అంతిమోపాయ నిష్ఠ – 6

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/09/21/anthimopaya-nishtai-5/ ) మనము భట్టరు, నంజీయర్ మరియు నంపిళ్ళై ల యొక్క దివ్య లీలలను గమనించాము. ఈ వ్యాసములో మన పూర్వాచార్యుల గురించిన మరిన్ని సంఘటనలను తెలుసుకొందాము.

ఒక ఉత్సవము గురించి తిరుకోష్ఠియూర్ నంబి శ్రీ రంగమునకు వచ్చి, ఉత్సవమంతా అచ్చటనే ఉండి ఎంపెరుమానార్, నంబి సేవలో వున్నారు. నంబి తిరిగి వెడలుచున్నప్పుడు, ఎంపెరుమానార్ వారితో “దయతో నాకు కొన్ని మంచి ఆదేశాలు కృప చేయుము, వానిని శరణు చేయుదును” అని వేడుకొనిరి. నంబి కొంత సమయము కన్నులు మూసికొని, తరువాత “మేము ఆళవందార్ వద్ద శిక్షణ పొందుతున్నాము. ఆ సమయములో, వారు నదీ స్నానము చేయుచు, శిరస్సును క్రిందకు నీటిలో ముంచి వుండగా, వారి శరీరపు వెనుక భాగము మెరయుచున్న అందమైన రాగి పాత్ర వలె కనిపించును. అట్టి దివ్య అనుభూతిని శరణు చేసెదము. ఆ విధముగానే మీరు శరణాగతి పొందవచ్చును” అని పలికిరి. ఈ సంఘటన బహు ప్రాచుర్యము పొందినది.
(అనువాదకుని గమనిక: ఈ సంఘటనే గురుపరంపర ప్రాభవము లోని 6000 పడిలో వివరించారు. ఈ సంఘటన ద్వారా శిష్యుని దృష్టి ఆచార్యుని దివ్య స్వరూపముపై నిలుపవలెనని తెలియుచున్నది).
తిరుకోష్టియూర్ కోవెల ప్రధాన గోపురము పైఅంతస్తున నంబి వుంటూ, ఆళవందార్ ను ప్రార్ధిస్తూ, సదా “యామునైతువర్” (యామూనాచార్యులు) అను మంత్రాన్ని వల్లిస్తూ ఉంటారని చెబుతూ వుంటారు.

మన జీయర్ ఈ క్రింది సంఘటనను వివరిస్తున్నారు.

ఉడయవర్లు ఒకసారి, ఒక మూగ వానిని అపారమైన కరుణచే కటాక్షించుటకై, తన గదికి గొనిపోయి, తన దివ్య రూపము మరియు పాద పద్మములే ఆ మూగ వానికి శరణు అని సైగల ద్వారా చూపారు. ఆ మూగ వాడు పారవశ్యముతో, ఉడయవర్ల పాదముల ముందు మ్రోకరిల్లాడు. ఆ మూగవాని శిరస్సుపై ఉడయవర్లు తమ పాదములను నుంచి దీవించిరి. ఇది గమనించిన కూరత్తాళ్వాన్, “ఓహ్, నేను కూడా మూగవానిగా జన్మించిన, నాకు కూడా ఇట్లే మార్గ దర్శనము చూపించేవారు కదా (ఇది ఎంపెరుమానార్ల దివ్య స్వరూపమును శరణాగతి చేయుటయే). కాని నేను ఆళ్వాన్ గా జన్మించి శాస్త్రములను అభ్యసించాను. అందువల్ల, ఉడయవర్లు నాకు ప్రపత్తి మార్గమును అనుగ్రహించారు. కావున నేను ఎంపెరుమానార్ల దివ్య స్వరూపమును ఆశ్రయించుటకు అనర్హుడనయ్యాను.” అని తలంచి, తనపై తానే కలతనొందిరి.

ఒకసారి నమ్మాళ్వార్లకు మంగళశాసనము చేయ తలంచి ఉడయవర్లు, ఆళ్వార్ తిరునగరికి పయనమైరి. మార్గములో వారు తిరుపుళ్లింగుడి అనే దివ్యదేశము చేరిరి. అచ్చట వీధిలో కనబడిన ఒక చిన్నారి బ్రాహ్మణ బాలికతో, “ఓ చిన్నారి, ఇచ్చట నుండి ఆళ్వార్ తిరునగరి ఎంత దూరము?” అని అడుగగా, ఆ బాలిక “ఓ జ్ఞానమూర్తి! మీరు తిరువాయ్మొళిని అభ్యసించలేదా?” అని సమాధానమిచ్చెను. ఉడయవర్లు ఆశ్చర్యచకితుడై, “తిరువాయ్మొళిని అభ్యసించుటకు, ఇచ్చట నుండి ఆళ్వార్ తిరునగరికి దూరము తెలిసికొనుటకు ఏమిటి సంబంధము? ” అని అడిగిరి. దానికి ఆ బాలిక ఈ విధముగా సమాధానమిడెను, “ఆళ్వార్ అనుచున్నారు – “తిరుప్పుళిన్గుడియాయ్! వడివిణైయిల్లా మలర్మగళ్ మఱ్ఱై నిలమగళ్ పిడిక్కుమ్ మెల్లడియై క్కొడువినైయేనుమ్ పిడిక్క నీ ఒరునాళ్ కూవుతల్ వరుతల్ చెయ్యాయే (తిరువాయ్మొళి 9.2.10)” – “ఆళ్వార్, తిరుపళ్లింగుడిలో ఉన్న పరమాత్మతో నన్ను నీవేల పిలుచుట లేదు, లేదా నా వద్దకు వచ్చుట లేదు, నేను నీ సుకుమారమైన పాదపద్మములను ఆశ్రయించవలెను. కాని వానిని ఇప్పటికే మిక్కిలి సుందరీమణులైన శ్రీదేవి మరియు భూదేవి నాచియార్లు ఆశ్రయించి వున్నారు కదా! – దీని వలన నీకు అర్ధము కాలేదా, ఆ దూరము చాలా స్వల్పము అని. (ఎలనన, అచ్చటి నుండి ఎంపెరుమాన్ పలికిన, ఆళ్వార్ తిరునగరి లోనున్న ఆళ్వార్ కు వినిపించెను కదా!)”.
ఇది విన్న ఉడయవర్లు పరమానందము చెంది, ఆ బాలిక తెలివితేటలకు మరియు ఆమెకు ఆళ్వార్ పలుకులపై వున్న విశ్వాసమునకు మిక్కిలి సంతోషించిరి. తనతో వంటకు తెచ్చిన మట్టి పాత్రలను పగుల గొట్టి, ఆ బాలిక నివాసమును తెలిసికొనిరి. ఆ బాలిక ఉడయవర్లను తన గృహమునకు తీసికొని వెళ్లగా, వారు ఆ బాలికను, ఆమె తల్లి తండ్రులను మరియు వారి బంధువులను తమ శిష్యులుగాగైకొనిరి. ఎంపెరుమాన్ కు విందు భోజనము (ప్రసాదం) చేయుమని వారిని ఆదేశించిరి. ఆ ప్రసాదమును తాము స్వీకరించిరి. తదుపరి అచ్చటి నుంచి బయలుదేరి, ఉడయవర్లు ఆళ్వార్ తిరునగరి చేరిరి. ఆనాటి నుంచి, ఆ బాలిక ఆమె బంధువర్గము ఉడయవర్లను తమ ఆరాధ్య దైవముగా భావించి, అద్భుతమైన జీవనము సాగించిరి, అని మన పెద్దలు వివరించిరి.

పై సంఘటనల ద్వారా, పిల్లలు, మూగ వారు, నిస్సహాయులు మొ || వారు శాస్త్రమును అభ్యసించుటకు అర్హత లేకపోయినను, నిజమైన ఆచార్యుని సంపర్కము చేత అంతిమ లక్ష్యమును పొందగలరని తెలియుచున్నది. ఆచార్యుని నిర్హేతుకమైన కృపచే, ఆ బాలిక, మూగవాడు ఉడయవర్ల యొక్క అద్భుతమైన దీవెనలు అందుకున్నారని మనము చూసాము.

ఈ క్రింది రెండు సంఘటనలు (మిగతా వానితో పాటు) పెరియాళ్వార్ తిరుమొళి 4.4.1 నవకారియం పాశుర వ్యాఖ్యానములో మామునిగల్ గుర్తించిరి. (అనువాదకుని గమనిక: ఈ రెండు సంఘటనలు ఆచార్యునిపై సంపూర్ణ నమ్మకము యొక్క ప్రాముఖ్యతను మరియు భగవానుని మాత్రమే కీర్తిస్తూ, ఆచార్యుని సమునిగా గాని అధికునిగా గాని చూడని వ్యక్తుల సాంగత్యమును వీడుటను తెలియజేయుచున్నవి.)

  • ఒకసారి తిరుక్కురుగైప్పిరాన్ పిళ్లాన్ కొంగు ప్రాంతమునకు (కోయంబత్తూరు, మొ ||) ప్రయాణిస్తున్నారు. అచ్చట ఒక శ్రీవైష్ణవుని నివాసమును చేరి, తళిగ ప్రసాదమును తామే చేయవలెనని భావించారు. ఆ గృహములో అందరూ భగవానుని నామ సంకీర్తనను చేయుచున్నారని (ఆచార్యుని తలంపకనే) అని గమనించారు. అది వారికి నచ్చలేదు, కావున ఆ గృహమును వీడినారు.
  • ఒకసారి, ఎంపెరుమానార్ సభకు ఒక వైష్ణవుడు వచ్చి, తిరుమంత్రమును పఠించెను. ముందుగా గురుపరంపర పఠించకనే తిరుమంత్ర అనుసంధానము చేయుట గమనించిన వడుగనంబి, ఇట్టి అనుసంధానము నాలుకకు అయోగ్యము అని ప్రకటించి, అచ్చటి నుంచి నిష్క్రమించారు. (అనువాదకుని గమనిక : సత్ శిష్యుడు సదా గురు పరంపర పఠించ వలెనని శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రములో పిళ్ళై లోకాచార్యులు ప్రకటించారు).

బాగా తెలిసిన వార్తామలై ప్రకారము, తిరుమలై ఆండాన్ అనిరి “నేను భగవద్విషయము బోధించవలెనని తలంచినను, ఈ భౌతిక విషయవాంఛల జగత్తులో అనేకులు దానిని వినరు మరియు నేర్చుకొనరు. మనము ఒక అరెక గింజ (వక్క) ను నాటి, కొంత ఎరువు వేసి మొలకెత్తు వరకు చూసి అచ్చటనే ఒక గుడిసె వేసుకొని, అది పెరుగుటను అనేక సంవత్సరములు చూడగా, చివరగా కొన్ని గింజలు మాత్రమే చూచెదము. ఇంత శ్రమ పడినను స్వల్ప ఫలితమే మనకు దక్కును. కాని భగవద్విషయము వలన ఈ బాధా పూరితమైన భౌతిక ప్రపంచము నుండి ముక్తి కలిగి, అతి పావనమైన పరమపదము లభించును. అయితే దీనికి అవసరమైనది, ఆచార్యునిపై ఎంతో కొంత కృతఙ్ఞత. ఆయనే ఈ భౌతిక జగత్తు నుంచి ముక్తి కలిగించగలరు అనే భావన. ఈ చిన్న విషయము కూడా చేయని వారికి నేను భగవద్విషయమునెలా బోధించగలను” అని విచారములో మునిగినారు. వారు ఇలా అనుచున్నారు “గోగ్నే చైవ సురాపే చ చోరే భగ్నవ్రతే తతా; నిష్కృతిర్ విహితా సద్భిః క్రుతఘ్నే నాస్తి నిష్కృతిః” (అనువాదకుని గమనిక: ఈ శ్లోకము అతి హేయమైన గోహత్య, సురాపానము, చౌర్యము, మొ || ప్రాయశ్చిత్తములు లేని పాపములను వరుసగా తెలియజేయుచున్నది. ఇట్టి పాపములను చేసిన కృతఙ్నులు కూడా పుణ్య కాలములో చేయు కొన్ని భక్తి పూర్వక చర్యల ద్వారా పాపరహితులు కాగలరు. కృతఙ్ఘునులు చేయు గోహత్య, చౌర్యము మొదలగు చర్యలు ఎంత హేయమో, లౌకిక వాసనల నుండి జీవాత్మను ఆధ్యాత్మికత వైపు మరలించే ఆచార్యునిపై కృతజ్ఞత లేక పోవుట గురించి ఏమి చెప్పగలము – బహుశా ఈ పాపమునకు ప్రాయశ్చిత్తము ఉండదు.

ఒక పాత్రలో ఇసుక కలిపిన నీటిని తీసుకొని, దానిని శుద్ధి చేయుటకు తేత్తం అనే విత్తును వేయగా, ఇసుక పాత్ర అడుగుకు చేరి శుభ్రమైన నీరు పైకి ఎట్లు తేలునో, అదే విధముగా, ఆచార్యుని కృపచే మనలోని (పాత్ర) అజ్ఞానము (ఇసుక) తొలగించుటకై , జీవాత్మ (శుద్ధ జలము)ను తిరుమంత్రము (విత్తు) ద్వారా శుద్ధి చేయుటచే, అజ్ఞానము నశించి, జ్ఞానము ప్రకాశించును. కాని ఆ పాత్రలోని శుద్ధ జలమును వేరొక పాత్రకు మార్చునంత వరకు, ఆ జలమును స్పృశించిన, తిరిగి ఇసుక ఆ నీటిని కలిసి ఎలా కలుషితము చేయునో, అటులనే జీవాత్మ కూడా పరమపదములో మరియొక శుద్ధ శరీరము పొందు వరకు అయోమయములో వుండును. ఇట్టి అయోమయము తొలగుటకై, శిష్యుడు ఆచార్యుల మరియు ఆచార్యులకు సమమైన ఇతర శ్రీవైష్ణవులకు చేరువలో వుండుట అవసరము. మన పూర్వాచార్యులు ఈ నియమమునే వివరించారు.

ఆళవందార్లు తిరువనంతపురమునకు పయనమవుతూ, తన ప్రియ శిష్యుడైన దైవవారి ఆండన్ తో ఎంపెరుమాన్ కు పూమాలల కైంకర్యము చేయవలెనని మరియు శ్రీరంగములోని మఠమును పర్యవేక్షించవలెనని ఆదేశించారు. ఆండన్ మిక్కిలి చింతతో వుంటూ, తీర్థ ప్రసాదములను కూడా నిరాకరించి రోజు రోజుకూ చిక్కి శల్యమవుతున్నారు. “మీరు ఎందుకు ఇలా అవుతున్నారు” అని పెరుమాళ్ అడుగగా, దానికి ఆండన్ “నాకు దేవరవారి కైంకర్య సేవ చేసే భాగ్యము లభించినను, నా ఆచార్యుని వీడి ఉండలేకపోవుచున్నానని, అందులకే నా శరీరము చిక్కి పోవుచున్నది” అని సమాధానమిడిరి. “అయినచో, మీరు ఆళవందార్ వద్దకు వెళ్ళుము” అని పెరుమాళ్ పలికిరి. ఆండన్ ఆనందముగా పయనమై, ఆళవందార్లను (తిరువనంతపురము నుంచి తిరిగి వస్తుండగా), తిరువనంతపురము సమీపములో ఒక నది ఒడ్డున కలిసిరి. అచ్చట తమ ఆచార్యుని చూసి, పరమానందము చెంది, ఆరోగ్యమును కూడా పొందిరి. ఆ సమయములో ఆళవందార్ ఆండాన్ తో ” మీరు తిరువంతపురము దగ్గరలోని ఉద్యానవనములను చూడుము. అచ్చటికి శ్రీవైష్ణవులతో కలిసి వెళ్లుము మరియు అనంతశయన పెరుమాళ్ ను ఆరాధించుము” అని పలికిరి. దానికి ఆండాన్ “అది మీ తిరువంతపురము. నేను నా తిరువనంతపురమును ఇప్పటికే చేరాను” అనిరి. (అనువాదకుని గమనిక: ఎంపెరుమాన్ ఆచార్యుని దివ్య రూపములోనే ఉండుటచే, అదే శిష్యునికి ఒక దివ్య దేశము). ఆళవందార్ “ఎంత గొప్ప నమ్మకము. ఇటువంటి నమ్మకస్తుడైన శిష్యుడు లభించుట దుర్లభము” అనిరి మరియు ఆండన్ ను చూసి పరమానంద భరితుడైరి.

పిన్భళగియ పెరుమాళ్ జీయర్ అనారోగ్యముతో వున్నప్పుడు, ఇతర శ్రీవైష్ణవులతో “ఎంపెరుమాన్ ను ప్రార్ధించి, నాకు ఇప్పుడే పరమపదము వలదని, నేను ఇంకా కొంత కాలము శ్రీరంగము లోనే నివసించునటుల కోరవలసినదని మరియు వారితో ఆళియెళ (తిరువాయి మొళి 7.4), ఏళై ఏతలన్ (పెరియ తిరుమొళి 5.8) పాశురములను పారాయణము చేయుచూ, పై విన్నపమును చేయుము” అనిరి. (అనువాదకుని గమనిక: శ్రీవైష్ణవ సంప్రదాయము ప్రకారము ఇది సరికాదు. ఏలనన, ఎంపెరుమాన్ ను కోరికతో ప్రార్ధించరాదు, అనారోగ్యము నుంచి బాగు పడుటకైనను). ఆ వైష్ణవులు ఆ ప్రకారముగానే చేయగా, వారు అనారోగ్యము నుంచి కోలుకొని, స్వస్థులైనారు. ఇది గమనించిన నంపిళ్ళై శిష్యులు, “వారు చాలా జ్ఞానులు మరియు పెద్దలు కదా, అయినను ఎంపెరుమాన్ ను ఈ విధముగా ఆరోగ్యమును కావలెనని కోరుట, వారి స్వరూపమునకు సమంజసమేనా” అని అడిగిరి. నంపిళ్ళై “వారి ఆలోచనలు ఏమిటో మనకు తెలియవు కదా? అయినను, పిళ్ళై ఎంగల్ ఆళ్వాన్ ను కలిసి అడుగుము” అని తెలిపిరి. వారిని అడుగగా, ఆళ్వాన్ “వారు శ్రీరంగములోని అద్భుతమైన కైంకర్యములపై అమిత బాంధవ్యము కలిగి మరి కొంత కాలము అచ్చటనే నివసించు కోరికతో ఉండి ఉండవచ్చు” అనుచు, ” ప్రతి ఒక్కరూ తమ కర్మ పూర్తి అగు వరకు ఈ సంసారమున ఉండక తప్పదు” అనిరి. తదుపరి, నంపిళ్ళై తమ శిష్యులను తిరునారాయణ పురత్తు అరయర్ ను కలిసి అడుగ మనిరి. అరయర్ “వారికి ఏమైనను ఇంకను చేయవలసిన కార్యములు వున్నవేమో, వానిని పూర్తి చేయుటకై, తమ జీవిత కాలమును పొడిగించు ప్రార్ధన చేసి ఉండ వచ్చు” అనిరి. మరల, నంపిళ్ళై తమ శిష్యులను అమ్మంగి పెరియ ముదలియార్ ను కలువమనిరి. వారు “నంపిళ్ళై కాలక్షేప గోష్టిని ఎవరూ వదలు కొనవలెనని భావించరు. వారి కాలక్షేప గోష్టిని పూర్తిగా వినవలెనని వారు ఈ విధముగా ప్రార్ధన చేసియుండవచ్చ ” అనిరి.
నంపిళ్ళై తమ శిష్యులను అమ్మంగి పెరియ ముదలియార్ వద్దకు వెళ్లి అడుగమనిరి. వారిని అడుగగా, “పరమపదములో నంపెరుమాళ్ యొక్క దివ్య స్వరూపము కానరానిచో, అచ్చటనే ఒక కంత చేసి, శ్రీరంగమునకు తిరిగి దూకివేయగలను అని భట్టరు అనిరి. అదే విధముగా, వారు నంపెరుమాళ్ పై అమిత ప్రేమచే, ఈ ప్రదేశమును వీడుటకు ఇచ్ఛ పడుటలేదేమో! ” అనిరి. ఈ అభిప్రాయములన్నియు విన్న పిదప, నంపిళ్ళై, చివరగా ఇళ్యార్ ను “ఇవన్నియు మీ యొక్క ఆలోచనలతో సరిపడునవిగా ఉన్నాయా” అని అడిగిరి. జీయర్ “ఇవి ఏవియును నా ఆలోచనలకు సరిలేవు” అనిరి. నంపిళ్ళై మీ మనస్సులో ఏమున్నదో తెలుపమనిరి. ఇళ్యార్, “మీకు అంతయును తెలియును. కాని, నాపై దయతో నాకు మీరు ఈ అవకాశమును అనుగ్రహించినారు. నేను ఇచ్చటనే నివసించ వలెనని భావించుటకు కారణమును తెలిపెదను. మీరు ప్రతి రోజు స్నానము అనంతరము, నూతన వస్త్రములను ధరించి, ఇచ్చట నడయాడు నప్పుడు, మీ దివ్య తిరుమేనిపై ఏర్పడు చిన్న స్వేద బిందువుల నుండి ఉపశమునకై, నేను వింజామరతో వీచేదను కదా! మీ యొక్క అట్టి దివ్య స్వరూపమును మరియు అట్టి సేవను నేను ఎటుల వదులుకొని పరమపదమునకు వెళ్లెదను?” అనిరి. నంపిళ్ళై, వారి శిష్యులు ఇట్టి పరమానందమైన దివ్య అనుభూతిని గాంచి, వారి అంకిత భావమునకు అచ్చెరువొందిరి. మన జీయర్ (మాముణులు) కూడా వారి అంకిత భావమునకు మిగుల ఆనందభరితులై, తమ మనస్సున కూడా ఇట్టి అంకిత భావమును పెంపొందించు కొనవలెనని ఉపదేశరత్తిన మాలై లోని 66 వ పాశురము నందు ఈ క్రింది విధముగా ఆదేశించిరి.

పిన్బऽళగరామ్ పెరుమాళ్ జీయర్
పెరున్తివత్తిల్ అన్బదువుమఱ్ఱు
మిక్క ఆసైయినాల్ నమ్పిళ్ళైక్కాన అడిమైగళ్ సెయ్
అన్నిలైయై నన్నెన్జే! ఊనమఱ ఎప్పొళుదుమ్ ఓర్

సాధారణ అనువాదము: పిన్భళగరామ్ పెరుమాళ్ జీయర్, పరమపదముపై ఆసక్తి చూపక, శ్రీరంగములోనే నంపిళ్ళై దివ్య స్వరూపమును సేవించ వలెనని అమిత ప్రేమతో నివసించిరి. ఓ, ప్రియ మనసా! ఎల్లపుడు అట్టి అంకిత భావమునే కలిగి వుండుము.

ఒకసారి పెరియనంబి, తిరుక్కోష్ఠిర్ నంబి మరియు తిరుమలై ఆండాన్ శ్రీరంగములోని చంద్ర పుష్కరిణి ఒడ్డున వున్న పొన్న చెట్టు వద్ద కలిశారు. వారి ఆచార్యుల (ఆళవందార్) మధుర జ్ఞాపకాలు స్ఫురణకు తెచ్చుకొని, వారి అద్భుత ఆదేశాలను గురించి చర్చించు కొనుచూ అనుభవిస్తున్నారు. ఆ సమయములో సెల్వర్ (అనువాదకుని గమనిక: సెల్వర్ అనగా పరివార దేవతలకు ప్రసాదమును పంచు పద్ధతిని గమనించే ఎంపెరుమాన్ రూపము (విగ్రహము)) యొక్క ఊరేగింపు ప్రారంభమై, కైంకర్య పరులతో కూడి శ్రీబలి (ప్రసాదమును) వద్దకు వెంచేసినారు. అపుడు వారు చర్చను ఆపి వేసి ఎంపెరుమాన్ ముందు ప్రణమిల్లి, నిలుచొని, “ఇదుగో గుంపును ఆకర్షించు వారు వచ్చినారు: నేటి నుంచి మనము ఎచటనైతే సెల్వర్ ప్రసాదము పంచే తమ కైంకర్య పరులతో వేంచేపుచేస్తారో, అచ్చటకు మనము వెళ్ళరాదు అని ప్రతిజ్ఞ చేసెదము” అనిరి. (అనువాదకుని గమనిక: అప్పటి నుంచి, వారి ప్రతిజ్ఞను నెరవేర్చుటకై, ఎంపెరుమాన్ కూడా శ్రీరంగములోని తమ శిష్యుల దివ్యమైన చర్చలకు అవరోధము కలుగరాదని, తమ కైంకర్య పరులతో కలిసి వూరేగింపుగా రాకూడదని ప్రతినబూనినారు. నేటికి అదే పద్ధతి అచ్చట కొనసాగు చున్నది).

నంజీయర్ (భట్టరుచే సంస్కరింపబడిన వేదాంతి) ను అనంతాళ్వాన్ కలిసినప్పుడు, వారు సన్యాసమును స్వీకరించి శ్రీరంగమునకు చేరు ఆలోచనలో నుండగా, వారితో “మీరు సన్యాసాశ్రమమును స్వీకరించినందుచే, మీరు మీ ఆచార్యునకు చేయు కైంకర్యములకు అవరోధము కలుగును కదా! మీకు స్వేద కలిగినప్పుడు స్నానము చేయుట, ఆకలి కలిగినప్పుడు ఆహారము స్వీకరించుట మరియు ఎల్లప్పుడూ భట్టరు గారి పాద పద్మములనే ఆశ్రయించుట చేయునప్పుడు వారు పరమ పదము నుంచి త్రోసి వేయుదురా? మీరు ఇప్పుడు భట్టరు సేవ చేయకయే, ఒక మూల ఉండవలెను.”

తొండనూరు నంబి యొక్క ఒక శిష్యుడు, పూర్వమున శైవుడు, ఒకసారి తిరుమలకు వచ్చి, అనంతాళ్వాన్ ను కలిసిరి. అనంతాళ్వాన్ తిరు వేంకటేశ్వరునికై తన తోటలో నున్న పూలు కోయుచు మరియు విత్తనములు నాటుచు ఉండుటను గమనించిరి. వారితో “ఓ, అనంతాళ్వాన్! అనేకులైన నిత్యసూరులు ఎంపెరుమాన్ సేవకై ఈ తిరుమలపైన పుష్ప రూపులై వున్నారు. మీరు వారిని అనవసరముగా నలిపి వేయుచున్నారు. మా ఆచార్యులైన తొండనూరు నంబి నివాసములో నాకు వారి ఇంటి వెనుక భాగమున శ్రీవైష్ణవులు స్వీకరించు ప్రసాద కైంకర్యమునకై అరటి ఆకులను శుభ్రముగా మరియు సరిగా వుంచు కైంకర్యమును ఒసగిరి. నేను చేయు ఈ కైంకర్యములో మీకును కొంత భాగమును ఇచ్చెదను. ఈ విధముగా భాగవత కైంకర్యములో పాలుపంచు కొనుట వలన మన జీవితమును పెయిలుం చుడరోళి (తిరువాయ్మొళి 3.7) మరియు నెడుమార్కడిమై (తిరువాయ్మొళి 8.10) లో తెలిపిన విధముగా కొనసాగించ వచ్చును.
(అనువాదకుని గమనిక : ఈ రెండు పదిగాలు కూడా భాగవతులకు విధేయులుగా ఉండుటకు ప్రాధాన్యమును చూపుచున్నవి). మీరు ఇట్టి దివ్య పుష్పములు కలిగిన వృక్షములను నాశనము చేయుట వీడలేరా?” అనిరి. తదుపరి ఆ శ్రీవైష్ణవుడు అనారోగ్యముపాలై, అనంతాళ్వాన్ ఒడిపై శిరము నుంచి ఒదిగిరి. అనంతాళ్వాన్ “మీరు ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నారు?” అని అడిగిరి. ఆ శ్రీవైష్ణవుడు “తొండనూర్ నంబి నన్ను స్వీకరించి, నా పూర్వపు చెడు సహవాసములను విస్మరించి, నన్ను సంస్కరించిరి. నేను వారి నివాసములోని వెనుక భాగములో కైంకర్యము చేయుచు, ధ్యానములో ఉందును.” మరియు వెంటనే పరమపదము నొసగిరి. ఈ సంఘటన యొక్క ప్రాధాన్యత ఏమనగా, ఆ శ్రీవైష్ణవుడు తిరువేంగడ ముడియాన్ ముంగిట ఉండే భాగ్యము వున్నను, దానిపై ఆసక్తి లేక తమ ఆచార్యులు స్వీకరించిన, తను కైంకర్యము చేయు ప్రాంతముపైననే పూర్తిగా దృష్టి కలిగి ఉండిరి.

అనువాదకుని గమనిక: పై సంఘటనల ద్వారా మన పూర్వాచార్యుల ప్రకారము భగవత్ కైంకర్యము / అనుభవము కన్నా, ఆచార్య కైంకర్యము / అనుభవముపై గల ప్రాధాన్యము బోధపడుచున్నది.

సశేషము…..

అడియేన్ గోపీ కృష్ణమాచార్యులు బొమ్మకంటి రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-6.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s