అంతిమోపాయ నిష్ఠ – 4

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః  శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/07/19/anthimopaya-nishtai-3/), నిజమైన శిష్యుని లక్ష్యణాలను మనము గమనించాము. ఈ వ్యాసములో మన పూర్వాచార్యుల యొక్క జీవితములలోని అనేక సంఘటనల గురించి మనము తెలుసుకొందాము.

ఒకసారి, వడుగనంబి, ఎంపెరుమానార్ల కోసము పాలను కాగపెడుతున్నారు. ఆ సమయములో చక్కగా అలంకృతుడైన నంపెరుమాళ్ ఊరేగింపులో భాగముగా ఉత్సవముగా, వారి మఠము ముందుకు విచ్చేసారు. ఉడయవర్లు బయటకు వెడలి, నంపెరుమాళ్ళకి మంగళాశాసనము చేసి, వడుగనంబిని, వడుగా! బయటకు వచ్చి, ఎంపెరుమానార్ల దర్శనము చేసుకో అని పిలిచారు.” దాసన్, నేను బయటకు వచ్చి మీ దైవము దర్శనము చేసుకొంటే, నా దైవమైన మీ కోసము కాచే పాలు పొంగిపోతాయి. అందుకే నేను ఇప్పుడు బయటకు రాలేను” అని సమాధానము ఇచ్చారు. మన జీయర్ (మాముణులు) వడుగనంబి నిష్ఠ గురించి తమ ఆర్తిప్రబంధములో 11వ పాశురములో ఈ క్రింది విధముగా ప్రార్ధించారు.

ఉన్నై ఒళియ ఒరు దెయ్వమ్ మఱ్ఱఱియా
మన్నుపుగళ్ పేర్ వడుగనమ్బి తన్నిలైయై
ఎన్ఱనక్కు నీ తన్తు
ఎతిరాసా ఎన్నాళుమ్ ఉన్ఱనక్కే ఆట్కొళ్ ఉగన్

యతిరాజా! అద్భుతమైన వడుగనంబి నీవు తప్ప అన్య దైవము ఎరుగడు, అట్టి సమానమైన నిష్ఠను నాకు దయతో ప్రసాదించగలరని మరియు నీ సేవకే నేను పూర్తిగా ఆనందముగా అంకితమవ్వాలని నన్ను ఆశీర్వదించుము.

మన జీయర్ (మాముణులు) ఈ క్రింది మూడు సూత్రములను / సంఘటనలను నిరంతరము వివరిస్తూవుంటారు. వీనిలో, రెండవ ఘటనను ఆచార్య ముఖతః సరిగా ఆలకించి, ఆకలింపు చేసుకోవాలి.

ఎవరైతే భౌతిక సుఖములపై ఆసక్తి కలిగి ఉన్నారో, వారు మంచి వైద్యునికి దగ్గరవుతారు (తన శరీరము బాగుగా ఉండవలెనని). ఎవరైతే ఆధ్యాత్మికత పై దృష్టి నిలుపుతారో, వారు సదాచార్యునికి సన్నిహితులవుతారు (ఆత్మ పై శ్రద్ధ నిలుపుటకు).

ఒకసారి, నంబిళ్ళై తన ప్రియ శిష్యుడైన వడక్కు తిరువీధిపిళ్ళైతో తన భార్యకు ఒక ముఖ్య కార్యమునకు సహాయము చేయమని ఆదేశించారు. కొంత సమయము పిదప నంబిళ్ళై “కృష్ణా! నా చర్యపై నీ అభిప్రాయమేమిటని (తన భార్యకు ఒక కార్యమునకై సహాయము చేయమని చెప్పినందులకు)? ” అడిగారు. దానికి వడక్కుతిరువీధిపిళ్ళై సమాధానమిస్తూ “నేను నిరంతరము మీ ఇరువురికి అందుబాటులో వున్నానని (మీకు మరియు మీ భార్యకు ) భావిస్తాను”. అని పలికారు. (అనువాదకుని గమనిక: మనము తాయారు మరియు ఎంపెరుమాన్ లకు ఎలా వినియోగ పడుతామో అలా). మహదానంద భరితుడైన నంబిళ్ళై, నిజమైన శిష్యుడు ఇట్టి లక్షణమే కలిగి ప్రవర్తిస్తాడని పలికారు. (అనువాదకుని గమనిక: మనము ఇతర సంప్రదాయముల వలె కాక శ్రీలక్మి మరియు శ్రీమన్నారాయణుని ఇరువురిని కలిపి ఆరాధించుతాము – ఇది మన విశిష్ట లక్షణము).

ఒకసారి, పిళ్ళైలోకాచార్యులు తమ శిష్యులలో ఒకరిని (ఆమె నిర్మల హృదయురాలు) తనకు స్వేద తీరుటకై వింజామర వీయమన్నారు. దానికి ఆమె “మీ దివ్య తిరుమేనికి కూడా ఇట్టి స్వేద వంటి అవస్థ కలుగునా?” అని అడిగింది. పిళ్ళైలోకాచార్యులు “అవును – ఈ దేహానికి కూడా స్వేద కలుగును. నాచియార్ తిరుమొళి 12.6 లో ఆండాళ్ గుర్తించినట్లు, భగవానునికి కూడా స్వేద కలుగును” అని పలికారు. ఆ విధముగా, ఆమె నమ్మకము వమ్ము కాకుండా, ఆండాళ్ పలుకులతో, సరి అయిన సమాధానమిచ్చారు. (అనువాదకుని గమనిక: మనము కూడా మన ఆచార్యుని స్వరూపమును, ఈ జగత్తులో జీవించి వున్నప్పుడు కూడా, కేవలము భౌతిక శరీరముగా కాక దివ్యమైనదిగా భావించవలెను. అటులనే భగవానుని లీల వలన ఆయన దివ్య స్వరూపము వలె, అది కూడా స్వేద కలిగి వుండును. దీనినే, పిళ్ళైలోకాచార్యులు చక్కని ప్రమాణముతో అద్భుతముగా సాయించారు.

శ్రీ ఉడయవర్ల కాలములో, యాజ్ఞమూర్తి అనే మహా అద్వైత విద్వాన్ (తదుపరి అరుళాల పెరుమాళ్, ఎంపెరుమాన్ అయ్యారు) ఉండేవారు. వారికి కల అనేక మంది శిష్యులు శాస్త్రములోని అనేక అంశములను అభ్యసించారు. వారు అహంకార పూరితులై, తమ శిష్య బృందముతో మరియు సాహిత్యరచనలతో శ్రీరంగమునకు విచ్చేసిరి. వారు ఉడయవర్లను సాహిత్య చర్చకై సవాలు చేసిరి మరియు చర్చ మొదలైనది. ఆ చర్చ 17 దినములు జరిగిన పిదప, 18 వ దినమున యజ్ఞమూర్తి పోటీలో పైచేయి సాధిస్తూవున్నారు. ఆ రోజుకు చర్చ ముగించి, యజ్ఞమూర్తి ఆనందముతో నిష్క్రమించారు. ఉడయవర్లు తన మఠమునకు చేరి, పెరుమాళ్ళ తిరువారాధనను ముగించుకొని, తనపై తానే చింతాక్రాంతులై, ఎంపెరుమాన్లతో “ఇప్పటి వరకు నీ స్వరూపము, ఆకారము, గుణములు, సంపద మొ ||నవి శాస్త్రము ప్రకారము యధార్ధములని స్థాపించావు. కాని ఇప్పటి నా కాలములో, ఒక అసత్యవాది ద్వారా (ఎవరైతే అంతా మిధ్య – అసత్యము అని ప్రకటిస్తున్నారో) వానిని నశింపజేయాలని తలస్తే, అలానే చేయుము.” అని మొరపెట్టుకొన్నారు. తదుపరి వారు యోగము (నిద్ర) లోకి, ప్రసాద స్వీకరణ చేయకనే జారుకున్నారు. వారికి స్వప్నములో ఎంపెరుమాన్ సాక్షాత్కరించి “మీకు యోగ్యుడైన ఒక శిష్యుని ఏర్పాటు చేసితిని. ఆతనికి అన్ని సూత్రములను విశదీకరించుము  ఆళవందార్లు చేసిన విధముగా), వానిని ఆతడు స్వీకరించి, మీకు శిష్యుడు కాగలరు” అని పలికారు.

ఉడయవర్లు మేల్కొని, తన దివ్య స్వప్నమునకు ఆశ్చర్యపడినారు. వారు అమితానందముతో అనేక ప్రమాణములను ధ్యానించారు.  రామానుజ నూత్రందాది 88 “వలిమిక్క చీయమిరామానుసన్ మఱై వాదియరామ్ పులిమిక్కతెన్ఱు ఇప్పువనత్తిల్ వన్దమై”  క్రూరపులులతో నిండిన అరణ్యములో, ఒక శక్తివంతమైన మృగేంద్రుడు ప్రవేశించి వానిని ఎలా నశింపజేయునో, అటులనే ఈ జగత్తున అసత్య ప్రమాణములను ప్రచారము చేయు కుదృష్థి మనస్సుగల శిక్షకులను నశింపజేయుటకై శ్రీరామానుజులు ఉద్భవించి, వారిని నశింపజేయుదురు (శుద్ధి చేయుదురు). మరుసటి ఉదయము ఉడయవర్లు గెలుపొందిన సింహము వలె, చర్చాసభకు విచ్చేసిరి. వారి పరమానందమైన స్వరూపమును గాంచిన యాజ్ఞమూర్తి గందరగోళుడై” నిన్న వారు నిష్క్రమించినపుడు పాలిపోయి ఉన్నారే, నేడు దేదీప్యమానముగా గొచరిస్తున్నారు – ఇది మానవ చర్య కానేరదు – ఎదో దైవికమైన సంబంధము వలననే సంభవము” అని యోచించి, ఉడయవర్ల పాదపద్మములపై ప్రణమిల్లినారు. “ఏమిది? మీరు ఇంక చర్చకు రారా? ” అని ఉడయవర్లు ప్రశ్నించారు. దానికి యాజ్ఞమూర్తి “పెరియ పెరుమాళ్ మీకు దర్శన మిచ్చి, మార్గోపదేశము చేసినారు కదా! మీకు మరియు పెరియ పెరుమాళ్ళకు వ్యత్యాసము లేదు. కావున నేను ఏ మాత్రము మీ ముందు నిలిచి మాటలాడే యోగ్యత లేని వానిని. దయతో నన్ను మీ శిష్యునిగా స్వీకరింపుడు” అని ప్రాధేయపడినారు. ఉడయవర్లు మిక్కిలి సంతశిం వారికి” అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానార్” ( పెరరూళాలన్ మరియు తన నామముతో జోడించి) అని నామకరణము చేసిరి. వారిని (శ్రీవైష్ణవ సన్యాస ఆశ్రమమునకు) ఆశీర్వదించి, ఒక పెద్ద మఠమును నివాసమునకై  ప్రసాదించారు. “మీకు అన్ని శాస్త్రములు తెలియును. వాంఛలను విడనాడి, శ్రీమన్నారాయణుని పాద పద్మములను ఆశ్రయించవలసినది. మీకు అన్నియును తెలియును, నేను వివరించనవసరము లేదు. మీరు మరియు మీ శిష్యులు విశిష్టాద్వైత సిద్దాంతములను పరమానందముగా చర్చించు సమయమిది” అని ఉడయవర్లు పలికారు. అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ కృతజ్ఞతతో ఆ మఠములో నివసించసాగారు.

ఎంపెరుమానార్ – శ్రీపెరుంబుదూర్, అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ – తిరుప్పాడగం

తదుపరి, శ్రీ వైష్ణవ జంట శ్రీరంగమునకు వచ్చిరి. వారు అచ్చటి ప్రజలను “ఎంపెరుమానార్” మఠము ఎక్కడ? అని విచారించారు. వారు “ఏ ఎంపెరుమానార్ మఠము” అని అడుగగా, ఆ శ్రీవైష్ణవులు అమితాశ్చర్యముతో “మేము మన సంప్రదాయములో ఒకే ఎంపెరుమానార్ వున్నారని భావిస్తున్నాము. ఇద్దరు వున్నారా?” అనినారు. దానికి ఆ ప్రజలు “అవును, ఇచ్చట ఎంపెరుమానార్లు మరియు అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్లు అను ఇరువురు వున్నారు” అని బదులిచ్చారు. దానికి ఆ శ్రీవైష్ణవులు “ఆహ! మేము ఆ రెండవ వారి గురించి వినలేదు. శ్రీభాష్యకారుల గురించే వచ్చాము” అని పలికారు. వారికి ఎంపెరుమానార్ల మఠమునకు మార్గము చూపగా, వారు అచ్చటకు చేరుకొన్నారు.
ఈ సంభాషణలను ఆలకించిన అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానార్లు “ఓహో మేము ఉడయవర్లతో కాకుండా వేరు మఠములో నివసించుటచే, ప్రజలు తమను కూడా ఒక ఉడయవర్లతో సమానుడిగా భావిస్తున్నారని” తలంచారు. తాము పెద్ద దోషమే చేశాము అని దుఃఖించారు. మరుక్షణమే వారి మఠమును తొలగించాలని ఆదేశించారు మరియు ఎంపెరుమానార్ల మఠమునకు జేరి, వారి పాదపద్మములపై మోకరిల్లి” నేను అనంత కాలముగా అహంకార పూరితుడనై, మీ నీడలో లేను. కాని ఇప్పుడు మీ నీడకు చేరినను, నన్ను విడిగా వేరు మఠములో ఉంచారు. ఇదేనా నా గురించి మీరు ఆలోచించినది” అని వాపోయారు. ఉడయవర్లు ఆశ్చర్యముతో ఏమి జరిగినదని అడిగారు. వారికి జరిగిన సంఘటనను వివరించారు.
ఉడయవర్ నీకు ఏమి చేయగలను అని అడుగగా,
అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ “నేటి నుంచి నేను మీకు నీడగా, మీ పాదపద్మములను అనుసరించునటుల మరియు మీకు నిత్య సేవా కైంకర్యము చేసే భాగ్యమును” ప్రసాదించగలరని ప్రార్ధించారు. ఎంపెరుమానార్లు అంగీకరించి, వారిని మఠములో వసించమని మరియు మన సంప్రదాయములోని అనేక సూక్ష్మములను వారికి బోధించారు. ఎంపెరుమానార్ల సేవ తప్ప అన్య భావము లేక, వారు ఆనందముగా అచ్చట వసించసాగారు. ఎంపెరుమానార్ల వద్ద అభ్యసించిన సూక్ష్మముల ద్వారా, వారు రెండు అద్భుతమైన ప్రబంధములను, అందరికి సులువుగా బోధపడే విధముగా రచించిరి. అవియే జ్ఞానసారము మరియు ప్రమేయసారము. వాని ద్వారా శిష్యునికి ఆచార్యులే పరమ ఆరాధ్యదైవమని నిరూపించినారు మరియు వారి పాదపద్మములే మనకు శరణు, “శరణాగతి మార్గాన్ని బోధించే ఆచార్యులే, శిష్యునికి శరణు”, “శ్రీమన్నారాయణుడే స్వయముగా మన ఆచార్యులుగా దర్శనమవుతారు”, అని మనకు మార్గనిర్దేశనము గావించారు. పై విషయాలను జ్ఞానులైన శ్రీ అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్లు మనకు కృప చేసారని, మన జీయర్ మాముణులు సాయించిరి.

అనువాదకుని గమనిక: పై విధముగా మనము ఎంపెరుమానార్లు తమ భగవత్ కృపచే వడుగ నంబి మరియు అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ల మనస్సును శుద్ధి చేయుటను మరియు వారు తమ వంతుగా ఎంపెరుమానార్లపై పూర్తిగా ఆధారపడుటను మరియు వారికి శరణాగతి చేయుటను గమనించినాము.

అడియేన్ గోపీ కృష్ణమాచార్యులు, బొమ్మకంటి, రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-4.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s