Monthly Archives: December 2021

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 8

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 7

నంపిళ్ళై వారి శిష్యులతో శ్రీ రంగంలో శ్రీ వైష్ణవ దర్శనం (శ్రీ వైష్ణవ సిద్దాంతము) చూసుకుంటూ జీవనము సాగిస్తున్న సమయంలో, వారి శిష్యురాలలో ఒక స్త్రీ నంపిళ్ళై వారి పొరుగింట్లో ఉంటూ ఉండేది. ఒకరోజు, నంపిళ్ళై తమ శిష్యులకు బోధన చేస్తున్నప్పుడు, వారి శిష్యులలో ఒకరు నంపిళ్ళై తిరుమాలిగ వారి శిష్యులందరికి వసతి కల్పించడానికి కొంచెం చిన్నదిగా ఉందని, ఆ శిష్యురాలిని తన ఇంటిని విడిచిపెట్టమని కోరతాడు. “గుడిలో చోటు ఎవరికైనా దొరుకుతుందా? నేను జీవించే వరకు ఈ ఇంటిని వదలను” అని ఆమె జవాబిస్తుంది. ఆ శిష్యుడు వెళ్ళి వారి సంభాషణ గురించి నంపిళ్ళై వారి వివరిస్తారు. నంపిళ్లై ఆమెను పిలిచి, “నీ శరీరానికి సరిపోయేంత చోటు ఉంటే సరిపోతుంది కదా? చాలా మంది శిష్యులుండటంతో ఈ స్థలంలో [వారి నివాసం] చోటు చాలక ఇరుకైపోయింది. అందుకని, నీ ఇల్లు మాకివ్వాలి” అని కోరతారు. దానికి ఆవిడ ” మీరు చెప్పినట్లే చేస్తాను; అయితే, దీనికి బదులుగా మీరు నాకు పరమపదం (శ్రీవైకుంఠం) లో చోటివ్వాలి” అని ఆమె ప్రార్థించింది. నంపిళ్లై ఆమెతో “అది అనుగ్రహించడానికి పరమపదనాధుడికే అధికారం ఉంది కదా? నేను ఆతడికి విన్నపం చేసి, అక్కడ నీకు స్థానము కల్పిస్తాను” అని వివరిస్తారు. ఆమె “స్వామీ! నేను ఏమీ తెలియని అమాయకురాలిని. నాకు స్థానము కల్పిస్తానని చెబితే సరిపోదు, మీరు వ్రాసి సంతకం చేసిన చీటీ నాకివ్వాలి” అని కోరుతుంది. అప్పుడు నంపిళ్ళై వారు ఒక తాటి ఆకుపై ఇలా వ్రాశారు, “ఫలానా తేదీన (రోజు, నెల, సంవత్సరంతో), నేను తిరుక్కళికన్ఱి దాసన్ అయిన నేను (నంపిళ్లై వారికి ఉన్న మరొక పేరు) పరమపదంలో చోటు నివ్వమని ఈ స్త్రీకి వ్రాతపూర్వకంగా ఇచ్చాను. సకల లోకాలకు ప్రభువైన నా స్వామి ఆమెకు ఆ స్థానము ప్రసాదించమని కోరుతున్నాను”; ఆ ఆకుపై సంతకం చేసి, ఆ పత్రాన్ని ఆమెకు ఇచ్చారు. ఆమె ఉప్పొంగిపోయి ఆ పత్రాన్ని తన శిరస్సుపై పెట్టుకుని, నంపిళ్ళై వారి నుండి ప్రసాదం పుచ్చుకుంది. అలాగే మర్నాడు ఆ మర్నాడు కూడా నంపిళ్ళై వారి ఎదుట సాష్టాంగ ప్రణామం చేసి, మూడవ రోజు తన దేహాన్ని త్యజించి పరమపదానికి బయలుదేరింది.

నంపిళ్ళై వారి గొప్పతనాన్ని చాటుతున్న వారి తనియన్లను చూద్దాము:

వేదాంత వేధ్యామృత వారిరాశేః వేదార్థ సారామృత పూరమర్గ్యం।
ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్య పూర్ణం కలివైరిదాసం॥ 

((నాంజీయార్ వారి అమృత సాగరం నుండి తీసుకోబడిన వేదాంతముల సారార్థములను కరుణతో కురిపించు తిరుక్కలికన్ఱి దాసులను నేను ఆశ్రయిస్తున్నాను))

నమామి తం మాధవ శిష్య పాదౌ యత్సన్నితం సూక్తిమయం ప్రవిష్టాః ।
తత్రైవ నిత్యస్థితి మాత్రియంతే వైకుంఠ సంసార విముక్త చిత్తాః॥

(మాధవర్ల (నంజీయార్) శిష్యులైన నంపిళ్ళై వారి దివ్య పాదారవిందములకు నేను నమస్కరిస్తున్నాను. ఆళ్వార్లు మరియు ఆచార్యుల దివ్య పాశుర స్తోత్రాలను నిరంతరం పఠించే నంపిళ్లై సన్నిధిలో ఉండటాన్ని వారి శిష్యులు ఎంతో ఆదరంగా స్మృతిస్తూ ఈ సంసారాన్ని ఆ శ్రీవైకుంఠాన్ని కూడా ఆశించరు.)

వార్తోంచ వృత్యాపి యదీయగోష్ట్యాం గోష్ట్యాంతరాణాం ప్రత్మాభవంతి
శ్రీమద్ కలిధ్వంసన దాసనామ్నే తస్మైనమః సూక్తి మహార్ణవాయ

(శ్రీ సూక్తి మహార్ణవం (ఆళ్వార్ల దివ్య పాశురముల సాగరము) అయిన ఆ తిరుక్కలికన్ఱి దాసులను నేను నమస్కరిస్తున్నాను. అలాంటి నంపిళ్ళై తమ శ్రీ వైష్ణవ గోష్ఠిలో చేసిన ఉపన్యాసాలలోని కొన్ని శబ్దాలను అనుసరించినా వాళ్ళు ఇతర శ్రీ వైష్ణవ గోష్ఠిలో శిఖామణులు అగుదురు).

నెంజత్తిరుందు నిరందరమాగ నిరయత్తుయ్ క్కుం
వంజక్కుఱుంబిన్ వగై అఱుత్తేన్ మాయవాదియర్ తాం
అంజప్పిఱంద సీమాధవనడిక్కన్బు శెయ్యుం
తంజత్తొరువన్ చారణంబుయం ఎన్ తలైక్కణిందే

(నేను నంపిళ్ళై దివ్య పద్మముల లాంటి పాదాలను నా శిరస్సుపై ఆభరణంగా ధరిస్తాను. నంపిళ్ళై వంటి గొప్ప ఆచార్యులను నిరంతరం మనము ధ్యానిస్తే, నన్ను నరకానికి దారితీసే అన్ని మార్గాలు మటుమాయమౌతాయి. పైగా జ్ఞానము, సంపద, వంశము నుండి సంతరించు మూడు అహంకారములు, నంపిళ్ళై వారిని ధ్యానించుటచే అంతరించిపోతాయి. శ్రీ మాధవన్ (నంజీయర్) యొక్క పాద పద్మాలను సేవించిన వీరిని చూసి మాయావాదులు (వేదాలను వక్రీకరించి వ్యాఖ్యానం చేయు వారు) భయంతో వణికిపోతారు. అందరికీ వారే ఆశ్రయం).

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/07/23/yathindhra-pravana-prabhavam-8/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 7

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 6

నంపిళ్ళై వారు ఒకసారి పెరియ కోయిల్ వళ్ళలార్ అనే ఒకరిని తిరుమంగై ఆళ్వార్ల తిరుమొళి  1-1-9 పాశురము కులం తరుంలోని మొదటి శ్లోకానికి (ఈ పాశురం శ్రీమన్నారాయణుని దివ్యనామం జపించడం వల్ల కలిగే ఫలాన్ని వివరిస్తుంది; మొదటి వరుస ఆతడి దివ్య నామము పఠించడం వల్ల మంచి వంశాన్ని (శ్రీవైష్ణవులకు జన్మించుట) ప్రసాదిస్తుంది) అర్థం చెప్పమని అడిగారు; వళ్ళలార్ వారు ఇలా జవాబిచ్చారు “అనాచార వంశంలో జన్మించిన నేను నంబూర్ వంశానికి (నంపిళ్ళై వారు నంబూర్ వాసులు) సేవ చేసుకునే భాగ్యము లభించినందున నాకు మంచి వంశము లభించిందనే భావిస్తాను” అని అంటారు. మరో మాటలో చెప్పాలంటే, ఆచార్యుల వంశాన్ని సేవించే వారు మహా గౌరవనీయమైన వంశానికి చెందిన వారిగా భావించాలి. నంపిళ్లై శిష్యులు “[భగవాన్] అవతారం ఎలా ఉంటుంది?” అని అడిగారు. వారు “దివ్య స్వరూపం పాలిపోయి, నాలుక ఎండి పోయి ఉంటుంది” అని వివరించారు. “ఎందుకు అలాగ?” అని వారు అడిగారు, “మోక్ష అర్హతకి తగిన వ్యక్తి దొరకనందుకు వారి రూపం పాలిపోతుంది; నాలుక పొడిగా ఉంటుంది ఎందుకంటే అలాంటి వ్యక్తిని చూసినా, ఆ వ్యక్తి ప్రాయోజనాంతపరర్ (భగవానుని కాకుండా ఇతర ఫలాలను కోరేవాడు)” అని వివరించారు. ఇక్కడ సూచించిన అర్థం ఏమిటంటే, ఎంబెరుమాన్ అంతటా వెదికినా, ఏ ఫలము ఆశించకుండా తమ ఆచార్యుడికి పూర్ణమైన అంకిత భావము ఉన్న వ్యక్తి లభించడం అనేది చాలా అరుదు అని అర్థమౌతుంది.

నంపిళ్ళై వారు ఆ విధంగా కలియుగ చీకటిని తొలగిస్తూ, ప్రతిచోటా ఆనందాన్ని ప్రసరింపజేస్తూ, అందరినీ సరిదిద్దితూ, వారిని తిరుమాళ్ భక్తులుగా తీర్చి దిద్దుతూ జీవిస్తున్నారు. ఒకసారి వారి దివ్య తిరుమేని అనారోగ్య పాలైయ్యింది. తమ అంతిమ దశ సమీపిస్తున్నదని వారు గ్రహించారు; వారు తమ శిష్యులందరినీ పిలిచి, వారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, వారి పట్ల తాను ఏదైనా అపరాధము చేసి ఉంటే క్షమించమని కోరారు. వారికి భోజన సత్కారములు గావించి వారి  అవశేషాలను వారు స్వీకరించెను; వారి శిష్యులు ఉపనిషత్తులోని బ్రహ్మవల్లిని జపించడం ప్రారంభించారు, అలాగే తిరువాయ్మొళి 10వ పత్తు 9వ పదిగము”శూళ్విశుంబణి ముగిల్” సేవించారు. నంపిళ్లై వారు తమ తిరుముడిని (శిరస్సు) నడువిల్ తిరువీధి పిళ్ళై వారి దివ్య ఒడిలో ఉంచి, తమ తమ తిరువడిని (పాదాలు) పిన్బళగియ పెరుమాళ్ జీయర్ వారి దివ్య ఒడిలో పెట్టి తమ ఆచార్యులైన నంజీయర్ వారిని ధ్యానిస్తూ కన్నుమూసారు. వారి శిష్యులైన పెరియ వాచ్చాన్ పిళ్ళై, నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టార్, వడక్కు త్తిరువీధి పిళ్ళై, పిన్బళగియ పెరుమాళ్ జీయర్ మొదలైన వారిని దుఃఖ సాగరములో ముంచేసి వారు ఈ సంసారం విడిచి పెట్టి పరమపదాన్ని చేరుకున్నారు. వాళ్ళు వారి ఆచార్యుల నుండి విరహాన్ని సహించలేక స్పృహలేని స్థితిలోకి ప్రవేశించారు. తిరిగి స్పృహలోకి వచ్చి తీవ్ర దుఃఖంతో  కన్నీళ్లు కార్చుకుంటూ ఒకరినొకరు ఓదార్చుకున్నారు. నంపెరుమాళ్ళ వద్ద నుండి వచ్చిన పూలమాలను పరివట్టం (వస్త్రం) ని సమర్పించి నంపిళ్ళై వారి చరమ సంస్కారాలకు సిద్ధమయ్యారు. కందాడై తోళప్పర్ వారు (ముదలియాండాన్ మనుమలు) నంపిళ్ళైకి “లోకాచార్యుడు” అనే బిరుదు ఇచ్చిన గొప్పతనం కలిగినవారు వారు. లోకాచార్యుడు అనగా మొత్తం ప్రపంచానికే గురువు అని సూచిస్తుంది. ఆళ్వార్ల దివ్య ప్రబంధంలోని అరుదైన అర్థాలను తెలుసుకుని అందరికీ వివరించ గలిగే గొప్పతనం కూడా వారికి ఉంది. వారికి ఉన్న మరో గొప్పతనం ఏమిటంటే, వారి తిరు హస్థాలతో వ్రాసిన చీటీతో, వారి పొరుగింటి ఒక మహిళ (నంపిళ్ళై వారి అనేక శిష్యులకి వారున్న స్థలము సరిపోనందున, నంపిళ్ళై వారి కోసము తన నివాసాన్ని వదులుకున్న ఒక మహిళ) పరమపదం చేరుకుంది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/07/22/yathindhra-pravana-prabhavam-7/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 6

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 5

నంపిళ్ళై వారికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఒకరోజు వంట చేస్తే, మరుసటి రోజు చిన్న భార్య వంట చేసేది. ఇది ఇలా సాగుతుండగా, నంపిళ్ళై తమ మొదటి భార్యను పిలిచి, “నా గురించి నీ అభిప్రాయమేమిటి? నీ మనస్సులో ఏమనుకుంటున్నావు?” అని అడిగారు. ఆమె వారికి నమస్కారాలు చేసి, కొంత సిగ్గుతో కొంత భయంతో, “మీరు నంపెరుమాళ్ళ అవతారము, నాకు ఆచార్యులు. నేను మీకు కట్టుబడి ఉండి మీ దివ్య పాదాలకు నిర్వహించే కైంకర్యాలు నాకు జీవనాధారం వంటివి” అని బదులిచ్చెను. ఆ తర్వాత వారు రెండో భార్యను అదే ప్రశ్న అడిగాడు. ఆమె కొంత సిగ్గుతో కొంత భయంతో “మీరు నాకు భర్త, నేను మీకు భార్యను” అని సమాధానం ఇచ్చింది. వారి సమాధానాలు విని నంపిళ్ళై  తన మొదటి భార్యను ప్రతి రోజూ తలిగ (వంట) చేయమని, రెండవ భార్యను ఆమెకు సహాయము చేయమని ఆదేశించారు. మొదటి భార్య వంట చేయలేని నెల సరి రోజుల్లో రెండో భార్య వంట చేసేది. ఆ మూడు రోజులు వారు ఎంబెరుమాన్ కి నైవెధ్యము సమర్పించి, ఆ ప్రసాదాన్ని 4 వ వర్ణంలో జన్మించిన ఉన్నత శ్రీ వైష్ణవునెచే తాకించి ఆ తరువాత వారు స్వీకరించేవారు. దీనితో, వారి రెండవ భార్యలో పవిత్రత లోపము ఉన్నందున, భగవానునికి సమర్పించిన తరువాత కూడా, ఆ ప్రసాదానికి శుద్ధ శ్రీ వైష్ణవ స్పర్శ అవసరమని అర్థమవుతుంది.

నంపిళ్ళై వారికి తమ రెండవ భార్య ద్వారా ఒక కుమారుడు జన్మించాడు. శ్రీ వైష్ణవులు ఈ విషయాన్ని ప్రకటించిన వెంటనే, తిరుప్పేరాచ్చాన్ అనే ఒక వ్యక్తి “నాకు ఒక అన్నయ్య అవతరించాడు” అని అంటారు. దీని అర్థం ఏమిటంటే, ఆచార్య తిరుకుమారుడు  చిన్నవాడైనప్పటికీ, తమకు పెద్దవాడిగా పరిగణించబడతాడు.

ఒకరోజు నంపిళ్ళై వారు పిన్బళగియ పెరుమాళ్ జీయార్ (వారి శిష్యులు) వారి మఠంలో ఉన్నారు. వారి శిష్యులు “మనం లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆళ్వార్ల లాగా ఉండాలి, కాని మనము స్త్రీలు, ఆహార పానీయాదులు మొదలైన వాటితో బంధింపబడి ఉన్నాము. మనం ఏమి చేయాలి?” అనే ప్రశ్నని అడిగారు. నంపిళ్ళై వారు దయతో “మనం ఇంకా ప్రాపంచిక విషయాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ, శరీరాన్ని విడిచిపెట్టి కైంకర్యమనే  అత్యున్నత లక్ష్యాన్ని పొందే ముందు, ఎంబెరుమాన్ మనకి ఆళ్వార్ల స్థితిని అనుగ్రహించి అది జరిగేలా చేస్తారు” అని అన్నారు. దీనికి ప్రమాణం “నకలు భాగవతా యమ విషయం గచ్ఛంత” (భగవానునికి శరణాగతులైన శ్రీ వైష్ణవులు యమ లోకానికి చేరుకోరు) మరియు ముదల్ తిరువందాది పాశురము 55 లో “అవన్ తమర్ ఎవ్వినైయారాగిలుం ఎంగోన్ అవన్ తమరే ఎన్ఱు ఒళివదల్లాల్ నమన్ తమరాల్ ఆరాయపట్టఱియార్ కండీర్” (యమ దూతలు శ్రీ వైష్ణవులను చూసి ప్రశ్నించరు. “వీరు మన భగవానుని భక్తులు కదా!” అని ప్రశంసించడం తప్ప). ఆ విధంగా ఈ ఆత్మలు తమ ఉజ్జీవనములో నిరంతరం మునిగి ఉంటారు. ఆత్మ ఆ శరీరాన్ని విడిచి వెళ్ళే సమయంలో, శరీరంలో ఆ ఆత్మకి ఎంబెరుమాన్ అసహ్యము సృష్టిస్తాడు, అర్చిరాధి మార్గంలో (శ్రీ వైకుంఠానికి వెళ్ళే ప్రకాశ మార్గం) తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, శ్రీ మాలాకారునికి (కృష్ణావతారంలో పూల దండలు అమ్మినవాడు) ప్రత్యక్షమైనట్లు, తన దివ్య స్వరూపాన్ని ఆ ఆత్మకి వ్యక్తపరుస్తాడు. ఆ ఆత్మలో పర భక్తి, పర జ్ఞానము మరియు పరమ భక్తి గుణాలను (ఎంబెరుమానుని యొక్క జ్ఞానం, భగవానుడు లేకుండా ఉండలేని స్థితి, ఎంబెరుమానుని చేరుకోవడం) సృష్టిస్తాడు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/07/21/yathindhra-pravana-prabhavam-6/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 5

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 4

నంపిళ్ళై వారు తమ శిష్యుడైన పెరియ వాచ్చాన్ పిళ్ళైకి  ఒన్బదినాయిరప్పడిని కొన్ని విశేష అర్థాలతో బోధించడం ప్రారంభించారు. పెరియ వాచ్చాన్ పిళ్ళై వారు ఈ అర్థాలను ప్రతి రోజు పట్టోలై (తాటి పత్రాలపై వ్రాసిన మొదటి కాపి) చేయడం ప్రారంభించారు. ఉపన్యాసాలు ముగిశాక, పెరియ వాచ్చాన్ పిళ్ళై వారు అన్ని వ్రాత ప్రతులను తీసుకువచ్చి నంపిళ్ళై వారి దివ్య పాదాల యందు అర్పించెను. దానికి నంపిళ్ళై వారు ఎంతో సంతోషించి, ఆ వ్రాతప్రతులపై తన దయను కురిపించి, దూర దూరం వరకు విస్తరించి అందరూ తెలుసుకునేలా ఈ పట్టోలైకి అనుకరణ చేసి అనేక గ్రంధాలుగా తయారు చేయమని పెరియవాచ్చన్ పిళ్ళైని ఆదేశించెను. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నడువిల్ తిరువీధి పిళ్ళై మరియు వడక్కు తిరువీధి పిళ్ళై తమ స్వసంకల్పముతో తిరువాయ్మొళి వ్యాఖ్యానం మొదటి కాపీ వ్రాసినట్లు కాకుండా పెరియ వాచ్చాన్ పిళ్ళై వారు నంపిళ్ళై వారి ఆదేశాన్ని అనుసరిస్తూ తిరువాయిమొళి వ్యాఖ్యానం యొక్క పట్టోలై తయారు చేశారు. మణవాళ మాముణులు తమ ప్రబంధము ఉపదేశ రత్నమాల 43 వ పాశురములో ఈ విషయం తెలియజేస్తున్నారు “నంపిళ్ళై తమ్ముడైయ నల్లరుళాల్ ఏవియిడ పిన్ పెరియ వాచ్చాన్ పిళ్ళై అదనాల్ ఇన్బావరుబత్తి మాఱన్ మఱైప్పొరుళై చ్చొన్నదు ఇరుబత్తి నాలాయిరం” (నంపిళ్ళై తమ దివ్య కృపా వర్షాన్నిపెరియ వాచ్చన్ పిళ్ళైపైన కురిపించిన తరువాత, వీరు భగవానుని దివ్య అనుగ్రహముతో అవతరించిన నమ్మాళ్వార్లు కరుణతో కూర్చిన తిరువాయ్మొళి వ్యాఖ్యానముమైన ఇరుబత్తినాలాయిరప్పడిని సమకూర్చారు).

ఒక రోజు నంపిళ్ళై వడక్కు తిరువీధి పిళ్ళై, శిఱియాళ్వాన ప్పిళ్ళై (ఈయుణ్ణి మాధవర్) ని పిలిచి, ఒన్బదినాయిరప్పడిని పఠించమని కోరెను. పెరియ వాచ్చాన్ పిళ్ళై వారితో కలిసి పఠించాలనే కోరికను వ్యక్తం చేసిరి. నంపిళ్ళై సంతోషంగా అంగీకరించి వారికి కూడా వాటి అర్థాలను ఉపదెశించెను. ప్రతి రోజూ నంపిళ్ళై ప్రసంగాలను వడక్కు తిరువీధి పిళ్ళై తమ ఇంట్లో వ్రాసి ఉంచుకునేవారు. ఒకరోజు, వారు నంపిళ్ళై వారిని తమ తిరుమాలిగకి తదీయారాధనకై ఆహ్వానించారు. తదీయారాధనకి ముందు వడక్కు తిరువీధి పిళ్ళై తిరుమాలిగలో తిరువారాధన చేస్తామని నంపిళ్ళై చెబుతారు. వారు తిరువారాధన కోసం కోయిలాళ్వార్ని తెరిచినప్పుడు, అక్కడ తాళపత్రాల కట్టలు వారు చూస్తారు. నంపిళ్ళై వాటి గురించి అడిగి తెలుసుకుంటారు. నంపిళ్ళై తమకి ఉపదేశించిన తిరువాయ్మొళి పాశురార్థాలను తాను మరచిపోకూడదని వ్రాసి ఉంచానని వడక్కు తిరువీధి పిళ్ళై వివరిస్తారు. తిరువారాధన స్వయంగా వడక్కు తిరువీధి పిళ్ళైని నిర్వహించమని చెప్పి నంపిళ్ళై వారు చాలా సేపు వ్రాతప్రతులను పరిశీలించడం ప్రారంభించెను. ఆపై వారు తదీయారాధనకై వెళ్ళేటప్పుడు కూడా ఆ వ్రాతప్రతులను పరిశీలించమని పెరియ వాచ్చాన్ పిళ్ళై మరియు ఈయుణ్ణి మాధవర్లని పురమాయిస్తారు. తరువాత వచ్చి మరలా పరిశీలించడం ప్రారంభిస్తారు. వీరు అద్భుతంగా వ్యాఖ్యానం వ్రాసిన తీరును ప్రశంసిస్తుండగా, వడక్కు తిరువీధి పిళ్ళైని నంపిళ్ళై వారు పిలిచి, “నువ్వు ఇలా ఎందుకు చేశావు? ‘పెరియ వాచ్చాన్ పిళ్ళై మాత్రమే వ్యాఖ్యానం రాయాలి’ అని నీవు అనుకున్నావా? ఇంకెవ్వరూ చేయకూడదా?’ ఇదేనా నీవు అనుకున్నది? అని ప్రశ్నిస్తారు. ఈ మాటలు విన్న వడక్కు తిరువీధి పిళ్ళై భయంతో వణికిపోయెను. తమ మనఃస్థితిని కుదుర్చుకొన్న తరువాత, వరు నంపిళ్ళైతో “జియార్! నేను అలా భావించలేదు. ఉపదేశించిన అర్థాలు ఒక వేళ మరిచిపోతే మరళా చూసుకోవచ్చని వ్రాశాను” అని అంటూ వారి పాదాలపై వాలిపోయిరి. నంపిళ్ళై అతనితో “నేను నిన్ను క్షమించాను. నీదొక విశేష జన్మగా అనిపిస్తుంది. నంజీయార్ వివరణల నుండి నేను బోధించిన వాటి నుండి నీవు ఒక్క అక్షరము కూడా తప్పు వ్రాయలేదు. నీ సామర్థ్యాన్ని నేను ఎలా ప్రశంసించాలి?” ఈ వ్యాఖ్యానాన్ని వ్యాప్తి చేయడానికి తమ ఆచార్యులైన నంజీయార్ వారి దివ్య నామాన్ని పంచుకుంటున్న మాధవర్ (ఈయుణ్ణి మాధవ ప్పెరుమాళ్, వారి శిష్యుడు) ని పురమాయిస్తున్నానని అంటారు. వడక్కు తిరువీధి పిళ్ళై సంతోషిస్తారు. నంపిళ్ళై ఆ తాళ పత్రాల కట్టలని ఈయుణ్ణి మాధవప్పెరుమాళ్‌ వారికి ఇచ్చి, “ఈ మూల పత్రాలకి నాలుగు లేదా ఐదు కాపీలుగా వ్రాసి అంతటా ప్రచారము చేయండి” అని ఆదేశిస్తారు. మాధవర్ సంకోచిస్తూ “నేను అలా చేయగలనా? నాకు ఆమోదం లభిస్తుందా?” నంపిళ్లై అతనితో “నంజీయార్ అనుగ్రహం మీకు ఉన్నప్పుడు, ఇది మీకు చాలా పెద్ద పనినా?. ఒక పురాణ కథనం ఉంది. ఇది వినండి. పేరారులాప్పెరుమాల్ (కంచి వరదర్)  తున్ను పుగళక్కంధాడైత్ తొళప్పర్ కలలోకి వచ్చి ఇలా అన్నారు “జగత్రక్షాపరో నందో జనిష్యత్యపరోముని: తధారస్య సాధాచార సాత్వికా స్థత్వ ధర్శిన: (ప్రపంచాన్ని రక్షించడంలో పూర్తిగా నిమగ్నమైన తిరువంతాళ్వాన్ (రామానుజ ముని అవతారం కాకుండా) మరొక మునిగా (అందరి అభ్యున్నతి కోసం ఆలోచన చేసేవాడు) అవతారం ఎత్తబోతున్నాడు; అతని క్రింద ఆశ్రయం పొందిన వారు (ఆ సమయంలో) పూర్తిగా మంచి ప్రవర్తన మరియు మంచి లక్షణాలను కలిగి ఉంటారు). ఆ సమయం వరకు, మీరు దీని ఆధారంగా ఉపన్యాసాన్ని నిర్వహించండి. మాధవర్ కూడా ఆ వ్రాతప్రతుల ఐదు కాపీలు తయారు చేశారు మరియు అతని కుమారుడు ఈయున్ని పధ్మనాభ ప్పెరుమాల్ కూడ  నేర్పించారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/07/20/yathindhra-pravana-prabhavam-5/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 4

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 3

ఆ సమయంలో, దేవరాజర్ అనే ఒక వ్యక్తి (నంబూర్ వరదరాజర్ అని కూడా పిలుస్తారు) పడుగై చక్రవర్తి ఆలయానికి సమీపంలో నివసిస్తుండేవారు. వారు పండితులు పామరులు అన్న తేడా లేకుండా అందరి మన్ననలు పొందినవారు. అతి దయాశీలుడు మరియు సత్వ గుణ పంపన్నులు. ఒక రోజు నంజీయర్‌ వారికి స్వప్నంలో దేవరాజర్‌ ని పిలవమని, విశిష్టాధ్వైత తత్వానికి సంబంధించిన విషయాల గురించి అతనికి ఉపదేశించమని, అతనికి ఒన్బదినాయిరప్పడి అనుకరణ తయారి గురించి వివరించమని దివ్య పిలుపు వచ్చెను. ఇది ఆళ్వార్ల అనుగ్రహం వల్లనే జరిగిందని నంజీయార్ భావించి, దేవరాజర్ గురించి తన శిష్యులను అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు దేవరాజర్‌ ని తమ వద్దకు తీసుకువచ్చారు. నంజీయార్ అతనిని ఆశీర్వదించి, ఒక తాళపత్రాన్ని ఇచ్చి దానిపై వ్రాయమని ఆదేశించారు. దేవరాజర్‌ వారు “నంజీయార్ యొక్క దివ్య చరాణాలే శరణు, భట్టార్ యొక్క దివ్య చరాణాలే శరణు” అని వ్రాసి, నంజీయార్ ముందు సాష్టాంగ నమస్కారములు చేస్తూ వారి దివ్య పాదాలను పట్టుకున్నారు. నంజీయార్ సంతోషించి అతనిని ఆశీర్వదించి, దయతో వారికి తిరువాయ్మొళి అర్థాలను క్లుప్తంగా వివరించారు. దేవరాజర్‌ వారికి కొన్ని తాళపత్రాలను ఇచ్చి, ఒన్బదినాయిరప్పడికి చక్కని కాపీలను తయారు చేయమని చెప్పారు. నంజీయార్ నుండి సెలవు తీసుకొని దేవరజర్ కవేరి నదిని దాటుతుండగా నదిలో వరద సంభవించెను. నిపుణుడైన ఈతగాడు కావడంతో, దేవరజర్ ఒన్బదినాయిరప్పడి మూల రాతప్రతులతో పాటు ఖాళీ తాళపత్రాలను తమ శిరస్సుపై కట్టి ఈదడం ప్రారంభించారు. వరద తీవ్రంగా ఉండటంతో, వ్రాతప్రతులు మరియు ఖాళీ తాళపత్రాలు తన శిరస్సు నుండి జారి, వరద నీటిలో కొట్టుకుపోయాయి. దేవరజర్ వారు “నేను ఆచార్యుల పట్ల ఘోరమైన అపరాధం చేశాను” అని తీవ్ర శోక సాగరంలో మునిగిపోయెను. ఇద్దరు శ్రీ వైష్ణవులు అతని పరిస్థితిని చూసి వారి తిరుమాళిగకి చేర్చారు. వారి భార్య కూడా జరిగిన సంఘటన గురించి తెలుసుకొని బాధపడి  వారిరువురూ ఆ రోజు ఉపవాసాన్ని అనుసరించారు. ఆ తర్వాత ఆమె అతనితో “మనం తిరువారాధన చేయడం మానుకోకూడదు” అని చెప్పగా దేవరజర్ వారు అప్పుడు స్నానం చేసుకొని, ఊర్ధ్వపుండ్రములు ధరించి తిరువారాధనను ప్రారంభించెను. వారి శోక ఉద్వేగానికి లోనైనందున వారికి కాస్త కునుకు పట్టింది. తమ కోయిలాళ్వార్ లోపల ఉన్న శ్రీ రంగరాజ పెరుమాళ్ వారితో  “ఓ దేవరాజా! రమ్ము! దుఃఖించకుము. కొత్త తాళ పత్రాలను తీసుకుని రాయడం ప్రారంభించు. నేను నీతోనే ఉంటాను” అని అంటారు. వెంటనే, దేవరాజర్ “శ్రీయః పతియాయ్” అన్న పదాలతో ప్రారంభించి, నంజీయార్ మాటలను గుర్తుచేసుకుంటూ “వారు విశిష్టమైన కృపా వర్షాన్ని కురిపించారు” అనే పదాలతో ముగించెను. నంజీయార్ బోధనలన్నీ తమ తలంపులో బలంగా నాటుకుపోయినందున, వాటిని గుర్తుకు తెచ్చుకోగలిగారు, తాళపత్రాలపై రాయగలిగారు. తమ కోయిలాళ్వార్‌ లోని భగవానునికి నైవెధ్యాన్ని సమర్పించి, ఆ ప్రాసాదాన్ని తాను ఆరగించి, ఒన్బదినాయిరప్పడి యొక్క మొత్తం శ్రీ కోశం (గ్రంధ రూపంలో ఉన్న దివ్య రచన) పూర్తి చేసి, నంజీయార్‌ వారి వద్దకి వెళ్లి, సాష్టాంగ నమస్కారములు సమర్పించుకొని లిఖిత పత్రాలను వారికి అందించారు. నంజీయార్ చాలా సంతోషించి, లిఖిత పత్రాలను తీసుకుని చదవడం మొదలు పెట్టారు. తనకు కొంత సందేహం వచ్చి వ్యాఖ్యానాన్ని పూర్తిగా పూర్తి చేయని కొన్ని చోట్ల అర్థాలను చక్కగా వివరించినట్లు ఆయన గుర్తించారు. వారు దేవరాజర్‌ ని పిలిచి, “ఇది ఎంత అద్భుతం! ఎంతటి మెధస్సు! ఇది ఎలా జరిగింది?” దేవరాజర్‌ వారికి జరిగినదంతా వివరించారు. జీయర్ సంతోషంతో లేచి నిలబడి, దేవరాజర్‌ ని ఆలింగనం చేసుకుని, “నువ్వు నమ్ పిళ్ళైవా?” అని అంటారు. ఆ తర్వాత తమ తిరువారాధన  పెరుమాళ్ “ఆయర్ధేవు”ని ఆరాధించి, దేవరాజర్‌ కి నంపిళ్ళై అనే బిరుదునిచ్చి, వారిని దర్శనానికి అధిపతిగా ప్రకటించి, తమ ఆచార్యులు భట్టర్ కోరిక మేరకు దర్శనం నాయకుడికి సమర్పించాల్సిన అంగులీకముని (భట్టర్ తమకు అందించిన) నంపిళ్లైకి బహూకరిస్తారు. వారు నంపిళ్ళై తో “నీ మెధస్సుకి అనుగుణంగా, తిరువాయ్మొళికి వ్యాఖ్యానం వ్రాసి, మన రామానుజ దర్శనం (శ్రీ రామానుజుల తత్వశాస్త్రం) ని అభివృద్ధి చేయుము” అని చెబుతారు. అప్పటి నుండి, నంపిళ్ళై ప్రాపంచిక విషయాల నుండి నిర్లిప్తమై, జ్ఞానానికి, భక్తికి నిధిగా మారారు. అనేకానేక  శ్రీ వైష్ణవులు వారిని అనుసరించడం ప్రారంభించారు. వారి కాలక్షేపం కోసం గుమిగూడిన జనసమూహాన్ని చూసి ఇది “నంపెరుమాళ్ గోష్ఠియా లేక నంపిళ్లై గోష్ఠియా” అని స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయేవారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/07/19/yathindhra-pravana-prabhavam-4/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 3

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 2

ఈ ఇద్దరు సహోదరులు తత్వ రహస్యం (నిజమైన అస్తిత్వానికి సంబంధించిన రహస్యాలు) తో ప్రారంభించి అనేక ప్రబంధాలను రచించారు, వందేళ్లకుపైగా జీవించారు, ఎందరో మహానుభావులు పిళ్లై లోకాచార్యుల దివ్య పాదాలను ఆశ్రయించి, తమ జీవితాన్ని వారికి అర్పించి, పరమానందంతో వారి జీవితాన్ని గడిపారు.

వారిలో కూరకులోత్తమ దాసర్, మణప్పాక్కత్తు నంబి, కొల్లి కావల దాసర్ అని పిలువబడే  అళగియ మణవాళ ప్పెరుమాళ్ పిళ్ళై, కోట్టూరిల్ అణ్ణర్, విలాంజోలై పిళ్ళై వంటి శిష్యులు ఉన్నారు, వీరితో పాటు తిరుమలై ఆళ్వార్ (తిరువాయ్మొళి పిళ్ళై) వారి తల్లిగారు మరియు ఇతర అనేక అమ్మంగార్లు ఉన్నారు. వీరందరూ విడవ కుండా వారి దివ్య పాదాలకు నిరంతర సేవ చేశారు. పిళ్ళై లోకాచార్యులు తమ దయ తో అరాయిరప్పడి, ఒన్బదినాయిరప్పడి, ఇరుబత్తు నాలాయిరప్పడి, ముప్పత్తారాయిరప్పడి వంటి వ్యాఖ్యానాలను (తిరువాయ్మొళి దివ్య ప్రబంధానికి) రచించడానికి గల కారణాలను తెలియజేసేవారు.

తమిళ వేద మహా సాగరమైన తిరువాయ్మొళిలో నిపుణులైనందున, మన పూర్వాచార్యులు ఎందరో తమ తమ మేధస్సుకి తగినట్లు విస్తృతమైన వ్యాఖ్యానాలు (తమ అత్యున్నత లక్ష్యం గా భావించి) వ్రాసారు. వెయ్యి శాఖలు ఉన్న ఉపనిషత్తుకు సమానమైనదిగా తిరువాయ్మొళి పరిగణించబడుతుంది. అటువంటి తిరువాయ్మొళిపై ఎంబెరుమానార్లు (భగవద్ శ్రీ రామానుజులు) వ్యాఖ్యానం వ్రాయమని  తిరుక్కురుగైపిరాన్ పిళ్ళాన్ పై కృపను కురిపించారు. పిళ్ళాన్ , దివ్య అవతార మూర్తిగా భావింపబడే నమ్మాళ్వార్ల దివ్య మనస్సును అనుసరించి, ఆరాయిరప్పడి (ఆరు వేల పడి; ఒక పడి అనేది 32 అక్షరాలతో కూడిన గద్యము) అనే వ్యాఖ్యానాన్ని రచించారు.

తరువాత, రామానుజులు మరియు ఇతర పూర్వాచార్యులు, అదనంగా ముఖ్యార్థాలతో, అందరికీ అర్థమయ్యేలా భట్టర్‌ ను (కురత్తాళ్వాన్ తిరుకుమారులు) తిరువాయ్మొళికి ఒన్బదినాయిరప్పడి (తొమ్మిది వేల పడి) తో కూడిన మరో వ్యాఖ్యానాన్ని వ్రాయమని నియమించారు. భట్టర్ ఒక చర్చలో మాధవుడనే ఒక అధ్వైతిని గెలిచారు. తరువాత వారు సన్యాసం స్వీకరించి భట్టర్ వారి దివ్య చరణాల యందు ఆశ్రయం పొందారు. భట్టార్ వారికి నంజీయర్ అనే బిరుదునిచ్చి, నంపెరుమాళ్ళని సేవించేందుకు శ్రీ రంగం కోవెలకి తీసుకెళ్లారు. భట్టర్, నంజీయర్ మరియు అనేక ఇతర జీయర్ల సమక్షములో నంపెరుమాళ్ళు అర్చక ముఖేన నంజీయర్ తో “స్వాగతం, నంజీయర్! భట్టర్ దివ్య మనస్సులో ఉన్న ఒన్బదినాయిరప్పడి వ్యాఖ్యానాన్ని సుసంపన్నము చేయండి” అని పలికారు. ఆ విధంగా, నంజీయర్ ఒన్బదినాయిరప్పడిని స్వరపరిచారు, ఇది ఆరాయిరప్పడికి స్వర్ణ మకుటము లాంటిది.

నంపెరుమాళ్ భట్టార్‌కు మోక్షం (శ్రీవైకుంఠం) మంజూరు చేసిన తర్వాత, నంజీయార్ చింతించ సాగారు.  “నేను వృద్దుడిని అయ్యాను; భట్టర్ స్వామి వయస్సులో చిన్నవారు కాబట్టి, దర్శనాన్ని (దర్శనం అనే పదం విశిష్టాధ్వైత తత్వాన్ని సూచిస్తుంది) ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకి నడిపించి నిరంతర పోషణ పొందుతుందని నేను భావించాను. ఇప్పుడు పరిస్థితి ఇలా మారింది” అని మనస్సులో చింతన చేయసాగారు. వారు భట్టర్ తిరుమాలిగకి వెళ్లి,  వారి దివ్య పాదాలపై పడి క్షోబించారు. భట్టర్ వారిని తన దగ్గరికి రమ్మని పిలిచి, “నీవు నిరాశ పడే అవసరం లేదు; దర్శనాన్ని ముందుకి నడిపించడానికి తగిన వ్యక్తిని అన్వేషించుము” అని చెబుతారు. ఈ మాటలు విన్న జీయర్ శాంతించి, వారి మాటలు గుర్తుండేలా తన ఉత్తరీయం ముడి వేసుకున్నారు. భట్టర్ చరమ కైంకర్యములు ఘనంగా నిర్వహించారు. వారు తమ ఇరుబత్తు నాలాయిరప్పడిని మరియు ముప్పత్తారాయిరప్పడిని మరింత మెరుగుపరచడానికి అవతారికగా ఒన్బదినాయిరప్పడికి పట్టోలై (ఏదైనా గ్రంథానికి మొదటి అచ్చు కాపి) ని రూపొందించి, ఆ లిఖిత ప్రతిని అనేక కాపీలు చేయగల వ్యక్తిని గాలించసాగారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/07/18/yathindhra-pravana-prabhavam-3/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 1

ఒకరోజు, నంపిళ్ళై వారు తమ కాలక్షేప దినచర్యను ముగించుకుని, ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటుండగా, వారి శిష్యుడు వడక్కు తిరువీధి ప్పిళ్ళై తల్లిగారు ‘అమ్మి’ వచ్చి వారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకొని ప్రక్కన నిలబడింది. వారు ఆమెను దయతో చూస్తూ, ఆమెను కుశల క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి సంభాషణ ఈ విధంగా ఉంది:

“ఏమి చెప్పమంటారు? నా కొడుకు అదుపుతప్పాడు”

“ఎందుకని?”

“అతనికి ఒక అమ్మాయితో మీరు పెళ్ళి కుదుర్చారు, మీకు గుర్తుందా? ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. వారికి పెళ్లి చేశాము. అతను గాబరాగా అరిచాడు. ఏమి జరిగిందని మేము లోపలికి వెళ్లి చుస్తే, పూర్తి చెమటలు పట్టి వణుకుతున్న స్థితిలో అతడిని చూశాము. ఏం జరిగింది అని అడిగితే  “అమ్మా! ఈ అమ్మాయి నాకు పాములా కనిపిస్తుంది. నాకు భయం వేస్తుంది. ఆమె ఇప్పటికీ అలానే ఉంది” అని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయి ఆమెను వదిలి వెళ్ళమని చెప్పాను. మరోక సందర్భంలో కూడా ఇలాగే జరిగింది.”

గట్టిగా నవ్వి “మీకేమి అనిపిస్తుంది?” అని పిళ్ళై ఆమెను అడిగారు.

“మీరు అలా ఉండగలరా? ఆ అమ్మాయి హాయిగా జీవించకూడదా? వంశోద్దారకుడు ఒకడు ఉండాలి కదా?” అని అడుగుతూ వారి పాదాలపై పడి దుఃఖించింది.

దయతో పిళ్లై వారు ఆమెతో “అమ్మీ! లే. దుఃఖించకు. తగిన సమయంలో మీ కోడలిని ఇక్కడకి తీసుకురా” అని చెప్పారు. ఆమె ఒకరోజు తన కోడలిని వారి వద్దకు తీసుకు వెళ్లింది. నంపిళ్ళై తమ దివ్య హస్తాన్ని ఆమె ఉదరముపైన పెట్టి, “నీకు నాలాంటి కొడుకు పుట్టుగాకా” అని పలికారు. వడక్కు తిరువీధి ప్పిళ్ళైని పిలిచి, “నీకు భయం ఉండకూడదు. మన శాస్త్రాను సారమైన (పవిత్ర గ్రంథాలు) విషయాల పట్ల మీ నిర్లిప్తతకు ఎటువంటి లోటు ఉండదు. నా మాటలను అనుసరించి ఈ రాత్రి ఆమెతో ఉండు.”

కోడలు సక్రమంగా గర్భం ధరించి ఐప్పశి మాసంలో తిరువోణం నక్షత్రం రోజున ఒక మగ శిశువుకి జన్మనిచ్చింది. పుట్టిన పన్నెండవ రోజున, అతనికి నంపిళ్లై (లోకాచార్య) అనే విశిష్ట నామానికి అనుగుణంగా “లోకాచార్య పిళ్ళై” అనే దివ్య నామకరణము చేయబడింది. ఆ బాలుడు ఒక సంవత్సరం పూర్తి చేసుకోగానే, నంపెరుమాళ్ ని సేవించుటకై పల్లకి, నాదస్వరాలతో ఆలయానికి తీసుకువెళ్లారు. నంపెరుమాళ్ వారిని చూసి చాలా సంతోషించి, అర్చక ముఖేన వారి తీర్థ ప్రసాదాలు, శ్రీ శఠారి, చందనము, దండలు ప్రసాదించిరి. అర్చక ముఖేన “నీవంటి కొడుకును అతనికి ప్రసాదించావు; ఇప్పుడు అతనికి మా వంటి కుమారుడిని ప్రసాదించుము” అని పలికించారు, నంపిళ్ళై వెంటనే అంగీకరించారు. ఆ విధంగా వారి కృపతో అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ జన్మించారు.

ఈ విధంగా అటువంటి గొప్పతము ఉన్న నంపిళ్లై వారి అనుగ్రహంతో అవతరించిన పిళ్ళై లోకాచార్యులు మరియు వారి [పిళ్ళై లోకాచార్యులు] అనుగ్రహంతో ఎదిగిన వారి తమ్ముడు కలిసి పెరిగారు. శ్రీరంగంలో వారిరువురు కలిసి నడుచుచున్నప్పుడు, శ్రీ రామ లక్ష్మణులు కలిసి నడుస్తున్నారా లేదా బలరామ కృష్ణులు కలిసి నడుస్తున్నారా అని అక్కడి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయేవారు. ఈ అర్థాన్ని వెణ్బ (తమిళ భాషలో ఒక రకమైన పద్యం) లో పిళ్లై లోకం జీయర్ వారు అతి సుందరముగా వర్ణించారు.

తంబియుడన్ దాశరథియానుం శంగవణ్ణ
నంబియుడన్ పిన్నడందు వందానుం – పొంగుపునల్
ఓంగు ముడుంబై ఉలగారియనుం అఱన్
దాంగు మణవాళనుమే తాన్

(ముడుంబై అనే ఉత్తమ వంశానికి చెందిన పిళ్లై లోకాచార్యులు మరియు వారి తమ్ముడు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు, శంఖ వర్ణంతో ఉన్న బలరాముడు మరియు కృష్ణుడిలా,  శ్రీ రామ లక్ష్మణులులా నడుచుచున్నారు అని అర్థము)

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2021/07/17/yathindhra-pravana-prabhavam-2/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

తనియన్లు

శ్రియః పతి శ్రీమన్నారాయణుడు కలియుగంలోని సంసారులను ఉద్దరించుటకై  పరాంకుశ (నమ్మాళ్వార్), పరకాల (తిరుమంగై ఆళ్వార్), భట్టనాథ (పెరియాళ్వార్) మొదలైన ఆళ్వార్లని  కరుణాపూర్వకంగా సృష్టించారు. అనంతరం, ఆతడు దయతో నాథముని, ఆళవందార్ ఆపై ఇతర ఆచార్యులను సృష్టించి వారి ద్వారా ఈ ప్రపంచాన్ని సంరక్షించాడు. ఆళ్వార్లు, ఆచార్యులు వారి తరువాత అవతరించిన వారి గొప్పతనాన్ని గురుపరంపర ప్రభావం (ఆళ్వార్లు, పూర్వాచార్యుల పరంపర గొప్పతనం) పిన్‌బళగియ పెరుమాళ్ జీయర్ ద్వారా ప్రజలకు తెలియపరచారు. అంతటితో ఆగకుండా, చిత్ మరియు అచిత్ రెండింటికి శేషి (స్వామి) అయిన శ్రియః పతి దయతో యతీంద్రప్రవణార్ ని (సన్యాసులకు అధిపతి అయిన శ్రీ రామానుజుల పట్ల ప్రపత్తి కలవారు. మణవాళ మాముణులను సూచిస్తున్నారు) ఈ లోకములోకి పంపి వారి (జీయర్) పలుకులు అనుష్ఠానముల ద్వారా చేతనుల సంరక్షిణకై పంపారు. పిళ్ళై లోకం జీయర్ తమ ఆచార్యులు (వారి తండ్రి అయిన శ్రీ శఠకోపాచార్యులు) మరియు కందాడై నాయన్ (ముదలియాండాన్ వంశీయులు మరియు కోయిల్ కందాడై వారి తిరుకుమారుడు) వారి అనుగ్రహం ద్వారా, మణవాళ మాముణుల గొప్పతనాన్ని తమ యతీంద్ర ప్రవణ ప్రభావము గ్రంధములో వెలికి తీసి చాటారు.

పూర్వాచార్యులపై గతంలో రచించిన ప్రబంధాలకు (గురుపరంపర ప్రభవం మొదలైనవి) ఈ ప్రబంధం కొనసాగింపుగా ఉంటుంది. పిళ్ళై లోకం జీయర్ వారు ప్రారంభంలోనే మణవాళ మాముణుల గొప్పతనం గురించి మాట్లాడే బదులు, సత్ సంప్రదాయ అర్థాలు మణవాళ మాముణులకు ఎలా చేరాయో వాటి గురించి వివరించారు. వారు ఈ క్రింది శ్లోకాన్ని పేర్కొన్నారు.

శ్రీవత్సచిన్న భవతశ్చరణారవింద సేవామృతైక రసికాన్ కరుణాసుపూర్ణాన్।
భట్టార్యవర్య నిగమాంతమునీంద్ర లోకగుర్వాది దేశికవరాన్ శరణం ప్రపద్యే॥

ఓ కూరత్తాళ్వాన్! కృపతో నిండి మీ దివ్య చరణాల యందు కైంకర్య అమృతాన్ని నిత్యమూ అనుభవించు భట్టర్ (కురత్తాళ్వాన్ తిరు కుమారులైన పరాంకుశ భట్టర్), నంజీయర్, నంపిళ్ళై మొదలైన గొప్ప ఆచార్యులకు నేను శరణాగతి చేయు చున్నాను. నంపిళ్ళై తరువాత అవతరించిన ఆచార్యులలో, సాంప్రదాయ తత్వశాస్త్ర సూత్రాలు మణవాళ మాముణులకి ఎలా చేరుకున్నాయో చూపించడానికి పిళ్లై లోకం జీయర్ మొదట పిళ్ళై లోకాచార్యుల కథనాన్ని వివరించారు. ఇది క్రింది పాశురము ద్వారా వివరించబడింది:

కోదిల్ ఉలగాశిరియన్ కూరకులోత్తమ తాదర్
తీదిల్ తిరుమలైయాళ్వార్ శెళుం కురవై మణవాళర్
ఓదరియపుగళ్ తిరునావీఱుడైయ పిరాన్ తాదరుడన్
పోద మణవాళముని పొన్నడిగళ్ పోఱ్ఱువనే

(మనము మొదట 1) నిష్కల్మశమైన పిళ్ళై లోకాచార్యులు (2) కూరకులోత్తమ దాసర్, (3) తిరువాయ్మొళి ప్పిళ్ళై అని కూడా పిలువబడే తిరుమలైయాళ్వార్ (4)  కురువై నగర్లో జన్మించిన కొత్తూర్ అళగియ మణవాళర్,  5) గొప్ప కీర్తిని కలిగి ఉన్న తిగళక్కిడందాన్ తిరుణావీఱుడైయ పిరాన్ దాసర్ (6) కమలముల వంటి చరణములు కలిగి ఉన్న మణవాళ మాముణుల దివ్య పాదాలను స్తుతిద్దాము). [ఈ పాశురము శ్రీ వచన భూషణం పఠనం ఆఖరున సేవించ బడుతుంది; పైన పేర్కొన్న ఆరుగురు గొప్ప ఆచార్యులలో, కొత్తూర్ అళగియ మణవాళ దాసర్ వారు మణవాళ మాముణుల తాతగారు,  తిగళక్కిడందాన్ తిరుణావీఱుడైయ పిరాన్ దాసర్ మాముణుల తండ్రిగారు].

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2021/07/16/yathindhra-pravana-prabhavam-1/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – తనియన్లు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

శ్రీ శైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం
యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం

జ్ఞాన భక్తి గుణ సాగరులు, శ్రీ శైలేశుల కృపకు పాత్రులు, యతులకు అధిపతి అయిన భగవద్ రామానుజుల యెడల అనంత ప్రీతి ఉన్న వారైన రమ్యజా మాతృ ముని (మాణవాళ మాముణులు) ని నేను పూజిస్తాను.

శ్రీ శఠారి గురోర్దివ్య శ్రీపాదాబ్జ మదువ్రతం
శ్రీమత్ యతీంద్రప్రవణం శ్రీలోకాచార్యామునిం భజే

శ్రీ యతీంద్ర ప్రవణం ప్రబంధాన్ని రచించిన శ్రీ శటారి గురుల దివ్య పాద కమలముల నుండి ప్రవహించే మధువు లాంటి శ్రీ పిళ్లై లోకం జీయర్ని నేను పూజిస్తాను

గురునాథనెంగణ్ మణవాళయోగి గుణక్కడలై
పలనాళుం అణ్డిప్పరుగి క్కళిత్తింద ప్పారినుళ్ళే
ఉలగారియన్ మునిమేగం ఇన్నాళెన్నుళ్ళం కుళిర
నలమాన శీర్మై మళై నాళుం పొళిందదు ఇన్నిలత్తే

మన పూర్వాచార్యులు (పిళ్ళై లోకం జీయర్) మాణవాళ మాముణుల దివ్య గుణ సాగరాన్ని సేవించి ఆనందించారు. ఈ లోకంలో మేఘములా ఉన్న ఆ పిళ్ళై లోకం జీయర్, ప్రతి నిత్యము తమ ఉదార గుణ వర్షాన్ని కురిపించెను.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2021/07/15/yathindhra-pravana-prabhavam-thaniyans/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org