Monthly Archives: December 2022

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 86

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 85

పేరారుళాళన్ పెరుమాళ్ళ కోసం సాలైక్కిణఱు (బావి) నుండి తిరుమంజన తీర్థం తీసుకువచ్చే కైంకర్యం చేసిన స్వామియణ్ణన్

స్వామి అణ్ణన్ (కందాడై అణ్ణన్) పేరారుళాళన్ పెరుమాళ్ళ తిరువారాధన కోసం సాలైక్కిణఱు (బావి) నుండి తిరుమంజనం (పవిత్ర జలం) తీసుకురావాలని ఆశించారు. ఉడైయవర్లు చేసిన ఆ కైంకర్యం ముదలియాండాన్ పరమానందంతో చేశారు. కందాడై తోళప్పర్ (ముదళియాండన్ మనుమడు) కోరికతో అదే కైంకర్యాన్ని చేశారు కాబట్టి, అణ్ణన్ కూడా ఈ కైంకర్యం చేయాలనుకున్నారు. వారు ఉదయాన్నే లేచి, పుష్కరిణి వద్దకు వెళ్లి, తీర్థమాడి (స్నానం), నిత్య కర్మానుష్టానములు చేసి, కైంకర్య ఆసక్తి ఉన్న శ్రీవైష్ణవులతో కలిసి సాలైక్కిణఱు వద్దకు ఆళవందార్ల స్తోత్ర రత్నం జపించుకుంటూ వెళ్లి, నీటి బిందేలను శుభ్రం చేసి, వాటిలో నీరు నింపి శిరస్సులపై పెట్టుకొని వచ్చేవారు. వారు తణ్ణీరముదు ఉత్సవం (తిరుమలలో ఉడయవర్లచే నిర్దేశింపబడినది ఈ ఉత్సవం) వలె, కాంచీపురంలో ఉన్నంన్నాళ్ళు అదే విధిని పాఠించారు. ఈ ఉత్సవం నిర్వహించడానికి కారణం ఏమిటంటే, రామానుజుల మేనమామైన తిరుమల నంబి తిరుమలలో తీర్థ కైంకర్యం (తిరువేంకటేశ్వరుని ఆరాధన కోసం ఆకాశ గంగ జలాన్ని తీసుకురావడం) చేస్తున్న కాలంలో, ఒకరోజు పెరుమాళ్ళు వేటగాడి వేషం లో వచ్చి తిరుమల నంబి మోసుకెళుతున్న కుండకు రంధ్రం చేసి, ఆ రంధ్రంలో నుండి వచ్చిన జలాన్ని తాగాడు. జరిగిన ఈ ఘట్టాన్ని అందరికీ తెలియజేయడానికొసం, అధ్యయన ఉత్సవం పూర్తయిన మరుసటి రోజున, అనేక మంది శ్రీవైష్ణవులు ఆకాశ గంగ జలాన్ని తీసుకువచ్చే ప్రక్రియను ఉడయవర్లు ఒక ఉత్సవంగా చేశారు). స్వామి అణ్ణన్ దయతో అప్పాచ్చియార్ అణ్ణను పేరారుళాళన్ పెరుమాళ్ళ కోసం క్రమం తప్పకుండా ఈ కైంకర్యాన్ని నిర్వహించమని ఆదేశించారు.

కందాడై రామానుజ అయ్యంగార్లు చేసిన కైంకర్యాలు

కందాడై రామానుజ అయ్యంగార్ తిరుమలలో పలు కైంకర్యాలు పూర్తి చేసుకొని కంచికి తిరిగి వచ్చిన తర్వాత, అనంత సరస్సులో (కాంచీపురం దేవప్పెరుమాళ్ళ పుష్కరిణి) నిరాళి మండపాన్ని (పుష్కరిణి మధ్యలో మటపం) నిర్మించారు. పుష్కరిణికి దక్షిణ భాగంలో ఎత్తైన అరుగు, అనంత సరస్సులోకి మెట్లు, ఆలయంలో సింహాసనం (పెరుమాళ్ళ కోసం), మండపం నిర్మింపజేశారు. పెరుమాళ్ళ తిరుమంజనం మంటపానికి ఎదుట ఉన్న తిరుమళిశై పిరాన్ ఆలయంలో (తిరుమళిశై ఆళ్వార్) అనేక కైంకర్యాలు చేశారు. పెరుమాళ్ళ కోసం దివ్య ఆభరణాలు, తిరుమడప్పళ్ళి (వంట శాల), పెరుమాళ్ తిరుమంజనం కోసం వేళకు హరిద్ర చందన తయారి చేయడం మొదలైన అనేక ఇతర కైంకర్యాలు చేసేవారు. కందాడై అణ్ణన్ పెరుమాళ్ళకు తగిన ప్రసాదాలు తయారు చేయమని అయ్యంగార్లను ఆదేశించి, “ఇవన్నీ అళగియ మణవాళ మాముణుల కైంకర్యాలు. వాటిని నియమం తప్పకుండా చేయండి.” అని చెప్పి అప్పాచియార్ అణ్ణతో తమకు సమానంగా వ్యవహరించమని చెప్పి వారిని తిరుమలకు పంపారు.

అణ్ణన్ జీయర్ – జీయర్ అణ్ణన్

స్వామీ అణ్ణన్ అనేక దివ్యదేశాలతో పాటు శ్రీపెరంబుదూరుకి కూడా మంగళాశాసనము చేయాలనుకున్నారు. వారు తిరువారాధన పూర్తి చేసుకొని, పెరుమాళ్ళకు నివేదించిన నైవేద్యాలను స్వీకరించిన తర్వాత, పేరారుళాళన్ పెరుమాళ్ళ అనుమతి కోరారు. పెరుమాళ్ళు వారికి తమ పీతాంబర వస్త్రం, అభయ హస్తం (హస్త ముద్ర), తిరువడిసోడు (పాద కవచాలు), కళబం (పరిమళ ద్రవ్యాల మిశ్రమం), తులసి హారాన్ని ప్రసాదించి, ఇవన్నీ “జీయర్ కోసం” అని అన్నారు. ఆ పిదప అణ్ణన్ ను సంతోషంగా వెళ్ళమని అనుమతినిచ్చాడు. అణ్ణన్ వైయమాళిగ వద్ద ఉన్న కచ్చిక్కు వాయ్తాన్ మండపం (ఆలయం లోపలి మండపం) కి చేరుకుని జీయర్ స్తుతి చేసి పేరారుళాళన్ ను సంతోషపెట్టారు. అక్కడి గోష్ఠిలోని ప్రముఖులు, పేరారుళాళన్ తమ జీయర్‌ కు ‘అన్నాన్ జీయర్’ అనే దివ్య నామాన్ని అనుగ్రహించారని కీర్తించారు. అక్కడ ఉన్న మరికొందరు, పెరియ పెరుమాళ్ స్వామీ అణ్ణన్ (కందాడై అణ్ణన్) కు ‘జీయర్ అణ్ణన్ ‘ అనే దివ్య నామాన్ని అనుగ్రహించారని కీర్తించారు. ఈ విధంగా గోష్ఠిలోని ప్రముఖులు జీయర్ అణ్ణన్ ల మధ్య పరస్పర సాన్నిహిత్యం, ఆప్యాయతను కీర్తించారు. అదే సమయంలో అణ్ణన్ కు “చాలా కాలమైనది, వెంటనే రమ్ము” అని జీయర్ నుండి సందేశం వచ్చింది. అణ్ణన్ ఆ దివ్య సందేశాన్ని శిరస్సున పెట్టుకుని, శ్రీపెరంబుదూర్, ఇతర దివ్యదేశాల వైపు చూసి, సాష్టాంగ నమస్కారం చేసి, వెంటనే శ్రీరంగానికి బయలుదేరారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/12/yathindhra-pravana-prabhavam-86/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 85

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 84

కందాడై అణ్ణన్ ను ఆశ్రయించిన అయోధ్య రామానుజ అయ్యంగార్లు

రామానుజ దాసర్ అయోధ్య రామానుజ అయ్యంగార్ని చూసి, “దేవర్వారి సూచనల మేరకు, బద్రికాశ్రమంతో పాటు ఇతర దివ్య దేశాలలో కైంకర్య నిర్వహించు విధానాలను చిన్న రామానుజ అయ్యంగారుకి నేర్పించి, వారి చేత అక్కడ అన్ని కైంకర్యాలు నిర్వహింపజేశాను. అడియేన్ దేవరి వారిని దర్శించుకోవడంతో పాటు, కందాడై అణ్ణన్ తిరువడిని సేవించే భాగ్యం కూడా కలిగింది” అని అన్నారు. రామానుజ అయ్యంగార్ చాలా సంతోషించి, తిరుమలకు చేరిన దగ్గర నుండి తిరువేంకటేశ్వరుడిని సేవించినప్పటి వరకు అక్కడ జరిగిన సంఘటనలంన్నింటి గురించి రామానుజ దాసర్ కు విడమరచి వర్ణించారు. రామానుజ అయ్యంగార్ని ఓదార్చడానికి రామానుజ దాసర్ వారితో ఇలా అన్నారు, “జీయర్ తిరువడి ఆశ్రయం పొంద లేదనే మీ ఆవేదనను పక్కన పెట్టండి; రేపు, తిరువోణం (శ్రావణం, తిరువేంకటేశ్వరుడిని తిరునక్షత్రం) సమయంలో, ఆ వేంకటేశ్వరుడు దివ్య స్నానమాచరించినడానికి (పుష్కరిణి స్నానం) వచ్చినపుడు, అణ్ణన్ ఆశ్రయం పొందండి, ఇది జీయరుకి రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది” అని తెలిపారు. ఇది విన్న రామానుజ అయ్యంగార్ సంతోషించి, తనతో పాటు రామానుజ దాసర్‌ ను కూడా తీసుకొని అణ్ణన్ వద్దకు వెళ్ళారు. వారి ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి తమ విన్నపాన్ని వారికి ప్రకటించారు. కరుణతో అణ్ణన్ “జీయర్ కూడా ఇదే కోరున్నారు” అని వారికి తెలిపారు. రామానుజ దాసర్ మరియు జీయర్ల విధానంలో సారూప్యతను గమనించి వారు ఆశ్చర్యపోయారు. జీయర్ తమ తరపున వివిధ దివ్య దేశాలను సేవించమని రామానుజ దాసర్‌ ను నియమించారని మనగళాశాసనం చేస్తూ, వారు అయోధ్య రామానుజ అయ్యంగార్ కు సమాశ్రయణం (పంచ సంస్కారం) నిర్వహించారు. తిరుప్పల్లాండు పాశురం “పండైక్కులత్తై తవిర్ందు” (వంశాచారాలకు దూరం అగుట) లో పేర్కొన్న విధంగా, రామానుజ అయ్యంగార్లు తమ మునుపటి మార్గాలను విడిచి, శుద్ధ బంగారంగా మారారు. తర్వాత రామానుజ దాసర్, అయోధ్య రామానుజ అయ్యంగార్లు తిరువేంకటేశ్వరుడి సన్నిధికి తీసుకెళ్లి పెరుమాళ్ళకు మంగళాశాసనం చేశారు. పెరుమాళ్ళు వారిపై తమ కృపను కురిపించి, రామానుజ అయ్యంగార్లకు తమ పట్టు పీతాంబరాన్ని ప్రసాదించారు. కందాడై అణ్ణన్ రామానుజ అయ్యంగార్ల మధ్య సంబంధ నిర్ధారణకై, అయోధ్య రామానుజ అయ్యంగారుకి “కందాడై రామానుజ అయ్యంగార్” అను తిరునామాన్ని ప్రసాదించారు. అనంతరం, పెరియ కేల్వీ జీయర్, శిరియ కేల్వీ జీయర్, ఏకాంగులు, ఆచార్య పురుషులు, స్థలత్థార్లు అందరూ అణ్ణన్ తిరుమాలిగకు వెళ్లి వారికి అనేక బహుమానాలు అందించారు. అణ్ణన్ తిరువడి సంబంధం పొందాలని ఆశించినవారు వారి వద్ద ఆశ్రయం పొంది, వారి శ్రీపాద తీర్థ ప్రసాదాన్ని తీసుకున్నారు;

తిరువరంగ దర్శనం కొరకై అణ్ణన్ తిరుమల నుండి బయలుదేరుట

మర్నాడు ఆలయ మర్యాదలతో అందరూ అణ్ణన్ ను వేంకటేశ్వరుని సన్నిధికి తీసుకెళ్లారు. వారు మంగళాసనం చేసిన తర్వాత, పెరుమాళ్ళ నడుముపై ధరించే దివ్య పీతాంబరాన్ని ఇతర సన్మానాలతో అణ్ణన్ కు సమర్పించారు. అర్చక ముఖేన పెరుమాళ్ళు కందాడై రామానుజ అయ్యంగార్ల పల్లకి కోసం ఛత్ర చామరాది (గొడుగు, వింజామర మొదలైన) ని అందించి, ఇక బయలుదేరమని అనుమతినిచ్చారు. వాళ్ళు కొండ దిగి తిరుపతి పట్టణానికి చేరుకుని, శ్రీ గోవిందరాజ పెరుమాళ్ళ సన్నిధి వెళ్లి, శ్రీ గోవిందరాజుతో పాటు ఇతర సన్నిధులకు మంగళాశాసనము గావించారు. అక్కడి నుండి బయలుదేరి వారు ఎఱుంబి చేరుకున్నారు. అక్కడ ఎఱుంబి అప్పా వారి తండ్రి ఐయైగళ్ అప్పా, అళగియ మణవాళ దాసర్, ఇతర శ్రీవైష్ణవులతో కలిసి వారిని స్వాగతించి, తమ తిరుమాలిగకు తీసుకువచ్చి సన్మానించారు. “ఇళైయాళ్వార్ పిళ్ళై, తిరువాయ్మొళి ఆళ్వార్ పిళ్ళై మొదలైన ఆచార్యులు, ఎమ్పెరుమానార్ జీయర్, తిరువెంగడం జీయర్ మొదలైన జీయర్లు ముందు వెళ్లారు” అని అణ్ణన్ అన్నారు. ఎఱుంబి అప్పా తండ్రిగారు ఐయైగళ్ అప్పా, దారిలో తమ వద్ద ఆగ లేదని కలత చెందారని, అణ్ణన్ వారిని ఓదార్చడానికి ఇలా అన్నారు, “వారు పల్లకీలో ప్రయాణిస్తున్నందున, వారితో పాటు నడవడం సరికాదని, అందుకే ముందు వెళ్లమని అన్నాను” అని అన్నారు, వారు పద్మజా పురం (శోలింగపురం) అనే ప్రదేశానికి చేరుకున్నారని తెలిపారు. ఐయైగళ్ శుద్ద సత్వ అణ్ణన్ చేతులు పట్టుకుని, పద్మపురం తోడుగా రమ్మని ప్రార్థించారు. అక్కడికి చేరుకొని ఆచార్య పురుషులు, జీయర్లు అందరినీ కలుసుకొని, వారి యోగక్షేమాలు అడిగి తెలుకొని, ఒకరినొకరు సేవించుకున్న పిదప ఐయైగళ్ అందరినీ వారి తిరుమాలిగకు తీసుకు వచ్చారు.

అక్కడ, వారి తిరువారాధన పెరుమాళ్ళకు, చక్రవర్తి తిరుమగన్ (శ్రీ రాముడు) కి తిరువారాధన నిర్వహించి, నివేదనలు అర్పించి తరువాత, తాదీయారాధన నిర్వహణ జరిపారు. మర్నాడు, వారు తిరుక్కడిగై (శోలింగపురం) కు వెళ్లి, అక్కారక్కని పెరుమాళ్లకు మంగళాసనం చేసి, ఆ తర్వాత తిరుప్పుట్కుళి (కాంచిపురం సమీపంలోని దివ్యదేశం) చేరుకుని, పుట్కుళియెంపోరేఱు (తిరుప్పుట్కుళి పెరుమాళ్ళ తిరు నామం) కు మంగళాసనం చేశారు. అనంతరం, వారు పెరుమాళ్ కోయిల్‌ చేరుకున్నారు.  అక్కడి ఆచార్యులు ఆలయ పరిచారకులందరూ ముందుకు వెళ్లి వారికి స్వాగతం పలికారు. అణ్ణన్ తో కలిసి అందరూ క్రమంలో అన్ని సన్నిధిలలో మంగళాశాసనం చేసి పేరారుళాళర్, పెరుందేవి తాయార్‌ ను దర్శించుకున్నారు. తరువాత వారి తిరుమాలిగకు తీసుకువెళ్లి, వారికి తగిన గౌరవంతో సత్కరించారు. అప్పాచ్చియారణ్ణా ఎంతో సంతోషించి, తాను ముదళియాండన్ ను సేవిస్తున్నట్లు వారు భావించారు. అణ్ణన్ ను సత్కరిస్తుండగా పేరారుళాళర్ కూడా సంతోషించి, అందరూ వారిని గౌరవంతో సంబోధించాలని “స్వామీ” అని పిలిచారు, .

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/11/yathindhra-pravana-prabhavam-85/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 84

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 83

తిరుమలకు బయలుదేరిన కందాడై అణ్ణన్

జీయర్ దయతో కందాడై అణ్ణన్ ను ఆదరించి, “దేవర్వారు తిరువేంకటేశ్వరునికి మంగళాశాసనం చేయ లేదు కదా?” అని అడిగారు. అక్కడ దగ్గరలో ఉన్న అప్పిళ్ళై, “కావేరిని దాటి వెళ్ళని కందాడై అణ్ణన్, అని ప్రసిద్ధికెక్కిన వారు వీరే కదా?” (వీరు శ్రీరంగనాధుని పరమ భక్తుడు) అని అన్నారు. దానికి జీయర్ “నిత్యసూరులందరూ సమావేశమై అరంగత్తణైయాన్ (శ్రీరంగనాధుడు) కి తిరువారాధన చేయాలని ఆశించేది తిరుమలలోనే కాదా?” [ఇక్కడ ప్రస్తావన తిరుప్పణాళ్వార్ తమ అమలనాదిపిరాన్ ప్రబంధం 3వ పాశురంలో ప్రస్తావించబడింది, ఆ పాశురంలో వారు ‘మందిపాయ్ వడవేంగడమామలై వానవర్గళ్ సంధి శెయ్య నిన్ఱాన్ అరంగత్తు అరవిణ్ అణైయాన్’ – దివ్య తిరుమలలో వానరులు ఎగిరి గెంతులు వేస్తుంటే, శ్రీ రంగనాధుడు నిత్యస్యూరుల ఆరాధనకై నిలబడి ఉన్నాడు’, అని వర్ణించబడి ఉంది]. అప్పుడు అణ్ణన్ జీయర్ తో “దేవర్వారు అడియేన్ ను ఆదేశించాలి” అని అన్నారు. జీయర్ అతనిని పెరుమాళ్ సన్నిధికి తీసుకువెళ్లి, తిరుమల వెళ్లేందుకు అనుమతినిచ్చి, ఆలయ అర్చకులైన ఉత్తమ నంబిని కూడా కందాడై అణ్ణన్ కు తోడుగా వెళ్ళమన్నారు. వారితో పాటు అనేక శ్రీవైష్ణవులను, జీయర్లను, ఏకాంగులను వెళ్ళమన్నారు. కందాడై అణ్ణన్ సౌకర్యం కోసమై ఉత్తమ నంబి పల్లకిని, ఇతర సౌకర్యాలను సిద్ధం చేసారు. అణ్ణన్ వాటన్నింటిని తిరస్కరించి, శ్రీవైష్ణవ గోష్ఠిని సేవిస్తూ తిరుమలకు వెళ్ళారు. భాద్రపద మాస బ్రహ్మోత్సవాల (పురట్టాసి మాసం) సందర్భంగా కనీసం రెండు మూడు రోజులు తిరుమలలో బసచేయాలన్న కోరికతో, ఆతృతగా ప్రయాణం సాగించారు. గోష్ఠి తిరుపతి చేరుకుని అడిప్పుళి అళగియ శింగర్ (నరసింహ పెరుమాళ్) ను దర్శించుకున్నారు. తిరుమల అనంతాళ్వాన్ [రామానుజుల శిష్యులలో ఒకరైన ‘ఒన్ఱాన తిరుమలై అనంతాణ్ పిళ్ళై’ వంశం వారు, అక్కడ పుష్ప కైంకర్యం చేసేవారు] ఈ వార్త పెరియ కెల్వియప్పన్ జీయర్ విన్న వెంటనే, స్థానిక ప్రముఖులకు ఈ విషయం గురించి కబురు పంపారు. సంతోషకరమైన ఈ  వార్త విన్న వారందరూ,  బ్రహ్మొత్సవాలలో పెరుమాళ్ళను దర్శించుకొని, అందరూ పెరుమాళ్ళు దివ్య రథాన్ని అధిరోహించే వరకు ఉండి, వెంటనే గోష్ఠి మొత్తం అణ్ణన్ ను స్వాగతించేందుకు వెళ్ళారు. అణ్ణన్ ను గౌరవ మర్యాదలతో స్వాగతం పలికి, తరువాత వారందరూ పెరుమాళ్ళ రథం వద్దకు వచ్చారు. కందాడై అణ్ణన్ పెరుమాళ్ళకు మంగళాశాసనం చేసిన తరువాత, రథం తిరుమాడ వీధుల్లో ప్రదక్షిణ గావించింది. ఇయల్ గోష్ఠి (నాలాయిర దివ్య ప్రబంధం పారాయణం చేసేవారు) జరిగే చోట, అయోధ్య రామానుజ అయ్యంగార్ అణ్ణన్ ను చూసి పారవశ్యంతో వారికి నమస్కారాలు సమర్పించుకున్నారు.

అదే సమయంలో, బద్రికాశ్రమంలో ఉన్న రామానుజ దాసర్ తిరుమలకు వచ్చారు. తిరుమలకు అణ్ణన్ వెంచేయడం చూసి ఆశ్చర్యపోయారు, వెంటనే అణ్ణన్ దివ్య పాదాలను సేవించుకున్నారు. అణ్ణన్ కూడా రామానుజ దాసర్ ను చూసి ఎంతో సంతోషించి, వారిని ఆలింగనం చేసుకొని ఆనందంగా “ఓ రామానుజ దాసర్! రండి. మీ దర్శన భాగ్యం మాకు కలిగింది! పర దేశానికి వెళ్లిన కొడుకులో తండ్రి మనస్సు ఉన్నట్లు, జీయర్ దివ్య హృదయం మీతో కలిసి ఉంది”, అని రామానుజ దాసర్ల ఆచార్య నిష్ఠాని అక్కడ సమావేశమైన ప్రముఖులందరికీ తెలిపారు. పెరుమాళ్ళు రథం నుండి దిగి ఆలయంలోకి ప్రవేశించారు. పెరుమాళ్ళను సేవించే క్రమంలో, అణ్ణన్ శ్రీవారి దివ్య పాదాల నుండి కిరీట పర్యంతం, మరలా శ్రీ దివ్య కిరీటం నుండి వారి పాదాల వరకు సేవించుకున్నారు. తన మనస్సులోని కోరిక పూర్తి అయినందుకు సంతృప్తితో, తీర్థ, శ్రీ శఠారీలు, శ్రీవారి పాద ధూళిని స్వీకరించి అనంతాళ్వాన్ తిరుమాలిగకు వెళ్ళారు. అక్కడ అనంతాళ్వాన్ అణ్ణన్ కు సకల గౌరవ సన్మానాలు నిర్వహించారు. కందాడై అణ్ణన్ కొన్ని రోజులు అక్కడే ఉన్నారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/11/yathindhra-pravana-prabhavam-84/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 83

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 82

కోయిల్లోని మరి కొన్ని సంఘటనలు

తిరువెంకటేశ్వరుడు తిరుమలలో కైంకర్యం చేయమని తిరుమలై అయ్యంగార్లను ఆదేశించిన రోజున, జీయర్ తిరువాయ్మొళి 3.3 పదిగం ‘ఒళివిలాక్కాలం ఉడనాయ్ మన్ని వళువిలా అడిమై శెయ్య వేండుం నామ్’ (ఆటంకాలు లేకుండా నిష్కల్మశమైన కైంకర్యం చేయాలి) కాలక్షేపం చేస్తున్నారు. వారు కూర్చున్నా, నిలబడినా, పడుకున్నా దుఃఖంతో రోధిస్తున్నారు. అంతకు ముందు రేత్రి, తిరువేంకట జీయర్ అనే ఒక ఏకాంగి (జీయరుకి సహకారిగా ఉండే బ్రహ్మచారి) ప్రతివాది భయంకరం అణ్ణా స్వప్నంలో వచ్చి “ఓ శ్రీవైష్ణవ దాసర్! రా! రేపు ‘ఒళివిలాక్కాలం’ కలక్షేపం సమయంలో జీయర్ మైమరపు స్ధితిలో ఉంటారు, ఎందుకంటే అక్కడ వారు కైంకర్యం చేయ లేదు కాబట్టి. ఆదిశేషుని అవతారమైన శేషశైలంలో (తిరుమల) వారికి కైంకర్యం ప్రసాదిస్తామని వారికి చెప్పండి” అని చెబుతారు. ప్రతివాది భయంకరం అణ్ణా చటుక్కున మేల్కొని “ఏమి ఈ దివ్య స్వప్నం!” అని మర్నాడు ఉదయం తమ నిత్య అనుష్ఠానాలు ముగించుకొని, తిరుమలైయాళ్వారుకి (జీయర్ మఠంలోని ఉపన్యాస మంటపం) చేరుకున్నారు, అక్కడ జీయరుకి సాష్టాంగ నమస్కారం చేశారు. అక్కడ జీయర్ పరిస్థితిని చూసి, మునుపటి రాత్రి తన స్వప్నాన్ని గుర్తుచేసుకుని, రెండూ ఒకేలా ఉన్నాయని గుర్తించి, సంతోషించి, జీయరుకి తమ స్వప్నం గురించి వివరించారు. జీయర్ అణ్ణాను ప్రశంసిస్తూ, “ఇది కూడా పెరుమాళ్ళ అనుగ్రహమే!” అని సంతోషించారు. జీయార్ ఆ స్వప్నాన్ని పదే పదే వర్ణించమని అభ్యర్థించారు, దానిని ఆనందంగా తమ అష్ట దిగ్గజులతో పంచుకున్నారు. “దీని గురించి మీకేమనిపిస్తుంది?” అని వారిని ప్రశ్నించారు. వారు జీయర్ తో “ఇప్పటికే తిరుమలలో ఒక అద్భుతమైన సంఘటన జరిగి ఉండాలి; అదేమిటో తెలుసుకోవడానికి దేవర్వారు ఎవరినైనా తిరుమలకు పంపాలి” అని విన్నపించారు. ఆ గోష్ఠిలో అళగరణ్ణన్ అనే ఒకరు లేచి, జీయరుకి సాష్టాంగము చేసి, “అడియేన్ స్వామివారి దివ్య తిరువడి పురుషకారంతో (సిఫార్సు పాత్ర) తిరుమలకు వెళ్ళి, అప్పన్ ను (తిరువెంకటేశ్వరుడు) సేవించుకొని, జరిగిన విషయం గురించి తెలుసుకుని వస్తాను” అని ప్రార్థించాడు. జీయర్ సంతోషించి, అతనిని బయలుదేరమని ఆదేశించారు. అళగరణ్ణన్ వెంటనే తిరుమలకు వెళ్లి పెరుమాళ్ళని దర్శించుకొని, అక్కడ ఇళైయాళ్వార్ పిళ్ళైని చూసి, ఇద్దరూ ఒకరికికొకరు సాష్ఠాంగ నమస్కారాలు సమర్పించుకున్నారు. ఇళైయాళ్వార్ పిళ్ళై అళగరణ్ణన్ ను రామానుజ అయ్యంగార్ల వద్దకి తీసుకువెళ్లారు. పరమానందంతో రామానుజ అయ్యంగార్లు అళగరణ్ణన్ పైన బహుమతుల వర్షం కురిపించి, జీయర్ మహిమను పదే పదే అడిగి తెలుసుకున్నారు. తిరుమలలో కైంకర్యం చేయాలనే జీయర్ కోరిక గురించి, ప్రతివాది భయంకరం అణ్ణా స్వప్నం గురించి అళగరణ్ణన్ అయ్యంగారుకి వివరించారు. రామానుజ అయ్యంగారు అన్నారు “అడియేన్ మహా భాగ్యవంతుడి నైనాను; జీయర్ తిరు హస్తాల ఆశీర్వాదంతో, అడియేన్ సామర్థ్యం మేరకు కైంకర్యం నిర్వహిస్తాను” అని తెలిపారు. తరువాత ఇళైయాళ్వార్ మరియు అళగరణ్ణన్ ను శ్రీరంగానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. వాళ్ళు వెంటనే శ్రీరంగం చేరుకొని, జీయరుకు సాష్టాంగ నమస్కారాలు సమర్పించి, వివిధ ఉత్తర దివ్యదేశ పెరుమాళ్ళ అభయ హస్త ప్రసాదాలను (పెరుమాళ్ళ అభయ హస్థం అచ్చు) వారికి అందించారు. జీయర్ వాటిని స్వీకరించి, చాలా కాలం తర్వాత చూస్తున్న ఇళైయాళ్వార్‌ పై అలాగే అళగరణ్ణన్ పైన తమ కృపను కురిపించారు. ప్రతివాది భయంకరం అణ్ణాతో “మీ కల ఫలించింది. తిరువెంకటేశ్వరుడు తమ కృపను మీపైన  కురిపించారు కదా!” అని చెప్పి ఇళైయాళ్వార్ పిళ్ళైని ఆలింగనం చేసుకుంటూ “నీవు దూర దేశాలకు వెళ్ళి వచ్చావు!” అని చెప్పి రామానుజ అయ్యంగార్ల స్వరూప గుణాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారు నంపెరుమాళ్, శ్రీ బద్రికాశ్రమ పెరుమాళ్, తిరుణారాయణ పెరుమాళ్ (తిరుణారాయణపురం), తిరువెంకటేశ్వరుడు, అళగర్ [మాముణుల తనియన్ పై] మధ్య ఉన్న సమన్వయాన్ని మరళా మరళా స్మరించుకున్నారు. ఈ సంఘటనలన్నీ కందాడై అప్పన్ తమ “వరవరముని వైభవ విజయం” అను ప్రబంధం లో దయతో వ్రాసి ఉంచారు. పైగా జీయర్ విని ఆమోదించినవి.

ఒక రోజు, జీయర్ కావేరి నది నుండి తిరిగి వస్తుండగా, ఇళైయాళ్వార్ వారికి చేయి ఇచ్చి, వారితో రామానుజ అయ్యంగార్ల [జీయర్ అనుగ్రహంతో కైంకర్యం చేయాలనే] కోరిక గురించి చెప్పారు. జీయర్ “తిరువెంకటేశ్వరుడిని సేవించేందుకు వారికి మరొక అవకాశం రాబోతుంది; అంతవరకు వారిని కైంకర్య సంపదతో ఉండనివ్వండి” అని అన్నారు. జీయర్ దివ్య పాదుకలను రామానుజ అయ్యంగార్లు తమ తిరువారాధన పెరుమాళ్ళుగా సేవిస్తున్నారని ఇళైయాళ్వార్ జీయరుకి తెలిపారు. జీయర్ మఠానికి చేరుకున్నారు. తమ తిరువడి సంబంధం ఉన్న కొందరు శ్రీవైష్ణవులు, బాధ్రపద (పురట్టాసి) ఉత్సవాలలో పాల్గొనడనికి తిరుమలకు వెళుతున్నట్టు తెలిపారు. జీయర్ ఎంతో సంతోషించి, తిరుమల వైపు చూసి తమ అంజలిని సమర్పించి, వారికి తమ పాదుకలనిచ్చి, వాటిని రామానుజ అయ్యంగారుకి ఇవ్వమని ఆదేశించారు. అవి తీసుకొని వాళ్ళు తిరుమలకు బయలుదేరారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/09/yathindhra-pravana-prabhavam-83/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 82

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 81

తనియన్ అవతరించిన మాసం, సంవత్సరం మొదలైన వివరణలు

తనియన్, వాళి తిరునామాలు ఆవిర్భవించిన నెల తిథుల గురించి అయోధ్య రామానుజ అయ్యంగార్లు ఇళైయాళ్వార్ పిళ్ళైని అడిగారు. ఇలైయాళ్వార్ పిళ్ళై ఈ క్రింది పాశురముల రూపంలో వివరించారు.

నల్లదోర్ పరితాబి వరుడందన్నిల్ నలమాన ఆవణియిన్ ముప్పత్తొన్ఱిల్
శొల్లరియ శోదియుడన్ విళంగువెళ్ళిత్ తొల్కిళమై వళర్పక్క నాలానాళిల్
శెల్వమిగు పెరియ తిరుమండపత్తిల్ శెళుం తిరువాయ్మొళి ప్పొరుళై చ్చెప్పుమెన్ఱు
వల్లియుఱై మణవాళర్ అరంగర్ నంగణ్ మణవాళ మాముని వళంగినారే

(ఈడు కలాక్షేపం ప్రారంభమైంది పరితాపి సంవత్సరం, ఆవని మాసం (శ్రావణ మాసం), 31వ దినము, స్వాతి నక్షత్రం, శుక్రవారం, శుక్ల పక్షం చతుర్థిలో ప్రారంభమైంది)

ఆనంద వరుడత్తిల్ కీళ్మై ఆండిల్ అళగాన ఆనిదనిన్ మూల నాళిల్
బానువారంగొండ పగలిల్ శెయ్య పౌరణమియినాళియిట్టు ప్పొరుంది వైత్తే
ఆనందమయమాన మండబత్తిల్ అళగాగ మణవాళరీడు శాత్త
వానవరుం నీరిట్ట వళక్కే ఎన్న మణవాళ మామునిగళ్ కళిత్తిట్టారే

(ఈడు శాఱ్ఱుముఱ (ఈడు చివరి పారాయణం) ప్రమాదీ నామ సంవత్సరం, జేష్ట్య మాసం (మిథున మాసం), మూల నక్షత్రం, ఆదివారం, పౌర్ణమి రోజున సంపూర్ణమైనది.) [పైన పేర్కొన్న ఈ రెండు పాశురములు అప్పిళ్ళర్ కృపతో రచించారు]. అయోధ్య రామానుజ అయ్యంగార్లు తమ స్వప్నంలో బద్రికాశ్రమ నారాయణుడు దర్శనమెలా ఇచ్చి, ఆ తనియన్ (శ్రీశైలేశ దయాపాత్రం) ను కంఠస్థం చేయించారో, సంప్రదాయం ప్రకారం పాశుర పారాయణం చివరిలో పఠించాలని పెరుమాళ్ళు ఎలా ఆదేశించారో వెల్లడించారు; ఆశ్చర్యపోయారు, పారవశ్యులైనారు. ఇక్కడ ఉన్న ప్రముఖులు, ఇళైయాళ్వార్లు, “ఈ తనియన్ భగవానుని ప్రసాదం కాదా!” అని సంతోషించి కీర్తించారు. కొంత సేపటి తరువాత కోలుకున్న రామానుజ అయ్యంగార్లు ఇళైయాళ్వార్ పాదాల మీద పడి, మణవాళ మాముణుల మహిమలను చెప్పమని వేడుకున్నారు. ఇళైయాళ్వార్ అంగీకరించి మఠంలో వివరిచెదమని చెప్పి, తిరుప్పావై పారాయణం పూర్తి చేసి, తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం, ఇళైయాళ్వార్ రామానుజ అయ్యంగార్ల మఠానికి వెళ్లి, మణవాళ మాముణుల మహిమలను వివరించి వారికి ఎంతో ఆనందం కలిగించారు. మణవాళ మాముణుల గొప్పతనాన్ని విన్న రామానుజ అయ్యంగార్లు వారిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలని ఆశించారు. శ్రీరంగం నుండి ఇళైయాళ్వార్ పిళ్ళైతో వచ్చిన రామానుజ దాసర్, అయోధ్య రామానుజ అయ్యంగార్ల మనస్సులోని కోరికను గ్రహించి,  తాను బద్రికాశ్రమం, ఇతర దివ్య దేశాలలో కొంత కాలం దేవర్వారి ఆదేశం ప్రకారం అడియేన్ కైంకర్యం చేస్తానని, దేవర్వారరు ఇళైయాళ్వార్ పిళ్ళైతో కలిసి జీయర్ తిరువడిని సేవించుటకై శ్రీరంగానికి వెళ్ళవచ్చని, అడియేన్ కొంత కాలం తరువాత జీయరుని దర్శనానికై శ్రీరంగానికి వస్తానని చెప్పారు. అయోధ్య రామానుజ అయ్యంగార్లు ఈ విషయం విని ఎంతో ఆనందించి, ఎంతో భక్తితో రామానుజ దాసుని స్తుతించారు. వారు జీయర్ దివ్య పాదుకలను సముచితమైన చోట ఉంచి, ఇళైయాళ్వార్ పిళ్ళైతో కలిసి శ్రీరంగానికి బయలుదేరారు. దారిలో, వారు తిరుమలకు వెళ్లి, తిరువెంకటేశ్వరుని దర్శించుకున్నారు. అప్పన్ (తిరువెంకటేశ్వరుడు) వారిపై కృపను కురిపించి, అయోధ్య రామానుజ అయ్యంగార్లకు కొన్ని కైంకర్యాలను నియమించారు, ఆ కారణంగా వారు తిరుమలలో ఉండిపోవలసి వచ్చింది. తిరుమలలో కైంకర్యం చేస్తున్నందుకు రామానుజ అయ్యంగార్లు ఎంతో సంతోషించారు, కానీ జీయర్ తిరువడిని ఇంకా దర్శించలేక పోయానే అని కూడా దుఃఖించసాగారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/09/yathindhra-pravana-prabhavam-82/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 81

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 80

శ్రీశైలేశ దయాపాత్రం తనియన్ ను ఇళైయాళ్వార్ పిళ్ళై సేవించుచుండగా విన్న రామానుజ అయ్యంగార్లు, వారితో పాటు అందరూ ఆశ్చర్యపోయారు.

జగ్గ్యే’మునాస్వప్న నివేధితం హియత్ కథం బదర్యాశ్రమ నిత్య వాసినా
ప్రాకాశి మంత్రాతం ఇదం మురధ్విషేధ్యయోధ్య రామానుజ ఆవిశిష్మయే

(బద్రికాశ్రమంలో కొలువై ఉన్న ఆ మురారి (ముర రాక్షసుడిని వధించిన కృష్ణుడు), స్వప్నంలో తనకు అనుగ్రహించిన ఈ తనియన్ (తిరుమంత్రార్థములు ఇమిడి ఉన్న) ను వీళ్ళెలా పఠింస్తున్నారని అయోధ్య రామానుజ అయ్యంగార్లు ఆశ్చర్యపోయారు.). “శ్రీ బద్రికాశ్రమ పెరుమాళ్ళు స్వప్నంలో ఈ తనియన్‌ ను ప్రసాదించారు. ఇది మీ వరకెలా చేరింది?” అని రామానుజ అయ్యంగార్ ఆశ్చర్యపోతూ వారిని ప్రశ్నించారు. వాళ్ళు ఇలా బదులిచ్చారు..

“ఆచినోతిహిశాస్త్రార్థాత్” (శాస్త్రార్థాలను తెలిపేవాడు ఆచార్యుడు) అన్న ఈ శ్లోకం తెలుపునట్లే, పెరుమాళ్ళు శ్రీరంగంలో ఈ తనియన్ ను సేవించినట్లే, ఈ దివ్య దేశంలో (బద్రికాశ్రమం) నరనారాయణ రూపంలో పెరియ తిరుమంత్రాన్ని (ప్రణవం) అనుగ్రహించారు. ఆ తిరుమంత్ర సారమైన దివ్యప్రబంధ అర్ధాలను వెలికితీయాలనే తిరు సంకల్పంతో పెరుమాళ్, ఆదిశేషునిని మణవాళ మాముణులుగా పునః అవతరింపజేయాలని సంకల్పించారు. స్థోత్ర రత్నం శ్లోకానికి అనుగుణంగా “యతోచితం శేష ఇతీరితే” (కాలనికి అణుగుణంగా కైంకర్య నిర్వహణ కోసం అనేక రూపాలు ధరించువాడు కనుక అతనిని ‘శేషన్’ అని పిలుస్తారు). ఆదిశేషుడు ఆ కైంకర్యానికి అనుగుణంగా అవతరించి, అత్యంత నైపుణ్యంతో దివ్యప్రబంధ వ్యాఖ్యానం చేశారు. అతని మహిమను మరింత ప్రకాశింపజేయడనికి, భగవాన్ ఈడు (తిరువాయ్మొళి వ్యాఖ్యానం) ఉపన్యాసం ఇవ్వమని జీయరుని కోరారు. జీయర్ మహా గొప్ప కైంకర్యంగా భావించి ‘ఈడు’ కి ఉపన్యాసం ఇచ్చారు. ఆచార్య సంభావన (ఆచార్యుడిని సన్మానం) సమర్పించే సమయంలో, రంగనాయగం (అర్చక పుత్రుడు) అనే ఒక ఐదు సంవత్సరాల పసిబాలుడిలా పెరుమాళ్ వచ్చి, తనియన్ సేవించారు. అప్పిళ్ళై ద్వారా మణవాళ మాముణుల కోసమై వాళి తిరునామాలు కూడా ప్రసాదించారు. దివ్యప్రబంధ పారాయణం ప్రారంభంలో, శ్రీశైలేశ దయాపాత్రంతో ప్రారంభించి, చివరిలో (దివ్యప్రబంధం) వాళి తిరునామాలు పఠించబడేలా చేశారు. తిరుమల, పెరుమాళ్ కోయిల్ మొదలైన అన్ని దివ్య దేశాలకు విశ్వక్సేనుడి ద్వారా ఈ సందేశం పంపారు. ఈ శ్లోకములో చెప్పబడింది.

శ్రీపన్నకాధీశమునేః పద్యం రంగేశభాషితం
అష్టోత్తర శతస్థానేష్వ అనుషధాం ఆచరేత్
ఇత్యాగ్గ్యా పత్రికా విష్వక్సేనే ప్రతిపాధితా
తధారభ్య మహత్బిశ్చ పత్యతే సన్నిధేః పురా

(మణవాళ మాముణులపై కృపతో శ్రీ రంగనాధుడు ఈ శ్లోకం పఠించారు. ఈ తనియన్ ను మొదట్లో సేవించాలని విష్వక్సేనుడి ద్వారా అన్ని దివ్య దేశాలకు సందేశం పంపబడింది. అప్పటి నుండి పెరుమాళ్ళ సన్నిధిలో ఈ తనియన్ సేవించబడుతుంది). దివ్య దేశ యాత్ర చేస్తున్న బ్రాహ్మణునితో తిరువేంకటేశ్వరుడు ఇలా పలికెను.

ఉపతిష్టం మయాస్వప్నే దివ్యం పద్యమిదం శుభం
వరయోగిసమాశ్రిత్య భవతః స్యాద్ పరం పదం

(విశేషమైనది, శుభప్రదమైనది అయిన ఈ శ్లోకం మీకు స్వప్నంలో ఉపదేశించాను. నీవు మణవాళ మాముణులను ఆశ్రయిస్తే, పరమపదం (శ్రీవైకుంఠం) పొందుతావు)). ఈ విధంగా, ఆ బ్రాహ్మణుడు జీయర్ తిరువడిని ఆశ్రయించేందుకు పెరుమాళ్ళు తోడ్పడ్డారు. ఈ శ్లోకములో వివరించబడింది.

ఇత్యుక్త్వాదం వృషాద్రీశో శ్రీపాదద్రేణుమేవచ
తత్వాశుప్రేషయామాస గచ్చయోగివరం శుచిం

(ఇలా పలుకుతూ, తిరువేంకటేశ్వరుడు తమ దివ్య పాద ధూళిని, శ్రీ శఠారిని, శ్రీపాదరేణువుని ప్రసాదించి, పరమ పవిత్రమైన మణవాళ మాముణుల వద్దకు వెళ్లమని ఆదేశించెను). ఆ బ్రాహ్మణుడు కూడా మాముణుల వద్దకు వెళ్ళి వారిని ఆశ్రయం పొందాడు. అదే విధంగా, తిరుమాలిరుంజోలై అళగర్ ఈ తనియన్ ను జీయర్ తిరువడి సంబంధం ఉన్న ఒక సేనై ముదలియార్ కు ఉపదేశించారు. ఆ విధంగా, ఇళైయాళ్వార్ తనియన్ తమ వరుకు ఎలా చేరుకుందో వివరించారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/07/yathindhra-pravana-prabhavam-81/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 80

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 79

ఇళైయాళ్వాఅర్ పిళ్ళై మరియు రామానుజ దాసర్ యాత్రకు పూనుకొనుట

చక్రవర్తి తిరుమగన్ (శ్రీ రాముడు) తన పాదుకలను భరతునికి ఇచ్చినప్పుడు, లక్ష్మణుడికి (ఇళైయ పెరుమాళ్) ఆ భాగ్యం కలుగలేదు. ఇళయ పెరుమాళ్ళ దివ్య నామం ఉన్న ఇళైయాళ్వార్ పిళ్ళై, జీయర్ పాదుకలను పొందినప్పుడు, వారు అందరికీ ఆనందాన్ని కలిగించారు. రామానుజ దాసరుకి న ఉత్తరీయం ఇచ్చినట్లే, ఇళైయాళ్వార్ పిళ్ళైకి తమ ప్రతినిధిగా పాదుకలను ప్రసాదించారు. ఇళైయాళ్వార్ పిళ్ళై ఆ పాదుకలను స్వీకరించి, ఆళవందార్ తమ స్తోత్ర రత్నంలో “ధనం మధీయం తవ పాద పంకజం” (మీ దివ్య చరణ కమలాలు నాకు నిధి లాంటివి) అని చెప్పినట్లు అతను గొప్ప నిధిని పొందినట్లు భావించాడు. “మదీయం మూర్ధానం అలంకరిష్యతి” (అవి నా శిరస్సుకి అలంకరణ వంటివి) లో చెప్పబడినట్లుగా, తన దివ్య శిరస్సుపై ఆ పాదుకలను ఉంచుకొని అంతులేని ఆనందానుభూతిని పొందాడు. నాచ్చియార్ తిరుమొళిలో “పెరుమాళ్ అరైయిల్ పీతగవాడై కొండు ఎన్నై వాట్టం తణియ వీసీర్” (పెరుమాళ్ నడుముపై ధరించిన ఆ పట్టు పీతాంబరంతో నా అలసట తీరే వరకు వీయండి) అని చెప్పినట్లుగానే రామానుజ దాసర్ కూడా ఆనందించారు.

వారిరువురూ తిరువారాధాన పెరుమాళ్ళను తమతో తీసుకెళుతున్నట్టుగా నిధి వంటి ఆ రెండు పాదుకలను మోసుకెళ్ళి ఆత్రుతగా గంగా నది ఒడ్డుకు చేరుకున్నారు. జీయర్ పాదుకలకు వారు శాస్త్రానుసారంగా గంగా నదిలో దివ్య స్నానం గావించారు. జీయర్ స్వయంగా అక్కడ స్నానమాచరిస్తున్నట్టు ఊహించుకుని అదే జలంలో వారునూ స్నానం గావించారు. ఆ ప్రాంతంలో ఉన్న స్థలాలను సేవించారు.

క్రమేణ తీర్థాని శరీర భాజాం పాపాపహాన్యుర్జిత సౌక్యతాని
పరిక్రమందావత్తిం దృశోస్థౌ వినిన్యసుః శ్రీబదరీనివాసం
విచిత్రాదేహసంపత్తిరీశ్వరాయ నివేదితుం

(ఆ ఇద్దరు (రామానుజదాసర్ మరియు ఇళైయాళ్వార్ పిళ్ళై) ప్రజల పాపాలను పోగొట్టగల మరియు సర్వోత్కృష్టమైన సౌఖ్యాన్ని ఇవ్వగల వివిధ దివ్య జలాల వద్ద సక్రమంగా స్నానం చేసి, శ్రీ బద్రికాశ్రమపు పెరుమాళ్‌ను సేవించారు) (అనేక రకాల శక్తులు కలిగిన చక్కని శరీరం మరియు దాని అవయవాలు భగవాన్‌కు కైంకర్యం చేయడానికి సృష్టించబడ్డాయి). ఈ స్లోకములలో చెప్పబడినట్లుగా, ఎవరికి దేహ పోషణ అనేది భాగవతార్థం (భగవంతుని  కైంకర్యం కోసం) దివ్యదేశాలు (సర్వేశ్వరుని దివ్య నివాసాలు) వారి అన్ని అడ్డంకులను తొలగించి గొప్ప పురుషార్థాన్ని (ప్రయోజనం) అందిస్తాయి. రామానుజ దాసర్ మరియు ఇళయాళ్వార్ పిళ్ళై వారి మార్గంలో అటువంటి దివ్యదేశాలకు వెళ్లి, ప్పెరుమాళ్లకు మంగళాశాసనం చేస్తు బద్రి చేరారు.

అయోధ్య రామానుజదాసనామా సతా ముతా పూజయతి ప్రసన్న:
వశీనిజశ్రీకులశెకరస్సన్ హరిం బదర్యాశ్రమ వాసినంతం

(అయోధ్యా రామానుజ దాసర్ అనే పేరుగల వ్యక్తి, శ్రీవైష్ణవ కులానికి ఆభూషణం వంటి వారు. నిత్య ప్రఖ్యాతి చెందిన బదరికాశ్రమ పెరుమాళ్ళకు ఆనందంగా సేవ చేసేవారు), అందరి ఆదరణ ఉన్న అయోధ్యా రామానుజ దాసర్, సజ్జనుడు, వంశానికే నాయకుడు, వదరియాచ్చిరామ పెరుమాళ్ (బాదరియాశ్రమ పెరుమాళ్) కు దినవారి సేవలు నిత్యం చేసేవారు. ఈ శ్లోకంలో వివరించబడి ఉన్నట్లు-

సలక్ష్మణం వీక్ష్యపవిత్రరూపం సమేధ్య రామానుజదాసమేనం
సమర్చయిత్వా వివిధోపచారైస్స దర్శయామాస రమాసహాయం

(ఆ అయోధ్య రామానుజ దాసర్, శుద్ధస్వరూపుడైన ఇళైయాళ్వార్ పిళ్ళైతో కలిసి వచ్చిన రామానుజ దాసర్ ను స్వాగతించి అనేక విధాలుగా సత్కరించి, స్తుతించి, బద్రికాశ్రమ పెరుమాళ్ళ దర్శినం వారికి కలిపించారు) శ్రీరంగం నుండి వచ్చిన రామానుజ దాసర్‌ కు తమ నమస్కారాలు చేసి, వారికి నర నారాయణ పెరుమాళ్ళ దర్శనాన్ని కల్పించారు. నర నారాయణ పెరుమాళ్ల కొరకై విశేష ప్రసాదాలను తయారు చేసి పెరుమాళ్ళకు సమర్పించారు. ఆ తర్వాత వారిని దివ్య ప్రబంధం పఠించమని వారిని అభ్యర్థించారు. ఈ శ్లోకములో వర్ణించబడింది.

వరయోగివరాగతౌచైలతౌ నరనారాయణసన్నిధౌ పురస్థత్
ద్రమిడోపనిషన్మహాప్రబంధ ప్రథమోధాహరణే న్యయుంగ్తవిధ్వాన్

(మహా విద్వానులైన అయోధ్య రామానుజ అయ్యంగార్లు, మణవాళ మాముణుల సన్నిధి నుండి వచ్చిన ఈ ఇరువురిని నర నారాయణ పెరుమాళ్ళ సన్నిధిలో దివ్యప్రబంధం పారాయణం ప్రారంభించమని నియమనం చేశారు). ఈ క్రింద శ్లోకంలో వివరించబడి ఉంది.

తథా విధిగ్యోవిధివత్ ప్రసాదాత్వరోపయంతుర్ దురిరంగధామ్నా
నివేదితం పద్యవరం ద్వికంటం పతంజకౌ ద్రావిడవేదమేషః

(రామానుజ అయ్యంగార్ ఆదేశానుసారంతో సరైన క్రమాన్ని తెలిసిన ఇళైయాళ్వార్ పిళ్ళై, శ్రీ రంగనాధుడు దయాపూర్వకంగా పఠించన ‘శ్రీశైలేశ దయాపాత్రం’ తనియన్ పఠించడం ప్రారంభించారు. ఆపై దివ్య ప్రబంధం పఠించారు), ముందుగా ‘శ్రీశైలేశ దయాపాత్రం’ తనియన్ పఠించడం మొదలుపెట్టారు, ఆ తర్వాత దివ్య ప్రబంధ పాశురాలను పఠించారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/06/yathindhra-pravana-prabhavam-80/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org