విరోధి పరిహారాలు – 45

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/03/12/virodhi-pariharangal-44/

  శ్రీ పార్థసారథి ఎమ్పెరుమాన్తో పాటు శ్రీదేవి, భూదేవి మరియు ఆండాళ్ నాచియార్ – అత్యంత విశ్వాసపాత్రుడు మరియు అరాధనీయుడు

75. అవిశ్వాస విరోధి  – అపనమ్మకంలో అవరోధాలు

బౌతిక వాదులను, దేవతాంతరములను, సామాన్య శాస్త్రమును నమ్మడాన్ని అవిశ్వాస విరోధి అని అంటారు.

విశ్వాసం అంటే నమ్మకం. ఇక్కడ, నమ్మకూడని అంశాలను  మనము నమ్మినప్పుడు, వాటిని అవరోధాలుగా వివరించబడ్డాయి. సామాన్య శాస్త్ర ఆదేశములను పాటించాల్సిన అవసరం ఉంది. కాని, ఒక ప్రపన్నుడు విశేష ధర్మాన్ని (భగవాన్ / భాగవతులకు సేవ) పాటించేటప్పుడు కొన్ని సామాన్య  లోపాలు ఉంటే, అది లోపంగా పరిగణించబడదు.

అనువాదకుల గమనిక: మనము ఇంతకు ముందు వీటిని గురించి  చాలా వివరంగా చర్చించాము. ఇక్కడ 3 అంశాలపై నమ్మకం గురించి తెలియజేస్తున్నారు – సంసారులు (లౌకిక వ్యక్తులు), దేవతాంతరములు (ఇతర దేవతలు) మరియు సామన్య శాస్త్రమును అడ్డంకులుగా తెలియజేయబడ్డాయి.

 • మనము భౌతిక అంశాలపై దృష్టి కేంద్రీకరించినప్పుడు, అటువంటి సహాయాలను పొందడానికి భౌతికవాదులను నమ్మవలసి వస్తుంది. అటువంటి చర్యలలో పాల్గొనడం ద్వారా ఈ భౌతిక సంసారంతో మన అనుబంధం మరింత పెరుగుతుంది. అందువల్ల సంసారులపై నమ్మకం ఉండకపోవడం మంచిది.
 • దేవతాంతరములు విషయానికొస్తే ఇది బ్రహ్మ, శివుడు మొదలైన వాళ్ళతో ప్రారంభమయ్యి మిగతా అందరు దేవతలకు సంబంధించినది. వారందరు కూడా బద్ద ఆత్మలు మాత్రమే. మనము వైధిక కర్మలలో భాగంగా దేవతలను గౌరవించినపుడు, అంతకు మించి వారికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఎక్కడా ఇవ్వబడలేదు. ఈ విషయానికి సంబంధించి నంపిళ్ళై ఒక సంఘటనను అందంగా వివరించారు.  శ్రీవైష్ణవులు వైధిక కర్మలలో భాగంగా దేవతలను ఆరాధిస్తారు కానీ  ప్రత్యేకంగా వారిని వారి ఆలయాలలో ఆరాధించరు ఎందుకు అని ప్రశ్నిస్తారు. అప్పుడు నంపిళ్ళై శాస్త్ర ఉపదేశాలలోని భాగంగా యజ్ఞాలు, సంధ్యావందనం మొదలైన వాటిని నిర్వహిస్తున్నపుడు ఆయా దేవతలలో అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణుడను ఆరాధిస్తాము అని బదులిస్తారు. శ్రీమన్నారాయణుడి ఆధిపత్యాన్ని స్పష్టంగా తెలుసుకున్న తరువాత కూడా వాళ్ళు కొన్ని సందర్భాలలో తమను స్వతంత్రంగా భావించి శ్రీమన్నారాయణుడితో కలహానికి దిగుతారు, ఓడిపోతారు కూడా.
 • శాస్త్రం రెండు వర్గాలుగా విభజించబడింది – సామాన్య శాస్త్రం మరియు విశేష శాస్త్రం. సామాన్య శాస్త్రం అంటే వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా శారీరక మరియు సాధారణ రోజువారీ అనుష్ఠానముల గురించి వివరించేది.  ఇవి చాలా అవసరం. విశేష శాస్త్రం అంటే ఆత్మ మరియు భగవానుడి‌తో ఆత్మ యొక్క  శాశ్వత సంబంధం గురించి వివరిస్తుంది. భగవాన్ మరియు భాగవతులకు చేసే రహస్య సేవలు ఇవి. పెరియాళ్వార్ దీనిని తిరుపల్లాండులో “అత్తాణిచ్ చేవకం” అని వివరించారు. ఆచార్య హృదయంలో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ చూర్ణిక 31 లో  – “అత్తాని చేవగతిల్ పోధువానతు నళువుం” –  భగవత్ / భాగవత కైంకర్యం చేస్తున్నప్పుడు, సామాన్య కైంకర్యాన్ని కొంతవరకు ఆలస్యం చేయవచ్చు / దాటివేయవచ్చు అని మాముణులు వ్యాఖానంలో వివరించారు. మరిన్ని వివరాలు https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/06/23/virodhi-pariharangal-10/ లో చర్చించబడ్డాయి. 


76. సంగ విరోధి – మన సాంగత్యములోని అవరోధాలు

భగవత్ జ్ఞానం (భగవాన్ గురించి జ్ఞానం) పొందిన తరువాత కూడా ఇతర  సిద్దాంతాల అనుచరులతో (శైవులు మొదలైన వారు) సంబంధం కలిగి ఉండటం.

సంగం అంటే స్నేహం, సంబంధం. భగవత్  జ్ఞానం అంటే శ్రీమన్నారాయణుడి  ఆధిపత్యానికి సంబంధించిన నిజమైన జ్ఞానం.

అనువాదకుల గమనిక: భగవాన్ గురించి జ్ఞానం అంటే భగవాన్ అత్యోన్నతుడని, మనం అతని నిత్య దాసులమని పూర్తిగా అర్థం చేసుకోవడం అని అర్థం. ఆ వాస్థవ జ్ఞానం పొందిన తర్వాత, మన వైఖరిలో పరివర్తన ఉంటుంది. అప్పుడు మనం భగవాన్ యొక్క ఆధిపత్యాన్ని తిరస్కరించే వారితో  లేదా భగవానుడిని అవమానించే వారితో మనం స్నేహం చేయాలనుకోము. ఆచార్యుల అనుగ్రహంతో మరియు భగవాన్ అనుగ్రహంతో యదార్థ జ్ఞానం లభిస్తుంది. ఆ యదార్థ జ్ఞానం లేని వారు భగవాన్ యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించరు. అలాంటి వ్యక్తులతో సన్నిహితంగా ఉండకపోవడమే మంచిది. ఇక్కడ తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ఒక శ్రీవైష్ణవుడిగా, అనుకూలమైన వ్యక్తులకు (భగవాన్ గురించి తెలుసుకోవాలని ఇష్టపడేవారు) వారి వర్ణంతో సంబంధం లేకుండా ఈ విషయం పట్ల అవగాహన కల్పించడం మన కర్తవ్యం. ఎందుకంటే, తన అసలు స్వరూపాన్ని గ్రహింపజేసే ఈ జ్ఞానాన్ని వారికి తెలియజేయడం మనం వాళ్ళకు చేసే గొప్ప సహాయం కనుక.

77. సంతాన విరోధి – సంతానం విషయంలో  అవరోధాలు

మన సొంత పుత్రుడైన సరే,  భగవాన్, భాగవతులు మరియు ఆచార్యుల పట్ల ద్వేషంగా/అగౌరవంగా ఉంటే, వరాహ పురాణంలో వివరించిన విధంగా అలాంటి పుత్రుడిని వదులుకోకపోవడం అడ్డంకి.

మాజనిష్ఠ స నో వమ్సేజాతో వాత్రాక్విసృజ్యతాం
ఆజాన్మమరణం యస్య వాసుదేవో నదైవతం

సంతానం అంటే మన సొంత పిల్లలు. మన సొంత పిల్లలు అయిన్నప్పటికీ, భగవాన్ భాగవతులు మరియు ఆచార్యుల పట్ల అపచారములలో పాల్పడినప్పుడు, వారిని వదులుకోవాలి. అలాంటి సంబంధాన్ని తెంచుకోవాలి.

అనువాదకుల గమనిక: ఒక ప్రపన్నుడు, తాను ఇతర అనుకూలమైన ప్రపన్నులతో మాత్రమే కలవడం చాలా ముఖ్యం. పిల్లలు లేదా దగ్గరి బంధువులు, భగవాన్ మరియు భాగవతులకు వ్యతిరేకంగా చూపించే అహంకారాన్ని సహించకూడదు. పిల్లలకి అర్థమైయ్యేలా వివరించే ప్రయత్నంచేయాలి, వారికి సరైన మార్గనిర్దేశం చేయడానికి ప్రయత్నించాలి. కానీ అలాంటి ప్రయత్నాలు విఫలమైనప్పుడు, సంబంధం ఉంచుకోకూడదు. దీనిని కొన్ని ఉదాహరణలతో చూద్దాం. 

 • ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుడి  గొప్ప భక్తుడు. అతని మనవడైన మహాబాలి శ్రీమన్నారాయణుడి పట్ల  భక్తిని అతని నుండి వారసత్వంగా పొందాడు. కానీ అతని దురాశ కారణంగా, అతను ఇంద్రుని సంపదను స్వాధీనం చేసుకుంటాడు, శ్రీమన్నారాయణుడి పట్ల కూడా అప్రియంగా ప్రవర్తిస్తాడు. అది చూసిన, ప్రహ్లాదుడు అతనిని మందలించడానికి ప్రయత్నిస్తాడు, కానీ అది చెవిటి వాడి ముందు శంఖం ఊది నట్లు అయిపోతే, చివరికి తన సంపదంతా కోల్పోవుగాకా అని శపిస్తాడు.
 • కైకేయికిచ్చిన వరం కారణంగా  శ్రీ రాముడు వనవాసానికి వెళ్లినపుడు, భరతుడు అక్కడ ఉండడు. తిరిగి వచ్చినప్పుడు, అతను కైకేయి కారణంగా శ్రీ రాముడు అడవికి పంపబడ్డాడని తెలుసుకొని ఆమెను త్యజిస్తాడు.
 • రావణుడు సీతను అపహరించినప్పుడు, విభీషణుడు తన అన్నకు ఆమెను శ్రీ రాముడికి తిరిగి అప్పజెప్పమని విన్నవిస్తాడు. కానీ రావణుడు విభీషణుడి మాట వినిపించుకోడు. పదే పదే ప్రయత్నించిన తరువాత విభీషణుడు చివరకు రావణుడిని పూర్తిగా వదిలిపెట్టి, శ్రీ రాముని ఆశ్రయాన్ని పొందుటాడు. అతను చివరికి  తన సొంత సోదరుడు రావణుడిని ఓడించటానికి శ్రీ రామునికి సహకరిస్తాడు.


78. వర్ణ విరోధి – మన వర్ణం విషయాలలో అవరోధాలు

వర్ణానికి  విరుద్ధమైన కార్యాలలో పాల్గొనడం ఒక అడ్డంకి.  బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్రులు అని నాలుగు వర్గాలుగా మనుషులను విభజించారు. ప్రతి వ్యక్తి ,వారి కోసం శాస్త్రంలో నిర్దేశించిన కార్యాలను నిర్వహించాలి. వారి స్వంత  వర్ణానికి విరుద్ధమైన పనులను చేయకూడదు.
అనువాదకుల గమనిక: ఈ విషయం ఇప్పటికే https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/08/08/virodhi-pariharangal-34/ లో చాలా వివరంగా చర్చించబడింది. ప్రతి వర్ణానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. వివిధ వర్ణానికి సంబంధించిన కార్యాలు ఈ క్రింద వివరించబడ్డాయి.

 • బ్రహ్మణ వర్గం వారికి  6 ప్రధాన కార్యాలు గుర్తించబడ్డాయి. అధ్యయనం (వేదాధ్యయనం), అధ్యాపనం (ఇతరులకు వేదాలు బోధించడం), యజనం (తన కోసం యజ్ఞం చేయడం), యాచనం (ఇతరుల కోసం యజ్ఞం చేయడం), దానం (దానధర్మాలు ఇవ్వడం), పరిగ్రహం  (దానధర్మాలు తీసుకోవడం).
 • క్షత్రియులకు, అధ్యయనం (వేదాధ్యయనం), యజ్ఞం (స్వయం కోసం యజ్ఞం చేయడం) మరియు దానం (దానధర్మాలు చేయడం) మాత్రమే వర్తిస్తాయి – ఇతరులకు వేదాలను బోధించడం, ఇతరుల కోసం యజ్ఞం చేయడం మరియు దానం తీసుకోవడం వర్తించవు. కానీ వాటికి బదులుగా, వాళ్ళు ఆయుధాలను చేతపట్టడం, పౌరులను రక్షించడం, దేశాన్ని పరిపాలించడం వాళ్ళకు వర్తిస్తాయి.
 • వైశ్యులకు కూడా, అధ్యయనం (వేదాధ్యయనం), యజ్ఞం (స్వయం కోసం యజ్ఞం చేయడం) మరియు దానం (దానధర్మాలు చేయడం) మాత్రమే వర్తిస్తాయి – ఇతరులకు వేదాలను బోధించడం, ఇతరుల కోసం యజ్ఞం చేయడం మరియు దానం తీసుకోవడం వర్తించవు. కానీ వాటి స్థానంలో, వాళ్ళు వ్యవసాయం చేయడం, గో సంరక్షణ, వ్యాపారం చేయడం మొదలైనవి వాళ్ళకు వర్తిస్తాయి.
 • ఈ మూడు వర్గాల వారికి వారి వారి పనుల్లో సహాయం చేయడం శూద్రులకు వర్తిస్తుంది.

పిళ్ళై లోకాచార్యులు శ్రీవాచన భూషణ దివ్య శాస్త్రం సూత్రాలు 276, 277, 278 లో కైంకర్యం (దాస్యం) గురించి వివరించారు. మొదట 276 లో, “కైంకర్యం రెండు రకాలు” అని చెప్పారు. సూత్రం 276 లో, “వారు అనుకూలమైన వాటిని చేస్తూ  అననుకూలమైన వాటిని చేయకూడదు” అని తెలియజేసారు. సూత్రం 277 లో, “అనుకూలమైనవి/ అననుకూలమైనవి తమ వర్ణం/ఆశ్రమం మరియు వారి అసలైన జీవాత్మ స్వభావంపై ఆధారపడి ఉంటుంది” అని వారు తెలియజేస్తున్నారు. మాముణులు ఈ సూత్రానికి లోతైన వివరణ ఇచ్చారు. నిస్వార్థ వైఖరితో భగవానుడికి అన్ని కైంకర్యాలు (నిత్య, నైమిత్తిక కర్మానుష్ఠానములు మరియు భగవత్ / భాగవతులకు కైంకర్యాలు) నిర్వహించాలని వారు వివరించారు. శాస్త్రం మరియు మన ఆచార్యల నుండి నేర్చుకున్నట్లుగా వర్ణశ్రమ ధర్మాన్ని అనుసరించడం కూడా భగవత్ కైంకర్యంగా చేయాలి, మన సేవలన్నీ భగవాన్ యొక్క దివ్య సంకల్పానికి అనుగుణంగా ఉండాలి.

79. జప విరోధి – మనం చదవడంలో/ స్మరించడంలో  అవరోధాలు

మూల మంత్రం (తిరుమంత్రం) మొదలైనవాటిని పఠించేటప్పుడు అన్ని మంత్రాలకు దేవత అయిన శ్రీమన్నారాయణపై దృష్టి పెట్టడానికి బదులుగా భౌతిక లాభాలను ఆశించడం, ఇతర దేవతల చింతన చేయడం ఒక అడ్డంకి.

మూల మంత్రం అంటే శ్రీ అష్ఠాక్షర మహామంత్రం. మంత్రం త్రాయతి ఇతి మంత్రః  – పఠించే వాడిని రక్షించేది మంత్రం అంటారు. మంత్రం యొక్క దేవత ఎవరో తెలుసుకొని ఆ మంత్రాన్ని పఠించాలి. అష్ఠాక్షర మంత్రానికి శ్రీమన్నారాయణుడు దేవత. అతనికి కైంకర్యం కాకుండా వేరొక మరే ఇతర ప్రయోజనాల గురించి గానీ చింతన చేయడం ఫలితాన్ని ఇవ్వదు.

అనువాదకుల గమనిక: ప్రతి మంత్రంలో  మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి – ఛందస్సు , ఋషి (మంత్ర ప్రచారం చేసినవాడు), దేవత (మంత్ర ధ్యానం యొక్క కేంద్ర బిందువు).  పిళ్ళై లోకాచర్యులు ముముక్షుప్పడి 4వ సూత్రంలో  – “మంత్రత్తిలుం మంత్రత్తుక్కు ఉళ్లిడాన వస్తువిలుం మంత్ర ప్రధాన ఆచర్యన్ పక్కలిలుం ప్రేమం గనక్క ఉణ్డానాల్ కార్యకరమావతు” అని ఘోషిస్తున్నారు. శిష్యుడికి మంత్రముపై,  భగవానుడిపై (మంత్రం యొక్క కేంద్ర బిందువు),  ఆచార్యునిపై (మంత్రంపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నవారు) సంపూర్ణ విశ్వాసం ఉండాలి. ఈ మూడింటిపట్ల గొప్ప ప్రీతిని  పెంపొందించుకోవాలి అని మాముణులు అందంగా వివరిస్తున్నారు. అతను అదే సూత్రాన్ని వెల్లడి చేసే సమానమైన సంస్కృత స్లోకాన్ని కూడా అందంగా ఉదహరిస్తున్నారు – “మంత్రే తత్  దేవతాయాంచ తతా మంత్రప్రదే గురౌ, త్రిషు భక్తిస్ సదాకార్యా సా హి ప్రధమ సాధనం”. ఈ అన్ని అంశాలపై సరైన అవగాహనతో మంత్రాన్ని జపించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ద్వయ మహామంత్రాన్ని వివరించే తిరువాయ్మొళి యొక్క అర్ధాలను ధ్యానించుకుంటూ ద్వయ మహామంత్రాన్ని నిరంతరం అన్ని సమయాలలో పఠించాలి.  మాముణులు ద్వయ మహమంత్రాన్ని నిరంతరం పఠిస్తూ, తిరువాయ్మొళి యొక్క అర్ధాలను ధ్యానిస్తున్నారని తన పుర్వ దినచర్యలో ఎరుమ్బి అప్పా కీర్తించడం మనం చూడవచ్చు. ఇది శ్లోకం 9లో “మంత్ర రత్న అనుసంధాన …” లో చూడవచ్చు.  శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం సూత్రం 274 లో “జప్తవ్యం గురుపరంపరైయుం ద్వయముం” –  గురుపరంపర మంత్రాన్ని, ద్వయ మహామంత్రాన్ని నిరంతరం పఠిస్తుండాలి అని పిళ్ళై లోకాచార్యులచే చెప్పబడింది.

80.  ఆరాధన వీరోధి  – పారాయణలో అవరోధాలు

తిరువారాదనం  మన నిజమైన స్వరూపాన్ని తృప్తిపరచడానికి నిస్వార్థ ఉద్దేశ్యంతో చేయకుండా భౌతిక కోరికలు  కలిగి ఉండటం, జాతి (జన్మ), ఆశ్రయ (యజమాని / అధికారి), నిమిత్తం, మాంసాన్ని, మద్యం మొదలైన శాస్త్రవిరుద్దమైన వాటిని తిరువారాధనంలో అర్పించడం అడ్డంకులు.

తిరువారాదన సమయంలో ఎటువంటి వాటిని ఆశించకుండా భగవానుడిని పూజించాలి. ఎమ్పెరుమాన్ ఆరాధన యొక్క ఫలితం పరమానందకరమైన ఆరాధన (మరింకేదీ కాదు). ఇది ఒక అతి సాధారణమైన ప్రఖ్యాతమైన నియమం – “యదన్నః పురుషోభవతి తదన్నస్ తస్య దేవతా” – శాస్త్ర ప్రకారం మనము భుజింపదగిన తినుపదార్థములన్ని మొదట మనం ఆరాధించే పెరుమాళ్కు సమర్పించి ఆపై మనం తీసుకోవాలి. ఉదాహరణకు, శాస్త్రంలో సన్యాసులకు తాబూలం తినడం నిషేధించబడింది, కాబట్టి తిరువారాధనంలో వారు ఆరాధించే పెరుమాళ్కు సమర్పించరు.  అనుష్ఠాన విరోధి (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/06/23/virodhi-pariharangal-10/) లో చర్చించబడిన అనేక అంశాలను మనం గుర్తు చేసుకోవచ్చు. 

అనువాదకుల గమనిక: తిరువారాదనం అనేది భగవానుడిని పూజించే ప్రక్రియ. దీన్ని http://ponnadi.blogspot.in/2012/07/srivaishnava-thiruvaaraadhanam.html లో వివరంగా వివరించబడింది. భగవానుడిని ఆరాధించడంలో ఉన్న అడ్డంకులు https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/08/25/virodhi-pariharangal-16/ లో వివరంగా వివరించబడ్డాయి. ఆహార పదార్ధాల విషయానికి వస్తే, వాటిని తినడంలో 3 రకాల పరిమితులు తలెత్తుతాయి – జాతి ధుష్టం (ఉల్లిపాయ, వెల్లుల్లి మొదలైనవి), ఆశ్రయ ధుష్టం (అవైష్ణవులతో సంబంధం కలిగి ఉన్న సాత్విక ఆహార పదార్థాలు) మరియు నిమిత్త ధుష్టం (చెడిపోయిన ఆహార పదార్థాలు మొదలైనవి) .ఇవి https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/12/15/virodhi-pariharangal-23/ లో వివరంగా వివరించబడ్డాయి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/11/virodhi-pariharangal-45.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s