Monthly Archives: July 2021

అంతిమోపాయ నిష్ఠ – 4

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః  శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/07/19/anthimopaya-nishtai-3/), నిజమైన శిష్యుని లక్ష్యణాలను మనము గమనించాము. ఈ వ్యాసములో మన పూర్వాచార్యుల యొక్క జీవితములలోని అనేక సంఘటనల గురించి మనము తెలుసుకొందాము.

ఒకసారి, వడుగనంబి, ఎంపెరుమానార్ల కోసము పాలను కాగపెడుతున్నారు. ఆ సమయములో చక్కగా అలంకృతుడైన నంపెరుమాళ్ ఊరేగింపులో భాగముగా ఉత్సవముగా, వారి మఠము ముందుకు విచ్చేసారు. ఉడయవర్లు బయటకు వెడలి, నంపెరుమాళ్ళకి మంగళాశాసనము చేసి, వడుగనంబిని, వడుగా! బయటకు వచ్చి, ఎంపెరుమానార్ల దర్శనము చేసుకో అని పిలిచారు.” దాసన్, నేను బయటకు వచ్చి మీ దైవము దర్శనము చేసుకొంటే, నా దైవమైన మీ కోసము కాచే పాలు పొంగిపోతాయి. అందుకే నేను ఇప్పుడు బయటకు రాలేను” అని సమాధానము ఇచ్చారు. మన జీయర్ (మాముణులు) వడుగనంబి నిష్ఠ గురించి తమ ఆర్తిప్రబంధములో 11వ పాశురములో ఈ క్రింది విధముగా ప్రార్ధించారు.

ఉన్నై ఒళియ ఒరు దెయ్వమ్ మఱ్ఱఱియా
మన్నుపుగళ్ పేర్ వడుగనమ్బి తన్నిలైయై
ఎన్ఱనక్కు నీ తన్తు
ఎతిరాసా ఎన్నాళుమ్ ఉన్ఱనక్కే ఆట్కొళ్ ఉగన్

యతిరాజా! అద్భుతమైన వడుగనంబి నీవు తప్ప అన్య దైవము ఎరుగడు, అట్టి సమానమైన నిష్ఠను నాకు దయతో ప్రసాదించగలరని మరియు నీ సేవకే నేను పూర్తిగా ఆనందముగా అంకితమవ్వాలని నన్ను ఆశీర్వదించుము.

మన జీయర్ (మాముణులు) ఈ క్రింది మూడు సూత్రములను / సంఘటనలను నిరంతరము వివరిస్తూవుంటారు. వీనిలో, రెండవ ఘటనను ఆచార్య ముఖతః సరిగా ఆలకించి, ఆకలింపు చేసుకోవాలి.

ఎవరైతే భౌతిక సుఖములపై ఆసక్తి కలిగి ఉన్నారో, వారు మంచి వైద్యునికి దగ్గరవుతారు (తన శరీరము బాగుగా ఉండవలెనని). ఎవరైతే ఆధ్యాత్మికత పై దృష్టి నిలుపుతారో, వారు సదాచార్యునికి సన్నిహితులవుతారు (ఆత్మ పై శ్రద్ధ నిలుపుటకు).

ఒకసారి, నంబిళ్ళై తన ప్రియ శిష్యుడైన వడక్కు తిరువీధిపిళ్ళైతో తన భార్యకు ఒక ముఖ్య కార్యమునకు సహాయము చేయమని ఆదేశించారు. కొంత సమయము పిదప నంబిళ్ళై “కృష్ణా! నా చర్యపై నీ అభిప్రాయమేమిటని (తన భార్యకు ఒక కార్యమునకై సహాయము చేయమని చెప్పినందులకు)? ” అడిగారు. దానికి వడక్కుతిరువీధిపిళ్ళై సమాధానమిస్తూ “నేను నిరంతరము మీ ఇరువురికి అందుబాటులో వున్నానని (మీకు మరియు మీ భార్యకు ) భావిస్తాను”. అని పలికారు. (అనువాదకుని గమనిక: మనము తాయారు మరియు ఎంపెరుమాన్ లకు ఎలా వినియోగ పడుతామో అలా). మహదానంద భరితుడైన నంబిళ్ళై, నిజమైన శిష్యుడు ఇట్టి లక్షణమే కలిగి ప్రవర్తిస్తాడని పలికారు. (అనువాదకుని గమనిక: మనము ఇతర సంప్రదాయముల వలె కాక శ్రీలక్మి మరియు శ్రీమన్నారాయణుని ఇరువురిని కలిపి ఆరాధించుతాము – ఇది మన విశిష్ట లక్షణము).

ఒకసారి, పిళ్ళైలోకాచార్యులు తమ శిష్యులలో ఒకరిని (ఆమె నిర్మల హృదయురాలు) తనకు స్వేద తీరుటకై వింజామర వీయమన్నారు. దానికి ఆమె “మీ దివ్య తిరుమేనికి కూడా ఇట్టి స్వేద వంటి అవస్థ కలుగునా?” అని అడిగింది. పిళ్ళైలోకాచార్యులు “అవును – ఈ దేహానికి కూడా స్వేద కలుగును. నాచియార్ తిరుమొళి 12.6 లో ఆండాళ్ గుర్తించినట్లు, భగవానునికి కూడా స్వేద కలుగును” అని పలికారు. ఆ విధముగా, ఆమె నమ్మకము వమ్ము కాకుండా, ఆండాళ్ పలుకులతో, సరి అయిన సమాధానమిచ్చారు. (అనువాదకుని గమనిక: మనము కూడా మన ఆచార్యుని స్వరూపమును, ఈ జగత్తులో జీవించి వున్నప్పుడు కూడా, కేవలము భౌతిక శరీరముగా కాక దివ్యమైనదిగా భావించవలెను. అటులనే భగవానుని లీల వలన ఆయన దివ్య స్వరూపము వలె, అది కూడా స్వేద కలిగి వుండును. దీనినే, పిళ్ళైలోకాచార్యులు చక్కని ప్రమాణముతో అద్భుతముగా సాయించారు.

శ్రీ ఉడయవర్ల కాలములో, యాజ్ఞమూర్తి అనే మహా అద్వైత విద్వాన్ (తదుపరి అరుళాల పెరుమాళ్, ఎంపెరుమాన్ అయ్యారు) ఉండేవారు. వారికి కల అనేక మంది శిష్యులు శాస్త్రములోని అనేక అంశములను అభ్యసించారు. వారు అహంకార పూరితులై, తమ శిష్య బృందముతో మరియు సాహిత్యరచనలతో శ్రీరంగమునకు విచ్చేసిరి. వారు ఉడయవర్లను సాహిత్య చర్చకై సవాలు చేసిరి మరియు చర్చ మొదలైనది. ఆ చర్చ 17 దినములు జరిగిన పిదప, 18 వ దినమున యజ్ఞమూర్తి పోటీలో పైచేయి సాధిస్తూవున్నారు. ఆ రోజుకు చర్చ ముగించి, యజ్ఞమూర్తి ఆనందముతో నిష్క్రమించారు. ఉడయవర్లు తన మఠమునకు చేరి, పెరుమాళ్ళ తిరువారాధనను ముగించుకొని, తనపై తానే చింతాక్రాంతులై, ఎంపెరుమాన్లతో “ఇప్పటి వరకు నీ స్వరూపము, ఆకారము, గుణములు, సంపద మొ ||నవి శాస్త్రము ప్రకారము యధార్ధములని స్థాపించావు. కాని ఇప్పటి నా కాలములో, ఒక అసత్యవాది ద్వారా (ఎవరైతే అంతా మిధ్య – అసత్యము అని ప్రకటిస్తున్నారో) వానిని నశింపజేయాలని తలస్తే, అలానే చేయుము.” అని మొరపెట్టుకొన్నారు. తదుపరి వారు యోగము (నిద్ర) లోకి, ప్రసాద స్వీకరణ చేయకనే జారుకున్నారు. వారికి స్వప్నములో ఎంపెరుమాన్ సాక్షాత్కరించి “మీకు యోగ్యుడైన ఒక శిష్యుని ఏర్పాటు చేసితిని. ఆతనికి అన్ని సూత్రములను విశదీకరించుము  ఆళవందార్లు చేసిన విధముగా), వానిని ఆతడు స్వీకరించి, మీకు శిష్యుడు కాగలరు” అని పలికారు.

ఉడయవర్లు మేల్కొని, తన దివ్య స్వప్నమునకు ఆశ్చర్యపడినారు. వారు అమితానందముతో అనేక ప్రమాణములను ధ్యానించారు.  రామానుజ నూత్రందాది 88 “వలిమిక్క చీయమిరామానుసన్ మఱై వాదియరామ్ పులిమిక్కతెన్ఱు ఇప్పువనత్తిల్ వన్దమై”  క్రూరపులులతో నిండిన అరణ్యములో, ఒక శక్తివంతమైన మృగేంద్రుడు ప్రవేశించి వానిని ఎలా నశింపజేయునో, అటులనే ఈ జగత్తున అసత్య ప్రమాణములను ప్రచారము చేయు కుదృష్థి మనస్సుగల శిక్షకులను నశింపజేయుటకై శ్రీరామానుజులు ఉద్భవించి, వారిని నశింపజేయుదురు (శుద్ధి చేయుదురు). మరుసటి ఉదయము ఉడయవర్లు గెలుపొందిన సింహము వలె, చర్చాసభకు విచ్చేసిరి. వారి పరమానందమైన స్వరూపమును గాంచిన యాజ్ఞమూర్తి గందరగోళుడై” నిన్న వారు నిష్క్రమించినపుడు పాలిపోయి ఉన్నారే, నేడు దేదీప్యమానముగా గొచరిస్తున్నారు – ఇది మానవ చర్య కానేరదు – ఎదో దైవికమైన సంబంధము వలననే సంభవము” అని యోచించి, ఉడయవర్ల పాదపద్మములపై ప్రణమిల్లినారు. “ఏమిది? మీరు ఇంక చర్చకు రారా? ” అని ఉడయవర్లు ప్రశ్నించారు. దానికి యాజ్ఞమూర్తి “పెరియ పెరుమాళ్ మీకు దర్శన మిచ్చి, మార్గోపదేశము చేసినారు కదా! మీకు మరియు పెరియ పెరుమాళ్ళకు వ్యత్యాసము లేదు. కావున నేను ఏ మాత్రము మీ ముందు నిలిచి మాటలాడే యోగ్యత లేని వానిని. దయతో నన్ను మీ శిష్యునిగా స్వీకరింపుడు” అని ప్రాధేయపడినారు. ఉడయవర్లు మిక్కిలి సంతశిం వారికి” అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానార్” ( పెరరూళాలన్ మరియు తన నామముతో జోడించి) అని నామకరణము చేసిరి. వారిని (శ్రీవైష్ణవ సన్యాస ఆశ్రమమునకు) ఆశీర్వదించి, ఒక పెద్ద మఠమును నివాసమునకై  ప్రసాదించారు. “మీకు అన్ని శాస్త్రములు తెలియును. వాంఛలను విడనాడి, శ్రీమన్నారాయణుని పాద పద్మములను ఆశ్రయించవలసినది. మీకు అన్నియును తెలియును, నేను వివరించనవసరము లేదు. మీరు మరియు మీ శిష్యులు విశిష్టాద్వైత సిద్దాంతములను పరమానందముగా చర్చించు సమయమిది” అని ఉడయవర్లు పలికారు. అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ కృతజ్ఞతతో ఆ మఠములో నివసించసాగారు.

ఎంపెరుమానార్ – శ్రీపెరుంబుదూర్, అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ – తిరుప్పాడగం

తదుపరి, శ్రీ వైష్ణవ జంట శ్రీరంగమునకు వచ్చిరి. వారు అచ్చటి ప్రజలను “ఎంపెరుమానార్” మఠము ఎక్కడ? అని విచారించారు. వారు “ఏ ఎంపెరుమానార్ మఠము” అని అడుగగా, ఆ శ్రీవైష్ణవులు అమితాశ్చర్యముతో “మేము మన సంప్రదాయములో ఒకే ఎంపెరుమానార్ వున్నారని భావిస్తున్నాము. ఇద్దరు వున్నారా?” అనినారు. దానికి ఆ ప్రజలు “అవును, ఇచ్చట ఎంపెరుమానార్లు మరియు అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్లు అను ఇరువురు వున్నారు” అని బదులిచ్చారు. దానికి ఆ శ్రీవైష్ణవులు “ఆహ! మేము ఆ రెండవ వారి గురించి వినలేదు. శ్రీభాష్యకారుల గురించే వచ్చాము” అని పలికారు. వారికి ఎంపెరుమానార్ల మఠమునకు మార్గము చూపగా, వారు అచ్చటకు చేరుకొన్నారు.
ఈ సంభాషణలను ఆలకించిన అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానార్లు “ఓహో మేము ఉడయవర్లతో కాకుండా వేరు మఠములో నివసించుటచే, ప్రజలు తమను కూడా ఒక ఉడయవర్లతో సమానుడిగా భావిస్తున్నారని” తలంచారు. తాము పెద్ద దోషమే చేశాము అని దుఃఖించారు. మరుక్షణమే వారి మఠమును తొలగించాలని ఆదేశించారు మరియు ఎంపెరుమానార్ల మఠమునకు జేరి, వారి పాదపద్మములపై మోకరిల్లి” నేను అనంత కాలముగా అహంకార పూరితుడనై, మీ నీడలో లేను. కాని ఇప్పుడు మీ నీడకు చేరినను, నన్ను విడిగా వేరు మఠములో ఉంచారు. ఇదేనా నా గురించి మీరు ఆలోచించినది” అని వాపోయారు. ఉడయవర్లు ఆశ్చర్యముతో ఏమి జరిగినదని అడిగారు. వారికి జరిగిన సంఘటనను వివరించారు.
ఉడయవర్ నీకు ఏమి చేయగలను అని అడుగగా,
అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ “నేటి నుంచి నేను మీకు నీడగా, మీ పాదపద్మములను అనుసరించునటుల మరియు మీకు నిత్య సేవా కైంకర్యము చేసే భాగ్యమును” ప్రసాదించగలరని ప్రార్ధించారు. ఎంపెరుమానార్లు అంగీకరించి, వారిని మఠములో వసించమని మరియు మన సంప్రదాయములోని అనేక సూక్ష్మములను వారికి బోధించారు. ఎంపెరుమానార్ల సేవ తప్ప అన్య భావము లేక, వారు ఆనందముగా అచ్చట వసించసాగారు. ఎంపెరుమానార్ల వద్ద అభ్యసించిన సూక్ష్మముల ద్వారా, వారు రెండు అద్భుతమైన ప్రబంధములను, అందరికి సులువుగా బోధపడే విధముగా రచించిరి. అవియే జ్ఞానసారము మరియు ప్రమేయసారము. వాని ద్వారా శిష్యునికి ఆచార్యులే పరమ ఆరాధ్యదైవమని నిరూపించినారు మరియు వారి పాదపద్మములే మనకు శరణు, “శరణాగతి మార్గాన్ని బోధించే ఆచార్యులే, శిష్యునికి శరణు”, “శ్రీమన్నారాయణుడే స్వయముగా మన ఆచార్యులుగా దర్శనమవుతారు”, అని మనకు మార్గనిర్దేశనము గావించారు. పై విషయాలను జ్ఞానులైన శ్రీ అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్లు మనకు కృప చేసారని, మన జీయర్ మాముణులు సాయించిరి.

అనువాదకుని గమనిక: పై విధముగా మనము ఎంపెరుమానార్లు తమ భగవత్ కృపచే వడుగ నంబి మరియు అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ల మనస్సును శుద్ధి చేయుటను మరియు వారు తమ వంతుగా ఎంపెరుమానార్లపై పూర్తిగా ఆధారపడుటను మరియు వారికి శరణాగతి చేయుటను గమనించినాము.

అడియేన్ గోపీ కృష్ణమాచార్యులు, బొమ్మకంటి, రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-4.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 3

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః  శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

ఇంతకు ముందు విషయములలో, (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/03/04/anthimopaya-nishtai-2/ ) ఆచార్యుని వైభవమును మనము గమనించాము. ఈ విభాగములో మనము శిష్య లక్షణమును తెలుసుకొందాము.

తిరువరంగత్తు అముదనార్లు, ఆళ్వాన్, ఎంబెరుమానార్లు

శిష్య లక్షణముపై మరికొన్ని అంశాలు:

  • ఉపదేశరత్తిన మాలై 72 – ఇరుళ్ తరుమా ఞాలత్తే। ఇన్బముఱ్ఱు వాళుమ్। తెరుళ్ తరుమ॥ దేశికనై చ్చేర్ న్దు।। –  దివ్యదేశములలోని ఎంపెరుమాన్లను, భాగవతులను సంపూర్ణ జ్ఞానముతో సేవించుచు, పరమానందముతో జీవించుచున్న ఆచార్యుని శరణాగతి చేయుటయే, ఈ అంధకార బంధురమైన జగత్తున అవసరము.
  • పెరియాళ్వార్  తిరువాయ్మొళి 4.4.2 – కుఱ్ఱమిన్ఱి గుణమ్ పెరుక్కి గురుక్కళుక్కు అనుకూలరాయ్ – శిష్యుడు లోపరహితుడై వుంటూ, ఆచార్యునికి ఎల్లప్పుడు అనుకూలుడై ఉండవలెను.
  • నాన్ముగన్ తిరువందాది 18 – వేఱాగ ఏత్తియిరుప్పారై వెల్లుమే మఱ్ఱవరై చ్చాత్తి యిరుప్పార్ తవమ్ – భగవానుని ఆరాధించే వారి తపస్సు కన్నా, భాగవతులను ఆరాధించే వారి తపస్సు ఉత్తమము.
  • నాచ్చియార్ తిరుమొళి 10.10 – విట్టుచిత్తర్ తంగళ్ దేవరై వల్లపరిసు వరువిప్పరేల్ అదు కాణ్డుమే – పెరియాళ్వార్ కణ్ణ్ ను ఆహ్వానించి, ఏ విధముగానైనా రప్పించగలిగేతే, నేను ఆ సమయములో ఆతనిని దర్శించగలనని ఆండాళ్ పలికారు.
  • కణ్ణినున్ శిరుత్తాంబు తనియన్ – వేఱొన్ఱుమ్ నానఱియేన్ – నాకు నమ్మాళ్వార్లు తప్ప మరి ఏదిగాని (ఎవరు గాని) తెలియదు.
  • కణ్ణినున్ శిరుత్తాంబు 2 – దేవుమఱ్ఱఱియేన్ – నమ్మాళ్వార్లు తప్ప వేరే ఇతర భగవానులను నేను ఎరుగను
  • శ్రీ రామాయణం – శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నః – శత్రుఘ్నుడు భరతుని పై అంకితభావముతో వుండి, శ్రీరాముడిని సేవించే కోరికను కూడా అధిగమించి, భరతునిపైననే సేవానిరతిని చూపును
  • శ్రీ వచన భూషణం 411 – వడుగ నమ్బి ఆళ్వానైయుం ఆణ్డానైయుమ్ ఇరుకఱైయర్ ఎన్బర్ – వడుగనంబి (ఎంపెరుమానార్లు అయిన రామానుజలవారికి పూర్తిగా శరణాగతి కలిగి) ఈ విధముగా అనేవారు. కూరతాళ్వాన్ మరియు ముదలియాండన్ లు ఎంపెరుమాన్ మరియు ఎంపెరుమానార్లపై ఆధారపడి వుంటారు. ( కాని తను మాత్రము పూర్తిగా ఎంపెరుమానార్లపై మాత్రమే ఆధారపడి వున్నారు)
  • ఇరామానుశ నూఱ్ఱన్దాది 1 – ఇరామానుశన్ శరణారవిందం నామ్ మన్ని వాళ నెఞే శొల్లువోం అవన్ నామఙ్గళే – ఎంపెరుమానార్ల యొక్క పూజ్య పాదాలపై విడదీయలేని విశ్వాసము పెంపొందుటకు మనము నిత్యము శ్రీరామానుజ నామాలను పారాయణ చేయాలి
  • ఇరామానుశ నూఱ్ఱన్తాది 28 – ఇరామానుశన్ పుగళ్ అన్ఱి ఎన్ వాయ్ కొఞిప్పరవకిల్లాదు, ఎన్న వాళ్విన్ఱు కూడియతే – నా జీవితము ఇప్పుడు అద్భుతముగా వుంది, ఏల అనగా నేను శ్రీరామానుజుని దివ్య / శుభప్రదమైన గుణములను మాత్రమే కీర్తిస్తున్నాను.
  • ఇరామానుశ నూఱ్ఱన్తాది 45 – పేఱొన్ఱు మఱ్ఱిల్లై నిన్ శరణన్ఱి, అప్పేరళిత్తఱ్కు ఆఱొన్ఱుమ్ ఇల్లై మఱ్ఱ చ్చరణన్ఱి –  అముదనార్లు ఎంపెరుమానార్ల గురించి – నా జీవిత లక్ష్యము నీ పూజ్య పాదములను సేవించుట. ఆ లక్ష్యమును సాధించుటకు నీ పూజ్య పాదములే నాకు మార్గము.
  • ఇరామానుశ నూఱ్ఱన్తాది 48 – నిగరిన్ఱి నిన్ఱ ఎన్ నీశదైక్కు నిన్నరుళిన్ కణ్ అన్ఱి ప్పుగల్ ఒన్ఱుమిల్లై అర్ట్కుం అహుతే పుగల్ – నాలో అమితమైన లోపాలు వున్నాయి. నీ దయ వల్లనే, నేను శుద్ధి పొందుతాను. నీ దయ పొందడానికి, నేను ఏమి చేయనవసరము లేదు, నీ దర్శన మాత్రముచే నీ దయను నేను పొందగలను.
  • ఇరామునుశ నూఱ్ఱన్తాది 56 – ఇరామానుశనై అడైన్తపిన్ ఎన్వాక్కు ఉరైయాదు ఎన్ మనమ్ నినైయాదు ఇని మఱ్ఱొన్ఱైయే –  శ్రీరామానుజుల ఆశ్రయము పొందిన తరువాత, నా పలుకులు మరి ఎవరి కీర్తిని గానము చేయవు మరియు నా మనస్సు మరి ఏ విషయమును ఆలోచించదు.
  • ఇరామానుశ నూఱ్ఱన్తాది 79 – ఇరామానుశన్ నిఱ్క వేఱు నమ్మై ఉయ్యక్కొళ్ళవల్ల దెయ్వమ్ ఇన్ఙి యాతెన్ఱు ఉలర్ందు అవమే ఐయప్పడా నిఱ్పర్ వైయత్తుళ్ళోర్ నల్లఱివిళ న్తే – ఎంపెరుమానార్లు ప్రతి ఒక్కరికి నిజమైన జ్ఞానమును ఇచ్చి, వారిని ఉద్ధరించాలని నిరీక్షిస్తూ ఉండగా, ప్రజలు అజ్ఞానముతో తమను ఉద్ధరించే భగవానునికై వెదుకుట నాకు బాధాకరముగా వున్నది.
    ● ఇరామానుశ నూఱ్ఱన్తాది104 – కైయిల్ కనియన్న కణ్ణనై క్కాట్టిత్తరిలుం ఉన్దనన్ మెయ్యిల్ పిఱఙ్గియ శీరన్ఱి వేణ్డిలన్ యాన్ – ఎంపెరుమాన్ అయిన శ్రీ కృష్ణుని దర్శనము నాకు నీవు కలిగించినను (తన భక్తులకు ఎవరైతే సౌందర్యానికి, సులభ ప్రాప్యతకు ప్రతీకలో), నేను నీ యొక్క దివ్య స్వరూపము మరియు గుణములు పైననే దృష్టి కలిగి ఉండుటచే, మరి ఏ విషయము నాకు అనవసరము
  • ఇరామానుశ నూఱ్ఱన్దాది106 – ఇరుప్పిడమ్ వైకున్దం వేఙ్గడం, మాలిరుఞ్జోలైయెన్నుమ్ పొరుప్పిడం మాయనుక్కెన్బర్ నల్లోర్, అవై తమ్మొడుం వన్దు ఇరుప్పిడం మాయన్ ఇరామానుశన్ మనత్తు ఇన్ఱు అవన్ వన్దు ఇరుప్పిడం ఎన్దన్ ఇదయత్తుళ్ళే తనక్కిన్బుఱవే – గొప్ప ఆత్మ జ్ఞానులు శ్రీమన్నారాయణుని శ్రీవైకుంఠము, తిరువేంకడము (తిరుమల), తిరుమాలిరుంజోలై మొదలగు క్షేత్రములలో నివశించుతారని ప్రకటించుతారు. కాని భగవానులు తమ సమస్త పరివారసహితుడై సుందరమైన శ్రీరామనుజుల వారి హృదయములో నివశించుతారు. అట్టి రామానుజులు నా హృదయములో శాశ్వత ఆనందాన్ని ఇస్తూ నివశించుతున్నారు
  • రామానుశ నూఱ్ఱన్తాది 108 – నంతలైమిశైయే పొఙ్గియ కీర్తి ఇరామానుశనడి ప్పూమన్నవే! – అట్టి రామానుజుల వారి పుణ్య పాదములు నాకు శిరోధార్యములు.
    అనువాదకుని గమనిక : పైన పేర్కొన్న పాశురముల ద్వారా, శిష్యుడు ఆచార్యుని ఎల్లప్పుడూ ఎలా ధ్యానించవలెను, అతని సేవకై ఎలా తహతహలాడవలెను మరియు ఆతనిని ఎల్లప్పుడూ ఎలా సంతోషపెట్టవలెను అనునవి నిరూపించబడెను. తదుపరి అరులాల పెరుమాళ్ ఎంపెరుమానార్ యొక్క జ్ఞానసారం నుంచి అనేక పాశురములు తెలియజేస్తున్నాము.

అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్

ఙ్ఞాన సారం 30
మాడుం మనైయుం మఱై మునివర్
తేడుమ్ ఉయర్ వీడుం శెన్నెఱియుం – పీడుడైయ
ఎట్టెళుత్తుం తందవనే ఎన్ఱిరాదార్ ఉఱవై
విట్టిడుగై కణ్డీర్ విది

శాస్త్రము ప్రకారము, మనము భౌతిక సంపదను మరియు ఆధ్యాత్మిక సంపదను ఆచార్యునిగా భావించవలెను. ఏలనన, వారి ద్వారానే మనకు అష్టాక్షరీ మహామంత్రము యొక్క వివరణ బోధింపబడినది. ఈ భావనకు విరుద్ధముగా తలచువారి సాంగత్యమునకు మనము దూరముగా ఉండవలెను.

ఙ్ఞాన సారం 31
వేదమొరు నాంగిన్ ఉట్పొదిన్ద మెయ్ ప్పొరుళుం
కోదిల్ మను ముదల్ నూల్ కూఱువదుం – తీదిల్
శరణాగతి తంద తన్ ఇఱైవన్ తాళే
అరణాగుమం ఎన్నుం అదు

అష్టాక్షరీ మహామంత్రము (వేదముల యొక్క సారము) మరియు స్మృతులు (మనువు ద్వారా పొందినవి) శరణాగతి అనే మార్గమును ఆచార్యుల ద్వారా మాత్రమే మనకు చూపించబడినాయని ఖచ్చితముగా ప్రకటించినవి. కావున ఆచార్యులే శిష్యునికి శరణు.

ఙ్ఞాన సారం 36
విల్లార్ మణి కొళిక్కుం వేన్గడ ప్పొఱ్ కున్ఱు ముదల్
శొల్లార్ పొళిల్ సూళ్ తిరుప్పతిగళ్ – ఎల్లాం
మరుళాం ఇరుళోడ మత్తగత్తు త్తన్ తాళ్
అరుళాలే వైత్త అవర్

నిజమైన శిష్యుడు, భగవానుని నివాస స్థలములైన తిరువేంకటము (మరియు పరమపదము, క్షీరాబ్ది, మొదలైనవి) తన ఆచార్యునిలోనే దర్శింప గలడు. కారణము ఆచార్యులు తమ అమిత కరుణ చూపి శిష్యుని అజ్ఞానమును పారద్రోలగలరు.

ఙ్ఞాన సారం 37
పొరుళుం ఉయిరుం ఉడమ్బుం పుగలుం
తెరుళుం గుణముం శెయలుం – అరుళ్ పురింద
తన్ ఆరియన్ పొరుట్టా చ్సన్గ్కఱ్పమ్ శెయ్బవర్ నెన్జ్చు
ఎన్నాళుం మాలుక్కిడం

ఏ శిష్యులు తమ సంపదను, బాంధవ్యములను, జ్ఞానమును, చర్యలను, ఇతరములను తమ ఆచార్యుని వద్ద వదలినారో, అట్టి వారి హృదయములో సర్వేశ్వరుడు శాశ్వతముగా / పరమానందముగా నివాసముండును.

ఙ్ఞాన సారం 38
తేనార్ కమల త్తిరుమామగళ్ కొళునన్
తానే గురువాగి త్తన్ అరుళాల్ – మానిడర్కా
ఇన్నిలత్తే తోన్ఱుదలాల్ యార్క్కుమ్ అవన్ తాళిణైయై
ఉన్నువదే శాల ఉఱుం

శ్రీ మహాలక్ష్మి యొక్క పతి అయిన శ్రీమన్నారాయణుడే ఆచార్యునిగా మనకు దర్శనమిస్తూ , జీవాత్మాలను తమ అపార కరుణతో ఉద్ధరించగలరు. వారి పూజ్య పాదములనే మనము సంపూర్ణముగా శరణు చేయుటే తరుణోపాయము.

శిష్యునికి ఆచార్యునిపై ప్రేమ / బాంధవ్యము నిండి ఉండవలెను.

అనువాదకుని గమనిక: పిళ్ళై లోకాచార్యుని ద్వారా శ్రీవచణ భూషణ దివ్య శాస్త్రము నందు వివరింపబడిన శిష్య లక్షణములు తదుపరి తెలుసు కొందాము.

సూత్రము 243: 

  • మనము ఈ సంసారములో ఉన్నందువల్ల కొన్ని విషయాలను గురించి ఆలోచించాలి.
    • మనమే (ముఖ్యముగా మన శరీరము) మన ఆత్మకు ముఖ్య విరోధులము – అదియే మన అహంకారమునకు (స్వ స్వాతంత్రియము) మరియు భౌతిక విషయ లాలస పై ఆసక్తి కి కారకము.
    • సంసారులు (విషయ వాంచిత్తులు) సర్పముల వలే భయావహులు – ఏలనన వారు మన విషయ లోలత్వమును పెంచి సంసారములోనే వుంచుదురు.
    • శ్రీవైష్ణవులే మనకు నిజమైన బంధువులు – వారే మనను విషయ లోలత్వము నుంచి విడదీసి, భగవత్ విషయములపై ఆసక్తిని /ఆధ్యాత్మిక భావనలను కలుగజేయుదురు.
    • ఎంపేరుమానే తండ్రి – మన హితమునే వారు ఎల్లప్పుడూ వాంచించెదరు కావున.
    • ఆచార్యులు, ఆకలిగొన్న వ్యక్తి ఆహారమునకై ఎట్లు తపించునో, అట్లు మన ఆధ్యాత్మిక ఆకలిని తీర్చు (జ్ఞానమును) అందించుదురు.
    • శిష్యుడు మనకు మిక్కిలి ప్రేమ పాత్రుడు – ఏలనన అతనితో మన భగవద్ అనుభవమును అతను ఇష్టపడున్నట్లు / ఆనందించేట్లు పంచగలము మరియు మనము కూడా భగవద్ విషయమును ఆనందించగలము.
  • ఇట్టి మానసిక భావనతో, మనము ఈ విధానముగా ఆలోచన చేయాలి
    • అహంకారము వలన మన నిజమైన శ్రేయోభిలాషులను (శ్రీవైష్ణవులు) విడిపోవుట జరుగును.
    • ధనము (భౌతిక సంపద) అవైష్ణవులపై అనుబంధమునకు చేర్చును – ఏ క్షణమున సంపద వెనుక మనము పయనిస్తామో, అప్పటి నుంచి అవైష్ణవులకు నమస్కరించుతూ, వారి సహాయముకై ఎదురు చూడవలసి వస్తుంది. అట్టి సందర్భములలో, మనము అవైష్ణవులపై ప్రశంసలను పెంచుకొంటాము (వారి పనులలో గొప్ప వారే అయినను) – కాని ఈ పొగడ్తలు ప్రమాదకరము ఏలనన, అవి భగవద్విషయము పై కావు మరియు మనను ఆ చేష్టలపై మళ్ళించును.
    • కామము (వ్యామోహము) మనను స్త్రీ లోలులనుగా చేయును (వారు మనను వదిలినను) భగవద్గీత లో శ్రీ కృష్ణ పరమాత్మ తెలియజేసారు – అనుబంధము మనను కాముకులుగా చేయును మరియు తద్వారా వాంచ్చలు కలిగి, పిచ్చివారుగా మారి, విజ్ఞత కోల్పోతాము, సంసారపు అట్టడుగునకు పడిపోతాము.
  • ఈ విధమైన మనస్సుతో, ఆత్మ గుణములపై (శమము, దమము, సత్వము, మొదలలైన) సంపూర్ణ విశ్వాసము పెంపొందించుకుని, అవి మన ప్రయత్నముల వలన గాక, మన ఆచార్యుని ద్వారా పరమాత్మ దయ వలన లభించినవనే భావనతో వుంటూ మరియు ఈ విధముగా నడచుకోవలెను.
    • భౌతికమైన వాంఛలపై అభిమానమును విడువవలెను
    • భగవద్విషయముపై అనుబంధము పెంచుకోవలెను
    • ప్రాపంచిక / భౌతిక వస్తువులు మనను నిజముగా ఆనందిపజాలవని అర్ధము చేసుకొనుటను మొదలిడ వలెను
    • మన శరీరము నిలబడుటకు భగవంతునికి నివేదింపబడిన ప్రసాదమును స్వీకరించుట లేదా తిరువారాధన తరువాత చివరిగా ప్రసాదమును వినియోగించుట (మనము వండిన ఆహారము పరమాత్మకు నివేదించుటచే, అది ప్రసాదము అగును. దానిలో కొంత మనము స్వీకరించవలెను).
    • మన జీవితములో కలుగు దుఃఖము / బాధలను మనము ఈ విధముగా ఆలోచిస్తూ సంతోషముగా స్వీకరించవలెను.
      • మన కర్మ ఫలము – మనము ఇంతవరకు అనేక పుణ్య / పాప కర్మలను చేశాము, వాని ఫలితములను మనము అనుభవించాలి, తద్వారా మన కర్మను తగ్గించుకోగలము.
      • ఎంపెరుమానుడి కృపా ఫలము – ఎంపెరుమానుడికి మనము ఇప్పటికే లొంగిపోయాము, కనుక మన సంచిత కర్మలను (కర్మల యొక్క పెద్ద మూట) ఆయన క్షమించినాడు. మనకు స్వల్ప దుఃఖమును మాత్రమే ఇచ్చి, సంసారముపై అనిష్టతను కలిగించి, పరమపదమును చేరవలెనని కోరుకుంటున్నారు – కాని ఇక్కడ మంచి జీవితము లభించితే, మనము తిరిగి సంసార లంపటములో పడగలము. అందువలన, ఎంపెరుమాన్ మనపై మిక్కిలి దయతో స్వల్ప కష్టములను మన కర్మానుసారము కలిగించి, మనకు పరమపదముపై ప్రేమ కలుగునటుల చేయును.
    • ఎంపెరుమాన్ను జేరుటకు మనము చేయు అనుష్టానమే ఉపాయము అను తలంపును వీడాలి. ఎంపెరుమాన్ మనకు చేయుచున్న సహాయములను అర్ధము చేసుకొని, ప్రతీది ఆయన కైంకర్యముగా చేయాలి.
    • మన పూర్వాచార్యులు మరియు గొప్పవారైన శ్రీవైష్ణవులు సాయించిన జ్ఞానము మరియు అనుష్టానముల పై అనుబంధము కలిగి ఉండవలెను.
    • జీవాత్మలపై అవధులులేని ప్రేమచే ఎంపెరుమాన్ దివ్యదేశములలో ఉన్నందువల్ల, వానిపై మనము అత్యంత అనుబంధముతో వుండాలి.
    • స్వామికి మంగళాశాసనము చేయాలి – ఎంపెరుమానుడికి ఈ ప్రమాదకరమైన సంసారములో ఎట్టి ఆపద రాకూడదని ప్రార్ధిస్తూ – ఏలనన, అనేక అర్చావిగ్రహములు తస్కరింప / ఎదిరింప / రూపుభిన్నము చేయబడుతున్నాయని మనము గమనిస్తున్నాము. ఎంపెరుమాన్ ఎల్లప్పుడు క్షేమముగా వుండాలని మనము ప్రార్ధించాలి. ఇదే ఎంపెరుమానుడిపై అత్యంత భక్తికి పరాకాష్ట. దీనినే పెరియాళ్వార్, ఆండాళ్, ఎంపెరుమానార్లు మొదలైనవారు నిరూపించారు.
    • భౌతిక విషయములపై విరక్తితో వుండాలి.
    • పరమపదము చేరుకోవాలని ధృడమైన కోరిక వుండాలి – నమ్మాళ్వార్ల వలే ఎంపెరుమాన్ వద్ద ప్రతి దినము ఆర్తితో మోక్షము కొరకు, శాశ్వతముగా పరమపదములో కైంకర్యము చేయాలని వేడుకోవాలి.
    • శ్రీవైష్ణవుల వద్ద వినయముగా వుండుట అభ్యసించాలి మరియు అవైష్ణవులకి ఎట్టి సేవను చేయరాదు.
    • ఆహార నియతి పాటించాలి – ఆహార అలవాట్లను క్రమబధీకరించు కోవాలి. (http://ponnadi.blogspot.in/2012/07/srivaishnava-AhAra-niyamam_28.html)
    • శ్రీవైష్ణవుల సాంగత్యము ఆశించాలి
    • అవైష్ణవుల కలయికను వదలించుకోవాలి.

సూత్రము 274 – శిష్యుని యొక్క సిసలైన లక్షణములు.

ఈ సూత్రములో మంచి శిష్య లక్షణములను (సరియైన శిష్యుడు) ఎవరైతే సంపూర్ణముగా ఆచార్యునిపై ఆధారపడునో తెలుసుకొందాము. అవి:

  • వాస్తవ్యమ్ ఆచార్య సన్నిదియుం భగవద్ సన్నిదియుం – నివాస స్థలము ఆచార్యుని సన్నిధానము ( అది లభించక పోతే ) ఎంపెరుమాన్ సన్నిధానము
  • వక్తవ్యమ్ ఆచార్య వైభవముమ్ స్వ నికర్షముమ్ – మాటలాడు విషయము ఆచార్యుని వైభవమును కీర్తించుట గాని, తన దోషములను తెలుపుట గాని
  • జప్తవ్యమ్ గురు పరమ్పరైయుమ్ ద్వయముమ్ – గురు పరంపర / ద్వయ మంత్రము యొక్క ధ్యానము / అనుష్టానము
  • పరిగ్రాహ్యమ్ పూర్వాచార్య వచనముమ్ అనుష్టానముమ్ – పూర్వాచార్యుల సూచనలను మరియు వారి చరితను ఆమోదించుట
  • పరిత్యాజ్యమ్ అవైష్ణవ సహవాసముమ్ అభిమానముమ్ – అవైష్ణవుల సహవాసమును విసర్జించుట మరియు అవైష్ణవులు మనను తమ వారు అని అనిపించే ఎట్టి కార్యమును చేయరాదు
  • కర్తవ్యమ్ ఆచార్య కైంకర్యముమ్ భగవత్ కైంకర్యముమ్ – ఆచార్యుని, ఎంపెరుమానుడిని సేవించుట కర్తవ్యము గావలెను

నిజమైన శిష్యునికి వుండవలసిన నడవడికపై మరికొన్ని సూత్రములు.

  • సూత్రము 275 – ఆచార్యుని ఎలా సేవించు కోవాలి అనే అంశముపై శిష్యుడు శాస్త్రమును ఆధారము చేసుకోవాలి మరియు ఆచార్యుని ఆదేశాలను పాటించాలి.
  • సూత్రము 298 – శిష్యుని జ్ఞానమునకు మూలము ఆచార్యుని దైవికమైన లక్షణములు; ఆచార్యుని దోషములే శిష్యుని అజ్ఞానము; ఆచార్యుని సేవించుటే శిష్యుని సమర్ధత; శాస్త్రము సమ్మతించని చర్యలను విడనాడుటపై చొరవే శిష్యుని అసమర్ధత.
  • సూత్రము 321 – నిజమైన శిష్యునికి అర్ధము.
    • ఆచార్యుని సేవించుట తప్ప వేరే ఎట్టి ఇతర లక్ష్యము లేకుండుట.
    • ఎల్లప్పుడు ఆచార్యుని ఆనందింపజేయుటకై మరియు వారి నుండి జ్ఞాన సముపార్జనకై ఆచార్యుని సేవించుట,
    • ఎవరైతే ఈ సంసారమును వదిలించుకుంటారో, ఒక్క క్షణము కూడా ఆచార్యుని ఎడబాటును భరించలేరో
    • ఎవరైతే ఆచార్యునిచే బోధింపబడిన భగవద్విషయము మరియు ఆచార్యుని సేవపై గొప్ప అనుబంధము కలిగి వుంటారో
    • ఎవరైతే భగవానుని మరియు భాగవతుల (తన ఆచార్యుని మరియు వారి తోటి శ్రీవైష్ణవులతో సహా) కీర్తిని ఆలకించునపుడు అసూయ చెందరో
  • సూత్రము 322 – ఆచార్యునిపై శిష్యుడు గొప్ప అనుబంధం పెంపొందించుకుని, దాని వలన ఆచార్యుడే తిరుమంత్రము, భగవానుడే తిరుమంత్ర లక్ష్యము, కైంకర్యమే ఫలితము అని భావిస్తూ, అజ్ఞానమును, భౌతిక ఆనందమును విడనాడాలి.
  • సూత్రము 323 – ఈ సూత్రమునే పరమాచార్యులైన ఆళవందార్లు, నమ్మాళ్వార్లపై సాయించిన “మాతా పితా యువతయా” అను శ్లోకములో వివరించారు. వారు నమ్మాళ్వార్లు వైష్ణవ కులపతి (వైష్ణవులకు నాయకుడు) అనియు మరియు తనకు అన్నియు నమ్మాళ్వార్లే అని నిరూపించారు.
  • సూత్రము 327 – ఆచార్యునికి ఏది అనందము కలుగజేయునో, అది శిష్యుడు చేయవలెను.
  • సూత్రము 328 – ఆచార్యుని సంతోషముపై శిష్యుడు ధ్యాస కలిగి వుండాలి.
  • సూత్రము 329 – ఈ విధముగా శిష్యుడు ఆచార్యుని ఆనందముపై ధ్యాస కలిగి, తన యొక్క గౌరవమునకై ఏ మాత్రము ఆలోచింప రాదు.
  • సూత్రము 330/331 – శిష్యుడు ఆచార్యుని ఆగ్రహమునకు గురి అయినను, అది తన మంచికే అని భావించవలెను. కావున, ఆచార్యులు తనపై ఏల ఆగ్రహించిరో అని శిష్యుడు తలపరాదు.
  • సూత్రము 333 – ఆచార్యుని శారీరిక / భౌతిక అవసరములపై శిష్యుడు ధ్యాస కలిగి వుండవలెను.
  • సూత్రము 349 – తన జీవితాంతము వరకు శిష్యుడు, ఆచార్యునిపై విశ్వాసము కలిగి వుండవలెను. “ఆచార్యుడు తన హృదయమును సంస్కరించెను” మరియు “తన మనస్సును భగవానుని పూజించుటకై శుద్ధి చేసెను” అని శిష్యుడు సదా భావించవలెను.
  • సూత్రము 450 – ఎంపెరుమాన్ యొక్క పంచ వివిధ స్వరూపములను (పర, వ్యూహ, విభవ, అంతర్యామి మరియు అర్చావతారము) తన ఆచార్యునిగా భావించి, వారి అవసరములను నిత్యమూ తీర్చాలి. http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-parathvadhi.html

కావున, తన ఆచార్యుని పాదపద్మములే శిష్యునికి ఈ సంసారములోను, పరమపదమునను అంతిమ లక్ష్యముగా భావించాలి.

ఆచార్యుని భౌతిక అవసరములు తనవిగా భావించి, వానిని శిష్యుడు నేరవేర్చవలెను.  శిష్యుడు తన సంపదను ఇస్తున్నాను అని భావించుట (ఆ సంపద అంతకు మునుపే ఆచార్యుని సంపద అయినదని భావించాలి), తన జ్ఞానమును నశింప జేసుకొనుట అగును. ఆచార్యుని దయ పొందుట మాత్రమే సరిపోదు – ఆచార్యునికి పూర్తిగా వినియోగమునకై వుండాలి – అప్పుడే భగవానుని యొక్క పూర్తి జ్ఞానము కలుగును. ఆచార్యుని వలన తనకు ఏమి దక్కినదని శిష్యుడు ఎల్లపుడు ఆలోచిస్తే, తను ఇంకా ఏమి తెలుసుకోలేదని మరియు ఆచార్యుని నుంచి ఇంకా చాలా నేర్వవలసినది కలదని అర్ధమగును. ఆచార్యుని సేవకు కలిగిన అనేక అవకాశములు చేజార్చు కొన్నందులకు మిక్కిలి ఆందోళనతో వుండును. శిష్యుడు తన ఆచార్యుని ఆగ్రహ అనుగ్రహములను సమ దృష్టితో స్వీకరించి మరియు రెండింటిని ఆదర్శముగా భావించాలి. ఎంతో తెలివి గలిగిన శ్రీశబరి సుందరుడైన శ్రీరాముని ఆహ్వానించెను, కొన్ని ఫలములను సమర్పించెను మరియు తన ఆచార్యుని సేవకు (పరమ పదములో నున్న) పయనమగుటకు అనుజ్ఞ వేడెను, శ్రీరాముని సేవను కూడా వదులు కొనుటకు ఇష్టపడి.

మన స్వామి (మణవాళ మాముణులు) కూడా తమ ఆచార్య నిష్ఠను మరియు అట్టి ఆచార్య నిష్ఠ యొక్క కీర్తిని అనేక ప్రబంధముల రచన, ఉపదేశ రత్తినమాలై, యతిరాజ వింశతి మరియు ఆర్తి ప్రబంధముల ద్వారా అందించారు.

భవిష్యదాచార్యులు, తిరువాయ్మొళి పిళ్ళై, మాముణులు

ఉపదేశ రత్తిన మాలై 61
ఙ్ఞానమ్ అనుట్టానమ్ ఇవై నన్ఱాగవే ఉడైయ నాన
గురువై అడైన్దక్కాల్
మానిలత్తీర్! తేనార్ కమల త్తిరుమామగళ్ కొళునన్
తానే వైకున్దం తరుమ్

జ్ఞానము మరియు ఆచరణ గల నిజమైన ఆచార్యుని యొక్క ఆశ్రయము పొందిన శిష్యులను, ఓహ్ ఈ జగత్తులోని జనులరా, శ్రీమన్నారాయణులు తానే దీవించి పరమపదములో దివ్య కైంకర్యమును ఒసగును.

ఉపదేశ రత్తిన మాలై 62
ఉయ్య నినైవుణ్డాగిల్ ఉఙ్గురుక్కళ్ తం పదత్తే వైయుం
అన్బు తన్నై ఇన్ద మానిలత్తీర్!
మెయురైక్కేన్ పైయరవిల్ మాయన్ పరమపదం ఉఙ్గళుక్కామ్
కైయిలఙ్గు నెల్లిక్కని

ఓహ్ ఈ జగత్తులోని ప్రజలారా, మీరు ఉద్ధరింపబడుటకు, ఆచార్యునిపై సంపూర్ణ అనుబంధమును పెంపొందించుకోవలెను. తద్వారా, భగవానుని (శేష తల్పముపై వున్న) నివాస స్థానమైన పరమపదమును సులువుగా పొందగలరు, చేతిలోని ఫలమువలే.

ఉపదేశ రత్తిన మాలై 64
తన్నారియనుక్కుత్తాన్ అడిమై శెయ్ వదు
అవన్ ఇన్నాడు తన్నిల్ ఇరుక్కుమ్ నాళ్
అన్నేర్ అఱిన్దుమ్ అదిలాశై ఇన్ఱి
ఆచారియనై ప్పిరిన్దిరుప్పారార్ మనమే! పేశు

ఆచార్యుని సేవ చేస్తూనే శిష్యుడు, వారి ద్వారా ముఖ్య అర్ధములను గ్రహించవచ్చును. అతడు తన ఆచార్యుని విడనాడాలని ఏనాడూ తలంపరాదు.

ఉపదేశ రత్తిన మాలై 65
ఆచారియన్ శిచ్చన్ ఆరుయిరై ప్పేణుమవన్
తేశారుమ్ శిచ్చనవన్ శీర్ వడివై ఆశైయుడన్ నోక్కుమవన్ ఎన్నుం
నుణ్ణఱివై క్కేట్టు వైత్తుం
ఆర్ క్కుం అన్నేర్ నిఱ్కై అరిదామ్

శిష్యుని ఆధ్యాత్త్మిక ప్రగతికై (జీవాత్మ) ఆచార్యుల దృష్టి వుంచవలెను.
ఆచార్యుని దివ్య స్వరూపముపై (భౌతిక ప్రగతి) శిష్యుని దృష్టి ఉండవలెను. ఇట్టి గాఢమైన లక్షణము ఎరింగినను, ఆచరణము కష్టసాధ్యము.

ఉపదేశ రత్తిన మాలై 66
పిన్బళగరామ్ పెరుమాళ్ శీయర్
పెరున్దివత్తిల్ అన్బదువుమఱ్ఱు
మిక్క ఆశైయినాల్ నమ్పిళ్ళైక్కు ఆన అడిమైగళ్ శెయ్
అన్నిలైయై నన్నెఞ్ఙే! ఊనమఱ ఎప్పొళుదుమ్ ఓర్

ఓహ్ ప్రియ మానసమా! పిన్బళగరామ్ పెరుమాళ్ జీయర్ వారికి పరమపదముపై ఎట్టి ఆసక్తి లేదు, ఏలనన, వారు తమ ఆచార్యులైన నమ్పిళ్ళైను పరమానందముగా సేవించారు. అట్టి అంకిత భావముగల మరియు అంకితులైన శిష్యులకై మనము ఎల్లప్పుడూ ధ్యానించాలి.

మామునిగళ్ యతిరాజ వింశతి స్తోత్ర ప్రారంభములో “రామానుజం యతిపతిమ్ ప్రణమామి మూర్ ధ్నా” (శ్రీ రామానుజుల పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు) అని సాయించి, ” తస్మాత్ అనన్య శరణో భవతి ఇతి మత్వా” (నాకు శ్రీ రామానుజులు మాత్రమే శరణము తప్ప ఇతరులు కాదు) అని ముగించినారు.

మామునిగళ్ తన ఆచార్యులైన తిరువాయ్మొళి పిళ్ళై వారి దివ్య ఆజ్ఞ మేరకు, అందులోని ఇరువది దివ్య శ్లోకములలో శ్రీ రామానుజులను కీర్తిస్తూ వారి సేవకై తపించారు (శ్రీ రామానుజులపై గల గొప్ప అనుబంధమును గమనించి ,ఆళ్వార్ తిరునగరిలోని భవిష్యద్చార్యుని సన్నిధిలో నిత్య పూజా కైంకర్యము చేయు భాగ్యము మాముణులకు, తిరువాయ్మొళి పిళ్ళై కలుగజేసిరి).

చివరిగా ఆర్తి ప్రబంధము 55 లో, తన స్వభావమునకు సంపూర్ణ దీవెనలు పొందినారని మామునిగళ్ భావించారు.

తెన్నరంగర్ శీరరుళుక్కు ఇలక్కాగ ప్పెఱ్ఱోమ్
తిరువరంగమ్ తిరుప్పతియే ఇరుప్పాగ ప్పెఱ్ఱోమ్
మన్నియ శీర్ మాఱన్ కలై ఉణవాగ ప్పెఱ్ఱోమ్
మదురకవి శొల్పడియే నిలైయాగ ప్పెఱ్ఱోమ్
మున్నవరామ్ నమ్ కురవర్ మొళిగళ్ ఉళ్ళ ప్పెఱ్ఱోమ్
ముళుతుమ్ నమక్కవై పొళుతు పోక్కాగ ప్పెఱ్ఱోమ్
పిన్నై ఒన్ఱు తనిల్ నెన్జు పేరామల్ పెఱ్ఱోమ్
పిఱర్ మినుక్కమ్ పొఱామై ఇల్లా ప్పెరుమైయుమ్ పెఱ్ఱోమే

శ్రీ రంగనాధుని సంపూర్ణ దీవెనలు తనకు గలవు (ఒక సంవత్సర కాలము మామునిగళ్ చేసిన కాలక్షేపమును ఆలకించిన, నంపెరుమాళ్ వారికి ఇట్టి మహద్భాగ్యమును కలిగించిరి. తదుపరి మామునిగళ్ తమ ఆచార్యులని అంగీకరించి, “శ్రీ శైలేశ దయా పాత్రం” అను తనియను ప్రసాదించిరి).

నన్ను శ్రీ రంగములోనే నివసించమని నంపెరుమాళ్ళు అజ్ఞాపించారు.

నేను నమ్మాళ్వార్ల పాశురములనే భుక్తిగా పొంది, ఎల్లప్పుడు పరమానందము పొందుట నా భాగ్యము.

మధురకవి ఆళ్వార్ల యొక్క ఆచార్య నిష్ఠ అడుగు జాడలను అనుసరించుట నా భాగ్యము.

ఎల్లప్పుడూ ఆళ్వార్ల / ఆచార్యుల గొప్ప కార్యములను ధ్యానించే భాగ్యము కలుగుట నా భాగ్యము.

నా పూర్తి సమయము వారి కార్యములపైనే వినియోగించుట నా భాగ్యము.

అన్య విషయములపై గాక, ఆళ్వార్లు / ఆచార్యుల కార్యములపై మాత్రమే నా మనస్సు సంపూర్ణముగా కేంద్రికరించుట నా భాగ్యము.ఇతర శ్రీవైష్ణవుల కీర్తిపై నాకు ఎట్టి అసూయ లేకుండుట నా భాగ్యము.

అనువాదకుని గమనిక: ఇటు పిమ్మట, మన పూర్వాచార్యుల జీవితముల నుంచి అనుభవపూర్వక వివిధ సంఘటనలను గమనించి, వారు తమ ఆచార్యులపై ఎలా పూర్తిగా ఆధారపడినారో, మొదటి మూడు వ్యాసములలో వివరించిన విధముగా, తెలుసుకొందాము.

సశేషం.

అడియేన్ గోపీ కృష్ణమాచార్యులు, బొమ్మకంటి, రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-3.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org