Monthly Archives: August 2016

చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజ వైభవ ప్రశస్తి

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజుల అవతార రహస్యము

పూర్వ వ్యాస మందు (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/06/14/charamopaya-nirnayam-ramanujar-avathara-rahasyam/) భగవద్రామానుజుల అవతార రహస్యము తెలుసుకొంటిమి! ఇక ఈ వ్యాసములో భగవద్రామానుజుల వైభవ ప్రశస్తి పెద్దలైన పూర్వాచార్యులు ఏవిధముగా అనుభవించిరో తెలుసుకొనెదము.

కూరత్తాళ్వార్లు చోళ రాజు యొక్క మత ఛాందసమునకు బలి కాబడి చూపు కోల్పోవడమే కాక భగవద్రామానుజుల వియోగము కూడా పొంది ఎంతో కాలము తల్లిని విడిచిన పసిబిడ్డ వలె భగవద్రామానుజుల కొరకు విలపించారు. పిదప భగవద్రామానుజులు తిరిగి శ్రీ రంగమునకు విజయము చేయుట జరిగి చోళరాజు చేత అవస్థ పడ్డ కూరత్తాళ్వార్ల కథ తెలుసుకుని ఎంతో బాధపడిరి. భగవద్రామానుజులు ఒకనాడు కూరత్తాళ్వార్లను పిలిచి,”మీరు కాంచిపురమునకు వెళ్ళి ఆశ్రిత వరదుడైన వరదరాజ పెరుమాళ్ళను మీకు కంటి చూపు ప్రసాదించమని ప్రార్థించండి”, అని ఆజ్ఞాపించిరి. అంతట ఆళ్వాన్ భగవద్రామానుజులు చెప్పినట్టే కాంచి పురమునకు వెళ్ళి వరదరాజ పెరుమాళ్ళ విషయముగా “వరదరాజ స్తవము” అను స్తోత్రమును చేసి పెరుమాళ్ళను ప్రసన్నము చేసుకొనిరి. (http://ponnadi.blogspot.in/2012/11/archavathara-anubhavam-kurathazhwan.html). అది పూర్తి అవగానే ఆళ్వాన్ ఉడయవర్ల వద్దకు వచ్చి దణ్ణము సమర్పించి కాంచీపురంలో జరిగినది ఇట్లు విన్నవించారు, “దేవరవారి ఆజ్ఞననుసరించి వరదరాజ పెరుమాళ్ళ సన్నిధిలో “వరదరాజ స్తవమును” చేసి స్వామికి సమర్పించితిని. అంతట, “పెరువిశుమ్బరుళుమ్ పేరరుళాళర్ ” (పరమపదమును అనుగ్రహించెడి అమితానుగ్రహ వరదులు) అగు వరదరాజ స్వామి వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతిః ! ఆస్తే విష్ణురచించ్యాత్మా భక్తైర్భాగవతై స్సహ !! (పరమపదమగు వైకుంఠములో జగత్పతి యగు విష్ణువు అచింత్యాత్ముడై అమిత వైభవము కలిగి శ్రీదేవితో, భగవద్భాగవతులతో కలిసి వేంచేసి ఉంటాడు – లింగ పురాణము) అనునట్లు దాసుడికి పరమపదమును అనుగ్రహించిరి. కానీ వారు మాతో, “మేము “వానిలిళవరసు (మేము పరమపదములో యువరాజుము – పెరియాళ్వార్ల దివ్య సూక్తి)” కనుక మా స్వాతంత్ర్యము కూడా పరిమితమే! అందు చేత మీరు వెళ్ళి ఉడయవర్లను ప్రార్థించండి. మాకు సేవ చేయు నిత్యసూరులలో శ్రేష్టులగు భగవద్రామానుజులు అనుమతిస్తే పరమపదమునకు వేంచేయ వచ్చును!!”, అని కృప చేసినారు! కనుక మీరు కరుణించి దాసుని కటాక్షిస్తే దాసుడు ఇక ఈ లీలా విభూతి నుంచి సెలవు తీసుకుంటాడు.” అని విన్నవించిరి.

అంతట భగవద్రామానుజులు కూరత్తాళ్వార్ల యొక్క తిరువుల్లమును గ్రహించి పరమ సంతోషమును పొంది కూరత్తాళ్వార్ల కుడి చెవిలో ద్వయ మంత్రమును చెప్పి, “నలమందమిల్లదోర్ నాడు పుగువీర్ (అపరిమిత ఆనంద నిలయమగు పరమపదము మీకు కలుగు గాక!)” అని ఆశీర్వదించిరి. ఆళ్వాన్ కూడా, “నాన్ పెట్ఱ పేఱు నాలురానుమ్ పెఱ వేణుమ్ (నేను పొందిన ఉత్తమగతిని నాలురాన్ కూడా పొందవలెను (‘ఈ నాలురాన్ అనేవాడు చోళ రాజుకు నమ్మకస్తుడైన మంత్రిగా ఉండి తన యొక్క విషపూరితమైన మాటలతో రాజును వైష్ణవ ద్వేషిగా మార్చి కూరత్తాళ్వాన్ కు కంటి చూపు పోవుటకు కారణమైనవాడు. కానీ అతను చేసిన తప్పును అజ్ఞాన పూరితముగా భావించి క్షమించి అతనికి కూడా పరమపదము కలుగు నట్లుగా ఆళ్వాన్ ఉడయవర్లను ప్రార్థించారు! ‘) )” అని భగవద్రామానుజులను ప్రార్థించగా వారు, “శ్రీ కృష్ణ పరమాత్మ ఘంటాకర్ణునికి మోక్షమును ఇవ్వగా అతనితో అతని సంబంధీకులందరూ మోక్షము పొందినట్లుగా మీరు పొందిన ఉత్తమ గతి మీ సంబంధీకులకు కూడా కలుగు గాక! ఇందులో సందేహము లేదు సుమా!” అని అనుగ్రహించగా ఆళ్వాన్ సంతోషముగా “కలఙ్గా ప్పెరునగర్ (కలతలేని మహానగరమైన పరమపదము – 3వ తిరు – 5)” ను పొందారు.

పిదప భగవద్రామానుజులు కూరత్తాళ్వార్ల యొక్క పెద్ద కుమారులైన పరాశర భట్టరుల చేత ఆళ్వాన్ కు అంతిమ సంస్కార తిరువధ్యయనేత్యాది కార్యములను నిర్వహింప చేసిరి. మరుదినము భగవద్రామానుజులు పితృ వియోగము చేత పరమ దుఃఖితులై ఉన్న పరాశర భట్టరులను శ్రీ రంగనాథుని సన్నిధికి గొనిపోయిరి. అంతట పెరుమాళ్ళు భట్టరులతో, “వత్సా! దుఃఖించకుము. ఇకపై నీకు మేమే తండ్రిమి!” అని చెప్పి పుత్ర స్వీకారము చేసుకొనిరి. పిదప పెరుమాళ్ళు భట్టరులతో, “నీవు దేనికీ చింతించ వలసిన పనిలేదు. ఈ లోకములో ఉండగా నీకు ఎటువంటి కొఱత కలుగనీయము! పర లోకములో కూడా నీ సుఖమునకు ఏ లోటూ లేకుండుటకు భగవద్రామానుజుల సంబంధము నీకు ఎటులనూ ఉన్నది! కనుక నిశ్చింతగా ఉండుము!”, అని చెప్పెను.ఈ విధముగా శ్రీ రంగనాథుడు భగవద్రామానుజుల వైభవమును వెల్లిబుచ్చెను.

ఉడయవర్లు తమ శిష్యులను తోడ్కొని దివ్య దేశ యాత్ర చేయుచు ఆళ్వార్ తిరు నగరి దివ్య దేశము చేరినారు. అచ్చట వేంచేసి ఉన్న తిరుక్కురుగూర్ నంబి పెరుమాళ్ళను, మరియు నమ్మాళ్వార్లను సేవించి “కణ్ణినుణ్ శిఱుఱ్ఱాంబు” అను దివ్య ప్రబంధమును మధురముగా అనుసంధానము చేయగా నమ్మాళ్వార్లు ప్రసన్నులయి అర్చక ముఖేన ఉడయవర్లకు అరుళప్పాడు (సన్నిధిలోనికి గౌరవ ఆహ్వానము) పలికిరి. ఆళ్వార్లు ఉడయవర్లను తమ శ్రీ చరణాల వద్ద శిరస్సున ఉంచమని చెప్పి, సకల శ్రీ వైష్ణవులను మరియు సన్నిధి పరిచారిక గణమును పిలిచి, “మా యందు ప్రేమతో భక్తితో మెలగి మాతో సంబంధము ఆశించు వారందరునూ మాకు పాదుకల వంటి వారైన మా రామానుజులను ఆశ్రయించండి! రామానుజులను ఆశ్రయించినచో మమ్ములను ఆశ్రయించి నట్టే అగును! రామానుజులనే ఉత్తారకులుగా భావించి ఉజ్జీవించండి!” అని శాయించెను. ఆనాటి నుండి నమ్మాళ్వార్ల శ్రీ శఠకోపమునకు “ఇరామానుశన్” అని సార్ధక నామధేయము సిద్ధించినది! తత్పూర్వము నమ్మాళ్వార్ల శ్రీ శఠకోపమునకు “శఠకోపపదద్వయం లేదా మధురకవులు” అని తిరు నామము ఉండేది. అందుకనే తిరువరంగత్త ముదనార్లు “మాఱన్ అడిపనిందుయందవన్ – మాఱన్ (నమ్మాళ్వార్ల) యొక్క తిరువడిని ఆశ్రయించి ఉజ్జీవించినవారు” అని ‘ఇరామానుశ నూఱ్ఱందాది’ అను దివ్య ప్రబంధములో ఉడయవర్లను ఉద్దేశించి శాయించినారు.

వైకుంఠ ఏకాదశి రోజు ఆళ్వార్ తిరునగరి దివ్య దేశము నందు నమ్మాళ్వార్లు శయన తిరుకోల మందు (భంగిమలో) వేంచేయగా వారి శ్రీ చరణాల వద్ద ఉడయవర్లు నాచ్చియార్ తిరుకోల మందు వేంచేసి ఉన్న దివ్య విశేషము.

మధుర కవులు సర్వజ్ఞులు అగుట చేత నమ్మాళ్వార్ల శ్రీ చరణాలను “మేవినేన్ అవన్ పొన్నడి – అతని బంగారు శ్రీ చరణాలనే ఆశ్రయించితిని” అని కీర్తించారు. అయితే ఇచ్చట ఒక్క విషయము విశ్లేషించదగినది. శుద్ధ వైరాగ్య చిత్తులు పరాభక్తి తత్పరులైన మధుర కవులు తమ ఆచార్యులైన నమ్మాళ్వార్ల శ్రీ చరణాలను “తామరై అడి – పాదపద్మములు” అని గాక “పొన్నడి – బంగారు పాదములు” అని ఎందుకు కీర్తించ వలసి వచ్చింది? బంగారము సకల ద్రవ్యముల కంటెనూ ఉత్కృష్టమైనది, అందఱును పరమ ప్రీతితో ఆశపడునది, ఫల ప్రదమగునది, సర్వ కాలములందు లభ్యమగునది, వ్యక్తి తారతమ్యములను చూడక అందరి వద్ద ఉండునది, తన పట్ల రుచి కలిగిన వారందరి వద్ద ఉండునది, ఆడ – మగ అను వ్యత్యాస మెఱుంగక ఆందరి చేతా వెంబడించబడునది, చేతబడితే రక్షించు కోవలెననిపించునది, చేజారితే ప్రాణ హానికి హేతువగునది. ఇలా బంగారమునకు ఉన్న ఈ లక్షణములను ఉడయవర్లలోనూ మనము దర్శించవచ్చును. అనగా,

  1.  ఉడయవర్లు తాము “కారుణ్యాత్ గురుషూత్తమో యతీపతిః – కారుణ్యము చేత గురువులలోకెల్లా ఉత్తములు ఉడయవర్లు” అని కదా కీర్తించ బడినారు.
  2. డెబ్భై నాలుగు సింహాసనాధి పతుల చేత కోరి కైంకర్యం చేయబడినవారు.
  3. మోక్షమనే ప్రతి ఫలాన్ని ఇచ్చేవారు.
  4. తరతమ బేధమెరుగక రహస్యార్థములను అందరికిన్నీ అనుగ్రహించినవారు.
  5. అనంతమైన శ్రీ వైష్ణవ భక్త గుణములలో తామూ మమేకమై భక్తి, నిష్ఠలను మరియు శ్రియఃపతిపై ప్రేమను వారిలో పెంపొందింప చేసినవారు.
  6. క్రిమికంఠుని వల్ల క్లేశమెదురై నప్పుడు ముదలి యాణ్డాన్ మొదలగు శిష్యుల చేత రక్షించ బడినవారు.
  7. వారి ఎడబాటును తాళలేక ఎంతో మంది భక్తాగ్రేసరులు ప్రాణాలు సైతం విడిచేటట్లు వేంచేసి ఉన్నవారు.

ఉడయవర్లలో ఇటువంటి సద్గుణములు ఉండి బంగారము యొక్క లక్షణములతో సామ్యమేర్పడుట వలన శ్రీ మధుర కవులు ఒక మర్మమైన దివ్య దృష్టి చేతనే నమ్మాళ్వార్ల తిరువడిని “పొన్నడి” అని కీర్తించడం ఎంతో ఉచితముగా తోచుచున్నది.

ఉడయవర్లు పరమపదమునకు వేంచేయు సమయమున వారి వియోగమును తాళలేక ఎంతో మంది భక్తాగ్రేసరులు ప్రాణాలు విడిచారు. ఉడయవర్ల శిష్యులైన కణ్ణియనూర్ శిరియాచ్చాన్ ఉడయవర్లను విడిచి తమ సొంత ఊరిలో ఉన్నారు. ఒకనాడు తమ ఆచార్యులను సేవించవలెనని ఆశపడి హుటాహుటీన శ్రీ రంగం వేంచేయగా ఆలయంలో ఎదో ఉత్సవం జరుగునట్లు జనం గుమిగూడి అందరునూ విషణ్ణ వదనులై ఉండుట గమినించిన శిరియాచ్చాన్ సన్నిధి నుంచి బయటకు వస్తున్న వ్యక్తిని చూచి తమ ఆచార్యులైన ఉడయవర్లు కుశలమే కదా అని అడుగగా ఆ వ్యక్తి బహు దుఃఖముతో ఉడయవర్లు తిరునాడు అలంకరించారని తెలుపగా, గుండె పగిలినవారై శిరియాచ్చాన్, “ఎమ్బెరుమానార్ తిరువడిగళే శరణం ” అనుచు అక్కడి కక్కడే ప్రాణాలను విడిచెను.

“కొమాండూర్ ఇళయవిల్లి ” అను మరొక శిష్యులు తిరుప్పేరూర్ లో వేంచేసి ఉండగా ఒకనాడు స్వప్నములో ఉడయవర్లు కోటి సూర్యులు ఒకేసారి ఉదయించినట్లు నిరవధిక తేజోరూపులై దివ్య విమాన మెక్కి ఆకాశ వీధిలో పోవుచుండగా పరమపదము నుంచి పరమపద నాథుడు అనంత గరుడ విశ్వక్సేనాది నిత్యసూరి గణములతో, ఆళ్వార్లు నాథమునులు మొదలగు నిత్య ముక్తులతో శంఖ భేరికాగళా మొదలగు వాద్య విశేషములతో ఎదురొచ్చి ఉడయవర్లను స్వయముగా పరమపదమునకు వేంచేపు చేసుకొని పోవుచున్నట్టు కల గని ఉలికి పాటుతో మేల్కొని తమ పక్క ఇంటి వారైన వళ్ళల్ మణివణ్ణన్ ను పిలిచి తమ స్వప్న వృత్తాన్తమును తెలిపి ఇక తానూ ఈ ఇహ జీవనము భరించలేనని “ఎమ్బెరుమానార్ తిరువడిగళే శరణం ” అనుచు అక్కడికక్కడే ప్రాణాలను విడిచెను.

ఈ విధముగా ఉడయవర్ల యొక్క ఎడబాటు భరించలేక ప్రాణాలను విడిచిన భక్తాగ్రేసరులు ఎందరో కలరు. ఈ విషయము ఉడయవర్లకు ముందుగానే తెలియుట చేత తాము పరమపదించిన పిదప ఎవరూ ప్రాణ త్యాగము చేయరాదని తమ ఆశ్రమములో శిష్య గణమునకు, ఆంతరంగిక పరిచారకులు, అనంత శ్రీవైష్ణవ ఆచార్య గణమునకు వారు ముందుగానే హెచ్చరిక చేసి పరమపదించి నందు వలన ఉడయవర్ల తరువాత సంప్రదాయ బాధ్యతలు వహించుట దైవాజ్ఞ కనుక ఉడయవర్ల అనుంగ శిష్యులు కొందఱు మాత్రం ఆ విశ్లేషార్తిని భరించి ఉన్నారు. ఈ విధంగా ఉడయవర్ల వైభవ ప్రభావము అంత విలక్షణమైనది!

ఇక వచ్చే అధ్యాయములో భగవద్రామానుజుల యొక్క ఉత్తారకత్వ ప్రభావమును పెద్దలైన పూర్వాచార్యులు ఎలా దర్శించారో చూద్దాము

— అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujars-glories.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org