శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః
<< అచిత్తు: పదార్థము అనగా నేమి?
- గత అధ్యాయములో (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2018/04/24/thathva-thrayam-chith-who-am-i/ ), చిత్తు (జీవాత్మ) మరియు అచిత్తు (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/04/18/thathva-thrayam-achith-what-is-matter/ ) యొక్క తత్వముల తాలూకు వివరములను తెలుసుకొంటిమి!
- శ్రీ పిళ్ళై లోకాచార్యుల “తత్వత్రయం” అను ఈ గ్రంథమును శ్రీమణవాళ మహాముణుల యొక్క దివ్య వ్యాఖ్యాన సహితముగా చిదచిదీశ్వర తత్వముల యొక్క వైభవమును తెలుసుకొనుటకు సాగిస్తున్న మన ప్రయాణములో ఈ అధ్యాయములో సర్వ విశిష్టమైన ఈశ్వర తత్వమును గూర్చిన విషయములను తెలుసుకొందాం !!
పరిచయం
- ఈ అధ్యాయములో సర్వోన్నతమైన ఈశ్వర తత్వమును మరియు ఈశ్వరేతర తత్వములైన చిదచిత్తులతో వైశేషిక బేధమలను ఆమూలాగ్రముగా విశ్లేషించెదము!!
స్వరూపము – దాని నిజ తత్వము
- అశుభ గుణాలకు అతీతము – అనగా సృష్టిలోని అని మంగళకరమైన, శుభములైన పరిణామములు భగవంతుని యొక్క దివ్య కళ్యాణ గుణములే!
- భావాతీతుడు – అనగా కాలము (కాలాతీతుడు – భూతభవిష్యద్వర్తమాన కాలముల యందు ఉండెడివాడు), ప్రదేశము (సర్వాంతర్యామి – అన్ని ప్రదేశముల యందు తన ఉనికి కలిగి ఉండెడివాడు), వస్తువు (స్థావర, జంగమ, జడ, చరాచర వస్తువుల యందు ఆత్మగా ఉండెడివాడు)!
- అపార జ్ఞానమూర్తి, అనంత కరుణారసార్ణవుడు.
- అనేకములైన దివ్యకల్యాణ గుణములకు నిలయుడు, అఘటిత ఘటనా సమర్థుడు.
- సృష్టి స్థిత్యంత కార్యములను సమర్థముగా నిర్వహించెడివాడు.
- చతుర్విధ పురుషార్థముల ద్వారా చేతనుల చేత ఆశ్రయించబడేవాడు – అలాగే చేతనులకు చతుర్విధ పురుషార్థములను ఒసగే వాడు.
- చతుర్విధగాములు ఆశ్రయించెడివాడు – భగవద్గీత 7.6 లో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధముగా చతుర్విధగాములు: ఆర్తులు – సంసారములో అలమటించెడివారు, అర్ధార్ధులు – ప్రాపంచిక సుఖసంపదలను అర్థించెడివారు, జిజ్ఞాసువులు – మోక్షము అర్థించెడివారు; జ్ఞానులు – అర్థభావ రహిత స్థితిలో ఉండెడివారు.
- అనంత దివ్యరూపములు కలిగినవాడు
- శ్రీభూనీళాది దేవేరులకు ప్రాణసఖుడైనవాడు
జీవాత్మ ఎటుల శరీరాలు మార్చినను దాని యొక్క మూల తత్వము నశించదో అటులనే అన్ని జీవుల యందు అంతర్యామిగా ఉన్నప్పటికిన్నీ పరమాత్మ యొక్క మూల స్వరూపము చెక్కుచెదరదు!
- నిత్యము – ఎల్లపుడు ఉండెడివి
- అనంతము – పరిమితులకు అందనివి
- అనేకము – లెక్కించనలవి కానివి
- నిర్హేతుకము – కార్యకారణములతో తెలియనలవి కానివి
- నిర్మలము – లోపము చూపజాలనివి
- నిరుపమానము – సర్వతంత్ర స్వతంత్రుడైన ఈశ్వరుని యొక్క దివ్య కల్యాణ గుణములను వర్ణించుటకు ఉపమానములు దొరకవు
- వాత్సల్యము: ఈశ్వరుని శరణుజొచ్చిన శిష్టుల యెడ ప్రేమగా అనుకూలముగా ప్రవర్తించుట – వాత్సల్యములో తిరువెంకటనాథుని గొప్పగా చెప్పెదరు.
- సౌశీల్యము: ఎటువంటి ఆడంబరములు, భేషజములు లేక ఉన్నతులకు, కడువారికి కూడా అందేలాగ అందరి యెడ సమానమైన చిత్తముతో ప్రవర్తించుట – శ్రీ రామచంద్ర మూర్తి యొక్క కళ్యాణ గుణములలో సౌశీల్యము చెప్పుకోదగిన గుణము – అటు విభీషణునితో, హనుమంతునితో, ఇటు గుహునితో ఒకే విధమైన స్నేహనిరతి కలిగినవాడు శ్రీరాముడు.
- సౌలభ్యము: అందరికి సులభముగా దొరికేవాడు! శ్రీ కృష్ణ పరమాత్మకు ఈ గుణము బహు విశేషముగా వర్తిస్తుంది!
అలాగే మరికొన్ని విశేషమైన భగవద్గుణములు,
- మార్దవము: మృదుత్వము – శారీరకముగానూ, మానసికముగాను పరమాత్మ మృదు స్వభావి
- ఆర్జవము: యోగ్యత, పెద్దరికము, న్యాయమూర్తిత్వము
- దుష్టులు, అధర్మచారులైన వారిని నిర్జించగల శౌర్యము, వీర్యము కలవాడు!
- సర్వజ్ఞత్వము: సర్వ విషయముల యందు అవగాహన కలిగినవాడు
- శక్తి: సృష్టి యందలి అన్ని కార్యములను నడిపించగల శక్తి కలిగినవాడు
- బలము: విశ్వగమనానికి సహాయపడగల సామర్థ్యము బలము కలిగినవాడు
- ఐశ్వర్యము: సృష్టిని నియంత్రించ గలవాడు
- వీర్య: ప్రతి శక్తులను సమర్థవంతముగా ఎదుర్కొనగల సామర్థ్యము కలవాడు
- తేజస్సు: అపరిమితమైన ప్రకాశము కలిగినవాడు
భగవత్కళ్యాణగుణములు – వాటి ఉద్దేశ్యము
-
భగవంతుని యొక్క అనంతమైన కళ్యాణ గుణములకు ఉద్దేశ్యములు, లక్షణములు కలవు! అవి,
- భగవంతుని యొక్క జ్ఞానము తమను అజ్ఞానులలుగా భావించే వారికి సహాయపడుటకుకు
- భగవంతుని యొక్క శక్తి అతనిని ఆశ్రయించినవారిని రక్షించుటకు
- భగవంతుని యొక్క క్షమ తప్పు ఒప్పుకుని శరణని ఆశ్రయించినవారిని అనుగ్రహించుటకు
- భగవంతుని యొక్క కృప సంసార బాధలలో అలమటించుచున్నవారిని ఉద్ధరించుటకు
- భగవంతుని యొక్క వాత్సల్యము తెలియక చేసిన తప్పుల వలన తన భక్తులకు పడ్డ కర్మల నుంచి కాపాడుటకు
- భగవంతుని యొక్క శీలము అణగారిన కడజాతి వారి చెంత చేరుటకు
- భగవంతుని యొక్క ఆర్జవము తనను నమ్మని వారిని కూడా అనుగ్రహించుటకు
- భగవంతుని యొక్క మార్దవము తనను విడిచి ఉండలేని అమాయక భక్తులను ఊరడించుటకు
- భగవంతుని యొక్క సౌలభ్యము తన చెంతకి చేరలేని వారి చెంతకు తాను చేరి వారిని అనుగ్రహించుటకు
ఇలా భగవంతుని యొక్క కళ్యాణగుణములకు అనేక దివ్య లక్షణములు చెప్పవచ్చును!భగవంతుని దివ్య గుణముల యొక్క సాక్షాత్కారము- భగవంతుడు ఈ సంసారములో అలమటిస్తున్న తన భక్తులను ఉద్ధరించుటకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండును
- ఈశ్వరుడు ప్రారబ్ధపీడితులైన జీవులను ఉద్ధరించుటకు సహాయము చేస్తూండును
- ఈశ్వరుడు తనను శరణుజొచ్చిన వారి యొక్క జన్మ జ్ఞాన స్వభావ లక్షణములు గమనించక వెంటనే వారికి సహాయపడును.
- తనను తాను రక్షించుకోలేని లేక మరే విధమైన సహాయ సాధనము లేని దుర్భర జీవులను ఈశ్వరుడు పట్టించుకుని సహాయపడును.
- ఈశ్వరుడు జీవులను తనవైపు తిప్పుకొనుటకు దివ్య లీలలను ప్రదర్శించును. ఉదాహరణకు కృష్ణావతారములో శ్రీ కృష్ణ పరమాత్మ ప్రదర్శించిన అద్భుతమైన దివ్యలీలలు.
- ఈశ్వరుడు ఎల్లపుడు తనను జీవులకు అందుబాటులోనే ఉంచుతాడు.
- జీవులకు సహాయపడటమే వ్రతముగా కలిగి ఉంటాడు!
- ఈశ్వరుడు జీవుల నుంచి బదులు ఆశించక జీవులు వారి వారి తాహతిని బట్టి సమర్పించే చిన్న కానుకను కూడా స్వీకరించి వారికి అపరిమితమైన లాభమును చేకూరుస్తాడు!
- ఈశ్వరుడు తనను శరణు జొచ్చినవారికి ఐహిక సుఖ భోగముల లాలస తగ్గించి వారిని మోక్ష సాధనవైపు మనసును మరలుస్తాడు!
- ఈశ్వరుడు శరణాగతుడైన భక్తుడు చేసిన తెలిసి తెలియని పొరబాటులను తన భార్య శ్రీమహాలక్ష్మి ఎత్తి చూపిననూ తాను మాత్రం వాటిని విస్మరించి వాత్సల్యముతో క్షమించి రక్షిస్తాడు!
- ఈశ్వరుడు జీవులలో లోటుపాట్లను, పసి పిల్లల ఉచ్చిష్టములను తల్లి సహించినట్లుగా, సహిస్తాడు!
- తన శిష్టులు దూరమైతే వారికన్నా ఈశ్వరుడే ఎక్కువగా దుఃఖించును.
- ఆవు అప్పుడే పుట్టిన లేగదూడను సాకుటకు కోడె దూడలను దూరము పెట్టినట్లు, జీవుడు భగవంతునికి శరణాగతి చేసినచో అతనిని తన దేవేరులు, నిత్యసూరులకంటే మిన్నగా ఈశ్వరుడు ఆదరించి రక్షిస్తాడు!

మనకు కనిపించే ఈ సృష్టిలోని పిండాండము నుంచి బ్రహ్మాండము వరకు సృష్టి చేసినవాడు చతుర్ముఖ బ్రహ్మ ! ఈ చతుర్ముఖ బ్రహ్మను కూడా సృష్టించిన పరబ్రహ్మమే ఈశ్వరుడైన శ్రీ మహా విష్ణువు! ఇంకా,
- ఈశ్వరుడు ఈ చరాచర సృష్టికి కారణ భూతుడు.
- పదార్ధముల యొక్క మూల వస్తువులైన అణువులు సనాతనమని నమ్మలేము!
- ఒకవేళ విశ్వములో పదార్థము వలన జీవులు జీవులలో మూలకణములు సృష్టి కాబడినచో దానిని సృష్టించిన తత్వము ఒకటి ఉండవలెను!
- దేవతలలో బద్ధ చేతనులుగా చెప్పబడే బ్రహ్మ రుద్రాది ప్రభృతులు సృష్టి మొదలు పుట్టి ప్రలయ సమయమున భగవంతునిలోకి లీనమయ్యెదరను శాస్త్ర సత్యమును బట్టి వారునూ సనాతులు కాజాలరని తెలియుచున్నది!
- కనుక పై పదార్థములను దేవతలను లోకాలను సృష్టి చేసి స్థితి కూర్చి లయం చేసుకోగల మహోన్నత శక్తికి ఈశ్వరుడు అని పేరు!
- కనుక జగత్తుకు కారణ భూతుడైన శక్తి ఈశ్వరుడే! అయితే ఈ కారణత్వము భగవంతునికి అజ్ఞానము చేతనో లేక కర్మ చేతనో రాలేదు! అది ఒక కేవలం ఈశ్వరుని యొక్క సంకల్ప మాత్రము చేత జరుపబడిన సృష్టి కార్యము!!
- సృష్టి స్థితి లయములు భగవంతుని సంకల్ప పరిణామాలు! ఆ కార్యముల వల్ల భగవంతునికి ప్రయోజనము కానీ వాటి యందు నిమిత్తము కానీ లేక కర్మానుభవము కానీ ఉండదు! ఇదంతా కేవలం ఒక లీలగా భగవంతుడు చేయుచున్నాడు!
- భగవంతుని లీలామాత్రకమైన సృష్టి ప్రళయముతో ముగుస్తుంది! ఆటలాడుకొనుచున్న పిల్లలు ఇసుక కోట కట్టుకుని మరల ఆ కోటను చిదిమేసినట్లుగా భగవంతుడు లీలగా జగత్తును సృష్టి చేసి మరల తనలోకి లయమొనర్చుకొనును!
- భగవంతుడు తననే ఈ చరాచర సృష్టిగా మార్చుకొనును! కనుక సృష్టి యొక్క మూల పదార్ధం కూడా భగవంతుడే!
- కారణత్వములు మూడు: ఉపాధాన కారణత్వం (కార్యమునకు కావలసిన వస్తువు), నిమిత్త కారణత్వం (కార్యము చేయువాడు), సహకార కారణత్వం (కార్యసాధనలో ఉపకారములు): మట్టితో పాత్ర చేయునపుడు మన్ను ఉపాధానము, కుమ్మరివాడు నిమిత్తము మరియు తిరగలి యంత్రము సహకారము అగును-మట్టి పాత్ర నిర్మాణములో ఈ మూడు వస్తువులు కారణత్వము వహించును!
- జగత్కార్యమునకు తానూ కారణ భూతుడైయున్ననూ ఈశ్వరుని యొక్క సహజ స్వరూపము మార్పు చెందదు! అందుకని భగవంతునికి నిర్వికారుడని ఒక నామము కలదు!
- సాలీడు తన లాలాజలంతో దారములల్లి గూడుకొట్టుకుని మరల ఆ గూడును తానే మింగివేసినట్లు, భగవంతుడు తనలోని భాగమైన బ్రహ్మపదార్థము చేత చిదచిత్తులను సృష్టి చేసి మరల ప్రళయములో తనలోకి లయము చేసుకొనును!
సృష్టి – స్థితి – లయ
ఈశ్వరుడే కారణ భూతుడై ఈ మూడు కార్యములను నిర్వహించును! విశ్వసృష్టి శూన్య దశ నుంచి పంచ భూతముల వరకు తయారు చేసి జీవులను ప్రభవించి తానే అంతర్యామిగా వారిలో ప్రకాశించును!
- జడ పదార్థము నుంచి జీవ పదార్థమును ప్రభవింపజేయుట
- జీవాత్మలకు ఇంద్రియ సహితముగా శరీరమును కూర్చుట
- జీవులలో బుద్ధిని సృజించి పెంచుట
- సృష్టించిన జీవుల మనుగడకు తోడ్పడి వారిని అభివృద్ధి చేయుట!
- సర్వకాల సర్వావస్థల యందు తాను జీవునికి తోడుగా యుండి అనుకూల మనస్సును కలుగజేయుట – మొక్క పెంచునపుడు నీరు భూమి నుండి మొక్కలోకి ఎగబాకి ఎదుగుదలకు ఊతమిచ్చినట్లు ఈశ్వరుడు జీవుని ఎదుగులలో తోడ్పడును!
- ఋషుల చేత వేదము, ధర్మ శాస్త్రములు జీవులకు అందించుట – తద్వారా జీవుని బుద్ధిని ధర్మానువర్తిగా చేయుట
- తాను శ్రీ రామ కృష్ణాది అవతారాలు ఎత్తి జీవుల మధ్య తిరుగుతూ తాను ధర్మమును ధర్మశాస్త్రములను ఆచరించి జీవునికి చూపుట!
- జీవాత్మలు అథోగతి పాలు కాకుండా వారిని శాస్త్ర జ్ఞాన రూపమున రక్షించుట!
- వారిలో అంతర్యామిగా మనస్సాక్షిగా మారి సన్మార్గము చూపుట!
లయ (సంహారం)
- ధర్మ మూలము మరిచి అధర్మ మార్గమున చరించుచున్న జీవాత్మల వలన సృష్టి ఇబ్బంది పడుతున్న సమయమున సామూహిక కర్మానుభవ సాక్షిగా ప్రళయము జరుగును
- ప్రళయము జగత్తును స్థితి దశ నుంచి శూన్య దశకు చేర్చును.
- సంహారముగా ఈశ్వరుని అంతర్యామిగా చేర్చుకుని రుద్రుడు, అగ్ని, కాలము ప్రచోదన చేసి వినాశనమును కలిగించును.
- వినాశనము భగవంతుని యొక్క తమోగుణ రూపము.
- సృష్టి క్రమములో భగవంతుడు స్వాతంత్రుడై స్వయం నియంతృత్వముతో సృష్టి చేయును
- జీవులు వారి వారి కర్మ వాసనాలను బట్టి రకరకాల రూపములు దాల్చి సృష్టించబడుదురు! వారిలో సుఖపడువారు కొందరు దుఃఖపడువారు మరికొందరు! జీవుల కర్మ ఫలితములకు భగవంతడికి ఎటువంటి నిమిత్తము లేదు! (నమ్మాళ్వార్లు సాయించినట్లు తిరువాయ్మొళి 3.2.1)
- అనాది స్వరూపము
- సమమైనవి
- నిత్యమై సత్యమై నిజ జ్ఞానరూపకమైనది
- జీవుని బంధించిన శరీరము వలె కాక భగవంతుని రూపము అతని నిజ తత్వము చూపించునట్లుగా అపౌరుషేయమైనదై ఉండును
- మిక్కిలి ప్రకాశవంతమైనదై ఉండును
- అనంత దివ్య కల్యాణ గుణ మిళితమైయుండును
- ఋషులు తమ తపస్సులలో దర్శించనలవి కాని అద్భుతమై సత్వ గుణోపేతమై ఉండును
- ఏ రూపము దర్శిస్తే ఇక ప్రాపంచిక రుచులపట్ల ఆసక్తి సన్నగిల్లునో అట్టి మహోన్నతమైన దివ్య రూపము ఈశ్వర రూపము
- ముక్తాత్మలు, దివ్యసూరులు అనుక్షణం సేవించి దర్శించే దివ్యరూపము
- అన్ని బాధలను తొలగించునట్టి శక్తి కలది
- లీలావతారములకు మూలమైనది
- అన్ని తనలో ఇముడ్చుకున్నది! అన్నిటియందు తాను ఇమిడియున్నది!
- శంఖచక్రగదాపద్మాది దివ్యాయుధాభరణ ధరితమైనది!
అటువంటి భగవత్స్వరూపము అయిదు విధములుగా దర్శించవచ్చును,. అవి:
- పరత్వము: పరమపదము యందు ఉండెడి దివ్యరూపము (వైకుంఠనాథుడు, పరమపదనాథుడు)
- వ్యూహము: లోకాలలో కనిపించి సంచరించెడి రూపములు (ప్రద్యుమ్న, సంకర్షణాది రూపములు)
- విభవము: అవతార రూపములు (మత్స్యకూర్మాది దివ్యావతార రూపములు)
- అర్చ: స్వయంభువుగా లోకులు అర్చించుకొనుటకు ఏర్పడిన రూపములు (తిరుమల, శ్రీరంగేత్యాది దివ్యక్షేత్రములలో మూర్తులు)
- అంతర్యామి: చేతనాచేతన శరీరములలో మనస్సులోపలి హృద్పద్మమందు వెలసిన రూపము
- ఈ రూపములు క్లుప్తముగా ఇచట వర్ణించబడినవి: http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-parathvadhi.html.
పరత్వ రూప లక్షణము
- బ్రహ్మాండమునకు వెలుపల వెలసిన అనంతానంద నగరి పరమపదము! అనంతమైన దివ్య ప్రకాశముతో కాలాతీత నియమమున దివ్య సూరులు, ముక్తులు నివసించెడి పరబ్రహ్మలోకమది!
- సర్వత్రా మంగళకర శకునములతో ఆ పరమపద నగరము అలరారుచుండును
- అచట పరబ్రహ్మము పరవాసుదేవునిగా, అనంతగరుడవిశ్వక్సేనాది నిత్యసూరిగణముల దివ్య కైంకర్యములను స్వీకరిస్తూ, శ్రీభూనీలాది దేవేరీయుతుడై, అచట మణిమయ మండపము నందు కుర్మాసనముపై ఆదిశేషుడు సింహాసనమవగా, దానిమీద ధర్మ పీఠముపై కూర్చుని, దివ్యాన్గనలు చామరములు వీచుచుండగా సర్వాకాలంకార విభూషితుడై, పాదముల వద్ద వైనతేయుడు నిలుచుండగా, సర్వదివ్య కళ్యాణ గుణసమన్వితుడై, పరాత్పరుడిగా, పరత్వరూపుడైన శ్రీమన్నారాయణుడు తన భక్తులకు ప్రప్రన్నులకు అమితమైన సంతోషాన్ని కలిగించుట కొరకు పరమపదమందు సేవ శాయించును!

- పరవాసుదేవుడైన పరమపదనాథుడు వ్యూహ వాసుదేవునిగా రూపమును పొందును! ఈయనే క్షిరాబ్ధి నాథుడైన శ్రీ మహావిష్ణువు!
- భౌతిక లోకముల యొక్క పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించుట కొరకు శ్రీ మహాలక్ష్మితో కూడి పరమాత్మ పాల కడలిని రాజధానిగా చేసుకొని సృష్టి స్థితి లయములను కార్యములు నిర్వర్తించుచుండును!
- వ్యూహ వాసుదేవుడు సంకర్షణునిగా, ప్రద్యుమ్నునిగా, అనిరుద్ధునిగా మరో మూడు రూపములు దాల్చును!
- సంకర్షణుడు – జ్ఞానము, బలము అనే గుణములు కలిగి, జీవులయందు శరీరాత్మ భేదములు కలిగించుచుండును. వేదశాస్త్రముల యందలి జ్ఞానమునకు కారణభూతుడితడు! సంకర్షణుడే ప్రద్యుమ్నునిగా ఆవిర్భవించును!
- ప్రద్యుమ్నుడు – ఐశ్వర్యము, వీర్యమనే గుణములకు అధిపతి యితడు! శరీరియందు మనస్సును అధిష్టించి ఉండును! ధర్మాధర్మ విచక్షణ శరీరిలో ఉద్దీపించే శక్తే ప్రద్యుమ్నుడు! జీవులలో మంచి బుద్ధి కలిగించి సత్కర్మాచరణకు ప్రేరేపిస్తాడు! తద్వారా జగత్తులో ధర్మము నడిచే విధముగా చేసే శక్తి ఈ ప్రద్యుమ్నుడు! అంతే కాక జీవులను సృజించుట, వర్ణాశ్రమ ప్రక్రియలకు బాధ్యుడు కూడా ఈ ప్రద్యుమ్నుడే! ప్రద్యుమ్నుడు పిదప అనిరుద్ధునిగా రూపు దాల్చును!
- అనిరుద్ధుడు – అనిరుద్ధుడు కాలాన్ని నడిపించేవాడు! శక్తి, తేజస్సు ఇతని గుణములు! అలాగే జీవులలో సత్వరజస్తమో గుణములకు కారకుడు యితడు!

శ్రీమహావిష్ణువు యొక్క దశావతారలకు విభవ అవతారాలని పేరు. అయితే ఈ దశావతారాలే కాక ఇంకా ఎన్నో అవతారాలు కలవు. విభావావతారములను రెండు విధములుగా వర్గీకరించవచ్చును, అవి:
- ముఖ్యావతారములు:
- ఇవి శ్రీ రామకృష్ణాది దశావతారములు. భగవానుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థం తన స్వయం సంకల్పము చేత అవతరించేవి ముఖ్య అవతారములు.
- ముముక్షవులు ధ్యానించి ఉపాసించవలసిన అవతారములు ఇవి.
- భగవానుడు పరమపదంలో ఉండెడి తనయొక్క అపూర్వమైన గుణగణములను ఈ అవతారములలో తన కలిగియుండును.
- పరమపదములో భగవంతునికి ఉండెడి తేజస్సంపద అవతార సమయమందు కూడా కలిగియుండును.
- దీపమును వెలిగించిన అగ్గిపుల్ల కంటే దీపము మిక్కిలి ప్రకాశమానమై వెలిగినట్లు పరమపదమందలి భగవంతుని ప్రకాశవిశేషము మరింతగా ఈ ముఖ్యావతారములందు బయల్వెడును.
- గౌణావతారములు:
- భగవానుడు తానే స్వయముగా అవతరించిననూ అవతరించకపోయిననూ తన యొక్క శక్తి విశేషమును మరియొక జీవునియందు ప్రవేశపెట్టి లోక కళ్యాణమును తలపెట్టును.
- ప్రాపంచిక కార్యములు తలపెట్టుటకు అవతరించుట చేత గౌణావతారములు ముముక్షువులకు అంత ముఖ్యము కాదు.
- ఈ గౌణవతరములు రెండు విధములు, అవి:
- స్వరూపావేశం: భగవంతుడు తన యొక్క దివ్యమైన తేజస్సు ద్వారా జీవులను ఉత్తేజపరిచి భగవత్కార్యమును జరిపించుట. ఉదా: వ్యాస మహర్షి, పరశురాముడు, మొ||
- శక్త్యావేశం: భగవంతుడు తన యొక్క శక్తిని దివ్యాంశగా ప్రవేశపెట్టి జీవుల చేత కార్యములు చేయించుట. ఉదా: బ్రహ్మ రుద్రాది దేవతాంశలు
- భగవంతుడు ఎప్పుడు అవతరించినా పూర్తిగా తన యొక్క స్వయం సంకల్పం చేత అవతరించును.
- తాను అవతరించుటకు కారణమును భగవంతుడే గీతలో (4.8) చెప్పియున్నాడు, “పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ…. “. సాధువులైన తన యొక్క భక్తులను రక్షించుట కొరకు, దుష్ట బుద్ధులను వినాశన చేయుటకు మరియు ధర్మగ్లాని ఏర్పడ్డ ప్రతి సమయందు లోకమును సంస్కరించి ధర్మమును పునః ప్రతిష్ఠ కావించుటకు భగవంతుడు అవసరమైనపుడు అవతరించును.
- కొన్ని అవతారములలో భగవంతుడు మునులచేత శాపమును పొంది భూమియందు జీవునిగా అవతరించుట పురాణ కథలలో చూచెదము. అయితే అది కేవలం ఒక లీల మాత్రమే! ఇది ఒక రహస్యము! అసలు నిజము భగవంతుని యొక్క స్వతంత్ర సంకల్పమే!
అంతర్యామి
- జీవాత్మలందు నిర్హేతుక కృప కలిగిన భగవంతుడు జీవుల మనస్సులలో హృదయాంతర్వర్తియై అంతర్యామిగా కొలువుండును.
- ధ్యానము యోగము ద్వారా మోక్షసాధన చేయు ముముక్షువులకు మొదటగా స్వామి అంతర్యామిగా దర్శనమిచ్చును.
- ముముక్షువును సర్వకాల సర్వావస్థల యందు గమనించు మనస్సాక్షియే భగవంతుని యొక్క అంతర్యామి స్వరూపము.
- జీవుల హృదయ మందిరములో కొలువైన భగవంతుడు ఎల్లప్పుడూ జీవులను రక్షిస్తూ ఉండును.
అర్చావతారము
- పరవ్యూహవిభవాది అవతారములలో భగవంతుడు దేశకాల ధర్మాది పరిమితులకు లోబడి చరించును.
- అయితే, పొయిగైయాళ్వారు ముదల్ తిరువదందాది, 44 వ పాశురములో కీర్తించినట్లుగా అర్చావతారములలో భగవంతుడు భక్తులు కోరుకున్న చోట, కోరుకున్న విధముగా కొలువై ఉండును.
- ఆలయములో విగ్రహరూపములో వేంచేసి ఉండే దివ్యమూర్తికి అర్చావతారం అని నామము.
- భగవంతుని అర్చావతారములు ఆళ్వార్లు మంగళాశాసనము చేసినవి 108 దివ్యదేశములు
- ఇవే కాక భగవద్, ఆచార్యాభిమాన క్షేత్రములు, మానవ నిర్మితములైన రకరకాల ఆలయములలో రకరాకల రూపములలో (శయన, ఉపవిష్ట, ఉత్తిష్ఠ భంగిమలలో) భగవంతుడు సేవ శాయించును.
- అర్చావతారములో, మిగిలిన అవతారములలో ఉన్న అన్ని దివ్యలక్షణములు ఉండును. అవి సౌశీల్య, సౌలభ్య, వాత్సల్య గుణవిశేషములు.
- అర్చావతారములో భగవంతుడు భక్తుని యొక్క దోషములన్నిటిని క్షమించి మిక్కిలి అనుగ్రహదృష్టి చేత భక్తుని కైంకర్యములను స్వీకరించును.
- భక్తుడు వేదవిహితమైన ఆగమ పద్ధతులలో షోడశోపచారములతో భగవంతుని సేవించుకొనవలెను.
- అర్చావతారము యొక్క పరిపూర్ణ వివరము:
- అర్చా విగ్రహ రూపములో భగవంతుడు భక్తునికి తన అమేయమైన వైభవము యొక్క రుచిని చూపించును
- జన్మ కర్మ జ్ఞాన వివక్ష లేకుండా అర్చారూపము అందరి జీవులకు నెలవగును
- భగవంతుని యొక్క దివ్య గుణానుభవమును అర్చావతార మూలముగా ముముక్షువులు పొందవచ్చును. పూర్వము ఆళ్వారాచార్యులందరూ అర్చా రూపమైన పరమాత్మను సేవించి తరించినవారే! (ఆళ్వారాచార్య వైభవము ఈ క్రింది లింకులో చదవవచ్చును. http://ponnadi.blogspot.in/p/archavathara-anubhavam.html)
- భగవంతుడు సర్వతంత్ర స్వతంత్రుడైననూ, సర్వ జీవ కోటికి ఆధార భూతుడైననూ, అర్చా రూపమైన విగ్రహరూపములో భక్తుల చేత ఉపచారములు స్వీకరించుచు భక్త పరాధీనుడై ఉండును.
- అయిననూ తన యొక్క నిర్హేతుక కృప చేత, భక్తుల యెడ అమితమైన కరుణ చేత భగవంతుడు విగ్రహరూపుడై మన చెంతనే ఉండి అమితమైన వాత్సల్యముతో మనము తెలిసి తెలియక చేసేది అపచారములను క్షమించి మన ఐహిక కామ్యములను ఈడేర్చును.
ముగింపు
అత్యంత సంక్లిష్టమైన, మర్మగర్భమైన చిదచిదీశ్వర తత్వములను తెలిపే “తత్వ త్రయము” అనే గ్రంథమును స్థాళీపులాక న్యాయముగా చూచితిమి!శ్రీ పిళ్ళై లోకాచార్యులు అనుగ్రహించిన “కుట్టి భాష్యము” గా కీర్తింపబడే ఈ గ్రంథమునకు శ్రీమణవాళ మహాముణులు అనుగ్రహించి వ్యాఖ్యానములో మరిన్ని లోతైన అర్థములు, వివరణలు కలవు. అయిననూ మన శక్తి కొలది ఈ దివ్య గ్రంథమును తెలుసుకొనుటకు మనకు శక్తిని ఆసక్తిని ఒసగిన పూర్వాచార్యులకు, ఆళ్వార్లకు శ్రీ శ్రీయ: పతులకు పల్లాండు పాడెదము! వారు అనుగ్రహించిన ఇటువంటి అద్వితీయమైన గ్రంథముల కన్నను వేరు సంపద లేదు మనకు!

దాసునికి ఈ తత్వత్రయం గ్రంథమును పరిచయము చేసి దాని అర్థమును వివరించిన శ్రీ ఉ. వే. ప్రతివాది భయంకరం సంపత్ స్వామికి సదా రుణపడి ఉందును!
“శ్రీమతే రమ్యజామాతృ మునింద్రాయ మహాత్మనే
శ్రీరంగ వాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్య మంగళమ్ ”
మంగళాశాసన పరై: మదాచార్య పురోగమై:
సర్వైశ్చ పూర్వైరాచార్యై: సత్కృతాయాస్తు మంగళమ్
మూలము: http://ponnadi.blogspot.com/2013/03/thathva-thrayam-iswara-who-is-god.html
పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org