Monthly Archives: September 2022

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 47

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 46

కందాడై అణ్ణన్ ను ఆశ్రయించిన ఆండపెరుమాళ్

ఒకరోజు జీయర్ శుద్ధసత్వం అణ్ణాను పిలిచి “దేవరి వారు భాగ్యవంతులు, నమ్మాళ్వార్ల పట్ల మధురకవి ఆళ్వార్ ఉన్నట్లే, అణ్ణన్ పట్ల దేవరి వారు కూడా అంతటి ఇష్టపడే వ్యక్తి అయినారు. ఆచార్యుడు ఈ లోకంలో ఉన్నంత వరకే సేవ చేయగలము. అణ్ణన్ అవసరాలను తీర్చుచూ జీవించండి” అని ఆశీర్వదించారు. తరువాత వారు కుమాండూర్ ఆచ్చాన్ పిళ్ళై మనవడు, శాస్త్ర నిపుణుడు, ఎంతో జ్ఞానవంతుడు అయిన ఆండపెరుమాళ్ ను పిలిచి ఇలా అన్నారు: “వీరిని మీ తిరువడి విశ్వాసపాత్రుడిగా ఉంచుకొని, దర్శన ప్రవర్తకారునిగా (రామానుజ తత్వసిద్దాంత ప్రచారము చేయువారు) మలచండి అని చెప్పి ఆండపెరుమాళ్ ని అణ్ణన్ సంరక్షణలో ఉంచారు.

జీయర్ నాయనార్ల దివ్య అవతారము

ఆ విధంగా, తమ దివ్య తిరువడిని ఆశ్రయించిన వారందరినీ ఉద్ధరించే గొప్పతనము ఉన్న జీయర్, దర్శనమును పరిశీలించుచూ నియంత్రిస్తున్నారు. వారి పూర్వాశ్రమ కుమారుడు నమ్మైయన్ ఇరామానుసన్‌ ఆళ్వార్ తిరునగరిలో సంప్రదాయ రీతిలో పెరుగుతున్నాడు. కొంతకాలం గడిచిన తరువాత అతనికి వివాహం అయ్యింది. మరికొంత కాలం తర్వాత, అతనికి ఒక కుమారుడు జన్మించాడు. జీయర్ అతనికి “అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్” అని దివ్య నామకరణము చేశారు. తరువాత నమ్మైయన్ ఇరామానుసన్‌ శ్రీవిల్లిపుత్తూరుకు వెళ్లి అక్కడ వాసము చేశారు. అక్కడ అతనికి మరో కుమారుడు జన్మించాడు. తగిన దివ్యనామం కోరుతూ వారు జీయరుకి కబురు పంపారు. జీయర్ “శిశువు శ్రీవిల్లిపుత్తూర్‌లో పుట్టాడు, ఇక తగిన పేరు పంపే అవసరం లేదు! శిశువుకి పెరియాళ్వార్ల పేరు పెట్టండి” అని తెలుపగా, ఆ బిడ్డకు పెరియాళ్వారైయన్ అను పేరును పెట్టారు. ఆ ఇద్దరు శిశువులు పెరిగి పెద్దయ్యారు, గురువుల సంరక్షణలో విడిచిపెట్టే వయస్సుకి వచ్చారు. వారిరువురు జీయర్ దివ్య తిరువడి యందు ఆశ్రయం పొందారు, ఈ ఇద్దరిలో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ నిత్యం జీయర్ సేవలో ఉండేవారు. ఒక్క క్షణం కూడా వారి దివ్య చరణాలను విడిచిపెట్టేవారు కాదు. జీయర్ ఆశ్రయం పొందిన వారు తమ కుమారులకు నాయనార్ (సన్యాసాశ్రమ స్వీకరణకు ముందు జీయర్ పేరు ‘నాయనార్’) అని పేరు పెట్టుకున్నారు. అందుకని, జీయర్ మొదటి మనవడిని జీయర్ నాయనార్ గా గుర్తించి ఆ పేరుతోనే పిలెచేవారు అందరూ. నాథముని ఆళవందార్లను దర్శన ప్రవర్తకులుగా భావించినట్లే, జీయర్ నాయనార్ ను దర్శన ప్రవర్తకునిగా భావించిన జీయర్, ఎంతో కృపతో అతనిని అనుగ్రహించి ఆశీర్వదించారు. జీయర్ మనుమడు అయినందున అతను దివ్య తేజస్సుతో దీప ప్రకాశము వలె ఉండేవారు. జీయర్ తిరువడి అనుచరులు అతని గురించి ఇల వర్ణించేవారు…

అస్మాసు వత్సలతయా కృపయాస భూయః
స్వచ్చావతీర్ణమివ సౌమ్యవరం మునీంద్రం
ఆచార్యపౌత్రం అభిరామవర అభిదానం
అస్మద్గురుం గుణనిధిం సతతం ఆశ్రయామః

అభిరామవరర్ (అళగియ మణవాళర్) కు మనపైన ఉన్న దివ్య కృప, వాత్సల్యము, కోరిక కారణంగా వారు పునరవతారము (మణవాళ మాముణుల పునరవతారము) పొంది, మన మధ్యలోకి వచ్చిన  వారి యొక్క దివ్య చరణాలకు నిత్యం నా నమస్కారాలు. వారు శుభ గుణాలకు నిధి, పైగా ఆచార్యుని దివ్య మనుమలు [జీయర్జి]) కూడా అని, నిత్యము ధ్యానం చేస్తూ ఉంటాను.

జీయర్ ఆళ్వార్తిరునగరికి బయలుదేరుట

నమ్మాళ్వార్ల అభిమానులకు స్వామిగా గౌరవింపబడే జీయర్, “భగవాన్ భగవద్ ఉత్పవస్థలీ భవతు శ్రీనగరీ గరీయసి” (ఓ! సర్వోన్నత సర్వగుణ సంపన్న, దేవారి వారి దివ్య అవతార స్థలమైన ఆళ్వార్ తిరునగరి అత్యంత ఉన్నతమైన ప్రదేశంగా ప్రకాశించాలి) అని కీర్తించబడే ఆళ్వార్తిరునగరి, తమ జన్మస్థలానికి వెళ్లి ఆళ్వారి దివ్య తిరువడిని సేవించాలని తమ దివ్య మనస్సులో సంకల్పించారు. కణ్ణినుణ్ శిఱుత్తాంబు పాశురములో చెప్పినట్లు – “కురుగూర్ నంబి! ముయల్గిన్ఱేన్ ఉందన్ మొయ్ కళఱ్కు అన్బైయే” (ఓ తిరుక్కురుగూర్ స్వామీ! మీ గొప్ప తిరువడి యందు భక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను), అని తమ హృదయంలో ఆనందంతో నంపెరుమాళ్ళ సన్నిధికి వెళ్లి, ఆళ్వార్తిరునగరికి వెళ్ళుటకు అనుమతి కోరారు. శ్రీరంగంలో శయనించి ఉన్న సహచరుడు తన ప్రయాణంలో తోడుగా వచ్చాడు. తిరువాయ్మొళి ప్పిళ్ళై జన్మించిన కుంతీనగరానికి వారు చేరుకొని మూడు రాత్రులు అక్కడే ఉన్నారు. వారు తిరువాయ్మొళి ప్పిళ్ళైని స్తుతిస్తూ ఈ క్రింది పాశురాన్ని పాడారు.

చిత్తం తిరుమాల్ మేల్ వైత్తరుళుం సీర్ మన్నర్
నత్తం ఇదు కాణుం నాం తొళిల్ – ముత్తరాయ్
పోనారేయాగిలుం పూంగమలత్తాళ్గళ్ తనై
తామార వైత్తార్ తలం

(మహాలక్ష్మికి పతి అయిన శ్రియః పతిపై తమ దివ్య మనసును దయతో ఉంచిన గొప్ప రాజు [తిరువాయ్మొళి ప్పిళ్ళై] జన్మించిన ప్రదేశం ఇది. వారు ముక్తాత్మ అయినప్పటికీ, కమలము వంటి వారి దివ్య పాదాలు ఇక్కడ మోపి నడైయాడిన ప్రదేశం ఇది). ఆ స్థలాన్ని సేవించి ముందుకు సాగారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/01/yathindhra-pravana-prabhavam-47/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 46

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 45

మాముణుల ఆశ్రయం పొందిన అణ్ణన్

ఈ క్రింది శ్లోకములో చెప్పినట్లుగా…

రామానుజపదాంభోజ సౌగంధ్య నిదయోపియే
అసాధారణ మౌన్నత్యమవధూయ నిజంధియా
ఉత్తేజయంతః స్వాత్మానం తత్తేజస్సంపదా సదా
స్వేషామతిశయం మత్వా తత్వేన శరణం యయుః

(ఎమ్పెరుమానార్ల (రామానుజుల) దివ్య పాదాల మధుర పరిమళాన్ని నిధిగా పొందిన వారు, దివ్య తేజస్సు గల మాముణులను ఆశ్రయించి మరింత గొప్పతనాన్ని పొందాలని భావించి, తమ స్వంత గొప్పతనాన్ని వదిలి ఆ మాముణులకు సంపూర్ణ శరణాగతి చేశారు), కందాడై అన్నన్ తో సహా ఆచార్యులందరూ, రామానుజుల అనుగ్రహం పొందిన వారే పైగా వారి జన్మం, జ్ఞానం, అనుష్ఠాన పరంగా ఎన్నో గౌరవాలు అందుకున్నవారు. వారందరూ తమ గొప్పతనాన్ని పక్కన పెట్టి, జీయర్ దివ్య తిరువడి మాత్రమే వారికి గొప్పతనాన్ని చేకూర్చునని తమ మనస్సులలో దృఢంగా స్థిరపరచుకొని వారి దివ్య తిరువడి యందు ఆశ్రయం పొందాలని జీయరు వద్దకి చేరుకున్నారు. జీయర్ దగ్గరకు అణ్ణన్ వెళ్లి ఇలా అన్నారు: “భక్తులపై మీ కృపను కురిపించే శుభ దినము ఆసన్నమైనది. ఇంతకు మునుపు ఎంబా చేత ఆపబడిన కొందరు, ఎమ్పెరుమాన్ వారి స్వప్నంలో చెప్పిన కారణంగా తమ మార్గాన్ని సరిదిద్దుకొని ఈ గోష్టిలో చేరారు. దేవర్వారు అందరిపై తమ కృపను కురిపించాలి.”జీయర్, వానమామలై జీయర్‌ని పిలిపించి, సమాశ్రయణం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. జీయర్ [మణవాళ మాముణులు] తిరువారాధన నిర్వహించి ఆహారం మరియు పండ్లు నివేదన గావించారు. వారు సమాశ్రయణం చేయవలసిన వారందరినీ పిలిచి, పరంపరా రీత్య చేయవలసివన్నీ పద్దతిగా నిర్వహించారు. అనగా “తాపః పుండ్రస్థతానామ మంత్రోయాగశ్చ పంచమః”[(భుజాలపైన దివ్య ముద్రలు, పన్నెండు ఊర్ధ్వపుండ్రాలు (భగవంతుని రక్షక చిహ్నాలు), దాస్యనానము ప్రసాదించుట, మంత్రోపదేశం (భగవానుని దివ్య మంత్రం (స్తోత్రం) పఠించడం), దేవపూజ (భగవానునికి రోజువారీ ఆరాధన చేసే విధానం) నిర్వహించడం]. వారు పరమానందంతో అణ్ణన్ ను చూస్తూ ఉండిపోయారు.

వానమామలై జీయర్ ఆశ్రయం పొందిన అప్పాచ్చియారణ్ణా

వానమామలై జీయర్‌ ను జీయర్ చూపిస్తూ “వీరు మా హృదయానికి అతి దగ్గరైనవారు, మాకు అతి ప్రియమైనవారు. మాకు జరిగిన మరియాద వీరికి కూడా జరగాలి” అని అన్నారు. అణ్ణన్ జీయర్ దివ్య మనస్సును తెలుసుకుని “అడియేన్ వారిని ఆశ్రయించి ఉండేవాడను కదా” అని అనగా, దానికి జీయర్ “మా సంపదను ఎలా వదులుకుంటాము?” అన్నారు. అణ్ణన్ తమ బంధువుల వైపు చూసి జీయర్ మనోభవనను వ్యక్తం చేసారు. ఆచ్చి కుమారుడైన అణ్ణా లేచి వారి ముందు సాష్టాంగము చేసారు; జీయర్ అతని కోరిక ఏమిటో అడిగారు; “మా స్వామి వానమామలై జీయర్ దివ్య తిరువడి పొందాలని ఉంది, దేవర్వారు అనుమతించాలి” అని ప్రార్థించారు. ఇది విన్న జీయర్ సంతోషించి, “నీవు మా అప్పాచ్చియారణ్ణన్!” (ఆచ్చి కుమారుడు). ఆ తర్వాత వారు అప్పాచ్చియారణ్ణన్ ని తమ చేతితో పట్టుకుని, తమ పక్కన నిలబెట్టి, తమ ఆసనము నుండి లేచి, వానమామలై జీయర్‌ ను తమ ఆసనముపై ఆసీనులు కామన్నారు. ఆ తర్వాత అప్పాచ్చియారణ్ణన్ ను వానమామలై జీయర్ కి అప్పగించి, అతనికి సమాశ్రయణం చేయమన్నారు. వానమామలై జీయర్ సంకోచిస్తుండగా జీయర్ అతనితో “సంకోచించకు; మాకు ఏది ప్రీతికారమో దానిని ఆచరించు” అని చెప్పి అప్పాచ్చియారణ్ణన్ ను ఆలింగనము చేసికొని వానమామలై జీయర్ దివ్య తిరువడిని ఆశ్రయించేలా చేసారు. వెంటనే, అప్పాచ్చియారణ్ణన్ తమ్ముడు, దాశరథి అప్పై కూడా వానమామలై జీయర్ దివ్య చరణాలను ఆశ్రయించారు. వానమామలై జీయర్ ఆ ఆసనములో నుండి లేచి “దయచేసి చాలు” అంటూ కొంతదూరం వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసారు. అప్పుడు మాముణులు, కందాడై అణ్ణన్ సోదరుడు, కందాడై అప్పన్, ఇతర సోదరులతో పాటు వారి బంధువులు, వారి సహధర్మచారులకు, పిల్లలకు మొత్తం 120 మందికి సమాశ్రయణం పూర్తి చేసారు. శింగరైయర్ తదితరులు కూడా మాముణుల ఆధ్వర్యంలో సమాశ్రయణం సంపన్నం చేసుకొన్నారు. ఆలయం నుండి పెరుమాళ్ల ప్రసాదంతో ఆలయ ఉద్యోగులంతా అక్కడికి వచ్చారు. జీయర్ బయటకు వెళ్లి, ఆలయ మర్యాదలను గౌరవప్రదంగా స్వీకరించి వారిని లోనికి పిలిచారు. కందాడై అణ్ణన్ వారిని ఎంతో ఆదరంతో వారికి తగిన విధంగా బహుమతులు అందజేశారు. తదనంతరం, ఆ రోజు తిరువడి సంబంధం పొందిన వారందరూ ఆలయానికి వెళ్లి, ఎమ్పెరుమానార్, ఆళ్వార్, నాచ్చియార్, పెరుమాళ్ళను వారి వారి సన్నిధులలో సేవించి జీయార్ మఠానికి తిరిగి చేరుకొని తదీయారాధనంలో పాల్గొన్నారు. దేవరాజ ప్పెరుమాళ్ పలికిన “జగత్రక్షాపరో నంద” (ఈ లోక రక్షణలో పూర్తిగా నిమగ్నమై ఉన్న అనంతాళ్వాన్ అవతరిస్తాడు…) అన్న తోళప్పర్ స్వప్నాన్ని గుర్తు చేసుకుని ఆనందించారు. మాముణుల ఆశ్రయం పొందిన వారందరూ, అతని మానవాతీత, అద్భుత కథనాలను స్మరిస్తూ ఈ శ్లోకాన్ని పఠించారు.

చిరవిరహతః చింతా సంతానజర్జజర చేతసం
      భుజగశయనం దేవంభూయః ప్రసాదయితుం ధృవం
యతికులపతిః శ్రీమాన్ రామానుజ స్వయమిత్య భూ
    తిదిథి సమదుశన్ సర్వే సర్వత్ర తత్ర సుతీజనాః 

(యతులకు రాజైన శ్రీ రామానుజులు ఈ లోకాన్ని విడిచి పెట్టిన తర్వాత శ్రీ రంగనాథ పెరుమాళ్ళు శ్రీరామానుజుల గురించి నిరంతరం ఆలోచిస్తూ తల్లడిల్లుతున్నందున, పెరుమాళ్ల సంతోషము కోసం వారు మణవాళ మాముణులుగా పునరవతారము చేసారని అక్కడి పండితులు సంతోషించారు.) వారు మాముణులను రామానుజుల పునరవతారముగా భావించి, వారి దివ్య చరణాలపై పడి, వారి పట్ల గౌరవంగా వ్యవహరించేవారు. జీయర్ తమ శిష్యులతో ఇలా దయతో జీవిస్తున్నప్పుడు, వారు శ్రీ కోశమును (ఎమ్పెరుమానార్ దర్శనం గురించి వ్రాసిన వ్రాతప్రతులు) పరీక్షించి వాటిని సురక్షిత స్థానములో ఉంచమని తిరువాళియాళ్వార్ పిళ్ళైని ఆదేశించారు; చిరిగి శిథిలమైన పత్రాలను తిరిగి సరిగ్గా వ్రాసి, అనుకరణ చేయడానికి రచయితలను నియమించారు. ఈడు (తిరువాయ్మొళికి ముప్పత్తారాయిర ప్పడి వ్యాఖ్యానం) వివరించడానికి వీలుగా అవసరమైనప్పుడల్లా శ్రీకోశము నుండి అందుకునేవారు.

మూలము:  https://srivaishnavagranthams.wordpress.com/2021/08/30/yathindhra-pravana-prabhavam-46/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 17

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/08/25/anthimopaya-nishtai-16/), మనము జన్మతో సంబంధము లేకుండా, శ్రీవైష్ణవుల కీర్తిని గమనించాము. తదుపరి, ఈ భాగములో, మనము భగవానునిచే, ఆళ్వార్లచే, ఆచార్యులచే శ్రీవైష్ణవులు కీర్తింపబడుటను మరియు దీనినే నిరూపించు మన పూర్వాచార్యుల జీవితములలోని కొన్ని సంఘటనలను గమనించెదము.

శ్రీవైష్ణవుల కీర్తిని అనేక సందర్భములలో స్వయముగా భగవానుడే కీర్తించిరి.

లోకే కేచన మద్భక్తాస్ సద్ధర్మామృతవర్షిణః
సమయంత్యగమత్యుగ్రం మేఘా ఇవ తవానలమ్

సాధారణ అనువాదము : వర్షపు మేఘములు ఏ విధముగా అగ్ని వేడిని అణచి వేయునో, అదే విధముగా రాబోయే ప్రమాదములను నా భక్తులు కొందరు దూరము చేయుదురు.

తన బాల్య మిత్రుడైన సుధాముని కృష్ణుడు కలిసెను

జ్ఞాని త్వాత్మైవ మే మతం

సాధారణ అనువాదము : నా పరిపూర్ణ భక్తుడైన జ్ఞాని నా ఆత్మ – ఇది నా అభిప్రాయము

ప్రియోహి జ్ఞానినోత్యర్ధం అహం స చ మమ

సాధారణ అనువాదము : నా భక్తుడైన జ్ఞానికి నా పై మిక్కిలి అనుబంధము – నాకు కూడ అతనిపై అంతే (యధార్ధమునకు ఇంకను అధికము) అనుబంధము కలదు.

మహాభారత యుద్ధములో అర్జునుని రధసారధిగా కృష్ణుడు

మమ ప్రాణా హి పాండవాః

సాధారణ అనువాదము : పాండవులు నా ప్రాణవాయువు వంటి వారు.

నిరపేక్షం మునిం శాంతం నిర్వైరం సమదర్శనం
అనువ్రజామ్యహం నిత్యం పూయేయేత్యన్గ్రిరేణుపిః

సాధారణ అనువాదము : యతులను నేను సదా అనుసరించి, వారి పాదపద్మముల ధూళిని స్వీకరించెదను, వారు స్వార్ధ ప్రయోజనములకు అతీతులుగా, శాంతియుతులుగా, విరోధ రహితులుగా, అందరి ఆత్మలయందు సమదృష్టి కలవారుగా వుందురు.

మాముణులను తమ ఆచార్యునిగా స్వీకరించిన శ్రీరంగనాధుడు – పెరియ జీయర్ పై తమ అత్యంత అనుబంధము / ఆదరణను వెల్లడించిరి

మమ మద్భక్తేషు ప్రీతిరభ్యధికా నృప
తస్మాన్ మత్ భక్తభక్తాశ్చ పూజనీయా విశేషతః

సాధారణ అనువాదము : నా భక్తులపై నా ప్రేమ అత్యంత గొప్పది, నా భక్తులు పూజింపబడి నప్పుడు అది ఇంకను ప్రత్యేకమైనది, నాకు ప్రియమైనది

కృష్ణుడు మరియు నమ్మాళ్వార్ – వీరిరువురి దివ్య ప్రేమానుబంధమును బహిర్గతము చేయుట

అన్నాధ్యమ్ పురతో న్యస్తమ్ దర్శనాత్ గృహ్యతే మయా
రసాన్ దాసస్య జిహ్వాయామస్నామి కమలోద్భవ

సాధారణ అనువాదము : ఓ కమలోధ్భవ (బ్రహ్మ – తామర పుష్పము నుంచి జన్మించిన) ముందుగా నాకొసగిన ప్రసాదమును దృష్టి ద్వారా స్వీకరించి, నా భక్తుల జిహ్వ ద్వారా నేను ఆస్వాదించెదను.

మద్భక్త జన వాత్సల్యమ్ పూజాయాంచ అనుమోదనమ్
స్వయమభ్యర్చనమ్ చైవ మదర్ధే డంబవర్జనమ్
మత్కధా శ్రవణే భక్తిసర్వనేత్రాంగ విక్రియా
మమానుస్మరణమ్ నిత్యమ్ యచ్చ మామ్ నోపజీవతి
భక్తిరష్ట విధా హ్యేషా యస్మిన్ మ్లేచ్చేపి వర్తతే
స విప్రేంద్రో మునిశ్రీమాన్ స యతిశ్శ చ పణ్డితః
తస్మై ధ్యేయమ్ తతో గ్రాహ్యమ్ స చ పూజ్యో యతా హ్యహమ్

సాధారణ అనువాదము : నా భక్తులకు ఈ క్రింది 8 లక్షణములు ముఖ్యముగా నుండును –

  • ఎంపెరుమాన్ భక్తులపై నిర్హేతుకమైన ప్రేమ
  • ఎంపెరుమాన్ ఆరాధనను (ఇతరుల) ఆస్వాదించుట
  • తాను స్వయముగా ఎంపెరుమాన్ ఆరాధన చేయుట
  • అహంకార రహితుడుగా నుండుట
  • ఎంపెరుమాన్ గురించిన విషయములను ఆసక్తిగా శ్రవణము చేయుట
  • ఎంపెరుమాన్ గురించి శ్రవణము / భావన / భాషణము చేయునపుడు శరీరము మార్పులకు లోనగుట ( ఒడలు పులకరించుట, మొ || )
  • సదా ఎంపెరుమాన్ నే తలంచుట
  • ఎంపెరుమాన్ ను ఆరాధించునపుడు భౌతిక ప్రయోజనములను ఆశించకుండుట.
    అట్టి భక్తులు, వారు మ్లేఛ్చులైనను, వారిని నాతో సమానముగా బ్రాహ్మణ పెద్దలు, మధ్యవర్తులు, కైంకర్యపరులు, యతులు, పండితులు ఆరాధించగలరు. వారు అట్టి పండితులకు జ్ఞానమును ఇచ్చుటకు మరియు స్వీకరించుటకు యోగ్యులు.

ఈ విధముగా, భగవానుడు తానే స్వయముగా తన భక్తుల గురించి వారు ఈ సర్వ జగత్తును శుద్ధి చేయు సమర్థులు, వారు నా ఆత్మ వంటివారు, వారు నాకు ప్రాణ వాయువు వంటి వారు, వారిని నేనే స్వయముగా అనుసరించెదను, వారి పాదపద్మముల ధూళిని కాంక్షించెదను, వారిని ఆదరించి / సేవించిన వారు నాకు మిక్కిలి ప్రీతి పాత్రులు, వారితో జరుపు వ్యవహారముల ద్వారా లభించు ఆహారమును నేను ఆస్వాదించెదను, వారు మ్లెచ్చులుగా జన్మించినను, నాతో సమానముగా ఆరాధ్యయోగ్యులు అని ప్రకటించిరి.

భూమి పిరాట్టి (భూదేవి తాయారు) తమ అంతిమ లక్ష్యముగా మహా భాగవతులను దర్శించుట, స్పృశించుట, వారితో ముచ్చటించుట అని ప్రకటించిరి; వారి యొక్క దివ్య మంగళకరమైన లక్షణములను వర్ణించుటకు తాను అశక్తురాలనని, వారి మహిమలను పూర్తిగా వివరింపజాలనని తెలిపెను. దీనినే ఈ క్రింది శ్లోకములలో వివరించిరి :

అక్ష్ణోః ఫలమ్ తాద్రుసదర్శనమ్ హి తన్వాః ఫలమ్ తాద్రుసగాత్రసంగమ్
జిహ్వాఫలమ్ తాద్రుసకీర్తనంచ సుధుర్లబా భాగవతా హి లోకే

సాధారణ అనువాదము : నేత్రముల లక్ష్యము గొప్ప భాగవతుల దర్శనము; మన శరీర లక్షణము గొప్ప భాగవతుల యొక్క స్పర్శనము; మన నాలుక లక్షణము గొప్ప భాగవతులను కీర్తించుట; ఈ జగత్తులో అట్టి భాగవతులు అరుదుగా లభించెదరు.

నాహమ్ సమర్ధో భగవత్ ప్రియాణామ్ వక్తుమ్ గుణాన్ పద్మ భువోప్యగణ్యాన్
భవత్రభావమ్ భగవాన్ హి వేత్తి తధా భవన్తో భగవత్ ప్రభావమ్

సాధారణ అనువాదము : భగవానుని భక్తిలో లీనమైన అట్టి భాగవతుల ఔన్నత్యమును గురించి వచించుటకు నేనర్హుడను. ఆ పరమాత్మకే వారి ఔన్నత్యము తెలియును, వారికి మాత్రమే ‘అతని’ ఔన్నత్యము తెలియును.

ఆళ్వార్లు కూడ భాగవతులను కీర్తించిరి, యమ భటులకు (యమధర్మ రాజుగారి సేవకులు) వారిపై నియంత్రణ లేదని గుర్తించిరి.

యమభటుల హస్తములనుంచి అజామిళుని విష్ణుదూతలు కాపాడిరి

తిరుమళిశై ఆళ్వార్ – నాన్ముగన్ తిరువందాది 68

తిఱమ్బేన్మిన్ కణ్డీర్
తిరువడి తన్నామమ్ మఱన్దుమ్ పుఱన్దోళా మాన్దర్
ఇఱైఞ్జియుమ్ శాదువరాయ్ ప్పోదుమిన్గళెన్ఱాన్
నమనుంతన్ తూదువరై క్కూవిచ్చెవిక్కు

సాధారణ అనువాదము : యముడు తమ దూతలతో “ఈ ఆదేశమును విస్మరించరాదు. భగవానుని నామములను కూడ మరచినను అన్య దేవతారాధనను చేయని శ్రీవైష్ణవులను మీరు ఆరాధించుడు, వారిని మిక్కిలి ఆదరించుడు, శుద్ధి పొందుడు” అని పలికిరి. (అనువాదకుని గమనిక: దీనికి విలక్షణమైన ఉదాహరణగా – భార్యా భర్తల మధ్య మనస్ఫర్ధలు ఏర్పడినప్పుడు, భర్తతో మాటలాడక భార్య వున్నచో అది అర్ధము చేసికొనవచ్చును గాని, ఆమె వేరొక పురుషునికై చూచుట, పూర్తిగా అనంగీకారయోగ్యమగును).

పోయిగై ఆళ్వార్ – ముదల్ తిరువందాది 55

అవన్ తమర్ ఎవ్వినైయర్ ఆకిలుమ్
ఎమ్ కోన్ అవన్ తమరే యెన్ఱు ఒళివతల్లాల్
నమన్ తమరాల్ ఆరాయప్పట్టు అఱియార్ కణ్డీర్
అరవణై మేల్ పేరాయఱ్కు ఆళ్ పట్టార్ పేర్

సాధారణ అనువాదము : శ్రీమన్నారాయణునికే అంకితులైన శ్రీవైష్ణవులు నాకు గురువులు, వారి చర్యలు ఏమైనను. ఆదిశేషునిపై పవళించి, గోపాల బాలునిగా దర్శనమిచ్చిన భగవానునికి సంపూర్ణ శరణాగతులైన శ్రీవైష్ణవుల దోషములను విశ్లేషించుటకు యమభటులు కూడ అనర్హులు.

నమ్మాళ్వార్ – తిరువాయ్మొళి 5.2.1

ఎంపెరుమానార్లకు ఘనమైన ఊరేగింపు – వారి ప్రత్యక్షము సమస్త జగత్తుకు శుభసూచకము

పొలిక పొలిక పొలిక పోయిఱ్ఱు వల్ ఉయిర్ చ్చాపమ్
నలియుమ్ నరకముమ్ నైన్ద నమనుక్కు ఇఙ్గుయాతొన్ఱుమ్ ఇల్లై
కలియుమ్ కెడుమ్ కణ్డు కొణ్మిన్
కడల్వణ్ణన్ పూదఙ్గళ్ మణ్మేల్ మలియప్పుకున్దు ఇశైపాడి ఆడి ఉళి తరక్కణ్డోమ్

సాధారణ అనువాదము : సాగరము (ముత్యములతో మొ || వానితో నిండి వున్నది) వలె శక్తివంతుడు, నీలి వర్ణము గలిగి మిక్కిలి సుందరుడైన భగవానునికి సంపూర్ణ శరణాగతి చేసిన అనేక భాగవతుల ఆట పాటలను నేను వీక్షించితిని. ఇట్టి భాగవతుల వలన, ప్రజల మనస్సులలో నున్న అజ్ఞానము నశించును. అజ్ఞానము తొలగినందుచే, వీరిని నరక లోకములో పడవేయు యమునికి, యమ కింకరులకు పని లేకుండా పోయెను. కలియుగ దోషములు అనే అంతర్లీన కారణము కూడ తొలగెను. ఇట్టి శుభ సూచకము కలకాలము ఉండగలదు.

తిరుమంగై ఆళ్వార్ – పెరియ తిరుమొళి 8.10.7

వెళ్ళై నీర్ వెళ్ళత్తు అణైన్ద అరవణై మేల్
తుళ్ళు నీర్ మెళ్ళత్తుయిన్ఱ పెరుమానే!
వళ్ళలే! ఉన్ తమర్కెన్ఱుమ్ నమన్ తమర్
కళ్ళర్ పోల్ కణ్ణపురత్తుఱై అమ్మానే!

సాధారణ అనువాదము : క్షీరాబ్ధిలో (పాల సముద్రము) ఆదిశేషునిపై శయనించియున్న ఓ పరమాత్మ! తిరుక్కణ్ణపురములో ఓ స్వామి (నా ముందరనే వున్నారు)! చోరులు ఇతరుల నుంచి ఏ విధముగా దాగెదరో, నీ భక్తులను చూచిన యమభటులు కూడ అదేవిధముగా దాగు కొనెదరు.

ఆళ్వార్లు (తొండరప్పొడి ఆళ్వార్) “నావలిట్టు ఉళి తరుగిన్ఱోమ్ నమన్తమర్ తలైగళ్ మీతే” (మేము జయధ్వానము చేయుచు, యమభటుల శిరములపై నుండి నడచెదము).

శ్రీవైష్ణవులను నియంత్రించుటపై యమభటులు దృష్టి సారించుటను, అట్టి చర్యలు గైకొనినచో వారు మిక్కిలి బాధ పడుదురని ఆళ్వార్లు పేర్కొనిరి. శ్రీవైష్ణవుల మహిమలు అంత గొప్పవి.

“న కలు భాగవతా యమ విషయం గచ్ఛంతి” (భాగవతులు, యమునకు పరస్పర చర్యలకు ఏమియును లేదు) భాగవతుల మహిమలను కూడ వివరించిరి. ఈ విషయములో, భాగవతులతో యముని చర్యలు, ఇత్యాదులను ఈ క్రింది శ్లోకములో వివరించిరి.

స్వ పురుషమ్ అపి వీక్ష్య పాచహస్తమ్ వతతి యమః కిల తస్య కర్ణమూలే
పరిహర మధుసూధన ప్రపన్నాన్ ప్రభురహమ్ అన్యనృణామ్ న వైష్ణవానామ్

కమలనయన వాసుదేవ విష్ణో ధరణిధరాచ్యుత శంఖ చక్రపాణే
భవ శరణమితీరయన్తి యే వై త్యజ భటదూరతరేణ ధనపాపాన్

సాధారణ అనువాదము: యముడు తన కింకరులను దగ్గరకు రమ్మని, వారితో మధుసూధనుని శరణాగతి చేసిన శ్రీవైష్ణవులకు తాను స్వామిని కానని, కాని తదితరులు తన నియంత్రణలో నుందురని వివరించిరి. శ్రీవైష్ణవులతో తటస్థముగా నుండగలరని, కమలనేత్రుడు, వాసుదేవుడు, విష్ణువు, ధరణీ ధరుడు (భూమిని చేత ధరించిన వాడు), శంఖ చక్రములు తన హస్తములలో ధరించిన వాడైన భగవానునికి వారు శరణాగతి చేసినందులకు, వారికి దూరముగా నుండమని తెలిపిరి.

ఈ విధముగా, యమ ధర్మరాజు తన కింకరులతో, మీరు శ్రీవైష్ణవులని అదుపు చేయజాలరని ఆదేశించిరి, భగవానుని క్రోధము నుంచి కాపాడ బడుటకై శ్రీవైష్ణవులకు దూరముగా ఉండుమని అనిరి. భాగవతుల ఇట్టి మహిమలను శ్రీవిష్ణుపురాణము, ఇత్యాదులలో వివరించిరి.

అభాగవతులతో కలిసి ఉండుట అనగా భాగవతులతో మరియు భగవానునితో ఎడబాటుకు దారి చూపును. భాగవతులతో కలియుట, భగవానునితో కలయికకు మార్గము, అభాగవతులను వీడివుండుట మోక్షమునకు దారి చూపును. నిజమైన ఆచార్యుని పర్యవేక్షణలో నున్నవారు సంసారము వలన కలత చెందరు. అట్టి పర్యవేక్షణను శిష్యుడు వదలి వేసినచో, అతడు ఈ సంసారములో సదా బాధలను అనుభవించును. దీనినే ఆచ్చాన్ పిళ్ళై మాణ్ణిక్కమాలైలో వివరించిరి.

కావున, శిష్యుని ప్రతి అంశము ఆచార్యుని అధీనములో నుండ వలెను. కాని, తన కలవరపాటుచే, ఆచార్యునితో సంబంధమును మరచినను, తన స్వబుద్ధిచే అకృత్యకరణము (శాస్త్రము నిషేధించన కార్యములు) లలో జోక్యము చేసుకొనినను, భగవదపచారము (భగవానుని నిందించుట), భాగవతాపచారము (భాగవతులను నిందించుట), అసహ్యపచారము (భగవంతుని – భాగవతులను అకారణముగా నిందించుట) ఇత్యాదులను గావించిన ఫలితముగా రౌరవాది నరక కూపములలో బాధలను అనుభవించుటకు యోగ్యుడగును. నిజమైన ఆచార్యుడు, తమ శిష్యులు, ఇట్లు దిగజారినచో, వారనుభవించు బాధలను ముందుగనే పసిగట్టి, తమ నిర్హేతుక దయచే, వారిని శుద్ధి చేయగలరని, ” పయనన్ఱాగిలుమ్ పాఙ్గల్ల రాగిలుమ్ శెయల్ నన్ఱాగ త్తిరుత్తిప్పణి కొళ్వాన్” కణ్ణినుణ్ శిఱుత్తాంబు – 10 లో గుర్తించిరి (నేను అప్రయోజకుడను, మిక్కిలి అయోగ్యుడ నైనను, నమ్మాళ్వార్ నన్ను సంస్కరించి, తన దాసుని చేసుకొనిరని, మధురకవి ఆళ్వార్ తెలిపిరి) ఇదియే నిజమైన ఆచార్యుల లక్షణము.

ఆచార్యుల నిర్హేతుక దయ అను ఈ లక్షణమును మన పూర్వాచార్యుల జీవితములలోని కొన్ని సంఘటనల ద్వారా వివరించిరి.

ఎంపెరుమానార్ ఆదేశములననుసరించి, ఆళ్వాన్ వరదరాజస్తవమును గానము చేయుచు, నాలూరన్ కు కూడ పరమపదమును ప్రసాదించగలరని దేవ పెరుమాళ్ళను చివరలో అభ్యర్థించిరి.

కూరత్తాళ్వాన్ శిష్యుడైన నాలూరన్ క్రిమికంఠునితో కలిసి ఆళ్వాన్ పై (నాలూరన్ యొక్క ఆచార్యులు) అత్యంత క్రూరమైన దోషమును గావించగా, పెరుమాళ్ వారిపై మిక్కిలి కలత చెంది “న క్షమామి” (నేను ఎన్నటికి నిన్ను క్షమించను) అని పలికిరి. కాని, ఆళ్వాన్ తమ నిర్హేతుక దయ చూపుచు, పెరుమాళ్ తో అంగీకరించక, “నాలూరన్ కూడ తమ వలనే పరమపదము పొందవలెను” అని పెరుమాళ్ ను అభ్యర్థించిరి.

అనుచిత సహవాసముతో కలిగిన కలవరపాటుచే, భట్టరు శిష్యులలో ఒకరు, ప్రాపంచిక విషయ సంబంధముచే, వారితో ” భట్టర్! ఇక మన మధ్య ఎట్టి సంబంధము లేదు ” అని పలికి, వారి పాదపద్మములను వీడు ప్రయత్నము చేసిరి. భట్టరు, అతనితో ” ప్రియ కుమారా! నీవలా తలంచవచ్చు. నీవు నాతో సంబంధమును వీడినను, నేను వీడను” అనిరి మరియు అతనిని మరల సంస్కరించిరి.

నంజీయర్ అయిన వేదాంతికి గల ఒక ప్రియ శిష్యుడు, మిక్కిలి వైరాగ్యము కలిగి, పుణ్య ప్రవృత్తితో నిండి వుండిరి. కాని అసాత్విక ఆహారమును స్వీకరించిన కారణముచే అతనిలో అహంకారము, ఇత్యాదులు పెరిగి, నంజీయర్ ను శరణు చేయుటకు ముందు వినియోగించిన గొడ్డలిని మరల చేత ధరించి, తమ రాజుగారి సేవకై తిరిగి ప్రయాణమైరి. నంజీయర్ అతనిని ఏదో విధముగా పట్టుకొని, ఒక ఏకాంత గదిలో నుంచి, అతనికి సరియగు ఆదేశముల నిచ్చుటకై తలుపులు మూసి వేసిరి. నంజీయర్ పాద పద్మములను ఆశ్రయించిన శ్రీవైష్ణవులు కలత చెంది, వారితో “ఓహ్! ఇది మంచిది కాదు. అతని చేతనున్న గొడ్డలితో మీపై అఘాయిత్యము చేయగలడు, కావున మీరు వెంటనే గదిని వదిలి బయటకు రాగలరు” అనిరి. నంజీయర్ సమాధానముగా “అతను శుద్ధి పొందు వరకు నేను బయటకు రాను. తన ఆత్మ స్వరూపమును గ్రహించి ఉజ్జీవుడైనను కావలెను లేదా అతని చేతిలో గొడ్డలిచే నేను హతుడనగుదును” అనిరి.

పిళ్ళై లోకాచార్యులు – అన్ని మంగళకర లక్షణములకు నిధి

శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రములో పిళ్ళై లోకాచార్యులు ఈ విధముగా తెలిపిరి. తమపై తామే అపరాధమును చేసికొనిన వారిపై, పోఱై (జాలి), కృప (దయ), చిరిప్పు (చిరునవ్వు), ఉగప్పు (ఆనందము), ఉపకార స్మృతి (కృతజ్ఞత) ఉండాలి. ఇంతేకాక, అతను వ్యక్తిగతంగా మరింత గౌరవముగా ప్రవర్తించగలుగుట, శ్రీవైష్ణవుని నడవడికకు అంతిమ ఉదాహరణ అగును.

స్వీకరోతి సదాచార్యాస్ సర్వానప్య విశేషతః
యత్పునస్తేశు వైషమ్యమ్ తేషామ్ చిన్ జ్ఞానవృత్తయోః

సాధారణ అనువాదము : సదాచార్యుడు అందరిని శిష్యులుగా అంగీకరించగలరు వారికి మంచితనము లేకపోయినను. తదుపరి అట్టి లోపభూయిష్ఠమైన వారికి ఆత్మ జ్ఞానమును,  తదనుగుణమైన అనుష్ఠానమును (శిష్యుని తో నిబద్ధత గల ఆచరణ) బోధించి, వారి దోషములను తొలగించెదరు.

తేషామేవ హి దోషోయమ్ న చాశ్యేతి వినిశ్చితమ్
అపక్వ పద్మకోశానామ్ అవికాసో రవేర్యతా

సాధారణ అనువాదము : సూర్య కిరణములు సోకినను, అపక్వమైన పద్మముల రేకలు వికసించనట్లు, శిష్యుల లోపములు వారి అపరిణిత వికాసము వలన మాత్రమే గలవని, తమ వలన కాదని భావించెదరు (శిష్యుడు జ్ఞానములోను, క్రమ శిక్షణ లోను పరిణతి పొందువరకు ఆచార్యులు సంస్కరించెదరు కాని అతనిని నిరాకరించరు).

పై శ్లోకములు గుర్తించినట్లు, ఒక శిష్యుడు ఆచార్యుని శరణు చేసినను, అతని అజ్ఞానము / దోషము వలన మరల దుశ్చర్యలు గావించి తన వ్యక్తిత్వము కోల్పోయినను, ఆచార్యుడు అతనిని సంస్కరించి మరియు రక్షించెదరు, “స్కాలిత్యే శాస్త్రము” లోని ఆదేశముల ద్వారా (తప్పు దారిలో నడచు శిష్యునికి సక్రమ ఆదేశముల నొసంగి సరి చేయుదురు), తమ అపార కరుణచే “దేషికో మే దయాళు” లో చెప్పిన విధముగా (నా పై ఆచార్యులు అపార కరుణ చూపిరి).

వాసుదేవమ్ ప్రపన్నానామ్ యాన్యేవ చరితాని వై
తాన్యేవ దర్మశాస్త్రాని త్యేవమ్ వేద విధో విధుః

సాధారణ అనువాదము : వేదములలో నిష్ణాతులైన వారు వాసుదేవునికి ప్రపన్నులైన (సంపూర్ణ శరణాగతి చేసిన భక్తులు) వారి జీవితమును ధర్మ శాస్త్రముగా పరిగణించెదరు.

మన పూర్వాచార్యుల యొక్క ఇట్టి విశిష్ఠ లక్షణములను మన ఆచార్యులు (మాముణులు) విశదీకరించిరి. వారు ఆళ్వార్ తిరునగరి లోని ఓలమిచ్చాన్ మఠములో (ఒక పూరి గుడిశె) విశ్రాంతి తీసుకొను సమయములో, క్రూర స్వభావులైన కొందరు (ఎంపెరుమాన్ కు ఇచ్చు ఆహారమును విషపూరితము చేసిన ఛండాలురు), మాముణులపై అసూయతో అర్ధరాత్రి సమయములో ఆ మఠమును అగ్నికి ఆహుతి గావించిరి. (అనువాదకుని గమనిక: ఆ మఠము లోని మంటల నుంచి మాముణులు ఆదిశేషుని రూపములో బయటకు దూరి వచ్చి, అగ్నికి ఆహుతి అగుచున్న ఆ మఠమును తిలకించుచు నిలబడిరి). ఆ స్థానీయ నిర్వాహకులు అట్టి ఘోర నేరము చేసిన పాపులను శిక్షించుటకు వారికై అన్వేషించసాగిరి. కాని, ఈ క్రింది ప్రమాణముల ద్వారా మాముణులు, వారి చర్యలను వ్యతిరేకించి, ఆ దుర్మార్గులను క్షమించమని మరియు వారిని వదిలి వేయమని కోరిరి. (అనువాదకుని గమనిక : మాముణులను ఇచట సీతా పిరాట్టితో పోల్చిరి – ఆమె కూడ తనపై హాని చేసిన వారిపై మిక్కిలి దయతో కనికరించెను. అదే విధముగా మాముణులు కూడ తమను అంతము చేయదలచిన వారిపై మిక్కిలి దయను కృపజేసి, వారిని చివరకు సంస్కరించిరి.

మిక్కిలి దయా స్వభావము గల సీతా పిరాట్టి మరియు మాముణులు (ఆళ్వార్ తిరునగరి)

పాపానాం వా శుభానాం వా వదార్హాణాం ప్లవంగమ
కార్యమ్ కరుణ మార్యేణ న కశ్చి న్నా పరాద్యతి

సాధారణ అనువాదము : హనుమాన్ తో సీతా పిరాట్టి – ఓ హనుమా! ఉదార స్వభావము కలవారు పాపాత్ములపై, పుణ్యాత్ములపై, మరణార్హులు అయిన వారిపై కూడ దయను చూపవలెను, ఏలనన, దోషములు చేయని వారు ఎవరూ వుండరు.

భావేయం శరణం హి వాః

సాధారణ అనువాదము : రాక్షస స్త్రీలతో సీతా పిరాట్టి – ఎట్టి పరిస్థితులలో నైనా మీకు నా అభయము

కః కుప్యేధ్ వానరోత్తమః

సాధారణ అనువాదము : హనుమానునితో సీతా పిరాట్టి – తమ యజమానుల ఆదేశములను పాటించు సేవకురాండ్రతో ఎవరు ఆగ్రహించెదరు?

ఈ విధముగా అత్యంత దయా స్వరూపులైన ఆచార్యులు మాముణులు, మిక్కిలి పాపులైన వారిని కూడ నిర్వాహకులు శిక్షింపకుండా చేసిరి. ఈ సంఘటన అన్ని ప్రాంతములలో ప్రాచుర్యము పొందెను. ఇంకను, మన ఆచార్యుని అత్యంత దయా స్వభావము, వారి అవతార విశేషమును (ఆదిశేషుని అవతారము, శ్రీ రామానుజులుగా మరల ఆగమనము) మనము ముంగిస మరియు చిలుక, వృక్షము (మాముణులు తింత్రిణీ వృక్షమునకు మోక్షమును ఇచ్చుట), విశిష్ఠ వ్యక్తుల స్వప్నములు (కోయిల్ అణ్ణాణ్, తిరుపతి లోని సాధు శ్రీవైష్ణవులు, మొ ||, మాముణుల గొప్పదనమును ముందుగానే దర్శించిరి) వంటి సంఘటనల ద్వారా గమనించగలము.

అనువాదకుని గమనిక : ఈ విధముగా, మనము శ్రీవైష్ణవుల దివ్య కీర్తిని, ఎంపెరుమాన్, పిరాట్టి, ఆళ్వార్లు, ఆచార్యులు గుర్తించినారని, అవి ప్రతిబింబించిన కొన్ని సంఘటనలను
గమనించితిమి. సీతా పిరాట్టి, మాముణులు తమను బాధించిన వారిపై చూపిన షరతులులేని దయను గమనించితిమి. ఇప్పుడు మనము ఈ దివ్య గ్రంధము యొక్క అంతిమ భాగమును దర్శించెదము.

కొన్ని సంస్కృత ప్రమాణములకు తగిన అనువాదమును ఒసంగిన శ్రీరంగనాథ స్వామికి ధన్యవాదములు.

తదుపరి భాగములో, ఈ అద్భుత గ్రంధము యొక్క కడపటి విశేషములను మనము దర్శించెదము.

సశేషము…

అడియేన్ గోపీకృష్ణమాచార్యులు బొమ్మకంటి, రామానుజ దాసన్ .

మూలము: http://ponnadi.blogspot.com/2013/07/anthimopaya-nishtai-17.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 45

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 44

అన్నన్ తమ బంధువులతో జీయర్ మఠానికి బయలురుట

అన్నన్ బంధువులలో కొంతమందిని సమాశ్రయణం కోసం జీయర్ మఠానికి వెళ్ల వద్దని వారి మనస్సులను ఎంబా మార్చి వేసారు. జరిగిన విషయం కందాడై అన్నన్ కు తెలిసింది; వారు నిరాశగా, కోపంతో “వాళ్ళను వదిలేయండి” అని చెప్పి, మిగిలిన వారిని తమతో తీసుకెళ్లాలని వారు నిర్ణయించుకున్నారు. వారు ఆచ్చిని పిలిచి, తగిన సమయం చూసి జీయర్ కు తెలియజేయమని చెప్పారు. ఆమె మఠానికి వెళ్లి చూడగా, తిరుమలై ఆళ్వార్ [ఉపన్యాస మందిరం] లో శ్రీవైష్ణవ గోష్టిలో జీయర్ ఉన్నారని తెలిసింది. గోష్టిలోకి వెళ్లి వారికి తెలియజేయుటకు సంకోచించింది. ఆమె అక్కడ ఉన్న ఒక శ్రీవైష్ణవుడితో మాముణులకు సందేశం పంపాలని అనుకుంది. ఆమె అతనిని పిలిచి, జీయర్‌ ను దయచేసి ఒక సారి లోపలికి రమ్మనమని, ఎవరికీ వినిపించకుండా జీయరుకి తెలియజేయమని ఆమె కోరింది. ఆ శ్రీవైష్ణవుడు కారణమేమిటని అడుగగా, ఆమె “కందాడై అయ్యంగార్ల వంశ ఆచార్యులతో కలిసి అణ్ణన్ వస్తున్నారు” అని చెప్పి, జీయర్ కు విషయము తెలియజేయడానికి వీలుగా లోపలికి వెళ్ళి ఎదురుచూసింది.

అసట్టాచ్చాన్!

ఆ శ్రీవైష్ణవుడు ఆచ్చి చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకొని వెంటనే లోపలికి పరిగెత్తుకెళ్లి, “స్వామీ! దయచేసి త్వరగా రండి. కందాడై అయ్యంగార్లు వస్తున్నారు” అని జీయర్తో అన్నారు. వారు వెంటనే లేచి పెరట్లోకి వెళ్ళారు. జీయర్ ఇంకా లోపలికి రాకపోయేసరికి, ఆ శ్రీవైష్ణవుడు వారికి ఏమి చెప్పారోనని ఆచ్చి ఆందోళన చెందింది. ఈ సంతోషకరమైన వార్తను వారికి తానే తెలియజేయాలనుకుంది. కానీ, పెరట్లోకి వెళ్ళలేక పోయింది. అప్పటికే, పండ్లు, పలు నివేదనలతో అన్నన్ మరియు వారి బృందము ప్రవేశ ద్వారం వరకు చేరుకున్నారు. వారందరూ అక్కడ వానమామలై జీయర్‌ను కలుసుకుని తమ మర్యాదలను సమర్పించుకున్నారు. అన్నన్ “మేము ప్రాప్యప్రాపకం (అత్యున్నత ఫలము మరియు సాధనం) గా జీయర్ దివ్య పాదాలను ఆశ్రయించుటకు వచ్చాము. దేవరు వారు ఈ మా విన్నపాన్ని స్వీకరించాలి” అని ఎంతో వినయంగా వానమామలై జీయర్ ను ప్రార్థించారు. అది విన్న వారు ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు, కానీ సంతోషించారు కూడా. తర్వాత జీయరుకి జరిగిన విషయము గురించి చెప్పేందుకు లోపలికి వెళ్లారు. ఇంతలో ఆచ్చి సరైన అవకాశము చూసుకొని, వెళ్లి జీయర్‌ని కలుసుకొని వారికి పాదభివందనాలు చేసి, “ఈ రోజు ఎంతో సుభ దినము. అన్నన్ మరియు కొందరు [దేవర్వారి] దివ్య చరణాల వద్ద ఆశ్రయం పొందాలని వస్తున్నారు” అని తెలిపెను. అదే సమయంలో, వానమామలై జీయర్ లోనికి వచ్చి, పారవశ్యంతో జరిగిన విషయమును గురించి వారికి తెలియజేశారు. ఇవి విన్న జీయర్ సంతోషించి. “వీటన్నిటికీ ప్రధాన కారణం ఆచ్చియార్ కదా!” అని అన్నారు. ఆ తర్వాత తిరుమలైయాళ్వార్లో తనను హెచ్చరించిన శ్రీవైష్ణవుడిని పిలిచి వింతగా “దేవరీర్ పేరు ఏమిటి?” అని అడిగారు. ఆ శ్రీవైష్ణవుడు “అడియేన్ రామానుజదాసన్” అని జవాబిచ్చాడు. జీయర్ వ్యజ్ఞ్యముగా“ అలా కాదు. దేవరీర్ అసట్టాచ్చాన్ (తెలివి లేని వ్యక్తి)” అన్నారు.

జీయరుకి తమ గౌరవాలు సమర్పించిన అన్నన్ 

జీయర్ ఆశ్చర్యపడుతూ కృపతో….

విధ్యా విముక్తిజననీ వినయాధికత్వం ఆచారసంపతనువేల వికాసశీలం
శ్రీలక్ష్మణార్య కరుణా విషయీకృతానాం చిత్రం నదాశరథివంశ సముత్భవానాం

(మోక్ష సాధనమైన జ్ఞానం, సత్ప్రవర్తనాసంపద మరియు అద్భుతమైన వినయ విధేయతలను శ్రీ ముదలియాండాన్ వంశస్థులు నిష్ఠగా అనురిస్తారని అనుటలో అతిశయోక్తి లేదు) అనిపలుకుతూ మఠం ముందు వాకిలిలోకి వచ్చారు. అక్కడ ఉన్న పరిచారకులను చూసి ఇలా అన్నారు….

శ్రీరామానుజ యోగీంద్ర కరుణా పరిబృంహితాం
శ్రేయసీం అనగాం వందే శ్రీమద్వాధూల సంతతిం

(ఏ దోషమూ లేని శ్రేష్ఠమైన యతిరాజులు, రామానుజుల కృపతో వృద్ధి చెందిన వాధూల వంశాన్ని నేను నమస్కరిస్తున్నాను). కందాడై అయ్యంగారులందరూ జీయర్ దివ్య పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, “నకర్మణా నప్రజాయతనేన ”, “వేదాహమేతం” మొదలైన వేద మంత్రాలను పఠించి తమ నివేదనలు వారికి సమర్పించుకున్నారు. జీయర్ వాటిని స్వీకరించి వారందరినీ లోపలికి ఆహ్వానించారు. అక్కడ చేరిన దివ్య గోష్ఠికి, తిరువాయ్మొళిలోని ‘పొలిగ పోలిగ’, తిరుప్పల్లాండు పాసుర అర్థాలపై క్లుప్తమైన ఉపన్యాసం ఇచ్చారు. అక్కడ సంభవించిన ఈ శ్రీవైష్ణవ ఘట్టాన్నిఅందరూ కీర్తించి తమ మంగళాశాసనాన్ని అర్పించారు. మాముణులకు సమాశ్రయణ విన్నపము చేయమని అన్నన్ వానమామలై జీయర్ను సూచించారు. వానమామలై జీయర్ మరియు అన్నన్‌ ను మాముణులు పిలిచి, “దేవర్ గొప్ప వంశానికి చెందినవారు, పైగా అందరికీ గురువుల వంటివారు. ఇది ఏమిటి?” అని అడిగారు. అన్నన్ ప్రతిస్పందిస్తూ “దయచేసి అలా అనకండి” అని అన్నారు. వారు తమ మునుపటి ప్రవర్తనకి [జియార్‌ను గౌరవించకుండుట] క్షమాపణలు వేడుకొని, తమ స్వప్నంలో చూసిన సంఘటనలను వివరించారు. జీయర్ అంగీకరించి, “తప్పక ఈయాన్ వంశస్థులను పెరియ పెరుమాళ్ళు కృపతో అనుగ్రహిస్తారు. ఈ రోజు నుండి నాల్గవ రోజున అందరికీ సమాశ్రయణం చేస్తాము’’ అని ప్రకటించారు. గోష్ఠిలోని వారందరూ ప్రసాదం, తమలపాకులు పుచ్చుకొని మఠం నుండి బయలుదేరారు.

మరికొంతమందిని సరిదిద్దాలనే ఉద్దేశ్యంతో, ఎమ్పెరుమాన్ తమ మనస్సులో నిశ్చయించుకున్నారు.

పునఃస్వప్నాపదేశేన దేశే దేశే నిరంకుశః
అయమర్చావతారత్వ సమాధిమవధీరయత్
అధ్యమర్త్యన్ తదేతస్య తత్వమాధ్యంతికం హితం
అసంకుచితం ఆసక్యౌ భుజంగశయనః పుమాన్

శేష శయ్యపైన శయనించి ఉన్న ఆ సర్వోన్నతుడు, ఆతనిని ఎదిరించే వారెవరూ లేరు కనుక, స్వప్నం నెపంతో, ఎవరితోనూ మాట్లాడకూడదనే తమ అర్చావతార స్వరూప నియమాన్ని కూడా ప్రక్కన పెట్టి పలు ప్రాంతాలకు వెళ్లి – కృపతో, ఇతర దేవతలను కూడా మించిన గొప్ప మాముణుల యథార్థ స్వరూపాన్ని మరియు వారి మోక్ష (శ్రీవైకుంఠం) సంసిద్ధతను తెలుపుతూ, “గురుశ్చ స్వప్నదృష్టశ్చ” (తమ ఆచార్యుని స్వప్నంలో దర్శించుట) అనే సూక్తికి అనుగుణంగా వారు [మాముణులు] తమ కలలోకి అర్చావతార రూపంలో వచ్చి: “మేము ఆచార్య (గురువు) రూపంలో అవతరించాము, మీరు కూడా ‘ఆచార్యం మాం విజానీయాత్ భవబంధ విమోచనం’ (ఈ సంసారము నుండి (అందరినీ) బంధ విముక్తులను చేయడానికి మేము మాముణులుగా అవతరించాము, ఈ విషయము అందరమూ తెలుసుకోవాలి), విశిష్ట విశ్వాసాన్ని ప్రదర్శించి వారి యందు ఆశ్రయం పొందుము” అని తెలియజేశారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/29/yathindhra-pravana-prabhavam-45/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org