Author Archives: sarathyt

తత్త్వత్రయం – శ్రీ పిళ్ళైలోకాచార్యులు అనుగ్రహించిన తత్వ త్రయము గ్రంథ పరిచయము

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

మనము ఇంతవరకు అయిప్పసి (తులా మాసము) మాసములో అవతరించిన ఆళ్వారాచార్యుల దివ్యానుభవములను తెలుసుకుంటున్నాము. మరిన్ని వివరముల కొరకు https://srivaishnavagranthamstelugu.wordpress.com/thathva-thrayam/ లింక్ చూడవచ్చును. ఇప్పుడు మనము పరమ కారుణికులు,దివ్య వైభవము కలిగిన శ్రీపిళ్ళైలోకాచార్యుల గురించి మరియు వారు రచించిన చిన్న శ్రీభాష్యమైన “తత్వత్రయము” గ్రంథము, దానికి స్వామి మణవాళ మహామునులు అనుగ్రహించిన వ్యాఖ్యానావతారికను తెలుసుకుందాము.

ఎమ్బెరుమానార్, శ్రీపిళ్ళైలోకాచార్యులు, స్వామి మణవాళ మహామునులు -తిరుప్పవళ వణ్ణం దివ్య దేశం
“తత్వత్రయము” అను ఈ గ్రంథము “చిన్న శ్రీభాష్యము” గా మన సంప్రదాయములో ప్రసిద్ధి గాంచినది. శ్రీభాష్యకార బిరుదాంకితులైన భగవద్రామానుజులు బ్రహ్మ సూత్రములకు అద్భుతమైన, సరళమైన వ్యాఖ్యానమును అనుగ్రహించారు. ఆ వ్యాఖ్యానమే “శ్రీభాష్యము” గా సుప్రసిద్ధమైనది. విశిష్టాద్వైత సిద్ధాంతమునకు అవసరమైన అన్ని ప్రధాన ప్రమాణములు ఇందులో ఇమిడియున్నవి. అయితే శ్రీభాష్యము సంస్కృతములో ఉండుట చేత సంస్కృత భాషాప్రవేశము లేనివారికి శ్రీభాష్యమునందలి విషయములు తెలుసుకొనుటకు కష్టసాధ్యముగానుండెను. శ్రీపిళ్ళైలోకాచార్యులవారు శ్రీభాష్యము యొక్క సారమును “తత్వ త్రయము” అను గ్రంథములో పొందుపరిచి ద్రావిడ భాషలో సామాన్యులకు సైతం సులభముగా అర్థమగు రీతిలో రచించారు. ఈ గ్రంథములో వేదాంతమునందలి ప్రాథమిక విషయములైన చిత్తు, అచిత్తు, మరియు ఈశ్వరుడు అను మూడు విషయములగూర్చి విశదీకరించుట జరిగినది. తత్వత్రయం గ్రంథము యొక్క సారాంశము ఈ లింకులో చదువుకొనవచ్చును.

ఇక స్వామి మణవాళ మహామునులు ఈ గ్రంథమునకు అనుగ్రహించిన ఉపోద్ఘాతమును చూద్దాము

“అనాది మాయయా సుప్తః”అనునట్లు, అనంతకోటి సంవత్సరాలుగా ఎడతెగని ఈ కాలచక్రములో జీవుడు పంచభూతాత్మకమైన ఈ ప్రకృతి సంబంధము చేత కర్మలు ఆచరించుచూ వాటి వల్ల సంక్రమించే పుణ్య పాపముల ఫలితముగా జననమరణ చక్రములో పడి అలమటిస్తున్నాడు. అజ్ఞానమనెడి అంధకారంలో చిక్కుకున్న జీవుడు తాను వేరు ప్రక్రుతి వేరు అన్న సత్యమును (తెలిసినచో కేవలము భగవత్కళ్యాణ గుణములనే స్మరిస్తూ భగవంతుని అనుభవిస్తూ ఈ ప్రకృతిని విస్మరించెడివాడు) మరచి తానూ ప్రకృతిలో ఒకనిగా భావించి ఈ ప్రకృతినే అనుభవిస్తూ కాలము గడుపుతున్నాడు. అటువంటి అజ్ఞానముతో జీవుడు
 • “దేహోZహమ్, మనుష్యోహమ్”, నేను దేహిని, మనుష్యుడును – అనే మాయలో దేహము తానూ ఒకరే అని భ్రమపడుతున్నాడు.
 • “ఈశ్వరోZహమ్ అహం భోగి”, నేనే ఈశ్వరుడను, స్వతంత్రుడను – తానూ శరీరమూ వేరన్న భావము జీవునికి కలిగిననూ, తానే భగవంతుడనని భావించి, తాను స్వతంత్రుడనని భ్రమిస్తున్నాడు.
 • తాను పరతంత్రుడనని భావించిననూ, భగవంతుని సేవకుడైన జీవుడు, తగు భగవత్కైంకర్యములను చేయక ప్రాపంచిక భోగములలో మునిగి తేలుచున్నాడు.

“యోzన్యథా సంతమానం అన్యథా ప్రతిపద్యతే, కిమ్ తేన న కృతం పాపమ్ చోరేణాత్మాపహారినా”, జీవుడు తన యొక్క స్వరూపజ్ఞానమును (తాను భగవంతుని దాసుడనన్న సత్యమును) విస్మరించి ప్రాపంచిక కార్యకలాపములందు నిమగ్నుడగుట ఆత్మచౌర్యమే అవుతుంది. తనది కాని వస్తువైన ఆత్మను తనదిగా భావించి తనది కాని శరీరమునకు ఆత్మను ఆపాదించి అశాశ్వతమైన, కర్మప్రదమైన ప్రాపంచిక సుఖములనుభవించుట పాపములలోకెల్లా మహా పాపమైనదని దీని భావము.

“విచిత్ర దేహ సంపత్తిర్ ఈశ్వరాయ నివేదితుం, పూర్వమేవ కృతా బ్రహ్మన్ హస్తపాదాది సంయుతా”, అని చెప్పినట్లు పూర్వము ప్రళయ సముద్రమునందు విశ్వము గాఢాంధకారమైయుండి, సృష్టి చేయునపుడు, సర్వేశ్వరుడు తన యొక్క నిర్హేతుక కృప చేత అప్పటివరకు అస్థిత్వము లేని జీవునికి శరీరమును, ఇంద్రియములను ఇచ్చి వాటి ద్వారా తనకు దాస్యము చేసి తరించి చివరికి తన శ్రీచరణాలను చేరమని  ఆశీర్వదించెను.

శ్రీనమ్మాళ్వారులుశ్రీరంగనాథుని యందు జీవులను అనుక్షణం ప్రేమతో అనుగ్రహించెడి  “వ్యూహ సౌహార్ద్రత” అను కళ్యాణగుణమును బాగుగా అనుభవించియున్నారు.
తిరువాయిమొళి, 3.2.1 లో, “అన్నాళ్ నీ తంద అక్కైయిన్ వాళి ఉళల్వేన్” అని  చెప్పినట్టుగా, జీవుడు భగవదనుగ్రహము చేత పొందిన శరీరేంద్రియములను దుర్వినియోగపరుచుచూ భౌతికసుఖలోలుడై కాలము గడుపుచున్నాడు. నది దాటుటకు పడవను పొంది నది దాటకపోగా, ఆ పడవలో సముద్రములోనికి పోయి అలలాడినట్లు, ఈ జీవుడు పాంచభౌతిక శరీరమును తానేయని భ్రమించి స్వార్థపూరిత కర్మలు ఆచరించుచూ సంసారసాగరములో కొట్టుమిట్టాడుచున్నాడు. చేసిన కర్మల ఫలితముగా మరల మరల జన్మించుచూ తాపత్రయగ్రస్థుడై గర్భస్థ, జన్మ, కౌమార, యవ్వన, మరణ అనెడి దశలను గడిపి చేసిన పాప కర్మల ఫలితముగా నరకముననుభవించి, పుణ్య కర్మల ఫలితముగా ఉత్తమ జన్మలెత్తుతూ అలా పడుతూ లేస్తూ ఈ జననమరణ చక్రములో తిరుగుచున్నాడు. “ఏవం సంస్మృతి చక్రస్థే భ్రామ్యమాణే స్వకర్మభిః జీవే దుఃఖాకులే కృపా కాపి ఉపజాయతే “, అనునట్లు భగవానుడైన శ్రీమహావిష్ణువు జీవులపట్ల తనకుగల నిర్హేతుక కృప చేత జీవులను సంసారసాగరము నుంచి ఉద్ధరించుటకు అనేక అవతారాల ఎత్తి ధర్మ రక్షణ, శిష్ట రక్షణ చేస్తూనే ఉన్నాడు. “జాయమానమ్ యమ్ పశ్యేన్ మధుసూదనః సాత్విక స్సతు విజ్ఞేయః సవై మోక్షార్థ చిన్తకః”, జీవుడు తల్లి గర్భములో జనించునపుడు తాను ఎటుల తరించవలెనో తెలుసుకుని సత్యమైన జ్ఞానమును పొంది సాత్వికుడై విష్ణువును ఆశ్రయించి మెలిగినపుడే ముముక్షుత్వము సాధించినవాడు అవుతాడు.   

సత్యమైన నిజ జ్ఞానము పొందేందుకు రెండు దారులు కలవు : 1) శాస్త్రము 2) ఉపదేశము (ఆచార్యోపదేశముగా పొందేది )

శాస్త్రాధ్యయనము వలన కొన్ని ఇబ్బందులు కలవు,
 • “శాస్త్ర జ్ఞానం బహు క్లేశం “, అనునట్లు శాస్త్రాధ్యయనము బహు క్లిష్టతరమైనది. అందు విషయము అంత సులభముగా అవగతపడదు. పదములకు గల నానార్థముల వలన శాస్త్ర వాక్యాలకు వివిధములైన అర్థములు స్ఫురించి ఏ అర్థమును అన్వయించుకొనవలెనో తెలియక చివరికి అజ్ఞానావస్థలోనే మిగిలిపోయే ప్రమాదం కలదు.
 • ఒకవేళ అంత శ్రమను ఓర్చి శాస్త్రజ్ఞానము సొంతముగా పొందగోరిననేమి, “అనంత భారమ్ బహు వేదితవ్యం అల్పచ్చ కాలో బహవశ్చ విఘ్నా:”, అనునట్లు జీవుడు తనకు గల పరిమిత జీవిత కాలములో మరియు, పరిమితమైన బుద్ధి చేత అనంత సాగరమైన శాస్త్రమును తెలియగోరుట అసాధ్యమే అవుతుంది.
 • చివరగా జీవులలో ఆడవారు, శూద్రులు శాస్త్రాధ్యయనమునకు నిషిద్ధులు. అయితే ముముక్షుత్వమునకు వారు అర్హులు.

అయితే శాస్త్రాధ్యయనము చేసిన పెద్దలైన ఆచార్యులను ఆశ్రయించి వారి వద్ద శాస్త్రజ్ఞానమును ఉపదేశముగా పొందవచ్చును. దానికి ఎటువంటి ఆంక్షలు లేవు. శాస్త్రజ్ఞులైన గురువులు అపారమైన శాస్త్రజ్ఞానమును అవపోశన పెట్టినవారు గనుక శిష్యుని యొక్క బుద్ధి పరిమితులను బట్టి శిష్యుడు సుకరముగా తరించుటకు ఎంత జ్ఞానము అవసరమో అంతే ఉపదేశిస్తారు. ఏ భాషలో (అంటే అత్యంత క్లిష్టమైన భాషలో శాస్త్రమున్ననూ దానిని సంస్కరించి శిష్యునికి అర్థమగునట్లు లలితముగా చిన్న చిన్న పదాలతో ఆళ్వార్లు రచించిన పాశురముల వలె గురువు శాస్త్రార్థములను శిష్యునికి ఉపదేశిస్తాడు.) చెబితే శిష్యునికి అర్థమవుతుందో ఆ భాషలో గురువు ఉపదేశిస్తాడు.

అందువలన పరమ కారుణికులైన శ్రీపిళ్ళైలోకాచార్యులు వేదాంత శాస్త్రమును ఆసాంతం అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞులైననూ జీవుల పట్ల గల నిర్హేతుక కృప చేత అందరికీ అర్థమగునట్లు లలితమైన భాషలో వేదాంతమునకు మూల వస్తువులైన చిత్తు, అచిత్తు మరియు ఈశ్వరుడు అను మూడు విషయముల గూర్చి ఈ తత్వ త్రయమను గ్రంథమును రచించియున్నారు.
పూర్వాచార్యులైన నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్, మరియు పెరియ వాచ్చాన్ పిళ్ళై వంటివారు కూడా క్లిష్టతరమైన వేదాంతశాస్త్రమును సులభరీతిలో జనులకు అర్థమగునట్లు తమ గ్రంథములు ద్రావిడభాషలో రచించుటకు కారణం జీవులపట్ల తమకు గల నిర్హేతుక కృప మాత్రమే. ఎందుకంటే మన పూర్వాచార్యులు
 • అహంకార రహితులు
 • జీవుల పట్ల ఎల్లప్పుడూ అక్కర కలిగినవారు
 • ఎప్పుడూ తమ స్వార్ధము, గొప్పతనము చూసుకోనివారు

మరి ఇందరు ఆచార్యులు ఒకే విషయముపై ఇన్ని గ్రంథములు రచించుట ఎందులకు? ఒకరు రచించిన గ్రంథమునే మిగిలిన వారందరునూ ఒప్పుకొని అన్వయించవచ్చును కదా? దీనికి స్వామి మణవాళ మహామునులు అనుగ్రహించిన వివరణ చూద్దాము:

 • ఆళ్వార్లు ఏకకంఠులు (అంటే శరీరములు వేరువేరైననూ పాడిన పాశురములు ఒక్కటే), ఒకే విషయమగు భగవద్గుణానుభవము గురించి పన్నెండుగురు ఆళ్వార్లు ప్రతిపాదించుట చేత శరణాగతి సిద్ధాంతము మరింత స్థిరీకరించబడినది. ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధమందలి మూల వస్తువు శరణాగతి తత్వమే కదా.  అదే విధముగా పూర్వాచార్యులు కూడా ఏకకంఠులు అగుట చేత దుష్కరమైన వేదాంత తత్వమును వివిధ గ్రంథముల ద్వారా ఒకే విషయమును ఒకే విధముగా ఒక గ్రంథమునకు ఇంకొక గ్రంథము భావ వ్యత్యాసము లేకుండా అంగీకృతముగా నుండు విధమున అనుగ్రహించారు. అందుచేత సిద్ధాంత ప్రమాణములుగా ఈ గ్రంథములు విలసిల్లుచున్నవి.
 •  ఒక గ్రంథమున క్లుప్తముగా వివరించిన విషయము మరొక గ్రంథములో విస్తారముగా చెప్పియుండును. ఇందువలన ఒకదానికి మరొకటి సామరస్యముగానుండును.

ఇదే సూత్రము ఒకే ఆచార్యుడు రచించిన అనేక గ్రంథములకూ వర్తించును. ఒక గ్రంథమందు ప్రతిపాదించిన విషయములను మరొక గ్రంథము ఆదరించుచూ సమన్వయముగలవైయుండును.

శ్రీపిళ్ళైలోకాచార్యులు, స్వామి మణవాళ మహామునులు – శ్రీపెరుంబుదూరు

 

ఈ విధముగా పరమాద్భుతమైన తత్వత్రయ గ్రంథము యొక్క పరిచయము చెప్పబడినది. విశిష్టాద్వైత సిద్ధాంతమందలి క్లిష్టమైన వేదాంత సూత్రములు ఈ గ్రంథములో అత్యంత సులభతరంగా వివరించబడినవి. స్వామి మాణవాళ మహామునుల యొక్క వ్యాఖ్యానము ఈ గ్రంథమునకు మరింత వన్నె తెచ్చినది. ఈ గ్రంథము నిజానికి ఒక ఆచార్యుని ఆశ్రయించి వారి ముఖేన వినదగిన శాస్త్రము. ఆ అవకాశము లేని వారికి ఈ అనువాదం ఒక సుగమవారధిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. పరమకృపాపూర్ణులైన మన పూర్వాచార్యుల దివ్య శ్రీచరణాలను మనసా స్మరించి ఈ గ్రంథములోని మరిన్ని విషయాలను వచ్చే అధ్యాయాలలో తెలుసుకుందామ్!

మూలము : http://ponnadi.blogspot.in/2013/10/aippasi-anubhavam-pillai-lokacharyar-tattva-trayam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Advertisements

శ్రీమద్రామానుజుల 72 అపూర్వ వార్తలు

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

swamy-in-unjal

శ్రీమద్రామానుజుల 72 అపూర్వ వార్తలు

లీలా విభూతి నుండి నిత్య విభూతికి తరలి పోయే సమయములో ఆచార్యుల విషయములోను, తోటివారి విషయములోను, లోకములోను నడచుకొన వలసిని విధానము గురించి తమ శిష్యులకు చెప్పిన 72 అపూర్వ వార్తలు.

 1. మీ ఆచార్యుల పట్ల , శ్రీవైష్ణవుల పట్ల చూపే భక్తిలో భేదము పాటించ రాదు.
 2. ఆచార్యుల బోధనలను పరి పూర్ణముగా విశ్వసించాలి.
 3. ఇంద్రియములకు దాసులు కావద్దు.
 4. ఙ్ఞాన సముపార్జనతో ఆగిపోవద్దు.
 5. భగవంతుడి లీలను తెలిపే రచనలను చదవటములో ఆనందమును అనుభచండి.
 6. ఒక సారి మీ ఆచార్యులు ఙ్ఞానేత్రమును తెరిచిన తరువాత తిరిగి ఇంద్రియ భోగములకు దాసులు కాకండి.
 7. సుఖదుఃఖములను సమానముగా స్వీకరించండి.
 8. గంధము, పుషములు, సెంటు వంటి సువాసన ద్రవ్యములకు దాసులు కావద్దు.
 9. భాగవతుల కథలను, ఔన్నత్యములను, నిరంతరము స్మరించటము వలన భగవంతుడు మిమ్మల్ని తనవారిగా స్వీకరిస్తాడు.
 10. భాగవత కైంకర్యము చేసే వారి కంటే ఎవరూ ముందుగా భగవంతుడిని చేరుకోలేరనే విషయాన్ని మీ మనసులలో దృఢముగా చిత్రించుకోవాలి.
 11. అత్యంత ఙ్ఞాన వంతుడైనా, భగవంతుడికి, భాగవతులకు కైంకర్యము చేయక పోతే నాశము తప్పదు.
 12. శ్రీవైష్ణవుల జీవనము లౌకిక సంపదలు ఆర్జించటము కోసమని అనుకోవద్దు.
 13. పరమపదము చేరటమే లక్ష్యముగా జీవనము సాగించాలి.
 14. భాగవతులను పొరపాటున కూడా అమర్యాదగా పిలవరాదు.
 15. శ్రీవైష్ణవులను చూసిన మాత్రముననే నమస్కరించటము మరచిపోకండి.
 16. భగవంతుడి ముందు, భాగవతుల ముందు, పెద్దల ముందు విలాసముగా కూర్చో కూడదు.
 17. నిద్రించే సమయములో భగవంతుడివైపు, భాగవతులవైపు, గృహ దేవతవైపు కాళ్ళు చాచరాదు.
 18. నిద్ర లేవగానే గురుపరంపరను అనుసంధానము చేయాలి.
 19. భాగవత గోష్ఠి కనపడితే భగవంతుడి కన్నా ముందు భాగవతులకు నమస్కారము చేయాలి.
 20. భాగవత గోష్ఠిలో నామ సంకీర్తనమో, ప్రబంధ సేవో జరుగుతున్నప్పుడు భక్తితో నమస్కరించాలి. మధ్యన లేచి వెళ్ళరాదు. అది దోషాలన్నిటిలోను పద్ద దోషము.
 21. శ్రీవైష్ణవులు మిమ్మల్ని చూడటానికి వస్తుంటే మీరే ముందుగా ఎదురేగి ఆహ్వానించడము మరవకండి. వారు బయలుదేరి నపుడు కొంత దూరము కూడా వెళ్ళి సాగనంపండి. ఇలా చేయక పోవటము పాపము.
 22. శ్రీవైష్ణవుల ఎడ భక్తితో ప్రవర్తించండి. వారి కృప మీమీద ప్రసరించేదాకా వేచి ఉండండి. అందుకని తరచుగా వారి ఇళ్ళకు వెళ్ళటము, వారి పేరును మీపేరు ముందు చేర్చుకోవటము, జీవనము కోసము వారి మీద ఆధారపడటము లాంటి పనులు చేస్తే, అవి మీ స్తాయిని దిగజారుస్తాయి.
 23. కోవెలను, గోపురమును చూడగానే భక్తితో చేతులు జోడించండి.
 24. ఎంత అందముగా మలచబడ్డా వింత దేవుళ్ళవైపు చూడకండి.
 25. వింత దేవుళ్ళ చేష్టలను విని ఆశ్చర్య పోకండి.
 26. శ్రీవైష్ణవులు భగవత్, భాగవత, ఆచార్య గ్రంధములను సేవించే సమయములో వారితో వాదనకు దిగరాదు.
 27. శ్రీవైష్ణవుల నీడను దాటరాదు.
 28. మీ నీడను శ్రీవైష్ణవుల మీద పడనీయకండి.
 29. అపవిత్రమైన వాటిని తాకితే స్నానము చేయనిదే శ్రీవైష్ణవులను తాకరాదు.
 30. పేదవారైన శ్రీవైష్ణవులు మిమ్మల్ని ముందుగా నమస్కరించితే, వారిని తక్కువగా చూడవద్దు. అది పాపము.
 31. శ్రీవైష్ణవులు మిమ్మల్ని ముందుగా నమస్కరించి “దాసుడిని” అనగానే, మిమ్మల్ని మీరు గొప్పగా తలచ కూడదు.
 32. ఎవరైనా శ్రీవైష్ణవుల లోపాలు (అతి నిద్ర, సోమరి తనము, తక్కువ కులములో పుట్టి వుండటము….)తెలిసి వుంటే ఎవరిదగ్గర చెప్పరాదు. వారిలోని మంచిని మాత్రమే అందరితో పంచుకోవాలి.
 33. అనుకోకుండానైనా భగవంతుడికిగాని, భాగవతులకుగాని శ్రీపాదములను కడిగిన తీర్థమును వారి ముందే పంచుకోవద్దు.
 34. తత్వ త్రయము, మంత్ర త్రయము తెలియని వారి శ్రీపాద తీర్థమును ఎట్టి పరిస్తితులలోను తీసుకోరాదు.
 35. ఆచార్య శ్రీపాద తీర్థమును తీసుకోవటము ఎట్టి పరిస్తితులలోను మరువరాదు.
 36. మీ అంచనాలకు మించి భాగవతుల స్థాయికి ఎదగ వద్దు.
 37. నాస్తికుడిని పొరపాటున తాకినా వేంటనే భాగవతుల శ్రీపాద తీర్థముతో పవిత్ర స్నానము చేయాలి.
 38. ఙ్ఞాన, వైరాగ్య, భక్తి సంపన్నులు ఈ దేహమును ఒక వస్త్రముగా భావిస్తారు. అలాంటి వారికి కైంకర్యము చేయండి.
 39. వారి జన్మనిరూపణ చేయకుండా మీరు కైంకర్యము చేసి తరించటము కోసము వచ్చిన పవిత్రులుగా భావించండి.
 40. నాస్తికుల గృహములలో భగవంతుడి శ్రీపాద తీర్థము అయినా తీసుకోరాదు.
 41. నాస్తికుల గృహములలో భగవంతుడి విగ్రహాలకు పూజ చేయ రాదు.
 42. పవిత్ర స్థలములలో నాస్తికులున్నా భగవత్ప్రసాదము తీసుకోవచ్చు.
 43. శ్రీవైష్ణవులు భగవత్ప్రసాదము ఇచ్చినప్పుడు, ఉపవాస దినము అని నిరాకరించరాదు.
 44. భగవంతుడికి సమర్పించే ప్రసాదముల పవిత్రత కంటే దానిని స్వీకరించిన భగవంతుడు పరమ పవిత్రుడని తెలుసుకోవాలి.
 45. శ్రీవైష్ణవుల ముందు ఆత్మస్తుతి చేసుకోరాదు.
 46. ఇతరులను చిన్నబుచ్చ రాదు.
 47. ప్రతి క్షణము భగవత్, భాగవత కైంకర్యములో గడపాలి.
 48. రోజులో కొంతభాగము , కనీసము ఒక గంట అయినా ఆచార్య సూక్తులను చేప్పుకోవాలి.
 49. రోజూ ఆళ్వార్ల, ఆచార్యుల రచనలను చదవాలి.
 50. స్వార్థపరుల గొష్ఠిలో చేర రాదు.
 51. కపట శ్రీవైష్ణవ వేషధారుల గొష్ఠిలో చేర రాదు.
 52. పుకారులను, అపవాదులను మాట్లాడటము, ప్రచారము చేయటము చేయరాదు.
 53. ఇతర మతవాదులతో చేరి ,వాదించి పాపము పెంచుకోకుండా శ్రీవైష్ణవుల గొష్ఠిలో చేరండి.
 54. భగవత్, భాగవత దూషణ చేసేవారు లౌకికముగా ఎంత పెద్దవారైనా వారి వైపు చూపు తిప్పకండి.
 55. సత్యమును విశ్వసించే విషయములో ద్వైదీభావము గల మేధావులతో చేరకండి.
 56. మోక్షమునకు ప్రపత్తి కాక ఇతర మార్గాలను అవలంభించే వారితో చేరకండి.
 57. తత్వ త్రయము, మంత్ర త్రయములను విశ్వసించని వారితో చేరకండి.
 58. ఐశ్వర్యము, లౌకిక సుఖముల వెంట పరుగులు తీసేవారికి దూరముగా వుండండి. కలిగినంతలో భగవంతుడికి సమర్పించి సంతోషముగా జీవనము సాగించండి.
 59. శ్రీవైష్ణవులెవరైనా మీకు అపకారము చేసినా, అనాదరణ చేసినా, వారికి అపకారము చేయ తలపెట్టరాదు. ఆత్మ నిగ్రహము కలిగి వుండాలి.
 60. పరమపదములో చోటు కోరుకుంటే, శ్రీవైష్ణవుల నుండి లబ్ది పొందకండి.
 61. భగవతుడిని ప్రపత్తి చేసిన వారు, విధి, విధానములకు భంగము రాకుండా భాగవతులతో నడచుకుంటారు.
 62. భగవతుడికి సమర్పించే గంధము, పుష్పములు, తమలపాకులు, వస్త్రము, నీరు రుచి, వాసన చూడరాదు.
 63. భగవంతుడికి సమర్పించే ప్రసాదముల పవిత్రత కంటే దానిని స్వీకరించేవాడు పరమ పవిత్రుడని తెలుసుకోవాలి.
 64. ప్రసాదములు ఉత్తమ జన్మ, పవిత్ర జీవనము ఉన్న వారు తయారు చేస్తేనే తీసుకోవాలి.
 65. కంటికింపైన వన్నీ భగవతుడికి సమర్పించ రాదు.
 66. భగవతుడికి సమర్పించ తగిన పదార్థములుగా మన గ్రంధములలో పేర్కొనిన వాటిని మాత్రమే సమర్పించాలి.
 67. భగవతుడికి సమర్పించి ఆయన కటాక్షించిన, పదార్థములను స్వీకరించండి . కాని వాటీని భోగ వస్తువులుగా చూడ రాదు.
 68. శాస్త్రములలో తెలిపిన విధముగా కైంకర్యము చేయాలి.
 69. మంత్ర త్రయమును ధ్యానము చేయు విషయములో శ్రధ్ధ గౌరవము లేని వారికి, లౌకిక విషయములో శ్రధ్ధ గౌరవము అమితముగా కల వారికి ఆత్మహాని నిశ్చయము.
 70. భాగవత కైంకర్యము జీవిత లక్ష్యము కావాలి. వారికి అసంతృప్తి కలిగితే అది ఆత్మహాని హేతువవుతుంది.
 71. ఎవరైతే భగవతుడిని కేవలము రాతి విగ్రహముగాను, అచార్యులను సామాన్యునిగాను, సకల పాపాలను పోగొట్టే పవిత్ర జలములను సాధారణ నీరుగాను, పవిత్ర మంత్రములు కేవల శబ్దములనుగాను, భగవంతుడు ఎవరి కంటే గొప్పవాడు కాడని భావించే వాడు నరకములో ఉండే వాడని గుర్తించాలి.
 72. భగవంతుడే తానుగా కోరి ఒకరిచే పూజ చేయించుకుంటే వారు ఎంతో గొప్పవారు, సమర్దులు. వారి పట్ల అమర్యాదగా నడచుకోవడము గొప్ప పాపము. పర్యవసానము చాలా తీవ్రముగా వుంటుంది. అది భగవంతుడిని అవమాన పరచడమే అవుతుంది. వారి శ్రీపాద తీర్థము, భగవంతుడి శ్రీపాద తీర్థము కన్నా పవిత్రమైనది. ఆ విషయము మనసు నందు నిలుపుకొని సదా భాగవత సేవలో నిమగ్నమై వుండాలి.

ఆధారము: వైణవన్ కురల్

తెలుగు సేత చక్రవర్తుల చూడామణి

English translation Courtesy: vaiNavan kural magazine.

archived in https://srivaishnavagranthamstelugu.wordpress.com

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org