Monthly Archives: October 2022

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 61

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 60

శ్రీవైష్ణవుల గుణాలను వివరిస్తున్నారు

ఉత్తర దక్షిణ భారత దేశపు ప్రాంతాల వారు తరచూ దర్శించుకునే శ్రీరంగ దివ్య క్షేత్రం పెరుమాళ్ళ దివ్య నివాసము. ఉత్తర దేశపు ఒక శ్రీవైష్ణవ ప్రభు (ఒక శ్రీవైష్ణవ శ్రీమంతుడు) జీయర్ ఉక్త్యానుష్టానాముల (అనుష్టానాలు, ఉపన్యాసాలు) గురించి విని, తమ దేశం నుండి శ్రీరంగాన్ని వెళుతున్న కొందరు భక్తుల ద్వారా జీయరుకి సందేశం పంపారు. ఆ సందేశంలో “కృపచేసి ఆచరణలో అనుసరించగలిగే అన్ని శాస్త్రార్థాలను క్లుప్తంగా ఇమిడ్చి, దయతో అడియేనుకి పంపండి” అని అభ్యర్థించారు. జీయర్ తమ సందేశంలో ఆ శ్రీవైష్ణవ శ్రీమంతుడికి ఇలా జవాబిచ్చారు. “పెరుమాళ్ళను సేవించుటలో ఉన్న రుచిని పురుషార్థం అని తెలుకున్న వ్యక్తికి కేవలం ఆతడికి సేవ చేయడమే పురుషార్థం కాదు. ఒక వ్యక్తి తన భుజాలపై శంఖ చక్ర చిహ్నాలు ధరించున్నంత మాత్రాన సరిపోదు, కేవలం పెరుమాళ్ళను సేవించుటయే సరిపోదు. కేవలం ఆచార్యునిపై పూర్ణంగా ఆధారపడే అర్హత ఉంటే సరిపోదు. కేవలం భాగవతాలకు పరతంత్రుడై ఉంటే సరిపోదు. అలాంటప్పుడు, ఆ వ్యక్తి పురుషార్థాన్ని ఎలా పొందగలడు? శ్రీవైష్ణవులు తన ఇంటిలోకి ఎటువంటి సంశయం లేకుండా ప్రవేశించేలా ఉండాలి. వారికి సరైన కైంకర్యం చేస్తూ, వారికి అన్ని సదుపాయాలను అందించి, ఉండడానికి అనుమతించి, ఎంతగా అంటే “వారు నన్ను కూడా అమ్మవచ్చు” అనే విధంగా ఉండి పురుషార్థాన్ని సాధించగలరు. ఒక మర్రి విత్తనంలో మర్రి చెట్టు ఊడలన్ని ఉన్నట్లే, ప్రణవంలో ఎన్ని అక్షరాలు ఉన్నట్లే, భాగవత శేషత్వం చివరి వరకు అనుసరిస్తే, సత్సాంప్రదాయ అర్థాలన్ని వచ్చినట్లే. మరో మాటలో చెప్పాలంటే, చరమార్థము (పూర్తిగా భాగవత పరతంత్రులై ఉండుట) ను పాటించే వారికి, భగవత్ సంబంధిత రహస్య అర్థాలను విడమరచి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక వేశ్య పతివ్రత ధర్మాన్ని గురించి మాట్లాడినట్లే, ఈ విశిష్టమైన అర్థాన్ని పాటించపోతే, సాంప్రదాయ అనుష్టానములు వ్యర్థం అవుతాయి.

పూజానాత్ విష్ణు భక్తానాం పురుషార్థోస్థి నేతర
తేషు విద్వేషతః కించిత్ నాస్తి నాశకం ఆత్మనాం

(భగవాన్ పట్ల పూర్ణ సమర్పణతో ఉన్న శ్రీవైష్ణవులను సేవించుట కంటే గొప్ప పురుషార్థం మరొకటి లేదు. వీరి పట్ల ద్వేషం, ఆత్మ స్వరూపాన్ని నాశనం చేసే మరొక చర్య ఉండదు)” అని జీయర్ తిరుమంత్ర సారమైన చరమార్థ నిష్ట (పురుషార్థ సాధనలో దృఢ నిష్చయుడై ఉండటం) ను తమ దివ్య సూక్తుల ద్వారా వివరించారు.

జీయర్ నుండి శ్రీముఖం (సందేశం) ను అందుకున్న తరువాత, ఆ శ్రీవైష్ణవ ప్రభు భాగవత ఆరాధనలో లీనమై ఉన్నారు; “తస్యై నిత్యం ప్రతిశద్ధిశే దక్షిణస్యై నమస్యం” (దక్షిణ దిక్కుని నిత్యం నమస్కరించుము), “దిశేవాపి నమస్కృర్యాత్ యత్రాసౌ వసతి స్వయం” (కనీసం తమ ఆచార్యుడు ఉంటున్న ఆ దిశకు అంజలి సమర్పించాలి) అని చేప్పినట్లు. తిరువాయ్మొళి 6-5-5 పాశురం ప్రకారం “తొళుం అత్తిషై ఉఱ్ఱు నోక్కియే” (ఆ దిశ వైపు తదేకంగా చూస్తూ సేవించు) అని చేప్పినట్లు, ప్రతిరోజూ నిద్రలేచిన వెంటనే, మాముణులు ఉండే దక్షిణ దిశకు అంజలి సమర్పించేవారు. తమ వర్ణానికి అనుగుణంగా జీయర్ మఠానికి సేవలు అందించేవారు.

ఆ సమయంలో, భట్టర్ పెరుమాళ్ (కురత్తాళ్వాన్ వంశస్థుడు) పెరుమాళ్ సన్నిధిలో జీయరుకి సాష్టాంగము చేసి “మీ శిష్యులు మాకు సాష్టాంగ ప్రణామం చేయడం లేదు, మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు” అని ఫిర్యాదు చేశారు. జీయర్ మఠం చేరుకొని, శిష్యులను పిలిచి, కారణమేమిటో అడిగారు. “వారికి పరతంత్రులై ఉండుట తమకు ఇష్టం లేదు” అని వారి శిష్యులు అన్నారు. “అలా అయితే పెరుమాళ్ పిరాట్టి దివ్య సింహాసనంలో కూర్చొని ఉన్నారని కల్పన చేసుకొని సేవించండి” అని జీయర్ వారితో అంటారు. ఆ విధంగా, పెరుమాళ్ళ పట్ల పరమ భక్తి ఉన్న జీయర్, దోషాలు ఉన్న చోట కూడా శుభ గుణాలను వెతకగలిగేవారు; సరైన అనుష్టానము ఎరిగిన వారు కాబట్టి, మన పూర్వాచార్యులు ఆచరించిన అనుష్టానాలకు తగిన విధంగా గౌరవాలు అందించేవారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/16/yathindhra-pravana-prabhavam-61/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 60

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 59

క్రింద శ్లోకంలో వివరించిన వివిధ కార్యముల ద్వారా, స్వీకృతమైన / అస్వీకృతమైన కర్మలు చేయునపుడు కలిగే శుభ / అశుభాలను అందరికీ అవగతం చేసి మాముణులు ప్రతి ఒక్కరినీ ఉద్ధరించారు:

పక్షితం హి విషంహన్తి ప్రాకృతం కేవలం వపుః
మంత్రౌషధమయీతత్ర భవత్యేవ ప్రతిక్రియా
దర్శనస్పర్శ సంశ్లేష విశ్లేష శ్రవణాతపి
అప్రతిక్రియం ఆత్మైవ హన్యతే విషయైర్ దృఢం
ఇత్తం ఉద్గోషయన్ దోషాన్ విస్తరేణ సుదుస్తరాన్
దూరం నిర్వాసయామాస వాసనా విషయేష్వసౌ

విషము సేవిస్తే పంచ భూతాలతో తయారైన ఈ శరీరము మాత్రమే నశిస్తుంది. కానీ, ఆ విషానికి మంత్రాల ద్వారా, మందుల ద్వారా విరుగుడు చేయవచ్చు. కానీ జీవాత్మ ఈ ప్రాపంచిక విషయాలను చూడడం ద్వారా, వాటి స్పర్శ ద్వారా, వాటిలో లీనమవుట ద్వారా, వాటిని వినడం ద్వారా, ఆ ప్రాపంచిక విషయము మనల్ని విరుగుడుకు అవకాశం లేకుండా నాశనం చేస్తుంది. మణవాళ మాముణులు వాటికి లోతైన వివరణలు ఇచ్చి ఈ ప్రాపంచిక సాధనలకు మరలా ఆకర్షితులు కాకుండా మూలము నుండి పెలికించి తొలగించారు.

నిదానం సర్వదోషాణాం నిదానం క్రోధ మోహయోః
మాన ఏవ మనాంస్యేషాం నిత్యమున్మూలయత్యసౌ

(స్వాభిమానం (అహంకారం) సమస్థ కళంకాలకు కారణం. అది కోపానికి కామానికి మూల కారణం. ఈ అభిమానం చేతనుడి బుద్దిని నాశనం చేస్తుంది.)

అర్థసంపత్ విమోహాయ విమోహో నర్కాయచ
తస్మాదర్థమనర్తాక్యం శ్రేయోర్థీ దూరతస్త్యజేత్
యస్యధర్మార్థం అర్థేహా తస్య నీహైవ శోభనా
ప్రక్షాళనాతి పంకస్య దూరాతస్పర్శనం వరం

(భోగములకు ధనము కారణము. ఆ భోగము నరకానికి దారి తీస్తుంది. అందుచేత, ‘పనికిరానిది’ అని పేరుగాంచిన ధనోపార్జనను మానుకోవాలి. దానం చేయుట కోసం ఐశ్వర్యాన్ని కోరుకొనుట కూడా మానుకోవాలి. లౌకిక విషయాసక్తిపైన కోరిక లేకుండా ఉండటం మంచిది. ముందు బురదలోకి దిగి, తరువాత కాళ్ళు కడుక్కోవడం కంటే, ముందే దూరంగా ఉండటం మంచిది).

బృత్యోహం విష్ణుభక్తానాం శాసితారస్త ఏవమే
క్రేతుం విక్రేతుమపిమామీశతేతే యతేప్సితం
ఇతియస్యమతం నిత్యం అయమేవాత్మ విత్తమః
స్వరూపం సిద్ధిస్ సర్వేషాం స్వోజ్జీవనమపి ధృవం
శ్రేయసీ దేశికానాంచ సిధ్యతి ప్రతుపక్రియః

(అడియేన్ శ్రీవైష్ణవులకు దాసభూతుడను. నన్ను నియంత్రించువారు. వాళ్ళ ఇచ్ఛానుసారంగా నన్ను అమ్మి/కొనేటంత అధికారం ఉన్నవారు. ఆత్మ ప్రాథమిక స్వరూపాన్ని గ్రహించిన చేతనుడే ఉత్తముడు. దీని వల్ల ఆత్మ స్వరూపం స్థిరపడుతుంది. ఇది ఆచార్యుల కంటే ఉన్నతమైన కృతజ్ఞతా స్థాయిని ఏర్పరుస్తుంది.

ఆచార్యవత్ దేవతావత్ మాతృవత్ పితృవత్తతా
ద్రష్టవ్యాస్సంత ఇత్యాదీర్ దృష్టః శాస్త్రేషు విస్తరాత్

(తల్లి తండ్రులను, దేవతలను, సత్పురుషులను ఆచార్యులుగా గౌరవించాలి. అటువంటి గొప్ప మార్గాలెన్నో మన శాస్త్రాలలో విస్తృతంగా వివరించబడి ఉన్నాయి)

సుశీలస్సులభః స్వామీ శ్రీమానపికృపానిధిః
అణేరపి మహత్ ద్వేషాతత్ త్యంతాం యాతివిక్రియాం
పావనీమహతాం దృష్టిః ప్రచ్యుతానపిమోచయేత్
అమర్షః పునరల్పోపి నిత్యానపి నిపాదయేత్
ప్రియాత్ ప్రియతరం శౌరేస్సజ్జనానాం సపాజనం
అప్రియాత్ అప్రియస్తేషాం అవమానోమనాకపి

(అందరికీ ప్రభువు అయిన భగవానుడు, అతి సులభుడు, అతి కృపాశీలుడు అంతటి శ్రీమాన్ అందరిలో స్వేచ్ఛగా కలిసేవాడు అయినప్పటికీ, ఉత్తముల పట్ల ఒక చిన్న తప్పును కూడా పెద్ద అపరాధంగా భావించి ఆగ్రహిస్తారు. మహానుభావుల కటాక్షం, ఎవరినైనా శుద్ధి చేయగలదు, భగవానుని ఆగ్రహపాత్రులను కూడా ఉద్ధరిస్తుంది, వారి బాధ అతి చిన్నదైననూ, నిత్యాత్మాలను (శ్రీవైకుంఠ నిత్య నివాసులు) కూడా ప్రభావితం చేయగలదు. అటువంటి ఉత్తములకు జరిగే అవమానం అతి అల్పమైనదైననూ, భగవానుడు ఉపేక్షించడు)

సజ్జనానిక్రమక్రౌర్యం శాస్త్రైర్ అర్థం ప్రదర్శయన
సూక్తిభిర్యుక్తాభిస్సర్వాన్ సముగతజీవయత్

(మణవాళ మాముణులు శాస్త్ర ఉదాహరణల ద్వారా, తమ దివ్య వాక్కులతో వివరణలను ఇచ్చి, సత్పురుషుల పట్ల చేసే అపచారములు (భగవత్ అపచారము, భాగవత అపచారము) చూపించి, అందరినీ ఉద్ధరించారు).

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/15/yathindhra-pravana-prabhavam-60/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 59

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 58

పరస్పరం శత్రుత్వాన్ని పెంచుకుటున్న శ్రీవైష్ణవులను సంస్కరించారు

తమ అహంకారం కారణంగా ఇద్దరు శ్రీవైష్ణవులు వాదనకు దిగారు. అదే చోట రెండు కుక్కలు పోట్లాడుకుంటున్నాయి. అది చూసి జీయర్ ఆ కుక్కలను, “అహంకారాన్ని పెంచుకుని వాదనకు దిగిన మీరు కూడా వీళ్ళ లాగా శ్రీవచన భూషణంలో నిష్ణాతులా?” అని అడిగారు. జీయర్ మాటలు వినగానే ఆ శ్రీవైష్ణవులిద్దరూ తమ ప్రవర్తనకు సిగ్గుపడి, ఆ నాటి నుండి పోట్లాడు కోవడం మానేశారు.

వస్తువుల పట్ల నిర్లిప్తత

ఉత్తరం దిశ నుండి ఊర్ధ్వపుండ్రాలు ధరించి కొందరు జీయర్ మఠానికి కొని వస్తువులు తీసుకువచ్చారు. జీయర్ ఆ వస్తువుల మూలమును విశ్లేషించి, అవి అక్రమంగా సంపాదించినవని గ్రహించి, వెంటనే వాటిని తిరస్కరించారు. అనంతరం, మఠానికి చెందిన భూముల నుండి పండించిన ధాన్యాన్ని మాత్రమే మఠానికి తెచ్చారు. ఆ పొలాల్లో పని చేసే వాళ్ళు, మఠంలోనే భోంచేశారు. వాళ్ళు కూర్చుని భోంచేసిన ఆ చోటిని ఆవు పేడ, నీళ్ళతో శుభ్రం చేశారు. ఆ కారణంగా ఆ చోటు ఇంకా తడిగానే ఉంది. ఆదే సమయంలో అక్కడికి వచ్చిన జీయర్, తడిగా ఉంది ఏమిటని అడుగగా, అక్కడున్న వారు కారణమేమిటో చెప్పారు. అర్థరాత్రి అయినప్పట్టికీ, వాళ్ళు తెచ్చిన ఆ పవిత్ర ధాన్యాన్ని జీయర్ శ్రీ బండారానికి (ఆలయ భాండాగారం) తరలించారు.

ఉడుత ముసలిదైనా చెట్టెక్కగలదు కదా?

అతి వృద్ధురాలైన ఒక మహిళ, మఠాన్ని విడువలేక, రాత్రి అక్కడే పడుకోవడం మొదలుపెట్టింది. ఇది చూసిన జీయర్ ఆమెను మఠం వదిలి వెళ్లేలా చేశారు. అక్కడున్నవారు ఎందుకలా చేసారని అడిగినప్పుడు, “ఒక ఉడుత ముసలిదయినా, దానికి చెట్టు ఎక్కే సామర్థ్యం ఉంటుంది? మన విరోధులు మనపై దుష్ప్రచారం చేయడానికి ఈ చిన్న కారణం చాలు” అని సమాధానమిచ్చారు.

వారి స్వభావానికి తగిన శిక్ష

ఒక శ్రీ వైష్ణవుడు మఠానికి తూదువళైక్కీరై (తాజా ఆకుకూరలు) తెచ్చి, మడప్పల్లిలో (వంట శాల) ఉన్న ఒక మహిళకు ఇచ్చి, వండి వడ్డించమని చెప్పాడు. ఆ మహిళ నిర్లక్షంతో దానిని వంటలో వాడలేదు. తరువాత, భోజనం వడ్డించినప్పుడు, ఆ శ్రీవైష్ణవుడు ఆ స్త్రీ వైపు వెటకారంగా చూశాడు. ఇది గమనించిన జీయర్, ఏమి జరిగిందని అడిగారు. ఆ శ్రీవైష్ణవుడు జరిగిన విషయం చెప్పారు. ఇది విన్న జీయర్ ఆమెను ఆరు మాసాలు వంట చేయవద్దని ఆదేశించారు. ఆ స్త్రీ సాష్టాంగం చేసి, చేసిన నేరానికి క్షమించమని వేడుకుంది. జీయర్ ఆమెను క్షమించి యదావిధిగా వంట కొనసాగించమని అన్నారు.

శ్రీవైష్ణవులు ఒంటరిగా రాకూడదు

వరందరుం పిళ్ళై అనే పేరుతో ఒక శ్రీవైష్ణవుడు, ఒకరోజు జీయర్ దివ్య తిరువడిని సెవించాలని ఆతృతతో ఒంటరిగా మఠానికి వచ్చి, జీయర్ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. జీయర్ అసంతృప్తి చెంది, “శ్రీవైష్ణవులు మరొక శ్రీవైష్ణవుని తోడు లేకుండా ఇలా ఒంటరిగా రాకూడదు” అని చెప్పి, ఆయనను స్వీకరించడానికి ముందు, మఠం బయట అరుగుపైన ఆరు నెలల పాటు కూర్చోమని ఆదేశించారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/14/yathindhra-pravana-prabhavam-59/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 58

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 57

జీయర్ వ్యాక్యానములు రచించుట

“భూత్వా భూయో వరవరమునిర్ భోగినాం సార్వభౌమ శ్రీమద్ రంగేవసతి విజయీ విశ్వసంరక్షణార్థం” (లోక సంక్షణ కొరకై ఆదిశేషుడు మణవాళ మామునిగా పునరవతారము చేసి శ్రీరంగంలో జీవిస్తున్నారు) అని చెప్పబడింది. లోక సంక్షణ కోసం భూలోకంలో అవతారం ఎత్తి నందున, సమస్త ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం, దయతో పిళ్ళై లోకాచార్యులు రచించిన రహస్య గ్రంథాలకు వ్యాఖ్యానాములు వ్రాయాలని తమ దివ్య మనస్సులో సంకల్పించారు.

రహస్యగ్రంథ తత్వేషు రమయామాస తత్ ప్రియం
వాక్యసంగతి వాక్యార్థ తాత్పర్యాణి యతాశృతం
వ్యాకుర్వన్నేవ పూర్వేషాం వర్తమానః పతేపతే
స్వమనీషాగతం నైవ కల్పయన్ కించిదప్యయం
గుప్తామ సర్వైర్ గురుత్వేన కూటానర్థాందీతిశత్
శృతిః స్మృతీతిహాసైశ్చ శృత్యంతైః పాంచరాత్రతః
దేశికానాం నిపందౄణాం దర్శయన్నేక కంటతాం
వాక్యాలంకార వాక్యాకి వ్యాచక్షాణో విచక్షణః
సిదీయః స్వాదయామాస స్వస్వరూపం సుదుర్గృహం

(మణవాళ మాముణులు మన పూర్వాచార్యులు అనుసరించిన పద్ధతులలో చిత్తశుద్దులై ఉన్నారు; అర్థాలతో కూడిన వాక్యములు, అప్పటి శ్లోకముల/సూత్రములు ఇప్పటి వాటి  మధ్య సంబంధం, ప్రతి పద అర్థాలు, భావాలు మొదలైనవి ఏవీ కూడా తమ నచ్చినట్టు అణువు మాత్రం కూడా జోడించకుండా, కేవలం ఆచార్యుల నుండి అభ్యసించిన వాటిని మాత్రమే దయాపూర్వకంగా వ్యాక్యానము చేసేవారు.) మన పూర్వాచార్యులు రహస్యంగా దాచి ఉంచిన విశేష అర్థాలను, వాటి గొప్ప తనం కారణంగా, కృపతో వీరు వెల్లడించారు. ఆ విధంగా, రహస్య గ్రంథాలపై రుచి ఉన్నవారు వాటి యథార్థాలను అనుభవించేలా చేసారు. అంతే కాకుండా, వేద వేదాంతములు (ఉపనిషత్తులు), స్మృతులు, ఇతిహాసములు (శ్రీ రామాయణం), శ్రీ పాంచరాత్రం, ఈ ప్రామాణిక గ్రంథాల ఆధారంగా విభిన్న గ్రంథాలను రచించిన పూర్వాచార్యుల ఏకాభిప్రాయాన్ని చూపించారు. నైపుణ్యతతో శ్రీవచన భూషణం శ్లోకాలకు వ్యాక్యానము వ్రాసారు. తద్వారా, అతి కఠినమైన ఆత్మస్వరూప జ్ఞానాన్ని జ్ఞానులు తెలుసుకొని అనుభవించి ఆనందించేలా చేసారు. ఆపై, దీన్ని దృష్టిలో ఉంచుకుని, తత్వ రహస్యముల వ్యాఖ్యానాలు రాయడం ప్రారంభించారు. వీరు రచించిన శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మహా ఉన్నతమైనది, అందరి మన్ననలు అందుకొని ప్రశంసించబడింది. వారు శ్రీవచన భూషణ మహిమను ధ్యానించి ఈ పశురాన్ని రచించారు.

సీర్వచనభూడణమాం దైవక్కుళిగై ప్పెఱ్ఱోం
పార్ తనై ప్పొన్నులగాప్పార్ క్క వల్లోం – తేరిల్ నమక్కు
ఒప్పార్ ఇని యార్ ఉలగాశిరియన్ అరుళ్
తప్పామల్ ఓదియపిన్ తాన్

(శ్రీవచన భూషణ దివ్య ప్రసాదాన్ని పొందిన కారణంగా ఈ సంసారాన్ని పరమపదంగా (శ్రీవైకుంఠం) చూడగలుగుతున్నాము. విశ్లేషిస్తే, పిళ్ళై లోకాచార్యుని దయను తెలుసుకున్న తరువాత, మనకు సమానులు ఎవరు అవుతారు?)

మామునిని వారు శిష్యులు స్తుతిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని రచించారు:

వాగ్భూషణం వకుళభూషణ శాస్త్రసారం యో మాదృశాంచ సుకమం వ్యవృణోద్దయాళుః
రమ్యోపయంతృమునయే యమినాం వరాయ తస్మై నమశ్శమదమాది గుణర్ణవాయ

(శమం (మనస్సుపై నియంత్రణ), దమం (పంచేంద్రియాలపై నియంత్రణ) వంటి మంగళ గుణ సాగరుడైన మణవాళ మాముణులు, వకుళ మాలను ధరించే నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయ్మొళి సారమైన శ్రీవచన భూషణానికి వ్యాఖ్యానాన్ని మావంటి మందబుద్ధులకు కూడా అర్థమైయ్యేటట్టుగా కరుణాపూర్వకంగా అందించిన వారిని నమస్కరిస్తున్నాము.)

అనంతరం, మణవాళ మాముణులు శ్రీవచన భూషణానికి పునాది వంటిది, చరమ పర్వ నిష్ఠ (ఆచార్య నిష్ఠ అత్యున్నతమైన సాధనము) ని విపులంగా వివరించే ఇరామానుస నూఱ్ఱందాది వ్యాఖ్యానం వ్రాసారు. అలాగే జ్ఞాన సారం, ప్రమేయ సారం (రామానుజుల శిష్యుడు అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ గ్రంథాలకు) వ్యాక్యానము వ్రాసారు. తిరువాయ్మొళి మొదలైన దివ్య ప్రబంధాలకు మునుపు ఎన్నడూ లేని రీతిలో ప్రచారం చేసి కీర్తిని చేకూర్చారు. ఆ సమయంలో, మాముణుల శిష్యులు తిరువాయ్మొళి గురించిన ఒక ప్రబంధాన్ని రచించమని అభ్యర్థించగా, వారు తిరువాయ్మొళి నూఱ్ఱందాదిని అనుగ్రహించారు. తత్వత్రయం (పిళ్లై లోకాచార్యుల రహస్యం గ్రంథము), ఈడు ( తిరువాయ్మొళికి నంపిళ్లై వ్రాసిన వ్యాఖ్యానం) లకు ప్రమాణత్తిరట్టు (ప్రబంధముల సంగ్రహం) ని కూడా తయారు చేశారు. వారు దర్శనార్థాల ఉపదేశాలందించిన  ఆచార్యుల క్రమణికను విపులంగా వివరిస్తూ దయతో ‘ఉపదేశ రత్నమాల’ ని కూడా రచించారు. ‘ఉడయవర్ల నిత్యం’ (తిరువారాధన క్రమము) గురించి క్లుప్తంగా వివరణ వ్రాసారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/13/yathindhra-pravana-prabhavam-58/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 57

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 56

మాముణులు, అప్పిళ్ళై అప్పిళ్ళార్లను ఆహ్వానించుటకు వానమామలై జీయరుతో కొంత మంది శ్రీవైష్ణవులను పంపారు. వీరు బయలుదేరే ముందే, అప్పిళ్ళారుకి వీరు వస్తున్నారని కబురు పంపించారు. వానమామలై జీయర్ తమ బృందంతో వస్తుండగా చూసి, అప్పిళ్ళార్ లేచి, వాళ్ళు వస్తున్న దిశవైపు సాష్టాంగలు చేసి, అంజలి ఘటించారు. తమకు అతి ప్రియమైన ఒక ఆకుపచ్చ శాలువను ఇద్దరు శ్రీవైష్ణవులకిచ్చి, “వాళ్ళు వచ్చే దారిలో ఈ శాలువను పరవండి. శ్రీవైష్ణవులందరూ దానిపై తమ పాదాలు మోపిన పిదప, శ్రీపాదధూళిని శాలువలో సేకరించి జాగ్రత్తగా తీసుకురండి” అని పంపారు. ఒక పళ్ళెంలో తమలపాకులు మరొక పళ్ళెంలో పండ్లను సిద్ధం చేసి, ఎఱుంబి అప్పా సమక్షంలో వానమామలై జీయర్ల శ్రీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. తమ బంధువులను వానమామలై జీయర్‌ కు పరిచయం చేసి, వారందరినీ ఉద్ధరించమని అభ్యరించారు. తరువాత ఆ శ్రీవైష్ణవులు తెచ్చిన శ్రీపాదధూళిని స్వీకరించి, తమ బంధువులందరి నుదుట పూసారు. జీయర్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న తరువాత, ఈ విశాల గోష్టి కందాడై అణ్ణన్ తిరుమాలిగ వైపు ముందుకి సాగారు. అణ్ణన్ గౌరవ మర్యాదలతో వారందరికి స్వాగతం పలికి, తమ తిరుమాలిగలోకి తీసుకెళ్లి, తాను మునుపు ఎలా ఉండేవారో, ఎమ్పెరుమానార్ల కృపతో ఎలా గొప్ప ఫలాన్ని పొందారో వారికి వివరించారు. ఆ తర్వాత అణ్ణన్ కరుణాపూర్వకంగా వారికి ఒక ఉపన్యాసం ద్వారా, మాముణులు ఎవరో కాదు రామానుజుల పునరతారమని తెలియజేసారు. అనేక నివేదనలు, పండ్లు, పట్టు పరియట్టం (తలపాగ) మొదలైనవన్నీ తీసుకుని, అప్పిళ్ళై అప్పిళ్ళార్లు జీయర్ మఠానికి వెళ్ళారు. జీయర్ తిరుమలైయాళ్వార్లో శ్రీవైష్ణవ గోష్టిలో ఉన్నారని వీరికి తిలిసింది.

మునుపు ఎప్పుడూ కని విని ఎరుగని ఛాయ, దృఢమైన భుజాలు, విశాలమైన వక్ష స్థలం, విశాలమైన నుదురు, దివ్య తేజముతో నిండిన నేత్రాలు, కుడిచేతిలో త్రిదండం పట్టుకుని, కాషాయ వస్త్రాలను ధరించిన జీయరుని చూసి అవాక్కై అప్పిళ్ళై ,అప్పిళ్ళార్ ఇద్దరూ జీయర్ ఎదుట సాష్టాంగము చేసి, భక్తిపూర్వకంగా నమస్కరించి, వారు తెచ్చిన నివేదనలను వారికి సమర్పించారు. జీయర్ వారి నివేదనలను స్వీకరించి, వారి జ్ఞాన స్థాయికి తగిన విధంగా తత్వపరం (పర స్వరూపం, ఎమ్పెరుమాన్) పై ఉపన్యాసం ఇచ్చారు. వాళ్ళు ఏ సంకోచం లేకుండా పూర్ణ సమర్పణతో, సమాశ్రయణం అనుగ్రహించమని విన్నపించారు. జీయర్ వాళ్ళకి పంచ సంస్కార విధిలోని తాపః, పుండ్రః మొదలైన ప్రక్రియలను వాళ్ళకు నిర్వహించారు, వాళ్ళతో పాటు ఆలయానికి వెళ్లి, తాము ప్రతి నిత్యం సేవించే క్రమంలో వివిధ సన్నిధిలకు వెళ్ళి మంగళాశాసనాలను నిర్వహించి, మఠానికి తిరిగి వచ్చిన పిదప వాళ్ళకు తదీయారాధన సేవ జరిగింది. జీయర్ తన ఉచ్చిష్టం (తాను భుజించిన ఆహార అవశేషాలు) ను అప్పిళ్ళై అప్పిళ్ళార్లకు ప్రసాదించి, తన దివ్య శ్రీ పాదాలకు ఆంతరంగికులుగా చేసి, వారిని ఉద్ధరించారు. ఎఱుంబి అప్పా తండ్రి గారు, అప్పాని చూడాలని కోరికగా ఉన్నట్లు సందేశం పంపారు. అప్పా భారీ మనస్సుతో ఎఱుంబికి వెళ్ళ వలసి వచ్చింది.

ఉత్తమ నంబిని సంస్కరించిన పెరియ పెరుమాళ్

ఒకరోజు, జీయర్ పెరియ పెరుమాళ్ళకు మంగళాశాసనము చేసేందుకు గుడికి వెళుతున్నారు. అది తిరువారాధన సమయం, ఏకాంతంలో (భక్తులు లేకుండా) నిర్వహించాల్సిన సేవ, అందుకని తెర వేసి ఉంచారు. జీయర్ లోపలికి వెళ్లి పెరియ పెరుమాళ్ళకు సేవ చేస్తున్నారు. ఉత్తమ నంబి వింజామర సేవ చేస్తున్నారు. అతను పాల వంటి తెల్లని దివ్య స్వరూపంతో ఉన్న జీయరుని చూసి, తమ దుష్కర్మచే ప్రేరితుడై, “లోపల ఎక్కువ సేపు ఉండకండి” అని గట్టిగా అన్నారు. నంబి ప్రవర్తనకి కారణం ఏమిటో ఎరిగిన జీయర్, “మహాప్రసాదం” అని చెప్పి సన్నిధి నుండి వెళ్లిపోయారు. వెంటనే, పెరుమాళ్ళకు ఆలవట్ట కైంకర్యం (వింజామర సేవ) చేస్తున్న ఉత్తమ నంబి, మైకం ఆవహించినట్లు తలుపుకి ఆనుకుని నిద్రలీకి జారుకున్నారు. అతనికి స్వప్నంలో ఆదిశేషునిపైన శయనించిన పెరియ పెరుమాళ్ళు, చిరుమందహాసంతో ఎర్రటి దివ్య అధరములు, స్పష్ఠమైన శ్వేత వర్ణంలో ఉన్న ఆదిశేషునికి చూపిస్తూ “ఆ ఆదిశేషుడే జీయరుగా అవతరించినాడని తెలుసుకో. అతని రంగు తెల్లనిది; వారితో వినయంగా ప్రవర్తించుము.” అని ఆదేశించాడు. ఉత్తమ నంబి అకస్మాత్తుగా మేల్కొని చూసినది ఏమిటో గ్రహించాడు, భయపడ్డాడు. వెంటనే మఠానికి పరుగెత్తుకొని వెళ్ళి జీయర్ పాదాలకు సాష్టాంగము చేశాడు. జీయర్ వెళ్లిన తర్వాత సన్నిధిలో జరిగిన సంఘటన గురించి జీయరుకు వివరించి, తన అసభ్య ప్రవర్తనకు క్షమాపణలు వేడుకున్నారు. నంబి జీయర్ పాదాలకు విశ్వాసపాత్రుడుగా పరివర్తనం పొందాడు. తరువాతి కాలంలో “అనంత ఆళ్వాన్ (ఆదిశేషన్) మణవాళ మాముణిగా అవతరించారని శ్రీరంగనాధుని తప్పా మరెవరికి తెలుసు?” అని అందరూ అనవచ్చు.

ఒక సాత్విక మహిళకు తమ నిజ స్వరూపంలో దర్శనమిచ్చిన జీయర్

మఠంలో అనేక స్థ్రీలు, మఠం శుభ్రం చేయడం మొదలైన పనులు చేస్తుండేవారు. వారిలో ఒక శఠకోపక్కొఱ్ఱి అనే పెరుతో ఒక మహిళ ఉండేది. ఆమె ఆచ్చి (తిరుమంజన అప్పా తిరుకుమార్తె) వద్ద నాలాయిర దివ్య ప్రబంధం, రహస్యార్థాలు నేర్చుకుంది. ఒకరోజు, మధ్యాహ్నం శ్రీవైష్ణవ గోష్ఠి ముగిసిన తర్వాత, జీయర్ ఎంబెరుమానుని తిరుక్కాప్పు (కోయిల్ ఆళ్వార్ తలుపులు తెరిచి) సమర్పించి, పూర్తి ఏకాంతంలో భగవానుని ధ్యానం చేస్తున్నారు. శఠకోపక్కొఱ్ఱి అనే మహిళ ద్వారం మెట్టు మీద నుండి జీయరుని చుసి, వారు వేయి పడగలతో ఆదిశేషుని రూపంలో ఉండటం ఆమె దర్శించింది. ఈ దృశ్యాన్ని చూసి ఆమె అత్యాశ్చర్యపోయింది. ఇది గమనించిన జీయర్ తిరుక్కాప్పు పూర్తి చేసుకొని, తన దివ్య ముఖంలో చిరునవ్వుతో బయటకు వచ్చి, ఏమి జరిగిందని ఆమెను అడిగారు. ఆమె తాను చూసిన ఘట్టాన్ని వారికి వివరించింది. “ఈ విషయాన్ని ఎవరికీ తెలియనీయ వద్దు” అని జీయర్ ఆమెను ఆదేశించారు. అలా, జీయర్ ఒక విశేష అవతారమని అందరికీ అర్థమైంది.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/12/yathindhra-pravana-prabhavam-57/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 56

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 55

జీయర్ తిరువడిని ఆశ్రయించిన అప్పిళ్ళై, అప్పిళ్ళార్

ఏడు గోత్రాలను క్రమబద్దీకరణ చేసిన పిమ్మట, ఎఱుంబి అప్పా తమ స్వస్థలం ఎఱుంబికి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. కానీ అపశకునాలు ఎదురైయ్యాయి. అప్పా జీయర్ వాద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసారు. వారు ఆనందంతో, “ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరగాలి. నీవు మరో మంచి రోజు చూసి వెళ్ళుము” అని అన్నారు. అక్కడున్న కొందరు ప్రముఖులు ఇది విని “మహాద్భుత సంఘటన సంభవించబోతున్నదట” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అయితే అది ఏమిటో ఎవరికీ తెలియదు.

కొద్ది రోజులు గడిచాక, పెరుమాళ్ళను సేవించుకొనుటకు అప్పిళ్ళై, అప్పిళ్ళార్ ఇరువురు వారి వారి సపరివార సమేతంగా విచ్చేసారు. జీయర్ తిరువడి పట్ల అంతగా వారిని భక్తి లేదు. రెండు రోజుల పాటు వారు కావేరి ఒడ్డున ఉండి, జీయర్ అనుష్టానాలు, వాక్ నైపుణ్యాన్ని విశ్లేషిస్తున్నారు. కందాడై అణ్ణన్, వారి వంశస్తులందరూ జీయర్ తిరువడి సంబంధం ఎలా పొందారని, ఇది ఎలా సంభవించిందని ఆశ్చర్యపోయారు. అప్పిళ్ళారుని అప్పిళ్ళై పిలిచి “ఇది జరిగిందంటారా?” అని అవాక్కైపోయారు. అప్పిళ్ళార్ అతనితో “ఎఱుంబి అప్పా సర్వ శాస్త్ర నిపుణులు. మహా అసాధారణమైన ఆచార్యశీలుడు (నిర్దేశిత కర్మలని నిష్టగా ఆచరించువాడు). అతను ఇలా చేసి ఉండడు. వెళ్లి విచారిద్దాము.” అని నిశ్చయించుకున్నారు. అప్పిళ్ళార్ జీయర్ మఠం దగ్గరికి వెళ్లి, తమకు అత్యంత సన్నిహితుడు, సమర్థుడైన ఒక వ్యక్తితో ఇలా అన్నారు: “వెళ్లి అప్పిళ్ళార్ వచ్చారని చెప్పండి. ఒక వేళ ఎఱుంబి అప్పా అక్కడ ఉంటే, వెంటనే వస్తాడు. అక్కడ ఇంకెవరైనా ఉంటే, ‘అప్పిళ్ళార్ ఎవరు?’ అని అడుగుతారు.” అని చెప్పి లోనికి పంపారు. ఆ వ్యక్తి ఎఱుంబి అప్పా ఎవరో కనుక్కుని అతని ఎదుట సాష్టాంగము చేసి అప్పిళ్ళార్ వీధిలో ఎదురుచూస్తున్నారని, తమ రాక కబురు దేవరి వారికి తెలియజేయమని అడియేనుని వారు పంపారని సందేశాన్ని అందించారు. అది విన్న ఎఱుంబి అప్పా ఎంతో సంతోషించి, “ఇది మంచి సమయం” అని చెప్పి అప్పిళ్ళార్ ను వెంటనే కలుసుకోడానికి వెళ్ళారు. ఎఱుంబి అప్పా భుజాలపై శంఖ చక్ర లాంఛన ముద్రలను అప్పిళ్ళార్ గమనించారు. అర్థం చేసుకుని ఎఱుంబి అప్పా ఎదుట సాష్టాంగం చేసారు. ఎఱుంబి అప్పా అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, ఒక ఇంటి అరుగుపైన అప్పిళ్ళార్ తో కలిసి కూర్చొని, పెరుమాళ్ తనిని ఉద్ధరించడానికి, జీయర్ తిరువడి సంబంధం పొందేల ఎలా నడిపించాడో అప్పిళ్ళార్ కు వివరించారు. ఇది విన్న తర్వాత అప్పిళ్ళార్ కు విషయం ఏమిటో స్పష్టమైంది. తాము ఉద్ధరింప బడాలన్న కోరికతో, అప్పిళ్ళైతో పాటు మరికొందరు దివ్య కావేరి ఒడ్డున విడిది చేస్తున్నారని ఎఱుంబి అప్పాకి చెప్పి, దయతో అక్కడికి రావాలని ఎఱుంబి అప్పాని అభ్యర్థించారు. ఎఱుంబి అప్పా మఠానికి తిరిగి వచ్చి, జరిగిన సంఘటన గురించి వానమామలై జీయరుకి వివరించి, “వాళ్ళని సరిదిద్ది తీసుకురావడానికి అడియేనుపై దేవారి వారు కరుణ కురిపించారలి” అని విన్నపించారు. ఆ తరువాత వారు అప్పిళ్ళార్ తో కలిసి కావేరి ఒడ్డుకి వెళ్ళారు. అప్పిళ్ళైని కలుసుకుని ఆప్యాయంగా మాట్లాడి, సత్ సూచనలను వారితో పంచుకొని, అతనిలో భక్తి ఉత్సాహం పెంపొందేలా చేసారు. ఇంతలో, వానమామలై జీయర్ పెరియ జీయర్ (మణవాళ మాముణులు) ఉన్న చోటికి వెళ్లి “అప్పిళ్ళై, అప్పిళ్ళార్, కొందరు ప్రముఖులు కావేరి ఒడ్డున బస చేసి ఉన్నారు. సాత్విక సంభాషణంపై వివరణలు కొంత ఇప్పడికే అందుకున్నారు. ఎఱుంబి అప్పా ఇప్పుడే అక్కడికి వెళ్ళారు. ఆచార్య సత్ సంబంధం పొందడానికి జరగాల్సినవన్నీ జరిగాయి. వాళ్ళు దేవరి వారి తిరువడి సంబంధం పొందుతారని ఖచ్చితంగా చెప్పవచ్చు. దేవరి వారి మనస్సు ఎప్పుడూ ‘ఆత్మలాభాత్ పరం కించిధన్యత్ నస్తి’ (ఆత్మను ధర్మ మార్గంలో నడిపింపజేయడమే మహోపకారం, మరేవీకావు) అని భావించును కదా? పెరుమాళ్ళకు శిష్యుడి మధ్య ఉపకారకుడు ఆచార్యుడు అని కూడా చెప్పబడింది. ఎఱుంబి అప్పా మరియు అడియేన్ కోరిక నెరవేరాలని దేవరి వారు ఆశీర్వదించాలి” అని అన్నారు. జీయర్ దయతో ఇలా అన్నారు “ఎమ్పెరుమానార్ (రామానుజులు) దివ్య సంకల్పం ఇదే; వాళ్ళల్లో ఒకరికి ఎమ్పెరుమానార్ దివ్య నామం ఉంది” అని అన్నారు. వానమామలై జీయర్ ఈ విషయం విని ఎంతో సంతోషించి,“ ఆడియేన్‌ ఎదురెళ్లి వారికి స్వాగతించుటకు దేవరి వారు అనుమతించాలి” అని జీయరుని ప్రార్థించారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/11/yathindhra-pravana-prabhavam-56/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 55

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 54

ఎఱుంబి అప్పా అక్కడ ఉన్నంత కాలం, ఈ శ్లోకములో చెప్పిన విధంగా…

ఇత్తం ధినే ధినే కుర్వన్వృత్తిం పద్యుః ప్రసాధినీం
కృతీర్ కడాపదం చక్రే ప్రక్తనీం తత్ర వర్తనీం
ఇత్తం ధినే ధినే కుర్వన్ విరుత్తం భర్తుః ప్రసాధినీం
కృతి కణ్టా పదఞ్జచక్రే ప్రాక్తనీం తత్ర వర్తనీం

(ఈ విధంగా, సన్నిధిలో [తిరుమలైయాళ్వార్] కైంకర్యం చేస్తూ, తమ ఆచార్యులైన మణవాళ మాముణుల దివ్య మనస్సుని ప్రసన్న పరచే కైంకర్యములను నిత్యం నిర్వహిస్తూ, దినచర్యను (మణవాళ మాముణుల నిత్య దినచర్య వివరణ) కృపచేసి, అక్కడ నిత్యం అందరూ పఠించేలా చేశారు. మహా రాజు రహదారిలా ప్రసిద్ధికెక్కించారు.

వరవరమునిర్ పాదయుగ్మం వరదగురోః కరపల్లవ ద్వయనే
రహసి శీరసిమే నిధీయమానం మనసినిదమ్య నిధానవాన్ భవామి

(కందాడై అణ్ణన్ తమ లేత హస్థములతో మణవాళ మాముణుల పాదపద్మములను తమ శిరస్సుపై ఉంచుకునే ఆ దృష్యాన్ని స్మరణ చేస్తూ జీవించుటకు శక్తిని పొందుతున్నాను), తమ దివ్య చరణాలను అణ్ణన్ కు సమర్పించి “మీ స్వస్థలానికి వెళ్లండి” అని అన్నారు. అప్పా బాధతో ఎఱుంబికి బయలుదేరారు.

నాయనార్ ఏడు గొత్రాలను క్రమపచుట

అప్పా ఎఱుంబికి బయలుదేరే ముందు, శ్రీరంగంలో ఒక సంఘటన జరిగింది. అప్పాకి సంబంధించిన కందాడై ఆండాన్ సంబంధీకులు (అత్తవారి తరపున వారు) కొందరు, కందాడై నాయన్ ధర్మ పత్నిని ఆమె పుట్టింటి నుండి కందాడై ఆండాన్ తిరుమాలిగకి తీసుకువచ్చారు. వారు ఆమెను సరైన వాహనంలో తీసుకురాకపోవడం చూసి అప్పా బాధపడి, జీయరుతో తమ బాధను పంచుకున్నారు. జీయర్ కూడా దుఃఖపడ్డారు. వారు కందాడై అణ్ణన్ ను పిలిచి ఇది సరి కాదు, వారిని త్యజించడం మంచిదని అన్నారు. “వారి స్వరూపమును గురించి వారికి ఉపదేశించ గలమా?” అని కోరారు. “వారు ఎంబా దగ్గరి బంధువులు, అహంకారులు” అని అణ్ణన్ బదులిచ్చారు. “అలాగైతే, ఇక మనం ఆలోచించ వద్దు” అని పలికి, కందాడై ఆండానుతో పాటు వారి బంధువులను, ముదలియాండాన్ వంశస్థులను పిలిచి, వారికి శాస్త్ర సూచనలను ఉపదేశించి వారిపై తమ కరుణను కురిపించారు. తరువాత వారికి ఒక శాస్త్ర విధి గురించి వివరణ ఇచ్చారు. వాదూల గోత్రం (ముదలియాండాన్ వారి గోత్రం), హారీత గోత్రం (రామానుజుల వారి గోత్రం) వాళ్ళు, వారి వారసులు 7 గోత్రాల (వాదూల, శ్రీవత్స, కౌండిన్య, హారీత, ఆత్రేయ, కౌశిక, భారద్వాజ) వారిని మాత్రమే వివాహం చేసుకోవాలని వివరించారు. తమ ఈ నియమావళికి సంబంధించిన ఒక వ్రాత పత్రం తయారు చేసి, తిరుమంగై మన్నన్ తిరుమాలిగ (తిరుమంగై ఆళ్వార్ల దివ్య నివాసం) లో ఒక ఫలకాన్ని తయారు చేసి, ఈ గోత్రాలకు చెందిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నరో ఆయా ప్రాంతాలకు సందేశాన్ని పంపారు. ఈ చర్యతో ఎఱుంబి అప్పా సంతోషించేలా చేసారు. ఈ సమయంలో, వారి దివ్య తిరువడి పట్ల ప్రతికూలంగా ఉండేవారందరూ, వారి గురించి చెడుగా మాట్లాడేవారందరూ, పేదరికంతో బాధపడుతూ తమ జీవితాలను వృధా చేసుకున్నారు.

ఒక రోజు, జీయర్ తమ శిష్యులతో  “ఆలిన్మేలాల్ అమర్ న్దాన్ అడియిణైగళే” అనే పాశురం గురించి చర్చిస్తున్నారు; ‘ఆల్’ అనే పదం రెండు చోట్ల వస్తుంది. ఆ పదం ఒక సారి మర్రి చెట్టును, మరొక సారి లేత మర్రి ఆకుని సూచిస్తుందని వారు చర్చించుకుంటున్నారు. కానీ జీయర్ దయతో, ‘ఆల్’ అనే పదం ఆకును సూచించదని అన్నారు. అదే సమయంలో, ఆడుతూ పాడుతూ చిన్నపిల్లలా కనిపించే కందడై నాయన్, “ఓ జీయార్! ఆలంగట్టి (వడగళ్ల వాన) ని సూచిస్తుందా?” అని తమాషాగా అన్నాడు. వెంటనే, జీయర్ అతన్ని పిలిచి తన ఒడిలోకి తీసుకుని, “నీవు పూజ్యనీయమైన వంశానికి చెందినవాడవు కదా?” అని అడిగారు. అతనిని దర్శన ప్రవర్తకుడు (రామానుజ సిద్ధాంతానికి నాయకుడు) కామని ఆశీర్వదించారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/10/yathindhra-pravana-prabhavam-55/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 54

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 53

అనంతరం, ఈ శ్లోకములో చెప్పినట్లుగా మాముణులు…..

తతః సజమూలజీతశ్యామ కోమలవిగ్రహే
పీతకౌశేయసం విధే పీనవృత్త చతుర్భుజే
శంఖచక్ర గదాధరే తుంగ రత్న విభూషణే
కమలా కౌస్తుభోరస్కే విమలాయత లోచనే
అపరాధసహే నిత్యం దహరాకాశ గోచరే
రేమేధామ్ని యథాకాశం యుజ్ఞానోధ్యాన సంపదా
సతత్ర నిశ్చలం చేతః చిరేణ వినివర్తయన్

(నల్లని మేఘ వర్ణుడు, అతి సౌందర్యవంతుడు, పట్టు పీతాంబరం ధరించి, తమ దివ్య చతుర్భుజాలలో శంఖం, చక్రం, గదా మొదలైన దివ్యాయుధాలను ధరించి, అరుదైన రత్నాభరణాలతో అలంకృతుడై, వక్షస్థలములో పిరాట్టి, కౌస్తుభ మణి భూషితుడై, మచ్చలేని విశాల దివ్య నేత్రాలు కలిగి, తన భక్తుల అపరాధాలను క్షమించి సహిస్తూ, చేతనుల హృదయాలలో ఆనందంగా నివాసుడై ఉన్న పరమ ప్రాప్య పరమ పురుషునితో మాముణులు ఐక్యమై తమ ధ్యాన సమృద్ధి ద్వారా ధ్యానిస్తున్నారు. ఇలా సంతోషంగా ఉండే మాముణులు, సమయం దొరికినప్పుడల్లా, ఆ పెరుమాళ్ళతో ఐక్యమై సుస్థిరంగా ఉన్న తమ దివ్య మనస్సుని మరలా తిరిగి తెచ్చుకునేవారు). తమ అంతర్యామితో సుస్థిరంగా మునిగి ఉన్న తమ దివ్య మనస్సుని తిరిగి తెచ్చుకునేవారు. అనంతరం తమ దివ్య మనస్సుని యతీంద్రుల (రామానుజులు) భక్తిలో లీనం చేసేవారు. లీనం చేసి యతిరాజ వింశతి (రామానుజులపై మాముణులు కూర్చిన ఇరవై శ్లోకాలు) పఠించేవారు; ఆ తర్వాత శ్రీ వచన భూషణం (పిళ్ళై లోకాచార్యులు స్వరపరిచిన దివ్య ప్రబంధం) పై వ్యాక్యానించేవారు. సాయంత్రం వేళ కూడా, వారు మధ్యాహ్నం నిర్వహించిన అన్ని అనుష్టానామాలను అనుసరించి, సన్నిధికి తిరిగి వెళ్లి, తిరుప్పల్లాండు (నాలాయీర దివ్య ప్రబంధంలో పఠించాల్సిన మొదటి పాశురములు) సేవించి, మంగళాశాసనములు సమర్పించుకుని ఈ క్రింది శ్లోకములో పేర్కొన్నట్లుగా శయనించుటకు సిద్ధమైయ్యేవారు.

తతః కనకపర్యంకే తరుణ ధ్యుమణిధ్యుతౌ
రత్నదీపద్వయోతస్త మహతః స్తోమస మేదినే
సోపదానే సుఖాసీనం సుకుమారే వరాసనే
అనంతహృదయైర్ తన్యైర్ అంతరంగైర్ నిరంతరం
శుశృషమాణైః శుచిబిః ద్విద్రైర్భృత్యైః ఉపాసితం
ప్రాచాం ఆచార్యవర్యాణాం సూక్తివృత్యనువర్ణనైః
వ్యాచక్షాణాం పరంతత్వం వక్తం మందతియామపి

(మాముణులు తప్పా మరే ఇతర ధ్యాస లేని, ఇద్దరు ముగ్గురు అంతరంగ శిష్యులతో నిరాటకంగా సేవలందుకునే మాముణులు, సూర్యకాంతి వలె మెరిసే రెండు మాణిక్య దీప కాంతుల మధ్య మేలిమి బంగారంతో చేసిన అందమైన మంచంపైన, మృదువైన ఒరుగుదిండ్లతో అలంకరించి ఉన్న ఆసనంపై ఆసీనులై కృపతో పూర్వాచార్యుల దివ్య వ్యాక్యానాలను అతి సరళంగా జ్ఞానములేని వ్యక్తులకు కూడా అర్థమైయ్యే విధంగా వివరించేవారు), తమ దివ్య విశ్రాంతి గదిలోకి ప్రవేశించి, మంచంపైన పడుకొని పూర్వాచార్యుల బోధమనుష్టానములను (వారు బోధించి ఆచరించిన) వివరించేవారు. అటువంటి లోతైన వివరణలను ఆస్వాదిస్తూ, అదే సమయంలో మాముణుల సంరక్షణ గురించి అక్కరలేని చింత చేస్తూ, వారి అంతరంగ శిష్యులు వారిని కీర్తించేవారు.

మంగళం రమ్యజామాతృ మునివర్యాయ మంగళం
మంగళం పన్నకేంద్రాయ మర్త్యరూపాయ మంగళం
ఏవం మంగళవానీపిరేనం సాగ్యలి పంతనాః
సకృత్య సంప్రసీదంతం ప్రనేముః ప్రేమ నిర్భరాః

(ఆచార్యోత్తముడైన మణవాళ మాముణులకు శుభం జరగాలి; మణవాళ మాముణుల స్వరూపంలో అవతరించిన ఆదిశేషునికి శుభం జరగాలి; చేతులు జోడించి ఇలా భక్తితో నమస్కరించి మంగళం పాడిన తమ శిష్యుల అరాధనలను మణవాళ మాముణులు సంతోషంగా స్వీకరించారు). ఉప్పొంగుతున్న భక్తితో శిష్యులు రెండు చేతులు జోడించి అంజలి ముద్రలో వారి ఎదుట సాష్టాంగములు సమర్పించారు. ఈ క్రింది శ్లోకములో చెప్పినట్లు, ఇక సెలవు తీసుకోండని వారికి అనుమతి ఇచ్చారు.

తతః సజ్జీకురుతం బృత్యైః శయనీయం విభూషయన్
యుయోజ హృదయం ధామ్ని యోగిత్యేయ పదద్వయే

(తరువాత తమ శిష్యులు సిద్ధం చేసిన పరుపుపై ​​పడుకుని, పరమ యోగులు ధ్యానించే ఆ పరమ పురుషుని దివ్య పాదాలపై తమ మనస్సును ఉంచారు), భగావానునికి పరుపుగా ఉన్న మణవాళ మాముణులు, స్వయంగా తాను ఒక పరుపు మంచం మీద పడుకున్నారు. నిద్రకి సిద్ధమవుతూ, శ్వేత వర్ణుడైన ఆదిశేషునిపై ఆశ్రయించి ఉన్న వాని దివ్య తిరువడి యందు తమ దివ్య మనస్సును ఉంచారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/07/yathindhra-pravana-prabhavam-54/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 53

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 52

అనంతరము, ఈ శ్లోకంలో చెప్పినట్లుగా …

అయంపున స్వయంవ్యక్త అనవతారాన్ అనుత్తమాం
నిధాయ హృదినీరంతరం నిధ్యాయన్ ప్రతభుద్యత
విశేషేణే సిషేవేచ శేషభోగ విభూషణం
అమేయమాత్ ఇమంధానం రమేశం రంగశాయినం
ధ్యానం ధ్యానం వపుస్తస్య పాయం పాయం దయోదతిం
కాయం కాయం గుణానుచ్చైః సోయం తద్భూయసాన్వభూత్

(స్వయంవ్యక్త స్వరూపాలైన అర్చావతారములను మణవాళ మాముణులు ధ్యానం చేస్తూ తమ దివ్య నేత్రాలను తెరిచారు. ఆదిశేషునిపై దివ్య అలంకారభూషితుడై శ్రీరంగంలో శయనించి ఉన్న దివ్య తేజోమయుడైన శ్రీయఃపతిని పూర్తిగా ధ్యానించారు. ఆ శ్రీరంగనాధుని దివ్య స్వరూపాన్ని, సాగరంలా ఉన్న ఆతడి కరుణను, మంగళ గుణాలను ధ్యానిస్తూ, మాముణులు పదే పదే ఆతడి దివ్య ప్రకాశాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నారు), సమస్థ అర్చా మూర్తులకు మూలమైన పెరియ పెరుమాళ్ళ విగ్రహ స్వరూపాన్ని, గుణాలను ధ్యానించారు. వారు యతీంద్రుల (రామానుజులు) తిరువడి భక్తిలో మునిగి స్నానం చేసారు. సర్వేశ్వరుని పట్ల భక్తికి, యతీంద్రుల పట్ల ఉన్న భక్తి ప్రపత్తులు సరిహద్దు రేఖ వంటిదని చెప్పబడింది. తమ స్నానం తర్వాత, నిత్యానుష్టానం, ఊర్ధ్వపుండ్రములను ధరించి, పారతంత్రియానికి నిదర్శనంగా తమ తిరువారాధాన పెరుమాళ్ళు శ్రీ రంగనాధునికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ క్రింది శ్లోకములో వివరించబడింది.

ఆత్మస్వరూప యాతాత్మ్యం ఆచార్యధీన దైవయత్
ఆమ్నాయానాం రహస్యంత తకిలేభ్యః ప్రకాశయన్
సర్వం యతిపదేరేవ కుర్వన్నాదేశ పూర్వకం
కృత్యాకృత్యేషు కర్తృత్వం కృతీకిమపి నస్పృశన్
తదస్తస్య ముఖోల్లాసం చికీర్షన్నేవ కేవలం

(మణవాళ మాముణులు తమ కర్మను ఆచరిస్తున్నానని ఎటువంటి ఆలోచన లేకుండా, యతీంద్రుల శ్రీముఖంలో ఆనంద భావాన్ని ఆశించి తమ కార్యాన్ని సాగించారు, [మరో మాటలో చెప్పాలంటే, చేసే కార్యముపై కర్తృత్వ భావము లేకుండా]; ఇది వారి ఆచార్య పారతంత్ర్యం (తమ ఆచార్యునిపై పూర్తిగా ఆధారపడి ఉండటం) గుణాన్ని వ్యక్తపరుస్తుంది. ఇది నిజమైన ఆత్మస్వరూప లక్షణం, వేదాలలో పరిపూర్ణంగా పేర్కొనబడింది.

అనంతరం వారు సన్నిధిస్తంభమూలభూషణం (సన్నిధిలోని స్థంభానికి దగ్గరగా ఆసీనులై ఆ చోటిని అలంకరించడం) లా తిరుమలైయాళ్వార్ [ఉపన్యాస మండపం]లోకి ప్రవేశించారు.

కందాడై అణ్ణన్ పురుషకారంతో ఎఱుంబి అప్పా మాముణులకు తమ కోరికను ఇలా వ్యక్తం చేశారు, “దయచేసి దేవరి వారి పాదాల యందు అడియేనుకి ఆశ్రయం ఇవ్వండి” అని విన్నపించారు. మాముణులు అతని కోరికను అంగీకరించి, వారికి పంచసంస్కారములను అనుగ్రహించి, మాముణులు తమ దివ్య తిరువడిని అప్పా శిరస్సుపై అలంకరించి, తమ విశిష్ట కృపను వారిపైన కురిపించారు. ఎఱుంబి అప్పాకు మంగళాశాసనమౌతుందని తమ మనస్సులో సంకల్పించుకుని, అతనికి మంత్రరత్నం (ద్వయం) వివరించి, తమ ఆంతరంగకుడిగా చేసుకుని, పెరుమాళ్లకు మంగళాశాసనం చేసేందుకు ఆలయానికి వెళ్లారు. నాన్ముగన్ తిరుక్కోపురం ముందు సాష్టాంగం చేసి, ఈ శ్లోకంలో పేర్కొన్న క్రమంలో సన్నిధిలను సేవిస్తూ ఆలయంలోకి ప్రవేశించారు.

దేవీగోదా యతిపతి శటద్వేషిణౌ రంగశృంగం
సేనానాథో విహగవృషబః శ్రీనిధిః సింధు కన్యాః
భూమానీళా గురుజనవృతః పురుషశ్చేత్యమీషాం
అగ్రేనిత్యం వరవరమునేరంగ్రియుగ్మం ప్రపద్యే

(ఆండాళ్, ఎంబెరుమానార్, నమ్మాళ్వార్, శ్రీరంగ విమానం, విష్వక్సేనులు, గరుడ, శ్రీ రంగనాధుడు, శ్రీ రంగ నాచ్చియార్, భూమి దేవి, నీళా దేవి, ఆళ్వార్లు చుట్టూ వ్యాపించి ఉన్న పరమపదనాధునికి మంగళాశాసనాన్ని నిర్వహించే మణవాళ మాముణుల దివ్య పాదాలను నేను నిత్యం ఆరాధిస్తాను), ప్రతి సన్నిధిలో తగిన పద్దతిలో మంగళాశాసనాన్ని నిర్వహించారు. ఆ తర్వాత పెరియ పెరుమాళ్ మరియు నంపెరుమాళ్ళ తిరువడిని సేవించారు. అనంతరం, ఈ శ్లోకంలో చెప్పినట్లుగా….

ఉపేత్య పునరప్యేష నిజమేవ నివేశనం
నివేధ్య నిఖిలం తత్ర యతీంద్రాయ నమస్యయా

(మణవాళ మాముణులు తమ మఠానికి తిరిగి వచ్చి అక్కడ జరిగిన సంఘటనలను తమ వద్ద నివాసముంటున్న యతిరాజులకు (రామానుజులు) తెలియజేసారు), వారు తమ మఠానికి తిరిగి వచ్చి ఆ రోజు జరిగిన సంఘటనలను రామానుజులకు వివరించారు. ఆ తర్వాత రామానుజుల తిరువడి దివ్య నీడగా తిరుమలయాళ్వార్ (ఉపన్యాస మండపం) లోకి ప్రవేశించి, ఈ సంసార విముక్తులను చేసే తమ పాద స్పర్శ కలిగిన పరిమళ తీర్థం – శ్రీ పాదతీర్థాన్ని ఎఱుంబి అప్పకి ప్రసాదించారు.

పెరుమాళ్ళకు సమర్పించిన నైవేద్యాలను తరువాత మాముణులు కూడా స్వీకరించారు, ఈ శ్లోకంలో వివరించబడింది…

అత మాధ్యానికం కృత్యం కృత్వా సర్వోత్తరం మునిః
ఆరాధ్య విధివత్ దేవమన్వభూత్ రంగభూషణం
తతస్సం ముఖసంస్పర్శరసేన సుగంధినా
శుచినా సుకుమారేణ సత్వసం శుద్ధి హేతునా
భక్తి భూతం ప్రభూతేన భోజ్యేన భగవత్ ప్రియాన్
తత్ పరః తర్పయామాస తధీయప్రేమ వృత్తయే
ఆత్మానం ఆత్మనాపశ్యన్ భోక్తారం పురుషమ్భరం
అనుయాగం యథాయోగం నిస్సంగో నిరవర్తయన్

(తరువాత, పరమ సాత్వికులైన మణవాళ మాముణులు, తమ మధ్యాహ్నిక అనుష్టానం నిర్వహించి, సరైన విధితో తమ తిరువారాధన పెరుమాళ్ అయిన శ్రీ అరంగనగరప్పన్ కు తిరువారాధనం చేశారు. ఎంబెరుమానుని దివ్య గుణాలను ధ్యానించారు. భగవానుని దివ్య అదర స్పర్శతో అమృతంలా, సువాసనతో పవిత్రమై, మృదువుగా మారి, సత్వ గుణాన్ని, మనః శుద్దిని కలిగించే ప్రసాదాన్ని భగవత్ భక్తులకు సమృద్ధిగా సమర్పించి, ఆ తరువాత తాను కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించి, తమ ద్వారా భోక్త స్వరుపంలో ఉన్న తన అంతర్యామి భగవానునికి అందించారు. తొండరడిప్పొడి ఆళ్వారి పాశురములో “పోనగం శెయ్ద తరువరేల్ పునిదమన్ఱే”- (భాగవతాలకు సమర్పించిన ప్రసాద శేషం పవిత్రమైనది) అని చెప్పబడింది. అప్పా పెరుమాళ్ళకు సమర్పించిన నైవేద్యాన్ని ఆరగించి వారు సంతృప్తి చెందారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/06/yathindhra-pravana-prabhavam-53/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 18

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవర మునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

ముగింపు – ఆచార్య నిష్ఠ మహిమలు

మునుపటి వ్యాసములో (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/09/27/anthimopaya-nishtai-17/), మనము ఎంపెరుమాన్, పిరాట్టి, ఆళ్వార్లు, ఆచార్యుల మాటలలో శ్రీవైష్ణవుల మహిమలను గమనించితిమి. సీతా పిరాట్టి, మాముణులు తమను బాధించిన వారిపై ఎనలేని దయను చూపుటను గమనించితిమి. ఇప్పుడు, మనము ఈ దివ్య గ్రంధము యొక్క ముగింపు భాగమును దర్శించెదము.

ఈ విధముగా, “స్తావరాణ్యాపి ముచ్యంతే” (వైష్ణవ స్పర్శచే మొక్కలు కూడ ముక్తి పొందును), “పశుర్ మనుష్యః పక్షివా (జంతువులు, మనుష్యులు, పక్షులు అన్నియును వైష్ణవ సంబంధముచే ముక్తి నొందును) అని తెలిపిన ప్రకారము, ఈ జగత్తునంతయు ఉద్ధరించు మిక్కిలి దయా స్వరూపులైన తమ ఆచార్యులను మన పూర్వాచార్యులు శరణు చేసిరి. మన పూర్వాచార్యులు సర్వఙ్జులు, పండితులలో వారు అగ్రగణ్యులు, విషయ సారాంశమునకు, అన్య ఇతర విషయముల మధ్య గల అంతరమును గుర్తించ గలవారు, తమ అన్ని బాధ్యతలను పూర్తి చేసిన వారు (సదాచార్యుల ఆశ్రయమును పొందినవారు), సదా మంగళాశాసనముపై దృష్టి కలవారు (భగవత్ భాగవతుల శ్రేయస్సుకై ప్రార్ధించుట). ఆండాళ్ నాచ్చియార్ తిరుమొళిలో “నానుమ్ పిఱన్దమై పొయ్యన్ఱే” అని తెలిపిన విధముగా (నాచ్చియార్ తిరుమొళి 10.4 – ఎంపెరుమాన్ వచ్చి నాకు దర్శనమివ్వనిచో, నేను పెరియాళ్వార్ పుత్రికనగుట వ్యర్థము), “వల్లపరిశు వరువిప్పరేల్ అదు కాణ్డుమే (నాచ్చియార్ తిరుమొళి 10.10 – ఎంపెరుమాన్ వచ్చునట్లు పెరియాళ్వార్ చేసిన, నేను వారిని దర్శించెదను), సదా ఎంపెరుమాన్ ను కీర్తించు శ్రీవైష్ణవులను ఆశ్రయించు సుగమమైన మార్గమును వారు అభ్యసించిరి. తదుపరి, నిస్సంశయమైన సంపూర్ణ జ్ఞానముతో, అట్టి ఆచార్యులే ఆరాధనకు / సేవకు అర్హులని, వారికి బరువు బాధ్యతలు ఉండవని, మండు వేసవిలో కూడ చల్లని గాలిలో విశ్రమించు వంటి వారని, వారిపై దృష్టి నిలిపెదరు. వారు అంతిమ లక్ష్యముపై ఆందోళనను వీడి “శిర్ట్రవేణ్డా” (తిరువాయ్మొళి 9.1.7 – ఆందోళన లేకుండుట), గురుపరంపరను పాటిస్తూ తేవు మత్తఱియేన్ (కణ్ణినుణ్ శిఱుత్తాంబు 2 – నేను నమ్మాళ్వార్ ను తప్ప అన్య దైవము నెఱుంగను). ఇట్టి ఉదాతమైన గుణములను క్రింద గమనించగలము:

 • పెరియాళ్వార్ల దివ్య సుపుత్రి ఆండాళ్ తన తండ్రి / ఆచార్యుని పై

 • నమ్మాళ్వార్ల పాద పద్మముల యందు మధురకవి ఆళ్వార్

 • నాధమునుల పాద పద్మముల యందు కురుగై కావలప్పన్

 • ఆళవందార్ పాద పద్మముల యందు దెయ్వవారియాండన్

 • ఎంపెరుమానార్ పాద పద్మముల యందు వడుగ నంబి

 • నంపిళ్ళై పాదపద్మములపై పిన్భళగియ పెరుమాళ్ జీయర్

శ్రీరంగములో నంపిళ్ళై పాదపద్మముల యందు పిన్భళగియ పెరుమాళ్ జీయర్
 • వడక్కు తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్యుల పాద పద్మముల యందు కూరకులోత్తమ దాసర్

 • తిరువాయ్మొళి పిళ్ళై, మణల్పాక్కత్తు నంబి పాద పద్మములపై మన జీయర్ (మాముణులు)

శ్రీరామానుజ (ఆళ్వార్ తిరునగరి), తిరువాయ్ మొళి పిళ్ళై (కొంతగై), మాముణులు (ఆళ్వార్ తిరునగరి)

ఇట్టి ఉదాత్త మనస్కులు ఇంకను అనేకులు మన పూర్వాచార్యులను ఆశ్రయించిరని గమనించగలము.

గొప్ప ఆచార్య నిష్ఠ గల ఇట్టి పెక్కు శ్రీవైష్ణవులు మన జీయర్ (మాముణులు) పాద పద్మముల వద్ద నున్నారు. నేటికి (పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్ గారి కాలము), పరిపూర్ణ యోగ్యులైన ఆచార్య, శిష్య సంబంధము ఉన్నచోట దీనిని మనము గమనించవచ్చును. భవిష్యత్తులో కూడ, ఎక్కడ రామానుజ సిద్ధాంతము వికసించునో, అచ్చట సదా యోగ్యులను చూడగలము. దీనినే “కలియుమ్ కెడుమ్ కాండు కొణ్మిన్” (కలియుగములోని దుష్పరిణామములు నశించును) లో తెలిపిరి. అట్టి యోగ్యులైన వారు యధాలాపముగా మాటలాడినాను, అవి మిక్కిలి పవిత్రమగును. వారి దివ్య వాక్కులు వేదాంత సారమైన తిరుమంత్రార్ధమును బోధించును.

వేద శాస్త్రారూఢాః జ్ఞానఖడ్గతరాద్విజాః
క్రీడార్ధమపి యద్ బ్రూయుస్స దర్మః పరమో మతః

సాధారణ అనువాదము: వేద గ్రంథములలోని సూత్రముల యందు నమ్మకము కలవారు, ఆ జ్ఞానమునందించు ద్విజులైన వారు, మాటవరసకు పలికినను, అది న్యాయము మరియు మహత్తును పొందును.

అదిగంతవ్యాస్సన్తో యద్యపి కుర్వంతి నైకముపదేశమ్
యస్తేశామ్ స్వైరకతాస్తా ఏవ భవంతి శాస్త్రార్ధాః

సాధారణ అనువాదము : ఉదాత్త పురుషుల బోధనలే కాక, వారి చర్యలను కూడ నిశితముగా పరిశీలించ వలెను. (కారణము) ఆ గ్రంథముల యధార్ధ తాత్పర్యమే వారి వ్యక్తిగత క్రమ శిక్షణకు రూపమగును.

జ్ఞాన సారము 40

అల్లి మలర్ పావైకు అన్బర్ అడిక్కు అన్బర్
సొల్లుమ్ అవిడు సురుదియాం
నల్ల పడియామ్ మను నూఱ్కవర్ సరిదై
పార్వై శెడియార్ వినై తొగైక్కుత్ తీ

సాధారణ అనువాదము : శ్రీయః పతి పాద పద్మములను ఎవరు ఆశ్రయించెదరో, వారి మాటలు వేదముతో సమానము, మను స్మృతికి వారి జీవితము మూలాధారము, వారి దృష్టే సర్వ పాపహరణము.

తదుక్తి మంత్రం మంత్రాగ్ర్యము

సాధారణ అనువాదము : వారి మాటలే ఉత్తమ మంత్రములు

అట్టి భక్తులు పొరపాటున కూడ వ్యర్థమైన మాటలు పలుకరని ప్రతీతి, వారి దివ్య పలుకులు వేదసారమైన తిరుమంత్రార్ధమును ప్రతిబింబించును.

అన్ని ప్రమాణముల ముఖ్య సూత్రములు తిరుమంత్రములో కలవని, దానిని తెలుసుకొనవలెనని, ఈ క్రింది శ్లోకములో తెలిపిరి.

రుచో యజుంషి సామాని తతైవతర్వణాని చ
సర్వమష్టాక్షరాన్తస్తమ్ యచ్చాన్యదపి వాజ్ఞమయం

సాధారణ అనువాదము: ఈ అష్టాక్షరీ మంత్రములో ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదముల, వేదాంతము, ఇతిహాసములు, పురాణములు, స్మృతులు, మొ || వానిలోని అర్ధములు ఇమిడి వున్నవి.

ఇట్టి మహిమాన్వితమైన తిరుమంత్రము 3 ప్రధాన లక్షణములను 3 పదముల ద్వారా వివరించుచున్నది – ఓం (శేషత్వము – శిష్యత్వము), నమః (పరాంతరీయము – పరిపూర్ణ ఆశ్రయము), నారాయణాయ (కైంకర్యము – భగవానుని మాత్రమే పరవశింపజేయు నిరంతర సేవ). ఈ సూత్రములు భగవానునికి పాక్షికముగాను మరియు భాగవతులకు సంపూర్ణముగాను వర్తించును. ఈ కారణముచే, మన పూర్వాచార్యులు, ప్రధాన సూత్రముల సారమును సంగ్రహించి, వానిని సంస్కృత, ద్రావిడ, మణిప్రవాళ భాషలలో సమముగా (ఏకగ్రీవముగా) వివరించిరి. ఒక శిష్యుడు నిరంతర సాధన చేయుచు ఆచార్య అభిమానమే (ఆచార్యుని దయ / ఆదరణ) అంతిమ నిష్ఠగా కలిగి ఉండవలెను. ఆచార్యుని తన గురువుగాను, శరణ్యుడుగాను ఆనంద హేతువుగాను, అన్ని విధముల బాంధవ్యమును కలిగి ఉండునటుల భావించవలెను.
ఆళవందార్ స్తోత్రరత్నము – 5 – మాతా పితా యువతయాః – మనకు నమ్మాళ్వారే తల్లి, తండ్రి, పత్ని, సంతానము మొ || కణ్ణినుణ్ శిఱుత్తాంబు – 4 : అన్నైయామ్, అత్తనాయ్ – నమ్మాళ్వారే నాకు తల్లి, తండ్రి. మాముణుల ఆర్తి ప్రబంధము – 3: తందై నఱ్ఱాయ్ తారం తనయర్ పెరున్జెల్వం ఎన్ఱనక్కు నీయే యతిరాజా – ఓ యతిరాజా నీవే నాకు తండ్రివి, తల్లివి, పత్నివి, సంపదవు మొ || నవి

 • కణ్ణినుణ్ శిరుఱ్ఱాంబు 1: త్తెన్గురు గూర్, నంబి యెన్ఱక్కాల్, అణ్ణిక్కుం అముదూఱుం, ఎన్నావుక్కే – మధురకవి ఆళ్వార్లు నమ్మాళ్వార్ల దివ్య నామములను పలికినంతనే నా నాలుకపై అమృతమైన రుచి కలుగును.
 • కణ్ణినుణ్ శిరుఱ్ఱాంబు  2 – నావినాల్ నవిత్తు, ఇన్బమెయ్ దినేన్ – నమ్మాళ్వార్ల నామమును / కీర్తిని పలికినంతనే, నేను అత్యంత పరవశత్వమును పొందుదును.
 • రామానుజ నూఱ్ఱందాది 102 – ఎన్నా విరున్దెమ్ ఇరామానుశన్ ఎన్ఱజైక్కుమ్ – నీతో నాకు గల నిర్హేతుకమైన దివ్య బాంధవ్యమును, నీ దివ్య నామములను నా నాలుక సదా ఉచ్ఛరించును.
 • రామానుజ నూఱ్ఱందాది 1 – ఇరామానుశన్ చరణారవిందం నామ్ మన్ని వళ నెన్జే శొల్లువోమ్ అవన్ నామఙ్గ్ ళే – ప్రియ మనసా! శ్రీరామానుజుని పాదపద్మముల వద్ద జీవితాంతము కొనసాగుటకై, వారి అనేక దివ్య నామములను పారాయణము చేయుదుము.
 • రామానుజ నూఱ్ఱందాది తనియన్ – ఉన్నామ మెల్లామ్ ఎన్ఱన్ నావినుళ్ళే అల్లుమ్ పకలు మమరుమ్పడి నల్ కు అఱుశమయ వెల్లుమ్ పరమ ఇరామానుశ – ఓ రామానుజ, అప్రమాణమైన ఆరు మతాలను ఖండించి, గెలుపు నొంది మరియు వేదాంత సూత్రములను నెలకొల్పితివి! నీ దివ్య నామములు నా నాలుకపై సదా ఉండున్నట్లు చేయుట కూడ నీదే బాధ్యత.
 • గురోవార్తశ్చ కథయేత్ – గురోర్నామ శబ్ధ జపేత్ – సదా ఆచార్యుని మాటలను / ఆదేశములను గురించి చర్చించుము, ఆచార్యుని నామములను సదా జపించుము.

సరియైన ఆచార్యునితో కల అట్టి బాంధవ్యముచే, శిష్యుడు ఈ క్రింది తీరునవలంబించ వలెను:

 • ఆచార్యునితో ప్రధమముగా చేసిన శరణాగతిపై నిరంతర ధ్యానము మరియు “నమః” అను మంత్రము కలిగి ఉండవలెను (అనువాదకుని గమనిక: జపతవ్యం గురు పరంపరాయుమ్ ధ్వయముమ్ అని పిళ్ళై లోకాచార్యులు తెలిపిరి – ఇక్కడ ద్వయ మంత్రము కన్నా ముందు ప్రధాన మంత్రముగా అస్మద్ గురుభ్యోనమః…. శ్రీధరాయనమః : అని పఠించ వలెను)
 • ఆచార్యుని పరమ దైవముగా భావించాలని ఈ క్రింద తెలిపిరి: 
   • గురేవ పరమ బ్రహ్మ – గురువే పరమ దైవము
   • జ్ఞాన సారం 38 – తేనార్కమలత్ తిరుమామగళ్కొళునన్ తానే గురువాగి – శ్రీయఃపతియే స్వయముగా తానే ఆచార్యుడగును
   • యస్య సాక్షాత్ భగవతి జ్ఞానాధిపప్రధే గురౌ – జ్ఞానజ్యోతి ద్వారా తన శిష్యునికి వికాసము కల్పించు ఆచార్యుని భగవానునిగా భావించాలి.
   • పితాగవాడైప్పిరానార్ బిరమగురువాయ్ వందు – ప్రధమ గురువుగా వచ్చిన భగవానుడు.
 • ఆచార్యుని గృహమే అంతిమ నివాసముగా – పరమపదముగా భావించవలెను. దీనినే ఈ క్రింద పేర్కొనిరి
   • యేనైవ గురుణా యస్య న్యాసవిద్యా ప్రధీయతే; తస్య వైకుంఠదుగ్ధాబ్ది ద్వారకాశ సర్వ ఏవ స: తమ శిష్యునకు శరణాగతి అను జ్ఞానమును ప్రసాదించిన ఆచార్యుడు ఎక్కడ నివసించునో, అదియే అతనికి శ్రీవైకుంఠము, క్షీరాబ్ది మరియు భగవానుని అన్ని నివాసములు.
   • జ్ఞానసారము 36 – విల్లార్మణి కొళిక్కుం వేంగడ పొఱ్కున్ఱు ముదల్ సొల్లార్పొళిల్సూళ్తిరుప్పడి గళ్ ఎల్లాం మరుళాం ఇరుళోడ మతగతు త్తనాళ్ అరుళాలే వైత్త అవర్ – అపారమైన కరుణచే ఆచార్యుడు తన శిష్యుని అజ్ఞానమును తొలగించిన కారణముగా, నిజమైన శిష్యునికి, తన ఆచార్యునిలోనే భగవానుని అన్ని నివాసములు, తిరువేంగడము మొదలుకొని (పరమపదము, క్షీరాబ్ది మొ ||) దర్శించవలెను.
   • కణ్ణినుణ్ శిరుత్తాంబు 11 – నమ్బువార్ పది వైగున్ధమ్ కాణ్మినే – మధురకవి ఆళ్వార్ దివ్య పలుకులను విశ్వసించిన వారికి, వారు ఉన్న నివాసమే వైకుంఠము.
 • ఆచార్యుని పాదపద్మములే మూలాధారము, ఎంపెరుమానార్ ను కీర్తిస్తూ, యోనిత్య మచ్యుత… రామానుజ చరణం శరణం ప్రపద్యే శ్లోకములో తెలిపిరి – రామానుజుని పాదపద్మములే మనకు సదా శరణ్యము.
   • రామానుజ నూఱ్ఱందాది 45 – ‘పేఱొన్ఱు మత్తిల్లై నిన్ శరణన్ఱి, అప్పేఱళిత్తఱ్కు
    ఆఱొన్ఱుమిల్లై మత్ చరణన్ఱి’ – అముదనార్ ఎంపెరుమాన్ ను స్మరిస్తూ – నా జీవిత ధ్యేయము నీ శ్రీచరణాలను సేవించుట మరియు దానిని సాధించుటకు కూడ నీ శ్రీచరణములే మార్గము అనిరి.
   • ఉపాయ ఉపేయ భావేన తమేవ శరణం వ్రజేత్ – ఆచార్యుని పాదపద్మములనే ఉపాయముగా మరియు ఉపేయముగా / లక్ష్యముగా శరణాగతి చేయుట.
 • మనసా వాచా కర్మణా వారి సేవ చేయుట అంతిమ లక్ష్యముగా తెలిపిరి.
   • సుందర బాహు స్తవము 129 – రామానుజార్య వాచక : పరివర్తిష్య – శ్రీరంగములో తమ ఆచార్యుని సేవించుటకై, వారితో తమను తిరిగి కలుపుమని సుందరబాహు పెరుమాళ్ ను అభ్యర్థించిన ఆళ్వాన్
   • యతిరాజ వింశతి 4 – నిత్యం యతీంద్ర తవ దివ్యవపు స్మృతౌ మే, సక్తం మనో భవతు వాక్ గుణ కీర్తనేసౌ, కృత్యం చ దాస్య కరణే తు కరద్వయస్య, వృత్త్యంతరేస్తు విముఖం కరణత్రయం చ – శ్రీరామానుజునితో మామునిగళ్ – ఓ యతీంద్రా! నా మనస్సు నీ దివ్య రూపాన్ని స్మరించుటలో ఆసక్తమై ఉండుగాక! నా వాక్కు నీ కల్యాణ గుణములను పాడటములో లగ్నమై ఉండుగాక: నా కరములు నీ కైంకర్యము చేయు గాక: ఈ మూడును ఇతర ప్రవృత్తులు లేనివగును గాక.
   • శ్రీవచన భూషణము 299 – శక్తిక్కిలక్కు ఆచార్య కైంకర్యము – ఆచార్యునికి చేయు కైంకర్యము పైననే శిష్యుడు తన శక్తి సామర్ధ్యములను నిలిపి / వినియోగించవలెను.
 • శిష్యుని కైంకర్యమును చూసిన ఆచార్యునికి కలిగిన సంతోషమే అతిపెద్ద ఫలితముగా పేర్కొనిరి: 
   • శ్రీవచనభూషణము 321 – శిష్యనెన్బత్తు సాధ్యాంతర నివృత్తియుమ్ ఫల సాధన శుశ్రూషైయుమ్ – ఆచార్యుడే అంతిమ ధ్యేయముగా మరియు ఆచార్యుని సదా ఆనందపరచు సేవయే నిజమైన శిష్యుని లక్షణముగా భావించవలెను. అట్టి అధికారులు (యోగ్యలైన శిష్యులు) ఆచార్య నిష్ఠలో నిమగ్నులై, అన్ని విషయ సుఖములు మరియు భౌతిక వాంఛలు విసర్జించవలెను. వారు ఆచార్యుని పవిత్రమైన దివ్య స్వరూపమును అనుభవింపవలెను. ” సదా పశ్యంతి… ” అను శ్లోకములో చెప్పిన విధముగా – పరమపదములో భగవానుని నిత్య దర్శనముచే జీవాత్మలు ఆనందమును అనుభవించెదరు.

ఇంకను, ” అత్ర పరత్ర చాపి ” (స్తోత్రరత్నము 2) లో తెలిపిన విధముగా, వారు తమ ఆచార్యునికి ఈ జగత్తులోను మరియు పరమపదములోను కైంకర్యము చేయుచు, పరమపదము (అపరిమిత ఆనందమునకు నెలవు) లో ఏకమనస్కులతో కలసి, అమృతతుల్యమైన ఆనంద సాగరములో మునిగి మరియు సదా మంగళాశాసనము చేయుచుందురు.

నాధముని – ఆళవందార్, కాట్టు మన్నార్ కోవెల

ఈ క్రింది దివ్య శ్రీసూక్తులను మనము అంతిమోపాయ నిష్ఠ కు ప్రమాణముగా (ప్రబల ఋజువు) సదా స్మరించగలము.

 • రామానుజ నూత్తందాది 104 – కైయిల్ కనియెన్న కణ్ణనైక్కాట్టిత్తరిలుమ్ ఉన్ తన్ మెయ్యిల్ పిఱఙియ శీరన్ఱి వేణ్డిలన్ యాన్ – నాకు మీరు కణ్ణన్ ఎంపెరుమాన్ ను (అతను సొగసుకు మరియు భక్తులకు అందుబాటులో నుండుటకు ప్రతీక) దర్శింపజేసినను, నేను మీ దివ్య తిరుమేనిని, దాని లక్షణములపై మాత్రమే దృష్టి సారించి తదితరములను విస్మరించెదను.
 • కణ్ణినుణ్ శిరుత్తాంబు 2 – నావినాల్ నవిత్తు ఇన్బ మెయ్ దినేన్ – నమ్మాళ్వార్ల మహిమలను కీర్తించి ధన్యుడనైతిని
 • నాచ్చియార్ తిరుమొళి 10.10 – నల్ల ఎన్ తోళి…. విట్టు శిత్తర్ తఙ్గళ్ తేవరై వల్లపరిశు వరువిప్పరేల్ అదు కాణ్డుమే – ఆండాళ్ పలికిరి – పెరియాళ్వార్ కణ్ణన్ ను ఆహ్వానించి, వారు దర్శనమిచ్చునట్లు చెసినచో, నేను వారిని అప్పుడు దర్శించెదను.
 • ఈ సూత్రమును పరమాచార్యులు ఆళవందార్లు నమ్మాళ్వార్లపై “మాతా పితా యువ తయా” అను శ్లోకములో వివరించిరి. నమ్మాళ్వార్ ను వైష్ణవ కులపతి (వైష్ణవులకు నాయకుడు) గా నిరూపించి, తన సర్వస్వము నమ్మాళ్వారే నని.
 • పశుర్ మానుష్య పక్షివ అను శ్లోకములో – ఒక జంతువు, మనిషి, పక్షి – పుట్టకతో సంబంధము లేకుండా (అట్టి యోగ్యత, జ్ఞాన సముపార్జనకు, శాస్త్రము లేక తత్సమానములను అభ్యసించుటకు అవసరమా), వైష్ణవునితో సంబంధము సులువుగా పరమపదమునకు చేరువ చేయును.
 • బాల మూగ జాత అంధశ్చ శ్లోకములో – బాలుడు, చెవిటి, మూగ, అంధుడు, మూర్ఖుడు, మొ || ఒక నిజమైన ఆచార్యుని శరణు పొందినచో, వారు తమ అంతిమ గమ్యమైన పరమపదమును తప్పక జేరగలరు.
 • ఆచార్యస్య ప్రసాదేనా మమ సర్వమభీష్టదం; ప్రపుణ్యామితి విశ్వాసో యస్యస్తి స సుఖీభవేత్ –
  తమ అపార కోరికలు ఆచార్యుని కరుణచే నెరవేరునని విశ్వాసము / నమ్మకము గల వారు ఆనందముగా నుందురు.
 • మాణిక్కమాలై నందు పెరియ వాచ్చన్ పిళ్ళై యొక్క దివ్య పలుకులు – ఇహ లోక పరలోకంగల్ ఇరణ్డుమ్ ఆచార్యన్ తిరువడిగళే ఎన్ఱుమ్, దృష్టా దృష్టంగళిరణ్డుమ్ అవనే ఎన్ఱుమ్ విశ్వసిత్తిరుక్కిఱతుక్కు మేలిల్లై – పరమపదము మరియు ఈ జగత్తులోనిదేదైనను ఆచార్యుని శ్రీచరణముల కన్నను అధికము కానేరదు మరియు ప్రత్యక్ష మరియు అగోచరమైన ప్రయోజనములు ఆచార్య స్వరూపములే.
 • శ్రీవచనభూషణము 322 లోని పిళ్ళై లోకాచార్యుల దివ్య శ్రీసూక్తి – మంత్రముమ్, దేవతైయుమ్, ఫలముమ్, ఫలానుబన్ధికళుమ్, ఫలసాధనముమ్, ఐహికభోగముమ్, ఎల్లాం ఆచార్యేనెన్ఱు నిన్నైక్కక్ కడవన్ – ఒక శిష్యుడు తన ఆచార్యునే మంత్రముగా తలంచి – అది వల్లించుటచే తన సంసారములోని బాధలు తొలగునని భావించవలెను.
   • పరదేవత – భగవాన్ – ఆ మంత్రము యొక్క లక్ష్యము
   • ఫలము – కైంకర్య రూపముగా ఫలితమును ఇచ్చి దీవించిన భగవానుడు
   • ఫలానుభూతి – సంపూర్ణ ఆత్మజ్ఞానము మరియు పరమపద నివాసము వంటి అనుబంధ ప్రయోజనములు కలుగుట
   • ఫల సాధనము – ప్రయోజనములు నెరవేరుటకు తోడ్పడు సాధనములు
   • ఐహిక భోగము – పరమపదమును జేరుటకు ముందు ఈ జగత్తులో ఇంకను ఇతర ఇంద్రియ సుఖములు అనుభవించ వలెనను కోరిక.

పిళ్ళై లోకాచార్యులు, మాముణులు, పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్

శ్రీసౌమ్యజామాతృమునేః ప్రసాదప్బావ సాక్షాత్కృత సర్వతత్వమ్
అజ్ఞానతామిశ్ర సహస్రభానుమ్ శ్రీ భట్టనాధమ్ మునిమాశ్రయామి

సాధారణ అనువాదము: నేను శ్రీభట్టనాధ మునిని శరణాగతి చేసెదను, వారు శ్రీసౌమ్యజామాతృ ముని దయచే యధార్ధములను వీక్షించిరి. వారు అజ్ఞానాంధకారమును రూపుమాపు సహస్ర కిరణముల ఆదిత్యుని వంటి వారు.

ఈ విధముగా పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్ రచించిన అంతిమోపాయనిష్ఠ ముగిసెను.

అనువాదకుని గమనిక: ఈ చివరి భాగములో మనము ఆచార్య నిష్ఠ యొక్క అన్ని మహిమలను వీక్షించితిమి. కొన్ని సంస్కృత ప్రమాణములకు అనువాదము చేకూర్చిన శ్రీరంగనాధ స్వామికి కృతఙ్ఞతలు.

అన్ని భాగములను ఈ క్రింద వీక్షించగలరు: https://srivaishnavagranthamstelugu.wordpress.com/anthimopaya-nishtai/

అడియేన్ గోపీకృష్ణమాచార్యులు బొమ్మకంటి, రామానుజ దాసన్ .

మూలము: http://ponnadi.blogspot.com/2013/07/anthimopaya-nishtai18.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org