విరోధి పరిహారాలు – 28

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/03/15/virodhi-pariharangal-27/ .

  కృష్ణ తృష్ణా తత్వంగా కీర్తించబడిన నమ్మాళ్వారులు – ఎమ్పెరుమాన్ యొక్క భక్తి స్వరూపులు

61. స్నేహ విరోధి  – మన అనుబంధాలలో / స్నేహంలో అవరోధాలు.

స్నేహం  అంటే మైత్రి, ప్రేమ, ఆప్యాయత, అనుబంధం మొదలైనవి. స్నేహం యొక్క పరిపక్వ స్థితిని భక్తి అంటారు. అలాగే, ఉన్నత వ్యక్తి పట్ల అధమ వ్యక్తి యొక్క స్నేహాన్ని కూడా భక్తి అంటారు (అనువాదకుల గమనిక: ఉదాహరణకు, పెరుమాళ్ (శ్రీ రాముడు – పరమాత్మ) పట్ల తిరువడి (హనుమాన్ – జీవత్మ) యొక్క ప్రేమను భక్తి అని పిలుస్తారు, తిరువడి పట్ల పెరుమాళ్ ప్రేమను స్నేహం అంటారు. ఈ విభాగంలో, ప్రతి అంశం రెండు భాగాలుగా చర్చించబడ్డాయి – మనకు వర్జింపబడినది మొదటి అంశం, మనం అనుసరించవలసినది రెండో అంశంగా వివరిచబడింది. ఇక్కడి సారాంశం ఏమిటంటే, మొదటి అంశం ఈ సంసారంలో చాలా సాధారణంగా చూస్తాము, కాని రెండవ అంశం ఈ సంసారం (భౌతిక ప్రపంచం) లో చాలా అరుదుగా కనిపిస్తుంది. మొదటి అంశంలో  తక్కువ మక్కువ చూపించి రెండవ అంశంలో మనం ఎక్కువ ఆసక్తి చూపించాలి. ఈ వివరణలను మనం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు.

 •  ప్రాకృత బంధువుల (దేహ బంధువులు – పుట్టుక ద్వారా ఏర్పడిన బంధాలు/ బంధువులు) పట్ల అనురాగం ఉండుట, ఆత్మ బంధువుల (భగవాన్, భాగవతులు మరియు ఆచార్యల ద్వారా ఏర్పడిన సంబంధం) పట్ల అనురాగం లేకపోవడం అడ్డంకులు.
 •  భౌతిక అంశాలలో ఆసక్తి  కలిగి ఉండటం, భగవత్ విషయాలలో  ఆసక్తి లేకపోవడం అడ్డంకులు. భగవత్ విషయాలలో ఆసక్తి పెంచుకొని, లౌకిక అంశాల పట్ల నిరాసక్తి చూపించాలి. పేయాళ్వార్ మూన్రామ్ తిరువంతాది 14 వ పాసురంలో “మార్పాల్ మనం సుళిప్ప మంగైయర్ తోళ్ కైవిట్టు” – శ్రీమన్నారాయణుని పట్ల ఆసక్తి పెరిగినపుడు మన ఆసక్తి స్త్రీల పట్ల (ఇతర లౌకిక సుఖాల పట్ల) అదంతకదే తగ్గిపోతుంది.
 • తమ శారీరక సుఖాల పట్ల ఆసక్తి  కలిగి ఉండటం మరియు తమ ఆచార్యుని  యొక్క శారీరక సుఖాల పట్ల జాగ్రత్త లేకపోవడం. ఉపదేశ రత్నమాల పాసురం 66 లో, “ఆచార్యన్  సిచ్చన్ ఆరుయిరైప్ పేణుమవాన్ తేసారుం సిచ్చన్ అవన్ సీర్వడివై ఆసైయుడన్ నోక్కుమవన్” – ఆచార్యులు  (ఆత్మ, ఆత్మకు సంబంధించిన భక్తి, జ్ఞానం మొదలైనవి) శిష్యులకు పోషించేవారు శిష్యులంటే  ఆచార్యుల దివ్య శరీరాన్ని పోషించేవారు. అనువాదకుల గమనిక: మాముణులు తన ఉపదేశ రత్నమాల పాసురములలో పిళ్ళై లోకాచార్యుల యొక్క శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం యొక్క సారాన్ని చాలా సరళంగా వివరించారు. శ్రీవచన భూషణంలో, ఆచార్యులు శిష్యులు వారు వహించే  పాత్రలను మార్చుకోవడం సముచితం కాదని పిళ్ళై లోకాచార్యులు వివరిస్తున్నారు. అనగా, ఆచార్యుడు శిష్యుని యొక్క ఆత్మ యాత్ర  (ఆధ్యాత్మిక అవసరాలు)పై మాత్రమే దృష్టి పెట్టాలి మరియు శిష్యుడు ఆచార్యుని యొక్క దేహ యాత్ర (శారీరక అవసరాలు) పై మాత్రమే దృష్టి పెట్టాలి.  ఆచార్యుడు శిష్యుని యొక్క శారీరక అవసరాలను తీర్చడానికి ప్రయత్నించడం,  శిష్యుడు ఆచార్యుని యొక్క ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తే రుగ్మత ఏర్పడుతుంది – ఎందుకంటే వారు అలా చేయడం అసహజమైనది కాబట్టి.
 • మనకు భౌతిక సుఖాలు మొదలైనవాటినిచ్చే వారి పట్ల స్నేహము కలిగి ఉండటం,  తిరుమంత్రం యొక్క సారాంశాన్ని ప్రసాదించిన  ఆచార్యుని పట్ల అనురాగం లేకపోవడం అవరోధాలు. ఇక్కడ భౌతిక సుఖాలు అంటే ఆహారం, బట్టలు, ఇల్లు మొదలైనవి. తిరుమంత్రం అంటే అష్టాక్షరం. అవసరమైన జ్ఞానం అందులో ఇమిడి ఉన్నందున పెరియ తిరుమంత్రంగా కీర్తింపబడింది.
 • మనముండే ప్రదేశంపై అనురాగం కలిగి ఉండుట, అచార్యులు నివసించే ప్రదేశంపై అనురాగం లేకపోవడం అడ్డంకులు. మన సొంత ఇల్లు, పట్టణం మొదలైన వాటి కంటే అచార్యులు ఉన్న ప్రదేశంపైన ఎక్కువ మక్కువ ఉండాలి. అనువాదకుల గమనిక: ఈ సందర్భంగా మాముణులను గుర్తు చేసుకోవచ్చు. వారు తమ ఉపదేశ రత్నమాల పాసురం 64 లో – “తన్ ఆరియనుక్కుత్ తాన్ అడిమై చెయ్వతు అవన్ ఇన్నాడు తన్నిల్ ఇరుక్కుం నాళ్, అన్నేర్ అఱిన్తుం అతిల్ ఆసైయిన్ఱి ఆచారియనైప్పిరిన్తిరుప్పార్ ఆర్? మనమే పేసు” – మన ఆచార్యులను ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకే వారిని సేవించగలము. ఇది తెలుసుకున్న తరువాత కూడా, తమ ఆచార్యుని నుండి దూరంగా ఎవరు ఉంటారు?
 • దేహ యాత్ర (లౌకిక జీవితం) లో ఆసక్తి కలిగి ఉండటం, ఆత్మ యాత్ర (ఆధ్యాత్మిక జీవితం) లో ఆసక్తి లేకపోవడం అడ్డంకులు. శరీర అవసరాలు తీర్చుకోవడం శ్రీవైష్ణవులకు తగినది కాదు. భగవాన్, భాగవతులు, ఆచార్యులకు సేవ చేయడం వంటి ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి ఉండాలి.
 • భగవాన్, భాగవతుల పట్ల ద్వేషభావం ఉండుట, పిల్లలు, భార్య మొదలైన వారిపై ఎక్కువ ఆసక్తి  కలిగి ఉండటం ఒక అడ్డంకి. భార్యా పిల్లలు మొదలైన వారితో శాస్త్రంలో అనుమతించబడినంత సంబంధం మాత్రమే ఉండాలి (వారికి ప్రాథమిక అవసరాలు – ఆహారం, ఇల్లు, బట్టలు మొదలైనవి తీర్చడం వంటివి) కాని వారితో ప్రేమపూర్వక సంబంధం ఉండకూడదు. భగవత్ / భాగవత విషయాల పట్ల ఆసక్తి చూపే భార్యా పిల్లలు మొదలైన వారిపై ప్రేమ భావంతో ఉండటంలో తప్పులేదు, ఎందుకంటే వారు భాగవతులుగా ఉండేందుకు అర్హతగలవారు కాబట్టి.
 • అర్చావతార ఎమ్పెరుమాన్ మరియు ప్రధాన దేవాలయాలు / దివ్య దేశములు – కోయిల్ (శ్రీరంగం), తిరుమలై (తిరుమల – తిరుపతి) మొదలైన వాటి పట్ల అనుబంధం/ఆసక్తి లేకపోవడం అడ్డంకులు. అర్చావతారాన్ని తిరుమంగై  ఆళ్వారులు తమ తిరునెడుంతాణ్డగంలో ఇలా కీర్తించారు “పిన్నానార్ వణంగుం సోతి” –  విభవావతారాల (శ్రీ రాముడు, కృష్ణ, మొదలైన) అవతారాల దర్శనాన్ని కోల్పోయిన వారికి ఒక జ్యోతి వంటిది. అర్చావతార భగవానుడు మన ఆశ్రయంలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. మన ఆళ్వారులు మరియు ఆచార్యులకు దివ్య దేశాల  అర్చావతార భగవానుని పట్ల గొప్ప ప్రెమానుబంధం, భక్తి ఉండేది. అటువంటి దివ్యదేశాలలో కూడా కోయిల్ (శ్రీరంగం), తిరుమలై (తిరుమల – తిరుపతి), పెరుమాళ్ కోయిల్ (కాంచిపురం) మరియు తిరునారాయణపురం (మేల్కోటె) వంటి క్షేత్రాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉండాలి.  అనువాదకుల గమనిక:  శ్రీరంగం వంటి దివ్య దేశాలు ఇతర దివ్య దేశాలకన్నా ఎక్కువగా కీర్తింపబడినప్పుడు, మిగిలిన ఇతర దివ్య దేశాలు తక్కువ అని కాదు.  ఉదాహరణకు, శ్రీరంగం మన సాంప్రదాయం యొక్క ప్రధాన కార్యాలయంగా ఉండేది. ఆళ్వారులు/ ఆచార్యులకు ఆ దివ్యదేశం పట్ల మహాసక్తి ఉండేది. వాళ్ళ అటువంటి అనుబంధం కారణంగా, శ్రీరంగం ఇతర దివ్య దేశాల కంటే ఎక్కువ ప్రాముఖ్యతను పొందింది.
 • ఇతరుల మంత్రాల పట్ల ఆసక్తి కలిగి ఉండటం, మంత్ర రత్నం పట్ల భక్తి లేకపోవడం అవరోధం. మంత్రరత్నం అంటే ద్వయ మహామంత్రం. ఇది రహస్య త్రయం (తిరుమంత్రం, ద్వయం మరియు చరమ స్లోకం) గురించి మాట్లాడుతున్నట్లు మనం పరిగణించవచ్చు. వీటిని ఆచార్యుల నుండి ఉపదేశ రూపంగా తీసుకోవాలి.  ఈ రహస్య త్రయం జీవాత్మ యొక్క స్వభావాన్ని స్పష్టంగా వివరిస్తుంది, జీవాత్మను మోక్ష మార్గం వైపు నిమగ్నమైయ్యేలా చేస్తుంది.  అనువాదకుల గమనిక: పూర్వ దినచర్యలో, దేవరాజ గురు (ఎఱుంబి అప్పా) మణవాళ మాముణుల దివ్య లీలలను లిఖితపూర్వకంగా నమోదు చేశారు. 9వ శ్లోకంలో, వారు ఇలా కీర్తించారు – “మంత్ర రత్న అనుసంధాన సంతత స్పురితాధరం తదర్త్ తత్వ నిధ్యాన సన్నద్ద పులకోద్గమం” –  మాముణుల పెదాలు నిరంతరం ద్వయ మహామంత్రానుసంధానం (మంత్ర రత్నంగా కీర్తించబడింది) చేస్తూ ఉండేవి,  ద్వయం యొక్క అర్ధాలను నిరంతరం ధ్యానం చేస్తూ ఉండటం వలన వారి శరీరం దివ్య భావ స్పందనలను వ్యక్తం చేస్తుండేవి (ఇది తిరువాయ్మొళి  తప్ప మరేదో కాదు). తిరువాయ్మొళి ద్వయ మహమంత్రం యొక్క పూర్తి వివరణ తప్ప మరొకటి కాదని నాయనార్ వివరించారు. ఇది ఆచార్య హృదయం చుర్ణిక 210లో వివరించబడింది. ఈ విధంగా, మంత్రరత్నం పట్ల మాత్రమే మన సంపూర్ణ ధ్యానం/ద్యాస ఉండాలి. ఈ రోజుల్లో, ఇతర సంప్రదాయాల వారితో సంభాషణలు వార్తాలాపాల కారణంగా శ్రీవైష్ణవులు ఇతర మంత్రాలచే ప్రభావితమవుతున్నట్లు మనం గమనించవచ్చు. ఇలాంటి పద్ధతులను మానుకొని మన పూర్వాచార్యుల ఆదర్శాలను అనుసరించడం మంచిది.
 • ఇతర మంత్రాలను ఇచ్చేవారి పట్ల అనురాగం కలిగి ఉండటం మరియు పెరియ (పెద్ద) తిరుమంత్రం ఇచ్చేవారి పట్ల అనురాగం లేకపోవడం. పెరియ తిరుమంత్రాన్ని (అష్థాక్షరం) ప్రసాదించిన వారిని ఆచార్యుడు అంటారు. ఇక్కడ ఇతర మంత్రాలంటే ఉపాసన కొరకు ఉపయోగించే మంత్రాలని అర్థం. మన ఆచార్యలు లౌకిక ప్రయోజనాల కోసం మంత్రాలను పఠించమని, అలాంటి మంత్ర జపం (లెక్క పెట్టమని) చేయమని, హోమాలలో పఠించమని ఎప్పుడూ చెప్పలేదు. అందువల్ల, పెరియ తిరుమంత్రాన్నిఉపదేశించిన ఆచార్యుల పట్ల ఆసక్తి/అనురాగం ఉండాలి.        అనువాదకుల గమనిక: తిరువాయ్మొళిలో, నమ్మాళ్వార్ మొదట శ్రీమాన్నారాయణ నామాన్ని 1.2.10వ పాసురంలో సూచించారు “ఎణ్ పెరుక్కన్నలత్త్ ఒణ్ పొరుళిరిల వణ్ పుగళ్ నారణన్ థిణ్ కళల్ సేరే” – శ్రీమాన్నారాయణుని చారణాలకు శరణాగతి చేయాలి –  శ్రీమాన్నారాయణ అందరి అంతర్యామి, అన్ని శుభ లక్షణాలతో నిండినవాడు, తన భక్తులను రక్షించడంలో ఎప్పుడూ విఫలం కానివాడు. ఈడు మహ వ్యాఖ్యానం అవతారిక (పరిచయం) లో, నంపిళ్ళై ఈ పాసురార్థాన్ని ఇలా వివరించారు. భగవాన్ని చేరుకునేందుకు తిరుమంత్రం (అష్టాక్షరం) ఒక భజన సాధనం (భక్తి సాధనం) అని అంటున్నారు. మరింత వివరిస్తూ, మన పూర్వాచార్యులు ఈ మంత్రం యొక్క దివ్య అర్ధాలపై దృష్టి కేంద్రీకరించి, ఉద్ధరింపబడి, వారి శిష్యులకు అదే సూచించారు, కాని ఈ మంత్రాన్ని జపం, యాగం, హోమాలు మొదలైన వాటిలో ఉపయోగించి వారి కోరికలను తీర్చుకోడానికి ప్రయత్నిస్తునారు. తిరుమంత్రాన్ని (లేదా ఏదైనా మంత్రం) ఉపయోగించి చేసినా, అలాంటి జపాలు, హోమాలు మొదలైన వాటిలో మనం పాల్గొనకూడదని ఇది నిర్ధారిస్తుంది. అలాగే, పిళ్ళై లోకాచార్యులు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం 315 వ సూత్రంలో, పెరియ తిరుమంత్రాన్ని (రాహస్య త్రయం యొక్క భాగం) సూచించిన వ్యక్తి  మన ఆచార్యుడని వివరిస్తున్నారు.

62. భక్తి విరోధి  –  భక్తి లో అవరోధాలు.
 
భక్తి అంటే ఉన్నతమైన వ్యక్తి  పట్ల ఆప్యాయత. భగవాన్ పట్ల ఆస్తికుడికి (శాస్త్రాన్ని నమ్మేవాడు) ఉన్న శ్రద్దను భక్తి అంటారు. దీనిని కాదల్ (తమిళంలో ప్రేమ) అని కూడా వివరించబడింది.  శాస్త్రంలో మోక్ష సాధనానికి భక్తిని ఉపాయంగా వర్ణించారు – దీనిని సాధన భక్తి అంటారు. భగవాన్ యొక్క నిజ స్వభావాన్ని అర్థం చేసుకున్న తరువాత, వారిని ప్రేమతో నిరంతరం ధ్యానించడాన్ని భక్తి యోగం అని పిలుస్తారు, దీనిని మోక్ష సాధనం (అంటే మోక్షం పొందడం) గా వివరించబడింది. అర్హతగల వ్యక్తులు మాత్రమే భక్తి యోగంలో పాల్గొనగలరు. అనువాదకుల గమనిక: సాధన భక్తిని త్రి-వర్ణికులు (మూడు వర్ణాలు – బ్రహ్మణ, క్షత్రియ, వైశ్యులు) మాత్రమే చేయగలరు, ఎందుకంటే దీనికి కర్మ,  జ్ఞాన యోగాలు అంగాలు (భాగాలు) గా ఉంటాయి, వారు మాత్రమే చేయగలవు.

ఆళ్వారులకు (వారు అత్యున్నతమైన భక్తులు) భక్తి  భగవాన్ చేత అనుగ్రహించబడింది. తిరువాయ్మొళి ప్రారంభంలోనే నమ్మాళ్వార్  1.1.1వ పాసురంలో “మయర్వఱ మతినలం అరుళినన్” – భగవాన్ మచ్చలేని జ్ఞానం / భక్తితో నన్ను ఆశీర్వదించారు – ఇది భగవాన్ యొక్క అనియమిత కృప యొక్క ఫలితం. ఎమ్పెరుమానార్ తమ శ్రీ భాష్యం మంగళ స్లోకంలో అదే విధంమైన భక్తిని ప్రసాదించమని భగవాన్ని ప్రార్థించారు – “భవతు మా పరస్మిన్ సేముశీ భక్తి రూపా”. భగవాన్ తమ భక్తులకు అలాంటి భక్తిని ఆశీర్వదిస్తాడు కాబట్టి, అలాంటి భక్తి  ప్రాప్యం (అంతిమ లక్ష్యం – కైంకర్యం) లోని భాగం అవుతుంది. కాబట్టి దీనిని సాధ్య భక్తి అని పిలుస్తారు ( వ్యక్తి యొక్క ప్రార్థనల ఆధారంగా భగవాన్ చేత ఆశీర్వదించబడిన భక్తి). అటువంటి సాధ్య భక్తి అనేది సాధన భక్తికి భిన్నంగా ఉంటుంది. అనువాదకుల గమనిక: ఆచార్య హృదయంలో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ వివిధ రకాల భక్తిని మరియు నమ్మాళ్వార్  యొక్క (ఇతర ఆళ్వారుల) భక్తి స్వభావాన్ని చర్ణికలు 95 నుండి 102 వరకు, ఇంకా ఆ తరువాత వాటిలో కూడా అందంగా స్థాపించారు. మాముణులు ఈ దివ్య సూత్రాలకు వ్యాఖ్యానాలని మనకు అశీర్వదించారు, ఆ వ్యాఖ్యానాల సహాయంతో మనం ఈ సూత్రాలను అర్థం చేసుకోగలుగు తాము.  భక్తి  3 రకాలుగా గుర్తించబడింది –  సాధన భక్తి, సాధ్య భక్తి మరియు సహజ భక్తి.

 • మన సొంత ప్రయత్నాల ద్వారా పెంచుకున్న భక్తిని సాధన భక్తి అంటారు. భగవానుని చేరుకునేందుకు భక్తి  ఉపాయంగా నిర్వహిస్తారు – దీనిని శాస్త్రాంలో భక్తి యోగం అంటారు.
 • ఆళవందార్, ఎమ్పెరుమావార్, మొదలైన మన గొప్ప పూర్వచార్యులు శుద్దమైన సాధ్య భక్తిని  కోరుకున్నారు. ఈ మన ఆచార్యలు అప్పటికే భగవానుకి పూర్తి శరణాగతులై  భగవాన్ను మాత్రమే ఉపాయంగా స్వీకరించారు. అలాంటి సాధ్యా భక్తిని ఆహారానికి ఆకలిలాగా పరిగణిస్తారు – ఆకలి ఉన్నప్పుడు మాత్రమే సంతృప్తిగా తినగలరు, అదేవిధంగా, స్వచ్ఛమైన భక్తి ఉన్నప్పుడు మాత్రమే, వారు చేసే కైంకర్యం (సేవ) పూర్తి సంతృప్తినిస్తుంది. కావున, ఈ సాధ్య భక్తి వారి కైంకర్యంలో భాగమవుతుంది.
 • సహజ భక్తి అంటే జన్మతహా పుట్టుకతో వచ్చిన స్వచ్ఛమైన భక్తి. ఉదాహరణకు, నమ్మాళ్వార్  భగవాన్ పట్ల ఉత్యున్నతమైన శుద్ద భక్తితో జన్మించారు, అలాంటి భక్తిని భగవాన్ స్వయంగా వారికి అనుగ్రహించారు. సహజ అంటే “వారితో పాటు జన్మించినది”. ఈ సహజ భక్తి (భగవాన్ కృప కారణంగా అనుగ్రహింపబడినది), సాధన భక్తి (ఇది వారి స్వంత ప్రయత్నంతో సాధించినది), సాధ్య భక్తి (ఇది ప్రార్థనల ఆధారంగా భగవాన్ను మెప్పించి సాధించినది, కైంకర్యంలో భాగంగా ఉపయోగించబడుతుంది) ఇవన్నీ భిన్నమైనవి. అందువల్లనే ఆళ్వారులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది – భగవాన్ కృప కారణంగా గొప్ప భక్తిని వారు పొందారు కాబట్టి.

ఈ పరిచయంతో, ఈ విభాగంలో చర్చించబడిన విభిన్న అంశాలకు చూద్దాం.

 • ఎమ్పెరుమాన్ సాధించడానికి భక్తిని సాధనం (ఉపాయము) గా పరిగణించడం ఒక అడ్డంకి. మన భక్తిని మోక్ష సాధనంగా భావించినప్పుడు, స్వయం ప్రయత్నం చేసినట్లవుతుంది. కానీ ఏదైనా సాధించడానికి సొంత ప్రయత్నం చేసినపుడు అది నేరుగా శేషత్వం (దాసత్వము), పారతంత్రియం (సంపూర్ణంగా ఆధారపడుట)కు విరుద్ధమవుతుంది. ఆ విధంగా భక్తిని సాధనంగా పరిగణించడం ఒక అడ్డంకి.  అనువాదకుల గమనిక: “భగవాన్” మాత్రమే ఉపాయం అని నిర్ధారించబడింది. మన చరమ శ్లోకం ఇదే సూత్రాన్ని వివరిస్తుంది, చరమ శ్లోకం లోని “మాం ఏకం” (నాకు మాత్రమే) భగవాన్ను మాత్రమే ఉపాయంగా అన్నదానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. కాబట్టి, భక్తిని ఉపాయంగా పరిగణించడం అపరిపూర్ణమైనది.  పిళ్ళై లోకాచార్యులు ఈ సూత్రాన్ని శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం  115వ సూత్రంలో చాలా సమగ్రంగా వివరించారు. అతను “ప్రాపకాంతర పరిత్యాగత్తుక్కు అజ్ఞాన అసక్తి కళన్ఱు, స్వరూప విరోధమే ప్రధాన హేతు” – కర్మ, జ్ఞాన, భక్తి యొగాలను త్యజించుట అవసరం ఎందుకంటే అవి ఆత్మ స్వభావానికి (జీవాత్మ పరమాత్మపైన సంపూర్ణంగా ఆధారపడి ఉంటాడు) విరుద్ధమైనవి, జ్ఞానం / సామర్థ్యం లేక కాదు. సామర్థ్యం ఉన్నవారు భక్తి యోగం చేయవచ్చని, అసమర్థులు భగవాన్‌కి శరణాగతి చేయవచ్చని కొంతమంది అంటారు. ఇటువంటి తత్వాలను మన పూర్వాచార్యులు పూర్తిగా తిరస్కరించారు. సామర్థ్యం ఉన్నా లేకపోయినా, భగవాన్కు శరణాగతి చేసి ఉద్ధరించబడటం జీవాత్మ యొక్క స్వభావం.
 • స్మరణం (చింతన), సంకీర్తనం (గానం) మొదలైనవన్నీ సాధ్యంలో (పరిణామం – కైంకర్యం) భాగమని తెలియకపోవడం ఒక అడ్డంకి. ప్రారంభ భక్తిలో, ఎమ్పెరుమాన్ సహాయపడటానికి వచ్చినప్పుడు జీవాత్మ యొక్క తరపున అద్వేశం (స్వీకరణ) ఉంటుంది. ఎమ్పెరుమాన్ “త్వమ్మే” (నువ్వు నావాడివి) అని అన్నప్పుడు, మనం “అహమ్మే” (నేను నావాడిని) అని అనకూడదు. ఎమ్పెరుమాన్ను తిరస్కరించకూడదనే ఆలోచనలు కూడా భగవాన్ సులభతరం చేస్తారని మనం పరిగణించాలి.
 • మన భక్తిని భౌతిక కోరికలతో కలవనీయకూడదు, శుద్ధ భక్తితో ఉండకపోవడం అవరోధం. ఇతర భౌతిక కోరికలను మన హృదయంలోకి రానివ్వకూడదు. అదేవిధంగా, స్వచ్ఛమైన భక్తి కొరకు నిరంతరం  ప్రయత్నించాలి.
 • ప్రపత్తి మరియు సాధ్య భక్తిని ఒకే విధంగా పరిగణించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ప్రపత్తి అంటే భగవానుకి శరణాగతులై వారిని ఉపాయంగా స్వీకరించడం. ఇంతకు ముందు చూసినట్లుగా, సాధ్యా భక్తి అంటే మన భక్తి శుద్ధి కావాలని భగవాన్ తరపు నుండి ప్రార్థించబడేది – కాబట్టి రెండూ భిన్నమైనవి. ప్రపత్తి మన స్వరూపానికి సంబంధించినది (మనం సహజంగా భగవాన్‌ శరణాగతులము) మరియు సాధ్య భక్తి మన కైంకర్యం ఎంత ప్రేమతో ఎలా చేస్తామో దానికి సంబంధించినది.
 • ఒక ప్రపన్నుడు సాధ్య భక్తి కొరకై ప్రార్థిస్తే, అతని ప్రపత్తి నిష్ఫలమవుతుందని తెలుసుకోక పోవడం ఒక అడ్డంకి. ఈ విషయం స్పష్టంగా లేదు – (డాక్టర్ వి.వి.రామానుజం స్వామి) పెద్దల నుండి విన్నాను, సాధ్య భక్తిని నిర్వహింస్తున్నప్పుడు అది సహజంగా ప్రపత్తిగా ముగుస్తుంది.
 • ఒక ప్రపన్నుడు సాధ్య భక్తి కొరకై  ప్రార్థిస్తే అలాంటి భక్తి వారి కైంకర్యంలో భాగమవుతుందని తెలియకపోవడం ఒక అడ్డంకి. ప్రపన్నులు స్వచ్ఛ భక్తిని కోరుతూ ఎంతో కోరికతో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇది ఆహారం కోసం ఆకలి లాంటిది, ఇది కైంకార్య మార్గాన్ని సులభతరం చేస్తుంది. అనువాదకుల గమనిక: ముముక్షుప్పడిలో, పిళ్ళై లోకాచార్యులు  సూత్రం 271 లో ఒక ప్రపన్నుడికి, వారి కర్మలు – కైంకర్యంలో భాగమవుతాయని, జ్ఞానం – వారి జ్ఞాన విస్తరణలో భాగమవుతుంది, భక్తి – వారు చేసే కైంకర్యం పట్ల రుచి / అనుబంధాన్ని కలగజేస్తుందని వివరించారు. ప్రపత్తి  జీవాత్మ యొక్క సహజ స్వభావంలో భాగమవుతుంది.
 • భగవాన్ చేత అనుగ్రహించబడిన/ఆశీర్వదించబడిన ఆళ్వార్ల భక్తి వారిని నిలబెడుతుందని తెలుసుకోకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: సామాన్య ప్రజలు ఆహారం, నీరు మొదలైన వాటి ద్వారా తమను తాము నిలబెట్టుకున్నట్లే, భగవాన్ చేత దివ్యంగా  అనుగ్రహించబడిన/ఆశీర్వదించబడిన ఆళ్వార్లు భగవాన్ పట్ల ఉన్న భక్తితో వారిని వారు పోషించుకుంటారు/నిలుపుకుంటారు. నమ్మాళ్వార్  తిరువాయ్మొళిలో “ఉణ్ణుం సోఱు పరుగు నీర్ తిన్నుం వెత్తిలై ఎల్లాం కణ్ణన్ ఎమ్పెరుమాన్” – తిరువాయ్మొళిలో శ్రీ కృష్ణుడే అన్నం, నీరు, తమలపాకు అని అంటున్నారు.
 • భగవానుకి మనము అవసరమైన అన్ని పదార్థాలను సమర్పించి వారిని సంతోష పెడుతున్నామని భావించుట, వారి దయతోనే మనము వారికి అన్ని పదార్థాలు సమర్పించగలుగుతున్నామని భావించకపోవుట ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: భగవత్గీత 9.26 లో, భగవాన్ “పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః” – ఒక పుష్పం, పత్రం, పండు లేదా నీరుగానీ భక్తితో సమర్పిస్తే నేను సంతోషంగా స్వీకరిస్తాను.  కాబట్టి, మన భక్తి చాలా ముఖ్యమైన అంశం అని అర్థం చేసుకోవాలి – మనమందించే గొప్ప ఘనమైన పదార్థాలు ముఖ్యం కాదు. భగవాన్ సర్వాధికారి – మనం కొత్తగా వారికేమీ ఇవ్వలేము. మిగతా వాటికన్నా ఎక్కువగా వారిని మెప్పించేది వారు మననుండి ఆశించేది మన భక్తి మాత్రమే.
 • మన హృదయాలలో భగవాన్ పట్ల భక్తి, అటువంటి  పరమ భక్తి (వీడి ఉండలేనంత దశ) అన్నీ భగవాన్ దయ యొక్క ఫలితం అని తెలియకపోవుట ఒక అడ్డంకి. ఎమ్పెరుమానార్ అటువంటి పరమ భక్తిని ప్రసాదించమని  శ్రీరంగనాథుని గాధ్యంలో ప్రార్థించారు – “పరభక్తి పరజ్ఞాన పరమభక్తి యుక్తం మామ్ కురుష్వ” అనువాదకుల గమనిక: ఆచార్య హృదయంలో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ చూర్ణిక 104 లో భగవాన్ను భక్తి ఉళవన్ (భక్తి యొక్క రైతు) అని పిలుస్తున్నారు – ఒక వరి రైతు భూమిని దున్ని, విత్తనాలు నాటి, నీళ్ళు పోసి, ఎరువులేసి, కలుపు మొక్కలను తీసేసి, పంటను కోసి చివరికి ధాన్యం ఇంటికి తీసుకువస్తాడు, భగవాన్ కూడా నిరంతరం జీవత్మను సంస్కరిస్తాడు, భక్తి యొక్క బీజాలను నాటి, జివత్మాకు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అనేక అవకాశాలనునిస్తాడు, అడ్డంకులను తొలగించడంలో సహాయపడతాడు, ఒకసారి జీవాత్మాలో భక్తి పరిపక్వం చెందినతరువాత చివరికి జీవాత్మకు మొక్షాన్ని  అనుగ్రహించి శాశ్వత కైంకర్యాన్ని జీవాత్మకు ప్రసాదిస్తాడు.
 • ఇతర ఉపాయాలను వదిలేసి భగవాన్ పట్ల పూర్తి విశ్వాసం ఆధారంగా వారినే ఉపాయంగా  స్వీకరించడం వలన మన సహజ స్వభావానికి ఎటువంటి హాని కలగదని తెలియకపోవుట ఒక అడ్డంకి. భగవాన్ స్వయంగా భగవద్గితలో “సర్వ ధర్మాన్ పరిత్యజ్య” (అన్ని ధర్మాలను త్యాగం చేసి)  చెప్పినట్టుగా కర్మ, జ్ఞాన, భక్తి యోగాలను ఉపాయాలుగా త్యాగం చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే వారి ఆజ్ఞానుసారంగానే వారిని ఆశ్రయిస్తున్నాము కాబట్టి.
 • స్వచ్ఛమైన మనస్సుతో భక్తితో మంగళాసాసనం చేయడం జీవాత్మ స్వభావానికి తగినదని తెలియకపోవడం ఒక అడ్డంకి. భగవాన్ కు “మీకు అన్నీ శుభాలు కలగాలి” అని చెప్పడం అనుచితంగా అనిపించవచ్చు ( వారు అన్ని శుభాలకూ శుభప్రదమైనవాడు కాబట్టి). కానీ ఎమ్పెరుమానుని సంపూర్ణ శరణాగతులు ఎమ్పెరుమాన్ యొక్క సౌందర్యాన్ని,  మృదు స్వభావాన్ని మొదలైనవి చూసి, ఇలాంటి ఈ భగవానుడికి ఏదైనా అశుభం కలుగుతుందేమోనని కలవరపడి మంగళాశాసనాలుపాడతారు. మాముణుల ఉపదేశ రత్న మాలలో ఇలా అన్నారు  “పొంగుం పరివాలే విల్లిపుత్తూర్ పట్టర్పిరాన్ పెత్తాన్  పెరియాళ్వార్ ఎన్నుం పెయర్” – భగవాన్ పట్ల పట్టర్పిరాన్ యొక్క ఉప్పొంగుతున్న భక్తి కారణంగా అతనికి పెరియాళ్వార్ (పెద్ద ఆళ్వార్) అనే పేరు వచ్చింది.  మధురైరాజు ఆస్థానంలో శ్రీమనారాయణ యొక్క ఆధిపత్యాన్ని వారు స్వయంగా స్థాపించినప్పటికీ, బయటకు వచ్చినపుడు, వారిని ఆశీర్వదించడానికి గరుడ వాహనంపై భగవానుడిని రావడం చూసి, అతను “పల్లాండు పల్లాండు ..ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాప్పు”(చిరంజీవి చిరంజీవి, మీ పాద పద్మాలు సురక్షితంగా ఉండుగాక) అని పాడటం మొదలుపెట్టారు. ఇది జీవాత్మ స్వభావానికి విరుద్ధం కాదు – వాస్తవానికి ఇది జీవాత్మా యొక్క నిజమైన స్వభావానికి ఖచ్చితంగా సరిపోతుంది. దీనిని శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో వివరించబడింది. ఈ అంశాన్ని ఆచార్యుల వద్ద అధ్యయనం చేయవచ్చు.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/06/virodhi-pariharangal-28.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s