Monthly Archives: June 2020

విరోధి పరిహారాలు – 32

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/05/12/virodhi-pariharangal-31/ .

66. దర్శన విరోధి – తత్వ జ్ఞానం అవగాహనలో అవరోధాలు

శ్రీ రామానుజ – శ్రీ పెరుంబుదూర్

దర్శనం అనగా ఒక నిర్దిష్ట మతం యొక్క తాత్విక అంశం. మన మతాన్ని శ్రీవైష్ణవ దర్శనము  అంటారు. ఎమ్పెరుమానార్ ఈ మతాన్ని పెంపొందించి ప్రతి చోటా స్థాపించారు కాబట్టి, దీనిని ఎమ్పెరుమానార్ దర్శనం అని పిలుస్తారు. ఈ మతప్రధాన సూత్రాలు ఏమిటంటే శ్రీమన్నారాయణ సర్వోత్తముడు, అత్యోన్నతుడు. వారికి సమానులు లేదా అంతకంటే ఎక్కువ ఎవరూ లేరు. ఈ మతం పరమ వైధికమైనది (పూర్తిగా వేదంపై ఆధారపడిఉంది). ఈ మతం, వేదం శాశ్వతమైనని మరియు మచ్చలేనిదన్న సూత్రం మీద ఉద్భవించింది. ఈ మతం యొక్క అనుచరులైన ఆళ్వారులు ఎమ్పెరుమాన్ చేత దివ్యానుగ్రహం పొందినవారని, వారి దివ్య ప్రబందాలు వేదంతో సమానమైనవని అర్థం చేసుకోవాలి. ఈ అనుచరులకు దివ్య ప్రబందంతో కూడా మంచి పరిచయం ఉండాలి.

అనువాదకుల గమనిక: మనం ముందుకు కొనసాగే ముందు, మన శ్రీవైష్ణవ దర్శనం గురించి సంక్షిప్త పరిచయం చూద్దాం.

మన శ్రీవైష్ణవ సత్సాంప్రదాయం పేరును స్వయంగా శ్రీరంగనాథుడు “ఎమ్పెరుమానార్ దర్శనం” (శ్రీ రామానుజ దర్శనం ) అని పిలిచారు – దీనిని మణవాళ మాముణులు తమ ఉపదేశ రత్న మాలైలో పేర్కొన్నారు. ఈ సాంప్రదాయాన్ని ఉభయ వేదాంత సాంప్రదాయం అని కూడా పిలుస్తారు.  వేదాంతం, స్మృతి, ఇతిహాస, పురాణాలు,  పాంచరాత్రం మొదలైన వాటిపై సంస్కృత వేదం ఆధారపడి ఉంది. వేదాన్ని నిత్యమైనది (శాశ్వతమైనది) గా, అపౌరుషేయమైనది (ఒకరి చేత సృష్థించనిది, క్రమానుగతంగా భగవానునిచే తెలియజేయ బడినది) గా ,నిర్దోషమైనది (ఎటువంటి లోపాలు లేనిది) గా పిలుస్తారు. ఇక ద్రావిడ వేదానికి (ఆళ్వారులచే వ్రాయబడిన 4000 దివ్య ప్రబంధం)  పూర్వాచార్యుల వ్యాక్యానాలు మద్దతు ఉంది. దివ్య ప్రబంధం ఆళ్వారులు వ్రాసినట్లు చెబుతున్నప్పటికీ,  అవి కూడా శాశ్వతమైనవని మరియు క్రమానుగతంగా ఆళ్వారుల ద్వారా ఎమ్పెరుమాన్ వ్యక్తం చేశారని మన పూర్వాచార్యులు చెబుతున్నారు. అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్  తమ ఆచార్య హృదయంలో ఈ సూత్రాన్ని చాలా స్పష్టంగా వివరించారు. దివ్య ప్రబంధం, వేదం మరియు వేదాంతం యొక్క సారాంశాన్ని వెలికితీసినది కాబట్టి, మన పూర్వాచార్యులు వాటిని ఎంతో ఉన్నతంగా మహిమపరిచారు, తాత్విక విషయాలలో దివ్య ప్రబంధానికి ఎంతో భక్తితో  అత్యున్నత స్థానాన్ని ఇచ్చారు.

ద్రావిడ వేదం మరియు సంస్కృత వేదం రెండింటిలోనూ, శ్రీమన్నారాయణుడుని సర్వోన్నత దేవుడిగా స్థాపించాయి. శ్రీమన్నారాయణుడు రెండు ముఖ్యమైన లక్షణాల ద్వారా మహిమ పరచపడ్డారు – సమస్థ కళ్యాణ గుణాలకు నివాసుడు మరియు అమంగళమైన గుణాలకు విపరీతమైన వాడు. వారిని ఉభయ విభూతి నాథుడు (ఆధ్యాత్మిక ప్రపంచం అయిన నిత్యా విభూతి  మరియు భౌతిక ప్రపంచం అయిన లీలా విభూతి రెండింటికీ అధిపతి) గా కూడా కీర్తింపబడ్డాడు. శ్రీమన్నారాయణుడునకు ఇతర ప్రాణులలో లేని కొన్ని ప్రత్యేక గుణాలు కలిగి ఉన్నట్లు చెబుతారు, అవి మరెవరిలోనూ కనిపించవు – శ్రీయః పతిత్వం (శ్రీ మహలక్ష్మికి భర్త కావడం), అనంతసాయిత్వం (సర్ప శయ్యపై నిద్రిస్తున్నవాడు), గరుడవాహనత్వం  (గరుడను అధిరోహించినవాడు) మొదలైనవి. ఇవన్నింటిలో శ్రీయః పతిత్వం అతి ముఖ్యమైన గుణం – తిరుమళిసై ఆళ్వార్ పాసురం 53లో ఇలా అన్నారు “తిరువిల్లత్ తేవరైత్ తేరెన్మిన్ తేవు” –  శ్రీ మహాలక్ష్మి సంభందం లేని వాడిని నేను దేవునిగా భావించను.  వేదం ఇలా అంటుంది “శ్రద్దయా దేవో దేవత్వమష్ణుతే” – శ్రీమహాలక్ష్మి సంబంధంతో శ్రీమన్నారాయణుడు ఆ దైవత్వం గడించారు. శ్రీమన్నారాయణుడుని పువ్వుగా మరియు శ్రీమహాలక్ష్మి ని సువాసనగా వివరించారు. శాస్త్రం ప్రకారం శ్రీమన్నారాయణుడు మాత్రమే సర్వోన్నత దేవుడు కాబట్టి మరే ఇతర దేవతలు సర్వోత్తములుగా పరిగణించలేము.

శ్రీమన్నారాయణుడు చిత్ మరియు అచిత్ రెండు తత్వాలలో విస్తరించి ఉన్నాడు. ప్రతిదానిలో అంతర్యామిగా ఉన్నాడు.  జీవాత్మ పట్ల అనురాగంతో శ్రీమన్నారాయణ ఇతర దేవతలను సృష్థించారు. వారు తమ సొంత గుణాల (సత్వం / మంచితనం, రాజసం  / రాగ ద్వేశాలు మరియు తామసం / అజ్ఞానం) ఆధారంగా ఆయా దేవతలను ప్రార్థించవచ్చు. ఈ దేవతాంతరములు లేకపోతే, వారు నాస్తికులుగా మారి శాశ్వతంగా సంసారంలో చిక్కుకొని ఉండిపోతారు.  కనీసం ఈ దేవతారాధన ద్వారానైనా వైధిక మతంపై కొంత వరకు విశ్వాసం ఉంటుంది, క్రమేణా నెమ్మదిగా ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఈ విధంగా, ఎమ్పెరుమాన్ యొక్క దివ్య ఆదేశాలను అమలు చేయడానికి, చిక్కుకొని ఉన్న జీవాత్మలను ఒక సద్గుణ మార్గం వైపు నడిపించడానికి, చివరికి శ్రీమన్నారాయణుడునకు దారి తీసేందుకు, ఈ సంసారంలో దేవతాంతరములు ఉన్నారు. కానీ దేవతాంతరములు, తామూ జీవాత్మలము అన్న వాస్తవాన్ని మరచి కొన్ని సంధర్భాలలో భగవాన్నే సవాలు చేశారు. ఈ కారణంగానే శ్రీవైష్ణవులు వారిని ఎన్నడూ ఆరాధించరు. ఎందుకంటే శ్రీవైష్ణవులు ఎల్లప్పుడూ సత్వ గుణంలో ఉండాలి. ఈ దేవతాంతరములు సత్వం / రాజసం  / తామస గుణాల మిశ్రమంలో ఉంటారు – శాస్త్రం చెప్పినట్లుగా సత్వ గుణ నిష్టులు (సత్వ గుణంలో నిష్ఠగా ఉన్నవారు) రాజస/తామస గుణ వ్యక్తులను ఆరాధించకూడదు.

ఇది మన సత్ సాంప్రదాయ సూత్రాల సంక్షిప్త రూపాన్ని అందిస్తుంది. ఈ పరిచయంతో, మనం ఈ విభాగంతో ముందుకు వెళదాం.

 • బ్రహ్మారుద్రులు మొదలైన దేవతల ఆధిపత్య సందేహాలు కలిగి ఉండటం, త్రిమూర్తి సామ్యంపై సందేహం ఉండటం (బ్రహ్మ, విష్ణు, శివుడు అందరూ సమానులని భావించడం), బ్రహ్మా, రుద్రులు మొదలైనవారు కూడా శ్రీమన్నారాయణుడుని దాసులేనని వారిని మనం సేవించుట ఒక అడ్డంకి. సాధారణంగా, ఈ ముగ్గురు దేవతలను – సృష్టి కోసం బ్రహ్మ, జీవనాధారం కోసం విష్ణు మరియు వినాశనం కోసం శివుడిని ప్రత్యేకంగా కీర్తిస్తారు.  అయినప్పటికీ, ఈ ముగ్గురిలో ఒకరు మాత్రమే యజమాని- విష్ణు అంటే శ్రీమన్నారాయణుడు మాత్రమే అధిపతి. బ్రహ్మ మరియు శివుడు ఇద్దరూ శ్రీమన్నారాయణుడుని చేత సృష్టించబడిన వారు, శ్రీమన్నారాయణుడుని ఆదేశాల మేరకు సృష్టి వినాశనాలు నిర్వహిస్తున్నారు.  వీరిరువురినీ విష్ణువు ఆధిపత్యానికి సమానంగా పోల్చకూడదు. త్రిమూర్తుల గురించి ప్రస్తావన ఉన్నప్పటికీ, వారు ఒకరికొకరు సమానం కాలేరు. తిరుమళిసై ఆళ్వార్ నాన్ముగన్ తిరువంతాది 1వ  పాసురంలో ఇలా వెల్లడిచేశారు –  ” నాన్ముగనై నారాయణన్ పడైత్తాన్, నాన్ముగనుం తాన్ ముగమాయ్ సంకరనైత్తాన్ పడైత్తాన్” – శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించాడు, బ్రహ్మ శివుడిని సృష్టించాడు) – మనం అర్థంచేసుకోవలసినది ఏమిటంటే అన్ని కారణాలకు కారణమైన శ్రీమన్నారాయణుడే సాటిలేని సర్వాధికారి. బ్రహ్మారుద్రులు ఇరువురు జీవాత్మలు, వారు నిర్దిష్ట పదవులను స్వీకరించారు. ఇతర జీవుల మాదిరిగానే ఏదో ఒక సమయంలో వారు నశ్వరమవుతారు. బ్రహ్మారుద్రుల అంతర్యామిగా శ్రీమన్నారాయణ ఉండటం వల్ల వారిరువురినీ  శ్రీవైష్ణవులు ఆరాధించగలరా? లేదు. వారి తమోరజో గుణాల కారణంగా, అహంకారంతో శ్రీమన్నారాయణుడను వ్యతిరేకించి పోరాడారు. అందువల్ల, వారికి శ్రీవైష్ణవులచే అరాధింపబడే అర్హత లేదు.  అనువాదకుల గమనిక: పెరియ తిరువంతాది 72వ పాసురంలో, నమ్మాళ్వార్ ఈ సూత్రాన్ని అందంగా వివరించారు. “ముదలాం తిరువురువం మూన్రెన్బర్, ఒన్రే ముదలాగుం మూన్రుక్కుం ఎన్బర్, ముదల్వా! నిగరిలగు కారురువా నిన్నగత్తతన్రే పుగరిలగు తామరైయిన్ పూ” –  కొందరు ఈ ముగ్గురు దేవతలు సర్వాధిపతులు అని అంటారు, మరికొందరు ఈ ముగ్గురికీ అధిపతి ఒక దేవత ఉందని అంటారు; అందమైన మేఘంవలే నల్లని దివ్య రూప(నాభి) కమలం యొక్క మూలం (దీని నుండి బ్రహ్మ జన్మించారు – ఇది శ్రీమన్నారాయణ యొక్క ఆధిపత్యాన్ని స్పష్టంగా నిర్ధారిస్తుంది). ఇదే సూత్రాన్ని పరాశర భట్టర్ శ్రీరంగరాజ స్థవం   పూర్వ శతకం 116 వ స్లోకంలో వివరించారు. ఈ సూచనలు ప్రమాణాల ద్వారా, శ్రీమన్నారాయణ ప్రతి ఒక్కరికీ అత్యున్నత కారణమని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. శ్రీవైష్ణవులు శ్రీమన్నారాయణుడను మరియు వారి భక్తులను మాత్రమే ఆరాధించాలి. ఇక్కడ వారి భక్తులు అంటే ఆయన పట్ల అపారమైన విశ్వాసం ఉన్నవారు మరియు ఎప్పుడూ రజో /తమో గుణాలను  వ్యక్తం చేయనివారు. మనం మొదట అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, సృష్టి, వినాశనం మొదలైన వాటిపై అధికారం ఉన్న బ్రహ్మ, రుద్రుడు మొదలైనవి ప్రత్యేకమైన పదవులు. జీవాత్మలు వారి గత కర్మల వల్ల అటువంటి స్థాయికి చేరుకుంటారు – ఎన్నో జన్మలలో కఠిన తపస్సులు చేసి వారు బ్రహ్మ, శివుడు మొదలైనవారు అవుతారు. కాని విష్ణువు అటువంటి పదవి కాదు – అతను స్వయంగా శ్రీమన్నారాయణుడు.  శ్రీరంగరాజ స్థవం ఉత్తర శతకం 52వ స్లోకంలో, భట్టర్ భక్తితో, శ్రీమన్నారాయణుడు ఈ సంసారంలోకి దిగి, ఈ ఇరువురు దేవతల మధ్య తనను తాను ఉంచుతాడు.  బ్రహ్మ, రుద్రుడు మొదలైనవారు శ్రీమన్నారాయణుడి యొక్క ఆధిపత్యాన్ని అర్థం చేసుకున్నప్పటికీ,  ఈ భౌతిక ప్రపంచంలో సృష్టి, వినాశనం మొదలైన ఉన్నత పదవులను అధిరొహించిన నందున, వారు కొన్ని సమయాల్లో అహంకారంతో వారి నిజమైన స్వభావాన్ని మరచిపోతారు. అటువంటి స్థితిలో, వారు భగవానుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. కృష్ణావతార సమయంలో, బ్రహ్మ కృష్ణుని ఆవులను దొంగిలించినపుడు కృష్ణుడు బ్రహ్మకు పాఠం నేర్పుతాడు. అటువంటి కఠినమైన పాఠం తర్వాత మాత్రమే, బ్రహ్మ తన తప్పును గ్రహించి క్షమించమని వేడుకుంటాడు. అదేవిధంగా, రుద్రుడు కూడా, బణాసురుడికి సహాయం చేస్తూ కృష్ణుడితో తీవ్రంగా పోరాడతాడు. చివరికి తన తప్పును గ్రహించి కృష్ణుడిని కీర్తిస్తాడు. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో, పిళ్ళై లోకాచార్యులు భగవత్ అపచారం గురించి విస్తారంగా వివరించారు. అందులో, మొట్ట మొదటి అపచారం దేవతాంతరములను (బ్రహ్మ, రుద్రుడు,మొదలైనవారు) శ్రీమన్నారాయణుడకు సమానంగా పరిగణించడం. కాబట్టి, “ఓహ్! ఈ దేవతాంతరములు శ్రీమన్నారాయణకు సమానం కావచ్చు” అనే సందేహం కూడా ఒక అడ్డంకి. అందువల్ల, వివిధ ప్రమాణాల ఆధారంగా శ్రీమన్నారాయణ సర్వాధిపతియని, సర్వోత్తముడని  పూర్తిగా నమ్మకంతో ఉండాలి మరియు దేవతాంతరములు పట్ల భక్తి చూపించకుండా ఉండాలి.
 • బాహ్యులు (వేదం మహోన్నత అధికారాన్ని అంగీకరించని వారు) మరియు కుదృష్ఠులు  (వేదం మహోన్నత అధికారాన్నిఅంగీకరిస్తారు కాని వారి సౌకర్యానికి తగినట్టుగా స్వీకరిస్తారు), బౌద్ధ, శైవ, మాయావాదుల వివరణలు సూత్రాలు అడ్డంకులు. బుద్ధుని అనుచరులు బౌద్ధులు. జైనలు కూడా కొంతవరకు బౌద్ధులతో సమానంగా ఉంటారు. ఈ రెండు మతాల వారు (బౌద్ధులు మరియు జైనులు) వేదం యొక్క మహోన్నత ఆధిపత్యాన్ని పూర్తిగా తిరస్కరించారు. శైవులను పాసుపతులని కూడా పిలుస్తారు, శివుడు మహోన్నత ఆధిపత్యం వహిస్తాడని నమ్ముతారు. వారికి శైవ ఆగమాలు అధికారం. మాయావాదులు అంటే మొత్తం భౌతిక ప్రపంచాన్ని మాయ/భ్రమ అని అంటారు. బ్రహ్మం మాత్రమే సత్యమని, అలాంటి బ్రహ్మకి పేరు, రూపం, గుణాలు మొదలైనవి ఉండవని చెప్పుకుంటారు. ఈ సూత్రాలు పనికిరానివని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి సూత్రాలకు దూరంగా ఉండాలి. తొండరడిప్పొడి ఆళ్వారులు  తిరుమాలై 7వ పాసురంలో, “పులైయఱమాగి నిన్ర పుత్తొడు చమణం ఎల్లాం కలైయఱక్ కఱ్ఱ మాన్తర్ కాణ్బరో? కేట్పరో తాం?” (మీరు బాగా చదువుకున్న శ్రోతలుగా ఉన్నప్పుడు?) – ఒకరు వేదా శాస్త్రంలో బాగా నేర్పరి అయినవాడు ఇతర బౌద్ధం, జైనం మొదలైన తత్వాలను అధ్యయనం చేస్తాడా? వింటాడా? అనువాదకుల గమనిక: బౌద్ధం (ఆధునిక చరిత్రకారుల ప్రకారం 2500 సంవత్సరాల క్రితం) ఇటీవలి కాలంలో గౌతమ బుద్ధతో సంబంధం కలిగి ఉందని గమనించినప్పటికీ , స్వయంగా వ్యాస ఋషి బౌద్ధ జైనమతంపై వేదాంతాన్ని అత్యున్నత తత్వంగా స్థాపించారు. ఆ సిద్దాంతం ఇవన్నిటికి ముందు చాలా కాలం నుండి కూడా ప్రబలంగా ఉన్నాయి. వేద నిపుణులైన అప్పటి అసురుల విశ్వాసాన్ని అనచడానికి భగవాన్ స్వయంగా బుద్ధుడిగా అవతరించారు. వారిని భ్రమపరచడానికి శూన్యవాద ప్రచారం చేసి శాస్త్రంపై వారి విశ్వాసాన్ని హతమార్చి వారిని ఓడించాడు. నంపిళ్ళై వారి ఈడు వ్యాఖ్యానంలో తిరువాయ్మొళి 5.10.4 పాసురంలో- “కళ్ళ వేదత్తై కొణ్డు పోయ్…” వివరించారు. ఈ పాసురంలో, బుద్ధుడు ఒక నల్లని అందమైన శరీరం, పొడవాటి చెవులతో చేతిలో పుస్తకం కలిగి ఉన్నట్లు వివరించారు. అతని రూపం ఎంత అందంగా ఉండేదంటే అతను ఏది చెప్పినా ప్రజలు వెంటనే నమ్మేవారు. అతను అహింసను అత్యున్నత సూత్రంగా బోధించారు. ప్రజలు అతని తత్వశాస్త్రాన్ని సునాయాసంగా నమ్మేవారు. ఆ విధంగా అసురులను భ్రాంతి చేసి వారి విశ్వాసాన్ని కొల్లగొట్టి చివరికి వారిని వధిస్తాడు. ఇక్కడ, చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. బౌద్ధ తత్వశాస్త్రం భగవాన్ స్వయంగా బోధించినప్పటికీ, వైధికులు ఆ తత్వాన్ని అంగీకరించరు (ఇతరులకై ఉద్దేశించినదని అర్థం చేసుకోవాలి). భగవాన్ స్వయంగా వేదానికి విరుద్ధంగా ఏదైనా భోదించినప్పటికీ, దానిని సిద్ధాంతులు తిరస్కరించారు. అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ తమ ఆచార్య హృదయంలో ఈ విషయాన్ని తిరువాయ్మొళి యొక్క కీర్తిని స్థాపించే సందర్భంలో తమిళ్ భాషలో వెల్లడిచేశారు. భాష ఆధారంగా ఒక సాహిత్యాన్ని అంగీకరించాల్సి వస్తే, సంస్కృతంలో ఉన్న భగవాన్ స్వయంగా పలికిన బౌద్ధ సాహిత్యాన్ని మనం అంగీకరించాలి అని వారు చెప్పారు. కానీ ఇది వేదానికి విరుద్ధం కాబట్టి, దీనిని గొప్ప వేదాంత తత్వవేత్తలు తిరస్కరించారు.
 • విశేష ధర్మం ప్రకారం, భగవత్ / భాగవత కైంకర్యానికి ప్రాముఖ్యత మరింత ఉంది. ఇది అత్యోన్నత లక్ష్యం. భగవానుడే ఏకైక ఆశ్రయంగా స్వీకరించి, కేవలం భగవత్ ప్రీతి కొరకే జీవించి ఉండి, ఎమ్పెరుమానుడే ఉపాయం (మధ్యమం) గా,  ఉపేయం (లక్ష్యం) గా భావించే వ్యక్తిని పరమైకాంతి అంటారు. అటువంటి గొప్ప వ్యక్తులు స్వచ్ఛమైన హృదయంతో సామాన్య ధర్మాన్ని (వర్ణాశ్రమ ధర్మం) ఆచరిస్తారు ఎందుకంటే ఇవి కూడా భగవత్ ఆరాధనంలో భాగమవుతాయి కాబట్టి. దీనినే ముముక్షుప్పడిలో పిళ్ళై లోకాచార్యులు “కర్మం కైంకర్యాత్తిలే పుగుం” అని వివరించారు . విశేష ధర్మం పాఠిస్తున్నప్పుడు సామాన్య ధర్మం కొంతవరకు వాయిదా వేయవచ్చు / దాటివేయవచ్చు. భగవత్ / భాగవత కైంకర్యం చేసేటప్పుడు సామన్య ధర్మం ఆలస్యం చేయడం / దాటివేయడం పాపం కాదని మనకి గట్టి నమ్మకం ఉండాలి. ఆచార్య హృదయంలో, అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ (మాముణుల వ్యాఖ్యానంలో)  విల్లిపుత్తుర్ పగవర్ (ఒక సన్యాసి) ఒకానొక సమయాన నదిలో స్నానం చేయడానికి వెళ్ళినట్లు వివరిస్తున్నారు. కొంతమంది బ్రహ్మణులను (భాగవత ధర్మంపై ఎటువంటి అవగాహన లేకుండా వర్ణశ్రమ ధర్మం మీద దృష్టి సారించినవారు) చూసి, అతను నదిలో నుంచి బయటకు వచ్చేసి ఇలా అన్నారు, “మీరు వర్ణధర్ములు మాత్రమే, కానీ మేము దాసులము (భగవాన్ సేవకులు). మనమిరువురం అంత సులభంగా కలవలేము” అని అన్నారు. ఈ విషయాలలో, మన పూర్వాచార్యులు అనుసరించినదే మనమూ అనుసరించాలి. వర్ణశ్రమ ధర్మాన్ని పాటించకపోవడం స్పష్టంగా పాపం అయినప్పటికీ, మనం విశేష ధర్మం (భగవత్ / భాగవత కైంకర్యం) చేస్తున్నప్పుడు,వర్ణాశ్రమ ధర్మాన్ని ఆలస్యం  చేయడం/ దాటివేయడం ఏ పాపానికి దారితీయదు.
 • శారీరకంగా వైష్ణవ స్వరూపం, వస్త్రాధరణ, పేరు కలిగి ఉండి కూడా భాగవతులను కించపరిచే పనులు చేయడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాంలో, పిళ్ళై లోకాచార్యులు ఈ సూత్రాన్ని సూత్రం 199, 200 లలో అందంగా వివరిస్తున్నారు. వారు దీనిని “ఆరూడ పతితన్” ఎత్తు నుండి క్రింద పడిన ఒక పదాన్ని ఉపయోగించి వివరించారు. భాగవతునిగా మారడం అంటే అత్యున్నత స్థితికి చేరుకున్నాడని అర్థం. కానీ ఆ స్థితిలో ఉండి ఇతర భాగవతులను కించపరచడం అంటే ఉన్నత స్థాయి నుండి క్రింద పడిపోవడం అని అర్థం. ఎంతో ఎత్తు నుండి క్రింద పడితే మరింత తీవ్రంగా గాయపడతాము. కాబట్టి, భాగవతుల పట్ల ఎటువంటి అభ్యంతరకరమైన పదాలు / చర్యలలో పాల్పడకుండా ఉండటం మంచిది.
 • నిజమైన ఆచార్యుని ఆశ్రయించకపోవడం ఒక అడ్డంకి.  నిజమైన ఆచార్యునికి శరణాగతి చేసి వారి నుండి పంచ సంస్కారము స్వీకరించాలి. సమాశ్రయణం కేవలం  సాధారణ సంస్కారాలతో  ఆగిపోదు. తిరువాయ్మొళి 5.5.11 పాసురంలో చెప్పినట్లుగా “చంతంగళ్ ఆయిరముం అఱియక్ కత్తు వల్లార్ వైత్తనవర్” – తిరువాయ్మొళి పూర్తిగా నేర్చుకున్న వారు, అర్థాలను జీర్ణం చేసుకున్న వారు మరియు వాటిని రోజువారి జీవితంలో అనుసరించేవారు నిజమైన వైష్ణవుడు. అనువాదకుల గమనిక: చాలామంది పంచ సంస్కారాన్ని ఒక లక్ష్యం లేదా చివరి మెట్టుగా చూస్తారు. కానీ నిజంగా ఇది వైష్ణవ ప్రయాణానికి నాంది. మనం ఆచార్యునికి హృదయపూర్వకంగా శరణాగతి చేసి, అన్ని అవసరమైన సూత్రాలను నేర్చుకోవాలి మరియు తాను శ్రీవైష్ణవునిగా వ్యవహరించాలి. ఒక ఆచార్యుని నుండి పంచ సంస్కరం పొందబడి, సంసారి (ప్రాపంచిక వ్యక్తి) లాగా జీవనం కొనసాగిస్తే, అది పంచ సంస్కరాన్ని స్వీకరించే ఉద్దేశ్యాన్ని పూర్తిగా ఓడిస్తుంది. ఇక్కడ, ఆచార్యుని పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో, పిళ్ళై లోకాచార్యులు చివరిలో ఆచార్యుని యొక్క మహిమలను వివరించారు. ఈ విభాగంలో ఆచార్యుని ద్వారా భగవాన్ను చేరుకునే ఉద్దేశ్యాన్ని అందంగా వివరించారు.
 • శ్రీవైష్ణవ లక్షణం  (ప్రవర్తన) లేకపోవడం ఒక అడ్డంకి. శ్రీవైష్ణవ లక్షణంలో రెండు అంశాలు ఉన్నాయి – బాహ్య మరియు అంతర్గత. బాహ్య – భుజాలపై శంఖ చక్రాల ముద్రలు కలిగి ఉండటం, 12 ఊర్ధ్వ పుండ్రాలు ఉండటం, తులసి / తామర కాండ మాలలు కలిగి ఉండటం,  చివరికి కళ్ళలో కన్నీళ్లు మొదలైన శారీరక మార్పులు, ఇవి భగవత్ / భాగవతుల చింతనలో నిరంతరం నిమగ్నమై ఉండటం ద్వారా జరుగుతాయి. . అంతర్గత – స్వచ్ఛమైన హృదయం కలిగి ఉండటం, జ్ఞానం, భక్తి, వైరాగ్యం, ఇతరుల పట్ల సహానుభూతి / బాధ, ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోరుట మొదలైనవి ఈ రెండూ ముఖ్యమైనవి. అనువాదకుల గమనిక: ఈ అంశంపై మొత్తం శ్రింఖల వ్రాయబడింది మరియు దీనిని http://ponnadi.blogspot.in/p/srivaishnava-lakshanam.html లో చదవవచ్చు.
 • ద్వయాధికారి (ద్వయ మహామంత్రం యొక్క అర్హతగల వ్యక్తి) కాకపోవడం ఒక అడ్డంకి. దీనిని నాచియార్ తిరుమొళిలో ఆండాళ్ నాచియార్ చెప్పినట్లుగా “మేయ్మైప్పెరు వార్తై విట్టుచిత్తర్ కేట్టిరుప్పర్”- పెరియాళ్వార్ చరమ స్లోకం అర్థంచేసుకొని (భగవద్గీత 66 – సర్వ ధర్మాన్….) సంపూర్ణంగా ఆచరించారు కూడా. రహస్య త్రయం (తిరుమంత్రం, ద్వయం, చరమ స్లోకం) ను అర్థం చేసుకొని దానిని నమ్మకంగా పాటించాలి. ఈ మూడిటిలో, ద్వయ మహామంత్రాన్ని మంత్రరత్నంగా కీర్తింపబడినందున ఎక్కువ ప్రాధాన్యత ఉంది. శ్రీరంగనాథుడు శరణాగతి గధ్యంలో ఎమ్పెరుమానార్ను ఇలా నిర్దేశించారు “ద్వయం అర్థానుసందానేన సహ యావచ్చరీరపాదం అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ” – నిరంతర ద్వయ మహామంత్ర చింతన వలన, సంతోషముగా శ్రీరంగంలో ఉండిపో. ద్వయ మహామంత్రం యొక్క అర్ధాలను తిరువాయ్మొళిలో పూర్తిగా వెల్లడిచేయబడ్డాయి. అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ కూడా తమ  ఆచార్య హృదయం 210వ చూర్ణికలో ఇలా వెల్లడిచేశారు “ద్వయార్థం దీర్గ శరణగతి ఎన్రరు సార సంగ్రహత్తిలే” – ద్వయ మహామంత్రం యొక్క అర్థాన్ని తిరువాయ్మొళి పూర్తిగా వివరిస్తుందని పిళ్ళై లోకాచార్యుల ద్వారా సార సంగ్రహంలో  స్థాపించబడింది. అనువాదకుల గమనిక: ముముక్షుప్పడి లో ద్వయ ప్రకరణ (విభాగం) ప్రారంభంలో పిళ్ళై లోకాచార్యులు మొదటి సూత్రంలోనే వైష్ణవుని లక్షణాలను విస్తారంగా వివరించారు. తరువాతి కొన్ని సూత్రాలలో, ద్వ మహామంత్ర వివరణలకు ముందు ఈ వైష్ణవ లక్షణాలు అందంగా వివరించబడ్డాయి. తిరువాయ్మొళి పిళ్ళై యొక్క సూచనల ప్రకారం, మాముణులు  శ్రీ భ్యాష్యం నేర్చుకున్న తరువాత మిగిలిన జీవితమంతా తిరువాయ్మొళిని (ద్వమహామంత్రం యొక్క దివ్య అర్థాలతో నిండి ఉన్న) ప్రచారం చేయడంలో గడుపుతారు. వారు వేదాంత నిపుణులు అయినప్పటికీ, వారు నిరంతరం వేదాంతాన్ని ఆళ్వారులు యొక్క మధుర  పదాల ద్వారా వివరించేవారు. మాముణులు  యొక్క అధరములు నిరంతరం ద్వయ మహామంత్రన్ని జపిస్తూ, ఆ అద్భుత మంత్రార్థాల చింతనలో వారి మనస్సు పూర్తిగా నిమగ్నమై ఉండేదని మాముణుల దినచర్యలో ఎఱుంబి అప్పా వెల్లడించారు.
 • అరుళిచ్చెయల్ (దివ్య ప్రబంధం) లో పాల్గొనకపోవడం ఒక అడ్డంకి. శ్రీవైష్ణవులను ప్రత్యేకంగా ఉభయ వేదాంతులుగా కీర్తిస్తారు. తమిళ్ వేదం అని పిలువబడే తిరువాయ్మొళి మిగిలిన దివ్య ప్రబంధాలను అంగ / ఉపాంగాలుగా (సహాయక భాగాలు) కలిగి ఉంది అని మరియు సంస్కృత వేదం, స్మృతి, ఇతిహాసపురాణాలకు సమానమైనవి అని అంటారు. ఆచార్యుల నుండి వాటి అర్ధాలతో దివ్య ప్రబంధాన్ని సరిగ్గా నేర్చుకొని, వాటిలో వివరించిన సూత్రాలను పాటించాలి. ఇది మనల్ని శ్రీవైష్ణడని పిలువబడడానికి పూర్తి అర్హత ఇస్తుంది.  అనువాదకుల గమనిక: తిరువాయ్మొళి పాసురాల ఆధారంగా ఈ విషయం ఇప్పటికే క్షున్నంగా వివరించబడింది. వార్త మాలై లో, పెరియవాచ్చాన్ పిళ్ళై ఒక అద్భుతమైన విషయం చెప్పారు. “ములైగళిలైయాన యువతియైప్పోలే కాణుం, ఊమైయల్లాత వైష్ణవన్ అరుళిచ్చెయలిలే అన్వయియాతొళిగై” – ఎలాగైతే స్తనములు లేని ఒక యుక్త వయసు అమ్మాయిని అమ్మాయి అని పిలువడానికి కూడా అర్హత ఉండదో, దివ్య ప్రబంధ పారాయణంలో పాల్గొనని వారికి వైష్ణవుడనే (చెవిటి మనిషి కాకపోతే ) అర్హత కూడా ఉండదు.
 • రహస్య  గ్రంథము మరియు ముఖ్యమైన సూత్రాలలో సరైన శిక్షణ పొందకపోవడం ఒక అడ్డంకి. తత్వం (నిజం) అంటే చిత్, అచిత్ మరియు ఈశ్వర (భగవాన్)ను సరిగ్గా అర్థం చేసుకోవడం. రహస్య గ్రంథాలు అతి గోప్యతమైన సాహిత్యం. ఈ సూత్రాలను ఎమ్పెరుమానార్ కాలంలో మౌఖికంగా చెప్పబడేవి. కానీ ఆ తరువాత దేవ పెరుమాళ్ అవతారమైన పిళ్ళై లోకాచార్యులు, వీటిని 18  గ్రంథాలుగా నమోదు చేశారు, వీటిని అష్ఠాదశ రహస్య గ్రంథాలు అని పిలుస్తారు.      అనువాదకుల గమనిక: సత్సాంప్రదాయం యొక్క ప్రధాన సూత్రాల సరైన శిక్షణ మనం పొందాలి. ఇక్కడ “శిక్షయ్” అనే పదాన్ని ఉపయోగించారు. శిక్షయ్ అంటే బోధన / అభ్యాసం (మన ఇండ్లల్లో మన సౌకర్యాన్ని బట్టి సీడీ వినడం లేదా  పుస్తకాలు చదవడం మొదలైనవి) కాదు. దీని అర్థం “సంపూర్ణ సంస్కరణ లేదా కఠినమైన పరిష్కరణ” – శిష్యుడు కొన్ని సూత్రాలను అర్థం చేసుకోనప్పుడు , ఆచార్యులు ఆ సూత్రాలను బాగుగ వివరిస్తే శిష్యుడు ఆ సూత్రాన్ని అర్థం చేసుకొని దానిని అనుసరించడం ప్రారంభిస్తాడు. 
 • శిష్ఠాచారంపై నమ్మకం లేకపోవడం మరియు వాటిని పాటించకపోవడం ఒక అడ్డంకి. శిష్ఠాచారం అంటే పెద్దల అభ్యసించిన విధులు. “ధర్మగ్య సమయం ప్రమాణం వేదాశ్చ” – అంటే “ప్రామాణికమైన శాస్త్రాభ్యాసం చేసిన పండితులు అనుసరించిన పద్దతులు ప్రామాణికము, వేదం ప్రామాణికము” – ఇది పూర్ణంగా స్థాపితమైన వాజ్ఞ్మూలము.  తిరుప్పావై 26 వ పాసురంలో, ఆండాళ్ “మేలైయార్ చెయ్వనగళ్” – పెద్దలు పాటించినవని అన్నారు. ఆమె 2వ పాసురంలో “చెయ్యాతన చెయ్యోం” – మన పెద్దలు పాటించని వాటిని మేము అనుసరించము. మన పెద్దల అనుష్ఠానాలపై మనకు బలమైన నమ్మకం ఉండాలి. అనువాదకుల గమనిక: ఒక ముఖ్యమైన సూత్రాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎఱుంబి అప్పా వారి “విలక్షణా మోక్ష అధికారి నిర్ణయం”లో ఈ ముఖ్యమైన సూత్రాన్ని స్థాపించారు. “పెద్దలు” అంటే మన “పూర్వాచార్యులు ” అనుసరించిన మార్గాన్ని మనం కూడా అనుసరించాలి. ఈ మధ్య శ్రీవైష్ణవ వరివారాలలో ఇతర దేవతలను ఆరాధించడం, కొన్ని వ్రతాలను పాటించడం, ప్రాపంచిక సుఖాలకై ప్రార్థనలు చేయడం లేదా బాధల నుండి విరుగుడు పొందడం కోసం ప్రార్థనలు చేయడం వంటి కొన్ని విచిత్రమైన పద్దతులు పుట్టుకురావడం మనం గమనించవచ్చు. ఒకసారి మనం సరైన ఆచార్యుల ద్వారా జ్ఞానాన్ని పొందిన తరువాత ఇటువంటి వన్నీ మానుకోవాలి. జ్ఞానం లేకపోవడం వంటి వివిధ కారణాలవల్ల ఇవి ఈ పరివారాలలోకి పాకి ఉండవచ్చు కాబట్టి వెంటనే మానుకోవాలి. మా పరివారపెద్దలు వీటిని పాఠించారని మనం మన ప్రతి చర్యను (మన పూర్వాచార్యుల సూత్రాలకు విరుద్ధమైనవి కూడా) సమర్థించుకోలేము.
 • జ్ఞానం, భక్తి, వైరాగ్యం లేకపోవడం ఒక అడ్డంకి. ఇక్కడ జ్ఞానం అంటే అర్థపంచక జ్ఞానం. జీవత్మా పరమాత్మ స్వభావాల అవగాహన, పరమాత్మ జీవత్మల మధ్య ఉన్న సంబంధం. అంటే, స్వామి – దాస భావం (యజమాని – సేవకుడు), ఉపాయం, పురుషార్థం (లక్ష్యం) మరియు లక్ష్యసాధనలో అవరోధాలు – విరోధి (అడ్డంకులు) యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. భక్తి అంటే ఎమ్పెరుమాన్పట్ల ఎనలేని భక్తి. వైరాగ్యం అంటే పరిత్యాగము.      దేవతాంతరముల (ఇతర దేవతలు) పట్ల అనురాగాన్ని మానుకోవాలి. అలాగే, విషయాంతరం (ప్రాపంచిక / భౌతిక సుఖాలు) పట్ల మక్కువను ఖచ్చితంగా మానుకోవాలి. విషయాంతరం అంటే భగవత్ / భాగవత విషయాలకు భిన్నమైన విషయాలు. శ్రీరంగనాథుడు స్వయంగా మణవాళ మాముణులను  మహిమపరిచి సమర్పించిన తనియన్లో, “ధీభక్త్యాధి గుణార్ణవం” చాలా ముఖ్యమైనది. ఇక్కడ ధీ అంటే జ్ఞానం, భక్తి అంటే ఉపాసన మరియు ఆధి అంటే వైరాగ్యాన్ని సూచిస్తుంది. మాముణులు  అటువంటి అద్భుతమైన గుణాల సముద్రం అని శ్రీరంగనాథుడు కీర్తిస్తున్నారు.
 • జ్ఞానులైన శ్రీవైష్ణవుల చరణ కమలాలను ఆశ్రయించక పోవడం ఒక అడ్డంకి. రహస్య విషయాలను శిష్యులకు ఉపదేశించే ఆచార్యులను ఆశ్రయించాలి. భాగవతులను కూడా ఆచార్య తుల్య (ఇంచు మించు అచర్యులకు సమానులు) అని కూడా పిలుస్తారు. అలాంటి వ్యక్తుల ఆశ్రయంలో  జీవించడం తన అభ్యున్నతికి దారితీస్తుందని గట్టిగా నమ్మాలి. అనువాదకుల గమనిక: ఎమ్పెరుమానార్ , తమ చివరి రోజులలో 6 ఉపదేశాలు ఇచ్చారు –  శ్రీభాష్యాన్ని నేర్చుకోవాలి మరియు నేర్పించాలి, అది సాధ్యం కాకపోతే,  దివ్య ప్రబంధం నేర్చుకోవాలి మరియు నేర్పించాలి, అది సాధ్యం కాకపోతే, ఒక దివ్య దేశంలో కైంకార్యాలు చేయాలి, అది సాధ్యం కాదు, తిరునారాయణపురంలో ఒక గుడిసె కట్టుకొని అక్కడ నివసించాలి, అది సాధ్యం కాకపోతే, ద్వయ మహమంత్రం యొక్క అర్ధాలను నిరంతరం ధ్యానం చేయాలి, అది సాధ్యం కాకపోతే, తన బాగోగులు జాగ్రత్తగా చూసుకునే ఒక శ్రీవైష్ణవుని ఆశ్రయించాలి. ఇందులో అర్థం చేసుకోవలసినది ఏమిటంటే, ఒక శ్రీవైష్ణవునికి ఆశ్రయం పొందినప్పుడు, అతను మొదటి 5 సూత్రాలను పాటించినట్టేనని అర్థం చేసుకోవాలి. పిళ్ళై లోకాచార్యులు కూడా శ్రీవైష్ణవ లక్షణం గురించి చెబుతూ ముముక్షుప్పాడి సూత్రం 116 లో ఇదే విషయాన్ని వివరిస్తున్నారు. వారు ఈ సూత్రం లో 10 వాక్యాలు వివరించారు . 6వ వాక్యం ఏమిటంటే “ఇప్పాడి ఇరుక్కుం శ్రీవైష్ణవర్గళ్ ఎత్తమరిణ్తు ఉగన్తిరుక్కైయుం” – ఈ అద్భుతమైన లక్షణాలు కలిగి ఉన్న శ్రీవైష్ణవుడి పట్ల గొప్ప భక్తి / ఆప్యాయత కలిగి ఉండాలని అర్థం చేసుకోవడం. ఈ గుణాన్ని సాధించడం చాలా కష్టం అని మాముణులు  వివరిస్తున్నారు. 10వ వాక్యంలో, శాంతి మరియు ప్రశాంతతతో నిండిన అటువంటి శ్రీవైష్ణవ సహకారం కోసం ప్రయత్నించాలని నొక్కిచెప్పారు. ఈ విధంగా ఎల్లప్పుడూ గొప్ప శ్రీవైష్ణవుల యొక్క సహవాసం కలిగి ఉండటం మరియు వారి మార్గదర్శకత్వం  యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు.
 • మన శ్రీరామానుజ దర్శనం పట్ల ద్వేషము చూపే వారితో స్నేహం చేయడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ప్రతికూలమైన వ్యక్తుల స్నేహానికి దూరంగా ఉండాలి. అలాంటి వారి స్నేహం మన మనస్సుపై సూక్ష్మ ప్రభావము కలుగజేస్తూ చివరికి మనలను కూడా క్రిందికి లాగేస్తుంది.  ప్రాపంచిక విషయాలకు అటువంటి శక్తి ఉంటుంది – మనం భౌతిక కార్యక్రమాలలో నిమగ్నమైనప్పుడు, ఆధ్యాత్మిక విషయాలకు మనం దూరమౌతున్నామని అర్థం.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/07/virodhi-pariharangal-32.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org