Monthly Archives: February 2023

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 94

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 93

అష్టదిగ్గజులటువంటి శిష్యులచే ఆరాధించబడుతున్న పెరియ జీయర్, ఈ ప్రపంచ వాసులందరినీ అర్థ పంచకం (తన గురించి తెలుసుకోవడం, భగవానుని గురించి తెలుసుకోవడం, ఆ భగవానుని పొందే మార్గాల గురించి తెలుసుకోవడం, పురుషార్థం గురించి తెలుసుకోవడం, ఈ ప్రయాణంలో ఎదురైయ్యే అవరోధాల గురించి తెలుసుకోవడం అనే ఐదు సూత్రాలు) తో ముడిపడి ఉండేలా చేశారు. అత్యోన్నత లక్ష్యం మార్గములోకి (ఆచార్యుని ఆశ్రయించడం) వారిని మరలించారు. తిరువాయ్మొళి ఈడు, శ్రీభాష్యాన్ని నాయనారుకి బోధించమని కందాడై అణ్ణన్ ను, ప్రతివాది భయంకరం అణ్ణాను పురమాయించారు.

వారు ఇలా జీవిస్తుండగా, ప్రతి ఒక్కరినీ, స్థావరాలను (మొక్కలు) కూడా ఉద్ధరిస్తూ (చింత చెట్టుకు కూడా మోక్షం ప్రసాదించారు) తమ నిష్కామ కృపను కురిపిస్తున్న కాలంలో, వారి గుణాలను వెలికితీస్తూ జీయర్ ఈ పాశురాన్ని పఠించారు:

తెన్నరంగర్ శీరారుళుక్కు ఇలక్కాగ ప్పెఱ్ఱోం
  తిరువరంగ త్తిరుప్పదియే ఇరుప్పాక ప్పెఱ్ఱోం
మన్నియ శీర్ మాఱన్ కలై ఉణవాగ ప్పెఱ్ఱోం
  మధురకవి శొఱ్పడియే నిలైయాగప్పెఱ్ఱోం
మున్నవరాం నం కురవర్ మొళిగల్ ఉళ్ళప్పెఱ్ఱోం
  ముళుదుం నమక్కివై పొళుదుపోక్కాగ ప్పెఱ్ఱోం
పిన్నై ఒన్ఱుదనిల్ నెంజం పోరామఱ్ ప్పెఱ్ఱోం
  పిఱర్మినుక్కం పొఱామై ఇల్లా ప్పెరుమైయుం ప్పెఱ్ఱోమే

(శ్రీ రంగనాధుని కరుణకు పాత్రులు కావడం మన భాగ్యం; శ్రీరంగ దివ్య దేశం మన నివాస స్థలం కావడం మన భాగ్యం; నమ్మాళ్వార్ల తిరువాయ్మొళిని అనుభవం మన భాగ్యం; ఆచార్య నిష్ఠను బోధించే మధురకవి ఆళ్వార్ల సూచనలు మన భాగ్యం; మన పూర్వాచార్యులు అనుగ్రహించిన ఈ గ్రంథ ఉపాకారం మన భాగ్యం; అన్య విషయాలపై ఆసక్తి లేకపోవడం మన భాగ్యం; ఇతరుల సామర్థ్యం చూసి అసూయపడని గొప్పతనం ఉండటం మన భాగ్యం.

‘యంయం స్పృశతి పాణిభ్యాం’ (తమ దివ్య హస్తాలతో తాకిన వారందరూ) అన్న వాఖ్యంలో పేర్కొన్నట్లుగా, వారి దివ్య స్పర్శతో మొక్కలు వృక్షాలు కూడా ఉద్ధరించబడినప్పుడు, మనుషుల గురించి వేరే చెప్పాలా? మణవాళ మాముణుల వల్ల అందరూ పొందిన ఫలాలను ఈ క్రింది శ్లోకము తెలియజేస్తుంది:

తత్పాదపద్మ సంస్పర్శపావనం సలివం జనాః
  స్వీకుర్వంతః సుఖేనైవ స్వరూపం ప్రతిభేదిరే
ఆలోకైర్ అనుకంపాధ్యైర్ ఆలాపైర్ అమృతచ్యుతైః
  అన్వహం పాణిపాదస్యస్పర్శన్యాసైశ్చ పావనైః
మంత్ర రత్న ప్రధానేన తదర్థ ప్రతిపాదనాత్
  ఆత్మార్పణేన కదిచిత్ అజ్ఞాపనే నచ
కేచిత్ క్షేమం యుయుస్తస్య పాదపద్యస్య సంశ్రయాన్
  అన్యే తద్రూపనినాతగ్యే తన్నామ కీర్తనాత్
శృత్వా తస్యగుణాన్ దివ్యాన స్తుత్వాతానేవ కేచన
  నత్వాతాం ధీశముద్దిశ్య స్మృత్వా తద్ వైభవం పరే
అపతిశ్యగమప్యేనమన్యే ప్రతిత వైభవం
  అన్యేతద్ బృత్య బృత్యానమలోక స్పర్శనాతపి
అన్యేతద్ పాదసంస్పర్శ తన్యేసంభూయ భూతలే
  అభవన్ భూయసా తస్య మునేః పాత్రం కృపాద్రుశం
ఏవం సర్వే మునీందరేణ బభూవుస్ స్రస్త బంధనాః

(మణవాళ మాముణుల దివ్య తిరువడితో ఉన్న అనుబంధం కారణంగా, వారి శిష్యులు ఆచార్య శ్రీపాద తీర్థాన్ని స్వీకరిస్తూ తమ స్వరూపాన్ని (శేషత్వం) సులభంగా అర్థం చేసుకున్నారు; మరి కొందరు అమృతంలా ప్రవహించే కరుణాపూరితమైన వారి దృష్టి, వాళ్ళ మీద పడి ఉద్ధరణ పొందారు. మరి కొందరు వారి దివ్య పాద స్పర్శతో, ఆ దివ్య పాదాలకు శరణాగతి చేయడంతో, మంత్ర రత్నంగా పరిగణించబడే ద్వయ మహామంత్రాన్ని వారి ద్వారా పొందడంతో, వారి నుండి ఆ అర్థాలను తెలుసుకోవడం ద్వారా ఉద్దరణ పొందారు; మరికొందరు తమ అజ్ఞానాన్ని వ్యక్తం చేస్తూ వారికి శరణాగతి చేయడం ద్వారా, కొందరు ఆ మహాముని దివ్య స్వరూపాన్ని ధ్యాన కేంద్ర బిందువుగా ఆపాదించుకున్నారు. మరికొందరు వారి దివ్యనామాలను పఠించారు, కొందరు ఆతని దివ్య మంగళ గుణాల శ్రవణం చేశారు, ఆ గుణాలను స్తుతించారు; మరి కొందరు వారు ఉన్న దిశ వైపు సాష్టాంగ నమస్కారం చేసి ఆరాధించారు; కొందరు వారి కీర్తిని మననం చేస్తూ అనందించారు; కొందరు, ఈ భూమండలంపైన అవతరించిన అంతటి మహిమగల మణవాళ మాముణుల దాసదాసర్ల (దాసులకు దాసులు) దివ్య స్పర్శతో పునీతులై వారి దివ్య కటాక్షానికి పాత్రులై ఉద్ధరించబడ్డారు; ఇలాగ ఆ మునీంద్రులైన (యతులకు రాజు) మణవాళ మాముణుల దయతో ప్రతి ఒక్కరూ బంధ విముక్తులైనారు). ఆ విధంగా, వారి శ్రీపాద తీర్థం తీసుకున్న వారితో ప్రారంభించి, వారి దృష్టి కటాక్షానికి పాత్రమయ్యే భాగ్యం కలిగిన వారు, వారిని ధ్యానించిన వారు, వారి పరిచయం ఉన్న వారి వరకు, తమ దగ్గరున్న వాళ్ళు, తమకు దూరంగా ఉన్న వాళ్ళు, తర్వాతి కాలంలో ఈ భూమిపైన జన్మించే వాళ్ళు, రాబోతున్న వాళ్ళ మధ్య ఎటువంటి భేదం లేకుండా, సంసారం పరమపదం అనే తేడా లేకుండా సమస్త లోకాలను బంధ విముక్తులను చేశారు. ఎంత మేరకు అంటే ఉద్దరణ ఎవరికైనా అవసరముందా అని వారిని అన్వేషించేటంత స్వర్ణ మయం చేశారు.

సర్వావస్థా సదృశవిభవా శేషకృత్వం రమయాభర్తుః
  త్యక్త్వా తదపి పరమం ధామతత్ప్రీతి హేతోః
మగ్నానగ్నౌ వరవరమునే మాదృశానున్నినీషన్
  మర్త్యావాసే భవసి భగవన్ మంగళం రంగధామ్నః

(మంగళ గుణాలు కలిగిన మణవాళ మాముని! శ్రీమహాలక్ష్మికి పతి అయిన భగవానునికి అన్ని కాలములలో, స్థితులలో, మహిమాన్వితమైన సేవలందింస్తున్నారు. సంసారం అనే అగ్నిలో కొట్టు మిట్టాడుతున్న అడియేన్ వంటి వారిని ఉద్ధరించడానికి, భగవత్ ప్రీతి కారణంగా ఆ పరమపదాన్ని (శ్రీవైకుంఠం) విడిచి వచ్చారు. ఈ లోకంలో ఈ దివ్య దేశమైన తిరువరంగంలో దేవర్వారు దివ్య దీపమువలెనున్నారు). అలా తాను అవతరించిన లక్ష్యాన్ని పూర్తి చేశారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/20/yathindhra-pravana-prabhavam-94/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 93

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 92

ఆచర్య హృదయం గ్రంథానికి వ్యాఖ్యానం వ్రాసిన జీయర్ 

జీయర్ తమ శరీరం బలహీనతను కూడా లెక్కచేయకుండా, ఆచార్య హృదయం (పిళ్ళై లోకాచార్యుల తమ్ముడు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ రచించిన రహస్య ప్రబంధం) గ్రంథానికి వ్యాఖ్యానం వ్రాయాలని సంకల్పించారు. వారి మెడ భాగం నొప్పి కారణంగా, తమ ఆసనంపై పడుకుని వ్యాఖ్యానం వ్రాసేవారు. అది చూసి, కందాడై అణ్ణన్ “దేవర్వారు ఎందుకు అంత శ్రమ తీసుకుంటున్నారు?” అని ప్రశ్నించగా, జీయర్ ప్రతిస్పందిస్తూ “అడియేన్ దేవర్వారి పుత్రులు మనుమల కోసం ఈ కృషి చేస్తున్నాను” అని చెప్పి వ్యాఖ్యానం పూర్తి చేశారు.

జీయర్ను ఆశ్రయించిన ఏట్టూర్ శింగరాచారియర్; ఎనిమిది గోత్రముల క్రమం

ఆ సమయంలో, పెరియ తిరుమలై నంబి దివ్య వంశస్థులైన ఏట్టూర్ శింగరాచారియర్ [రామానుజుల పంచ ఆచార్యులలో ఒకరు, వారి మేనమామ], జీయర్ మహిమను గురించి విని, తన అకించన్యం [తనకంటూ ఒకటి ఉన్నదని చెప్పుకోడానికి ఏమీ లేకపోవడం], అనన్య గతిత్వం [ఇక వేరే ఎక్కడికి వెళ్ళే ఆస్కారం లేని] (ఇవి ఒక వ్యక్తి శరణాగతులు కావడానికి కావలసిన ప్రాథమిక అవసరాలు) తన అహంకారములు సిగ్గులను విడిచిపెట్టి, జీయర్ తిరువడి యందు ఆశ్రయం పొందాలని వచ్చెను. ఏట్టూర్ శింగరాచారియర్ సమర్పించిన సంపదతో, తిరునగరిలో ఆళ్వార్ కోసమై దివ్య గోపురం మరమ్మత్తు కైంకర్యాన్ని జీయర్ చేపట్టారు. ఆ కైంకర్యాన్ని పూర్తి చేయడంలో కొంత నిధుల కొరత ఏర్పడినప్పుడు, జీయర్ నాయనార్ [జీయర్ పూర్వాశ్రమ మనవడు] ఆ కొరతను సరిచేసి, పనిని పూర్తి చేశారు. తరువాత జీయర్ పొళిప్పాక్కం నాయనారుకి కబురు పంపి, సప్త గోత్ర నిబంధన (ఏడు వంశీయులను క్రమబద్ధం చేయడం), ఆ ఏడు వంశాలకు ఏట్టూర్ శింగరాచారియర్ ను కూడా చేర్చి, అష్ట గోత్ర సంఖ్యగా మార్చారు. ఈ క్రింది శ్లోకంలో చెప్పినట్లు…

జగత్రక్షయాపరో’నందో జనిష్యత్యపరోమునిః
తదారశ్యాస్ సదాచరాస్ సాత్వికాస్ తత్వ దర్శినః

(లోక సంరక్షణలో మునిగి ఉన్న తిరువంతాళ్వాన్ (రామానుజ మునిగా అవతారం కాకుండా) మరొక మునిగా అవతరించబోతున్నాడు (అందరి అభ్యున్నతి కోసం ధ్యానం చేసేవాడు); వారి ఆశ్రయం పొందిన వారు (ఆ సమయంలో) మంచి నడవడిక, సత్గుణాలను కలిగి ఉంటారు, తత్వార్థాలను సరిగ్గా తెలుసుకుంటారు), జీయర్ ఆశ్రయం పొందిన వ్యక్తులు సత్ప్రవర్తన కలిగి, కైంకర్యములలో నిమగ్నమై ఉన్నారు, మన తత్వశాస్త్రార్ధాలను పూర్తిగా తెలుసుకుంటున్నారు, నిరంతరం జీయర్ను ధ్యానిస్తూ ఉన్నారు.

అష్టదిగ్గజులు

ఈ పాశురములో చెప్పబడినట్లు…

పారారుమంగై తిరువేంగడముని భట్టర్పిరాన్
ఆరామమ్ శూళ్ కోయిల్ కందాడై అణ్ణన్ ఎఱుంబియప్పా
ఏరారుమప్పిళ్ళై అప్పిళ్ళార్ వాది భయంకరరెన్
పేరార్ంద దిక్కయన్ జూళ్ వరయోగియై చ్చిందియుమే

జీయరుకి ఎనిమిది ప్రాథమ శిష్యులు ఉండేవారు. వారు వానమామలై జీయర్, తిరువెంగడం జీయర్, భట్టర్పిరాన్ జీయర్, కందాడై అణ్ణన్, ఎఱుంబియప్పా, అప్పిళ్ళై, అప్పిళ్ళార్, ప్రతివాధి భయంకరం అణ్ణ. ఈ అష్టదిగ్గజులు కాకుండా మరి కొందరు తిరుప్పాణాళ్వార్ దాసర్, ఏట్టూర్ శింగరాచార్యర్, వరం తరుమ్ పెరుమాళ్ పిళ్ళై, మేనాట్టు త్తోళప్పర్, అళగియ మణవాళ ప్పెరుమాళ్ నాయనార్, జీయర్ నాయనార్, అణ్ణరాయ చక్రవర్తులు మొదలైనవారు మునుపు చూసిన ‘జగత్రక్షయాపరో నందో…….తత్వ దర్శినః’ శ్లోకానికి అణుగుణంగా ఉన్న మహా పురుషులు, సత్ ప్రవర్తనతో, దర్శన సూత్రాల అనుసంధానం చేస్తూ లోకోద్ధారణకై జీవిస్తుండేవారు.

శిష్యులకు కైంకర్యం

పైన పేర్కొన్న శిష్యులలో, అష్టదిగ్గజులతో సహా, ఈ కింద పేర్కొన్న వాళ్ళు జీయర్ తిరువడి వద్ద నిత్య కైంకర్యాలు చేస్తుండేవారు:

  1. వానమామలై జీయర్ – జీయర్ ప్రారంభ రోజుల నుండి భక్తి ప్రపత్తులతో నిత్యం జీయరుతో ఉన్న ఒక పేరుగాంచిన వ్యక్తి.
  2. కందాడై అణ్ణన్ – ‘రామానుజ మునిద్రస్య శ్రీమన్ దాశరథిర్యతా’ అనే వ్యాక్యంలో రామానుజులకు ముదళియాండాన్ ఎలాగో, అలాగే, అణ్ణన్ జీయర్ పట్ల పరమ భక్తితో ఉండేవారు. జీయర్ భద్రతను చూసుకునే కైంకర్యం చేసేవారు.
  3. ఎఱుంబియప్పా – ‘దేవుమఱ్ఱఱియేన్’ (మరొక దేవుణ్ణి ఎరుగను) అని అన్నట్లు, రామానుజుల పట్ల వడుగ నంబి ఎలా ఉండేవారో, అల్లగే జీయర్ పట్ల నిష్ఠతో ఉండేవారు.
  4. ప్రతివాది భయంకరం అణ్ణన్ – రామానుజులకు కూరత్తాళ్వాన్ ను పోలి; వీరు ప్రజలను ఇతర తత్వాల బారి నుండి దూరంగా ఉంచడం, శ్రీభాష్యంలో జీయరుకి నిరంతర సహచరుడిగా ఉండేవారు.
  5. సేనై ముదల్లియార్ అణ్ణన్, శఠగోప దాసర్, అప్పిళ్ళై, తిరుప్పాణాళ్వార్ దాసర్ – ఈ శిష్యులందరూ జీయరుకి తిరువాయ్మొళి దివ్య ప్రబంధ సహచరులు. ప్రత్యేకించి, అప్పిళ్ళై జీయర్ ఆదేశానుసారం, ఐదు తిరువందాదులకు [ముదల్, ఇరండాం, మూన్ఱాం, నాన్ముగ, పెరియ తిరువందులు] గమనికలు వ్రాసారు; అదీ కాకుండా యతిరాజ వింశతి (జీయర్ స్వరపరచినది) కి వ్యాఖ్యానం కూడా రాశారు.
  6. అప్పిళ్ళార్ – వీరు మఠ కార్యనిర్వహణ విషయాలు చూసుకునేవారు. కాల రితులకు అణుగుణంగా కూరగాయలు, పాలు, నెయ్యి, పెరుగు, పప్పులు, ఉప్పులు మొదలైన వంటకు సంబంధించిన సరుకుల ఏర్పాట్లను చూసుకునేవారు.
  7. భట్టర్పిరాన్ జీయర్ – రామానుజులకు ఎంబార్ లాగానే, జీయర్ దివ్య పాదాలకు నీడగా భట్టర్పిరాన్ జీయర్ ఉండేవారు. జీయరుని వీడి ఉండలేక, వారికే అన్ని సేవలు చేస్తూ, జీయర్ తప్పా మరేమీ ఎరగని వారు.
  8. జీయర్ నాయనార్ – ఒక యువరాజు వలె అందరికీ నచ్చినవాడు; రామానుజులకు తిరుక్కురుగై ప్పిరాన్ పిళ్ళాన్ వలె, వీరు జీయరుకి ఎంతో ఆసరాగా ఉండేవారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/19/yathindhra-pravana-prabhavam-93/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 92

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 91

శిష్యుల ద్వారా దివ్యదేశాలలో కైంకర్యములు నిర్వహించారు

జీయర్ శ్రీ పాదాల ఆశ్రయం పొందిన మహాబలి వాణనాథన్, తిరుమలై తందాన్ తోళప్పర్ (తిరుమలై తోళప్పర్) ని తమ ప్రధాన అధికారులుగా నియమించి, వారి ద్వారా తిరుమాలిరుంజ్యోలై దివ్యదేశంలో అనేక కైంకర్యములను నిర్వహింప జేశారు. వారి కృషి వల్ల అళగర్కోయిల్లో కైంకర్యం సంపద అంచలంచలుగా పెరిగింది. కోయిల్ (శ్రీరంగం), తిరుమల మొదలైన దివ్యదేశాలలో ఏ లోటు లేకుండా కైంకర్యాలు జరుగుతూ అందరూ అనందించే సమయంలో తుళవ వంశంలో జన్మించిన ఒక వ్యక్తి ఆ ప్రాంతాలలో సంచరిస్తూ జీయర్ వద్దకు వచ్చి వారి ఆశ్రయం పొందారు. జీయర్ అతనిపై తమ కృపను కురిపించి, అతనికి “శ్రీరామానుజ దాసర్” అను దాస్య నామాన్ని అనుగ్రహించారు. జీయర్ కృప కారణంగా, శ్రీరంగంతో మొదలు పెట్టి అనేక దివ్యదేశాలలో కైంకర్యం చేసే భాగ్యం వారికి కలిగింది. తరువాత, ఈ క్రింది శ్లోకంలో చెప్పబడినట్లు

దివ్యోత్సవప్రసంగేషు దేవదేవమతంత్రితః
ఆశాసానస్సమాసీతన్నత్రాక్షీత్ రంగభూషణం

(ప్రత్యేక ఉత్సవాల సమయాల్లో, అత్యోన్నత స్వరూపుడైన శ్రీరంగనాధుని సేవించి, వారి నిజమైన భక్తుడిగా మంగళాశాసనం చేశారు), ఉత్సవాల సమయాలలో జీయర్ నంపెరుమాళ్ళకు మంగళాశాసనాన్ని నిర్వహించి, చెయ్దవక్కారం నఱు నెయ్ పాలాల్ (ఎర్రటి బియ్యం, పప్పు, పంచదార, నెయ్యి పాలతో తయారు చేసిన తీపి వంటకం) మొదలైన అనేక రకాల ప్రసాద నివేదనలను అర్పించారు. అంతకు మించి, ప్రతి ఏడాది ‘ఒన్ఱుం దేవుం, కణ్ణినుణ్ శిఱుఱ్ఱాంబు, ఇరామానుజ నూఱ్ఱందాది మొదలైన విశేష పాశురాలను పఠించేవారు, ప్రతి నిత్యం వ్యాఖ్యానాలతో పాటు ఆళ్వార్ అరుళిచ్చెయల్ పఠించేవారు. ఈ క్రింది శ్లోకంలో చెప్పినట్లుగా…

కస్తూరి హిమకఱ్పురా స్రక్ తాంబూలా’నులేపనైః
దివ్యైరప్యభజత్ భోజ్యైః రంగనాథం దినే దినే

(ప్రతిరోజూ శ్రీ రంగనాధునికి కస్తూరి, కర్పూరం, మాలలు, తమల పాకులు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి నివేదించే కైంకర్యం వీరు చేసే వారు. మార్గళి (ధనుర్మాసం) మాసంలో…

కాలేకోతండ మార్తాండే కాంక్షంతే వారునోదయం
న్యషేవతవిశేషేణ శేషిణం శేషశాయినం
మంగళానిప్రయుజ్ఞానో మాధవం ప్రత్యభోదయత్
సంయకేనం సమప్యర్చ్య సర్వధానుకతైః క్రమైః
స్వస్వకాలోచితైర్దిన్యై స్వసంకల్పోపలంబితైః
అభోజయతయం భోజ్యైః శాకమూలపలాధిపిః
సూభాభూప కృతక్షీర చర్కరా సహితం హవిః 

(ప్రాతఃకాలంలో, శేష శయ్యపై ​​శయనించి ఉన్న పెరుమాళ్ళకు విశేష ఆరాధనలు చేసేవారు. దివ్య పాశురాలను సేవిస్తూ మేల్కొనే సమయం ఆసన్నమైనదని శ్రీ మహాలక్ష్మి పతిని మేల్కొలుపేవారు. శాస్త్ర విధిని నిష్ఠగా అనుసరించి పెరుమాళ్ళకు తిరువారాధన చేసేవారు. వారు స్థాపించిన పద్ధతి ప్రకారం, వివిధ రితులలో లభించే ప్రత్యేక కూరగాయలు, దుంపలు, పండ్లు మొదలైన కాలానుగుణంగా లభించే పదార్థాలతో పాటు వడలు, పప్పు, నెయ్యి, పాలు, పంచదార, అన్నం మొదలైనవి నివేదించేవారు).

పెరియాళ్వార్ తిరుమొళికి వ్యాఖ్యానము రచించారు

పెరియాళ్వార్ తిరుమొళికి పెరియవాచ్చన్ పిళ్ళై రచించిన వ్యాఖ్యానం దురదృష్టవశాత్తు ఆఖరి నలభై పాశురాలు మినహా అన్నీ నశించిపోయాయి [తాళపత్రాలకు చెదలు పట్టడం వల్ల]. నష్ట పోయిన భాగానికి వ్యాఖ్యానం వ్రాయాలని సంకల్పించి పాశురంలో పేర్కొన్న విధంగా ఆళ్వార్ తిరునగరిలో కైంకర్యం నిర్వహిస్తున్న తిరుప్పాణాళ్వార్ దాసర్‌ కు సందేశం పంపారు.

శెందమిళిల్ ఆళ్వార్గళ్ శెయ్ద అరుళిచ్చెయలై
శిందై సెయల్ తన్నుడనే శెప్పలుమాం – అందో
తిరుప్పాణాళ్వార్ తాదర్ నాయనార్ శేర
విరుప్పారాగిల్ నమక్కీడావార్ యార్ 

(అందమైన తమిళ భాషలో దయతో ఆళ్వార్లు రచించిన ఆరుళిచ్చెయల్ కు, మనసా వాచా కర్మనా నేను వ్యాఖ్యానం వ్రాయాలని ఆశిస్తున్నాను. అయితే, ఈ కార్య సిద్ధి కోసం తిరుప్పాణాళ్వార్ దాసర్ సహకారం కోరుతున్నాను) తిరునగరిలో తిరుప్పాణాళ్వార్‌ కు ఈ సందేశం లభించిన వెంటనే ఎంతో సంతోషించి, ఆ సందేశాన్ని తమ శిరస్సుపై పెట్టుకుని, తమ తిరునందనవన కైంకర్యాన్ని (పెరుమాళ్ల పూల తోటను చూసుకునే) విడిచిపెట్టి, వెంటనే తిరునగరి నుండి బయలుదేరి, వేగాతివేగంగా శ్రీరంగం చేరుకుని జీయర్ దివ్య పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. తిరుప్పాణాళ్వార్‌ యత్నాలను, తనను చూడలేకపోయానన్న తపనను గ్రహించి, జీయర్ తమ చల్లని దృష్ఠితో అతనిని ఆదరించి, “మీరు ఎంతో జ్ఞానవంతులయ్యారు” అని చెప్పి, మర్నాడే, పెరియాళ్వార్ తిరుమొళి వ్యాఖ్యానం రచించడం ప్రారంభించారు, చివరి నలభై పాశురాల వరకు [మిగిలిన భాగానికి పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానమ్ ఉంది) రాగనే ఆపివేసి, ఈ రెండు భాగాలను జోడించారు.

జీయర్ రచించిన వ్యాఖ్యానాన్ని కీర్తించిన కందాడై నాయన్

అప్పుడు చిన్నవాడైన కందాడై నాయన్ అక్కడికి వచ్చి,  జీయర్ వ్యాఖ్యానం మరియు అభయప్రదరాజర్ వారి (పెరియ వచ్చన్ పిళ్ళై) వ్యాఖ్యానం విశ్లేషించాడు. అతను పెరియ వాచ్చన్ పిళ్ళైల నలభై పాశురాల వ్యాఖ్యానాన్ని క్రింద ఉంచి, జీయర్ వ్యాఖ్యానాన్ని తన చేతిలోకి తీసుకుని, “మిగతా నలభై పాసురములు లేకుండా, ఇది సంపూర్ణం కాదు” అని అన్నాడు. ఇది విన్న జీయర్, “ఇంత చిన్న వయస్సులో, ఎంతటి జ్ఞాన పరిపూర్ణతను సొంతం చేసుకున్నాడితడు!” అని భావించి, కందడై నాయన్ ను తమ కృపా దృష్ఠితో చూసి, నాయన్‌ ను ఆశీర్వదించి, “ఒకరిని తిరస్కరించి మరొకరిని ఆదరించుట సమంజసమేనా? అటువంటి భేదం అసలు ఉందా?” అని నాయన్ ను ప్రశ్నించారు. నాయన్ బదులిస్తూ, “చిలక కొరికిన పండు ఎంత తియ్యగా ఉంటుందో, మాముణులు అందించినప్పుడు పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం తీయగా మారుతుంది. జ్ఞానాన్ని కొలవడం అంటే, ముఖ్య అంశాలను స్వీకరించి, అముఖ్యమైనవి విస్మరించుట. అంతేకాక, ఈ వ్యాఖ్యానములో అద్భుతమైన సారం ఇమిడి ఉంది” అని అన్నారు. అది విన్న జీయర్ సంతోషించి నాయన్ ను ఆలింగనం చేసుకున్నారు. ఆ విధంగా, జీయర్ ప్రతి ఒక్కరు సంతోషపడే విధంగా పెరియాళ్వార్ తిరుమొళికి వ్యాఖ్యానం రచించారు. అంతే కాకుండా తమ వద్ద ఉన్నపెరియవాచ్చాన్ పిళ్ళైల దివ్య స్పర్ష కలిగిన శ్రీ రంగరాజుల విగ్రహాన్ని తిరుప్పాణాళ్వార్ దాసర్‌ను తన తిరువారాధన పెరుమాళ్ళుగా ఇచ్చి వారికి ఆళ్వార్ తిరునగరికి వెళ్ళమని అనుమతిని ఇచ్చారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/18/yathindhra-pravana-prabhavam-92/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 91

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 90

కోయిల్ కు తిరిగివచ్చిన జీయర్

తిరుమాలిరుంజోలై నుండి బయలుదేరి, ప్రతి నిత్యం తిరుమాలిరుంజోలై భగవానుడు శయనించే దేశమైన శ్రీరంగానికి [అన్ని దివ్యదేశాల పెరుమాళ్ళు రాత్రికి శయనించడానికి శ్రీరంగానికి వస్తారు] చేరుకున్నారు. తిరువాయ్మొళి 10-9-8 వ పాశురము “కొడియణి నేడుమదిళ్ గోపురం కుఱుగినర్” (ఎత్తైన ప్రహరీ గోడలు, రంగురంగుల ధ్వజాలతో అలంకరించబడిన ప్రదేశంలోకి ప్రవేశించాను) అని నమ్మాళ్వార్ చెప్పినట్లు, శ్రీరంగంలోకి ప్రవేశించగానే, అక్కడి స్థానికులు ఎదురు వచ్చి, వారి పాదాలపై పడి, భక్తితో ఈ శ్లోకాన్ని పఠించారు

వకుళతరసవిత్రీం యాతియస్మిన్ ధరిద్రీం మధుమథన నివాసో రంగమాసీతసారం
పునరపి సుసమ్రుద్దం భూయసా సంప్రవిష్టే వరవరమునివర్యో మానుషః స్యాద్కిమేషః

(మొగళి పుష్పమాలలను తమ వక్షస్థలంలో ధరించే నమ్మాళ్వర్ల స్వస్థలమైన ఆళ్వార్తిరునగరికి మణవాళ మాముణులు వెళ్ళిన సమయంలో, క్షీరసాగరాన్ని మథనం చేసిన పెరుమాళ్ళు కొలువై ఉన్న శ్రీరంగం, తన శోభను కోల్పోయింది. మణవాళ మాముణులు తిరిగి శ్రీరంగంలోకి ప్రవేశించిన వెంటనే శ్రీరంగం తన శోభను సంతరించుకుంది. ఈ మణవాళ మాముణులను సాధారణ మనిషిగా భావించాలా?). వచ్చిన వారందరిపై జీయర్ తమ అనుగ్రహం కురిపించి, వారందరితో కలిసి మొదట ఎంబెరుమానార్ల సన్నిధికి వెళ్ళి, వారి తిరువడిని సేవించి, వారి పురుషకారంతో శ్రీరంగ నాచ్చియార్, పెరియ పెరుమాళ్ళను దర్శించుకున్నారు. విశేష ప్రసాదాలను స్వీకరించి తమ మఠానికి చేరుకున్నారు. ‘రంగే ధామ్ని సుఖాసీనం’ (శ్రీరంగంలో ఆసీనులై) అని చెప్పినట్లు, జీయర్ తిరుమలైయాళ్వార్లో ఆసీనులైనారు. తమ యథావిధి వ్యాఖ్యానాలు (వివిధ ప్రబంధాలు, శ్రీసూక్తుల వ్యాఖ్యానాలు) నిర్వహించి అందరినీ ఆనందపరిచారు. సందర్భానికి అనుగుణంగా వారి శిష్యులు ఈ క్రింది శ్లోకాన్ని పఠించారు.

జయతౌ యశసా తుంగం రంగం జగత్రయ మంగళం
జయతు సుచిరం తస్మిన్ భూమా రమామణి భూషణం
వరదగురుణార్థం తస్మై శుభాన్యపి వర్ధయన్
వరవరమునిః శ్రీమాన్ రామానుజో జయతు క్షితౌ

(ముల్లోకాలకు మంగళ కరమైన కేంద్ర బిందువుగా మహోన్నత కీర్తిని సంతరించుకున్న శ్రీరంగం దివ్యంగా ప్రకాశించాలి. పెరియ పిరాట్టియార్ (శ్రీమహాలక్ష్మి), శ్రీ కౌస్తుభం [సమస్థ చిత్ తత్వాలను సూచించే రత్నం] ఆభరణాలుగా కలిగి ఉన్న భగవాన్ చిరకాలం వర్ధిల్లాలి. వరదగురు అణ్ణన్ తో పాటు, ఆ పెరుమాళ్ళకు మరింత మంగళం కలిగించే, రామానుజుల పునరవతారమైన మణవాళ మాముణులు ఈ భూమిపై దివ్యంగా ప్రకాశించాలి).

అళగర్ కోయిల్ కు నిర్వాహకులుగా ఒక జీయరుని పంపిన మణవాళ మాముణులు

తిరుక్కురుంగుడిలో జీయర్ చేసిన మంగళాశాసనం ఫలించి, అళగర్ తిరుక్కురుంగుడి నుండి  తమ స్వస్థళానికి  తిరిగి చేరుకున్నారు. అళగర్ తరపు నుండి ఒక దివ్య సందేశం వచ్చింది. ‘నంగళ్ కున్ఱం కైవిడాన్’ (ఈ కొండను వదిలి వెళ్ళనివ్వము) అన్న దేవర్వారి సంకల్పానికి అనుగుణంగా మేము మా క్షేత్రానికి తిరిగి వచ్చాము. మా ఈ గృహంలో సక్రమంగా కార్యములు నిర్వహించుకోడానికి ఎవరినైనా పంపండి” అని సందేశం పంపారు. జీయర్ దీనిని చదివి ఎంతో సంతోషించి, మహా విరక్తర్ (అన్నింటినీ సంపూర్ణంగా త్యాగం చేసినవాడు), మంగళాసన పరర్ (నిష్ఠగా పెరుమాళ్లకు మంగళాశాసనం చేసేవారు) అయిన యతిరాజ జీయర్ అనే దివ్య నామంతో ఉన్న ఒక జీయరుని అళగర్ శ్రీకార్యం (అళగర్ ఆలయంలో కార్య నిర్వాహం చేసే వ్యక్తి) గా పంపారు. యతిరాజ జీయర్ అక్కడికి వెళ్లి, అళగర్ ను సేవించుకొని, తన ఆచార్య నిష్ఠకు ప్రతీకగా అన్ని కైంకర్యాలను శ్రద్ధతో నిర్వహించారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/17/yathindhra-pravana-prabhavam-91/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆళ్వార్ తిరునగరి   వైభవము – ప్రాచీన చరిత్ర

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవర మునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

పూర్తి శ్రేణి

ఆళ్వార్ తిరునగరిని  శ్రీకురుగాపురిక్షేత్రం అని , ఆదిక్షేత్రమని కూడా అంటారు. జగత్పతి అయిన శ్రీమన్నారాయణుడు తన లీల కోసం సృష్టించిన గొప్ప దివ్యదేశమిది. సృష్టి ఆదిలో భగవానుడు,  చతుర్ముఖబ్రహ్మను సృష్టించి అతని ద్వారా ఈ జగత్తును సృష్టించాలని సంకల్పిస్తాడు. ఆ బ్రహ్మ సృష్టికార్యాన్ని పూర్తిచేసుకొని, భగవానుడి దర్శనం పొందాలనే కోరికతో వెయ్యి సంవత్సరాల కఠోరతపస్సు చేసి దర్శనం పొంది అనేక విధాలుగా స్తుతిస్తాడు. ఆ సమయంలో, భగవానుడు బ్రహ్మతో ఒక రహస్యం చెబుతాడు. భూలోకంలో భరతదేశం దక్షిణభాగంలో మలయమలై అనే పర్వతాలు ఉన్నాయని, ఆ మలయమలై పర్వతాల నుండి తామ్రపర్ణినది ఉద్భవించిందని, దానికి దక్షిణ భాగములో ఆదిక్షేత్రం ఉందని, తాను ఆదినాథుడిగా అందమైన స్వరూపాన్ని ధరించి ఎవరికీ కనిపించకుండా శ్రీమహాలక్ష్మితో ఆనందంగా కొలువై ఉన్నానని తెలుపుతాడు. బ్రహ్మను ఆ క్షేత్రానికి వెళ్ళి తనను ఆరాధించమని నిర్దేశిస్తాడు. ఈ క్షేత్రమహిమను తెలుసుకున్న బ్రహ్మ సంతోషించి ఆ క్షేత్రాన్ని ‘కురుగా క్షేత్రం’ అని పిలవాలని కోరతాడు. పిదప బ్రహ్మ ఆదిక్షేత్రం చేరుకుని చాలాకాలం పెరుమాళ్ళను ఆరాధిస్తాడు. ఈ క్షేత్రం, ఇక్కడ ప్రవహించే తామ్రపర్ణినది భగవానుడికి అత్యంత ప్రియమైనవని మన పూర్వాచార్యులు స్తుతించారు.

ఈ క్షేత్రంలో జరిగిన సంఘటనలు
మహర్షులు ఎందరో ఈ క్షేత్రాన్ని,  ఇక్కడి పెరుమాళ్ళను సేవించుకున్నారు. ఆ కాలమున ఒక ఏనుగుకి  వేటగాడికి  మధ్య పోరాటం జరిగి ఇద్దరు ఒకరినొకరు చంపుకున్నారు. విష్ణుదూతలు వచ్చి ఆ ఇద్దరి ఆత్మలను విష్ణులోకానికి తీసుకొని వెళతారు. ఇది చూసిన మహర్షులు ఇక్కడి క్షేత్రమహిమ వలననే ఇలా  జరిగిందని గ్రహించి ఈ క్షేత్రాన్ని కీర్తించారు.

ఇక్కడ మనము ‘దాంతన్’ చరిత్రను కూడా అనుభవిద్దాము. ఉత్తరదేశంలోని శ్రీసాలగ్రామంలో ఒక బ్రాహ్మణుడి వద్ద శిష్యుడు వేదాధ్యయనం చేస్తుండేవాడు. అతనికి తగినంత జ్ఞానం లేకపోవడం వలన వేదాధ్యయనం సరిగ్గా చేయలేకపోతాడు. ఆ బ్రాహ్మణుడు “నీవు వేదాలను సరిగ్గా నేర్చుకోలేదు కాబట్టి, వచ్చే జన్మలో శూద్రుడిగా పుడతావని”  ఆ శిష్యున్ని శపిస్తాడు. అయితే ఆ శిష్యుడు శాపభయానికి లోనవకుండా, సమీపంలో ఉన్న విష్ణ్వాలయంలోని  గడ్డిని కోసి అమ్ముతు జీవనం సాగిస్తుండేవాడు. క్రమేణా అతడు విష్ణుకృపకు పాత్రుడై మరుసటి  జన్మలో ఆదిక్షేత్రంలో శూద్రుడిగా జన్మిస్తాడు. భగవత్ కృపతో అతను ‘దాంతన్’ అనే పేరుతో  పెరుమాళ్ళను సేవిస్తూంటాడు.  సురాసురుల యుద్ధం సమయాన దేవేంద్రుడు, దేవతలతో ఇక్కడికి వచ్చి పెరుమాళ్ళను పూజిస్తారు. కానీ, దాంతన్ పట్ల చేసిన అపరాధ కారణంగా, వాళ్ళు తమ దృష్టిని కోల్పోగా దాంతన్ వారి అపరాధాన్ని మన్నించి, వారికి దర్శనమీయమని భగవానుని ప్రార్థిస్తాడు. దాంతన్ కోరిక ప్రకారం భగవానుడు వారికి తన దర్శనభాగ్యం కల్పిస్తాడు.ఇలా దాంతన్ ఈ క్షేత్రపెరుమాళ్ళను సేవిస్తు,  సంసార విముక్తిని పొందుతాడు.

పూర్వ కాలంలో, శంఖమునివన్ అనే ఒక ఋషి ఇంద్రపదవిని పొందాలనే కోరికతో తపస్సు చేస్తాడు. ఇంతలో నారదముని అక్కడికి వచ్చి తపస్సు ఎందుకు చేస్తున్నావని ఋషిని అడుగుతాడు. విష్ణువుని  ఇతర దేవతలతో సమానుడిగా  భావించానని నారదునికి తన తప్పిదమును చెపుతాడు. నారదుడు అతనితో “నువ్వు ఘోరమైన తప్పు చేశావు కావున  ఈ తప్పిదము వలన నీవు సముద్రంలో శంఖములా జన్మిస్తావని” శపిస్తాడు. శంఖమునివన్ తన తప్పిదమును గ్రహించి, నారదుడిని శాపవిముక్తి పొందే మార్గాన్ని కోరుతాడు. నారాదుడు అతనితో “ఆదిక్షేత్రంలోని పెరుమాళ్ళ దయతో నీవు శాపవిముక్తి పొందుతావు” అని అభయమిస్తాడు. శంఖమునివన్ సముద్రంలో శంఖములా  జన్మించి, తపస్సు చేస్తూ తామ్రపర్ణికి చేరుకుంటాడు. అతను ఉన్న తీరాన్ని శంగణిత్తుఱై అని అంటారు. శంఖరూపంలో ఉన్న శంఖమునివననుని తో పాటు ఇతర శంఖాలకు భగవానుడు కృపతో ముక్తిని ప్రసాదించి తన దివ్యస్వరూపంతో ఈ దివ్యదేశంలో వెలిశాడు.  బ్రహ్మ ద్వారా భగవానుడు శ్రీభూనీళా దేవేరులను, వరహమూర్తి మరియు  గరుడున్ని  ఈ దివ్యదేశానికి తీసుకువచ్చాడు.

అంతేకాకుండా,  భృగుమార్కండేయ మహర్షులకు, కార్తవీర్యార్జునునికి, పంచపాండవులలో అర్జునునికి  ఈ దివ్యదేశంలో భగవత్ దర్శనప్రాప్తి కలిగింది.

కురుగాపురి మహాత్మ్యంలో వేదవ్యాసుడు తన పుత్రుడైన శ్రీశుకుడికి, బ్రహ్మవశిష్టులకు ఈ ఆదిక్షేత్ర మహిమను తెలిపారని స్పష్టంగా వివరించబడి ఉంది.

ఇలా ఈ క్షేత్ర చరిత్రవైభవమును అనుభవించాము.

మూలం – కురుగాపురి క్షేత్ర వైభవం పై ఆదినాథ ఆళ్వార్ దేవస్థానం ప్రచురించిన పుస్తకం.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2022/12/02/azhwarthirunagari-vaibhavam-1/

పొందుపరిచిన స్థానము – https://srivaishnavagranthams.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 90

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 89

కోయిల్ విరహంతో బాధపడుతున్న జీయర్

ఈ విధంగా ఆళ్వార్ తిరునగరిలో జీయర్ ఉండగా, మార్గళి మాసం (ధనుర్మాసం) ఆసన్నమైంది. ఎమ్పెరుమానార్ల తిరుప్పావై గొప్పతనాన్ని విని జీయర్, సేవించలేక పోతున్నానే అని బాధ పడ్డారు. [తిరుప్పావైతో ఎమ్పెరుమానార్లకు ప్రగాఢ అనుబంధం ఉండేది; వారిని తిరుప్పావై జీయర్‌ గా సూచిస్తారు, జీయర్ వారిని ఎంబెరుమానార్ల తిరుప్పావై అని పిలుస్తారు]; ఈ పాశురాన్ని రచించారు..

ఎందై ఎదిరాశర్ శిఱప్పై ఎళిల్ అరంగా
శిందై మగిళ్ందు అముదు శెయ్య – అంద నిలం
శెన్ఱు నిన్ఱు సేవిక్కుం సెల్వం ఇన్ఱు పెఱ్ఱిలమే
ఎన్ఱు సేవిక్కుం ఇని యాం?

(ఓ సుందరమైన శ్రీరంగనాధా! ఈనాటి రోజున నేను శ్రీరంగ కోయిల్ కు వెళ్ళి, ఆలయంలో నిలబడి, నా స్వామి అయిన రామానుజులను స్తుతించి, సంతోషించి, అదే భోగ్యంగా భావించి, దర్శించుకునే భాగ్యం నాకు లేకపోయింది. ఇక ఎప్పుడు దర్శిస్తానో? )

సంక్రమణం (దక్షినాయనం నుండి ఉత్తరాయణం సంక్రమణం, తై మాసం (మకర మాసం) ప్రారంభంతో) ప్రారంభమైనప్పుడు, జీయర్ నిరుత్సాహంతో ఈ పాశురాన్ని పఠించారు.

శీరరంగర్ తం దేవియరోడు శిఱప్పుడనే
ఏరారుమాఱన్ కలియన్ ఎదిరాశనోడు అమర
ప్పారోర్ మగిళ్ందేత్తుం తట్టుక్కళ్ తన్నుడన్ పోఱ్ఱ మంద
ప్పేరార వార్ త్తై ఇన్ఱు కండు ఇన్బుఱ ప్పెఱ్ఱిలమే

(నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, రామానుజులు, ఉభయ దేవేరులతో కలిసి ఆసీనులై ఉన్న శ్రీ రంగనాధుని దర్శించుకునే భాగ్యం నాకు లేకపోయింది. అందరు ఎంతో ఆనందంతో అడుగులు వేస్తూ, వారిని గొప్పగా స్తుతించే ఆ దృశ్యాన్ని నేను వీక్షించ లేక పోతున్నాను)

తై త్తిరునాళ్ (శ్రీ రంగంలో మకర మాస ఉత్సవాలు) ఉత్సవాలను గుర్తు చేసుకుంటూ ఈ పాశురాన్ని పఠించారు.

దేవియరుం తాముం తిరుత్తేరిన్ మేల్ అరంగర్
మేవి విక్కిరమన్ వీధి తనిల్ – సేవై శెయుం
అంద చ్చువర్ క్కత్తై అనుబవిక్క ప్పెఱ్ఱిలమే
ఇంద త్తిరునాళిలే నాం

(ఈ పవిత్రమైన రోజున, ఉభయ దేవేరులతో కలిసి నంపెరుమాళ్ళు దివ్య రథంపై ఆసీనులై తిరువిక్కిరమన్ వీధి (శ్రీరంగం ఆలయం ఏడు ప్రాకారాలలో ఒకటి) విహార అద్భుత దర్శనం నాకు కాలేదే!)

‘అణియరంగం ఆడుధుమో’, ‘తిరువరంగ ప్పెరునగరుళ్ తెణ్ణీర్ ప్పొన్ని తిరైక్కియాల్ వరుడి ప్పళ్ళి కొళ్ళుం కరుమణియై క్కోమళత్తై క్కణు కొండు ఎన్ కైణ్ణిణైగళ్ ఎన్ఱు కొలో కళిక్కుం నాళే’ (కులశేఖర ఆళ్వర్ల పెరుమాళ్ తిరుమొళి పాశురం 1.1.1), ‘ఊరరంగం ఎన్బదు ఇవళ్ తనక్కు ఆశై’ మొదలైన ఆళ్వార్ల పాశురాల మననం చేసుకుంటూ, శ్రీరంగ ఉత్సవ రోజులను అనుభవించ లేకపోతున్నానేనని దుఃఖించారు. జీయర్ తమ మనస్సులో ఆర్తితో, ఆళ్వార్ సన్నిధికి వెళ్లి ఈ పాశురాన్ని పఠిస్తూ మంగళాశాసనం చేసారు.

తిరుక్కురుగై ప్పెరుమాళ్ తన్ తిరుత్తాళ్గళ్ వాళియే
తిరువాన తిరుముగత్తు చ్చెవి ఎన్ఱుం వాళియే
ఇరుక్కుమొళి ఎన్ నెంజిల్ తేక్కినాన్ వాళియే
ఎందై ఎదిరాశర్ క్కు ఇఱైవనార్ వాళియే
కరుక్కుళియిల్ పుగావణ్ణం కాత్తరుళ్వోన్ వాళియే
కాశినియిల్ ఆరియనాయ్ క్కాట్టినాన్ వాళియే
వరుత్తం అఱ వందు అన్నై వాళ్విత్తాన్ వాళియే
మధురకవి తం పిరాన్ వాళి వాళి వాళియే

(తిరుక్కురుగూర్ స్వామి దివ్య తిరువడి చిరకాలం వర్ధిల్లాలి! ఆ దివ్య ముఖ తేజస్సు చిరకాలం వర్ధిల్లాలి! ఋగ్వేదం దివ్య వాక్కులు నా హృదయంలో నిలిచిపోయేలా చేసిన ఆ తీరు చిరకాలం వర్ధిల్లాలి! నా స్వామి అయిన రామానుజుల స్వామి చిరకాలం వర్ధిల్లాలి! మరొక గర్భంలో పడకుండా నన్ను కాపాడిన తీరు చిరకాలం వర్ధిల్లాలి! ఆ మహోన్నత వ్యక్తి చూపిన ఈ బాట చిరకాలం వర్ధిల్లాలి! ఏ పశ్చాత్తాపం లేకుండా జీవించడంలో నాకు తోడ్పడిన తీరు చిరకాలం వర్ధిల్లాలి! మధురకవి ఆళ్వార్ల ఉద్ధరణ పొందినవారు చిరకాలం వర్ధిల్లాలి!)

జీయర్ నమ్మాళ్వార్ల అనుమతి తీసుకుని తిరుక్కురుగూర్ నుండి బయలుదేరి, శ్రీవిల్లిపుత్తూర్ చేరుకుని, ఆలయంలోకి ప్రవేశించి, భట్టర్పిరాన్ (పెరియాళ్వార్, పొంగుం పరివు (పెరుమాళ్ పట్ల పొంగిపోతున్న భక్తి) ఉన్నవాడు) అలాగే వడపెరుం కోయిలుడైయాన్ (విశాల మందిరంలో ఒక మర్రి ఆకుపై కొలువై ఉన్నవాడు)ని సేవించుకున్నారు. ఆ తర్వాత వారు నాచ్చియార్ నివాసంలోకి ప్రవేశించి, ‘ఆళ్వార్ తిరుమగళార్ ఆండాళ్’ (పెరియాళ్వార్ దివ్య కుమార్తె అయిన ఆండాళ్) దివ్య చరణాలను దర్శించుకున్నారు. కోదై (ఆండాళ్‌ కు ఉన్న మరో పేరు, పెరుమాళ్‌ను అలంకరించే ముందు తాను ఆ మాల ధరించినందుకు ఆ పేరుతో పిలుస్తారు) వీరిపై తన కృపను కురిపిస్తూ, “కోయిలణ్ణన్ పునరవతారము కాదా నీవు!” అని పలికెను. ఆండాళ్ అనుగ్రహంతో, ‘అళగన్ అలంగారన్ మలైయాన్ సుందరత్తోలుడైయాన్’ (అందమైన భుజాలు గలవాడు, తిరుమాలిరుంజోలైలో కొలువై ఉన్నవాడు) దర్సించుకోడానికి అళగర్ కోయిల్‌ కు బయలుదేరారు. ఆండాళ్ అనుగ్రహంతో, అందంగా అలంకరింపబడిన ‘అళగన్ అలంగారన్ మలైయాన్ సుందరత్తోలుడైయాన్’ (అందమైన భుజాలు గలవాడు, తిరుమాలిరుంజోలైలో కొలువై ఉన్నవాడు) దర్శించుకోడానికి అళగర్ కోయిల్‌ కు బయలుదేరారు. పరమ స్వామిని (తిరుమాలిరుంజోలై మూలవర్ల పేరు) సేవించుకున్నారు. ‘అళగర్’ ఉత్సవర్లను తిరుక్కురుంగుడికి తరలించారని తెలిసింది. పెరియాళ్వార్ల పాశురం “నల్లాదోర్ తమరై ప్పొయ్గై నాణ్మలర్మేల్ పనిశోర అల్లియుం తాదుం ఉదిర్ందిట్టు అళగు అళిందాలొత్తదాలో, ఇల్లం వెఱిచ్చోడిఱ్ఱాలో ఎన్ మగళై ఎంగుం కాణేన్” (అందమైన సరస్సులో నిండుగా వికసించిన తామర పుష్పం పైన మంచు పడితే, ఆ పుష్పం లోపలి, బయటి రేకులు పడిపోతాయి; అలాంటిది జరిగినప్పుడు, కమలం దాని అందాన్ని కోల్పోతుంది. నా కూతురు ఎక్కడా కనిపించనందుకు, అందం కోల్పోయిన కమలం వలెనున్నది నా ఇల్లు ఇప్పుడు), అలాగే, అళగర్ ఆలయంలో లేనందుకు, ఈ ఆలయం కూడా అందం కోల్పోయినట్లుగా కనిపించింది. “పుత్ర ద్వయ విహీనం తత్” (రామ లక్ష్మణులద్దరు లేని ఇల్లు వంటిది) అని చెప్పినట్లుగా భావించి బాధపడ్డారు. ఆండాళ్ నాచ్చియార్ తిరుమొళి 9-6 వ పాశురంలో “నాఱు నఱుం పొళిల్ మాలిరుంజోలై నంబిక్కు” (సువాసనలు వెదజల్లే తోటలున్న తిరుమాలిరుంజోలైలో నివాసమున్న ఆ పెరుమాళ్ళు) అని పలికినట్లుగా, రామానుజుల మాదిరిగానే, వీరు అన్ని పదార్థాలను తెచ్చి వాటితో ప్రసాదాన్ని తయారు చేసి, పెరుమాళ్లకు సమర్పించారు. ఆ ప్రసాదాన్ని భుజించినందుకు ‘కైక్కూలి’ (లంచం) గా, వీరు నాచ్చియార్ తిరుమొళి 9-7 వ పాశురం “పిన్నుమ్ ఆలుమ్ సెయ్వన్”, పెరియాళ్వార్ తిరుమొళి 5-3 పాశురం ‘ఉన్ పొన్నడి వాళ్గ’ పఠించి పెరుమాళ్ళకు మంగళాశాసనం చేసారు. పరమస్వామి యొక్క దివ్య ముఖారవిందాన్ని సేవించి, సత్య పలుకులు చెప్పే ఆళ్వార్ల పాశురం “నంగల్ కున్ఱం కైవిడాన్” (మా నివాసాన్ని విడిచివెళ్ళ నివ్వకుండా) సత్యంగానే ఉండాలని ప్రార్థించారు [ఉత్సవ మూర్తి త్వరగా తిరిగి రావాలని పెరుమాళ్‌ను ప్రార్థించారు).

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/16/yathindhra-pravana-prabhavam-90/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 89

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 88

జీయర్ను ఆశ్రయించిన మహాబలి వాణనాథరాయన్

మధురలో జీయర్ ఉన్న కాలంలో , ఆ ప్రాంతపు రాజైన మహాబలి వాణనాథ రాయులు జీయర్ తిరువడి సంబంధం కోరి వారి దివ్య పాదాలను ఆశ్రయించారు. జీయర్ ఆ రాజుపై తమ విశేష కృపను కురిపించి, వారికి పంచ సంస్కారములు గావించి తమ పాదాల యందు ఆశ్రయం కలిపించారు. జీయర్ ఆ రోజు, మరుసటి రోజు అక్కడే గడిపి, రెండవ రోజు అర్ధ రాత్రిలో, ఈ పాశురములో చెప్పినట్లు

మణికాంచన సంజన్నాం చిపికాం తద్ అతిష్టితాం
అస్పన్నయంత స్వస్గందే కృత్వా కేచిత్ ప్రతస్థిరే

(మణవాల మాముణులు కరుణతో ఆసీనులై ఉన్న ఆ కెంపులతో పొదగబడిన స్వర్ణ పల్లకిని కొందరు శ్రీవైష్ణవులు అలుపు లేకుండా తమ భుజాలపైన మోసుకువెళ్ళారు) ఆ రాజు సమర్పించిన నవరత్నాభరితమైన అమూల్య పల్లకీలో బయలుదేరారు. చల్లని మంచు కురుస్తున్న రాత్రి అయినందున, ఆ పల్లకీని కప్పి శ్రీవైష్ణవులు మోసుకెళ్లారు. క్రింది శ్లోకములో పేర్కొనబడి ఉంది..

చత్రంచిత్రం తదుః కేచిత్ చామరే తదిరేపరే
బ్రుంగారమవరే’బిప్రన్ కళాఙ్ఞమపికేచన
తద్ పాదబ్జ రజస్పర్శ పావనీం ఆత్మ భావినీం
సంతస్సంతారయంతిస్మ మౌళినామణి పాదుకాం
అకాయన్నగ్రతః కేచితత నృన్యంతి కేచన

((శ్రీవైష్ణవులలో) కొందరు వైభవపూర్ణమైన స్వేత గొడుగును పట్టుకున్నారు; కొందరు చామరను ఊపుతున్నారు; కొందరు పడిక్కం (విగ్రహాల స్నానం కొంసం ఉపయోగించే నీటి బిందెలు/పాత్రలు) మోసుకెళుతున్నారు, కొందరు కళంజి (తమలపాకులు, వక్కలు పెట్టుకునే పాత్ర); మరికొందరు జీయర్ పాదుకలు పట్టుకెళుతున్నారు. ఎందుకంటే వారి దివ్య పాద ధూళి వాటిపై పడి పవిత్రం చేస్తుంది కాబట్టి; కొందరు ముందుకు సాగారు (వెనక వచ్చేవారి సౌకర్యార్థం); మరికొందరు నృత్యం చేశారు), జీయర్ ఆసీనులైన దివ్య పల్లకిని మోసుకెళుతూ, అనేక శ్రీవైష్ణవులు తమకు అనుగుణమైన కైంకర్యాన్ని – దివ్య ఛత్ర చామరలు మొదలైన వివిధ ఉపకరణాలను పట్టుకొని పరమానందంతో పాడుతూ నృత్యం చేస్తూ, మరికొందరు ఆనందంగా వింటూ ముందుకు సాగారు. ఇలా వాళ్ళు దాదాపు 20 మైళ్ళు వెళ్ళిన తరువాత, తెల్లవారింది. వైగై నది ఒడ్డున నిత్యానుష్టానము నిర్వహించేదుకు ఆగారు. పల్లకీ మోసేవానిగా వేషం ధరించిన రాజు, జీయర్ పాదాలను సేవించుట గమనించిన జీయర్ ఆశ్చర్యపోయి, “నీవిలా చేయవచ్చా?” అని అడిగారు. వాళ్ళు అప్పుడు చేరుకున్న కుగ్రామం ‘ముత్తరసన్’ పై తమ కృపను కురిపించమని రాజు జీయర్‌ ను వేడుకున్నారు. జీయర్ ఆ గ్రామాన్ని ఆశీర్వదించి, వారి విన్నపం మేరకు ఆ గ్రామానికి “అళగియ మణవాళ నల్లూర్” అనే నామాన్ని పెట్టారు. ఆ తర్వాత రాజుకి వెళ్ళమని అనుమతినిచ్చి, వీళ్ళందరూ తిరుప్పుళ్ళాణి మీదుగా ముందుకు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు చోటు వెతుకుతున్నారు. మంచి నీడనిచ్చే ఒక చింత చెట్టును చూశారు. వారంతా ఆగి ఆ చెట్టు నీడలో తమ అలసటను తీర్చుకున్నారు.

చింతచెట్టుకి మోక్షాన్ని ప్రసాదించిన జీయర్

జీయర్ శిష్యులు ఒక చింతచెట్టు తమందరికీ ఎంతో మేలు చేసిందని, ఆ చెట్టుపై తమ కరుణను కురిపించమని అభ్యర్థించారు. జీయర్ అద్భుతమైన దయతో, తమ దివ్య హస్తాలతో ఆ చెట్టును తాకి, “నేను పొందిన ఫలాన్నే నీవు పొందుగాక” అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ చెట్టు వెంటనే తాజాదనం కోల్పోయి వ్రాలి కనుమరుగై పోయింది. అది చూసి శిష్యులు ఇలా అన్నారు..

యంయం స్పృశతి పాణిభ్యాం యంయం పశ్యతి చక్షుషా
స్థావరాణ్యపి ముచ్యంతే కింపునర్ బాంధవాజనాః

(పరమ సాత్వికులెవరైనా తమ దివ్య హస్తాలతో తాకినా, వారి దృష్థి పడినా, చెట్లు అయినా సరే, మోక్షాన్ని పొందుతుంది; అలాంటప్పుడు, జీయర్ తిరువడి సంబంధము ఉన్న వారి గురించి వేరే చెప్పాలా?).

అనంతరం జీయర్ బృందం తిరుప్పుల్లాణి చేరుకుని, తిరుప్పుల్లాణి పెరుమాళ్ళను దర్శించుకొని, అక్కడి నుండి బయలుదేరి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ తిరునగరి చేరుకున్నారు. అందరు శాస్త్ర విధిని అనుసరించి ‘ఆళ్వార్’ ను, ‘పోలిందు నిన్ఱ పిరాన్ (తిరునగరి పెరుమాళ్ళ తిరునామము) ని దర్శించుకొని మంగళాశాసనం చేసారు. అక్కడ అనేక మందిని సంస్కరించి, తిరుమగళ్ కేళ్వన్ (శ్రీమహాలక్ష్మికి పతి) దాసులుగా మార్చారు. వాళ్ళకి తిరువాయ్మొళి వంటి దివ్యప్రబంధాలను ఉపదేశించి, వారు నిత్యం ఆళ్వార్ తిరుమంజనం, ఇతర దివ్య ఉత్సవాలను అనుభవించారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/15/yathindhra-pravana-prabhavam-89/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 88

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 87

శ్రీ గోవింద దాసరప్పన్ ల మధురకవి నిష్ఠ

ఒక రోజు మఠంలో, గోష్ఠి సమావేశమై ఉండగా, అందరికీ తెలిసినప్పటికీ, జీయర్ “దేవుమ్ మఱ్ఱు అరియెన్” (ఆచార్యుడు తప్పా మరొక దేవుడిని నేనెరుగను) అన్న వాఖ్యం శ్రీ గోవింద దాసరప్పకు మాత్రమే సరిపోతుందని, అతని విశిష్ఠతను గుర్తిస్తూ అన్నారు.

ఈ క్రింది పాశురములో చెప్పినట్లు..

సాక్షాన్నారాయణో దేవః కృత్వా మర్త్య మయీం తనుం
మగ్నానుద్ధారతే లోకాన్ కారుణ్యాచ్చాస్త్ర పాణినా
జగతో హిత చింతాయై జాగ్రతః పణిశాయినః
అవతారేష్వన్యతమం విద్ది సౌమ్యవరం మునిం

(మానవ రూపంలో (ఆచార్యునిగా) ఈ లోకానికి దిగి వచ్చి, సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న జీవాత్మలను తమ దయతో, శాస్త్ర సహాయంతో ఉద్ధరించేది కేవలం నారాయణుడే (సర్వేశ్వరుడు) అని తెలుసుకో. శేష శయ్యపై శయనించి, మేల్కొని ఉన్నవాడు, ఈ సంసారములో జీవాత్మలను ఉద్దరించేందుకు చేపట్టిన అవతారాలలో, మణవాళ మాముణులు ఒకరు), జీయర్ ఈ విషయాన్ని స్పష్టం చేసేందుకు, తమ అంతిమ లక్ష్య సాధనలో శ్రీ గోవింద దాసర్ మరింత నిష్ఠగా ఉండాలని అళగియ మణవాళ పెరుమాళ్ళ విగ్రహాన్ని వారి తిరువారాధన పెరుమాళ్ళుగా ప్రసాదించారు. తమ ఆచార్యుల తిరువడిని విడిచి పెట్టకుండా ముప్పై సంవత్సరాలుగా మోర్ మున్నం (మొదటి మజ్జిగన్నం తినడం) పాఠిస్తున్న శ్రీ గోవింద దాసరప్పన్, జీయర్ వద్ద రహస్యార్థాల శ్రవణం చేశారు. కొన్ని సందర్భాలలో ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినపుడు, రాత్రికి బస చేయకుండా తిరిగి వచ్చి, నియమం తప్పకుండా నిత్యం జీయరుకి సేవ చేస్తూ ఉండేవాడు [‘మోర్ మున్నం’ పదానికి విశేషత ఏమిటంటే – ఆచార్యుడు తిన్న అరటి ఆకులోనే శిష్యుడు తినడాన్ని సూచిస్తుంది; ఆచార్యుడు ఆఖరిలో మజ్జిగన్నంతో తమ భోజనం ముగిస్తారు, శిష్యుడు ఆ మజ్జిగన్నం రుచిని ఆస్వాదించాలని, తాను ముందు మజ్జిగన్నంతో మొదలుపెట్టి తరువాత ఇతర అన్న ప్రసాదాలు తింటాడు]. తరువాత, ఆండాళ్ తిరువాడిప్పూర (ఆండాళ్ తిరునక్షత్ర మహొత్సవాలు) ఉత్సవ సమయంలో, శ్రీ గోవింద దాసరప్పన్, శూడికొడుత్త నాచ్చియార్ (పెరుమాళ్ళకు అర్పించే మాలాలను ముందు తాను ధరించి నందుకు ఆండాళ్ ను ‘శూడికొడుత్త నాచ్చియార్’ అను తిరునామముతో పిలుస్తారు) తీర్థ ప్రసాదాలను తెచ్చి జీయరుకి అందించారు. జీయర్ సంతోషంగా స్వీకరించి, ఆండాళ్‌ ను సంతోషపెట్టడానికి, శ్రీ గోవిందప్ప దాసర్‌ కు “భట్టర్పిరాన్ దాసర్” అనే బిరుదుని అనుగ్రహించారు. (భట్టార్ పిరాన్ అనేది ఆండాళ్‌ తండ్రిగారైన పెరియాళ్వార్ల నామము). క్రమేణా, గోవింద దాసరప్పన్ వైరాగ్యంతో ఈ సంసార పరిత్యాగం చేసి సన్యాసాశ్రమ స్వీకారం చేసి అందరితో ‘భట్టర్ పిరాన్ జీయర్’ అని పిలిపించుకున్నారు. రామానుజుల తిరువడికి వడుగ నంబి అంకితమై ఉన్నట్లే, భట్టర్ పిరాన్ జీయర్ కూడా మణవాళ మాముణుల పట్ల ‘ఆచార్య నిష్టాగ్రేసరుడు’ గా నిలిచారు. వీరు చరమ పర్వ నిష్ఠ (ఆచార్య నిష్ఠలో దృఢమై ఉన్న అత్యున్నత దశ) తో తమ ఆచార్యునికి అపూర్వమైన సేవ చేస్తూ జీవిస్తున్నప్పుడు, వీరిని భట్టర్ పిరాన్ జీయర్, దేవు మఱ్ఱు అఱియేన్, భట్టర్ నాథ మునివరాభీష్ట దైవతం (భట్టర్ పిరాన్ జీయరుకి మణవాళ మాముణులు మాత్రమే దైవం), శ్రీ మధురకవి చరితకారి మహిత చరిత్ర శ్రీమాన్ భట్టనాథపతీశ్వరః (శ్రీ మధుర కవి నిష్ఠతో పోల్చగల ప్రవర్తన, శ్రీ భట్టర్ పిరాన్ జీయర్ మణవాళ మాముణుల పట్ల చేసేవారు) అని పిలిచేవారు. అటువంటి అంతీమోపాయ నిష్ఠ అగ్రేసర్ (పూర్తిగా ఆచార్యునిపై ఆధారపడే అంతిమ దశలో దృఢంగా పాతుకుపోయిన వారిలో ఉత్తముడు) సేవ చేస్తున్న సౌమ్యజమాతృ ముని జీయర్‌ కు తల్లి, తండ్రి, బంధువు వంటి నమ్మాళ్వార్లను సేవించాలనే తపన ఉండేది. ఎందుకంటే స్వయంగా జీయర్ వారిని సేవించి ఎంతో కాలం గడిచింది కాబట్టి. వెంటనే పెరుమాళ్ళకు విజ్ఞప్తి చేసి, అనుమతి పొంది, దూడ ఆవు దగ్గరకి పరుగెత్తినట్లు, వెంటనే ఆళ్వార్ తిరునగరికి బయలుదేరారు. మార్గమధ్యంలో, ‘తిరుప్పల్లాండు’ జన్మ స్థలమైన మధురై కూడల్ నగర్‌ కు చేరుకుని “మల్లాండ తిణ్ తోళ్ మణివణ్ణన్” (మల్లయోద్ధులను సంహరించిన నీల మణి వర్ణ పెరుమాళ్) ని దర్శించుకున్నారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/14/yathindhra-pravana-prabhavam-88/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 87

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 86

అణ్ణన్, కాంచీపురం నుండి బయలుదేరి, జీయర్ దివ్య తిరువడి దర్శనం పొందాలనే గొప్ప ఆర్తితో కావేరి ఒడ్డుకు చేరుకున్నారు. శ్రీరంగంలోని ప్రముఖులందరూ వారి రాక కబురు విని ఎంతో ఆనందించారు. ఆలయ అర్చకులు, ఆలయ ఉద్యోగులందరు కలిసికట్టుగా వెళ్లి అణ్ణన్ ను స్వాగతించి, వారిని తిరుమాలిగకు చేర్చారు. అణ్ణన్ తిరుమాలిగకు జీయర్ కూడా వచ్చి, అతనిపైన తమ కృపను కురిపించారు. జీయర్ తిరువేంకటేశ్వరుడి ప్రసాదాలు, పేరారుళాళన్ ప్రసాదాలను స్వీకరించి, ఆనందపడి, యాత్ర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అణ్ణన్ తో వెళ్లిన శ్రీవైష్ణవులు, జీయరుకి పేరారుళాళన్ అనుగ్రహించిన దివ్యనామం ‘అణ్ణన్ జీయర్’ గురించి తెలియజేసారు. ఇది విన్న జీయర్ ఎంతో సంతోషించి, “మా మనస్సు తెలుసుకుని, దేవర్వారితో ఉన్న సంబంధాన్ని ఆ పేరారుళాళన్ ఎంత గొప్పగా చాటారు!” అని పొగిడి మాట్లాడారు. మరి కొందరు “స్వతంత్రుడైన భగవానుడికి హద్దు, అడ్డంకి ఉంటుందా!” అని అన్నారు. ప్రతివాది భయంకరం అణ్ణా కూడా “శ్రియః పతి” అని చెప్పినట్లే ఈ దివ్య నామము కూడా ఒక గుర్తింపును అద్భుతంగా తెస్తుంది అని అన్నారు. అక్కడ ఉన్నవారందరూ అతన్ని మనస్ఫూర్తిగా కీర్తించారు.

తరువాత రామానుజ దాసర్, జీయర్ తిరువడి యందు సాష్టాంగ నమస్కారం చేయగా, జీయర్ తమ దివ్య పాదాలను రామానుజ దాసు శిరస్సుపై ఉంచి, అద్భుత రీతిలో అతని శిరస్సుని అలంకరించి అనుగ్రహించారు. ఉత్తర దివ్యదేశాల నుండి రామానుజ దాసర్ పొందిన ప్రసాదాలు, సమర్పణలను నలుగురు శ్రీవిష్ణువులు తెచ్చి జీయరుకి సమర్పించారు. జీయర్ వాటంన్నింటినీ స్వీకరించి గోష్ఠి వారందరిలో వితరణ చేయించారు. జీయర్ ఎంతో సంతృప్తి చెంది, ఉత్తర దివ్యదేశాలన్నింటినీ సేవించినట్లు భావించి, రామానుజ దాసర్ను ఆలింగనం చేసుకున్నారు.

తరువాత రామానుజ దాసర్, ఎఱుంబికి తిరిగి రమ్మని కోరుతూ ఎఱుంబి అప్పా తండ్రిగారు పంపిన  సందేశాన్ని ఎఱుంబి అప్పా కు తెలియచెశారు. జీయర్ నుండి వీడవలసి వచ్చినందుకు అప్పా ఎంతో బాధ పడ్డారు. అతనిని ఓదార్చడానికి, జీయర్ తమను పోలిన ఒక విగ్రహాన్ని, పాదుకలను వారికి ఇచ్చారు. ఈ సంఘటనను వర్ణిస్తూ ఈ శ్లోకం రచించబడింది.

ప్రీతః ప్రేషితవాన్ మునిర్వరవరో యస్మై ముహుః శ్రీముఖం
ప్రాదాత్ స్వాంగ్రి సరోజసంగసుపకం స్వీయాముపానద్యుకీం
స్వీయం సుందరం ఉత్తరీయం అమలం స్వాం మూర్తిం అర్చామయీం
తం దేవేశగురుం భజేమ శరణం సంసార సంతారకం

(మాణవాళ మాముణులు తమ సందేశాలను ఎవరికైతే పంపేవారో, ఎవరికైతే తమ దివ్య పాదుకలను, దివ్య విగ్రహాన్ని ప్రసాదించారో, ఆ దేవరాజ గురువుకి (ఎఱుంబి అప్పా అని కూడా పిలువబడే) శరణాగతి చేద్దాం. తరువాత, ఎఱుంబి అప్పావారి దివ్య మనుమడు పిళ్ళైయప్పా కూడా ఈ సంఘటనను గుర్తు చేసుకున్నారు.

జీయర్ అనుమతి తీసుకుని అప్పా కోయిల్ (శ్రీరంగం) నుండి బయలుదేరి, ఎఱుంబికి వచ్చి, తమ తండ్రిగారి దివ్య పాదాలను సేవించుకొని వారికి కైంకర్యాలు నిర్వహించారు. వీరు జీయర్ ఆదిశేష స్వరూపాన్ని, లక్ష్మణ రుపాన్ని వర్ణిస్తూ అనేక ప్రబంధాలను రచించారు. అవి వరవరముని ప్రబంధం, వరవరముని పంచాశత్, వరవరముని స్తవం, వరవరముని మంగళాశాసనం, వరవరముని గద్యం మొదలైనవి.

అరంగనగరప్పన్ తిరువారాధనముగా పొందిన శ్రీవానమామలై జీయర్

అదే సమయంలో, వానమామలై ఆలయ నిర్వహణ కార్య భారాలను నిర్వహించేందుకు వానమామలై జీయర్‌ను వానమామలైకి పంపమని సేన ముదలియార్ (విష్వక్సేనుడు) సందేశం పంపారు. జీయర్ దానికి సంతోషంగా అంగీకరించారు. వానమామలై జీయరుని పెరియ పెరుమాళ్ళ సన్నిధికి తీసుకెళ్లి, వానమామలై నుండి వచ్చిన సందేశాన్ని ప్రకటించారు. నిత్యం పెరియ పెరుమాళ్ళ సన్నిధిలో నాలాయిర దివ్య ప్రబంధంలో నుండి వంద పాశురాలను పఠించి పెరుమాళ్ళకు వినిపించడం జీయర్ నియమము. ఆ రోజు, వారు పెరియ తిరుమొళి 11-8-8 “అణియార్ పొళిల్ శూళ్ అరంగ నగర్ అప్పా” (సుగంద భరితమైన నందనవనాలతో చుట్టుముట్టి ఉన్న శ్రీరంగంలో నివాసముంటున్న ఓ నా స్వామీ!) అని పఠించారు. పెరియ పెరుమాళ్ళు అంగీకరించి, ‘భూపాలరాయన్’ ( నంపెరుమాళ్ సింహాసనము) పైన నంపెరుమాళ్ తో కలిసి ఆసీనులైన “అరంగనగరప్పన్” విగ్రహాన్ని వానమామలై జీయర్‌ తిరు హస్థాలకు అందించారు. దివ్య తేజముతో నిండిన జీయర్ తిరుముఖాన్ని చూసి ‘పెరియార్ క్కాట్పట్టక్కాల్ పెఱాద పయన్ పెఱుమాఱు” అని పఠించి, తీర్థం, తిరుపరివట్టం (శిరస్సుపై ధరించే దివ్య వస్త్రం), మాల, అభయ హస్తం మొదలైన వాటితో సత్కరించి, [వానమామలై జీయరుని శ్రీరంగం నుండి బయలుదేరడానికి] అనుమతిని ఇచ్చారు. జీయర్ ఎంతో భక్తితో మేళ తాళాల నడుమ అరంగనగరప్పన్‌ ను స్వీకరించి, వారికి దివ్య నివేదనలు అర్పించి, వానమామలై జీయరుని ఆశీర్వదించి వానమామలైకి పంపారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/13/yathindhra-pravana-prabhavam-87/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org