Monthly Archives: June 2022

అంతిమోపాయ నిష్ఠ – 10

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/06/09/anthimopaya-nishtai-9/) నంపిళ్ళైల దివ్య మహిమల గురించి మనము తెలుసుకొన్నాము. ఈ వ్యాసములో మనము మరిన్ని సంఘటనలను ఎంపెరుమానార్ల వివిధ శిష్యుల ద్వారా తెలుసుకొందాము.

ఉడయవర్ల కాలములో ఒకసారి, అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానార్ అస్వస్థులైరి. కూరత్తాళ్వాన్ వారిని పరామర్శించుటకై వెంటనే వెళ్ళ లేదు. కాని 4 రోజుల తరువాత వెళ్లి పరామర్శిస్తూ “మీరు ఇన్ని రోజులు అనారోగ్యముతో ఎలా వున్నారు?” అని అడిగిరి. అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానార్ “మన ఇరువురి మధ్య గల మిత్రత్వ స్థాయి తలంచి, నా అనారోగ్యము గురించి తెలిసిన వెంటనే మీరు వచ్చి నన్ను కలసి ఆశీర్వదించ గలరని భావించాను. కాని మీరు నన్ను పూర్తిగా విస్మరించుట, నన్ను అమిత బాధకు గురిచేసెను. నేను ఆళవందార్ల పాద పద్మములను ఆరాధించిస్తేగానీ నాకు స్వస్థత చేకూరదు” అని తెలిపిరి. ఈ సంఘటనను ‘పొన్ ఉలగు ఆళిరో’ (తిరువాయ్మొళి 6.8.1) అను పాశురము వ్యాఖ్యానములో స్పష్టముగా వివరించిరి. (అనువాదకుని గమనిక: ఇచట సందర్భము, ‘పొన్ ఉలగు ఆళిరో’ పాశురములో, నమ్మాళ్వార్ ఒక పక్షిపై పరిపూర్ణ విశ్వాసముతో ఎంపెరుమాన్ వద్దకు దూతగా పంపుటకు కారణము, ఆ పక్షికి ఎంపెరుమాన్ తో ఉన్న సాన్నిత్యము మరియు సమర్థత. కాని ఆ పక్షి వెంటనే ఆళ్వార్ కు సహకరించలేదు. అదే విధముగా, ఆళ్వాన్ కు ఎంపెరుమానునితో ఉన్న సాన్నిత్యము ద్వారా, తమను వెంటనే పరమపదమునకు పంపగలిగే సమర్థత ఉన్ననూ వారు తనను కలియుటకు జాప్యము చేసిరని, అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానార్ భావించిరి. ఇట్టి తమ భావన నయము కావలెననిన, తాము ఇప్పటికే పరమపదములో నున్న ఆళవందార్ల ముందు మోకరిల్లిన గాని తొలగదని అనిరి).

ఉడయవర్లు పరమపదము పొందిన తరువాత, వడుగనంబి కొంతకాలము సజీవులుగానే వున్నారు. కాని తరువాత వారు కూడా పరమపద ప్రాప్తి పొందారు. ఒక శ్రీవైష్ణవుడు భట్టరు వద్దకు వెళ్లి “వడుగనంబి పరమపదము నొందిరి” అని తెలిపిరి. భట్టరు “నీవు వడుగనంబి గురించి ఆ విధముగా అనరాదు” అనిరి. ఆ శ్రీవైష్ణవుడు “ఎందులకనరాదు? వారు పరమపదమును చేరినారు అనిన దోషమేమి?” అని అడిగిరి. భట్టరు వారు అద్భుతముగా సమాధానమిస్తూ, పరమపదము ప్రపన్నులకి మరియు ఉపాసకులకి (భక్తి యోగమును అవలంబించిన వారికి, వారి కృషిచే పరమపదము పొంద గలరు) సాధారణమైనది – కాని వడుగనంబి లక్ష్యం అది కాదు అనిరి. ఆ శ్రీవైష్ణవుడు “అయితే వడుగనంబి మనస్సులో వేరే ఇతర స్థానము ఉన్నదా?” అని అడిగిరి. జవాబుగా భట్టరు వారు “అవును, నీవు, వడుగనంబి ఎంపెరుమానార్ పాదపద్మములను చేరిరి, అని పలుకవలెను” అనిరి. మా ఆచార్యులైన (మాముణులు) దీనిని వివరించిరి. స్తోత్ర రత్నము ప్రారంభములో ఆళవందార్లు ఈ విధముగా ప్రకటించిరి ” త్ర పరత్ర చాపి నిత్యం యదీయా చరణం శరణం మదీయం” – (సంసారము మరియు పరమపదము రెంటిలో కూడా నేను నాధమునుల పాదపద్మములనే సేవించవలెను). రామానుజ నూఱ్ఱందాది 95 వ పాశురములో, తిరువరంగత్తు అముదనార్ ఈ విధముగా సాయించారు “విణ్ణిణ్ తలై నిన్ఱు విడలిప్పన్ ఎమ్మిరామానుజన్ మణ్ణిణ్ తలత్తుధిత్తు మరైనాళుమ్ వలరత్తననే” (పరమపదము నుంచి జీవాత్మలను మన రామానుజులు పరమపద కైంకర్యమే అంతిమ లక్ష్యము అని దీవించెదరు, ఈ సంసారములో జన్మించినపుడు, సంసారములోని దోషములు అంటకుండా, సరైన వేద శాస్త్రమును నిరూపించెదరు).

సర్వజ్ఞులైన అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానార్, కూరత్తాళ్వాన్ కుమారులైన భట్టరు, పరమాచార్యులైన ఆళవందార్లు, ఉడయవర్ల దివ్యమహిమలను సంపూర్ణముగా తెలిపిన తిరువరంగత్తు అముదనార్, కూరత్తాళ్వాన్ మొ ||, వీరందరూ ఆచార్య నిష్ఠ యొక్క మహిమలను స్పష్టముగా వివరించినవారు. ఈ సంసారము మరియు పరమపదము రెంటిలో కూడా సాటిలేని ఆచార్యుల పాదపద్మములను ఆశ్రయించుటయే శిష్యునికి అత్యావశ్యకము అని నిరూపింపబడినది, భగవానుని పాదపద్మములను ఆశ్రయించుట కంటే ఉత్తమమైనది. జితంతె స్తోత్రములో కూడా ఈ రెండు సమానమని ఈ విధముగా తెలిపిరి “దేవానాం ధనవాంఛ సామాన్యం అధిదైవతం” (అన్ని జీవులకు భగవానుడు ఒక్కడే). అందులకే మాముణులు, ఎంపెరుమానార్లతో “నీ పాదపద్మములను నేను ఎప్పుడు పొందగలను?”, “యతిరాజా! దయతో నాకు సదా మీ సేవ చేసే భాగ్యము పొందజేయుడు” అనిరి.

మన జీయర్ ఈ క్రింది సంఘటనను వివరించిరి. ఒకసారి ఒక శ్రీవైష్ణవుడు ప్రసాదమును స్వీకరిస్తుండగా కిడాంబి ఆచ్చన్ జలాన్ని వడ్డించుతున్నారు. కాని వారు ఎదురుగా ఉండి అందించకుండా, ప్రక్కన నిలబడి ఇచ్చుట వలన, ఆ శ్రీవైష్ణవుడు తన కంఠమును ప్రక్కకు తిప్పి అందుకొన్నారు. ఇది గమనించిన ఉడయవర్లు, కిడాంబి ఆచ్చన్ ను వెనుక నుంచి తట్టి “మనము శ్రీవైష్ణవులకి అత్యంత శ్రద్దతో సేవ చేయవలెను” అనిరి. ఆ మాటలు వినిన కిడాంబి ఆచ్చన్ హర్షాతిరేకముతో “మీరు నాలోని లోపాలను తొలగించుచున్నారు, ఇంకను అధిక సేవ చేయుటకై ప్రోత్సహించుచున్నారు. నేను మీకు సదా కృతజ్ఞుడను” అని తమ కృతజ్ఞతను తెలియ జేసిరి.

మాణిక్క మాలైలో, పెరియ వాచ్చాన్ పిళ్ళై ఈ క్రింది సంఘటనను తెలిపిరి. ఒకసారి ఆళ్వాన్ పై ఆగ్రహం చెందిరి. అక్కడ వున్న కొందరు ఆళ్వాన్ తో “ఉడయవర్లు మిమ్ములను విస్మరించి పక్కన పెట్టినారు కదా. మరి మీరు ఇప్పుడు ఏమి తలంచుచున్నారు?” అని అడిగిరి. సమాధానముగా ఆళ్వాన్ “నేను శ్రీభాష్యకారులకు పరిపూర్ణ విధేయుడను, వారి ఆజ్ఞ మేరకు ఉండగలను – చింతింపనవసరము లేదు” అని బదులుచ్చెను.

ఈ క్రింది సంఘటన వార్తామలైలో వివరించబడినది. ఒకసారి పిళ్ళై ఉరంగవిల్లి దాసర్, ముదలిఆణ్డాన్ వద్దకు వెళ్లి వారి పాదపద్మములకు ప్రణమిల్లి “ఆచార్యుని వద్ద శిష్యుని ప్రవర్తన ఏ విధముగా ఉండవలెను?” అని అడిగిరి. ఆణ్డాన్ “ఆచార్యుని కొరకై శిష్యుడు పత్నివలె, శరీరము వలె, ఒక విశిష్ట గుణము వలె నుండవలెను – అనగా పతి ఆజ్ఞ పాలించు పత్నిలాగా, శరీరము ఆత్మకు అవసరమైనవి సమకూర్చునట్లు, లక్ష్య సాధనే ధ్యేయంగా గల గుణము” అని అనిరి. తదుపరి, పిళ్ళై ఉరంగవిల్లి దాసర్ ఆళ్వాన్ వద్దకు వెళ్లి” ఒక ఆచార్యులు తమ శిష్యులతో ఏ విధముగా ఉండవలెను?” అని అడిగిరి. జవాబుగా ఆళ్వాన్, శిష్యుని కొరకై ఆచార్యులు ఒక పతి వలె, ఆత్మ వలె మరియు లక్ష్యము వలె – అనగా పత్నికి స్పష్టమైన ఆదేశములు ఇచ్చు పతివలె, శరీరమును నియంత్రించగల ఆత్మ వలె, లక్ష్యమును సాధించు గుణము వలె” నుండవలెను అనిరి.

ఒకసారి కూరత్తాళ్వాన్ మరియు ముదలియాణ్డాన్ మధ్య దైవ సంబంధ విషయములపై సాగుచున్న చర్చలో “సానువృత్తి ప్రసన్నాచార్యులు (శిష్యులను అనేక క్లిష్ట పరీక్షలకు గురిచేసి, తదుపరి వారికి దివ్య జ్ఞానమును ప్రసాదించువారు) లేక కృపామాత్ర ప్రసన్నాచార్యులు (శిష్యుల నిష్కామమైన కోరిక ఆధారముగా, దివ్య జ్ఞానమును ప్రసాదించు ఆచార్యులు), వీరిలో అంతిమ ధ్యేయమైన మోక్షము ఎవరి వలన లభించును” అని చర్చించిరి. ఆణ్డాన్ “సానువృత్తి ప్రసన్నాచార్యుల వలననే మోక్షము లభించును” అనిరి. కాని ఆళ్వాన్ “మనకు మోక్షము కృపామాత్ర ప్రసన్నాచార్యుల ద్వారానే లభించును” అనిరి. ఆణ్డాన్ వివరిస్తూ, పెరియాళ్వార్ “కుఱ్ఱమిన్ఱి గుణం పెరుక్క గురుక్కలుక్కు అనుకూలరే (మనలోని లోపములను తొలగించుకొని, ఆచార్యునికి అనుకూలముగా ప్రవర్తించ వలెను) అని తెలిపారు, మనము కూడా ఆ విధముగానే చేయవలెను, అనిరి. ఆళ్వాన్ “అది సరి కాదు”, కారణము మధురకవి ఆళ్వార్ ఈ విధముగా తెలియజేసిరి, “పయనన్ఱాగిలుం, పాఙ్గల్ల రాగిలుమ్, శెయల్ నన్ఱాగ, త్తిరుత్తిప్పణి కొళ్వాన్, కుయిల్ నిన్ఱార్ పొళిల్ శూళ్, కురుగూర్ నమ్బి” (చుట్టూ ఉద్యానవనములతో కూడి ఉన్న ఆళ్వార్ తిరునగరిలో నివసించుచున్న నమ్మాళ్వార్, మనకు యోగ్యత లేకపోయినను, సరియైన జ్ఞానము లేకపోయినను కూడా, మనను శుద్ధిచేసి, వారి సేవలో వినియోగించగలరు). ఈ ప్రయత్నమును మనము స్వయముగా చేయరాదు, అంతిమ లక్ష్యమైన మోక్షమును పొందుటకై ఆచార్యుని కృపపైననే ఆధారపడవలెను. ఇది వినిన ఆండాన్ మిక్కిలి సంతసించిరి. ఈ సంఘటనను మా ఆచార్యులు (మాముణులు) వివరించిరి.

కిరుమికండన్ (ఒక శైవ రాజు) కారణమును ఉదహరిస్తూ, తమ దివ్య కృపచే ఉడయవర్లు తిరునారాయణపురమునకు పయనమైరి. ఆ కారణముగా, అక్కడ (శ్రీరంగము) కోవెల కైంకర్యపరులు ఆవేదన చెందుతూ, “మాకు వచ్చిన ఇక్కట్లకు ఉడయవర్లే కారణమని భావించి, ఉడయవర్లతో సంబంధమున్న వారెవరికీ, ఈ కోవెలకు ప్రవేశము లేదు” అను ఆదేశమును ప్రకటన చేసిరి. కూరత్తాళ్వాన్ మన సిద్ధాంతమును నిలబెట్టుటకై కిరుమికండన్ సభకు వెళ్లి, అచ్చట తమ నేత్రములను కోల్పోయిరి. తిరిగి శ్రీరంగమును చేరిరి. కోవెలలో జరిగిన పై సంఘటన వారికి తెలియనందువల్ల, పెరియ పెరుమాళ్ ఆరాధనకై, వారు కోవెలకు వెళ్లిరి. ఆళ్వాన్ను అక్కడ ఒక ద్వారపాలకుడు అనుమతించలేదు. కాని మరియొక ద్వారపాలకుడు ఆళ్వాన్ను మీరు కోవెలకు వెళ్లవచ్చుననిరి. వీరిరువురి భిన్న అభిప్రాయములను ఆలకించిన ఆళ్వాన్ ఆశ్చర్యముగా “ఇక్కడ ఏమి జరుగు చున్నది?” అని అడిగిరి. దానికి వారు “ఎంపెరుమానార్లతో సంబంధము ఉన్న వారెవరిని కోవెలలోనికి ప్రవేశింప జేయరాదని మాకు ఆదేశము ఇచ్చిరి” అనిరి. ఆళ్వాన్ “అయినచో నన్ను కోవెలలోనికి ఏల అనుమతించుచున్నారు” అని అడిగిరి. వారు “మీరు ఇతరుల వలె కాదు, మంచి సహృదయులు మరియు ఆత్మ గుణవంతులు. కావున అనుమతించుచున్నాము” అనిరి. ఇది విన్న ఆళ్వాన్ ఉలిక్కిపడి నీటిలో కనిపించు చంద్రుని వలె (సదా కదులుతూ ఉండును కదా) వణికిరి. వారు కొంత వెనుకంజ వేసి “శాస్త్రము ప్రకారము ఆత్మ గుణములు ఆచార్యుని సంబంధమును వృద్ధి చేయును; కాని ఇక్కడ నా విషయములో ఆత్మ గుణములు ఎంపెరుమానార్లతో నాకు గల సంబంధమును వదలి వేయునట్లుగా చేయుచున్నది” అని మిక్కిలి బాధతో పలికిరి. ఇంకను వారు “నా వరకు, ఎంపెరుమానార్ల పాదపద్మములే నా అంతిమ లక్ష్యము చేరుటకు సరిపోవును; ఎంపెరుమానార్లతో సంబంధమును వదులుకొని నేను పెరుమాళ్ళను ఆరాధించలేను” అని పలుకుచూ ఎంపెరుమాన్ ఆరాధన చేయకుండా తమ తిరుమాళిగైకు (నివాసము) వెడలిరి. ఈ సంఘటనను మన జీయర్ వివరించిరి.

తిరువిరుత్తమ్ వ్యాఖ్యానములో ఆళవందార్లు, ఎంపెరుమాన్ తమ అపార కరుణచే వారే స్వయముగా నమ్మాళ్వార్లుగా దర్శనమిచ్చిరి అని పేర్కొనిరి. అళగియ మణవాళ నయనార్ తమ ఆచార్య హృదయములో నమ్మాళ్వార్లే కలియుగము చతుర్ధ వర్ణములో అవతారము దాల్చిరా, వీరే పూర్వము అత్రి, జమదగ్ని, దశరధుడు, వాసుదేవుడు / నందగోపాలుడు మొ || వారి కుమారులుగా, బ్రాహ్మణ / క్షత్రియ / వైశ్య వర్ణములలో పూర్వపు యుగములలో (సత్య, త్రేతా, ద్వాపర యుగములు) జన్మించినారా అని ఆశ్చర్యచకితులైరి. (అనువాదకుని గమనిక: ఆళ్వార్ల మహిమలు మనకు వారు ఎంపెరుమానుని అవతారమా అను భావన కలుగజేయును, కాని పూర్వాచార్యులు వివరించినట్లు వారు అలా కాదు. కాని ఇక్కడ విషయము ఎంపెరుమాన్ తానే స్వయముగా ఆచార్యుని రూపముగా, అదియే అన్నిటికన్నా అత్యున్నత స్థితి అని ఋజువు చేయుచున్నారు.

అనువాదకుని గమనిక: ఈ విధముగా మనము శ్రీరామానుజుల వివిధ శిష్యుల నిష్టను గమనించితిమి. వారు ఏ విధముగా శ్రీరామానుజులపై సంపూర్ణముగా ఆధారపడినారో వ్యక్తమైనది.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-10.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 9

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

నంపిళ్ళై వైభవము – 2

మునుపటి వ్యాసములో, (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/06/05/anthimopaya-nishtai-8/), మన పూర్వాచార్యుల జీవితములలోని మిక్కిలి అద్భుతమైన సంఘటనలను గమనించాము, అవి, శ్రీరంగనాధుడు మాముణులను తమ ఆచార్యునిగా అంగీకరించుట, శ్రీశైలేశ దయాపాత్రము తనియన్ ను అనుగ్రహించుట, ఆ తనియన్ ను అన్ని దివ్య దేశములలో ప్రచారము చేయుట. ఈ వ్యాసములో మనము నంపిళ్ళై యొక్క మరిన్ని దివ్య మహిమలను గమనించెదము.

నంపిళ్ళై పాదపద్మముల వద్ద పిన్భళగియ పెరుమాళ్ జీయర్ – శ్రీరంగము

ఒకరోజు నంపిళ్ళై తమ భాగవత విషయ కాలక్షేపము ముగించిన పిదప అందరూ వెళ్ళుచుండగా, పిన్భళగియ పెరుమాళ్ జీయర్ నంపిళ్ళై ముందు ప్రణమిల్లి, “నా నిజ స్వభావము (జీవాత్మ) ఏమిటి? దానికి ఉపాయము, అంతిమ లక్ష్యము వివరించగలరు” అని అడిగిరి. సమాధానముగా నంపిళ్ళై “జీవాత్మలను ఉద్దరించుట అనే ధ్యేయముగల ఎంపెరుమాన్ / ఎంపెరుమానార్ల కోరిక వలననే జీవాత్మ పోషింపబడుచున్నాడు, వారి కృపయే ఉపాయము, వానికి ఒనరించు పరమానందకరమైన సేవ అంతిమ లక్ష్యము” అని అనిరి. జీయర్ ప్రతిస్పందిస్తూ “నేను ఆ విధముగా భావించుట లేదు”  అనిరి. నంపిళ్ళై “వేరే మార్గము ఏమైనా కలదా? మీ మనస్సులో ఏమున్నదో తెలియజేయుడు” అనిరి. జీయర్ “మీ పాద పద్మములను ఆశ్రయించిన శ్రీవైష్ణవులను నేను ఆశ్రయించుట నా స్వభావము, వారి దయ నాకు ఆధారము (ఉపాయము), వారి దివ్య ముఖారవిందములోని ఆనందము నాకు అంతిమ లక్ష్యము” అనిరి. జీయర్ పలుకులకు నంపిళ్ళై మిక్కిలి సంతసించిరి.

నంపిళ్ళై కాలములో, ఎంతో కీర్తి గాంచిన  ముదలియాండాన్ మనుమడైన కందాడై తోళప్పర్ నంపిళ్ళైపై  అసూయ చెందిరి. ఒకసారి తోళప్పర్ పెరియ పెరుమాళ్ కోవెలలో ఆరాధనలో నుండగా, అదే సమయమునకు నంపిళ్ళై తమ పలు శిష్యులతో అచ్చటకు వేంచేసిరి. అకారణముగా అసూయతో, తోళప్పర్ నంపిళ్ళైపై బిగ్గరగా అరచి వారిని అవమానించిరి. అది వినిన నంపిళ్ళై దీని పరిణామము ఎట్లుండునో నని కలత చెంది, పెరియ పెరుమాళ్ ఆరాధనను త్వరగా ముగించి, తమ తిరుమాళిగకు (నివాసము) వెడలిరి. ఈ సంఘటనను తెలుసుకొనిన, వివేకవంతురాలైన తోళప్పర్ సతీమణి, నంపిళ్ళై పట్ల తన పతి చేసిన ఈ ఘోర తప్పిదమునకు మిక్కిలి చింతించి, తను గృహమున చేయు అన్ని కైంకర్యములను ఆపి, తన పతి రాకకై ఎదురుచూచుచున్నది. తోళప్పర్ ఇంటికి రాగానే, తన సతీమణి ఆహ్వానము పలుకలేదని, తాము వచ్చినప్పుడు చేసే సేవలు ఏమీ చేయలేదని గ్రహించిరి. వారు ఆమెతో “మన వివాహము మొదలు నీవు నన్ను నీ ఆచార్యునిగా భావించి, నాకు చక్కని సేవలు చేసెడి దానవు. కాని ఈ రోజు నన్ను పూర్తిగా విస్మరించితివి. కారణమేమిటి?” అని అడిగిరి. దానికి ఆమె, “ప్రియ స్వామి! మీరు తిరుమంగై ఆళ్వార్ల అపరావాతారులైన మరియు పెరియ పెరుమాళ్ళకు అత్యంత ప్రియులైన, నంపిళ్ళైను, పెరియ పెరుమాళ్ ముందే అవమానించిరి. మీ చర్యకు మీరు పశ్ఛాతాపమూ పడినట్టుగా లేదు. నేటి నుండి నాకు మీతో ఎట్టి సంబంధము లేదు. నన్ను ద్వేషించి, శిక్షించదలచినచో, నా తల్లిదండ్రులు మీకు ఒసగిన నా శరీరమును శిక్షించవచ్చును. నా ఆచార్యుని ఆశ్రయము పొందిన నేను, అప్పుడే ఉద్దరింపబడినాను. కావున, నాకు మీతో ఏ సంబంధము లేదు. అనేక కోట్ల జన్మలెత్తినను, భాగవతాపచారము చేసిన వానిని నేను క్షమించను అని పరమాత్మ తెలిపెను కదా! ఇది తెలిసి కూడా మీరు నంపిళ్ళైను అవమానించారు. కావున, నా జీవితమును నేనే కొనసాగించెదను.” అని పలికెను.
ఆమె మాటలకు తోళప్పర్ ఒక్క క్షణము విస్మయము చెందిరి. తోళప్పర్ ఒక్క క్షణం మననం చేసి, ముదలియాండాన్ వంటి గొప్ప వంశములో జన్మించి, విద్వాంసుడై నందున తన తప్పిదమును గ్రహించిరి. వారు ఆమెతో “నీవు చెప్పినదంతయు యధార్ధము. నేను చాలా పెద్ద తప్పు చేసితిని. ఇప్పుడు నేను ఏమి చేయవలెను?” అని పలికిరి. ఆమె వారితో “మీరు నదిలో పోగొట్టుకున్న దానిని, చిన్న కొలనులో వెతకరాదు” అనెను. దానికి “మీ భావమేమిటి” అని వారు అడిగిరి. దానికి ఆమె “నంపిళ్ళైకు మీరు నేరము చెసినారు, కావున మిక్కిలి దయాళువులైన వారి పాదపద్మములపై మోకరిల్లి,  క్షమాపణ కోరుడు. వారు మిమ్ములను తప్పక కరుణించగలరు. మీ పాపము నుండి విముక్తి కలుగును” అనెను. దానికి వారు “పెరియ పెరుమాళ్ ఎదురుగా నేను వారిని అవమానించి పెద్ద నేరమే చేసినాను. వారి ముందకు వెళ్ళుటకు కూడా నాకు మొఖము చెల్లుట లేదు. వారిని క్షమా బిక్ష అభ్యర్థించుటకు, నీవు కూడా దయతో నాతో రావలసినది” అనిరి. దానికి ఆమె అంగీకరించి, వారిరువురు తమ నివాసము వదిలి వెళ్ళుటకు ఉద్యుక్తులైరి.

ఆ సమయానికే, పెరుమాళ్ కోయిల్ నుండి బయలుదేరి నంపిళ్ళై తమ తిరుమాళిగైకు చేరి, తమ శిష్యులందరిని పంపించివేసి, సూర్యాస్తమయము వరకు ఉపవాసము చేసిరి. ఆ పిదప తమ శిరస్సును ఒక వస్త్రముచే కప్పివేసికొని, తోళప్పర్ నివాసమునకు ఒక్కరే నడచి వెళ్లి, వసారాలో వేచి వున్నారు. ఆ సమయమునకే, దీపము చేతబట్టుకొని ద్వారమును తెరచి తోళప్పర్ తమ సతీమణితో కలిసి నంపిళ్ళై తిరుమాలిగకు వెళ్ళుటకు సిద్ధమైరి. అక్కడ వసారాలో ఎవరో వున్నారని గమనించి, ఎవరది అని అడిగిరి. నంపిళ్ళై తనను తాను తిరుక్కలికన్ఱి దాసర్ను అని సంబోధించికొనిరి. నంపిళ్ళైని  అచట చూసి, తోళప్పర్ ఆశ్చర్యపోయి, వారితో (మరల అహంకారముతో) “పెరియ పెరుమాళ్ ముందు నాపై మీరు తిరిగి బిగ్గరగా అరవలేదు, కారణము, అక్కడ నాకు మంచి పేరు ఉన్నదని, అందుచే నన్ను ఏకాంతముగా ఇక్కడ అవమానించుటకు వచ్చితివి” అని పలికిరి. నంపిళ్ళై “నేను అందులకు ఇచటకు రాలేదు” అనిరి. తోళప్పర్ ఆశ్చర్యముతో “మరి ఇచటకు ఏల వచ్చితిరి?” అని అడిగిరి. నంపిళ్ళై “నా ప్రవర్తన వలన పెరియ పెరుమాళ్ ఎదురుగా ముదలియాండాన్ మనుమడు అవమానింపబడు పాపమును నేను చేసితిని. నేను ఇచటకు క్షమాబిక్షకై వచ్చితిని. మీరు నన్ను క్షమించగలరు” అనిరి. ఇది ఆలకించిన తోళప్పర్ పూర్తిగా శుద్ధులై, నంపిళ్ళైను ఆలింగనము చేసుకొనిరి. తరువాత వారు “నేటి వరకు మీరు కొంత మంది శిష్యులకే ఆచార్యులు అనే భావనలో నేను వున్నాను. కాని మీరు ఈ లోకమంతటికి ఆచార్యులు కాగల లక్షణములు కలవారని నాకు ఇప్పుడు అవగతమైనది. కావున నేటి నుండి మీరు ‘లోకాచార్యర్’ అని పిలువబడెదరు” అని పలికిరి. తదుపరి వారు నంపిళ్ళైను తమ తిరుమాలిగలోనికి ఆహ్వానించి, తమ సతీమణితో కలిసి వారికి గొప్ప సేవ చేసిరి. నంపిళ్ళై కూడ సంతుష్టులైరి. వారు నంపిళ్ళై పాదపద్మములను ఆశ్రయించి, అన్ని దైవ సంబంధములైన విషయములను అభ్యసించిరి. ఈ సంఘటనను మన జీయర్ ఉపదేశరత్త మాల 51 వ పాశురములో ఈ విధముగా వివరించిరి.

తున్ను పుగళ్ కన్దాడైత్ తోళప్పర్ తమ్ ఉగప్పాల్
ఎన్న ఉలగారియనో ఎన్ఱురైక్క
పిన్నై ఉలగారియన్ ఎన్నుమ్ పేర్ నమ్పిళ్ళైక్కు ఓంగి
విలగామల్ నిన్ఱదెన్ఱుమ్ మేల్

సాధారణ అనువాదము : శ్రీరంగములో మంచి పేరు గాంచిన కందాడై తోళప్పర్, నంపిళ్ళైను మిక్కిలి ఆప్యాయతతో ‘లోకాచార్యులు’ అని సంభోదించిరి. ఆ తదనంతరము, నంపిళ్ళై లోకాచార్యులన్న పేరు ప్రఖ్యాతులు శాశ్వతంగా నిలిచిపోయాయి.

నంపిళ్ళై మహిమ అపారమైనదని ఈ క్రింది పాశురము, శ్లోకముల ద్వారా అవగాహన పొందవచ్చును.

పిళ్ళై అళగియ మణవాళ దాసర్ అనుగ్రహించిన ఇయల్ సాఱ్ఱుఱైలోని ఒక శ్లోకము

నెన్జత్తిరున్తు నిరంతరమాగ నిరయత్తుయ్ క్కుం
వన్జక్కుఱుమ్బిన్ వగైయఱుత్తేన్
మాయవాదియర్ తామ్ అన్జప్పిరన్తవన్ చీమాదవనడిక్కన్బుచెయ్యుమ్
తన్జత్తొరువన్ చరణాంబుయం ఎన్ తలైక్కణిన్తే

సాధారణ అనువాదము : నంజీయర్ (మాయావాదులకు భయంకరుడైన) కు ప్రియ శిష్యులైన నంపిళ్ళై పాదపద్మములను ఆశ్రయించుటచే, నన్ను నరకమున పడద్రోయునటువంటి చెడు ఆలోచనలను నేను తొలగించుకొంటిని.

నమామి తౌ మాదవ శిష్య పాదౌ యత్ సన్నిధిమ్ సూక్తిమయీమ్ ప్రవిష్టాః
తత్రైవ నిత్యం స్తితిమాద్రియంతే వైకుంఠ సంసార విరక్త చిత్తాః

సాధారణ అనువాదము : నంజీయర్ శిష్యులైన నంపిళ్ళై పాదపద్మములను నేను ఆరాధించెదను. వారి మహిమాన్వితమైన మాటలను శ్రవణము చేసిన మనము, అత్యంత గొప్ప భగవత్ అనుభవమును పొంది, సంసారము మరియు శ్రీవైకుంఠము రెంటిపై కూడ నిర్లిప్తత పొందెదము.

శృత్వాపి వార్తాఞ్చ యదీయగోష్ట్యామ్ గోష్ట్యంతరాణామ్ ప్రధమా భవంతి
శ్రీమత్కలిద్వంసన దాస నామ్నే తస్మై నమస్ సూక్తిమహార్ణవాయ

సాధారణ అనువాదము:  నేను సూక్తి మహార్ణవ (దివ్య సూక్తుల మహా సాగరము వంటి నంపిళ్ళై)ను, శ్రీమద్ కలిధ్వంసన దాసర్ అని పేరు గాంచిన వారిని ఆరాధించెదను. వారి ప్రవచనములను ఆలకించిన తరువాత, ఆ గోష్టి మరి ఇతర అన్ని గోష్టిల కంటే అత్యుత్తమమైనదని అని మనం గ్రహించగలము.

వడక్కు తిరువీధి పిళ్ళై మరియు వారి ధర్మ పత్ని (ఇరువురు నంపిళ్ళై శిష్యులు, అతి విశ్వసనీయులు) ప్రాపంచిక విషయముల నుండి విరక్తిగా వుంటూ, నంపిళ్ళైను అన్ని విధముల సదా సేవించుచుండిరి. ఒకరోజు, వడక్కు తిరువీధి పిళ్ళై తిరుమాళిగకు నంపిళ్ళై వేంచేసిరి. వారి పాదపద్మములకు అందరు ప్రణమిల్లిరి. ఆ సమయమున వడక్కు తిరువీధి పిళ్ళై ధర్మ పత్ని తడి చీరను ధరించి ప్రణమిల్లినది. నంపిళ్ళై అక్కడ ఉన్న ఇతర స్త్రీలతో, ఆమె తడి వస్త్రములో ఉండుటకు కారణము ఏమి అని అడిగిరి. వారు, ఆమె ఋతుక్రమము తదుపరి, శుచిగా, మీ ఆశీర్వచనము పొందుటకై, ఆ విధముగా వచ్చెనని పలికిరి. మిక్కిలి సంతోషముతో, నంపిళ్ళై ఆమెను తమ దగ్గరకు ఆహ్వానించి, తమ దివ్యమైన హస్తముతో ఆమె ఉదరమును స్పృశించి “నా వలె కీర్తిగల పుత్రునికి జన్మనివ్వగలవు” అని ఆశీర్వదించిరి. ఇది తిలకించిన వడక్కు తిరువీధి పిళ్ళై, తమకు పుత్ర సంతానము కలుగుట తమ ఆచార్యునికి ఆనంద హేతువగునని గ్రహించి, తమ పత్నితో ఆ విధముగా మెలగసాగిరి. తదుపరి ఆమె గర్భముదాల్చి, ఒక సంవత్సరములోనే, దైవాంశ సంభూతుడైన పుత్రునికి జన్మనిచ్చెను. వడక్కు తిరువీధి పిళ్ళై అతనకి నంపిళ్ళై యొక్క దివ్య నామము ‘లోకాచార్యర్ ‘ (తరువాత పిళ్ళై లోకాచార్యులుగా పేరుగాంచిరి) అని నామకరణము చేసి, తమ ఆచార్యునిపై తమకున్న కృతజ్ఞతను ప్రకటించిరి.

నంపిళ్ళై, వడక్కు తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్యులు, అళగియ మణవాళ పెరుమాళ్ నయనార్

ఆ విధముగా నంపిళ్ళై దివ్య ఆశీర్వచనముచే, వడక్కు తిరువీధి పిళ్ళై పుత్రుడు పిళ్ళై లోకాచార్యులు జన్మించిరి. పిళ్ళై లోకాచార్యులు తమ దివ్య అనుగ్రహము, అపారమైన కరుణచే, జీవాత్మలు ఉద్దరింప బడవలెనని, అనేక దివ్య గ్రంధములను మనకు అనుగ్రహించిరి. అవి తత్వ త్రయము, రహస్య త్రయము (ముముక్షుపడి మొ ||), శ్రీ వచన భూషణము మొ || నవి. అత్యంత గొప్యమైన సందేశములను అతి సరళ శైలిలో రచించి మనకు బోధించిరి. పిళ్ళై లోకాచార్యులు జన్మించిన ఒక సంవత్సరము తరువాత, వడక్కు తిరువీధి పిళ్ళై దంపతులకు మరియొక అందమైన పుత్రుడు (స్వయముగా శ్రీరంగనాధుని దివ్య కృపచే) జన్మించెను. అతనికి అళగియ మణవాళ పెరుమాళ్ నయనార్ అని నామకరణము చేసిరి. వీరు ఆచార్య హృదయము (నమ్మాళ్వార్ల దివ్య హృదయమును తెలుపును) అను దివ్య గ్రంధమును అనుగ్రహించిరి.

ఆ విధముగా, తిరుమంగై ఆళ్వార్ల విశేష అవతారమైన లోకాచార్యర్ (నంపిళ్ళై)  గొప్ప జీవితమును జీవించారు. నా ఆచార్యులైన (మాముణులు), వారి పితరులైన తిగళక్కిడంతాన్ తిరునావీఱుడైయపిరాన్ తాతరణ్ణర్, వారి 5 సంవత్సరాల వయస్సులో పెద్దల మార్గదర్శకములో నంపిళ్ళై యొక్క శిష్యులైరని తెలిపిరి.

అనువాదకుని సూచన: ఈ విధముగా మనము నంపిళ్ళై దివ్య మహిమలను దర్శించి, పూర్తిగా ఆనందించితిమి. ఈ సంఘటనల ద్వారా సంసారమును సాగిస్తూ పరమపదమునకు సరి అయిన మార్గము లభింపవలెననిన, ఆచార్యుని కృపయే మనకు తప్పనిసరి అని తెలియుచున్నది. పైగా ఈ ఈ సంసారములో ఉంటూ శిష్యుడు తనకు తగిన కైంకర్యములో నిమగ్నుడై ఉండి జీవనం సాగించవలెను.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-9.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 8

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/04/10/anthimopaya-nishtai-7/), మనము నంపిళ్ళై యొక్క విశిష్ఠతను వారి జీవితములోని పెక్కు సంఘటనల ద్వారా గమనించితిమి. ఇంక మనము మన పూర్వాచార్యుల జీవితములలోని మిక్కిలి అద్భుతమైన సంఘటనలను పరిశీలించెదము.

మలై కునియ నిన్ఱ పెరుమాళ్ (ఆళ్వాన్ / భట్టర్ వంశీకులు) మన సంప్రదాయమునకు నాయకులుగా ఉండి, ప్రస్తుతము శ్రీరంగములో నివసించుచున్నారు. వారి తండ్రి గారికి మన జీయర్ (మాముణులు) తో ప్రత్యేక అనుబంధము కలదు. మాముణులు తిరువాయ్మొళిలోని ఈడు 36000 పడి వ్యాఖ్యానమును, ఇతర వ్యాఖ్యానములను పూర్తిగా కంఠస్థము చేసిరి. వారు మన జీయరును ప్రేమతో ” 36000 పెరుక్కార్ ” (ఈడు 36000 పడి వ్యాఖ్యానమును పోషించిన వారు) అని సంభోదించిరి, మాముణులు చేసిన కాలక్షేపమును ఆనందముగా ఆస్వాదించిరి. అదే సమయమున, పరీతాపి నామ సంవత్సరము శ్రావణమాసములో, నంపెరుమాళ్ తిరుపవిత్రోత్సవ మండపమునకు వేంచేసిరి. ఆ పెద్ద సభ ముందు నంపెరుమాళ్, తానే స్వయముగా మన జీయరును (మామునులు) ప్రత్యేకముగా ఆహ్వానించి, శ్రీ శఠగోపము మరియు వారి పూమాలలు, తీర్థము, ప్రసాదము మొదలైన వానితో ఆశీర్వదించిరి. తదుపరి మామునులతో “రేపటి నుంచి మన పెరియ తిరుమండపము (పెరియ పెరుమాళ్ తిరు సన్నిధి అభిముఖముగా) లో మీరు నంపిళ్ళై యొక్క ఈడు 36000 పడి వ్యాఖ్యానమును అనుసరించి, తిరువాయ్మొళి దివ్య అర్ధమును వివరించగలరు” అని ఆదేశించిరి. తదుపరి దినము, నంపెరుమాళ్ ఉభయ నాచ్చియార్లతో కూడి, సేనై ముదలియార్, నమ్మాళ్వార్, యతిరాజులు (ఇతర ఆళ్వార్లు మరియు ఆచార్యులు) తో కలిసి మండపమునకు వేంచేసిరి, పెరియ ఇళ్యార్ కాలక్షేపమును మండపములో గల గొప్ప శ్రీవైష్ణవులతో కూడి ఆలకించసాగిరి. ఈ సంఘటనను ఈ క్రింది పాశురములో వివరించిరి.

నల్లతోర్ పరీతాపి వరుడన్తన్నిల్ నలమాన ఆవణియిన్ ముప్పత్తొన్ఱిల్
చొల్లారియ చోతియుడన్ విళన్గు వెళ్ళిక్కిళమై వళర్పక్కమ్ నాలామ్నాళిల్
చెల్వమిగు పెరియ తిరుమణ్డపత్తిల్ చెళుం తిరువాయ్మొళిప్పొరుళైచ్ చెప్పుమెన్ఱు
వల్లియుడై మణవాళర్ అరన్గర్ నన్గళ్ మణవాళ మునిక్కు వళంగినార్.

ఆ విధముగా, నంపెరుమాళ్ మరియు తదితరులు తిరువాయ్మొళి కాలక్షేపమును (36000 పడి, ఇతర 4 వ్యాఖ్యానములు) ఎట్టి అవరోధము లేకుండా ఒక సంవత్సరము (10 మాసములు) పాటు పూర్తిగా ఆలకించిరి. మరల, చివరి రోజున ఆణి మూలము రోజున, నంపెరుమాళ్ అందరితో కలసి మండపమునకు చేరిరి. జీయర్ అద్భుతముగా సాయించుచున్న శాత్తుముఱైను శ్రవణము చేసిరి. ఆ తదుపరి నంపెరుమాళ్ మిక్కిలి ఆనందముతో, జీయరును గొప్పగా గౌరవించిరి. (అనువాదకుని గమనిక : మాముణులకు తమ శేష పర్యంకమునే గాక, శ్రీశైలేశ దయా పాత్రము అను తనియన్ ను అనుగ్రహించి, వారిని తమ ఆచార్యులుగా అంగీకరించిరి. ఈ తనియన్ను అన్ని దివ్య దేశములలో ప్రచారము చేసిరి). ఇట్టి గొప్ప కైంకర్యమును నంపెరుమాళ్ తనకు అనుగ్రహించుటచే, వారి దివ్య / ప్రత్యేక ఆశీర్వచనమునకు, జీయర్ వారిపై సదా వినయముతో మరియు కృతజ్ఞతగా ఉండిరి.

నామార్! పెరియ తిరుమణ్డపమార్!
నమ్పెరుమాళ్ తామాగ నమ్మైత్ తనిత్తళైత్తు
నీ మాఱన్ చెన్తమిళ్ వేదత్తిన్ చెళుం పొరుళై నాళుమిన్గే వన్తురై
ఎన్ఱేవువతే వాయ్ంతు

నేను ఎవరిని? ఈ పెరియ తిరుమండపము యొక్క మహిమలు ఏమిటి? నన్ను ఈ ద్రావిడ వేదము (తిరువాయ్మొళి 36000 పడి ద్వారా) యొక్క దివ్య అర్ధములను ప్రతి రోజు (సంవత్సరము పూర్తిగా) వివరించుడని, నంపెరుమాళ్ శాసించుట, అది వారికే ఒక గొప్ప ఆశీర్వాదము.

అదే విధముగా, మాముణులతో అనుబంధము గల ఆ నాటి గొప్ప ఆచార్యులు / శ్రీవైష్ణవులు, ఈ విధముగా ప్రకటించిరి.

వలంపురియాయిరమ్ చూళ్ తరవాళి మరున్గొళురు చెలమ్చెలనిన్ఱు ముళుంగుగ పోల్
తనతు తొణ్డర్ కులమ్ పల చూళ్ మణవాళ మాముని కోయిలిల్ వాళ
నలన్గడల్ వణ్ణన్ మున్నే తమిళ్ వేదమ్ నవిఱ్ఱననే.
తారార్ అరంగర్ మున్నాళ్ తన్తామళిత్తార్ చీరార్ పెరియ తిరుమణ్డపత్తుచ్ చిఱంతై
ఎన్ ఆరావముతనైయాన్ మణవాళ మామునియైయళైత్తు ఏరార్ తమిళ్ మఱై ఇంగేయిరుంతు చొల్ ఎన్ఱననే

శ్రీరంగములోని నివసించే తమ వేలాది శిష్యులు గుమిగూడి ఉండగా, మాముణులు తమిళ్ వేద అర్ధములను ఎంపెరుమాన్ ఎదురుగా వివరించిరి. ఇటుల చేయుటకై, సుందరుడైన శ్రీరంగనాథుడు, మణవాళ మాముణులను తమ పెరియ తిరుమండపమునకు ఆహ్వానించి, తిరువాయ్మొళి యొక్క అందమైన అర్ధములను అచ్చట అనుగ్రహించమని దీవించారు.

మాముణుల శిష్యులు, ఆ విధముగా వారిపై గల కృతఙ్ఞతను చూపిరి, తమ జీయర్ (మాముణులు) పైన తప్ప ఇతరులెవరి పైనను చూపని ఈ ఆదరణను, నంపెరుమాళ్ కృప చేసిన ఇట్టి దైవిక చర్యను ఆదరించిరి.

ఇప్పుడు, నేను (పరవస్తు పట్టర్పిరాన్ ఇళ్యార్) నా ఆచార్యుని కీర్తిని గురించి (మధ్యలో నంపిళ్ళై వైభవముతో) మాట్లాడుట ప్రారంభించాను, ఎందుకంటే, గురువు నిత్యము ప్రకాశించును.

  •  ప్రతి ఒక్కరు తమ ఆచార్యుని / గురువుని సదా కీర్తించాలి
  • కణ్ణినుణ్ శిఱుత్తాంబు – ‘ఎండిశైయుం అఱియ్అ ఇయంబుకేన్ ఒణ్ తమిళ్ చ్చటగోపన్ అరుళైయే’ – నేను (మధురకవి ఆళ్వార్), నమ్మాళ్వార్ యొక్క దయను తెలిపి వారిని అన్ని మార్గములలో (ప్రతి చోట) కీర్తించెదను 
  • శ్రీ వచన భూషణం – వ్యాక్యానం అచ్చర్య వైభవం – ఆచార్యుని ఉత్కృష్టతను తెలియజేయుట అందరి యొక్క బాధ్యత.

అనువాదకుని గమనిక: ఆ విధముగా ఆణి తిరుమూలం రోజున, పెరియ జీయరును నంపెరుమాళ్ కీర్తించుట / ఆదరించుట అను దైవ ఘటనను మనము తిలకించాము, వారిని తమ ఆచార్యునిగా అంగీకరించుట, వారికి తమ శేష పర్యంకమును బహుకరించుట, ఇంకను గొప్ప విశేషము “శ్రీశైలేశ దయా పాత్రమ్ ధీభక్త్యాది గుణార్ణవం, యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్” అను తనియన్ను అనుగ్రహించుట, అన్ని దివ్య దేశములలో ప్రచారము చేయుట, మొ || అనునవి నంపెరుమాలే స్వయముగా తమ ఆచార్యునిపై అంతిమోపాయ నిష్ఠను ప్రదర్శించుటగా చెప్పవచ్చును మరియు జగత్తు అంతయు దీనిని తిలకించి, అనుసరించగలదు.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-8.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org