Monthly Archives: September 2020

విరోధి పరిహారాలు – 38

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/09/12/virodhi-pariharangal-37/

     71. సిద్ధాంత విరోధి  – సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో వచ్చే అవరోధాలు – భాగం 2

ఎమ్పెరుమానార్ (శ్రీ రామానుజ) – శ్రీపెరుంబూదూర్ – మన సిద్ధాంతాన్ని క్రమబద్ధంగా ప్రచారం చేసినవారు

సిద్ధాంత విరోధి అనే ఈ అంశాన్ని కొనసాగిద్దాము. ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి చాలా వరకు అగాధమైన జ్ఞానం అవసరం. ఈ జ్ఞానాన్నిక్రమబద్ధమైన శాస్త్రాధ్యయనం ద్వారా పొందవచ్చు. సంపూర్ణ అవగాహన కలగడానికి, జ్ఞానుల మార్గదర్శకత్వంతో ఈ సూత్రాలను నేర్చుకోవడం  మంచిది.

  • సామానాధికరణ్యం (అనేక విశేషణాలు / గుణాలతో ఉన్న ఒక విశేష్యం / తత్వం ను వివరించడం), అంతర్లీన తత్వాన్ని స్వీకరించి వాటి గుణాలను నిర్లక్ష్యంచేయడం ఒక అడ్డంకి. శుక్ల పతః అంటే తెల్లని వస్త్రం. వస్త్రం అనేది ఇక్కడ పదార్ధం. తెలుపు అనేది ఆ వస్త్రం యొక్క విడదీయరాని గుణం. ఇటువంటి విడదీయరాని గుణాన్ని విశేషణం అంటారు. అనువాదకుల గమనిక: సామానాధికరణ్యాన్ని “బిన్న ప్రవృత్తి నిమిత్తానాం శబ్దానాం ఏకస్మిన్ అర్తే వృత్తిః” – ఒకే పదార్థాన్నిఅనేక పదాలతో (గుణాలు / అర్థాలు) గుర్తించడం. ఉదాహరణకు, తెల్లని వస్త్రం విషయంలో – వస్త్రం (వస్త్రంగా ఉండటం) మరియు తెలుపుదనం ఆ వస్త్రం యొక్క గుణాలు. కాబట్టి, ఒకే పదార్ధానికి సంబంధించిన అనేక అంశాలను సామానాధికరణ్యం అంటారు. ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మన విశిష్ఠాద్వైత సిద్దాంతంలో అతి ముఖ్యమైన సూత్రాలలో ఒకటి. బ్రహ్మం అనేది విశేష్య (పదార్ధం), ఇది ఆధారం. చిత్ అచిత్తులు విశేషణలు (గుణాలు)  ఆధేయములు (ఆధార పడి ఉన్నవి). పదార్థము మరియు గుణము రెండూ విడదీయరానివి. ఇక్కడ కొన్ని సిద్దాంతాలు చిదచిత్తులను విస్మరించి కేవలం బ్రహ్మం మీద దృష్ఠిసారిస్తాయి. కానీ అది చెల్లదు. వేదార్థ సంగ్రహంలో ఎమ్పెరుమానార్ చేత ఈ సూత్రాలు  అద్భుతంగా వివరించబడ్డాయి. ఇవి పూర్తి అవగాహన పొందడానికి సరైన ఆచార్యుల సమక్షంలో కాలక్షేపంగా విని అర్థం చేసుకోవాలి.
  • ఏక బ్రహ్మం (గుణాలతో) అని కీర్తించడం బ్రహ్మం యొక్క ఏకైక అసమానమైన స్వభావాన్ని నొక్కి చెప్తుందని తెలియకపోవడం ఒక అడ్డంకి. ఏక విశేషణ విశిష్ట ఐక్యార్త పరం – ఒక గుణానికి అనుసంధానమైన ఒక తత్వం.  “స బ్రహ్మా, సశివః సేంద్రః” అని శృతి చెబుతుంది. స – “అతడు” అంటే “ఆ పరమపురుషుడిని” సూచిస్తుంది. అతడు బ్రహ్మ, అతడు శివుడు, అతడు ఇంద్రుడు. ఇక్కడ దీని అర్థం, బ్రహ్మ, శివ, ఇంద్రుడు శరీర / విశేషణ (శరీరం, లక్షణం) అని అర్థం. శ్రీమన్నారాయణుడు  అనేది శరీరి / విశేష్య (ఆత్మ) ని సూచిస్తుంది.  అనువాదకుల గమనిక: వేదంలో సాధారణంగా 3 భాగాలు గుర్తించబడ్డాయి – భేద శృతి (విభిన్న తత్వాల గురించి మాట్లాడేది), అభేద శృతి (ఏకవచన బ్రహ్మం గురించి మాట్లాడేది) మరియు గటక శృతి (బ్రహ్మం మరియు ఇతర వస్తువులను  (చిత్ / అచిత్) కలిపేది) గా గుర్తించబడ్డాయి. ఇతర సిద్దాంతాలు భేద లేదా అభేద శృతులపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, విశిష్ఠాద్వైత సిద్దాంతం గటక శ్రుతిని ఉపయోగించి భేద, అభేద శృతులను సమన్వయం చేస్తుంది. ఏకవచన బ్రహ్మానికి ప్రాధాన్యత ఉన్నచోట, చిత్ / అచిత్ బ్రహ్మల మధ్య గటక శృతి సందర్భానుసారంగా శరీర/శరీరి సంబంధం, విశేషణ / విశేష్య సంబంధం అర్థం చేసుకోవాలి. ఈ రెండు అంశాలలో, ప్రధానంగా మాయావాదం (బ్రహ్మాన్ని మాత్రమే స్వీకరించి మిగతావన్నీ భ్రమ అని స్థాపించే సూత్రాలు) తిరస్కరించబడ్డాయి. నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 8.8.8 పాసురంలో  “కూడిత్తగిల్ నల్లుఱైప్పు” అని వివరించారు. అన్ని వ్యాఖ్యానాలలో ఇదే మూలసూత్రం వివరించబడింది. జీవాత్మ బ్రహ్మంతో సమానం (మరేమీ లేదు) ఎన్నడూ కాలేడు. ఎందుకంటే ఒక వస్తువు ఎప్పటికీ మరొకటిగా మారదు – జీవాత్మ జీవాత్మగానే ఉంటాడు, పరమాత్మ పరమాత్మగానే ఉంటాడు.
  • అనేకత్వ తిరస్కరణ అనేది బ్రహ్మకు భిన్నమైనదేదీ  లేదని నిర్ధారించడమౌతుందని తెలుసుకోకపోవడం ఒక అడ్డంకి. నానాత్వ నిషేదం – అనేకత్వం  యొక్క తిరస్కరణ. “ఏకమేవ అధ్విదీయం, నేహనానాస్థి కించనః” ఇది శృతి అందించిన వాక్కు. కేవలం ఒక్కటే ఉంది – రెండవది లేదు అని అర్థం. నానా – అనేకం కాదు. ఇక్కడ  అనేకత్వం  తిరస్కరించబడింది. కానీ ఈ తిరస్కరణ బ్రహ్మకు భిన్నమైన తత్వాలకు వర్తిస్తుంది. బ్రహ్మం ప్రతిదాని యొక్క అంతరాత్మ (నివాస ఆత్మ) కాబట్టి, ప్రతిదీ బ్రహ్మం (సర్వ బ్రహ్మాత్మకం) చేత విస్తరించబడి ఉంది. బ్రహ్మం చేత విస్తరించబడనిది ఏదీ లేదు.
  • సంహారం (వినాశనం) సమయంలో చిత్ అచిత్తుల సూక్ష్మ ఉనికిని సూచిస్తుంది అని తెలియక పోవడం ఒక అడ్డంకి. సంహారం అనేది విశ్వానికి సంబంధించిన కార్యాలలో మూడవ అంశం. సృష్టి, స్థితి, లయ అని మూడు అంశాలు ఉన్నాయి. సంహారం సమయంలో, చిదచిత్తులు పూర్తిగా నాశనం కావు. అవి నిత్యమైన అస్తిత్వాలు. అవి స్థూల స్థితి నుండి సూక్ష్మ స్థితికి మారి పరబ్రహ్మలోకి ప్రవేశిస్తాయి. సృష్టి సమయంలో భగవాన్ వాటికి మళ్ళీ స్థూల రూపాన్ని ఇస్తారు.  అనువాదకుల గమనిక: ఈ సూత్రాన్ని తిరువరంగత్తు అముదనార్ రామానుజ నూత్తందాది 69 వ పాసురంలో చక్కగా వివరించారు. “చింతైయినోడు కరణంగళ్ యావుం చితైన్తు మున్నాళ్ అంతముత్తాళ్ న్తతు” – సంహారం సమయంలో మనస్సు , ఇంద్రియాలు, శరీరం – అన్నీ సూక్ష్మ స్థితికి మారి మూల ప్రకృతితో కలిసి ఒక్కటవుతాయి. ఆ స్థితిలో, చిత్లు (ఆత్మలు) సూక్ష్మంగా మారతాయి, అచిత్ కూడా సూక్ష్మ స్థితి కలిగి ఉంటాయి, విడదీయలేనివిగా ఉంటాయి. కాని అప్పటికీ అవి ఉంటాయి. చిత్, అచిత్ మరియు ఈశ్వరుడు (దేవుడు) అనే మూడు తత్వములు శాశ్వతమైనవి. చిత్ (ఆత్మలు) లో స్వభావ వికారం (జ్ఞానం వికసించడం, ఇమడటం వంటి గుణ మార్పులు) ఉంటుంది. అచిత్తులో స్వరూప వికారం (స్థూల నుండి సూక్ష్మంగా మరియు వేర్వేరు స్థూల రూపాలను ధరించే స్వభావ మార్పులు) ఉంటుంది. ఈశ్వరుడు ఏ వికారం (మార్పు) లేనివాడు.
  • సోదక వాక్యములలో గుణాలను నిరాకరించడం అమంగళ గుణాలను నిరాకరించడాన్ని ఉద్దేశించినవి అని తెలియకపోవడం ఒక అడ్డంకి. బ్రహ్మను నిర్గుణం (గుణాలు లేని) గా వివరించే కొన్ని వాక్యములు (వచనములు) ఉన్నాయి. అవి బ్రహ్మం అమంగళమైన గుణాలు లేనివాడు అని ఉద్దేశించినవి. ఇప్పటికే బ్రహ్మం “అకిల హేయ ప్రతిపత కళ్యాణ గుణైక తాన” గా స్థాపించబడి ఉన్నాడు కాబట్టి –  అమంగళ గుణాలు లేని, శుభ లక్షణాలకు మాత్రమే నివాసుడైనవాడు అని అర్థం.    అనువాదకుల గమనిక: బ్రహ్మను రెండు రకాల వాక్యాలతో వివరించారు – కారణ వాక్యములు (బ్రహ్మమే అన్నింటికీ కారణమని చెప్పే వచనములు), సోదక వాక్యములు (బ్రహ్మం యొక్క విభిన్న లక్షణాల గురించి మాట్లాడే వచనములు). “యతో వా ఇమాణి భూతాణి జాయంతే, యేణ జాతాణి జీవణ్తి, యత్ప్రయంతి అభిసంవిచంతి, తత విజిజ్ఞాసస్వ, తత్ బ్రహ్మేతి” – ఇది కారణ వాక్యానికి ఒక ఉదాహరణం. ఎవరి చేతనైతే ఈ విశ్వం, జీవులు సృష్టించబడ్డాయో, ఎవరి చేతనైతే ఈ మొత్తం విశ్వం సంరక్షించబడుతున్నదో, ప్రళయ సమయంలో సమస్థ విశ్వం ఎవరి లోనైతే విలీనం అవుతుందో,  మోక్షం సాధించిన తరువాత జీవులు ఎవరి నైతే చేరుకుంటారో, అదే బ్రహ్మం అని తెలుసుకోవాలి. ఈ విధంగా జగత్ కారణత్వ (విశ్వ కారకుడు), ముముక్షు ఉపాస్యత్వ (మోక్షం పొందాలనుకునే వారికి మూలాధార భూతునిగా ఉండటం), మోక్ష ప్రధత్వ (జీవత్మలకు మోక్షాన్ని ప్రసాదించగల సామర్థ్యం కలిగి ఉండటం) – ఇవి సర్వశక్తిమంతుడయిన వాని యొక్క  అతి ముఖ్యమైన గుణాలుగా వివరించబడ్డాయి. “సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ” – ఇది సోదక వాక్యానికి ఒక ఉదాహరణ. బ్రహ్మం జ్ఞానంతో నిండి ఉన్న, అనంతమైనదిగా (దేశానికి కాలానికి పరిమితం కాకుండా) శాశ్వతమైనదిగా వివరించబడింది. ఈ విధంగా సోదక వాక్యములను సరిగ్గా అర్థం చేసుకోవాలి.
  • బ్రహ్మం యొక్క కళ్యాణ గుణాలను ప్రదర్శించే వాక్యములను తేలికగా తీసుకోవడం ఒక అడ్డంకి. “యః సత్యకామః సత్య సంకల్పః” – అతను శుభ లక్షణాలతో నిండి ఉన్నవాడు అని వివరించినట్లుగా, వాటిని విస్మరించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: నమ్మాళ్వార్ తిరువాయ్మొళిని ఈ పాసురంతో ప్రారంభించారు, “ఉయార్వ ఱ ఉయర్ నలం ఉడైయవన్ యవన్” – శుభ లక్షణాలతో నిండిన వాడా అని అర్థం. కూరత్తాళ్వానులు తన శిష్యుడైన పిళ్ళై పిళ్ళై ఆళ్వానుకి వివరిస్తూ, నమ్మాళ్వారులు భగవానుడి కల్యాణ గుణాలను ప్రకటిస్తూ మొదలు పెట్టి తద్వారా నిరంతరం బ్రహ్మం గుణాలు లేని వాడని చెప్పే కుదృష్ఠులపై (వేదాన్ని, వేదార్థాలను తప్పుగా అర్థం చేసుకునేవారు) నేరుగా దాడిచేశారు.  
  • బ్రహ్మ స్వరూపం లేనివాడన్న దానికి అర్థం, బ్రహ్మ తమ కర్మానుసారంగా రూపాన్ని పొందడన్న విషయాన్ని సూచిస్తుంది (భగవాన్ తన కోరిక మేరకు రూపాన్ని ధరిస్తారు) ఈ విషయం తెలియకపోవడం ఒక అడ్డంకి. “నతే రూపం నచాకారః” – శరీరం, రూపం మొదలైనవి లేనివాడు, కర్మానుసారంగా పొందే ఈ లౌకిక శరీరాన్ని సూచిస్తుంది.  భగవాన్ తన కోరికమేరకు అనేకానేక రూపాలను ధరిస్తారని అర్థం చేసుకోవాలి.
  • భగవాన్‌ రూపాన్ని కీర్తించే వాక్యములను నిరాకరించడం ఒక అడ్డంకి. పరమపురుషుడు (అత్యున్నతుడు) అతి సుందర రూపం గలవాడని పూర్తి విశ్వాసం ఉండాలి. ఛాందోగ్య ఉపనిషద్లో ఒక ప్రసిద్ధ వాఖ్యము ఉంది “అంతరాధిత్యే హిరణ్మయః పురుషోదృశ్యతే – తస్యయతా కప్యాసం పుండరీకమేవమక్షిణీ” – సూర్యమండలం మధ్యలో ప్రకాశిస్తూ కనిపించేవాడా అని అర్థం. అతని రెండు నేత్రాలు సూర్యకాంతితో వికసించిన తామర పువ్వును పోలి ఉంటాయి. ఈ విషయాలు తెలియకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఋగ్వేదం ఇలా ఘోషిస్తుంది – “స ఉశ్రేయాన్ భవతి జాయమానః” – భగవాన్ ఈ భూమిపైకి దిగి వచ్చినప్పుడు మరింత ప్రశంసనీయుడవుతాడు. భగవద్గీత 4వ అధ్యాయంలో, శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార రహస్యాన్ని వెల్లడిచేశారు. 5వ శ్లోకంలో అర్జునుడికి వివరిస్తున్నారు, “నేను, నువ్వూ ఇద్దరమూ ఎన్నోసార్లు జన్మించాము. నీ ముందు జన్మల గురించి నీకు తెలియదు, కానీ నావి నాకు తెలుసు”. తరువాతి శ్లోకంలో, “నేను పుట్టుక లేని, మార్పులకు / నాశనానికి బద్దుడుకాని, అందరికీ ప్రభువు అయినప్పటికీ, నా స్వ ఇచ్ఛతో  మళ్లీ మళ్లీ జన్మిస్తాను” అని వివరిస్తున్నారు. తరువాతి శ్లోకంలో, “ధర్మం నశించి, అధర్మం పెరిగినప్పుడల్లా, నేను ఆయా సమయాల్లో అవతరిస్తాను” అని ఉపదేశించారు.  తరువాతి శ్లోకంలో అతను “సజ్జనులను సంరక్షించడానికి, అధర్మాన్ని నిర్మూలించి ధర్మస్థాపనకై నేను అనేక రూపాల్లో కాలానుగుణంగా అవతరిస్తాను” అని ప్రకటించారు. చివరగా 9వ శ్లోకంలో, అర్జునుడికి ఉపదేశిస్తూ “నా దివ్య జన్మను (అవతారాలను), నా దివ్య లీలలను, నిష్ఠతో వాటిని  ధ్యానించేవాడు, తన ఈ జీవితానంతరం సంసారం (జన్మ- మరణ చక్రం) నుండి విముక్తి పొంది నన్ను చేరుకుంటాడు”. కర్మతో కట్టుబడని అనేక దివ్య రూపాలు భగవానుడికి ఉన్నాయని, వీటి నుండి మనం అర్థం చేసుకోవచ్చు.
  • ఉభయ లింగ విశిష్ఠుడు (రెండు ప్రత్యేకమైన వ్యక్తిత్వాలు ఉన్నవాడు), విలక్షణ విగ్రహ విశిష్ఠుడు (అసమానమైన రూపం ఉన్నవాడు), శ్రియః పతి (శ్రీ మహలక్ష్మి యొక్క దివ్య పతి), అకార వాచ్యుడు (“అ” – అకారంతో గుర్తింపబడేవాడు) అత్యోన్నత ప్రభువు భగవానుడని తెలియకపోవడం ఒక అడ్డంకి. అకార వాచ్యుడు – ప్రణవం (ఓం) అనేది వేదం యొక్క సారాంశం. ఇది “అ”, “ఉ”, “మ” అక్షరాల యొక్క కలయిక. ఇందులో, అకారం (అ) అత్యోన్నతుడైన శ్రీమన్నారాయణుడను సూచిస్తుంది. సర్వస్మాత్పరుడు – ఆయనకు సమానమైనవాడు గానీ లేదా అతని కంటే ఎక్కువ ఎవ్వరూ లేనివాడు. ఉభయ లింగ  విశిష్ఠుడు – 2 ప్రత్యేక వ్యక్తిత్వాలను  కలిగి ఉన్నవాడు, అవి అకిల హేయ ప్రత్యనీక (అన్ని అమంగళ గుణాలకు వ్యతిరేకమైనవాడు),  కల్యాణ గుణ పూర్ణుడు (శుభ లక్షణాలతో నిండి ఉన్నవాడు). అతను చాలా శుద్ధమైనవాడు,  ఇతరులను పరిశుద్ధి చేసే సామర్ధ్యం గలవాడు. పరత్వం (ఆధిపత్యం) మరియు సౌలాభ్యం (సరళత) రెండూ కలిగి ఉన్నవాడు. అకారం ప్రధానంగా కారణత్వం (సర్వ కారకుడు) మరియు రక్షకత్వం (సర్వ రక్షకుడు) గురించి నొక్కి చెబుతుంది.
  • శ్రీమన్నారాయణుడు జగత్కారణుడని (సర్వ కారకుడు)  తెలియకపోవడం ఒక అడ్డంకి. ఛాందోగ్య ఉపనిషత్తులో “సదేవ సోమ్య! ఇదమగ్ర ఆసీత్, ఏకమేవ, అధ్విదీయం” అని వివరించబడింది. అదే బ్రహ్మమును సుభాల ఉపనిషత్తులో “ఏకోహవై నారాయణ ఆసీత్, నబ్రహ్మా, నేశానః” అని వివరించబడింది. దీని నుండి, నారాయణుడే సర్వ కారకుడు అని స్పష్టమవుతుంది. అనువాదకుల గమనిక: మొదట, ఛాందోగ్య ఉపనిషత్తులో, ఉద్దాలకరుడు తన పుత్రునికి ఇలా వివరించారు – (సృష్ఠికి ముందు) సత్ మాత్రమే ఉండేది, మరేదీ ఉండేది కాదు. ఇక్కడ, బ్రహ్మం కాకుండా మిగతా అన్నిటిని తిరస్కరించే 3 విభిన్న అవధారణములు (సదేవ, ఏకమేవ, అద్వితీయం) అనే మూడు వేర్వేరు కారణాలు వివరించబడ్డాయి. అవి ఉపాధాన కారణం (భౌతిక కారణం), నిమిత్త కారణం (సమర్థవంతమైన కారణం), సహకారికా కారణం (సహాయక కారణం).  ఉదాహరణకు, ఒక కుండను తయారు చేయడానికి, మట్టి అనేది ఉపాదాన కారణం, కుమ్మరి (కుండను తయారు చేయాలనే అతని కోరిక) నిమిత్త కారణం, కర్ర, చక్రం మొదలైనవి సహకారిక కారణం. శృష్ఠికి, చిత్ (ఆత్మలు) మరియు అచిత్ (పదార్థం) ఉపదానం – ఇవి బ్రహ్మమునకు శరీరం వంటివి. బ్రహ్మం యొక్క సంకల్పం నిమిత్త కారణం. బ్రహ్మం యొక్క జ్ఞానం, శక్తి మొదలైనవి సహకారికం. ఇదే సూత్రాన్ని నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 2.8.10 పాసురంలో “వేర్ ముదలాయ్ విత్తాయ్” – వేర్ (వేరు) సహకారి, ముదల్ (పెరగాలనే కోరిక) అనేది నిమిత్తం, విత్తు (విత్తనం) ఉపాదానం అని వివరించబడింది.  ఇక్కడ భగవానుడే అన్ని 3 కారణాలుగా గుర్తించబడ్డాడు. అదే బ్రహ్మమును సుభాల ఉపనిషత్తులో నారాయణుడిగా గుర్తించబడింది. అక్కడ అప్పుడు ఆ సమయంలో నారాయణుడు మాత్రమే ఉనికిలో ఉన్నాడని,  బ్రహ్మ, శివ మొదలైనవారు లేరని వివరించబడింది.  నారాయణుడు సమస్తానికి అత్యున్నత కారణమని వీటి నుండి మనం అర్థం చేసుకోవచ్చు.
  • ప్రాధమిక కారణాలని ప్రధానం (పదార్థం), పరమాణు (పరమాణు కణం) అని కీర్తించే సూత్రాలలో స్పష్టత కలిగి ఉండక పోవడం ఒక అడ్డంకి. ప్రధానం అనేది అచిత్ అయిన ప్రకృతి. మట్టి దానికదే కుండగా మారదు. ఒక తత్వం దానికదే స్వతంత్రంగా ప్రథమ కారణం కాలేదు. పరమాణు (పరమాణు కణం) కారణం కణాద చేత సమర్పించబడుతుంది. ఇది కూడా స్వీగీకరించలేము. సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు అన్ని విశ్వాలలో అంతర్యామిగా సర్వవ్యాప్తి చెంది ఉన్నావాడు అన్నది మాత్రమే కారణం, “వేర్ ముదలాయ్ విత్తాయ్” లో చూసినట్లు దీనిపై ఎటువంటి సందేహం ఉండకూడదు. అనువాదకుల గమనిక: పిళ్ళై లోకాచార్యులు, తత్వ త్రయ సూత్రము 153 నుండి 156 వరకు ప్రధానం మరియు పరమాణు కారణం అనే భావనను తిరస్కరించారు. మాముణుల ఈ సూత్రాలకు అందమైన వివరణ ఇచ్చారు. పరమాణు (అణు కణము) కారణమని బౌద్ధ, జైన మరియు వైశేషికుల చేత ప్రచారంలోకి వచ్చింది. ప్రధానం (ప్రకృతి – అచిత్ – తత్వం) కారణమని కపిల మహర్షి చేత ప్రచారంలోకి వచ్చింది. ఈ సూత్రాలు శ్రుతికి విరుద్ధమైనవి, తర్కానికి మించినవి కాబట్టి వాటిని స్వీకరించలేము.
  • బ్రహ్మ, శివ (నారాయణ చేత సృష్టించబడిన) మొదలైనవారిని పరత్వం (ఆధిపత్యం), కారణత్వం (సర్వ కారకుడు) అని భావించడం  ఒక అడ్డంకి. తిరుమళిసై ఆళ్వార్ నాన్ముగన్ తిరువంతాది 1వ పాసురంలో, “నాన్ముగనై నారాయణన్ పడైత్తాన్, నాన్ముగనుం తాన్ముగమాయ్ శంకరనైత్తాన్ పడైత్తాన్” – నారాయణుడు బ్రహ్మను సృష్టించాడు, బ్రహ్మ శంకరుని సృష్టించాడు. బ్రహ్మ, రుద్ర మొదలైన దేవతలు  శ్రీమన్నారాయణుడి చేత సృష్టించబడ్డారు. ఆధిపత్యానికి అవకాశమే లేదు, వారు కారణమనే ప్రశ్నే తలెత్తదు.
  • బ్రహ్మ, విష్ణు, రుద్రాలను సమానంగా పరిగణించడం ఒక అడ్డంకి. బ్రహ్మ, విష్ణు, శివుడిని త్రిమూర్తులని కీర్తిస్తారు. ముదల్ తిరువంతాది 15వ పాసురంలో పోయిగై ఆళ్వారులు ఈ విధంగా వివరించారు, “ముదలావార్ మూవరే – అమ్మువారుళ్ళుం ముదలావాన్ మూరి నీర్ వణ్ణన్” – ఇతర దేవతల మినహా ప్రాధాన్యతగల ముగ్గురు దేవతలున్నారు. వారిలో,  సముద్రపు నీటి వంటి నీలం రంగును పోలిన శరీర రంగు గలవాడు అత్యున్నతుడు. ఈ పాసురంలో వివరించినట్లుగా, బ్రహ్మ (సృష్టి బాధ్యత వహిస్తాడు), విష్ణు (సంరక్షణ బాధ్యత వహిస్తాడు), శివుడు (వినాశన బాధ్యత వహిస్తాడు). వీరు ముగ్గురిలో విష్ణు మూలభూత దేవుడు. వీరు ముగ్గురు ఒకే స్థాయికి చెందిన వారు కాదు.  అనువాదకుల గమనిక: నంపిళ్ళై ఈ పాసుర వ్యాఖ్యానంలో ఈ ముగ్గురిపైన దృష్టి పెట్టడానికి గల కారణాన్ని చెబుతున్నారు. ఆళ్వార్ ఈ ముగ్గురు దేవుళ్ళ గురించి మాట్లాడుతూ (ముక్కోటి దేవతల గురించి చెప్పడానికి బదులుగా), వీళ్ళలో ఇద్దరిని తిరస్కరించడంతో విష్ణువు అత్యున్నతుడని నిరూపించడం సులభం. పిళ్ళై లోకాచార్యులు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో వివిధ రకాల అపచారాల గురించి వివరించారు. భగవత్ అపచారము గురించి వివరించేటప్పుడు, సూత్రం 303 లో,  దేవతాంతరములను శ్రీమన్నారాయణుడితో సమానంగా పరిగణించడం మొదటి నేరం అని వివరిస్తున్నారు. నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 2.3.2 లో కూడా “ఒత్తార్ మిక్కారై ఇలైయాయ మా మాయా” – అతనికి సమానమైన లేదా ఉన్నతమైన వారెవరు లేని గొప్పవాడు. ఇది స్వేతస్తర ఉపనిషత్ వాక్యం “న తత్ సమశ్చ అభ్యధికశ్చ దృశ్యతే” అని వివరిస్తుంది.
  • సర్వ రక్షకుడు (అందరికీ రక్షకుడు/విమోచకుడు – శ్రీమన్నారాయణుడు) కాకుండా ఇతర మరెవరినైనా రక్షణగా (రక్షకుడు / విమోచకుడు) భావించడం ఒక అడ్డంకి. అకార వాచ్యమైయిన  (“అ” యొక్క అర్ధం) శ్రీమన్నారాయణుడే అందరికీ రక్షకుడు. అన్ని వరాలనివ్వ గలవాడు. దేవతాంతరములకు ఈ సామధ్యం లేదు. అనువాదకుల గమనిక: పిళ్ళై లోకాచార్యులు ప్రపన్న పరిత్రాణం అనే ఒక రహస్య గ్రంథాన్ని రాశారు. శ్రీమన్నారాయణుడు మాత్రమే రక్షకుడని, మమ్మల్ని రక్షించి / విముక్తులను చేయగలిగిన వారెవరూ లేరని ఈ గ్రంథంలో వారు వివరించారు. ముముక్షుప్పడి 36 వ సూత్రంలో, పిళ్ళై లోకాచార్యులు రక్షకం అనే పదం యొక్క అర్ధాన్ని వివరించారు. రక్షకం అంటే అడ్డంకులను తొలగించి కోరికలను తీర్చడం అని వివరిస్తున్నారు. జీవాత్మల బట్టి అడ్డంకులు మరియు కోరికలు మారుతాయని వారు అ తరువాతి సూత్రాలలో వివరిస్తున్నారు. ఒక సంసారీకి (భౌతికవాది), శత్రువులు, వ్యాధులు మొదలైనవి అడ్డంకులు. మంచి భోజనం, లౌకిక సుఖాలు మొదలైనవి వారి కోరికలు. ముముక్షువుకి (మోక్షాన్ని కోరేవాడికి), ఈ సంసారంలో ఉండడమే ఒక అడ్డంకి. పరమపదం చేరుకొని భగవానుడికి నిత్య కైంకర్యం చేయాలనేదే వారి కోరిక. ముక్తులకు (ముక్తి పొందినవారు), నిత్యులకు (నిత్య సూరులు) కైంకర్యంలో అంతరాయం ఒక అడ్డంకి మరియు కైంకర్యంలో వృద్ధిపొందాలనేదే వారి కోరిక. వారు ప్రపన్న పరిత్రాణం సుత్రం 39 లో, “శ్రీమన్నారాయణుడు తప్ప మరొక మోక్షప్రదాత లేడు” అని వివరిస్తున్నారు. అందువల్ల ఏ అడ్డంకులు వచ్చినా, వాటిని తొలగించేది భగవాన్ మాత్రమే. కోరికలు ఏమైనప్పటికీ, భగవాన్ మాత్రమే వాటిని తీర్చగలడు. అధములు తమ కోరికలను తీర్చమని దేవతాంతరములను వేడుకున్నప్పుడు కూడా, అంతర్యామిగా ఉన్న భగవాన్, ఆయా దేవతల ద్వారా ఆ కోరికలను తీరుస్తాడు.
  • శ్రీమన్నారాయణుడు కాకుండా మరొకరిని ప్రభువుగా భావించడం ఒక అడ్డంకి. శ్రీ మహాలక్ష్మి యొక్క దివ్య పతి అయిన శ్రీమన్నారాయణుడే, పరమపదం (నిత్య విభూతి – శ్రీ వైకుంఠం) మరియు సంసారం (లీలా విభూతి – భౌతిక ప్రపంచం) రెండింటికి ఏకైక యజమాని. శేషి అనగా యజమాని, స్వామి, ప్రభువు. ఇతర మరెవరినీ ఈశ్వరునిగా (నియంత్రించువాడు) పరిగణించడం అపరాధం. అనువాదకుల గమనిక: మనం ఈ విషయాన్ని తిరుమళిసై ఆళ్వార్ మాటల ద్వారా  నాన్ముగన్ తిరువంతాది పాసురం 53లో ఇప్పటికే చూశాము, “తిరువిల్లాత్ తెవరై తేరేన్మిన్ దేవు” –  శ్రీ మహలక్ష్మితో సంబంధం లేని ఈ ఇతర దేవతలను నేను ఎన్నడూ దేవతలుగా పరిగణించను. ముముక్షుప్పడిలో, భగవాన్ ఇతరులను రక్షించేటప్పుడు, విముక్తులను చేసేటప్పుడు ఎప్పుడూ శ్రీ మహలక్ష్మితో ఉంటారని భగవాన్ రక్షకత్వం యొక్క విభాగంలో పిళ్ళై లోకాచార్యులు వివరిస్తున్నారు.
  • శ్రీమన్నారాయణుడు కాకుండా మనం ఆరాదించాల్సిన పరబ్రహ్మ మరింకెవరో ఉన్నారని భావించడం ఒక అడ్డంకి. ముముక్షు అనగా మోక్షాన్ని (ముక్తి – పరమపదంలో నిత్య కైంకర్యం) కోరుకునేవాడు. శ్రీమన్నారాయణుడు  మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలడు. మరెవరూ ఇవ్వలేరు. కాబట్టి, అటువంటి ముముక్షువు శ్రీమన్నారాయణుడను మాత్రమే నమ్మకంగా ధ్యానించాలి. అనువాదకుల గమనిక: ఛాందోజ్ఞ ఉపనిషద్ ఇలా అంటుంది “కారణం తు ద్యేయః” – ధ్యానించవలసిన అత్యోన్నత కారణం. ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఈ సూత్రం మన ధ్యాన వస్తువును స్థాపిస్తుంది – కాని ఇది అత్యోన్నత కారణం ఏమిటని నిర్వచించ లేదు. అత్యోన్నత కారణం శ్రీమన్నారాయణుడు మాత్రమే అని మనం ఇప్పటికే చూశాము. ఈ రెండింటినీ అనుసంధానించడం ద్వారా, సిద్ధాంతం స్థాపించబడింది – అనగా, మనం అత్యున్నత  కారణంపై దృష్ఠి పెట్టాలి, ఆ అత్యున్నత కారణం శ్రీమన్నారాయణుడు. కాబట్టి, నిరంతరం మనం శ్రీమన్నారాయణుడి చింతన చేయాలి. శ్రీమన్నారాయణుడను “ముకుంద” అని పిలుస్తారు, అంటే ముక్తిని ప్రసాదించేవాడు అని కూడా మనం గమనించాలి.
  • పురుషోత్తముడు (మోక్ష ప్రదాత) కాక, మన కోరికలను తీర్చగలవాడు ఇంకొకరెవరూ లేరని తెలియకపోవడం ఒక అడ్డంకి. సర్వ అభిమత ఫల ప్రదాత – అన్ని రకాల కోరికలను తీర్చగలవాడు. దేవతాంతరములు భౌతిక వరాలు మాత్రమే ఇవ్వగలవు. కానీ పరమ పురుషుడు కేశవుడు అన్ని కోరికలను తీర్చడంతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించగలడు.
  • క్షుద్ర దేవతలను ఆరాధించడం ఒక అడ్డంకి. క్షుద్రం – చిన్న/ నిమ్న అని అర్థం. అనువాదకుల గమనిక: గతంలో సూచించినట్లుగా, దేవతాంతరములు భౌతిక వరాలు మాత్రమే ఇవ్వగలదు. కానీ ఒక ప్రపన్నునికి, భౌతిక కోరికల నుండి విముక్తి పొంది, శ్రీమన్నారాయణుని నిత్య కైంకర్యంలో స్థిరపడటమే వారి లక్ష్యం. భగవద్గీత, 7 వ అధ్యాయంలో, భగవాన్ అన్య దేవతల యొక్క స్వభావ పరిమితులు మరియు వారు ఇచ్చిన వరాలను వివరిస్తున్నారు. దేవతాంతరముల ఆరాధన చేయడం, ఈ సంసారంలో మన జన్మ / మరణ చక్రాన్ని పునరావృతం చేస్తుంది. అందుకని వారి ఆరాధనను స్పష్టంగా తిరస్కరించారు.
  • తాత్కాలికమైన / అల్పమైన అంశాల పై కోరికలు కలిగి ఉండటం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక:  మునుపటి వివరణ మాదిరిగానే. ఒక ప్రప్పన్నుడు కావడంతో, తాత్కాలిక మరియు అల్పమైన అంశాల పట్ల ఆసక్తిని పెంచుకోకూడదు. పరమపదంలో భగవానుడి నిత్య కైంకర్యంపై దృష్టి పెట్టాలి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో – http://ponnadi.blogspot.com/2014/09/virodhi-pariharangal-38.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

విరోధి పరిహారాలు – 37

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/08/29/virodhi-pariharangal-36/

71.  సిద్ధాంత విరోధి  – సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో వచ్చే అవరోధాలు  – భాగం 1

పెరియ పెరుమాళ్ – ప్రథమాచార్య

నమ్మాళ్వార్ – ఎమ్పెరుమానార్ – పిళ్ళై లోకాచార్యులు – మాముణులు

సిద్ధాంతం అంటే స్థాపించబడిన ఉపదేశాలు అని అర్థం. ఏదైనా ఒక విషయంపైన, తప్పు అవగాహనలను తిరస్కరించి సరైన అవగాహనను ఏర్పరచడాన్ని సిద్ధాంతం అంటారు. ఏ సిద్ధాంతం అయినా, అది తప్పని సరిగా వేదానికి అనుగుణంగా ఉండాలి, శాస్త్ర ప్రమాణాలు ఉండాలి, పండితుల వివరణలు ఉండాలి. ఒక సిద్ధాంతాన్ని స్థాపించబడడానికి శాస్త్రంలోని రుజువులను ప్రమాణాలు అంటారు. వేదం శాశ్వతమైనదని, మచ్చలేని ప్రమాణంగా ఆస్తికులు (వేదాన్ని అత్యున్నత ప్రాధికరణము అని అంగీకరించిన పండితులు) అందరు అంగీకరించారు. వ్యాస భగవానుడి దివ్య పలుకులు ఇలా ఉన్నాయి –  “వేదాత్ శాస్త్రం పరం నాస్తి న దైవం కేశవాత్పరం” – (వేదానికి  మించిన గ్రంథము లేదు, కేశవునికి సమానమైన దేవుడు లేడు). పరం అన్న పదం ఆధిపత్యాన్ని (దానికి సమానమైన/ మించినది లేనిది) సూచిస్తుంది . నమ్మాళ్వారుల తిరువాయ్మొళి యొక్క మొదటి తనియన్లో “ద్రావిడ వేద సాగరం” (ద్రావిడ వేద సముద్రం) అని  వివరిస్తున్నారు. ఆళ్వారులందించిన దివ్య ప్రబంధం వేదంతో సమానంగా పరిగణించబడింది. ఈ  సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రమిది, “నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః….యచ్చ కించిత్ జగత్ యస్మిన్ దృశ్యతే స్రూయతేపిచ, అంతర్ బహిశ్చ తత్ సర్వం వ్యాప నారాయణస్స్తితః” – నారాయణుడే మహోన్నత బ్రహ్మ, వారే సర్వశ్రేష్ట సూత్రం…ఈ విశ్వములో కనిపించేది/వినిపించేది ఏదైనా అన్నింటి లోపల బయట నారాయణుడే వ్యక్తమవుతున్నాడు.  దీని అంతరార్థం ఏమిటంటే వారే ప్రతి వస్తువులో నివసించే ఆత్మగా (అంతర్యామిగా) ఉన్నాడు. అతను అన్నింటిలో అంతర్యామిగా ఉండటం ద్వారా వారందరినీ భరిస్తాడు. ఈ పరిచయంతో, ఇప్పుడు ఈ విభాగంలో ముందుకు వెళదాము. అనువాదకుల గమనిక: మన సిద్ధాంతానికి విశిష్టాద్వైత సిద్ధాంతం అని పేరు పెట్టారు – సంపూర్ణ వైధిక సిద్ధాంతమిది (వేదం, వేదాంతం మొదలైన వాటిపై ఆధారపడి ఉన్న సిద్ధాంతం). అనాది నుండి ఉన్న ఈ సిద్ధాంతం శాశ్వతమైనది. పరాశర, వ్యాస, బోదాయన, టంక, ద్రమిడ వంటి ఋషులు మొట్ట మొదట ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. తరువాత, ఆళ్వారులు అవతరించి వైధిక సారాన్ని ప్రతిబింబిస్తున్న ఈ ద్రవిడ వేదాన్ని ప్రచారం చేశారు. శ్రీ రామానుజులు  బ్రహ్మ సూత్రం మరియు భగవద్గీతకు వివరణాత్మక వ్యాఖ్యానాలు రాశారు. ఉపనిషత్తుల ప్రధాన సూత్రాలను వారు తమ ఇతర రచనలలో వివరించారు. శ్రీ రామానుజుల రచనలను లోతుగా వివరించిన ప్రధాన ఆచార్యలలో ఒకరు శృత ప్రకాశికాచార్యులు. ఆళ్వారుల పాసురములను అనేక వ్యాఖ్యానాల ద్వారా  వివరించారు. ఆళ్వారుల దివ్య పాసురముల యొక్క కొన్ని సంక్లిష్టమైన అర్థాలను వెలికి తెచ్చిన ప్రధాన ఆచార్యులలో నంపిళ్ళై ఒకరు. వారి  శిష్యులైన పెరియవాచాన్ పిళ్ళై మరియు వడక్కు తిరువీధి పిళ్ళై, నమ్మాళ్వారి తిరువాయ్మొళి  యొక్క దివ్య పాసురార్ధాలను వెలికి తీసే ప్రయత్నంలో అతనికి పూర్తి సహాయం చేశారు. పిళ్ళై లోకాచార్యులు మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు తిరువాయ్మొళి యొక్క సారాన్ని అందంగా వెలికి తెచ్చి అనేక అద్భుతమైన రహస్య గ్రంథాలుగా (రహస్య సాహిత్యం) నమోదు చేశారు. మణవాళ మాముణులు ఈ రహస్య గ్రంథాలకు అద్భుతమైన వ్యాఖ్యానాలు రాశారు. దివ్య ప్రబంధం, వేదాంతం మరియు రహస్య గ్రంథాల మధ్య సంబంధాన్ని వారు ఎన్నో ఉపన్యాసాలలో అద్భుతంగా వివరించారు. ఈ విధంగా, చరిత్రలో అనేక తరాల నుండి ఈ సిద్ధాంతం ఎందరో గొప్ప పండితులచే పోషింపబడుతూ వస్తుంది. ఈ సిద్ధాంత ప్రధాన సూత్రం ఏమిటంటే, 3 తత్వాలు ఉన్నాయి – చిత్ (అసంఖ్యాక జీవాత్మలు), అచిత్ (అసంఖ్యాక జీవంలేని పదార్థాలు) మరియు ఈశ్వరుడు. ఇక్కడ, ఈశ్వరుడు (సర్వశ్రేష్ఠ భగవానుడు) మరియు చిత్ (చేతనము గలవి) / అచిత్ (చేతనము లేనివి) – మధ్య రెండు ముఖ్యమైన సంబంధాలు ఉన్నాయి. మొదటిది శరీర / శరీరి భావం – అనగా, భగవానుడు చేతనాచెతనములలో అంతరాత్మ (శరీరి – శరీరం ఉన్నది)  రూపంలో నివాసుడై ఉన్నాడు, మరలా అవి (చిత్ అచిత్తులు) భగవాన్ యొక్క శరీరాలు. రెండవది విశేషణ / విశేష్య భావం – అనగా, భగవానుడు అనే వాడు ఒక్కడు (విశేష్య – విషయం), చిత్ అచిత్తులను తమ గుణాలు (విశేషణ) గా  కలిగి ఉన్నవాడు. కాబట్టి, కలిపి చూస్తే, చిత్ / అచిత్తులతో కలిసి ఉన్న భగవానుడు ఒక విలక్షణమైన అస్తిత్వమని చెప్పబడింది, అతనికి సమానమైన ఇంకొక రెండవ అస్తిత్వం ఉండదు. అలాగే, శాస్త్రం నుండి వివిధ ప్రమాణాల ద్వారా శ్రీమన్నారాయణుడు అత్యున్నతుడని స్థాపించబడింది. ఈ విభాగంలో, ఎన్నో లోతైన సూత్రాలు వెల్లడి చేయబడ్డాయి. వీటిని అర్థం చేసుకోవడానికి చాలా వరకు వేదం, వేదాంతం మొదలైన వాటి యొక్క కొన్ని ప్రాథమిక సూత్రాల ముందస్తు జ్ఞానం అవసరం. అతివిస్తారమైన విభాగం ఇది. ఇప్పుడు మనం విభాగంలోకి వెళ్లి ఈ విషయం గురించి మరింత తెలుసుకుందాం.

  • వైధిక సిద్ధాంతానికి (వేదం/ వేదాంత సిద్ధాంతాలు) విరుద్ధమైన ప్రమాణాలను స్వీకరించడం ఒక అడ్డంకి. వేద ప్రమాణాలకు  విరుద్ధంగా వివరించబడిన సూత్రాలు, అవి ఎవరు వివరించినా సరే, అటువంటి విరుద్ధమైన సూత్రాలకు స్వీకరణ చూపకూడదు. అనువాదకుల గమనిక: ఈ అంశాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన విషయం ఒకటుంది. శాస్త్రం మరియు శాస్త్ర తాత్పర్యాలు (సారాంశాలు) ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. మన పూర్వాచార్యుల వంటి ఉన్నత జ్ఞానులు శాస్త్రం మరియు శాస్త్ర తాత్పర్యాలు రెండింటిపై లోతైన అవగాహనతో సూత్రాలను వాక్చాతుర్యంతో వివరించారు. ఉదాహరణకు, మన శాస్త్రంలో వర్ణాశ్రమ ధర్మానికి  ప్రాధాన్యమివ్వడం జరిగింది. కానీ భగవత్ కైంకర్యం మరియు భాగవత ధర్మం (భాగవతులతో వ్యవహరించడం) గురించి కూడా శాస్త్రంలో వివరించబడింది. మన పూర్వాచార్యులు శాస్త్రాన్ని క్షున్నంగా అర్థం చేసుకొని వర్ణాశ్రమ ధర్మం మరియు భగవత్ కైంకర్యం / భాగవత ధర్మం రెండింటి గురించి చక్కని సమతుల్యతతో వివరించారు. వారు రెండింటి యొక్క ప్రాముఖ్యతను కీర్తించారు, అయినప్పటికీ భగవత్ / భాగవత కైంకర్యం వర్ణాశ్రమ ధర్మానికంటే అధిక ప్రధాన్యమైనదని స్థాపించారు.  సిద్ధాంతాన్ని స్పష్టంగా స్థాపించే మన పూర్వాచార్యుల మేధస్సును అర్థం చేసుకోవడానికి ఇది మంచి ఉదాహరణ.
  • ప్రత్యక్ష్యానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ వేదంలో వివరించినవి స్వయం స్పష్టమైనవని అర్థంచేసుకొనక పోవడం ఒక అడ్డంకి. సాధారణంగా ప్రమాణం అంటే రుజువు. మన పూర్వాచార్యులు 3 ప్రమాణములను వివరించారు –  ప్రత్యక్ష్యం (ఇంద్రియాల ద్వారా ప్రత్యక్ష అవగాహన – దృష్టి, స్పర్శ, ధ్వని, వాసన మరియు రుచి), అనుమానం (పూర్వ జ్ఞానం ఆధారంగా అనుమానాలు – ఉదాహరణకు, పొగను చూసినప్పుడు అగ్ని ఉందని మనము అర్థం చేసుకుంటాము – ఇది పొగ, అగ్ని (రెండిటిని) కలిపి చుసిన మన గత జ్ఞానంపై ఆధారితమైనది, శబ్దం (వేదం, వేదసూత్రాలను వివరించే సహాయక సాహిత్యం). వీటిలో, వేదాన్ని స్వతః ప్రమాణం అని వివరించబడింది – స్వయం ప్రత్యక్షమైనది (స్వయం ప్రమాణం) – ఏ ప్రశ్నకు అవకాశం లేకుండా, సూత్రాలు వాటికవే వివరణలు. ఇవి “ప్రశ్నించలేని ప్రమాణాలు” గా వివరించబడ్డాయి. ఆస్తికుడంటే భగవంతుడు ఉన్నాడని స్వీకరించినట్లే, వేదం యొక్క ఆధిపత్యాన్ని కూడా స్వీకరించేవాడు. అనువాదకుల గమనిక: వేదం/ శాస్త్రం ఉన్నది ప్రధానంగా జీవాత్మల కోసం. ఇంతకు ముందు వివరించిన మూడు తత్వాలలో, భగవాన్ సర్వజ్ఞుడు (అన్నీ తెలిసినవాడు) అందువల్ల వేదం వారికి అవసరం లేనిది. అచిత్తులకు (అచేతన పదార్థాలు) జ్ఞానం ఉండదు కాబట్టి వేదం వాటికి ఎటువంటి ఉపయోగం లేనిది. కానీ జీవాత్మలకు, వేదం అనేది వారి జీవితాలను సరిదిద్దుకోడానికి, ఆధ్యాత్మికంగా పైకి ఎదగి చివరికి మోక్షాన్ని పొందడానికి మార్గ దర్శకం. ఒక తల్లి తన బిడ్డపై ఉన్న ప్రేమకంటే  1000 రెట్లు ఎక్కువ వేదానికి / శాస్త్రానికి  జీవాత్మలపై శ్రద్ధ  ఉందని వివరించబడింది. వేదం ఖచ్చితంగా జీవాత్మల శ్రేయస్సుకి, వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది అని వివరించబడినది . కాబట్టి, మన ప్రత్యక్ష అవగాహనకు విరుద్ధంగా అనిపించే కొన్ని విషయాలు ఉన్నప్పటికీ, మనం వేదాన్ని అంగీకరించాలి, దానికి పూర్తిగా కట్టుబడి ఉండాలి. ఉదాహరణకు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, లౌకిక వ్యవహారాలకు దూరంగా ఉండి భగవానుడిపై దృష్ఠిపెట్టాలని శాస్త్రం చెబుతుంది. ఆహారనియంత్రణ (ఉపవాసం ఉండటం చాలా మందికి కష్టకరమైనది) చేయమని శాస్త్రం నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని ఆశ్చర్యపోవచ్చు – కాని ఇక్కడ, ఉన్నత ఆధ్యాత్మిక స్థాయికి మనం ఎదిగేలా శాస్త్రం సహాయపడుతుందని మనం అర్థం చేసుకున్నట్లైతే,  శాస్త్ర సూత్రాలను మనం పూర్తిగా అంగీకరిస్తాము. వాటిని అనుసరించే ప్రయత్నం కూడా చేస్తాము.
  • వేద వేదాంతార్ధాలను విస్తృతంగా వివరిస్తున్న స్మృతి, ఇతిహాసం, పురాణములు మొదలైన వాటిపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండకపోవడం ఒక అడ్డంకి. వేద ఉప బృహ్మణం – ఇవి వేద సూత్రాలను అర్థం  చేసుకోవడానికి మనకు సహాయపడే సహాయక సాహిత్యాలు. వీటిలో స్మృతి, ఇతిహాసం, పురాణాలు మొదలైనవి ఉన్నాయి. స్మృతి అంటే వేద సూత్రాలను దృష్టిలో ఉంచుకుని రాసిన సాహిత్య సంకలనం. ఇతిహాసములు- మహాకావ్యములు- చారిత్రిక పత్రాలు – శ్రీ రామాయణం మరియు మహాభారతం. పురాణాలలో శ్రీ విష్ణుపురాణం మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ దృఢమైన ప్రమాణములు (ఆధారములు) అని ఒక బలమైన నమ్మకం మనకుండాలి. భగవాన్ స్వయంగా “సృతిస్ స్మృతిర్ మామైవాజ్ఞా, ఆజ్ఞాచ్చేతీ మమ ద్రోహి, మద్ భక్తోపి  వైష్ణవః” – శృతి స్మృతులు స్వయంగా నా ఆదేశాలు, వాటిని అనుసరించని వారు ద్రోహులు. అతను నా భక్తుడైనా సరే వైష్ణవుడిగా పరిగణించబడడు. శృతి (వేదం), స్మృతి, ఇతిహాసాలు, పురాణాలు మొదలైనవన్నింటిని సమిష్టిగా శాస్త్రం అంటారు. శ్రీ కృష్ణ పరమాత్మ  భగవద్గీత 16.24 లో ఇలా ఉపదేశించారు, “తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే” – అందువల్ల శాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి / ప్రమాణంగా స్వీకరించాలి. అనువాదకుల గమనిక: పిళ్ళై లోకాచార్యులు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రాన్నిఇలా ప్రారంభిస్తున్నారు,  “వేదార్థం అఱుధియిడువదు స్మృతి ఇతిహాస పురణంగలలే” – స్మృతి, ఇతిహాసాలు, పురాణాలలో వేదార్థాలు దృఢంగా వివరించబడ్డాయి. మాముణులు ప్రారంభించడానికి ఉత్తమ వివరణ ఇస్తున్నారు. ప్రమాతా (ఆచార్య – పూర్వాచార్యులు) ప్రమాణం ద్వారా ప్రమేయాన్ని (లక్ష్యం)  స్థాపించాల్సిన అవసరం ఉందని అన్నారు. వేదం అంతిమ ప్రమాణమని అద్భుతంగా స్థాపించారు. కాబట్టి, మొదట అత్యున్నత ప్రమాణమేదో తెలుసుకోవాలి, వాటికి సంబంధించిన సహాయక సాహిత్యాలను సరైన గురువుల నుండి విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. తరువాత, మాముణులు జాబితా చేయబడిన అనేక విభిన్న సహాయక సాహిత్యాలు ఉన్నాయని,  వేదార్ధాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడటానికి అవి ఎలా విలువైనవో ఇక్కడ వివరిస్తున్నారు. దీన్ని సరిగ్గా అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి, మనకు ప్రాథమిక సూత్రాల గురించి గొప్ప అవగాహన ఇస్తుంది.
  •  వివిధ సహాయక సాహిత్యాలలో, సాత్వికుల (మంచితనం / ధర్మ రీతిని పాఠించేవారు) చేత అంగీకరించబడిన సాత్విక అంశాలు, వాటిని వెల్లడి చేసే భాగాలు ప్రధాన ప్రమాణములు అని తెలుసుకోకపోవడం ఒక అడ్డంకి. ఉప బృహ్మణం లో (సహాయక సాహిత్యం), ముఖ్యంగా పురణాలు, సాత్విక అంశాలు ప్రధాన ప్రమాణాలు. రాజస మరియు తామస అంశ విభాగాలు కూడా ఉన్నాయి. వాటిని పట్టించుకోనవసరం లేదు. అనువాదకుల గమనిక: మత్స్య పురాణంలో, “యస్మిన్ కల్పేతు యత్ ప్రోక్తం పురాణం బ్రహ్మణా పురా, తస్య తస్యతు మాహాత్మియం తత్ స్వరూపేణ వర్ణ్యతే” – సత్వ, రాజస లేదా తామస స్వభావం కలిగిన దేవతలను కీర్తిస్తూ, ఒక కాలంలో ఒక గుణం (సత్వ, రాజస లేదా తామస గుణం) ప్రధానంగా ఉన్నపుడు బ్రహ్మ పురాణాలను వెల్లడి చేసారు. ఈ స్లోకాన్ని పిళ్ళై లోకాచార్యుల శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం యొక్క 3వ సూత్ర వ్యాఖ్యానంలో మాముణుల చేత కీర్తించబడింది. పురాణాలను సాత్విక కోణంతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం గమనించాలి.  మన పూర్వాచార్యులు (శుద్ద సాత్వికులు) పురాణాల యొక్క సాత్విక భాగాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. పురాణముల యొక్క సాత్విక భాగాలు, శ్రీమన్నారాయణ మరియు వారి కీర్తిని వెల్లడిచేస్తాయి. దీనిపై వైష్ణవుల యొక్క ప్రధాన దృష్టి ఉంటుంది.
  • రాజస / తామస  వ్యక్తిత్వాలకు సంబంధించిన సాత్విక అంశాలు సాత్వికులకు అనుపధేయం (హితమైనవి కావు) అని తెలియకపోవడం ఒక అడ్డంకి. బ్రహ్మా, శివ, లింగం మొదలైన వాటిపై దృష్టి కేంద్రీకరించిన పురాణాలలో, రాజస / తామస వ్యక్తిత్వం ఉన్నందున వాటికి సంబంధించిన సాత్విక భాగాలను స్వీకరించాలి. ఇక్కడ మూల గ్రంథములో దీనిని అనుపధేయం (హితమైనవి కావు) అని అంటారు – కాని ఇది అక్షర దోషం కావచ్చు. అది ఉపాధేయం (ఆమోదయోగ్యమైనది) అయి ఉండాలి. తిరువాయ్మొళి 6.10.8 లో నమ్మాళ్వార్ శివుని యొక్క సాత్విక గుణాన్ని ఇక్కడ మనకందిస్తున్నారు, “నుణ్ణుణర్విన్ నీలార్ కణ్డత్తమ్మానుం” – మహా జ్ఞాని అయిన శివుడు విషాన్ని మింగి ఈ విశ్వాన్ని రక్షించాడు, అందుకని వారి కంఠం నీలంగా ఉంటుంది అని కీర్తించారు. సత్వ గుణం ప్రధానంగా ఉన్నప్పుడు తిరుమల వేంకటేశ్వరుని ఆరాధించడానికి వచ్చినందున ఇక్కడ ఆళ్వార్ శివుడిని కీర్తిస్తున్నారు. అలాగే, ప్రఖ్యాత ప్రమాణ  స్లోకమైన – “వైకుణ్టేతు పరే లోకే… ఆస్తే విష్ణురచింత్యాత్మా” లింగ పురణంలో కనిపిస్తుంది – ఈ స్లోకము ప్రతిరోజూ మంత్ర పుష్పం సమర్పిస్తూ తిరువారాధన సమయంలో శ్రీవైష్ణవులు పఠిస్తారు.
  • అరుళి చెయల్ (దివ్య ప్రబంధం) సాత్విక, రాజస, తామసం మొదలైన విభజన లేకుండా ఇది మచ్చలేనిదని దృఢ నమ్మకం ఉండకపోవడం ఒక అడ్డంకి. ఎందుకంటే ఇది శుద్ద సాత్వికులైన మన పూర్వాచార్యులు సంపూర్ణంగా స్వీకరించినది. అతి శుద్ధమైన భక్తి జ్ఞానంతో శ్రీమన్నారాయణుడిచే అనుగ్రహింపబడిన ఆళ్వారుల దివ్య ప్రబంధములు కూడా శుద్ధమైనవి. వీటిని పవిత్రమైన మన పుర్వాచార్యులు స్వీకరించి అనుసరించారు. కాబట్టి, వాటిలో ఎటువంటి లోపానికి అవకాశం లేదు. ఈ సూత్రంపై బలమైన నమ్మకం శ్రీవైష్ణవులకు ఉండటం చాలా అవసరం.
  • పూర్వాచార్యుల దివ్య పలుకులు సాత్వికులకు అత్యంత ప్రామాణికమైనవని పూర్తిగా నమ్మకపోవడం ఒక అడ్డంకి. ఆళ్వారులు శ్రీమన్నారాయణుడిచే అనుగ్రహింపబడినట్టుగా, మన పుర్వచార్యులు ఆళ్వారులచే అనుగ్రహింపబడ్డారు. వారి ఉపదేశాలను సంపూర్ణంగా స్వీకరించి కీర్తించాలి. అనువాదకుల గమనిక: ధర్మశాస్త్రంలో, “ధర్మజ్ఞ సమయం ప్రమానం వేదశ్చ” – గొప్ప వ్యక్తుల ఆలోచనలు / అభిప్రాయాలు ప్రామాణికమైనవి, వేదం కూడా ఒక ప్రమాణం. ఇక్కడ ధర్మజ్ఞ అంటే “ధర్మం తెలిసినవాడు” అని అర్ధం – మనకు భగవానుడు సిద్ద ధర్మం (ప్రామాణికమైన ధర్మసూత్రాలు), అందువల్ల ధర్మజ్ఞ  అనగా భగవాన్ యొక్క స్వభావాలు, నామాలు, రూపాలు, గుణాలు మొదలైన వాటి గురించి పూర్తి అవగాహన ఉన్న ఆళ్వారులు మరియు ఆచార్యులను సూచిస్తుంది.  కాబట్టి, మన పూర్వాచార్యుల సూక్తులపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. మణవాళ మాముణులు  ఉపదేశ రత్నమాలలో 36 “తెరుళుత్త ఆళ్వార్గళ్ చీర్మై  అఱివారార్, అరుళిచ్ చెయలై అఱివారార్, అరుళ్ పెత్త నాదముని ముదలాన నాం దేసికరై అల్లాల్ పేడై మనమే! ఉణ్డో పేచు” – జ్ఞానులైన ఆళ్వారుల నిజమైన కీర్తి ఎవరికి తెలుసు? దివ్య ప్రబంధాల యొక్క దివ్య అర్థాలు ఎవరికి తెలుసు? ఓ ప్రియమైన హృదయమా! ఆళ్వారులచే అనుగ్రహింపబడిన మన పూర్వాచార్యుల (నాథమునులతో ప్రారంభించి) లాంటి వారు ఎవరైనా ఉన్నారా? మన పూర్వాచార్యులకు సంబంధించి అనేక సంఘటనలు అనేక గ్రంథములలో నమోదు చేయబడ్డాయి. మన శ్రేయస్సు కోసం హృదయపూర్వక భక్తితో వాటిని మనం నిరంతరం అధ్యయనం చేయాలి, వినాలి, వాటిని గురించి చింతన చేయాలి, అనుసరించడానికి ప్రయత్నించాలి.
  • స్వయంగా శ్రీమన్నారాయణుడు ఉపదేశించిన శ్రీ పాంచరాత్రంపై సంపూర్ణ విశ్వాసం లేకపోవడం ఒక అడ్డంకి. శ్రీమన్నారాయణుడు ఉపదేశించిన శ్రీ పాంచరాత్ర సంహితుల ప్రామాణికతపై సంకోచం కూడా ఉండకూడదు, దీనిని “భగవత్ శాస్త్రం” అని పిలుస్తారు. వేదానికి సమానంగా పరిగణించాలి. పరమాచార్య ఆళవందారులు మనకు “ఆగమ ప్రామాణ్యం” (ఆగమం – శ్రీ పాంచరాత్ర ఆగమం) అనే దివ్య గ్రంథమును ఆశీర్వదించారు, ఇది శ్రీ పాంచరాత్ర ఆగమం యొక్క ప్రామాణికతను వివరంగా తెలియజేస్తుంది.
  • అన్ని ప్రమాణములు భగవత్ స్వరూపంపై కేంద్రీకృతమై ఉన్నాయని నమ్మకం లేకపోవడం ఒక అడ్డంకి. భగవద్గీత 15.15 లో, కృష్ణ పరమాత్మ “వేదైశ్చ సర్వైర్ అహమేవ వేధ్యః” – వేదం నా గురించి మాత్రమే చెబుతుంది. వేదం యొక్క ఉద్దేశ్యం భగవానుడిని కీర్తించడమే. పెరియాళ్వార్  తిరుమొళి 2.9.6లో పెరియాళ్వారులు ఇలా వెల్లడి చేస్తున్నారు “వేదప్పొరుళే ఎన్ వేంకటవా” – వేదం యొక్క మూల బిందువైన ఓ వేంకట. ఇక్కడ భగవాన్ తన రూప, గుణ, ఐశ్వర్యం, స్వరూపం, నామాలు మొదలైనవాటితో సహా ఉన్నవాడు. అనువాదకుల గమనిక: ఎమ్పెరుమానార్ తమ భాష్యం (వ్యాఖ్యానం) లో గీతా శ్లోకం 15.15 నికి సమతుల్యంగా ఉన్న మనుస్మృతి 12.9న్ని వివరించారు, “సరీరజైః కర్మ ధోషైః యాతి స్తావరతాం నరః, వచికైః పక్షి మృగతాం మానసైర్ అంత్యజాతితాం” – ఒక మనిషి తన చేతులతో ఇతరులను శారీరకంగా బాధ పెట్టినప్పుడు, అతను ఒక చెట్టులా పుడతాడు; అతను తన మాటలతో బాధ పెట్టినప్పుడు, అతను పక్షి / జంతువుగా పుడతాడు, అతను తన మనస్సు ద్వారా ఇతరులను బాధ పెట్టినప్పుడు, అతను అతి అల్ప వ్యక్తిగా జన్మిస్తాడు. ఇక్కడ వివిధ రకాలైన శరీరాలను (మానవుడు, చెట్టు, జంతువు మొదలైనవి) గురించి వివరిస్తున్నప్పటికీ, చివరికి అది జీవాత్మ యొక్క కర్మానుసారంగా వచ్చే జన్మ  గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా వేదం అగ్ని, వాయు, వంటి ఇతర దేవతల గురించి మాట్లాడినప్పుడల్లా, చివరికి అన్నింటిలో అంతరాత్మగా ఉన్న శ్రీమన్నారాయణుడను మాత్రమే సూచిస్తుంది. పెరియాళ్వార్ తిరుమొళి పాసుర వ్యాఖ్యానానికి, మాముణులు ఈ గీతా శ్లోకాన్ని ఉల్లేకిస్తూ ఈ పాసురాన్ని,  “తిరుమల వేంకటేశ్వరుని రూపంలో వేదం యొక్క మూల బిందువు నా ముందు ఉంది” వారు అందంగా వివరించారు.
  • చిత్ మరియు అచిత్తులతో కూడి ఉన్న పరమాత్మనే అన్ని వాక్కుల పరమార్థం అని మనం అర్థం చేసుకోకపోవడం ఒక అడ్డంకి. బ్రహ్మ  శ్రీ రామాయణంలో శ్రీ రాముని ఇలా కీర్తించారు, “భవాన్ నారాయణో దేవః జగత్ సర్వం శరీరం తే” – నీవే నారాయణుడవి, సర్వోన్నత దేవుడివి. ఈ విశ్వమంతా నీ శరీరం. ఏది చూసినా, విన్నా, అవన్నీ పరబ్రహ్మ శ్రీమన్నారాయణ శరీరమే. ఆయన ప్రత్యక్షంగా జీవాత్మలలో వ్యక్తమవుతాడు, జీవాత్మ ద్వారా అచిత్లో వ్యక్తమవుతాడు. నామం రూపం ఉన్నదేదైనా అందులో  భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అని వివరించబడింది. అనువాదకుల గమనిక: వేదార్థ సంగ్రహంలో, వేదాంతం నేర్చుకున్నవాడు ప్రతిదానిలోనూ భగవాన్ని చూస్తాడు అని శ్రీ రామానుజులు వివరిస్తున్నారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి మేకను చూసినప్పుడు, వారు ఆ మేకలో ఉన్న జీవాత్మను చూస్తాడు, ఆ జీవాత్మ లోపల ఉన్న పరమాత్మను చూస్తాడు. కానీ వేదాంతం నేర్చుకోని వాడు, మేకను మాత్రమే చూస్తాడు, ఎందుకంటే అతను  తత్వ త్రయ సిద్ధాంతం – చిత్, అచిత్ మరియు ఈశ్వరుని గురించి తెలియని వాడు కాబట్టి.
  • భగవానుడు  ప్రతి ఒక్కరిలో నివసించే ఆత్మ అని తెలియకపోవడం ఒక అడ్డంకి. మునుపటి వివరణ మాదిరిగానే. అనువాదకుల గమనిక: నారాయణ సూక్తంలో “అంతర్ బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ  స్తితః” – అంతటా శ్రీమన్నారాయణ వ్యాపించి ఉన్నాడు. ఇదే సూత్రాన్ని నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 1.1.10 లో “పరంద తాణ్ పరవైయుళ్ ణీర్ తొఱుం పరందుళన్ పరంద అణ్డం ఇదెన నిల విశుంబు ఒళివఱ కరంద సిల్ ఇడం తొఱుం ఇడం తిగళ్ పొరుళ్ తొఱుం కరందు ఎంగుం పరందుళన్ ఇవై ఉణ్డ కరనే” – భగవాన్ సముద్రములో ఉన్న చిన్న నీటి బిందువులో ఉన్నట్టే విరాటస్వరూపంగా ఈ విశ్వంలో కూడా అంతే సులభంగా వ్యాపించి ఉన్నాడు. అదేవిధంగా, అతను ఈ భూమిపైన, పై గ్రహాలు మొదలైన వాటిలో కూడా నివసించి ఉన్నాడు, జీవాత్మలు నివసించే అతి సూక్ష్మ ప్రదేశాలలో కూడా ఉన్నాడు. జీవాత్మలు అతని ఉనికిని గ్రహించక పోయినా భగవాన్ అక్కడ ఉంటాడు. అటువంటి సర్వవ్యాపి అయిన భగవానుడు సంహారం (ప్రళయ) సమయంలో అన్నింటినీ తనలోకి తీసుకుంటాడు, తన లోపల ఉంచుకొని రక్షిస్తాడు.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/09/virodhi-pariharangal-37.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org