Monthly Archives: January 2020

విరోధి పరిహారాలు – 24

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/07/07/virodhi-pariharangal-23/.

56. తీర్థ విరోధి  – తీర్థానికి సంభందించిన అడ్డంకులు. 

తీర్థం అనగా స్వచ్ఛమైన / పవిత్రమైన / శుద్ధ జలం. భగవాన్, ఆచార్యులు మొదలైనవారి స్పర్శా సంబంధంతో జలం ఆ స్వచ్ఛతను పొందుతుంది. భగవానుడి తిరువారాదనంలో ఉపయోగించే నీటిని తీర్థం అంటారు.  దీనిని “పెరుమాళ్ తీర్థం” అని కూడా అంటారు. శ్రీవైష్ణవ పరిభాషలో భగవానుడి స్నానాన్ని  “తిరుమంజనం” అని పిలుస్తారు. మరికొందరు “అభిషేకం” అని పిలుస్తారు. ఎమ్పెరుమాన్ స్నానంలో ఉపయోగించిన నీటిని “తిరుమంజన తీర్థం” అని అంటారు. ఆ నీటిని సేకరించి  శ్రీవైష్ణవ గోష్థిలో అందరికీ పంచబడుతుంది (ఇతరులు కూడా). శ్రీవైష్ణవ పరిభాషలో శ్రీవైష్ణవుల యొక్క స్నానాన్ని “తీర్తమాడుతల్” అని పిలుస్తారు. అలాగే, ఆచార్యులు మరియు ఉన్నత శ్రీవైష్ణవుల చరణామ్రుతాన్ని (చరణాలు కడిగిన నీరు) శ్రీపాద తీర్థం అని అంటారు.  ఆచార్యుల యొక్క పాదుకలను తాకిన నీటిని కూడా శ్రీపాద తీర్థం అని పిలుస్తారు. ఈ “తీర్థ విరోధి” విభాగంలో  పెరుమాళ్ తీర్థం, తిరుమంజన తీర్థం మరియు శ్రీపాద తీర్థానికి సంబంధించిన నియమాలు, నిబంధనలు మొదలైన వాటి గురించి తెలుసుకుంటాము. అనువాదకుల గమనిక: తీర్థం అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి.  పవిత్రమైన, శుద్ధ జలం, పవిత్ర స్థలం/క్షేత్రం మరియు స్వయంగా భగవానుడు (అతిపవిత్రమైనవాడు, వారికి సంబంధించిన ప్రతివారిని పవిత్రం చేసేవాడు), మొదలైన వాటిని తీర్థం అని అంటారు. ఇక్కడ ముందు వివరించిన విధంగా వివిధ రకాలైన పవిత్ర జలంపై దృష్టి కేంద్రీకరించబడింది. వాటిని వివరంగా చూద్దాం.

 •  ప్రయోజనాంతర పరార్ (ఎమ్పెరుమాన్ నుండి లౌకిక ఉపకారాలపై దృష్టి ఉన్నవారు) నుండి పెరుమాళ్ తీర్థం స్వీకరించడం ఒక అడ్డంకి. ముముక్షులు అంటే మోక్షం (పరమపదంలో ఎమ్పెరుమాన్ కి శాశ్వత కైంకర్యం) పై దృష్టి కేంద్రీకరించేవారు. ఇతర భౌతిక ప్రయోజనాలపై దృష్టి సారించిన వారిని సాధారణంగా బుబుక్షులు (భౌతిక ఆనందాలను కోరుకునేవారు) అంటారు. అటువంటి వ్యక్తుల దగ్గర నుండి పెరుమాళ్ తీర్థం స్వీకరిస్తే అది మనల్ని ప్రభావితం చేస్తుంది. మన పూర్వాచార్యుల వాక్కులపై మన స్థిరమైన విశ్వాసానికి భంగం కూడ కలిగించవచ్చు. కాబట్టి అలాంటి వ్యక్తుల నుండి పెరుమాళ్ తీర్థం స్వీకరించడం హానికరం.
 • సాధనాంతర పరుల ముందు పెరుమాళ్ తీర్థం స్వీకరించడం (భగవాన్ కాకుండా ఇతర మార్గాలను ఉపాయంగా/మార్గంగా భావించేవారు) ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక:  సాధనం అంటే ఏదైనా సాధించడానికి ఒక ఉపాయం (ఇక్కడ ఎమ్పెరుమాన్ కి శాశ్వత కైంకర్యంపైనే మన దృష్టి). శాస్త్రంలో అనేక విధాలు వివరించబడ్డాయి. వాటిలో కర్మ యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం మొదలైనవి.  ప్రపత్తిని కూడా కొంతమంది ఉపాయంగా భావిస్తారు. కానీ నిజమైన ప్రపన్నులు / శారణాగతులు, భగవాన్ని మాత్రమే ఉపాయంగా (మనకు శాశ్వతమైన కైంకర్యాన్ని ప్రసాదించేవాడు) భావిస్తారు. అలాంటి వ్యక్తులు భగవాన్ని సాధించడానికి  సొంత ప్రయత్నాలపై ఆధారపడే వారి ముందు ఏదీ తినకూడదు.
 • మంత్రాంతర పరుల (ద్వయ మహామంత్రం కాకుండా ఇతర మంత్రాలను పఠించేవారు) ముందు పెరుమాళ్ తీర్థం స్వీకరించడం ఒక అడ్డంకి. రహస్య త్రయం (తిరుమంత్రం, ద్వయం, చరమ స్లోకం) ఆచార్యుల చేత శిష్యునికి ఉపదేశించబడుతుంది.  ఇతర మంత్రాలు అనగా ఇక్కడ దేవతాంతరములకు (శ్రీమాన్నారాయణ కాకుండా ఇతర దేవతలు) సంబంధించిన మంత్రాలు గురించి ప్రధానంగా చెప్తున్నారు .  అనువాదకుల గమనిక: భగవాన్ ఉపాయం (సాధనము) అని, తాయార్ మరియు పెరుమాళ్ళకు చేసే కైంకార్యం ఉపేయమని (లక్ష్యం) ద్వయ మహామంత్రంలో స్పష్టముగా తెలియచేయడం కారణంగా  మన పూర్వాచార్యులచే  గొప్పగా మహిమపరచబడింది. అన్ని మంత్రాలలో, ఈ మంత్రాన్ని మంత్ర రత్నంగా కీర్తించారు మరియు ఈ మంత్రాన్ని నిరంతర పారాయణం చింతన చేయాలని మన పూర్వాచార్యులు ఎల్లప్పుడూ ప్రేరేపిస్తూ ఉండేవారు. పుర్వ దినచర్యలో ఎఱుమ్బి అప్పా వివరిస్తూ, మాముణుల పెదవులు ద్వయ మహమంత్రాన్ని నిరంతరం పఠిస్తుంటాయని మరియు వారు ఎల్లప్పుడూ దాని అర్ధాలను (తిరువాయ్మొళి మరియు వాటి వ్యాఖ్యానాలు) ధ్యానం చేస్తూ ఉండేవారని వర్ణించారు.
 • దివ్య దేశాలలో పెరుమాళ్ తీర్థం తీసుకునేముందు తీర్థం యొక్క పవిత్రతను పరిశీలించడం ఒక అడ్డంకి. అంటే, దివ్య దేశాలలో (సన్నిధులు / దేవాలయాలు)  తీర్థంన్ని స్వీకరించడానికి వెనుకాడకూడదు. దివ్య దేశం అంటే దివ్య ప్రభాంధాలలో ఆళ్వారులు కీర్తింపబడిన ఆలయాలు. ఆళ్వారులు / ఆచార్యలతో అనుసంధానించబడిన ఏ దేవాలయానికైనా ఇదే నియమం వర్తిస్తుంది (ఉదాహరణకు: అభిమాన స్థలాలు, అవతార స్థలాలు మొదలైనవి) – దివ్య దేశాలకు సమానమైనవి.
 • ఇతర ప్రదేశాలలో పెరుమాళ్ తీర్థం తీసుకునేముందు తీర్థం యొక్క పవిత్రతను పరిశీలించక పోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: దివ్య దేశాలు, అభిమాన స్థలాలు  మరియు ఆళ్వారులు / ఆచార్య అవతార స్థలాలు కాకుండా ఇతర ఆలయాలలో సరైన శ్రీవైష్ణవ ఆచారాలు పాటిస్తున్నారో లేదో మనం నిర్ధారించుకోవాలి. ఉదాహరణకు, సాధారణంగా మన పెద్దలు ఆలయాలలో ఆళ్వారులు / ఆచార్యుల సన్నిధులు ఉన్నట్లు నిర్ధారించుకుంటారు మరియు దేవాలయానికి వెళ్ళే ముందు భగవానుడితో పాటు ఆళ్వారులు / ఆచార్యులకు సరైన అరాధన జరుగుతుందో లేదో  నిర్ధారించుకుంటారు.
 • సంసారుల (భౌతికంగా దృష్టితో ఉన్న వ్యక్తులు) మధ్య తీర్థంను స్వీకరించడం ఒక అడ్డంకి. సంసారులు ఎవరు అని మనం ఇప్పటికే చర్చించాము. అనువాదకుల గమనిక: మన పూర్వాచార్యులు అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులతో కలవడం మరియు వారి ముందు ఏదైనా తీసుకోవడాన్ని పూర్తిగా వర్జించుకునేవారు.
 • ఇతర శ్రీవైష్ణవుల కంటే ముందు తీర్థం మనం  స్వీకరించడం ఒక అడ్డంకి. ఇతర శ్రీవైష్ణవులను మొదట తీర్థం తీసుకునేవరకు వేచి ఉండి ఆ తరువాత మనం స్వీకరించాలి. తీర్థం తీసుకోవడానికి  ముందు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయకూడదు.
 • మనం ఏదైనా ఒక దిశలో / పరిస్థితిలో ఉన్నప్పుడు తీర్థంను తీసుకోవడానికి వెనుకాడటం ఒక అడ్డంకి. తూర్పు వైపు ముఖం చేసే తీర్థం తీసుకోవాలనే నియమాలు లేవు.  శ్రీవైష్ణవ గోష్ఠిలో మనం ఎక్కడ ఉన్నా అక్కడే తీర్థం స్వీకరించవచ్చు.
 • తీర్థం తీసుకున్న తరువాత ఆదరణతో  తమ కళ్ళకు అద్దుకొని తలపై పెట్టుకోవాలి – అలా చేయకపోవడం ఒక అడ్డంకి.
 • తీర్థం స్వీకరించిన తర్వాత చేతులు కడుక్కోవాలని చూడటం ఒక అడ్డంకి.
 • భగవాన్, ఆచార్యులు మొదలైన వారికి కైంకర్యం చేసే ముందు చేతులు కడుక్కోకపోవడం.  తీర్థం తీసుకునేటప్పుడు, మన చేతులు పెదాలకు తాకి ఉండవచ్చు – అటువంటి మాలిన్యాన్ని(పెదాలకు తగలడం) శుద్ధి చేయడానికి , కైంకర్యానికి వెళ్ళే ముందు చేతులు కడుక్కోవాలి.
 • నేలపైన  తీర్థం పడవేయడం ఒక అడ్డంకి. తీర్థంను తీసుకునేటప్పుడు క్రింద పడకుండా వారి వస్త్రాన్ని కుడి చేతి క్రింద పెట్టి జాగ్రత్తగా తీసుకోవాలి. అనువాదకుల గమనిక: ఎవరైతే తీర్థాన్ని క్రింద పడవేస్తున్నారో  వారు మహాపాపం చేస్తున్నారని శాస్త్రంలో వివరించబడింది. అలాగే తీర్థం, ప్రసాదంపై అడుగు పెట్టడం గురించి కూడా అదే చెప్పబడింది.
 • సాంప్రదాయ జ్ఞానం లేని వ్యక్తుల మాదిరిగా తలపై తీర్థం చల్లుకోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ముందు చెప్పినట్లుగా, ఆదరణతో  తమ కళ్ళకు అద్దుకొని తలపై పెట్టుకోవాలి. సామాన్యుల లాగా నిర్లక్షంగా తలపై చల్లుకోకూడదు.
 • పనికిరాని విషయాలను చర్చిస్తూ తీర్థం స్వీకరించడం ఒక అడ్డంకి. తీర్థాన్ని భక్తితో తీసుకోవాలి. ఆ సమయంలో ఇతరులతో మాట్లాడకుండా ఉండాలి.
 • సంసారులు (లౌకిక  ప్రజలు) చూసిన తీర్థాన్ని స్వీకరించడం ఒక అడ్డంకి.
 • భగవత్ తీర్థం కన్నా శ్రీవైష్ణవ శ్రీపాద  తీర్థం ఉన్నతమైనదని అర్థం చేసుకోవాలి. అలాంటి అవగాహన లేకపోవడం ఒక అడ్డంకి.
 • తీర్థం యొక్క వాస్తవ స్వభావం / గొప్పదనం తెలుసుకోకుండా కేవలం ఇచ్చేవారి భౌతిక స్వరూపం ఆధారంగా స్వీకరించడం ఒక అడ్డంకి.
 • తీర్థం ఇచ్చేటప్పుడు పఠించిన దాని ఆధారంగా, తీర్థం ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. సాధారణంగా తీర్థం సాత్తుముఱ (పాసుర పఠనం ముగింపు) సమయంలో పంచ బడుతుంది, ఆ సమయంలో తీర్థాన్ని ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోవడం ఒక అడ్డంకి.
 • అచార్య శ్రీపాద తీర్థం ఆచార్యుల అనుగ్రహంతో ఇవ్వబడుతుంది కాబట్టి ఒక సారి కంటే ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: కొన్ని మఠాలు / తిరుమాలిగలలో, శ్రీపాద తీర్థం రెండుసార్లు ఇవ్వబడుతుంది మరియు ఇతర మఠాలు / తిరుమాలిగలలో మూడుసార్లు ఇవ్వబడుతుంది. రెండింటికీ శాస్త్రంలో ప్రమాణాలు ఉన్నాయి. అయితే, శ్రీపాద తీర్థం ఒక్కసారి మాత్రమే తీసుకోకూడదని అర్థం చేసుకోవచ్చు.
 • సాదాచార్యుల (నిజమైన ఆచార్యులు) యొక్క శ్రీపాద తీర్థం ఎల్లప్పుడూ పూజ్యనీయమైనదని అర్థం చేసుకోవాలి (ఒక కలశంలో ఉంచిన గంగా జలం పూజ్యనీయమైన విధంగా). ఇది శిష్టాచారము (పెద్దలు అనుసరించిన ప్రక్రియ) అని అర్థం చేసుకొని మనం కూడా చేయాలి. అలాంటి అవగాహన లేకపోవడం ఒక అడ్డంకి.
 • శ్రీపాద తీర్థం వేదకప్ పొన్ (రాగిని బంగారంగా మార్చగల ఒరగల్లు) గా కీర్తింపబడింది. కేవలం శ్రీపాద తీర్థాన్నితాకగానే (ఏ రూపంలోనైనా) శుద్ధులమవుతాము. “స్రమణి విదుర ఋషి పత్నికళైప్ పూతరాక్కిన పుండరీకాక్షన్ నెదునోక్కు” (ఆచార్య హృదయం – శ్రీమన్నారాయణ యొక్క దివ్య నేత్రాలను పుండరీకాక్ష/ పద్మనేత్రాలుగా కీర్తించారు, స్రమణిని (శబరిని), విదురుడిని, ఋషుల పత్నులను శుద్ధులను చేశారు. అటువంటి ఆచార్య యొక్క శ్రీపాద తీర్థం చాలా ఉన్నతమైనదిగా విశేషంగా పరిగణించాలి. దీనిని ప్రత్యేక జ్ఞానం అని పిలుస్తారు. అటువంటి ప్రత్యేక జ్ఞానం లేకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: కూరత్తాళ్వారుల జీవితంలో, ఒక అందమైన సంఘటనను మనం గుర్తుచేసుకుందాము. ఒక శ్రీవైష్ణవ పుత్రుడు చెడు సహవాసం వలన అవైష్ణవ విషయాలలో మక్కువ చూపిస్తాడు. కానీ ఒక రోజు, అతను అకస్మాత్తుగా శ్రీవైష్ణవ వస్త్రధారణతో తిలకం పెట్టుకొని తన తండ్రి ముందు కనిపిస్తాడు. ఒకేసారి ఆ తండ్రి, కూరత్తాళ్వారులు తమ దివ్య దృష్టితో నిన్నేమైనా చూశారా? అని అడుగుతారు.  అలాంటిది కూరత్తాళ్వారుల యొక్క కీర్తి. వారి దృష్టి ద్వారా, వారు చూసిన ప్రతి వ్యక్తిలో మార్పు తెచ్చేవారు (శుభ లక్షణాల పరివర్తన).
 • కోరిక లేకుండా కేవలం మహిమలను అర్థం చేసుకోవడం ద్వారా శ్రీపాద తీర్థం తీసుకోవడం ఒక అడ్డంకి. కీర్తిని అర్థం చేసుకోవడమే కాకుండా, శ్రీపాద తీర్థాన్ని ఇష్థంగా కోరికతో తీసుకోవాలి.
 • కొన్ని తీర్థాలను స్వీకరించడం (దేవతాంతర సంబందం ఉన్నవి) జీవాత్మ యొక్క నిజమైన స్వభావానికి హానికరం. అటువంటి తీర్థాలను ధైర్యంగా స్వీకరించడం (పరిణామాల గురించి ఆలోచించకుండా) ఒక అడ్డంకి.
 • తీర్థాన్ని మొదట (అందరికంటే ముందు) ఇచ్చినప్పుడు సంతోషంగా స్వీకరించడం, అదే ఇతరులకు పంచిన  తరువాత ఇచ్చినపుడు సంకోచంతో స్వీకరించడం ఒక అడ్డంకి. తీర్థం మనల్ని శుద్ధి చేస్తుందనే అవగాహనతో ఎటువంటి సంకోచం లేకుండా ఏ పరిస్థితిలోనైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
 • శ్రీపాద తీర్థంలో తన శ్రీపాద తీర్థం కూడా ఉందని తిరస్కరించడం. కొన్ని సందర్భాలలో, ఇండ్లల్లో శ్రీవైష్ణవ గోష్టిని నిర్వహించినప్పుడు, సమావేశమైన శ్రీవైష్ణవులందరి శ్రీపాద తీర్థాన్నిసేకరించడం సాధారణ పద్ధతి. అలా చేసిన తరువాత, సేకరించిన శ్రీపాద తీర్థం అందరికీ పంచ బడుతుంది. ఆ సమయంలో, తన సొంత శ్రీపాద తీర్థం కూడా దానిలో కలిసి ఉన్నందున ఆ తీర్థాన్ని తీసుకోనని  నిరాకరించకూడదు. అనేక మంది శ్రీవైష్ణవ పాదాలను కడిగిన నీటి తీర్థం ఇందులో ఉందని, అది మనలను మరింత శుద్ధి చేస్తుందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని తీర్థాన్ని స్వీకరించాలి.
 • ప్రపన్నులు కొన్ని కర్మలలో ప్రాయశ్చిత్తం (పాపాలకు ప్రాయశ్చిత్తం) చేయడానికి ఉపయోగించే తీర్థాన్ని తీసుకోకూడదు. అలా చేయడం ఒక అడ్డంకి.
 • శైవులు మొదలైన వాళ్ళును తగిలినపుడు (శరీర స్పర్శ) , తమను తాము శుద్ధి చేసుకోవడానికి శ్రీపాద తీర్థాన్ని తీసుకోవాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. శరీరం కి తగిలినప్పుడు, శరీరం యొక్క ఆ భాగాన్ని కడిగి, ఆపై శ్రీపాద తీర్థాన్ని తీసుకోవాలి. ఇలాంటి మాలిన్యానికి ఇది పరిహారము. పరాశర భట్టార్‌ జీవితంలోని ఒక సంఘటనను మనం గుర్తు చేసుకుందాం. ఒక పాషండుని శరీరం నుండి బూడిద అక్కడ వ్యాపించి, పరాశర భట్టార్ను తాకినప్పుడు,  భట్టార్ వాళ్ళ అమ్మ దగ్గరకు పరిగెత్తుకెళ్తాడు, ఎలా శుద్ధి చేయాలో అడుగుతాడు. శాస్త్రాలలో గొప్ప పండితురాలైన వారి తల్లి ఆండాళ్, ఒక అబ్రహ్మణ శ్రీవైష్ణవుని యొక్క శ్రీపాద తీర్థాన్ని తీసుకోమని ఆదేశిస్తుంది.  భట్టార్ ఊరేగింపు సమయంలో భగవానుడిని తీసుకువెళ్ళే ఒక వ్యక్తిని కోరతాడు, తనను తాను శుద్ధి చేసుకుంటాడు. ఈ సంఘటన వార్తామాల 327 వ వివరణలో చెప్పబడింది. 
 • శ్రీపాద తీర్థ శుద్ధత/ స్వచ్ఛతను మాత్రమే పరిగణించడం, శ్రీపాద తీర్థపై మక్కువ (రుచి) లేకపోవడం ఒక అడ్డంకి. శ్రీపాద తీర్థం తీసుకోవడం అమితానందకరమైనదని అర్థం చేసుకోవాలి.
 • శ్రీపాద తీర్థాన్ని ఒక్కసారి తీసుకొని సంతృప్తిపడి ప్రతిరోజూ దాని కోసం ఆరాటపడకపోవడం ఒక అడ్డంకి. తల్లి పాలు తాగుతున్న శిశువు ఎంతో ఆశగా ఇంకా ఇంకా కావాలనుకున్నట్లుగా, ఆచార్య యొక్క శ్రీపాద తీర్థం కోసం ఆశతో ఉండాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి.
 • ఈ భౌతిక ప్రపంచంలో ఆచార్యులకు చివరి జన్మ అని అర్థం చేసుకోకుండా ఆచార్యుల  శ్రీపాద తీర్థ స్వీకణ  కోల్పోవడం ఒక అడ్డంకి. తిరువాయ్మొళి 9.10.5 లో “మరణామానాల్ వైకుంఠం” (మరణానంతరం వారు పరమపదం చేరుకుంటారు) అని చెప్పినట్లుగా, మనం ఆచార్యలను ఎంతో ప్రేమతో చూసుకోవాలి మరియు వారి శ్రీపాద తీర్థాన్ని స్వీకరించాలి. వారు జీవితులుగా ఉన్నప్పుడు వారి నుండి విలువైన సూచనలు వినాలి.
 • శ్రీపాద తీర్థాన్ని వేరొకరి ద్వారా కాకుండా నేరుగా (పంచేవారి నుండి) స్వీకరించాలి. పెరుమాళ్ తీర్థం విషయంలో, కొన్ని సమయాల్లో, తీర్థకారులు (ఆలయ ప్రధాన అధ్యాపకులు) కోసం ఒక సహాయకుడిని నియమించడం మనం చూస్తాము. ఇటువంటి పద్ధతి న్యాయకరమైనది కాదు.
 • శ్రీపాద తీర్థాన్ని మనమై మనం తీసుకోవడం ఒక అడ్డంకి. ఆచార్యుల నుండి లేదా తిరువారాదనం చేస్తున్న వ్యక్తి నుండి తీసుకోవాలి.
 • శ్రీపాద తీర్థం మనం పొందాలనే గొప్ప కోరిక ఉండాలి. అలాంటి కోరిక లేకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఇక్కడ,  నిర్లక్షంగా శ్రీపాద తీర్థాన్ని తీసుకోవడం ఖండించబడింది.
 • శ్రీపాద తీర్థం ఇచ్చేవారు మరియు పుచ్చుకునే వారిరువురు  ద్వయ మహమంత్రంపై పూర్తి దృష్టి ఉండాలి.  అలా ఉండకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ద్వయ మహ మంత్రం మరియు ఆ అర్ధాలను గురుపరంపరా మంత్రంతో పాటు ఎల్లప్పుడూ చింతన చేస్తూ ఉండాలి. అలా చేయటం వలన మనం తాయార్, ఎమ్పెరుమాన్ల నిరంతర దాసులమని గుర్తుంటుంది, మనం కేవలం ఎమ్పెరుమాన్ ను మాత్రమే ఉపాయంగా స్వీకరిస్తాము, ఇల చేయడం వలన పరమపదంలో వారికి  శాశ్వతంగా సేవ చేయాలనే కోరికను పెరుగుతుంది. గురుపరంపరా మంత్రాన్ని పఠించడం ద్వారా, ఈ అద్భుతమైన అచార్య పరంపర ద్వారా భగవానుడితో మన సంబంధం నిరంతరం గుర్తుకువస్తుంది.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.in/2014/06/virodhi-pariharangal-24.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org