విరోధి పరిహారాలు – 44

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/01/31/virodhi-pariharangal-43/

74. అంతిమ దశ విరోధి –  అంతిమ  క్షణాలలోని అవరోధాలు 

  వరాహ పెరుమాళ్ (తిరువిడవెంతైలో ఉన్నట్టుగా) –  తన భక్తులకు మొక్షాన్ని ప్రసాదిస్తానని ప్రమాణం చేసినవాడు.

 అంతిమ దశ అంటే మరణ శయ్యపైన ఉన్న చివరి క్షణాలు. మరణం సమీపిస్తున్నప్పుడు, చాలా మంది స్పృహ లేకుండా పడి ఉంటారు. కొంత మంది  తమ చివరి క్షణాల గురించి పూర్తిగా తెలుసి ఉన్న వారు కూడా ఉంటారు. మన ఆచార్యలు రెండు ముఖ్యమైన అంశాలను తెలియజేస్తున్నారు.  ” ‘పేరు తప్పాతు’ ఎన్రు తుణిన్తిరుక్కైయుం, పేత్తుక్కుత్ తవారిక్కైయుం శ్రీవైష్ణవాధికారిక్కు అవస్యాపేక్షితం” –  శ్రీవైష్ణవుడు తన అంతిమ లక్ష్యాన్ని సాధించగలడు అన్న విశ్వాసం కలిగి ఉండాలి మరియు తన అంతిమ లక్ష్యం పట్ల ఆత్రుతగా ఆరాటపడాలి అని వివరించారు. ఈ మొత్తం వివరణ ఈ రెండు ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంది. ఇక్కడ ‘పేఱు’ అంటే  శ్రీవైకుంఠం (పరమపదం) చేరుకొని అతని (పెరుమాళ్) ఆనందం కోసం నిత్య కైంకర్యంలో పాల్గొనడమే మనకు అత్యున్నత లక్ష్యం.  అనువాదకుల గమనిక: సామాన్యంగా శాస్త్రంలో, అంతిమ స్మృతిని బాగా నొక్కి చెప్పారు. భగవద్గీత 8.6 లో, శ్రీకృష్ణ పరమాత్మ “యం యం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కళేవరం తమ్ తమ్ ఏవ ఇతి కౌంతేయ సదా తద్భావ భావితః” – ఓ కుంతీ పుత్ర! ఆత్మ చివరి క్షణాలలో దేనిని స్మరిస్తే, ఆ తరువాతి జన్మలో ఆ రూపాన్ని పొందుతుంది. ఈ కారణంగానే భగవాన్ నామాలను, రూపాలు, లీలల యొక్క స్మరణ చేయాలని నొక్కి చెప్పబడింది. కానీ అంతిమ క్షణాలలో తమ పరిస్థితుల బట్టి, అది సాధ్యమౌతుంది. స్పృహలేని స్థితిలో ఉంటే, వారు ఆ సమయంలో భగవత్ చింతన చేయలేరు. పైగా, తమ లౌకిక బంధాల కారణంగా, ఆఖరి క్షణాలలో భౌతిక అంశాల గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు. జ్ఞాన యోగంలో ప్రావీణ్యం ఉన్న గొప్ప సత్పురుష రాజు అయిన భరతుడు కూడా ఒక జింక పట్ల అనురాగంలో చిక్కుకొని, తమ ఆఖరి క్షణాలలో ఆ జింక గురించి ధ్యానించడం ప్రారంభించాడు. ఫలితంగా అతను తన తరువాతి జన్మలో జింకగా జన్మించాడు. కానీ ఇవన్నీ ఉపాసకులు అయిన కర్మ / జ్ఞాన / భక్తి యోగ నిష్ఠాపరులకు ప్రత్యేకమైనవి. ప్రపన్నులకు ఇది అవసరం లేదు. సంపూర్ణ శరణాగతి చేసిన ఆత్మ భగవాన్ యొక్క నియంత్రణా బాధ్యతలో ఉన్నందున, అతను భగవత్ ధ్యానం చేయగలిగినా చేయలేకపోయినా, ఆ ఆత్మ తప్పకుండా పరమపదం చేరుకుంటుంది. ఎమ్పెరుమానార్ కొన్ని సందేహాలను స్పష్టం చేసుకోవాలనుకున్నప్పుడు, వారు దేవ పెరుమాళుకి రహస్య కైంకర్యం చేస్తున్న తిరుక్కచ్చి నంబి (కాంచిపూర్ణ స్వామి) వద్దకు వెళ్లి, ఆ సందేహాలపై దేవ పెరుమాళ్ సలహా పొందమని కోరతారు. తిరుక్కచ్చి నంబి ఎమ్పెరుమానార్ పరిస్థితి గురించి దేవ పెరుమాళ్ని అభ్యర్థిస్తారు, దేవ పెరుమాళ్ తిరుక్కచ్చి నంబికి 6 వార్తలతో (పదాలు / ఉపదేశాలు) ఆశీర్వదిస్తారు, ఇవి ఎమ్పెరుమానార్ యొక్క సందేహాలను స్పష్టం చేస్తాయని చెప్తారు. తిరుక్కచ్చి  నంబి ఎమ్పెరుమానార్ని తన సందేహాల గురించి అడగరు, దేవ పెరుమాళ్ కూడా ఆ సందేహాలు ఏమిటని తిరుక్కచ్చి నంబిని అడగరు. దేవ పెరుమాళ్  ఎమ్పెరుమానార్ యొక్క మనో హృదయాన్ని తెలుసుకొని, నేరుగా తిరుక్కచ్చి నంబికి సమాధానాలను వెల్లడి చేస్తారు. ఆ 6 విషయాలు – “నేను, శ్రీమన్నారాయణ సర్వశ్రేష్ఠుడిని”, “ద్వంద్వత్వం నిజం”, “ప్రపత్తి (శరణాగతి) మాధ్యమం”, “అంతిమ స్మృతి అవసరం లేదు”, “ప్రపన్నులు ఈ జీవిత చివరలో విముక్తి పొందుతారు”,  చివరకు” పెరియ నంబిని ఆచార్యునిగా స్వీకరించు”. ఇక్కడ అతను ఒక ప్రపన్నునికి అంతిమ స్మృతి (చివరి క్షణాలలో భగవత్ ధ్యానం చేయడం) అవసరం లేదని ప్రత్యేకంగా చెప్పబడింది.  ఇది కూడా వరాహ చరమ శ్లోకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం – ఇక్కడ వరాహ పెరుమాళ్ ప్రత్యేకంగా తన పట్ల ఎంతో అంకితభావంతో ఉన్నవారికి (అంటే అతనికి శరణాగతులైన వారికి), తమ తుద దశలో వారు స్పృహ లేని స్థితిలో ఉన్నప్పటికీ, ఆ సమయంలో అతను వారిని గుర్తుచేసుకొని వారిని  పరమపదానికి తీసుకువెళతానని వెల్లడిచేస్తున్నారు.  మన ఆచార్యులలో చాలామంది వారి చివరి క్షణాలలో ప్రత్యేకంగా భగవాన్ గురించి ధ్యానం చేయకుండా తమ స్వంత ఆచార్యుడి గురించి చింతన చేశారని మన పూర్వాచార్యుల జీవితంలో మనం స్పష్ఠంగా గమనించవచ్చు. ఇప్పుడు మనం అంశంలోకి వెళ్దాం.

 • మరణం తరువాత వదిలి వెళ్ళే ఆస్థిపాస్థులు, భార్యా పిల్లల పట్ల మక్కువ కారణంగా కలవరం చెందడం ఒక అడ్డంకి. ప్రావణ్యం అంటే అనురాగము అని అర్థం. ఇల్లు, భూములు, భార్యా పిల్లలు మొదలైన వాటిని వదిలివెళ్తున్నందుకు బాధపడవచ్చు, ఇది అజ్ఞానం కారణంగా జరుగుతుంది. అనువాదకుల గమనిక:  అంతిమ క్షణాలలో మరణ శయ్యపై ఉన్న  వ్యక్తి యొక్క మానసిక స్థితి గురించి పెరియాళ్వార్ తన పెరియాళ్వార్ తిరుమోళి 4.10 లో “తుప్పుడైయారై …” తో మొదలయ్యే పదిగంలో చాలా లోతుగా వివరించారు. తాను భగవత్ ధ్యానం చేసే స్థిరమైన మనస్సు కలిగి ఉండకపోవచ్చు అని అతను మొదట భగవానుడికి తెలియజేస్తున్నారు, తన ప్రస్తుత సంపూర్ణ శరణాగతి స్థితిని గుర్తుంచుకొని తన ఈ జీవితం చివరిలో (అతని మనస్సు స్థిరంగా ఉండకపోయినా) ముక్తిని ప్రసాదించమని భగవానుడిని అభ్యర్థిస్తున్నారు. ఈ పది పాసురములలో, చివరి క్షణాలలో మనం అనుభవించే బాధలను పెరియాళ్వార్ చాలా విస్త్రుతంగా వివరించారు.  మరణ శయ్యపై ఉన్న వ్యక్తి చుట్టూ తన బంధువులు గట్టి గట్టిగా ఏడుస్తూ తన భయాన్ని ఇంకా పెంచుతుంటారు. అతను ఆ శరీరాన్ని విడిచిపెట్టే ముందు వీలైనంత ఎక్కువ సంపదను తన నుండి లాక్కోవాలని కూడా వారు చూస్తూ ఉంటారు. ఇవన్నిటికి పైగా, తన సొంత భార్యా పిల్లలను, ఆస్తిపాస్తులను విడిచిపెట్టి వెళుతున్నందుకు తనపై తను జాలిపడతాడు. కాని ఆ వ్యక్తికి తాను ఒక జీవాత్మ, తాను ఈ శరీరాన్ని మాత్రమే విడిచిపెడుతున్నాను అన్న జ్ఞానం ఉన్నప్పుడు, వాళ్ళకి ఏ బాధ ఉండదు. ఇటువంటి సాక్షాత్కారం ప్రపన్నులకు సహజమైన గుణం.తనకు ప్రియమైన అతిథి వారి ఇంటికి వస్తానన్నఫ్ఫుడు అతను వచ్చే వరకు ఎదురుచూసిన్నట్లే, ప్రపన్నులు ఆత్రుతగా మృత్యు దేవత కోసం ఎదురుచూస్తారని చెప్పబడింది. ఎందుకంటే, అటువంటి ప్రపన్నులను, మరణించిన తరువాత, వాళ్ళను స్వయంగా భగవాన్ విరజా నది తీరానికి తీసుకువెళతారు (ఇది పరమపదం మరియు సంసారం మధ్యలో ప్రవహిస్తుంది). వారు అర్చిరాది మార్గం గుండా విరజా నదిని దాటి చివరకు  శ్రీమన్నారాయణ యొక్క దివ్య నివాసానికి చేరుకుంటారు. అక్కడ అతన్ని నిత్యసూరులు మరియు ముక్తాత్మలు స్వాగతిస్తారు. తరువాత భగవాన్ కూర్చున్న శేష పర్యంకం (సింహాసనం) పైకి ఎక్కి భగవానుడిని ఆలింగనం చేసుకుంటాడు. ఆ తరువాత, భగవాన్ అతనికి నిత్య కైంకార్యాన్ని ప్రసాదిస్తాదు,  అతను సంతోషంగా చిరకాలం అక్కడే ఉండిపోతాడు. ఆ విధంగా, మరణం తరువాత ఉన్న ఈ అద్భుతమైన జీవితాన్ని చూసి, ప్రప్పన్నులు తమ ఈ శరీరాన్ని విడిచి పెట్టడం గురించి భయపడరు. కానీ ఈ తత్వ అవగాహన లేని సామాన్య పురుషులు, మహిళలు మరణాన్ని ఎదుర్కొనేందుకు చాలా కష్టపడతారు.
 • క్షేత్రాణి మిత్రాణి ” లో వివరించినట్లుగా, అటువంటి అనుబంధాలు/అనురాగాలు అననుకూలమైనవి కావు అని గమనించాలి. అలా ఉండకపోవటం ఒక అడ్డంకి. క్షేత్రాణి , మిత్రాణి – నా ఆస్థిపాస్థులు, నా స్నేహితులు, వంటి అనుబంధాలు. పరమపదం చేరుకోవడానికి ఆటంకాలు. అందువల్ల ఈ కారణాలు (అనుబంధాలు/అనురాగాలు) అననుకూలమైనవి కావని తెలియజేస్తున్నారు.  అనువాదకుల గమనిక: ఎమ్బెరుమానార్ ఈ శ్లోకం శారణాగతి గధ్యంలో ఉల్లేకించారు. “పితరం మాతరం ధారాన్ పుత్రాన్ బంధూన్ సఖీన్ గురూన్, రత్నాని ధనధాన్యాని క్షేత్రాణి చ గృహాణి చ, సర్వధర్మాం శ్చ సంత్యజ్య సర్వకామాన్ శ్చ సాక్షరాన్, లోకవిక్రాంత చరణౌ చరణం తే వ్రజం విభో!” –  ప్రియమైన భగవాన్ (విభో)! నా యొక్క తల్లి తండ్రులు, భార్యాపిల్లలు, బంధు మిత్రులు, గురువులు, విలువైన రత్నాలు, సంపద, నిల్వ ధాన్యం, పొలాలు, ఇళ్ళ పట్ల మక్కువను నిన్ను పొందడానికి వదులుకున్నాను. అన్ని ఇతర మార్గాలు, ఏ కొంచం స్వల్పమైన కోరికలున్న అన్ని మార్గాలను నేను వదులుకుని, ముల్లోకాలను కొలిచిన మీ పాద పద్మాలకు శరణాగతి చేశాను. లౌకిక సంపద పట్ల ఉన్న మక్కువను  తిరస్కరించిన తరువాత భగవాన్ యొక్క పాద పద్మాలు మాత్రమే మన అభ్యున్నతికి ఏకైక మార్గమని స్పష్టంగా తేలుపుతున్నందుకు ఈ శ్లోకం గొప్పగా మహిమపరచబడింది.
 • తిరువాయ్మొళి 9.4.7 పాసురం “మాగ వైకుంఠం కాణ్బత్తర్కు ఎన్మనం ఏకమెణ్ణుం” లో పేర్కొన్నట్లుగా అత్యోన్నత నివాసంపై ఆసక్తి లేకపోవడం ఒక అవరోధం. పరమపదం చేరుకోవటానికి,  అక్కడ ఉన్న భగవానుడిని చూడాలని గొప్ప కోరిక ఉండాలి.  “తిరువాయ్మొళి 2.3.3 లో, ఆళ్వార్  ఈ భౌతిక ప్రపంచంలో  తనని ఉంచి నందుకు తన నిరాశను వెల్లడించాడు” అని తిరుమాలై ఆండాన్ తెలియజేస్తున్నారు. అనువాదకుల గమనిక: ఈ తిరువాయ్మొళి 9.4.7 పాసురానికి నంపిళ్ళై యొక్క ఈడు వ్యాఖ్యానం చాలా స్ఫుటమైనది మరియు అందమైనది కూడా. నరసింహుని యొక్క నిత్య నివాసమయిన శ్రీవైకుంఠం గురించి నిరంతరం ధ్యానం చేస్తున్న నమ్మాళ్వారుల యొక్క స్థితిని వారు వివరించారు. రాత్రి పగలుతో సంబంధం లేకుండా నా మనస్సు పరమపదం గురించి నిరంతరం చింతన చేస్తుందని ఆళ్వార్ తెలియజేస్తున్నారు. సామాన్యంగా జనాలకి ప్రొద్దున రాత్రి పనులు వేరు వేరుగా ఉంటాయి. కాని ఆళ్వారుకి అన్నీఒకటే, నిరంతరం భగవత్ చింతన చేస్తూ ఉండే వారని  నంపిళ్ళై తెలియజేస్తున్నరు.
 • తిరువాయ్మొళి 4.9.7 పాసురం “కొడువులగం కాట్టేలే” లో పేర్కొన్న విధంగా విడిచిపెట్టవలసిన ఈ భౌతిక ప్రపంచాన్ని ద్వేషించకపోవడం ఒక అడ్డంకి. నమ్మాళ్వారులు ఈ భౌతిక ప్రపంచంలో సంసారుల మధ్య ఉండటం “కొడువులగం” – క్రూరమైన ప్రపంచమని అంటున్నారు, “నేను దీన్ని ఇకపై చూడకూడదను కుంటున్నాను” అని అంటున్నారు. అనువాదకుల గమనిక: తన గురించి నిజమైన జ్ఞానాన్ని తెలుసుకున్న వెంటనే, ఈ ప్రపంచంలో జీవాత్మకు ముళ్ళపైన ఉన్నట్టు అనిపిస్తుంది, ఇది తనకు నిరంతర కైంకర్యంలో పాల్గొనడానికి సరిపోదు అని అనిపిస్తుంది. నమ్మాళ్వారులు తన మొదటి ప్రబంధంలోని మొదటి పాసురంలోనే దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్నారు – తిరువిరుత్తం 1 – “పొయ్ నిన్ఱ జ్ఞాననుం… ఇనియాం ఉఱామై” – నేను, అజ్ఞానంతో నిండి ఉన్న ఈ ప్రపంచాన్ని భరించలేకపోతున్నాను అని అర్థం. ఆళ్వార్లకు, ఈ ప్రపంచంలో ఉండటం అంటే పాదరక్షలు లేకుండా వేడి ఇసుక మీద నిలబడటం లాంటిది – అది కొన్ని క్షణాలు కూడా సహించలేము. ఈ భౌతిక ప్రపంచంలో మనం అలాంటి విరక్తిని పెంచుకోకపోతే, చివరి క్షణాలలో ఇక్కడి బంధాలను వదులుకోవడం చాలా కష్టం.
 • తిరువాయ్మొళి  పాసురం 1.2.9 లో “పిన్నమాక్కై విడుంపొళుతెణ్ణే” ప్రస్తావించినట్లుగా, ఈ శరీరాన్ని వదులుకోవాలనే కోరిక లేకపోవడం ఒక అడ్డంకి. ఈ అనిత్యమైన శరీరానికి దూరం కావాలని ఎదురుచూడాలి. తిరువాయ్మొళి 6.9.9 లో వివరించినట్లు “కూవిక్కొళ్ళుం కాలం ఇన్నుం కుఱుగాతో?” – ఆ దివ్య ధామానికి చేరుకోవాలని, మరణించే ఆ ఆఖరి క్షణం కోసం ఆత్రంగా ఎదురుచూడాలి అని అర్థం .  అనువాదకుల గమనిక: అచార్య హృదయంలో, అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ చూర్ణిక 229 లో ఇలా వివరిస్తున్నారు, నమ్మాళ్వార్  తమ 4 ప్రబంధాలలో  భగవానుడిని పరమపదాన్ని ప్రసాదించమని ఆర్తితో 20 సార్లు పిలిచే వరకు భగవానుడు ఎదురుచూశాడని తెలియజేస్తున్నారు. అనేక కారణాల వల్ల భగావనుడు అంత కాలం ఎదురు చూసాడు, కాని ముఖ్యంగా పరమపదం చేరుకోవాలనే నమ్మాళ్వార్ కోరికను సాధ్యమైనంత పరిపక్వ స్థాయికి పెంచాలని, తద్వారా అతన్ని ముముక్షు (మోక్షం కోరుకునేవాడు) అని పిలవడానికి పూర్తిగా అర్హత సాధింపజేయడానికి అని నాయనార్ వివరిస్తున్నారు. నమ్మాళ్వారులు భగవానుడిని పిలుస్తున్న 20 ప్రదేశాలను మాముణులు వ్యాఖ్యానంలో అందంగా వివరించారు, శరణగతులైన వ్యక్తికి పరమపదంలో శాశ్వతంగా భగవానుడితో ఉండాలని గొప్ప కోరిక ఉండాలి, అలాంటి ఉన్నతమైన కోరిక శరణాగతిని పూర్తి చేస్తుంది – లేకపోతే ఆ శరణాగతిని అసంపూర్ణమని పరిగణించబడుతుంది.
 • తిరువాయ్మొళి 10.10.9వ “ఉన్నై ఎన్నాళ్ వందు కూడువన్” పాసురంలో ప్రస్తావించినట్లుగా ఎమ్పెరుమాన్తో నిత్యం ఉండాలనే కోరిక పరిపక్వం చెందిన తరువాత కూడా ఎమ్పెరుమానుని చూడకుండా తాను ఉండగలగడం ఒక అడ్డంకి. పరమపదంలో ఎమ్పెరుమాన్ యొక్క అత్యంత దివ్య రూపాన్ని నేను ఎప్పుడు చూస్తాను? నేను వ్యక్తిగతంగా అలాంటి ఎమ్పెరుమాన్ని ఎప్పుడు అనుభవిస్తాను? ఇవి నమ్మాళ్వారుల హృదయంలో భావాల అనుభవం. పరమపదంలో ఎమ్పెరుమాన్ యొక్క పరత్వ రూపాన్ని పొందాలనే కోరిక ఉన్న  దశ ఇది. బాగా పరిపక్వం చెందిన ఈ భక్తి స్థితిని పరమభక్తి అంటారు. అనువాదకుల గమనిక: మునుపటి వివరణ‌లో చెప్పినట్లుగా, భగవానుడి పట్ల భక్తి అత్యున్నత స్థితికి చేరి పరిపక్వం చెందాలి. భక్తిలోని 3 దశలు ఇవి – పరభక్తి, పరజ్ఞానం, పరమ భక్తి ఉన్నాయి. పరభక్తి అనేది ఎమ్పెరుమాన్ గురించి పూర్తి పరిజ్ఞానం ఉన్న స్థితి – ఈ స్థితిలో ఎమ్పెరుమాన్‌తో కలిసి ఉండటం ఆనందాన్ని ఇస్తుంది, భగవాన్ నుండి దూరమైనపుడు దుఃఖాన్ని ఇస్తుంది. పరమ జ్ఞానం అనేది భగవాన్ యొక్క కల్యాణ గుణాలు, నామాలు, రూపాలు మొదలైనవాటిని పూర్తిగా మనస్సులో చిత్రీకరించి మనో నేత్రాలతో చూసుకునే స్థితి. పరమ భక్తి అనేది భగవాన్ పట్ల తమ అత్యున్నత భావాల స్థితి, భగవాన్ లేకుండా తాను ఉండలేకపోవడం అని అర్థం. నాయనార్ వీటిని ఆచార్య హృదయం యొక్క చూర్ణిక 233 లో కీర్తించారు, మాముణులు వాటిని తగినంత అందంగా వివరించారు.
 • తిరువాయ్మొళి 10.6.1 పాసురం “మారులోజి ఎన్” లో పేర్కొన్న విధంగా అర్చావతార ఎమ్పెరుమానుడిపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉండటం ఒక అడ్డంకి. మన కోరిక ఆధారంగా భగవాన్ మనకు పరమపదాన్ని ప్రసాదిస్తాడు అని నమ్మాళ్వార్ తెలియజేస్తున్నారు. మనము ఈ ప్రపంచంలో ఇంత వరకు భక్తితో ఆరాధించిన  అర్చావతార ఎమ్పెరుమాన్  పరమపద భగవానుడిని అనుభవించే కోరికను అతను ప్రేరేపిస్తాడు. కాబట్టి, ఇక్కడ వారు పరమపదానికి దగ్గరవుతున్నపుడు తిరువాయ్మొళి చివరలో, అర్చావతార భగవానుడిని “మారుల్” (అపార్థం) అంటారు, ఎందుకంటే ఈ అర్చావతార భగవాన్ అనుభవం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నందున. కానీ అదే ఆళ్వార్, సుళ్విసుంబణిముగిల్ పదిగం (10.9) లో,  అర్చరాది మార్గాన్ని అనుభవిస్తూ, అతను తిరుక్కుదంతై యొక్క ఆరవముదన్ భగవానుడి పట్ల తన భక్తిని చూపించారు. కాబట్టి, అర్చావతారం పట్ల అనురాగం మన స్వభావానికి వ్యతిరేకం కాదని మనం అర్థం చేసుకోవచ్చు. తిరుమంగై ఆళ్వార్ కూడా తన చివరి క్షణాలలో, తిరునెడుంతాండగం 29 వ పాసురంలో,  “తన్కుదంతైక్ కిదాంత మాలై నెడియానై అదినాయేన్ నినైన్తిట్టేనే” అని కీర్తించారు.  అనువాదకుల గమనిక: శ్రీవైష్ణవులకు అర్చావతార పెరుమాళ్ పట్ల భక్తి ప్రేమలు ఉండటం సహజం. వారు తమ జీవితం మొత్తం అర్చావతార పెరుమాళ్కి సేవచేస్తూ గడుపుతున్నందున, దానికి మించి ఇంకేదీ వారి మనస్సులోకి రాదు. పరాశర భట్టార్ తమ చివరి క్షణాలలో “నేను పరమపదంలో శ్రీరంగనాథుని చూడకపోతే, నేను పరమపదానికి ఒక రంధ్రం చేసి దానిగుండా తిరిగి శ్రీరంగంలోకి దూకుతాను” అని చెప్పడం మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ, పరమపదంలో భగవానుడికి నిత్య సేవ చేయాలనే కోరికతో అర్చావతార ఎమ్పెరుమాన్ పట్ల అనురాగాన్ని తగ్గించుకోవాలి. శ్రీవైష్ణవులకు ఇక్కడి దివ్య దేశాలు మరియు పరమపద అనుభవంలో తేడా లేనప్పటికీ, ప్రత్యేక వ్యత్యాసం ఏమిటంటే – ఈ ప్రపంచంలోని దివ్య దేశాలలో, కైంకర్యంలో అంతరాయాలు ఉంటాయి – ఏది ఏమైనా, సమయం అయ్యిం తరువాత ఆలయం మూసివేయబడుతుంది, భక్తులు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. కానీ పరమపదంలో, ముసలితనం, వ్యాధి మొదలైన వాటి ప్రభావం లేకుండా నిరంతర కైంకర్యం చేయవచ్చు. కాబట్టి, శ్రీవైష్ణవులు ఈ ప్రపంచంలో అర్చావతారము  పట్ల ఉన్న అనుబంధాన్ని వదులుకుని, సమయం వచ్చినప్పుడు పరమపదాన్ని అధిరోహించడానికి తమను తాము సిద్ధం చేసుకోవాలి.
 • చివరి క్షణాలలో “ఇప్పుడు నాకు ఆశ్రయం ఏమిటి?” అని ఆలోచించడం,  “భగవానుడికి శరణాగతి చేయుటయే మనకు ఆశ్రయం” అన్నదే నిజమైన ఆశ్రయం అని తెలియకపోవుట ఒక అడ్డంకి. పెరియ తిరుమొళి 2.7.1 లో వివరించినట్లుగా “ఉన్ మనత్తాల్ ఎన్ నినైన్తిరుంతాయ్” – మీరు నన్ను ఎలా రక్షించాలను కుంటున్నావు? మన యొక్క ముక్తి భగవానుడి బాధ్యత, వారి సంకల్పం కూడా. భగవాన్ మనస్సులో ఆ కోరిక ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి, తనను తాను ఎప్పుడూ స్వయం రక్షకుడిగా భావించి స్వతంత్రంగా వ్యవహరించకూడదు. “ఇప్పుడు నేను నన్నెలా విముక్తి పరచుకోగలను?” అని స్వతంత్రంగా ఆలోచడం ఒక అడ్డంకి అని అంటారు. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో, 69 వ సూత్రంలో “”అంతిమ కాలత్తుక్కు తంజం, ఇప్పోతు తంజమెన్ ఎంగిఱ నినైవు కులైగై” ఎన్ఱు జీయర్ అరుళిచ్చెయ్వర్ ” – ఆఖరి క్షణాలలో మన ఆశ్రయం ఏమిటంటే, “మనల్ని మనం రక్షించుకునే వైఖరిని వదులుకోవాలి, భగవత్ ఆశ్రయాన్నే సంపూర్ణగా స్వీకరించాలి” అని నంజీయర్ తెలియజేస్తున్నారు. అనువాదకుల గమనిక: శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రం యొక్క రెండవ ప్రకరణంలో, పిళ్ళై లోకాచార్యులు ప్రపత్తి (శరణాగతి) యొక్క మహిమను వివరించారు. ఈ విభాగంలో, 60 వ సూత్రంతో ప్రారంభించి, ప్రపత్తి  (మనం శరణాగతి చేసే చర్య) కూడా ఉపాయం కాదు కేవలం భగవాన్ మాత్రమే ఉపాయం అని పిళ్ళై లోకాచార్యులు వివరించారు. భగవానుడిపై ఆధారపడినప్పుడు వారికి శరణాగతి చేయుట సర్వ సహజం అని ఇక్కడ స్థాపిస్తున్నారు. సూత్రం 63 లో, భగవాన్ జీవాత్మలను రక్షిస్తున్నపుడు, భగవాన్ జీవాత్మ నుండి ఆశించేది ఏమిటంటే అతన్ని జీవాత్మను రక్షించనివ్వడం. ఎమ్పెరుమాన్ చేత జీవాత్మ రక్షింపబడాలనే కోరిక, అతనికి రక్షణ ఇవ్వడానికి జీవాత్మ భగవానుడిని అనుమతిస్తున్నాడన్న దానికి సూచన అని మాముణులు వ్యాఖ్యానంలో వివరించారు. జీవత్మను రక్షించాలనే భగవాన్ యొక్క కోరిక ముఖ్యమని సూత్రం 66 లో పిళ్ళై లోకాచార్యులు వివరించారు.. తరువాతి సూత్రంలో, భగవాన్ నిరంతరం జీవత్మను రక్షించాలనే కోరికతో ఉంటాడని, ప్రయత్నిస్తుంటారని వివరించారు. జీవాత్మ కోరిక మారినప్పుడు అటువంటి రక్షణ కార్యరూపం దాల్చుతుందని సూత్రం 68 లో వివరించారు. “కోరికలో మార్పు” అంటే “తనను తాను రక్షించుకోవడం నుండి భగవాన్ మీద పూర్తిగా ఆధారపడటమనే వైఖరిలో మార్పు” అని మాముణులు ఇక్కడ అద్భుతంగా వర్ణించారు. ఇది 69 వ సూత్రంలో పిళ్ళై లోకాచార్యుల చేత నంజీయర్ పదాల ద్వారా స్థాపించబడింది. ఈ సూత్రంలో, నంజీయర్  అనారోగ్యంగా ఉన్న ఒక శ్రీవైష్ణవునికి సాన్త్వననిస్తూ  ప్రస్తుతానికి అతనికి ఆశ్రయం ఏమిటి అని అడిగినపుడు, నంజీయర్ వారు తనను తాను రక్షించుకునే ప్రయత్నాలను వదులుకొని,  భగవత్ ఆశ్రయాన్ని స్వీకరించడమే ఏకైక మార్గం అని తెలియజేస్తారు. ఈ విధంగా, భగవాన్ అతన్ని రక్షించనివ్వడం మరియు భగవాన్ కోరికకు లొంగి ఉండడం వంటి జీవాత్మ యొక్క సహజ వైఖరిని “అధికారి విశేషం” గా వివరించబడింది. “అధికారి విశేషం” అనగా శరణాగతి చేసిన వ్యక్తి యొక్క సహజ గుణం, కనీ అది అతని మొక్షానికి ఎన్నడూ ఉపాయం (మాధ్యమం) గా మారదు. ఈ సూత్రాలపై మరిన్ని వివరాలకు ఉత్తమమైన  విద్వాంసుల మార్గదర్శకత్వంలో శ్రవణం చేయవచ్చు.
 • స్పృహ / జ్ఞానం యొక్క అభివ్యక్తత లేకుండా ఒక రాయి/ చెక్క ముక్కలా ఉండకపోవడం ఒక అడ్డంకి. “తతస్తం మ్రియమాణంతు కాష్టపాషాణ సన్నిబం, అహం స్మరామి మద్ భక్తం” – స్వతంత్రంగా మనల్ని మనం సంరక్షించు కోకుండా చలనం లేకుండా ఒక రాయి/ చెక్క ముక్కలా ఉండాలని వరాహ పెరుమాళ్ వివరిస్తున్నారు. నాపై పూర్తిగా ఆధారపడిన అలాంటి వ్యక్తులను, వారి చివరి క్షణంలో నేను వారిని స్మరిస్తాను, వారిని ఉద్ధరిస్తాను. అనువాదకుల గమనిక: శ్రీవైష్ణవ సాంప్రదాయంలో, 3 చరమ శ్లోకములు గొప్పగా మహిమపరచబడ్డాయి. చరమ శ్లోకం అంటే అత్యున్నత మూలసూత్రాలను వెల్లడించే శ్లోకం అని అర్థం. వరాహ చరమ స్లోకం “స్థితే మనసి …” తో మొదలవుతుంది. “సకృతేవ ప్రపన్నాయ…” తో ప్రారంభమయ్యేది శ్రీ రామ చరమ స్లోకం. “సర్వధర్మాన్ పరిత్యజ్య …” తో మొదలయ్యేది కృష్ణ చరమ స్లోకం. భగవాన్ తన భక్తులకు అంతిమ రక్షకుడన్న తన ప్రతిజ్ఞను ఈ స్లోకాములన్నీ వెల్లడిస్తున్నాయి. భగవాన్ యొక్క రక్షణను పూర్తిగా స్వీకరించడం, అతని సంకల్పానికి కోరికలకు కట్టుబడి ఉండటం మన బాధ్యత.
 • చివరి క్షణాలలో మొక్షానికి ఎవైనా ప్రత్యేక నియమాలు ఉన్నాయనుకోవడం, సిద్ద సాధనం (భగవాన్) మన రక్షకుడు అన్న మన సంపూర్ణ విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని తెలియకపోవడం ఒక అడ్డంకి. సిద్ద సాధన నిష్ఠ అంటే మనకు ఉపాయం (మధ్యమం), ఉపేయం (లక్ష్యం) రెండూ భగవానుడే అన్న పూర్ణ విశ్వాసం కలిగి ఉండటం. మన స్వంత ప్రయత్నంపై ఆధారపడే ఏ అవసరమైనా మన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అనువాదకుల గమనిక: చివరి క్షణాలలో మన ఆలోచన ప్రక్రియకు ప్రత్యేక అవసరాలు ఉన్నాయనుకున్నపుడు, అది మనల్ని స్వతంత్రంగా ఆలోచించేలా చేస్తుంది, ఆ సొంత ఆలోచనా అంశాలను అనుసరించేలా చేస్తుంది. కానీ స్వాతంత్రాన్ని వ్యక్తపరిచే ఇటువంటి ధోరణి జీవాత్మ స్వరూపానికి విరుద్ధం, జీవాత్మలు ఎల్లప్పుడూ భగవానుడిపై సంపూర్ణంగా ఆధారపడి ఉండాలి. అందువల్ల, భగవానుడే సర్వాధారము అన్న ఈ సూత్రాలను పూర్తిగా గ్రహించిన ప్రపన్నులు ఇటువంటి ప్రయత్నాలను అనుసరించరు. భక్తి యోగ నిష్ఠాపరులు, ఇతర ఉపాసకులు, భగవత్గీతలో  వివరించిన విధంగా చివరి క్షణాల్లో ఈ పద్ధతులను పాటిస్తారు. వారి తరుతాతి జన్మ వారు అనుసరించిన చివరి స్మృతి ప్రకారం ఉంటుంది.
 • చివరి క్షణాలలో మనస్సులో తలెత్తే పవిత్రమైన ఆలోచనలు/భావాలు భగవత్ ఉల్లాసాన్ని కలిగిస్తాయని, అవి మన  లక్ష్యంలో భాగమని  తెలియకపోవడం ఒక అడ్డంకి. మన యదార్థ స్వభావం (భగవత్ విషయంలో నిరంతరం నిమగ్నమై ఉండటం) నుండి ఉత్పన్నమయిన భగవద్ ఆలోచనలు/భావాలు మన అంతిమ ఫలితంలో భాగమవుతాయని తెలుసుకోవాలి. అనువాదకుల గమనిక: నిజమైన ప్రపన్నుడు, తన చివరి క్షణాలలో అతను స్పృహలో ఉంటే మాత్రం  భగవాన్ గురించి మాత్రమే ఆలోచిస్తాడు. వేరే ఇంకేదో సాధించాలని తప్పుగా అర్థం చేసుకోకూడదు. అది కేవలం వారు భగవత్ విషయంలో నిరంతరం నిమగ్నమై ఉండటం వలన, స్వయంగా భగవత్ సంకల్పం యొక్క ఫలితమిది. ఆచార్యలు వారి చివరి క్షణాలలో భగవాన్ వారి హృదయంలో సంపూర్ణంగా అభివ్యక్తమవ్వడం కారణంగా వారు పరమానందంగా ఉండటం మన పుర్వచార్యల జీవితంలో స్పష్ఠంగా గమనించవచ్చు. మన ఆచార్యలు చివరి క్షణాలలో వారి ఆచార్యల పూర్తిగా చింతనలో ఉండి పరమానందాన్ని అనుభవిస్తారు. అత్యున్నత పరిణామమైన  పరమపదంలో భగవానుడి నిత్య కైంకర్యంలోని భాగములు ఇవన్నీ.
 • చివరి క్షణాలలో ఆచార్యుల నామాలను తప్పనిసరిగా ధ్యానించాలని అనుకోవడం ఒక అడ్డంకి. ఈ విషయంతో ప్రారంభించి, ఆచార్యుల యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పబడింది. చివరి క్షణాలలో ఆచార్యుల నామాలు సాధనం (మాధ్యమం) గా భావించకూడదు. అనువాదకుల గమనిక: భగవత్ కృప వల్ల ఏమి జరిగినా, ఆ పరిస్థితిలో మనం స్వీకరించాలి. దీన్ని బట్టి మనం ఉపాయంగా చేయవలసినది ఏమీ లేదని మనం అర్థంచేసుకోవాలి.
 • నిత్యం ఆచార్యులతో గత సహవాసం (సాంగత్యము) కారణంగా సహజంగా వచ్చే ఆలోచనలు/భావములు పరమపద ప్రయాణంలో ఉపయోగపడతాయని తెలియకపోవటం మరియు అలాంటి ఆలోచనలు తప్పనిసరిగా రావడం అవసరం అనుకోవడం ఒక అడ్డంకి. ఆ క్షణాలలో ఆచార్యుని గుర్తు చేసుకోవడం మంచిది. ప్రయాణపాదేయం –  సుదీర్ఘ ప్రయాణాలకు వెళ్ళినప్పుడు, మన వెంట కొంత ఆహార సామగ్రిని తీసుకువెళతాము. అదేవిధంగా అర్చరాది మార్గంలో పరమపదానికి ప్రయాణించేవారికి, ఆచార్యుని ఆలోచనలు ఆహారం వంటివి. అనువాదకుల గమనిక: సాధారణంగా “పాదేయం పుండరికాక్ష నామ సంకీర్తనం” – సాధారణంగా ప్రయాణించేటప్పుడు భగవాన్నామ సంకీర్తనమే మనకు ఆహారం. అదేవిధంగా, ఇక్కడ చివరి ప్రయాణంలో ఆచార్యలను కీర్తించడం మనల్ని ఆదుకుంటుంది అని నొక్కి చెప్పబడింది.
 • నిత్యం ఆచార్యులతో గత సాంగత్యము కారణంగా సహజంగా వచ్చే ఆలోచనలు/భావములు ఉపాయం (మాధ్యమం) గా పరిగణనలోకి తీసుకోవడం ఒక అడ్డంకి. ఇది ఏదైనా సాధించడానికి ఉపాయంగా మారదు. అనువాదకుల గమనిక: ఇది ముందు వివరించినట్లు గత అనుభవాల కారణంగా ఉన్న సహజ స్మృతులు,  మన అంతిమ లక్ష్యంలోని భాగంగా పరిగణించాలి.
 • ఈ ప్రయాణంలో మనల్ని నడిపించేది మన నిజమైన శ్రేయోభిలాషి “అతడు” అని తెలియకపోవడం ఒక అడ్డంకి. ఈ ప్రయాణంలో మనల్ని నడిపించే మన నిజమైన శ్రేయోభిలాషి అయిన వారు ఆచార్యులు అని మనం తెలుసుకోవాలి. అనువాదకుల గమనిక: సాధారణంగా భగవానుడిని “మార్గబంధు” అని కీర్తిస్తారు – ప్రయాణాల సమయంలో నిజమైన తోడుగా ఉండేవాడు. ఇక్కడ ఆచార్యుడని గురించి కూడా చెప్పవచ్చు. ఈ సూత్రం భగవాన్ మరియు ఆచార్యుడు ఇద్దరికీ వర్తిస్తుంది. తిరుమోగూర్ యొక్క కాళమేగ పెరుమాళ్ను వళిత్తునై / మార్గ బంధు పెరుమాళ్ అని అంటారు. ఎమ్పెరుమానార్ను “శ్రీ విష్ణులోక మణిమండప మార్గదాయి” అని కీర్తిస్తారు. మనకి పరమపద మార్గాన్ని ఇచ్చేవాడు. కాబట్టి, భగవాన్ మరియు ఆచార్యులు ఇద్దరికీ ఇది వర్తిస్తుంది.
 • అనిష్ఠ నివృత్తి (అనవసరమైన అంశాలను తొలగించడం – అజ్ఞానం, మొదలైనవి) మరియు ఇష్ఠ ప్రాప్తి (కావలసినవి సాధించడం – అర్చరాది మర్గంలో వెళ్లడం, పరమపదం చేరుకోవడం మొదలైనవి) మన సొంత ప్రయత్న ఫలితమని భావించడం అవరోధం. అవిధ్య (అజ్ఞానం) అంటే భౌతిక ప్రపంచంలో శారీరక అంశాల బంధం వల్ల ఆర్జించిన జ్ఞానం. భౌతిక శరీరం పోయినప్పుడు, అజ్ఞానం తొలగి, జ్ఞానం పూర్తిగా విస్తరిస్తుంది. ఇది ముక్తుని యొక్క స్థితి. అర్చిరాది గతి అనేది అర్చిస్ (కాంతి) తో ప్రారంభమై పరమపదంలో ముగిసే ఒక దారి. మన సొంత ప్రయత్నంతో ఇవి సంభవించాయని భావించకూడడు.
 • అటువంటి అవరోధాలను తొలగించి,  వరాలను ప్రసాదించే భగవానుడు ఈ ఫలితానికి నిజమైన ఉపకారి అని తెలియకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఇది చాలా ముఖ్యమైన సూత్రం. “చేతన లాబం ఈశ్వరనుక్కు” – ఒక బద్దాత్మ శుద్ధి చేయబడి ముక్తి పొందినప్పుడు, అతను పరమపదానికి చేరుకుని భగవాన్ నిత్య సేవ చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి, జీవాత్మలను బంధ విముక్తులను చేయడంలో భగవానుడు అత్యున్నత్ సహకారి అని వివరించబడింది.  భగవాన్ యొక్క నిత్య సేవ చేయడమే జీవత్మ యొక్క నిజమైన స్వభావం అయినప్పటికీ,  భగవాన్ యొక్క కృపతో మాత్రమే అతను ఉద్ధరించబడతాడు. ఈ విధంగా, భగవాన్ ప్రతి ఒక్కరికీ యజమానిగా ఉండటం కారణంగా వారు అత్యున్నత శ్రేయోభిలాషి.  శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రం 70 వ సూత్రంలో “ప్రాప్తవుం ప్రాపకనుం ప్రాప్తిక్కు ఉగప్పానుం అవనే” – మార్గనిర్దేశం చేసేవాడు, వరాన్ని ఇచ్చేవాడు, లక్ష్యాన్ని సాధించిన పిదప ఆనందాన్ని పొందేవాడు కూడా భగవానుడు అని పిళ్ళై లోకాచార్యులు  వివరించారు. మాముణులు ఈ సూత్రానికి ఒక ఉత్తమమైన వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. అతను ఈ సూత్రాలను ప్రమణాలతో వివరించారు. భగవానుడు ప్రాప్త మరియు ప్రాపకుడు కాబట్టి – జీవాత్మ సొంత ప్రయత్నంతో పని లేకుండా,  అంతిమ ఫలితం లభించిన తరువాత పరమానందాన్ని పొందేవాడు కూడా భగవానుడు కాబట్టి – తన ఆనందం కోసం జీవాత్మ ప్రయత్నించకూడదు.
 • ఇష్టా అయిష్టాలలో అనుబంధం కలిగి ఉండటం ఒక అడ్డంకి. భగవాన్ అంతర్యామిగా ఉండటం కారణంగా, ఆ జీవత్మాకు అనుకూలమైన మరియు అననుకూలమైనదాన్ని నిర్ణయించడం అతని బాధ్యత. అనువాదకుల గమనిక: మనం భగవా‌నుడిని అత్యున్నత మార్గం మరియు లక్ష్యంగా స్వీకరించినప్పుడు, మన చర్యలన్నీ ఈ సూత్రం ప్రకారం నడుపుకోవాలి. మన జీవితాల్లో శాస్త్రం (గ్రంథాలు) మరియు అనుష్ఠానం (మన పూర్వాచార్యుల చేత ఆచరించబడినవి) లో వివరించిన వాటిని మనస్ఫూర్తిగా పాటించాలి. మనకు అనుకూలమైన/ అననుకూలమైన అంశాలను మన ఇష్టాయిష్టాలకు బదులుగా శాస్త్రం మరియు ఆచార్యుల సూచనల ద్వారా నిర్ణయించబడాలి. చాలా సార్లు మనము చూస్తుంటాము, కొంతమంది “నేను పూర్తి శరణాగతి చేసాను, ఇక నేను భగవానుడి బాధ్యత” అని చెబుతారు. కానీ వారి ప్రవర్తన శాస్త్రం మరియు శిష్ఠాచారములకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది – సామాన్యంగా ఎటువంటి నియమ నిబంధనలను పాటించక తప్పించుకోవడానికి ఇది ఒక సులభమైన మార్గం, పైగా వారు తమను తాము చాలా జ్ఞానులుగా, నిష్ఠాపరులుగా చూపించుకుంటారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని కోరుకునే వారికి ఇటువంటి వైఖరి హానికరం.
 • అలాంటి ఇష్టాలు మరియు అయిష్టాలు, “అహం” లో వివరించబడిన భగవానుడికి సముచితమైనవి అని తెలియకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: భగవత్గిత చరమ స్లోకంలో “అహం త్వా సర్వపాపేబ్యో మోక్షయిష్యామి” అని ప్రకటించినట్లుగా – ‘అహం’  అంటే “నేను” అని ధైర్యంగా భగవాన్ మాత్రమే ఘోషించగలడు. భగవాన్ మరియు భాగవతులపై ఆధారపడుటను వ్యక్తపరిచే “అడియేన్”, “దాసుడు” అని మనల్ని మనం ఎప్పుడూ సంభోదించుకోవాలి. అతను మాత్రమే అసలైన యజమాని కాబట్టి, అతనికి మాత్రమే ఇష్టాలు మరియు అయిష్టాలు ఉంటాయి. మన ఇష్టాయిష్టాలు అతన్ని అనుసరించాలి. ఉదాహరణకు, భగవాన్ జ్ఞానులను (బాగా జ్ఞానం ఉండి భగవాన్ పట్ల అంకితభావం ఉన్నవారు) ఇష్టపడతాడని భగవత్గితలో ఉపదేశించారు. శాస్త్రంలో ఉన్న తన సూచనలను ఖండించి, అధర్మాన్ని అనుసరించే వారిని అతను ఇష్టపడడు. మనం కూడా మన జీవితాలను ఆ ప్రకారంగా మలచుకొని, తద్వారా మనం అలాంటి జ్ఞానులకు సేవ చేస్తూ అధర్మ మార్గాన్ని అనుసరించకుండా ఉండాలి.
 • మనకు నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించే శాశ్వతమైన యజమాని, మనకు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడని విశ్వాసం లేకపోవడం ఒక అడ్డంకి. ఆశించేవారికి నిజమైన జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆచార్యుడు. భగవాన్ స్వయంగా ఆచార్యుడిగా వచ్చి మనల్ని తనలోకి చేర్చుకుంటాడు. కాబట్టి ఆయన అసలైన యజమాని, మోక్షాన్ని ప్రసాదించేవాడు. అనువాదకుల గమనిక: భగవానుడిని ‘ముకుంద’ అని పిలుస్తారు – మోక్షాన్ని ఇచ్చేవాడు. మోక్షం అంటే పరమపదంలో నిత్య కైంకార్యం చేయడం. అటువంటి విముక్తిని పొందడానికి, మొదట తన గురించి నిజమైన జ్ఞానం ఉండాలి. చిత్, అచిత్ మరియు భగవాన్ – తత్వ త్రయం గురించి జ్ఞానం ఉండాలి. అలాంటి జ్ఞానాన్ని ఆచార్యుని నుండి శిష్యుడు పొందుతాడు. నిజమైన జ్ఞానం లభించిన తర్వాత, సహజంగానే, బంధ ముక్తులయ్యి పరమపదంలో భగవానుడికి నిత్య సేవలు అందించాలని కోరుకుంటారు. ఈ సంసారం నుండి విముక్తి పొందడం మరియు పరమపదంలో నిత్య కైంకర్యం  పొందడం కేవలం భగవాన్ చేతనే అనుగ్రహింపబడుతుంది.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో – http://ponnadi.blogspot.com/2014/11/virodhi-pariharangal-44.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s