విరోధి పరిహారాలు – 18

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/09/02/virodhi-pariharangal-17/

49. అంజలి  విరోధి  – అంజలి (చేతులు జోడించి నమస్కరించడం). అర్పించడంలో అవరోధాలు 

అంజలి అంటే రెండు  అరచేతులను జోడించి నమస్కరించడం (నమస్కారం) అని అర్థం. ఇది 48 వ అంశానికి సంబంధించినది (వందన – సాష్టాంగ నమస్కారం). సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత, పైకిలేచి అంజలి (రెండు  అరచేతులను జోడించి వందనం) చేయాలి. కొన్ని సమయాల్లో, కొందరు పూర్తి నమస్కారం చేయకుండానే అంజలి చేస్తారు. అంజలి చేయడం ఎలా అంటే చేతులు ఛాతి దగ్గరకు తీసుకువచ్చి అరచేతులు రెండూ ఒకదానికొకటి తాకే విధంగా జోడించడం.  కొన్ని సార్లు రెండు  అరచేతులను జోడించి తలపైన పెట్టుకోవడం కూడా మనం చూస్తాము.  అంజలిని “అం జలయతి ఇతి అంజలిః” – “అ” – అకారం చేత ప్రస్తావించబడిన భగవాన్ను కరిగించేది. “అంజలిః పరమాముద్రా  క్షిప్రమ్ దేవప్రసాధినీ” – అంజలి అనేది భగవాన్ యొక్క దయను త్వరగా ప్రేరేపించే  అత్యున్నతమైన భంగిమ.

 • అంజలి అనేది భగవాన్ యొక్క పాద పద్మాలపై మన మనస్సును కేంద్రీకరించి చేయాలి. దేవతాంతరాలు, భౌతికంగా ధనవంతులు మొదలైన వారిపై దృష్టి కేంద్రీకరించిన మనస్సుతో చేయకూడదు.
 • అంజలి చేయటానికి సమయ పరిమితులు మరియు శుభ సమయం లేవని అర్థం చేసుకోవాలి.
 • ప్రతి  శ్రీవైష్ణవునికి చేయాలి మరియు ప్రతి  శ్రీవైష్ణవుడూ చేయాలి అని అర్థం చేసుకోకపోవడం ఒక అడ్డంకి. అదేవిధంగా, అంజలి చేయటానికి వారికి ప్రత్యేక అర్హత అవసరమని అనుకోవడం కూడా సరైనది కాదు. భగవత్ సంభంధం ఉన్న ఎవరికైనా అంజలిని అర్పించవచ్చు. తిరుమంగై ఆళ్వార్ యొక్క తిరునెడుంతాణ్డం పాసురం 14 లో “వాళర్త్తతనాల్  పయన్ పెఱ్ఱ ఏన్ వరుగవెన్ఱు మడక్కిళియైక్ కైకూప్పి వణంగినాళే ” – పరకాల నాయకి(నాయికా భావంలో తిరుమంగై ఆళ్వార్)  చిలుకను పెంచినపుడు, ఆ చిలుక ఎమ్పెరుమాన్ పేర్లను చాలా ఆనందంగా పఠించడం విని, ఆమె పరమానందపడి తన  అరచేతులను జోడించి ఆ చిలుకకు అంజలి చేస్తుంది.
 • ఏ పరిస్థితిలోనైనా అంజలి చేయవచ్చని అర్థం చేసుకోకపోవడం ఒక అడ్డంకి. శారణాగతి గధ్యంలో, ఎమ్పెరుమానార్ అన్నారు “ఏనకేనాబి ప్రకారేణ ద్వయవక్తా” – ఏ పరిస్థితిలోనైనా ద్వయ మంత్రాన్ని పఠించవచ్చు, అలాగే, ఏ పరిస్థితిలోనైనా అంజలి చేయచవచ్చు, ఎమ్బెరుమాన్ని కరిగింపజేస్తుంది.
 • ఒక అంజలి సరిపోతుందని భావించకపోవడం, అనేక సార్లు అంజలి చేయాలని భావించడం. సకృత్ – ఒకసారి. అసకృత్ – అనేక సార్లు. ఆళవందార్ల స్తోత్ర రత్నం 28 లో, వారు ఎమ్పెరుమాన్తో అంటున్నారు “త్వదంగ్రి ముద్దిచ్య కతాపి కేనచిత్ యతా తథా వాపి సకృత్ కృతోంజలిః తదైవ ముష్ణాతి అశుబాని అశేశతః సుభాని పుష్ణాతి నజాతు హీయతే” – మీ పాద పద్మాలకు ఏ సమయంలోనైనా ఎవరైనా ఏ విధంగానైనా చేసే ఒక్క అంజలి ఒకేసారి పాపాలను తొలగిస్తుంది, అలాంటి వ్యక్తి యొక్క శ్రేయస్సును పెంచుతుంది,  ఆ మంచి ఎప్పుడూ తగ్గదు. అందువల్ల, ఒక్కసారి అంజలి చేస్తే సరిపోతుంది. అనేక సార్లు చేయవలసిన అవసరం లేదు.  అనువాదకుల గమనిక:   పెరియ పిరాట్టి యొక్క మహిమను చాలా అందంగా భట్టార్ తన శ్రీ గుణరత్న కోశం, 58 వ స్లోకంలో వెల్లడిచేసారు – “ఐశ్వర్యం అక్షర గతిం పరమం పదం వా కస్మైచిత్ అంజలి పరం వహతే విధీర్య అస్మై న కించిత్ ఉచితం కృతం ఇతి అత అంబత్వం లజ్జసే కతయ కః అయం ఉధారభావః” ఓ మాతా! ఒకవేళ ఎవరైనా మీ ముందు అంజలి వహిస్తే, మీరు అతనికి ప్రాపంచిక సంపద, సర్వోత్తమమైన గమ్యం (పరమపదం) మరియు పరమపదంలో కైంకర్యాన్ని ఆశీర్వదిస్తారు. ఇన్ని ఇచ్చిన తరువాత కూడా, ‘నేను తగినంత చేశానా?’ అని అనుకొని సిగ్గుతో తల క్రిందకు దించుకుంటారు. దీని నుండి మనం ఎమ్పెరుమాన్ మరియు పిరట్టి యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు, భక్తుడు వారిని సమీపించడంలో కనీసం ప్రయత్నం చేయడాన్ని కూడా భరించక వారు దయను ఒకేసారి కురిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంక అనేక ప్రయత్నాల గురించి ఏమి చెప్పాలి?
 • అంజలి చేయడం వల్ల భవిష్యత్తులో చాలా కాలం తరువాత ఆశించిన ఫలితం లభిస్తుందని, ఆ ఫలితం వెంటనే ఇవ్వబడుతుందని అర్థం చేసుకోకపోవటం . “క్షిప్రం దేవ ప్రసాదినీ” లో చెప్పినట్లుగా, భగవాన్ ఎవరైనా అంజలి చేయడాన్ని చూసినప్పుడు వారు ఆశించిన ఫలితాన్ని వెంటనే ఇస్తాడు. మునుపటి వివరణ నుండి కూడా దీనిని అర్థం చేసుకోవచ్చు.
 • ప్రతి అపచారానికి ఒక అంజలి తప్పనిసరిగా నిర్వహించాలి అని భావించుట, అన్ని అపచారములను తొలగించడానికి ఒకే అంజలి సరిపోతుందని అనుకోకపోవుట. “అపరాదానిమాం సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ!” – ఆత్మలలో ఉత్తముడా(భగవాన్) దయచేసి నా నేరాలన్నిటినీ క్షమించండి అని అంజలి చేయడం సరిపోతుంది. అనువాదకుల గమనిక: ఈ సూచన స్లోకం “ఉపచారాపదేశేన …” లోని భాగం. ఈ స్లోకం ఇంట్లో మన తిరువారాదనం చివరిలో పారాయణం చేయబడుతుంది. దీని అర్థం “ఓ భగవాన్! నిన్ను విలాసపర్చడానికి మరియు మీకు సేవ చేయాలనే కోరికతో నేను ఈ తిరువారాదనం ప్రారంభించాను. అయితే నేను మీకు సేవ చేయడం కంటే ఎక్కువ అపరాధాలు చేశాను. దయచేసి ఇలాంటి నేరాలకు నన్ను క్షమించండి”. భగవాన్ యొక్క గొప్పతనాన్ని చూస్తే, మనం తగినంతగా వారికి సేవ చేయలేము. అలాగే, ఈ సంసారంలో చిక్కుకొని ఉన్న జీవాత్మ యొక్క మానసిక స్థితిని పరిశీలిస్తే, తిరువారాదనం చేసేటప్పుడు కూడా, ఎమ్పెరుమాన్ మీద మాత్రమే పూర్తిగా దృష్టి పెట్టి వారిని సరిగ్గా ఆరాధించడం చాలా కష్టం. కాబట్టి, భగవాన్ యొక్క గొప్పతనం మరియు జీవాత్మ యొక్క లోపాలు,ఈ రెండు కోణాల నుండి చూస్తే, తిరువారాదనం జీవాత్మా వైపు నుండి అసంతృప్తికరంగా ముగుస్తుంది. కానీ భగవాన్ సౌలభ్యం (సరళత) తో, కొన్ని లోపాలు ఉన్నప్పటికీ తన భక్తుడు చేసిన కైంకర్యాలను ఎంతో ఆనందంతో స్వీకరిస్తారు.
 • మునుపటి వివరణ మాదిరిగానే, అంజలి కొన్ని పాపాలను మాత్రమే తొలగించుటయే కాకుండా అన్ని రకాల పాపాలను తొలగిస్తుంది. దీనిని “సర్వపాపనివారణి” (అన్ని పాపాలను తొలగించునది) అని అంటారు. కానీ ఉద్దేశపూర్వకంగా పాపాలు చేసి, ప్రతిసారీ అంజలి చేయడం ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చని అనుకునే వారికి పురోగతి ఆశ లేదు.
 • అంజలి చేయడం వల్ల కొన్ని శుభాలు మాత్రమే ఇస్తుందని, సంపూర్ణ శుభాలు కాదని భావిస్తే అది అడ్డంకి . ఇంతకుముందు స్తోత్ర రత్నం 28వ స్లోకం లో చర్చించినట్లుగా, ఇది అన్ని శుభాలను ప్రసాదిస్తుంది.
 •  ఆశించిన ఫలితం వచ్చేవరకు మాత్రమే అంజలి చేయడం మరియు ఫలితం లభించిన తర్వాత కూడా అంజలి చేయుట కొనసాగించాలని అర్థం చేసుకోకపోవుట. దీని ఫలితంగా భగవత్ అనుభవం మీద కేంద్రీకృతమై ఉంది. పరమపదంలో కూడా, నిత్యులు మరియు ముక్తులు “నమ ఇత్యేవ వాదినః” అని చెప్పినట్టుగా  అంజలి చేస్తూ ఉంటారు . అనువాదకుల గమనిక:  నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 3.8.4 లో “కైకళాలాఱత్ తోళుత్తు తొళుతున్నై” – అంజలి చేయడం ద్వారా నిన్ను నిరంతరం ఆరాధిస్తున్నాను. నంపిళ్ళై యొక్క వ్యాఖ్యానం దీనికి చాలా అద్భుతమైనది – ఆళ్వార్ యొక్క దివ్య భావోద్వేగాలను బహిర్గతం చేయడంలో వారి తేజస్సు ఒక ప్రకాశవంతమైన సూర్యుడిలా ప్రకాశిస్తుంది. అంజలి చేసే నమ్మాళ్వార్ ప్రవృత్తి తనకు చాలా ప్రియమైనదని ఆయన అన్నారు. అతను “భౌతిక కోరికలపై దృష్టి కేంద్రీకరించినవాడు వారి కోరిక నెరవేరిన తర్వాత ఆరాధనను ఆపివేస్తాడు. ఇది ఒక సాధనంగా చేసేవాడు వారి లక్ష్యం సాధించిన తర్వాత ఆగిపోతాడు. కాని ఇది వారి యాత్ర (జీవితం) గా ఉన్నవారికి ‘నిత్యాంజలి పుడాః” లో చెప్పినట్లుగా, స్వేత ద్వీప వాసులకు (క్షీరసముద్ర నివాసులకు), పరమపాదంలోని  (నిత్యులు మరియు ముక్తులు) కూడా గతంలో ‘ఇత్యేవ వాదినః’ చూసినట్లుగా నిరంతరం అంజలిని నిర్వహిస్తుంటారు. ఈ గొప్ప భక్తుల అంజలి ప్రదర్శనల  ప్రేరేపణల వల్ల ఎమ్పెరుమాన్ తనను తాను నిలుపుకుంటున్నారని వారు వివరిస్తున్నారు. కాబట్టి, ఎమ్పెరుమాన్ పట్ల ఎంతో ప్రేమ మరియు ఆప్యాయతతో కైంకర్యంగా చేసినప్పుడు, అంజలి చేస్తూనే ఉండాలని మనం అర్థం చేసుకోవచ్చు.
 • గరుడ ముద్ర పాము విషాన్ని నియంత్రించి అణచివేస్తుందని అర్థం చేసుకోకపోవుట, ఈ అంజలి ముద్ర భగవాన్ యొక్క స్వాతంత్ర్యము (మొత్తం స్వాతంత్ర్యం / స్వేచ్ఛా సంకల్పం) ను నియంత్రిస్తుంది మరియు లొంగదీస్తుంది. ఈ సూత్రం పట్ల చాలా నమ్మకంగా ఉండాలి. అనువాదకుల గమనిక: శ్రీ రామాయణ స్లోకంలో, “చ చాల చాపం చ ముమోచ వీరః” – రావణుడు రామునిపై బాణాలు వదులుతుండగా,  శ్రీ రాముడు కూడా విల్లు ఎక్కుపెట్టి యొద్ధం చేస్తున్నారు. కానీ రావణుని విల్లు శ్రీ రాముని చేత విరిగిపోయినప్పుడు,  రావణుడు ఆ విల్లును కింద పెట్టివెస్తాడు. (తన చేతుల్లో ఆయుధాలు లేకపోతే రాముడు అతన్ని కొట్టలేడని బాగా తెలుసు), శ్రీ రాముడు వెంటనే రావణునిపై  దాడి చేయకుండా అతనికి ప్రాణ దానమిచ్చాడు. మన పూర్వాచార్యులు ఈ విషయం గురించి వివరిస్తూ, ఆ సమయంలో రావణుడు ఒక అంజలిని ప్రదర్శించి ఉంటే, అతను శ్రీరాముడిని సులభంగా గెలిచి ఉండేవాడు – ఎందుకంటే ఎమ్పెరుమానుని ఈ సర్వోత్తమైన ముద్ర ద్వార నియంత్రించబడతారు కాబట్టి.
 • అభయ హస్తం (రక్షణ ముద్ర) శేషి (యజమాని) స్వభావానికి తగినట్లుగా, అంజలి హస్తం (జోడించిన చేతుల ముద్ర) శేష భూతుని (సేవకుడు)  స్వభావానికి తగినదని మనం దృఢముగా అర్థం చేసుకోవాలి. అలాంటి విశ్వాసం లేకపోవడం ఒక అడ్డంకి. శేషి  – స్వామి (యజమాని) అనగా, ఎమ్పెరుమాన్. అతను అభయ హస్తం (రక్షణ ముద్ర), వరద హస్తం (ప్రసాదిస్తున్న ముద్ర), ఆహ్వాన హస్తం (ఆహ్వానిస్తున్న ముద్ర) వంటి వివిధ ముద్రలలో తన హస్తాలని ఉంచుతారు. అదేవిధంగా, జీవత్మ కొరకు, అంజలి హస్తం అత్యంత సముచితమైనది – ఇది జీవాత్మ యొక్క అనణ్య గతిత్వం (వేరే ఆశ్రయం లేదని) మరియు అకించణ్యం (అతని చేతిలో ఏమీ లేదని) వెల్లడిస్తుంది. అనువాదకుల గమనిక: మునుపటి వివరణలో తిరువాయ్మొళి 3.8.4 పాసురం యొక్క వ్యాఖ్యానం మనం ఇప్పటికే చూశాము – ఎమ్పెరుమాన్ తన భక్తులను రక్షించడం ద్వారా తనను తాను నిలబెట్టుకుంటారు, ఇంకా జీవాత్మ ఎమ్పెరుమాన్ రక్షణతో తనను తాను నిలబెట్టుకుంటాడు.
 • తనను తాను రక్షించుకునే ఆలోచనతో అంజలి చేయడం అడ్డంకి. అంజలి చేయడం తనను తాను రక్షించుకునే సాధనం ఏమీ లేదని తెలుపుతుంది. వేరే ఆశ్రయం లేనట్లే, తనను తాను రక్షించుకోలేడు. తిరుక్కోళూర్ పెన్ పిళ్ళై వార్తై గ్రంథం “ఇరు కైయుం విట్టేనో ద్రౌపదియైప్ పోలే” – నా రెండు చేతులతో నన్ను నేను రక్షించుకోవడం మానేసి ద్రౌపదిలాగా ఎమ్పెరుమానుకి పూర్తి శరణాగతి చేస్తున్నానా? ద్రౌపది తన గౌరవాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్నప్పుడు, ఆమె తనను తాను రక్షించుకునే ప్రయత్నాలను వదలి, “హ కృష్ణా! హ ద్వారకావాసా!” అని ఆర్తితో పిలుస్తుంది, వెంటనే ఎమ్పెరుమాన్ ద్వారా రక్షించబడుతుంది కూడా. అదేవిధంగా, మనం కూడా మన రక్షణకై  ఎలాంటి అపేక్ష లేకుండా అంజలి చేయాలి.
 • కైంకర్యం తప్ప మరే ఇతర ప్రయోజనాల కోసం అంజలి చేయుట. అనువాదకుల గమనిక: జీవాత్మ ఉనికి యొక్క మొత్తం ఉద్దేశ్యం భగవానుడికి వారి భక్తులకు సేవ చేయడమే. వేరే అపేక్షలు ఉండకూడదు. ప్రయోజనాలకు బదులుగా అంజలి చేయడం ఇది జీవాత్మ పరమాత్మల మధ్య వ్యాపార ఒప్పందం కాదు. మనం ఇంతకుముందు పోయిగై అజ్వార్ యొక్క ముదల్ తిరువంతాది పాసురం 26 “ఎళువార్ విడై కొళ్వార్ ఇన్ తుళాయానై వాళువా వగై నినైన్దు వైగల్ తొళువార్…” – సంపదను ఆశించేవారు, కైవల్యాన్ని ఆశించేవారు వారి కోరికలు నెరవేరిన తర్వాత ఎమ్పెరుమానుని వదిలివేస్తారు, కానీ పూర్తిగా ఎమ్పెరుమాన్ సేవ చేయాలనుకునే వారు నిరంతరం మరే ఇతర కోరిక లేకుండా ఎమ్పెరుమానుని ఆరాధించడంలోనే నిమగ్నమై ఉంటారు.
 • దేవతాంతర దేవాలయాల ముందు  శఠగోపునికి (నమ్మాళ్వార్ ) అంజలి చేయడం ఒక అడ్డంకి. తిరువాయ్మొళి పఠించేటప్పుడు, ప్రతి పదిగం (పది పాసురాలు) చివరిలో, 11 వ పాసురం పఠించేటప్పుడు, నమ్మాళ్వార్ పేరు విన్నప్పుడు (శఠగోపన్, వళుతి నాదన్, మాఱన్, మొదలైనవి), నమ్మాళ్వారు మనకు చేసిన గొప్ప సహాయానికి కృతఙ్ఙతగా అంజలి చేయాలి. ఎప్పుడైనా సరే నమ్మాళ్వార్ పేరు విన్నప్పుడు  అదే పద్దతిని (తప్పక అంజలి చేయడం) అనుసరించాలని చెప్పబడింది. కానీ అది కూడా, మనం ఇతరదేవతాంతర దేవాలయాల దగ్గర లేదా ముందు ఉన్నట్లయితే, అంజలి చేయకూడదు (ఎందుకంటే పొరపాటుగా ఇతర దేవతలకు అంజలి చేసినట్టు కావచ్చు). ఈ సందర్భంలో, “శఠగోపనుం త్యాజ్యం”  – (అంజలి) శఠగోపునికి కూడా వదులుకోవాలి. అనువాదకుల గమనిక: పురప్పాడు (ఊరేగింపు) సమయంలో తిరువాయ్మొళి వీధుల్లో పఠించక పోయినప్పటికీ, గొప్ప భాగవతులు తరచూ పాసురములను వారి మనస్సులో పఠిస్తూ  అర్ధాలను స్మరించుకుంటూ ఉంటారు.  అలాంటి సందర్భాల్లో కూడా, దేవతాంతరాలపై భక్తి చూపించకుండా జాగ్రత్త పడాలి.
 • అభాగవతులు (ఎమ్పెరుమాన్  భక్తులు కానివారు) ఎవరైనా అంజలి చేసినప్పుడు, మనం అంజలితో ప్రతిస్పందించకూడదు – దానిని విస్మరించాలి. దీనికి విరుద్ధంగా, మనం భాగవతులను చూసినప్పుడు, వారు చేసే ముందే మనం అంజలి చేయాలి.
 • అచార్యులను చూసినప్పుడు, కేవలం అంజలి చేయకుండా, పూర్తి సాష్టాంగ నమస్కారాలు చేయాలి, పైకి లేచి అంజలి చేయాలి.
 • మనస్సులో నిజాయితీ లేకుండా, లేదా పాక్షికంగా కూడా అంజలి చేయకూడదు. అనువాదకుల గమనిక: అంజలిని హృదయపూర్వకంగా సరైన పద్ధతిలో చేయాలి. ఒక్క చేత్తో వందనాలు చేయడం సాధారణంగా శాస్త్రంలో ఖండించబడింది.
 • నమ్మాళ్వార్ (శఠగోప స్వామి మొదలైన) నామమును విన్నప్పుడు తలపై అంజలి చేయకపోవుట. దీని గురించి గతంలో వివరంగా చర్చించారు. గోష్టిలో (సామూహికంగా) పాసుర పారాయణం చేసేటప్పుడు, తలపై చేతులు ఎత్తి అంజలి చేయడం మనం గమనించడం లేదు. ఎమ్పెరుమాన్ యొక్క పాదుకలను శ్రీ శఠగోప అంటారు. గోష్టిలో లేదా ఇంకెప్పుడైనా, మనం శ్రీ శఠారితో ఆశీర్వదించబడినప్పుడు, మనం వినయంగా తల వంచి, అంజలితో ఆ ఆశీర్వాదాన్ని స్వీకరించాలి.
నమ్మాళ్వార్  శ్రీ శఠగోపం రూపంగా – వానమామలైలో ఉంది

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/03/virodhi-pariharangal-18.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s