Monthly Archives: July 2022

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 36

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 35

నాయనార్ పెరుమాళ్ కోయిల్ ని దర్శించుట

నాయనార్లు తిరుమల నుండి బయలుదేరి, దారిలో పలు చోట్ల రెండు రోజులు ఆగి, “ఉలగేత్తుమ్ ఆళియాన్ అత్తియూరాన్” (దివ్య శంఖ చక్రాలను ధరించి కాంచీపురంలో కొలువై ఉన్నవాడు) అని పాశురంలో చెప్పినట్లు వారిని సేవించుటకై కాంచీపురం చేరుకున్నారు.

శ్లోకము….

దూరస్థితేపి మయిదృష్టి పదంప్రపన్నేదుఃఖం విహాయ పరమం సుఖమేష్యతీతి
మత్వేవయత్గగనకంపినతార్థిహంతుః తర్ గోపురం భగవతశ్శరణం ప్రపద్యే

(ఆకాశాన్ని అంటుకునేటంత ఎత్తైన గోపురము క్రింద కొలువై ఉన్న ప్రణతార్తిహరుడు పేరరుళాళన్ (కంచి దేవ పెరుమాళ్) ను నేను ఆశ్రయించుచున్నాను. ఆతడు అల్లంత దూరంలో ఉన్నప్పటికీ, ఆతడి చల్లని చూపు రూపముగా వారి కటాక్షం పడితే, ఆ వ్యక్తి దుఃఖాలు తొలగి సకల సౌఖ్యాలను పొందుతాడు), నాయనార్లు తిరుగోపుర నాయనార్ (దివ్య ఆలయ గోపురం) ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు. ఆలయంలోకి ప్రవేశించి, పుణ్యకోటి విమానాన్ని సేవించి, కోవెలలోని దివ్య అనంత పుష్కరిణిలో స్నానమాచరించి ద్వాదశ ఊర్ధ్వ పుండ్రములను ధరించిన తరువాత, సంప్రదాయ రీతిలో ఆళ్వార్లను సేవించి, బలిపీఠం ఎదుట సాష్టాంగము చేసి, ప్రధాన ఆలయంలోకి ప్రవేశించి, శేర్ందవల్లి నాచ్చియార్, శ్రీ రాముడు (చక్రవర్తి తిరుమగన్) ఆపైన తిరువనంత ఆళ్వాన్ (ఆదిశేషుడు) లను సేవించారు. తరువాత వారు ప్రదక్షిణగా వెళ్లి, ఆళవందార్లు కృపతో ఇళైయాళ్వార్ (భగవద్ రామానుజులు) లను అనుగ్రహించిన దివ్య ప్రాంగణాన్ని సేవించి, వారు నివాసమున్న కరియమాణిక్క సన్నిధి, అలాగే తిరుమడప్పళ్ళి నాచ్చియార్ (ఆలయ వంటశాలలోని శ్రీమహాలక్ష్మి) ని సేవించుకున్నారు. తరువాత వారు పేరరుళాళర్ల దివ్య పత్ని అయిన పెరుందేవి తాయర్ (శ్రీ మహాలక్ష్మి) ను దర్శించుకున్నారు. తాయార్ ను ఇలా కీర్తిస్తారు….

ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసినీం
అశేష జగధీశిత్రీం వందే వరద వల్లభాం

(నిత్య పద్మ నివాసిని, సర్వ లోక నియామకుడు అయిన దేవ పెరుమాళ్ళ దివ్య పత్ని, అనన్య శేషత్వం (ఎమ్పెరుమానునికి తప్ప మరెవరికీ సేవ చేయకుండుట), అనన్య శరణత్వం (ఎమ్పెరుమానుని తప్ప మరెవరినీ ఆశ్రయించకుండుట) మరియు అనన్య భోగ్యత్వం (ఎమ్పెరుమాన్ తప్ప మరెవ్వరికీ భోగ్య వస్తువుగా ఉండకుండుట) కలిగి ఉన్న పెరుందేవి తాయర్ దివ్య పాదాలకు నేను నమస్కరిస్తున్నాను). ఆ దివ్య దేశ నిత్య నివాసులందరి పురుషకారముతో పెరుందేవి తాయర్ యొక్క కృపతో వీరు పెరియ తిరువడి (గరుడ), నరసింహ పెరుమాళ్, శూడిక్కొడుత్త నాచ్చియార్ (ఆండాళ్) మరియు సేనై మొదలియార్ (విష్వక్సేనులు) లను సేవించుకున్నారు. ప్రదక్షిణగా శ్రీ హస్తి గిరి వద్దకు వెళ్లి, “ఏషతం కరిగిరిం సమాశ్రయే” (నేను హస్తిగిరి పర్వతాన్ని ఆశ్రయించుచున్నాను) అని చెప్పినట్లుగా, వారు మెట్ల దగ్గర సాష్టాంగ నమస్కారము చేసి, మలయాళ నాచ్చియార్‌ ను దర్శించుకొని, మెట్లు ఎక్కారు. కంచి వరదుడు తిరుక్కచ్చి నంబి సమక్షంలో రామానుజులను తిరురంగ పెరుమాళ్ అరైయర్ కు ప్రసాదించిన కచ్చిక్కు వాయ్ త్తాన్ అను దివ్య మందిరంలోకి ప్రవేశించి, “ఇదే కదా ఆ దివ్య స్థలం!” అని వాపోయెను. ఇలా వర్ణింపబడింది….

సింధురాజశిరోరత్నం ఇందిరావాస వక్షసం
వందే వరదం వేదిమేధినీ గృహమేధినం

(దివ్య హస్తి గిరి పర్వతానికి తలమానికం, దివ్య ఆభరణం వంటి వాడు, అలర్మేల్ మంగ నిత్య నివాసము చేసే దివ్య వక్షస్థలం కలిగి ఉన్నవాడు, యాగ భూమికి అధిపతి (బ్రహ్మ యాగము చేసిన చోటు) అయిన వరదరాజుని దివ్య చరణాలను ఆశ్రయించు చున్నాను), ఈ శ్లోకములో చెప్పినట్లు పుణ్యకోటి విమానం మధ్యలో ఉన్న పేరారుళాళర్ ను సేవించారు.

రామానుజాంగ్రి శరణేస్మి కులప్రదీపః ద్వాసీత్స యామునమునేః స చ నాథవంశ్యః
వంశ్యః పరాంగుశమునేః స చ సో’పి దేవ్యః దాసస్త్వవేది వరదాస్మి తవేక్షణీయః

(ఓ పేరారుళాళ! ఆళవందార్ల జ్ఞాన వంశానికి అలంకార దీపము వంటి ఎమ్పెరుమానార్ల ఆశ్రయం పొందిన వాడను నేను; ఆ ఆళవందార్ నాథముని వంశానికి చెందినవారు; ఆ నాథముని నమ్మాళ్వార్ల  జ్ఞాన గోష్టికి చెందినవారు; ఆ ఆళ్వారు పిరాట్టికి దాసులు; అందుకని ఈ పరంపర ద్వారా, అడియేన్ దేవరువారి దివ్య కృపకు అర్హుడను). వరదరాజునికి సాష్టాంగము చేసి, తిరుప్పల్లాండు, వరదరాజ అష్టకం, స్తోత్రలు, గద్యాలు సేవించి తమ మంగళాశాసనాలు సమర్పించుకున్నారు. దేవ పెరుమాళ్ళు కూడా “నమ్మిరామానుశనై ప్పోలే ఇరుప్పార్ ఒరువరై ప్పెఱువదే” (రామానుజుల వంటి వారిని పొందడం ఎంత భాగ్యము!) అని తమ కరుణను వారిపై కురిపించి, తీర్థ శఠారిని వారికి అందించారు. పెరుమాళ్ళ అనుమతితో నాయనార్లు సెలవు తీసుకొని కంచి పట్టణములోని తిరువెక్క మొదలైన ఇతర దివ్య దేశాలను సేవించుకునేందుకు బయలుదేరారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/20/yathindhra-pravana-prabhavam-36/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 14

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/07/18/anthimopaya-nishtai-13/, మనము ఆచార్య అపచారము, వాని యొక్క దుష్పరిణామముల గురించి వివరముగా గమనించాము. ఈ భాగములో మనము భాగవత అపచారము గురించి అవగాహన చేసుకొందాము.

ఇప్పుడు మనము భాగవత అపచారమును తిలకించెదము .

శ్రీ వచన భూషణము 307 వ సూత్రం – ‘ఇవై యొన్ఱుక్కొన్ఱు క్రూరన్గళుమాయ్, ఉపాయ విరోధిగళుమాయ్, ఉపేయ విరోధిగళుమాయ్ యిరుక్కుమ్’

సాధారణ అనువాదము: ఇవి (అకృత్య కరణము – శాస్త్రవిరుద్ధమైనవి చేయుట,
భగవత్ అపచారము – భగవానుని పట్ల తప్పు చేయుట, భాగవత అపచారము – భాగవతుల పట్ల తప్పు చేయుట, అసహ్యాపచారము – అకారణముగా భగవత్ / భాగవతుల పట్ల అపచారము చేయుట) అన్నియు మునుపు దాని కంటే అతి క్రూరమైనవి. అనగా, భగవత్ అపచారము అకృత్య కరణము కన్నా క్రూరమైనది, భాగవత అపచారము భగవత్ అపచారము కంటే క్రూరమైనది, అసహ్యాపచారము భాగవత అపచారము కంటే క్రూరమైనది. ఇవన్నీ మన సాధనములకు, మన అంతిమ లక్ష్యము పొందుటకు అవరోధములు.

కూరత్తాళ్వాన్ శిష్యులైన వీర సుందర బ్రహ్మ రాయన్ (ఆ ప్రాంతపు రాజు) ఒకసారి ఆళ్వాన్ కుమారులైన పరాశరభట్టర్ పై శత్రుత్వమును పెంచుకొనిరి. వారు భట్టర్ ను వేధించగా, ఆ బాధను భరించేక శ్రీరంగమును వీడి, తిరుక్కోష్ఠియూర్ చేరిరి. భట్టరే స్వయముగా ఈ విషయమును తమ శ్రీరంగరాజ స్తోత్రము 5 వ శ్లోకములో వెల్లడించిరి.

పూగీ కణ్ఠద్వయస సరస స్నిగ్ధ నీరోపకణ్ఠాం
ఆవిర్మోద స్తిమిత శకునానూదిత బ్రహ్మఘోషామ్
మార్గే మార్గే పధికనివహై రుంజ్య మానాపవర్గాం
పశ్యేయం తాం పునరపి పురీం శ్రీమతీం రఙ్గధామ్నః

సాధారణ అనువాదము: పచ్చని చేట్లు నీటి వనరులతో, దివ్య సంపద సౌందర్యాలతో అలరారుతూ, మనస్సునకు ఆహ్లాదమును చేకూర్చే శ్రీరంగ దివ్య దేశమును మరలా ఎప్పుడు చూస్తానో?  అక్కడి పక్షులు నిరంతరము చేయు వీనులవిందైన శబ్దాలు, వేద ఘోషను పోలి ఉండును. ఆ దివ్య దేశం దారి మోక్ష సాధకుల సమూహముతో నిండి వుంటుంది.

తిరుక్కోష్ఠియూర్లో సౌమ్య శ్రీనారాయణ ఎంపెరుమాన్ పాదపద్మముల చెంత నంజీయర్ తో పాటు భట్టర్ – కాని వారి మనస్సు శ్రీరంగం లోనే

పై శ్లోకము ద్వారా, భట్టర్ తాను శ్రీరంగము, శ్రీరంగనాధుని నుండి దూరమగుట వలన కలిగిన వేదనను వెల్లడించిరి. ఆ సమయములో ఒక శ్రీవైష్ణవుడు భట్టరు వద్దకు వచ్చి, వారిని సేవించి, తనకు తిరువిరుత్తము బోధించమని అభ్యర్థించిరి. భట్టరు తన శిష్యుడైన నంజీయర్ వంకకు తిరిగి “జీయ! శ్రీరంగానికి,  రంగనాధునికి దూరమైన నేను, ఏ విషయము గురించి మాట్లాడలేను. తిరువిరుత్తం అర్థాలను నీవు ఈ శ్రీవైష్ణవునికి వివరించుము” అని పలికి, ఆ శ్రీవైష్ణవునికి నంజీయర్ పాదపద్మములను చూపిరి. తదుపరి కొంత కాలము గడచిన పిదప, భట్టర్ ను కష్టముల పాలు చేసిన వీర సుందర బ్రహ్మ రాయన్ గతించిరి. భట్టర్ తల్లి ఆండాళ్ ను కొందరు శ్రీవైష్ణవులు కాపాడుచు, వారి ఉపదేశములను పాటించుచుండిరి, ఈ వార్తను ఆలకించి, తమ ఉత్తరీయమును గాలిలోనికి ఎగురవేసి సంబరములు జరుపుకొనిరి. దీనిని గమనించి ఆండాళ్ తమ తీరుమాళిగకు వెనువెంటనే చేరి, ద్వారములు మూసి, బిగ్గరగా రోదించసాగిరి. గొప్పగా సంబరములలో నున్న ఆ శ్రీవైష్ణవులు, ఆండాళ్ వైపునకు తిరిగి “భట్టర్ వారి శత్రువు గతించినందులకు మీరు సంతోషముగా లేరా, భట్టర్ ఇచ్చటకు తిరిగి వచ్చెదరు కదా! మనమంతా కలిసి గొప్ప సత్సంగము చేయమా? ” అని అడిగిరి.

ఆండాళ్ సమాధానముగా “మీకు తెలియదు. వీర సుందర బ్రహ్మ రాయన్ ఆళ్వాన్ శిష్యులు. కాని వారు భట్టర్ను మిక్కిలి కష్టపెట్టి మహాపరాధమును ఒడిగట్టుకొనిరి. దీనికి తోడు అతను భట్టర్ వారిని మరల కలువలేదు, నేను అపరాధము చేసితినని, దయతో నన్ను క్షమించమని వారి పాదపద్మములపై శిరస్సు వంచి క్షమాభిక్షను కూడా కోరలేదు. ఇప్పుడు వారు గతించిరి కూడా. వారు తమ తనువును వీడిన వెంటనే యమధర్మరాజు భటులు వారిని తీసుకొని వెళ్ళిరి. వారి చేతులలో, వారు అనుభవించు బాధలను నేను తట్టుకోలేను. మీరు, నా ఈ భావనను గ్రహించలేరు” అనిరి. ఈ విధముగా నా ఆచార్యులు (మాముణులు), భాగవత అపచార ఫలము క్రూరముగా నుండునని తెలిపిరి.

భట్టర్ శిష్యులైన కడక్కత్తు ప్పిళ్ళై చోళ మండలము (ఒక ప్రాంతము) లో నివసించుచుండగా, ఉడయవర్లచే సంపూర్ణ శిక్షణ పొందిన సోమాసియాండన్ గురించి వినిరి. సోమాసియాండన్ తిరునారాయణపురంలో నివసించుచు అనేకులకి శ్రీభాష్యముపై శిక్షణనిచ్చెడి వారు. పిళ్ళై, తిరునారాయణపురము జేరిరి. వారిని దర్శించిన సోమాసియాండన్ అమితానందమును పొంది తమ తీరుమాళిగలో బస చేయమని వారిని ఆహ్వానించిరి. తదుపరి పిళ్ళై ఒక సంవత్సర కాలము శ్రీభాష్యము, భగవద్విషయము ఇత్యాదులపై ఆండాన్ ఉపదేశమును శ్రవణము చేసిరి. శాత్తుముఱై (చివరి సమావేశము) పిదప, పిళ్ళై తమ తిరుగు ప్రయాణము ప్రారంభించిరి. పిళ్ళైకు తోడుగా ఆండాన్ తిరునారాయణపురం సరిహద్దుల వరకు వెళ్ళిరి (అనువాదకుని గమనిక: సందర్శకులుగా వచ్చిన శ్రీవైష్ణవులను గ్రామ సరిహద్దు వరకు లేక నీటి వసతి వరకు కలిసి వెళ్లి, ఘనముగా సాగనంపుట శ్రీవైష్ణవుల యొక్క ఆచారము), “మీరు ఇచ్చట ఒక సంవత్సర కాలము నివసించుట నాకు గర్వకారణము; ఇప్పుడు మీ ఎడబాటు నాకు మిక్కిలి విచారకరముగా ఉంది: నేను దేనిని ఆశ్రయించాలి  అను విలువైన ఆదేశమును ఇచ్చి దీవించుడు” అని పలికిరి. పిళ్ళై “సోమాసియాండన్! మీరు గొప్ప జ్ఞానులు, శ్రీభాష్యము మరియు భగవద్విషయము రెంటిపై నిష్ణాతులు. అయినను, మీరు భాగవత అపచారము చేయరాదని సదా జ్ఞప్తికి వచ్చుటకై, మీ ఉత్తరీయమునకు ఒక ముడిని బిగించిరి” అని సమాధానమిచ్చిరి. ఈ సంఘటనను నా ఆచార్యులు (మాముణులు) వెల్లడించిరి. (అనువాదకుని గమనిక : పై ఉత్తరీయమునకు ముడి బిగించుట ఒక ఆచారము, దానిని చూచినంతనే మరచిన విషయము స్ఫురణకు రాగలదు).

ప్రాతుర్భావై స్సురనరసమో దేవదేవస్తదీయాః జాత్యా వృత్తేర్ అపి చ గుణతః తాదృశో నాత్ర గర్హా
కింతు శ్రీమద్బువనభవన త్రాణతోన్యేషు విద్యావృత్తప్రాయో భవతి విధవాకల్పకల్పః ప్రకర్శః

సాధారణ అనువాదము : పరమాత్మ భక్తులు, వారి జన్మ , కులము, చర్యలు లేక గుణముల వలన మానవులను కాని దేవతలను కాని పోలి ఉండుటచే, వారు యధార్ధముగా స్వయముగా పరమాత్మకు సమానులు. వారిని నిందించరాదు. వారు పెరుమాళ్ళ ఆలయములను, వాటి భూములను కాపాడుచుందురు. వారు జ్ఞాన అనుష్ఠానములలో ప్రవీణులు. వారు పండితులలో ఆభరణముల వలె అద్భుత కాంతి కలిగి ఉందురు.

అర్చావతారోపాదానమ్ వైష్ణవోత్పత్తి చింతనమ్
మాతృయోని పరీక్ష్యాస్తుల్యమాహూర్ మనీషిణః

సాధారణ అనువాదము : పండితవర్యులు గుర్తించినట్లు, ఎంపెరుమానుని దివ్య అర్చా రూపమును, దాని ముడి పదార్ధము ఆధారముగా యోగ్యత నిర్ణయించుట, ఒక వైష్ణవుని అతని జన్మ ఆధారముగా అర్హత నిర్ణయించుట అనేది తమ స్వంత తల్లి శీలమును అనుమానించుటతో సమానము.

అర్చాయామేవ మామ్ పస్యన్ మద్భక్తేషుచ మామ్ దృహన్
విషదగ్దైర్ అగ్నిదగ్దైర్ ఆయుదైర్హన్తిమామసౌ

సాధారణ అనువాదము : నన్ను నా భక్తులలో కాక, ఒక అర్చావతారములో మాత్రమే దర్శించుట, నన్ను తీవ్రమైన విషము, అగ్ని మరియు ఆయుధములతో గాయపరచుటతో వంటిది.

యా ప్రీతిర్మయి సంవృత్తా మద్భక్తేషు సదాస్తు తే
అవమానక్రియా తేశామ్ సంహరతి అఖిలమ్ జగత్

సాధారణ అనువాదము : భక్తులపై నాకు గల ప్రేమ సదా పెరుగుచూ నుండును. ఎంతనగా అనగా వారికి అవమానము జరిగినచో ఈ జగత్తునంతను అంతము చేయు వరకు కూడ వెళ్లును.

మద్భక్తమ్ స్వపచమవాపి నిందామ్ కుర్వంతి యే నరాః
పద్మకోటి శతేనాపి న క్షమామి కథాచన

సాధారణ అనువాదము : నా భక్తునిపై నిందారోపణలు చేయు వారిని, వారు ఛండాలుడైనను, కొన్ని లక్షల సంవత్సరములు గడచినను, నేను వారిని క్షమించను.

చండాలమపి మద్భక్తమ్ నావమన్యేత బుద్దిమాన్
అవమానాత్ పదత్యేవ రౌరవే నరకే నరః

సాధారణ అనువాదము : నా భక్తుని, అతను ఛండాలుడైనా సరే, ఒక తెలివైన వ్యక్తి అవమానము చేయరాదు, కారణము అతను నా భక్తుని అవమానపరిస్తే నిశ్చయముగా రౌరవాది నరకములో పడును.

అశ్వమేధ సహస్రాణి వాజపేయ సతానిచ
నిష్కృతిర్ నాస్తి నాస్త్యేవ వైష్ణవ ద్వేషినామ్ నృణామ్

సాధారణ అనువాదము : వైష్ణవులపై ద్వేషము కల వారు, ఒక సహస్ర అశ్వమేధ యాగములు లేక నూరు వాజపేయ యాగములు జరిపినను నిష్కృతి లేదు.

శూద్రమ్ వా భగవత్ భక్తమ్ నిషాదమ్ స్వపచమ్ తథా
ఈశతే జాతి సామాన్యాన్ స యాతి నరకమ్ దృవమ్

సాధారణ అనువాదము : భగవత్ భక్తుడిని జన్మతః శూద్రుడు, నిషాదుడు లేక స్వపచ అనే దృష్టితో వివక్షగా ఎవరైతే చూచెదరో, వారు ఘోరమైన నరకమును జేరెదరు.

అనాచారాన్ దురాచారాన్ అజ్ఞ్యాతౄన్ హీనజన్మనః
మద్భక్తాన్ శ్రోత్రియో నిందన్ సత్యాస్ చండాలతాం వ్రజేత్

సాధారణ అనువాదము : వేదములలో పండితుడైన వ్యక్తి, నా భక్తులకు నిబద్ధత, న్యాయము, జ్ఞానము లేదని నిందను మోపితే, అతను నిశ్చయముగా ఛండాల గుణమును పొందును.

అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్
సాధురేవ స మంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సః

సాధారణ అనువాదము : అత్యంత ఘోరమైన కార్యములు చేసినను, నా భక్తుడైనచో, అతనిని పవిత్రునిగా భావించాలి.

సర్వైశ్ఛ లక్షణైర్యుక్తో నియతశ్చ స్వకర్మసు
యస్తు భాగవతాన్ ద్వేష్టి సుదూరమ్ ప్రచ్యుతో హి సః

సాధారణ అనువాదము : ఎవరైతే అన్ని సుగుణములు కలిగి ధర్మ బద్ధమైన కార్యములలో నిబద్ధతో నున్నను, అతను భగవానుని భక్తులపై ద్వేషముగా వున్నచో సుదూర ప్రాంతములకు బహిష్కృతుడగును.

తిరుమాలై 43

అమర ఓర్ అంగమాఱుం వేదమోర్ నాన్గుమోది
తమర్గళిల్ తలైవరాయ శాది అంతణర్గళేలుమ్
నుమర్గళై ప్పళిప్పరాగిల్ నొడిప్పదోర్ అళవిల్
ఆంగే అవర్గళ్ తామ్ పులైయర్ పోలుమ్ అరంగమానగరుళానే

సాధారణ అనువాదము : ప్రియ శ్రీరంగనాధ! నాలుగు వేదాలు, ఆరు వేదాంగాలలో నిష్ణాతులై, వైష్ణవులలో అగ్రగణ్యులైన బ్రాహ్మణులైనను, నీ భక్తులకు మనస్తాపము కలిగించినచో వెంటనే, అక్కడే, వారు అత్యల్పులగుదురు.

శ్రీవచన భూషణము 192వ సూత్రం –  “ఈశ్వరనవతరిత్తు ప్పణ్ణిన ఆనైతొళిల్ కళెల్లామ్ భాగవతాపచారమ్ పొఱామై” ఎన్ఱు జీయర్ అరుళిచ్చెయ్వర్

సాధారణ అనువాదము : తన భక్తులకు మనస్తాపము కలిగినచో భరించలేడు కనుక భగవానుడు ప్రత్యక్షమై అనేక క్లిష్ట కార్యములను జరిపినట్లు నంజీయర్ ప్రముఖముగా తెలిపిరి.

శ్రీవచన భూషణము 194 – 197 వ సూత్రం – ‘భాగవతాపచారం తాన్ అనేక విధమ్; అతిలే యొన్ఱు అవర్గళ్ పక్కల్ జన్మ నిరూపణమ్;  ఇతుతాన్ అర్చావతారత్తిల్ ఉపాదానస్మృతియులుమ్ కాట్టిల్ క్రూరమ్; ఆత్తై మాతృ యోని పరీక్షై యోడోక్కుమ్ ఎన్ఱు శాస్త్రమ్ శొల్లుమ్.’

సాధారణ అనువాదము : భాగవతాపచారము పలు విధములు. జన్మ ఆధారముగా అర్హతను నిర్ణయించుట వానిలో ఒక విధము. దివ్య అర్చామూర్తిగా వున్న ఎంపెరుమానుని ముడి పదార్ధము ఆధారముగా అర్హత నిర్ణయించుట కంటే ఇది క్రూరమైనది. శాస్త్రము ప్రకారము, దివ్య అర్చామూర్తిగా నున్న ఎంపెరుమాన్ అర్హతను నిరూపించుట అనగా తన స్వంత తల్లి శీలమును అనుమానించుటతో పోల్చవచ్చును.

శ్రీవచన భూషణము 198 వ సూత్రం –  ‘త్రిశంకువైప్పోలే కర్మ చండాలనాయ్ మార్విలిట్ట యజ్ఞోపవీతమ్ తానే వారాయ్విడుమ్’

సాధారణ అనువాదము : భాగవతాపచారము చేసిన వారు, త్రిశంకు వలె కర్మ ఛండాలుడు (తన చర్యల ద్వారా ఈ జన్మలోనే ఛండాలుడగుట ) అగుట, తన యజ్ఞోపవీతమే ఉరితాడు అయి, కంఠమును బిగించి నులిమి వేయును.

శ్రీవచన భూషణము 199 – 200 వ సూత్రం – జాతి చండాలనుక్కు క్కాలాన్తరత్తిలే భాగవతనాకైక్కు యోగ్యతై యుణ్డు. అతువుమిల్లై యివనుక్కు; ఆరూఢ పతితనాకైయాలే.

సాధారణ అనువాదము : జన్మతః చండాలునికి, ఏదో ఒక సమయములో, భాగవతుడగు అవకాశము కలదు. కాని కర్మ ఛండాలునికి అట్టి ఆశ మృగ్యము ఏలనన అతను అత్యున్నత స్థానము నుంచి దిగజారుటచే.

మన సమాజమునకు నాయకులైన ఆళ్వార్లు, శ్రీవైష్ణవులని గొప్పగా కీర్తించెదరు, ఒక శ్రీవైష్ణవుడు మరియొక శ్రీవైష్ణవుడు తమతో సమానుడనే భావన కూడ భాగవతాపచారమే అగును.

ఆళ్వార్లు శ్రీవైష్ణవులని వివిధ మార్గములలో కీర్తించెదరు :

  • తిరువుడైమన్నార్ – అమితమైన కైంకర్యశ్రీ కలిగినవారు (రాజులు)
  • శెజుమామణిగళ్ – సుందరమైన పెద్ద ముత్యములు
  • నిలత్తేవర్ – ఈ జగత్తులోని దేవతలు
  • పెరుమక్కళ్ – ఉన్నతమైన వారు
  • తెళ్ళియార్ – గొప్ప మేధావులు
  • పెరుంత్తవత్తార్ – మిక్కిలి నిరాడంబరులు
  • ఉరువుడైయార్ – సుందరులు
  • ఇళైయార్ – యవ్వనులు (మరియు సుందరులు)
  • వళ్లార్ – జ్ఞానులు
  • ఒత్తువళ్లార్ – వేద నిష్ణాతులు
  • తక్కార్ – మిక్కిలి తగిన వారు (కీర్తించుటకు)
  • మిక్కార్ – మన కన్నా మేలైనవారు
  • వేదవిమలర్ – స్వచ్ఛమైన వైదికులు
  • శిఱుమామనిసర్ – రూపములో చిన్నవారు కాని గుణాలలో గొప్పవారు
  • ఎంపిరాన్తన చిన్నన్గళ్ – నా పరమాత్మ యొక్క ప్రతినిధులు

భాగవతాపచార దుష్పరిణామములపై మరికొన్ని ముఖ్య ప్రమాణములు

తస్య బ్రహ్మవిధాగసః 

సాధారణ అనువాదము : బ్రహ్మ జ్ఞానము చేరువలో నున్న వారిని కీర్తించుట (స్పష్టమైన భావము లేదు)

నాహమ్ విసంగే సురరాజవజ్రాంత త్ర్యక్ష శూలాన్ న యమస్య దండాత్
నాజ్ఞోర్కసోమానిల విత్తహస్తాత్ శంగే బృశం భాగవతాపచారాత్

సాధారణ అనువాదము: నేను ఇంద్రుని వజ్రాయుధము యొక్క ఆగ్రహమునకు గాని, యముని భటులకు గాని లేక అగ్ని, చంద్రుడు, ఇతర దేవతల కోపమునకు గాని భీతిల్లను. కాని భాగవతాపచారమునకు మిక్కిలిగా భయపడెదను.

బ్రహ్మవిధోపమానాత్

సాధారణ అనువాదము : బ్రహ్మ జ్ఞానము కల వానితో పోల్చుట (భావము అస్పష్ఠముగా నున్నది).

ఆయుశ్రియమ్ యశో ధర్మమ్ లోకానాశిష ఏవ చ
హన్తి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమః

సాధారణ అనువాదము : దీర్ఘాయువు, సంపద, నైపుణము, గౌరవము, శ్రేష్ఠత మరియు అతనికి అనుకూలమైన ప్రతీది కూడ అతని అతిక్రమణచే నాశనము చెందును (భాగవతాపచారము చే)

నిందంతియే భాగవత్చరణారవింద చింతావధూత సకలాఖిలకల్మషౌకాన్
తేశామ్ యశోదనసుకాయుర పత్యబందు మిత్రాణి చ స్తిరతరాణ్యపి యాంతి నాశమ్

సాధారణ అనువాదము : భగవానుని పాదపద్మములే అన్ని కల్మషములు హరించుటకు ఆధారామని భావించు భక్తులను నిందించు వారు తమ కీర్తిని, సంపదను, దీర్ఘాయుశ్శును, సంతానమును, బంధువులను, మిత్రులను, తమ స్వాధీనములోనివన్నీ కోల్పోవును.

అప్యర్చయిత్వా గోవిందమ్ తదీయాన్ నార్చయింత్యే
న తే విష్ణోః ప్రసాదస్య భాజనమ్ డాంబికాజనాః 

సాధారణ అనువాదము : పరమాత్మను మాత్రమే అర్చించి, వాని భక్తులను పూజించని కపటులు భగవానుని కృపకు పాత్రులు కారు.

శ్రీవచన భూషణము 204 వ సూత్రం –  ‘..ఇళవుక్కు అవర్గళ్ పక్కల్ అపచారమే పోరుమ్’

ఎట్లు స్వచ్చమైన భాగవతునితో గల అనుబంధము (మనకు జ్ఞాన అనుష్టానము లేకున్నను) ఒక ఆహ్లాదకరమైన ఫలితము నిచ్చునో, అటులనే మనకు సంపూర్ణ జ్ఞానము మరియు అనుష్టానము వున్నను, అట్టి భాగవతులకు ఒనర్చు అపచారమే, మనను దానికి దూరము చేయును.

వైష్ణవానామ్ పరీవాదమ్ యో మహాన్ శృణుతే నరః
శంకు పిస్తస్య నారాచైః కుర్యాత్ కర్ణస్య పూరణమ్

సాధారణ అనువాదము : వైష్ణవుని పై దూషణలను ఆలకించిన వారి చెవులు బల్లెములతో, బాణములతో నిండి పోవును.

శ్రీవచన భూషణము 203 వ సూత్రం –ఇవ్విడత్తిలే వైనతేయ వృత్తాన్తత్తైయుమ్, పిళ్ళైప్పిళ్ళైయాళ్వానుక్కు ఆళ్వాను పణిత్త వార్ త్తైయైయుమ్ స్మరిప్పతు

అపచారమొనర్చిన గరుడాళ్వార్ల రెక్కలను దహించివేస్తున్న అగ్ని

సాధారణ అనువాదము : ఇది అర్ధము కావలెననిన (భాగవతాపచారము యొక్క క్రూరత్వము) వైనతేయుని సంఘటనను (శాండిలిని దివ్యదేశమునకు బదులుగా దూరముగా ఏల నివసించుచున్నదని తలంచిన మాత్రమే గరుడుని రెక్కలు ఆహుతి అయినవి), పిళ్ళై పిళ్ళై కు భాగవతపచారము వీడుటపై ఆళ్వాన్ ఆదేశములపై ధ్యానమొనర్చుట.

ఈ విధముగా ఆచార్యాపచారము, భాగవతాపచారము అతి క్రూర ప్రవృత్తి కలవని వేదశాస్త్రము, పురాణములు, శాస్త్రసారము తెలిసిన జ్ఞానులు, ఆళ్వార్లు, మన ఆచార్యులు అనేక మార్లు వివరించిరి. ఇది అర్ధము అయిన ఆస్తికుడు (శాస్త్రమును నమ్మినవారు), సంసార బంధము నుండి ఉపశమనముపై దృష్టి కలవాడు, సరియైన గురువులు మరియు మనను సదా కాపాడువారైన భాగవతులపై ఎట్టి పరిస్థితులలోనూ అపచారమొనర్చరాదు. (స్వప్నములో నైనను). మా జీయర్ (మాముముణులు) ఈ విషయములను విస్మరించి చిన్న అపచారము చేసినను దానినుండి కోలుకోలేము, భూమి బ్రద్ధలైనచో దానిని కలపలేము, సాగరము భూమి పైకి వచ్చిన ఆ ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు, ఒక పర్వతము శిరస్సున పడినచో దానిని భరించలేము – భాగవతాపచారము సరిదిద్దుకోలేని భాద్యతారాహిత్యమైన నేరమగును. ఇట్లు, తమ సదాచార్యునితో సమానులైన భాగవతుల పట్ల జాగరూకతతో ఉండి, పై సూత్రములను మరువకుండగ, ఎట్టి అపచారములను చేయరాదు. ఇదియేగాక, తమ ఆచార్యులు మరియు అట్టి భాగవతులపై సత్శిష్యుల ప్రవర్తనను గురించి తదుపరి వివరించిరి.

అనువాదకుని గమనిక : ఇట్లు, భాగవతాపచారము చెసినచో కలుగు దుష్పరిణామములను చూచితిమి. తదుపరి భాగములో, నిజమైన శిష్యుడు ఆచార్యునికి మరియు గొప్ప భాగవతులకు ఏమి చేయవలెనో గమనించెదము.

కొన్ని సంస్కృత ప్రమాణములను అనువదించుటకు సహకారమునిచ్చిన శ్రీరంగనాథన్ స్వామికి కృతజ్ఞతలు.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/07/anthimopaya-nishtai-14.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 13

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/07/12/anthimopaya-nishtai-12/), మనము ఆచార్యుడు సాక్షాత్ భగవానుని అవతారమని మరియు వారిని ఆ ప్రకారముగానే భావించవలెనని గమనించితిమి. ఈ భాగములో, మనము ఆచార్యుని ఒక సామాన్య జీవిగా తలంచిన కలుగు దుష్పరిణామముల గురించి తెలుసుకొందాము.

ఎంపెరుమానార్ – ఆళ్వాన్, కూరమ్ (ఆళ్వాన్ అవతార స్థలము) – ఆదర్శవంతమైన ఆచార్య శిష్యులు

పరాశర మహర్షి ఈ క్రింది పలుకులతో మనకు అనుగ్రహించిరి:

అర్ధ పంచక తత్త్వజ్ఞాః పంచసంస్కార సంస్కృతాః
ఆకారత్రయ సంపన్నాః మహాభాగవతాః స్మృతాః
మహాభాగవతా యత్రావసంతి విమలాస్శుభాః 
తద్దేశం మంగళం ప్రోక్తం తత్తీర్థం తత్తు పావనం
యథా విష్ణుపాదం శుభం

సాధారణ అనువాదము: ఆచార్యుని యందు పంచ సంస్కారమును పొంది, అర్ధ పంచకమును అభ్యసించవలెను. మనము ఆచార్యుని 3 విశేష గుణములను (అనన్యార్హత్వము, అనన్య శేషత్వము, అనన్య భోగ్యత్వము) గుర్తించి, నిర్మలుడైన భాగవతుని సేవించవలెను. సంపూర్ణ శుద్ధి పొందుటకై, మహా భాగవతునికి దగ్గరలో నివసించవలెను. ఆ చోటు మిక్కిలి పవిత్రమైనదని, ఆ సమీపములోని జలము అతి స్వచ్ఛమైనది (మనను శుద్ధి చేయుటకు), అది శ్రీమన్నారాయణుని మంగళప్రదమైన స్థానమని చెప్పబడింది.

ఈ సూత్రమును అత్యంత స్పష్టముగా పిళ్ళై లోకాచార్యులు తమ శ్రీ వచన భూషణము సూత్రము 450 లో వివరించిరి:

పాట్టుక్కేట్కుమిడముమ్, కూప్పీడు కేట్కుమిడముమ్, గుతిత్త విడముమ్, వళైత్తవిడముమ్,
ఊట్టుమిడముమ్ ఎల్లామ్ వకుత్తవిడమే యెన్ఱిరుక్కక్కడవన్

సాధారణ అనువాదము: ఎంపెరుమానుని 5 విభిన్న స్వరూపాలను ఆచార్యునిగా (సరియైన రక్షకునిగా) శిష్యుడు భావించవలెను. ఆ ఐదు స్వరూప స్వభావమును వరుస క్రమములో వివరించుచు,

  • ఆతడు దివ్య సంగీతమును (సామగానము) పరవశముతో శ్రవణము చేయు చోటు – పరమపదము
  • దేవతల ఫిర్యాదులను విను చోటు – వ్యూహము
  • లోక రక్షణ కోసమై ఈ సంసారములోకి దూకుట – విభవము
  • తమ ఉనికితో అందరిని ఆకర్షించు చోటు – అర్చావతారము
  • ప్రతి ఒక్కరి అంతరాత్మగా ఉండి పాలించు వాడు – అంతర్యామి

ఈ విధముగా, ఆచార్యుని పరమపదమునకు మరియు సంసారమునకు పరమాత్మగా శిష్యుడు గుర్తించి, ఆచార్యుడే ఈ రెండు జగత్తులలో పొందగల గొప్ప సంపదగా భావింపవలెను.

ఆచార్య నిష్ఠాపరులు (అముదనార్ వంటి వారు) ఆచార్యుని సదా ఈ క్రింది విధముగా భావించెదరు :

  • రామానుజ నూఱ్ఱందాది 20 – ఇరామానుశన్ ఎందన్ మానిదియే – శ్రీ రామానుజులే నా తరగని సంపద.
  • రామానుజ నూఱ్ఱందాది 22 – ఇరామానుశ నెందన్ శేమవైప్పే – శ్రీ రామానుజులు అను నా సంపద, నన్ను విపత్తుల నుండి కాపాడును.
  • రామానుజ నూఱ్ఱందాది 5 – ఎనక్కుఱ్ఱ శెల్వం ఇరామానుశన్ – నా నిజ స్వభావమునకు శ్రీ రామానుజలే తగిన చక్కని సంపద.

సాక్షాత్ నారాయణో దేవః కృత్వా మర్త్య మాయిమ్ తనుమ్” – తమను ఉద్ధరించుటకై భగవానుడే స్వయముగా మానవ రూపమును ధరించుటను అర్ధము చేసుకోలేక, వారు కూడ మనవలే భుజించుచు, నిదురించుచు ఉండుటను గమనించుట, ఆచార్యులు కూడ మన వంటి మానవ మాత్రులే అని భావిస్తూ, “మానిడవనెన్నుమ్ గురువై” (జ్ఞాన సారం – 32) లో తెలిపిన విధముగా “జ్ఞానదీపప్రదే గురౌ మర్త్య బుద్ధి శృతమ్ తస్య“, “యో గురౌ మానుషమ్ భవామ్“, “గురుషు నరమతిః” మొ || నవి తీవ్రముగా ఖండించిరి.

తదుపరి భాగములలో, ఆచార్యుని మానవమాత్రునిగా భావించిన కలుగు దుష్పరిణామములను చూచెదము.

విష్ణోరర్చావతారేషు లోహభావం కరోతియః
యో గురౌ మానుషం భావమ్ ఉభౌ నరకపాతినౌ

సాధారణ అనువాదము: దివ్య అర్చా రూపముగా ఒక లోహము (ముడి పదార్ధము) తో తయారు చేసిన విష్ణువును విగ్రహముగా, తమ ఆచార్యుని ఒక మానవమాత్రునిగా మాత్రమే భావించుట, ఈ రెండును కూడ మనను నరక లోకమునకు నడిపించగలవు.

నారాయణోపి వికృతిమ్ యాతి గురోః ప్రచ్యుతస్య దుర్భుదేః
జలాత భేదమ్ కమలం సోషయతి రవిర్ణ పోషయతి

సాధారణ అనువాదము : ఏ విధముగానైతే, సూర్య కిరణాలు కమల పుష్పమును వికసింపజేయునో, నీటి నుంచి బయటకు తీసిన ఆ కమల పుష్పము అదే సూర్య కిరణాల వేడికి  కమిలిపోవును. అదే విధముగా, ఎవరైతే తమ గురువు నుంచి విడిపోయెదరో, వారిని శ్రీమన్నారాయణుడే (సర్వరక్షకుడు) కష్టములపాలు చేయును.

ఏకాక్షర ప్రధారమ్ ఆచార్యమ్ యోవమన్యతే
స్వానయో నిశతమ్ ప్రాప్య చణ్డాలేష్వపి జాయతే

సాధారణ అనువాదము: జ్ఞానమును ప్రసాదించు మన ఆచార్యుని విస్మరించిన వారు, 100 మార్లు చండాలునిగా (కుక్క మాంస భక్షకుడు) జన్మించెదరు.

గురుత్యాగీ భవేన్ మృత్యుః మంత్రత్యాగీ దరిద్రదా
గురుమంత్ర పరిత్యాగీ రౌరవం నరకం వ్రజేత్

సాధారణ అనువాదము : గురువును త్యజించిన వారు శవముతో సమానము; మంత్రమును (గురువు నుంచి పొందిన) త్యజించిన వాడు అష్టదరిద్రుడు. గురువును, మంత్రమును రెంటిని త్యజించిన వాడు, రౌరవాది నరకమును తప్పక పొందును.

జ్ఞాన సారము 30

మాడుం మనైయుం మఱై మునివర్
తేడుం ఉయర్వీడుం సెన్నెఱియుం – పీడుడైయ
ఎట్టెళుత్తుం తంద వనే ఎన్ఱు ఇరాదార్ ఉఱవై
విట్టిడుగై కండీర్ విధి

(దీనికి సరియగు సంస్కృత ప్రమాణమును మాముణులు నిరూపించిరి)

ఐహికం ఆముష్మికం సర్వం గురు అష్టాక్షర ప్రదః
ఇత్యేవం యేన మన్యన్తే త్యక్తవ్యస్తే మనీషిపిః 

సాధారణ అనువాదము : ఎవరైతే తమ సంపదను, భూములను, మోక్షమును మరియు ధర్మమును, మొ || వానిని, తమకు అష్టాక్షర మహామంత్రమును ఉపదేశించిన ఆచార్యునిగా భావించరో, వారితో గల సంబంధమును / బాంధవ్యమును త్యజించవలెను.

జ్ఞాన సారం – 32

మానిడవన్ ఎన్ఱుం గురువై మలర్మగళ్కోన్
తానుగందకోలం ఉలోగం ఎన్ఱుం – ఈనమదా
ఎణ్ణుగిన్ఱ నీసర్ ఇరువరుమే ఎక్కాలుం
నణ్ణిడు వర్కీళాంనరగు

సాధారణ అనువాదము : ఎవరైతే ఆచార్యుని సాధారణ మానవమాత్రునిగానే భావించెదరో, ఆ శ్రీయఃపతి అర్చామూర్తిని సాధారణ లోహపు (ముడి సరుకు) విగ్రహముగానే భావించెదరో – ఆ ఇరువురు తప్పక అత్యల్ప నరకము లోకమును పొందగలరు.

ఏక గ్రామనివాసస్సన్ యశ్శిష్యో నానర్చయేత్ గురుం
తత్ ప్రసాదం వినా కుర్యాత్ సవై విద్సూకరో భవేత్

సాధారణ అనువాదము : తన గ్రామములో నివసించు శిష్యుడు ఆచార్యుని ఆరాధన చేయకుండా, ఇతర కార్యములలో నిమగ్నుడై ఆచార్యుని ప్రసాదమును గ్రహించకున్నచో అతను జంతువుతో సమానుడు.

జ్ఞాన సారము 33

ఎట్ట ఇరుంద గురువై ఇవై అన్ఱు ఎన్ఱు
విట్టోర్ పరనై నై విరుప్పుఱుదల్ – పొట్టనెత్తన్
కణ్సెంబళి తిరుందు కైత్తురుత్తి నీర్తూవి
అంబుదత్తై పార్తిరుప్పాన్ అఱ్ఱు

సాధారణ అనువాదము : సులభముగా లభ్యమగు ఆచార్యుని విస్మరించి, ఎవరైతే భగవానుని సమీపించెదరో, అది దాహార్తితో నున్న వారు చేతిలో నున్న జలమును జారవిడచి, వర్షముకై ఆకాశము వంక చూచుటకు సమానము.

జ్ఞాన సారము 34

పఱ్ఱుగురువై పరన్ అన్ఱు ఎన్ఱు ఇగళందు
మాఱ్ఱోర్పరనై వళిప్పడుదల్ – ఎఱ్ఱేతన్
కైప్పొరుళ్ విట్టారేనుం ఆసినియిల్తాంపుదైత్త
అప్పొరుళ్ తేడితిరివానఱ్ఱు

సాధారణ అనువాదము : భగవదవతారముగా ఆచార్యుని (మనకు సులభముగా అందుబాటులో నున్న వారు) అంగీకరించుటకు బదులుగా భగవానుని నేరుగా ఆరాధించుట, మన అధీనములో నున్న సంపదను వీడి, ఇతరులు గుప్తముగా భూమిలో దాచిన సంపద కొరకై అన్వేషణ గావించిన విధముగా నుండును.

జ్ఞాన సారము 35

ఎన్ఱుమ్ అనైత్తు యిఱ్కుమ్ ఈరం సెయ్ నారణనుం
అన్ఱుమ్ తన్ ఆరి యన్పాల్ అంబు ఒళి యిల్నిన్ఱ
పునల్పిరింద పంగయతై పొంగుసుడర్ వెయ్యోన్
అనల్ ఉమిళ్ందు తాన్ ఉలర్తియఱ్ఱు

సాధారణ అనువాదము : భగవంతుడు అపార కరుణామయుడు, అందరీ మిక్కిలి అనుకూలుడు, కాని జీవాత్మ ఆచార్యునిపై ప్రేమను / బాంధవ్యమును విస్మరించినచో, ఆ జీవాత్మను పరమాత్మ కూడ విస్మరించును. ఈ చర్య, ఒక తామర పుష్పము వికసించుటకు దోహదపడిన సూర్యుడే, అదే తామర పుష్పము నీటి నుంచి విడి పోయినచో అదే సూర్యుడి వలన ఎండి పోవుటకు సమానము వంటిది.

ప్రమేయ సారము 9

తత్తం ఇఱైయిన్ వడివు ఎన్ఱు తాళిణైయై
వైత్త అవరై వణంగియిరాప్ పిత్తరాయ్
నిందిప్పార్కు ఉణ్దు ఏఱానీణిరరయం నీదియాల్
వందిప్పార్కు ఉణ్డిళియావాన్

సాధారణ అనువాదము : ఆచార్యులే మనకు భగవంతుని పాదపద్మములతో ఆశీర్వదింతురు. అట్టి ఆచార్యుని స్వయముగా భగవానుడని ఆరాధించిన వారు నిశ్చయముగా పరమపదములోని దివ్య జీవులగుదురు. ఆచార్యుని అంగీకరించక, ఆరాధించని ఇతరులు ఈ లోకములోనే శాశ్వతముగా కష్టముల పాలగుదురు.

ఉపదేశ రత్తిన మాలై 60

తన్ గురువిన్ తాళిణైగళ్ తన్నిల్ అన్బొన్ఱిల్లాదార్
అన్బుతన్పాల్ శెయ్ దాలుమ్ అంబుయైకోన్
ఇన్బ మిగు విణ్ణాడు తానళిక్క వేణ్డియిరాన్
ఆదలాల్ నణ్ణాఱ్ అవర్ గళ్ తిరునాడు

సాధారణ అనువాదము : తమ ఆచార్యుని పాదపద్మములను సేవించని వారు, తాము ఎంపెరుమాన్ పై ఎంత గొప్ప ప్రేమ చూపినను, శ్రీమన్నారాయణుడు వారికి పరమపదములోని ఆనందమయమైన జీవితమునొసంగరు, కావున వారు పరమపదమును జేరలేరు.

ప్రతిహంతా గురోరపస్మారి వాక్యేన వాక్యస్య
ప్రతిఘాతం ఆచార్యస్య వర్జయేత్

సాధారణ అనువాదము : ఆచార్యునికి దూరముగా నున్నచో, వారు త్యజించబడుటకు అర్హులు.

బ్రహ్మాండ పురాణము

అర్చావిష్ణౌl శిలాధీర్ గురుషూ నరమతిర్ వైష్ణవే జాతి బుద్దిర్
విష్ణోవా వైష్ణవానామ్ కలిమలమతనే పాద తీర్ధే అంబు బుద్దిః
సిద్దే తన్నామ మందిరే సకల కలుషహే సప్త సామాన్య బుద్దిః
శ్రీసే సర్వేశ్వరే చేత్ తతితర (సురజన) సమతీర్ యస్యవా నరకి సః

సాధారణ అనువాదము : అర్చామూర్తి రూపములో నున్న విష్ణువును ఒక విగ్రహముగా భావించుట, గురువును మానవమాత్రునిగా భావించుట, వైష్ణవ జన్మమును విశ్లేషించుట, కలిలో నున్న అన్ని దోషములను తొలగించు విష్ణువు, వైష్ణవుల శ్రీపాద తీర్థమును సాధారణ జలముగా భావించుట, వారి నామములను, కోవెలలను (విష్ణు మరియు వైష్ణవుల) కీర్తించు పదములను, సాధారణ వానిగా భావించుట, శ్రీమన్నారాయణుని అన్య దేవతలతో సమానముగా భావించువారు నిశ్చయముగా నరక లోకమును జేరెదరు.

గురువును అవమానించుట యందు ఈ క్రింది అంశములు ఉండును :

  • గురువు ఆదేశములను అనుసరించక పోవుట
  • అనర్హులకు గురువు ఆదేశములను బోధించుట
  • ఆచార్యునితో సంబంధమును వదులు కొనుట – శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రము 439 వ సూత్రంలో తెలిపిన విధముగా “తామరైయై అలర్ త్తక్కడవ ఆదిత్యన్ తానే నీరైప్ పిరిన్తాల్ అత్తై ఉలర్ త్తుమాపోలే, స్వరూప వికాసత్తై ప్పణ్ణుమ్ ఈశ్వరన్ తానే ఆచార్య సంబంధం కులైంతాల్ అత్తై వాడ ప్పణ్ణుమ్” – ఒక తామర పుష్పము వికసించుటకు దోహదపడిన సూర్యుడు, ఆ తామర పుష్పము నీటి నుంచి బయట పడినచో ఎటుల దానిని అదే సూర్యుడు కాల్చి వేయునో, అదే విధముగా, జీవాత్మకు జ్ఞానము నిచ్చి పోషించు భగవానుడు, ఆచార్య సాంగత్యమును వీడిన జీవాత్మ జ్ఞానమును క్షీణింప జేయును.
  • ‘గురోరపహ్నుతాత్ త్యాగాత్ అస్మరణాదాపి; లోభా మోహాదిపిశ్చాన్యైర్ అపచారైర్ వినశ్యతి’ – గురువును త్యజించిన వాడు, అతనికి దూరముగా నున్న వాడు, అతని గురించి ఆలోచించని వాడు, తన దురాశ మరియు మోసము వల్ల ఆర్జించిన పాపముతో నాశనము అగును.
  • గురోరన్ఱుతాబిశంసనం పాదకసమానమ్ కలు గుర్వర్ త్తే సప్తపురుషాన్ ఇతశ్చ పరతశ్చ హంతి; మనసాపి గురోర్నాన్ఱుతమ్ వదేత్; అల్పేష్వప్యర్ త్తేషు – అసత్య వచనములతో ఆచార్యుని చేరుట, వారిని గాయపరచుటతో సమానము. ఆచార్యుని సంపదను తస్కరించినచో, ముందు ఏడు తరాలు, తరువాతి ఏడు తరాలు నాశనమగును. కావున, ఆచార్యుని మదిలో కూడ మోసము చేయు తలంపుతో నుండరాదు. వారి సంపదలో ఒక అణువు కూడ తస్కరించరాదు.
  • వారితో అబద్దపు మాటలాడుట, వాదించుట, వారు బోధించని వాని గురించి మాటలాడుట, వారు దయతో ఆదేశములను కృప చేయునప్పుడు వారిపై పిర్యాదు చేయుట, వారిని కీర్తించునప్పుడు దూరముగా ఉండుట, వారిపై కఠిన పదజాలమును ఉపయోగించుట, వారిపై బిగ్గరగా అరచుట, వారి ఆదేశములను విస్మరించుట, వారి ఎదురుగా మేను వాల్చుట, వారి కన్నా వేదికపై ఎత్తులో ఉండుట, వారి ఎదురుగా పాదములను జాచుట / చూపుట, వారి చర్యలకు అడ్డు తగులుట, అంజలి ఘటించి వారిని ఆరాధించుటకు సిగ్గు పడుట, వారు నడుచునప్పుడు మార్గములోనున్న అడ్డంకులను తొలగించక పోవుట, వారి మనో భావములను అర్ధము చేసుకొనక మాటలాడుట, ‘కాయిలే వాయక్కిడుతాల్ ‘ – అన్యుల ద్వారా వారితో పరోక్షముగా వ్యవహరించుట, వారి ముందు కంపించుట, వారి నీడపై పాదమునిడుట, ఇతరుల నీడ ఆచార్యునిపై పడుటను అనుమతించుట – ఈ చర్యలను ఆచార్యుని ముందు వదులు కొనవలెను.

యస్య సాక్షాత్ భగవతి జ్ఞానాదీపప్రదే గురౌ
మర్త్య బుద్ది శృతం తస్య సర్వమ్ కున్జరసౌచవత్

సాధారణ అనువాదము: ఆచార్యులు జ్ఞాన జ్యోతితో శిష్యునికి జ్ఞానోదయము చేయుటచే, వారిని భగవానునితో సమానునిగా భావించవలెను. ఎవరైతే గురువును సాధారణ మానవ మాత్రునిగా భావించెదరో, వారు పొందిన శాస్త్ర జ్ఞానము గజము స్నానము (మట్టిని శిరస్సుపై చల్లుకునే విధముగా) చేసిన దానితో సమానము.

సులభమ్ స్వగురుమ్ త్యక్త్వా దుర్లభమ్ య ఉపాసతే
లబ్ధమ్ త్యక్త్వా ధనమ్ మూడో గుప్తమన్వేషతి క్శితౌ

సాధారణ అనువాదము : సులభముగా పొందగలిగిన ఆచార్యుని వీడి, క్లిష్టతరమైన ఉపాసనలను అవలంబించుట అనునది మన వద్దనున్న సొమ్మును పారవైచి, నిధికై భూమిని తవ్వుటతో సమానము.

చక్షుర్ గమ్యమ్ గురుమ్ త్యక్త్వా శాస్త్ర గమ్యమ్ తు యస్స్మరేత్
హస్తస్తమ్ ఉదగమ్ త్యక్త్వా గనస్తమభి వాన్చతి

సాధారణ అనువాదము : సమీపమున నున్న గురువును వదలివేసి, భగవానునికై ప్రయత్నించుట అనునది దాహర్తితో నున్న వ్యక్తి చేతిలోని నీటిని జార విడచి, ఆకాశములోని వర్షమునకై ఎదురుచూచినట్లు ఉండును.

గురుమ్ త్వంగ్కృత్య హూంగ్కృత్య విప్రమ్ నిర్జిత్య వాదతః
అరణ్యే నిర్జలే దేశే భవంతి బ్రహ్మరాక్షసాః

సాధారణ అనువాదము : తమ ఆచార్యునితో అనుచితముగా భాషించి అణచుటకు పర్యత్నించువారు, నీరు దొరకని అరణ్యములో బ్రహ్మరాక్షసులగుదురు.

ఈ విధముగా, పైన పేర్కొన్న ప్రమాణముల ద్వారా, ఆచార్య అపచారములు వివరించిరి.

అనువాదకుని సూచన : ఈ విధముగా, ఆచార్య అపచారము చేసిన, జరుగు దుష్పలితములను గమనించితిమి. తరువాతి భాగములో మనము భాగవత అపచారము గురించిన ప్రమాణములను తెలుసుకొందాము.

సంస్కృత ప్రమాణములను అనువదించుటకు సహకారము నిచ్చిన శ్రీ రంగనాథన్ స్వామి గారికి ధన్యవాదములు.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/07/anthimopaya-nishtai-13.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 35

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 34

నాయనారు అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని, పైకి ఎక్కడం మొదలు పెట్టారు. ఇది విన్న పెరియ కెల్వి జీయర్ (పెద్ద జీయర్ స్వామి) ఇతర శ్రీవైష్ణవులు, ఆలయ ఉద్యోగులందరితో కలసి నాదస్వరంతో,  తిరువేంకటేశ్వరుడి దివ్య తిరువడి (శ్రీ శఠారి), పెరియ పరివట్టం, శ్రీవారి అభయ హస్తం, శ్రీపాదరేణువు మొదలైన వాటితో నాయనారు మరియు వారి శిష్యులను స్వాగతించెను. దివ్య విమానం, తిరునారాయణగిరి, ధ్వజ స్తంభాన్ని దర్శించుకున్న వారికి ఆలయ మర్యాదలు ప్రసాదిస్తారు.

వారు  అవావరచ్చూళందాన్  ద్వారం వద్ద సాష్టాంగ నమస్కారం చేసి, ఆలయ ప్రదక్షిణగా వెళుతూ దివ్య తిరుమాడ వీధులను, దివ్య భవనాలను ఆనందంగా చూస్తూ స్వామి పుష్కరిణికి చేరుకొని పవిత్ర స్నానమాచరించి, ఊర్ధ్వ పుండ్రములను ధరించి, వరాహ స్వామిని సేవించి అక్కడ శ్రీ శఠారి, చందనము స్వీకరించి అక్కడి నుండి ముందుకు సాగారు; దివ్య రథాలను దర్శించుకుంటూ వారు రంగనాథ మండపానికి (అళగియ మణవాళ దివ్య మండపము – తుర్కుల దండయాత్ర కాలంలో కొంత కాలంగా నంపెరుమాళ్ళు ఇక్కడ ఉన్న మండపము) వెళ్లి అక్కడ సాష్టాంగ నమస్కారం చేశారు. వారు బలిపీఠం వద్ద, దివ్య చెంబగ ద్వారము వద్ద మరియు  అత్తాణిప్పుళి వద్ద తమ సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకున్నారు. శెణ్బగచ్చుఱ్ఱు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, నెయ్ కిణఱుని చూస్తూ, తిరుమడప్పల్లిని (నైవేద్యాలను సిద్ధం చేసే దివ్య వంటశాల) సేవించి, యమునైత్తుఱైవన్ ని సేవించి, దివ్య బావిలో నుండి జలాన్ని తీసుకుని, బంగారు మంటపముపైకి వెళ్లి నారాయణగిరిని సేవించి, శెన్బగ ద్వరములోకి ప్రవేశించి, దేవ పెరుమాళ్ళు వెలసి ఉన్న పొన్ వింజు పెరుమాళ్ సన్నిధికి వెళ్లి అళగప్పిరానార్ ను వారి ఆయుధాలను సేవించుకొనెను. ఆ తర్వాత వారు తిరుమడైప్పళ్ళి నాచ్చియార్ (దైవ వంటశాలలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మీ) ని, దశావతారములను సేవించెను. యాగ మంటపం వద్ద ఉభయ నాయచ్చిమార్చులతో ఉన్న పెరుమాళ్ విగ్రహాన్ని సేవించి, తీర్థ జలాన్ని స్వీకరించెను. విశ్వక్సేనులను సేవించి “రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే” అని జపము చేస్తూ రామానుజుల ఎదుట సాష్టాంగము చేసి వారి తీర్థ జలాన్ని, అనంతాళ్వాన్ [తిరుమలలో ఎమ్పెరుమానార్ల తిరువడిని అనంతాళ్వాన్ అని పిలుస్తారు; మిగితా అన్ని చోట్లా వారి తిరువడిని ముదలియాండాన్ అని వ్యవహరిస్తారు], చందనం స్వీకరించెను. ఆ తర్వాత వారు శ్రీ నరహింహ పెరుమాళ్ళను, ఆపై పెరుమాళ్ళకు అద్దంలా ఉండే పెరియ తిరువాడి నాయనారు (గరుడ) ను సేవించుకొని, హుండీలో తన నివేదనలు సమర్పించి, ద్వారపాలకుల అనుమతి తీసుకుని గర్భ గుడిలోకి ప్రవేశించారు. వారు చక్రవర్తి తిరుమగన్ (శ్రీ రాముడు) ని సేవించుకొని, కులశేఖర పడి దగ్గరకు వెళ్లి, “శిషేవే దేవదేవేశం శేషశైల నివాసినం” (నిత్యసూరులకు స్వామి తిరుమలలో కొలువై ఉన్న తిరువేంగడముడయాన్ ను సేవించెను) అని చెప్పినట్లు వారు తిరువేంగటేశ్వరుడిని సేవించెను. వారు తిరువేంగటేశ్వరుడిని తదేకంగా దర్శిస్తూనే తీర్థ శఠారీలు స్వీకరించి కృతజ్ఞతతో సంతృప్తిని అనుభవించెను.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/19/yathindhra-pravana-prabhavam-35/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 12

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/07/06/anthimopaya-nishtai-11/ ), మనము ఎంబార్ల దివ్య ప్రవృత్తిని, ఇతర సంఘటనలను గమనించాము. ఈ వ్యాసములో, ఆచార్యుడు భగవానుని అవతారమని, ఆచార్యుడిని భగవానునితో సమానంగా భావించాలని స్థాపించారు.

ఆచార్యులు భగవానుని అవతారము

పురుషార్ధము (జీవాత్మ సాధించవలసిన లక్ష్యాలు) నాలుగు రకాలు:

  1. సాక్షాత్కారము – భగవానుని దివ్య దర్శనము (అంతరంగములో) – ఇది భగవానుని అర్ధము చేసుకొనే ప్రత్యేక జ్ఞానము.
  2. విభూతి సాక్షాత్కారము – సాకార రూపములో సాక్షాత్కరించే భగవానుని దివ్య దర్శనము – ఈ స్థితిలో ఒక ప్రత్యేక జ్ఞానము ద్వారా మనము నిజమైన అడ్డంకులను (ఈ భౌతిక శరీరము మరియు భౌతిక ప్రపంచము) గ్రహించగలము.
  3. ఉభయవిభూతి సాక్షాత్కారము – ఆధ్యాత్మిక మరియు ఆదిభౌతిక రూపములలో భగవానుని దివ్య దర్శనము – ఈ స్థితిలో ఒక ప్రత్యేక జ్ఞానము ద్వారా కైంకర్యము యొక్క యధార్ధ లక్ష్యమును మనము గ్రహించవచ్చును.
  4. ప్రత్యక్ష సాక్షాత్కారము – భగవానుని దివ్య దర్శనము మన కనులారా వీక్షించుట – ఈ స్థితిలో
    • మన లక్ష్యము మరియు సాధనం రెండూ ఒకటే అని గుర్తించగలము, అనగా, రెండూ భగవానుడే
    • భగవానునికి చేయు కైంకర్యము (ప్రేమతో చేయు సేవ) మన అంతిమ లక్ష్యము
    • దానికి ఉపాయము (విధానము) కూడ కైంకర్యమే

మొదటి మూడు విధములు పురుషార్ధములో (అంతిమ లక్ష్యము) భాగము అని భావించినను, ప్రత్యక్ష సాక్షాత్కారము పొందనిచో, ఆ మూడు నిరుపయోగమే. అంతిమ లక్ష్యమును మాత్రమే మనము ప్రత్యక్షముగా దర్శించినచో, ఆ ఇతర మూడు కూడ సాధించలేము.

ఈ క్రింది ఆరు రూపములలో భగవానుని ప్రత్యక్ష దర్శనమును సాధించగలము :

  • పరత్వము – పరమపదములో నున్న భగవానుని దివ్య స్వరూపము – ఇది నిత్యులకు మరియు ముక్తులకు
  • వ్యూహము – క్షీరాబ్దిలో దర్శనమిచ్చు భగవానుని దివ్య స్వరూపము – ఇది సనకసనందనాదులకు (బ్రహ్మ మానస పుత్రులు), దేవతలకు, మొ ||
  • విభవము – భగవానుని అవతారములైన శ్రీరామ, శ్రీకృష్ణ, ఇత్యాదులు – ఇవి శ్రీరామ, శ్రీకృష్ణ మొ || వారి కాలములో జీవించివున్న వారికి, దశరధుడు, వాసుదేవుడు, నందగోపాలుడు, ఇత్యాదులు
  • అంతర్యామిత్వము – ప్రతి జీవుని అంతరంగములో నివసించు భగవానుని స్వరూపము – ఇది యోగులకు మరియు ఉపాసకులకు
  • అర్చావతారము – కోవెలలో, మఠములలో, గృహములలో వున్న స్వరూపము – ఈ రూపము ప్రతి ఒక్కరికి
  • ఆచార్యావతారము – జ్ఞానమును ప్రసాదించు ఆచార్యునిగా దర్శనమిచ్చు భగవానుని స్వరూపము – ఇది వారిని ఆశ్రయించిన (శరణాగతి) వారికి.

పై వానిలో, వానికి ఉన్న పరిమితుల దృష్ట్యా మొదటి నాలుగు చేరలేము – అనగా

  • దేశము – ప్రాంతము – పరమపదము, క్షీరాబ్ది సర్వులకు అందుబాటులో లేవు
  • కాలము – సమయము – విభవ అవతారములు వేరు వేరు యుగములలో జరిగినవి – ఆ కాలములో లేనివారు వానిని కోల్పోయిరి.
  • కరణము – స్పందన – మనస్సును పూర్తిగా నియంత్రించగల యోగులు మాత్రమే తమ జ్ఞానము ద్వారా అంతర్యామి ఎంపెరుమాన్ ను దర్శించగలరు.

పై వానిలో చివరి రెండు, అర్చావతారములోని ఎంపెరుమాన్లు, ప్రతి ఒక్కరితో స్వయముగా సంబంధము కలిగి వుండరు. కావున, అర్చావతారమును కూడ ఎంపెరుమానుని ఇతర అవతారములతో పోల్చవచ్చును. అన్ని శాస్త్రములను పరిశీలించిన పిదప, ఒక జీవాత్మ ముక్తుడగుటకు, తమ ఆచార్యుని దివ్య జ్ఞానము పొందవలెనని స్పష్టముగా నిర్ణయమైనది. కావున, దేనివలన జ్ఞానము లభించునో అది అంతిమ లక్ష్యము కూడ అగును. దేనివలన అంతిమ లక్ష్యము లభించునో, అది ఉపాయం (సాధనము) అగును. కావున, ఆచార్యునికి చేయు కైంకర్యమే అత్యున్నత లక్ష్యము. స్వయముగా భగవానుడే నమ్మాళ్వార్లను మచ్చలేని జ్ఞానముతో అనుగ్రహించుటచే, తనకు మచ్చలేని జ్ఞానము నొసంగిన భగవానుడే, తన ఆరాధ్యుడు అని వారు ప్రకటించిరి. దివ్య జ్ఞానమును ఇచ్చి దీవించే ఆచార్యులే  శిష్యునికి ఏకైక సాధనము. ఇతర ఉపాయములన్ని కూడ ఉపాయాంతరముల వంటివి (వదలి వేయ తగిన ఇతర సాధనములు). ఈ విషయమును నంపిళ్ళై కు తిరుముడిక్కుఱై రహస్యములో, నంజీయర్ వివరించిరి. ఇట్టి ప్రత్యక్ష సాక్షాత్కారము లేనిచో (ఆచార్యుని ప్రత్యక్ష దివ్య దర్శనము), మోక్షమును పొందు అవకాశము లేదు, కావున, ఆచార్యావతారము అంతిమ ఉపాయమగును.

ఆచార్య అభిమానము యొక్క గొప్పతనమును పిళ్ళై లోకాచార్యులు తమ అర్థ పంచకము (రహస్య గ్రంధము) లో ఈ క్రింది విధముగా స్పష్టముగా వివరించిరి.

ఆచార్య అభిమానమావతు ఇవైయొన్ఱుక్కుమ్ సక్తనన్ఱిక్కే ఇరుప్పానొరు ఉవనైక్ కుఱిత్తు ఇవనుడైయ ఇళావైయుమ్, ఇవనైప్పెఱ్ఱాల్ ఈశ్వరనుక్కు ఉణ్డాన ప్రీతియైయుమ్ అనుసందిత్తు, స్తనందయప్రజైక్కు వ్యాతి ఉణ్డానాల్ తన్ కుఱైయాగ నినైత్తుత్ తాన్ ఔషధ సేవై పణ్ణి రక్శిక్కుమ్ మాతావైప్పోలే ఇవనుక్కుత్తాన్ ఉపాయానుష్టానమ్ పణ్ణి రక్శిక్క వల్ల పరమదయాళువాన మహాభాగవత అభిమానత్తిలే ఒదుంగి, “వల్లపరిసు వరువిప్పరేల్ అతు కాణ్డుమే” ఎన్గిఱపడియే సకల నివృత్తి ప్రవృత్తిగళుమ్ అవనిట్ట వళక్కాయ్.

ఆండాళ్ తిరుక్కళ్యాణము

సాధారణ అనువాదము : ఆచార్య అభిమానము అనగా – మరి ఇతర ఉపాయములు (కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి) నిర్వహించు సామర్ధ్యము లేని, జీవాత్మకు, అతని అసహాయతను గుర్తించిన ఆచార్యులు (ఎంపెరుమానుతో గల సంబంధమును జీవాత్మ గుర్తించనందు వల్ల) మరియు జీవాత్మను పొందిన ఈశ్వరుని (తన నిజమైన సేవకునిగా) సంతోషమును గమనించినట్లు, తన పసిపాప అనారోగ్యమును గమనించిన తల్లి తాను అనారోగ్యమును పొందినట్లు భావించి తాను ఔషధమును స్వీకరించి, తన స్తన్యము ద్వారా దానిని పసిపాపకు నయమగుటకు ఇచ్చినట్లు, ఒక ఆచార్యుడు తన శిష్యుని కొరకు తానే స్వయముగా ఎంపెరుమాన్ ను శరణాగతి చేయుదురు. అట్టి కరుణా స్వరూపులైన సిసలైన భాగవతునికి, శిష్యుడు సదా అందుబాటులో వుంటూ, వారి ఆశీర్వాదమునకై వేచి ఉండి, “భగవానుడు ఆచార్యునికి కట్టుబడి వున్న విధముగా వారు వచ్చి నన్ను దీవించగలరు” (నాచ్చియార్ తిరుమొళిలో ఆండాళ్ నాచ్చియార్ గుర్తించిన ప్రకారముగా) అని భావింతురు.

మణఱ్పాక్కత్తు నంబి ప్రత్యక్షముగా దర్శించినట్లు మన పిళ్ళై లోకాచార్యులు సాక్షాత్తు పేరరుళాళన్ (కంచి దేవ పెరుమాళ్) అవతారమని స్పష్టమగుచున్నది. ఈ సంఘటనను (దేవ పెరుమాళ్ళ అవతారము పిళ్ళై లోకాచార్యులని) మన జీయర్ (మాముణులు) శ్రీ వచన భూషణము వ్యాఖ్యానములో (అవతారిక) చక్కగా వివరించిరి. ఇవియేగాక, ఇంకను సదాచార్య – సత్శిష్య లక్షణము గురించి అనేక సొగసైన వ్యాఖ్యానములను మన జీయర్ (మాముణులు) వివరించిరి. వానిని ఇది పెద్ద గ్రంధమగుననే భయముచే నేను వివరించుటలేదు.

ఈ విధముగా, “శ్రీమన్నారాయణుడే (శ్రీమహాలక్ష్మి పతి) మిక్కిలి దయతో ఆచార్యునిగా దర్శనమిచ్చును” అని ఘోషించుచున్నాయి. అవి

  • వేదములు
  • వేదములను వివరించు – స్మృతి, ఇతిహాసములు, పురాణములు
  • పరాశర, పారాశర్య (వ్యాసుడు), బోధాయనుడు, శుకుడు, మొ || ఋషులు వాని సారాంశమును దర్శించిరి.
  • ఆళ్వారులైన ప్రపన్న జన కూటస్థర్ పరాంకుశ (నమ్మాళ్వార్) పరకాల (తిరుమంగై ఆళ్వార్), భట్టనాధుడు (పెరియాళ్వార్), మొ ||ఆళ్వార్లు భగవానుని ఆధ్యాత్మిక ఆది భౌతిక జగత్తులను సంపూర్ణముగా వీక్షించగలుగుటచే, వారు ద్రావిడ బ్రహ్మ విద్య ద్వారా సమస్త వేదముల వేదాంతముల సారాంశమును వెల్లడించి, పుట్టుక వయస్సులతో నిమిత్తము లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులోనుంచిరి.
  • సర్వము తెలిసిన ఆచార్యులైన నాథమునులు, యామూనాచార్యులు, యతిరాజులు, మొ || వారు ఆళ్వార్ల అడుగుజాడలను కొనసాగించిరి.

ముముక్షుపడి ప్రారంభములో పిళ్ళైలోకాచార్యులు వివరించిన విధముగా – జీవాత్మలు ఈ సంసారములో  అనాదిగా వుంటూ తమ యధార్ధ స్వరూపము, భగవానుని యధార్ధ స్వరూపము, జీవాత్మ పరమాత్మల మధ్య సంబంధము తెలుసుకొనక, భగవత్ కైంకర్యములో నిమగ్నమగు అద్భుత అవకాశమును జారవిడుచు కొనుచున్నారని కూడ గుర్తించలేక పోవుచున్నారు. బదులుగా, అనాది కాలము నుండి సంసార సాగరములో మునిగి సంసారులు బాధలను అనుభవించుచున్నారు. అయిదు భిన్న రూపములు కల భగవానుడు (పరత్వాది పంచకము – http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-parathvadhi.html) మిక్కిలి దయతో తిరుమంత్రము ద్వారా ఈ సంసారులను శుద్ధి చేయవలెనని భావించిరి. వారిని అర్చిరాది గతి (మోక్షమునకు పయనమగు మార్గము) ద్వారా మార్గనిర్దేశనము చేయుట, సూర్య మండలమును చేధించుకొనుచు, విరజా నదిని దాటుటకు సహాయమొనరించుచు, అమానవన్ (ఎంపెరుమాన్ యొక్క మరొక స్వరూపము) హస్త స్పర్శచే ఆధ్యాత్మిక శరీరమును ఆశీర్వదించుచు, ఆ జీవాత్మను సదా కైంకర్య సేవకు వినియోగపడుట చేయును. దీనిని సాధించుటకు, బదరికాశ్రమములో నర నారాయణులుగా సాక్షాత్కరించిన పరమాత్మ, జీవాత్మలను సంసార బంధము నుండి విముక్తి చేయుటకు ఇప్పుడు ఈ సంసారములో కూడ సాక్షాత్కారమును ఇచ్చిరి. ఆ విధముగా, భగవానుడే స్వయముగా (ప్రధమ పర్వము – మొదటి వేదిక) ఆచార్యునిగా దర్శనమిచ్చున్నారని (చరమ పర్వము – అంతిమ వేదిక) మనము అంగీకరించ వలెను. దీనినే ఈ క్రింది శ్లోకములో వివరించిరి :

సాక్షాన్ నారాయణో దేవ:
కృత్వామర్త్యమయీమ్ తనుమ్
మగ్నానుద్దరతే లోకాన్
కారుణ్యాచ్చాస్త్ర పాణినా

సాధారణ అనువాదము: మహోన్నత భగవానుడైన శ్రీమన్నారాయణుడే, తమ అపార కరుణచే మనుష్య రూపు ధరించి, తమ హస్తములోనున్న శాస్త్ర సహాయముతో, ఈ జగత్తు లోని జీవాత్మలను ఉద్దరించుచున్నారు (ఆచార్యునిగా).

ఇప్పటి వరకు మనము, నిజమైన శిష్యుడు భగవానుని విశిష్ఠ అవతారము దాల్చిన నిజమైన ఆచార్యుని ఆరాదించవలెనని అనేక ప్రమాణముల (సాక్షములు) ద్వారా దర్శించితిమి. ఇప్పుడు, మనము ఆచార్యుని సాధారణ పురుషునిగా భావించరాదని మరికొన్ని ప్రమాణముల ద్వారా దర్శించెదము. పైన పేర్కొనిన రెండింటి ద్వారా, ఆచార్యుని సాధారణ పురుషునిగా భావించిన వారు నరక లోకములో పడుదురని, ఆచార్యుని భగవంతునిగా ఆరాధన చేయువారు పరమపద ప్రాప్తి నొందుదురని విదితమైనది. అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ జ్ఞాన సారము 32 పాశురములో “ఎక్కాలుమ్ నణ్ణిడువర్ కీళాం నరగు” (ఆచార్యుని సామాన్య మానవునిగా భావించినవారు, శాశ్వతముగా నరక లోకములో పడుదురు). ఈ విధమైన ఆలోచనలను పూర్తిగా వదలివేయవలెను, మనము “పీతకవాడై ప్పిరానార్ బిరమగురువాగివందు” (భగవానుడే స్వయముగా ఆచార్యునిగా సాక్షాత్కరించుట) అని పెరియాళ్వార్ తెలిపిన విధముగా భావింపవలెను. ఈ సూత్రము శాస్త్రమును పూర్తిగా విశ్వసించిన, సదా ప్రమాణములను పాటించిన వారి హృదయ లోతులలో ఉండును.

అందువలన, “యత్సార భూతం తదుపాసితవ్యం” (సారాంశము/మూలమును ఆరాధించిచాలి/అనుసరించాలి), “భజేత్ సార తమం శాస్త్రం” (శాస్త్రంలో మూలసారాన్ని అనుసరించాలి, మొ॥., “ఉపాయ ఉపేయ భావెన త్వమేవ శరణం వ్రజేత్” అని చెప్పినట్లుగా జీవాత్మ మోక్షంపైనే ఏకైక దృష్టి ఉన్న ఆచార్యుని (ఆచార్య అభిమానం) పై ఆధారపడే బదులు, ఆచార్యుని చరణ కమల యందు శరణాగతి చేసి అదియే ఉపాయం/ఉపేయం భావించుట), “పేరొన్ఱు మాఱ్ఱిళ్ళై నిన్ శరణన్ఱి” (నీ తిరువడి తప్పా నాకు ఇంకొక ధ్యేయం లేదు – ఇరామానుశ నూఱ్ఱందాది 45 పాశురములో అముదనారులు), మొ॥. ఈ ఆచార్యత్వం

  • అన్ని శాస్త్రాముల సారము
  • శ్రీ మధురకవి, నాథమునులు మొదలైన ప్రారంభించి మన పూర్వాచార్యులు మన గురుపరంపరలో బోధించారు.
  • మనం అరాధించ తగిన ప్రత్యక్ష స్వరూపం
  • అణు మాత్రం స్వాతంత్ర్యం లేని పరమ దయామయుడు
  • అతి చేరువలో ఉన్న అత్యంత సులభుడు

కాని మనను ఉద్దరించు ఆచార్యుని సంపూర్ణ శరణాగతి చేయుటకు బదులు, పూర్ణ స్వతంత్రుడు, అత్యుత్తముడైన భగవానుని ఉపాయ ఉపేయములుగా పట్టుకొనుట, మన కన్నుల ముందరే దర్శనమిచ్చు ఆచార్యుని విస్మరించి భగవానునికై ప్రయత్నించుట, చాలా మూర్ఖత్వమగును (మన దోసలిలో ఉన్న నీటిని జారవిడచి, నిజముగా దాహార్తితో నున్నవాడు వర్షపు నీటికై ఆకాశము వంక చూచినట్లు). భగవానుని ఇట్లు వివరించారు.

  • తైత్తరీయ ఉపనిషత్తు – “యతో వాచో నివర్తంతే అప్రాప్య మానసా సహ – భగవానుని ఒక్క గుణమే కూడ మనస్సుకు అర్ధము కాదు మరియు అత్యంత వివేకవంతుడు కూడా దానిని మాటలలో చెప్పలేడు.
  • “సులభమ్ స్వగురుమ్ త్యక్త్వా దుర్లభమ్ యా ఉపాసతే” – సులభముగా లభ్యమగు గురువును వదలి భగవానునికై క్లిష్టమగు ఆరాధన చేయుట మూర్ఖత్వమగును.
  • స్తోత్ర రత్నము – విధి శివ సనకాద్యైర్ ధ్యాతుం అత్యంత దూరం – మహా యోగులైన బ్రహ్మ, శివ, సనక కుమారులకు కూడా నీ సేవ చేయుట వారి గ్రహణ శక్తికి అతీతమైనది.
  • తిరుమాలై 44 – ‘పెణ్ణులామ్ శడైయినానుమ్ పిరమునుమ్ ఉన్నైక్కాణ్బాన్ ఎణ్ ఇలా ఊళిఊళి త్తవం శెయ్దార్ వెళ్గి నిఱ్ప’ – జటా జూటములో గంగను దాల్చిన శివుడు అనేక వర్షములు తపమొనరించినను బ్రహ్మాదులకు కూడా నీ సాక్షాత్కారము లభింపక సిగ్గుతో తలదించుకొనిరి.
  • సిద్ధిర్ భవతి వా నేతి సంసయోచ్యుత సేవినామ్ – అచ్యుతుని సేవించిన వారికి కూడ అతడు లభ్యమగుట అనుమానస్పదమే.
  • తిరుచ్చంద విరుత్తమ్ 85 – ‘వైత్త శిందై వాంగు విత్తు నీంగు విక్క – నీవు సర్వ స్వతంత్రుడవు, నా మనస్సును నీ నుండి తొలగించి, భౌతిక విషయముల వైపు మళ్ళించగలవు.
  • క్షిపామి న క్షమామి – నేను వారిని శిక్షించెదను, నేను వారిని క్షమించను

ఆచార్యుని అంత దయాశాలి ఎంపెరుమాన్ కాదని, ఆచార్యులు సదా క్షమిస్తూ మరియు మోక్షమార్గమునకు మనను మరల్చగలరని తెలిపిరి.

పరమాత్మ గురించి వివరించుచు, అతనిని జేరుట చాలా కష్టమని, సంసారములో జీవాత్మను బంధించుటకైనను, సంసారము నుండి జీవాత్మను విముక్తి చేయుట కైనను, తనను శరణాగతి చేసిన భరతుని కూడ నిర్దయగా నిరాకరించుట, పెరుమాళ్ళనే అంటిపెట్టుకొని వున్న సీత పిరాట్టిని ఎడబాసి జీవించుటకు అరణ్యమునకు పంపుట, అర్జునునికి ప్రపత్తిని బోధించుట, ఇత్యాది వన్నియు అతని లీలలను ప్రదర్శించు చున్నవి.

నమ్మాళ్వార్ ను పూర్తిగా శరణాగతి చేసిన మధురకవి ఆళ్వార్

కావున, శిష్యుడు ఆచార్యుని ఉపాయము (సాధనము) మరియు ఉపేయము (లక్ష్యము) గా అంగీకరించుట “ఉత్తారయతి సంసారాత్ తదుపాయ ప్లవేనతు; గురుమూర్తి స్థిత స్సాక్షాత్ భగవాన్ పురుషోత్తమః” (భగవానుడు ఆచార్య రూపమును ధరించి తగిన సాధనముల ద్వారా జీవాత్మలను సంసారము నుండి ఉద్దరించుటకు అవతరించును) అని వివరించిరి.
స్తోత్ర రత్నములో ఆళవందార్లు “సర్వం యదేవ నియమేన” (ఆళ్వారుని పాదపద్మములే నాకు సదా సర్వస్వము) అని తెలిపిరి. శిష్యుడు తన ఆచార్యుని గురువుగాను, రక్షకుడుగాను, మిక్కిలి ఆనందముగా అనుభవించు వానిగాను స్వీకరించవలెను. దీనికి బదులుగా, కొందరు ఆచార్యుని సామాన్య ఉపకారకునిగా (ఎంపెరుమాన్ దగ్గరకు చేర్చు సహాయకునిగా) మాత్రమే భావించుటను, ఉపదేశ రత్న మాల 71 పాశురములో “మున్నోర్ మొళింద ముఱై తప్పామల్ కేట్టు! పిన్నోర్ందు  తామతనై ప్పేశాదే! తన్నేఞ్జిల్ తొఱ్ఱినతే శొల్లి ఇదు శుద్ధ ఉపదేశ వరవాఱ్ఱతెన్బర్ మూర్కరావార్!” అని తెలిపిరి. పూర్వాచార్యుల నుంచి విని నది, వారి దివ్య సిద్ధాంతములు, అంతర్యామి తెలియజేసినది అనుసరించకయే, వారు భావించిన సిద్ధాంతమునే బోధించుచు” ఈ సూత్రము మన పూర్వాచార్యుల నుండి వచ్చినది” అని తెలుపుచు, కొందరు తమను తామే స్వతంత్రులుగా తలంచుచు, ఆ దౌర్భాగ్యులు తమ ఆచార్యునిపై అంకితము లేకుండా కఠిన హృదయులైనారు.
మన సంప్రదాయములోని లోతైన సూత్రములపై అవగాహన లేకపోవుటచే వారి ఉపదేశములు ఉనికిని కోల్పోయి, నకిలీ అలంకారముల వలె అదృశ్యమగును. నా ఆచార్యులు (మాముణులు) వివరించుచు, ప్రమాణములకు అనుగుణంగా ప్రతి ఒక్కరు తమ ఆచార్యునిపై సంపూర్ణ విశ్వాసముగలిగి ఉండవలెనని తెలిపిరి. అవి..

  • ‘ఆచార్యాయాహరే ధర్తాన్ ఆత్మానంచ నివేధయేత్ : తదధీనశ్చ వర్తేత సాక్షాన్ నారాయణో హి సః’ – తనను తాను, తన సంపదను, ఆచార్యుని అధీనములో ఉండి  తమ ఆచార్యునికి ఎవరు సమర్పించుదురో, వారు తప్పక శ్రీమన్నారాయణుని దివ్య ధామానికి చేరగలరు.
  • ‘యస్య సాక్షాత్ భగవతి జ్ఞాన దీపప్రదే గురౌ’ – ఆచార్యులు జ్ఞానజ్యోతి వెలిగించి, శిష్యునికి జ్ఞానమోసగుటచే, వారిని సాక్షాత్ భగవానునిగా భావించవచ్చు.
  • ‘ఆచార్యస్స హరి సాక్షాత్ చరరూపి న సంశయః’ –  ఆచార్యులు స్వయముగా శ్రీహరియే – నిస్సంశయముగా, కాని వారు భగవానునిలా (కోవెలలో ఒకే చోట నిశ్చలముగా వుంటారు) కాక, మన చుట్టూ దర్శనమిచ్చెదరు
  • ‘గురురేవ పరంబ్రహ్మ’ – గురువే పరంబ్రహ్మ
  • ‘గురుమూర్తి స్థితస్ సాక్షాత్ భగవాన్ పురుషోత్తమః’ – భగవానే స్వయముగా గురువు రూపమును ధరిస్తారు, మొ ||

పిళ్ళై లోకాచార్యులు, శ్రీవచన భూషణము 443 సూత్రములో ఈ విషయమునే వివరించిరి:
‘స్వాభిమానత్తాలే ఈశ్వరాభిమానత్తై కులైత్తుకొణ్డ ఇవనుక్కు, ఆచార్యాభిమానమొళియ గతియిల్లై ఎన్ఱు పిళ్ళై పలకాలుం అరుళిచ్చెయ్య క్కేట్టిరుక్కైయాయిరుక్కుమ్’.

సాధారణ అనువాదము: జీవాత్మ తన స్వతంత్రత కారణముగా ఈశ్వరుని కృపను కోల్పోయిరని, వారికి ఆచార్యుని కృపయే శరణ్యము అని వడక్కు తిరువీధి పిళ్ళై పదే పదే తెలిపిరని నేను వింటిని.

ఈ సూత్రము (ఆచార్యుని కృపను ఉపాయముగా స్వీకరించుట) సత్సంప్రదాయము యొక్క ఫలితము. అందరూ

  • తమ ఆచార్యుని శ్రీమన్నారాయణుని (శ్రీమహాలక్ష్మి పతి) రూపముగా భావించాలి
  • వారి పాదపద్మములను ఉపాయ ఉపేయములుగా తలంచాలి
  • ఆ పాదపద్మముల సేవయే అంతిమ లక్ష్యముగా చేసుకొనాలి
  • వారి తిరుమాలిగ (లేదా వారి మఠం) అత్యున్న నివాసముగా యోచించాలి
  • వారి దివ్య స్వరూపమునే రక్షకునిగా, పోషకునిగా, ఆనందము నొసంగునదిగా భావించి సేవించవలెనని నమ్మాళ్వార్లు ఉణ్ణుం చోఱు అను పాశురములో వివరించిరి
  • ‘ఉత్తారయతి సంసారాత్’ శ్లోకములో వివరించిన ప్రకారము వారిని ఉధ్ధారకునిగా భావింపవలెను
  • ఆర్తి ప్రబంధములో మాముణులు ఆరాధించిన విధముగా వారిని ఆరాధించవలెను “యతిరాజ ఎన్నై ఇని క్కడుక ఇప్పవత్తినిన్ఱుమ్ ఎడుత్తఱుళే ” – యతిరాజా నన్ను దయతో ఈ క్రూర సంసారము నుండి వెంటనే విముక్తుడిని చేయుము.
  • ” ఆచార్య అభిమానమే ఉత్తారకము ” – శ్రీవచన భూషణము 447 – ఆచార్యుని కృపయే ఉద్ధరింపబడుటకు శరణ్యము.
  • రామానుజ నూఱ్ఱందాది 93వ పాశురము “ఎన్ పెరువినైయై క్కిట్టిక్కిళంగొడు తన్నరుళ్ ఎన్నుం ఒళ్ వాళురువి వెట్టి కలైన్ద, ఇరామానుశన్”, కణ్ణినుణ్ శిఱుత్తాంబు 7వ పాశురము “కండు కొండెన్నై, కారి మాఱ ప్పిరాన్ పణ్డై వల్వినై, పాఱ్ఱి యరుళినాన్” – మనము మునుపు చేసిన పాపములను తొలగించువాడు ఆచార్యులే అని భావించుము.

ఈ విధముగా చరమ పర్వము (అంత్య స్థితి) లో నున్న శిష్యులు, ఆచార్యులు తాము ఆశించిన ఫలితము నిచ్చువారిని, తమ లక్ష్య సాధనలో నున్న అడ్డంకులను తొలగించు వారని, తమను ఉద్ధరించు ఆచార్యునకు విధేయులని, స్వగత స్వీకారము (ఆచార్యుని అనుసరించు శిష్యుడు), పరగత స్వీకారము (ఆచార్యులు తమ దివ్య కృపచే శిష్యుని అనుగ్రహించుట), ఈ రెండును అంతిమ ఫలితమును ప్రసాదించును. కాని, శిష్యునికి ఆచార్యుని సమీపించుట / అనుసరించుట తామే స్వయముగా / అహంకార పూరితముగా చేయుచున్నామను భావనలో నుండుట, కాలుడు (యముడు) దీవించి ఇచ్చిన ఉంగరమును ధరించినటు వంటిది అగును, కావున జీవాత్మ స్వభావమునకు స్వగత స్వీకారము సరిపోదు. కావున శిష్యుడు దానిని వదలి, ఆచార్యుని అపార కరుణ (పరగత స్వీకారము) పైననే సంపూర్ణముగా ఆధారపడి ఆనందముగా జీవించవలెను.

  • “సంసారావర్త వేగ ప్రశమన శుభదృక్ దేశిక ప్రేక్షి – తోహం” – సంసారము వల్ల ఏర్పడు శక్తివంతమైన ఫలితములను అణచి వేయుటకై నా ఆచార్యుని సహాయమునకై ఆధారపడుట వల్ల నేను సుఖముగా నున్నాను.
  • ‘నిర్భయో నిర్భరోస్మి’ – భయము మరియు సంసారములో కష్టములు లేకుండుట.
  • ‘ఆచార్యస్య ప్రసాదేన మమ సర్వమభీష్టితం’; ప్రప్నుయామీతి విశ్వాసో యస్యాస్తి స సుఖీభవేత్’ – ఆచార్యుని కృపచే తమ సమస్త వాంఛలు నెరవేరునని నమ్మకము / విశ్వాసము కలిగిన వారు సుఖముగా నుండగలరు.
  • తిరువాయ్మొళి తనియన్ – ‘తనత్తాలుమ్ ఏదుమ్ కుఱై విలేన్ ఎందై శడకోపన్ పాదంగల్ యాముడైయ పత్తు’ – నేను నమ్మాళ్వార్లను శరణు చేయుటచే, నా సంపద (భౌతిక, ఆధ్యాత్మిక) పై సంతుష్టి కలిగి వున్నాను.

ఇంకను, పుణ్య పాపములు రెంటిని త్యజించుటచే, నిత్య విభూతి (పరమపదము) మరియు లీలా విభూతి (సంసారము) ల మధ్య అడ్డంకులు తొలగిపోవుటచే, ఈ సంసారములో ఆనందముగా వశించ వచ్చునని ఈ క్రింద పేర్కొనిన వానిలో వివరించిరి :

  • ప్రమేయ సారము 1 – ‘ఇవ్వాఱు కేట్టిరుపాఱ్కు ఆళెన్ఱు కణ్డిరుప్పార్ మీట్చియిల్లా నాట్టిరుప్పార్ ఎన్ఱు ఇరుప్పన్ నాన్’ – ఎవరైతే ఆచార్యుని ద్వారా తిరుమంత్ర అర్ధములను వినిరో, ఆచార్య శేషత్వమును గ్రహించిరో, వారి సేవ గావించిరో, వారు నిశ్చయముగా తిరిగి రాని ఉత్తమ లోకము పరమపదమును చేరెదరు.
  • ప్రమేయ సారము 9 – ‘తత్తం ఇఱైయిన్ వడివు ఎన్ఱు తాళిణైయై వైత్త అవరై’ – ఎవరైతే తమ ఆచార్యుని భగవదవతారముగా భావించి, ఆరాధించెదరో వారు తప్పక పరమపదమును చేరగలరు.
  • ఉపదేశ రత్త మాల 72 – ‘ఇరుళ్ తరుమా జ్ఞాలత్తే ఇన్బ ముఱ్ఱు వాళుం, తెరుళ్ దరుమా దేశిగనై చ్చేర్ న్దు’ – పూర్వాచార్యుల దివ్య ఆదేశములను, వారి జీవితములను శ్రవణము గావించి, ఆచరించి, వాటి దివ్య జ్ఞానమును ఆచార్యుని ద్వారా పొందిన శిష్యుడు, అంధకారమయమైన ఈ సంసారములో కూడ ఆనందముగా జీవించగలడు.

ఈ కారణముగానే పెరియ వాచ్చన్ పిళ్ళై, ఆచార్యుని పాదపద్మములే భౌతిక / ఆధ్యాత్మిక జగత్తులని భావించుట, గోచరమైన / అగోచరమైన లక్ష్యమని అంగీకరించుట కన్నా ఇతర గొప్ప విషయమేది లేదని తేల్చిరి. అయితే, అట్టి శిష్యులకు (తమ ఆచార్యునిపై సంపూర్ణ విశ్వాసము కలవారికి) ఈ సంసారమే పరమపదమగునా? ఒకసారి, నంబి తిరువళుది వళనాడు దాసర్, కణ్ణినుణ్ శిఱుత్తాంబు పఠించుచూ “మధురకవి శొన్నశొల్ నంబువార్ పది వైకుందం కాణ్మనే” (మధురకవి ఆళ్వార్ల దివ్య పలుకులను విశ్వసించినవారు, వారు ఎక్కడ వున్నను అదియే వైకుంఠమగును) అని ముగించిరి. ఆ సమయములో అక్కడ నున్న శ్రీవైష్ణవులు “ఈ సంసారములో (లీలా విభూతి) నున్న శ్రీవైష్ణవులు దానిని విశ్వాసముతో చదివిన, ఆ స్థలము వైకుంఠముగా (నిత్య విభూతి) ఎట్లగును?” అనగా, వారు జవాబుగా ఎట్లగునో నేను వివరించెదను, వినుము. దైవాంశతో జన్మించిన కూరత్తాళ్వాన్ పుత్రుడు (భట్టర్) అవతరించిన పిదప, ఆ రెండు జగత్తుల మధ్య ఉన్న హద్దులు తొలగిపోయి, రెండును ఏకమైనవి” అనిరి. ఈ సంఘటనను కణ్ణినుణ్ శిఱుత్తాంబు వ్యాఖ్యానములో వివరించిరి.

అనువాదకుని గమనిక: ఈ విధముగా, మనము భగవానుని స్వయం అవతారముగా అపార కరుణా స్వరూపునిగా ఆచార్యుని దర్శించితిమి, శిష్యునికి వారి సేవయే అత్యంత ఆవశ్యకము.

దీనిలోని అనేక సంస్కృత ప్రమాణములను అనువదించుటకు సహాయ మొనర్చిన శ్రీ రంగనాథన్ స్వామికి కృతఙ్ఞతలు.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-12.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 34

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 33

ఇప్పుదు, తిరుమల కథనం

పురట్టాసి (భాద్రపద) మాసం మొదటి రోజు, తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే, స్థానికులు కొందరు కొండ క్రింద ఆళ్వార్ తీర్థం దక్షిణ దిశ పొదల్లో పెరియ పెరుమాళ్ళ (శ్రీ రంగనాథన్) లాగా శయనించి ఉన్న ఒక శ్రీవైష్ణవుడిని తాము చూశారని వచ్చి చెప్పినట్టు పెరియ కేళ్వి జీయర్ (కొండపై ఉన్న పెద్ద జీయర్ వారు) స్వప్నంలో చూసెను.  ఏడు కొండలంత అతి విశాల రూపముతో, వారి దివ్య తిరుముడి (శిరస్సు) పడమర దిశలో వారి దివ్య తిరువడి (పాదాలు) తూర్పు దిశలో ఉంచి, దక్షిణం వైపు చూస్తున్నాట్టు, ఒక జీయర్ వారి పాదాల వద్ద నిలబడి ఉన్నట్టు స్వప్నంలో వారికి కనిపించారు. వారెవరని స్థానికులను అడిగినప్పుడు, “వారు అళగీయ మాణవాళ పెరుమాళ్ నాయనార్ అని, ముప్పత్తారాయిరం (ఈడు, తిరువాయ్మొళి  వ్యాఖ్యానం) నిపుణుడని, వారి దివ్య తిరువడి యందు నిలబడి ఉన్న వ్యక్తి పొన్నడిక్కాల్ జీయర్” అని స్వప్నంలో తెలుపుతారు. మరుసటి రోజు తెల్లవారు జామున, పెరియ కెల్వి జీయర్ సుప్రభాత సేవ కోసం గుడికి వెళ్ళినప్పుడు, వారు ఇయల్ (తిరుప్పల్లాండు, తిరుప్పావై మొదలైన పాశురాలు పారాయణం చేసే ప్రాతః ఆచారం) కోసం వచ్చిన వారికి స్వప్నం గురించి వివరించెను. ఇది విన్న తోళప్పర్ ఒక శ్లోకం రచించారు.

స్వప్నేబృహత్ యతీంద్రస్య శ్రీశైలసమితోమహామ్
శయానః పురుషోదృష్టః సౌమ్యజామాతృ దేశికః
తదర్శ పశ్చాత్ తస్యైవ పాదమూలే యతీశ్వరం
ప్రాంజలిం నిభృతం ప్రహ్వం స్వర్ణాధిపతిపదసంయకం

(పెరియ కేళ్వి జీయర్ స్వప్నంలో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ అనే విశేష మహాపురుషులు శయనించి ఉన్నట్టు, వారి తిరువడి వద్ద పొన్నడిక్కాల్ జీయర్ వినయంతో చేతులు జోడించుకొని నిలుచొని ఉన్నట్టు పెద్ద జీయర్ చూశారు). ఇది విని అందరూ సంతోషించారు. సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి వస్తున్న కొందరు వారిని కోయిల్ నాయనార్ అని అన్నారు. మరికొందరు వారు బ్రహ్మోత్సవాల కోసం వస్తున్నారని అన్నారు; మరికొందరు “వానమామలై జీయర్ని నాయనార్లు అతి ప్రియ శిష్యులుగా భావిస్తారు; వారిని  పొన్నడిక్కాల్ జీయర్ అనే పేరుతో పిలుస్తారు” అని వారిలో వారు గుసగుసలు చెప్పుకున్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలు అద్బుతంగా జరగబోతున్నాయని అందరూ ఆశగా ఎదురు చూడసాగారు.

నాయనారు తమ యాత్రలో భాగంగా, తిరువాయ్మొళి 3.3.8 “తిరువేంగడమామలై ఒన్ఱుమే తొళ నం వినై ఓయుమే” (తిరుమల ఏడు కొండలను మనం సేవించిన వెంటనే, మన పూర్వ కర్మలు తొలగిపోతాయి) అని పఠించుచూ తిరుమలైయాళ్వార్ (కొండ) ని సేవించెను. వారు తిరుమలైయాళ్వార్ ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి, రెప్పార్చకుండా ఏడు కొండలను చూస్తూ “సువర్ణముఖరీం తత్రసంగతాం మంగళాస్వనాం” (మధురమైన ధ్వనులతో ఆ తిరుమలలో ప్రవహిస్తున్న సువర్ణముఖి) అని చెప్పినట్లు, స్వర్ణముఖి నదికి చేరుకున్నారు. అక్కడ పవిత్ర స్నానమాచరించి, కేశవ నామముతో ప్రారంభించి పన్నెండు ఊర్ధ్వ పుండ్రములను ధరించెను. వారు గోవిందరాజుల సన్నిధికి వెళ్లి, ఆతడికి మంగళాశాసనము చేసి, తీర్థ శఠారీ తుళసి తులసి మొదలైన ఆలయ మర్యాదలు స్వీకరించి, కొండ క్రిందనే ఉన్న అళగియ శింగర్ (నరసింహుడు) ని సేవించెను. ఉపనిషత్తు “ఏవంవిత్ పాదేన అధ్యారోహతి” (ఇలా సేవించినవాడు కాలి నడకన పైకి ఎక్కుతాడు) లో పేర్కొన్నట్లుగా, అతను కొండపైకి ఎక్కడం ప్రారంభించాడు. దారిలో, అతను పరిషద్ తిరువేంగడముడైయాన్ సేవించెను (పరిషత్ తిరువేంగడముడైయాన్ అనేది – తిరువేంగడముడైయాన్ యొక్క మరప భక్తుడైన తోండమాన్ చక్రవర్తిని ఆదుకోడానికి శంఖ చక్రాలతో వచ్చిన పెరుమాళ్ళ అర్చా రూపం. తర్వాత, సమీపంలోని కర్పూరకా (కర్పూర తోట) నుండి పవిత్ర జలాన్ని తీసుకుని, ఆపై కాట్టళగియ శింగర్ మరియు మాంబళ ఎంపెరుమానార్లను సేవించెను.

(మాంబళ ఎమ్పెరుమానార్ గురించి ఆసక్తికరమైన కథనం ఒకటి ఉంది: ఎమ్పెరుమానార్లు తిరుమల కొండ పైకి ఎక్కుతున్నప్పుడు తిరువేంకటేశ్వరుడు అనంతాళ్వాన్ శిష్యులలో ఒకరి లాగా వేషం వేసుకుని, ఎమ్పెరుమానార్ వద్దకు మామిడి పండు పెరుగన్నంతో వెళ్లి, వీటిని తిరువేంకటేశ్వరుడు పంపారని చెప్పెను. ఎమ్పెరుమానార్లు అతడిని తమ ఆచార్యుడు ఎవరు అని అడిగినప్పుడు, అతను తన ఆచార్యులు అనంతాళ్వాన్ అని తెలిపుతారు. వెంటనే ఎమ్పెరుమానార్లు వారి తనియన్ను పఠించమని ఆ శ్రీవైష్ణవుడిని అడగగా

అఖికాత్మ గుణావాసం అజ్ఞాన తిమిరాపహం
ఆశ్రితాతాం సుచరణం వందే అనంతార్య దేశికం
యతీంద్ర పాదాంబుజ సంచరీకం శ్రీమద్ దయాపాల దయైక పాత్రం
శ్రీవేంకటేశాంగ్రి యుగాంతరం నమామి అనంతార్యం అనంతకృత్వః

అని చెప్పి అదృశ్యమౌతాడు. ఇది చూసి ఎమ్పెరుమానార్లు ఆశ్చర్యపోతారు; ప్రసాదముతో వచ్చినది వేంకటేశ్వరుడే అని వారు గ్రహిస్తారు. వారు ఆ చోటిలో కూర్చొని పెరుగన్నం మామిడి పండుని తిని ఆ మామిడి జీడిని ఆ ప్రదేశంలోనే నాటుతారు. తిరువేంకటేశ్వరుని దివ్య పాదాలు అక్కడ ప్రత్యక్షమైన తరువాత, తరువాతి కాలంలో వచ్చిన వారు అక్కడ ఎమ్పెరుమానార్ల విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని మాంబళ ఎమ్పెరుమానార్ అని పిలుస్తారు).

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/18/yathindhra-pravana-prabhavam-34/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 33

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 32

తిరుమలకు బయలుదేరిన నాయనార్

ఉత్తర ప్రాంతాలలో ఉన్న తిరుమల మరియు ఇతర దివ్య దేశాలకు వెళ్లి అక్కడ ఎంబెరుమానులను సేవించుటకు యాత్ర ప్రారంభించాలని నాయనార్లు తమ దివ్య మనస్సులో సంకల్పించెను. వారు పెరియ పెరుమాళ్ళ సన్నిధి వెళ్లి, పెరుమాళ్ళను సేవించి, “అడియేన్ తిరుమలకు వెళ్లి తమ పాదాలను సేవించుటకు తమ అనుమతిని కోరుతున్నాను” అని అభ్యర్ధించెను. పెరుమాళ్ళు తమ దివ్య మాల, తీర్థ శఠారీలు వారిని సమర్పించి అనుమతిని అనుగ్రహించెను. “తదస్థేనాభ్య అనుంజ్ఞాతో యాతో దరణిం ఉత్తరాం” అని చెప్పినట్లు పెరుమాళ్ అనుమతిని పుచ్చుకొని వారు ఉత్తర భాగాలలో ఉన్న దివ్యదేశాల వైపు బయలుదేరెను.

తిరుక్కోవలూర్, తిరుక్కడిగై మంగళాశాసనము

అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు వెంటనే తిరుమలకు బయలుదేరెను. “ముప్పోదుం వానవరేత్తుం మునివర్గళ్” (దేవతలు నిత్యము తిరువేళ్లఱై పెరుమాళ్ళను సేవించుచుందురు) అని పెరియాళ్వార్లు చెప్పినట్లుగానే, వారు తిరువేళ్లఱై యందు పంగయచ్చెల్వి తాయార్ (శెంగమల వల్లి) యొక్క పురుషకారంతో సెందామరైక్కణ్ణన్ (పుండరీకాక్ష పెరుమాళ్) ను సెవించుకున్నారు. అక్కడి పెరుమాళ్ళ తీర్థ శఠారీలను అందుకొనెను. “పాదేయం పుండరీకాక్ష నామసంకీర్తనామృతం” (పుండరీకాక్షుని దివ్యనామాల జపం మనకు ఈ యాత్రలో అమృతం వంటిది) అని చెప్పినట్లు, వారు ద్వయ మహామంత్రాన్ని ధ్యానిస్తూ, “పూంగోవర్లూర్ తొళుదుం పోదు నెంజే” (ఓ నా మనసా! తిరుక్కోవలూర్ ఎంబెరుమానుని ధ్యానిస్తూ ఉండు) అని చెప్పినట్లు తిరుక్కోవలూర్ వైవు ప్రయాణము సాగించెను. మార్గ మధ్యంలో పలు చోట్ల విశ్రాంతి తీసుకుని తిరుక్కోవలూర్ చేరుకున్నారు. వారు మొదట ముద్దాలాళ్వార్ల దివ్య తిరువడిని సేవించి, వీరి సిఫార్సుతో త్రివిక్రమ ప్పెరుమాళ్ళను సేవించుకున్నారు. అతను తిరుమొళి పాశురము 2.10.9 “తూవడివిల్ పార్మగళ్” (సౌందర్య స్వరూపిణి భూదేవి) తో ప్రారంభించి, “తిరుక్కోవలూర్ అదనుళ్ కండేన్ నానే” (తిరుక్కోవలూర్ దివ్య దేశములో సేవించాను) తో ముగించారు. వారు ముదల్ తిరువందాది పాశురము 86 “నీయుం తిరుమగళుం నిన్ఱాయాల్” (శ్రీ మహాలక్ష్మి మరియు నీవు భక్తులపై కృపా వర్షాన్ని కురిపించడానికి కలిసి నిలబడి ఉన్నారు) పఠించారు. ఆ తర్వాత తిరుప్పావై పాశురము 24 “అన్ఱివ్వులగం అళందాయ్ అడి పోఱ్ఱి” (ముల్లోకాలను కొలిచిన నీ దివ్య పాదాలు చిరకాలం వర్ధిల్లాలి!) అంటూ తిరుక్కోవలూర్ పెరుమాళ్ళకు మంగళాశాసనం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించెను. తిరుక్కోవలూర్ పెరుమాళ్ళు వెనక్కి లాగుతున్నట్లు, తిరువేంకటేశ్వరుడు తమవైపు లాగుతున్నారని తలచుకుంటూ వారు తిరుమలకి బయలుదేరారు. తిరువాయ్మొళి 3.3.8 పాశురములో చెప్పినట్లుగా “కున్ఱమేంది కుళిర్మళై కాత్తవన్ అన్ఱు జ్ఞాలం అళంద పిరాన్ పరన్ శెన్ఱు శేర్ తిరువేంగడం మామలై…” (గోవర్ధన గిరిని ఎత్తి గోవులను కాపాడినవాడు; ముల్లోకాలను తమ పాదాలతో కొలిచినవాడు; అటువంటి ఎంబెరుమానుడు వచ్చి ఈ తిరుమలలో కొలువై ఉన్నాడు…), పాశురము “తిరువేంగడత్తాయన్” (తిరుమల నివాసి) మరియు “మొయిత్త శోలై మోయ్ పూం తడం” (అనేక సరస్సులు తోటలతో ఉన్న), వారు అపారమైన గోష్టితో మరియు ఎంతో కోరికతో అతి సులభుడైన తిరువేంగడముడైయాన్ దివ్య పాదాలను సేవించాలని ఎంతో ఆతృతతో ముందుకు సాగారు. దారిలో, తిరుక్కడిగై (శోళింగపురం) కొండపైన కొలువై ఉన్న తక్కాన్ పెరుమాళ్ళను సేవించెను. శోళింగపురం సమీపంలోని ఎఱుంబి అనే ఊరికి చెందిన కొందరు ప్రముఖులు వారి కోసము కొన్ని పదార్థాలు తెచ్చి వారికి సమర్పించి సేవించు కొన్నారు. నాయనార్లు వారిపై తమ కృపను కురిపించి అక్కడ నుండి బయలుదేరారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/17/yathindhra-pravana-prabhavam-33/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 32

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 32

నాయనార్లకు తీర్థ ప్రసాదం, శఠారి, పెరుమాళ్ళు ధరించిన దివ్య పూమాలలు సమర్పించబడ్డాయి. ఒక మహా రాజు కిరీటము దండలు అందుకున్నట్లుగా తాము సంతోషించి  “శ్రీరంగనాథుని అనుగ్రహానికి పాతృలైనాము” అని తలచారు. “నంపెరుమాళ్ళు దేవరువారి కోసమని తనపైన కరుణను కురిపించాడు” అని తిరుక్కోట్టూరిల్ అణ్ణర్ వైపు చూస్తూ అన్నారు. తర్వాత వారు అణ్ణర్తో కలిసి వారి తిరుమాలిగకి వెళ్ళి, అక్కడ భట్టార్ వారు పంపిన పెరుమాళ్ళ ప్రసాదాలను స్వీకరించెను. తరువాత తిరుక్కోట్టూరిల్ అణ్ణర్ మన పూర్వాచార్యుల అనుష్ఠానములు మరియు సత్వచనముల గురించి వారికి ఉపన్యాసం ఇచ్చెను. ఆ తర్వాత, అణ్ణర్ తో కలిసి వెళ్లి గతంలో పూర్వాచార్యులు నివసించిన వివిధ దివ్య తిరుమాలిగలను సేవించుకొనెను. వారు పిళ్ళై లోకాచార్యుల తిరుమాలిగకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వారి తనియనన్ను స్మరించుకున్నారు.

వాళి ఉలగాశిరియన్ వాళి అవన్ మన్ను కులం
వాళి ముడుంబై ఎన్నుం మానగరం వాళి
మనంజూళ్ంద పేరిన్బమల్గు మిగు నల్లార్
ఇనంజూళ్ందు ఇరుక్కుం ఇరుప్పు

(పిళ్లై లోకాచార్యులు చిరకాలం వర్ధిల్లాలి! వారి గొప్ప వంశం చిరకాలం వర్ధిల్లాలి! గొప్ప ముడుంబై దేశం చిరకాలం వర్ధిల్లాలి! గొప్ప మహా పురుషుల మనస్సులను ఆకట్టుకుని గొప్ప ఆనందాన్ని తెచ్చిపెట్టిన వారు చిరకాలం వర్ధిల్లాలి). వారి దివ్య మనస్సులో మరొక పాశురము చిగురించింది:

మణవాళన్ మాఱన్ మనమురైత్తాన్ వాళి
మణవాళన్ మన్నుకులం వాళి మణవాళన్
వాళి ముడుంబై వాళి వడవీధి తాన్
వాళియవన్ ఉరై శెయ్ద నూల్

(అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ (పిళ్ళై లోకాచార్యుల సోదరుడు) నమ్మాళ్వార్ల దివ్య సంకల్పాన్ని తెలియజేసారు. ఆ మణవాళన్ యొక్క దివ్య వంశం చిరకాలం వర్ధిల్లాలి. మణవాళన్ చిరకాలం వర్ధిల్లాలి! ముడుంబై చిరకాలం వర్ధిల్లాలి! వడవీధి (వారు నివసించిన వీధి) చిరకాలం వర్ధిల్లాలి! వారు రచించిన వచనాలు చిరకాలం వర్ధిల్లాలి!) తర్వాత ఈ ఇద్దరు ఆచార్యుల (పిళ్ళై లోకాచార్యులు మరియు అళగీయ మణవాళ ప్పెరుమాళ్ నాయనారు) అసమానమైన మహిమలపై సంకలనం చేయబడిన మూడు శ్లోకములు:

వాణీం పుణ్యసుధాపకాం శటజిత్స్వైరం విగాహ్యాదరాత్
ఆనీయామృత మత్రచక్రదుకుభౌ లోకోపకారాత్మకౌ
యౌ వాక్భూషణ దేశికేంద్రహృదయాపిక్యౌ ప్రబంధావిమౌ
తే వందే భువనార్యసుందరవరౌ కృష్ణాత్మజౌ దేశికౌ

(వడక్కు తిరువీధి పిళ్ళై కుమారులైన పిళ్ళై లోకాచార్యులు మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, ఈ ఇద్దరు ఆచార్యులు సంసారులను ఉద్దరించాలనే ఉద్దెశ్యముతో శ్రీ వచన భూషణము, పూర్ణ అంకితభావంతో నమ్మాళ్వార్ల తిరువాయ్మొళి అమృతార్థాలలో లీనమై ఆచార్య హృదయము రచించారు.)

ఆర్యసౌమ్యవరశ్శటారికలిజిత్ బట్టేశ ముఖ్యాత్మనాం
భక్తానాం విమలోక్తిమౌక్తిక మణీనాతాయ చక్రే బృశం
కృత్వా సాధురహస్యత్రయార్థం అఖిలం కూటం విశ్పచిత్రియం
లోకార్యావరజస్సుశిక్షకవర శ్చూడామణిశ్శోభతే

(అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ పిళ్ళై లోకాచార్యుల దివ్య సోదరుడు; వీరు సత్సంప్రదాయ అర్థాలను అధ్యయనము చేసినవారు; వీరు అందరిచే ఆరాధింపబడ్డ గొప్ప ఆభూషణము వంటి వారు. నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, పెరియాళ్వార్ వంటి గొప్ప భక్తుల ముత్యాల వంటి స్వచ్ఛమైన పలుకుల అధారముగా వీరు రహస్యత్రయం (తిరుమంత్రం, ద్వయం మరియు చరమ శ్లోకం) యొక్క నిగూఢ అర్థాలను పూర్వాచార్యుల దివ్య మనస్సులకు అనుగుణంగా, స్పష్టంగా) వెల్లడి చేశారు.

యస్యహం కులదైవతం రఘునతేర్ ఆధనం శ్రీసఖం
కావేరీ సరితిందరీపనగరీ వాసస్థలే పుణ్యభూః
కృష్ణో మాన్యగురుర్ వరేణ్యమహిమా వేదాంత విధ్యానిధిః
భ్రాత సౌమ్యవర స్స్వయంతు భువనాచార్యోసి కస్తే సమః

( శ్రీ రాముని తిరువారాధన పెరుమాళ్ అయిన అళగియ మణవాళన్ [పెరియ పెరుమాళ్] ఎవరి కులదైవమో, రెండు దివ్య కావేరి ప్రవాహాల మధ్య ఉన్న శ్రీరంగం ఎవరి నివాస స్థలమో, అతి పూజ్యనీయులు మరియు అత్యంత గౌరవనీయులైన వడక్కు తిరువీధి పిళ్ళై ఎవరి తండ్రి మరియు ఆచార్యులో, ఉభయ వేదాంత సంపద కలిగి ఉన్న అళగియ మాణవాళ పెరుమాళ్ నాయనార్ ఎవరి తమ్ముడో, అటువంటి పిళ్ళై లోకాచార్యులు సమస్థ ప్రపంచానికే ఆచార్యుడు. అటువంటి దేవర్వారికి ఎవరు సమానులౌతారు?)

పిళ్లై లోకాచార్యుల దివ్య తిరుమాలిగని ఆశ్చర్యంగా చూస్తూ “రహస్యం విళనిద మణ్ణన్ఱో?” (ఈ చోటి నుంచే కదా రహస్యార్థాలు వచ్చాయి?) తిరుక్కోట్టూరిల్ అణ్ణర్ పిళ్లై లోకాచార్యుల మహిమను వివరిస్తుండగా కొంత సేపు అక్కడే ఉండి విన్నారు; కృతజ్ఞతతో, ​​”మనం ఎంత అదృష్టవంతులం!” అని ఆశ్చర్యపోయారు. తర్వాత వారు మన పూర్వాచార్యుల నివాసం వంటిదైన ఆలయంలోకి ప్రవేశించారు [మన పూర్వాచార్యుల వారి తిరుమాలిగలలో కంటే ఆలయంలో ఎక్కువ సమయం గడిపేవారు]. పెరుమాళ్ళు వారికి దివ్య మాల, పరియట్టం, తీర్థ, శఠారీలని ప్రసాదించెను. ఈ క్రింద శ్లోకములో చెప్పినట్లు….

తస్మిన్ సస్మిత నేత్రేణ శ్రీమతా శేషశాయినా
సత్కృతః కృతవాన్ వాసం కించిత్ తత్ర తదంతికే

(వికసించిన విశాల నేత్రాలతో దివ్య అనుగ్రహము కురిపించుచూ తన వైపు చూస్తున్న శ్రీమాన్ – పెరియ పెరుమాళ్ళ దివ్య పాదాల వద్ద వారు కొంతకాలం జీవనం సాగించెను. పెరియ పెరుమాళ్ వారితో “ఉడయవర్ల లాగా, నా ఈ నివాస వ్యవహారాలు చూసుకుంటూ, దర్శన రహస్యాలను విశ్లేషిస్తూ, నీ శరీరం వ్రాలిపోయే వరకు ఇక్కడే ఉండుము” అని ఆదేశించెను. నాయనార్ వెంటనే అంగీకరించి, “మహా ప్రసాదము” అని చెప్పి అక్కడ తమ నివాసమెర్పరచుకున్నారు.

ఆ సమయంలో, వారు రహస్య ప్రబంధాలపై మన పూర్వాచార్యుల రచించిన వ్రాత పత్రాలన్నింటినీ పరిశీలించి, చెదలతో శిథిలావస్థలో ఉన్న వాటిని మళ్లీ వ్రాసి వాటిని వెలుగులోకి తెచ్చారు. ఒక రోజు వానమామలై జీయర్ వారితో “పెరుమాళ్ళ తిరువారాధన నిర్వహణ చేపట్టిన ఉత్తమ నంబి తమ పనులు సరిగ్గా చేయడం లేదు; పెరుమాళ్లకు అర్పించే ప్రసాద పరిమాణాన్ని తగ్గిస్తున్నారు” అని ఫిర్యాదు చేశెను.  అతి వినమ్ర స్వభావము కల నాయనార్లు  ఉత్తమ నంబిపై ఎటువంటి కఠినమైన చర్య తీసుకోవడానికి ఇష్టపడలేదు. “తిరువారాధనము ఎటువంటి లోపం లేకుండా జరిగేలా దయచేసి వారిని సరిదిద్దమని పెరుమాళ్ళని అభ్యర్థించండి” అని వారు జీయర్ తో అన్నారు. స్వయంగా వారు కూడా అలా జరిగేలా పెరుమాళ్ళని వేడుకున్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/16/yathindhra-pravana-prabhavam-32/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 31

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 30

నాయనార్లు పలు శ్రీ వైష్ణవులతో కలిసి, శ్రీ మహాలక్ష్మికి పతి అయిన తెన్నరంగన్ (శ్రీ రంగనాధుడు) యొక్క పాదపద్మాలకు పాద రక్షలుగా పరిగణించబడే శఠగోప (నమ్మాళ్వార్) సన్నిధికి వెళ్లెను. వారిని సేవించెను. ఇరామానుశ నూఱ్ఱందాదిలో “అంగయల్ పాయ్ వయల్ తెన్నరంగం అణియాగ మన్నుం పంగయమా మలర్ ప్పావై (చేపలు తుళ్ళి తుళ్ళి ఆడుకునే పంట పొలాలతో చుట్టు ముట్టి ఉన్న శ్రీ రంగానికి దక్షిణంలో దివ్యాభరణముగా ప్రకాకించే పద్మ నివాసినీ శ్రీ రంగ నాచ్చియార్) అని కీర్తించబడ్డ శ్రీరంగ నాచ్చియార్ సన్నిధికి ప్రదక్షిణగా వచ్చి చేరుకున్నారు. ఆ సన్నిధి ఎదుట “శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః” (శ్రీరంగ సంపద అయిన శ్రీ రంగ రాజ పత్ని యొక్క దివ్య చరణాలను చేరుకున్నాము) అని సేవించి ఆమె దివ్య అనుగ్రహాన్ని పొందెను. తరువాత వారు ఆలయం లోపల, దివ్య మంటపాల గుండా వెళ్లి, బలిపీఠం ఎదుట సాష్టాంగ నమస్కారం చేసెను. ఆపై శ్రీ రంగనాధుని సన్నిధికి , ప్రదక్షిణ చేసి, ప్రణవాకార విమానాన్ని అలాగే విష్వక్సేనుల సన్నిధి సేవించి, ముఖ్య మంటపములోకి ప్రవేశించి  సాష్టాంగము చేసి “అళివాణ్ణా! నిన్ అడియిణై అడైందేన్ అణిపొళి తిరువరంగత్తమ్మానే!” (ఓ మహా సాగర వర్ణము కలవాడా! కావేరి నడుమ ఉన్న తిరువరంగములో కొలువై ఉన్నవాడా! నీ దివ్య తిరువడిని చేరుకున్నాను) అని చెప్పి, వారు పెరియ తిరువడి (గరుడ) ని సేవించుకొని, ద్వారపాలకుల అనుమతి తీసుకుని, ప్రధాన సన్నిధిలోకి ప్రవేశించి, తిరుమణత్తూణ్ (పెరియ పెరుమాళ్ళ ఎదుట ఉన్న రెండు పెద్ద స్తంభాలు, గర్భగుడి వెలుపల) దగ్గర ఎంబెరుమానుని హృదయపూర్వకంగా స్తుతిస్తూ, పెరుమాళ్ తిరుమొళి పాశురము “అరంగమాకోయిల్ కొండ కరుంబినై క్కణ్డు క్కణ్ణిణై కళిత్తు” (విశాల నేత్రాలతో శ్రీరంగ మహాలయములో నివాసుడై ఉన్న ఈ చెరుకు (కల్కండు) ని సేవిస్తున్నాను) అని అరుళిచ్చెయల్లో వర్ణించిన విధముగా పెరుమాళ్ళకి మంగళశాసనం చేశారు. రెండు కళ్లతో ఆనందాన్ని అనుభవిస్తూ, అమలనాదిపిరాన్‌ లో తిరుప్పాణాళ్వార్ పఠించినట్లుగా దివ్య కిరీటము నుండి మొదలుపెట్టి పాదాలవరకు సేవించి, ముదల్ తిరువందాది “పళుదే పల పగలుం పోయిన” (నేను సేవించకుండా ఎన్నో రోజులు వృధా చేసాను) లో పేర్కొన్నట్లుగా బాధపడుతూ, “పడుత్త పైన్నాగణై ప్పళ్ళికొండానుక్కు పల్లాండు కూఱుదుమే” (అధిశేషుని శయ్యపైన ​​శయనించి ఉన్న వాడు చిరకాలం వర్ధిల్లాలని) అని తిరుప్పల్లాండులో స్తుతించినట్లు కీర్తించి తరువాత అనంతరం, తొండరడిప్పొడి ఆళ్వార్ల తిరుమాలై పాశురముతో మొదలుపెట్టి “పాయు నీరరంగందన్నుళ్ పాంబణై ప్ప నీరరంగధన్నుల్ పాంబనైపళ్ళి కొండ మాయనార్ తిరునన్మార్వుం” (కావేరీ జలల మధ్య దివ్య వక్ష స్థలముతో తేజోమయుడై ఆదిశేషునిపై పవ్వళించి ఉన్న ఎంబెరుమానుడు), “అయసీర్ ముడియుం తేశుం అడియరోర్కు అగ్లలామే” (అటువంటి దివ్య కిరీటం మరియు వైభవమున్న ఎమ్పెరుమానుని, వారి భక్తులు విడిచిపెట్టడం సాధ్యమేనా?) తో ముగించెను. వీరు వ్యుహ సౌహార్ధాధి (భగవానుని సౌశీల్యము, కరుణ వంటి దివ్య గుణానుభవములు) ని అనుభవించి, తరువాత సెరపాండియన్ (నంపెరుమాళ్ళ ఆసనము) అను వారి దివ్య సింహాసనంపై ఆసీనులై ఉన్న నంపెరుమాళ్ళను సేవించుకొనెను.  శ్రీ రంగారాజ స్తవం పూర్వ శతకం 74 లో చెప్పబడిన విధంగా వారు నంపెరుమాళ్ళను సేవించెను.

అబ్జన్యస్థ పదాబ్జం అంజితగడీశం వాధికౌశేయకం
కించిత్ దాణ్డవగంధిసంహననకం నిర్వ్యాజమందస్మితం
చూడాశుంబిముఖాంబుజం నిజభుజావిశ్రాంతి దివ్యాయుధం
శ్రీరంగే శరతశ్శతం తదయితః పశ్యేమ లక్ష్మీసఖం

(దివ్యమైన పట్టు పీతాంబరాన్ని ధరించి, నాట్యం చేస్తున్నట్టుగా దివ్య రూపము, చిరుమందహాసము ఉన్న, కిరీటాన్ని కౌగిలించుకున్నట్లు ఉన్న వారి దివ్య ముఖారవిందము, దివ్య ఆయుధాలను ధరించిన శ్రీ మహాలక్ష్మికి ప్రియాతి ప్రియుడు, పద్మాసనములో తమ పాదములను స్థిరముగా ఉంచినట్లు తిరువరంగంలో ఉంచిన ఆతడిని మరో వంద సంవత్సరాలు సేవిద్దాం) తరువాత వారు ముముక్షుప్పడి ద్వయ ప్రకరణ సూత్రం 21 “తిరుక్కైయిలే పిడిత్త దివ్యాయుధంగళుం వైత్తంజలెన్ఱ  కైయిమ్ కవిత్త ముడియుం ముకముం ముఱువలుం ఆసనపద్మత్తిలే అళుందియ తిరువడిగళుమాయ్ నిఱ్కిఱ నిలైయే నమక్కు తంజం”  (నంపెరుమాళ్ళు తమ దివ్య హస్థములో దివ్య ఆయుధాలను ధరించిన రీతిని చూపిస్తూ దేనికీ భయపడకుము అని వ్యక్తపరచి, వారి దివ్య శ్రీముఖాన్ని అలంకరించిన కిరీటం, దివ్య శ్రీ ముఖం, చిరుమందహాసము, దివ్య కమలాసనముపై వారి దివ్య పాదాలను స్థిరంగా ఉంచిన  తీరు, ఆయన మాత్రమే మనకు ఆశ్రయం అని సూచిస్తున్నాయి) . ఒక నిరుపేదవాడు మహా నిధిని చూస్తున్నట్లుగా, వీరు నంపెరుమాళ్ళ దివ్య శ్రీముఖాన్ని దీర్ఘంగా ఆలకించెను, ఎర్రటి వారి దివ్య ముఖ భావము, కస్తూరి తిరునామం (నుదుటిపై ఉన్న దివ్య తిలకము) ని రెప్పార్చకుండా చూశారు. నంపెరుమ్మాళ్ళు కూడా అదే సమయంలో, చాలా కాలంగా వేరే ఊళ్లో ఉంటూ ఇంటికి తిరిగి వచ్చిన తమ కొడుకును తల్లిదండ్రులు చూస్తున్నట్లుగా, రామానుజులను అనుగ్రహించిన విధముగానే వీరిపై కూడా తమ దృష్టి కటాక్షము కురిపించెను.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/15/yathindhra-pravana-prabhavam-31/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 11

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/06/19/anthimopaya-nishtai-10/), మనము శ్రీరామానుజుల శిష్యుల దివ్య మహిమలను గమనించితిమి. ఇప్పుడు మరికొన్ని సంఘటనలను (ప్రధానముగా ఎంబార్ యొక్క నిష్ఠ గురించి) తెలుసుకొందాము.

ఎంపెరుమానార్ – ఎంబార్

ఎంబార్ (గోవిందర్) వట్టమణి కులంలో (ఒక ప్రత్యేక కుటుంబ పరంపర) జన్మించిరి. వారు మంచి జ్ఞానులు, గొప్ప వైరాగ్యపరులు, యుక్త వయస్సు నుండే అనుష్టానములు సక్రమముగా చేసినవారు. ఆ కాలములో వారు శివ భక్తులుగా వుంటూ, శైవ ఆగమములో ప్రవేశించి, రుద్రాక్ష మాల ధరించి కాళహస్తిని చేరిరి. అక్కడ వారు ప్రధాన అర్చకులుగా వుంటూ, శివుని ఆలయమును నిర్వహించుచుండిరి. వారి హస్తములో దండములు/పత్రములు (శివునికి ప్రియమైనవి) ధరించి, తమిళ భాషలో వారికున్న పటుత్వము వలన సదా శివ కీర్తనలను ఆలపించెడివారు. ఆ సమయములో తిరుమల నుంచి పెరియ తిరుమల నంబి (శ్రీశైలపూర్ణులు) ఒక ప్రత్యేక కార్యము (గోవిందర్ ను సంస్కరించుటకై) పై కాళహస్తిని చేరిరి. వారు వారి శిష్యులతో కలసి వృక్షముల చెంత (అడవి) కూర్చుని చర్చ ప్రారంభించిరి. అదే సమయంలో రుద్రునికి పుష్పములు కోయుటకై అచటికి ఎంబార్ వచ్చి, తిరుమలనంబి గారు కూర్చున్న ప్రక్కనే ఉన్న ఒక వృక్షమును ఎక్కనారంభించిరి. ఎంబార్ స్థితిని గమనించిన తిరుమల నంబి వారిపై బాధతో, “ఈ జీవాత్మ (ఎంబార్) ఒక మంచి విద్వాంసుడు, వైరాగ్యపరుడు. అల్పమైన వానిపై జీవాత్మకు ఉండకూడని భక్తిని వదిలించుకొని, జీవాత్మకు సముచిత గురువైన శ్రీమన్నారాయణునిపై భక్తి పట్ల మరలించిన, ఈ జగత్తునకు ఎంతో ప్రయోజనము చేకూరును” అని తలంచిరి. అప్పుడు వారు ఎంబార్ పుష్పములు కోయుచున్న వృక్షము వద్దకు వెళ్లి, శ్రీమన్నారాయణుడే సర్వేశ్వరుడు అని నిరూపించు వేదములలోని కొన్ని పద్యములను శిష్యులకు వివరించిరి. తిరుమల నంబిగారి దివ్య వివరణను ఆలకించిన ఎంబార్, తాను ఆలయములో చేయు సేవలను, పుష్పములను కోయుటను కూడ మరచి, అమిత పారవశ్యముతో అచ్చటనే చాలా సమయము గడిపిరి.

ఎంబార్ అనుకూల ప్రవర్తనను, ఆసక్తిని గమనించి, నంబి “నమ్మాళ్వార్ల దివ్య శ్రీ సూక్తుల నుండి ఒక పాశురమును వివరించుట ద్వారా వారి మనస్సును శుద్ధి చేయగలము” అని తలంచి, తిరువాయ్మొళి (2.2.4) పాశురమును విశ్లేషణాత్మకముగా వివరించుట ప్రారంభించిరి.

తేవుమ్ ఎప్పొరుళుమ్ ప్పడైక్క
పూవిల్ నాన్ముకనై ప్పడైత్త
తేవన్ ఎమ్బెరుమానుక్కల్లాల్
పూవుమ్ పుశనైయుమ్ తకుమే?

సాధారణ అనువాదము: వ్యష్ఠి సృష్టి అనగా అన్ని జీవులను మరియు ఇతర అంశాలను సృష్టించుటకై ఎంపెరుమాన్ బ్రహ్మను సృష్టించెను. (మొదటగా భగవానుడు తానే స్వయముగా సమిష్టి సృష్టి గావించెను – పంచభూతములను సృష్టించుట, పరోక్షముగా బ్రహ్మ ద్వారా వ్యష్ఠి సృష్టి గావించెను). కావున, ఎంపెరుమాన్ కాకుండా పుష్పములచే, పూజలచే ఆరాధనలను అందుకోగలిగిన యోగ్యులు వేరొకరెవరైనా ఉన్నారా? (ఇతరులెవరూ యోగ్యులు కాదు అని భావము).

అది విన్న ఎంబార్, తమిళములో మంచి ప్రతిభ కలిగి ఉండుటచే, ఒక్కసారిగా పుష్పముల బుట్టను జారవిడిచి, వృక్షముపై నుండి క్రిందకు దిగి, “లేదు! లేదు! ఇంతవరకు నేను, తమోగుణ పూరితుడైన ఈ దేవుని స్నానమునకై జలమును తెచ్చుట మొ || సేవలు ఒనరిస్తూ, నా జీవితమును వ్యర్ధము చేసుకొంటిని” అని పలుకుచూ తిరుమల నంబి పాద పద్మములపై బడిరి. నంబి, తమ లక్ష్యము నెరవేరినదని సంతసించి, ఎంబార్ కు స్నానమాచరించి, శుద్ధి పొందమని ఆదేశించిరి. ఎంబార్ తన రుద్రాక్షమాలను పారవేసి తమ పాషండ వేషమును తొలగించి, స్నానమొనరించి, తడి వస్త్రములతో నంబి వద్దకు, వారిని తమ ఆచార్యులుగా పొందు గొప్ప కోరికతో, చేరిరి. వారిని గాంచి మిక్కిలి సంతసించిన నంబి, వెను వెంటనే వారికి పంచ సంస్కారములు గావించి, త్యజించుట (ఏమి వదలి వేయవలెనో) మరియు ఉపాధ్యేయము (ఏమి అంగీకరించవలెనో) స్పష్టముగా వివరించి, “భగవానునితో సంబంధము తప్ప మిగిలిన ఇతర అన్ని విషయములను త్యజించమని, శ్రీమన్నారాయణుని వదలక ఆశ్రయింపుమని, మన కలయికపై విశ్వాసము వుంచమని” ఆదేశించిరి. ఎంబార్ కృతజ్ఞతతో అంగీకరించి, నంబితో కలిసి తిరుమలకు పయనమైరి.

అదే సమయమున, కాళహస్తిలోని అనేక పాషండులు అచటకు వచ్చి ఎంబారుతో “మీరు మా ప్రధానులు, కావున మీరు మమ్ములను వీడరాదు” అని ప్రార్థించిరి. కొంచెము దూరము నుంచే సమాధానమిచ్చుచు ఎంబార్ “మీ దండములు మరియు పత్రములు మీరే ఉంచుకొనుడు; ఇంక నేను ఈ స్మశానములో ఉండలేను” అనిరి. లంకపై ఎట్టి అనుబంధము లేకుండా వదిలి వేసిన సీతా పిరాట్టి వలె, పరమపదము చేరుటకై ముక్తాత్మలు అర్చిరాది మార్గము వైపు మనలోని అంతర్యామి సూచన వలన పయనమగునట్లు, తిరుమల నంబి మార్గ దర్శకత్వములో, భూలోక వైకుంఠముగా భావింపబడు తిరుమలకు, ఎంబార్ చేరి, తిరుమల నంబికి మిక్కిలి విశ్వాసపాత్రుడై, సదా సేవ చేయుచు అక్కడ నివసించసాగిరి.

ఉడయవర్ తిరుమలకు చేరి, తిరుమల నంబి వద్ద శ్రీ రామాయణములోని ప్రధాన సూత్రములను అభ్యసించి, శ్రీరంగమునకు తిరుగు ప్రయాణమునకు సన్నద్దులైరి. శ్రీ రామానుజులను ఒక ప్రత్యేక అవతారముగా భావించి, వారిని ఆళవందార్ రూపముగా దర్శించిన తిరుమల నంబి, తమ కుమారులకు ఉడయవర్లను ఆశ్రయించమని తెలిపి, వారితో “నేను మీకు ఇంకా విలువైనది ఇవ్వదలచితిని” అనిరి. ఎంబార్ కు తమ ఆచార్యునిపై గల నిష్ఠను గమనించిన ఉడయవర్లు, ఎంబార్ ను తమతో శ్రీరంగమునకు పంపి, ఆశీర్వదించమని నంబిని కోరిరి. వారి అభ్యర్ధనను నంబి సంతోషముగా అంగీకరించి ఉదక తర్పణము (శుద్ధ జలమును దానమునకు వినియోగించి వ్యవహారమును పూర్తి చేయుట) గావించి, ఎంబార్ ను వారికి ధారపోసిరి. ఉడయవర్లతో కలిసి ఎంబార్ పయనమైరి. 4 / 5 రోజుల ప్రయాణము తరువాత, వారు తమ ఆచార్యులైన నంబిని వీడినందువలన, విచారవదనముతో నుండిరి. ఉడయవర్ వారితో “మీరు ఏల విచారముతో నున్నారని” అడిగిరి, “మీ ఆచార్యుని ఎడబాటు వల్లనైతే, మీరు తిరిగి తిరువేంగడమునకు వెళ్లవచ్చును” అనిరి. తిరుమలకు ఎంబార్ సంతోషముగా తిరుగు ప్రయాణమై, 4 / 5 రోజుల పిదప, తిరుమల నంబి తిరుమాళిగను (గృహము) చేరి వారి పాద పద్మములపై బడిరి. నంబి ఎంబార్ తో “నేను ఉదక తర్పణము గావించి, మిమ్ములను ఉడయవర్లకు ధారపోసితిని కదా! మీరు మరల ఏల ఇచటకు వచ్చిరి?” అని అడిగిరి. ఎంబార్ సమాధానముగా నేను మీ ఎడబాటును భరించలేక తిరిగి వచ్చితిని అనిరి. నంబి వారితో “ఇతరులకు అమ్మివేసిన గోవునకు మేము దాణ ఇవ్వలేము. మీరు ఉడయవర్లకు పూర్తిగా కట్టుబడి ఉండి వారి సేవయే చేయవలెను” అనిరి. ఎంబార్ కు ప్రసాదమును కూడా ఇవ్వక వారిని బయటకు త్రోసి వేసిరి. ఈ చర్యతో తమ ఆచార్యుల ఉద్దేశ్యమును అర్ధము చేసుకొనిన ఎంబార్ తమకు ఉడయవర్ల పాదపద్మములే శరణ్యమని గ్రహించి, శ్రీరంగమునకు తిరుగు ప్రయాణమైరి. అప్పటి నుండి వారు అచటనే ఉండి, ఉడయవర్లకు సంతోషముగా సేవ చేయుచు ఉండిరి.

ఒకసారి, ఉడయవర్లు తమ శిష్యులతో ఉన్న ఒక గోష్ఠిలో, ఎంబార్ల జ్ఞానము, భక్తి, వైరాగ్యము, మొ|| వాటి గురించి ఉడయవర్ల శిష్యులు కీర్తింప సాగిరి. ఎంబార్ తమ శిరస్సును అంగీకారముగా ఊపి “ఔను ! అది యదార్ధము” అనిరి, తనను తానే ఇతరుల కన్నా ఉత్తమునిగా కీర్తించుకొనిరి. ఇది గమనించిన ఉడయవర్ “ఇతరులు నిన్ను కీర్తించిన, నీవు చాల అణుకువతో మెలిగి, నేను ఆ పొగడ్తలకు అనర్హుడనని పలుకవలెను. కాని నిన్ను నీవే కీర్తించుకొనుట, మర్యాదకరమేనా?” అని ప్రశ్నించిరి. ఎంబార్ సమాధానమిచ్చుచు “స్వామి! ఈ శ్రీవైష్ణవులు నన్ను కీర్తించినది – నేను కాళహస్తిలో నున్నప్పుడు అల్పమైన దండములు మరియు మట్టిపాత్ర, మెడలో రుద్రాక్షమాల మొ|| వానిని ధరించినందువలన. వానిని చూచి కీర్తించినచో, దానికి నేను అర్హుడనే. కాని మీరు, మీ గొప్పదనముచే, ‘పీతగవాడైప్పిరానార్ బిరమగురువాయ్ వంతు’ (భగవాన్ తానే ప్రధమ గురువుగా దర్శనమిచ్చినటుల) అని చెప్పిన విధముగా, నన్ను శుద్ధి చేసిరి. నేను అతి అల్పుడను – నిత్య సంసారి కన్నా అల్పుడను – కాని నన్ను మీరు సంస్కారించుటచే ఈ శ్రీవైష్ణవులు నన్ను కీర్తించుచున్నారు. కావున, ప్రతిసారి నన్ను నేను గాని, లేక ఇతరులు గాని కీర్తించినచో, అది యధార్ధముగా మీ గొప్పతనమును కీర్తించుటయే అగును” అనిరి. ఉడయవర్ “ప్రియ గోవింద పెరుమాళ్! అద్భుతము! అద్భుతము!” అని పలికి ఎంబార్ యొక్క స్వామి నిష్ఠను గాంచి మిక్కిలి సంతసించిరి.

ఒక ఆచార్యుడు తమ శిష్యునికి, ఏమి గ్రహించవలెనో మరియు ఏమి త్యజించవలెనో స్పష్టముగా వివరించుచుండిరి. ఆ సూత్రములను శిష్యుడు అర్ధము చేసుకొనలేదు. ఆచార్యులు వాని లోపములను అక్కడే సరిచేయుచున్నారు (కాలిత్యే శాసితారంలో సూచించిన విధముగా). ఒక విద్వాంసుణ్ణి శిష్యుడు కలవగా, ఆచార్యుని శిక్షణ పొందుటకు ఆ శిష్యుడు ఇంకను సిద్ధముగా లేడని భావించి, దిగులుగా, ఆచార్యుని ఆదేశములను పాటించగల శిష్యులకు మాత్రమే ఆచార్యుడు శిక్షణనిచ్చును, కాని “నీ ఆచార్యులు నీకేల శిక్షణనిచ్చిరి?” అని అడిగిరి. ఈ విషయమును నా ఆచార్యులు (మాముణులు) వివరించిరి. ఆ విధముగా, పూర్ణ శరణాగతి అయిన శిష్యునికి ఆదేశములు/ మార్గదర్శనము ఆచార్యులు చేయవలెను, నిజమైన ఆచార్యుని అట్టి ఆదేశములు/ మార్గదర్శనము శిష్యుని అంతిమ ధ్యేయములో ఒక భాగమని నిరూపింపబడినది. మరియొక ప్రాంతములో నివసిస్తున్న నంజీయర్ శిష్యులు ఒకరు వారి వద్దకు వచ్చి, కొంత కాలము వారిని సేవించుకొని, తదుపరి వారు తిరుగు ప్రయాణమునకు సిద్ధమైరి. వారు తిరిగి వెళ్ళుటకు గమనించిన నంజీయర్ల మరియొక శిష్యుడు వారితో, “ఓహ్! జీయర్ పాదపద్మములను విడనాడి, మీ నివాసమునకు తిరిగి పయనమగుట దురదృష్టకరము” అని బాధ పడిరి. దానికి శ్రీవైష్ణవుడు జవాబుగా “నేను ఎక్కడ వున్నను, నాకు నా ఆచార్యుని కృప ఉండును” అని తమను తాము ఓదార్చుకొనిరి. ఈ సంభాషణను వినిన మరియొక శ్రీవైష్ణవుడు (నంజీయర్లకు సన్నిహితుడు), తమ గృహమునకు తిరుగు ప్రయాణమైన ఆ శ్రీవైష్ణవుడు తమ ఆచార్యుని నుండి ఎడబాటునకు సహితము బాధను కనపరచ లేదని “ఏనత్తు ఉరువాయ్ ఉలగిడంద ఊళియాన్ పాదమ్ మరువాదార్కు ఉండామో వాన్?” (మొదల్ తిరువందాది 91 – ఈ భూమిని కాపాడిన వరాహ పెరుమాళ్ పాదపద్మములను పూజించని వాడు, పరమపదమును ఎలా పొందగలరు? – విషయమేమనగా – ఎంపెరుమాన్ పాదపద్మములను గురించియే ఈ విధముగా భావించిన, ఇంక ఆచార్యుని పాదపద్మములను ప్రతిరోజు అర్చించనిచో, దానిని గురించి ఏమని అనగలము). ఈ సంఘటనను నా ఆచార్యులు (మాముణులు) తెలిపిరి. దీని వలన, శిష్యుడు తమ సదాచార్యుని ఎడబాసినచో, అతను ఏమి గ్రహించవలెనో, ఏమి త్యజించవలెనో తెలుసుకొనజాలడు అని విదితమగుచున్నది. తదుపరి, ఆ అజ్ఞానము వానిని నష్టపరుచుటయే కాక, పరమపదము పొందవలెనను అంతిమ లక్ష్యము కూడ నెరవేరనీయదు.

కొంగునాడు (కోయంబత్తూర్ ప్రాంతము) కరువుతో ప్రభావితమైన సమయములో, ఒక బ్రాహ్మణుడు, అతని పత్ని, శ్రీరంగములో నివసించుటకై పయనమైరి. ఆ రోజుల్లో ఎంపెరుమానార్ మధుకరము (ఆహారమునకై బిక్షాటన) చేయుటకై 7 గృహములకు వెళ్లెడివారు. అగళంగనాట్టాళ్వాన్ ప్రాకారమ్ (కోవెల చుట్టూ ఉన్న 7 ప్రాకారములలో ఒకటి) వీధిలో వున్నప్పుడు శ్రీవైష్ణవులు, ఎంపెరుమానార్ల పాదపద్మములకు ప్రణమిల్లెడివారు. ఆ దగ్గరలోనే ఉన్న ఒక మేడపై నున్న ఇంట్లో నివసిస్తున్న ఆ బ్రాహ్మణుడు, అతని పత్ని ఇది గమనించిరి. ఒకరోజు, ఎంపెరుమానార్ వారి నివాసము దగ్గరకు వచ్చినప్పుడు, ఆమె మేడపై నుంచి క్రిందకు వచ్చి ఎంపెరుమానార్లతో “రాజులందరు మీ పాదపద్మములకు ప్రణమిల్లుచుండగా, మీరు మాత్రము ఆహారమునకై బిక్షాటన చేయు చున్నారు. కారణమేమి?” అని అడిగిరి. ఎంపెరుమానార్ సమాధానముగా “నేను వారికి చేయు మంచి ఆదేశముల వలన వారు నన్ను ఆరాధించుచున్నారు” అనిరి. ఆమె కూడ వారి పాదపద్మములకు ప్రణమిల్లి “నాకు కూడ దయతో మంచి ఆదేశములను ప్రసాదించగలరు” అని ప్రాధేయపడెను. వారు తమ దివ్య అనుగ్రహముచే ఆమెకు ద్వయ మంత్రమును ఉపదేశించిరి. తదుపరి కొంత కాలము పిదప, వారి ప్రాంతములో సాధారణ స్థితి నెలకొనెను. వారు శ్రీరంగమును వీడుటకు సిద్ధమైరి. తాము తిరిగి వెళ్ళు సమయమునకు ఎంపెరుమానార్లతో కలయిక జరుగదేమోనని ఆమె చింతించెను. ఆ సమయమునకే మధుకరమునకై ఎంపెరుమానార్ అచ్చటకు వెళ్ళిరి. వారిని గాంచి ఆమె “మేము మా స్వగ్రామమునకు తిరుగు ప్రయాణమగుచుంటిమి; మీరు దయతో మరియొక సారి దివ్య మంత్రమును ఉపదేశింపుమని, తద్వారా అది నా అంతరంగములో నిక్షిప్తమగునని” అని ప్రాధేయపడెను. ఎంపెరుమానార్ తమ అపార కరుణచే, మరల ఆమెకు దివ్య ఆదేశములను అనుగ్రహించిరి. ఆమె ఇంకను “నన్ను సదా కాపాడుటకై మరియొక ఆదేశమును ఇచ్చి అనుగ్రహించమని” వేడుకొనెను. వెంటనే ఉడయవర్ తమ పాదుకలను ఆమెకు ప్రసాదించి, ఆమెను పెరియ పిరాట్టి అని సంబోధించిరి. అప్పటి నుండి ఆమె ఆ పాదుకలను తన తిరువారాధనలో నుంచి, ప్రేమగా అర్చించసాగెను. ఈ సంఘటన వార్తామలై ద్వారా ప్రసిద్ధిచెందెను. దీని ద్వారా, ఈ సంసారములో ఎంపెరుమానుని కూడ విస్మరించి – ఆచార్యునిపై సంపూర్ణ భక్తిని పెంపొందించుకొని, ఆచార్య సంబంధమైన దానిని గ్రహించి (ఇచట పాదుకల వలె) పరిపూర్ణ శరణాగతి చేయవలెనని అవగతమగుచున్నది. ఆచార్యునిపై పూర్తి విశ్వాసము కలవారు, కొంగు దేశములోని పెరియ పిరాట్టి వంటివారు. ఆచార్య నిష్టాపరులైన పొన్ నాచ్చియార్ (పిళ్ళై వురంగ విల్లి దాసర్ పత్ని), తుంబి యార్కు కొండి, ఏకలవ్యుడు, విక్రమాదిత్యుడు మొ || వారి జీవితములను మనము గుర్తు పెట్టుకొనవలెను.

అనువాదకుని గమనిక: ఈ విధముగా మనము ఎంబార్ నిష్ఠను, ఉడయవర్ల ఇతర శిష్యుల నిష్ఠను గమనించాము. వారు శ్రీ రామానుజునిపై ఎటుల సంపూర్ణముగా ఆధారపడిరో వ్యక్తమైనది.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-11.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org