Category Archives: charamOpAya nirNayam

చరమోపాయ నిర్ణయం – అనుబంధము-సింహావలోకనము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< ముగింపు

చరమోపాయ నిర్ణయం అనెడి ఈ గ్రంథములో గత అధ్యాయాలలో చూచిన అనేక విషయములను సంక్షిప్తముగా సింహావలోకనము చేసుకుందాం :

 • నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై తమ గురువులైన పెరియ వాచ్చాన్ పిళ్ళైని కీర్తించి వారి అనుగ్రహము చేత ఈ గ్రంథము చేయుట జరిగినది. జగదాచార్యులైన శ్రీరామానుజుల దివ్యగుణవైభవమును చెబుతూ వారి అనుగ్రహమే శ్రీవైష్ణవులను తమ చరమ గమ్యమైన పరమపదమునకు కొనిపోవుటకు హేతువు అన్న సత్యమును ప్రధాన భూమికగా చేసి ఈ గ్రంథము చెప్పటం జరిగినది.
 • ఆచార్య రత్నమాలలో ఎమ్బెరుమానార్లు మధ్యలో ప్రకాశించెడి అద్వితీయమైన వజ్రముగా చెప్పబడుచున్నారు.
 • స్వానువృత్తి మరియు కృపామాత్ర ప్రసన్నాచార్యుల తత్వములు ఈ గ్రంథములో వివరించిరి. అందులో ఎమ్బెరుమానార్లు కృపామాత్ర ప్రసన్నాచార్యులుగా జగదోద్ధారకులుగా చెప్పబడినారు.
 • ఎమ్బెరుమానార్ల తిరుముడి సంబంధము చెప్పబడినది.
 • “పొలిగ!పొలిగ!” అను పాశురము ద్వారా నమ్మాళ్వార్లు శ్రీరామానుజుల భవిష్యదవతారము గూర్చి చెప్పటమే కాక నాథమునులకు స్వప్నములో భవిష్యదాచార్యుని రూపములో దర్శనమిచ్చి నిజరూపములో భవిష్యదాచార్య విగ్రహమును చెక్కించి ఇచ్చి అనుగ్రహించారు!
 • నాథమునులు ఆ భవిష్యదాచార్య విగ్రహమును ఉయ్యక్కోండార్ కు అనుగ్రహించారు!
 • ఉయ్యక్కోండార్ల నుంచి ఆ విగ్రహము మణక్కాల్ నంబికి దక్కినది!
 • మణక్కాల్ నంబి ఆ విగ్రహమును మరియు పారంపర్యముగా భవిష్యదాచార్య అవతారము గూర్చి వచ్చెడి రహస్య విషయములను ఆళవందార్లకు అనుగ్రహించారు!
 • ఆళవందార్లు ఇళయాళ్వారును తమ తరువాత శ్రీవైష్ణవ ధర్మప్రవక్తకులుగా అనుగ్రహించి ఆశీర్వదించిరి!
 • ఆళవందార్లు భవిష్యదాచార్య విగ్రహమును తత్సంబంధిత రహస్యములను తిరుక్కోష్టియూర్ నంబికి అనుగ్రహించారు!
 • తమ వంశములో ఒక శ్రీవైష్ణవుడు జన్మించుటచే పితృదేవతలు ఎలా సంతోషపడతారో అలాగే శ్రీరామానుజుల మునుపు అవతరించిన ఆచార్యులందరూ శ్రీరామానుజులు ప్రపన్నకులములో అవతరించుట చేత పరమ సంతోషపడిరి!
 • భగవానుడు, నమ్మాళ్వార్లు, ఎమ్బెరుమానార్లు ఉత్తారకాచార్యులుగా నిరూపింపబడిరి! అందులో ముఖ్యముగా ఎమ్బెరుమానార్ల యొక్క ఉత్తారకత్వము పరమ విశేషముగా వివరింపబడినది!
 • ఎమ్బెరుమానార్ల ఆచార్యపంచకమైన పెరియ నంబి, పెరియ తిరుమల నంబి, తిరుక్కోష్టియూర్ నంబి, తిరువరంగ పెరుమాళ్ అరయర్, తిరుమాలైయాణ్డాన్ తమ ఉపదేశముల ద్వారా ఇతర అనుభవముల ద్వారా ఎమ్బెరుమానారే ఉత్తారకులుగా నమ్మి తమ పిల్లలను సైతం ఎమ్బెరుమానార్లకు శిష్యులుగా చేసినారు!
 • తిరుక్కచ్చి నంబి ద్వారా వరదరాజ పెరుమాళ్ళు ఎమ్బెరుమానార్ల గొప్పతనమును లోకానికి చాటినారు! ఎలాగైతే పెరుమాళ్ళు రామకృష్ణాది అవతారములలో విశ్వామిత్ర, సాందీపని మొదలగు మహర్షుల వద్ద విద్య నేర్చుకున్నారో ఎమ్బెరుమానార్లు కూడా తమ అవతారములో భాగంగానే ఆళవందార్ల శిష్యులను ఆచార్యులుగా స్వీకరించి వారి వద్ద విద్య నేర్చినారని వరదరాజ పెరుమాళ్ళు చెప్పినారు!
 • వేదవేదాంతములకు వక్రభాష్యములు చెప్పి భగవత్తత్వమును పక్కదారి పట్టించిన అద్వైతమును మరియు వేదమును వ్యతిరేకించిన శూన్య మాయావాదుల సిద్ధాంతములను ఖండించి వేదాంతమునకు సరియైన భాష్యము చెప్పి పరమాత్మ అస్తిత్వాన్ని కాపాడిన ఎమ్బెరుమానార్లే నిజమైన ఉత్తారకాచార్యులు! కనుక వారిని ఆశ్రయించుటలో మనకు ఎటువంటి సందేహము అవసరంలేదు! ఎందుకంటే భగవంతునికే ఉత్తారకాచార్యుడు శ్రీఎమ్బెరుమానార్లు కనుక!
 • ఎమ్బెరుమానార్ల అవతార రహస్యము బహిర్గతము చేయటమైనది! వారి అసలు రూపము నిత్యసూరులకు నాయకుడైన ఆదిశేషుడని తిరుమాళిరుంశోలై అళగర్, క్షీరాబ్ది నాధుడు, సరస్వతి మరియు తామే పలు సందర్భాలలో చెప్పినట్టు ఐతిహ్యములు చెప్పబడినవి!
 • దేవ పెరుమాళ్, నమ్మాళ్వార్, కూరత్తాళ్వాన్ మొదలగువారి మూలముగా ఉడయవర్ల గొప్పతనము చెప్పటం జరిగినది! ఎమ్బెరుమానార్ల పట్ల శిష్యులకు ఉన్న ప్రేమాతిశయము ఎటువంటిదంటే వారి పరమపద వార్త విని ఎంతోమంది శిష్యులు తత్క్షణమే ప్రాణము విడిచి వారూ పరమపదము చేరిరి!
 • శ్రీరామానుజుల ఉత్తారకత్వము ఎవ్వరెవ్వరి చేత నిరూపింపబడినదంటే:
  • పలు సందర్భాలలో వారే చెప్పుకొనుట
  • అరుళాళ పెరుమాళ్ ఎమ్బెరుమానార్
  • తిరువేంగడముడైయాన్
  • తిరుక్కురుంగుడి నంబి
  • నడాదూర్ అమ్మాళ్
  • సోమాసియాణ్డాన్
  • కణియనూర్ సిరియాచ్చాన్
  • పొన్నాచ్చియార్  (పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ గారి భార్య )
 • ఆళవందార్లకు నాథమునుల మీద మరియు ఎమ్బెరుమానార్ల మీద గల ప్రేమాతిశయము వివరించడం జరిగినది! ఆళవందార్లు ఎమ్బెరుమానార్ల ఉత్తారకత్వమును ప్రతిపాదించుట చెప్పటం జరిగినది!
 • ప్రథమపర్వ నిష్ఠ కన్నా చరమపర్వ నిష్టకున్న గొప్పతనమును వివరంచటం జరిగినది!
 • శ్రీరామానుజుల ఉత్తారకత్వమును ప్రతిపాదించిన వారు:
 • చివరిగా తిరువరంగత్తు అముదనార్లు “ఇరామానుశ నుత్తన్దాది ” గ్రంథములో చెప్పిన చరమోపాయ నిష్ఠుడు పాటించవలసిన ధర్మ సూత్రములు:
  • ఎమ్బెరుమానార్ల యొక్క భక్తుల సన్నిధే మన పెన్నిధి!
  • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్యగుణానుభవమే మన నిత్యవిధి!
  • ఎమ్బెరుమానార్ల గొప్పతనమును కీర్తించనివారి సాంగత్యమును విసర్జించవలెను!
  • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్య నామ సంకీర్తనమే (రామానుజ! భాష్యకారా! ఎతిరాజా! ఉడయవరే! ఎమ్బెరుమానారే!) మన జిహ్వకు ఉద్యోగము!
  • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్యరూపమే మనకు ధ్యాన చిత్రము!
  • ప్రేమ భావముతో ఎమ్బెరుమానార్ల యొక్క భక్తులకు సేవ చేయాలి!
  • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్యమంగళ విగ్రహముతో ఆత్మ సంబంధము కలిగివుండాలి !
  • ఎమ్బెరుమానార్ల యొక్క శ్రీచరణాలపై పెట్టిన నమ్మకమే వారి సన్నిధికి మనలను చేరుస్తుంది! అనుమానము శాశ్వత సంసారములోనికి పడదోస్తుంది!

నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం

పెరియ వాచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం

ఆళ్వార్, ఎమ్బెరుమానార్, జీయర్ తిరువడిగళే శరణం

జీయర్ తిరువడిగళే శరణం

 

— అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము :   https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-summary-of-events.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Advertisements

చరమోపాయ నిర్ణయం – ముగింపు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 3

గత మూడు అధ్యాయాలలో జగదాచార్యులైన ఎమ్బెరుమానార్ల యొక్క ఉత్తారకత్వమును అనుభవించియున్నాము! ఇక ఇంత అద్భుతమైన గ్రంథము యొక్క ముగింపు చూద్దాము!

(గమనిక : ఈ ముగింపు భాగము తిరువరఙ్గత్తాముదనార్లు రచించిన “ఇరామానుశ నూత్తన్దాది” అను ప్రబంధమును ఆధారముగా చేసుకొని చెప్పడం జరుగుతున్నది! అముదనార్లుకు ఉడయవర్లపై గల అసాధారణ మరియు నిరుపమాన భావానుభూతులు ఈ ప్రబంధము ద్వారా మనం తెలుసుకొనవచ్చును! ఈ ప్రబంధమును నాలాయిరప్రబంధములలో చేర్చవలెనని మరియు తిరువీధులలో స్వామి పురప్పాడు (ఊరెరిగింపు) జరుగునపుడు ఈ ప్రబంధమును ఆచార్యపురుషులు అనుసంధించవలెనని సాక్షాత్తు శ్రీరంగనాధుడే (నమ్పెరుమాళ్) ఆజ్ఞ చేసాడు! దీని వలన భగవంతునికి కూడా ఈ ప్రబంధము పట్ల ఉన్న అభిమానము స్పష్టమగుచున్నది! ఈ ప్రబంధమునకు “ప్రపన్న గాయత్రి” అని పేరు! ఈ ప్రబంధమును స్త్రీ పురుష వర్ణ వయో భేదములు లేక రామానుజ దాసులైన వారెల్లరూ గాయత్రి అనుష్టానము వలె దీన్ని అనుసంధించుకోవచ్చునని ఆర్యోక్తి !! అంటే గాయత్రి ఎంత జపిస్తే అంత శక్తిమంతమో ఈ ప్రబంధము కూడా ప్రపన్నులైన రామానుజ దాసులకు ఎంత పాడుకుంటే అంత రామానుజ కటాక్షము!!

జగదాచార్యులైన స్వామి రామానుజులు -శ్రీపెరుంబుదూరు

 

గతములో తెలుసుకున్నట్లు ఎమ్బెరుమానార్లే జగదాచార్యులు, ఉత్తారకాచార్యులు! ఉడయవర్లు ఈ ఘోర కలిలో సామాన్య జనులకు  సైతం మోక్షార్హత కల్పించి వారిని సంసారము నుండి కాపాడి సద్గతులనిచ్చు ఒక ప్రత్యేక అవతారముగా వచ్చినటువంటి పరమ ప్రేమైకమూర్తి! వారి శ్రీచరణాలే పరమమని నమ్మి జీవించెడి చరమపర్వనిష్ఠులైన శ్రీవైష్ణవులకు నిస్సందేహముగా వారే ఉపాయము మరియు ఉపేయమున్నూ!

 • 105వ పాశురములో చెప్పినట్లు, “ఇరామానుసనై తొళుమ్ పెరియోర్ ఎళుందిరైత్తాడుమ్ ఇడం అడియేనుక్కు ఇరుప్పిడమే- పెద్దలైన శ్రీవైష్ణవులు ఎక్కడైతే రామానుజుల దివ్యవైభవాన్ని గానం చేస్తారో అక్కడే నాకు స్థానమ “, అని చెప్పినట్లు ప్రపన్నులు ఉండదగిన చోటు రామానుజ వైభవము కీర్తించెడి పెద్దల సాంగత్యములోనే.
 • 94వ పాశురములో “ఉవందరుందేన్ అవన్ సీర్ అన్ఱి యానోన్ఱుమ్ ఉళ్ మగిళ్ న్దే – రామానుజుల వైభవ కీర్తనము తప్ప మరేదీ మనసులో నిలుపజాలను”, అని చెప్పినట్లు చేయవలసిన కార్యము నిరతము రామానుజ దివ్యగుణ కీర్తనమే! ఇదే అర్థము 2వ పాశురములో కూడా ధ్వనిస్తుంది, “ఇరామానుశన్ మిక్క సీలమల్లాల్ ఉళ్ళాదు ఎన్నెన్జు – రామానుజ తత్వముపై తప్ప తక్కిన విషయములపై నిలువదు నా మనసు ” ! కనుక చరమాధికారుల (ఆచార్య నిష్టులు) పరమ గమ్యము రామానుజుల దివ్యగుణ స్మరణమే!
 • 15వ పాశురములో చెప్పినట్లు, “ఇరామానుసన్ తన్ పిరంగియశీర్ సారా మనిసరై చ్చేరేన్ ఎనక్కెన్న తాళ్వినైయే – రామానుజుల దివ్యగుణములను అనుభవించని మనుష్యులతో చేరను! వారితో నాకేమి లాభము? “, అని చెప్పినట్లు రామానుజ గుణానుభవము చేయని వారి సాంగత్యమును విసర్జించవలెను! “అటువంటి వారితో చేరకపోవుట చేత నాకెటువంటి నష్టము లేదు!” అని అముదనార్లు పాశురములో చెప్పుటచే, “రామానుజ గుణానుభవత్యక్తుల సాంగత్యము మనకు నష్టమును కలిగించును”, అని అర్థము చేసుకొనవలెను! దీనివలన స్వరూప నాశనము జరుగునని రూఢి అగుచున్నది!
 • 28వ పాశురములో, “ఇరామానుశన్ పుగళ్ అన్ఱి యెన్ వాయ్ కొంజిప్పరవగిల్లాదు – రామానుజుల గుణవైభవ కీర్తనము తప్ప నా నోరు పక్క దారి పట్టి ఎగురలేదు! ” అని చెప్పినట్లు ఎల్లప్పుడూ రామానుజుల గుణానుభవ కీర్తనమే జిహ్వకు ఉద్యోగముగా చేయవలెనని అర్థము!
 • 35వ పాశురములో చెప్పిన విధముగా, “ఇరామానుశన్ మన్ను మామలర్ తాళ్ అయరేన్ – రామానుజుల దివ్యచరణ కమలాలను ఎన్నటికీ మరువను”, అనునట్లు సదా రామానుజుల చరణసరోజములను ధ్యానమందు నిలుపుకొనవలెనని అర్థము! ఎందుకంటే ఆ చరణములు సకలపాప హరణములు! అంతర్బాహ్య శుద్ధి కరణములు ! వాటిని ఎన్నటికీ మరువరాదు!
 • 107వ పాశురములో, “ఉన్ తొండర్గట్కె అన్బుత్తిరుక్కుమ్ బడి ఎన్నై యాక్కి అంగాట్పడుత్తే – నీ దాసులయందు ప్రియము కల్గి ఉండునట్లు నను నీవే చేసి అనుగ్రహించుము “, అని చెప్పినట్లు చరమపర్వ నిష్టుల కర్తవ్యము (స్వరూపము) రామానుజుల దాసులైన శ్రీవైష్ణవుల పట్ల అభిమానము కలిగి వారి యెడల సేవాభావముతో జీవించుట!
 • 104వ పాశురములో చెప్పినట్లు, “ఉందన్ మెయ్యిల్ పిరంగియ శీర్అన్ఱి వేణ్డిలన్ యాన్….. ఇవ్వరుళ్ నీ సెయ్యిల్ తరిప్పన్ ఇరామానుసా – నీ దివ్యమంగళ విగ్రహ సందర్శనము తప్ప వేరేదీ కోరేవాడను కాను – అది నాకు అనుగ్రహిస్తే తరిస్తాను”, అని చెప్పినట్లు రామానుజుల దివ్యమంగళ విగ్రహమును సందర్శనమే మనస్సుకు పరమౌషధముగా భావించవలెను!
 • 80వ పాశురములో, “ఇరామానుశన్ తిరునామం నమ్బవల్లార్ తిరత్తై ….శైయ్వన్ సోర్విన్ఱియే – రామానుజుల తిరునామము జపించెడి ఉత్తములైన శ్రీవైష్ణవులను మనసా వాచా కర్మణా సేవిస్తాను”, అని చెప్పినట్లు రామానుజ ధ్యానపరాయణులైన శ్రీవైష్ణవ శిఖామణులను ఎల్లపుడు సేవిస్తూ వారికి మనసా వాచా కర్మణా సేవ చేయవలెను! మరియు 46వ పాశురములో, “ఇరామానుశన్ తిరునామమ్ నమ్బిక్కల్లార్ అకలిడత్తోర్ ఎదు పేరెన్ఱు కామిప్పరే – రామానుజుల తిరునామము నమ్మని వారికి ఈ లోకములో ఏది గతియని చూపించండి చూద్దాం?”, అని చెప్పుటలో రామానుజులను నమ్మని మూఢులకు లోకములో మోక్షము కొరకు వేరు గతి ఉండదని తెలుసుకోవాలి!

 

కూరత్తాళ్వార్లను సేవించెడి తిరువరఙ్గత్తాముదనార్లు – అముదనార్లు కూరత్తాళ్వార్ల వద్ద సమాశ్రయణము రామానుజసంబంధమును పొందారు

అముదనార్లు ఈ అద్వితీయమైన ప్రబంధమును శ్రీరామానుజులు వేంచేసి ఉన్న కాలములోనే రచించి గానము చేసినారు! శ్రీరామానుజుల చేత మరియు నంబెరుమాళ్ళయిన శ్రీరంగనాథుని చేత ఆమోదించబడిన ఈ గ్రంథములో చెప్పిన చరమపర్వస్థ నియమాలు సూత్రాలు నిస్సందేహముగా పాటించదగినవని పూర్వాచార్యుల ఉవాచ! ఎందుకంటే :

సత్యం సత్యం పునస్సత్యం యతిరాజో జగద్గురుః !

స ఏవ సర్వలోకానామ్ ఉద్ధర్తా నాత్ర సంశయః !!

అర్థము : సత్యం! సత్యం! మరల సత్యం ! యతిరాజులే జగద్గురువులు ! వారే సర్వలోకులను ఉద్ధరించగలరు ! ఇందులో సందేహములేదు!

ఇరామానుశన్ మన్ను మామలర్ తాళ్ పొరుందానిలై యుడై ప్పున్మయిలోర్కు

ఒన్ఱుమ్ నన్మై శెయ్యా ప్పెరుందేవరై ప్పరవుమ్ పెరియోర్ తమ్ కళల్ పిడిత్తే  – 62వ పాశురము

అర్థము – రామానుజుల శ్రీచరణాలను ఆశ్రయించని దుర్మార్గులకు కొంచెము కూడా సహాయపడని గొప్ప దేవతలైన పెద్దల శ్రీచరణాలను ఆశ్రయిస్తాను!

చరమోపాయ నిర్ణయము ముగిసినది !!

నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం

పెరియ వాచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం

ఆళ్వార్, ఎమ్బెరుమానార్, జీయర్ తిరువడిగళే శరణం

జీయర్ తిరువడిగళే శరణం

మదాచార్య తిరువడిగళే శరణం

— అడియేన్ శ్రీనివాస రామానుజదాసన్

మూలము:   https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-conclusion.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 3

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 2

గత అధ్యాయములో  (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/12/01/charamopaya-nirnayam-ramanujar-our-saviour-2/) భగవద్రామానుజుల ఉత్తారకత్వ ప్రభావము పెద్దలు పొందిన కొన్ని అనుభవాల మూలముగా తెలుసుకున్నాము! ఇక ఈ అధ్యాయములో స్వామివారి ఉత్తారకత్వ వైభవమును మరి కొన్ని ఐతిహ్యముల ద్వారా తెలుసుకుందాము!!

 

ఒకనాటి రాత్రి ఎంబార్ భగవద్గుణానుభవము గావిస్తూ తిరువీధులలో నడుస్తూ ఉండగా భట్టర్ వారిని సమీపించి అంజలి ఘటించి, “ద్వివిధములైన ఆచార్యత్వము (స్వానువృత్తి ప్రసన్నాచార్యత్వము, కృపామాత్ర ప్రసన్నాచార్యత్వము) మరియు తద్విషయస్వీకారత్వమున్ను (స్వగత స్వీకారము, పరగత స్వీకారము) ద్వివిధములై ఉన్నందున ఎందులో చరించవలెనో దేవరవారే అనుగ్రహించవలసింది!”, అని ప్రార్థించగా ఎంబార్, “కృపామాత్ర ప్రసన్నాచార్యత్వము, పరగత స్వీకారమే ఉత్తమమైన మార్గములు! అవి ఉడయవర్ల విషయములో మెండుగా ఉన్నవని మేము గ్రహించితిమి! మీరు కూడా మిమ్ములను శ్రీరంగనాధుడు తమ పుత్రునిగా స్వీకరించాడని, పరమ భక్తిజ్ఞానవైరాగ్య సంపన్నులైన కూరత్తాళ్వాన్ పుత్రుడనని, సకల విద్యాపారంగతుడనన్న అహంకారము ఇత్యాది జాడ్యములను దరి చేరనీయక మా వలె ఉడయవర్లే ఉత్తారకులుగా నమ్మి వారి వద్ద ఉత్తారకప్రతిపత్తి చేయండి! “, అని బదులిచ్చెను!

భట్టర్ నంజీయరుకు తిరువాయిమొళి వ్యాఖ్యానమును కాలక్షేపమును అనుగ్రహించినపుడు “प्रत्यक्षे गुरवस्स्तुत्याः – ప్రత్యక్షములో ఆచార్యులు స్తుతించదగినవారు”, అను విధముగా నంజీయర్ భట్టర్ ను పలువిధములుగా స్తుతించి, “దాసుని శిరస్సుపై దేవరవారి శ్రీచరణాలనుంచి దాసుని అనుగ్రహించి తరింపచేయండి!”, అని ప్రార్థించగా భట్టర్ అటులనే ఏకాంతముగా నంజీయర్ శిరస్సుకు తమ పాదస్పర్శనము చేసి ఇటులనిరి, “ఈ పాదాలు కాదు మీరు శరణు వేడవలసింది! ఆచార్య కటాక్షముపై మీకు నమ్మకము కలుగచేయుట కొరకే మేమెటులచేసితిమి! మీకు, మాకు, మిగిలినవారందరికి ఉడయవర్లే ఉత్తారకులు! వారే జీవులకు చరమోపాయము! ఈ సత్యమును మనస్సులో ఉంచుకుని తదేకనిష్ఠులై జీవించండి! లేకపోతే నిత్యసంసారిగా మిగిలిపోతారు జాగ్రత్త!” దీనివల్ల మనకు తెలియునదేమనగా ఉడయవర్ల శ్రీచరణాలను ఆశ్రయించుటయే ఉజ్జీవనమునకు హేతువు! మిగిలినవి ఉజ్జీవకములుగా భావించుట అజ్ఞానము!

ఈ అర్థమును అముదనారు “ఇరామానుశ నుత్తన్దాది”లో చక్కగా అనుగ్రహించారు!

పొయ్యై చ్చురక్కుమ్ పొరుళై త్తురందు
ఇంద ప్పూదలత్తే మెయ్యై పురుక్కుమ్ ఇరామానుశన్ నిర్క
వేఱు నమ్మై ఉయ్యక్కొళ్ళవల్ల దైవ మిన్గు యాదెన్ఱు ఉలర్న్దు
అవమే అయ్యప్పడానిఱ్పర్ వైయ్యత్తుళ్ళోర్ నల్లఱి విళిన్దే! – 79వ పాశురము

భావము – అసత్య ప్రచారములు (వేదమును అంగీకరించని మతాలు) చేయు బాహ్యములను, మరియు కుదృష్టులను (వేదమును అంగీకరించియును తప్పుడు అర్థమును బోధించెడి మతములు) రూపు మాపి జనులకు నిజమైన జ్ఞానమును అందించుటకు శ్రీరామానుజులు సిద్ధముగా ఉండగా ఈ లోకులు ఎందులకు వేరే దైవము వచ్చి తమను ఉద్ధరిస్తుందని ఎదురు చూస్తారు?

అని చెప్పడం చేత ఉడయవర్ల తరువాత జనులను ఉజ్జీవింపజేసేది ఇక భగవానుడే! అయితే చరమపర్వమగు ఉడయవర్లు వేంచేసి ఉండగా, ప్రథమపర్వమగు భగవంతుని ఆశ్రయించుట అజ్ఞానకార్యమగును! మనవద్దకొచ్చిన చరమపర్వమును విడిచిపెట్టి విప్రకృష్టమగు ప్రథమపర్వమును పట్టుకొనుట అజ్ఞానమే కదా!

ఎట్ట ఇరుంద కురవై ఇఱై ఎన్ఱు అన్ఱు విట్టు
ఓర్ పరనై విరుప్పురుతల్
పొట్టనైత్తన్ కణ్ సెంబళిత్తు కై తుఱత్తి నీర్ తూవి
అంబుదత్తై పార్తిరుప్పాన్ అన్ఱు -జ్ఞాన సారము – 33వ పాశురము

భావము – తనకు చేరువనున్న గురువును కాదని ఎక్కడో మనకు కనపడని దూరములోనున్న దైవమును ప్రార్థించుట ఎటులన్న దాహముగొన్నపుడు దరిలో నీరుండగా ఆకాశముకేసి చూసి వానకై నిరీక్షించినట్టు ఉండును!
అని దృష్టాంత సహితముగా అరుళాళప్పెరుమాళ్ ఎమ్బెరుమానార్ అనుగ్రహించారు కదా!

(గమనిక – ఈ పాశురమును వ్యాఖ్యానించు సమయములో స్వామి మణవాళ మహామునులు ఒక శ్లోకము చెప్పియున్నారు! అది “चक्षुर्गम्यं गुरुं त्यक्त्वा शस्त्रगम्यं तु यस्स्मरेत् ! करहस्तम् उदकम् त्यक्त्वा का नस्थम् अभिवाञ्चति !!” మహామునులు జ్ఞానసారము యొక్క గొప్పతనమును అవతారికలో అద్భుతముగా చెప్పియున్నారు! గ్రంథకర్త అయిన అరుళాళ ప్పెరుమాళ్ ఎమ్బెరుమానార్ ఉడయవర్లకు ప్రత్యక్షంగా శుశ్రూష చేసి వారి వద్ద నేర్చుకున్న అత్యంత క్లిష్టతరమైన చరమోపాయమును బహు సులభముగా సామాన్యులకు అర్థమగునట్లు చిన్న చిన్న ఉదాహారణలతో విశదీకరించియున్నారు!)

“చరమపర్వమునకు తగనివాడు ప్రథమపర్వమునకు కూడా తగడు! “, అని వంగిపురత్తు నంబిగారి సూక్తి! తదీయశేషత్వజ్ఞానము లేనివాడికి తచ్చేషత్వ జ్ఞానము కూడా లేకుండా ఉండును! భగద్విషయము నందు జ్ఞానము లేనివాడు దాన్ని పొందుటకు ఆచార్యుని ఆశ్రయించవలెను! ఆచార్యాభిమాననిష్ఠుడు ప్రథమపర్వమందు తలదూర్చడు! ఆచార్యాభిమానము కోల్పోయినవాడు భగవద్కృతమైన స్వరూప సంకోచమును పొందుతాడు! ఈశ్వరాభిమానమును కోల్పోయినవాడు ఆచార్యాభిమానమందు ఒదిగి ఉండవలెను! చరమోపాయనిష్ఠునకు ఈశ్వరాభిమానము అవసరంలేదని ఇక్కడ చెప్పవచ్చు ! దీనిబట్టి చెప్పవచ్ఛేదేమిటంటే ఉడయవర్ల అభిమానము పొందనివానిని ఈశ్వరుడు కూడా విడిచిపెడతాడు! ప్రథమపర్వమైన ఈశ్వరుడు దోషదర్శనము చేత చేతనుని విడిచిపెడతాడు! కానీ, చరమపర్వమైన ఆచార్యుడు, అనగా, ఉడయవర్లు మాత్రం విడిచిపెట్టరు! ఉడయవర్ల శ్రీచరణ సంబంధము పొందాక ఇక సద్గతి కొరకు భగవంతుని ప్రార్థన చేయనక్కరలేదు కదా- అని అర్థము! “తేవు మత్తఱియేన్ మేవినేన్ అవన్ పొన్నడి మెయిమ్మయే – వేరొక దైవమెరుగను ! శ్రీశఠకోపుల బంగారు పాదములాశ్రయించాను (కణ్ణినుణ్-2)” అనువిధముగా జీవించినట్లైతే సద్గతి తప్పక కలుగును కదా! ఎందుకంటే ఆశ్రయించెడి చరణాలు “పొన్నడి – బంగారు పాదాలు” కనుక! ఈ విధముగా అన్ని ప్రకారములుగా అందరికి ఉత్తారకులు ఉడయవర్లే కనుక కొరత చెందే పనిలేదు ! అటువంటి ఉడయవర్ల యొక్క అభిమానమును మనసారా పొందనివారు నిత్యసంసారులుగానే మిగిలిపోతారు!

ఉడయవర్ల శ్రీచరణాలు ఆశ్రయించినవారు వారి తిరునామమును నిత్యమూ స్మరించుకోవాలి! అముదనార్లు ఉడయవర్ల యొక్క తిరునామము యొక్క గొప్పతనమును వారి యొక్క శ్రీచరణకమల ప్రావణ్య జనకముగా ఈ విధముగా చెప్పియున్నారు, “ఇరామానుశన్ చరణారవిందం నామ్ మన్ని వాళ నెంజే! సొల్లువోమ్ అవన్ నామంగళే! -ఇరామానుశ -1” అని చెబుతూ, “నామ్ మన్ని వాళ  అవన్ నామంగళే సొల్లువోమ్!” అని చెప్పుట వలన ఉడయవర్ల యొక్క నామజపము చేయని యెడల వారి యందు భక్తితో జీవించలేమని అర్థము! వారిని ఆశ్రయించి జీవిస్తున్నట్లైతే శ్రీరామానుజ నామస్మరణ అనుసంధించవలెనని అదే వారి శ్రీపాదకమలాల యందు ప్రావణ్యమును పెంపొందింపజేయగలదని అర్థము! ఈ విధముగా ఉడయవర్ల తిరునామమును అనుసంధించుకొనుచు వారి శ్రీచరణాలను ఆశ్రయించినవారికి ప్రాప్యప్రాపకములు రెండూ వారే కదా! “పేఱొన్ఱు మత్తిల్లై నిన్ చరణన్నిఅప్పేఱళిత్తర్కు యారొన్ఱుమిల్లై మత్త చ్చరణన్ని- ప్రాప్యము ఏది లేదు నీ శ్రీచరణాలు తప్ప! ఆ ప్రాప్యమును ఇచ్చునట్టి ప్రాపకమూ వేరేదీలేదు నీ శ్రీచరణాలు తప్ప – -ఇరామానుశ -45” అని ప్రాప్యప్రాపకములు రెండూ ఉడయవర్ల యొక్క శ్రీచరణాలే అని ఉద్ఘాటించారు అముదనార్లు!

వడుగ నంబి ఒకనాడు ఉడయవర్ల సభలోకి ప్రవేశించి ఉడయవర్లకు దండం సమర్పించి నిలుచుంటే, ఉడయవర్లు వారిని ఉద్దేశించి, “మన మధురకవులు వచ్చారు!” అన్నారుట! నమ్మాళ్వారుకు ఒక మధురకవులు ఉన్నారు కదా! అంత అభిమానము వడుగనంబి మీద ఉడయవర్లకు! వడుగనంబి కూరత్తాళ్వార్లను, ముదలియాణ్డాన్ ను ఉద్దేశించి, “ఇరుకఱైయర్- ఇరుతీరాలవారు”, అని పిలిచేవారుట! అంటే శ్రీరామానుజులు, భగవంతుడు అంటే రెండు తీరాలను పట్టుకుని ప్రవహించే శుద్ధ గంగానది వంటి వారని వారి ఉద్దేశ్యము!

ఒకనాడు ఉడయవర్లు వడుగనంబిని పిలిపించి, “వడుగా! ఆచార్యాభిమాననిష్ఠుడు ఎలా ఉండవలెను?”, అని అడుగగా నంబి, “వేంబిన్ పుళుపోలే ఇరుప్పన్ – వేపలోని పురుగువలె ఉంటాడు”, అన్నారుట! దానికి అర్థము వేప చెట్టును పట్టుకుని బ్రతికే పురుగు వేపరుచి తప్ప వేరు రుచి ఎరుగదు!  “కఱుమ్బిన్ ఫుళు – చెఱకులోని పురుగు” వలె అన్య ఆస్వాదనాలాలస కలుగనిదై ఉండును! అదే విధముగా ఆచార్యాభిమాననిష్ఠుడు కూడా వేప పురుగు వలె ఒక ఆచార్యుని మాత్రమే ఆశ్రయించి వారి అనుగ్రహము చేత ముక్తిని పొందుతాడు తప్ప వేరు ఆలోచన కూడా మనసుకు రానీయడు! మరి ఇక్కడ చెఱకు పురుగు అంశం ఎందుకంటే ఆచార్యుడు ఎంత దయాళువై ఉన్ననూ తననే నమ్ముకుని ఉన్న శిష్యుని పట్ల విరసభావమును పొంది ఘాతుక దశలో ఉన్ననూ, “నానున్నై యన్ఱి ఇలేన్ (నాన్ముగన్ తిరు -7 )- నిన్ను వదిలి నేను ఉండలేను” అనువిధముగా ఆచార్యుడు లేకపోతే వేరు గతి లేదను ప్రగాఢ నమ్మకంతో, “కళైకణ్ మఱ్ఱిలేన్ (తిరువాయిమొళి-5-9-8)- వేరు రక్షకుడు లేనివాడను”, అన్నంత ఆచార్య అభిమాననిష్ఠ కలిగి ఉండవలెను! అందుచేత ఉడయవర్ల విషయములో ఒదిగి ఉన్నవాడు తదేకనిష్టుడై ఉండి తద్వ్యతిరిక్త విషయములలో ఆసక్తి లేనివాడై ఉండవలెనని అర్థము! అత్యంత గొప్పదైన పరమోత్కృష్టమైన వస్తువు సొంతమైతే ఇంక మిగిలిన విషయములు అవసరము లేదు కదా! “పల్లుయిఱ్కుమ్ విణ్ణిన్ తలైనిన్ఱు వీడళిప్పాన్ నమ్మిరామానుశన్ -(ఇరామానుశ-95) పలు జీవులకు పరమపదములో తన పురుషకారము చేత చోటు ఇప్పిస్తారు శ్రీరామానుజులు” అని ఉడయవర్ల యొక్క  గొప్పతనమును చెప్పారు కదా సకలశాస్త్ర ప్రావీణ్యులైన అముదనార్లు!

నంబిళ్ళై ఒకనాడు ఉడయవర్ల సన్నిధికి వెళ్లి దండము సమర్పించి, నూత్తన్దాది అనుసంధించి, “ఈనాడు దాసుడుకి ఒక హితమును అనుగ్రహించండి!”, అని ప్రార్థించారుట! ఆనాటి రాత్రి ఉడయవర్లు స్వప్నములో దర్శనమిచ్చి తమ తిరువడిగళ్లను నంబిళ్ళై శిరస్సుపై ఉంచి ‘మీకు హితము చేకూరవలెననిన మా పాదాలే రక్షకముగా భావించండి! మిమ్మలను ఆశ్రయించినవారికి కూడా వీటినే రక్షకములుగా ఉపదేశించండి! దీనిని మించిన హితములేదు!'”, అని ఉపదేశించిరి! నిదురలేచిన నంబిళ్ళైఆనందబాష్పాలతో పరవశులై తమ కుమారుడైన పెరియవాచ్చాన్ పిళ్ళైని పిలిచి స్వప్నవృత్తాన్తమును చెప్పి సంతోషపడిరి! నంబిళ్ళైచరమదశలో ఉండగా వారి కుమారులు సమీపించి తమకు దిక్కేది బాధపడుచుండగా నంబిళ్ళై, “ఎమ్బెరుమానార్ల శ్రీచరణాలు మనకు రక్షకములు! వేరు హితమేమి అవసరము? వారి అభిమానమందు అన్తర్భూతులై ఉంటే మన హితముకొరకు ఆలోచించాల్సిన అవసరము రాదు! అదే నిష్ఠతో జీవితము గడపండి! నేను పొందే పరమపదము మీకు కూడా లభిస్తుంది!”, అని ఉపదేశించారుట !
ఇక వచ్చే అధ్యాయములో ఈ గ్రంథము యొక్క ముగింపు విషయములను తెలుసుకుందాము!

— అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము:  https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujar-our-saviour-3.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 2

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 1

గత అధ్యాయములో  (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/12/01/charamopaya-nirnayam-ramanujar-our-saviour-1/) భగవద్రామానుజుల ఉత్తారకత్వ ప్రభావము కొన్ని అనుభవాల మూలముగా తెలుసుకున్నాము! ఇక ఈ అధ్యాయములో స్వామివారి ఉత్తారకత్వ వైభవమును మరి కొన్ని ఐతిహ్యముల మూలముగా తెలుసుకొనెదము!!

ఒకానొకప్పుడు అరుళాళ ప్పెరుమాళ్ ఎమ్బెరుమానార్ల శిష్యులైన అనంతాళ్వాన్, ఎచ్చాన్, తొండనూర్ నంబి, మరుదూర్ నంబి మొదలైనవారు ఉడయవర్లను ఆశ్రయించి ఒక సందేహమడిగినారు, “ఈ ఆత్మకు ఆచార్యుడు ఒకరా? పలువురా? ఇంతమంది ఎందులకు? ” ! దానికి ఉడయవర్లు ఆ శిష్యులను వెళ్లి పొన్నాచ్చియార్ అను వారిని అడుగవలసిందిగా చెప్పారు! అప్పుడు వారందరు పొన్నాచ్చియార్ అమ్మగారి తిరుమాళిగకు చేరుకొని తమ సందేహాన్ని వారి వద్ద విన్నవించారు! అప్పుడు పొన్నాచ్చియార్ అమ్మగారు తమ శిరోజాలని ముడివిప్పి విదిలించి మరల ముడి వేసుకుని, “ఈ సందేహమును దాసురాలు తీర్చజాలదు! అబలయైన దాసురాలికి అంత జ్ఞానమేమున్నది? స్వామివారే మీ సందేహము తీర్చగలరు? ” అని వారికి సమాధానము చెప్పి నేలపై పడియున్న ఒక నూలు పోగును తల మీద పెట్టుకుని లోపలి వెళ్లిపోయారు! శిష్యులు చేసేది లేక మరల ఉడయవర్ల వద్దకు వచ్చి నిలబడిరి! ఉడయవర్లు వారితో, “కార్యము నెరవేరినదా?”అని అడుగగా వారు లేదని బదులిచ్చిరి! అంతట ఉడయవర్లు వారితో, “మీరు వెళ్ళినప్పుడు వారు ఏమి చేసినారు?” అని అడుగగా వారు పొన్నాచ్చియార్ తమ జుత్తు ముడిని విప్పి జుత్తు విదిలించి తిరిగి ముడి వేసుకున్నారని, నేలపై పడియున్న ఒక నూలు పోగు శిరస్సుపై వేసుకుని లోపలి వెళ్లిపోయారని బదులిచ్చారు! దానికి ఉడయవర్లు, “అయితే మీకు సమాధానం దొరికింది! ఆమె తన చేష్టల ద్వారా మీకు సమాధానం చెప్పారు! మీకు అర్థం కాలేదే?”, అనగా శిష్యులు వారికి సాష్టాంగ దండం సమర్పించి, “మా అజ్ఞానాన్ని మన్నించి సవివరంగా దేవరవారే తెలియజేవలసింది!” అని ప్రార్థించిరి! దానికి ఉడయవర్లు వారి పట్ల వాత్సల్యము గలవారై వారితో ఇటుల చెప్పిరి, “ఆమె తమ జుట్టు ముడి విప్పి జుత్తు విదిలించడమంటే – ఈ ఆత్మకు ఆచార్యులు పలువురు ఉండవచ్చును (తల్లిదండ్రులు, చదువు చెప్పే గురువులు, ఈ ప్రకృతి ఇలా జీవుడికి రకరకాల గురువులు ఉండవచ్చును )! అయితే ఆత్మకు ప్రాప్యమును కలిగించే (అంటే మోక్షమును ఇచ్చు) ఆచార్యుడు మాత్రం ఒక్కరే! అదే ఆమె తిరిగి తన జుత్తు ముడి వేసుకొనుటకు అర్థము! నేలపై పడి ఉన్న కావినూలు తీసి శిరస్సుపై ధరించుటలో అర్థం ఆత్మకు ప్రాప్యమును కలిగించే ఆచార్యుడు చతుర్థాశ్రమమైన సన్యాసమును స్వీకరించి కాషాయత్రిదండ ధారుడైన ఎమ్బెరుమానార్ అనగా మమ్ములను సూచించారు! అక్కడ ఉండకుండా లోపలి వెళ్ళుటలో అంతరార్థం అటువంటి ఆచార్యుని గుట్టుగా మనస్సులో స్థిరంగా నిలుపుకుని ‘పేణి క్కొణర్న్దు పుహుదు వైత్తుక్కొండేన్ ‘(ఆదరించి తీసుకువచ్చి విశ్లేషించకుండా హృదయంలో నిలుపుకున్నాను) అనునట్లు ప్రేమతో ఆచార్యుని ఆరాధిస్తూ వారి నామస్మరణ చేయుటయే శిష్యునికి ఉపాయము అని పొన్నాచ్చియార్ మీకు చేసి చూపించారు! కనుక మీరందరు అదే విధమైన నిష్ఠను కలిగి జీవించండి! ” అని బదులిచ్చిరి!

ఒకనాడు ఉడయవర్లు ఏకాంతంలో ఉన్న సమయములో ఎంబార్, వడుగనంబి వారి వద్దకు వెళ్లి, “మధురకవియాళ్వార్ నమ్మాళ్వార్ల విషయములో ‘తేవు మత్తఱియేన్’-నీవు తప్ప వేరు దైవమెరుగను- అని శేషత్వ-శరణ్యత్వ-ప్రాప్యత్వములు ఆళ్వార్లే అని నిశ్చయించుకుని ప్రథమపర్వమును (భగవత్స్మరణం) సైతం విడిచిపెట్టి తదేకనిష్ఠులై ఉన్న అటువంటి శ్రద్ధ మాకు కూడా కలిగేలా దేవరవారు ఆశీర్వదించవలసింది!”, అని ప్రార్థించగా ఉడయవర్, “మధురకవులు నమ్మాళ్వార్ల వద్ద కలిగి ఉన్న నిష్ఠను మీకు ఇదివరకే అనుగ్రహించియున్నాను కదా? ఇంకేమి సంశయము? “, అని అడుగగా వారు,”అటువంటి నిష్ఠ యావదాత్మభావిగా జీవితాంతం కలిగియుండేలా అనుగ్రహించవలసింది! ” అని ప్రార్థించిరి! ఉడయవర్లు పరమ సంతోషముతో శిష్యులంటే ఇటులకదా ఉండవలెనని మనస్సులో భావించి, “‘ఉపాయోపేయ భావేన తమేవ శరణం వ్రజేత్’-ఉపాయము ఉపేయము నీవేనను భావముతో శరణు వేడవలెను- అను రీతిలో ఉపాయోపేయ రూపములు రెండునూ మా వద్ద ఉండుట చేత “తేవు మత్తఱియేన్ ” అను రీతిలో మాకు శరణు వేడిన మీకు లోటు ఉండదు! ఇది మీకే గాక మీ సంబంధిసంబంధులకు వర్తించగలదు” అని బదులిచ్చెను!

గమనిక : ఇక మిగిలిన వ్యాసంలో  ఆళవందార్లు మరియు నాథమునుల సంబంధమును నిశితంగా తెలియజేయడమైనది.

మనకు ఒక సందేహము కలుగవచ్చు , “మనము ఆశ్రయించెడి ఆచార్యునకు ఈ లీలావిభూతిలో ఉన్న రోజులలో ఉపాయత్వము మాత్రమే కాక, ప్రాప్య భూమి అనబడే పరమపదంలో కూడా ఉపాయత్వము కలదా?” అంటే ప్రాప్యభూమి యందు కూడా ఆచార్యునకు ఉపాయత్వము కలదు! దీనిని స్వామి ఆళవందార్లు స్తోత్ర రత్నములో ఈ విధముగా అనుగ్రహించారు :

తస్మై నమో మధుజిదంఘ్రి సరోజ తత్వ

జ్ఞానానురాగా మహిమాతిశయాంత శీమ్నే!

నాధాయ నాథమునయే అత్ర పరత్రచాపి

నిత్యం యదీయ చరణౌ శరణం మదీయం !!

అర్థము – మధుమర్దియైన శ్రీమన్నారాయణుని శ్రీచరణముల పట్ల అచంచలమైన ప్రేమ,భక్తి కలిగి నిజజ్ఞాన పూర్ణులైన నాథమునులే నాకు యజమాని! వారి దివ్యసన్నిధి ఈ భూలోకమందు మరియు పరమపదమందును నాకు ఆశ్రయము!

మరియు విష్ణుపురాణ సూక్తియగు, “సాధ్యభావే మహా బాహో! సాధనై: కిం ప్రయోజనం ? ” అనగా – సాధ్యభావం సిద్ధించినపుడు ఇక సాధనములతో ఏమి ప్రయోజనం ? (అంటే దక్కవలసింది దక్కినపుడు ఇక సాధనాలతో ఏమి ప్రయోజనం ?).
కానీ, భట్టర్ అనుగ్రహించిన శ్రీరంగరాజస్తవములో ఈ విధముగా తెలిపారు (87వ శ్లోకము – ఉత్తర శతకం)

ఉపాదత్తే సత్తాస్థితి స్వనియమానాద్యైశ్చిదచితౌ
స్వముద్దిశ్య శ్రీమానితి వదతి వాగుపనిషదీ !

ఉపాయోపేయత్వే తదిహ తవ తత్త్వం నతు గుణౌ

అతస్త్వామ్ శ్రీరంగేశయ! శరణమవ్యాజ్యమభజం !!

అర్థము – ఓ శ్రీరంగేశ! శ్రీమన్నారాయణుడివై నీవు భూజాతులైన చిత్తులు (బుద్ధి జీవులు ) అచిత్తుల (బుద్ధి రహిత జీవులు) యొక్క సేవలను సృష్టి, స్థితి, నియమములనెడి పరికరముల ద్వారా స్వీకరించెదవని ఉపనిషత్తులు ఘోషించుట చేత చేతనులకు నీవే ఉపాయము మరియు ఉపేయము అనుట అతిశయోక్తి కాదు! అది సత్యము ! అటువంటి నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను!

అన్నందువలన ఈ ఉపాయోపేయములు రెండు భగవానుడి స్వరూపములు! అయితే ఉపాయము బయటికి ప్రకాశిస్తుంది ఉపేయము అంతర్గతముగా  ఉండును! అయితే ఈ స్వరూపములు భగవానుడి విషయములోనే కదా? అంటే ఆచార్యుని విషయములో కూడా స్వీకరించవచ్చును ! ఆళవందార్లు శాయించిన, “ఉపాయోపేయ భావేన…. ” అన్న విధముగా ఆచార్యునకు ఉపాయోపేయత్వములు రెండూ స్వరూపములై ఉండును! అందుకనే “అత్ర పరత్రాచాపి…  ” అని చెప్పబడింది ! మరియు “త్వమేవ… ” అనుటలో భావం ఇటువంటి స్వరూపములు ఆచార్యునియందు “మాత్రమే” ప్రకాశించును అని రూఢి చేసినట్లు ఉన్నది ! కనుక చరమపర్వమందు ఇతర సహాయ సంబంధములను సహించనిదై ఉండును ! (అనగా చరమోపాయ నిష్టలో ఆచార్యుడు తప్ప ఇక వేరే ఇతర సహాయములు పనిచేయవు అని అర్థము) ! కార్యకాలములో చరమపర్వము (చరమోపాయ నిష్ఠ) అన్నిటికంటే ఉత్తమమై ఉండును! కనుక చరమపర్వము ప్రథమపర్వము కన్నా ఏ విధముగా గొప్పదో క్లుప్తముగా చూద్దాం :

 •  భగవానుడు తనను ఆశ్రయించిన భక్తులను తన యొక్క సర్వతంత్ర స్వతంత్రత చేత మోక్షములోనో లేక తిరిగి సంసారములోనో ఉంచును! కనుక భగవానునిని ఆశ్రయించిన భక్తునికి మోక్షము తథ్యమని నమ్మరాదు (ఉడయవర్ల కాలములో సింహాచలంలో పరమ నృసింహ భక్తుడైన కృష్ణమాచార్యుని గాథ ద్వారా తెలియవచ్చును )! కానీ ఆచార్యుడు తన శిష్యుడు ఏ విధంగానైనా తరించాలని తపనపడి తమ యొక్క నిర్హేతుక కృప చేత భగవానునికి పురుషకారము చేత మోక్షమును ఇప్పించును!
 • భగవానుడు ఆచార్య సంబంధము కలిగిన భక్తుని మాత్రమే స్వీకరించును ! కానీ కృపాపూర్ణుడైన ఆచార్యుడు ఎవరినైనా తన శిష్యునిగా స్వీకరించి భగవంతునితో సంబంధమును కలిగించును!
 • ఆచార్యుడు అజ్ఞాని అయిన తన శిష్యునికి భగవద్విషయమును తానే ఉపదేశించి భగవంతుని సేవించే విధమును నేర్పును కానీ శిష్యుని జ్ఞానార్జనలో ఒంటరిగా విడిచిపెట్టడు! కానీ భగవానుడు జ్ఞానవంతుడై ఆచార్య సంబంధము కలిగిన జీవుని మాత్రమే అనుగ్రహించును!
 • కనుక మోక్షము విషయములో మనలోని సంశయములు దూరం చేసి తనను ఆశ్రయించిన వారికి పరమపదము తథ్యమని ఉపదేశించిన ఉడయవర్ల చరణయుగళాన్ని ఆశ్రయించి మధురాకవియాళ్వార్లు నమ్మాళ్వార్ల పట్ల కలిగియుండిన “తేవు మత్తఱియేన్…. ” అనెడి నిస్సంశయ, అన్యధా శరణ నాస్తి అనెడి నిర్దుష్టమైన భక్తి ప్రపత్తులు ఉడయవర్ల సన్నిధిలోనూ కలిగియుండుటలో ఎటువంటి ఆలోచన చేయనక్కరలేదు!

అయితే మనకు ఇంకొక సందేహము కలుగవచ్చు! పూర్వాచార్యులైన ఆచార్యులందిరికినీ ఉడయవర్లే ఉత్తారుకులని చెప్పుకున్నప్పుడు, మరి ఆళవందార్లు నాథమునుల విషయములో ఉపాయత్వమును నిశ్చయించుకున్నదెట్లు? దానికి సమాధానం – నాథమునులే కదా నమ్మాళ్వార్ల వద్ద రహస్యార్థములన్నీయును మరియు స్వప్నార్థములను భవిష్యదాచార్య విగ్రహముతో సహా పొంది తమ అంత్యకాలమందు వాటిని తమ శిష్యులైన ఉయ్యాక్కొండారుకు ఇచ్చి భవిష్యత్తులో అవతరించబోవు ఆళవందార్ల విషయమును వారికి చెప్పి, “ఈశ్వరమునులకు కలుగబోవు కుమారునికి రహస్యార్థములను ఉపదేశించవలసింది! ” అని తెలిపినందువల్ల వారు అలాగే వేచియుండి తమ కాలమందు ఆళవందార్లు అవతరించకపోవుట చేత తమ శిష్యులైన మణక్కాల్ నంబికి ఆ బాధ్యతను అప్పజెప్పగా మణక్కాల్ నంబి ఆచార్య దివ్యాజ్ఞను అనుసరించి తమ కాలములో అవతరించిన ఆళవందార్లకు రహస్యార్థములను ఉపదేశించి మరియు భవిష్యదాచార్య విగ్రహమును వారికి అనుగ్రహించిరి! దానికి ఆళవందార్లు నాథమునుల వల్లనే కదా తమకు శ్రీసంప్రదాయ విద్య అబ్బినదని సంతోషించి, “తాము పుట్టక మునుపే గర్భములోనే సంపదను పొందిన రీతిగా విశేష కటాక్షమును పొంది, సంప్రదాయార్థములను తెలియపరచి, భవిష్యదాచార్య విగ్రహమును చూపి ఆ భవిష్యదాచార్యులైన ఉడయవర్లు తమకాలములోనే అవతరించగా వారిని దర్శించే భాగ్యాన్ని కలుగచేసి సద్వారకముగా స్వప్నదర్శనమును అనుగ్రహించి ఇంత ఉపకారమును ఒనర్చిన నాథమునులకు నేనేమి ప్రత్యుపకారము చేయగలనని ” చింతించి ఆళవందార్లు నాథమునుల పట్ల ఉండెడి ప్రత్యుపకార భావము యావదాత్మభావిగా ఉండునని తెలియపరచగోరి, “నాథమునులు నిశ్చయించిన విషయమువరకు ఎందుకు, నాకు ఇంత ఉపకారము చేసిన నాథమునులే నాకు సర్వస్వము కదా!”, అని పలికారు ఆళవందార్లు ! అదే దాని భావము! నిజానికి నాథమునుల మనోభావమే ఆళవందార్ల మనోభావము !

అలా ఆళవందార్లు నాథమునుల పట్ల ప్రాప్యమునకు తగిన ఉపాయత్వభావమును పొందుటయే కాక  నమ్మాళ్వార్ల పట్ల కూడా, “సర్వం యదేవ నియమేవ మదన్వయానాం! ఆద్యస్య నః కులపతేర్వకుళాభిరామం శ్రీమత్తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా!!” (స్తోత్ర రత్నం -5), (నా వంశమునకు చెందినవారికందరికిని శ్రీశఠకోపుల పాదద్వయమే సమస్తమో ఆ శ్రీచరణయుగళాన్నే ఆశ్రయిస్తున్నాను!) అని అందరికి, తమకు ఆళ్వార్ల శ్రీచరణాలే ఉపాయముగా నిశ్చయించుకున్నట్లు అయినది! అక్కడే “మదీయ శరణం.. ” అన్నందువలన తామొక్కరినే చెప్పి ఉపాయత్వమును చెప్పుటచే ఆళ్వార్లు తమకు చేసిన ఉపకారమునకు బద్ధులై తత్సమృద్ధి సూచకంగా చెప్పినట్లు స్పష్టమవుచున్నది !!

ఇక తరువాతి వ్యాసములలో ఉడయవర్ల యొక్క ఉత్తారకత్వమును నిరూపించే మరికొన్ని ఐతిహ్యములను చెప్పుకుందాము!

— అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము:  https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujar-our-saviour-2.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 1

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజ వైభవ ప్రశస్తి

పూర్వవ్యాసమందు (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/06/14/charamopaya-nirnayam-ramanujar-avathara-rahasyam/) భగవద్రామానుజుల అవతార రహస్యము తెలుసుకొంటిమి! ఇక ఈ వ్యాసమందు భగవద్రామానుజుల ఉత్తారకత్వమును (జీవులను ఉద్ధరించగల ఉత్తమ తత్వము) పూర్వాచార్యులైన పెద్దల అమృత అనుభవముల మూలముగా తెలుసుకొనెదము!

 తిరువాయిమొழி ప్రవర్తకాచార్యులు – నమ్మాళ్వార్లు , భగవద్రామానుజులు,స్వామి మణవాళమహామునులు -ఆళ్వార్ తిరునగరి

భగవద్రామానుజులు తమ అభిమాన శిష్యులైన తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ కు తిరువాయిమొழி కాలక్షేపము గావిస్తున్న సమయమున “పొలిగ! పొలిగ! (తిరు-5-2-1)” దశకము రాగానే పిళ్ళాన్ హర్షాతిరేకముతో పులికితులై ఉండుట గమనించిన ఉడయవర్లు. “పిళ్ళాన్! ఏమి ఆ వైలక్షణ్యము?” అని ప్రశ్నించగా, వారు, “నమ్మాళ్వార్లు దేవరవారి యొక్క అవతారమును కటాక్షించి కదా ఈ దశకమునందు “కలియుమ్ కెడుమ్ కణ్డుకొణ్మిన్- కలి నశిస్తుంది చూడండి!”” అని కీర్తించారు! అలాగే మీరు కూడా “దీనికి మేమే నిరూపణము!” అను విధముగా వేంచేసి ఉన్నారు! ఇదంతయు మనసులో తలచుకుని పులకితుడనై ఆళ్వార్లు అనుభవించిన రీతిలో దేవరవారు ఈ జీవులను ఉద్ధరించుటకు సర్వోత్తారకులుగా అవతరించినవారు! అటువంటి జన్మ విశేషము కలిగిన దేవరవారి తిరుముఖ మూలముగా తిరువాయిమొழிకి అర్థము తెలుసుకొను మహద్భాగ్యమును పొందితిని గదా అను విస్మయమొందుచుంటిని!”, అని బదులిచ్చెను. ఉడయవర్లు సంతోషించి పిళ్ళాన్ ను ఆనాటి రాత్రి పేరరుళాళన్ అయిన వరదరాజ స్వామి సన్నిధికి తోడ్కొని పోయి, తమ తిరువడిగళ్లను అతని శిరస్సుపై ఉంచి, “ఇక ఈ పాదములే మీకు రక్ష అని నమ్మండి! రాబోవు కాలమందు మిమ్ములను ఆశ్రయించిన వారికిన్నీ వీటినే రక్షకములుగా చూపించండి! రేపటినుంచి వరదరాజ స్వామి సన్నిధిలో తిరువాయిమొழிకి విష్ణు పురాణ సాంఖ్యముగా (6000 శ్లోకములు గల విష్ణుపురాణమునకు సామ్యముగా) వ్యాఖ్యానమును రాయండి”, అని ఆదేశించిరి!

ఉడయవర్లు తమ శిష్యులైన కూరత్తాళ్వాన్, ముదలియాణ్డాన్ మరియు అరుళాళ  పెరుమాళ్ ఎమ్బెరుమానార్ లతో కూడి భగవద్విషయమునకు వ్యాఖ్యాన సహిత కాలక్షేపములు గావిస్తున్న రోజులలో ఎందరో ఆచార్యులు ఉడయవర్లను ఆశ్రయించి శిష్యులయ్యారు ! అలా అనంతాళ్వాన్, ఎచ్చాన్, తొండనూర్ నంబి, మరుదూర్ నంబి మొదలగు వారు ఉడయవర్లను ఆశ్రయించిరి! అయితే ఉడయవర్లు వారిని అరుళాళ  పెరుమాళ్ ఎమ్బెరుమానార్ల చేత సమాశ్రయణము చేయించిరి! అంతటఅరుళాళ  పెరుమాళ్ ఎమ్బెరుమానార్ తమ శిష్యులతో, ” పిచ్చుక కంఠానికి తాటికాయ కట్టినట్టు మీ అందరి బాధ్యత మోయుటకు నాకు శక్తి లేదు! సర్వోత్తారకులైన ఉడయవర్ల శ్రీచరణాలే మీకూ మాకూ మనందరికీ దిక్కు!!”. అని బోధించెను! ఉడయవర్లు కూడా వారితో, “మీకు మా మూలముగా భగవత్సంబంధము కలిగించలేదని దిగులు పడకండి! మీ అందరి యొక్క ఉత్తారక బాధ్యత మా మీదనే ఉన్నది! మా చరణాలనే నిత్యమూ ధ్యానించండి!” అని చెప్పెను!

ఉడయవర్లు వారి శిష్యులు తిరుమల వెళ్ళి తిరువేంగడముడైయాన్ అయిన శ్రీనివాసునికి  మంగళశాసనము చేయుటకు వరదరాజ పెరుమాళ్ళ వద్ద అనుమతి పొంది బయలుదేరిరి! నమ్మాళ్వార్లు “విణ్ణోర్ వెర్పు (తిరు-1-8-3)-నిత్యసూరులు నివసించు కొండ ” అని కీర్తించినట్టు, నిత్యసూరులే నిత్యము వచ్చి స్వామి కైంకర్యము చేసుకునే మహిమాన్వితమైన ఆ తిరుమల పర్వతమును కాలితో తొక్కి అపవిత్రము చేసి కొండను అగౌరవపరచరాదన్న అభిప్రాయము కలిగి ఉడయవర్లు తిరుపతిలోనే నిలిచిపోయినారు! “తానే తొழுమ్ అతిశయుత్తు నొక్కీయే (తిరు-6-5-5)-తానే ఆ దిశను చూస్తూ నమస్కరిస్తున్నది” అన్నట్లుగా తిరుమలేశుడు వేంచేసిన దిశవైపు చేతులెత్తి నమస్కరించి వెళ్ళిపోదామని అనుకున్నారు ఉడయవర్లు! అయితే తాము అంతకుముందే స్వామి కైంకర్యము కొరకు నియమించిన అనంతాళ్వాన్ మరియు తక్కిన శ్రీవైష్ణవులు, “మీరు కొండ ఎక్కనిచో మేము కూడా ఎక్కము! ఇకపై ఎవరును ఎక్కజాలరు! కనుక దేవరవారు అవశ్యం తిరుమల కొండ ఎక్కవలెను!”, అని ప్రార్థించెను! వారి విన్నపము మన్నించి ఉడయవర్లు, “పాదేనాధ్యారోహతి (ఛాన్దోగ్యోపనిషత్ )- ముక్తుడు పాదముతో ఎక్కుతున్నాడు”, శ్రీవైకుంఠనాధుని ఆజ్ఞతో పాదపీఠం పై కాలుమోపి అధిరోహించినట్లే, తిరుమలేశుని ఆజ్ఞానుసారం ఉడయవర్లు తిరుమల కొండ ఎక్కినారు! “ముడియుడై వానవర్ ముఱై ముఱై ఎదిర్గొళ్ల (తిరు-10-9-5)-కిరీటధారులైన నిత్యసూరులు క్రమానుసారముగా ఎదురు వచ్చి ముక్తుని ఆహ్వానించగా”, అనునట్లు తిరుమలలో స్వామి కైంకర్యపరులైన తిరుమలనంబి శ్రీవైష్ణవ పరివారముతో పెరుమాళ్ళ తీర్థప్రసాదములను గైకొని ఎదురు వచ్చి ఉడయవర్లను ఆహ్వానించెను! ఉడయవర్లు భక్తితో దండం సమర్పించి తీర్థప్రసాదములు స్వీకరించి వయోవృద్ధులైన తిరుమలనంబిని ఉద్దేశించి, “మీరు ఇంత శ్రమ తీసుకోవాలా? చిన్నవారు ఎవరూ లేరా? ” అని అడుగగా నంబి, “నాలుగు మాడవీధులలో ఎంత వెదకినను నాకన్నా చిన్నవాడు ఎవరూ కనపడలేదు!సాక్షాత్ ఆ తిరుమలేశుడే వచ్చి స్వాగతం పలకాలి! సర్వ జీవఉద్ధారకులైన మీవంటి మహానుభావుని ఆహ్వానించుటకు నాకు ఏమాత్రము అర్హత లేదు! అయినా పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞను అనుసరించి నేను రాక తప్పలేదు”, అని నిగర్వముగా సమాధానమిచ్చెను! వారి యొక్క నిర్మలమైన నిరహంకార మనస్సుకు పులకితులైన ఉడయవర్లు మరి మరి దండం సమర్పిస్తూ సన్నిధిలోకి వేంచేసి పెరుమాళ్ళకు దండం సమర్పించి మంగళాశాసనము చేసి నిలువగా, ఆ ఆనందనిలయవాసుడు పరమానందముతో అర్చకముఖేన ఇట్లనెను, “మేము మీకు మా దక్షిణ గృహమైన శ్రీరంగములో ఉభయవిభుతి ఐశ్వర్యములను ప్రసాదించి జగత్తును ఉద్ధరించుటకు నియమించితిమి కదా! ఇక ఏమి కొరవ ఉన్నదో చెప్పండి! ప్రసాదించెదము!” !

అంతట ఉడయవర్లు పెరుమాళ్ళకు దండము సమర్పించి,”స్వామి! కిడందదోర్ కిడక్కై (తిరుమాలై-23)- శయనించిన రూపము అద్వితీయము” అనియు, మరియు, “పిరాన్ ఇరుందమై (తిరు-6-5-5)- స్వామి కూర్చున్న అందము” అనియు మరియు, “నిలైయార నిన్ఱార్(పెరియతిరు-6-9-8)-నిలుచున్న స్వామి అందము “, అనియు దేవరవారి శయన, ఉపవిశ్య, ఉత్తిష్ట భంగిమలు ఎంతో అందముగా ఉంటాయి! శయన సౌందర్యమును శ్రీరంగములో అనుగ్రహించితివి! నిలిచి ఉన్న భంగిమలో నీయొక్క సౌందర్యము హస్తిగిరిలో (కాంచీపురము) అనుభవించితిమి! “అమరర్ మునిక్కణంగళ్ విఱుమ్బుమ్ తిరువేంగడత్తానే! (తిరు-6-10-10)- దేవతలు, మునులు ఎంతో ఇష్టపడే ఓ తిరుమలేశుడా! “, అనునట్లు, ఈ తిరుమలలో గుణనిష్టులు, నీ యొక్క కైంకర్యపరులకు నీ దర్శనమును అనుగ్రహించెడి సన్నివేశం కనులార వీక్షించవలెనన్న కాంక్షతో వరదరాజ స్వామి వద్ద అనుమతి గొని నీ సన్నిధికి వచ్చితిమి!”, అని భక్తి పూర్వకముగా బదులిచ్చెను! అంతట పెరుమాళ్ళు, “అయితే ఇచటకు రండి” అని తమ వద్దకు పిలిచి తమ శ్రీచరణముల వద్ద శిరస్సు వంచమని, “మా తిరువడిని నిత్యమూ స్మరించి దర్శనాన్ని నిర్వహించండి! ఉభయవిభూతులకున్నూ మీరే అధికారి! మీ అభిమానములో ఒదిగినవారే మాకు ఆప్తులు! అందరిని మాకు దాసులు అయ్యే రీతిలో సంస్కరించండి! జగత్తును ఉద్ధరింపచేయుట కొరకే మిమ్ములను మేము అవతరింపచేసితిమి! మీతో సంబంధము కలవారికి ఏ కొరతా ఉండదు! “శూழల్ పల పల(తిరు -1-9-2) – చేసిన ఉపాయములు అనేకములు”,అనునట్లు ప్రపన్నుల కొరకు మేము ఎన్ని అవతారాలెత్తి వెదకినను లభించలేదన్న కొరతతోనే శ్రీవైకుంఠమునకు వెళ్ళిపోయాము! ఆ కొరతను మీరు తీరుస్తారని విశ్వసిస్తున్నాము! మా నమ్మకమును నిజము చేసి చూపించుము!”, అని తిరుమలేశుడు ఉడయవర్లకు బదులిచ్చెను! ఈ విధముగా తిరుమల పెరుమాళ్ళు కూడా ఉడయవర్ల ఉత్తారకత్వమును ప్రతిపాదించెను!

అచట నుంచి ఉడయవర్లు వారి శిష్యగణము తిరుక్కురుంగుడి వెళ్ళిరి. అక్కడ వేంచేసి ఉన్న తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్ళు ఉడయవర్లను సాదరముగా ఆహ్వానించి, వారిని ఆశీర్వదించి వారితో ఇట్లనెను, “”బహూని మే జన్మాని వ్యతీతాని (భగవద్గీత 4-5)- నా జన్మలు అనేకములు గడిచినాయి”, అనునట్లు ఎన్ని జన్మలు లోక కళ్యాణార్థమైన మేము ఎత్తిననూ మాకు మావారని ఎవ్వరూ లభించక, “అసురీం యోని మాపన్నా మూఢా జన్మని జన్మని, మమ ప్రాప్యైవ కౌంతేయ! తతో యాంత్యధమాం గతిమ్ (భగవద్గీత 16-20)- దుష్ట యోనులలో ముఢులై ఎన్నో జన్మలు ఎత్తిన జీవులు నన్ను పొందకనే మరింత అధోగతి పాలవుతున్నారు “, అనునట్లు అసురప్రకృతి కలవారై అధోగతి పాలవుతున్నారు! కానీ ఇప్పుడు అదే జనులు మిమ్ములను ఆశ్రయించి తరించుచున్నారు! ఈ విధముగా మీరు వారిని ఆకర్షించుకున్న ఉపాయమేమి? ఆ ఉపాయము మీరు మాకు కూడా చెప్పవలెను!”, అని తిరుక్కురుంగుడి నంబి ఉడయవర్లను అడుగగా ఉడయవర్లు, “దేవరవారు సర్వజ్ఞులు! అయినా మీరు అడిగినారు కనుక చెప్పెదము! అయితే ఆ ఉపాయము తెలుసుకొనుటకు అడగవలసిన విధము కలదు! ఆ విధమున మీరు అడిగినచో ఆ దివ్య రహస్యమును మీకు చెప్పగలము!”, అని బదులివ్వ నంబి తమ మూలస్థానము నుంచి క్రిందకి వచ్చి కింద చిత్రాసనముపై కూర్చుని ఉడయవర్లను తమ సింహాసనముపై కూర్చుండబెట్టి అందరిని బయటకి పంపించేసి, “ఇప్పుడు అషట్కకర్ణముగా ఉన్నది! అనుగ్రహించవచ్చును!”, అని అనగా ఉడయవర్లు, “నివేశ్య దక్షిణే స్వస్య వినతాంజలి సంయుతం, మూర్ధ్ని హస్తం వినిక్షిప్య దక్షిణం జ్ఞానదక్షిణం, సవ్యం తు హృది విన్యస్య కృపయా వీక్షయేత్ గురుః, స్వాచార్యం హృదయే ధ్యాత్వా జప్త్వా గురుపరంపరామ్, ఏవం ప్రపద్య దేవేశం ఆచార్యం కృపయా స్వయం, అధ్యాపయేన్మన్త్రరత్నం సర్షిచ్ఛన్ధోధిదైవతం- వినయముతో అంజలి చేసిన శిష్యుని తన దక్షిణ దిక్కులో కూర్చొనపెట్టుకుని, అతని తలపై జ్ఞాన దక్షిణమైన కుడి చేతిని ఉంచి, ఎడమ చేతిని తన గుండెపై పెట్టుకుని, గురువు ఆ శిష్యుని కటాక్షించాలి! తన ఆచార్యుని హృదయమందు ధ్యానించి, గురుపరంపరను జపించి,భగవానుని,ఆచార్యుని శరణు వేడి, కృపతో స్వయముగా మంత్రరత్నమును, ఋషి – ఛందస్సు – అధిదేవతల సహితముగా మంత్రమును ఉపదేశించవలెను!”, అనువిధముగా తిరుమంత్రమును మరియు ద్వయమంత్రమును నంబి యొక్క కుడి శ్రీకర్ణమందు ఉడయవర్లు ఉపదేశించిరి!

 

అంతట ఉపదేశము పొందిన నంబి పరమ సంతోషముతో, “మేము ఒకనాడు బదరికాశ్రమమునందు శిష్యాచార్య రూపేణ తిరుమంత్రమును బహిర్గతము చేసితిమి! అచట మేమే శిష్యునిగా మరియు ఆచార్యునిగా ఉండితిమి! కానీ అన్యుని ఆచార్యునిగా స్వీకరించి మేము శిష్యులమై ఉండి ఉపదేశము పొందుట ఇప్పటివరకు జరుగలేదే అనే పెద్ద కొరతతో ఉంటిమి ఇన్నాళ్ళున్నూ! ఆ కొరత నేడు మీమూలముగా తీరినదే! ఇక ఈనాటినుంచి మేము కూడా రామానుజుల శిష్యులలో ఒకరిగా ఆవిర్భవించితిమి కదా! ఈ నాటి నుంచి మేము వైష్ణవ నంబి అయినాము! “, అని అనుగ్రహించిరి! అయితే నంబి యొక్క శిష్యత్వము వారి యొక్క స్వాతంత్ర్య గుణము యొక్క పరాకాష్ట అని తాత్పర్యము! అందరికి ఆదిగురువైన ఆ పరమాత్మ (తిరుక్కురుంగుడి నంబి) రామానుజుల వద్ద శిష్యరికము చేయుటలో ఉన్న ప్రభావమును గుర్తించి వారి వద్ద శిష్యరికమునకు ఆశపడుట కేవలం ఉడయవర్ల యొక్క ఉత్తారకత్వమును లోకమునకు చాటుట కొరకే కదా!

నడాదూరు అమ్మాళ్ శ్రీచరణాలను ఆశ్రయించి పన్నెండు మంది శిష్యులు శ్రీభాష్యమును అధికరించుచున్న కాలమందు, “భక్తిప్రపత్తులు దుశ్శకములు, స్వరూపవిరుద్ధములు, విశ్వాసదుర్లభములు కనుక అవి ఆచరించలేని నిస్సహాయుడైన చేతనునికి ఇక ముక్తి ఏవిధంగా కలుగుతుంది? “, అను సంశయమును శిష్యులు అమ్మాళ్ వద్ద అడుగగా వారు, “ఇవి రెండూ లేని వారికి ఉడయవర్ల శ్రీచరణములే దిక్కు! అంతకన్నా వేరే దారి లేదు! నేను నమ్మిన సత్యమూ అదే!”, అని బదులిచ్చెను! అమ్మాళ్ చరమదశలో శిష్యులు వద్దకు చేరి తాము తరించుటకు దారేదని అడుగగా వారు, “భక్తి ప్రపత్తులు ఆచరించండి! అవి దుష్కరములుగా తోచినచో రామానుజుల దివ్య చరణయుగళాన్ని పట్టి ఉండండి! అవే మీకు రక్షకములని విశ్వసించండి! ఇక మీ సంతోషమునకు కొరత రాదు!”, అని బదులిచ్చెను! “ప్రయాణకాలే చతురః స్వశిష్యాన్ పదాంతికస్థాన్, వరదో హి వీక్ష్య, భక్తిప్రపత్తీ యది దుష్కరే వో రామానుజార్యమ్ నమతేత్యవాదీత్!! – వరదులనబడే నడాదూరు అమ్మాళ్ తమ ప్రయాణకాలమందు తమ పాదాలను ఆశ్రయించిన శిష్యులను చూచి, “భక్తి ప్రపత్తులు మీకు ఆచరణ సాధ్యములు కాకున్నచో రామానుజులను శరణాగతి చేయండి!”- అని అన్నారు”, అని చెప్పిన అర్థము సుప్రసిద్ధము కదా!!

కారాంజి గ్రామస్థులైన సోమాసియాణ్డాన్ ఉడయవర్లకు అభిమాన శిష్యులు! చాలా రోజులు శ్రీరంగములో  ఉండి ఆచార్య కైంకర్యము చేసుకొని తమ స్వగ్రామానికి వెళ్ళినారు! అయితే కొన్నాళ్ళకు భార్యాభిమానములో మునిగిన సోమాసియాణ్డాన్ ఆచార్య కైంకర్య విషయమును విస్మయించి ఉడయవర్లను సేవించుటకు శ్రీరంగము వెళ్ళలేదు! సోమాసియాణ్డాన్ తమ స్వగ్రామములో ఉడయవర్లకు ఆలయము కట్టించవలెనని సంకల్పించి విగ్రహము చేయించారు! అయితే విగ్రహము తమకు నచ్చినట్టు రానందున మరియొక శిల్పము చెక్కించవలెనని స్థపతికి చెప్పెను! ఆనాటి రాత్రి సోమాసియాణ్డాన్ కు స్వప్నములో ఉడయవర్లు సేవ సాయించి, “నీవు ఎందుకు నన్ను బాధించి నా విగ్రహము తయారు చేయుచుంటివి? నా పట్ల అభిమానమే ఉత్తారకమని గ్రహించని నీవు నా విగ్రహమునకు ఎట్లు శరణాగతి చేయగలవు?”, అని తెలుపగా ఉలిక్కిపడి లేచిన సోమాసియాణ్డాన్ తాను తప్పు చేయుచున్నట్లు గ్రహించి తమ భార్యను వెంటబెట్టుకుని శ్రీరంగము వెళ్లి ఉడయవర్ల పాదాలపై బడి చంటి పిల్లవాని వలె విలపించెను! అంతట ఉడయవర్లు కారణమేమని అడుగగా సోమాసియాణ్డాన్ తమ స్వప్నవృత్తాన్తమును తెలిపి క్షమించమని ప్రార్థన చేసిరి! దానికి ఉడయవర్లు సమాధానమిస్తూ,”నీకున్న స్త్రీ ఆసక్తి ని వదిలించుట కొరకే మేము అటుల స్వప్నమందు దర్శనమిచ్చితిమి! అంతే కానీ నీ మీద మాకు కోపము లేదు! నీవెక్కడ ఉన్ననూ నీ బాధ్యత మాదే కదా!!నీ యొక్క భారములన్నియు మాపై ఉంచి నిర్భయముగా జీవించుము!!”, అని చెప్పినట్లు మన పెరియవాచ్చాన్ పిళ్ళైగారు అనుగ్రహించిరి!!

కణ్ణియనూర్ ఆచ్చాన్ ధరించిన దుస్తులతోనే కావేరియందు స్నానమాడి (సాధారణముగా స్నానము ధరించిన దుస్తులతో చేయరాదు! వేరే దుస్తులు ధరించి స్నానమాచరించవలెను! చర్మ కైంకర్యములందు, చక్ర స్నానమందు మరియు సత్య ప్రమాణము చేయు సమయమందు మాత్రమే ధరించిన దుస్తులతో స్నానము చేయవలెనని శాస్త్రము చెప్పుచున్నది !) పెరియతిరుమండపమును నందు శ్రీవైష్ణవులందరిని రావించి, శ్రీశఠకోపము తలపైనుంచుకొని ఇట్లు చెప్పిరి:

 

సత్యమ్ సత్యమ్ పునస్సత్యమ్ యతిరాజో జగద్గురుః |
స ఏవ సర్వ లోకానామ్ ఉద్ధర్తా నాస్తి సంశయః ||

అర్థము : ఇది సత్యము ! ఇది సత్యము !ఇదే సత్యము ! మన యతిరాజులే జగద్గురువులు !!వారు మాత్రమే సర్వలోకములను ఉద్ధరించగలవారు!! ఇది నిస్సంశయము!!

అక్కడ గుమిగూడిన అందరిని ఉద్దేశించి ఆచ్చాన్ ఇట్లు ఘోషించెను, “ప్రపన్న కులమునకు చెందిన అందరు శ్రీవైష్ణవులకు భగవద్రామానుజులే రక్షకులు! వారి శ్రీచరణాలు మనకు ఉద్ధారకము! నా మాటను నమ్మండి !”

వచ్చే అధ్యాయములో ఉడయవర్ల ఉత్తారకము గురించి మరిన్ని ఐతిహ్యములు తెలుసుకుందాం !!

— అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujar-our-saviour-1.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజ వైభవ ప్రశస్తి

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజుల అవతార రహస్యము

పూర్వ వ్యాసమందు (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/06/14/charamopaya-nirnayam-ramanujar-avathara-rahasyam/) భగవద్రామానుజుల అవతార రహస్యము తెలుసుకొంటిమి! ఇక ఈ వ్యాసములో భగవద్రామానుజుల వైభవ ప్రశస్తి పెద్దలైన పూర్వాచార్యులు ఏవిధముగా అనుభవించిరో తెలుసుకొనెదము.

కూరత్తాళ్వార్లు చోళ రాజు యొక్క మత ఛాందసమునకు బలి కాబడి చూపు కోల్పోవడమే కాక భగవద్రామానుజుల వియోగము కూడా పొంది ఎంతో కాలము తల్లిని విడిచిన పసిబిడ్డ వలె భగవద్రామానుజుల కొరకు విలపించారు. పిదప భగవద్రామానుజులు తిరిగి శ్రీరంగమునకు విజయము చేయుట జరిగి చోళరాజు చేత అవస్థ పడ్డ కూరత్తాళ్వార్ల కథ తెలుసుకుని ఎంతో బాధపడిరి.భగవద్రామానుజులు ఒకనాడు కూరత్తాళ్వార్లను పిలిచి,”మీరు కాంచిపురమునకు వెళ్ళి ఆశ్రిత వరదుడైన వరదరాజ పెరుమాళ్ళను మీకు కంటి చూపు ప్రసాదించమని ప్రార్థించండి”, అని ఆజ్ఞాపించిరి. అంతట ఆళ్వాన్ భగవద్రామానుజులు చెప్పినట్టే కాంచిపురమునకు వెళ్ళి వరదరాజ పెరుమాళ్ళ విషయముగా “వరదరాజ స్తవము” అను స్తోత్రమును చేసి పెరుమాళ్ళను ప్రసన్నము చేసుకొనిరి. ( http://ponnadi.blogspot.in/2012/11/archavathara-anubhavam-kurathazhwan.html). అది పూర్తి అవగానే ఆళ్వాన్ ఉడయవర్ల వద్దకు వచ్చి దణ్ణము సమర్పించి కాంచీపురంలో జరిగినది ఇట్లు విన్నవించారు, “దేవరవారి ఆజ్ఞననుసరించి వరదరాజ పెరుమాళ్ళ సన్నిధిలో “వరదరాజ స్తవమును” చేసి స్వామికి సమర్పించితిని. అంతట, “పెరువిశుమ్బరుళుమ్ పేరరుళాళర్ “(పరమపదమును అనుగ్రహించెడి అమితానుగ్రహ వరదులు) అగు వరదరాజ స్వామి వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతిః ! ఆస్తే విష్ణురచించ్యాత్మా భక్తైర్భాగవతై స్సహ !! (పరమపదమగు వైకుంఠములో జగత్పతి యగు విష్ణువు అచింత్యాత్ముడై అమిత వైభవము కలిగి శ్రీదేవితో, భగవద్భాగవతులతో కలిసి వేంచేసి ఉంటాడు -లింగ పురాణము) అనునట్లు దాసుడికి పరమపదమును అనుగ్రహించిరి. కానీ వారు మాతో, “మేము “వానిలిళవరసు (మేము పరమపదములో యువరాజుము-పెరియాళ్వార్ల దివ్య సూక్తి)” కనుక మా స్వాతంత్ర్యము కూడా పరిమితమే! అందుచేత మీరు వెళ్ళి ఉడయవర్లను ప్రార్థించండి. మాకు సేవ చేయు నిత్యసూరులలో శ్రేష్టులగు భగవద్రామానుజులు అనుమతిస్తే పరమపదమునకు వేంచేయవచ్చును!!”, అని కృప చేసినారు! కనుక మీరు కరుణించి దాసుని కటాక్షిస్తే దాసుడు ఇక ఈ లీలా విభూతి నుంచి సెలవు తీసుకుంటాడు.” అని విన్నవించిరి.

 

అంతట భగవద్రామానుజులు కూరత్తాళ్వార్ల యొక్క తిరువుల్లమును గ్రహించి పరమసంతోషమును పొంది కూరత్తాళ్వార్ల కుడి చెవిలో ద్వయ మంత్రమును చెప్పి, “నలమందమిల్లదోర్ నాడు పుగువీర్ (అపరిమిత ఆనంద నిలయమగు పరమపదము మీకు కలుగు గాక!)” అని ఆశీర్వదించిరి. ఆళ్వాన్ కూడా, “నాన్ పెట్ఱ పేఱు నాలురానుమ్ పెఱ వేణుమ్ (నేను పొందిన ఉత్తమగతిని నాలురాన్ కూడా పొందవలెను (‘ఈ నాలురాన్ అనేవాడు చోళ రాజుకు నమ్మకస్తుడైన మంత్రిగా ఉండి తనయొక్క విషపూరితమైన మాటలతో రాజును వైష్ణవద్వేషిగా మార్చి కూరత్తాళ్వాన్ కు కంటి చూపు పోవుటకు కారణమైనవాడు. కానీ అతను చేసిన తప్పును అజ్ఞానపూరితముగా భావించి క్షమించి అతనికి కూడా పరమపదము కలుగునట్లుగా ఆళ్వాన్ ఉడయవర్లను ప్రార్థించారు! ‘) )” అని భగవద్రామానుజులను ప్రార్థించగా వారు, “శ్రీకృష్ణ పరమాత్మ ఘంటాకర్ణునికి మోక్షమును ఇవ్వగా అతనితో అతని సంబంధీకులందరూ మోక్షము పొందినట్లుగా మీరు పొందిన ఉత్తమగతి మీ సంబంధీకులకు కూడా కలుగు గాక! ఇందులో సందేహములేదు సుమా!” అని అనుగ్రహించగా ఆళ్వాన్ సంతోషముగా “కలఙ్గా ప్పెరునగర్ (కలతలేని మహానగరమైన పరమపదము-3వ తిరు-5)” ను పొందారు.

పిదప భగవద్రామానుజులు కూరత్తాళ్వార్ల యొక్క పెద్ద కుమారులైన పరాశర భట్టరుల చేత ఆళ్వాన్ కు అంతిమసంస్కార తిరువధ్యయనేత్యాది కార్యములను నిర్వహింపచేసిరి. మరుదినము భగవద్రామానుజులు పితృవియోగము చేత పరమ దుఃఖితులై ఉన్న పరాశర భట్టరులను శ్రీరంగనాథుని సన్నిధికి గొనిపోయిరి. అంతట పెరుమాళ్ళు భట్టరులతో, “వత్సా! దుఃఖించకుము. ఇకపై నీకు మేమే తండ్రిమి!” అని చెప్పి పుత్రస్వీకారము చేసుకొనిరి. పిదప పెరుమాళ్ళు భట్టరులతో, “నీవు దేనికీ చింతించవలసిన పనిలేదు. ఈ లోకములో ఉండగా నీకు ఎటువంటి కొఱత కలుగనీయము!పరలోకములో కూడా నీ సుఖమునకు ఏ లోటూ లేకుండుటకు భగవద్రామానుజుల సంబంధము నీకు ఎటులనూ ఉన్నది! కనుక నిశ్చింతగా ఉండుము!”, అని చెప్పెను.ఈ విధముగా శ్రీరంగనాథుడు భగవద్రామానుజుల వైభవమును వెల్లిబుచ్చెను.

 

 

ఉడయవర్లు తమ శిష్యులను తోడ్కొని దివ్యదేశ యాత్ర చేయుచు ఆళ్వార్ తిరునగరి దివ్యదేశము చేరినారు. అచ్చట వేంచేసి ఉన్న తిరుక్కురుగూర్ నంబి పెరుమాళ్ళను, మరియు నమ్మాళ్వార్లను సేవించి “కణ్ణినుణ్ శిఱుత్తామ్బు” అను దివ్యప్రబంధమును మధురముగా అనుసంధానము చేయగా నమ్మాళ్వార్లు ప్రసన్నులయి అర్చకముఖేన ఉడయవర్లకు అరుళప్పాడు (సన్నిధిలోనికి గౌరవ ఆహ్వానము) పలికిరి. ఆళ్వార్లు ఉడయవర్లను తమ శ్రీచరణాల వద్ద శిరస్సునుంచమని చెప్పి, సకల శ్రీవైష్ణవులను మరియు సన్నిధి పరిచారికగణమును పిలిచి, “మా యందు ప్రేమతో భక్తితో మెలగి మాతో సంబంధము ఆశించు వారందరునూ మాకు పాదుకల వంటివారైన మా రామానుజులను ఆశ్రయించండి ! రామానుజులను ఆశ్రయించినచో మమ్ములను ఆశ్రయించినట్టే అగును! రామానుజులనే ఉత్తారకులుగా భావించి ఉజ్జీవించండి!” అని శాయించెను. ఆనాటి నుండి నమ్మాళ్వార్ల శ్రీశఠకోపమునకు “ఇరామానుశన్” అని సార్ధక నామధేయము సిద్ధించినది! తత్పూర్వము నమ్మాళ్వార్ల శ్రీశఠకోపమునకు “శఠకోపపదద్వయం లేదా మధురకవులు” అని తిరునామము ఉండేది. అందుకనే తిరువరంగత్తముదినార్లు “మాఱన్ అడిపనిందుయందవన్-మాఱన్ (నమ్మాళ్వార్ల) యొక్క తిరువడిని ఆశ్రయించి ఉజ్జీవించినవారు ” అని ‘ఇరామానుశ నూత్తన్దాది’ అను దివ్యప్రబంధములో ఉడయవర్లను ఉద్దేశించి శాయించినారు.

 

వైకుంఠ ఏకాదశి రోజు ఆళ్వార్ తిరునగరి దివ్యదేశమునందు నమ్మాళ్వార్లు శయన తిరుకోలమందు (భంగిమలో) వేంచేయగా వారి శ్రీ చరణాల వద్ద ఉడయవర్లు నాచ్చియార్ తిరుకోలమందు వేంచేసి ఉన్న దివ్య విశేషము

మధురకవులు సర్వజ్ఞులు అగుట చేత నమ్మాళ్వార్ల శ్రీచరణాలను “మేవినేన్ అవన్ పొన్నడి-అతని బంగారు శ్రీచరణాలనే ఆశ్రయించితిని” అని కీర్తించారు. అయితే ఇచ్చట ఒక్క విషయము విశ్లేషించదగినది. శుద్ధవైరాగ్య చిత్తులు పరాభక్తి తత్పరులైన మధురకవులు తమ ఆచార్యులైన నమ్మాళ్వార్ల శ్రీచరణాలను “తామరై అడి- పాదపద్మములు” అని గాక “పొన్నడి-బంగారు పాదములు” అని ఎందుకు కీర్తించవలసివచ్చింది? బంగారము సకల ద్రవ్యముల కంటెనూ ఉత్కృష్టమైనది, అందఱును పరమప్రీతితో ఆశపడునది,ఫలప్రదమగునది, సర్వకాలములందు లభ్యమగునది, వ్యక్తి తారతమ్యములను చూడక అందరి వద్ద ఉండునది, తన పట్ల రుచి కలిగినవారందరి వద్ద ఉండునది, ఆడ-మగ అను వ్యత్యాసమెఱుంగక ఆందరి చేతా వెంబడించబడునది, చేతబడితే రక్షించుకోవలెననిపించునది, చేజారితే ప్రాణహానికి హేతువగునది. ఇలా బంగారమునకు ఉన్న ఈ లక్షణములను ఉడయవర్లలోనూ మనము దర్శించవచ్చును. అనగా,

1) ఉడయవర్లు తాము “కారుణ్యాత్ గురుషూత్తమో యతీపతిః – కారుణ్యము చేత గురువులలోకెల్లా ఉత్తములు ఉడయవర్లు” అని కదా కీర్తించబడినారు.

2) డెబ్భైనాలుగు సింహాసనాధిపతుల చేత కోరి కైంకర్యం చేయబడినవారు.
3) మోక్షమనే ప్రతిఫలాన్ని ఇచ్చేవారు.

4) తరతమ బేధమెరుగక రహస్యార్థములను అందరికిన్నీ అనుగ్రహించినవారు.

5) అనంతమైన శ్రీవైష్ణవ భక్తగణములలో తామూ మమేకమై భక్తి, నిష్ఠలను మరియు శ్రియఃపతిపై ప్రేమను వారిలో పెంపొందింపచేసినవారు.

6)క్రిమికంఠుని వల్ల క్లేశమెదురైనప్పుడు ముదలియాణ్డాన్ మొదలగు శిష్యుల చేత రక్షించబడినవారు.

7) వారి ఎడబాటును తాళలేక ఎంతోమంది భక్తాగ్రేసరులు ప్రాణాలు సైతం విడిచేటట్లు వేంచేసి ఉన్నవారు.

ఉడయవర్లలో ఇటువంటి సద్గుణములు ఉండి బంగారము యొక్క లక్షణములతో సామ్యమేర్పడుట వలన శ్రీమధురకవులు ఒక మర్మమైన దివ్య దృష్టి చేతనే నమ్మాళ్వార్ల తిరువడిని “పొన్నడి” అని కీర్తించడం ఎంతో ఉచితముగా తోచుచున్నది.

ఉడయవర్లు పరమపదమునకు వేంచేయు సమయమున వారి వియోగమును తాళలేక ఎంతోమంది భక్తాగ్రేసరులు ప్రాణాలు విడిచారు. ఉడయవర్ల శిష్యులైన కణ్ణియనూర్ శిరియాచ్చాన్ ఉడయవర్లను విడిచి తమ సొంత ఊరిలో ఉన్నారు. ఒకనాడు తమ ఆచార్యులను సేవించవలెనని ఆశపడి హుటాహుటీన శ్రీరంగం వేంచేయగా ఆలయంలో ఎదో ఉత్సవం జరుగునట్లు జనం గుమిగూడి అందరునూ విషణ్ణ వదనులై ఉండుట గమినించిన శిరియాచ్చాన్ సన్నిధి నుంచి బయటకు వస్తున్న వ్యక్తిని చూచి తమ ఆచార్యులైన ఉడయవర్లు కుశలమే కదా అని అడుగగా ఆ వ్యక్తి బహుదుఃఖముతో ఉడయవర్లు తిరునాడు అలంకరించారని తెలుపగా, గుండె పగిలినవారై శిరియాచ్చాన్, “ఎమ్బెరుమానార్ తిరువడిగళే శరణం ” అనుచు అక్కడికక్కడే ప్రాణాలను విడిచెను.

“కొమాండూర్ ఇళయవిల్లి ” అను మరొక శిష్యులు తిరుప్పేరూర్ లో వేంచేసి ఉండగా ఒకనాడు స్వప్నములో ఉడయవర్లు కోటి సూర్యులు ఒకేసారి ఉదయించినట్లు నిరవధిక తేజోరూపులై దివ్యవిమానమెక్కి ఆకాశవీధిలో పోవుచుండగా పరమపదమునుంచి పరమపదనాథుడు అనంతగరుడవిశ్వక్సేనాది నిత్యసూరిగణములతో, ఆళ్వార్లు నాథమునులు మొదలగు నిత్యముక్తులతో శంఖభేరికాగళా మొదలగు వాద్యవిశేషములతో ఎదురొచ్చి ఉడయవర్లను స్వయముగా పరమపదమునకు వేంచేపు చేసుకొని పోవుచున్నట్టు కల గని ఉలికిపాటుతో మేల్కొని తమ పక్క ఇంటి వారైన వళ్ళల్ మణివణ్ణన్ ను పిలిచి తమ స్వప్న వృత్తాన్తమును తెలిపి ఇక తానూ ఈ ఇహ జీవనము భరించలేనని “ఎమ్బెరుమానార్ తిరువడిగళే శరణం ” అనుచు అక్కడికక్కడే ప్రాణాలను విడిచెను.

ఈ విధముగా ఉడయవర్ల యొక్క ఎడబాటు భరించలేక ప్రాణాలను విడిచిన భక్తాగ్రేసరులు ఎందరో కలరు. ఈ విషయము ఉడయవర్లకు ముందుగానే తెలియుటచేత తాము పరమపదించిన పిదప ఎవరూ ప్రాణత్యాగము చేయరాదని తమ ఆశ్రమములో శిష్యగణమునకు, ఆంతరంగిక పరిచారకులు, అనంత శ్రీవైష్ణవ ఆచార్యగణమునకు వారు ముందుగానే హెచ్చరిక చేసి పరమపదించినందువలన ఉడయవర్ల తరువాత సంప్రదాయ బాధ్యతలు వహించుట దైవాజ్ఞ కనుక ఉడయవర్ల అనుంగ శిష్యులు కొందఱు మాత్రం ఆ విశ్లేషార్తిని భరించి ఉన్నారు. ఈ విధంగా ఉడయవర్ల వైభవ ప్రభావము అంత విలక్షణమైనది!

ఇక వచ్చే అధ్యాయములో భగవద్రామానుజుల యొక్క ఉత్తారకత్వ ప్రభావమును పెద్దలైన పూర్వాచార్యులు ఎలా దర్శించారో చూద్దాము

— అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujars-glories.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల అవతార రహస్యము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< ఆళవన్దార్ల యొక్క శిష్యపంచకము భగవద్రామానుజుల ఉత్తారకత్వమును ప్రతిపాదించుట

పూర్వ వ్యాసములో (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/02/14/charamopaya-nirnayam-ramanujars-acharyas/) ఆళవన్దార్ల యొక్క శిష్యపంచకము భగవద్రామానుజుల ఉత్తారకత్వము నిరూపించిన విధమును చూచితిమి. ఈ వ్యాసములో ఇంకనూ విపులముగా భగవద్రామానుజుల ఉత్తారకత్వమును మరి కొన్ని దివ్యానుభావాల ద్వారా తెలుసుకొందాం!

ద్వాపర యుగమందు కృష్ణావతారము ధరించి భువికి వేంచేసిన శ్రియఃపతి అయిన శ్రీమన్నారాయణుడు అర్జునుని పట్ల అవ్యాజమైన అభిమానము చేత తన విషయమైన చరమశ్లోకమును (‘సర్వధర్మాన్ …. మా శుచ!!’) అనుగ్రహించి తానే ప్రథమోపాయముగా నిశ్చయించిన విధముగా భగవద్రామానుజులు కూడా ఈ కలియుగమందు జనులు గుర్తించవలసిన చరమోపాయము తామే యని నిశ్చయించిన సందర్భము ఒకటి ఉన్నది.అది  ఉడయవర్లు తిరునారాయణపురమందు వేంచేసి ఉన్న కాలమందు జరిగినది. ఒకనాడు ముదలియాణ్డాన్ (దాశరథి) “యాదవగిరి మహాత్మ్యము” ను పారాయణ చేయుచుండగా ఒక శ్లోకము తటస్థించినది.

“అనంతశ్చ ప్రథమమ్ రూపం, లక్ష్మణశ్చ తతః పరమ్ !

బలభద్రః తృతీయస్తు, కలౌ కశ్చిత్ భవిష్యతి !! ”

అర్థము – ప్రథమ రూపమున అనంతుడై ఉండి పిదప లక్ష్మణస్వామిగా అవతరించెను. పిదప బలభద్రునిగా అవతరించెను. ఈ కలియుగమున కూడా అవతరించి ఉన్నారు.

ఈ శ్లోకము వచ్చినంతనే పారాయణ ఆగినది. అక్కడ ఉన్న శిష్యులు,పండితులు ఆ శ్లోకములో చెప్పబడినట్టుగా కలియుగమున అనంతుడు ఎవరి రూపములో అవతరించెను ? అని ముదలియాణ్డాన్ ని ప్రశ్నించెను. అంతట ముదలియాణ్డాన్ పరమభక్తి పూర్వకముగా భగవద్రామానుజుల వంక చూచి “ఉడయవర్లే చెప్పాలి!” అనెను. అంతట ఉడయవర్లు ముదలియాణ్డాన్ మాటను అపేక్షించి “ఆళ్వార్లను ఉద్దేశించి ఋషి చెప్పి ఉంటారు. ” అని బదులిచ్చెను. అయితే ఉడయవర్ల బదులుకు గోష్టి సంతృప్తి చెందక, “మా పై దయుంచి ఇంకొంచెం విపులీకరించవలసింది! ” అని ఉడయవర్లను వేడుకొనెను. అపుడు ఉడయవర్లు, “ముందు పారాయణము పూర్తి అవ్వనివ్వండి. ఇంకొకమారు చెప్పెదము”, అని విషయము గంభీరముగా దాటవేసెను. ఆనాటి రాత్రి ఉడయవర్ల శిష్యులైన ముదలియాణ్డాన్, ఎంబార్, తిరునారాయణపురత్తరయర్ , మారుతియాణ్డాన్, ఉక్కలమ్మాళ్ ముదలగువారు ఉడయవర్లను సమీపించి ఆ శ్లోకమునకు అర్థమును తెలియపరచవలసిందని ప్రార్థించగా, ఉడయవర్లు.”దాని రహస్యార్థమును మీకు తెలియపరచవలెననిన ఒక షరతు! దీనిని ఎట్టి పరిస్థితులలోనూ ఇంకెవ్వరికీ చెప్పరాదు సుమా! ఋషి ఆ శ్లోకములో చెప్పిన భవిష్యదాచార్యులు మేమే!! మమ్ము ఆశ్రయించుటయే చరమోపాయము. అనంతుని యొక్క దివ్యాంశగా ఈ కలియుగమున జనోద్ధరణకై అవతరించితిమి. “,అని బదులిచ్చి వారిని అనుగ్రహించెను. ఈ విషయము పరమరహస్యముగా ఉన్ననూ బయటకు రాక తప్పలేదు.

ఒకనాడు తిరుమాలిరుమ్శోలై అழగర్ సన్నిధిలో అధ్యయనోత్సవము జరుగుచుండగా, పెరుమాళ్ళు  గోష్టిని ఉద్దేశించి, “నమ్మిరామానుశముడైయార్కు అరుళప్పాడు”-అర్థము : మా రామానుజుల యొక్క శిష్యులను ఆహ్వానిస్తున్నాము, అనెను. అంతట, అందరు శ్రీవైష్ణవులు, “నాయన్దే!” (నేను నీ దాసుడను), అని ముందుకు వచ్చెను.

శ్రీమన్నారాయణుని మరియు ఆదిశేషుని అవతార పరంపర

 

కానీ కొందరు మహాపూర్ణుల శిష్యులు మాత్రం లేచి ముందుకు రాలేదు. అప్పుడు అழగర్ పెరుమాళ్ళు వారు రాకపోవుటకు కారణమేమని ప్రశ్నించగా వారు, “దేవరవారు భగవద్రామానుజుల శిష్యులను మాత్రం ఆహ్వానించియున్నారు. భగవద్రామానుజులు మా ఆచార్యులు పెరియనంబిగారి శిష్యులగుట చేత మేము రాలేదు”, అని బదులిచ్చెను. అప్పుడు పెరుమాళ్ళు వారికి ఈ విధముగా సమాధానమిచ్చెను, “ఎమ్బెరుమానార్లవారికి మహాపూర్ణులు ఆచార్యులు! అదెట్లనగా మాకు రామావతారములో దశరథునివలె అలాగే కృష్ణవతారములో వసుదేవుని వలె మేము వారలకు కుమారునిగా జన్మించిననూ మా అవతార కార్యములో వారి పాత్ర నామమాత్రమే! అటులనే ఎమ్బెరుమానార్లు కేవలం సకల జీవోద్ధరణే ప్రథమ కారణముగా అవతరించియున్నారు. సర్వ జీవులు వారిని ఆశ్రయించియే ఉజ్జీవించగలరు. మీరు ఈ నిజమును గుర్తించుము! “.పిమ్మట అழగర్ పెరుమాళ్ళు ఉడయవర్ల ప్రియ శిష్యులైన కిడంబి ఆచ్చాన్ ను ఆహ్వానించి ఒక పాశురము మధురముగా ఆలపించమని ఆజ్ఞాపించెను. అంతట పరమ వినయశీలులైన ఆచ్చాన్ లేచి నిలబడి ఆళవన్దార్ స్తోత్రమందలి “న ధర్మనిష్టోస్మి న చ ఆత్మవేదీ న భక్తిమాన్ త్వచ్చరణారవిన్దే ! అకించనోzనన్య గతిశ్శరణ్యః త్వత్పాదపద్మమ్ శరణం ప్రపద్యే !! ”  అను శ్లోకమును శ్రావ్యముగా ఆలపించెను.

అర్థము- ‘ఓ స్వామి! నేను ధర్మనిష్టుడను కాను! ఆత్మాజ్ఞానిని కాను! నిను ఆశ్రయించుటకు ఏ విధమూ తెలియనివాడను. ఓ సర్వజీవులకు శరణ్యమైనవాడా! ఇదే నీ చరణారవిన్దములను ఆశ్రయించుచున్నాను’,

అంతట అழగర్ పెరుమాళ్ళు, “ఆచ్చాన్! అదేమి ఇలా అంటున్నారు. సకల జీవోజ్జీవకులైన ఉడయవర్లను ఆశ్రయించినాక ఇక ఉజ్జీవనకై భయమేల? మీరు ఒక గొప్ప ఆచార్యుని ఆశ్రయములో జీవించుచున్నారు. మీరు ఇలా అనుట పాడి కాదు”, అని బదులిచ్చిరి.

కాంచిపురములో ఒక బ్రాహ్మణుడికి కలిగిన కుమారుడు ఆరేళ్ళ వయస్సు వచ్చిననూ ఇంకా మాటలు రాక ఉండెను. ఆ బాలుడు రెండు సంవత్సరాలు కనపడకుండా ఎక్కడికో పోయి తిరిగి వచ్చెను. తిరిగి వచ్చిన ఆ బాలుడు మంచి ముఖవర్చస్సు కలిగి మృదుమధురముగా మాటలాడుచుండెను. ఇంతకాలము ఎక్కడికి వెళ్ళావని అందరూ ఆ బాలుని ప్రశ్నించగా, “నేను క్షీరాబ్దికి వెళ్లి పెరుమాళ్ళను సేవించాను. అక్కడి జనులందరూ ఇలా మాట్లాడుకొనుచున్నారు. పెరుమాళ్ళ సేనాపతి విశ్వక్సేనులవారు ఈ కలియుగములో జనులను ఉద్ధరించుటకు ఇళయాళ్వారుగా అవతరించెను.!”, అని చెప్పి ఆ బాలుడు అందరూ చూస్తూండగానే అంతర్ధానమయ్యెను. ఈ విధముగా క్షీరాబ్దినాధుడైన భగవంతుడు ఆ బాలకుని మూలముగా ఉడయవర్ల జన్మకారణత్వమును తెలియపరచెను.

ఇళయాళ్వారు యాదవప్రకాశుల వద్ద సామాన్య శాస్త్రములను అభ్యసిస్తున్న రోజులలో ఒకనాడు ఆ దేశపు రాజు యొక్క కూతురికి బ్రహ్మ రాక్షస్సు (పూర్వ జన్మ యందు ఈ బ్రహ్మ రాక్షస్సు ఒక బ్రాహ్మణుడై ఉండి వేద, ధర్మ శాస్త్రార్థములకు వక్రభాష్యములు చెప్పి ఆదాయమును గడించుట వలన అతనికి మరు జన్మయందు బ్రహ్మరాక్షస్సు గతి పట్టెను!) పట్టి తాను యువరాణిని విడిచిపెట్టవలెనన్న ఇళయాళ్వారు వచ్చి తమ పాదములతో తన శిరస్సును తాకి తనకు మోక్షము ఇప్పించవలెనని చెప్పెను. చిన్నపిల్లవాడైన ఇళయాళ్వారు వలన పిశాచి పీడ తొలగించటం ఏమవుతుందని భ్రమించిన యాదవప్రకాశులు తామే స్వయముగా రాజు ఆస్థానమునకు వెళ్లి ఎన్నో పిశాచవిమోచన మంత్రములు జపించి  ప్రయత్నించి విఫలమయ్యెను. ఆ బ్రహ్మ రాక్షస్సు, “ఓరి వెర్రివాడా! నీవా నన్ను విడిపించునది? అది నీ వల్ల సాధ్యపడదు! పోయి నీ శిష్యుడు ఇళయాళ్వారుని పంపించుము ! అతను ఎవరో కాదు! శ్రియఃపతి అయిన శ్రీమన్నారాయణుని యొక్క నిత్యశూరులైన గరుడవిశ్వక్సేనాదులకు నాయకుడైన ఆదిశేషుడే మానవ రూపములో ఈ కలియుగములో జీవులను ఉద్ధరించుటకు అవతరించెను. అతడే నన్ను తరింపచేసి నాకు మోక్షము ప్రసాదించగలడు. మూర్ఖుడా! నీకును అతడే దిక్కు ! వెళ్లి అతనినే ఆశ్రయించుము ” అని యాదవప్రకాశులను హేళనగా మాట్లాడి ధిక్కరించెను. పిదప ఇళయాళ్వారు తమ పాదములను యువరాణి తలకు తాకించగా ఆ బ్రహ్మరాక్షస్సు యువరాణిని విడిచిపెట్టి సభలో అందరు చూస్తుండగా ఇళయాళ్వారుకు నమస్కరించి మోక్షమును పొందెను. ఈ విధముగా చిన్న వయస్సులోనే భగవద్రామానుజుల అవతార విశేషము జగద్విఖ్యాతమయ్యెను.

ఉడయవర్లు తాము రాసిన శ్రీభాష్యమును దేశమంతటా ప్రచారము చేయుచు కాశ్మీరులోని శారదాపీఠమును దర్శించెను. ఆనాడు శారదాదేవి ఉడయవర్లను స్వయముగా ఆహ్వానించి వారు రాసిన శ్రీభాష్యమును విని పరమసంతోషపడెను. ముఖ్యముగా ఛాన్దోగ్యోపనిషత్తులోని “కప్యాసమ్ పుండరీకమేవమక్షిని” అను వాక్యముకు ఉడయవర్లు శాయించిన, “పరమపురుషుడైన శ్రీమన్నారాయణుని నేత్రములు నీరు త్రాగి ప్రకాశించుచున్న సూర్యుని యొక్క కిరణాలు పడి వికసించిన ఎర్రకలువ పుష్పపు రేకులవలే యున్నవి” అన్న వ్యాఖ్యానమునకు పులకితురాలైన సరస్వతీదేవి, “ఉడయవరే! మీరు కారణ జన్ములు. మీ యొక్క నిర్హేతుక కృప చేత ఈ చేతనాచేతన జీవరాశిని ఉద్ధరించి ఉజ్జీవిమ్పచేయుటకే అవతరించినవారు!నేడు నా పుణ్య విశేషము చేత నాకు శ్రీభాష్యము వినిపించి అనుగ్రహించినారు. మీరే “భాష్యకారులు”గా ప్రఖ్యాతి పొందుదురు గాక! ” అని తెలిపెను. ఈ విధముగా శారదాదేవి కూడా ఉడయవర్ల యొక్క అవతార వైశిష్ట్యమును ప్రకటించెను.

ఇక వచ్చే అధ్యాయములో పూర్వాచార్యులైన పెద్దలు భగవద్రామానుజుల వైభవ ప్రశస్తిని అనుభవించి తరించిన విధమును తెలుసుకొనెదము.

— అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: http://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujar-avathAra-rahasyam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org