Category Archives: Dramidopanishat Prabhava Sarvasvam

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 20

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 19

శ్రీభాష్యం మంగళ శ్లోకము – దివ్య ప్రబంధ అనుభవం – మొదటి భాగము

భగవద్రామానుజులు తమ శ్రీభాష్యం ప్రారంభంలో ఈ మంగళ శ్లోకాన్ని చెప్పి ప్రారంభించారు.

అఖిలభువనజన్మ స్తేమభంగాదిలీలె

వినతవివిధభూతవ్రాతరక్షైకదీక్షే!

శృతిశిరసి విధీప్తే బ్రాహ్మణి శ్రీనివాసే

భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తిరూపా!

           మహాచార్యులైన భగవద్రామనుజుల వారి శ్రీసూక్తిగా వెలువడిన ఈ శ్లోకం సకల భక్త గోష్టికి సదా సర్వదా  అమృతతుల్యము. ఇది భక్తుల హృదయాలలో భక్తి రూపాపన్న జ్ఞానాన్ని నిలుపుతుంది.

ఈ శ్లోకానికి ఆళ్వార్లు అనుగ్రహించిన ప్రబంధాలు, ఆచార్యుల శ్రీసూక్తులు  మూలాధారంగా చెప్పవచ్చు. ముందుగా ఆళ్వార్ల ప్రబంధాలకు ఈ శ్లోకానికి ఉన్న సంబంధాన్ని చూద్దాం.

పరమాత్మ జగత్సృష్టి, స్థితి, సంహారాలను లీలగా చేస్తున్నాడని చెప్పే ‘అఖిలభువనజన్మ స్తేమ భంగాదిలీలె’ అన్న శ్లోక భాగంలోని మాటలు బ్రహ్మసూత్రాలలోని రెండవదైన

‘జన్మాద్యస్య యతః’

అని, ఆ సూత్రంమే

‘యతోవా ఇమాని భూతాని జాయంతే’

అనే ఉపనిషత్ వాక్యం యొక్క మూలం అన్నది  స్పష్టంమవుతున్నది. స్తేమ అన్న పదం రక్షణ, దీర్గ కాలము నిలిపి వుంచుట అన్న అర్థాన్నిస్తాయి. ఇందులో పరమాత్మ తత్వమైన లోక రక్షణత్వము  కూడి వుంది. ఇలా రక్షణ గురించి రామానుజులు ఇంతకు ముందే చెప్పారు. మళ్ళీ

‘వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే’

అన్నారు. శ్రీనివాసుడి లక్ష్యము తన భక్తులను రక్ష్మించటమే అని తెలుస్తున్నది.

శ్లోకం మొదటి భాగంలోనే  చెప్పబడిన ఈ  రక్షణత్వము మళ్ళీ ఎందుకు చెప్పారు?

మన ఆచార్యులు ఎప్పుడు ఏది చెప్పిన శృతి ప్రమాణము తోనే చెపుతారు. ఇక్కడ రామానుజుల ఈ పద ప్రయోగం చూసినప్పుడు దీని మూలం ఆళ్వార్ల పాశురాలలో కనపడుతుంది.

తిరువాయిమోళి 1 – 3- 2 లో   ‘ఎళివరుం ఇయల్వినన్’ అన్న  పాశుర భాగంలో నమ్మళ్వార్లు పరమాత్మ గుణానుభవము చేశారు.  ఆయన యొక్క అప్రాకృత, అసంఖ్యాక, కల్యాణ గుణములను అనుభవిస్తున్నారు.  ఇంకా అయన మోక్షప్రదత్వమును ‘విడాన్ తెళితరు నిలైమై అదు ఒళివిలన్’ అన్నారు.

ఇంతకు ముందే చెప్పిన గుణాలతో ఇది కూడా చేరి వుంటుంది కదా! మళ్ళి చెప్పాలా! అన్న ప్రశ్నకు మన పూర్వాచార్యులు మోక్షప్రదత్వము పరమాత్మ గుణాలలో అత్యున్నత మైనదని అందువలన ఇక్కడ పునరుక్తి దోషము రాదని వివరించారు. ఆళ్వార్లు రెండవ పత్తులో  ‘అణైవదరవణైమేల్’ అని మోక్షప్రదత్వాన్ని   అనుభవించారు. స్వామి దేశికులు కూడా ద్రమిడోపనిషత్ తాత్పర్య రత్నావళిలో  తిరువాయిమోళి యొక్క  ప్రధానఉదేశ్యము  మోక్షప్రదత్వము అని చెప్పారు. అందువలన పరమాత్మ కున్న మోక్ష ప్రదత్వము అనే గుణము విడిగా అనుభవించదగినది అని చెపుతున్నారు. ఇక ‘వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే’ అన్న ప్రయోగంలో రక్షకత్వము అంటే సామాన్యఅర్థంలో కాక మోక్షప్రదత్వము అని బోధపడుతుంది.

వాదికేసరి అళగియ మనవాళ జీయర్ స్వామికి ముందు ఎవరూ తమ సంస్కృత రచనలలో ఆళ్వార్ల శ్రీసూక్తులను ప్రమాణంగా చూపలేదు కావున ఇక్కడి శ్రీభాష్య పంక్తిలో శ్రుత ప్రకాశికాభట్టరు, ‘జగదుద్భవ – స్థితి – ప్రణాశ – సంసార విమోచన‘ అని ఆళవందార్లను ఉదాహరించారు.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/18/dramidopanishat-prabhava-sarvasvam-20/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

 

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 19

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 18

దివ్య ప్రబంధ(అరుళిచ్చెయల్) అనుసంధానం

దివ్య ప్రబంధము (అరుళిచ్చెయల్) మీద మన ఆళ్వార్లకు ఆచార్యులకు అసమాన్యమైన అభిమానం ఉన్నదన్న విషయం విదితమే. పండితులు, పామరులు అన్న భేదం లేకుండా కోవెలలో స్వామి సన్నిధిలో, వీధిలో జరిగే శోభాయాత్రలో పెరుమాళ్లకు ముందు నడిచే గోష్టి దివ్య ప్రబంధాన్ని సేవించడం మనకు తెలిసిన విషయమే . దివ్య ప్రబంధాన్ని నేర్చుకున్న పెద్దలు అలా వీధిలో పరమాత్మా ముందు సేవిస్తూ గోష్టిగా నడుస్తుంటే ఆ ఆనందం చెప్పనలవి కాదు, చూసిన కళ్ళదే భాగ్యం కదా! దివ్యప్రబంధ పారాయణమే ఆ స్వామి వీనులకు విందైనదని మన పూర్వాచార్యులు తెలుసుకొని ఈ ఏర్పాటును చేశారు. ఈ ఏర్పాటుకు ఎప్పుడైనా విధి వశాత్తు భంగం వాటిల్లినా అతి త్వరలో మళ్ళీ జరిపించెందుకు తగిన ఎర్పాట్లు చేశారు. శ్రీవైష్ణవులైన వారందరు  ఈ కైంకర్యాన్ని కోరుకుంటారు.

                కోవెలలలో నిర్వహించే అన్ని కైంకర్యాలలో ఆళ్వార్లు అనుగ్రహించిన ప్రబంధాల ప్రాముఖ్యతను గురించి మన ఆచార్యులు ఎంతగానో కీర్తించారు. అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తమ ఆచార్య హృదయంలో ఈ పద్దతుల గురించి చక్కగా వివరించారు. శ్రీ వేదాంత దేశికులు కూడా ఇలాంటి ప్రబంధ గోష్టులను ఆదరించి తాము  కూడా అందులో పాల్గొన్నట్లు తెలుసున్నది. మన ఆచార్యులు దివ్య ప్రబంధానికి చేసిన విపులమైన వ్యాఖ్యానాల ద్వారా వారికి  ఆళ్వార్ల మీద, వారు పాడిన పాశురాల మీద ఎంత భక్తి, ఆదరాలు ఉన్నాయో,  అలాగే ఆళ్వార్ల, వారి పాశురాల ప్రభావం ఆచార్యుల మీద ఎంత ఉందో తెలుస్తుంది. దివ్య  ప్రబంధానికి శ్రీవైష్ణవం, విశిష్టాద్వైతం అంటే అతిశయోక్తి కాదు. ఆచార్యుల గ్రంధాలను చూస్తేనే ఈ విషయం బోధపడుతుంది.

          దివ్య ప్రబంధ వ్యాఖ్యానాలు, గురుపరంపరా ప్రభావం మొదలైన గ్రంధాలలో చూపిన ఐతిహ్యాల నుండి భగవద్రమానుజుల వంటి ఆచార్యులు, సంస్కృతంలో వేదాంత గ్రందాల రచనలు చేసిన ఆచార్యులకు వీటి మీద ఎంత గొప్ప ఆసక్తి ఉందో తెలుసుకోవచ్చు. భగవద్రమానుజుల సమకాలీనులు, కూరత్తాళ్వాన్ల శిష్యుడు అయిన శ్రీ తిరువరంగత్తముదనార్లు భగవద్రమానుజుల గురించి రాసిన ‘రామానుజ నూత్తందాది’ భగవద్రమానుజులకు దివ్య ప్రబంధం మీద వున్న అపారమైన పట్టును, ప్రేమను తెలియజేస్తుంది.  ఈ పాశురాలను తప్పక నేర్చుకోవాలా! అన్న ప్రశ్నకు తావే లేదు. వాటిని అర్థంతో నేర్చి, ఇతరులకు  చెప్పి అనుభవించినప్పుడే జీవితానికి అర్థం పరమార్థం దక్కుతుంది అనడంలో సందేహం లేదు.

ప్రతి పనిని విమర్శించేవారు కూడా ఉంటారు కదా! కొందరు వ్యక్తులు, కొన్ని సమూహాలు, అసత్య వాదాలు, అర్థ రహిత వాదాలు చేయటం లోకంలో కనపడుతుంది. సాంప్రదాయ పద్ధతులను వివరించేటప్పుడు వీటికి వేద ప్రమాణాలు లేవని వాదిస్తారు. ఇలాంటి శుష్క వాదాలు చేసేవారు వేదంలోని అంతరార్థాలను ఎరుగరు. కానీ వారి వాదనలను వాక్చాతుర్యంతోను, తప్పుడు వాదాలతోనూ నోరు మూయించాలని ప్రయత్నిస్తారు. వేదాలపై  అధిపత్యం లేను వారిని బెదిరించి అదలించి గందరగోళ పరచి నోరుమూయిస్తారు.

ఆగమాలు, వేదాలు నేర్వకుండానే కొందరు కోవేలలో విగ్రహా ప్రతిష్టకు ఆదారాలే లేవంటారు. ఎంతో కొంత నేర్చినవారు తాము ఏది మాట్లాడిన చెల్లుతుందని తమకు ఆ అధికారం ఉందని భ్రమ పడతారు. మన ఆచార్యులు ఎందుకు చెపారు? ఏమి చేశారు, అని లోతుగా తెలుసుకోకుండా నోటికి వచ్చింది చెప్పటం, చేతికి వచ్చింది రాయటం మంచిది కాదు, అది వినాశ హేతువవుతుంది.

ఒక వైపు దివ్యప్రబంధము మీద మన ఆచార్యుల వ్యాఖ్యానాలు మేరుసమానంగా ఉండగా ‘దివ్యప్రబందానికి ఏ మహిమ లేదు’ అని చెప్పేవారి గోష్టి కూడా ఉంది. కోవెలలో దివ్య ప్రబంధము సేవించటం అనూచానంగా వస్తున్నఆచారమని తెలిసినా, దానికి చారిత్రక ఆధారాలు ఉన్నా, వాటికి సంబంధించిన వివరాలు రామానుజుల వారి గ్రంధాలలో ఉన్నా, అలాగా ఎక్కడ ఎవరు చెప్పలేదని వితండ వాదం చేసేవారున్నారు.

ఇది ఒక గుడ్డి వాదన. రామానుజులు రాసిన తొమ్మిది గ్రంధాలలో ఏది వారు ప్రత్యక్షంగా శిష్యులకు బోధించ లేదు, కానీ అందులో చెప్పిన విషయాలు వారి శిష్యప్రశిష్యులు ఆచరించారు, ఇప్పటికి అవి కొనసాగుతూ వస్తున్నాయి. నిత్య గ్రంధం ఒక్కదానిలోనే స్వామి ఆజ్ఞాలను మనం చూడగలుగుతున్నాము. ఇది వారి చివరి గ్రంధము. ఇందులో కోవెలలో నిర్వహించవలసిన కైంకర్య విధానాలను వివరించారు.

స్వామికి దివ్యప్రబంధం మీద అపారమైన భక్తి , ప్రేమ ఉండటం వలన వారు తమ గ్రంధాలలో దివ్య ప్రబందానికి సముచిత స్థానాన్ని ఇచ్చారు. దివ్యప్రబంధం వీనుల విందైనది (సేవిక్కినియ సెంజొల్) అని ప్రసిద్ది గాంచినది. నమ్మాళ్వార్ల తిరువాయిమోళి 10 -6-11 లో ‘కేట్పార్ వానవర్ గళ్ సేవిక్కినియ సెంజొలే’ అని అన్నారు.

నమ్మాళ్వార్ల తిరువాయిమోళి తోనే నిరంతరం మునిగి వుండే స్వామి, ‘శ్రీ సూక్తైః స్తోత్రైః అభిస్తూయ’ అని అన్నారు. అది ఒక శబ్ద ప్రవాహము  అది స్తోత్రం, ఎదో ఒక స్తోత్రం కాదు  శ్రీ సూక్తి స్తోత్రం …….చేవులకింపైనది.

భగవద్రామానుజులు తమకు ఆళ్వార్ల శ్రీసూక్తులపై ఉన్న అధికారం, మమకారం ప్రకటితమయ్యేట్టుగా వీటిని ఆళ్వార్ల పాశురాలు అనకుండా ఆళ్వార్లె  పేర్కోన్నట్టుగా ‘చెవికింపైన మంచి మాటలు’ అనేవారు.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/17/dramidopanishat-prabhava-sarvasvam-19/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

 

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 18

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 17

దరిలేని ఆనందములో వివిధ అనుభవాలు

భగవద్గీత 10 వ అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో “మచ్చిత్తా మత్ గత ప్రాణా బోధయంతః  పరస్పరం – కతయం తస్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ”

ఎవరైతే నన్ను ఎప్పుడూ చింతిస్తారో నన్ను ఆత్మార్థంగా భక్తి చేస్తారో వాళ్ళు పరస్పరం నాగురించి బోధించుకుంటూ,  నాగురించి మాట్లాడుతూ ఆనందాన్ని, తృప్తిని పొందుతుంటారు అని అర్థం.

               ఈ శ్లోకం భక్తుల మధ్య జరిగే సంభాషణ, దానివలన వాళ్ళు పొందే అనందం, పరస్పరం బోధించు కోవటం గురించి చెప్తున్నది. మనవాళ మాముణులు తమ ఉపదేశ రత్నమాల చివరలో ఒక్కోక్కరు వారి వారి స్వభావానికి తగినట్లుగా గుణాతిశయాన్ని పాడుతారని అన్నారు.

ఇలాంటి శ్లోకాల అర్థం వివరించడంలో భగవద్రామానుజుల వైఖరి ప్రత్యేకమైనది. ఈ భగవద్గీతా  శ్లోకం చివరలో  ‘తుష్యంతి చ  రమంతి చ’ అన్న ప్రయోగం రసవత్తరమైనది. తృప్తి చెందడం, సంతోషించటం అని రెండు పదాలలో చెప్పటం ప్రత్యేకమైన అర్థాన్ని ఇస్తుంది.

శంకర భగవత్పాదులు, ‘తుష్యంతి – పరితోషం ఉపయంతి, రమంతి రతిం చ ప్రాప్నువంతి ప్రియ సంగత్యా ఇవ” అన్నారు. అర్థాత్  ‘తుష్యంతి – అన్న ప్రయోగం  సంతోషం పొందటాన్ని , రమంతి – అన్నప్రయోగం  కోరుకున్న వస్తువును పొందటాన్ని తెలియజేస్తుంది అని అన్నారు కానీ, ఆ సంతోషంమో, కోరుకున్న వస్తువో ఎలా పొందాలో వివరించలేదు.

శ్రీమద్వాచార్యులు కూడా ఈ శ్లోకానికి అర్థాన్ని వివరించలేదు.

దీనికి భగవద్రామానుజులు   ‘వక్తారః  తత్వచనేన అనన్య ప్రయోజనేన తుష్యంతి!

శ్రోతారచ్చ తశ్రవణేన  అనవధికాతిశయ ప్రియేణ రమంతే!”=======

రామానుజులవారు  చేసిన అన్వయం  అసామాన్యమైనది. ఈ అన్వయం, పై శ్లోకార్థాన్ని చక్కగా వివరిస్తున్నది. పరమాత్మను గురించి చర్చించుకునేవాళ్ళు ఆ చర్చ వలననే ఆనందాన్నిపొందుతారు. వారికి  వేరే లక్ష్యాలు లేవు. వేరే ఆనందమే లేదు అన్నారు.

ఈ వివరణ చాలా గొప్పది ఎందుకంటే, ‘ తుష్యంతి చ  రమంతి చ ‘ అన్న రెండు పదాలకు అర్థాన్ని చెపుతుంది.

కృష్ణుడు “బోధయంతః పరస్పరం” అన్నాడు.

వాళ్ళు పరస్పరం నా గురించే రాస్తున్నారు చెపుతున్నారు, మాట్లాడుతున్నారు,అని చెప్పి,

ఇంకా, “మాం నిత్యం కథయంతి” అన్నారు.

వాళ్ళు నాగురించే మాట్లాడుతున్నారు. అందులో ఒకరు వక్త, మరొకరు శ్రోత. ఇద్దరు వాళ్ళ స్టితిని మార్చుకుంటూ వుంటారు. మరొకసారి వీరు వక్త, వారు శ్రోత అవుతారు. అందువల్ల ఇద్దరు విని ఆనందిస్తారు, మాట్లాడి ఆనందిస్తారు అన్నారు. వేదాంత దేశికులు తమ తాత్పర్యచంద్రికలో

“కతాయా శ్రవణయో ఎకస్మిన్నేవ కాల భేదేన సంభావితవత్”

(ఇద్దరు వినటం, మాట్లాడటం వేరు వేరు కాలలో జరుగుతుంది) అన్నారు .

                   గీతా శ్లోకాన్ని బాగా పరిశీలించి రామానుజులవారు ఈ అర్థాన్ని చెప్పారు. తిరుమంగై ఆళ్వార్ల అనుభవమే  ఈ అర్థం చెప్పడానికి వీరికి మూల ప్రమాణంగా అమరింది.  ఆళ్వార్లు  తమ నాన్ ముగన్ తిరువందాదిలో

“తెరిందెళుది వాసిత్తుం కేట్టుం ….పోక్కినేన్ పోదు”

(తెలుసుకొని, చదివి, విని పొద్దుపుచ్చాను.) అని అన్నారు. బోధయంతం పరస్పరం –తెలుసుకొని అంటే తెలియబరచి లేక మాట్లాడి, కతయంతస్చ మాం  నిత్యం తుష్యంతి చ – విని, అంటే చెవులతో విని, రమంతి చ — పొద్దు పుచ్చటం. పరమాత్మతో అనవతరం ఉన్నట్లు చెప్పటము- మాం నిత్యం కతయంతా. అదే పాశురంలో ఆళ్వార్లు “తరిత్తిరున్దేనాగవే ‘ (ప్రాణాలు తరించి ఉన్నాను ) అనవతరం పరమాత్మతో పొద్దు పుచ్చటం వలన ప్రాణాలు తరించి ఉన్నాను‘ అన్నారు. “మచ్చిత్తా మత్ గత ప్రాణా” అన్న దానిని రామానుజులవారు  ‘మయా వినా ఆత్మ తారణం అలాభమానాః’ నేను లేకపోతె తరించి ప్రాణాలు నిలుపుకోలేని వారు. అని వివరించారు.

రామానుజులవారు ఈ విధంగా పై గీతా శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పటానికి తిరుమళిశై  ఆళ్వార్ల ఈ పాశురమే మూలప్రమాణమైనది. ఈ శ్లోకానికి అర్థం, ‘తిరుమళిశై పిరాన్ వంటి దాసులు నేను లేకుండా తరించ లేరు, అందువలన నేను నిరంతరం వారి చింతనలో ఉంటాను. దీనికి నా భక్తులు నిరంతరం బోధయంతం పరస్పరం అని చెప్పుకుంటూ, వింటూ, ఆనందిస్తూ, ఆనందింప చేస్తూ, ఉజ్జీవిస్తారు’ అని కృష్ణుడి భావన అని రామానుజులవారు వివరించారు .

ఆళ్వార్ల శ్రీసూక్తులు విలంభనం లేకుండా అనుభవించడం వలననే  రామానుజులవారు  మనకు ఇంత చక్కని  అర్థాన్ని అందించగలిగారు .

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/16/dramidopanishat-prabhava-sarvasvam-18/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 17

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 16

అంతులేని వాత్సల్యం

              భగవద్రామానుజులు తమ శరణాగతి గద్యంలో ‘ అఖిలహేయ ప్రత్యనీక ‘ అని మొదలుపెట్టి పరమాత్మ దివ్యనామాలనేకం అని చెప్పారు. ఇందులో వీరు నామాలన్నింటిని సంబోధనాత్మకంగానే ప్రయోగించారు.

భగవద్రామానుజులు, ‘మహావిభూతే! శ్రీమన్నారాయణా!  శ్రీవైకుంఠనాథా! అని సంభోదించిన తరవాత స్వామి దివ్యగుముణములను పేర్కొంటూ ‘అపారకారుణ్య సౌశీల్య వాత్సలౌధార్య సౌందర్య మహోధదే! ‘అని వర్ణించారు. పరమాత్మా లోతైన, అందమైన, కళ్యాణగుణ మహాసముద్రుడు. వీరి కళ్యాణ గుణాలు అంతులేనివి, అనుభవానికి అంతులేనివి, అపార మైనవి. ఈ లోకంలోని జీవాత్మలను తరింప చేసే ఆయన స్వరూపము దయ, సౌలభ్యము,  స్వామిత్వం, సౌదర్యం, వాత్చల్యం అంతులేనివి. వీటిలో వాత్సల్యం అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాము .

వాత్సల్యం :

                      చేతనుల దోషాలకు దండించకుండా ఆ దోషాలను కూడా అనుభవించే స్వభావము. కొందరు జ్ఞానులు ఆయన దోషాలను భిన్నం అంటారు. ఇక్కడ ఆ వివాదం మనకు అప్రస్తుతం . ఈ గుణము తల్లిప్రేమలో చూడవచ్చు. తల్లి తన బిడ్డలో దోషాలున్నా వాటితో సహా ప్రేమిస్తుంది. ఆ ప్రేమలో నిబంధనలు ఏవి ఉండవు.               ‘ ‘వత్చ’ అంటే ఆవు దూడ. అప్పుడే పుట్టిన దూడ శరీరానికి అంటుకొని వున్న మాలిన్యాన్ని ప్రేమతో తన నాలుకతో నోటిలోకి తీసుకుంటుంది, ఆ ప్రేమయే వాత్సల్యం. అలాగే జీవాత్మ విషయంలో పరమాత్మా చూపేది ఎల్లలు లేని వాత్సల్యం.

                      భగవద్రామానుజులు శరణాగతి గద్యంలో ‘ ఆశ్రిత వాత్సల్య జలధే ‘ అంటారు. అంటే పరమాత్మా ఒక్క వాత్సల్యం గుణంలోనే సముద్రమంతటి వాడు! భగవద్రామానుజులు ఈ వాత్సల్య గుణాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెపుతున్నారు? అని చూస్తే  పరమాత్మ గుణాలన్నింటిలో ఈ గుణమే చేతనుల మనసును కరిగించే శక్తి గలది అమితాశ్చర్యకరమైనది. రామానుజుల వంటి పరమ భక్తి గలవారికి ఈ గుణానికి కరిగి పోతారు. తమ దైవీకమైన అనుభవంలో దానినే మళ్ళీ మళ్ళీ చెపుతుంటారు.

           ఆళ్వార్లు తమ ప్రబంధాలలో కూడా పరమాత్మ వాశ్చల్య గుణాన్ని ఎంతగానో కీర్తించడం కనపడుతుంది.

           శ్రీనివాసుడిని  నమ్మాళ్వార్లు ‘అగల కిల్లెన్ ఇఱైయుం ఎన్రు అలర్మేల్ మంగై ఉరై మార్బా‘ అని కీర్తించారు.  పరమాత్మ శ్రీహృదయాన్ని అమ్మవారు క్షణ కాలమైనా విడవకుండా ఉంటుంది. దాసులు ఆయనను ఆశ్రయించేసమయంలో ఆమె ఆయనలోని గుణాలను ప్రేరేపిస్తుంది. అలా ప్రేరేపింపబడిన గుణాలలో ఈ వాత్సశ్చల్య గుణమే ముందు నిలుస్తుంది. ఇందులో ఆశ్చర్య పడవలసిన విషయం ఏది లేదు ఆమె సహజంగానే వాత్సల్య గుణోజ్వల, అందువలన అయనలోను ఆ గుణాన్నే ప్రేరేపిస్తుంది .

                వాత్సల్య గుణము లాగా మరొక గుణము లేదు అని తెలిసే భగవద్రామానుజులు ఇతర గుణాలకన్నా ఈవాత్సల్య  గుణాన్నే ప్రత్యేకంగా చెప్పారు. మన పూర్వాచార్యులు అనవసరముగా ఒక్క మాటను వాడటం గాని, చెప్పటం గాని జరగదు. రామానుజులు, ‘అపార కారుణ్య సౌశీల్య  వాత్సలౌధార్య సౌందర్య మహోధదే!’  అని ముందు పరమాత్మ అపూర్వ గుణాలను  చూపి, తరువాత వాటితో కూడి వున్న వాటికన్నా ప్రత్యేకమైన గుణమైన వాత్సల్యమనే గుణాన్ని ప్రయోగించారు. ‘ఆశ్రిత వాశ్చల్య జలధే!’ అని అన్నారు. ఈ వాత్సల్య గుణం పరమాత్మా గుణ సముద్రంలోనిదే అయినా ఇది ప్రత్యేకమైనది గొప్పది అసామాన్యమైనది అనితెలుస్తున్నది.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/15/dramidopanishat-prabhava-sarvasvam-17/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 16

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 15

ప్రధాన సంకేతం

                           ఆత్మ స్వరూపం గురించి పలువురు అనేక విధాలుగా పరిశోధనలు చేశారు. పలు రకాలుగా వ్యాఖ్యానించారు. ఇదియే అనేక తత్వాలకు, తత్వ పరిశోధనలకు ఆధారమైంది. వివిధ సిధ్దాంతాలలో ఆత్మ స్వరూపము గురించి భేద భావాలు, వాటి మీద జరిగిన చర్చలే భిన్నాభిప్రాయాలకు కారణమైనది. ఈ విషయంగా భగవద్రామానుజుల అభిప్రాయమేమిటో ఇక్కడ చూద్దాము.

                     మన పూర్వాచార్యులైన నమ్బిళ్ళై , పెరియవాచ్చాన్ పిళ్ళై వంటి మహాచార్యుల రచనలలో భగవద్రామానుజుల వారి జీవిత కాలంలో జరిగిన ఒక సంఘటన పేర్కొనబడింది. ఆత్మ ఆనందమయ, జ్ఞానమయమైనది అని చెప్పబడింది. ఈ ఆత్మ ఈశ్వరునకు శేషభూతమైనది అని చెప్పబడింది. ఈ రెండు సంకేతాలలో ప్రధానమైనది ఏది? అన్న ప్రశ్న భగవద్రామానుజుల వారి గోష్టిలో ఉదయించిందట.

నంపిళ్ళై

రామానుజులవారు ఈ ప్రశ్నకు తాము జవాబు చెప్పగలిగినా తమ ఆచార్యులైన తిరుకోష్టియూర్ నంబిగారి అభిమతమును వారి శ్రీసూక్తిగా వినాలని భావించారు. అందుకోసం తమ ప్రియ శిష్యులు, జ్ఞాన పరిపూర్ణులు అయిన శ్రీకూరత్తాళ్వాన్ ను పిలిచి, అనువైన సమయం చూసి తిరుకోష్టియూర్ నంబిగారిని ఈ సందేహానికి జవాబుఅడిగి తెలుసుకొనిరమ్మని  పంపించారు. కూరత్తాళ్వాన్ ఆచార్యఅనతి మేరకు తిరుకోట్టియూర్ నంబిగారి దగ్గరకువెళ్ళారు.

 

అక్కడ ఆచార్యులు చెప్పినట్టుగా అనువైన సమయం చూసి ఈ ప్రశ్నను లేవనేత్తుదా మనుకునే వరకే ఆరు నెలల కాలం గడచిపొయింది. కూరత్తాళ్వాన్ సరే వేళ్ళివస్తాను,ఆనతి ఇమ్మని తిరుకోట్టి యూర్ నంబిగారిని అడిగారు. అప్పుడు తిరుకోట్టియూర్ నంబి ‘ ఆడియెన్ ఉళ్ళాన్  ఉడనుళ్ళాన్ ‘ అన్నారు. ఇది తిరువాయిమోళిలో 8వ పత్తులో 8వ తిరువయిమోళిలోని 2వ పాశుర భాగము.  ఆత్మ సంకేతాలలో అది ఈశ్వరుడికి శేషమవటమే ప్రధానమైన సంకేతము అని తెలియజేసే పాశురభాగము. అదియే తిరుకోట్టియూర్ నంబి గారి అభిమతము. ఇందులోని ‘ఆడియెన్‘ పదము చెప్పే అర్థమే  ప్రధానమైనది.

తిరుకోష్టియూర్ స్వామి

ఆళ్వార్ల శ్రీసూక్తులలో ఈ ‘ఆడియెన్‘ పదము తరచుగా చూడవచ్చు. అలాంటప్పుడు తిరుకోష్టియూర్ నంబిగారు ఈ సందర్భాన్నే ఎందుకు చెప్పారు. ఎదో ఒకటని చెప్పారా? దీనికి ఏదైనా ప్రత్యేకతలున్నయా? అని పరిశీలిస్తే .. తిరువిరుత్తం అనే ప్రబంధంలో నమ్మాళ్వార్లు ‘అడియెన్  సెయ్యుం విణ్ణప్పమే‘ అనే ప్రారంభించారు. పైన పేర్కొన్న 8వ పత్తు లోని 8వ తిరువయిమోళిలో ప్రారంభంలోను  ‘అడియెన్‘ అనే అన్నారు. మరి తిరుకోష్టియూర్ నంబిగారు ఈ సందర్భాన్నే ఎందుకు ఎంచుకున్నారు? దీని ఔచిత్యం ఏమిటి? అని చూద్దాము .

 

                     ఇతర సన్నివేశాలలో ‘అడియెన్‘ అన్న ప్రయోగం ఒక ప్రత్యేక ఆత్మవిశేషాన్ని తెలియజేయటం లేదు. ఉదాహరణకు ‘అడియెన్  సెయ్యుం విణ్ణప్పమే‘ అనే ప్రయోగాన్ని తీసుకుంటే, విన్నపము అనేది శరీరమున్న అత్మకే సాధ్యమైన విషయము శరీరమును వదిలివేసిన ఆత్మకు సాధ్యము కాదు. ఈ ఉదాహరణ శరీరములో బందింపబడిన ఆత్మను తెలియజేస్తుంది కానీ శరీరమును కడచిన ఆత్మను సూచించలేదు. ఆత్మ పరమాత్మకు శేషభూతమని  చెప్పే సందర్భం కేవలం తిరువాయిమోళి 8 -8 -2 లోనే ఉన్నది.

స్వామి నమ్మాల్వార్

ఈ పదము యొక్క అర్థాన్ని ముందుగా చూద్దాము. ఈ పాశురములో ఆళ్వార్లు పరమాత్మ, ఆత్మను అవలంభించి ఉండేవాడన్న అర్థంలో  ‘అడియెన్ ఉళ్ళాన్‘ అని, అవలంభించి ఉన్నాడు అని తెలియ జేయడానికి  ‘ఉడ నుళ్ళాన్‘ అని అనుగ్రహించారు. ఈశ్వరుడు అంతట వ్యాపించి ఉన్నాడని, ఆత్మలో కూడా ఉన్నాడని, శరీరములో కూడా వ్యాపించి ఉన్నాడని అర్థము. అలౌకికమైన ఆత్మలోనూ, లౌకికమైన శరీరములోనూ వ్యాపించివున్నాడు అని తెలియజేస్తున్నారు. ‘ఉడ నుళ్ళాన్‘ అనటం వలన శరీరంలోని వ్యాప్తిని, ‘అడి యెన్  ఉళ్ళాన్ ‘ అనటం వలన ఆత్మలోని వ్యాప్తిని వేరుచేసి చూపిస్తున్నారు. ‘ఉడల్‘ అని  శరీరం ఆత్మ నుండి వేరు అని ఆళ్వార్లు ప్రత్యేకంగా వివరించనవసరం లేకుండానే  స్పష్టమవుతున్నది.

 

               ఈ సందర్భము, దీని వివరణ చాలా అందంగా ఉన్నా , ఇదే వాస్తవమైనది అనడానికి ఇంకా ఏవైన ఉదాహరణలున్నాయా! రామానుజులు తమ ఇతర గ్రంధాలలో ఎక్కడైనా దీనిని ప్రస్తావించారా?

అన్న విషయం తెలుసుకోకపొతే ఇది కేవలం కథగా మిగిలిపోవచ్చు. అప్పుడు దీనికి ఇంత ఔన్నత్యం ఒనగూడదు. స్వామి గీతా భాష్యంలో ‘జ్ఞానీ‘, ‘జ్ఞానవంతుడు‘ అని వచ్చిన సందర్భాలలో ఈ ప్రమాణాన్నే ఉదాహరించారు. శంకరభగవత్పాదులు సాదరణంగా చేతనుల గురించి చెప్పె సమయంలో “ విష్ణోః తత్వ విత్ “ (విష్ణువు యొక్క తత్వమును తెలిసిన వాడు)  అని అన్నారు. కానీ రామానుజులు జ్ఞాని అయిన వాడు ఆత్మ, పరమాత్మకు శేష భూతమని తెలుసుకొని వుంటాడు అనే అర్థములో ‘భగవత్ శేషతైక రస ఆత్మ స్వరూపవిత్ –జ్ఞానీ“ అని అన్నారు. ఆళ్వార్లు  ‘నేను‘  అంటే ‘ఆడియెన్‘  అని చెప్పిన వివరణకు అనుగుణంగానే రామానుజులు జ్ఞానము కంటే శేషత్వమే ఉన్నతమైనదని స్పష్టంగా చెప్పారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/14/dramidopanishat-prabhava-sarvasvam-16/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 15

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 14

శ్రీ భట్టనాధ ముఖాబ్జ మిత్రం

                భగవద్గీతలో కొన్ని ఉదాహరణలను చూస్తే, భగవద్రామానుజులకు దివ్యప్రబంధలో ఉన్న ప్రావీణ్యం మనకు బోదపడుతుంది.  దివ్యప్రబంధలోని మధురిమను జోడించటం వలన వీరి వ్యాఖ్యాన శైలి ప్రత్యేకంగా ఉంటుంది.

పెరుమాళ్ కొయిళ్ ఆళ్వారులు మరియు ఆచార్యులు

                “ చతుర్విధా భజంతే మాం  “ (భగవద్గీగీత 7-16) అనే శ్లోకమలో నలుగురిని పేర్కొన్నారు. 1. ఆర్తా

2. జిజ్ఞాసు

3.అర్థార్తి

4.జ్ఞాని

ఈ నలుగురి గురించి చెప్పేటప్పుడు వ్యాఖ్యాతలలో అభిప్రాయ బేధాలు కనపడుతున్నాయి. 7వ అధ్యాయంలో శ్రీ కృష్ణుడు తనను శరణాగతి చేయడం వలన మాత్రమే (యే మామేవ ప్రపద్యంతే ) చేతనులు మాయమయమైన ఈలోకంలోని క్లేశాల నుండి బయట పడగలరని (తే మమా మాయాం తరంతి) తన ఉన్నతమైన మాహాత్మ్యాన్ని (దైవిమాయ) ఉపదేశించారు.

పెరుమాళ్ చరణాల వద్ద ఆళ్వారుల పూర్ణ శరణాగతి

          ఈ శ్లోకంలో పరమాత్మ తనను శరణాగతి చేసేవారు నాలుగు రకాల వారు అని అన్నారు. శరణాగతి చేసినప్పుడు ‘ప్రపద్యంతే ‘ అన్నవాడు, ఇప్పుడు ‘భజంతే‘ అంటున్నాడు. ‘భజంతే‘ అన్న ప్రయోగానికి శ్రీ శంకరులు, ‘సేవంతే‘ అన్నారు. భక్తీ, శరణాగతి రెంటి అర్థము కైంకర్యము చేయటమే అవుతుంది. పైన చెప్పిన నాలుగు రకాల వారు శ్రీ కృష్ణుని దాసులే.

విభిన్న రకాల కృష్ణుని సేవలు

దీనికి వివరణగా శ్రీ శంకరులు ‘ఆర్తాః‘ = తస్కర వ్యాగ్రా రోగాదినా అబిభూతాః ఆపన్నః

జిజ్ఞాసు = భగవత్ తత్త్వం జ్ఞాతుమిచ్చతి యః

ఆర్తార్థి =ధనకామః

జ్ఞానీ = విష్ణోః తత్వవిత్ ‘ అని వివరించారు .

                 పై నలుగురు తమకు కావలసినది కోరటంలో వైవిధ్యం కనపడుతుంది. మొదటి వర్గం వారు దొంగల నుండి, క్రూర జంతువుల నుండి, భయంకర వ్యాధుల నుండి తమను కాపాడమని ప్రార్థించేవారు, రెండవ వర్గం వారు భగవత్తత్వాన్ని, కృష్ణతత్వాన్ని అకాంక్షించేవారు, మూడవ వర్గం వారు సంపదను కోరుకునేవారు, నాలుగవ వర్గం వారు భగవత్తత్వం తెలిసిన జ్ఞానులు.

తిరుమలలో రామానుజులు

         వేదాంతంలో చిత్, అచిత్, ఈశ్వరుడు అని మూడు తత్వాలు ఉండటమే చేతనులలో నాలుగు వర్గాలవారు ఉండటానికి కారణం అని స్వామి రామానుజులు నిర్వహిస్తున్నారు.  ఆత్మ, తాను స్వయంగా ఈశ్వర స్వరూపమైన అచిత్తును వెదుకుతూ వెళుతుంది. ఇక్కడే ఈశ్వరుడి భక్తులలో భేదం మొదలవుతున్నది. ఐశ్వర్యాన్ని కోరే వారిలో రెండు రకాలవారుంటారు . ఒకటి భ్రష్టైశ్వర్యం (ఒకప్పుడు సంపదలు ఉండేవి. వాటిని పోగొట్టుకున్నారు ప్రస్తుతం వాటిని పొందటం కోసం ప్రార్థింస్తున్నారు), రెండు అపూర్వఐశ్వర్యం (గతంలో సంపదలు ఏవీలేవు, ఇప్పుడు సంపదలు కోరుకుంటున్నారు). ఈ విభజన చేతనునికో ఈశ్వరుడికో తగనిది. కైవల్య ప్రాప్తి గాని, భగవత్ప్రాప్తి గాని, మోక్షప్రాప్తి గాని, నిరంతరమైనది. దానిని పోగొట్టుకోవటమో మళ్ళీపొందటమో సాద్యం కాదు. అవి కొత్తగా కోరి పోందవలసినవి మాత్రమే. కావున పై నాలుగు రకాల భక్తులు  భ్రష్టైశ్వర్య కామః , అపూర్వఐశ్వర్య కామః , కైవల్య కామః , భగవత్ కామః అని అన్నారు.

భగవద్రామానుజుల ఈ వ్యాఖ్యానం ఎక్కడ లభించింది అని ప్రశ్నించుకుంటే, తిరుపల్లాండులో పెరియళ్వార్లు భక్తులను పై నాలుగు వర్గాలుగా పాడినందునే వీరికి ఈ విభజన లభిచింది అని బోధపడుతుంది. మొదటి రెండు పాశురాల తరవాత వరుసగా మూడు పాశురాలలో  ఈ భావాన్నే పెరియళ్వార్లు పాడారు.

శ్రీ భట్టనాథ – ముఖాబ్జ – మిత్రః

ఉదాహరణకు ‘వాళాళ్ పట్టు‘ అనే పాశురములో  భగవంతుని కోరే వాళ్ళను, ‘ఏడు నిలత్తిల్‘ లో కైవల్యార్థులను, ’అండ కులత్తుక్కు‘ లో అపూర్వైశ్వర్యార్థులను, భ్రష్టైశ్వర్యార్థులను గురించి చెప్పారు. ఈ ప్రబంధంలో పెరియాళ్వార్లు భగవంతుడికి మంగళాశాసనము చేయడానికి కోరికగలవారిని రమ్మని పిలిచారు.

            భక్తులకు సంభందించిన భగవద్గీతలో చెప్పిన విభజనను వివరించడానికి రామానుజులు తిరుపల్లాండులోని పెరియాళ్వార్ల శ్రీసూక్తులను ప్రకాశింపచేసారు. అలాగే శ్రీమణవాళమామునులు రామానుజులకు  పెరియాళ్వార్ల మీద ఉన్న భక్తిని ప్రకాశింపచేస్తూ ‘శ్రీభట్ట నాధ ముఖాబ్జమిత్రులు‘ అని కొనియాడేవారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/13/dramidopanishat-prabhava-sarvasvam-15/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 14

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 13

 

తిరుప్పావై జీయర్

               తిరువరగంగత్తముదనార్, స్వామి రామానుజులను “చూడికొడుత్తవళ్  తోల్ అరుళాల్ వాళ్గిన్ర వళ్లల్” (ఆండాళ్ అనుగ్రహ సంపన్నులు) అని కొనియాడేవారు. స్వాభావిక కృపా సంపన్నురాలైయన ఆండాళ్ వలన రామానుజులు ఉజ్జివించారని వారి అభిప్రాయం. తిరుప్పావైలోని పద్దెనిదవ పాశుసురానికి సంబంధించిన ఐతిహ్యం ఒకటి ఉంది. దాని వలననే  స్వామి రామానుజులు తిరుప్పావై జీయర్ గా  కొనియాడబడుతున్నారు.

స్వామి రామానుజుల మీద తిరుప్పావై ప్రభావాన్ని తెలిపే ఉదంతాన్ని ఇక్కడ చూద్దాం.

భగవధ్గీత ౩వ అధ్యాయంలో కర్మయోగం గురించి చెప్పినప్పుడు  ఇలా చెప్పారు.

 ” యద్యదాచరతి శ్రేష్టః తత్త దేవేతరో జనః

స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ” ( 3-21)

‘సామాన్య అర్థంలో చూస్తె ఈ శ్లోకంలో విశేషం ఏమి కనపడదు, కానీ తెరచి చూస్తే  మంచివారి నడవడి, శీలము గురించి చెప్ప బడిందని బోధపడుతుంది.  ఈ శ్లోకంలోని రెండవ పాదాన్ని శంకర భగవత్పాదులు

“సః శ్రేష్టాః యత్ ప్రమాణం కురుతే – లౌకికం వైదికం వా, లోకాః తత్ అను వర్తతే – తదేవ ప్రామాణికరోతి ఇతి అర్థం” అన్నారు.

లౌకిక వైదిక విషయాలలో సామాన్యులు ఎక్కువ మంది ఏది చేస్తే అదే ప్రమాణంగా స్వీకరింపబడుతున్నది అన్నారు.

“యత్ వాక్యాధికం  ప్రామాణీ కురుతే యదుక్త ప్రకారేణ తిష్యంతి ఇతి అర్థతః” అని అన్నారు.

పై వివరణలలో “యత్ ప్రమాణం“ అన్నభాగం “యత్ “ — “ ప్రమాణం“ అని విడగొట్టబడింది. ఈ  ప్రయోగానికి స్వామి రామానుజులు తమ భాష్యంలో ఒక ప్రత్యేకమైన వివరణను చెప్పారు.

“యత్ ప్రమాణం“ అన్న ప్రయోగాన్ని బహువ్రీహి సమసంగా గ్రహించి వివరించారు. దీనికంటే ముందు ఈ శ్లోకానికి వీరు చేసిన వ్యాఖ్యానాన్ని ఒక సారి చూడవలసి వుంది.

శ్రేష్టః – క్రుస్న శాస్త్ర జ్ఞాత్రుతయా అనుష్టాత్రుతయా చ ప్రతితః

పెద్దలనగా శాస్త్రములను బాగా చదివి, దాని ప్రకారం ఆచరిచేవారు.

‘ యద్యదాచరతి తత్త దేవ అక్రుస్న జనా అపి ఆచరతి‘

 శాస్త్ర జ్ఞానము అంతగాలేని సామాన్యులు పెద్దల ఆచరణను చూసి అనుసరిస్తారు.

“అనుష్టీయమానం అపి కర్మ శ్రేష్టో, యత్ ప్రమాణం యత్ – అంగయుక్తం అనుతిష్టతి  తత్  అంగయుక్తం ఏవ అక్రుత్స్నవిల్లోకోను తిష్టతి.“

ఈ ప్రకారం చేయబడే కర్మలలో సామాన్యులు, పెద్దలు చేసేకర్మలనే అనురిస్తున్నారు.

యత్ ప్రమాణం అన్న ప్రయోగం చక్కగా వివిరింపబడింది. ఇక్కడ రామానుజులవారు ఇచ్చిన వివరణ చక్కగా సరిపోవటమే కాక చాలా చక్కగా అమరింది. సామాన్యులు కర్మలను ఆచరించే విధానాన్ని వివరించే ప్రకరణంలో  కర్మ, కర్మఫలములను మాత్రమే వివరిస్తే సరిపోతుంది. పెద్దలు ఆచరించినదానినే సామాన్యులు ఆచరిస్తారు అని చూపటం చాలా చక్కగా అమరింది. ఎందుకంటే సరియిన ప్రమాణాన్నే అనుసరించాలన్న విషయము భగవగ్దీతలో ౩వ అధ్యాయంలో ప్రస్ఫుటంగా చెప్పలేదు. అర్జునుడికి ఏ ప్రమాణము తగినది అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. కర్మను గురించిన చర్చ మాత్రమే జరిగింది. అందువలన సామాన్యుల ఆచరణకు సంబంధించిన ప్రమాణాన్ని గురించి చెప్పలేదు.

                స్వామిరామానుజులు ఈ అర్థాన్ని తిరుప్పావై నుండి గ్రహించి మనకు అనుగ్రహించారన్న విషయం గుర్తించ వలసిన విషయము.  తిరుప్పావైలోని 26వ పాశురములో ఆండాళ్,  “మేలైయార్ సేయ్వనగళ్ వేండువన కెట్టియేల్“  అన్నది. ‘వేండువన ‘  అన్న ప్రయోగమే ఇక్కడ ‘యత్ ప్రమాణం‘ అన్న ప్రయోగాన్ని వివరిచేదిగా అమరింది.

                సమస్త విషయాలకు ప్రమాణంగా స్వీకరించే వేదము పలు నియమనిబంధనలను చెప్తుంది. ఇంకా, పెద్దలు వేదములో చెప్పబడ్డ అన్నింటిని పెద్దలు ఆచరించటము లేదు. వేటిని ఆచరించక పొతే పాపమో వాటిని మాత్రమే ఆచరిస్తున్నారు.

“క్రియమాణమ్ న కస్మైచిత్ యత్ అర్దాయ ప్రకల్పతే

అక్రియావదనర్దాయ తతు కర్మ సమాచరేత్“

ఫలమును ఆశించి చేసేకర్మలను వాళ్ళు చేయటం లేదు. చేయకుండా వదిలి వేస్తె పాపం అన్న విదిత కర్మలను మాత్రమే వాళ్ళు చేస్తున్నారు.

 ఒక సన్యాసి ఆశ్వమేధం చేయడానికి సంకల్పించరు కదా!

పెద్దలు ఆచరించే కర్మలు అవి లౌకికమో వైదికమో ఏదైనా సామాన్యులు  ఆచరించతగినవిగా తిరుప్పావైలోను  భగవగ్దీతలోను చెప్పబడ్డాయి. అందువలన శీలవంతులైన, వేద విదులైన పెద్దల ఆచరణయే సామాన్యులకు శిరోదార్యము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/12/dramidopanishat-prabhava-sarvasvam-14/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org