Monthly Archives: February 2022

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 17

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 16

తమతో ఉన్న తోళప్పర్ కుమారుడైన అప్పన్ పిళ్లైని ఓదార్చుచూ వాళ్ళు ఇలా అన్నారు – “బాధపడవద్దు, ఎందుకంటే నీ తండ్రి ఆళ్వార్ కైంకర్యంలో తమ దివ్య శరీరాన్ని త్యాగము చేశారు; ఆళ్వార్ నిన్ను కూడా తన కొడుకుగానే భావిస్తారు; తొళప్పర్కి చేసిన వాగ్దానము నీపైన అమలు చేయబడుతుంది” అని హామీ ఇచ్చారు. తరువాత ఆళ్వార్ల దివ్య విగ్రహాన్ని ముదిరిప్పు అనే చోటికి తీసుకువచ్చి, ఐదు రోజుల తిరుమంజనం నిర్వహించారు. ఆ చుట్టుపక్కల ఉన్న దొంగలు ఈ సంఘటన గురించి విని అక్కడికి వచ్చి, ఆళ్వార్కి ఆరాధనలు చేసి, వాళ్ళు ముందు దోచుకున్న సంపత్తినంతా తిరిగి వారికే సమర్పించి, ఆళ్వార్‌ తిరుక్కణాంబికి తీసుకెళ్లడానికి సౌకర్యముగా పల్లకీని దానం చేసి, ఆళ్వార్తో పాటు పరిచారకులందరూ సురక్షితంగా వెళ్లేలా ఏర్పాట్లు చేసారు. ఒక పెద్ద గరుడ పక్షి ఆళ్వార్ మీదుగా తిరుక్కణాంబి వరకు ఎగురుతూ వెళ్లి, అక్కడ ఒక చెట్టుపై గూడు కట్టుకుని అక్కడే ఉండిపోయింది. దీనిని ఆశ్చర్యంగా చూస్తూ, ప్రజలు ఆళ్వార్ని సేవించారు, వారి స్థితికి తగినట్లు సమర్పణము అందించి పరమోత్సాహముతో ఉత్సవాలలో పాలు పంచుకున్నారు. నిత్యోత్సవాలు, మాసోత్సవాలు అన్నీ ఘనంగా నిర్వహించారు. ఈ అద్భుతమైన సంఘటనల గురించి విని, చుట్టు పక్కల ఉన్న దివ్యదేశాలలోని (తిరువనంతపురం, తిరువాట్టాఱు, తిరువణ్‌పరిసారం, తిరువల్లవాళ్ మొదలైన) నంబూద్రీ పురోహితులు తిరుక్కణాంబికి వచ్చి, ఆళ్వార్ని సేవించుకున్నారు. తిరిగి వెళ్ళడానికి వాళ్ళకు మనసు రాలేదు. నిత్యారాధనములు, దద్యోజనము, నెయ్యితో చేసిన దోస, అటుకులు బెల్లముతో చేసిన పలు నైవేధ్యాలు మధ్యాహ్నం వరకు సమర్పించేవారు. ఆళ్వారు కాస్త విశ్రాంతి తీసుకున్న తరువాత తిరువారాధనము పూర్తైన పిదప అన్నంతో చేసిన వివిధ రకాల తీపి వంటలు, ఉప్పు సాత్తముదు, పాలు అల్లముతో చెసిన పానీయము మొదలైనవి సమర్పించేవారు. నంబూద్రీ పురోహితులు ఈ ఏర్పాట్లన్నీ ఆళ్వార్ పట్ల అమితమైన ప్రేమతో చేసేవారు.  ఆళ్వార్ జన్మస్థలమైన ఆళ్వార్ తిరునగరిలో విగ్రహాము యొక్క మూల స్థానము యందు వారి శిష్యులు, మఠాధిపతులు అందరూ ఆళ్వార్ పట్ల అమితమైన భక్తి ప్రపత్తులతో సరైన సమయాలలో సరైన రీతిలో ఉత్సవాలు జరుపుతూ అక్కడే ఉండిపోయారు.

ఇప్పుడు, శ్రీరంగం ఆలయ సంఘటనము చూద్దాము

నంపెరుమాళ్ళు శ్రీరంగాన్ని విడిచి వెళ్లిన తర్వాత, శ్రీ రాముడు అడవులకు బయలుదేరిన తర్వాత “అభివృక్షాః పరింలానాః” అనే సూక్తి ప్రకారం అయోధ్య తన ఐశ్వర్యాన్ని అందాన్ని కోల్పోయినట్లే, శ్రీరంగం కూడా తన అందాన్ని కోల్పోయింది. ఆళ్వార్లు తమ పాశురములలో “అఱ్ఱపఱ్ఱర్ శుఱ్ఱి వాళుం అందణీర్ అరంగం” (చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలో నివసిస్తూ వైరాగ్యముతో నిండిన భక్తులతో కూడిన అందమైన చల్లని తిరువరంగం) మరియు “నల్లార్గళ్ వాళుం నళ్రి అరంగం” (చల్లని తిరువరంగంలో నివసించే సత్పురుషులు) అని కొనియాడిన శ్రీరంగము తన అందాన్ని పూర్తిగా కోల్పోయింది.

ముస్లిముల సైన్యాధిపతి శ్రీరంగానికి మరింత నష్టం చేకూర్చాడు. దృఢమైన ఆలయ ప్రహరీ గోడలను పడగొట్టి కణ్ణనూర్లో [తిరువానైక్కావిల్ సమీపంలో] తన కోసం ఒక విశ్రాంతి భవనాన్ని నిర్మించుకొన్నాడు. అక్కడ నివసించే ప్రజలకు మరిన్ని కష్ఠాలు ఇబ్బందులు కలిగించేవాడు. పెరియ పెరుమాళ్ళకు సంబంధించిన భూములు ఆస్తుల విషయాలను చూసుకుంటున్న సింగప్పిరాన్ అనే వ్యక్తి, ఆలయ ప్రహరీ గోడలు, గోపురాలు, మంటపాలు, మాడ వీధులు మొదలైన వాటికి నష్టం జరగకుండా సహాయం చేయమని వేడుకొని అటుపైన నష్ఠము కలుగకుండా చూసుకున్నారు. స్థానిక ఆచార్యులు మఠాధిపతులందరూ ఎంతో సంతోషించి కుదుటపడ్డారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/01/yathindhra-pravana-prabhavam-17/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 16

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 15

ఇప్పుడు ఆళ్వార్లకు సంబంధించిన సంఘటనలు

నంపెరుమాళ్ కోళిక్కొడు నుండి బయలుదేరినప్పుడు, అక్కడి అధికారులు, అర్చకుల అయుక్తతత కారణంగా ఆళ్వార్ పెరుమాళ్ళతో వెళ్లలేకపోయెను. ఆ రోజుల్లో తూర్పు పశ్చిమము రెండు దిశల్లో  (కోళిక్కొడు) దొంగల ఆవాసము ఉండేది; ఉత్తరం వైపున, ముస్లిం ఆక్రమణదారుల భయం ఉండేది. ఆ కారణంగా ఆళ్వార్ని దక్షిణ దిశగా తీసుకువెళ్ళవలసి వచ్చెను. దొంగల భయం ఉండటంతో, వేరే దారి లేక, ఒక కొండ లోయలో ఒక దివ్య చెట్టు కాండములో ఆళ్వారుని ఆసీనపరచి, రక్షణ కొరకు ఆ చెట్టు చుట్టూ గొలుసులు చుట్టి ఉంచి, ఆళ్వార్ యొక్క దివ్యాభరణాలను సమీపంలోని సురక్షితమైన ప్రదేశంలో భద్రపరచి, ఆ కొండ క్రిందకి దిగడం ప్రారంభించారు. దారిలో కొందరు దొంగలు దాడిచేయగా, తమ వద్ద ఉన్న వస్తువులను వారికి ఇచ్చి వారి వారి ఇల్లకి చేరుకున్నారు.

వారిలో ఆళ్వార్ల ఎనలేని భక్తుడైన తోళప్పర్ కూడా ఉన్నారు. అతను మధురకి వెళ్లి, తిరుమలై ఆళ్వార్లను [తిరువాయ్మొళి ప్పిళ్ళై, మణవాళ మాముణుల ఆచార్యులు] కలుసుకుని, జరిగిన సంఘటన గురించి వివరించారు. అతని మాట విన్న తర్వాత, తిరుమలై ఆళ్వార్ తన నమ్మకస్తులతో మలయాళ దేశ రాజుకి సందేశం పంపారు. అప్పటికి ఆక్రమణదారుల ఇబ్బందులు తగ్గుముఖం పట్టాయి. వాళ్ళు తిరువాంగోట్టూర్ చేరుకుని, రాజును కలుసుకుని, తిరుమలై ఆళ్వార్ల సందేశాన్ని అందించారు. ఆ సందేశాన్ని చదివిన తర్వాత, రాజు తోళప్పర్ కు బహుమానములిచ్చి, తన విశ్వసనీయులను పంపించి, తిరుక్కణాంబిలో ఆళ్వార్ని ప్రతిష్టించమని ఆదేశించారు. వాళ్ళు కావలసిన సామగ్రి గొలుసులు పలకలను తీసుకొని ముండిరిప్పు అనే ప్రదేశానికి వెళ్లి పర్వతం ఎక్కడం ప్రారంభించారు. ఆళ్వార్లి దాచిన లోయలో అ చోటికి దిగడానికి  భయపడి ఎవరు ముందుకు వస్తారోనని ఆలోచించసాగారు. తోళప్పర్ ముందుకు వచ్చారు. వారితో వచ్చిన వారు సంతోషించి, ఆలయంలో వకుళాభరణ భట్టర్ (నమ్మాళ్వార్ల  అవతార స్థలము ఆళ్వార్ తిరునగరిలోని ప్రముఖ కైంకర్యపరారు) తో సమానమైన గౌరవాలు తనకి ఇవ్వబడతాయని అతనికి వాగ్దానం చేశారు.  ఆళ్వార్ తిరునగరిలో కొన్ని సందర్భాలలో ఆళ్వారుకి తిరుమంజనము నిర్వహించినపుడు, ఆళ్వార్ల దివ్య శిరస్సుని అలంకరించే పూ మాలను “ఆళ్వార్ తోళప్పర్” అరుళప్పాడు (అరుళప్పాడు అనేది సన్మానం అందించే ముందు ఆ సన్మానం పొందే వ్యక్తి పేరును ప్రతి ఒక్కరూ వినేలా గట్టిగా పిలిచే ఒక ప్రక్రియ) వారికి ఇవ్వబడుతుంది. ఆ తర్వాత వారు తమ వెంట తెచ్చుకున్న గొలుసుల పలకలపైన తోళప్పర్ని కూర్చోపెట్టి క్రిందకి దించారు. వారు ఆళ్వార్ని దాచి ఉంచిన చోటికి వెదుకుతుండగా దగ్గరలో ఒక పక్షి [గరుడ] శబ్దాలు చేయడం ప్రారంభించింది. తోళప్పర్ అది దివ్య సంకేతముగా భావించి అక్కడ వెదికితే ఒక కాండము కనిపించెను. సాష్టాంగ నమస్కారము చేసి ఆళ్వార్ని ధ్యానించారు. ఆ పక్షి ఎగిరిపోయింది. వారు ఆ కాండముని తెరిచి చూస్తే లోపల ఆళ్వార్ దర్శనమిచ్చెను. మళ్లీ ఆళ్వార్ ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. వారు కొన్ని తాళపత్రాలు మరియు వ్రాత పరికరాలు తీసుకెల్లినందున, వారు దిగిన క్షణం నుండి తాను చూసిన విషయాలను ఆ పత్రాలలో వ్రాసారు. తరువాత ఆళ్వారున్న ఆ దివ్య కాండముని పలకపైన ఉంచి పైనున్న వారికి లాగమని సైగ చేశారు. వాళ్ళు పలకను పైకి లాగి తోళప్పర్ వ్రాసినది చదివి, ఆళ్వార్ని పూజించి, తోళప్పర్ పైకి రాడానికి ఆ పలకను మళ్లీ క్రిందకి దించారు. పైకి లాగుతుండగా, ఆ పలక మధ్యలో ఒక అడ్డంకికి తగిలి తోళప్పర్ జారి క్రింద లోయలో పడిపోయెను.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/07/31/yathindhra-pravana-prabhavam-16/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 15

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 14

నంపెరుమాళ్ళకు సంభంచిన సంఘటనలు

నంపెరుమాళ్ జ్యోతిష్కుడిని నుండి,  శ్రీరంగంగా భావించబడే తిరుమాలిరుంజోలై దివ్య దేశాన్ని చేరుకున్నారు. తిరుమాలిరుంజోలై చుట్టూ శ్రీరంగం వంటి ఉద్యానవనాలు ఉన్నందున పిళ్లై లోకాచార్యుల నుండి వీడిన శోకాన్ని మరచి, అక్కడే ఉండ సాగారు. కూరత్తాళ్వాన్ తమ సుందరబాహు స్థవం శ్లోకం 103లో తిరుమాలిరుంజోలై కళ్ళళగర్ని ఇలా వర్ణించారు.

శిఖరిషు విపినేష్వపి ఆపాగాః వచ్చతోయాస్వనుభవ
సురసజ్ఞో దణ్డకారణ్య వాసాన్ ।
తదిహ తదనుభూతౌ సాభిలాశోద్య రామ శ్యరసి
వనగిరేంద్రం సుందరీభూయ భూయః ॥

(ఓ శ్రీరామా! రసజ్ఞుడవైన నీవు, దండకారణ్యంలో పయనిస్తూ, శుద్ద స్ఫటికమైన జలముల మందాకినీ నదికి తీరములో, చిత్రకూటపు అరణ్య పర్వత ప్రాంతాలలో కృపతో బస చేశావు. ఆ రుచిని చవిచూసిన కారణంగా, ఆ ప్రాంతాలలో నివసించినందున, ఆ అనుభూతులను పునః జీవించాలనే నీ దివ్య సంకల్పముతో, ఈ తిరుమాలిరుంజోలైని నీ దివ్య నివాసంగా చేసుకున్నావు).

ఇందులో పేర్కొన్నట్లుగా, నంపెరుమాళ్ అరణ్య ప్రాంతంలో నివసించాలనే కోరికతో, అడవులు మరియు కొండలతో చుట్టుముట్టబడిన ప్రదేశంలో కొంతకాలం [సుమారు ఒక సంవత్సరం] విశ్రాంతి తీసుకున్నారు. ఆతడు పరమ ధార్మికుడు కాబట్టి, అళగియ మణవాళన్ కిణఱు (నంపెరుమాళ్ళు తవ్విన బావి) తణ్ణీర్పందల్ (దాహంతో ఉన్నవారికి జలం చేకూర్చడానికి)  సృష్టించాడు. అనంతరం, కులశేఖరాళ్వార్ల గురించి చెప్పినట్లుగా – “కొల్లి కావలన్ కూడల్ నాయగన్ కోళిక్కోన్ కులశేగరన్” (కొల్లి ప్రాంత రక్షకుడు, కూడల్ ప్రాంతానికి నాయకుడు మరియు కోళి ప్రాంతానికి అధిపతి), నంపెరుమాళ్ళు కులశేఖర ఆళ్వార్లు పాలించిన ప్రాంతంలో ఉండాలని ఆశించెను. వారు తిరుమాలిరుంజోలై నుండి పశ్చిమం వైపు వెళ్లి, దారిలో కొన్ని ప్రదేశాలలో బస చేసి చివరకు కోళిక్కోడు చేరుకున్నారు.

“సుడర్కొళ్ సోదియై దేవరుం మునివరుం తొడర” (ఎంపెరుమానునితో నిత్యసూరులు మరియు ముక్తాత్మలు) లో పేర్కొన్నట్లుగా, ఇతర దివ్యదేశ ఎంపెరుమాన్లు మరియు నమ్మాళ్వార్లు కూడా అదే చోటికి వచ్చి చేరుకున్నారు [ముస్లింల దాడి ఫలితంగా]. అతడు వారిని కూడా సంరక్షించాడు [భక్తులు తెచ్చిన వివిధ దివ్యదేశ సంబంధిత విగ్రహాలని]. తన దివ్య సింహాసనంపై నమ్మాళ్వార్లకి స్థానమిచ్చి, కరుణతో తదేకంగా ఆళ్వార్ని చూస్తూనే ఉండెను. ఆ తర్వాత అక్కడి నుండి ఆళ్వార్‌తో పాటు వారు తేనైక్కిడంబై (తిరుక్కణాంబి) అనే చోటికి బయలుదేరాడు, కొంత కాలం అక్కడ ఉండి, తనతో పాటు వెళ్లాలనుకున్న ఆళ్వార్‌ను విడిచిపెట్టి, పుంగనూర్ మీదుగా తిరునారాయణపురం చేరుకున్నాడు, అక్కడ కొంత కాలం ఉండి ఆళ్వార్చే “తిలదములగుక్కాయ్ నిన్ఱ” (ప్రపంచమంతటికీ అలంకారము వంటి) అని పిలువబడే తిరువెంగడముకి చేరుకున్నాడు.

తిరుమలలో నంపెరుమాళ్ 

శ్రీ రామాయణం అయోధ్య కాండం 56-38 లో చెప్పినట్లుగా

సురమ్యం ఆసద్యతు చిత్రకూటం నదీంచతాం మాల్యవతీం సుతీర్థాం ।
ననంద హృష్ఠ మృగపక్షి జుష్టాం జహౌచ దుక్కం పురవిప్రవాసాత్ ॥

(ఆహ్లాదకరమైన చిత్రకూట పర్వతము చేరుకుని మాల్యవతి నదీ ప్రాంతములో జంతు పక్షుల మధ్య సీతా, రామ లక్ష్మణులు, అయోధ్య నగరం బహిష్కణ వల్ల కలిగిన బాధని మరచారు. తిరుమళిశై ఆళ్వార్ తమ నాన్ముగన్ తిరువందాది పాశురము 47 “నన్మనివణ్ణనూర్…” (మణి వంటి రంగులో ఉన్న సర్వేశ్వరుని నివాస స్థలం) లో ప్రశంసించబడిన తిరువెంగడం చేరుకుని నంపెరుమాళ్ళు కుదుట చెందారు. తిరుప్పాణాళ్వార్ తమ అమలనాదిపిరాన్ 3 వ పాశురములో చెప్పినట్లుగానే, “మందిపాయ్ వడవెంగడమామలై వానవర్గళ్ సంధి శెయ్య నిన్ఱ అరంగత్తు అరవినణైయాన్…” (ఉత్తరాన వెలసిన తిరువేంకట కొండలులో ఆదిశేషునిపై శయనించి ఉన్న తిరువరంగడు, నిత్యసూరుల పుష్పారాధనలు అందుకొనుటకై తిరుమలలో నిలుచొని ఉన్నాడు), వీరిరువురు (అరంగనాధుడు, తిరువేంకట నాధుడు) ఒకే స్వరూపులు కాబట్టి, నంపెరుమాళ్ళు చాలా కాలం పాటు దివ్య ఉత్సవాలను ఆనందిస్తూ తిరువేంగడంలో ఉన్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/07/30/yathindhra-pravana-prabhavam-15/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org