Monthly Archives: January 2022

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 14

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 13

నంపెరుమాళ్ కోయిల్ ని విడిచి వెళ్ళుట

ఈ విధంగా పిళ్లై లోకాచార్యులు సమస్థ చేతనులు ఉద్దరింపబడాలని ప్రమాణం (వేదాలు), ప్రమేయం (ఎమ్పెరుమాన్), ప్రమాతృ (వివిధ గ్రంథాల రచయితలు) మహిమలను చాటుతున్న తరుణంలో శ్రీరంగం తుర్క ఆక్రమణదారుల వశమైనది. పెరియ పెరుమాళ్ మరియు నమ్పెరుమాళ్ళకు ఎలాంటి హాని జరగ కూడదని, పెరియ పెరుమాళ్ళు కనబడ కూడదని రాతి గోడ నిర్మించి ఆ గోడ ఎదుట పెరుమాళ్ళ విగ్రహ స్థాపన చేశారు. ఉభయ నాచ్చిమార్లతో పాటు నంపెరుమాళ్ళని పల్లకీలో ఆలయం నుండి బయటకి తరలించారు. పెరుమాళ్ తిరుమొళి 4 – 6 లో “సుఱ్ఱమెల్లాం పిన్ తొడరత్తొల్ కానం అడైందు” (శ్రీ రాముడు తమ ప్రియమైన వారితో అడవికి వెళ్ళాడు), పెరియ తిరుమొళి 5 -10లో “తంబియొడు తామ్ ఒరువర్ తం తుణైవి కాదల్ తుణైయాగ” (శ్రీరాముడు తన ప్రియమైన పత్ని, తమ్ముడితో కలిసి వెళ్ళాడు) అని చెప్పినట్లు, నంపెరుమాళ్ తమ రహస్య పరివారంతో ఆలయం నుండి వలస వెళ్ళాడు. తిరువాయ్మొళి 8 -3 -7 పాశురంలో చెప్పబడినట్లుగా, “ఉరువార్ చక్కరం శంగు సుమందు ఇంగు ఉమ్మోడు ఒరు పాడు ఉళల్వాన్ ఓరడియాన్…” (నీ దివ్య అందమైన శంఖు చక్రములను ఎత్తుకొని నీ దాసుడు నీతో నడుచుచున్నాడు) శ్రీరామునికి సేవ చేయుటకు లక్ష్మణుడు తన విల్లు మరియు ఖడ్గంతో తన అన్న వెంబడి వెళ్ళినట్లు,  పిళ్ళై లోకాచార్యులు కూడా నంపెరుమాళ్ళ  వెంబడి వెళ్ళారు. లోకాచార్యులు ఇతర సహచరులతో పాటు నంపెరుమాళ్ళను స్తుతిస్తూ, సంక్షేప రామాయణంలో “ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః” (కమల నేత్రాల శ్రీ రాముడు అరణ్యములోకి ప్రవేశించెను) అని చెప్పబడినట్లుగానే వీరు కూడ అడవిలోకి ప్రవేశించారు. శ్రీ రామాయణం అరణ్య కాండ 119-22 లో “వనం సభార్యః ప్రవివేశ రాఘవః సలక్ష్మణః సూర్య ఇవ అభ్ర మండలం” (సూర్యుడు మేఘాలలోకి ప్రవేశించినట్లు సీతా లక్ష్మణ సమేత శ్రీ రాముడు అరణ్యములోకి ప్రవేశించెను). గర్జించి భయపెట్టే సింహాలు, పులులు, అడవి పందులు, ఎలుగుబంట్లు అనేక క్రూరమైన జంతువులుండే మహారణ్యం గుండా వాళ్ళు వెళుతున్నారు. చేతుల్లో బాణాలు పట్టుకొని ఆ ప్రాంతంలో వేటగాళ్ళు కూడా  తిరుగుతున్నారు. దొంగలున్న ప్రాంతానికి చేరుకున్న నంపెరుమాళ్ళు  దయతో తమ సంపదంతా (తిరు ఆభరణాలు) ఆ దొంగలకు ఇచ్చాడు. అది విన్న పిళ్ళై లోకాచార్యులు వెనక్కి తిరిగి వచ్చి అదే దొంగలపై తన పూర్తి కృపను కురిపించి ముందుకు సాగారు. అక్కడి కోయ్య వాళ్ళు కొంతమంది వచ్చి పిళ్లై లోకాచార్యులకి శరణాగతి చేసి కొన్ని సమర్పణలు అందించుకున్నారు.

లోకాచార్యులు తిరుమలైయాళ్వార్లని సంప్రదాయానికి తీసుకు వచ్చి శ్రీవైకుంఠానికి చేరుకొనెను

వాళ్ళు నంపెరుమాళ్ళతో కలిసి మధురై దగ్గరలో ఉన్న జ్యోతిష్కుడి (ప్రస్తుతం కొడిక్కుళం అని పిలువబడుతుంది) అనే గ్రామానికి చేరుకుని అక్కడ తమ బస ఏర్పాటు చేసుకున్నారు. పిళ్ళై లోకాచార్యులు అనారోగ్యం అలసట కారణంగా పరుండినారు. వారి స్థితిని చూసి శిష్యులు బాధతో తామెవరిని ఆశ్రయించాలని బాధచెందారు. పిళ్ళై లోకాచార్యుల దివ్య మనస్సు తిరుమలై ఆళ్వార్ గురించి ఆలోచించి, లౌకికము మరియు వైధికము రెండింటిలోనూ నిపుణుడైన తిరుమలై ఆళ్వార్ అని పెద్ద స్వరంతో వారికి చెప్పారు. వారు అప్పట్లో మధుర రాజ్య వ్యవహారాలను చూసుకుంటుండేవారు. రాజ్య వ్యవహారాల బాధ్యతలను వదిలి దర్శన బాధ్యతలు చేపట్టేలా చేయమని వారిని ఆదేశించెను. అతనికి అన్ని రహస్య గ్రంథాలు, వాటి అర్థాలను బోధించమని కూరకుళోత్తమ దాసి నాయనార్లను, తిరుక్కణ్ణంగుడి పిళ్ళై మరియు తిరుపుట్కుళి జీయర్ని వారికి తిరువాయ్మొళిని బోధించమని, నాలూర్ పిళ్ళైని మూవాయిరప్పడి (తిరుప్పావై)ని నేర్పించమని, విలాంజోలై పిళ్ళైని సప్తకాదైని బోధించమని పురమాయించెను. ఆని (మిథున) తమిళ మాసంలో అమావాస్య తరువాతి ద్వాదశి (12వ) రోజున వారు తిరునాడు (శ్రీవైకుంఠం) కి బయలుదేరాలని నిశ్చయించుకున్నారు. వారు విలాంజోలై పిళ్ళైని చివరి వరకు తిరువనంతపురంలోనే ఉండమని కోరారు. వారు తమ తండ్రి మరియు ఆచార్యులైన వడక్కు తిరువీధి పిళ్ళై దివ్య తిరువడిని స్మరించుకుంటూ తిరునాడుకి బయలుదేరారు. వారి శిష్యులందరూ దుఃఖంలో మునిగిపోయారు. వాళ్ళు తమను తాము ఓదార్చుకొని, పిళ్ళై లోకాచార్యుల దివ్య తిరుమేనిని దివ్య పరియట్టం (శిరస్సున ధరించే వస్త్రం), నంపెరుమాళ్ళ దివ్య పూలమాలలతో అలంకరించి చరమ కైంకర్యములను నిర్వహించిరి.

పిళ్ళై  లోకాచార్యుల తిరునక్షత్రము శ్రవణము, ఐప్పశి (తులా) మాసము. వీరి తనియన్

లోకాచార్య గురవే కృష్ణ పాదస్య సూనవే
సంసారి భోగి సందష్ఠ జీవజీవాతవే నమః

(సంసారం అనే విష సర్ప కాటుకు విరుగుడు అయిన వడక్కు తిరువిధి పిళ్ళై వారి తిరు కుమారులైన పిళ్ళై లోకాచార్యుని నేను ఆశ్రయిస్తున్నాను.)

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/07/29/yathindhra-pravana-prabhavam-14/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 13

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 12

మాణవాళ మాముణులు, శ్రీవచన భూషణ శాస్త్రాన్ని నంపెరుమాళ్ళ ఆదేశము మేరకు రచించారని చెప్పారు, కానీ పైన ఉల్లేఖించిన సంఘటన మన మనస్సులో సందేహానికి స్థానమిస్తుంది. ఈ విషయము గురించి పెద్దలను అడిగి తెలుసుకోవడం మంచిది. మాణవాళ మాముణులు, తమ శ్రీవచన భూషణం వ్యాఖ్యానంలో ఈ విధంగా వ్రాశారు:

“సంసారులు అనుభవిస్తున్న కష్టాలను చూసి, వారిని ఉద్ధరించడానికి, పిళ్ళై లోకాచార్యులు గొప్ప కరుణతో, అనేక ప్రబంధాలను రచించారు. పెరుమాళ్ళ అనుగ్రహముతో ఆతడి కోరిక మేరకు, పూర్వాచార్యులు పరమ గోప్యంగా ఇచ్చిన నిగూఢమైన కాలక్షేపాలను స్మరిస్తూ, తమ మునుపటి రచనలలో వెల్లడించని అర్థాలను నిర్ధారిస్తూ, పిళ్ళై లోకాచార్యులు శ్రీ వచన భూషణ ప్రబంధాన్ని కృపచేసారు.

పేరరుళాళ ప్పెరుమాళ్ (కంచి దేవా ప్పెరుమాళ్) మణప్పాక్కం నివాసి అయిన నంబికి తన స్వప్నంలో కొన్ని అర్థాలను నిర్ధేశించారు. ఆతడు ఒకరోజు నంబితో “నీవు రెండు నదుల మధ్య ఉన్నప్పుడు; మరిన్ని అర్థాలను మేము అక్కడ మీకు స్పష్టమైన రీతిలో నిర్ధేశించెదము” అని అన్నారు. నంబి కూడా శ్రీరంగం (కొల్లిడం మరియు కావేరి అనే రెండు నదుల మధ్య ఉంది) కి చేరుకున్నారు. అక్కడ ప్రతిరోజూ పెరుమాళ్ళను ఆరాధిస్తూ, దేవరాజ పెరుమాళ్ తనకు చెప్పిన అర్థాలను ఆలయంలో (కాట్టళగియ శింగర్ ఆలయము) ఏకాంత ప్రదేశంలో ధ్యానించుచుండెను. పిళ్లై లోకాచార్యులు తమ శిష్యులతో కలిసి ఒకరోజు అక్కడికి వచ్చారు. వారు తమ శిష్యులకు శాస్త్ర రహస్యార్థాలను ఉపదేశించడం ప్రారంభించారు. అవి దేవ ప్పెరుమాళ్ళు తనకు చెప్పిన అర్థాల మాదిరిగా ఉన్నట్టు గమనించి,  మణప్పాక్కం నంబి తాను ఉన్న చోటి నుండి బయటకు వచ్చి పిళ్లై లోకాచార్యులకి సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకున్నారు. వారు లోకాచార్యులని “మీరు వారేనా?” (అర్థం – మీరు పేరరుళాళ ప్పెరుమాళ్ళా?) అని అడిగారు. లోకాచార్యులు “అవును; ఎందుకు అడుగుతున్నావు?” అని ప్రశ్నించారు. స్వప్నములో పేరారుళాళ పెరుమాళ్ళు తనకి అర్థాలను ఎలా ఉపదేశించారో, తరువత ఏమి చేయమని ఆదేశించారో నంబి వివరించారు. లోకాచార్యులు ఈ మాటలు విని సంతోషించి, నంబిని తన శిష్యునిగా స్వీకరించి వారికి కూడా రహస్యార్థాలను బోధించారు. ఒకరోజు, నంబి స్వప్నములో పెరుమాళ్ళు వచ్చి, ఈ అర్థాలు మరచిపోకుండా ఉండేందుకు వీటిని వ్రాయమని తన ఆదేశముగా లోకాచార్యులకి తెలియజేయమని చెప్పెను. లోకాచార్యులు దీనిని పెరుమాళ్ళ ఆదేశముగా భావించి పాటించాలని నిశ్చయించుకునెను” (ఇక్కడ వరకు మణవాళ మాముణులు తమ  శ్రీవచన భూషణ ప్రబంధ వ్యాఖ్యాన పరిచయములో వివరించెను).

అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తిరుప్పావైతో సహా కొన్ని ప్రబంధాలకు వ్యాఖ్యానం రాశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, జీయర్ [మన సంప్రదాయంలో జీయర్ అనే పదం మణవాళ మాముణులను సూచిస్తుంది], తమ ఉపాదేశ రత్నమాల ప్రబంధంలో “తన్ శీరాల్ వైయ గురువిన్ తంబి మన్ను మణవాళ ముని శెయ్యుం అవై తానుం శిల” (పిళ్ళై లోకాచార్యుల సోదరుడైన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ కొన్ని వ్యాఖ్యానాలు కృపతో అనుగ్రహించారు). అని రాశారు.

ఆ విధంగా, పిళ్ళై లోకాచార్యులు మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు ప్రాపంచిక విషయాల పట్ల సంపూర్ణ నిర్లిప్తతతో జీవిస్తున్నప్పుడు, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు శ్రీవైకుంఠాన్ని చేరుకున్నారు. పిళ్ళై లోకాచార్యులు దుఃఖ సాగరములో మునిగిపోయి బాధతో, మణవాళ పెరుమాళ్ నాయనార్ల శిరస్సును తన ఒడిలో పెట్టుకుని, “గొప్ప  ముడుంబై వంశానికి చెందిన మణవాళ పెరుమాళ్ కూడా శ్రీవైకుంఠానికి వెళితే, అష్టాక్షరముల (తిరుమంత్రం) అంతరార్థాలను ఎవరు తెలియజేస్తారు. ‘మామ్’ [శ్రీ భగవత్ గీత 18.66 లో కృష్ణుడు పలికిన “మామ్ ఏకం శరణం వ్రజ”] అనే పదానికి అర్థం ఎవరు తెలియజేస్తారు? అని విలపించసాగారు.

అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ల తనియన్:

ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం
రమ్యజామాతృ దేవేన దర్శితం కృష్ణసూనునా

(వడక్కు తిరువీధి పిళ్ళై తిరు కుమారులైన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు దివ్య గ్రంధమైన ఆచార్య హృదయం రచించారు)

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/07/28/yathindhra-pravana-prabhavam-13/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 12

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 11

పిళ్ళై లోకాచార్యుల మహిమ

పిళ్లై లోకాచార్యులు ఏటువంటి మహిమ కలవారంటే వారిని నమ్మాళ్వార్ల పునరవతారముగా పరిగణిస్తారు. వీరి తమ్ముడు, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తన కృపా ఛాయలో పెరిగారు. వీరిరువురు రామ లక్ష్మణుల లాగా, అలాగే కృష్ణ బలరాముడి మాదిరిగా  కలిసి పెరిగారు. వీరి జంటని ఈ పాశురములో వర్ణించారు.

తంబియుడన్ దాశరథియానుం శంగవణ్ణ
నంబియుడన్ పిన్నడందు వందానుం – పొంగుపునల్
ఓంగు ముడుంబై ఉలగారియనుం ఒఱన్
దాంగు మణవాళనుమే తాన్

ఎలాగైతే దాశరథి (శ్రీ రాముడు) తన తమ్ముడైన లక్ష్మణునితో, అలాగే నల్లని కృష్ణుడు తన అన్న అయిన తెల్లని శంఖము వంటి వర్ణము కలిగిన బలరామునుతో కలిసి నడిచినట్లు, ముడుంబై అను ఉత్తమ వంశజులైన ఉలగారియన్ (పిళ్లై లోకాచార్యులు) వారి సోదరుడైన అళగియ మణవాలన్ తో కలిసి నడుచుచున్నారు)

వీరిరువురిలో, పిళ్లై లోకాచార్యులు అనేక నిగూఢ గ్రంథాలను రచించారు.  స్త్రీలతో పాటు సామాన్యులు కూడా ఉద్ధరింప బడుటకు ఈ గ్రంథాల అనుసంధానము చేయవచ్చు. అవి తనిప్రణవం, తనిద్వయం, తనిచరమం, పరందపడి, శ్రీయఃపతిపడి, యాదృచ్ఛిక ప్పడి, ముముక్షుప్పడి, సంసార సామ్రాజ్యం, సారసంగ్రహం, తత్వత్రయం, తత్వశేఖరం, ప్రపన్న పరిత్రాణం, ప్రమేయ శేఖరం, అర్చిరాది, అర్థ పంచకం, నవ విధ సంబంధం, నవ రత్న మాలై, శ్రీ వచన భూషణం మొదలైనవి. వీరు తమ తమ్మునితో కలిసి జీవించిన కాలంలో పరమసాత్వికులైన అనేక మంది – కూరకులోత్తమ దాసర్ నాయన్, మణప్పాక్కత్తు నంబి, అళగియ మణవాళ పిళ్ళై (కొల్లి కావల దాసర్), కోట్టూరిల్ అణ్ణర్, తిరుమలై ఆళ్వార్ (తరువాత వీరు మణవాళ మాముణులకు ఆచార్యులైనారు), విళాంజోలై పిళ్ళై, గొప్ప స్త్రీ మూర్తులై తిరుమలై ఆళ్వార్ వారి తల్లిగారు మొదలైన అనేక మంది పిళ్లై లోకాచార్యుల దివ్య పాదాల యందు ఆశ్రయము పొంది, ఎంబెరుమానుని కంటే ఎక్కువగా అన్ని వేళలా అన్ని స్థితులలో వీరికి సేవలు చేసి తరించారు.

అలా వారిద్దరూ జీవనము సాగిస్తున్న కాలములో, పిళ్లై లోకాచార్యులు తమ శిష్యులకు శ్రీ వచన భూషణ కాలక్షేపము ఇవ్వడం ప్రారంభించారు. దాదాపు అదే సమయంలో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు తమ ఆచార్య హృదయం అనే రచనను ప్రారంభించారు, ఇది తిరువాయ్మొళి సారముగా పరిగణించబడుతుంది, అలాగే శ్రీవచన భూషణ అర్థ విశేషాలను దృఢపరచే గ్రంథమిది. ఈ రెండూ, ఈడు యొక్క అర్థాలను తెలియజేస్తాయి కాబట్టి, ఈడు తనియన్లు పఠించినప్పుడు పిళ్లై లోకాచార్యులు మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ల ఇద్దరి తనియన్ ని పఠించడం పరిపాటి.

అన్నదమ్ములిద్దరూ తమ రచనల వల్ల పొందిన కీర్తిని, వారి రచనల శ్రవణం చేయడానికి,  ప్రజలు వచ్చి వారి ఆశ్రయం పొందడాన్ని కొందరు సహించలేక పోయారు. అసూయతో వారు వెళ్లి నంపెరుమాళ్ళతో ఇలా మొర పెట్టుకున్నారు, “ఓ రంగనాథా! పిళ్లై లోకాచార్యులు శ్రీ వచన భూషణం అనే గ్రంథాన్ని నిగూఢ అర్థాలతో రచించెను, ఇది దర్శనం యొక్క అర్థాలను నిరర్థకం చేసేటట్టుగా ఉంది” అని వేడుకున్నారు. ఇది విన్న నంపెరుమాళ్ ఆగ్రహించి, అర్చక ముఖేన  పిళ్ళై లోకాచార్యుని పిలిపించారు. వారు స్నాన మాచరించేందుకు వెళ్ళినందున, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు వారి పిలిపు ఉద్దేశ్యాన్ని తెలుసుకొని వారితో పాటు పెరుమాళ్ళ సన్నిధికి వెళ్ళెను. అర్చక ముఖేన పెరుమాళ్ళు ఇలా అడిగారు, “ఓ నాయనార్! ధర్మసంస్థాపనకై మనము అనేక అవతారాలు ధరించాము కదా?  అవి నిరర్థకము చేయడానికి నీవు రహస్య గ్రంథాలను ఎందుకు గ్రంథస్తం చేయుచున్నావు? ” శ్రీవచన భూషణ స్థాపనకు అనుబంధంగా తాను ఆచార్య హృదయం గ్రంథస్తం చేసారని  అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు జవాబిచ్చారు. ఈ వివరణ విన్న పెరుమాళ్ళు సంతోషించి, ఫిర్యాదు చేసిన వారిని “ఇవి కాదా, తన అవతారాలలో చెప్పినవి?” అని పలికారు. ఆ తరువాత నాయనార్లకు ఆలయ మర్యాదలన్ని అందించి (తీర్థ శఠారి, తుళసి ప్రసాదం మొదలైనవి), పల్లకీలో వారి నివాసానికి పంపాడు. ఇది విన్న పిళ్ళై లోకాచార్యులు సంతోషించి, తిరునెడుందాండగము పాశురము “వళర్ త్తదనాల్ పయన్ పెఱ్ఱేన్” (నికు శిక్షణ ఇచ్చిన ప్రయోజనాన్ని నేను ఇప్పుడు గ్రహించాను) పాడుతూ తన సోదరుడిని కౌగిలించుకున్నాడు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/07/27/yathindhra-pravana-prabhavam-12/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 11

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 10

వడక్కు తిరువీధి పిళ్ళై మహిమ:

నంపిళ్లై తర్వాత, వడక్కు తిరువీధి పిళ్ళై ఎంపెరుమానార్ దర్శన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు, వారి శిష్యులు “ఆత్మ యొక్క ప్రాథమిక స్వభావం ఏమిటి?” అని వారిని అడిగారు. వారు ఇలా జవాబిచ్చారు, “‘అహంకారము (స్వతంత్రంగా ఉండటం) అనే మలినాన్ని తొలగించినప్పుడు, ఆత్మకి అడియేన్ (దాసుడు) అన్న నామము స్థిరమవుతుంది. అనగా, ఆత్మ “నేనే ఈశ్వరుడిని (అన్నింటినీ నియంత్రిచగలను)'” అనే భావన తొలగిన పిదప, ఆ ఆత్మకి ప్రాథమిక గుర్తింపు ‘నేను దాసుడను'” అని  తెలుస్తుంది. అన్ని వేదాలను, శాస్త్రాలను, ఆళ్వార్ల పాశురాలను, ఆచార్యుల దివ్య పలుకులను విశ్లేషించిన తర్వాత శ్రీ వైష్ణవుడికి ఆచార్యాభిమానము తప్ప మోక్ష సాధనము మరొటి లేదని, ఆ మోక్ష ప్రాప్తి మార్గములో ఘోరమైన అడ్డంకి భాగవతాపచారమని వారు వివరించెను. వారు తమ ఆచార్యులు నంపిళ్ళైని ఉటంకిస్తూ తమ శిష్యులతో ఇలా అన్నారు, “నిత్యమైన ఆత్మ ఉనికి, భాగవతాపచారము చేయనంత వరకు మాత్రమే ఉంటుంది కదా?” నిరంతమైన ఆచార్యాభిమానం మన నిత్య కర్మానుష్థానములలో ఆచార్యుని పలుకులను అనుసరించడం, ఆచార్యుడే సాధనం మరియు లక్ష్యం అనే దృఢ విశ్వాసంతో ఉండడం, భాగవతుని పట్ల శాశ్వతమైన అపరాధం అనేది, చేసిన భాగవత అపరాధానికి ప్రాయశ్చిత్తం చేయకపోవుట. అటువంటి చర్య ఆత్మ స్వరూపానికి హాని చేకూరుస్తుంది, ఆత్మను ఒక కాలిన గుడ్డ ముక్కలా చేసి [కాలిన గుడ్డ ముక్క  సాధారణంగా కనిపించినా గాలి వీసినపుడు ఎగిరి గాలిలో కలిసిపోతుంది] దానిని నాశనం చేస్తుంది.

ఈ విధంగా అందరినీ ఉద్ధరిస్తూ, వడక్కు తిరువిధి పిళ్ళై తమ తిరుకుమారులైన పిళ్ళై లోకాచార్యులు మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లను పూర్తిగా దర్శన సిద్ధాంత ప్రచారానికై అంకితం చేయించి, కొంత కాలము తరువాత తమ ఆచార్యుల తిరువడిని స్మరిస్తూ  దివ్య పరమపదానికి చేరుకున్నారు.  పిళ్లై లోకాచార్యులు దుఃఖ సాగరములో మునిగిపోయి, “ఉభయ వేదాంతములలో (సంస్కృతం మరియు ధ్రావిడం (తమిళ)) ప్రావిణ్యము ఉన్న వారిని మనము కోల్పోయాము” అని చెప్పి వారికి చరమ కైంకర్యములను తగిన రీతిలో నిర్వహించారు.

తిరువీధి పిళ్ళై వారి దివ్య తిరునక్షత్రం స్వాతి, వారి తనియన్ –

శ్రీకృష్ణపాదపాదాబ్జే నమామి శిరసా సదా।
యత్ప్రసాదప్రభావేన సర్వసిద్ధిరభూన్ మమ॥

(ఆ శ్రీకృష్ణ (వడక్కు తిరువీధి ప్పిళ్ళై అని కూడా పిలుస్తారు) దివ్య అనుగ్రహంతో అన్ని పురుషార్థాలను (ప్రయోజనాలు) పొందిన నేను నిరంతరం నా శిరస్సుని వారి దివ్య పాదాల యందు ఉంచి ఆరాధించెదను.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/07/26/yathindhra-pravana-prabhavam-11/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 10

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 9

 ఈయుణ్ణి మాధవ ప్పెరుమాళ్ళ మహిమ

నంపిళ్ళై నుండి ఈడు ముప్పత్తారాయిరం (నంపిళ్ళై ఉపన్యాసాల ఆధారంగా వడక్కు త్తిరువీధి పిళ్ళై రాసిన వ్యాఖ్యానం) అందుకున్న తర్వాత, ఈయుణ్ణి మాధవ ప్పెరుమాళ్ తమ తిరుకుమారులైన ఈయుణ్ణి పద్మానాభ పెరుమాళ్ళకి ఆ వ్యాఖ్యానాన్ని బోధించారు. అతను శ్రీ వైష్ణవ దర్శనంతో ముడిపడి ఉండేలా అనేక శ్రీ సూక్తిల గోప్య అర్థాలను కూడా వారికి బోధించారు. శ్రీ పద్మానాభ పెరుమాళ్, దయతో ఆ పైన తమ శిష్యుడైన కోళ వరాహ నాయనార్లకి ఆ అర్థాలను బోధించి శ్రీ వైష్ణవ దర్శనంతో జతపడి ఉండేలా మలచుతారు. వీరిని నాలూర్ పిళ్ళై అని మరొక పేరుతో కూడా పిలుస్తారు. ఆ పైన వీరు తమ తిరుకుమారుడైన నాలురాచ్చాన్ పిళ్ళైకి ఆ జ్ఞానాన్ని అందించి అతనిపై తన కృపా వర్షాన్ని కురిపించెను. నాలురాచ్చాన్ పిళ్ళై ఈ వ్యాఖ్యానార్థాలను తమ శిష్యులలైన తిరువాయ్మొళి పిళ్ళై కి (మణవాళ మాముణుల ఆచార్యులు), తిరునారాయణపురత్తు ఆయికి, తిరువాయ్మొళి ఆచ్చాన్ పిళ్ళైకి బోధించెను. ఈ విషయమును గురించి మణవాళ మాముణుల ఉపదేశ రత్నమాల 49 వ శ్లోకము “ఆంగవర్ పాల్ పెత్త శిఱియాళ్వాన్ అప్పిళ్ళై। తామ్ కొడుత్తార్ తమ్ముగనార్ తం కైయిల్ పాజ్ఞ్గుడనే  నాలూర్ పిళ్ళైక్కు అవర్ దామ్ నల్లమగనార్కు అవర్ దామ్  మేలోర్కు ఈన్దార్ అవరే మిక్కు॥” లో మనము గమనించ వచ్చు (ఈ శ్లోకము ఈయుణ్ణి మాధవ ప్పెరుమాళ్ నుండి  తిరువాయ్మొళి పిళ్ళై వరకు ఈడు ముప్పత్తారాయిర అర్థాలు ఎలా పరంపర రూపముగా వచ్చిందో వివరిస్తుంది).

ఈయుణ్ణి మాధవ ప్పెరుమాళ్ళ దివ్య తిరు నక్షత్రం హస్తా. వారి తనియన్

వరదార్యకృపాపాత్రం శ్రీమాధవగురుం భజే
కురుకాధీశ వేదాంత సేవోన్మీలిత వేదనం

(నంపిళ్ళై, తమిళ ఉపనిషత్తుగా గౌరవించబడే  తిరువాయ్మొళిపై కాలక్షేపాలు చేయడం వల్ల ఎంతో జ్ఞాన స్పష్టత సంపాదించారు. వరదార్యులు అని కూడా పిలువబడే నంపిళ్ళైల కృపకు పాత్రులైన ఈయుణ్ణి మాధవ ప్పెరుమాళ్ళని నేను స్తుతిస్తున్నాను.).

ఈయుణ్ణి పద్మనాభ ప్పెరుమాళ్ళ దివ్య తిరు నక్షత్రం స్వాతి. వారి తనియన్

ఏనావగాహ్య విమలోస్మి శటారిసూనోర్ – వాణీగణార్థ పరిబోధ సుధాపకాయాం
శ్రీమన్ ముకుంద చరణాబ్జమధువ్రతాయ శ్రీ పద్మనాభ గురవే నమ ఆచరామః

(నమ్మాళ్వార్ల దివ్య పాశురార్థాల నుండి వెలువడిన దివ్య తేనె సాగరములో మునిగి తేలే అవకాశము మనకందించిన, శ్రీయఃపతి ముకుందుని దివ్య పాదాల యందు భ్రమరములా ఉన్న ఆ పద్మాభ పెరుమాళ్ళని మనము ఆరాధిద్దాము)

నాలూర్ పిళ్ళైల దివ్య తిరునక్షత్రం పుష్యం. వారి తనియన్

శ్రీ పద్మనాభ కురుత శటజిన్మునీంద్ర శ్రీసూక్తిభాష్యమధిగమ్య సమృద్ధభోదః
తత్ దేవరాజగురవేః యతిశచతుశ్ పూర్వాసేత్త కోలవర దేశికమాశ్రయే తం

(నాలూర్ నివాసి అగుటచే దివ్య తేజముతో ప్రకాశిస్తున్న కోలవరాహరుల [నాలూర్ పిళ్లై] దివ్య పాదాలను నేను ఆశ్రయించాను. శ్రీ పద్మాభ పెరుమాళ్ళ నుండి పొందిన నమ్మాళ్వార్ల దివ్య ప్రబంధ [తిరువాయ్మొళి] వ్యాఖ్యానమైన ఈడు గురించి వీరు పూర్ణ జ్ఞానం ఉన్నవారు. కోలవరాహరుల ఈడు దివ్య పరిజ్ఞానాన్ని కృపతో నాలూరాచ్చాన్ పిళ్లైకి బోధించారు).

నాలూరాచ్చాన్ పిళ్ళై వారి తనియన్:

నమోస్తు దేవరాజాయ చతుర్ గ్రామనివాసినే
రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే

(నాలూర్ నివాసి, నాలూర్ పిళ్ళైవారి తిరు కుమారులు, అన్ని శుభ గుణాలలో సంపూర్ణుడు, దేవరాజర్ మరియు శ్రీ రామానుజ దాసర్ అని కూడా పిలవబడే నాలూరాచ్చాన్ పిళ్లైకి నా వందనాలు అందజేస్తున్నాను. ).

కోలాదిపాద్విదువారబ్య సహస్రగీతేర్భాశ్యం హి పూర్వతన దేశికవర్యగుప్తం
త్రేతా ప్రవర్త్య భువియః ప్రతయాంచకార శ్రీ దేవరాజ గురువర్యమహం భజేతం

(పూర్వాచార్యులచే భద్రంగా రక్షించబడిన ఈడు వ్యాఖ్యానాన్ని తమ తండ్రి కోలాధిపర్ల నుండి పొందిన మహానుభావుడు ఆచార్య దేవరజులు (నాలూరాచ్చాన్ పిళ్లై). వీరికి నేను నమస్కరిస్తూ స్తుతిస్తున్నాను. వీరు ముగ్గురు అచార్యులైన (తిరువాయ్మొళి పిళ్ళై, ఆయి జనన్యాచారియర్, తిరువాయ్మొళియాచ్చాన్ పిళ్ళై) ల ద్వారా ఈ వ్యాఖ్యానాన్ని అంతటా వ్యాప్తింపజేశారు.)

శ్రీ శైలనాథగురు మాతృగురుత్తమాభ్యాం శ్రీసూక్తి దేశికవరేణ చ యస్త్రిదైవం
వ్యక్తశ్శటారికృతి భాష్య సుసంప్రదాయో విస్తారమేతి సహి వైష్ణవపుంగవేషు

(తిరువాయ్మొళికి భాష్యము అయిన ఆ ఈడు, ఈ ముగ్గురు ఆచార్యుల (తిరువాయ్మొళి పిళ్ళై, ఆయి జనన్యాచారియర్యులు, తిరువాయ్మొళియాచ్చాన్ పిళ్ళై) ద్వారా శోభను పొందింది, ఆపై శ్రీవైష్ణవ పెద్దలచే ప్రాబల్యము గణించింది.)

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/07/25/yathindhra-pravana-prabhavam-10/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 9

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 8

పెరియ వాచ్చాన్ పిళ్ళై వారి మహిమ

నంపిళ్ళై శ్రీ వైకుంఠానికి అధిరోహించిన తర్వాత, పెరియ వాచ్చాన్ పిళ్ళై దర్శన (శ్రీవైష్ణవ సిద్ధాంతం) కార్య భారాన్ని చేపట్టి నంపిళ్ళై శిష్యులందరినీ చేరదీశారు. నడువిల్ తిరువీధి పిళ్ళై  పెరియ వాచ్చాన్ పిళ్ళై వారిని ఇలా అడిగాడు, “మీరు గురు పరమపర మరియు ద్వయ మంత్రముపైన ఉపన్యాసాలు చేసిన వారికి మరియు ఉపన్యాసం విన్న వారికి తేడా లేకుండా ఉపన్యాసం ఇస్తున్నారు. పరమసాత్వికులైన శ్రీ వైష్ణవులు మిమ్మల్ని ఎందుకు అనుసరిస్తున్నారని మీరు అనుకుంటున్నారు?”. దానికి పెరియ వాచ్చాన్ పిళ్ళై వారు జవాబు ఇలా ఇచ్చారు. “అడియేన్ అహంకారి కాబట్టి, అడియేన్ అభిప్రాయంలో శ్రీ వైష్ణవ సిద్ధాంతం ఉందని భావిస్తున్నాను. ఇది ఈశ్వరుడు ప్రసాదించిన జన్మ కాబట్టి, అడియేన్ శ్రీ వైష్ణవుడిగా భావిస్తాను. అడియేన్ ‘వీళ్ళందరి మనోభావన ఎలా ఉంది అని యోచించినచో, వీళ్ళందరూ అడియేన్ని అనుసరిస్తున్నారు, కాబట్టి వారి అభిప్రాయంలో కూడా శ్రీ వైష్ణవత్వం ఉందని అడియేన్ భావిస్తున్నాడు. కాబట్టి మూడు అభిప్రాయాలలో, మూడు తంతువులతో కూడిన శ్రీ వైష్ణవత్వము అడియేన్ లో ఉందని భావిస్తాను”. వారు ఈ మూడు అభిప్రాయాలతో శ్రీ వైష్ణవత్వము ఉందని తమ సొంత ప్రశంస చేయకుండా వారి గొప్పతనాన్ని చాటుకున్నారు.

వారి శిష్యులు ఒకానొక రోజు “మనం భగవానుని లీలలో భాగమా లేక ఆతడి కరుణకు పాత్రులమా?” అని అడిగారు. అతను ప్రతిస్పందిస్తూ, “అహంతో ఎటువంటి సంబంధం లేని నిత్యులు మరియు ముక్తులు భగవానుని మాధుర్యానికి పాత్రులు. అహంకార మమకారములతో కూడిన సంసారులు ఆతడి లీలకి పాత్రులు. మన ఆచార్యుల సహాయంతో భగవానుని కరుణ ద్వారా మన అహంకార మమకారములను తొలగించుకోవాలని ప్రయత్నిస్తున్న మనం కూడా ఆతడి కరుణకు పాత్రులమే. ఆ విధంగా, సర్వేశ్వరుడు తమ వాత్సల్యము ద్వారా సమస్థ చేతనులను వారి అహంకారము మరియు స్వాధీన స్వభావాన్ని తొలగించి వారిని తన కైంకర్యాల కోసం ఉపయోగించుకుంటాడు.

పెరియ వాచ్చాన్ పిళ్ళై శ్రీ వైష్ణవ గోష్ఠిలో కొంత మంది వారిని ఇలా ప్రశ్నించారు “మేము ఆశ్రయం పొందే కొన్ని మాటలు మీరు కృపతో చెప్పండి” అని అడిగారు. పిళ్లై ఇలా అన్నారు, “ఈ లోకము భ్రమికులతో నిండి ఉండి, నిత్యము భ్రమలో ఉండేవారితో, భ్రమింపజేయునది,  స్పష్టం చేసేవారు, స్పష్టత పొందే వారు మరియు ఎల్లప్పుడూ స్పష్టంగా ఉండేవారితో ఈ సంసారము నిండి ఇంది. ఇక్కడ, భ్రాంతిలో ఉన్న వ్యక్తి జీవాత్మ (చేతనుడు); ఆ చేతనుడిని భ్రమింపజేసేది అచిత్ (ప్రకృతి); ఎప్పుడూ భ్రాంతిలో ఉండే వాళ్ళు సంసారులు; స్పష్టం చేసే వారు ఆచార్యుడు; స్పష్టత పొందేవాడు చేతనుడు, ఎల్ల వేళలా స్పష్టతతో ఉండేవాడు ఈశ్వరుడు. అందువల్ల, ఆచార్యుల ఉపన్యాసం ద్వారా స్పష్టత పొందేవాడు (1) దిగ్భ్రాంతికి గురయ్యే స్వయమును, (2) భ్రాంతికి కారణమైన ప్రకృతిని (3) ఎల్లవేళలా భ్రాంతిలో ఉండే సంసారులను ఆశ్రయించుటను తోసివేసి, స్పష్టతను అనుగ్రహించే ఆచార్యుడిని, అనునిత్యము స్పష్టంతో నిండి ఉండే ఈశ్వరుడిని ఆశ్రయించాలి.  ఇది జీవాత్మ యొక్క ప్రాథమిక స్వరూపమని అర్థం చేసుకోవాలి.

పెరియ వాచ్చాన్ పిళ్ళై వారు పెరియాళ్వార్ తిరుమొళితో ప్రారంభించి మొత్తం నాలాయిర దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానాన్ని రచించి ప్రపంచాన్ని ఉద్ధరించారు. ఇది గుర్తు చేసుకుంటూ, జీయర్ (మణవాళ ముణులు) తమ ఉపదేశ రత్నమాలలో  “పెరియ వాచ్చాన్ పిళ్ళై పిన్బుళ్ళవైక్కుం తెరియ వియాక్కిగైగళ్ సెయ్వాల్ అరియ అరుళిచ్చెయఱ్పొరుళై ఆరియర్గట్కు ఇప్పోదు అరుళిచ్చెయలాయ్ త్తఱిందు” అని అనుగ్రహించారు. (ప్రీతితో వ్యాఖ్యాన చక్రవర్తిగా పిలువబడే పెరియ వాచ్చాన్ పిళ్ళై వారు, నంపిళ్ళై ప్రియ శిష్యులు, అందరూ ఆళ్వార్ల  దివ్య ప్రబంధాల పాసురార్థములను తెలుసుకోవాలని దాదాపు 3000 పాశురాలను వ్యాఖ్యానములు వ్రాశారు), పెరియ వాచ్చన్ పిళ్ళై అరులి చ్చెయల్ కి కొన్ని అరుదైన వ్యాఖ్యానాలను రచించారు). తరువాత, వారు దయతో రహస్య త్రయ వివరణం, తత్వత్రయ నిర్ణయం మొదలైన అనేక ఇతర రచనలను కూడా చేశారు.

ఒక రోజు తమ శిష్యులలో ఒకరైన వాదికేసరి, వారు తమ గృహస్థాశ్రమంలో ఉన్న సమయంలో, శాస్త్రాలను విశ్లేషిస్తున్న కొంత మందిని మీరేమి అనుసంధానము చేస్తున్నారని అడిగారు. అతను చదువు రాని వారని తెలిసి, “మేము ముసలకిసలయం చదువుతున్నాము” అని హేళనగా చెప్పారు. అటువంటిది ఒకటి ఉందో లేదో తెలియక, అతను పెరియ వాచ్చన్ పిళ్ళై వద్ద తెలుసుకుందామని వెళతారు. పెరియ వచ్చన్ పిళ్ళై వారు జరిగినది విని నవ్వి, తన చదువురాని తనాన్ని వారు వెక్కిరిస్తున్నారని చెప్పారు. వాదికేసరి సిగ్గుపడి, పెరియ వాచ్చన్ పిళ్ళై ముందు సాష్టాంగము చేసి, “మీరు నన్ను విద్యావంతునిగా మార్చాలి, జ్ఞాన నిపుణుడిని చేయాలి” అని ప్రార్థించారు. పెరియ వాచ్చన్ పిళ్ళై వారు అంగీకరించి, వాదికేసరిని శాస్త్రములో నిపుణుడు అయ్యే విధంగా అతనికి బోధించారు. వాదికేసరి వారు సంస్కృతంలో ముసలకిసలయం అనే పేరుతో ఒక ఇతిహాసం రాసి, తనను ఎగతాళి చేసిన ఇద్దరు శ్రీ వైష్ణవులకు అందించి, చదవమంటారు. వాళ్ళు మాట మాట్లాడకుండా సిగ్గుతో తల వంచుకుంటారు. ఆ తరువాత వాదికేసరి వారు సంసార నిర్లిప్తత చెంది, సన్యాసాశ్రమ స్వీకారము చేసి, అనేక చర్చలలో భగవానుని పరత్వాన్ని చాటుతూ ఎంతో మంది జనులపై గెలుపు పొంది, వాదికేసరి అళగియ మాణవాళ జీయర్ అనే బిరుదును సంపాదించెను. వారు తిరువాయ్మొళి యొక్క మునుపటి వ్యాఖ్యానాలను పరిశీలించి, వాటి సూక్ష్మమైన అర్థాలను గ్రహించి, అందరికీ సులువుగా అర్థమైయ్యేలా తిరువాయ్మొళికి పన్నీరాయిరప్పడి (పన్నెండు వేల పడి, ఒక పడి గద్యం ముప్పై రెండు అక్షరాలతో రూపొందించబడినది) వ్యాఖ్యానాన్ని సంకలనం చేశారు. జీయర్ ఉపదేశ రత్త మల లోని 45 వ శ్లోకంలో “అన్బోడు అళగియ మణవాలచ్చీయర్ ……ఏదమిల్ పన్నీరాయిరం ” (అళగియ మణవాళ చ్చీయర్ ఎంతో ప్రీతితో దోషరహితంగా 12000 పడి సంకలనం చేసారు) వ్రాసారు. తర్వాత, వారు దీప ప్రకాశ శతం, తత్వ నిరూపణం మొదలైన ఇతర రచనల సంకలనం చేశారు.

పెరియ వాచ్చాన్ పిళ్ళైల దివ్య తిరునక్షత్రము రోహిణి, తమిళ ఆవణి మాసము (సింహ మాసము). వారి తనియన్

శ్రీమద్ కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే
యత్కటాక్షైక లక్ష్యాణాం సులభః శ్రీధరస్సదా

యామునర్ల పుత్రులైన శ్రీమాన్ కృష్ణర్  [పెరియ వాచ్చాన్ పిళ్ళై] కు నేను నమస్కరిస్తున్నాను, వారి దివ్య చూపు మనపై పడితే  సర్వేశ్వరుడిని అతి సులభంగా చేరుకోగలమనన్న నిజాన్ని గ్రహించగలుగుతాము.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/07/25/yathindhra-pravana-prabhavam-9/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org