ఆళ్వార్ తిరునగరి   వైభవము – ప్రాచీన చరిత్ర

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవర మునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

పూర్తి శ్రేణి

ఆళ్వార్ తిరునగరిని  శ్రీకురుగాపురిక్షేత్రం అని , ఆదిక్షేత్రమని కూడా అంటారు. జగత్పతి అయిన శ్రీమన్నారాయణుడు తన లీల కోసం సృష్టించిన గొప్ప దివ్యదేశమిది. సృష్టి ఆదిలో భగవానుడు,  చతుర్ముఖబ్రహ్మను సృష్టించి అతని ద్వారా ఈ జగత్తును సృష్టించాలని సంకల్పిస్తాడు. ఆ బ్రహ్మ సృష్టికార్యాన్ని పూర్తిచేసుకొని, భగవానుడి దర్శనం పొందాలనే కోరికతో వెయ్యి సంవత్సరాల కఠోరతపస్సు చేసి దర్శనం పొంది అనేక విధాలుగా స్తుతిస్తాడు. ఆ సమయంలో, భగవానుడు బ్రహ్మతో ఒక రహస్యం చెబుతాడు. భూలోకంలో భరతదేశం దక్షిణభాగంలో మలయమలై అనే పర్వతాలు ఉన్నాయని, ఆ మలయమలై పర్వతాల నుండి తామ్రపర్ణినది ఉద్భవించిందని, దానికి దక్షిణ భాగములో ఆదిక్షేత్రం ఉందని, తాను ఆదినాథుడిగా అందమైన స్వరూపాన్ని ధరించి ఎవరికీ కనిపించకుండా శ్రీమహాలక్ష్మితో ఆనందంగా కొలువై ఉన్నానని తెలుపుతాడు. బ్రహ్మను ఆ క్షేత్రానికి వెళ్ళి తనను ఆరాధించమని నిర్దేశిస్తాడు. ఈ క్షేత్రమహిమను తెలుసుకున్న బ్రహ్మ సంతోషించి ఆ క్షేత్రాన్ని ‘కురుగా క్షేత్రం’ అని పిలవాలని కోరతాడు. పిదప బ్రహ్మ ఆదిక్షేత్రం చేరుకుని చాలాకాలం పెరుమాళ్ళను ఆరాధిస్తాడు. ఈ క్షేత్రం, ఇక్కడ ప్రవహించే తామ్రపర్ణినది భగవానుడికి అత్యంత ప్రియమైనవని మన పూర్వాచార్యులు స్తుతించారు.

ఈ క్షేత్రంలో జరిగిన సంఘటనలు
మహర్షులు ఎందరో ఈ క్షేత్రాన్ని,  ఇక్కడి పెరుమాళ్ళను సేవించుకున్నారు. ఆ కాలమున ఒక ఏనుగుకి  వేటగాడికి  మధ్య పోరాటం జరిగి ఇద్దరు ఒకరినొకరు చంపుకున్నారు. విష్ణుదూతలు వచ్చి ఆ ఇద్దరి ఆత్మలను విష్ణులోకానికి తీసుకొని వెళతారు. ఇది చూసిన మహర్షులు ఇక్కడి క్షేత్రమహిమ వలననే ఇలా  జరిగిందని గ్రహించి ఈ క్షేత్రాన్ని కీర్తించారు.

ఇక్కడ మనము ‘దాంతన్’ చరిత్రను కూడా అనుభవిద్దాము. ఉత్తరదేశంలోని శ్రీసాలగ్రామంలో ఒక బ్రాహ్మణుడి వద్ద శిష్యుడు వేదాధ్యయనం చేస్తుండేవాడు. అతనికి తగినంత జ్ఞానం లేకపోవడం వలన వేదాధ్యయనం సరిగ్గా చేయలేకపోతాడు. ఆ బ్రాహ్మణుడు “నీవు వేదాలను సరిగ్గా నేర్చుకోలేదు కాబట్టి, వచ్చే జన్మలో శూద్రుడిగా పుడతావని”  ఆ శిష్యున్ని శపిస్తాడు. అయితే ఆ శిష్యుడు శాపభయానికి లోనవకుండా, సమీపంలో ఉన్న విష్ణ్వాలయంలోని  గడ్డిని కోసి అమ్ముతు జీవనం సాగిస్తుండేవాడు. క్రమేణా అతడు విష్ణుకృపకు పాత్రుడై మరుసటి  జన్మలో ఆదిక్షేత్రంలో శూద్రుడిగా జన్మిస్తాడు. భగవత్ కృపతో అతను ‘దాంతన్’ అనే పేరుతో  పెరుమాళ్ళను సేవిస్తూంటాడు.  సురాసురుల యుద్ధం సమయాన దేవేంద్రుడు, దేవతలతో ఇక్కడికి వచ్చి పెరుమాళ్ళను పూజిస్తారు. కానీ, దాంతన్ పట్ల చేసిన అపరాధ కారణంగా, వాళ్ళు తమ దృష్టిని కోల్పోగా దాంతన్ వారి అపరాధాన్ని మన్నించి, వారికి దర్శనమీయమని భగవానుని ప్రార్థిస్తాడు. దాంతన్ కోరిక ప్రకారం భగవానుడు వారికి తన దర్శనభాగ్యం కల్పిస్తాడు.ఇలా దాంతన్ ఈ క్షేత్రపెరుమాళ్ళను సేవిస్తు,  సంసార విముక్తిని పొందుతాడు.

పూర్వ కాలంలో, శంఖమునివన్ అనే ఒక ఋషి ఇంద్రపదవిని పొందాలనే కోరికతో తపస్సు చేస్తాడు. ఇంతలో నారదముని అక్కడికి వచ్చి తపస్సు ఎందుకు చేస్తున్నావని ఋషిని అడుగుతాడు. విష్ణువుని  ఇతర దేవతలతో సమానుడిగా  భావించానని నారదునికి తన తప్పిదమును చెపుతాడు. నారదుడు అతనితో “నువ్వు ఘోరమైన తప్పు చేశావు కావున  ఈ తప్పిదము వలన నీవు సముద్రంలో శంఖములా జన్మిస్తావని” శపిస్తాడు. శంఖమునివన్ తన తప్పిదమును గ్రహించి, నారదుడిని శాపవిముక్తి పొందే మార్గాన్ని కోరుతాడు. నారాదుడు అతనితో “ఆదిక్షేత్రంలోని పెరుమాళ్ళ దయతో నీవు శాపవిముక్తి పొందుతావు” అని అభయమిస్తాడు. శంఖమునివన్ సముద్రంలో శంఖములా  జన్మించి, తపస్సు చేస్తూ తామ్రపర్ణికి చేరుకుంటాడు. అతను ఉన్న తీరాన్ని శంగణిత్తుఱై అని అంటారు. శంఖరూపంలో ఉన్న శంఖమునివననుని తో పాటు ఇతర శంఖాలకు భగవానుడు కృపతో ముక్తిని ప్రసాదించి తన దివ్యస్వరూపంతో ఈ దివ్యదేశంలో వెలిశాడు.  బ్రహ్మ ద్వారా భగవానుడు శ్రీభూనీళా దేవేరులను, వరహమూర్తి మరియు  గరుడున్ని  ఈ దివ్యదేశానికి తీసుకువచ్చాడు.

అంతేకాకుండా,  భృగుమార్కండేయ మహర్షులకు, కార్తవీర్యార్జునునికి, పంచపాండవులలో అర్జునునికి  ఈ దివ్యదేశంలో భగవత్ దర్శనప్రాప్తి కలిగింది.

కురుగాపురి మహాత్మ్యంలో వేదవ్యాసుడు తన పుత్రుడైన శ్రీశుకుడికి, బ్రహ్మవశిష్టులకు ఈ ఆదిక్షేత్ర మహిమను తెలిపారని స్పష్టంగా వివరించబడి ఉంది.

ఇలా ఈ క్షేత్ర చరిత్రవైభవమును అనుభవించాము.

మూలం – కురుగాపురి క్షేత్ర వైభవం పై ఆదినాథ ఆళ్వార్ దేవస్థానం ప్రచురించిన పుస్తకం.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2022/12/02/azhwarthirunagari-vaibhavam-1/

పొందుపరిచిన స్థానము – https://srivaishnavagranthams.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s