యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 36

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 35

నాయనార్ పెరుమాళ్ కోయిల్ ని దర్శించుట

నాయనార్లు తిరుమల నుండి బయలుదేరి, దారిలో పలు చోట్ల రెండు రోజులు ఆగి, “ఉలగేత్తుమ్ ఆళియాన్ అత్తియూరాన్” (దివ్య శంఖ చక్రాలను ధరించి కాంచీపురంలో కొలువై ఉన్నవాడు) అని పాశురంలో చెప్పినట్లు వారిని సేవించుటకై కాంచీపురం చేరుకున్నారు.

శ్లోకము….

దూరస్థితేపి మయిదృష్టి పదంప్రపన్నేదుఃఖం విహాయ పరమం సుఖమేష్యతీతి
మత్వేవయత్గగనకంపినతార్థిహంతుః తర్ గోపురం భగవతశ్శరణం ప్రపద్యే

(ఆకాశాన్ని అంటుకునేటంత ఎత్తైన గోపురము క్రింద కొలువై ఉన్న ప్రణతార్తిహరుడు పేరరుళాళన్ (కంచి దేవ పెరుమాళ్) ను నేను ఆశ్రయించుచున్నాను. ఆతడు అల్లంత దూరంలో ఉన్నప్పటికీ, ఆతడి చల్లని చూపు రూపముగా వారి కటాక్షం పడితే, ఆ వ్యక్తి దుఃఖాలు తొలగి సకల సౌఖ్యాలను పొందుతాడు), నాయనార్లు తిరుగోపుర నాయనార్ (దివ్య ఆలయ గోపురం) ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు. ఆలయంలోకి ప్రవేశించి, పుణ్యకోటి విమానాన్ని సేవించి, కోవెలలోని దివ్య అనంత పుష్కరిణిలో స్నానమాచరించి ద్వాదశ ఊర్ధ్వ పుండ్రములను ధరించిన తరువాత, సంప్రదాయ రీతిలో ఆళ్వార్లను సేవించి, బలిపీఠం ఎదుట సాష్టాంగము చేసి, ప్రధాన ఆలయంలోకి ప్రవేశించి, శేర్ందవల్లి నాచ్చియార్, శ్రీ రాముడు (చక్రవర్తి తిరుమగన్) ఆపైన తిరువనంత ఆళ్వాన్ (ఆదిశేషుడు) లను సేవించారు. తరువాత వారు ప్రదక్షిణగా వెళ్లి, ఆళవందార్లు కృపతో ఇళైయాళ్వార్ (భగవద్ రామానుజులు) లను అనుగ్రహించిన దివ్య ప్రాంగణాన్ని సేవించి, వారు నివాసమున్న కరియమాణిక్క సన్నిధి, అలాగే తిరుమడప్పళ్ళి నాచ్చియార్ (ఆలయ వంటశాలలోని శ్రీమహాలక్ష్మి) ని సేవించుకున్నారు. తరువాత వారు పేరరుళాళర్ల దివ్య పత్ని అయిన పెరుందేవి తాయర్ (శ్రీ మహాలక్ష్మి) ను దర్శించుకున్నారు. తాయార్ ను ఇలా కీర్తిస్తారు….

ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసినీం
అశేష జగధీశిత్రీం వందే వరద వల్లభాం

(నిత్య పద్మ నివాసిని, సర్వ లోక నియామకుడు అయిన దేవ పెరుమాళ్ళ దివ్య పత్ని, అనన్య శేషత్వం (ఎమ్పెరుమానునికి తప్ప మరెవరికీ సేవ చేయకుండుట), అనన్య శరణత్వం (ఎమ్పెరుమానుని తప్ప మరెవరినీ ఆశ్రయించకుండుట) మరియు అనన్య భోగ్యత్వం (ఎమ్పెరుమాన్ తప్ప మరెవ్వరికీ భోగ్య వస్తువుగా ఉండకుండుట) కలిగి ఉన్న పెరుందేవి తాయర్ దివ్య పాదాలకు నేను నమస్కరిస్తున్నాను). ఆ దివ్య దేశ నిత్య నివాసులందరి పురుషకారముతో పెరుందేవి తాయర్ యొక్క కృపతో వీరు పెరియ తిరువడి (గరుడ), నరసింహ పెరుమాళ్, శూడిక్కొడుత్త నాచ్చియార్ (ఆండాళ్) మరియు సేనై మొదలియార్ (విష్వక్సేనులు) లను సేవించుకున్నారు. ప్రదక్షిణగా శ్రీ హస్తి గిరి వద్దకు వెళ్లి, “ఏషతం కరిగిరిం సమాశ్రయే” (నేను హస్తిగిరి పర్వతాన్ని ఆశ్రయించుచున్నాను) అని చెప్పినట్లుగా, వారు మెట్ల దగ్గర సాష్టాంగ నమస్కారము చేసి, మలయాళ నాచ్చియార్‌ ను దర్శించుకొని, మెట్లు ఎక్కారు. కంచి వరదుడు తిరుక్కచ్చి నంబి సమక్షంలో రామానుజులను తిరురంగ పెరుమాళ్ అరైయర్ కు ప్రసాదించిన కచ్చిక్కు వాయ్ త్తాన్ అను దివ్య మందిరంలోకి ప్రవేశించి, “ఇదే కదా ఆ దివ్య స్థలం!” అని వాపోయెను. ఇలా వర్ణింపబడింది….

సింధురాజశిరోరత్నం ఇందిరావాస వక్షసం
వందే వరదం వేదిమేధినీ గృహమేధినం

(దివ్య హస్తి గిరి పర్వతానికి తలమానికం, దివ్య ఆభరణం వంటి వాడు, అలర్మేల్ మంగ నిత్య నివాసము చేసే దివ్య వక్షస్థలం కలిగి ఉన్నవాడు, యాగ భూమికి అధిపతి (బ్రహ్మ యాగము చేసిన చోటు) అయిన వరదరాజుని దివ్య చరణాలను ఆశ్రయించు చున్నాను), ఈ శ్లోకములో చెప్పినట్లు పుణ్యకోటి విమానం మధ్యలో ఉన్న పేరారుళాళర్ ను సేవించారు.

రామానుజాంగ్రి శరణేస్మి కులప్రదీపః ద్వాసీత్స యామునమునేః స చ నాథవంశ్యః
వంశ్యః పరాంగుశమునేః స చ సో’పి దేవ్యః దాసస్త్వవేది వరదాస్మి తవేక్షణీయః

(ఓ పేరారుళాళ! ఆళవందార్ల జ్ఞాన వంశానికి అలంకార దీపము వంటి ఎమ్పెరుమానార్ల ఆశ్రయం పొందిన వాడను నేను; ఆ ఆళవందార్ నాథముని వంశానికి చెందినవారు; ఆ నాథముని నమ్మాళ్వార్ల  జ్ఞాన గోష్టికి చెందినవారు; ఆ ఆళ్వారు పిరాట్టికి దాసులు; అందుకని ఈ పరంపర ద్వారా, అడియేన్ దేవరువారి దివ్య కృపకు అర్హుడను). వరదరాజునికి సాష్టాంగము చేసి, తిరుప్పల్లాండు, వరదరాజ అష్టకం, స్తోత్రలు, గద్యాలు సేవించి తమ మంగళాశాసనాలు సమర్పించుకున్నారు. దేవ పెరుమాళ్ళు కూడా “నమ్మిరామానుశనై ప్పోలే ఇరుప్పార్ ఒరువరై ప్పెఱువదే” (రామానుజుల వంటి వారిని పొందడం ఎంత భాగ్యము!) అని తమ కరుణను వారిపై కురిపించి, తీర్థ శఠారిని వారికి అందించారు. పెరుమాళ్ళ అనుమతితో నాయనార్లు సెలవు తీసుకొని కంచి పట్టణములోని తిరువెక్క మొదలైన ఇతర దివ్య దేశాలను సేవించుకునేందుకు బయలుదేరారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/20/yathindhra-pravana-prabhavam-36/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s