విరోధి పరిహారాలు – 31

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/04/23/virodhi-pariharangal-30/

65. సమర్పణ విరోధి – మన సమర్పణలలో అవరోధాలు 

                                                              నమ్మాళ్వార్, ఆళవందార్, ఎమ్పెరుమానార్

అర్పణం అంటే సమర్పించడం / అర్పించడం అని అర్థం. సాధారణంగా, భగవానుడు, ఆచార్యులు మొదలైన గొప్ప వ్యక్తులకు అర్పించడాన్ని “సమర్పణం” అని అంటారు. ఇది సాధారణంగా వైధిక వేడుకలలో కనిపిస్తుంది, మనం  శ్రీవైష్ణవులకు ఏదైనా సమర్పించినప్పుడు, “శ్రీవైష్ణవేభ్యో సంప్రదతే – న మమ” అని అంటాము.  “ఇది ఇప్పుడు శ్రీవైష్ణవులకు ఇవ్వబడింది, ఇకపై నాది కాదు” అని అర్థం . ఈ విభాగంలో, ఆత్మ సమర్పణం గురించి వివరంగా చర్చించి స్పష్టం చేయబడింది. ఆత్మ సమర్పణం అంటే  ఎమ్పెరుమాన్ పాద పద్మాల వద్ద తమను తాము అర్పించుకోవడం అని అర్థం. తిరువాయ్మొళి 2.3.4 లో, నమ్మాళ్వారు ఇలా అన్నారు,  “ఎనాధవి తంతొళిన్తేన్….ఇని మీళ్వతెన్బతుణ్డే” – (నన్ను నేను అర్పించుకున్నాను…తిరిగి వచ్చే ప్రసక్తేలేదు) అని తనను తాను భగవానుడికి అర్పించారు.  ఆళ్వార్ అడుగుజాడలను అనుసరించి, ఆళవందార్ స్తోత్ర రత్నం 52వ స్లోకంలో “తదయం తవ పాద పద్మయోః అహం అద్యైవ మయా సమర్పితః” అని తనను తాను భగవానుడి పాద పద్మాలకు అర్పించారు. అనువాదకుల గమనిక: మధురకవి ఆళ్వార్ కణ్ణినుణ్ చిఱుత్తాంబు 5వ పారురంలో,  “నంబినేన్ పిరార్ నన్పొరుళ్ తన్నైయుం” – భగవానుని (పిరార్ – ఇక్కడ భగవాన్ అని అర్థం) ఆస్తి అయిన నెను, నా సంపద అని భావించి నాపైన నెను (నన్పొరుళ్ – ఆత్మ) అనురాగం పెంచుకున్నాను. జీవాత్మ పరమాత్ముని సంపద. భగవాన్ యజమాని, జీవాత్మ సంపద. అలా ఆలోచిస్తే జీవాత్మ తనను తాను భగవానుడికి ఎలా సమర్పించుకుంటాడు (అప్పటికే భగవాన్ యజమాని అయినప్పుడు?). రాత్రికి భగవానుడి తిరుఆభరణాన్ని దొంగిలించి మర్నాడు ప్రొద్దున వెళ్లి గొప్ప గర్వంతో మన సొంత వస్తువు భగవానుడికి సమర్పిస్తున్నట్టుగా భావించుటగా మన పూర్వాచార్యులు ఈ చర్యను వివరిస్తున్నారు. అయినప్పటికీ, మన ఆళ్వారులు మరియు ఆచార్యులు ఇలాంటి చర్యలో పాల్గొన్నారు. దీన్ని మన పూర్వాచార్యులు చాలా అందంగా వివరించారు. తిరువాయ్మొళి 2.3.4 లో, ఆళ్వారు మొదట భగవాన్కు తనను తాను అర్పించినప్పటికీ, పాసురం యొక్క తరువాతి భాగంలో వారు వెంటనే తన తప్పును గ్రహించి, ఎమ్పెరుమాన్ “ఎనదావియార్? యాన్ ఆర్? తండ నీ కొండాక్కినైయే” – నేను ఎవరు? నేను ఇప్పటికే మీ స్వంతం. మీరు ఇప్పుడు మీ స్వంత ఆస్తినే స్వీకరిస్తున్నారు. వ్యాఖ్యానంలో, సమర్పణం లేకపోతే, అది సర్వ ముక్తి ప్రసంగానికి దారి తీస్తుందని నంపిల్లై వివరిస్తున్నారు (శరణాగతి చేసే అవసరం లేకుండా ఎమ్పెరుమాన్ ప్రతి ఒక్కరినీ పరమపాదానికి తీసుకువెళ్లాలి). కానీ మనం ఆత్మ సమర్పణం చేస్తే అప్పుడు భగవానుకి వారి సొంత ఆస్తిని సమర్పించినట్లవును. నంపిళ్ళై గారు వివరణ ఇస్తూ – సంసారంవైపు చూసి, ప్రపన్నులు ఒక్కోసారి  భయపడతారు, వారు తమను తాము అర్పించడం ద్వారా ఎమ్పెరుమానుకి శరణాగతులమని చెప్పారు – ఇది చాలా గందరగోళమైన స్థితి (సంసారంవైపు చూసి భయపడటం) గా వివరించబడింది. కానీ, వారు భగవాన్ని చూసినప్పుడు, వారి భయం పూర్తిగా కనుమరుగవుతుంది – ఎందుకంటే వారు భగవాన్ యొక్క సంపద అని, వారు తన ఆశ్రితులను రక్షించగల సామర్థ్యం గల వాడని గుర్తుకువస్తుంది, అప్పుడు వారు భగవాన్ యొక్క సొంత సంపదను వారికే ఇవ్వడం ద్వారా గొప్ప తప్పు చేశారని వారు గ్రహిస్తారు. ఆత్మా సమర్పణం చేసిన తప్పుకు పశ్చాత్తాప పడతారు. వారు సంసారంలో ఉన్నంత కాలం ఇది నిరంతరం జరుగుతుంది – ఎందుకంటే వారు సంసారం మరియు భగవాన్ ఇద్దరినీ మళ్లీ మళ్లీ చూస్తున్నారు కాబట్టి. ఇదే సూత్రాన్ని ఆళవందార్  కూడా ప్రస్తావించారు – స్తోత్రరత్నం 52వ శ్లోకంలో వారు తనను తాను అర్పిస్తున్నారు, కాని 53వ శ్లోకంలో వారు భగవాన్ని అడుగుతారు ” అతవా కిం ను సమర్పయామి” ఔరా! నేను ఎవర్ని? నేను నీకు ఏమి అర్పిస్తున్నాను? నాకు యజమాని అయిన మీకు నేను సమర్పించే స్వాతంత్ర్యం నాకు లేదు. ఈ శ్లోకానికి పెరియవాచ్చాన్ పిళ్ళై తన వ్యాఖ్యానంలో ఇచ్చిన ఈ వివరణ. ఈ విధంగా, ఆత్మ సమర్పణం వాస్తవానికి జీవాత్మాకు తగిన చర్య కాదని మనం చూడవచ్చు, అయినప్పటికీ అజ్ఞానం వల్ల జరుగుతుంది మరియు  జీవత్మ పరమాత్మ అధీనుడన్న నిజమైన స్వభావ సాక్షాత్కారం వచ్చిన తర్వాత పశ్చాత్తాపం చెందుతాడు. ఈ పరిచయంతో విభాగంలోకి ముందుకు వెళ్దాం.

 • అహంకారం (దేహాన్ని ఆత్మగా పరిగణించుట) మరియు మమకారం (భగవాన్ సంపత్తిని తనదిగా భావించుట) ఇవి రెండూ జీవాత్మను మరియు జీవాత్మకు చెందినవి,  భగవాన్ మరియు భాగవతులకు అర్పించకుండా అనాదిగా ఆపుతున్నాయి. తాను స్వతంత్రుడని భావించడం మహాపాపం. అసలు నిజం ఏమిటంటే “అన్నీ / అందరూ భగవాన్ సొంతం”. నమ్మాళ్వారు తిరువాయ్మొళి 2.9.9 లో ఇలా అన్నారు “యానే ఎన్నై అఱియగిళాతే యానే ఎంతనతే ఎన్ఱిరుంతేన్” – ఇంతకు ముందు నేనెవరో నాకు తెలియదు, నన్ను నేను స్వతంతృడని భావించాను – అది జీవత్మా యొక్క యధార్థ స్వభావాన్ని గ్రహించక ముందు ఉన్న స్థితి. అదే పాసురంలో నమ్మాళ్వారులు  ఇలా అంటున్నారు “యానే నీ ఎన్నుడైమైయుం నీయే” – నేను నీ సొంతం మరియు నా శరీరం కూడా నీ సొంతం – ఇది జీవత్మా యొక్క నిజమైన స్వభావాన్ని గ్రహించిన తరువాత ఉన్న స్థితి. తిరువాయ్మొళిలో నమ్మాళ్వారు ప్రతి ఒక్కరికీ ఇచ్చిన మొట్ట మొదటి ఉపదేశము 1.2.2 లో ఉంది “నీర్ నుమతు  ఎన్ఱివై వేర్ ముతల్ మాయ్ త్తు” – అహంకర మమకారాలను సంపూర్ణంగా వదులుకోవాలి. అనువాదకుల గమనిక: ఆధ్యాత్మిక ప్రయాణంలో నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏమిటంటే, ఆత్మ దేహానికి (శరీరానికి)  భిన్నమైనదని స్పష్టంగా అర్థం చేసుకోవడం. మనము శాశ్వతమైన ఆత్మలము, మన శరీరాలకు భిన్నమైన వాళ్ళము. చాలా మంది ఆత్మ మరియు శరీరం మధ్య తేడాను గుర్తించ కుండా శారీరక ధోరనిలో ఎల్లప్పుడూ కృషి చేస్తుంటారు. రెండవది, భగవాన్ సర్వ స్వతంత్రుడని సర్వాధికారి (చిత్, అచిత్) అని మనం అర్థం చేసుకోవాలి. ఈ సమస్థ సృష్టిలో మన స్వంతం ఏమీ లేదు. ఈ రెండు సూత్రాలపై సరైన అవగాహన ఉంటే, యావత్తు సృష్థికి అధిపతి అయిన భగవాన్ ప్రీతి కొరకు మనం సహజంగా కృషి చేస్తాము. ఈ రెండు (అహంకార మమకారాలు) మన ఆధ్యాత్మిక పురోగతిలో అతిపెద్ద అవరోధాలు. శ్రీ కృష్ణుడు  భగవత్గీతలో అర్జునుడికి ఆత్మ సాక్షాత్కారం యొక్క దివ్య జ్ఞానాన్ని ఉపదేశించడం ప్రారంభించినప్పుడు దీనిని స్పష్టంగా వివరించారు. 2.12 లో వివరించడం ప్రారంభిస్తూ – ఆత్మ దేహానికి భిన్నమైనది, అసంఖ్యాక ఆత్మలు ఉన్నాయి, ప్రతి ఆత్మ ఇతరులకన్నా భిన్నంగా ఉంటుంది, భగవాన్ మహోన్నతుడు. ఆచార్యుల ద్వారా శరణాగతి చేసిన తరువాత కూడా, ఈ రెండు అడ్డంకుల వల్ల మనం తరచుగా కలవరపడవచ్చు. మనం శరీరాలకు భిన్నమైన జీవాత్మలు అని నిరంతరం గుర్తుంచుకోవాలి, మనం భగవాన్ మీద ఆధారపడి ఉన్నాము. ఈ స్థిరమైన భావనతో,  మనం సరైన పద్ధతిలో నడుచుకోవచ్చు.
 • భగవాన్ దాసుడని అని తెలుసుకున్న తర్వాత కూడా, ఆ వస్తువు తన సొంతమని భావించుట ఒక అడ్డంకి. భగవాన్ సేవకుడిగా నిజమైన స్వభావం గురించి గ్రహించిన తర్వాత,  తనకు చెందిన ప్రతిదీ సహజంగానే భగవానుడికి మాత్రమే చెందుతుంది. కాబట్టి, సంకోచం లేకుండా ప్రతిదీ భగవాన్కు అర్పించాలి.
 • మనం యజమానులము అనే ఆలోచనతో భగవానుడికి అర్పించడం ఒక అడ్డంకి. ప్రతిదీ భగవాన్ యాజమాన్యంలో ఉంది అనేది నిజం. మనల్ని మనం యజమానులుగా భావించడం సంశయానికి గురిచేసే స్థితికి దారితీస్తుంది. భగవాన్ యాజమాన్యంలో ప్రతిదాన్ని పరిగణించడం మనస్సు యొక్క స్పష్టమైన స్థితికి దారితీస్తుంది. అనువాదకుల గమనిక: పరిచయ భాగంలో ఇప్పటికే వివరంగా వివరించబడింది.
 • భగవాన్ యొక్క ఆస్తిని దొంగిలించడం (వారి స్వంత ఆనందం కోసం ఆత్మ మరియు దేహము ఉపయోగించడం) వాటిని భగవాన్కు సమర్పించడం ఒకటే అన్న మునుపటి మన అజ్ఞాన స్థితి గురించి తెలియకపోవడం ఒక అడ్డంకి. భగవానుడికి తనను అర్పించుకోవడం, రాత్రి ఆలయం నుండి ఒక విలువైన ఆభరణాన్ని దొంగిలించి, ఉదయాన్నే భగవానుడికి అర్పించడంతో పోల్చబడింది. అనువాదకుల గమనిక:  తనను (ఆత్మ) తాను స్వతంతృనిగా పరిగణించుట మరియు దాని ప్రకారంగా వ్యవహరించుట పెద్ద దొంగతనం / పాపంగా శాస్త్రంలో  వివరించబడింది – దీనిని మహాభారతంలో “కిం తేన న కృతం పాపం చోరేణ ఆత్మాపహారిణా” – ఆత్మను (భగవాన్ యొక్క ఆస్తి) తమ సొంతమని భావించేవాడు అన్ని రకాల దొంగతనాలు / పాపాలు చేసినట్లుగా భావించాలి అని చెప్పబడింది. ఇది అర్పణకు ముందు లేదా సమర్పణ సమయంలో అయినా, ఆత్మ తన సొంతం అనే ఆలోచన ఉంటే, అది తగనిదిగా పరిగణించబడుతుంది.
 •  “నేను ఇప్పటికే తన ఆస్తి, నేను వారికి ఎలా సమర్పించగలను?” అన్న ఆలోచనతో తనను తాను అర్పించక పోవుట. మన పూర్వాచార్యులు తమను తాము అర్పించినప్పటికీ. ఆత్మ సమర్పణం మన పూర్వాచార్యులు చేత చేయబడింది. అలవందార్ “అహం అధ్యైవ మయా సమర్పిత:”. అయినప్పటికీ, ఆత్మ భగవాన్ యాజమాన్యంలో ఉన్నప్పటికీ, మనం ఆయనకు తమనుతాము అర్పించాలి. కానీ అలవందార్లు పశ్చాత్తాప పడి తరువాతి స్లోకంలో “అథవా కిం ను సమర్పయామి” అని అంటున్నారు.  నేను పూర్తిగా మీ స్వంతమని నేను గ్రహించిన తర్వాత, నన్ను నేను మీకు ఎలా సమర్పించగలను? అని ఇక్కడ అంటున్నారు.  నమ్మాళ్వారులు కూడా మొదట ఆత్మ సమర్పణం ప్రదర్శించి ఆ తరువాత తిరువాయ్మొళి 2.3.4 – “ఎనదావి తన్తొళింతేన్….ఇని మీళ్వతెన్బతుణ్డే? యాన్ ఆర్? తంద నీ కొణ్డాక్కినైయే ఆ తరువాత “ఎనదావియార్? యాన్ ఆర్? తంద నీ కొణ్డాక్కినైయే” అని అంటున్నారు. ఈ సంధర్భంలో, వ్యాఖ్యాన చక్రవర్తి పెరియవాచ్చాన్ పిళ్ళై స్తోత్ర రత్న వ్యాఖ్యానంలో వివరిస్తూ –  “సంసార భీతియాల్ సమర్పిక్కైయుం, స్వరూప యాదాత్మ జ్ఞానత్తాల్ అనుసయిక్కైయుం ఇరణ్దుం యావన్మోక్షం అనువర్తిక్కక్కడవతు.” – సంసార భయముతో తమనుతాము  భగవానుడికి సమర్పించడం ఆపైన తమ నిజ స్వభావాన్ని గ్రహించి పశ్చాత్తాపం చెందడం మనం ఈ సంసారం నుండి విముక్తి పొందే వరకు జరుగుతూనే ఉంటుంది – ఇది అనివార్యమైనది. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో పిళ్ళై లోకాచార్యులు , ప్రపత్తిని ఉపాయంగా పరిగణించడం మరియు అటువంటి సూత్రంలో లోపాలను సిద్ధోపాయ నిష్ఠ ప్రకరణంలో లోతైన వివరణ ఇచ్చారు. ఈ సూత్రం146లో, భగవాన్ మాత్రమే ఉపాయం కనుక “ప్రపత్తిని ఉపాయం” గా పరిగణించుట కూడా సరికాదని సూత్రం 146 లో వివరించారు. మాముణులు గద్య  త్రయంను ఉదాహరిస్తూ, ఇక్కడ ఎమ్పెరుమానార్  మొదట ప్రపత్తిని నిర్వహించి ఆ తరువాత తాను మునుపు చేసిన చర్యలకు భగవంతుని క్షమాపణ కోరతారు – కాబట్టి మన పూర్వాచార్య రచనలన్నిటి నుండి, తమను తాము ఎమ్పెరుమానుకి అర్పించడం, తరువాత పశ్చాత్తాపం చెందడం వంటివి చూడవచ్చు.
 • వారు తమ సంపత్తినే స్వీకరిస్తున్నాడని అర్థం చేసుకోకపోవడం ఒక అడ్డంకి. భగవాన్ అన్నింటికీ యజమాని కాబట్టి, అతను తన సొంత ఆస్తినే స్వీకరిస్తున్నాడు – అలాంటి సరైన అవగాహన లేకపోవడం ఒక అడ్డంకి.
 • తనను తాను “నాది” గా భావించి వారికి  సమర్పించడం ఒక అడ్డంకి. ముందు చెప్పినట్లుగా, ప్రతిదీ భగవాన్ సొంతం. తనను తాను యజమాని అని అనుకోవడం, తమను భగవానుడికి మన స్వంత ఆస్తిని అందిస్తున్నట్లుగా సమర్పించడం సరికాదు. అయినప్పటికీ తమను ప్రేమతో ఎమ్పెరుమాన్ అర్పించాలి. భగవత్గీతలో, నాకు ప్రేమతో అర్పించినదానిని నేను చాలా ఆనందంతో స్వీకరిస్తాను అని అంటారు శ్రీ కృష్ణ పరమాత్మా. కాబట్టి, మనం అందించేది ప్రేమతో నిండి ఉండాలి. ఏదైనా తాను ఆధిపత్యాన్ని వహిస్తున్నానన్న  కలుషిత భావన జీవాత్మ యొక్క స్వభావానికి అనుకూలమైనది కాదు. కాబట్టి ఇక్కడ ఖండించబడింది.
 • భగవానుడు అసంతృప్తి పరుడని,  స్వయం సమృద్ధిగా లేడని భావించడం, అతను మన నుండి ఏదో ఆశిస్తున్నాడని భావించుట ఒక అడ్డంకి. భగవాన్ని అవాప్త సమస్త కాముడు అని పిలుస్తారు (అన్ని కోరికలు తీరినవాడు). అయినప్పటికీ, అతనికి తన భక్తులు ప్రేమతో అర్పించిన వాటిని ఎంతో ఆనందంతో స్వీకరిస్తాడు.
 • ఆయన దగ్గర లేనిదేదో మనము ఇస్తున్నామని భావించడం ఒక అడ్డంకి. అతని దగ్గర ఈ వస్తువు లేదు, నేను వారికి ఈ వస్తువు ఇస్తే , తద్వారా అతను ఆ వస్తువుకు యజమాని అవుతాడు” అని మనం అనుకోకూడదు.
 • అతను సర్వ సంపన్నుడు, మన సేవను పూర్తి చేయడానికి మరియు మమ్మల్ని ఉద్ధరించడానికి మాత్రమే మన సమర్పణలను స్వీకరిస్తాడు అన్న భావన లేకపోవడం ఒక అడ్డంకి. “దేహిమే – దదామి తే” (నేను నీకేదో ఇస్తాను, నీవు నాకేదో ఇవ్వు) అని అనుకోకూడదు – ఈ మనస్తత్వం అస్థిరమైన స్థితికి దారితీస్తుంది. సాధారణంగా ప్రజలు ఇబ్బందుల్లో / బాధలో ఉన్నప్పుడు, వారు భగవానుడిని ప్రార్థిస్తూ “దయచేసి ఈ బాధ నుండి నన్ను బయటపడేలా చేయి, నేను ప్రతిఫలంగా మొక్కుబడి తీర్చుకుంటాను” – దీనిని సాధారణంగా సంస్కృతం / తమిళంలో ప్రార్థనా / వేణ్డుతల్ అని పిలుస్తారు. కానీ ఆయన (పెరుమాళ్) అతని పట్ల స్వచ్ఛమైన భక్తిని ప్రదర్శించి వారి సంరక్షణను మనము స్వీకరించాలని మాత్రమే ఆశిస్తాడు. అయినప్పటికీ, ఆయన పట్ల ప్రేమతో మన సామర్థ్యంతో (ఆయన మనకు ఇచ్చిన దానిలో) సమర్పించాలి. అనువాదకుల గమనిక: భౌతిక సమస్యలను పరిష్కరించడానికి ఈ రకమైన లౌకిక ప్రార్థనలు జీవాత్మ యొక్క నిజమైన స్వభావానికి తగినవి కావు. భగవాన్ మరియు భాగవతులకు శాశ్వతమైన కైంకర్యం చేయాలని మనం ఎల్లప్పుడూ ప్రార్థించాలి, ఎందుకంటే ఇది జీవత్మ యొక్క నిజమైన స్వభావానికి సరిపోతుంది. భౌతిక సుఖాలకై ప్రార్థన మన ఆధ్యాత్మిక పురోగతికి పెద్ద ఆపద.
 • భగవాన్ ప్రసాదించిన దానికి ప్రతిఫలంగా మనమేదో వారికి అందిస్తున్నామని భావించుట. అనువాదకుల గమనిక: ఇంతకుముందు వివరించినట్లుగా, భగవాన్‌ను భక్తి ఉళవన్ (భక్తి యొక్క రైతు) అంటారు. అతను జీవత్మలో భక్తి విత్తనాన్ని నాటి, దానిని సాగుచేసి (పెంచి), శాస్త్రాన్ని మార్గదర్శకంగా అందించి, ఆచార్యుని చూపించి, భాగవత సంబంధాన్ని అందించి, అడ్డంకులను తొలగించి జీవాత్మను చివరికి  పరమపదంలోకి తీసుకువస్తాడు. ఇంత గొప్ప సహాయానికి జీవాత్మ ఏ విధంగానూ తిరిగి ఇవ్వలేడు.
 • ఎమ్పెరుమాన్ చేసిన సహాయాలకు బదులు చెల్లించలేకపోవడం గురించి చింతించక పోవడం. మధురకవి ఆళ్వర్ కణ్ణినుణ్ చిఱుత్తాంబు 10వ పాసురంలో “ముయల్గిఱేన్ ఉంతన్ మొయ్కళర్కన్బయే” (నేను మీ పాద కమలములకు ప్రేమపూర్వకమైన చిన్న సేవ చేయటానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నీవు చేసిన కృపకు సరితూగేంత నేను చేయలేకపోతున్నాను) నమ్మాళ్వారి ప్రార్థనలకు ప్రతిఫలంగా ఏమీ చేయలేకపోతున్నాడని అతను బాధపడుతున్నాడు. నమ్మాళ్వారు కూడా భగవాన్ పట్ల ఇటువంటి దివ్య భావాలను తిరువాయ్మొళి 2.3.4లో “ఎనధావి ఉళ్ కలన్త పెరునల్లుతవిక్ కైమ్మాఱు” – నీవు నా వద్దకు వచ్చి ఎంతో ప్రేమతో మెలిగావు, కానీ ఇంత గొప్ప అభిమానానికి నేనేమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను అని వ్యక్తం చేస్తున్నారు.
 • ఆత్మ సమర్పణం చేస్తున్నప్పుడు, ఆత్మ తన సొంతమని భావించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక:  మనం దీని గురించి వివరంగా చర్చించాము, ఆత్మ పూర్తిగా ఎమ్పెరుమాన్ యాజమాన్యంలో ఉంటుంది, ఎమ్పెరుమాన్ తన సొంత సంపత్తినే స్వీకరిస్తున్నాడు.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/07/virodhi-pariharangal-31.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s