విరోధి పరిహారాలు – 43

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/01/24/virodhi-pariharangal-42/

73. పుంస్త్వ విరోధి  – పురుషత్వంలో అవరోధాలు  

  పెరుమాళ్తో (శ్రీ రాముడు – మరియాదా పురుషోత్తముడు – ఆదర్శ పురుషుడు) సీతా పిరాట్టి, లక్ష్మణ పెరుమాళ్ – శ్రీ పెరుంబుదూర్

పుంస్త్వం అంటే మగతనం / పురుషత్వం – పురుషునిగా ఉండటం. దివ్య ప్రబంధం వ్యాఖ్యానాలలో శారీరక స్థితి ఆధారంగా, మగవారిని “మోవాయెళున్తార్” అని పిలుస్తారు (గడ్డం ఉన్న ప్రాంతాన్ని సూచించే ఎత్తైన దవడ అని అర్థం. ఆడవారిని “ములైయెళున్తార్” అని పిలుస్తారు (ఎత్తైన వక్ష స్థలం ఉన్నవారు అని అర్థం). తమ గత కర్మల ఫలితంగా ఈ బాహ్య / శారీరక గుణాలు పొందుతారు. అత్యోన్నత పురుషుడైన భగవానుడిని “ఉత్తమః పురుషః” అని భగవద్గీతలో వివరించిబడింది. ” స్థ్రీ ప్రాయం ఇతరం జగత్” ప్రమాణంలో వివరించినట్లుగా, ఈ విశ్వంలో కర్మానుసారంగా శరీరం పొందిన స్త్రీ అయినా పురుషుడైన అందరూ స్త్రీ వర్గానికి చెందినవారే అని అర్థం. స్త్రీత్వం యొక్క ముఖ్యమైన గుణాలు ఏమిటంటే పూర్తిగా ఆధారపడటం, వినయంగా ఉండటం, సిగ్గుపడటం మొదలైనవి. జీవాత్మ కూడా అంతర్గతంగా పరమాత్మపై పూర్తిగా ఆధారపడి ఉన్నట్లు గుర్తించబడింది. ఇప్పుడు వ్యాఖ్యానానికి వెళ్దాం. అనువాదకుల గమనిక:  ప్రణవంలో “అ” యొక్క అర్థంగా భగవాన్ని కీర్తించారు. పరాశర భట్టర్ తన అద్భుతమైన అష్ట శ్లోకి (ఎనిమిది అద్భుతమైన శ్లోకాలతో కుడి ఉన్న ఈ ప్రబంధం, రాహస్య త్రయం – తిరుమంత్రం, ద్వయం మరియు చరమ శ్లోకం యొక్క అర్ధాలను సమగ్రంగా వెల్లడిస్తుంది) యొక్క మొదటి శ్లోకమును “అకారార్ధో విష్ణుః” అని ప్రారంభించారు. రక్షకత్వము “అకారం” యొక్క ప్రధాన వివరణలలో ఒకటి. రక్షకత్వం అంటే అనవసరమైన అంశాలను తొలగించి, కావలసిన అంశాలను అందించడం. ఒక్క శ్రీమన్నారాయణుడు మాత్రమే స్వతంత్రుడు, మిగతావారందరూ అతనిపై పూర్తిగా ఆధారపడి ఉంటారు. మన పూర్వాచార్యులు జీవితాల నుండి ఒక ఆసక్తికరమైన సంఘటనను మనం గుర్తు చేసుకోవచ్చు.  పెరియవాచాన్ పిళ్ళై ఈ సంఘటనను తిరునెడుంతాండగం 3వ పాసుర వ్యాఖ్యానంలో తెలియజేస్తున్నారు. పరాశర భట్టర్ పాల మహాసముద్రాన్ని చిలుకుతున్న సంఘటనను వివరిస్తున్నారు. శ్రీ మహాలక్ష్మి పాల సముద్రం నుండి బయటకు వచ్చినప్పుడు, ఆమె నేరుగా శ్రీమన్నారాయణుడి వద్దకు వెళ్లి, అతని వక్షస్థలాన్ని (ఇది ఆమె శాశ్వత నివాసం) అధిరోహించి అతనిని తన భర్తగా స్వీకరిస్తుందని అతను వివరించారు. ఈ సమయంలో, నంజియర్, భట్టర్ను ఇలా ప్రశ్నిస్తారు, “అక్కడ ఎంతో మంది దేవతల సమక్షంలో, బహిరంగంగా ఒక పురుషుని వద్దకు వెళ్ళడానికి ఒక మహిళగా ఆమె సిగ్గుపడలేదా?”. భట్టర్ తెలివిగా “భర్త దగ్గరకు వెళ్ళేటపుడు, అలంకరణ వస్తువులు, బహుమతులు మొదలైనవి తీసుకువెళ్ళే తన చెలికత్తలను చూసి భార్య సిగ్గుపడాలా?” అని జవాబు ఇస్తారు. దీని అర్థం, అక్కడ ఉన్న అందరు జీవాత్మలు (దేవతలు, అసురులు) మగ శరీరాలతో ఉన్నప్పటికీ స్త్రీ స్వభావం గలవారు. ఈ విధంగా, అత్యున్నత స్వాతంత్రం యొక్క ఈ అంశం పురుషత్వంతో ముడిపడి ఉంటుంది,  దీనికి విరుద్ధంగా ఉన్న అంశాన్ని  స్త్రీత్వంతో ముడిపడి ఉంటుంది.

 • గరుడ వాహనుడు అయిన భగవానుడే పురుషోత్తముడు (మగవారిలో ఉత్తముడు) అని  అర్థం చేసుకోవడానికి బదులుగా తనను తాను మగవాడిగా పరిగణించడం ఒక అడ్డంకి. పురుషుడిగా కీర్తించబడే అర్హత ఉన్న ఒకే ఒక్కడు పురుషోత్తముడు. మిగతా జీవాత్మలందరూ ఆడవారి విభాగంలోకి వస్తారు. మగ శరీరం ఆధారంగా తనను తాను మగవానిగా పరిగణించుకోవడం అజ్ఞానం. ఇది కూడా తప్పు. అనువాదకుల గమనిక: గరుడ వాహనత్వం అత్యున్నత బ్రహ్మం యొక్క ముఖ్యమైన గుణం. గరుడను వేదాత్మ అంటారు – వేదం యొక్క ఆత్మ అని అర్థం. భగవాన్ గరుడపై అధిరోహించడం మరియు  భగవాన్ వైపు గరుడ వేళ్లు చూపడం శ్రీమన్నారాయణుడి యొక్క ఆధిపత్యానికి స్పష్టమైన సూచన. అలాగే, శ్రీమన్నారాయణుడిని పురుషోత్తముడు అని పిలుస్తారు – పురుషులలో ఉత్తమమైన వారు. కాబట్టి, పురుషత్వం శ్రీమన్నారాయణకు మాత్రమే సంబంధించినది.
 •  బ్రహ్మ, రుద్రుడు మొదలైన దేవతలను వారి మగ శరీరాలు కారణంగా వారిని మగవారిగా పరిగణించడం ఒక అడ్డంకి. ముందు వివరించినట్లుగా, ఈ సూత్రం దేవతులకు కూడా వర్తిస్తుంది. పురుషోత్తముడితో పోల్చినప్పుడు – మిగతా అందరు దేవుళ్ళు మగ శరీరాలు కలిగి ఉన్నప్పటికీ అతని ఆడ ప్రతిరూపాలు మాత్రమే. దీనికి విపరీతంగా పరిగణనలోకి తీసుకోవడం అజ్ఞానం అవుతుంది.
 • మనలో ఉన్న సహజమైన స్త్రీ స్వభావగుణం అతని సహజ పురుష స్వభావానికి ప్రతిరూపమైనదని తెలియకపోవడం ఒక అడ్డంకి. అతని సంపూర్ణ స్వాతంత్ర గుణానికి సహకరించి అతనిపై పూర్తిగా ఆధారపడటమే మన నిజమైన స్వభావం,  .
 • మన వద్ద ఉన్న మగ శరీరం మన కర్మానుసారంగా పొందినదని,  తాత్కాలికమైనదన్న విషయం తెలియకపోవడం ఒక అడ్డంకి. మగ దేహం యొక్క ఈ బాహ్య రూపం మన గత కర్మల ఆధారంగా పొందుతాము. మన కర్మ ఆధారంగా వేర్వేరు శరీరాలను ఒకదాని తరువాత ఒకటి పొందుతామని మనం తెలుసుకోవాలి. అనువాదకుల గమనిక: భగవద్గితలో, కృష్ణుడు శరీరాలు మారే ఈ సూత్రాన్ని 2 వ అధ్యాయంలో చాలా విస్తృతంగా వివరించారు. ఉపయోగకరం లేని చిరిగిన పాత వస్త్రం పారవేసి కొత్త వస్త్రం తొడిగినట్లే, జీవాత్మ తన పాత శరీరం విడిచి కొత్త శరీరాన్ని ధరిస్తాడు.  భగవాన్ మరొక ఉదాహరణ కూడా ఇచ్చి  వివరిస్తున్నారు –  ఆత్మ ఒక పసిబిడ్డ శరీరం, పిల్లల శరీరం, యుక్త శరీరం మరియు వృద్ధాప్య శరీరం గుండా వెళుతున్నట్లే, ఆ శరీరానికి కర్మ పూర్తయినప్పుడు, ఆ శరీరం విదిచిపెట్టి కొత్త శరీరం ధరించబడుతుంది. ఈ విధంగా మనం జీవితాంతం వివిధ శరీరాలను పొందుతామని, ఈ శరీరాలలు తాత్కాలికమైనవని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు.
 • అనాది కలాం నుండి పొందిన మగ, ఆడ శరీరాలు అశాశ్వతమైనవి అని తెలియకపోవడం ఒక అడ్డంకి. మనము ఈ సంసారం (భౌతిక ప్రపంచం) లో అనాదిగా ఉంటున్నాము,  మన కర్మ ఫలితాల ఆధారంగా వివిధ శరీరాలను పొందుతున్నాము. కాబట్టి, అవి ఏవీ శాశ్వతం కాదు. ఇది స్వయం స్పష్టమైనది.
 • భగవానుడిపై పూర్తిగా ఆధారపడటం జీవాత్మ యొక్క  స్వభావం అని తెలియకపోవడం ఒక అడ్డంకి. భగవత్ పారతంత్రియం (భగవానుడిపై ఆధారపడటం) అనేది జీవత్మా యొక్క శాశ్వతమైన మరియు అంతర్లీన స్వభావం. పారతంత్రియం అంటే యజమాని (ఈ సందర్భంలో భగవాన్) పూర్తి నియంత్రణలో ఉండటం . అనువాదకుల గమనిక: మనం ఇంతకు ముందు ప్రమాణంలో చూశాము,  “స్వత్వం ఆత్మని సంజాతం స్వామిత్వం బ్రహ్మణి స్థితం” – భగవానుడి ఆస్తిగా ఉండటం జీవత్మా యొక్క స్వభావం, యజమానిగా ఉండటం భగవానుడి స్వభావం. జీవత్మ యొక్క స్వభావం భగవాన్ మీద ఆధారపడి ఉండటం అని దీని నుండి మనం అర్థం చేసుకోవచ్చు.
 • భగవానుడిపై మన ఆధారపడుట గురించి జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా శారీరక పరిస్థితి కారణంగా రవ్వంతైనా స్వాతంత్రం కలిగి ఉండి  తనను తాను మగవాడిగా భావించడం ఒక అడ్డంకి. ఒకసారి మనం పారాంతంత్రియం (ఆధారపడుట) యొక్క నిజమైన జ్ఞానాన్ని పొందిన తరువాత, తనను తాను మగవాడిగా భావించడంలో ఎటువంటి ప్రశ్న లేదు.  స్వాతంతృలమని రవ్వంత భావన మగవారికి సహజంగానే ఉంటుంది. అనువాదకుల గమనిక: ఇక్కడ ప్రాథమిక సమస్య అయిన దేహాత్మాభిమానం (ఆత్మ మరియు శరీరం ఒకటే నని భావించడం) అన్న విషయానికి తిరిగి తీసుకెళుతుంది. ఎన్నో కాలక్షేపములు విన్న తరువాత, సూత్రాలను అర్థం చేసుకున్న తరువాత కూడా మనము, ఆత్మ దేహమని భ్రమపడతాము. శరీరానికి ఆత్మకి మధ్య ఉన్న ఈ ముఖ్యమైన వ్యత్యాసాన్ని పదే పదే ధ్యానించడం, మన రోజువారీ జీవితంలో దీనిని నిరంతరం అనుసరించడం తప్ప వేరే మార్గం లేదు.
 • స్వభావంతో స్త్రీగా భగవాన్ మీద పూర్తిగా ఆధారపడి ఉండి, ఇతర ఆడవారిని (శారీరక సుఖం కోసం) ఆశించుట ఒక అడ్డంకి. భగవాన్ (పరమ పురుషుడు) పై ఆధారపడిన స్త్రీగా (జీవాత్మ) తనను తాను అర్థం చేసుకున్న తరువాత, తనకోసం మరొక స్త్రీని ఆశించడం అజ్ఞానం వల్లనే జరుగుతుంది (ఆత్మకు బదులుగా శరీరంతో తనను తాను అనుబంధించుకుంటాడు). ఇది సముచితం కాదు. ఈ సందర్భంలో మనం శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం, సూత్రం 101 “విహిత విషయ నివృత్తి తన్నేఱ్ఱం” ను గుర్తుచేసుకోవాలి. అనువాదకుల గమనిక: సూత్రాలు 99, 100 మరియు 101 లలో, పిళ్ళై లోకాచార్యులు ఇంద్రియ సుఖాల నిర్లిప్తత యొక్క అంశాన్ని మరియు ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించ వలసిన అవసరాన్ని గురించి చర్చిస్తున్నారు. ఇంతకుముందు, ప్రాపంచిక సుఖాల నిర్లిప్తత, ఆధ్యాత్మిక పురోగతికి మూలధారమైన అర్హత అని ఆయన పేర్కొన్నారు. మాముణులు ఈ సుత్రమును అనర్గళంగా ప్రమాణాల ద్వారా చాలా అందంగా వివరించారు. 99 వ సూత్రంలో, భౌతిక సంపదను కోరుకునే వ్యక్తులకు, భక్తి యోగంలో నిమగ్నమైన వ్యక్తులకు, చివరకు ప్రపన్నులకు (భగవాన్కు పూర్తిగా శరణాగతులైన వ్యక్తులు) ఈ నిర్లిప్తత అవసరమని పిళ్ళై లోకాచార్యులు వివరించారు.  భౌతిక సంపదను కోరుకునే వ్యక్తులకు, దానిని సాధించే ప్రక్రియలో, వారు తమ భావాలను పూర్తిగా నియంత్రించాల్సిన అవసరం ఉందని మాముణులు వివరించారు. ఉపసాకులు (భక్తి యోగ నిష్ఠాపరులు) మరియు ప్రపన్నులకు నిశ్చయంగా వారు తమ ఇంద్రియాలపై మరియు ప్రాపంచిక సుఖాలపై పూర్తిగా నిర్లిప్తతను కలిగి ఉండాలి. 100 వ సూత్రంలో, ఈ మూడు వర్గాలలో, ప్రపన్నులకు, ఇంద్రియాలపై ఇటువంటి నియంత్రణ చాలా ముఖ్యమైనదని పిళ్ళై లోకాచార్యులు వివరించారు.  ప్రపన్నులకు నిర్లిప్తత యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి మాత్రమే పిళ్ళై లోకాచార్యులు ఇతర 2 వర్గాలను చేర్చారని మాముణులు అందంగా తెలియజేస్తున్నారు. 101 వ సూత్రంలో, భౌతిక సంపదను కోరుకునేవారికి మరియు ఉపసాకులకు, శాస్త్రాంలో నిషేధించబడిన వాటిలో నిర్లిప్తత ఉండాలి అని పిళ్ళై లోకాచార్యులు తెలియజేస్తున్నారు. కానీ ప్రపన్నులకు, శాస్త్రంలో అనుమతించబడిన వాటిపై కూడా నిర్లిప్తత ఉండాలి, ఎందుకంటే ఇది స్వరూప విరోధం (జీవాత్మ యొక్క స్వభావానికి విరుద్ధం) అవుతుంది కాబట్టి. శాస్త్ర ప్రకారం శారీరిక సుఖం వివాహం యొక్క సరిహద్దులో అనుమతించబడింది, అయినప్పటికీ,  శారీరక సంబంధం ఎప్పుడు, ఎలా జరగాలనే దానిపై అనేక నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ, ప్రపన్నులు తమ భార్య పట్ల కూడా నిర్లిప్తతను చూపించాలని పిళ్ళై లోకాచార్యులు తెలియజేస్తున్నారు.  మాముణులు తమ వ్యాఖ్యానములో ఈ విషయాన్ని చాలా వివరంగా వివరించారు. ఆచార్య మార్గదర్శకత్వంలో వినడం ఉత్తమము. ఈ విషయం తమను భగవతాధీనులమని స్పష్టంగా అర్థం చేసుకోవటానికి సంబంధించినది.
 • భగవాన్ యొక్క దృష్ఠికోణంతో చూసినప్పుడు ప్రతి ఒక్కరూ ఆడవారే అన్న అవగాహన లేకపోవడం ఒక అడ్డంకి. పరమపురుషుని దృష్ఠికోణం నుండి చూసినప్పుడు, సమస్థ జీవాత్మలు ఆడవారే అని తెలుసుకోవాలి.
 • భగవాన్ మరియు భాగవతులను సేవించడానికి తన భార్యతో పాటు తాను దాసుడిగా ఉండకపోవడం ఒక అడ్డంకి. గృహస్థాశ్రమం – భార్యతో కలిసి జీవించడం. శ్రీ రామాయణం “సహపత్న్యా విశాలాక్ష్యా నారాయణముపాకమత్” – శ్రీ రాముడు సీతను వివాహమాడి, తాను స్వయంగా పెరియ పెరుమాళ్ను (శ్రీ రంగనాథుడు) సేవించారు. ఇది గ్రుహస్థాశ్రమ ధర్మం. భార్యా భర్తల సంబంధం ఉన్నప్పటికీ, భగవాన్ ఎదుట స్త్రీ పురుషులిద్దరూ  స్త్రీ స్వభావం కలిగిన వారే. ఇద్దరూ భగవానుకి మాత్రమే లొంగి ఉండలి. అనువాదకుల గమనిక: నాలుగు ఆశ్రమాలలో (బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం మరియు సన్యాసం). ఇతరులకు సేవ చేయడంపై పూర్తిగా దృష్టి సారించ గలిగిన ఆశ్రమం గ్రుహస్థాశ్రమం. బ్రహ్మచారిగా తాను విధ్యాభ్యాసంపై దృష్టి కేంద్రీకరించి ఉంటాడు. సంపాదించడానికి అవకాశం ఉండడు. వానప్రస్థుడు అడవిలో నివసించి ధ్యానంపై కేంద్రీకరించి ఉంటాడు. ఒక సన్యాసి బోధనపై దృష్టి కేంద్రీకరించి ఉంటాడు, ఎటువంటి సంపాదన ఉండదు. బ్రహ్మచారులు మరియు సన్యాసు సేవ/సంరక్షణకై  గ్రుహస్థుడు మాత్రమే సంపదను సేకరించగలడు.  అలాగే, తీర్థయాత్రలో యాత్రికులు సేవలందు కోవడానికి, స్థానికంగా నివసించే గృహస్థులపై ఆధారపడతారు. ఈ విధంగా గ్రహస్థాశ్రమం పూర్తిగా భగవాన్ (వారి ఇంట్లో మరియు ఆలయంలో తిరువారాధనం) మరియు భాగవతుల (బ్రహ్మచారులు, సన్యాసులు మరియు యాత్రీకులు) పై పూర్తిగా కేంద్రీకృతమై ఉంది. కాబట్టి, సొంత భార్యతో ఇంద్రియ సుఖాలపై దృష్టి పెట్టడానికి బదులు, ఎమ్పెరుమాన్ మరియు శ్రీవైష్ణవుల సేవ చేయడంపై దృష్టి పెట్టాలి.
 • తనను తాను మగ దాసునిగా భావించడం ఒక అడ్డంకి. తనను తాను మగవాడిగా భావించకూడదని ఇప్పటికే వివరించబడింది. అనువాదకుల గమనిక: భగవాన్ మరియు భాగవతులకు తాను ఒక స్త్రీ దాసుడని ఎప్పుడూ తనను తాను పరిగణించాలి.
 • ఈ జ్ఞానాన్ని సంపాదించిన తరువాత, భార్యతో పాటు (మరొక స్త్రీలాగా) పడుకుని, నిజమైన స్వభావాన్ని మరచి ఆమెతో శారీరకంగా వ్యవహరించే ప్రయత్నం చేయడం ఒక అడ్డంకి. భార్య తనను తాను తన భర్తకు సమర్పించినట్లే, మనం కూడా భగవానుడికి సమర్పించుకోవాలి. మనకు మగ శరీరం ఉన్నప్పటికీ, మనకు రవ్వంత కూడా స్వతంతృల మన్న ఆలోచన రాకూడదు. అనువాదకుల గమనిక: ఇక్కడ నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. తన సొంత భార్యతో పడుకున్నప్పుడు కూడా, లైంగికంగా వ్యవహరించే  ప్రశ్నే లేకుండా స్త్రీతో మరొక స్త్రీ పడుకున్నట్లు అనిపించాలి. అంటే, తన భార్య పట్ల అటువంటి కోరికలేవీ లేనపుడు, ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా అలాంటి ఆలోచనలు రావు.  ప్రత్యేకించి భ్రమం (నిజమైన స్వభావంపై సరైన అవగాహన లేకపోవడం) మరియు రాగం (ఇంద్రియ సుఖాలపై ఆసక్తి) గురించి ప్రస్తావించబడింది – ఏ ఒక్కటి ఉన్నా, స్త్రీ పురుషులు శారీరక సంబంధంలో పాల్గొనడం ప్రారంభిస్తారు.
 • ఆళ్వారులు మగ దేహంతో  జన్మించారు, అయినప్పటికీ, వారు స్త్రీ భావంతో (నాయికా భావం) భగవానుని దివ్య స్వరూపానికై తాపత్రేయపడ్డారు. మునుపటి అనుభవాల నుండి వచ్చిన భ్రమ కారణంగా, అటువంటి పాసురములు విని వాటి అర్థాలను తెలుసుకున్న తరువాత కూడా, శారీరక అంశాల పట్ల ఆసక్తి కలిగి ఉండటం మరియు అలాంటి శారీరక ఆనందానికై ఆరాటపడటం అవరోధాలు. ఆళ్వారులు, ఎమ్బెరుమాన్ యొక్క దివ్య స్వరూపాల పైన ప్రత్యేకంగా నమ్మాళ్వారులు మరియు తిరుమంగై  ఆళ్వారులు  నాయికా భావం (స్త్రీ తన పురుషుడి కోసం ఆరాటపడే మానసిక స్థితి) లో అనేక పాసురా‌లను పాడారు. వారు భగవాన్ నుండి తమ విరహ బాధను  తమ పాసురాలలో అద్భుతంగా కురిపించారు. అటువంటి పాసురములు యొక్క బాహ్య మరియు అంతర్గత అర్ధాలను విన్న తర్వాత కూడా, “నేను ఒక పురుషుడిని” అన్న భావనకి తిరిగి వెళ్ళకూడదు, ఇంద్రియ సుఖాల ఆసక్తికై ఆరాటపడకూడదు. దయచేసి తిరుమంగై ఆళ్వారుల తిరుమొళి 1.1.2 చుడండి, “ఆవియే అముదే ఎన నినైన్తురుగి అవరవర్ పణైములై తుణైయా పావియేనుణరాతు ఎత్తనై పగలుం పళుతు పోయొళిన్తన నాళ్గళ్” – నేను పాపిని,  అజ్ఞానంగా తెలియకుండా ఎదిగిన స్తనములున్న మహిళల గురించి ఆలోచిస్తూ, “నా జీవితం! నా మధువు!” అని ఎన్నో నా రోజులు వృధా చేసుకున్నాను. అతను తరువాత శ్రీమన్నారాయణ కృపతో అలాంటి బాధల నుండి విముక్తి పొందారని తెలియజేస్తున్నారు.
 • ఆస్తిక నాస్తికుడు కావడం వల్ల ఆచార్యుల చేత వదిలివేయబడటం ఒక అడ్డంకి. సాధారణంగా, ఆస్తిక నాస్తికుడు భగవంతుడు ఉన్నాడని స్వీకరిస్తారు కానీ దృఢమైన విశ్వాసం ఉండదు,  ఏ సూత్రాలను పాటించరు. మరింత అవగాహన కోసం, దయచేసి ఉపదేశ రత్నమాల 68 వ పాసురం చూడండి, “నాత్తిగరుం నన్నెఱిచేరాత్తిగరుం ఆత్తిగనాత్తిగరుమామివరై ఓర్తు నెంజే! మున్నవరుం పిన్నవరుం మూర్కరెన విట్టు నడుచ్చొన్నవరై నాళుం తొడర్”.  అనువాదకుల గమనిక: ఆస్తికుడు అంటే వేద (ప్రామాణికమైన మూలం) శాస్త్రాన్ని ప్రమాణంగా అంగీకరించేవాడు. ప్రమేయమైన భగవానుడిని శాస్త్రం అనే ప్రమాణం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వేద శాస్త్రంలో ఉపనిషత్తులు, స్మృతి, ఇతిహాసం, పురాణములు, పాంచరాత్రం మొదలైనవి ఉన్నాయి. ఆస్తికులకు  వ్యతిరేకమైన వారు నాస్తికులు. అంటే వేద శాస్త్రాన్ని ప్రమాణంగా అంగీకరించనివాళ్ళు. మూడవ వర్గం కూడా ఉంది, ఇది ఆస్తిక – నాస్తిక వర్గం వారు. ఆస్తిక – నాస్తిక అంటే వేద శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరిస్తారు కాని తమ జీవితంలో అనుసరించే సమయంలో గౌరవించరు. ఈ పాసుర వ్యాఖ్యానంలో, పిళ్ళై లోకం జీయర్ మాముణులు యొక్క సొంత వాక్కులను ఉటంకిస్తూ వీటిని వివరంగా వివరించారు. ఈ పాసురంలోని అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే – ఈ పాసురం చివరికి ఆచార్యులకు సంపూర్ణ శరణాగతిపై దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఆస్తిక, నాస్తిక మరియు ఆస్తికా-నాస్తిక యొక్క ఈ అంశాన్ని ఈ కోణం నుండి అర్థం చేసుకోవాలి – అనగా, పూర్తిగా విశ్వాసపాత్రంగా ఉండి, ఆచార్యులకు శరణాగతులై ఉండటం, ఆచార్యపై నమ్మకం లేకపోవడం,  విశ్వాసం ఉంటుంది కాని ఆచార్యులను అనుసరించక పోవడం వంటివి.  శిష్యుడు ఆస్తికుడు కావడం వల్ల ఒకవేళ ఆచార్యుడు ఆ శిష్యుడిని వదులుకుంటే, ఆ శిష్యునికి ఇక వేరే దారే లేదు. జ్ఞానం, అనుష్ఠానం (అభ్యాసం) అనే రెండు ముఖ్యమైన అంశాలు ఆచార్యులకు ఉంటాయని ఉపదేశ రత్నమాల ప్రబంధం లో మాముణులు కీర్తించారు. ఇది అందరి శ్రీవైష్ణవులకు వర్తిస్తుంది.
 • సారం (సారాంశం) మరియు అసారం (అన్యమైనవి) అంశాల మధ్య తేడాను గుర్తించనందున పండితులు / పెద్దలచే ఖండించబడటం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఆచార్యులను ఆశ్రయించడం యొక్క ఉద్దేశ్యం వివేక జ్ఞానం (సారాంశం మరియు అన్యమైనవాటి మధ్య వివక్ష చూపే సామర్థ్యం) పొందడం. సాధారణంగా పాలు నీళ్ళని వేరుచేసే సామర్థ్యం గల హంసను  కీర్తిస్తారు. సారాంశాన్ని కీర్థించి, మన శాస్త్రాంలో కూడా అన్యమైన అంశాలను తీసివేయగలిగి నందుకు మన పూర్వాచార్యులను హంసలుగా కీర్తించబడ్డారు. మన పూర్వాచార్యులు యొక్క అడుగు జాడలను అనుసరించడం మరియు పెద్దల నుండి నేర్చుకోవడం, సారాంశం మరియు బాహ్య అంశాల మధ్య తేడాను గుర్తించే సామర్థ్యాన్ని మనలో అభివృద్ధి చేసుకోవాలి. సారాన్ని అట్టి పెట్టుకొని మరియు అన్య అంశాలను విస్మరించాలి. అన్య అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపడం పండితులచే ఖండనకు దారి తీస్తుంది. ఉదాహరణకు, పండితుల అధీనములో అధ్యయనం చేసిన తరువాత కూడా, శారీరక సుఖాలు మొదలైనవాటిని పట్టుకుని, ఆధ్యాత్మిక పురోగతిపై దృష్టి కేంద్రీకరించకపోతే, అలాంటి వ్యక్తులను గొప్ప ఆచర్యులు ఖండిస్తారు.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/11/virodhi-pariharangal-43.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s