు సేవించడం శిష్యుల స్వభావానికి అనుకూలమైనది.
  • ఎమ్పెరుమాన్ విషయంలో, వారి తిరుమేని (దివ్య దేహం) కన్నా వారి తిరువడి (పాద పద్మాలు) ప్రియమైనవని వివరించబడింది. నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 6.10.4లో “పూవఱ్ కళల్గళ్ అరువినైయేన్ పొరున్తుమరు పుణరాయే” – నా పాపాలను తొలగించే మీ పాద పద్మాల వద్ద దృఢంగా  స్థిరమై ఉంటాను. తిరువాయ్మొళి 6.10.11లో “అడిక్కీళ్ అమర్ న్తు పుగుంతేనే” – నేను మీ పాద పద్మాల వద్ద విశ్రాంతి పొందుతున్నాను. అదేవిధంగా, ఆచార్యుల విషయంలో కూడా, ఆచార్యుల యొక్క చరణ కమలాలకు సేవ చేయడంలో ఎక్కువ అనురాగము ఉండాలి. అనువాదకుల గమనిక: పిళ్ళై లోకాచార్యులు ఈ సూత్రాన్ని ముముక్షుప్పడి 147 లో   ద్వయ ప్రకరణం చరణౌ (తిరువడి) శబ్దంలో చాలా అందంగా వివరించారు – శేషిపక్కల్ శేషభూతన్ శేషిపక్కల్ ఇళియుం తుఱై; ప్రజై  ములైయిళే వాయ్ వైక్కుమా పోలే – శిశువు పాలకోసం స్వాభావికంగా తన తల్లి (ఎందుకంటే అది జీవనాధారం/పోషణకు మూలాధారము కాబట్టి) దగ్గరికి వెళ్ళి నట్టుగా, జీవాత్మ సహజంగా భగవాన్ యొక్క పాద పద్మాలను వెతుక్కుంటూ వెళతాడు.
  • చరమాధికారుల (అత్యున్నతమైన ఆచార్య భక్తిలో స్థిరమై ఉన్న వ్యక్తులు) కోసం, ఆచార్య తిరువడి ( దివ్య పాద పద్మాలు) కన్నా గొప్పది అచార్యుల పాదుకలు. నిరంతర చింతన మరియు పరిజ్ఞానము తర్వాత ఇది మన హృదయాల్లో ద్రుఢంగా ఉంచాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. ఎమ్పెరుమాన్ యొక్క పాదుకలు శ్రీశఠగోపం (శఠారి) మనకు చాలా ప్రియమైనట్లే, ఆచార్య యొక్క పాదుకలు కూడా మనకు చాలా ప్రియమైనవి. ముందు చూసినట్లుగా, వడుగ నంబి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. నంబి “దేవుమఱ్ఱఱియేన్” – ఎమ్పెరుమానార్ కంటే మరే ఇతర దేవుడినెరుగను. అతను ఎమ్పెరుమానార్కు రహస్య మరియు తక్కువ స్థితిసేవలను చేయడంపై సంపూర్ణ దృష్టి పెట్టారు. ఒకసారి ఒక యాత్రలో ఎమ్పెరుమానార్తో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, అతను తన తిరువారాధనం – ఎమ్పెరుమానార్ యొక్క పాదుకలను, ఎమ్పెరుమానార్ యొక్క తిరువారాధనం – ఎమ్పెరుమానార్ పెరుమాళ్ ని ఒకే దగ్గర కలిపి మూట కడతారు. దీని గురించి ఎమ్పెరుమానార్ తెలుసుకున్నప్పుడు కలత చెంది  నంబిని అడిగితే, నంబి, ఎటువంటి భయం లేకుండా, “నా పెరుమాళ్ మీ పెరుమాళ్ కంటే ఏ విధంగా తక్కువ?” అని జవాబు చెబుతారు. ఎమ్పెరుమానార్  నంబి యొక్క విశ్వాసాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. “నేను నీతో చర్చలో గెలవలేను వదులుకుంటున్నాను. అని నంబితో అంటారు. అటువంటి బలమైన విశ్వాసాన్ని అభివృద్ధి కావడం చాలా కష్టం. అనువాదకుల గమనిక: ఆధ్యాత్మిక విషయాలలో ఎమ్పెరుమానార్తో వ్యక్తిగతంగా బోధన పొందిన కొంగిల్ పిరాట్టిని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఆమె ఎమ్పెరుమానార్ యొక్క పాదుకలను తిరువారాధనంలో పూజించేది. ఆమె అభ్యర్థన మేరకు ఎమ్పెరుమానార్ ఒక జత పాదుకలు ఆమెకు ఇస్తారు. ఈ సందర్భంలో, వివిధ మహా పురుషుల పాదుకల పేర్లను చూద్దాం. సాధారణంగా, ప్రత్యేకమైన మహా పురుషుని  యొక్క ప్రియమైన శిష్యుడి పేరుతో పాదుకలకు పేరు పెడతారు. భగవాన్ కొరకు, శ్రీ శఠగోపం (నమ్మాళ్వార్ను సూచిస్తుంది) అంటారు. నమ్మాళ్వార్ కోసం, మధురకవులు అని పిలుస్తారు (ఆళ్వార్ తిరునగరిలో, దీనిని శ్రీ రామానుజం అంటారు). ఎమ్పెరుమానార్ కోసం, వీటిని ముదలియాండాన్ అంటారు. ఆళ్వాన్ మరియు ఎంబార్ కోసం, వీటిని  భట్టార్ అంటారు. మణవాళ మామునులు కొరకు, వీటిని పొన్నడియాం సెంగమలం (పొన్నడిక్కాళ్ జీయర్ని సూచిస్తుంది) అని పిలుస్తారు. ఇంక అలా కొనసాగుతుంది.
  •  భగవాన్ మరియు భాగవతలను ఆరాధించడంలో  నిమగ్నమై ఉండాలి – అది ఆచార్యలను ఎంతో సంతోషపరుస్తుంది. అలా చేయకపోవడం గొప్ప తప్పు. అలాగే, భగవత్ ఆరాధనం (భగవాన్‌ను ఆరాధించడం) మరియు భాగవత ఆరాధనం (భాగవతలను ఆరాధించడం) మధ్య భేదం చూపకూడదు – ఈ రెండింటినీ సమానంగా ఆదరించాలి.
  •  మనం ఎవరైనా శ్రీ వైష్ణవులు అలసిపోయినట్టు గమనిస్తే, వెంటనే వారి చరణాలను కడిగి,  అతనికి కొంత ప్రసాదం తినడానికి ఇవ్వాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి.
  •  “దర్శనాత్ గ్రుహ్యతే మయా” (నాకు అర్పించినవి నేను నా చూపుతో ఆరగిస్తాను) – దీనిని “కణ్డరుళప్ పణ్ణుగై” (ఎమ్పెరుమాన్ భోగం సమర్పించడం) అని పిలుస్తారు. “అముదు సెయ్యప్ పణ్ణుగై” – అక్షరాలా ఎమ్పెరుమాన్ నైవేద్యాన్ని తినడం.   ఈ రెండూ భిన్నమైనవి అయినప్పటికీ, ఎమ్పెరుమాన్ వారి కళ్ళ ద్వారా ఆరగించి అవశేషాలను మనకు ఇస్తున్నప్పటికీ, ఎమ్పెరుమాన్ సాక్షాత్తూ తింటున్నారు అని మనం అనుకోవాలి. అనువాదకుల గమనిక: చర్చ భాగవత ఆరాధనం వైపు మారినందున, మనం దీనిని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. అయితే, ఎమ్పెరుమాన్కు భోగం అర్పించేటప్పుడు, వారి చూపుతో స్వీకరిస్తే, అప్పుడు మనం ఆ ప్రసాదాన్ని భాగవతలకు అర్పించాలి. అప్పుడు మాత్రమే, మనం ఆ ప్రసాదాన్ని (భగవాన్ మరియు భాగవతల అవశేషాలు) తీసుకోవాలి. ఆ ప్రసాదం ఎమ్పెరుమాన్ వారి కళ్ళతో స్వీకరించిన దానికన్నా గొప్పది.  మనము శుద్ధులు కావడానికి భాగవత శేషం (భగవతుల అవశేషాలు) చాలా గొప్పగా మహిమపరచబడింది. శ్రీ భాగవతంలో, నారద మహర్షి చెబుతూ మునుపటి జన్మలో భాగవతులైన గొప్ప ఋషుల ప్రసాదాన్నిస్వీకరించడం ద్వారా  తాను శుద్ధి అయ్యానని గొప్పగా కీర్తించారు. తొండరడిప్పొడి ఆళ్వార్ తిరమాలై పాసురం 41 లో “పోనగం సెయ్త సేడం తరువరేల్ పునితమన్ఱే” –  భాగవతులు దయతో వారి అవశేషాలను ఇస్తే, అది చాలా వరకు శుద్ధి చేస్తుంది, అని చెప్పారు.
  • ఆచార్యులు మరియు భాగవతలను (ఆచార్యులకు సమానమైన వారు) ఎమ్పెరుమాన్తో సమానంగా ఆదరించాలి, ఎటువంటి భేదం లేకుండా అంతే గౌరవంతో సేవ చేయాలి. “ఆచార్యస్ స హరిస్ సాక్షాత్ చరరూపీ న సమ్సయః “ఆచార్యులు సాక్షాత్తూ హరి, ఆచార్యుల రూపంలో వారు తిరుగుతారు,  కాని అర్చావతార ఎమ్పెరుమాన్ కదలిక లేనివారు.”
  •  ఇక్కడ సామాన్య శాస్త్రం మరియు శిష్టాచారం  (విశేష ధర్మం) అని రెండు అంశాలు ఉన్నయి.  ఒక ప్రసిద్ధ సామెత ఉంది “ధర్మగ్య సమయం ప్రమాణం వేదాశ్చ” – నేర్పరులైన పండితుల మెధస్సు / మార్గదర్శకత్వం ప్రామాణికం, వేదం కూడా. ఇక్కడ పండితుల (శ్రీవైష్ణవుల ) మేధస్సుకు వేదం కన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది. కాబట్టి, తిరువారాదనం చేసేటప్పుడు, సాధారణ సూత్రాలను (ఇవి లౌకిక ప్రయోజనాలను ఆశించే) పాటించకుండా గొప్ప పండితులైన మన పూర్వాచార్యుల దిశను అనుసరించాలి.
  • ఎమ్పెరుమాన్ , ఆచార్యులను మరియు భాగవతలను ఆరాధించేటప్పుడు సోమరితనంతో ఆవలించడం మొదలైనవి చేయకూడదు.

ఇది అతి ముఖ్యమైన మన రోజువారీ కార్యాలకు వర్తించే విషయాలతో చాలా సుదీర్ఘమైన విషయం, తిరువారాదనం. దీన్ని జాగ్రత్తగా చదివి, సూత్రాలను స్పష్టంగా అర్థం చేసుకొని, రోజువారీ జీవితంలో ఈ సూత్రాలను పాటించటానికి ప్రయత్నించాలి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/03/virodhi-pariharangal-16.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a comment