Monthly Archives: March 2023

ఆళ్వార్ తిరునగరి వైభవము – ఉత్సవాలు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

పూర్తి శ్రేణి

<< సన్నిధులు

తామ్రపర్ణి నదీజలముతో  ఆళ్వార్ కు నిత్యము తిరుమంజనం జరుగుతుంది. సంవత్సరం  పొడవునా పెరుమాళ్, తాయార్లు, ఆళ్వార్లు, ఆచార్యులు ఎన్నో ఉత్సవాలను ఆస్వాదిస్తారు. మనంకూడా వాటిని ఇక్కడ ఆస్వాదిస్తాము:

ప్రతిమాసం జరిగే తిరువీధిఉత్సవములు

  1. అమావాస్యకు – పెరుమాళ్
  2. ఏకాదశికి  – తాయర్లతో కూడి పెరుమాళ్ కు
  3. ద్వాదశికి  – ఆళ్వార్ కు
  4. పౌర్ణమికి  – ఆళ్వార్ కు
  5. శుక్రవారం- పెరుమాళ్  తాయార్లకు
  6. రోహిణి నక్షత్రమున  – కృష్ణుడికి
  7. పునర్వసు నక్షత్రమున – శ్రీ రాముడు
  8. ఉత్తరా నక్షత్రమున  – పెరుమాళ్, ఆళ్వార్లకు
  9. తిరువిశాఖం కి  – పెరుమాళ్, ఆళ్వార్లకు
  10. తిరువోణం (శ్రవణా నక్షత్రమున) – పెరుమాళ్ కు

నాలాయిర దివ్యప్రబంధం సేవించే క్రమం :

ఆయా ఆళ్వార్ల తిరునక్షత్రం రోజున ఆయా ప్రబంధముల పాశురాలు శాత్తుముర  అయ్యే విధంగా ఏర్పాటు చేయబడింది.

  • రోహిణి నక్షత్రం రోజున  – అమలనాది పిరాన్
  • మృగశీర్షం నక్షత్రం రోజున  – ప్రత్యేక సేవాకాలం ఉండదు
  • ఆరుద్రా నక్షత్రం రోజున  – ఇరామానుజ నూత్తందాది
  • పునర్వసు నక్షత్రం రోజున    – పెరుమాళ్ తిరుమొళి, తిరువాయ్ మొళి 1వ శతకం
  • పుష్యమి నక్షత్రం రోజున      – తిరువాయ్ మొళి 2వ శతకం
  • ఆశ్లేష  నక్షత్రం రోజున  – నాన్ముగన్ తిరువందాది, తిరువాయ్ మొళి 3వ శతకం
  • మఖ నక్షత్రం రోజున    – తిరుచ్చంద విరుత్తం, తిరువాయ్ మొళి 4వ శతకం
  • పూర్వఫల్గుణి నక్షత్రం రోజున    – నాచ్చియార్ తిరుమొళి, తిరువాయ్ మొళి 5 శతకం
  • ఉత్తర ఫల్గుణి  నక్షత్రం రోజున  – తిరుప్పల్లాండు, పెరియాళ్వార్ తిరుమొళి 1వ శతాబ్దం, తిరువాయ్ మొళి 6వ శతకం
  • హస్త నక్షత్రం రోజున  – పెరియాళ్వార్ తిరుమొళి 2వ శతకం, తిరువాయ్ మొళి 7వ శతకం
  • చిత్త నక్షత్రం రోజున  – పెరియాళ్వార్ తిరుమొళి 3వ శతకం, తిరువాయ్ మొళి 8వ శతకం
  •  నక్షత్రం రోజున  – పెరియాళ్వార్ తిరుమొళి 4, 5 వ శతకం, తిరువాయ్ మొళి 9వ శతకం
  • విశాఖ నక్షత్రం రోజున  – తిరువిరుత్తం, తిరువాశిరియం, పెరియ తిరువందాది 10వ శతకం
  • అనురాధ నక్షత్రం రోజున  – ప్రత్యేక సేవాకాలం ఉండదు
  • జేష్ఠ నక్షత్రం రోజున  – తిరుమాలై, తిరుప్పళ్ళియెళుచ్చి
  • మూలా నక్షత్రం రోజున  – ఉపదేశ రత్నమాల, తిరువాయ్ మొళి నూత్తందాది
  • పూర్వాషాడ నక్షత్రం రోజున  – పెరియ తిరుమొళి 1వ శతకం
  • ఉత్తరాషాడ  నక్షత్రం రోజున  – పెరియ తిరుమొళి 2వ శతకం
  • శ్రవణం/తిరువోణం నక్షత్రం రోజున  – పెరియ తిరుమొళి 3వ శతకం, మొదటి తిరువందాది
  • ధనిష్టం నక్షత్రం రోజున  –  పెరియ తిరుమొళి 4వ శతకం, ఇరండాం తిరువందాది
  • శతభిషం నక్షత్రం రోజున  – పెరియ తిరుమొళి 5వ శతకం, మున్ఱామ్ తిరువందాది
  • పూర్వాభాద్ర నక్షత్రం రోజున  – పెరియ తిరుమొళి 6వ శతకం
  • ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున  -పెరియ తిరుమొళి 7వ శతకం
  • రేవతి నక్షత్రం రోజున  – పెరియ తిరుమొళి 8వ శతకం
  • అశ్విని నక్షత్రం రోజున  – పెరియ తిరుమొళి 9వ శతకం, తిరువెళుకూట్టిరుక్కై, శిరియ తిరుమడల్
  • భరణి నక్షత్రం రోజున  – పెరియ తిరుమొళి 10వ శతకం, పెరియ తిరుమడల్
  • కృత్తిక నక్షత్రం రోజున  – పెరియ తిరుమొళి 11వ శతకం, తిరుక్కుఱుందాండగం, తిరునెడుందాండగం

నిత్య సేవకాలం

  • పెరుమాళ్ళ సన్నిధిలో – ప్రతి రాత్రి – తిరుప్పల్లాండు, శెన్నియొంగు (పెరియాళ్వార్ తిరుమొళి 5-4)
  • ఆళ్వార్ సన్నిధిలో -ప్రతి ఉదయం – కణ్ణినుణ్  శిఱుత్తాంబు, తిరుప్పావై సేవించబడుతుంది. తరువాత, తిరునక్షత్రం ఆధారంగా పాశురాలు సేవించబడతాయి.
  • ఆళ్వార్ సన్నిధిలో – ప్రతి రాత్రి – కణ్ణినుణ్ శిఱుత్తాంబు, ఏళై ఏదలన్ (పెరియ తిరుమొళి 5.8), ఆళియెళి (తిరువాయ్ మొళి 7.4).

అనధ్యయన కాలం – నిత్య సేవ

  • పెరుమాళ్ సన్నిధిన – నాలాయిర తనియన్లు
  • ఆళ్వార్ సన్నిధిన – ఉదయం – ఉపదేశ రత్నమాల, రాత్రి – ఇరామానుజ నూత్తందాది

ధనుర్మాసం – ఆళ్వార్ పెరుమాళ్ళ సన్నిధులలో తిరుప్పళ్ళియెళుచ్చి, తిరుప్పావై.

ఉత్సవాలు (మాసాల ప్రకారం)

చైత్రమాసం

  • పెరుమాళ్ళ బ్రహ్మోత్సవాలు – 10 రోజులు – చైత్ర (చిత్తిరై) మాస ఆర్ద్రా నక్షత్రం రోజున, రాత్రి ఊరేగింపు సమయంలో పెరుమాళ్ళ వద్దకు ఆళ్వార్ వెళ్తారు. చైత్ర మాసం పునర్వసు నక్షత్రం రోజున రాత్రి        శ్రీరాములవారు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్తారు. 9వ రోజున – చైత్ర మాసంలో రథోత్సవం జరుగుతుంది. 10వ రోజున – చైత్ర మాసం ఉత్తర ఫల్గుని నక్షత్రం రోజున – మిక్క ఆదిప్పిరాన్ పెరుమాళ్ కి తీర్థవారి (తామ్రపర్ణి నదిలో తిరుమంజనం).
  • మధురకవి ఆళ్వార్ దివ్యనక్షత్రం – చైత్ర మాస చిత్తానక్షత్రం
  • ఎంబెరుమానార్ల తిరుఅవతార ఉత్సవం – 11 రోజులు. 10వ రోజు తిరువాదిరై(ఆర్ద్ర) నక్షత్రం (భవిష్యదాచార్య సన్నిధి), ఉడయవర్లు, ఆదినాథ ఆళ్వార్ సన్నిధికి వెళ్ళి మంగళాశాసనం చేస్తారు.
  • చిత్రాపౌర్ణమి – 2 రోజులు – పౌర్ణమి రోజున – పెరుమాళ్ళ ఊరేగింపు. పాడ్యమి రోజు ఆళ్వార్ సరిహద్దు శిల వద్దకు ఊరేగింపుగా వెళతారు.
  • శ్రీవైకుంఠ పెరుమాళ్ళ బ్రహ్మోత్సవం 5వ రోజు – పొలిందు నిన్ఱ పిరాన్, ఆళ్వార్ శ్రీవైకుంఠ దివ్యదేశానికి ఊరేగింపుగా వెళతారు (ఆళ్వార్ తిరునగరి సమీపంలో ఉంది).

వైశాఖమాసము

  • నమ్మాళ్వార్ తిరు అవతార ఉత్సవం – 10 రోజులు; 5వ రోజున నవ తిరుపతుల పెరుమాళ్ళకు  గరుడ సేవ; నమ్మాళ్వార్లకు  హంస వాహనం;  చెక్క ఆసనంపైన మధురకవి ఆళ్వార్లు. 7వ రోజు – ఆళ్వారు, ఎంబెరుమానార్లు ఇద్దరూ ఒకే ఆసనంలో ఆసీనులై ఉంటారు. ఇరువురికి శేర్తితిరుమంజనం (భవిష్యదాచార్య సన్నిధిలో); 8వ రోజు – అప్పన్ కోయిళ్ లో(ఆళ్వార్ అవతరించిన స్థలం) – ఆళ్వార్ కి దోగాడే కృష్ణుడి రూపంలో దివ్యాలంకరణ; 9వ రోజు – వైశాఖమాస తిరురథోత్సవం.
  • వైశాఖమాస  ఉత్తరాభద్ర నక్షత్రమున  – వర్షాభిషేకం (సంవత్సరానికి ఒకసారి సంప్రోక్షణం జరిగుతుంది).

జేష్ఠమాసం

జేష్ఠమాస మొదటి రోజు – ముప్పళం (వేసవికాలం ముగింపును సూచిస్తూ మూడు రకాల పండ్లను నివేదన చేస్తారు)

  • వసంతోత్సవం – 10 రోజులు, జేష్ఠమాస ఉత్తరఫాల్గుణికి  శాత్తుముర.
  • జేష్ఠమాస అనురాధ – శ్రీమన్నాథమునుల తిరునక్షత్ర ఉత్సవం.
  • జేష్ఠమాస – జేష్ఠానక్షత్రం – జ్యేష్ఠాభిషేకం – ఏడు తెరలతో  చేయబడుతుంది.
  • జేష్ఠమాస – తిరుమూలం – తిరుప్పులి ఆళ్వార్ తిరునక్షత్రం (దివ్య చింతచెట్టు)

ఆషాఢమాసం

  • తిరు ఆడిప్పూరం – కురుగుర్ నాచ్చియార్,  ఉడయవర్ల సన్నిధికి ఊరేగింపుగా వెళతారు.
  • పక్షిరాజు/గరుడన్  ఉత్సవం – 10 రోజులు – ఆషాఢస్వాతి సందర్భంగా శాత్తుముర
  • ఆషాఢ ఉత్తరాభాద్ర నక్షత్రం – అళగర్ ఉత్సవం

శ్రావణమాసం

  • పవిత్రోత్సవాలు – 9 రోజులు – శ్రావణమాస శుక్లపక్ష ఏకాదశి రోజున ప్రారంభమవును. 9వ రోజు – మిక్కఆదిప్పిరాన్ కు  తీర్థవారి.
  • శ్రీపాంచరాత్ర శ్రీజయంతి – పురాణ పారాయణం, ఆలయం లోపల కృష్ణుడి ఊరేగింపు, మరుసటి రోజు – ఉరయాడి (ఉట్టి కొట్టుట) – వీధుల్లో పెరుమాళ్, తాయార్, ఆళ్వార్, కృష్ణుడి ఊరేగింపు.
  • తిరుక్కోళూర్ వైత్తమానిధి పెరుమాళ్ బ్రహ్మోత్సవం – 9వ రోజు – తిరుక్కోళూర్ కి ఆళ్వార్ ఊరేగింపు – రథంపై దివ్యదర్శనం

 భాద్రపదమాసం

  • నవరాత్రి ఉత్సవాలు – 9 రోజులు
  • విజయదశిమి – పార్వేట ఉత్సవం
  • భాద్రపద శ్రవణానక్షత్రం  – జ్ఞానప్పిరాన్ (వరాహస్వామి), తిరువేంగడముడయాన్ లకు ఉత్సవం. వేదాంతదేశికులు – ఆదినాథ పెరుమాళ్ –  ఆళ్వార్ సన్నిధులకు  ఊరేగింపుగా వెళ్ళి మంగళాశాసనం చేయడం.

ఆశ్వీయుజమాసం

  • ఆశ్వీయుజ మొదటి రోజు – వెన్నీర్కాప్పు (వేడి నీళ్లతో రక్షణ) ప్రారంభం
  • ఊంజల్ సేవ – 10 రోజులు – ఆశ్వీయుజ ఉత్తరాషాఢనక్షత్రం  సందర్భంగా శాత్తుముర. మణవాళ మాముని ఉత్సవం – 12 రోజులు – తిరు మూలానక్షత్రం రోజున, ఆళ్వార్ పల్లకిలో మామునులు వేంచేసి  ఆదినాథ పెరుమాళ్ –  ఆళ్వార్ సన్నిధులకు  ఊరేగింపుగా వెళ్ళి మంగళాశాసనం చేస్తారు.
  • పూర్వాషాడ నక్షత్రం  – విశ్వష్సేనుల అవతార దినోత్సవం.
  • శ్రవణానక్షత్రం  – పొయిఘై  ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం,  పిళ్ళై లోకాచార్యుల  – 11 రోజుల తిరునక్షత్ర ఉత్సవం – ఆదినాథ పెరుమాళ్ –  ఆళ్వార్ సన్నిధులకు  ఊరేగింపుగా వెళ్ళి మంగళాశాసనం చేస్తారు.
  • ధనిష్టానక్షత్రం  – పూదత్తాళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం
  • శతభిషా నక్షత్రం –  పేయాళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం
  • దీపావళి – ఆళ్వారాచార్యులు,  ఆదినాథ పెరుమాళ్ –  ఆళ్వార్ సన్నిధులకు  ఊరేగింపుగా వెళ్ళి మంగళాశాసనం చేస్తారు.

కార్తీకమాసం

  • కృత్తికా నక్షత్రం – తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం
  • రోహిణి నక్షత్రం – తిరుప్పాణాళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం
  • శ్రీపాంచరాత్ర కృత్తికాదీపోత్సవం  – శొక్కప్పానై – అనగా పెరుమళ్ శేషంగా సువాసన తైలమును ఆళ్వారాచార్యుల కంఠమునకు పూసెదెరు.  ఇక మరుసటి రోజు నుండి అనధ్యయన కాలం ప్రారంభమవుతుంది.
  • శుక్లపక్ష ఏకాదశి – కైశిక ఏకాదశి – ఆదినాథ పెరుమాళ్ –  ఆళ్వార్ సన్నిధులకు  ఊరేగింపుగా వెళ్ళి  మంగళాశాసనం చేస్తారు.
  • కైశిక ద్వాదశి – కైశిక పురాణ పఠనం, అణ్ణావియర్ వంశస్థులకు   బ్రహ్మరథం (మధురకవి ఆళ్వార్ల వంశస్థులను పల్లకిపై తీసుకెళ్ళడం), పెరుమాళ్ కు గరుడసేవ, ఆళ్వార్ కు  హంసవాహనం.

మార్గశిరమాసం

  • మార్గశిర మొదటి రోజు – తిరుప్పల్లియెళుచ్చి ప్రారంభం, ధనుర్మాస క్రమం.
  • అమావాస్య తర్వాత మొదటి రోజున ఆరంభించి 21 రోజుల అధ్యయన ఉత్సవం  ప్రారంభమవుతుంది.  – పగల్ పత్తు (పగటి పూట 10 రోజుల ఉత్సవం) పగల్ పత్తు సమయంలో ప్రతిరోజు, ఆళ్వార్ కు  రెండు దివ్య అలంకారములు . దశమి రోజున – ఆళ్వార్ శయనం, పెరుమాళ్ కు  నాచ్చియార్ అలంకారము.
  • శుక్లపక్ష ఏకాదశి – వైకుంఠ ఏకాదశి. పొలిందు నిన్ఱ పిరాన్ – శయనం. తిరువాయ్ మొళి పారాయణ ఏర్పాట్ల గురించి పెరుమాళ్ళు వింటారు.
  • రాప్పత్తు (రాత్రి పది రోజుల ఉత్సవం) – ప్రతి రోజు తిరుముడి సేవ (పెరుమాళ్ కృపతో తమ తిరువడిని ఆళ్వార్ కు ప్రసాదిస్తారు). ఆరుద్ర రోజున, ఆళ్వార్-ఎంబెరుమానార్లకు శేర్తి (కలిపి) తిరుమంజనం. 8వ రోజు – వేడుపఱి (తిరుమంగై ఆళ్వార్ గుర్రంపైన వేంచేసి పెరుమాళ్  చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు). 10వ రోజు – నమ్మాళ్వార్ల మోక్షం. 11వ రోజు – వీడు విడై తిరుమంజనం (మోక్షం నుండి తిరిగి వచ్చిన తరువాత స్నానం)
  • తరువాత వచ్చే విశాఖానక్షత్రము నాటికి  అనధ్యయన కాలం ముగిస్తుంది.
  • జ్యేష్టా నక్షత్రం – తొండరడిప్పొడి ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం

పుష్యమాసం

  • సంక్రాంతి – వంగక్కడల్ (తిరుప్పావై చివరి పాశురం);
  • తిరుప్పళ్ళియెళుచ్చి శాత్తుముర
  • కనుము – తాయార్లకు తీర్థవారి
  • మఖానక్షత్రం – తిరుమళిశై ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం
  • హస్తానక్షత్రం – కురత్తాళ్వాన్ తిరునక్షత్ర ఉత్సవం. ఆళ్వాన్ –  ఆదినాథ పెరుమాళ్ –  ఆళ్వార్ సన్నిధులకు  ఊరేగింపుగా వెళ్ళి  మంగళాశాసనం చేస్తారు.

మాఘమాసం

  • మాఘ ఉత్సవం మొదటి రోజు – వెన్నీర్కాప్పు (వేడి నీటితో రక్షణ) ముగింపు.
  • తెప్పోత్సవం – ఆళ్వార్ దివ్య స్వరూప ప్రతిష్ఠోత్సవం – 13 రోజులు. 7వ రోజు – ఆళ్వార్ ఎంబెరుమానార్లకు శేర్తితిరుమంజనం (భవిష్యదాచార్య సన్నిధిలో), 9వ రోజు – తిరుత్తేరు ఉత్సవం. 10వ రోజు – పెరుమాళ్ళకు  తెప్పోత్సవం. 11వ రోజు – ఆళ్వార్, ఆచార్యులకు  తెప్పోత్సవం. 12వ రోజు – విశాఖ – ఆళ్వార్ తీర్థవారి తన దివ్యరూపంలో. 13వ రోజు – ఆళ్వార్ తొలైవిల్లిమంగళ దివ్యదేశానికి  ఊరేగింపుగా వెళతారు. అక్కడ శాత్తుముర.
  • పునర్వసు – కులశేఖరాళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం
  • మృగశిర – తిరుక్కచ్చి నంబి తిరునక్షత్ర ఉత్సవం. నంబి (భవిష్యదాచార్య సన్నిధి నుండి) మంగళాశాసనం కోసం ఆదినాథ- ఆళ్వార్ సన్నిధులకు  ఊరేగింపుగా వెళతారు.

ఫాల్గుణమాసం

  • పెరుమాళ్ళకు ఫంగుణి  బ్రహ్మోత్సవాలు – 10 రోజులు. 9వ రోజు – రథోత్సవం. 10వ రోజు – ఫాల్గుణ మాస ఉత్తర ఫల్గుణి  నక్షత్రమున- మిక్క ఆదిప్పిరాన్ కు తీర్థవారి.
  • ఉత్తరఫల్గుణి నక్షత్రమున—ఆదినాయకి తాయార్ –  ఉడైయవర్ల సన్నిధికి ఊరేగింపుగా వెళతారు.
  • ఉగాది – ఆళ్వారాచార్యులు – ఆదినాథ పెరుమాళ్ –  ఆళ్వార్ సన్నిధులకు  ఊరేగింపుగా వెళ్లి  మంగళాశాసనం చేస్తారు.
  •  పంచాంగశ్రవణం జరుగుతుంది.

మరికొన్ని ముఖ్య విషయాలు

  • సాధారణంగా ఇక్కడ ఉత్సవాల 5వ రోజున, పెరుమాళ్ళు గరుడ వాహనంపైన, ఆళ్వారు హంస వాహనంపైన ఊరేగింపుగా వెళ్తారు.
  • ఈ నాలుగు ఉత్సవాలలో పెరుమాళ్ సన్నిధిన  గరుడ ధ్వజారోహణం, ఆళ్వార్ సన్నిధిన హంస ధ్వజారోహణం జరుగుతుంది.
  • ఈ నాలుగు ఉత్సవాలలో పెరుమాళ్-ఆళ్వార్లకు రథోత్సవం ఉంటుంది.
  • ఆదినాథపెరుమాళ్ –  ఆళ్వార్ల సన్నిధులలో తీర్థవారి జరిగినప్పుడల్లా, భవిష్యదాచార్య సన్నిధిలో తిరుమణ్ కాప్పు (నుదుటిపై దివ్య తిలకధారణ) ఉంటుంది.

వ్యాసానికి ఆధారం – కారిమాఱన్ కలైక్కాప్పగం – నాట్కుఱిప్పు

మూలం: https://srivaishnavagranthams.wordpress.com/2022/12/07/azhwarthirunagari-vaibhavam-6/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ఆళ్వార్ తిరునగరి వైభవము – సన్నిధులు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

పూర్తి శ్రేణి

<< మణవాళ మామునుల చరిత్ర, వైభవము

ప్రదక్షిణ మార్గంగా వెలుతూ ఆదినాథ- ఆళ్వార్ల ఆలయ ప్రాంగణం  ఉన్న సన్నిధులు,ఉపసన్నిధులు, మఠాలు, తిరుమాళిగల గురించి మనం ఇక్కడ తెలుసుకొందాం.

ఆదినాథ – ఆళ్వార్ల దేవాలయం లోపలి సన్నిధిలు

ప్రదక్షిణ మార్గంగా వెలుతూ ఆదినాథ- ఆళ్వార్ల ఆలయ ప్రాంగణం  ఉన్న సన్నిధులు,ఉపసన్నిధులు, మఠాలు, తిరుమాళిగల గురించి మనం ఇక్కడ తెలుసుకొందాం.

ఆదినాథ-ఆళ్వార్ల దేవాలయం లోపలి సన్నిధులు:

  1. ప్రధాన  పెరుమాళ్ళ సన్నిధి గర్భగుడిలో  – శ్రీదేవి భూదేవి సమేత ఆదినాథ పెరుమాళ్ళు. ముఖమండపమున  ఆదినాయకి, శ్రీదేవి, పొలిందు నిన్ఱపిరాన్, భూదేవి, నీళాదేవి, కురుగూర్ నాయకి(ఉత్సవర్లు)- నవబేరాలు (శయన, స్నానాది బేరములు).
  2. ద్వారపాలకులు, అనంత – గరుడ ‌‌ విశ్వష్సేన సన్నిధులు.
  3. పొన్ నిన్ఱపిరాన్ సన్నిధి.
  4. శ్రీరాములవారి, శ్రీకృష్ణుడి సన్నిధులు
  5. సన్నిధి గరుడన్.
  6. రుక్మిణిసత్యభామ సమేత శ్రీవేణుగోపాల సన్నిధి.
  7. రెండవప్రాకారములో – జ్ఞానప్పిరాన్  సన్నిధి – భూమి పిరాట్టి సమేత వరహ పెరుమాళ్ (వీరికి ప్రత్యేకముగా  గరుడసన్నిధి కలదు)
  8. రెండవప్రాకారములో అనగా పెరుమాళ్ సన్నిధికి సరిగ్గా వెనుకన ఆదినాయకి (మూలవర్లు).
  9. పరమపదనాథుడి సన్నిధి
  10. చక్రత్తాళ్వార్ల సన్నిధి
  11. దశావతార సన్నిధి
  12. కురుగూర్  నాయికి సన్నిధి(మూలవర్లు).
  13. తిరుప్పుళి ఆళ్వార్ సన్నిధి (ఆళ్వార్ జీవితకాలమున వేంచేసి ఉన్న దివ్యచింతచెట్టు)
  14. శ్రీమన్నాథమునుల సన్నిధి
  15. పన్నెండుగురు ఆళ్వార్ల సన్నిధి
  16. నరసింహపెరుమాళ్ సన్నిధి
  17. తిరువేంగడముడయాన్ సన్నిధి
  18. నమ్మాళ్వార్ల సన్నిధి (ప్రత్యేక ధ్వజస్తంభం కలదు)
  19. తిరువడి (ఆంజనేయుని) సన్నిధి
  20. కృష్ణ సన్నిధి (యానైచ్చాలై)
  21. పక్షిరాజు (గరుడన్) సన్నిధి

ఇతర సన్నిధులు (ఆలయం వెలుపల)

  1. తెఱ్కు తిరువేంగడముడయాన్ సన్నిధి (దక్షిణ మాడవీధి)
  2. శ్రీరంగనాథుని సన్నిధి (దక్షిణ మాడవీధి)
  3. పిళ్ళైలోకాచార్యుల సన్నిధి (ఉత్తర మాడవీధి)
  4. అళగర్ – శ్రీరాములవారి సన్నిధి (ఉత్తర మాడవీధి)
  5. వేదాంతదేశికుల సన్నిధి (ఉత్తర మాడవీధి)
  6. ఆండాళ్ సన్నిధి (ఉత్తర మాడవీధి)
  7. మణవాళ మామునుల సన్నిధి (ఉత్తర మాడవీధి)
  8. కూరత్తాళ్వాన్-భట్టర్ సన్నిధి (రామానుజ చతుర్వేదిమంగళం)
  9. తిరుక్కచ్చినంబి సన్నిధి (రామానుజ చతుర్వేదిమంగళం)
  10. ఉయ్యక్కొండార్-తిరువాయ్ మొళిపిళ్ళై సన్నిధి (రామానుజ చతుర్వేదిమంగళం)
  11. పెరియనంబి సన్నిధి (రామానుజ చతుర్వేది మంగళం)
  12. ఎంబెరుమానార్(భవిష్యదాచార్యులు)సన్నిధి(రామానుజ చతుర్వేదిమంగళం)
  13. కృష్ణుడి సన్నిధి (రామానుజ చతుర్వేదిమంగళం)
  14. శింగపెరుమాళ్ సన్నిధి (తిరుచ్చంగణిత్తుఱై – తీర్థవారి మండపం – వడక్కు రథతిరువీధి)
  15. నంపిళ్ళై సన్నిధి (వడక్కు రథవీధి)
  16. వడక్కు తిరువేంగడముడయాన్ సన్నిధి (వడక్కు రథవీధి)
  17. శ్రీరాములవారి సన్నిధి (పరాంకుశ – నాయకర్  మండపం)
  18. అప్పన్ కోయిల్ (తిరువేంగడముడయాన్ సన్నిధి – ఆళ్వార్ అవతార స్థలం)

శ్రీ మఠాలు (జీయర్లు ఉండే చోటు):

  1. శ్రీ ఎంబెరుమానార్ జీయర్ మఠం- ప్రస్తుతం వేంచేసి ఉన్నారు (రామానుజ చతుర్వేది మంగళం)
  2. శ్రీ వానమామలై మఠం (వడక్కు రథవీధి)
  3. శ్రీ తిరుక్కుఱుంగుడి మఠం (వడక్కు రథవీధి)
  4. శ్రీ అహోబిల మఠం (రామానుజ చతుర్వేది మంగళం)

ఆశ్రమాలు / శ్రీ వైష్ణవ స్థాపనాలు (శ్రీ వైష్ణవులచే స్థాపించబడినవి):

  1. శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమం (వడక్కు రథవీధి)
  2. ఉత్తరాది మఠం (తెఱ్కు రథవీధి)

తిరుమాళిగలు / ఆచార్య పురుషుల నివాసాలు:

  1. అరైయర్ తిరుమాళిగ (శ్రీమన్నాథమునుల వంశం- కిళక్కు మాడవీధి)
  2. అణ్ణావియర్ తిరుమాళిగ (మధురకవి ఆళ్వార్ వంశం-  తెఱ్కు మాడవీధి)
  3. తిరువాయ్ మొళిపిళ్ళై తిరుమాళిగ (రామానుజ చతుర్వేది మంగళం)
  4. ఆత్తాన్ తిరుమాళిగ (ముడుంబైనంబి వంశం- వడక్కు రథవీధి)
  5. కఱ్కుళం తిరుమాళిగ (కొమాండూర్ ఇళయవిల్లి ఆచ్చాన్ వంశం-వడక్కు రథవీధి)

అనేకమంది ఆచార్య పురుషులు (శ్రీరామానుజులచే  నియమించబడిన సంప్రదాయ ప్రవర్తకులు) ఇక్కడే ఉండి కైంకర్యాలు చేస్తున్నారు. అంతేకాకుండా  అనేక మంది తీర్థకారులు (సంప్రదాయపరంగా భగవత్ ప్రసాదాలను పప్రధమంగా స్వీకరించేవారు), స్థలత్తార్లు (తరతరాలుగా ఇక్కడ ఉంటున్నవారు, తీర్థకారుల తరువాత ఆలయ మర్యాదలను స్వీకరించేవారు) కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఆలయ ఉత్సవాల సమయంలో అనేక జీయర్లు ఇక్కడకు వేంచేసి  మంగళాశాసనలు చేస్తుంటారు.

తరువాతి ఉపన్యాసములో మనం ఉత్సవాల గురించి చూద్దాం.

మూలం: https://srivaishnavagranthams.wordpress.com/2022/12/06/azhwarthirunagari-vaibhavam-5/

పొందుపరిచిన స్థానము – https://srivaishnavagranthams.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆళ్వార్ తిరునగరి  వైభవము – మణవాళ మామునుల చరిత్ర, వైభవము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

పూర్తి శ్రేణి

<< నమ్మాళ్వర్ల యాత్ర

తిరువాయ్ మొళిపిళ్ళై ఆళ్వార్ తిరునగరి ఎలా పునర్నిర్మించారో క్రిందట అనుభవించాము. నమ్మాళ్వార్లకు, ఆదినాథ పెరుమాళ్ళకు, ఎంబెరుమానార్లకు నిత్య కైంకర్యాల ఏర్పాట్లను ఎలా చేశారో కూడా అనుభవించాము. ఆ రోజుల్లో  తిరువాయ్ మొళిపిళ్ళై అనే ఆచార్యపురుషులు ఆళ్వార్ తిరునగరిలో సంప్రదాయ ప్రచారకులుగా ఉండేవారు.

కాలాంతరమున, ఆళ్వార్ తిరునగరిలో  ఆశ్వీయుజమాస (ఐప్పశి) మూలానక్షత్రమున ఆదిశేషుని అవతారమైన  రామానుజులే స్వయంగా తిరునావీఱుడైయపిరాన్ అనే స్వామికి  పుత్రునిగా జన్మిస్తారు.   ఆ బిడ్డ తేజస్సును చూసి పెద్దలు ఆ బిడ్డకు శ్రీరంగనాథుల తిరునామమైన ‘అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్’ అని నామకరణం చేస్తారు. అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ బాల్యలో తమ తాతగారి ఊరు ‘శిక్కిల్ కిడారం’ అనే గ్రామమున పెరుగుతారు. కాలానుగుణంగా తగిన వయసులో  ఉపనయనాది వైదికసంస్కారాలు వీరికి జరిగాయి. తమ తండ్రి వద్దనే శాస్త్రఅధ్యయనం అధికరించారు. తరువాత వివాహం జరిగింది. తమ తండ్రిగారివద్దనే ‘అరుళిచ్చెయల్’ (నాలాయిర దివ్యప్రబంధం), రహస్యార్థాలను నేర్చుకొని జ్ఞానభక్తి వైరాగ్యాలకు నిధిగా రూపుదిద్దుకుంటారు. వీరి తండ్రిగారు పరమపదించిన తర్వాత  తిరువాయ్ మొళిపిళ్ళై వైభవమును ఆలకించి, ఆళ్వార్ తిరునగరికి వచ్చి తిరువాయ్ మొళిపిళ్ళై దివ్యపాదాలను ఆశ్రయిస్తారు. నాయనార్ల కళ్యాణగుణాలను చూసి, తిరువాయ్ మొళి పిళ్ళై ఆనందించి సంప్రదాయార్థాలని వారికి అనుగ్రహిస్తారు. ‘ఎంబెరుమానార్ల తిరువడిగళే శరణం’ అని నాయనార్లకు ఉపదేశించి, వీరిని ఎంబెరుమానార్ల సన్నిధిలో నిత్యకైంకర్యం చేయమని నిర్దేశిస్తారు. నాయనార్లు కూడా ఎంబెరుమానార్ల పట్ల అపారమైన భక్తితో కైంకర్యం చేసి ‘యతీంద్రప్రవణులు’ (రామానుజుల యందు భక్తిప్రపత్తులు కలవారు) అనే తిరునామాన్ని సంపాదించుకొంటారు.

తిరువాయ్ మొళిపిళ్ళై తమ అవసానమున, “భవిష్యత్తులో సంప్రదాయ ప్రవర్తకులెవరు?”అనే విచారంలో ఉండగా , అంతట  నాయనార్లు ఆ బాధ్యత తాను నిర్వహిస్తానని హామి ఇస్తారు. కేవలం మాటలతో సరిపోకుండా తిరువాయ్ మొళిపిళ్ళై,  నాయనార్లతో ప్రమాణం చేయించుకొని , సంస్కృత శాస్త్రంపైనే ఎక్కువ దృష్ఠిపెట్టకుండా తిరువాయ్ మొళి తో పాటు ఇతర దివ్యప్రబంధాలు ప్రచారంచేయమని నాయనార్లను ఆదేశిస్తారు. కాలాంతరమున తిరువాయ్ మొళిపిళ్ళై పరమపదించగా  నాయనార్లు వారికి చరమ కైంకర్యాలన్ని శ్రద్ధతో నిర్వహిస్తారు.

వానమామలై దివ్యదేశానికి చెందిన ‘అళగియ వరదర్’ అనే ఆచార్యపురుషులు  నాయనార్లను ఆశ్రియిస్తారు. పిమ్మట వీరు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి వానామామలై మఠాధిపతిగా అవుతారు. జీయర్ అయిన తరువాత కూడా వీరు నాయనార్లను విడువకుండా కైంకర్యాలు చేసేవారు. జీయరు అనుసరించి, అనేక మంది శ్రీవైష్ణవాచార్యులు  నాయనార్లను ఆశ్రయించి శిష్యులవతారు.

నాయనార్లు, శ్రీరంగంలో ఉండి సంప్రదాయాన్ని వృద్ధిపరచాలని సంకల్పించి ఆళ్వార్ తిరునగరిని  నుండి  శ్రీరంగానికి వెళ్ళుటకు నమ్మాళ్వార్లను అనుమతిని కోరుతారు. ఆళ్వార్  అనుమతించగా శ్రీరంగమునకు  చేరుకుంటారు. నాయనార్ల రాకకు పెరియపెరుమాళ్ (శ్రీరంనాథుడు) సంతోషించి ఒక ఉత్సవంలా జరుపుకుని, శాశ్వతంగా శ్రీరంగంలోనే ఉండమని నాయనార్లను ఆదేశిస్తారు. నాయనార్లు శ్రీరంగంలోనే ఉండి లుప్తమైపోయిన రహస్య గ్రంథాలను తిరిగి తెచ్చి, తాళపత్రాలను సరిచేసి, కాలక్షేపాలను నిర్వహిస్తుండేవారు. నంపిళ్ళై కృపతో అనుగ్రహించిన ఈడు వ్యాఖ్యానాన్ని  (తిరువాయ్ మొళికి వ్యాఖ్యానం) నాయనార్లు  బాగాప్రచారం కావించారు కావున ‘ఈడు పెరుక్కర్’ (ఈడు ప్రచారంచేసినవారు) అనే దివ్యనామాన్ని పొందుతారు.

తిరువేంకటనాథునికి మంగళాశాసనం చేయాలని నిర్ణయించుకొని, ఆ మార్గమద్యంలో ఉన్నఅనేక దివ్యదేశ పెరుమాళ్ళను దర్శించుకొని,  మంగళాశాసనాలు చేసి, తిరుమలకు చేరుకొని తిరువేంకటనాథునితో పాటు అనేక భాగవతుల మన్ననలను పొందుతారు. ఆ తర్వాత కాంచీపుర పెరుమాళ్ కోయిల్ (దేవ పెరుమాళ్ళ సన్నిధి) కు వెళ్లి దేవపెరుమాళ్ళకు మంగళాశాసనం చేసి,  అటు నుంచి ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ శ్రీపెరంబుదూర్ చేరుకొని అక్కడ ఎంబెరుమానార్లకు మంగళాశాసనం చేశారు. అటునుంచి తిరువెఃకా కు వెళ్లి ‘కిడాంబిఆచ్చాన్’ అనే ఆచార్యుల సన్నిధిన శ్రీభాష్యం సేవిస్తారు. నాయనార్ల తేజస్సుని సంప్రదాయ పరిజ్ఞానాన్ని పరికించిన కిడాంబి ఆచ్చాన్, తమ అసలు స్వరూపాన్ని వెల్లడించమని అడుగగా, నాయనార్లు తమ ఆదిశేషస్వరూపంతో దర్శనమిస్తారు. అనంతరం నాయనార్లు శ్రీరంగానికి తిరిగి చేరి సంప్రదాయాన్ని విస్తరించసాగారు.

ఇలా వీరు సంప్రదాయ కైంకర్యాలు నిర్విరామంగా కొనసాగిస్తున్న సమయంలో వీరి బంధువులలో ఒకరి మరణం వలన వీరికి అశౌచం ఏర్పడుతుంది. ఇక మీదట ఇలాంటి ఇబ్బందులేవీ ఉండకుండ సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలని నిర్ణయించుకొంటారు. తన బాల్యసఖుడు,సహాధ్యాయి అయిన శఠకోప జీయర్ వద్ద నాయనార్లు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. పిదప, పెరియపెరుమాళ్ ను సేవించుకోగా పెరుమాళ్ వీరికి ‘అళగియ మణవాళ మామునులు’ అనే బిరుదునిచ్చి, పల్లవరాయమఠాన్ని బహూకరించి సత్కరిస్తారు. వానమామలై జీయర్ల సహకారంతో మామునులు పల్లవరాయ మఠాన్ని పునర్నిర్మించి, కాలక్షేపార్థం ‘తిరుమలై ఆళ్వార్ కూటం’ అనే  పెద్దమండపాన్ని నిర్మించి సంప్రదాయాన్ని విశిష్టరీతిలో విస్తరింపజేస్తారు. శ్రీరంగం మరియు ఇతర ప్రాంతాల నుండి అనేక విద్వాంనులు మామునుల వద్దకు వచ్చి, పంచ సంస్కారాలు పొంది, వీరి శిష్యులై తరించారు.

మామునులు అనేక రహస్య గ్రంథాలకు వ్యాఖ్యానాలు వ్రాయడమే కాకుండా, అనేక సంస్కృత -తమిళ ప్రబంధాలను కూడా అనుగ్రహించారు. కారణాంతరాలవల్ల సంవత్సరాలుగా నిలిచిపోయిన కైంకర్యాలను, స్థలత్తార్లను, ఆస్థాన మర్యాదలను పునః స్థాపించారు. తమ శిష్యుల ద్వారా, అనేక దేవాలయాలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా కట్టుదిట్టం చేశారు. వానమామలై జీయర్ ను అఖండ భాతరదేశ సంచారం చేయమని ఆదేశించి, వారిద్వారా   దేశమంతటా సంప్రదాయాన్ని స్థాపించారు. అలా శ్రీరంగంలో ఎంబెరుమానార్ వలె విశేష ఆదరణలను అందుకుంటూ కాలం గడపసాగారు.

మామునుల కీర్తిని ప్రకటించాలని  పెరియపెరుమాళ్ శ్రీరంగంలో  సంవత్సర కాలంపాటు తమ  ఉత్సవాలన్ని  నిలుపు చేస్కొని, ఈడు వ్యాఖ్యానము (నంపిళ్ళై వారి తిరువాయ్  మొళి ఉపన్యాసాల ఆధారంగా వడక్కు తిరువీధిపిళ్ళై అనుగ్రహించిన వ్యాఖ్యానం) చేయమని మామునులను ఆదేశిస్తారు. పెరుమాళ్ళ శాసనం మేరకు, ఉభయ దేవేరులతో నంపెరుమాళ్, ఆళ్వారాచార్యులు వేచేంసి ఉండగా, వారి సమక్షంలో మామునులు అందరు ఆనందించేలా తిరువాయ్ మొళి –ఈడు  వ్యాఖ్యానమును కృపచేస్తారు. కాలక్షేపం చివరి రోజున, జేష్ఠ మాస(ఆణి) దివ్య మూలానక్షత్రంలో, పెరియ పెరుమాళ్  సన్నిధిఅర్చకుని కుమారుని రూపంతో వచ్చి “శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం। యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్!” అని తనియన్ ను మామునుల సన్నిధిన సమర్పించి, వారిని తమ ఆచార్యునిగా స్వీకరిస్తారు. అంతటితో ఆగకుండా, సంస్కృత-నాలాయరప్రబంధ సేవాకాల ఆరంభమున ఈ తనియన్ తప్పకుండా సేవించాలని నంపెరుమాళ్ నియమనం చేస్తారు.

అటువంటి వైభవం గల మణవాళమామునులు, వయస్సు పైబడడంతో తిరునాడుకు చేరుకుంటారు. వారి శిష్యులు మామునుల చరమ కైంకర్యాలు ఘనంగా నిర్వహిస్తారు.

మామునుల కొన్ని విశేషాలను ఇక్కడ అనుభవిద్దాము:

శిష్యులు:

అష్ట దిగ్గజములు (ఎనిమిది దిక్కులను కాపలాకాసే ఏనుగుల వంటి  ప్రధానశిష్యులు): పొన్నడిక్కాల్ జీయర్, కోయిల్ కందాడై అణ్ణన్, పతంగి పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్, తిరువేంగడ జీయర్, ఎఱుంబియప్ప, అప్పిళ్ళై, అప్పిళ్ళార్,  ప్రతివాది భయంకరం అణ్ణ.

నవరత్నాలు: సేనైముదలియాండాన్ నాయనార్, శఠకోపదాసర్ (నాలూర్ శిఱ్ఱాతాన్), కందాడై పోరేఱ్ఱు నాయన్, ఏట్టూరి శింగరాచార్యులు , కందాడై అణ్ణప్పన్, కందాడై తిరుక్కోబురత్తు నాయనార్, కందాడై నారణప్పై, కందాడై తోళప్పరప్పై, కందాడై అళైత్తు, వాళ్విత్త పెరుమాళ్. వీరే కాకుండా ఎంబెరుమానార్లు నియమించిన 74 సింహాసనాధిపతుల తిరుమాలిగల వాళ్ళు, తిరువంశస్థులు అనేక మంది వీరి శిష్యులుగా ఉండేవారు.

పరమపదం పొందిన చోటు: శ్రీరంగం

కృపతో వీరు అనుగ్రహించిన గ్రంథాలు: దేవరాజమంగళం, యతిరాజవింశతి, ఉపదేశరత్నమాల, తిరువాయ్ మొళి నూత్తాందాది మరియు ఆర్తిప్రబంధం.

వ్యాఖ్యానాలు: ముముక్షుప్పడి, తత్త్వత్రయం, శ్రీవచనభూషణం, ఆచార్య హృదయం, పెరియాళ్వార్ తిరుమొళి, మరియు ఇరామానుజ నూత్తందాది.

ప్రమాణ తిరట్టు: (అన్ని శ్లోకాలకు పదకోశం, శాస్త్రఉల్లేఖనాలు వీరి వ్యాఖ్యానాలలో కనిపిస్తాయి) ఈడు ముప్పత్తు ఆరాయిర ప్పడి, జ్ఞాన సారం, ప్రామేయసారం, తత్త్వ త్రయం, శ్రీవచనభూషణం.

మణవాళ మామునుల తనియన్:

శ్రీశైలేశ దయా పాత్రం ధీ భక్త్యాది గుణార్ణవమ్ |
యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిమ్ ||

శ్రీ శైలేశులు (తిరువాయ్ మొళి పిళ్ళై) దయకు పాత్రులైన, యతీంద్రుల ప్రవణులనబడు, ఙ్ఞానము భక్తి మొదలైన కల్యాణ గుణములను కలిగిన రమ్య జామాతృలకు ( శ్రీ వరవరమునులకు) నమస్కరిస్తున్నాను.

మణవాళ మామునుల- వాళి తిరునామాలు

ఇప్పువియిల్ అరంగేశర్ క్కు ఈడళిత్తాన్ వాళియే
ఎళిల్ తిరువాయ్ మొళి పిళ్ళై ఇణైయడియోన్ వాళియే
ఐప్పశియిల్ తిరుమూలత్తు అవదరిత్తాన్ వాళియే
అరవరశ ప్పెరుంశోదియ అనందన్ ఎన్ఱుం వాళియే
ఎప్పుళుదుముం శ్రీశైలమేత్తవందోన్ వాళియే
ఏరారుం ఎతిరాశర్ ఎనఉదిత్తాన్ వాళియే
ముప్పిరినూల్ మణివడముం ముక్కోల్ దరిత్తాన్ వాళియే
మూదఱియ మణవాళ మామునివన్ వాళియే

(తిరునాళ్ పాట్టు – తిరునక్షత్రం – మూలా నక్షత్రం రోజున సేవించేది)

శెందమిళ్ వేదియర్ శిందై తెళిందు శిఱందు మగిళ్ందిడు నాళ్
శీర్ ఉలగారియర్ శెయ్ దరుళ్ నఱ్కలై తేశుపొలిందిడు నాళ్
మంద మదిప్పువి మానిడర్ తంగళై వానిల్ ఉయర్ త్తిడు నాళ్
మాశఱు జ్ఞానియర్ శేర్ ఎదిరాశర్ తం వాళ్వు ముళైత్తిడు నాళ్
కందమలర్ ప్పొళిల్ శూళ్ కురుగాదిపన్ కలైగళ్ విళంగిడు నాళ్
కారమర్ మేని అరంగక్కు ఇఱైకంగళ్ కళిత్తిడు నాళ్
అందమిల్ శీర్ మణవాళముని ప్పరన్ అవతారం  శెయ్ దుడునాళ్
అళగు తిగళందిడుం ఐప్పశియిల్ తిరుమూలం అదు ఎనునాళే

మూలం: https://srivaishnavagranthams.wordpress.com/2022/12/05/azhwarthirunagari-vaibhavam-4/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ఆళ్వార్ తిరునగరి వైభవము – ఆళ్వార్ యాత్ర

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

పూర్తి శ్రేణి

<< నమ్మాళ్వర్ల చరిత్ర, వైభవము

నమ్మాళ్వార్ల చరిత్రలో ఆళ్వా రునగరి దివ్య దేశం ఊరేగింపుకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. మ

నమ్మాళ్వార్ల చరిత్రలో ఆళ్వార్ తిరునగరి దివ్యదేశ యాత్రకి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మనం ఆ ప్రాధాన్యత గురించి కొంతవరకు ఇక్కడ అనుభవిద్దాం.

క్రిందటి వ్యాసంలో రామానుజుల అవతార రహస్యాన్ని నమ్మాళ్వార్,   మధురకవిఆళ్వార్లకు భవిష్యదాచార్యుల అర్చామూర్తి  ద్వారా ప్రకాశింపచేయడం గురించి తెలుసుకున్నాము. నమ్మాళ్వార్ల- రామానుజుల అవతారానికి మధ్యకాలంలో నాథమునులు మొదలైన పూర్వాచార్యులు ఎందరో ఈ లీలావిభూతిలో   అవతరించి మన శ్రీవైష్ణవసంప్రదాయాన్ని విస్తరింపచేశారు. శ్రీమన్నాథమునులు,  నమ్మాళ్వార్ల పాశురవైభవం విని ఆ పాశురాలను తెలుసుకోవాలనే ఆర్తితో ఆళ్వార్ తిరునగరికి చేరి తమ  యోగదృష్ఠిచే నమ్మాళ్వార్ల దర్శన భాగ్యం పొందుతారు. నమ్మాళ్వార్ల అనుగ్రహంతో శ్రీమన్నాథమునులకు వారి నాలుగు ప్రబంధాలతో పాటు ఇతర ఆళ్వార్ల ప్రబంధాలు, వాటి అర్థాలు కూడా ప్రసాదంలా పొందే భాగ్యం కలుగుతుంది. ఆచార్య పరంపరలో నమ్మాళ్వార్ల తర్వాతి స్థానాన్ని అలంకరించారు శ్రీమన్నాథమునులు.

శ్రీమన్నాథమునుల తరువాత కాలంలో కురుగైక్కావలప్పన్ , ఉయ్యక్కొండార్, మణక్కాల్ నంబి, ఆళవందార్, పెరియనంబి వంటి మహానుభావుల ద్వారా సంప్రదాయ వైభవం , ఆచార్యపరంపర  వృద్ధిచెందింది. ఆ తరువాత, ఆదిశేషుని అవతారమైన శ్రీరామానుజులు ఈ లీలావిభూతిపై అవతరించి, మోక్షాసక్తి ఉన్నవారందరికీ మోక్షం లభిస్తుందని నిరూపించారు. ఎంబెరుమానార్  (రామానుజులు) తమను తాము ‘మాఱన్ అడిపణిందు ఉయ్ న్దవన్’ అని భావించేవారు. అంటే ‘నమ్మాళ్వార్ల దివ్య తిరువడి అనుగ్రహంతో ఉజ్జీవింపబడ్డాను’ అని అర్థం. తమయందు  రామానుజులకు ఉన్న అపారమైన భక్తి ప్రపత్తులను చూసి ఆళ్వార్, రామానుజులకు తమ ‘తిరువడినిలై ‘(పాదుకలు) స్థానాన్ని ప్రసాదించారు. ఇతర దివ్యదేశాల సన్నిధులలో నమ్మాళ్వార్ల తిరువడినిలైని ‘మధురకవి ఆళ్వార్’గా పిలుస్తారు. కాని   ఆళ్వార్ తిరునగరిలో మాత్రం నమ్మాళ్వార్ల శ్రీశఠారిని/ తిరువడిని ‘శ్రీరామానుజులు’ అని భక్తుల శిరస్సుపైన అనుగ్రహిస్తారు. స్వయంగా నమ్మాళ్వార్లే ఇలా నియమనం చేశారు.

ఎంబెరుమానార్ల కాలం తరువాత, మన సంప్రదాయాన్ని ఎంబార్, భట్టర్, నంజీయర్, నంపిళ్ళై, వడక్కు తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్యుల వంటి ఆచార్యమహానుభావులెందరో ‘ఓరణ్‌ వళి’ని (ఆచార్యుని తరువాత శిష్యుడు ఆ పరంపరఙ్ఞానాన్ని తరువాతి వారికి వరకు అందించడం) వృద్ధిపరిచారు. పిళ్ళైలోకాచార్యుల అవసానములో, విదేశీయుల దాడులతో దక్షిణభారతం అనేక ఉపద్రవాలకు లోనైనది. మన సంప్రదాయానికి మూలకేంద్రమైన శ్రీరంగంలో పలుదాడులు జరిగాయి. అప్పుడు పిళ్ళైలోకాచార్యులు పెరియపెరుమాళ్ళ (శ్రీ రంగనాథ మూలవర్లు ) ఎదుట ఒక గోడను కట్టి నంపెరుమాళ్ళను (ఉత్సవ విగ్రహం) రక్షణ కై దక్షిణం వైపుకు తీసుకువెళతారు. వీరు నంపెరుమాళ్ళతో మధురై ప్రాంతంలో ఉన్న జ్యోతిష్కుడికి (ప్రస్తుతం – కొడిక్కుళం) చేరుకున్నారు. వయోవృద్ధులు కావడంతో అనారోగ్యం పాలయ్యారు. తమ శిష్యుడైన తిరుమలై ఆళ్వార్ ని  నియమించి సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించి వారు పరమపదానికి చేరుకుంటారు.

ఆ తరువాత, నంపెరుమాళ్  కేరళలోని కోళిక్కోడుకి చేరుకోగా, అదే సమయంలో  ఈ ఉపద్రవాలను తప్పించుకోడానికి నమ్మాళ్వార్లు కూడా ఆళ్వార్ తిరునగరి నుండి బయలుదేరి కోళిక్కోడుకి చేరుకుంటారు. ఆళ్వార్ తిరునగరిని వదిలి నమ్మాళ్వార్లు ఎంతోకాలం దూరంగా ఉండవలసి వస్తుంది. ఆళ్వార్ కోళిక్కోడుకి రాగానే నంపెరుమాళ్ ఆనందించి ఎంతో ఆశతో నమ్మాళ్వర్లని తమ దివ్యాసనముపై స్థానమిస్తారు. పోత్తిమార్లు, నంబూద్రి అర్చకులు నంపెరుమాళ్ తో పాటు నమ్మాళ్వార్లకు ఎంతో భక్తితో కైంకర్యాలు నిర్వహిస్తారు. ఇక కోళిక్కోడు నుండి బయలుదేరి తిరుక్కనాంబికి చేరుకుంటారు. అక్కడ కొంత కాలం గడిపిన తర్వాత నంపెరుమాళ్  తమ యాత్రను ముందుకు సాగిస్తారు. నమ్మాళ్వార్ల కైంకర్యపరులు మాత్రం సురక్షిత ప్రాంతాన్ని వెదుక్కుంటూ పశ్చిమం వైపు వెళుతూ ఎత్తుగా నిటారుగా ఉన్న ఒక కొండ దగ్గరకు చేరుకొంటారు.వారు  ఆళ్వార్ ను  అక్కడే దాచి ఉంచాలని నిశ్చయించుకొని ఆళ్వార్ ను  పెట్టెలో ఉంచి కొండ లోయలోకి దించుతారు.

ఇలా ఆళ్వార్ అర్చామూర్తిని భద్రపరచి తిరిగి వస్తుండగా, దొంగలు వారి దగ్గర నుండి అమూల్యమైన తిరువాభరణాలను దోచుకుంటారు. ఆ కైంకర్యపరులలో ఒకరైన తోళప్పర్ మధురైకి వెళ్ళి రాజాస్థానంలో మంత్రిగా ఉన్న తిరుమలైఆళ్వార్ ని సహాయం కోసం అభ్యర్థిస్తారు. వీరు పిళ్ళైలోకాచార్యుల ప్రధాన శిష్యులు. పిళ్ళైలోకాచార్యులు తమ తర్వాత వీరినే సంప్రదాయ పరంపరాధిపతిగా నియమించి పరమపదం చేరుకుంటారు. ఆళ్వార్ అర్చామూర్తిని తిరిగి పొందడానికి తిరుమలై ఆళ్వార్ తమ ఆంతరంగిక  సేవకులతో కేరళరాజు వద్దకు ఒక సందేశం పంపిస్తారు. సందేశం అందగానే కేరళరాజు ఆళ్వార్ ని  తిరిగి తీసుకురావడానికి తన సైన్యాన్ని పంపుతారు. తోళప్పర్ నాయకత్వంలో వీరందరు  బయలుదేరుతారు. ఆళ్వార్ ఉన్న చోటును వీరికి ఒక గరుడపక్షి సూచిస్తుంది. తోళప్పర్ ఇనుప గొలుసుతో కట్టిన  చెక్కపలకపై కూర్చొని ఆ ఏటవాలుగా ఉన్న కొండలోయలోకి దిగి, ఆళ్వార్ల అర్చామూర్తి ఉన్న పెట్టెను గైకొని ఆ చెక్కపలకపై ఆళ్వార్ ను ఉంచి పైకి పంపిస్తారు. తోళప్పర్ ని పైకితీసుకరావడానికి పైనున్నవారు మళ్ళీ పలకను దించుతారు. అలా వారు పైకివస్తుండగా అదుపును తప్పి లోయలోపడి పరమపదిస్తారు. ఇది తెలిసిన  తోళప్పర్ పుత్రుడు శోకిస్తారు. ఆళ్వార్  వారికి  ఇకమీదట తోళప్పర్  వంశస్థులకు ఆలయంలో గౌరవమర్యాదలు ఇవ్వబడతాయని ఓదార్చి నియమనంచేశారు . తరువాత, నమాళ్వార్లు మళ్లీ తిరుక్కనాంబికి చేరుకున్నారు. దొంగలు తమ తప్పిదమును  గ్రహించి, దోచుకున్న తిరువాభరణాలను తిరిగి ఆళ్వార్ కి సమర్పించుకుంటారు. పిమ్మట తిరుమలై ఆళ్వార్ తిరుక్కనాంబిలో ఆళ్వార్  ని సేవించుకుంటారు.

తిరుమలైఆళ్వార్లు మధురకి వచ్చి, పిళ్ళైలోకాచార్యుల శిష్యులలో ఒకరైన కూరకులోత్తమదాసులను కలుసుకొని  వారికి ఆచార్యులతో ఉన్న అనుబంధాన్ని స్మృతి చేసుకుంటారు. కూరకులోత్తమ దాసులు వీరికి సంప్రదాయ విషయాలను ఉపదేశించి, తమ మంత్రి పదవికి రాజీనామాచేసి, కేవలం నమ్మాళ్వార్లకు మాత్రమే దాసుడిగా ఉండమంటారు. తిరుమలైఆళ్వార్ సంప్రదాయార్థాలను కూరకులోత్తమదాసులు, విళంజోలై పిళ్ళై, నాలూరాచ్చాన్ పిళ్ళై మొదలైన ఆచార్యుల ద్వారా పొంది  పిళ్ళైలోకాచార్యుల దివ్యసంకల్పానికి అనుగుణంగా సంప్రదాయాన్ని వృద్ధిపరుస్తారు. వీరి కారణంగానే ఆళ్వార్ తిరిగి ఆళ్వార్ తిరునగరిని చేరుకున్నారు. తిరుమలైఆళ్వార్లు ఆళ్వార్ తిరునగరికి వచ్చినపుడు ఆ ప్రదేశమంతా కలుపు మొక్కలతో అడవిలా ఉండటం చూసి, దానిని శుభ్రపరచి ఆదినాథ- ఆళ్వార్ల మందిరాన్ని పునర్నిర్మితం కావిస్తారు. తిరుప్పుళి ఆళ్వార్ల (దివ్య చింతచెట్టు) క్రింద తొవ్వి భవిష్యదాచార్యుల దివ్యఅర్చామూర్తిని వెలికితీస్తారు. ఆళ్వార్ తిరునగరికి పశ్చిమంలో రామానుజ-చతుర్వేదిమంగళవీధిని నిర్మింపజేసి, భవిష్యదాచార్యులకు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మింపచేసి ఆదినాథ-ఆళ్వార్-ఎంబెరుమానార్లకు నిత్యం కైంకర్యాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తారు. నమ్మాళ్వార్ల యందు, తిరువాయ్ మొళి యందు వీరికున్న ఆర్తి, ఎనలేని భక్తి కారణంగా వీరిని ‘శఠగోపదాసుల’ని ‘తిరువాయ్ మొళిపిళ్ళై’ అనే తిరునామాలతో వ్యవహరించేవారు. ఇప్పటికిని వీరి వంశస్థులు ఈ క్షేత్రంలోనే కాకుండా పరిసర దివ్యదేశాలలో కైంకర్యములు నిర్వహిస్తున్నారు.మన పూర్వాచార్యులు ఈ చరిత్రను “నమ్మాళ్వార్ల -యాత్ర” అని వ్యవహరిస్తారు.

తరువాత కాలంలో ఈ దివ్యదేశంలో అవతరించి స్వయంగా శ్రీరంగనాథునికే ఆచార్యులై, ఆచార్యునిగా తిరువాయ్ మొళిపిళ్ళైవారిని స్వీకరించి, ప్రప్రధమంగా ఆళ్వార్ తిరునగరిలో కైంకర్యం చేసిన మణవాళ మామునుల చరిత్రను తర్వాతి వ్యాసంలో అనుభవిద్దాం.

మూలము: https://srivaishnavagranthamstamil.wordpress.com/2021/12/08/azhwarthirunagari-vaibhavam-3/

పొందుపరిచిన స్థానము – https://srivaishnavagranthams.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆళ్వార్తిరునగరి వైభవము – నమ్మాళ్వర్ల వైభవము, చరిత్ర

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః  శ్రీ వానాచల మహామునయే నమః

పూర్తి శ్రేణి

<< ఆళ్వార్ తిరునగరి  వైభవము – చరిత్ర

నమ్మాళ్వార్లు అవరించిన తరువాత ఆదిక్షేత్రం అని పిలువబడే ఈ తిరుక్కురుగూర్ క్షేత్రం ఆళ్వార్తిరునగరిగా ప్రసిద్ధిచెందింది. ఇప్పుడు మనం నమ్మాళ్వార్ల చరిత్రను వైభవాన్ని అనుభవిద్దాము.

ఈ సంసారంలో బాధలను అనుభవిస్తున్న ఆత్మలను నిత్య విభూతి శ్రీ వైకుంఠానికి చేర్చడానికి పెరుమాళ్ళు ఎన్నో లీలలాడుతుంటాడు. ప్రళయకాలంలో అన్ని లోకాలను నశింపజేసి, మరలా సృష్టించి, ఆత్మలకు దేహాన్ని, ఇంద్రియాలను ప్రసాదించి, వారికి శాస్త్రాల నిచ్చి, ఋషుల ద్వారా ఆ శాస్త్రార్థాలను విశదపరచి, స్వయంగా తాను అనేక అవతారాలను ఎత్తి, ఎన్నో లీ

ఆదిక్షేత్రం అని పిలువబడే ఈ తిరుక్కురుగూర్ నమ్మాళ్వార్లు అవతరించిన తరువాత ‘ఆళ్వార్ తిరునగరి’ గా ప్రసిద్ధిచెందినది. ఇప్పుడు మనం నమ్మాళ్వార్ల  వైభవాన్ని అనుభవిద్దాము.

ఈ సంసారబాధలను అనుభవిస్తున్న ఆత్మలను,  నిత్యవిభూతియైన శ్రీవైకుంఠానికి చేర్చడానికి భవవానుడు ఎన్నో లీలలను ప్రదర్శిస్తుంటాడు. భగవానుడు ప్రళయకాలంలో లోకాలన్నింటిని నశింపజేసి, మరలా సృష్ఠించి, ఆత్మలకు దేహాన్ని, ఇంద్రియాలను ప్రసాదించి, వారికి శాస్త్రాలనిచ్చి, ఋషుల ద్వారా ఆ శాస్త్రార్థాలను విశదపరచి, స్వయంగా తాను అనేక అవతారాలను ఎత్తి, ఎన్నో లీలలను చూపి, జీవాత్మలను ఈ సంసారబంధం నుండి విముక్తులను చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఇంత ప్రతయ్నం చేసినా  జీవులు ఆత్మోజ్జీవనం పొందలేకపోతే, మరలా వారిని ఉద్దరింపచేయుటకు,  వేటగాడు జింకను పట్టుకోవడానికి మరొక జింకను ఎరవేసినట్లు, భగవానుడు ఈ జీవాత్మలను ఉద్ధరించడానికి ఇక్కడి ఆత్మలనే(జీవాత్మ) ప్రయోగించాలని నిర్ణయించుకొని, కొన్ని ప్రత్యేక ఆత్మలను ఎంచుకొని, శుద్ధజ్ఞానాన్ని వారికి ప్రసాదించి, వారినే ఆళ్వార్లుగా  అవతరింప చేశాడు. ఆ విధంగా అజ్ఞానశూన్యులైన ఆళ్వార్లకు, భగవానుడు కృపతో శుద్దభక్తిజ్ఞానాలను అనుగ్రహించి, వారిచే దివ్యపాశురాలను రచింపజేసి, వీరి ద్వారా ఈ లోకంలోని సమస్త  ఆత్మలకు జ్ఞానోదయం కలిగించి, తద్వారా వారు మోక్షం (శ్రీవైకుంఠం) పొందాలని భగవానుడు సంకల్పింస్తాడు. అటువంటి ఆళ్వార్లలో నమ్మాళ్వార్లను ప్రధానులుగా భావిస్తారు మన పెద్దలు.

నమ్మాళ్వార్లకు  మాఱన్, మగిళ్ మాఱన్, శఠకోపులు, నావీఱులు, పరాంకుశులు, వకుళాభరణులు, శఠజిత్, మరియు కురుగూర్ నంబి అనే తిరునామాలున్నవి.

కలియుగం ప్రారంభమున  ఆళ్వార్ తిరునగరి సమీపములోని ‘అప్పన్ కోయిల్’ అనే క్షేత్రమున  కారియార్ ఉడైయనంగై అనే దివ్యదంపతులకు వైశాఖ(వైగాశి)మాస విశాఖానక్షత్రంలో అవతరించారు నమ్మాళ్వార్. ఉడైయనంగైకారియార్ల  ఇరువురి కుటుంబం వారు పరంపరగా భగవత్కైకర్యమున తమ జీవితాలను కృతార్థం చేసుకున్నారు. ఈ దంపతులిద్దరు సంతానార్థం తిరుక్కురుంగుడినంబిపెరుమాళ్ళను ప్రార్థించారు. పెరుమాళ్  తానే వారికి సంతానంగా పుడతానని వరమిస్తాడు. మనం గురుపరంపర గ్రంథంలో ఈ విషయం గురించి చర్చించుకున్నాము (ఆళ్వారాచార్యుల చరిత్రలు). నమ్మాళ్వార్ల మహిమను గ్రహించిన మన పూర్వాచార్యులు, భగవానుడే స్వయంగా అవతారించారా లేక నిత్యసూర్యులలోని వారా అని ఆశ్చర్యపోయేవారు.

తల్లి  గర్భంలో శిశువు ఉన్నప్పుడు అజ్ఞానాన్నికలిగించే ‘శఠం’ అనే వాయువు / ఉమ్మనీరు ఆ శిశువును ఆవహించి జ్ఞానభ్రాంతి కలిగించును. అలాంటి ‘శఠం’ శిశువుగా ఉన్న  నమ్మాళ్వార్లను ఆవహించబోగా వారు శఠాన్ని ధిక్కరించారు.  అందువల్ల వీరికి  ‘శఠకోపన్’ (శఠమును కోపించిన వారు)అనే తిరునామం కలిగినది.  నమ్మాళ్వార్లు అందరి పిల్లల వలె పుట్టగానే ఏడవలేదు, పాలు తాగేవారు కాదు. వీరి తల్లిదండ్రులు నమ్మాళ్వార్లను తిరుక్కురుగూర్ ఆదినాథుడికి సమర్పించి ‘తిరుప్పుళి ఆళ్వార్’ అనే చింతచెట్టు  క్రింద వదిలేస్తారు. చింతచెట్టు  తొర్రలో నమ్మాళ్వార్లు నిద్రాహారాలు లేకుండ దివ్యతేజంతో 16 సంవత్సరాల కాలం పాటు పద్మాసీనులై  భగవత్ ధ్యానంలో ఉండిపోతారు.

ఇది ఇలా ఉండగ, నమ్మాళ్వార్ల అవతారానికి ముందు ఆళ్వార్ తిరునగరికి సమీపములో ఉన్న తిరుక్కోళూర్   అనే దివ్యదేశములో  మధురకవి ఆళ్వార్ అనే బ్రాహ్మణోత్తముడు జన్మిస్తాడు. వీరు ఉత్తరభారతదేశ యాత్ర  చేస్తుండగా దక్షిణదిశ నుండి ఒక దివ్యమైన  తేజస్సుని చూస్తారు. ఆ జ్యోతిని అనుసరిస్తూ వారు ‘తిరుప్పుళి ఆళ్వార్’ అనే చింత చెట్టు క్రింద పద్మాసీనులైఉన్న నమ్మాళ్వార్ల వద్దకు చేరుకుంటారు.

నమ్మాళ్వార్లు ప్రబంధాలను అనుగ్రహించగా మధురకవి ఆళ్వార్లు వాటిని తాళపత్రాలపై వ్రాసినారు. నమ్మాళ్వార్ల అనుగ్రహించిన  నాలుగు ప్రబంధాలు.

  • తిరువిరుత్తం (ఋగ్వేద సారం)
  • తిరువాశిరియం (యజుర్వేద సారం)
  • పెరియ తిరువందాది (అధర్వవేద సారం)
  • తిరువాయ్ మొళి (సామవేద సారం)

నమ్మాళ్వార్ల ఈ నాలుగు ప్రబంధాలు నాలుగు వేదాలకు సమానమైనవి. అందుకనే వీరికి  ‘వేదం తమిళ్ శెయ్ ద మాఱన్’ అనే తిరునామం కలిగినది.   అంటే వేదాలను తమిళంలో వ్రాసిన మాఱన్ అని అర్థం. సంస్కృత వేదార్థాలను అందరికి అర్థమైయ్యేలా సులువుగా తమిళభాషలో వెలికి తెచ్చారు. ఇతర ఆళ్వార్ల ప్రబంధాలు వేదాలకు ఉపాంగాలుగా పరిగణించారు మన పూర్వాచార్యులు. పన్నిద్దరాళ్వార్లు కృపచేసిన  నాలుగువేల పాశురాల (నాలాయిర దివ్యప్రబంధం) సారమంతా తిరువాయ్ మొళిలో ఇమిడి ఉందని పూర్వాచార్యులు కీర్తిస్తారు. మన పూర్వాచార్యులు తమతమ వ్యాఖ్యానాలను, రహస్యగ్రంథాలన్నీ తిరువాయ్ మొళిని ఆధారంగానే అనుగ్రహించారని పూర్వుల నిర్వాహకం. భగవానుని  అనుగ్రహంతో పూర్వాచార్యులు  తిరువాయ్ మొళి శ్రీసూక్తులకు ఐదువ్యాఖ్యానాలు కృపచేశారు. ప్రస్తుతం ఇవి లభ్యం.

ఆళ్వార్ [ఈ పదం కేవలం నమ్మాళ్వార్లను మాత్రమే సూచిస్తుంది] ఈ లీలావిభూతిలో ముప్పైరెండు సంవత్సరాలు జీవించారు. ఆళ్వార్ సాంసారిక బంధాలతో ఎటువంటి అనుబంధం లేకుండా నిరంతరం భగవధ్యానంలో ఉండేవారు. ఆ చింతచెట్టు క్రింద పద్మాసీనులై ఆయా దివ్యదేశాల పెరుమాళ్ళను స్తుతిగా  పాశురాల ద్వారా మంగళాశాసనం కృపచేశారు. దివ్యదేశాల నుండి పెరుమాళ్ళు తామే  స్వయంగా ‘తిరుప్పుళియాళ్వార్’ వద్దకు వచ్చి వీరి పాశురాల ద్వారా మంగళాశాసనాలు అందుకునేవారు. పెరుమాళ్ళ దివ్యానుగ్రహంతో శాస్ర్తార్థాలను ఆళ్వార్  తమ ప్రబంధాలలో స్పష్టంగా కృపచేశారు. ఇంతటి  విశేష వైభవం  కలిగిన  తిరువాయ్ మొళి సేవిస్తున్నప్పుడు, ఫలశృతి పాశురాలలో ‘కురుగూర్’ అన్న నామాన్ని ఉచ్ఛరించినప్పుడల్లా మనం దక్షిణదిక్కుకి తిరిగి ఆళ్వార్ తిరునగరికి చేతులెత్తి నమస్కరించాలని మన పూర్వాచార్యులు నియమనం చేశారు .

ఆళ్వారు ముప్పైరెండు సంవత్సరాల కాలంపాటు ఈ లీలావిభూతిలో ఉన్న తర్వాత, ఇక పరమపదానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న మధురకవిఆళ్వార్లు తమ ఆచార్యులు ఈ లీలావిభూతిని వదలి వెళ్ళుతున్నారని తెలిసి కలతచెంది తమ నిత్యతిరువాధన కోసం ఒక అర్చామూర్తిని  ప్రసాదించమని ప్రార్థించారు. మధురకవిఆళ్వార్లకు తామ్రపర్ణి నదీజలాన్ని కాచితే తమ అర్చామూర్తి లభిస్తుందని ఆళ్వార్ అనుగ్రహిస్తారు. మధురకవి ఆళ్వార్లు తమ ఆచార్యుల ఆదేశంమేరకు తామ్రపర్ణి నదీజలాన్ని కాచి ఒక అర్చామూర్తిని పొందుతారు. అంజలి ముద్రలో ఉన్న ఆ అర్చామూర్తిని సేవించిన  మధురకవి ఆళ్వార్లు , “మీరు దాసునికి ఆచార్యులు కాబట్టి,  ఉపదేశముద్రతో ఉన్న అర్చామూర్తిని ఆరాధించాలని ఆశించాను, కాని  ఈ అంజలిముద్రకు కారణం ఏమిటి స్వామి?” అని అడిగారు. దానికి నమ్మాళ్వార్లు బదులిస్తూ “ఆ అర్చామూర్తిని (భవిష్యదాచార్య రామానుజులును) చూపిస్తు, వీరు నాలుగువేలసంవత్సరాల తర్వాత అవతరించబోయే ఒక గొప్ప మహానుభావుడు” అని సూచిస్తారు.

ప్రస్తుతం మనం ఆళ్వార్ తిరునగరిలో ప్రధానసన్నిధికి పడమరవైపు ఉన్న ‘రామానుజ చతుర్వేదిమంగళం’అనే  వీధిలో భవిష్యదాచార్యుని  (రామానుజుల) దివ్య అర్చామూర్తిని  సేవించుకోవచ్చు. మధురకవిఆళ్వార్లను మళ్ళీ తామ్రపర్ణి నదీజలాన్ని కాయమని నమ్మాళ్వార్లు ఆదేశిస్తారు. ఈసారి వీరు నమ్మాళ్వార్ల వంటి అర్చామూర్తిని  పొందుతారు. మధురకవి ఆళ్వార్లు పరమానందంతో స్వీకరించి ఆ అర్చామూర్తిని ఆరాధిస్తారు.   ఆళ్వార్ తిరునగరిలో. ప్రస్తుతం మనం సేవిస్తున్న మూర్తి ఈ అర్చామూర్తియే.

కాలానంతరం, భగవానుడు స్వయంగా వచ్చి నమ్మాళ్వార్లను పరమపదానికి తీసుకువెళతారు. అనంతరం మధురకవిఆళ్వార్లు,  ఆదినాథ పెరుమాళ్ళ ఆలయంలోపల నమ్మాళ్వార్ల అర్చామూర్తిని ప్రతిష్ఠించి, దివ్య గోపురప్రాకారమండపాదులను నిర్మింపజేశారు. నిత్యం వివిధరకపు పూలమాలతో నమ్మాళ్వార్ల అర్చామూర్తిని అలంకరించి ఆనందాన్ని పొందేవారు. నమ్మాళ్వార్ల పాశురాలను నలుమూలలా వ్యాపించే విధంగా పాడుతూ ఉండేవారు. వీరు భక్తి పారవశ్యంతో నమ్మాళ్వార్లను స్తుతిస్తూ పదకొండు పాశురాల ‘కణ్ణినుణ్ శిఱుత్తాంబు’ అనే ప్రబంధాన్ని అనుగ్రహిస్తారు.  ఇప్పటికిని ఆళ్వార్ తిరునగరిలో “అణ్ణావియర్” అనే తిరునామంతో మధురకవిఆళ్వార్ల వంశస్థులు నిత్యకైంకర్యం చేస్తున్నారు.

కొంత వరకు మనము ఆళ్వార్ల వైభవాన్ని అనుభవించాము.

నమ్మాళ్వా ర్ల తనియన్:

మాతాపితా యువతయ స్తనయా విభూతిః

సర్వం య దేవ నియమేన మదన్వయానామ్|
ఆద్యస్య నః కులపతేర్వకుళాభిరామమ్
శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా||

నమ్మాళ్వా ర్ల వాళి తిరునామాలు

తిరుక్కురుగై ప్పెరుమాళ్ తన్ తిరుత్తాళ్గళ్ వాళియే
తిరువాన తిరుముగత్తు చ్చెవ్వి ఎన్ఱుం వాళియే
ఇరుక్కుమొళి ఎన్ నెంజిల్ తేక్కినాన్ వాళియే
ఎందై ఎదిరాశర్కు ఇఱైవనార్ వాళియే
కరుక్కుళియిల్ పుగావణ్ణం కాత్తు అరుళ్వోన్ వాళియే
కాశినియిల్ ఆరియనాయ్ క్కాట్టినాన్ వాళియే
వరుత్తం అఱ వందు ఎన్నై వాళ్విత్తాన్ వాళియే
మధురకవి తంబిరాన్ వాళి వాళి వాళియే

ఆన తిరువైరుత్తం నూఱుం అరుళినాన్ వాళియే
ఆశిరియం ఏళు పాట్టు అళిత్త పిరాన్ వాళియే
ఇనం అఱ అందాది ఎణ్బత్తు ఏళు ఇందాన్ వాళియే
ఇలగు తిరువాయ్మొళి ఆయిరత్తు నూఱ్ఱు ఇరండు ఉరైత్తాన్ వాళియే
వాన్ అణియుం మామాడక్కురుగై మన్నన్ వాళియే
వైగాశి విశాగత్తిల్ వందు ఉదిత్తాన్ వాళియే
సేనైయర్కోన్ అవదారం శెయ్ద వళ్ళల్ వాళియే
తిరుక్కురుగై చ్చటకోపన్ తిరువడిగల్ వాళియే

మేదినియిల్ వైగాశి విశాగత్తోన్ వాళియే
వేదత్తై చ్చెందమిళాల్ విరిత్తు ఉరైత్తాన్ వాళియే
ఆది గురువాయ్ అంబువియిల్ అవదరిత్తోన్ వాళియే
అనవరదం సేనైయర్ కోన్ అది తొళువోన్ వాళియే
నాదనుక్కు నాలాయిరం ఉరైత్తాన్ వాళియే
నన్ మధురకవి వణంగుమ్ నావీఱన్ వాళియే
మాధవన్ పోఱ్పాదుగైయార్ వళర్ న్దరుళ్వోన్ వాళియే
మాగిళ్ మాఱన్ శడగోపన్ వైయగత్తిల్ వాళియే

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2022/12/03/azhwarthirunagari-vaibhavam-2/

పొందుపరిచిన స్థానము – https://srivaishnavagranthams.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org