Monthly Archives: March 2022

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 20

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 19

నాలూరాచ్చాన్ పిళ్ళై దివ్య పాదాలకు తిరుమలై ఆళ్వార్ సాష్టాంగ నమస్కారం చేసి శరణాగతి చేసెను. నాలూరాచ్చాన్ పిళ్ళై వారిని స్వీకరించి, ఈడు (తిరువాయ్మొళిపై నంపిళ్లై చేసిన కాలక్షేపం ఆధారంగా వడక్కు తిరువీధి పిళ్ళై వ్రాసిన వ్యాఖ్యానం) బోధించడం ప్రారంభించారు. నాలూరాచ్చాన్ పిళ్ళై తిరుమలై ఆళ్వార్ కు ఈడు వాక్యానము బోధిస్తున్నారని విని, తిరునారాయణపురంలోని జనన్యాచార్ (తిరునారాయణపురత్తు ఆయి), తిరువాయ్మొళి ఆచ్చాన్ పిళ్ళై మొదలైన ఆచార్యులు, ఎంబెరుమానార్లచే వెలువడిన ఒక సందేశాన్ని నాలూరాచ్చాన్ పిళ్ళైకి పంపారు. అది చూసి, తిరుమలై ఆళ్వార్‌తో కలిసి నల్లూరాచ్చన్ పిళ్లై తిరునారాయణపురానికి బయలుదేరెను.

ఇలా చెప్పబడినట్లుగా..

ఆరుహ్యామల యాదవాద్రి శిఖరం కల్యాణితీర్థం తతః
స్నాత్వాలక్ష్మణయోగినః పదయుగం నత్వాతుగత్వాంతతః
శ్రీనారాయణమేయతత్ర ధరణీ పద్మాలా మధ్యకం
పశ్యేయం యధికిం తపఃపలమతః సంపత్కుమారం హరిం

(పవిత్రమైన యాదవాద్రి కొండ ఎక్కడం, కళ్యాణి తీర్థంలో పుణ్య స్నానం చేయడం, ఇళయాళ్వార్ల (రామానుజుల) దివ్య తిరువడిని సేవించడం, తిరునారయణుని దర్శించడం,  ఇరువురు దేవేరులైన శ్రీ దేవి భూదేవుల నడుమనున్న సంపత్ కుమారుని (సెల్వ పిళ్ళై) ఆరాధించగలిగితే, దీని కంటే గొప్పది తపస్సు ఇంకే ముంది?)

వారు గౌరవాలు పొందుతూ సరైన సాంప్రదాయ రీతిగా క్రమంలో తిరునారాయణుని దివ్య పాదాలను తమ రక్షణగా ఉంచి వెళ్ళారు; వారు ఎమ్పెరుమానార్లని మొదట సేవించి వారి పురుషకారాంతో యదుగిరి నాచ్చియార్ (శ్రీమహాలక్ష్మి), సెల్వప్పిళ్ళై (ఉత్సవ మూర్తి) మరియు తిరుణారాయణుని (మూలవర్లు) సేవించుకొనెను. వారు తమ బస అక్కడ ఏర్పరచుకొనిరి. ఇరామానుశ నూఱ్ఱందాది 19వ పాశురంలో “ఉరుపేరుం శెల్వముం.. (తిరువాయ్మొళి మన జీవనాధారానికి నిధి….” ) వ్రాసిన విధంగా ఎమ్పెరుమానార్లకి సంతృప్తి కలిగించడానికి ఎమ్పెరుమానార్ల సన్నిధిలో నాలూరాచ్చాన్ పిళ్ళై నుండి ఈడు వ్యాక్యానాన్ని అభ్యసించడం ప్రారంభించారు. ఉపదేశ రత్నమాల పాశురము 49 “మెలోర్కిందార్…” (ఉత్తమ పురుషులకు అర్థాలను అనుగ్రహించెను) లో చెప్పబడినట్లుగానే నాలూరాచ్చన్ పిళ్లై కూడా మహా కృపతో వారికి పూర్తి అర్థాలను వివరించారు. నాలూరాచ్చన్ పిళ్లైల దివ్య తిరువడి యందు సాష్టాంగ నమస్కారం చేసి తిరుమలై ఆళ్వార్ ఆళ్వార్ల దివ్య ప్రబంధాల అర్థాలను వివరించమని కోరారు.  నాలూరాచ్చన్ పిళ్లై కూడా తిరుమలై ఆళ్వార్ల జ్ఞాన భక్తి వైరాగ్యాలకు మెచ్చి తమ తిరువారాధన పెరుమాళైన ఇనవాయర్ తలైవన్ (పశు కాపరి, అనగా శ్రీ కృష్ణుడు) ని తిరుమలై ఆళ్వార్లకి ప్రసాదించెను.

ఈ శ్లోకములో చెప్పినట్లుగా….

దేవాదిపాత్సమధిగమ్య సహస్రగీతేర్ భాష్యం నికూటమపియః ప్రదయాం చకార
కుంతీపురోత్వముం శరణం భజేహం శ్రీశైలనాథ గురుభక్తి పృతం శటారౌ

(దేవాదిపర్ అని పిలువబడే నాలూరాచ్చాన్ పిళ్ళై వద్ద తిరువాయ్మొళి పాశురాల నిగూఢ భాష్యమైన ఈడు ముప్పత్తారాయిరమును నేర్చిన ఆ తిరుమలై ఆళ్వార్ల యందు నేను శరణు వేడుతున్నాను; తర్వాత వారు ఆ భావార్థాలను ఎంతో ప్రసిద్ధికెక్కించెను. నమ్మాళ్వార్ల యందు ఎంతో భక్తి ప్రపత్తులతో ఉండేవారు. కుంతీనగరంలో జన్మించారు.) దేవ పెరుమాళ్ళచే అనుగ్రహింపబడిన తిరుమలై ఆళ్వార్లు, నమ్మాళ్వార్ల దివ్య తిరువడి యందు అంతులేని భక్తితో ఉండేవారు. శ్రీ రామాయణంలో “ఆజగామ ముహూర్తేన” (కొద్ది క్షణాల్లో) చెప్పినట్లుగానే, అతను నమ్మాళ్వార్ నివాసం ఉన్న తిరుక్కనంబికి చేరుకొనెను, ఆళ్వార్ల దివ్య పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆళ్వారుపైన తనకున్న అభిమానాన్ని పూరించడానికి ఆళ్వారుని తిరుక్కనంబి నుండి ఆళ్వార్తిరునగరికి తీసుకురావాలని నిర్ణయించుకొనెను. “నల్లార్ పలర్ వాళ్ కురుగూర్” (ఎందరో మహానుభావులు నివసించే కురుగుర్లో) అని చెప్పినట్లు దానికి అనుగుణంగా, వారు మొదట ఆళ్వార్ తిరునగరికి వెళ్లి, అక్కడ పెరిగి ఉన్న కలుపు మొక్కలన్నీ పెరకి, ఉండగలిగేలా సౌకర్యవంతమైన ప్రదేశంగా మార్చారు. ఆ తర్వాత వారు నమ్మాళ్వార్లను మూలస్థానంలో ప్రతిష్టింపజేశారు. ఇలా చెప్పబడింది..

శటకోపమునిం వందే శటానాం భుద్ది దూషణం
అజ్ఞానాం జ్ఞానజనకం తింద్రిణే మూల సంశ్రయం

(అజ్ఞానుల అజ్ఞానాన్ని తొలగించి, దివ్య జ్ఞానాన్ని(భగవత్ జ్ఞానము) పొందేలా చేసి కృపతో దివ్య చింత చెట్టులో నివాసమున్న శ్రీ శఠగోప ముని దివ్య తిరువడి యందు నేను నమనము చేస్తున్నాను). తమ ఈ లక్ష్యాన్ని పూర్తి అయిన పిదప వారు నమ్మాళ్వారుని చిత్త శుద్ధములై ఆరాధించడంతో, నమ్మాళ్వార్ స్వయంగా [అర్చక ముఖేన] శ్రీ శఠగోపదాసర్ (నమ్మాళ్వారుల దివ్య దాసుడు) అని బిరుదును ప్రసాదించెను. వీరు చాలా కాలం పాటు ఆళ్వార్ తిరునగరిలోనే ఉండి, తమ దినచర్యగా భావించి నమ్మాళ్వార్లకి అన్ని వేళలా అన్ని సేవలను నిర్వహించెను.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2021/08/04/yathindhra-pravana-prabhavam-20/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 19

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 18

తరువాత, కూరకులోత్తమ దాస నాయన్ తమ అంతిమ రోజుల్లో ఉన్నారని గ్రహించి, తిరుమలై ఆళ్వార్‌ ను పిలిచి, విళాంజోలై ప్పిళ్ళై వద్ద ముఖ్యమైన భావార్థాలను నేర్చుకోమని; తిరుక్కణ్ణంగుడి పిళ్ళై వద్ద తిరువాయ్మొళిని నేర్చుకోమని చెప్పి, తమ ఆచార్యులైన పిళ్ళై లోకాచార్యుల దివ్య చరణాలను స్మరిస్తూ తిరునాడు (శ్రీవైకుంఠం) కి చేరుకున్నారు. వారి చరమ సంస్కారాలు వారు తిరుకుమారులు సంపన్నము గావించెను. కూరకులోత్తమ దాసులు తిరునక్షత్రం తిరువాదిరై (ఆరుద్ర) ఐప్పశి (తులా) మాసం. వారి తనియన్

లోకాచార్య కృపా పాత్రం కౌండిన్య కులభూషణం
సమస్థాత్మ గుణావాసం వందే కూర కులోత్తమం
స్వయమాహూయ శైలేశ గురవేర్థప్రధానతః
లబ్దోధారపితం కూరకులోత్తమం అహం భజే

(పిళ్ళై లోకాచార్యుల దయకు పాత్రుడు, కౌండిన్య వంశానికి భూషణము వంటి వారు, సకల శుభ గుణాలకు నెలవైన కూరకులోత్తమ దాస నాయనార్ కు నా పాదాబి వందనాలు సమర్పిస్తున్నాను. తిరుమలై ఆళ్వార్ పై విషేశ  [రహస్యార్థముల] కృప కురిపించి, అందువల్ల ఉదారుడని ప్రఖ్యాతి గాంచిన కూరకులోత్తమ దాస నాయనార్లను నేను ఆరాధించెదను.)

ఆ తరువాత, తిరుమలై ఆళ్వార్ తిరుక్కణ్ణంగుడి పిళ్ళై ని ఆశ్రయించి, వారికి సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకొని, “తిరువాయ్మొళి అర్థాలను ఈ అడియేన్ కి కృపచేయ మని ప్రార్థిస్తున్నను” అని కోరారు. పిళ్లై అంగీకరించి, పద పదార్థాల ఆధారంగా తిరువాయ్మొళి అర్థాలను బోధించడం ప్రారంభించెను. తిరుమలై ఆళ్వార్ తమిళ భాషా నిపుణులు కాబట్టి, వారు భావార్థాలను వివరణాత్మకంగా చెప్పమని పిళ్లైని అభ్యర్థించారు. అప్పడికి పిళ్లై వృద్దులైనందున, అలా చేయలేక వారు తిరుమలై ఆళ్వార్ ను తిరుప్పుట్కుళి జీయర్ వద్ద అభ్యసించమని చెప్పెను. తిరుమలై ఆళ్వార్ కాంచీపురం చేరుకున్నారు. కానీ వారు చేరుకున్న ఆ రోజు జీయర్ మోక్షాన్ని పొందిన పన్నెండవ రోజు అని తెలుసుకున్నారు. వారు చాలా బాధపడ్డారు. వారు మంగళాశాసనాలు సమర్పించుకునేందుకు దేవరాజ పెరుమాళ్ ఆలయంలోని ఆచార్యులందరూ అలాగే ఆలయ ఉద్యోగులు అందరూ వారిని పెరుందేవి తాయర్ మరియు పేరారుళాళ పెరుమాళ్ళ వద్దకి తీరుకువెళ్లి తీర్థ శఠారి, పెరుమాళ్ళ దండ, దివ్య తుళసి వగైర వారికి అందించి, దర్శన ప్రవర్తకులిగా వారిని కీర్తించారు.

మర్నాడు నాలూర్ పిళ్లై వారి కుమారులైన నాలూరాచ్చాన్ పిళ్లైతో కలిసి తిరునరాయణపురం నుండి తిరిగి వచ్చి, పేరరుళాళ పెరుమాళ్ళకి మంగళాశాసనాలు సమర్పించుకునేందుకు ఆలయానికి విచ్చేసారు. ఆ సమయంలో సన్నిధి లోపల తిరుమలై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచుండెను. సన్నిధి లోపల తిరుమలై ఆళ్వార్ ఉన్నారని తెలియక, లోపల ఎవరు ఉన్నారని వారు బయట ఉన్న వారిని అడిగారు.  కోయిల్ తిరుమలై ఆళ్వార్ అని బయట ఉన్నవారు చెప్పారు. వారు దయతో “ఇది కోయిల్ తిరుమలై పెరుమాళ్ కోయిల్ కాదా?” అని అన్నారు. (శ్రీరంగం, తిరుమల కాంచీపురంలోని దివ్య ఆలయాలను కోయిల్, తిరుమలై మరియు పెరుమాళ్ కోయిల్ అని సంబోధించుట ఆచారం). అర్చాకులు శ్రీ శఠారిని అందరికీ అందిస్తుండగా, వెనుక వరుసలో ఉన్న నాలూర్ పిళ్లై, శ్రీ శఠారిని స్వీకరించడానికి అర్చాకుల వైపు తల వంచారు. శ్రీ శఠారి అందిస్తుండగా వారు తమ దివ్య హస్తాలతో శఠారిని ముట్టుకున్నారు. అర్చాకారులు హడావిడిగా ఆ శ్రీ శఠారిని సన్నిధి లోపలికి తీసుకొచ్చి, తిరుమలై ఆళ్వార్ల దివ్య చేతులను పట్టుకుని, నలూర్ పిళ్ళై వద్దకు తీసుకొచ్చి వారిని అప్పగించి, “అతనికి మూవాయిరం (3000 పాశురాలు, తిరువాయ్మొళి తప్పించి) బోధించమని మేము జ్యోతిష్కుడిలో ఆదేశించాము; అతను వచ్చాడు; తిరుప్పుట్కుళి జీయర్కి జరిగిన నష్టాన్ని సరిచేసేందుకు, మీరు వీరికి అది కూడా బోధించండి” అని ఎమ్పెరుమాన్ అర్చక మూఖేన తెలియజేశారు. “మహా అనుగ్రము, కానీ తిరుక్కణ్ణంగుడి పిళ్ళై చేయలేనిది, బోధించే సామర్థ్యము ఈ అడియేన్ కు గలదా?” అని అన్నారు. ఎంబెరుమాన్ “నాలూరాచ్చాన్ పిళ్ళై వారికి బోధించినట్లైతే, ఆత్మావై పుత్రనామాసి (పుత్రుడిగా జన్మించిన ఆత్మ) అని చెప్పినట్లు, అది మీరు అతనికి బోధించిన దానికి సమానమౌతుంది” అని అర్చక ముఖేన పలికారు. అది విని, నాలూర్ పిళ్ళై చాలా సంతోషించి, తిరుమలై ఆళ్వార్తో “స్వాగతం, ఆళ్వార్! అడియేన్ వృద్ధుడైనాడు; నీవు అనేక రంగాలలో నిపుణుడవు; అతను మాత్రమే (తమ తిరుకుమారుడైన నాలూరాచ్చన్ పిళ్ళైని చూపిస్తూ) నీకు బోధించగలడు” అని తెలుపెను. తిరుమలై ఆళ్వార్‌ ను తమ తిరుకుమారుడైన నాలూరాచ్చన్ పిళ్ళైకి అప్పగించి, వారు తిరునారాయణపురానికి బయలుదేరారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/03/yathindhra-pravana-prabhavam-19/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 18

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 17

తిరువాయ్మొళి పిళ్ళైల మహిమ 

పిళ్లై లోకాచార్యులు పరమపదం (శ్రీవైకుంఠం) చేరుకున్న తరువాత, లోకాచార్యుల ఆశ్రయములో ఉన్న తిరుమలై ఆళ్వార్ల (తిరువాయ్మొళి పిళ్ళై) తల్లిగారు, ఆ శోకం భరించలేక దివ్య పరమపదానికి తానూ చేరుకున్నది. తిరుమలై ఆళ్వార్ తమ పిన్ని దగ్గర ఉండ సాగెను. తిరుమలై ఆళ్వార్‌ లౌకిక జ్ఞానం బాగా ఎరిగినవారు, పైగా తమిళంలో కూడా బాగా ప్రావీణ్యం ఉన్నవారు. వారికి వైధిక జ్ఞానంతో పాటు లౌకిక ప్రావిణ్యము కూడా ఉన్నదని తెలుసుకున్న తర్వాత, పాండ్య రాజు వారిని తమ మంత్రిగా, పైగా రాజ పురోహితులిగా నియమించెను.

కూరకులోత్తమ దాసులు తిరువాయ్మొళి పిళ్ళైని సరి చేసి దర్శనములోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో, ఒకరోజు తిరువాయ్మొళి పిళ్ళై రాజ కార్యము కొరకై పల్లకీలో వెళుతుండగా, కూరకులోత్తమ దాసులు వారికి వినబడేంత దూరములో ఉండి తిరువిరుత్తం (నమ్మాళ్వార్ల మొదటి ప్రబంధం) లోని మొదటి పాశురాన్ని పఠించారు. తిరువాయ్మొళి పిళ్ళైకి దాని అర్థంపై ఆసక్తి కలిగి, ఆ విషయము గురించి నాయన్ (కూరకులోత్తమ దాసు) ని అడిగారు. నాయన్ ఆ భావార్థాన్ని వివరించనని ముఖం సూటిగా చెప్పెను. తిరువాయ్మొళి పిళ్ళైకి పిళ్లై లోకాచార్యుల విశేష అనుగ్రహం ఉన్నందున, నిరాకరించినందుకు నాయన్‌పై కోపం రాలేదు. తర్వాత ఇంటికి చేరుకోగానే తమ పిన్నికి జరిగిన విషయం చెప్పెను. బాల్యములో పిళ్లై లోకాచార్యల దివ్య తిరువడితో ఉన్న అనుబంధం గురించి ఆమె వారికి గుర్తు చేసింది. నాయన్ వారిని కలుసుకోవాలని, వారి దివ్య చరణాల యందు ఆశ్రయం పొందాలని ఆసక్తి వీరికి కలిగెను.

శింగప్పిరాన్ ను ఆ రోజుల్లో “తిరుమణత్తూణ్ నంబి” అని పిలిచేవారు. వారిపై ఉన్న అభిమానం కారణంగా, అనేక శ్రీవైష్ణవులు వారికి ఎన్నో మంచి మాటలు చెప్పేవారు; “ఎంతో మంది ఎన్నో రకాల మంచి మాటలు చెబుతున్నారు. నేను ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నాను. మంచి స్పష్టత ఉన్నవారెవరైనా విశదీకరించి వివరిస్తే బావుంటుంది అని నేను అభ్యర్థిస్తున్నాను” అని వారు కోరెను. అప్పుడు వారు చాలా వాగ్ధాటిగా పేరుగాంచిన తిరుమలై ఆళ్వార్‌ ని విశదీకరించమని కోరెను. తిరుమణత్తూణ్ నంబిని వారి మాటలు ఎంతో ఆకట్టుకున్నాయి. వారిని సంప్రదాయ ప్రవర్తకులుగా చేయాలని అశించెను. వారు కూరకులోత్తమ దాసులను (అప్పటికి వారు శ్రీరంగానికి చేరుకున్నారు) కలుసుకుని తన కోరికను తెలియజేశారు. కూరకులోత్తమ దాసులు తిరుమలై ఆళ్వార్‌ ని దర్శనములోకి తీసుకువస్తానని చెప్పి మధురకి  బయలుదేరారు. ఒకరోజు తిరువాయ్మొళి పిళ్ళై ఏనుగుపైన వెళుతుండగా దాసులు గమనించి, పిళ్ళైకి కనిపించేలా ఒక కొండపైకి ఎక్కారు. తిరువాయ్మొళి పిళ్ళై వారిని చూడగానే, తమ ఆచార్యులు పిళ్లై లోకాచార్యులుగా ఊహించి, ఏనుగుపై నుండి క్రిందకి దిగి, నాయన్ ముందు సాష్టాంగము చేశారు. నాయన్ వారికి తమ చేతుల్లోకి తీసుకుని ఆపై ఆలింగనముచేసుకొని వారిని ప్రశంసించారు. తిరువాయ్మొళి పిళ్ళై అప్పుడు వారికి స్వాగతాలు పలుకుతూ తమ ఇంటికి తీసుకువెళ్లి సత్కరించి సత్ విషయాలు చెప్పమని ప్రార్థించారు. పిళ్లై లోకాచార్యుల కడా దినాలను నాయన్ వారికి వివరించారు. తిరుమలై ఆళ్వార్ దాస నాయనార్ ను అక్కడే ఉండమని ప్రార్థించి, మర్నాడు ఉదయాన వారు ఊర్ధ్వ పుండ్రాలను ధరించేటప్పుడు రావలసిందిగా కోరారు. నాయన్ వారి సౌకర్యవంతమైన బస కోసం మఠం కుడా ఏర్పాటు చేశారు.

ప్రతిరోజూ ప్రాతః కాలమున, కూరకులోత్తమ దాసులు తిరుమలై ఆళ్వార్‌ దగ్గరకు వెళ్లి, పిళ్లై లోకాచార్యులు రచించిన రహస్యార్థాలను వారికి బోధించేవారు. ఆళ్వార్ వీటిని ఎంతో గౌరవంగా నేర్చుకునేవారు. ఒకరోజు, రాజరిక బాధ్యతలలో మునిగి ఉండటం కారణంగా, నాయన్ రహస్యార్థాల వివరిస్తుండగా, వినకుండా అంతగా పట్టించుకోలేదు. మరుసటి రోజు నాయన్ రాలేదు. ఆ మరుసటి రోజు కూడా నాయన్ రాకపోవడంతో, ఎందుకు రాలేదో తెలుసుకోమని తిరుమలై ఆళ్వార్ తన కాపలాదారులను పంపారు. కాపలాదారులు తిరిగి వచ్చి, కూరకులోత్తమ దాసులు ఏమీ మాట్లాడలేదని చెప్పారు. తిరుమలై ఆళ్వార్ నాయనుని తిరుమాలిగైకి వెళ్లి చాలా సేపు సాష్టాంగ నమస్కారం చేసారు. అప్పుడు నాయన్ వారిని క్షమించారని చెప్పి, తమ తిరుమాళిగలో (ఇతర శిష్యులకు) ఉపన్యాసం ముగుస్తున్నందున, తిరుమలై ఆళ్వార్‌ ప్రసాదము తీసుకొని వెళ్ళమని చెబుతారు. తిరుమలై ఆళ్వార్ ప్రసాదం తీసుకున్న వెంటనే, పరమవిరక్తులుగా పరివర్తనము చెంది,  “కూరకులోత్తమ దాస నాయన్ తిరువడిగళే శరణం” అని పదే పదే జపం చేయ సాగెను. వారు తమ రాజ కార్యాలకి తిరిగి వచ్చిన తర్వాత కూడా, ఈ జపం చేస్తూనే ఉండెను. తిరుమలై ఆళ్వార్‌ వింతగా ప్రవర్తిస్తున్నారని అక్కడి అధికారులు వెళ్లి రాణికి సమాచారం అందించారు. ఆమె తిరుమలై ఆళ్వార్‌ ను రమ్మని కబురు పంపింది. ఆమె తిరుమలై ఆళ్వార్‌ కు స్వాగతం పలికినప్పుడు, తిరిగి సమాధానము ఇవ్వాకుండా, “కూరకులోత్తమ దాస నాయన్ తిరువడిగళే శరణం” అని బదులు చెప్పెను. అప్పుడు ఆమె, “పిల్లలు యుక్తవయస్సు వచ్చి రాజ్య వ్యవహారాలను వారి స్వంతంగా నిర్వహించగలిగే వరకు మేము, పిల్లలు, నేను మీపై ఆధారపడి ఉన్నాము” అని బాధతో చెప్పింది. తిరుమలై ఆళ్వార్‌ ఆమెను ఓదార్చుతూ, “బాధపడకుము. మీ కుమారుడు ఇప్పుడు పెద్దవాడైయ్యాడు, తగిన సామర్థ్యము ఉన్నవాడు. నేను నాయన్ యొక్క దివ్య తిరువడిని సేవించాలి. నన్ను అడ్డుకోవద్దు. నేను రాజరిక వ్యవహారాలను గమనిస్తూనే ఉంటాను, అవసరమైనప్పుడు యువరాజునికి సలహాలిస్తాను” అని చెప్పెను. వారు కొంతకాలం అక్కడే ఉండి, కురాకులోత్తమ దాసుల నుండి నేర్చుకుంటూ, రాజ్య వ్యవహారాలలో కూడా సహాయం అందిస్తూ ఉండెను. ఆ తరువాత వారు తిరుప్పుళ్లాని దివ్య దేశము సమీప ప్రాంతంలో సిక్కిలికి (ప్రస్తుతం సిక్కిల్ కిడారం అని పిలుస్తారు) చేరుకున్నారు. అక్కడ కురాకులోత్తమ దాసులు గురుకుల వాసము చేయుటకు కుటీరాన్ని ఏర్పరచుకొని ఉండసాగారు. పిళ్ళై లోకాచార్యుల నుండి తాను నేర్చుకున్న రహస్యాలన్నింటినీ కురాకులోత్తమ దాసులు వారికి బోధించారు కాబట్టి, దాస నాయన్‌ ను కురాకులోత్తమదాసం ఉదారం (కురాకులోత్తమ దాసుల గొప్పతనం) అని పేర్కొన బడ్డారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2021/08/02/yathindhra-pravana-prabhavam-18/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org