అంతిమోపాయ నిష్ఠ – 9

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

నంపిళ్ళై వైభవము – 2

మునుపటి వ్యాసములో, (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/06/05/anthimopaya-nishtai-8/), మన పూర్వాచార్యుల జీవితములలోని మిక్కిలి అద్భుతమైన సంఘటనలను గమనించాము, అవి, శ్రీరంగనాధుడు మాముణులను తమ ఆచార్యునిగా అంగీకరించుట, శ్రీశైలేశ దయాపాత్రము తనియన్ ను అనుగ్రహించుట, ఆ తనియన్ ను అన్ని దివ్య దేశములలో ప్రచారము చేయుట. ఈ వ్యాసములో మనము నంపిళ్ళై యొక్క మరిన్ని దివ్య మహిమలను గమనించెదము.

నంపిళ్ళై పాదపద్మముల వద్ద పిన్భళగియ పెరుమాళ్ జీయర్ – శ్రీరంగము

ఒకరోజు నంపిళ్ళై తమ భాగవత విషయ కాలక్షేపము ముగించిన పిదప అందరూ వెళ్ళుచుండగా, పిన్భళగియ పెరుమాళ్ జీయర్ నంపిళ్ళై ముందు ప్రణమిల్లి, “నా నిజ స్వభావము (జీవాత్మ) ఏమిటి? దానికి ఉపాయము, అంతిమ లక్ష్యము వివరించగలరు” అని అడిగిరి. సమాధానముగా నంపిళ్ళై “జీవాత్మలను ఉద్దరించుట అనే ధ్యేయముగల ఎంపెరుమాన్ / ఎంపెరుమానార్ల కోరిక వలననే జీవాత్మ పోషింపబడుచున్నాడు, వారి కృపయే ఉపాయము, వానికి ఒనరించు పరమానందకరమైన సేవ అంతిమ లక్ష్యము” అని అనిరి. జీయర్ ప్రతిస్పందిస్తూ “నేను ఆ విధముగా భావించుట లేదు”  అనిరి. నంపిళ్ళై “వేరే మార్గము ఏమైనా కలదా? మీ మనస్సులో ఏమున్నదో తెలియజేయుడు” అనిరి. జీయర్ “మీ పాద పద్మములను ఆశ్రయించిన శ్రీవైష్ణవులను నేను ఆశ్రయించుట నా స్వభావము, వారి దయ నాకు ఆధారము (ఉపాయము), వారి దివ్య ముఖారవిందములోని ఆనందము నాకు అంతిమ లక్ష్యము” అనిరి. జీయర్ పలుకులకు నంపిళ్ళై మిక్కిలి సంతసించిరి.

నంపిళ్ళై కాలములో, ఎంతో కీర్తి గాంచిన  ముదలియాండాన్ మనుమడైన కందాడై తోళప్పర్ నంపిళ్ళైపై  అసూయ చెందిరి. ఒకసారి తోళప్పర్ పెరియ పెరుమాళ్ కోవెలలో ఆరాధనలో నుండగా, అదే సమయమునకు నంపిళ్ళై తమ పలు శిష్యులతో అచ్చటకు వేంచేసిరి. అకారణముగా అసూయతో, తోళప్పర్ నంపిళ్ళైపై బిగ్గరగా అరచి వారిని అవమానించిరి. అది వినిన నంపిళ్ళై దీని పరిణామము ఎట్లుండునో నని కలత చెంది, పెరియ పెరుమాళ్ ఆరాధనను త్వరగా ముగించి, తమ తిరుమాళిగకు (నివాసము) వెడలిరి. ఈ సంఘటనను తెలుసుకొనిన, వివేకవంతురాలైన తోళప్పర్ సతీమణి, నంపిళ్ళై పట్ల తన పతి చేసిన ఈ ఘోర తప్పిదమునకు మిక్కిలి చింతించి, తను గృహమున చేయు అన్ని కైంకర్యములను ఆపి, తన పతి రాకకై ఎదురుచూచుచున్నది. తోళప్పర్ ఇంటికి రాగానే, తన సతీమణి ఆహ్వానము పలుకలేదని, తాము వచ్చినప్పుడు చేసే సేవలు ఏమీ చేయలేదని గ్రహించిరి. వారు ఆమెతో “మన వివాహము మొదలు నీవు నన్ను నీ ఆచార్యునిగా భావించి, నాకు చక్కని సేవలు చేసెడి దానవు. కాని ఈ రోజు నన్ను పూర్తిగా విస్మరించితివి. కారణమేమిటి?” అని అడిగిరి. దానికి ఆమె, “ప్రియ స్వామి! మీరు తిరుమంగై ఆళ్వార్ల అపరావాతారులైన మరియు పెరియ పెరుమాళ్ళకు అత్యంత ప్రియులైన, నంపిళ్ళైను, పెరియ పెరుమాళ్ ముందే అవమానించిరి. మీ చర్యకు మీరు పశ్ఛాతాపమూ పడినట్టుగా లేదు. నేటి నుండి నాకు మీతో ఎట్టి సంబంధము లేదు. నన్ను ద్వేషించి, శిక్షించదలచినచో, నా తల్లిదండ్రులు మీకు ఒసగిన నా శరీరమును శిక్షించవచ్చును. నా ఆచార్యుని ఆశ్రయము పొందిన నేను, అప్పుడే ఉద్దరింపబడినాను. కావున, నాకు మీతో ఏ సంబంధము లేదు. అనేక కోట్ల జన్మలెత్తినను, భాగవతాపచారము చేసిన వానిని నేను క్షమించను అని పరమాత్మ తెలిపెను కదా! ఇది తెలిసి కూడా మీరు నంపిళ్ళైను అవమానించారు. కావున, నా జీవితమును నేనే కొనసాగించెదను.” అని పలికెను.
ఆమె మాటలకు తోళప్పర్ ఒక్క క్షణము విస్మయము చెందిరి. తోళప్పర్ ఒక్క క్షణం మననం చేసి, ముదలియాండాన్ వంటి గొప్ప వంశములో జన్మించి, విద్వాంసుడై నందున తన తప్పిదమును గ్రహించిరి. వారు ఆమెతో “నీవు చెప్పినదంతయు యధార్ధము. నేను చాలా పెద్ద తప్పు చేసితిని. ఇప్పుడు నేను ఏమి చేయవలెను?” అని పలికిరి. ఆమె వారితో “మీరు నదిలో పోగొట్టుకున్న దానిని, చిన్న కొలనులో వెతకరాదు” అనెను. దానికి “మీ భావమేమిటి” అని వారు అడిగిరి. దానికి ఆమె “నంపిళ్ళైకు మీరు నేరము చెసినారు, కావున మిక్కిలి దయాళువులైన వారి పాదపద్మములపై మోకరిల్లి,  క్షమాపణ కోరుడు. వారు మిమ్ములను తప్పక కరుణించగలరు. మీ పాపము నుండి విముక్తి కలుగును” అనెను. దానికి వారు “పెరియ పెరుమాళ్ ఎదురుగా నేను వారిని అవమానించి పెద్ద నేరమే చేసినాను. వారి ముందకు వెళ్ళుటకు కూడా నాకు మొఖము చెల్లుట లేదు. వారిని క్షమా బిక్ష అభ్యర్థించుటకు, నీవు కూడా దయతో నాతో రావలసినది” అనిరి. దానికి ఆమె అంగీకరించి, వారిరువురు తమ నివాసము వదిలి వెళ్ళుటకు ఉద్యుక్తులైరి.

ఆ సమయానికే, పెరుమాళ్ కోయిల్ నుండి బయలుదేరి నంపిళ్ళై తమ తిరుమాళిగైకు చేరి, తమ శిష్యులందరిని పంపించివేసి, సూర్యాస్తమయము వరకు ఉపవాసము చేసిరి. ఆ పిదప తమ శిరస్సును ఒక వస్త్రముచే కప్పివేసికొని, తోళప్పర్ నివాసమునకు ఒక్కరే నడచి వెళ్లి, వసారాలో వేచి వున్నారు. ఆ సమయమునకే, దీపము చేతబట్టుకొని ద్వారమును తెరచి తోళప్పర్ తమ సతీమణితో కలిసి నంపిళ్ళై తిరుమాలిగకు వెళ్ళుటకు సిద్ధమైరి. అక్కడ వసారాలో ఎవరో వున్నారని గమనించి, ఎవరది అని అడిగిరి. నంపిళ్ళై తనను తాను తిరుక్కలికన్ఱి దాసర్ను అని సంబోధించికొనిరి. నంపిళ్ళైని  అచట చూసి, తోళప్పర్ ఆశ్చర్యపోయి, వారితో (మరల అహంకారముతో) “పెరియ పెరుమాళ్ ముందు నాపై మీరు తిరిగి బిగ్గరగా అరవలేదు, కారణము, అక్కడ నాకు మంచి పేరు ఉన్నదని, అందుచే నన్ను ఏకాంతముగా ఇక్కడ అవమానించుటకు వచ్చితివి” అని పలికిరి. నంపిళ్ళై “నేను అందులకు ఇచటకు రాలేదు” అనిరి. తోళప్పర్ ఆశ్చర్యముతో “మరి ఇచటకు ఏల వచ్చితిరి?” అని అడిగిరి. నంపిళ్ళై “నా ప్రవర్తన వలన పెరియ పెరుమాళ్ ఎదురుగా ముదలియాండాన్ మనుమడు అవమానింపబడు పాపమును నేను చేసితిని. నేను ఇచటకు క్షమాబిక్షకై వచ్చితిని. మీరు నన్ను క్షమించగలరు” అనిరి. ఇది ఆలకించిన తోళప్పర్ పూర్తిగా శుద్ధులై, నంపిళ్ళైను ఆలింగనము చేసుకొనిరి. తరువాత వారు “నేటి వరకు మీరు కొంత మంది శిష్యులకే ఆచార్యులు అనే భావనలో నేను వున్నాను. కాని మీరు ఈ లోకమంతటికి ఆచార్యులు కాగల లక్షణములు కలవారని నాకు ఇప్పుడు అవగతమైనది. కావున నేటి నుండి మీరు ‘లోకాచార్యర్’ అని పిలువబడెదరు” అని పలికిరి. తదుపరి వారు నంపిళ్ళైను తమ తిరుమాలిగలోనికి ఆహ్వానించి, తమ సతీమణితో కలిసి వారికి గొప్ప సేవ చేసిరి. నంపిళ్ళై కూడ సంతుష్టులైరి. వారు నంపిళ్ళై పాదపద్మములను ఆశ్రయించి, అన్ని దైవ సంబంధములైన విషయములను అభ్యసించిరి. ఈ సంఘటనను మన జీయర్ ఉపదేశరత్త మాల 51 వ పాశురములో ఈ విధముగా వివరించిరి.

తున్ను పుగళ్ కన్దాడైత్ తోళప్పర్ తమ్ ఉగప్పాల్
ఎన్న ఉలగారియనో ఎన్ఱురైక్క
పిన్నై ఉలగారియన్ ఎన్నుమ్ పేర్ నమ్పిళ్ళైక్కు ఓంగి
విలగామల్ నిన్ఱదెన్ఱుమ్ మేల్

సాధారణ అనువాదము : శ్రీరంగములో మంచి పేరు గాంచిన కందాడై తోళప్పర్, నంపిళ్ళైను మిక్కిలి ఆప్యాయతతో ‘లోకాచార్యులు’ అని సంభోదించిరి. ఆ తదనంతరము, నంపిళ్ళై లోకాచార్యులన్న పేరు ప్రఖ్యాతులు శాశ్వతంగా నిలిచిపోయాయి.

నంపిళ్ళై మహిమ అపారమైనదని ఈ క్రింది పాశురము, శ్లోకముల ద్వారా అవగాహన పొందవచ్చును.

పిళ్ళై అళగియ మణవాళ దాసర్ అనుగ్రహించిన ఇయల్ సాఱ్ఱుఱైలోని ఒక శ్లోకము

నెన్జత్తిరున్తు నిరంతరమాగ నిరయత్తుయ్ క్కుం
వన్జక్కుఱుమ్బిన్ వగైయఱుత్తేన్
మాయవాదియర్ తామ్ అన్జప్పిరన్తవన్ చీమాదవనడిక్కన్బుచెయ్యుమ్
తన్జత్తొరువన్ చరణాంబుయం ఎన్ తలైక్కణిన్తే

సాధారణ అనువాదము : నంజీయర్ (మాయావాదులకు భయంకరుడైన) కు ప్రియ శిష్యులైన నంపిళ్ళై పాదపద్మములను ఆశ్రయించుటచే, నన్ను నరకమున పడద్రోయునటువంటి చెడు ఆలోచనలను నేను తొలగించుకొంటిని.

నమామి తౌ మాదవ శిష్య పాదౌ యత్ సన్నిధిమ్ సూక్తిమయీమ్ ప్రవిష్టాః
తత్రైవ నిత్యం స్తితిమాద్రియంతే వైకుంఠ సంసార విరక్త చిత్తాః

సాధారణ అనువాదము : నంజీయర్ శిష్యులైన నంపిళ్ళై పాదపద్మములను నేను ఆరాధించెదను. వారి మహిమాన్వితమైన మాటలను శ్రవణము చేసిన మనము, అత్యంత గొప్ప భగవత్ అనుభవమును పొంది, సంసారము మరియు శ్రీవైకుంఠము రెంటిపై కూడ నిర్లిప్తత పొందెదము.

శృత్వాపి వార్తాఞ్చ యదీయగోష్ట్యామ్ గోష్ట్యంతరాణామ్ ప్రధమా భవంతి
శ్రీమత్కలిద్వంసన దాస నామ్నే తస్మై నమస్ సూక్తిమహార్ణవాయ

సాధారణ అనువాదము:  నేను సూక్తి మహార్ణవ (దివ్య సూక్తుల మహా సాగరము వంటి నంపిళ్ళై)ను, శ్రీమద్ కలిధ్వంసన దాసర్ అని పేరు గాంచిన వారిని ఆరాధించెదను. వారి ప్రవచనములను ఆలకించిన తరువాత, ఆ గోష్టి మరి ఇతర అన్ని గోష్టిల కంటే అత్యుత్తమమైనదని అని మనం గ్రహించగలము.

వడక్కు తిరువీధి పిళ్ళై మరియు వారి ధర్మ పత్ని (ఇరువురు నంపిళ్ళై శిష్యులు, అతి విశ్వసనీయులు) ప్రాపంచిక విషయముల నుండి విరక్తిగా వుంటూ, నంపిళ్ళైను అన్ని విధముల సదా సేవించుచుండిరి. ఒకరోజు, వడక్కు తిరువీధి పిళ్ళై తిరుమాళిగకు నంపిళ్ళై వేంచేసిరి. వారి పాదపద్మములకు అందరు ప్రణమిల్లిరి. ఆ సమయమున వడక్కు తిరువీధి పిళ్ళై ధర్మ పత్ని తడి చీరను ధరించి ప్రణమిల్లినది. నంపిళ్ళై అక్కడ ఉన్న ఇతర స్త్రీలతో, ఆమె తడి వస్త్రములో ఉండుటకు కారణము ఏమి అని అడిగిరి. వారు, ఆమె ఋతుక్రమము తదుపరి, శుచిగా, మీ ఆశీర్వచనము పొందుటకై, ఆ విధముగా వచ్చెనని పలికిరి. మిక్కిలి సంతోషముతో, నంపిళ్ళై ఆమెను తమ దగ్గరకు ఆహ్వానించి, తమ దివ్యమైన హస్తముతో ఆమె ఉదరమును స్పృశించి “నా వలె కీర్తిగల పుత్రునికి జన్మనివ్వగలవు” అని ఆశీర్వదించిరి. ఇది తిలకించిన వడక్కు తిరువీధి పిళ్ళై, తమకు పుత్ర సంతానము కలుగుట తమ ఆచార్యునికి ఆనంద హేతువగునని గ్రహించి, తమ పత్నితో ఆ విధముగా మెలగసాగిరి. తదుపరి ఆమె గర్భముదాల్చి, ఒక సంవత్సరములోనే, దైవాంశ సంభూతుడైన పుత్రునికి జన్మనిచ్చెను. వడక్కు తిరువీధి పిళ్ళై అతనకి నంపిళ్ళై యొక్క దివ్య నామము ‘లోకాచార్యర్ ‘ (తరువాత పిళ్ళై లోకాచార్యులుగా పేరుగాంచిరి) అని నామకరణము చేసి, తమ ఆచార్యునిపై తమకున్న కృతజ్ఞతను ప్రకటించిరి.

నంపిళ్ళై, వడక్కు తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్యులు, అళగియ మణవాళ పెరుమాళ్ నయనార్

ఆ విధముగా నంపిళ్ళై దివ్య ఆశీర్వచనముచే, వడక్కు తిరువీధి పిళ్ళై పుత్రుడు పిళ్ళై లోకాచార్యులు జన్మించిరి. పిళ్ళై లోకాచార్యులు తమ దివ్య అనుగ్రహము, అపారమైన కరుణచే, జీవాత్మలు ఉద్దరింప బడవలెనని, అనేక దివ్య గ్రంధములను మనకు అనుగ్రహించిరి. అవి తత్వ త్రయము, రహస్య త్రయము (ముముక్షుపడి మొ ||), శ్రీ వచన భూషణము మొ || నవి. అత్యంత గొప్యమైన సందేశములను అతి సరళ శైలిలో రచించి మనకు బోధించిరి. పిళ్ళై లోకాచార్యులు జన్మించిన ఒక సంవత్సరము తరువాత, వడక్కు తిరువీధి పిళ్ళై దంపతులకు మరియొక అందమైన పుత్రుడు (స్వయముగా శ్రీరంగనాధుని దివ్య కృపచే) జన్మించెను. అతనికి అళగియ మణవాళ పెరుమాళ్ నయనార్ అని నామకరణము చేసిరి. వీరు ఆచార్య హృదయము (నమ్మాళ్వార్ల దివ్య హృదయమును తెలుపును) అను దివ్య గ్రంధమును అనుగ్రహించిరి.

ఆ విధముగా, తిరుమంగై ఆళ్వార్ల విశేష అవతారమైన లోకాచార్యర్ (నంపిళ్ళై)  గొప్ప జీవితమును జీవించారు. నా ఆచార్యులైన (మాముణులు), వారి పితరులైన తిగళక్కిడంతాన్ తిరునావీఱుడైయపిరాన్ తాతరణ్ణర్, వారి 5 సంవత్సరాల వయస్సులో పెద్దల మార్గదర్శకములో నంపిళ్ళై యొక్క శిష్యులైరని తెలిపిరి.

అనువాదకుని సూచన: ఈ విధముగా మనము నంపిళ్ళై దివ్య మహిమలను దర్శించి, పూర్తిగా ఆనందించితిమి. ఈ సంఘటనల ద్వారా సంసారమును సాగిస్తూ పరమపదమునకు సరి అయిన మార్గము లభింపవలెననిన, ఆచార్యుని కృపయే మనకు తప్పనిసరి అని తెలియుచున్నది. పైగా ఈ ఈ సంసారములో ఉంటూ శిష్యుడు తనకు తగిన కైంకర్యములో నిమగ్నుడై ఉండి జీవనం సాగించవలెను.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-9.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s