Monthly Archives: October 2022

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 52

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 51

ఎఱుంబి అప్పా తిరువారాధన పెరుమాళ్ అయిన చక్రవర్తిత్ తిరుమగన్ (శ్రీ రాముడు) అతని కలలోకి వచ్చి, “నీవు ఆదిశేషుని పునరవతారమైన మణవాళ మాముణుల పట్ల అపరాధము చేసావు. నీకు శ్రీ నారద భగవానుని మూలం తెలియదా? ‘భగవద్ భక్తి పాత్ర శిష్టోధనారాత్ కోపిదాసీ సుతోప్యాసి సమృతో వై నారాదోభగవత్ (ఒక వేశ్య పుత్రుడు భగవాన్ భక్తుని శేష ప్రసాదాన్ని ప్రేమతో స్వీకరించాడు. మరు జన్మలో అతను నారద భగవానుడు అయ్యాడు). నీవు జీయర్ దివ్య తిరువడి యందు ఆశ్రయం పొంది, వారికి క్షమాపణలు చెప్పకపోతే, మీ తిరువారాధనను మేము స్వీకరించము. వెంటనే వెళ్ళు” అని ఆజ్ఞాపించాడు. అప్పా తమ నిద్ర నుండి మేల్కొని ఎటువంటి కల ఇది అని ఆశ్చర్యపోయాడు. అతను వెంటనే కోయిల్ (శ్రీరంగం) కి బయలుదేరారు. ఈ శ్లోకం పఠించారు……

అంగేకవేరా కన్యాయాః తుంగేభువన మంగళే
రంగే ధామ్ని సుఖాసీనం వందే వరవరం మునిం

(కావేరి నడుమ సమస్త లోకాలకు మంగళకరమైన ప్రదేశంలా దర్శనమిచ్చే శ్రీ రంగ దివ్య దేశములో దయతో నివాసం ఉన్న మణవాళ మాముణుల దివ్య తిరువడి సంబంధం నేను పొందుతున్నాను). అదే సమయంలో, పెరుమాళ్ళను సేవించడానికి జీయర్ వస్తున్నారు. “దణ్డవత్ ప్రణమేత్ భూమావుపేధ్య గురుం అన్వహం” (ఒక కర్ర చేతిలో నుండి వదిలితే ఎలా నిఠారుగా క్రింద పడిపోతుందో అదే విధంగా ప్రతిదినం తమ ఆచార్యుడి ఎదుట సాష్టాంగ నమస్కారం చేయాలి) అని చెప్పినట్లుగా, అప్పా జీయరుని చూసి వెంటనే వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. “లోచనాభ్యాం పిపన్నివా” (అతన్ని కళ్లతో కరిగించివేస్తూ) అని చెప్పినట్లుగా, జీయర్ తమ కరుణా భరితమైన దృష్ఠితో వారికేసి చూశారు. అప్పా జీయరు వారి దివ్య మంగళ స్వరూపం యొక్క సౌందర్య ఆస్వాదంలో మునిగిపోయి ‘మయిప్రవిశతి శ్రీమాన్’ నుండి ప్రారంభించి ‘మయిప్రసాదప్రవణం’ తో ముగిసే పూర్వదినచర్య పఠించడం ప్రారంభించారు.

ఆత్మలాభము కంటే గొప్పైనది మరేదీ లేదు అన్న భావించి, ఎఱుంబి అప్పాని స్వీకరించాలన్న సంకల్పంతో జీయర్ తిరిగి మఠానికి వచ్చారు. తమ శిష్యులతో “ఆలయానికి వెళ్లి, పెరుమాళ్ళను సేవించుకొని రండి” అని పంపారు. వాళ్ళు పెరుమాళ్ళను సేవించుకొని తిరిగి వచ్చాక వాళ్ళతో, పెరుమాళ్ ఫలానా అలంకారములు ధరించారని, ఫలానా ప్రసాదాలు స్వీకరించారని చెప్పారు. ఆలయంలో తాము చూసినదంతా జీయర్‌ అక్షరాలా కళ్ళకు కట్టినట్లు వర్ణించడంతో, శిష్యులు వారి సర్వజ్ఞతను చూసి ఆశ్చర్యపోయారు. సుదూరం నుండి వచ్చిన అప్పా, శ్రీరంగాన్ని సేవించాలనే తమ కోరిక తీరేలా, ఆకలితో ఉన్న వ్యక్తి ఆహారాన్ని చూస్తున్నట్లుగా, తదేకంగా వారు మాముణులను చూస్తూనే ఉండిపోయారు. దినచర్యలో చెప్పినట్లు – “భవంతమేవ నీరంత్రం పశ్యన్వస్యేన చేతసా” (అడియేన్ మీ ఉత్తమ ఛాయలో ఉంటూ మీ ఔన్నత్యాన్ని చూస్తూనే ఉంటాను), అని జీయర్ దివ్య మంగళ స్వరూపాన్ని తన ధారకం, పోషకం, భోగ్యంగా భావించారు.

మరుసటి రోజు తెల్లవారుజామున, అణ్ణన్ తో ఇతర శిష్యులు కలిసి జీయర్ గది ద్వారం వద్ద నిలుచొని, వారిని మేల్కొలపడానికి ఈ క్రింది శ్లోకాన్ని పఠించారు.

రవిరుధయత్యతాపి నవినశ్యతిమేతిమిరం
వికసతి పంకజం హృదయపంకజమేవ నమ
వరవర యోగివర్య! వరణీయ గుణైకనిధే!
జయజయదేవ! జాగ్రహి జనేషు నిధేహి దృశం

(సూర్యుడు ఉదయించినా అడియేన్ మనస్సులోని చీకటి తొలగలేదు. సరస్సులలో తామరపూలు వికసించాయి కానీ అడియేనుడి హృదయ కమలం వికసించలేదు. దివ్య మంగళ గుణాలకు నిధి అయిన ఓ స్వామీ! ఓ మణవాళ మాముని! దేవరి వారు మేల్కోవాలి. దేవరి వారి దివ్య నేత్రాలు తెరవాలి. తమ ఆశ్రయం పొందిన వారిపై కరుణ కురిపించాలి. మాముణులు లేచి, గురుపరంపరతో ప్రారంభించి రహస్య త్రయం (తిరు మంత్రం, ద్వయం, చరమ శ్లోకం) పఠించారు. వారు తిరుమంత్రం ద్వారా ఎంబెరుమానుని పర, వ్యూహ, అంతర్యామి గుణాలను, చరమ శ్లోకం ద్వారా విభవ గుణాలను, ద్వయం ద్వారా అర్చా (విగ్రహ రూపం) గుణాలలోని సంపూర్ణతను కరుణతో పఠించారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/05/yathindhra-pravana-prabhavam-52/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 51

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 50

జీయర్ ఆశ్రయం పొందిన ఎఱుంబి అప్పా

ఒక శ్రీవైష్ణవుడు తిరుమల కొండకి వెళుతూ దారిలో ఎఱుంబి అప్పా వద్దకు వెళ్ళారు. అప్పా అతన్ని చూసి గౌరవంగా ఆహ్వానించి, కోయిల్ (శ్రీరంగం దేవాలయం) గురించి, మాముణుల గురించి విషేశాలు చెప్పమని ఆతృతతో అడిగాడు. ఆ శ్రీవైష్ణవుడు అతనితో ఇలా అన్నాడు: “కందాడై అన్నన్ వంటి కందాడై అయ్యంగార్లు, తిరువాళియాళ్వార్ పిళ్ళై వంటి ఇతర ప్రముఖులతో పాటు ఎందరో శ్రీవైష్ణవులు మాముణుల దివ్య తిరువడి ఆశ్రయం పొందారు; జీయర్ కీర్తి దిన దినము అంచలంచలుగా పెరుగుతున్నాది.” ఇది విన్న అప్పా ఎంతో సంతోషించి, ఆ శ్రీవైష్ణవుడికి అనేక బహుమానాలు సమర్పించుకున్నారు. తర్వాత అప్పా ఆ శ్రీవైష్ణవులతో “మీ ద్వారా మాముణుల మహిమల గురించి క్లుప్తంగా విన్నాము. దయచేసి ఈ ఘట్టాల గురించి, జీయర్ ఆళ్వార్ తిరునగరి నుండి శ్రీరంగానికి తిరిగి వెళ్ళుట గురించి కూడా వివరించండి” అని ప్రార్థించారు. “తిరుమల నుండి త్వరగా తిరిగి రండి. మీరు శ్రీరంగానికి వెళ్లేటప్పుడు మేము మీతో వస్తాము” అని తెలిపారు. అప్పా పూజ్యులైన తమ తండ్రి వద్దకు వెళ్లి ఈ సంఘటనల గురించి చెప్పారు. వారి తండ్రిగారు ఆయనతో “నీవు జీయర్ తిరువడి సంబంధం పొందాలనుకుంటున్నట్లు అనిపిస్తుంది. అది అంతగా సబబు కాదని నేను భావిస్తున్నాను. నీవు కావాలంటే, వారికి నీ గౌరవాలను సమర్పించుకో, వారి నుండి తగిన వ్యాక్యార్థాల శ్రవణం చేయి, శ్రీపాదతీర్థం, ప్రసాదాన్ని స్వీకరించు” అని అన్నారు. ఇంతలో, ఆ శ్రీవైష్ణవుడు తిరుమల నుండి తిరిగి వచ్చాడు. ఎఱుంబి అప్పా అతనితో పాటు శ్రీరంగానికి వెళ్ళి నంపెరుమాళ్ళను సేవించుకున్నారు. తన సన్నిహిత మిత్రుడు అయిన పెరియ కందాడై అణ్ణన్ తిరుమాలిగకు వెళ్లి భోజనము చేసారు. తరువాత జీయర్ దివ్య తిరుమాలిగకు వెళ్లారు. ఎఱుంబి అప్పా మహా జ్ఞాని అని జీయరుకి తెలుసు. వారు సర్వేశ్వరుని పరత్వ గుణాన్ని చాటి చెప్పే తిరువాయ్మొళి మొదటి పాశురము ‘ఉయర్వఱ ఉయర్నలం’ పరిచయం గురించి వివరణాత్మక అర్థాలను వివరించారు. జీయర్ ఉపన్యాసం విన్న ఎఱుంబి అప్పా ఆశ్చర్యపోయి, “జీయర్‌కు తమిళం భాషలో నిష్ణాతులని, సంస్కృతంలో అంత నిష్ణాతులు కాదని మేము విన్నాము. కానీ వీరు రెండింటిలోనూ నిపుణులు, వీరు ఉభయ వేదాంతులు (సంస్కృతం మరియు ధ్రావిడం)” అని అన్నారు. జీయర్ అతని పట్ల ఆప్యాయతతో మఠంలో భోజనం చేయమని అభ్యర్థించారు. అప్పా స్పందిస్తూ ఇలా అన్నారు.

యత్యన్నం యతిపాత్రస్నం యతినా ప్రేశితంచ యత్
అన్నత్రయం నభోక్తవ్యం భుక్త్వా చాంద్రాయణం చరేత్

(సన్యాసుల ఆహారం, సన్యాసుల పాత్రల నుండి తెచ్చిన ఆహారం, సన్యాసులు పంపిన ఆహారం – ఈ మూడు రకాల ఆహారాలు స్వీకరించుట నిషేధం. ఈ  విశేష ధర్మాన్ని పాటించకుండా అలాంటి ఆహారాన్ని ఎవరైనా తింటే, అతను ప్రాయశ్చిత్తంగా చాంద్రాయణ వ్రతం పాటించాలి), (శాస్త్రాన్ని రెండు విధాలుగా పాటించాలి. ఒకటి సామాన్య శాస్త్రం – సామాన్య సమయంలో పాటించాలి. రెండవది విశేష శాస్త్రం – విశిష్ట సమయాల్లో ఆచరించాలి). అప్పా జీయర్ ఆశ్రయం పొందకుండా, కందడై అణ్ణన్ తిరుమాలిగకి కూడా వెళ్ళకుండా అసంతృప్తితో వెంటనే ఎఱుంబికి బయలుదేరారు.

ఇంటికి చేరుకున్న తర్వాత, తమ తిరువారాధన పెరుమాళ్ అయిన చక్రవర్తి తిరుమగన్ (శ్రీరాముడు) యొక్క కోయిలాళ్వార్ (మందిరం) తెరవాలనుకున్నారు. ఎంత ప్రయత్నించినా కోయిలాళ్వార్ తలుపులు తీయలేకపోయారు. దీంతో తీవ్ర బాధతో రాత్రికి ఏమీ తినకుండానే నిద్రలోకి జారుకున్నారు. వారి స్వప్నంలో శ్రీ రాముడు వచ్చి ఇలా అన్నాడు….

శేషః శ్రీమానజనిహిపురా సౌమ్యజామాతృయోగి భోగీభూతః
తదనుభగవాన్ రాఘవస్యానుజన్మా
భూత్వా భూయో వరవరమునిర్ భూయసాపాసమానః రక్ష్యత్యస్మాన్
రఘుకులపతే రాస్తితోపత్రపీటం
భూత్వా భవ్యో వరవరమునిర్ భోగినాం సార్వభౌమః శ్రీమద్ రంగే
వసతివిజయీ విశ్వసంరక్షణార్థం
తత్వం కంతుం వ్రజ శరణమిత్యాధిశత్ రాఘవోయం స్వప్నే
సోయం వరవరగురుః సంశ్రయో మాధృశానాం

(ఈ మణవాళ మాముణులు మొదట్లో కైంకర్యశ్రీ (సేవా సంపద) తో ఉన్న తిరువనంత ఆళ్వాన్ (ఆధిశేషుడు). అదే సర్ప రాజు తరువాత శ్రీ రాముడి తమ్ముడు లక్ష్మణునిగా అవతరించాడు. తరువాత మానవుడిగా అవతారమెత్తి, తమ భక్తులకు చేరువగా, శ్రీ రాముడి సింహాసనంపై ఆసీనులై మనల్ని రక్షిస్తున్నాడు. “ఆదిశేషుడు లోక కల్యాణార్థం మణవాళ మాముణులుగా అవతరించి శ్రీరంగంలో ఉంటున్నాడు. తత్వజ్ఞానము పొందాలనుకుంటే అతనిని ఆశ్రయించుము” – ఆ విధంగా అప్పా స్వప్నంలో శ్రీ రాముడు ఆదేశించాడు. అలాంటి మణవాళ మాముణులు మనలాంటి వారు ఆశ్రయించుటకు తగినవారు).

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/04/yathindhra-pravana-prabhavam-51/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 50

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 49

ఆళ్వార్తిరునగరిలో అగ్నికి ఆహుతి అయిన జీయర్ మఠం

పెరియ జీయర్ అపార పాండిత్యముతో ఇలా కాలము గడుతుండగా, ఈర్ష్యాద్వేషములతో వారంటే పడిరాని వాళ్ళు కొందరు, రాక్షస ప్రవృత్తితో అర్ధరాత్రి వేళ జీయర్ మఠానికి నిప్పంటించి పారిపోయారు. అది చూసిన వారి శిష్యులు దుఃఖ సాగరములో మునిగిపోయారు. జీయర్ ఆదిశేషుని రూపాన్ని ధరించి, రగిలే మంటల నుండి చెక్కుచెదరకుండా తప్పించుకుని, తమ శిష్యులు ఆశ్చర్య పడేలా తిరిగి వచ్చి వాళ్ళను కలుసుకున్నారు. అది విన్న అక్కడి రాజు, నేరస్థులను శిక్షించేందుకు తన భటులను నియమించారు. ఎలాగైతే రావణుడు యుద్దములో మరణించిన తర్వాత ఒంటి కన్నుచెవి ఉన్న రాక్షస స్త్రీలను సంహరించాలని సంకల్పించిన హనుమంతునితో సీతాపిరాట్టి “పాపానాంవా ​​శుభానాం వా” (అది పాప కార్యమో లేక పుణ్య కార్యమో…) అని చెప్పి వాళ్ళను క్షమించి తన ఉదారతను ప్రదర్శించమని అన్నట్లుగా, వరవరముని శతకం 14 లో “దేవి లక్ష్మీర్ భవసిదయయా వత్సలత్వేన సత్వం ” (నీ మాతృ కృప, సహన గుణాల కారణంగా నీవు లక్ష్మీదేవివి) అని చెప్పినట్లుగా మాముణులు తమ దయ మరియు ఉదారత కారణంగా ఆ దుండగులను క్షమించారు. తరువాత ఆ నేరస్థులు వచ్చి, వారు చేసిన అపరాధాన్ని మన్నించమని వేడుకొని కృపా సముద్రులైన మాముణుల చరణాల యందు శరణాగతి చేశారు. తరువాత వారు ఎంతో కాలం పాటు మాముణులతోనే ఉన్నారు.

తిరుక్కుఱుంగుడి మరియు తిరుక్కురుగూర్లో కైంకర్యాలు

ఆ స్థానిక రాజు, మాముణుల జ్ఞానానుష్ఠాములు, సర్వజ్ఞ గుణములు మొదలైన వాటి గురించి విని భక్తిప్రపత్తులతో వచ్చి మాముణులను ఆశ్రయించారు. జీయర్ వారికి శఠకోప దాసర్ అని దాస్యనామాన్ని ప్రసాదించి, “ఒక వంతు ప్రాపంచిక విషయాసక్తి ఉంచుకొని మిగిలిన మూడు వంతులు మోక్షాసక్తి కలిగి ఉండండి” అని రాజుని నిర్దేశించారు. రాజు కూడా చూచా తప్పకుండ ఈ సూచనను అనుసరించారు. ఆ రాజు కాలమేఘ తిరుమండపం (కాలక్షేపం మొదలైనవాటిని నిర్వహించడానికి ఒక దివ్య మండపం), దివ్య వీధులు, దివ్య సరిహద్దులు మొదలైన అనేక కైంకర్యాలను నిర్వహించి జీయర్ ని సంతోషపరిచారు. వారు అళగియ మణవాళన్ దివ్య మండపాన్ని కూడా నిర్మించారు.

అనంతరం, జీయర్ తిరుక్కుఱుంగుడికి వెళ్లి, తిరువెంగడముడైయాన్ అనే బ్రాహ్మణునిపై తమ దయ చూపారు. అతనికి తిరువేంగడదాసర్ అను దాస్యనామాన్ని అనుగ్రహించి తిరుక్కుఱుంగుడిలో కైంకర్యం నిర్వహించమని నియమించారు. తిరువేంగడదాసర్ నిన్ఱ నంబి, ఇరుంద నంబి మరియు కిడంద నంబి ల కోసం ప్రత్యేక మందిరాలను నిర్మించారు (తిరుక్కుఱుంగుడి నంబికి ఆ ప్రదేశంలో పంచ మూర్తులు ఉన్నాయి; మాముణుల మహిమలకు సంబంధించిన మరో కథనము ప్రకారం, మగిలిన రెండు మూర్తులకు (తిరుప్పాఱ్కడల్ నంబి, మలైమేల్ నంబి) కూడా వారే మందిరాలు నిర్మించారని విదితమౌతున్నది. వీరు నంబుల కోసం దివ్య మండపాలను కూడా నిర్మించారు. ఆ విధంగా, మాముణులు తిరుక్కురుగూర్ నంబి (నమ్మాళ్వార్) మరియు తిరుక్కుఱుంగుడి నంబి (సర్వేశ్వరన్) ఇద్దరికీ సాధ్యమైన విధాలుగా అలంకారాలను ఏర్పాటు చేశారు. వారు ఈ మందిరాల కార్య నిర్వహణల అభివృధి బాధ్యతలను ఈ ప్రదేశాలలో తమ అనుచరులను అప్పగించారు. అనంతరం వారు కోయిల్ (శ్రీరంగం) కి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు.

జీయర్ శ్రీరంగానికి తిరిగి రాక

ఈ పాశురమును పఠిందారు……

పిఱందగత్తిల్ శీరాట్టు ప్పెఱ్ఱాలుం తన్నై
చ్చిఱంద్ఉగక్కుం శీర్కణవన్ తన్నై మఱందిరుక్క
ప్పోమో మణవాళర్ పొన్నడియై విట్టిరుక్క
లామో కల్వియఱిందాల్

(తమ పుట్టింటిలో ఎంత గారంగా చూసుకున్నా, ఆమెను గొప్పగా ఆదరించే భర్త పొందే ఆనందాన్ని మరచిపోగలదా? కొంత జ్ఞానం ఉన్న ఎవరైనా అళగియ మణవాళర్ (నంపెరుమాళ్) ల దివ్య స్వర్ణమయమైన చరణాల నుండి వీడి ఉండుట సరైనదేనా?) వెంటనే శ్రీరంగానికి తిరిగి రాడానికి ఆళ్వార్ అనుమతి కోరారు. శ్రీరంగానికి తిరిగి వచ్చి పెరియ పెరుమాళ్ళను సేవించి, ఇతర తత్వ సిద్ధాంతులతో తిరుగులేని విధంగా చర్చించి వారిపై తమ సిద్ధాంతాన్ని (రామానుజ దర్శనం) స్థాపించారు. తమ ఆదిషేశుని అవతారమని దర్శింపజేసే తమ గుణాలను వ్యక్తపరచుచూ పెరియ పెరుమాళ్ళ సమక్షంలో జీవించారు.

అప్పిళ్ళార్ అను ఒక జ్ఞాని  ఉత్తర ప్రాంతాలకు వెళ్లి వాద్వివాదాలలో చర్చించి ఇతర సిద్ధాంత అనుచరులపై గెలుపు పొందుచున్నారు. ఎఱుంబి అప్పాతో చర్చ వాదనకై వారు ఎఱుంబి (శోలింగపురం దగ్గరలో) అనే చోటికి చేరుకున్నారు. అప్పా కీర్తి గురించి తెలుసుకొని అప్పిళ్ళార్ ఆశ్చర్యపోయారు. అప్పాతో వాదనకు బదులుగా అతనితో స్నేహం ఏర్పరచుకొని వారి నుండి సూక్ష్మార్థాలను నేర్చుకున్నారు. మూడు దినాలు అక్కడే గడిపిన తరువాత ఇక బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో అప్పా అడిగగా. దానికి అప్పిళ్ళై “శ్రీరంగంలో జీయర్ అనే వ్యక్తి ఉన్నారు. అడియేన్ వారిని చూడాలని వారితో చర్చించాలని ఆశిస్తున్నాను” అని అన్నారు. ఇది విన్న అప్పా ఒక శ్రేయోభిలాషిగా అప్పిళ్ళార్ తో ఇలా అన్నారు “దేవరి వారి పక్షాన ఇలా అనడం సమంజసం కాదు. అడియేన్‌కి జీయర్ మహిమలు తెలుసు. పెరుమాళ్ కోయిల్‌ లో కిడాంబి నాయనారు నుండి శ్రీభాష్యం కలక్షేపం వినే భాగ్యం కలిగినప్పుడు, ఆ సమయంలో, నాయనార్లు అడియేన్ని పిలిచి, జీయార్ సామర్థ్యాలను పరీక్షించమని కోరారు. ఏకకాలంలో అన్ని అర్థాలపై ఉపన్యాసం ఇవ్వగల సమర్థుడు జీయర్. వారితో వాదనకు దిగడం ఎవరికీ సాధ్యం కాదు. పైగా, వారు యతులకు నాయకుడు మరియు శ్రీ వైష్ణవ దర్శనమును నడిపించువారు. మనమందరం వారి పట్ల ఎంతో గౌరవంగా ఉండాలి. తగిన సమయంలో మీకు వివరిస్తాను” అని చెప్పి వారిని పంపారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/04/yathindhra-pravana-prabhavam-50/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 49

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 48

జీయర్ మరియు తిరునారాయణపురం ఆయి సమావేశం

మాముణులు ఆచార్య హృదయంలోని 22వ సూత్రం [నమ్మాళ్వార్ల తిరువాయ్మొళి ఆధారంగా అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ (పిళ్లై లోకాచార్యుల తమ్ముడు) రాసిన నిగూఢ గ్రంథం] అర్థాన్ని వివరిస్తున్నప్పుడు, తమ వ్యాక్యానము అంతగా వారిని సంతృప్తి పరచలేదు. మంచి వివరణ ఎవరు ఇవ్వగలరా అని ఆలోచిస్తున్నారు. మాముణులకు తిరునారాయణపురత్తు ఆయి జ్ఞాపకం వచ్చి వారి వద్ద ఆ సూత్రార్థాల శ్రవణం చేయాలని ఆశించారు. ఆ తర్వాత జీయర్ తిరునారాయణపురత్తు ఆయిని కలవడానికి ఆళ్వారుకి అనుమతి పార్థిన చేసి, ఆళ్వార్ అనుమతితో తిరునారాయణపురానికి బయలుదేరారు. ఇంతలో, ఆయి కూడా మాముణుల కీర్తి మహిమలను విని వారిని సేవించాలనుకున్నారు. అటు ఆయి తిరునారాయణపురం నుండి బయలుదేరారు, దారిలో ఆళ్వార్ తిరునగరికి దగ్గర ఇద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారు. మాముణులు “ఎణ్ణిన పలం ఎదిరిలే వర ప్పెఱువదే” (అడియేన్ కోరిన ఫలాన్ని పొందాలని బయలుదేరితే ఆ ఫలమే ఎదురుగా రావడం ఎంతటి అదృష్టము!) అని పరవశించారు. ఇద్దరూ ఎంతో ఆప్యాయతతో ఒకరికొకరు భక్తితో గౌరవ నమస్కారాలు ఇచ్చి పుచ్చుకున్నారు. జీయర్ శిష్యులు వీరిరువురిని చూసి “పెరియ నంబి, రామానుజులు ముఖాముఖిగా వచ్చినట్లు అనిపిస్తోంది!” అని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం, అందరూ తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి) చేరుకున్నారు. మాముణులు తాను ఆచార్య హృదయంలో వినాలనుకున్న అర్థాలను ఆయి నుండి విని, వారిపైన ఒక తనియన్ సంకలనం చేశారు.

ఆచార్య హృదయమ్యార్తాః సకలా యేన దర్శితాః
శ్రీసానుధాసమమలం దేవరాజం తమాశ్రయే

(ఆచార్య హృదయ భావార్థాలను పూర్తిగా వివరించిన శ్రీసానుదాసర్ (తిరుత్తాళ్వరై దాసర్) అని పిలువబడే ఆ దేవరి వారిని (అయి) నేను నమస్కరిస్తున్నాను). ఆయి తమ ప్రశంసల పట్ల అంతగా రుచి చూపక, జీయరుని కీర్తిస్తూ ఇలా అన్నారు…

పూదూరిల్ వందుతిత్త పుణ్ణియనో? పూంగమళుం
తాదారుమగిళ్ మార్బన్ తానివనో – తూదూర
వంద నెడుమాలో? మణవాళ మామునివన్
ఎందై ఇవర్ మూవరిలుం యార్?

(శ్రీపెరంబుదూర్లో [రామానుజర్] అవతరించిన దివ్య మనిషినా వీరు? సుగంధ భరితమైన దివ్య హారము తమ వక్షస్థలముపై ఉన్నవారా [నమ్మాళ్వార్] వీరు? దూత కార్యాన్ని నిర్వహించుటకు వచ్చిన తిరుమాళా (శ్రీమహాలక్ష్మీ పతి) వీరు? ఈ ముగ్గురిలో నా స్వామి మణవాళ మాముణులు ఎవరు?) జీయర్‌ వారిని విశిష్ట అవతారంగా ఆదరించి కొంతకాలం ఆళ్వార్ తిరునగరిలోనే ఉన్నారు.

తిరునారాయణపురంలో ఆయిపై అసూయతో ఉన్న కొందరు, వారి అనుపస్థితిని ఉపయోగించుకుని, వారు తిరునాడు (శ్రీవైకుంఠం) కి చేరుకున్నారని ప్రచారం చేసి, ఆయి తిరుమాలిగలో ఉన్న వస్తువులన్నీ ఆలయ గిడ్డంగి (స్టోర్ రూం) లో శెల్వ పిళ్ళై (తిరునారాయణపురం ఆలయంలోని పెరుమాళ్ పేరు) సమర్పణగా ఇచ్చేసారు. ఆయి సుమారు అదే సమయంలో, ఆళ్వార్ తిరునగరి నుంచి తిరునారాయణపురానికి తిరిగి వచ్చి, జరిగిన సంఘటన గురించి విని, “యస్యానుగ్రమ్ ఇచ్ఛామి తస్య విత్తం హరామ్యహం” (నాకు నచ్చిన వారిపై కృప చూపాలనుకుంటే మొదట వారి సంపదను దోచుకుంటాను) అన్న గీతా శ్లోకాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని సంతోషించారు. తన సంపదను సర్వేశ్వరుడు స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి, ఆతని కరుణకు పాత్రుడైనందుకు సంతోషించారు. “యస్యైతే తస్యతద్దనం” (యజమాని తన ఆస్తిని స్వాధీనము చేసుకొనుట సమంజసమే) అని ఆలోచిస్తూ ఆనంద బాష్పాలు కార్చారు. ఆ తర్వాత వారు తమ నిత్యారాధన కొరకు జ్ఞానప్పిరాన్ (వరాహ స్వరూపము) మూర్తిని మాత్రమే తీసుకొని మిగిలిన వాటిని యాదవగిరినిలయుని (యాదవగిరి పెరుమాళ్) కి తమ సమర్పణగా ఆలయంలోనే ఉంచారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/02/yathindhra-pravana-prabhavam-49/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 48

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 47

ఈ శ్లోకములో చెప్పినట్లు..

యానియానిచ దివ్యాని దేశే దేశే జగన్నితేః
తాని తాని సంస్థాని స్థాని సమసేవత

(మార్గంలో, ఎమ్పెరుమాన్ ఎక్కడెక్కడ కొలువై ఉన్నాడో అక్కడక్కడి పెరుమాళ్ళ దివ్య తిరువడిని సేవించారు), తిరుమంగై ఆళ్వార్ తిరునెడుందాణ్డగం పాశురం 6 లో “తాన్ ఉగంద ఊరెల్లాం తన తాళ్ పాడి” (ఎమ్పెరుమాన్ ఆనందంగా కొలువై ఉన్న దివ్య దేశాలలో వారి తిరువడిని సేవించుట) అని చెప్పినట్లుగా, దారిలో ఉన్న అన్ని దివ్య దేశాలలో మంగళాశాసనాలను సమర్పించుకున్నారు. ఈ శ్లోకంలో పేర్కొన్న విధంగా వారు దివ్య దేశాలను సేవించారు:

వైకుంఠనాథ విజయాసన భూమిపాలాన్ దేవేశ పంకజ విలోచన చోరనాట్యాన్
నిక్షిప్తవిత్త మకరాలయకర్ణపాశాన్ నాతం నమామి వకులాభరేణ శార్థం

(నేను శ్రీవైకుంఠనాదర్ (శ్రీ వైకుంఠము), విజయాసనర్, భూమి పాలర్, దేవర్పిరాన్ (తిరుప్పుళింగుడి), అరవిందలోచనర్ (తిరుత్తొలైవిల్లిమంగళం), మాయక్కూత్తర్ (పెరుంగుళం), వైత్తమానిధి (తిరుక్కోళూర్), మకర నెడుం కుళైక్కాదర్ (తెన్తిరుప్పేరై), ఆళ్వార్ తో పాటుగా ఉన్న ఆదినాదర్, వీరిని వకుళాభరణర్ అని కూడా పిలుస్తారు పాద పద్మాలను సేవించాను). అష్టతలములు ఉన్నట్లు కనిపించే శ్రీవైకుంఠంలో ఉన్న శ్రీ శ్రీవైకుంఠనాదర్ ను ఆరాధించి, అష్ట సన్నిధులను సేవిచుకుంటూ, కర్ణికై (ఎనిమిది విమానాల మధ్య భాగము) వంటి కేంద్రమైన ఆళ్వార్ తిరునగరికి వారు చేరుకున్నారు. వారి అనుచరులు ఆళ్వార్ 4.10 పాశురమైన ‘తిరుక్కూరదనై ప్పాడియాడి ప్పరవి చ్చెన్మింగళ్ క్కుఉరాధనైప్పాడియాదీప్పరవిచ్చెన్మింగల్’ (మీరు తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి) ని సేవిస్తున్నన్నప్పుడు ఆడండి పాడండి) పైన ఆనందతో ఆడారు పాడారు. జీయర్ తమ గోష్ఠితో కలిసి తామిరపరణి నది ఒడ్డుకి చేరుకొని మంగళ స్నానం చేసి, పన్నెండు ఊర్ధ్వపుండ్రాలను ధరించి, కోకిల పక్షుల కిలకిలారావాలు చేసే సరస్సులను, ఎర్రటి తామర పుష్పాలు వికసించి ఉన్న సరస్సులను, చుట్టూ తుమ్మెదల హుంకారాలను వింటు, బంగారు భవంతులు, ఎత్తైన దివ్య నివాస భవనాలను ఆస్వాదించుచూ నిత్యసూరులు ఆరాధించిన తిరుక్కురుగూర్‌ ను దర్శించుకుంటూ ఈ పాశురాన్ని పఠించారు

పుక్కగత్తినిన్ఱుం పిఱందగత్తిల్ పోందదు పోల్
తక్క పుగళ్ తెన్నరంగం తన్నిల్ నిన్ఱుం – మిక్క పుగళ్
మాఱన్ తిరునగరి వందోం అరంగన్ తన్
పేఱన్ఱో? నెంజే! ఇప్పోదు

(మెట్టినింటి నుండి పుట్టింటికి వచ్చినట్లు, దక్షిణాన ఉన్న అత్యంత ప్రసిద్ధ పట్టణమైన శ్రీరంగము నుండి బయలుదేరి [ఆళ్వార్] తిరునగరికి చేరుకున్నాము. ఓ హృదయమా! ఇది శ్రీరంగనాథుని కృప వల్లనే జరిగినది కదా?)

వారు పట్టణ ప్రవేశం చేసినప్పుడు, తిరుక్కురుగూర్‌ లో నివసించే గొప్ప జ్ఞానులు పండితులు తండోపతండాలుగా వచ్చి జీయర్ తిరువడి యందు సాష్టాంగము చేశారు. వారందరిపైన కృపా వర్షాన్ని కురించి గోష్ఠిగా సాగుతూ మొట్ట మొదట చతుర్వేది మంగళం వీధిలో ఉన్న ఎమ్పెరుమానార్ల సన్నిధికి చేరుకున్నారు. “శ్రీ మాధవాంగ్రి జలజ…. రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా” (శ్రీ లక్ష్మీపతి దివ్య చరణాల నిత్య సేవ చేస్తున్న యతిరాజైన రామానుజుల దివ్య పాదాలకు సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాను) అని యతిరజ వింశతిలోని 1వ శ్లోకమును పఠించారు [ఈ స్తోత్రాన్ని వారు ఆళ్వార్ తిరునగరిలో ఉన్నప్పుడు స్వరపరిచారు]. ఆ సన్నిధిలో వారు తీర్థ ప్రసాదాలను స్వీకరించి అక్కడి నుండి బయలుదేరి తిరువాయ్మొళి పిళ్ళై తిరుమాలిగకు చేరుకున్నారు. ద్వారం వద్ద సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకొని లోనికి ప్రవేశించి ఇనవాయర్ తలైవన్ (పశువుల కాపరి శ్రీ కృష్ణుడు) ని సేవించారు. ఆచార్య తిరువాయ్మొళి పిళ్ళై తనియన్, అనగా, “నమః శ్రీ శైల నాథాయ…” పఠించి “మనల్ని యోగ్యులగా మార్చిన ప్రదేశం ఇదే కాదా?” అని మననము చేసుకుంటు తిరువాయ్మొళి పిళ్ళై ఉపన్యాసం ఇచ్చే చోటిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఎత్తైన కొండల వంటి భవనాలనూ, మేలిమి బంగారంలా మెరిసే భవనాలనూ వీక్షిస్తూ ముందుకు సాగారు. వారు ఉభయ ప్రధాన ప్రణవం (ప్రణవం (ఓం) లో ‘అ’ మరియు ‘మ’ అక్షరాలు ఉన్నట్లే), ఆదినాతర్ మరియు ఆళ్వార్ ఇరువురూ కొలువై ఉన్న) ఆలయంలోకి ప్రవేశించారు. ‘వకుళాభరణం దేవం స్వకుళాభరణం యయౌ’ (తమ వంశానికే ఆభరణం లాంటి పూజ్యర్ (అత్యంత స్వచ్ఛమైన) నమ్మాళ్వార్ల సన్నిధికి చేరుకున్నారు) అని చెప్పినట్లుగా, వీరు మొదటగా వకుళ పుష్ప మాలను తమ ఛాతీపై ధరించి ఉన్న ఆళ్వార్ దివ్య చరణాలని సేవించారు). తనియన్ ‘మాతా పితా… వకుళాభిరామం శ్రీమద్ తదంగ్రియుగలం ప్రణమామి మూర్ధ్నా’ తో ప్రారంభించి, మధురకవి ఆళ్వార్ల కణ్ణినుణ్ శిరుఱ్ఱాంబు ప్రబంధాన్ని పఠించారు. ‘అన్నైయార్ అత్తనాయ్’ పాశురంలో చెప్పినట్లు, ఆళ్వార్ని తమ తల్లిగా, తండ్రిగా, ఇతర సంబంధిగా భావించే వీరు అంజలి ముద్రతో వారి ముందు నిలబడి సేవించారు. చాలా కాలంగా వేరే ఊళ్లో ఉండి ఇంటికి తిరిగి వస్తున్న కొడుకుని తల్లిదండ్రులు చూస్తున్నట్లుగా ఆళ్వార్ కూడా జీయరుని మనసారా తదేకంగా చూశారు. ఆళ్వార్ జీయరుకి తీర్థం మరియు శ్రీరామానుజులను (దివ్య చరణాలు) సమర్పించారు. వారు ‘శెల్వచ్ఛటకోపర్ తేమలర్తాట్కు ఏయ్ త్తినియ పాడుకమామ్ ఎందై ఇరామానుసనై వాయ్ందు ఎనదు నెంజమే వాళ్ (ఓ నా హృదయమా! కైంకర్య సంపద పుష్కలంగా ఉన్న శ్రీ శఠగోపుల తేనె వంటి చరణ పాదుకలుగా ఉన్న శ్రీ రామానుజులను స్వీకరించి వర్ధిలుము) వారు పఠించాను. ‘వకుళాలంకృతం శ్రీమచ్చటగోప పదద్వయం అస్మద్ కులధనం భోగ్యమస్తుమే మూర్తి భూషణం (కైంకర్య సంపదతో నిండి ఉన్న శఠగోపుల దివ్య పాదాలు నా శిరస్సుపై ఆభరణములా ఉండనీ) అని వారు పఠించాను. తరువాత ఆళ్వార్ సంకల్పానికి అనుగుణంగా, వీరు పొలిందు నిన్ఱ పిరాన్ సన్నిధికి వెళ్ళి తమ మంగళాశాసనాలు సమర్పించుకున్నారు. పిదప వారు తమ మఠానికి వచ్చి అక్కడ కొంత కాలం ఉన్నారు. స్థానిక వాసులెందరో జీయరుని ఒక దివ్య అవతారంగా భావించి, వారి దివ్య తిరువడి యందు ఆశ్రయం పొందారు. వాళ్ళపైన తమ దయను చూపి ఆళ్వార్ల దివ్య ప్రబంధాలను వాళ్ళకి ఉపదేశించారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/02/yathindhra-pravana-prabhavam-48/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org