Author Archives: Sridevi

విరోధి పరిహారాలు – 1

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవులు తమ రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానార్ వంగి పురత్తు నంబికి వివరించారు. వంగి పురత్తు నంబి ఈ ఉపదేశాలను వాటి వ్యాఖ్యానమును ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పరిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

1. స్వర్గత్తుక్కు సంసారం విరోధి  – సంసారం (ఈ సందర్భంలో –  ఈ శరీరానికి సంభందించినది) స్వర్గపు సుఖాలకు విరోధి.

సాధారణంగా స్వర్గం అంటే దేవతల స్వర్గపు గ్రహాలని అర్థం. ఇంద్రుని గ్రహం స్వర్గం అని పిలువబడుతుంది. స్వర్గలోకం ఈ భూమిపైన కనిపించని అనేక సుఖాలతో నిండి ఉంది. కానీ స్వర్గమార్గాన్ని అనుసరించడానికి అనేక తపస్సులు చేయవలసి ఉంటుంది.  ఈ సందర్భంలో భూలోకంపైన (సంసారంలో) జీవితం వారి వారి కర్మ ఫలితంగా లభిస్తుందని సూచన. సాధారణంగా వాటిని తపస్సుకు అడ్డంకులుగా పరిగణిస్తారు. వారి శరీరం, బంధువులు (భార్య, పిల్లలు, మొదలైనవి), ఆస్తులు (భూమి, సంపద మొదలైనవి) వారి తపోనిష్ఠకి అడ్డంకులు, కావున వాటిని పరిత్యజించాలి.

 భూలోక సుఖాలు – స్వర్గానికి అడ్డంకులు

అనువాదకుని గమనిక: “ౙ్యోతిష్థోమేన స్వర్గ కామో యజేత”  స్వర్గాన్ని కోరుకునే వారు ౙ్యోతిష్థోమం చేయవలిన అవసరం ఉంది – ఈ హోమానికి కఠినమైన నిష్ఠ అవసరం.

2.  స్వర్గేచ్చువుక్కు ఐహిక సుఖం విరోధి – పరలోక సుఖాలను కోరేవారికి ఈ భూలోక సుఖాలు విరోధి.

మునుపటి సూత్రానికి సరూపముగా, పరలోక సుఖాలను ఆస్వాదించే కోరిక ఉన్నవారికి, ఈ  భూలోక ప్రపంచంలోని వ్యవహారాలు / సుఖాలు అడ్డంకులుగా ఉంటాయి. భూలోక సుఖాలపై ఎక్కువ మక్కువ ఉన్నట్లయితే, అది పరలోక నివాసాలను కోరేవారి నిష్ఠను భంగపరుస్తుంది.

అనువాదకుని గమనిక: ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది –  స్వర్గానుభవం గురించి ఇక్కడ ఎందుకు ప్రస్తావించబడింది అని? ఇది ప్రపన్నులకు ఎలా సంబంధించినది అని? ఇది కేవలం ఒక అభ్యుదయ మార్గంలో,  (స్వర్గానుభవాది) చిన్న కోరికల నుండి చివరికి అత్యున్నతమైన భాగవత సేవా ప్రాప్తి వరకు, ఉన్న వివిధ అడ్డంకుల గురించి వివరించుటకు అని అర్థం చేసుకోవాలి.

3. ఆత్మానుభవత్తుక్కు స్వర్గానుభవం విరోధి – స్వర్గపు సుఖ అనుభవం వారి ఆత్మ ఆనందానికి  అడ్డంకి.

స్వర్గపు ఆనందాలు – ఆత్మానుభవానికి అడ్డంకి

అత్మానుభవం అనేది కైవల్యం అనే ఒక రకమైన మోక్షంగా పిలవచ్చు. కైవల్యం అనగా, ఆత్మ భౌతిక శరీరం నుంచి ఉపశమనం పొంది విరజా నదిని దాటి శ్రీవైకుంఠం చేరుకొని పూర్తిగా తనను తాను (జీవాత్మ) ఆనందించడం అన్నమాట. సంసారం (లీలా విభూతి – భౌతిక ప్రపంచం) లో పునర్జీవితం లేనందున ఇది కూడా ఒక రకమైన మోక్షంగా పరిగణించబడుతుంది. స్వర్గంలో సుఖాలు మన పుణ్యాలు ఉన్నంతవరకు మాత్రమే సాగుతాయి. పుణ్యం క్షీణించిన తరువాత, భూమండలంపైకి వచ్చి వారి  ప్రయాణాన్ని తిరిగి కొనసాగించాలి అని “క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి” లో వివరించారు.

4. ఆత్మానుభావకామనుక్కు స్వర్గం విరోధి – ఆత్మానుభావం కోరేవారికి  స్వర్గలోకాలను ఆనందించాలనే కోరిక అడ్డంకి.

(దయచేసి మునుపటి సూత్రం  యొక్క వివరణను చూడండి.)

5. భగవత్ అనుభవత్తుక్కు ఆత్మానుభవం విరోధి – ప్రతివారి ఆత్మానుభవం భగవత్ అనుభవానికి విరోధి.

స్వయం అనుభవం – భగవదానుభావం

భగవత్ అనుభవం అనగా భగవానుని సుందర రూపాన్ని, కళ్యాణ గుణాలతో, ఉభయ విభూతి ఐశ్వర్యం (రెండు లోకాలను నియంత్రించే సామర్థ్యం ఉన్న వాడు) – నిత్య విభూతి (ఆధ్యాత్మిక ప్రపంచం) మరియు లీలా విభూతి (భౌతిక ప్రపంచం) మొదలైనవి, ఇటువంటి ఆనంద అనుభవం భగవానునిపై ప్రీతి (భక్తి, ప్రేమ, అనుబంధం) కలిగింపజేస్తుంది. ఇటువంటి ఆనంద అనుభవం నుండి పుట్టిన అనుబంధం భగవత్ కైంకర్యానికి (సేవ) దారి తీస్తుంది. ఇటువంటి పరమానందమును పరమపదంలో  (శ్రీవైకుంఠంలో) అపరిమిత పరమానంద మోక్షం అని అంటారు. అత్మానుభవం పరమానందం అయినప్పటికిని  భగవత్ అనుభవంతో పోల్చితే,  అది చాలా స్వల్పమైనది. అందువల్ల, తనను తాను ఆస్వాదించే (ఆత్మానుభవం) కోరిక  భగవత్ అనుభవానికి ఒక ఆటంకము.

అనువాదకుని గమనిక: జీవాత్మ సహజంగానే జ్ఞానమయం (జ్ఞానంతో నిండినవాడు) మరియు ఆనందమయం (ఆనందంతో నిండినవాడు). కాబట్టి, అత్మానుభవం ఒక ఆసక్తికరమైన అంశముగా ఉండవచ్చు, అయినా అది చాలా స్వల్పమైనది. ఎందుకంటే ఆత్మ అణుప్రాయమైనది (అణు స్వభావం). ఆత్మ యొక్క పరిమిత జ్ఞానం మరియు ఆనందంతో పోలిస్తే  భగవాన్ విభుడు (సర్వవ్యాపి,  ప్రబలమైనవాడు), వారి  జ్ఞానం మరియు ఆనందం అపరిమితమైనవి.

6. భగవత్ అనుభవ కామనుక్కు ఆత్మానుభవ ఇచ్చై విరోధి – భగవత్ అనుభవాన్ని కోరినవారికి, తమను తాము ఆనందించడం ఆటంకము.

(దయచేసి మునుపటి సూత్రం యొక్క వివరణను చూడండి.)

7. గుణానిష్ఠనుక్కు గుణి విరోధి – భగవానుని కళ్యాణ గుణాలపై నిష్ఠ ఉంచినవారికి, భగవత్ స్వరూపం ఆటంకము.

భగవాన్ స్వరూపాన్నిఆనందించడం – భగవత్ కళ్యాణ గుణ అనుభవం గుణనిష్ఠకి అడ్డంకి – “సదా పరగుణావిష్ఠ” లో చెప్పినట్లుగా, “నిరంతరం భగవానుని పవిత్రమైన గుణాలను అనుభవిస్తున్న వ్యక్తి అని అర్థం. శృతిలోని “సోస్నుతే” అన్న ప్రమాణం, జీవాత్మ పరమాత్మను వారి పవిత్ర కళ్యాణ గుణాలతో పాటు ఆస్వాదిస్తాడు, ఆనందిస్తాడు అని తెలియజేస్తుంది. “రాసోవై సః” అంటే మాధుర్యాన్ని రూపుదిద్దుకున్నవాడు అని అర్థం. దీనిని అనుభవించడం ద్వారా ముక్తాత్మ (ముక్తి పొందిన ఆత్మ) ఆనందం పొందుతాడు. ఎమ్బెరుమాన్ తన కళ్యాణ గుణాలను  అనేక దివ్య కార్యకలాపాల ద్వారా బహిర్గతం చేస్తారు. తిరువిరుత్తం 98వ పాసురం “నెంజాళ్ నినైప్పరిత్తాళ్ – వెణ్ణేయుణెన్నుం ఇరచ్ చొళ్ళే”, తిరువాయ్మొళి 1.3.1 వ పాసురం “ఎత్తిఱాం! ఉరలినోడు ఇణైన్తిరుంతేంగియ ఎళివే”  మొదలైన పాసురాల ద్వారా, నమ్మాళ్వార్ భగవద్ గుణాల అనుభవాన్ని అర్థంచేసుకోవచ్చు. ఇది పెరియ తిరువందాది 86 లో “చీర్ కాలంత చోల్” గా  (అనగా భగవాన్ యొక్క పవిత్రమైన లక్షణాలతో నిండిన పదాలు) వివరించబడింది. గుణి అంటే భగవాన్ యొక్క దివ్య స్వరూపం (అనగా, గుణం  ఉన్నవాడు గుణి). ఈ భగవత్ స్వరూపం అర్థమగుట గొప్ప యోగులకు కూడా చాలా కష్టమైన విషయం. భగవత్ స్వరూపంపై దృష్టి కేంద్రీకరించడం భగవత్ గుణాలను అనుభవించడానికి, ఆనందించడానికి ఒక అడ్డంకిగా ఉంటుంది. ఇది తరువాతి సూత్రానికి సమానంగా ఉంది.

8. కైంకర్యనిష్ఠనుక్కు భగవత్ సౌందర్యం విరోధి –  భగవానుడికి సేవ  అందించడంలో దృష్టి సారించినవారికి, భగవానుడి యొక్క సౌందర్యం ఒక అడ్డంకి.

భగవాన్ యొక్క సౌందర్యంపై దృష్టి కేంద్రీకరించడం –  సేవ అందించడంలో అడ్డంకి (ఇళయ పెరుమాళ్ నిరంతరం పెరుమాళ్ సేవలో నిమఘ్నమై ఉండేవారు.)

కైంకర్యనిష్ఠులు – ఇళయ పెరుమాళ్ (లక్ష్మణ)  “అహం సర్వం కరిష్యామి” (మీకోసం ఏదైనా చేస్తాను),  అన్ని సమయాల్లో సాధ్యమైన విధాలుగా సంపూర్ణ దృష్టి భగవానునిపై పెట్టి ఉన్నవాడు. ఒకసారి అతని దివ్య సౌందర్యాన్ని అనుభవించటం మొదలుపెడితే, మన దృష్టి, మనస్సు అతనిపై స్థిరపడి మరియు పూర్తిగా అబ్బురపోతారు. ఈ భావన ఎమ్బెరుమాన్ సేవను ప్రభావితం చేస్తుంది. అందువల్ల పిళ్ళై లోకాచార్యులు ముమ్ముక్షుపడి సూత్రం 187 లో ” సౌందర్యం అంతరాయం” అంటే భగవానుని సౌందర్యం ఆటంకము. సహజంగా – భగవనుడు యజమాని, జీవాత్మ దాసునిగా ఉంటారు. భగవానుని యొక్క లక్షణాలను అనుభవించడం ద్వారా, జీవాత్మకు భగవానునిపై  అనుబంధం అభివృద్ధి చెంది తద్వారా అటువంటి కళ్యాణ గుణాలు ఉన్న  ఎమ్బెరుమానకి సేవ చేయాలనే కోరికను పొందుతాడు. ఇది శేషత్వమైన (సేవకుడు/దాసుడు) జీవాత్మ స్వభావానికి సరితూగుతుంది, ఇది కోరదగినదే. ఇది ఎంతో అవసరం. కాని ఒకసారి భగవానుడి  దివ్య సౌందర్యముపై దృష్టి మరలితే, అది కైంకర్యం జరగకుండా అడ్డుకుంటుంది. అందువల్ల, కైంకర్య నిష్ఠులకు భగవానుని సౌందర్యం అడ్డంకి అని చెప్పవచ్చు.

9. భాగవత కైంకర్య నిష్ఠనుక్కు భగవత్ కైంకర్యం విరోధి – భాగవత (భక్తులు) కైంకర్యంలో శ్రద్ధ వహించేవారికి  భగవత్ కైంకర్యం (భగవాన్ సేవ)  ఆటంకము.

భగవత్ కైంకర్యం పై కేంద్రీకరించడం – భాగవత కైంకర్యంలో అడ్డంకి.

జీవాత్మ యొక్క సహజ వ్యక్తిత్వం  భగవత్ దాస్యత్వం (భగవానుని సేవకుడు), ఎమ్బెరుమాన్ కు సంపూర్ణ దాసుడిగా ఉండాలి. ఇంకా ప్రాముఖ్యమైనది – స్వరూప యాథాత్మ్యం (నిజ స్వభావ తత్వము) – భాగవత శేషత్వం  (భాగవతుల యొక్క సేవకుడు). పెరియ తిరువాయ్మొళి 8.10.3 లో, తిరుమంగై ఆళ్వార్ తిరుమంత్రం యొక్క సారాంశాన్ని స్వయంగా ఎమ్బెరుమాన్ కు తెలియజేస్తూ ఇలా అన్నారు  ” నిన్ తిరువెట్టెళుత్తుం కఱ్ఱు ణన్ ణాన్ ఉఱ్ఱతుం ఉన్నడియార్కడిమై కణ్ణపురత్తుఱైయమ్మానే ” –  తిరుకణ్ణపురం లోని ప్రియమైన భగవానుడా! తిరుమంత్రం యొక్క సారాంశాన్ని తెలుసుకున్న తర్వాత నేను మీ భక్తుల సేవకుడనని అర్థం చేసుకున్నాను. తిరుమళిశై ఆళ్వార్ నాన్ముగన్ తిరువన్తాధి 18 వ పాసురంలో “ఏత్తియిరుప్పారై వెల్లుమే  మాఱ్ఱవరైచ్ చాత్తియిరుప్పార్ తవం”  – భక్తుల పట్ల భక్తి భగవానునిపై భక్తి కన్నా ఎక్కువ). ఏత్తియిరుప్పార్ – భగవత్  శేష భూతర్ – భగవానునికి శరణాగతి చేసినవాడు. అటువంటి భక్తులకు శరణాగతి చేసినవారి  స్థితి చాలా ఉన్నతమైనది. శ్రీ రామాయణంలో, లక్ష్మణ భరతులు శ్రీరాముడికి పూర్తిగా శరణాగతులై ఉండేవారు. శత్రుఘ్నాళ్వారులు భరతుడే సర్వస్వంగా ఉండేవారు. శ్రీ రామాయణంలో  “శత్రుఘ్నొ నిత్యశతృఘ్నః” (శాశ్వతమైన ఆటంకాన్ని జయించిన వాడు) అని చెప్పబడింది.  మన పూర్వాచార్యులు ఇలా వివరించారు “శత్రుఘ్నాళ్వారులు శ్రీరాముని యొక్క సౌందర్యాన్ని మరియు పవిత్రమైన కళ్యాణ గుణాలను విస్మరించి  పూర్తిగా భరతుని సంపూర్ణ సేవలో నిమఘ్నమై ఉండేవారు. తిరువాయ్మొళి 8.10.3 పాసురంలో నమ్మాళ్వార్  “అవనడియార్  సిఱుమామనిసరాయ్  ఎనీ ఎన్నైయాణ్డార్”. సిఱుమామనిసర్ భగవానునికి శరణాగతి చేసినవాడు, పరిమాణంలో చిన్నగ ఉన్న వారు కానీ జ్ఞానం, ఆచరణలో గొప్పవారు. ఇటువంటి భక్తులే నా యజమానులు అని నమ్మాళ్వార్  అన్నారు. అటువంటి భక్తులు ఉనికిలో ఉన్నప్పుడు, వారిని విస్మరించి ఎమ్బెరుమాన్ చరణ కమలాలనే ఎలా సేవించగలం? జీవాత్మ నిజమైన స్వభావమునకు, భాగవత కైంకర్యం మరింత సముచితమైనది. అందువల్ల భగవత్ కైంకర్యం భాగవత కైంకర్యానికి అడ్డంకి అని చెప్పవచ్చు.

తదుపరి విభాగాన్ని మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

హిందీలో :  http://ponnadi.blogspot.com/2013/12/virodhi-pariharangal-1.html

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Advertisements

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 10

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 9

భగవద్రామానుజులు చేతనులలో అంతర్యామిగా ఉన్న శ్రీరంగనాథుని  చూసారు.

వారి   శ్రీరంగ గద్యం ‘ స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం’ అని ప్రారంభించి నారాయణుడే సకల ఆత్మలను, వస్తువులను నియంత్రించు వాడు, అందువలననే ఈ లోకంలో ఆత్మలు ఆత్మలుగాను, లోకము లోకముగాను ఉన్నవి.

నంపెరుమాళ్ – సకల లోకాలను నియంత్రించువాడు

వాటి స్థితి, స్వరూపము  అయన అధీనములో ఉన్నాయి. ఆయన రక్షకత్వం వలననే ఈ జగత్తు, ఆత్మలు తమ స్థితిని పొంది ప్రస్తుతము ఉన్న రూపంలో ప్రకాశిస్తునాయి. ఈ ప్రవృత్తి నివృత్తి అనే క్రియలు ఆయన మనో సంకల్పానికి తగినట్లుగానే నడుస్తున్నవి. ఈ లోకము, ఇక్కడి మనుష్యుల స్థితి, ప్రవృత్తి  సమస్తం ఆయన వలననే నిర్వహింపబడుతున్నవి.

 

ఈ విషయము వేదాలలోను, ఉపనిషత్తులలో, మునులచే అనుగ్రహిమ్చబడిన పలు గ్రంధాలలో సుస్పష్టంగా కనపడుతుంది. స్వామి రామానుజుల వారి ఈ అభిప్రాయం వారు  అనుగ్రహించిన గ్రంధాలలో పలు చోట్ల కనపడుతుంది.

సకల చేతనాచేతనముల స్వరూపము, స్థితి, ప్రవృతి సమస్తం ఆయన సంకల్పమే అని స్వామి ఎలా చెప్పారో అదే విధంగా తిరువాయిమోళిలో కనపడుతుంది.

ఆళ్వార్ – రామానుజుల మార్గదర్శకులు

తిరువాయ్మొళి మొదటి శతకంలోని మొదటి దశకం (తిరువాయ్మొళి) ఈ ప్రకరణానికి సమానార్థకంగా ఉంది .

స్వరూపము

నామ్ అవన్ ఇవన్ ఉవన్ అవళ్ ఇవళ్ ఉవళ్ ఎవళ్

తామ్ అవర్ ఇవర్ ఉవర్ అదు ఇదు ఉదు ఎదు

వీమ్ అవై ఇవై ఉవై అవై నలమ్ తీంగవై

అమ్ అవి ఆయ్  అవై ఆయ్ నిన్ర అవరే  1.1.4

ఇక్కడ పరమాత్మ అనుగ్రహిమ్చినవే నామ్, అవన్, అవళ్, అదు, అవర్, అవై,ఇవై,( మనము , వాడు, ఆమె , అది,వాళ్ళు ,అవి,ఇవి ) అనేవి అన్ని మనకు తెలిసిన మనుషులు , వస్తువులకు సంబందించిన స్థితి ,  స్వరూపము .

నారాయణ – స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప

తిరుక్కురుగై పిరాన్  పిళ్ళాన్  దీనిని  వివిధ నిర్దేశములతో నిర్దిష్టమైన సమస్త వస్తువుల స్వరూపము భగవదాధీనము అని చెపుతున్నారని వివరించారు. దీని వలన మనము చూస్తున్న సమస్త వస్తువులు ఆయన సంకల్పమే అని బోధపడుతున్నది.

స్థితి

అవరవర్ తమతమదు అఱి  వఱి వఱి వకై

అవరవర్ ఇఱైయవర్ ఎన వడి  అడైవర్గళ్

అవరవర్ ఇఱైయవర్ కుఱైవిలర్  ఇఱైయవర్

అవరవర్ వితి వళి అడైయనిన్రనరే      1.1.5

ఒక్కొక్కరు వారి వారికి తగినట్లు వాస్తవాలను స్వీకరించి వేరు వేరు పురుషార్థాలను పొందటం కోసం వేరు వేరు దైవాలను కొలుస్తారు. అలాంటి వారు వారి కర్మ ఫలానికి తగినట్లు ఫలితాలను పొందుతారు. కానీ ఆయా దైవాలలో నారాయణుడే ఉండి వారి ఉపాసనలను స్వీకరించి ఫలితాన్ని ఇస్తున్నాడు.

నారాయణ – స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితిగా

పిళ్ళాన్ ఈ విషయంగా, సర్వ కర్మల సమారాధ్యుడై సకల ఫల ప్రదాయి కావటంచేత  జగద్రక్షణము ఆధీనమై అన్నారు. సకల కర్మల చేత ఆయనే పూజిమ్పబడటం వలన ఆయనే ఫల ప్రదాత అవుతున్నాడు. అందు వలన జగద్రక్షణము ఆయన దివ్య సంకల్పమని స్పష్ట మవుతున్నది.

ప్రవృత్తి :

నిన్ఱనర్ ఇరుందనర్ కిడందనర్ తిరిందనర్

నిన్ఱల ర్ ఇరుందిలర్ కిడందిలర్ తిరిందిలర్

ఎన్రుం ఓర్ ఇయల్వినర్ ఎన నినైవరియవర్

ఎన్రుం ఓర్ ఇయల్వోడు నిన్న్రవెంతిడరే ‘

వేదవేదాంతములు తెలియ జేయు పరమాత్మ- హృదయము, స్పందనలను నుండి వేరు పడి ఉన్నాడు. ఆయనే సమస్త కర్మలను కర్మలు లేని స్థితిలోను  ఉన్నాడు .

నారాయణ – స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తి

పిళ్ళా న్  ఈ పశురాన్ని, “చేతనాచేతనత్మక సమస్త వస్తు వస్తువుల సమస్త ప్రవృత్తి, నివృత్తులు  పరమపురుష సంకల్పాధీనములు అని చెపుతున్నాయి” అని వివరించారు. అంటే  ప్రాణులు, అప్రాణులు, సమస్త చేతనాచేతనముల కర్మాకర్మలు ఈశ్వరుని సంకల్పమే అనే విషయం స్పష్టముచేస్తున్నారు.

ఈ మూడు పాశు రాలు చేతనాచేతనముల సమస్త  ప్రవృత్తి, నివృత్తులు పరమపురుష సంకల్పా ధీనములు అని చెపుతున్నాయని భగవద్రామానుజుల భావమే కాదు, అది ఆళ్వార్ల మనోభావాలు కూడా. దానిని వీరు వివరించారన్నది  సుస్పష్టం మవుతున్నది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/05/dramidopanishat-prabhava-sarvasvam-10/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 9

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 8

ఈ భాగంలో భగవద్రామానుజుల ‘ కప్యాసం పుండరీకాక్ష ‘ అనే శృతి వాఖ్యానికి ఆళ్వార్ల మనోభావాలను చూడబోతున్నాము.

గంభీరాంబస్సముద్భూత పుండరీక—-తామర , జలజము , అంబుజము  లేక నీరజము . అది నీటిలో పుట్టటము వలన దానికి పై పేర్లన్నీ అమరినవి. తామర నీటిలోనే పుడుతుంది, నేలపై పుట్టదు.   కాబట్టి ఈ పేర్లన్నీ తామరకు మాత్రమే చెందుతాయి. అమ్బస్సముద్భూత  అంటే నీటిలో పుట్టినవి.

స్వామి పిళ్ళై లోకాచార్య

శ్రీవచన భూషణంలో స్వామి పిళ్ళై లోకాచార్యులు ‘ తామరను వికసిమ్పచేసే సూర్యుడు అది నీటిని విడిచి బయటకు వస్తే తన వేడితో వదలగొట్టినట్టుగా ‘ అని అన్నారు. దీనిని బట్టి తామరకు నీరు ఎంత అవసరమో తెలుస్తున్నది.

 

పరమాత్మ కళ్ళు పుండరీకాక్షము. వాటిని తామరతో పోల్చి చూడబడుతున్నది . నీటిలో నివసించే తామర గుణాలు ఆళ్వార్ల పాశురాలలో వివరించబడ్డాయి. సిరియ తిరుమడల్ లో తిరుమంగై ఆళ్వార్లు, ‘నీరార్ కమలం పోల్ సేమ్క్ ణ్ మాల్ ఎన్రోరువన్’  అన్నారు. పరమాత్మ ఎర్రని కళ్ళను ఎర్ర తామర లాగా భావించారు వారు.  ఇంకా తిరువిరుత్తంలో నమ్మాళ్వార్లు ఇదే అర్థంలో ‘ అళలర్  తామరై కణ్ణన్ ‘ అన్నారు. ఈ పాశుర వ్యాఖ్యానంలో స్వామి నమ్బిళ్ళై కప్యాస శృతిని ఉదాహరణగా చూపించారు. వదికేసరి జీయర్ స్వాపదేశము కూడా ఇలాగే కనపడుతుంది.

                                     

   స్వామి నంపిళ్ళై                                                                              వడికేసరి జీయర్

 

ఇక్కడ ‘గంభీర ‘ అన్న ప్రయోగం నీటి సమ్రుద్దిని సూచిస్తున్నది. ‘ తిరువాయిమోళి ‘ లో ఆళ్వారు ‘ తణ్  పెరునీర్ తడంతామరై మలర్దాల్ ఒక్కుం కణ్ పెరుంకణ్ణన్ ‘ అని వర్ణించారు. తామర పెద్ద , చల్లని తటాకంలో వికసించింది . పరమాత్మ కళ్ళు కూడా అలాంటివే అన్న అర్థంలో చెప్పారు.

‘సంరుష్ట నాళ పుండరీక “ – తామరపువ్వు ఎలాగైతే నీళ్ళ మీద ఆధారపడి ఉంటుందో అలాగే తన ఎర్రని కాడ మీద కూడా  ఆధారపడి ఉంటుంది. ఆళ్వార్ల పాశురాలలో దీనికి సంబంధించిన ఆధారాలు కనపడతాయి.

తిరువురుత్తంలో ఆళ్వార్లు “ఎమ్పిరాన్ తడంకణ్ గళ్  మెన్ కాల్ కమల తడం పోల్ పొలిందన” (పరమాత్మా ఎర్రని కన్నులు తామర పువ్వు లాగా విచ్చుకున్నాయి) అన్నారు.

“ రవికర వికసిత “ నీటిలో ఉన్న తామర సూర్యరశ్మి వలన వికసించింది . రమ్యమైన సుందరమైన పరమాత్మ కన్నులకు దగ్గర పోలికలు గలవి తామరలు మాత్రమే. సూర్యకిరణాలు ఆయనకు చేతులు.  “సెమ్జుడర్ తామరై “ అని ఆళ్వార్ల పాశురాలలో ఉదాహరించారు.

పరమాత్మా కళ్ళకు, తామరకు ఉన్న సంబంధమును కులశేఖర ఆళ్వార్లు తమ పెరుమాళ్ తిరుమోళిలో  “సెంకమలమ్ అందరమ్ సీర్ వేమ్కదిరోర్ కల్లాల్ అలరావల్ “ అని అనుగ్రహించారు.

పుండరీక దళామలాయతేక్షణ  – మూలములో ‘పుండరీకమేవ మక్షిణి’ ఉంది. దీనిని బట్టి తామర వంటి కన్నులు గలవాడు అనో, పుండరీకాక్షుడు  అనో చెప్పవచ్చు. కానీ రామానుజులు దళ, ఆమల, ఆయత అనే మూడు పదాలను పుండరీక, ఈక్షణ అనే రెండు పదాల మధ్య చేర్చి చెప్పారు. ఇది ఆళ్వార్ల పాశురాలను వలననే సాధ్యం అవుతుంది.

ఆళ్వార్లు “తామరై తడం కణ్ణన్”,  “ కమల త్తడం పెరుం కణ్ణన్”  వంటి పదాలను ప్రయోగించారు.  తమిళంలో ‘తడ’, సంస్కృతంలో ‘తళ’ సమానార్థకాలు. సంస్కృతంలోని ‘ళ కారము’ తమిళంలో ‘డ కారముగా మారుతుంది. ఈ మార్పిడిని తమిళ భాషా శాస్త్రజ్ఞులు ‘ఎళుత్తుపోలి’ (అక్షరంలో పోలిక ) అంటారు. పూర్వాచార్యులు తమ వ్యాఖ్యానాలలో ‘తడం’ అంటే పెద్ద, కొలను, ఆకు అని వివరించారు. ఇక్కడ ఆకు అన్న అర్థం సరిపోతుంది.

ఆళ్వార్ల “ కమల కణ్ణన్  …..అమలంగళాగా విళిక్కుం” (కమలముల వంటి నేత్రాలవాడు అమలములను పోగొడతాడు) పరమాత్మ కరుణా కటాక్షము సకల పాపాలను పోగొడతాయి. అయన దృష్టి ‘ అమల’ అనటం వలన ఈ విషయమ బోధపడుతుంది. కీట్స్ ఆంగ్ల కవి చెప్పిన మాట ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఆనంద అంటే ఒక అందమైన వస్తువు ఆనందాన్ని ఇచ్చి అది నిరంతరం ప్రవర్తమానమవటం అన్నారు.  లోకంలో ఎంత ఆనందకరముగా ఉండే అందమైన వస్తువైనా కొంతకాలానికి విసుగు కలిగిస్తుంది. నిత్య జీవన  ప్రవాహంలో ఎంతో అందమైన వస్తువైనా కొంతకాలానికి విసుగు పుట్టిస్తాయి, అసలు ఆ అందాన్ని అనుభవించే ఓపిక కూడా ఉండదు. దానికి విరుద్ధంగా ఎప్పటికి నవనవోన్మేషంగా ఉండేది పరమాత్మ రూపం ఒక్కటే. భక్తి పెరిగిన కొద్దీ ఆయన అందం ఇనుమడిస్తుంది. ఆయన అందమైన నేత్రాలు ప్రేమతో కారుణ్యంతో నిండి వుంటాయి. ఇది నిజమైన, పవిత్రమైన విషయం మాత్రమే కాదు చేతనులను ఉద్దరించే దృఢ సంకల్పం గోచరమవుతుంది. ఆయన అందమైన నేత్రాలు మన పాపాలను పోగోట్టడమే కాక చేతనులను ఉన్నతగతికి చేరుస్తాయి .

శ్రీ వైష్ణవులకు ‘ఆయత’ అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది అని చూడడం సులభం.  రుప్పాణ్ణాళ్వార్ల

తిరుప్పాన్ఆళ్వార్

‘కరియవాగి పుడైపరందు మిళిర్దు సెవ్వరియోడి నీండవప్పెరియ వాయకంణ్ గళ్’ అన్న మాటలు మన హృదయంలో రూపుకడతాయి.

 

స్వామి రామానుజుల మాటలకు, ఉదాహరణలకు ఆళ్వార్ల పాశురాల నుండి కాక బయట అర్థాలను వెతికితే ప్రయోజనం ఉండదు. శ్రీ రామాయణంలో ‘రామ కమల పత్రాక్ష’ , ‘పుండరీక విశాలాక్ష’ అన్న ప్రయోగాలు తప్ప వేరేగా ఎక్కడ కనపడవు . ఆళ్వార్ల పాశురాల ఆధారంగానే ఈ ప్రయోగాలను వివరించారు.

స్వామి ఆళ్వార్ల పాశురాలపై తమకు గల అధికారంతో చేసిన ఈ వ్యాఖ్య పరమాత్మ నేత్రాల సౌందర్యాన్ని, దాని నుండి మనపై ప్రవహించే కరుణను మనము అనుభవించగలుగుతున్నాము.

 

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/05/dramidopanishat-prabhava-sarvasvam-9/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడొపనిషత్ ప్రభావ సర్వస్వం 8

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 7

 

 

పుండరికాక్షనే పరబ్రహ్మం (పుండరీకాక్షుడే  పరమాత్మ )

చాందోగ్యోపనిషత్తులో  పుండరీకాక్షుడే పరమాత్మ అని, ‘తస్య యదా కప్యాసం పుండరీకాక్షిణి’ అన్న వాక్యంలో చెప్పబడింది. స్తోత్రరత్నంలో ఆళవందార్లు పరమాత్మను వర్ణించే సందర్భంలో ‘కః పుండ రీకాక్ష నయనః’ అని అన్నారు. కావున కమల నయనుడైన వాసుదేవుడే పరబ్రహ్మం అని శృతి వాక్యం.

తిరువెళ్ళరై – పుండరీకాక్ష భగవాన్

వివరణలో వచ్చిన చర్చలు :

యాదవప్రకాషులు

ఈ చాందోగ్యోపనిషత్తు శ్లోకం గురించి విస్తృత చర్చ జరిగింది. దీనికి యాదవ ప్రకాశులు పరమాత్మ కన్నులు ఎర్రగా మర్కటం పృష్ఠభాగం లాగా ఉంటుంది అని వివరించారు. ఈ వివరణ పరమాత్మను కించపరిచేదిగాను, తక్కువ చేసినదిగాను ఉంది. భగవద్రామానుజులకు మనఃక్లేశాన్ని కలిగించింది అని చరిత్ర .

 

శ్రీశంకరాచార్యుల  వివరణ:

శ్రీశంకరాచార్యులు ఈ విషయంగా వివరిస్తూ పరమాత్మ కళ్ళను మర్కటం పృష్ఠభాగంతొ పోల్చరాదు అన్నారు. ఇంకా పరమాత్మ కళ్ళను తామరతో పోల్చతగినది అన్నారు.  ఈ విధంగా శ్రీశంకరాచార్యులు పరమాత్మ కళ్ళను తామరతో పోల్చి పరమాత్మ పుండరీకాక్షుడని నిరూపించటం వలన ఉన్నతమైన పరమాత్మ లోని ఒక అవయవాన్ని నీచమైన మర్కటం పృష్ఠభాగంతొ పోల్చనీయకుండా విజయం సాధించారు, శృతి ఈ విషయంగా తామరను గురించి మాత్రం చెప్పితే సరిపోతుంది కదా, ఇంకా మర్కటం పృష్ఠభాగం గురించి ఎందుకు చెప్పిందని తృప్తికరంగా వివరించలేదు .

భగవద్రామానుజుల వివరణ:

కప్యాసం అన్న శబ్దం తామరకు ఎలా సరిపోతుందో వివరించి రామానుజులవారు ఈ చర్చకు ముగింపు చెప్పారు. అది ఎలాగంటే పరబ్రహ్మం పుండరీకాక్షుడని ప్రస్పుటంగా చెప్పటమే వేదాంతము యొక్క ఉద్దేశ్యము. మర్కటం పృష్ఠభాగం అన్న విరోధ భావానికి మారుగా ఉపనిషత్తు పరమాత్మ కళ్యాణ గుణాలను విభ్రమంగా చూసింది. భగవద్రామానుజుల చక్కటి వ్యాఖ్య వలన కుద్రుష్టుల భారి నుండి వేదాంతం తప్పించుకో కలిగింది.

 

భగవద్రామానుజులు అనుగ్రహించిన మూడు అర్థాలు;

  1. కం పిబతి ఇతి కపి= ఆదిత్యః  తేన్ అస్త్యతే క్షిప్యతే వికాసతే ఇతి కప్యాసం

సూర్యుడిచే  వికసింప బడిన  తామర పువ్వు

నీటిని తాగేది కపి. సూర్యుడు నీటిని పీల్చడం వలన కపి  అని పిలవ బడుతున్నాడు. కప్యాసం అనగా సూర్యుడి వలన వికసింపచేసేది. తామరకు సంకేతంగా ఉండి అప్పుడే సూర్యుడిచే  వికసింప బడిన  తామర అన్న అర్థం వస్తుందని చెప్పారు.

 

 

  1. కం పిబతి ఇతి కపి= నాళం ,తస్మిన్ అస్తే ఇతి కప్యాసం .

బలమైన తూడులుగల తామర

కపి అంటే నీటిని తాగేది ఎదో అది కపి. తామర తూడు నీటిని తాగుతుంది అందు వలన అది కపి. కప్యాసం పుండరీకం అంటే నీటిలో ఉండి తూడుచే భరించ బడుతున్నదానిని చెపుతున్నది.

 

3. కం జలం ఆచ ఉపవేసనే ఇతి జలేపి ఆస్తే ఇతి కప్యాసం

నీటిలో  ఒక అందమైన తామర

కం అంటే జలము. నీటిలో నిలబడేది కప్యాసం. ఇక్కడ కప్యాసం పుండరీకం అంటే నీటిలో ఉన్న ఒక అందమైన తామర అని అర్థం .

 

ద్రమిడాచార్యులు తమ వ్యాఖ్యానంలో ఆరు అర్థాలను చెప్పినట్లు శ్రుత ప్రకాసిక వలన తెలుస్తున్నది. ఇందులో మూడు మర్కటం సంబందంగా ఉండటం వలన అవి పూర్వ పక్షం చేయబడ్డాయి. మిగిలిన మూడు పరబ్రహ్మాన్ని పుండరీకాక్షుడుగా చెప్పటం వలన అవి యుక్తముగా ఉన్నవని  స్వీకరించబడ్డాయి. ఈ అర్థాలు రామానుజులచే అందంగా శృతి యుక్తంగా చక్కగా వివరించబడ్డాయి.

వేదర్తసంగ్రహంలో ఈ అర్థాలు చాలా సులభంగా చెప్పారు.

‘గంభీరాంపశ్చముద్భూత సమృష్ట నాళ రావికర వికసిత పుండరీక తలామలాయతేక్షణ ‘

‘ కప్యాసం’  అంటే పై పై అర్థం చూస్తే ఈవిశేష విషయాలు స్పురించవు. మరి రామానుజులు ఈ అర్థాలను  ఎలా చెప్పారని ఆశ్చర్యం కలగడం సహజం. ఆళ్వార్ల శ్రీసూక్తులను అనుభవించటం వలననే ఈ అర్థాలు స్పురిస్తాయనడం లో సందేహం లేదు.  ఆళ్వార్ల శ్రీసూక్తులలో  ఈ విషయానికి సంబందించిన పాశురాలను అనుభవించి నప్పుడు ఈ విషయం చక్కగా బోధపడుతుంది.

రామానుజుల ఆళ్వార్ల శ్రీసూక్తులలో ఏ ఏ భాగాలను అవగాహన చేసుకొని ఈ వివరణ ఇచ్చారన్నది తరువాతి భాగాలలో అనుభావించవచ్చు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/05/dramidopanishat-prabhava-sarvasvam-8/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

 

ద్రమిడొపనిషత్ ప్రభావ సర్వస్వం 7

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 6

కళ్యాణ గుణ సాగరం

           పూర్వాచార్య గ్రంధాలలొ భగవంతుడిని సకలకల్యాణగుణ పరిపూర్ణుడుగా  వర్ణించారు. అవి ఎంత అంటే సముద్ర మంత అనిచేప్పుకోవాల్సిందే .

           స్వామి రామానుజులు పలుసందర్భాలలో పరమాత్మా గురించి చెప్పేటప్పుడు అసంఖ్యాక కళ్యాణగుణ ములు అని వర్ణించడం తెలిసిన విషయమే .

           శ్రీభాష్యంలో ‘అనంత గుణసాగరం’  అని  ‘అపరిమితోధార గుణసాగరం’ అని ప్రయోగించారు. ఉదాహరణకు శ్రీభాష్యం రెండవ అధ్యాయం అవతారికలో

‘ప్రధమే అధ్యాయే ప్రత్యక్షాది ప్రమాణ గోచరాత చేతనాత్ తత్సంసృష్టాత్ వియుక్తాచ్చ చేతనాత్ అర్థాంతరభూతం నిరస్త నిఖిల అవిధ్యాది అపురుషార్థగంధం అనంత జ్ఞానందైకతానం అపరి మితోధార గుణసాగరం నిఖిల జగత్కారణం సర్వాంతరాత్మభూతం పరం బ్రహ్మం వేదాంతం ఇత్యుక్తం .’

దీని భావము: …..వేదాంత సూత్రములోని మొదటి అధ్యాయంలో పరబ్రహ్మ ఇంద్రియములకు అందక భౌతిక రూపంతో ఉండే జీవాత్మల నుండి వేరుగా, ఈ వస్తువుల నుండి విడివడి, అజ్ఞానము వంటి సకల దోషములకు అతీతముగా, అంతులేని జ్ఞానానందములకు మూలస్థానమై  గుణరత్నాకరమై సమస్త చరాచరములకు తాను ఒక్కడే కారణమై సకల పదార్థాలకు అంతర్యామియై ఉన్నాడని  వేదాంతములు తెలియచేస్తున్నది .

             ఈ వాక్యంలో పరబ్రహ్మ అని ప్రధామావిభక్తిలో ఉంది కానీ ద్వితీయా విభక్తిలో లేదు. ఈ దృష్టితోనే ఈ పంక్తినిలోని పాదాలకు అర్థాలను చూడవలసి ఉంది.  ‘ అపరిమిత ఉదార గుణ సాగరం’ అన్న పదం తత్పురుష సమాసములో చూడకూడదు. ఎందుకంటే ‘గుణ సాగరః’  అన్న పదములో ‘సాగరం‘ అన్నది పుంలింగ ప్రయోగము. కావున ‘అపరిమిత ఉదార గుణ సాగరః’ అని వుండాలి. కానీ ఇక్కడ ‘గుణ సాగరం‘ అని నపుంసక లింగలో వుంది. అందువలన దీనిని తగిన బహువ్రీహి సమాసం ’ ‘అపరిమిత గుణ సాగరః  యస్య తత్’ అని కానీ  ‘అనంత  గుణ సాగరః యస్య తత్’  అని వుండాలి. శ్రుత ప్రకాశికాచార్యులు కూడా దీనిని బహువ్రిహిగానే స్వీకరించారు.

            ఈ రెండు విగ్రహవాఖ్యాలకు అర్థము మారుతుంది.  భగవంతుడే సముద్రము, నీటి సముద్రము కాదు. దివ్యగుణ సాగరము అని తత్పురుష సమాసార్థము. బహువ్రీహి  సమాసార్థములో గుణములే సాగరము, ఆ సముద్ర మంత గుణములు కలవాడు భగవంతుడు. రెండవ అర్థమే ఇక్కడ సరిపోతుంది.

            పలు సందర్భాలలో భగవంతుడు గుణసాగరంగా  వర్ణించబడటం జరిగింది. కానీ అయన గుణములను సముద్రంగా కొన్ని సందర్భాలలోనే చెప్పబడింది. ఆచార్యుల వ్యాఖ్యానాలలోను. రామానుజులవారి రచనలలోను మాత్రమే ఇలా వర్ణించబడింది.  ఎవరైనా ఆచార్యులు భగవంతుడి గుణములను సముద్రంతో  పోల్చివర్ణించారంటే వారు శ్రీవైష్ణవ ఆచార్య పరంపరకు చెందిన వారు అని బోధపడుతుంది.

        రామానుజులవారు దీనిని ఒక ఉదాహరణగా ఉపయోగించలేదు. వారు ఆళ్వార్ల శ్రీసూక్తులను  లోతుగా మదించినవారు. కావున వారు ఇలా రాయలేరు. పెరియ తిరువందాదిలో నమ్మాళ్వార్లు ‘మికుం తిరుమాల్ సీర్కడలై యుళ్ పోదిమ్డ సింద నైయేన్’  (69 ) అని అన్నారు. ఇందులో పరమాత్మ దివ్యగుణాలను సముద్ర ముతో పోలుస్తున్నారు. అగస్త్యులు ఉప్పు సముద్రాన్ని తాగారు. మేగాలు సముద్రపు నిరు తాగినట్లు  ఆళ్వార్లు ఆచార్యులు భగవంతుడి గుణముల సముద్రాన్ని తాగారు. ఈ విషయాన్ని తెలియజేయటం కోసమే స్వామి బహువ్రీహిని ప్రయోగించారు.

       

                 
నాథముని              ఆలవందార్లు                నమ్మాల్వార్లు        తిరుమంగై ఆళ్వారు

పెరియ వాచ్చాన్ పిళ్ళై

ఇక్కడ ఇలాంటిదే మరొక వివరణ కూడా చూదగినది. స్తోత్రరత్నంలో ఆళవందార్లు నాధమునులను ‘అగాధ  భగవద్భక్తి’ నాధమునుల భక్తి అగాధమైనదని చెప్పారు. ఇక్కడ నాధమునులే ‘భక్తిసముద్రమా?’  (తత్పు రుష) లేక భక్తి అనే సముద్రము కలవాడా? (బహువ్రీహి) అన్న ప్రశ్న ఉదయిస్తుంది. వ్యాఖ్యాన చక్రవర్తి పెరియ వాచ్చాన్ పిళ్ళై ఆళ్వార్ల మనసెరిగి బహువ్రీహిగానే నిర్వహించారు. దానికి వారు నమ్మాళ్వార్ల ‘కాదల్ కడలిన్ మిహ పెరిదు (ప్రేమ సముద్రము చాలా పెద్దది) ‘(తిరువాయిమోళి 7 -3 -6)  అన్న పాశురంలో తిరుమంగై ఆళ్వార్ల ‘ఆసై ఎన్నుం కడలిల్’ (ప్రేమ అనే సముద్రము)  (పెరియ తిరుమొళి 4-9-3) అన్న పాశురాన్ని ఉదాహరణగా చూపించారు. ఇది శ్రీవేదాంత దేశికులచే ఆదరించబడినది. వారు తమ వ్యాఖ్యానంలో ముందు తత్పురుష అర్థాన్ని తరువాత బహువ్రీహిని  చెప్పారు. ‘భక్తింవా సిందుత్వేన  రూపయిత్వాబహువ్రీహి’ భక్తిని ఒక సముద్రంలా వివరించారు.                 

అడియేన్ చూడామణి రామానుజ దాసి 

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/05/dramidopanishat-prabhava-sarvasvam-7/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 6

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 5

ఆళ్వార్లు – భగవద్రామానుజాచార్యలు – 2

 

పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ……

                     భగవద్గీత నాలుగవ అధ్యాయంలో ‘ పరిత్రాణాయ సాధూనాం..’ అన్న శ్లోకం ఉంది. దీని అర్థము సామాన్యులకు కూడా సులభంగా అర్థమవుతుంది. మంచిని రక్షించి చెడును తోగించి ధర్మమును స్థాపించటానికి  ప్రతి యుగంలోను అవతరిస్తాను అని పరమాత్మ చేతనులకు దృడంగా చెపుతున్నాడు.’ మంచి, రక్షణ ,నాశము , చెడు,ధర్మము  అన్న పదాలను ఇందులో అర్థం చేసుకోవలసిఉంది. వీటి అర్థాలను ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు చెప్పుకోవచ్చు. కాని భగవద్గీతలో ఏ అర్థంతో చెప్పారో తెలుసుకోవలసి వుంది. స్వామి 

రామానుజులు భగవద్గీత మొత్తం దృష్టిలో వుంచుకొని ఈ శ్లోకానికి అర్థం చెప్పారు.

 

‘సాధు జనులు ఎవరు?’

              కృష్ణుడిచే రక్షింపబడు  సాధు జనులు ఎవరు? అని తెలుసుకోవటం చాలా రసవత్తరమైన

12 ఆళ్వారులు

విషయము. స్వామి రామానుజులు ఈ విషయాన్ని వివరించేటప్పుడు అళ్వార్లను స్మరించారనడమే న్యాయంగా ఉంటుంది. వారు సాధు జనుల గురించి చెప్పేటప్పుడు అళ్వార్లకు సంబంధించిన పలు సుగుణాలను చెప్పారు.అవి , శ్రీవైష్ణవులకే కాక సామాన్యులకు కూడా తెలియజేయాలని భావించి చెప్పినవి.

 

గీతా భాష్యంలో స్వామి ఈరకంగా వివరించారు.

సాధువు: ఉక్తలక్షణము – ధర్మశీలా వైష్ణవాగ్రేసరాః మత్సమాశ్రయణే ప్రవృత్తాః మన్నామకర్మ-స్వరూపాణాం వాగ్మనసాగోచారతయా మద్దర్శనేన వినా స్వాత్మధారణపోషణాదికమలభమానాః క్షణమాత్రకాలం కల్పసహస్రం మన్వానాః ప్రశిథిల-సర్వ-గాత్రా భవేయురితి మత్స్వరూప చేష్టితావలోకనాలాపాదిదానేన తేషాం పరిత్రాణాయ!’

ధర్మశీలా—వారు నియమింపబడిన ధర్మాన్ని తమ అర్హతగా కలిగిఉన్నవారు. ” ధర్మ ” అనే ప్రయోగంలో  సాధారణ  ధర్మాన్ని స్వీకరించవచ్చు. లేక విశేష వైష్ణవ ధర్మాన్ని తెలియ జేసేదిగాను స్వీకరించవచ్చు’ అని ఉండటం వలన ముందు చెప్పిన అర్థము , తరవాత ‘ వైష్ణవాగ్రేసరాః ‘ అని ఉండటము వలన తరువాత చెప్పిన అర్థము కూడ అన్వయిస్తుంది.

వైష్ణవాగ్రేసరాః  — వీరు వైష్ణవులలో ప్రధములు. ఇదే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడిన విషయము. రామానుజ సంప్రదాయంలో ఆళ్వార్లే ఉన్నతమైన శ్రీవైష్ణవులుగా చెప్పబడ్డారు. వైష్ణవాగ్రేసరాః అన్న ప్రయోగం వారి ఉన్నతమైన స్థానాన్ని చూపిస్తుంది.

మత్సమాస్రయేణ పవిత్రాః —నన్నే ఆశ్రయించాలని తలచినవారు. ఇది ‘ తుయరఱు సుడరడి తొళుదెళు’, (దుఃఖాన్ని  తొలగదోసే ప్రకాశమానమైన శ్రీపాదాలు)   ‘ ఆళివణ్ణ నిన్ అడియిణైయై అడైందేన్ ‘ (మెఘవర్ణా నీ శ్రీపాదాలను చేరాను) వంటి ఆళ్వార్ల శ్రీసూక్తిగా చెప్పబడినవి.

మన్నామక్రమ స్వరూపాణాం వాగ్మనసాగోచరతయా —— ‘ఎన్ సొల్లిసొల్లుహేన్? ‘ (ఏమని చెప్పను)   ‘ నెంజాల్ నినైప్పరిదాల్ వెణ్ణెయై ఊణ్ ఎన్నుం ఈనచొల్లే’ (మనసులో స్మరించ లేనందున వెన్నను కూడా ఆహారం అని హీనమైన మాట) అని ఆళ్వార్లు పరమాత్మ దివ్య నామాలు, దివ్య చేష్టితాలు మనసును,  మాటను చిలికినవని గ్రహించినవారు.

మద్దర్శనేన వినా స్వాత్మధారణపోష్ణాదికమలభమానాః —–ఆళ్వార్లు  పరమాత్మను స్మరించకుండా, చూడకుండా తరింపలేరు. ‘ తొల్లై మాలై కణ్ణార కండు కళివదోర్ కాదలుఱ్ఱార్క్కుం ఉండో కణ్గళ్ తుంజుదలే ‘(పొద్దు మాపు కనులార కాంచి కరగిపోయాక ప్రేమించినవారికి కనులు వాలుతాయా!), ‘ కాణవారాయ్ ఎన్నెండ్రు కణ్ణుం వాయుం తువర్దు ‘ (కానరావా అని కళ్ళు నోరు తెరుచుకొని) అన్న పాశుర భాగాలలో ఈ విషయం స్పష్టమవుతుంది.

 క్షణమాత్రకాలంకల్పసహస్రం మన్వానాః—ప్రమాత్మను క్షణకాలమైనా వీడి వుండటాన్ని  ఆళ్వార్లు ఒక యుగకాలంగా భావిస్తారు. వారి మాటలలో ‘ ఒరు పగల్ ఆయిరం ఊళియాలో ‘(ఒక పగలు వేయి యుగాలు కావా)   ‘ ఊళియిల్ పెరిదాయ్ నాళికై ఎన్న్మ్’ (యుగమంత దీర్గమైన రోజు), ‘ఊయుం పొళిదిన్ఱి ఊళియాయ్ నీండదాల్ ‘ (వాలే పొద్దు యుగంలాగా దీర్గంగా) అన్న పాశురభాగాలను చూడవచ్చు.

 ప్రశితిల సర్వగాత్రాః—-పరమాత్మతో చెరినప్పుడు ఆళ్వార్ల తిరుమేని అలసి సొలసి పోయిందట. కలసినప్పుడు ఆనందం వలన అలసట, దూరమైనప్పుడు దుఃఖంతో సొలసి పోవటం. ‘కాలాళుం, నెంజళీయుం, కణ్ సుళలుం’ , ‘కాలుం ఎళా కణ్ణ నీరుం నిల్లా ఉడల్ సోర్దు నడుంగి కురల్ మేలుం ఎళా మయిర్కూచ్చమఱా ‘ , ‘ ఉళ్ళెళ్ళాం ఉరుక్కి కురల్తళుత్తుళిందేన్ ‘ , ‘ ఉరోమ కూపంగళాయ్కణ్ణ్నీర్గళ్ తుళ్ళ శోరత్తుయిలణై కొళ్ళేణ్ అని అన్నారు.

సంగ్రహంగా ‘ఒక సాధు వైష్ణవ గొష్టిలో నాయకులుగా ఉంటారు, ధర్మ పరిపాలనలో ప్రధములుగా, కృష్ణుడిగా నన్నే శరణమని తలచేవారు, నా నామాలు చేష్టితాలను దివ్యమైనవిగా, మనసులోను, మాటలోను నిండి వున్నవిగా భావించేవారు,  వీటి అనుభవము లేక పోతే తరించలేని వారు, నా స్వరూప స్వభావాన్ని తరించలేని వారు, నా వియోగాన్ని ఒక క్షణాన్ని యుగముగా భావించేవారు, సాదు వైష్ణవులు. పరమాత్మతో ఉన్న సంబంధము అంతరంగమైనదిగా భావిస్తారు.

          దయామయుడైన పరమాత్మ కృప చూపి దుఃఖాన్ని పోగొట్టడం కోసం యుగయుగాలుగా ఎన్నో అవతారాలనెత్తాడు, ఆయన తనను తన భక్తులకు చూపిస్తున్నాడు. వారికి తన దివ్య దర్శనాన్ని ఇచ్చి తన దివ్య చేష్టితాలను చూపి వారితో దగ్గరి సంబంధాన్ని నేర్పి ఉజ్జీవింపచేస్తాడు. దీనినే సాధు సమ్రక్షణం అంటారు.

ఈ వ్యాఖ్యానము యొక్క ముఖ్య ఉద్దేశ్యము:

                            ఈ వ్యాఖ్యానము భగవద్గీతలోని అంతరార్థాన్నిపోలి ఉన్నది .  అందువలన వైష్ణ వ తత్వానికి బయట ఉన్న వారికి కూడా స్వామి  వ్యాఖ్యానము కృష్ణుడి తత్వము సుబోధకంగా ఉంటుంది.

                   సాధు భక్తితో పాటు ఆళ్వార్ల తత్వాన్ని కూడా చెప్పడం వలన సామాన్యులకు కూడా అర్థమయ్యే ఒక ఉన్నతమైన  వ్యాఖ్యానంగా అమరింది .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/04/dramidopanishat-prabhava-sarvasvam-6/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

 

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 5

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 4

ఆళ్వార్లు – భగవద్రామానుజాచార్యలు – 1

                నంపెరుమాళ్ళు (శ్రీరంగంలో ఉత్సవ మూర్తులు)  స్వయంగా మన దర్శనానికి   ఎంమ్బెరుమానార్ దర్శనమని పేరు పెట్టినట్లు స్వామి మణవాళ మామునులు అన్నారు.

”  ఎంపెరుమానార్ దర్శనం ఎన్ఱే  నంపెరుమాళ్ పేరిట్టు నాట్టి వైత్తార్ “. శ్రీ వైష్ణవ సంప్రదాయములోను , బయట కూడా భక్తి ఉద్యమానికి రామానుజాచార్యులనే ఆద్యునిగా భావిస్తారు. కావున ద్రమిడోపనిషద్ అర్థాలను వీరి గ్రంధాల నుండే తెలుసుకోవలసి వుంది .

             కిందటి భాగాలలో   రామానుజాచార్యులను  దివ్య ప్రబంధ విద్యార్థిగా , అధ్యాపకులుగా,  ఆళ్వార్ల భక్తులుగా, శిష్య పరంపర ద్వారా ఈ సంప్రదాయ ప్రవర్తకులుగా చూశాము. ఇక ఆళ్వార్ల శ్రీసూక్తులకు, రామానుజాచార్యుల  శ్రీ సూక్తులకు ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని చూడ బోతున్నాము.

             రామానుజాచార్యుల గ్రంధాలు, వారి వ్యాఖ్యానాలు ప్రత్యేక శైలిని కలిగి వుంటాయి. పరమాత్మ గురించిన ప్రస్తావన వచ్చిన చోటల్లా ఆళ్వార్ల మార్గాన్నే అనుసరించారు. పరమాత్మ ఔన్నత్యము, పరస్వరూపము, కల్యాణగుణాలు, సుభాశ్రయము, దివ్యస్వభావము, మనోహరమైన స్వరూపము, దివ్య చేష్టితాలు, మొదలైన వాటిలో మునిగి పోయేవారు. ఏ ఒక్క సందర్భంలో కూడా ఈ అవకాశాన్ని వదులుకోలేదు. ఆ గ్రంధాలను చదివిన వారికి, విన్న వారికి తాను పొందిన అదే ఆనందానుభూతిని  కలుగజేసారు . ఆళ్వార్ల భక్తి పాఠశాలలో, రామానుజుల వారు పొందిన  పరమాత్మానుభవం కొంచెం కూడా వదుల కుండా తమ గ్రంధాలలో అనుగ్రహించారు . ఈ ఆత్మానుభవాన్ని కోరుకునేవాళ్ళు కనీసం శ్రీభాష్యం, గీతాభాష్యం, గద్యత్రయం మొదలైన వాటిని తప్పక సేవించాలి.

“ మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు

మామెవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః “

భగవద్గీత 9వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అన్నాడు.

 ‘ నీ మనసును నా మీద స్థిరముగా నిలుపు, నా భక్తుడుగా వుండు, నన్ను ఉపాసించు, నన్ను నమస్కరించు, నన్ను చేరుకోవటమే లక్ష్యముగా భావించు. నీ మనసును ఈ విధంగా కేంద్రీకరిస్తే నన్ను తప్పక చేరుకోగలవు.’ అని ఈ శ్లోకానికి అర్థం .

      ” మన్మనా భవ! ” అంటే నీ మనసును నా మీద స్థిరముగా నిలుపు అని అర్థము . ఈ మాటలు అతి సులభమైనవి . వీటిని శ్రీ మద్వాచార్యులు స్ప్రుసించనే లేదు. శ్రీ శంకరాచార్యులు मयि वासुदेवे मनः यस्य तव स त्वं मन्मना भव.  అని వ్యాఖ్యానించారు. ఇక్కడ ‘నన్ను’ అంటే వాసుదేవుడని అర్థము. నీ మనసును వాసుదేవుడైన నాపై నిలుపు అనివ్యాఖ్యానం చేశారు .

భగవద్రామానుజుల వారి వ్యాఖ్యానం కఠిన హృదయం కలవారిని కూడా ద్రవింప చేసే విధంగా వుంది.

मन्मना भव – मयि सर्वेश्वरे निखिलहेयप्रत्यनीककल्याणैकताने सर्वज्ञे सत्यसङ्कल्पे निखिलजगदेककारणे परस्मिन् ब्रह्मणि पुरुषोत्तमे पुण्डरीकदलामलायतेक्षणे स्वच्छनीलजीमूतसंकाशे युगपदुदितदिनकरसहस्रसदृशतेजसि लावण्यामृतमहोदधौ उदारपीवरचतुर्बाहौ अत्युज्ज्वलपीताम्बरे अमलकिरीटमकरकुण्डलहारकेयूरकटकभूषिते अपारकारुण्यसौशील्यसौन्दर्यमाधुर्यगाम्भीर्यौदार्यवात्सल्यजलधौ अनालोचितविशेषाशेषलोकशरण्ये सर्वस्वामिनि तैलधारावदविच्छेदेन निविष्टमना भव!

” మన్మనా భవ! “-మయి సర్వేశ్వరే నిఖిల హేయ ప్రత్యనీక కల్యణైకతానే సర్వజ్ఞే  సత్య సంకల్పే నిఖిలజగదేక కారణే పరస్మిన్ బ్రాహ్మణి పురుషోత్తమే పుండరీకదళామాలాయతేక్షణే స్వచ్చనీలజీమోతసంకాశే యుగాపదుదితదినకరసహస్రసదృశతేజసి లావణ్యామృతమహోదదౌ ఉదారపీవరచతుబ్రహౌ అత్యుజ్వలపీతామ్బరె అమలకిరీటమకరకుండలహారకేయూరకటకభూషితే అపారకారుణ్యసౌసీల్యసౌందర్యమాధుర్యగాంభీర్యదార్యవాత్సల్య జలధౌ  అనాలోచితవిశేషాశేషలోకశరణ్యయే సర్వస్వామిని తైలధారావదవిచ్చేదేన నివిష్టమనా భవ!“

           అర్జునుడిని కృష్ణుడు   ‘ఎల్లప్పుడు నన్నే స్మరించు, నన్నే ఆశ్రయించు, నా భక్తుడిగా ఉండు దాని వలన ఉన్నత ఫలితాన్ని పొందగలవు . అనగా పరమాత్మనే పొందగలవు ‘ అని చెపుతున్నాడు. ఇక్కడ పరమాత్మ మాటలను యధాతధంగా చెప్పటం తప్ప వ్యాఖ్యాత కొత్తగా చెప్పదగిన విషయం ఏమి ఉంటుంది ? అని ఒక వ్యాఖ్యాత అన్నారు. కాని స్వామి రామానుజులు మాత్రం ఇక్కడ భగవంతుని అనంత కళ్యాణగుణాలను వివరించారు. అర్జునుడిని యాంత్రికంగా తనను  ఆశ్రయించమని చెప్పాడా కృష్ణుడు? త్రికరణ శుద్ధిగా, ప్రేమతో ఆత్మార్పణ చేయమని చెప్పాడు కదా!  కృష్ణుడు ఎవరు? అయన దేవాదిదేవుడు, పరబ్రహ్మం , ఉన్నతమైన అందమైన , పవిత్రమైన , అద్భుతమైన, మొహనాకారుడు, పరమాత్మ కదా! అయినా సులభుడు , తన భక్తుల హృదయములను ఆనందములో ఓలలాడించగలవాడు . ఆయన తన శిష్యుడిని ఏవో అల్పమైన ప్రయోజనాల కోసం యుద్దం చేయమని చెపుతాడా?

                అర్జునిడికి ఈవిషయం స్పష్టంగా తెలుసు. రామానుజులు ఇక్కడ చక్కటి వివరణను ఇవ్వాలను కున్నారు . ఆళ్వార్ల మార్గంలో ప్రయాణించిన వారు , పరమాత్మ మీద అపారమైన ప్రేమ కలిగి ఉన్నవారు , ఆయననే కోరుకునేవారు, తమ హృదయమంతా పరమాత్మను నింపుకున్నవారు కదా!. కూరత్తాళ్వాన్లు ఈ విషయంగా రామానుజుల వారిని नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोह. (నిత్య మచ్యుత పదాంభుజ యుగ్మరుక్మ వ్యామోహ) అని వర్ణించారు. ఈ మాట అనగానే రామానుజుల హృదయం నుండి గట్టుతెగిన నదిలాగా ప్రేమ ప్రవాహం పొంగుతుంది. ఈ ప్రవాహమే వినేవారి, చదివేవారి పర్యంతం ప్రవహిస్తుంది. ఇదియే రామానుజుల కోరిక . ఏకకాలంలో స్వామి ఒక చక్కని వ్యాఖ్యాత , ఆచార్యులు, గొప్ప భక్తులు ….ఇలా పలు కోణాలను ఆయనలో చూడవచ్చు. ఆళ్వార్ల నోటి నుండి వెలువడిన ప్రేమ పూరితమైన వాక్కులు వినగానే  రామానుజుల వారి హృదయంలో అనంతమైన పరిణామాలు కలుగుతాయి.

సర్వేశ్వరుడనైన నాపై మనసును నిలుపు –

నాపై = ఎటువంటి కొరతలు లేని, సర్వ మంగళములకు మూలమైన , స్ప్రుహణీయ మైన కళ్యాణ గుణములు గల , సర్వ వ్యాపకుడైన, సత్య సంకల్పుడైన , మూలకారకుడైన, పర బ్రహంమైన , అరవిందలోచనుడైన , నీలజీమోత సన్నిభుడైన, తేజోమయుడైన , పితాంభరధారి అయిన , పలు ఆభరణాలు, కుండలము, హారము, కంకణము , భుజకీర్తులు, ధరించి అపారకారుణ్య గుణములతో కూడి అందరికి సులభుడైన నామీద నీ మనసును అవ్యవధానంగా నిలుపు అర్జునా!   అన్నాడు అని వివరించారు .

            ఈ వ్యాఖ్యానం వలన స్వామి రామానుజులు పరమాత్మ మీద భక్తి చేయవలసిన కారణాలను చక్కగా వివరించారు. పరమాత్మ మనోహర దివ్య రూపము, ఆయన ఔన్నత్యము, ఆనందమయమైన కళ్యాణ గుణములు భక్తుల హృదయాలను వశీకరిస్తున్నవి. ఆ ప్రవాహములో మునిగి కృష్ణతృష్ణలో ఆయనకు కైంకర్యం చేయటానికి మనసు తపించి పోతుంది. ఈ పంక్తులను విన్నా, చదివినా భక్తుల హృదయములు అసంకల్పితంగానే కృష్ణుభక్తిలో లీనమై ఆయన నోటి నుండి వెలువడిన గీతామృతంలో  ఓలలాడుతాయి అని రామానుజుల అభిమతం .

ఆళ్వార్ల నుండి లభించిన భక్తి సంపద రూపమే స్వామి రామానుజులు అని వేరే చెప్పవలసిన అవసరం లేదు. దీ నినే అముదనార్లు ఈ విధంగా వర్ణించారు.

பண்டருமாறன் பசுந்தமிழ் ஆனந்தம் பாய்மதமாய்

விண்டிட எங்களிராமானுச முனிவேழம்!

పన్దతరు మాఱన్ పశున్తమిழ் * ఆనందమ్ పాయ్ మదమాయ్

విణ్ డిడ * ఎఙగ్ళ్ ఇరామానుశ మునివేழమ్…….

கலிமிக்க செந்நெற்கழனிக்குறையல் கலைப்பெருமான் ஒலிமிக்க பாடலையுண்டு தன்னுள்ளம் தடித்து அதனால் வலிமிக்க சீயம் இராமானுசன்!

కలిమిక్క సేన్నేర్ కழనికురైయల్ కలైపెరుమాన్ ఒలిమిక్క పాడలైఉండు తన్నుళ్ళం తడిత్తు అదనాల్ వలిమిక్క సీయం ఇరామానుసన్ …….

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/03/dramidopanishat-prabhava-sarvasvam-5/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org