విరోధి పరిహారాలు – 20

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/10/02/virodhi-pariharangal-19/


వైత్తమానిధి (గొప్ప నిధి) – తిరుక్కోళుర్ – మనకు నిజమైన నిధి

51. ఆర్జన విరొధి  – ధన సంపదనలో అవరోధాలు

ఆర్జనం అంటే ధనం సంపాదించడం అని అర్థం. ఈ భాగం అతివిస్తారంగా ఉంది. ఇందులో కొన్ని అంశాలు స్పష్టంగా లేవు. పెద్దల నుండి తెలుకున్న తరువాత కూడా నాకు (వి వి రామానుజం స్వామి) సంతృప్తికరమైన సమాధానాలు రాలేదు. నేను (వి వి రామానుజం స్వామి)  అర్థం చేసుకున్నంత వరకు రాశాను. సాధారణంగా, సంపాదన అనేది ధర్మం (నీతి మార్గం) యొక్క సరిహద్దులలో ఉండాలి. వర్ణం మరియు ఆశ్రమాల పరిమితులను దాటకుండా సంపాదించాలి. ఒక పాత తమిళ్ సామెతలో చెప్పినట్లుగా “పోతుమెన్రా మనమే పొన్ చెయ్యుం మరున్తు” – ఉన్న దాంట్లో సంతృప్తి చెందడమే ఉత్తమమైన ఔషదం, ఉన్నదానితో సంతృప్తి చెందేందుకు మన మనస్సును సిద్ధం చేసుకోవాలి. అక్రమ పద్ధతులన్నిటికీ దూరంగా ఉండాలి. ఇతరులను మోసం చేయడం, అబద్ధం చెప్పడం, దోపిడీ చేయడం ద్వారా సంపాదించిన డబ్బుకి దూరంగా ఉండాలి. దురాశకు పూర్తిగా దూరంగా ఉండాలి. పక్క దార్లలో,  అక్రమ పద్ధతులతో, మన మనస్సాక్షికి వ్యతిరేకమైన మొదలైన వాటి ద్వారా డబ్బు సంపాదించడం పాత రోజుల్లో కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుటి రాజకీయాలలో మరియు ఇతర వ్యాపారాలలో మనం చూస్తున్న అవినీతి పాత రోజుల్లో ఉండేది కాదని నేను (వి వి రామానుజం స్వామి) అంచనా వేస్తున్నాను. వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. ఇప్పుడు అడ్డంకులను చూద్దాం.  అనువాదకుల గమనిక: సర్వ సాధారణంగా గోచరిస్తున్న సూత్రం ఏమిటంటే, మనం అందించిన ఏ సేవకైనా వేతనం కోరి తద్వారా డబ్బును సంపాదించకూడదు. ఇచ్చతో ఇచ్చినది ఏదైనా సంతృప్తితో స్వీకరించాలి,  ప్రాథమిక శరీర అవసరాలను తీర్చడానికి అవసరమైన దానికంటే ఎక్కువ  సంపదను ఆర్జించడంలో అత్యాశ చూపకూడదు. అలాగే, శ్రీవైష్ణవులకు ఎమ్బెరుమాన్ యొక్క పాద పద్మాలే నిజమైన సంపద. ఆళవందార్లు తమ స్తోత్ర రత్నంలో ఇలా అన్నారు “ధనం మదీయం తవ పాదపంకజం” – మీ చరణ కామలానే నా సంపద. కైంకర్య శ్రీ (భగవాన్ మరియు భాగవతులకు సేవ) కూడా గొప్ప సంపదగా కీర్తింపబడింది. మన ఆళ్వారులు మరియు ఆచార్యలు ప్రాపంచిక సంపద నుండి పూర్తిగా దూరంగా ఉండి, భగవాన్ మరియు భాగవతులకు సేవ చేయడంపై మాత్రమే సంపూర్ణ దృష్టి పెట్టారు. కాబట్టి, మనం కూడా ప్రాపంచికంగా సంపాదించకుండా నిజమైన సంపదపై దృష్టి పెట్టాలి. 

 • శ్రీవైష్ణవునిగా మారిన తరువాత కూడా విరాళాలు స్వీకరించి ధనం ఆర్జించడం ఒక అడ్డంకి. సాధారణంగా బ్రాహ్మణులు, విరాళాలు / బహుమతులు ఇవ్వడం మరియు అందుకోవడం రెండూ ధర్మశాస్త్రంలో అనుమతించబడింది. అటువంటి విరాళాలు / బహుమతులు కూడబెట్టుకోవడం మరియు దానిని నిల్వ చేయడం ఖండించబడిందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనము విరాళాలు / బహుమతులు తీసుకున్నపుడు అవి అవసరమైన వారికి ఇవ్వాలి.
 • మనం చేసిన కొన్ని తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి విరాళాలు / బహుమతులు ఇవ్వమని ఇతరులకు సలహా ఇవ్వడం మరియు అలాంటి విరాళాలను పొందడం. అనువాదకుల గమనిక: ఈ రోజుల్లో, ప్రజలు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి పరిహారం (సమస్యల పరిష్కారం) పొందడానికి సలహాలు ఇస్తున్నారు. కొన్ని సార్లు సలహా ఇచ్చే వాళ్ళు కూడా ఆ ప్రయోజనాల భాగీదారులు అవుతారు. ఇలాంటి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎమ్పెరుమాన్ , ఆళ్వారులు మరియు ఆచార్యలు భౌతిక బాధలను తొలగించేందుకు వేచిలేరు. మనల్ని  భౌతిక బంధాల నుండి వెలికి తీయటాని కోసమే వారున్నది. మనం దీనిని పూర్తిగా అర్థం చేసుకొని, ఇతరులకు కూడా కేవలం ఎమ్పెరుమాన్ / ఆళ్వారులు / ఆచార్యలను ఆరాధించాలని మరియు వారికి శరణాగతి చేయాలని సూచించాలి.
 • ఇతరుల నుండి జలంతో ఇవ్వబడిన సంపదను దానంగా స్వీకరించుట ఒక అడ్డంకి. సాధారణంగా, ఏదైనా దానంగా ఇచ్చినప్పుడు, ఇచ్చిన దానం పూర్తిగా పుచ్చుకున్నవారిదని గట్టిగా నిర్ధారించడానికి ఇచ్చేవాడు తీసుకునేవారి చేతుల్లో నీటిని పోస్తాడు. దీనిని తమిళ్లో “దారై వార్తుక్ కొడుత్తల్”  అని వివరించారు. వైధిక కర్మలలో, సాధారణంగా “స్రోత్రియాయ శ్రీవైష్ణవాయ సమ్ప్రదతే నమమ” అని ఉచ్చరిస్తూ ఇచ్చే వస్తువుపైన పూర్తి హక్కు పుచ్చుకున్నవాడిదన్నపద్దతి చెప్పబడింది. భగవానుడు వామనుడిగా అవతరించి మహాబలి నుండి దానాన్నిస్వీకరిస్తారు  – ఈ సంఘటనను అనేక పాసురములలో ఆళ్వారులు గొప్పగా కీర్తించారు. తన భక్తులను రక్షించడానికి వారి ఆధిపత్యాన్ని తగ్గించుకొని అవతరించారు (అయినప్పటికీ ఇది వారి గొప్పతనాన్ని మరింత పెంచింది).   ఇది భగవానుని యొక్క అత్యంత నిస్వార్థ కార్యము. కానీ స్వార్థపూరిత ఉద్దేశ్యాల కోసం మనం ఇలాంటి దానధర్మాలను స్వీకరించకూడదని అంటారు.
 • కొన ఊపిరి తీసుకొంటూ చివరి క్షణాలలో ఉన్న వ్యక్తి నుండి దానం స్వీకరించడం ఒక అడ్డంకి. కాలదానం  – ఒక వ్యక్తి తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా శరీరాన్ని విడిచిపెట్టేటపుడు ఆఖరి క్షణాలలో ఇచ్చే దానం. కొంతమంది ధాన్యాలు, బంగారం మొదలైన వాటిని దానధర్మాలలో ఇస్తారు. కానీ దురాశతో అలాంటి దానధర్మాలను స్వీకరించకూడదు. అది శ్రీవైష్ణవులు అనే నిజమైన స్వభావాన్ని నాశనం చేస్తుంది.
 • శ్రాద్దంలో తినడం ద్వారా సంపదను కూడబెట్టుకోవడం ఒక అడ్డంకి. శ్రాద్దం అంటే తల్లి తండ్రులు  మొదలైన వారి సంవత్సరీకం సందర్భంగా పితృలకు  చేసే వైధిక కర్మలను  శ్రాద్దం అని పిలుస్తారు. ఈ చర్యలో భాగంగా, కర్మ చేసే వ్యక్తి ముగ్గురు బ్రాహ్మణులను పిత్రులుగా (ఎవరి కోసమైతే   శ్రాద్దం  నిర్వహిస్తున్నామో), విశ్వదేవర్ మరియు విష్ణు యొక్క స్థానాన్ని స్వీకరించడానికి ఆహ్వానిస్తాడు, వారికి వివిధ రకాలైన ఆహార పదార్థాలను తినిపించి చివరకు వారికి సంభావనను (దానం) మరియు తాంబూలం (వక్క తమలపాకులు, కొబ్బరికాయ మొదలైనవి) సమర్పించుకుంటారు. పాత రోజుల్లో, నిమంత్రణం వచ్చినప్పుడు (విశ్వదేవర్ మరియు విష్ణు యొక్క స్థానాన్ని స్వీకరించడానికి ఆహ్వానం), శ్రీవైష్ణవులు వారి అభ్యర్థనను స్వీకరించి, వైధిక కర్మను నెరవేర్చేవారు. నిమంత్రణం కోసం అత్యంత విశ్వసనీయమైన శ్రీవైష్ణవులను ఆహ్వానించడం కూడా అప్పట్లో ఒక పద్ధతి ఉండేది. కాని ఈ రోజుల్లో చాలా మంది  శ్రాద్దంలో తినడం, వాటి నుండి డబ్బు సంపాదించడం ద్వారా జీవనోపాధి పొందుతున్నట్లు మనం చూస్తున్నాము. ఇటువంటి పనులు అనుకూలమైనవి కావని సులభంగా అర్థం చేసుకోవచ్చు.
 • ఇతరులకు కొన్ని ఉపచారాలను సూచించడం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. అజ్ఞానులైన / అమాయకులైన వారికి ఆరోగ్యం, సంపద మొదలైన వాటిని పొందడం కోసం కొన్ని ఉపచారాలు చేయమని సలహా ఇవ్వడం, వాటి నుండి సంపాదించడం స్పష్టంగా మోసచర్య,  వాటికి దూరంగా ఉండాలి.
 • ఇల్లు మొదలైన వాటికి సంబంధించి జ్యోతిష్య సలహా ఇవ్వడం తద్వారా సంపాదించడం ఒక అడ్డంకి.
 • గ్రామ అధిపతిగా సంపాదించడం (ప్రాపంచిక అధికారంతో, వివాద పరిష్కారాలు మొదలైనవి) ఒక అడ్డంకి. శ్రీ రామాయణం ఉత్తర గాంటం, 69వ సర్గంలో ఒక సంఘటన వివరించబడింది. ఒక బ్రహ్మణుడు కోపంతో ఒక కుక్కను గాయపరుస్తాడు. కారుతున్న రక్తంతో ఆ కుక్క శ్రీ రాముని రాజభవనానికి వచ్చి ఈ సంఘటన గురించి వారికి ఫిర్యాదు చేస్తుంది.  శ్రీ రాముడు ఆ  బ్రహ్మణుడిని రాజసభకి ఆహ్వానించి ఈ  విషయాన్ని విచారిస్తాడు. బ్రహ్మణుడు “నేను అప్పుడు చాలా ఆకలితో ఉన్నాను, ఆహారం కోసం యాచిస్తూ చాలా అలసటతో ఉన్నాను. ఆ సమయంలో కుక్క నన్ను బాధపెట్టినందున, నేను కోపంతో ఆ కుక్కను గాయపరిచాను. నాకు ఏ శిక్షవేసినా నేను అంగీకరిస్తాను” అని అంటాడు.  శ్రీ రాముడు అప్పుడు ఆ కుక్క వైపు తిరిగి నీవే తగిన శిక్ష ఇవ్వమని చెబుతాడు. కుక్క బ్రహ్మణుడిని ఒక గ్రామానికి అధికారి చేయమని అంతుంది, శ్రీ రాముడు ఆ ఆదేశాన్ని అమలుచేయమని చెబుతాడు. ఆ శిక్ష ఎందుకు ఇచ్చారని కుక్కను అడుగుతాడు? కుక్క “నా మునుపటి జన్మలో నేను ఒక గ్రామానికి అధిపతి. నాకు తెలిసినంతవరకు, నేను అందరితో సమానంగా ప్రవర్తించాను, చాలా క్రమశిక్షణతో  గ్రామ ప్రజల అవసరాలను చూసుకున్నాను. అయినప్పటికీ నేను ఇప్పుడు ఇలాంటి పుట్టుకను పుట్టాను. నాకు తెలియకుండా నేను ఏదో అన్యాయం చేసుంటాను. లేదా నా క్రింద సహాయకులు కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు. ఆ కారణంగా నేను ఈ ప్రస్తుత పరిస్థితిలో ఉన్నాను “. అందువల్ల గ్రామ అధిపతిగా ఉండటం చాలా కష్టమైన స్థితి అని మనం అర్థం చేసుకోవచ్చు. అనువాదకుల గమనిక: దేశంలోని పౌరులు చేసిన పాపాలలో కొంత భాగాన్ని రాజు పొందుతాడని గుర్తుంచుకోవాలి. గ్రామాధికారికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని అర్థం చేసుకోవచ్చు. అందుకని, డబ్బు / సంపద సంపాదించడంపై దృష్టి కేంద్రీకరించే ఏ లౌకిన వృత్తిలో పాల్గొనకుండా ఉండటం మంచిది.
 • పిల్లలకు ప్రాథమిక విద్య నేర్పించడం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. మరలా, విద్యాభ్యాసం నుండి డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టకూడదు – విద్యార్థులు గురుదక్షిణగా (ఉపాధ్యాయునికి సమర్పణలు) అందిస్తే, దానిని సంతోషంగా స్వీకరించవచ్చు, గురువు వాటితో సంతృప్తి చెందాలి.
 • తమ పాండిత్యము (జ్ఞానం) గొప్పతనాన్ని గురించి ప్రగల్భాలు పలుకుతూ సంపాదించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: “విద్యాదదాతి వినయః” – విద్య వినయాన్ని పెంచుతుంది, అని చెప్పబడింది. ఎవరైనా జ్ఞానవంతుడైనపుడు వారు ప్రగల్భాలు  చెపుతూ దాని నుండి డబ్బు సంపాదన చేయకూడదు. బదులుగా వారు వినయంగా ఉండి, ఇతరులు తమ నిస్వార్థ బోధనలు చేసి, ఆచరణాత్మమైన ఉదాహరణల ద్వారా సహాయం చేయాలి.
 • ఇతరులను ప్రశంసించడం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. తిరువాయ్మొళి 3.9 పాదిగంలో “చొన్నాల్ విరోదం”, మొదటి అసురంలోనే, నమ్మాళ్వార్ “ఎన్ న్నావిలింకవి యాన్ ఒరువర్కుం కొడుక్కిలేన్” – నా తీయని పద్యాలను భగవాన్కి తప్పా ఇంకెవ్వరికీ ఇవ్వను. నమ్మాళ్వార్ ధనవంతులను స్తుతించవద్దని, అలా డబ్బు సంపాదించి తద్వారా దిగజారవద్దని కవులకు సలహా ఇస్తున్నాడు. అనువాదకుల గమనిక: పాత రోజుల్లో, కవులు నిరుపేదలు, వాళ్ళు రాజు దగ్గరికి లేదా ధనవంతుల వద్దకు వెళ్లి వాళ్ళని ఆకాశానికెత్తినంత కవితలతో వారిని ప్రశంసించేవారు. తమ గురించి గొప్పగా విన్నందుకు సంతోషించిన రాజులు / ధనవంతులు కవులకు అనేక బహుమతులు ఇచ్చేవారు. ఇప్పటి రోజుల్లో కూడా, చాలా మంది ధనవంతులను కీర్తిస్తూ తమ జీవితాన్ని గడుపుతున్నారు, వారిచే అనేక సహాయాలు పొందుతారు, తద్వారా ప్రాపంచిక విషయాలలో పూర్తిగా జారిపోతారు. ఈ విధమైన వైఖరిని భగవాన్ దాసులుగా మన స్వభావానికి వ్యతిరేకం కాబట్టి మన ఆళ్వారులు మరియు ఆచార్యలు తీవ్రంగా ఖండించారు.
 • ఇతరుల సంపదను / ఆస్తిని దొంగిలించి సంపాదించడం ఒక అడ్డంకి.
 • ఇతరులను మోసం చేసి సంపాదించడం ఒక అడ్డంకి.
 • ఇతరులు ప్రయాణించేటప్పుడు దోచుకొని సంపాదించడం ఒక అడ్డంకి.
 • ఇతరులగురించి చెడుగా మాట్లాడటం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. ఆండాళ్  తిరుప్పావై రెండవ పాసురంలో ఇలా అన్నారు “తీక్కురళైచ్ చెన్రోతోం” –  ఎట్టి పరిస్తితుల్లో కూడా ఎవరి గురించి చెడుగా మాట్లాడము. అనువాదకుల గమనిక:  వ్యాఖ్యానంలో, పెరియవాచాన్ పిళ్ళై మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ సీతా పిరాట్టిని కీర్తిస్తూ ఇలా వివరించారు. సీతా పిరాట్టి అశోకవనంలో ఉన్నప్పుడు రాక్షసులు చేసిన హింసల గురించి శ్రీ రామునికి ఒక్క మాట కూడా చెప్పదు. అయ్జనన్యాచార్యులు అందంగా కీర్తిస్తూ,  తమ హృదయంలో శ్రీవైష్ణవుల లోపాలను పరిగణించరాదని, ఎందుకంటే ఎమ్బెరుమాన్ తమ హృదయంలో అంతర్యామిగా ఉన్నందున – ఆ దురాలోచన మన హృదయంలోకి రానిస్తే, భగవాన్ ఆ విషయం తెలుసుకుంటాడు, కాబట్టి ఇతరుల లోపాల గురించి ఆలోచించడం మానుకోవాలి.
 • తాను  గొప్ప వ్యక్తిత్వం గలవాడని ఇతరులను నమ్మేలాచేసి,  తద్వారా వారు వాళ్ళకి లొంగి ఉండి డబ్బు, సంపద సమర్పణలు తీసుకొని సంపాదించడం  ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: కొంతమంది గొప్ప వ్యక్తులతో తమ సంబంధం ఉందని ప్రగల్భాలు పలికి తాము చాలా పలుకుబడి ఉన్నవారని నమ్మిస్తారు. ప్రజలు అలా నమ్ముతున్నప్పుడు, అలాంటి వ్యక్తుల నుండి సహాయం పొందటానికి ఇష్టపడేవారు వారి పట్ల వినయాన్ని ప్రదర్శించి, భౌతిక ప్రయోజనాలకు బదులుగా డబ్బు, సంపద మొదలైనవాటిని సమర్పించుకుంటారు. అటువంటి వైఖరిని ఇక్కడ ఖండించారు.
 • పురాణాలు చదవడం ద్వారా, పాసురాలపై ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా సంపాదించడం. పురాణాలు చదవడం, ఉపన్యాసాలు ఇవ్వడం తప్పు కాదు. కానీ బదులుగా వేతనాన్ని ఆశించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఇంతకు ముందు వివరించినట్లుగా, శ్రవణం చేసినవారు ఇచ్చుకంగా ఇచ్చిన వాటిని స్వీకరించడం తప్పు కాదు.
 • గ్రంథాలను / పుస్తకాలను దొంగిలించడం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. పాత రోజుల్లో, సాహిత్యాన్ని తాటి పత్రాలపై నమోదు చేసేవారు. అవన్నీ చేతితో వ్రాసినవి. ఎంతో కృషితో ప్రయాసంతో కూడుకున్న పని అది. అవి మనకు అమూల్యమైన సంపద. వీటిని దొంగిలించి అమ్మడం మహా పాపం. అనువాదకుల గమనిక: ప్రస్తుత పరిస్థితులలో, ఇతరుల రచనలను దొంగిలించడం, వాటిని ప్రచురించడం, డబ్బు సంపాదించడం మరియు అసలు రచయితకి తగిన గౌరవం / బహుమానం ఇవ్వకపోవడం వంటివి ఈ అంశంతో పోల్చవచ్చు.
 • చెవి పోగులు దొంగలించడం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. ఈ అంశం యొక్క అర్థం స్పష్టంగా లేదు.
 • ఉన్నత కుటుంబం / వంశంలో వారి పుట్టుకను గొప్పగా చెప్పుకోవడం ద్వారా సంపాదించడం. కులాధికం – ఆబిజాత్యం – ఉన్నత కుటుంబం / వంశంలో జన్మించడం. “ఈ వ్యక్తి గొప్ప కుటుంబంలో జన్మించాడు, మీరు అతన్ని ఆరాధించండి / గౌరవించండి, వారికి సంపదను అర్పించుకోండి” అని ప్రచారం చేయడానికి మరియు అలాంటి  సంపదను స్వీకరించడానికి తెలివిగా కొంతమందిని నియమించుకోవడాన్ని కూడా మనం చూస్తున్నాము. ఇటువంటి వైఖరిని ఖండించారు. అనువాదకుడి గమనిక: కూరత్తాళ్వాన్ యొక్క కీర్తిని గుర్తుకు తెచ్చుకోవచ్చు – వారిని “ముక్కుఱుంబు అఱుత్తవర్” అని కీర్తించారు – 3 రకాల లోపాల నుండి పూర్తిగా విముక్తి పొందినవాడు. అనగా, గొప్ప కుటుంబంలో జన్మించినట్లు తమను తాము అనుకోవడం, తమను తాము చాలా ధనవంతుడు అని అనుకోవడం, తమను తాము మహా పండితులమని అనుకోవడం – కూరత్తాళ్వాన్ గొప్ప కుటుంబంలో జన్మించినప్పటికీ, వారు మహాశ్రీమంతులైనప్పటికీ, వారు మహా పండితులైనప్పటికీ, వారు ఎన్నడూ వారి గొప్పతనాన్ని చెప్పుకోలేదు – ఇది నిజమైన శ్రీవైష్ణవుల లక్షణం.
 • తమ సాంప్రదాయకమైన గుణాల గురించి ప్రగల్భించి దాని నుండి సంపాదన  చేయడం ఒక అడ్డంకి.
 • ప్రతి ఒక్కరికీ “అహం బ్రహ్మ” అని నమ్మించి దాని నుండి సంపాదించడం. “అహం బ్రహ్మ” అనేది ఒక అద్వైత సూత్రం. జీవాత్మ బ్రహ్మతో సమానమని  అద్వైతుల (కుదృష్టులు – లోపపు దృష్టి ఉన్నవారు) అర్థవివరణ. ఈ సూత్రం ఎమ్పెరుమానార్ దర్శనానికి సంపూర్ణంగా  వ్యతిరేకమైనది. దీనిని “నేను గొప్పవాడిని” అని కూడా అర్థం చేసుకోవచ్చు మరియు అలాంటి బోధనలు / ప్రచారం నుండి నేను సంపాదించవచ్చు అన్న చర్యలను ఇక్కడ ఖండిస్తున్నారు.
 • శాస్త్రంలో తమ జ్ఞానాన్ని ప్రగల్భించి సంపాదించడం ఒక అడ్డంకి. తమకు జ్ఞానం ఉన్నదని సొంత ప్రచారంలో పాల్గొనకూడదు, అలాంటి చర్యల నుండి డబ్బు సంపాదించకూడదు.
 • తమ శౌర్యం / ధైర్యం గురించి గొప్పగా చెప్పుకొని తద్వారా సంపాదించడం  ఒక అడ్డంకి. గొప్ప బలం, శౌర్యం మొదలైనవి తమకున్నాయని ప్రచారం చేయడం తప్పు. ఈ రోజుల్లో దీన్ని   డాన్స్ చేస్తుండటం మనం చూస్తున్నాము.
 • ఇంద్రజాలంతో మాంత్రికం మొదలైనవి చేసి సంపాదించడం ఒక అడ్డంకి.
 • డబ్బు సంపాదించడానికి అజ్ఞానులను అమాయకులను తమ వైపు ఆకర్షించడం ఒక అడ్డంకి. మంత్రం, అంజనం, కళ్ళతో మంత్రముగ్దులను చేయడం ద్వారా  ఆకర్షించి వారి నుండి డబ్బును దోచుకోవడం లాంటి చర్యలను ఇక్కడ ఖండిస్తున్నారు.
 • వైద్యునిగా ఉండి సంపాదించడం ఒక అడ్డంకి. వైద్య వృత్తి ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో చేయాలి కాని డబ్బు సంపాదించడం కోసం కాదు.
 • నిధులను చూపిస్తానని హామీ ఇచ్చి సంపాదించడం ఒక అడ్డంకి.
 • అణగారిన వ్యక్తులకు పనిచేసి సంపాదించడం (సంసారులు –  లౌకిక సుఖాలకు పూర్తిగా లోనైనవాడు).
 • రసవాదిగా సంపాదించడం. ఇనుము, రాగి మొదలైన వాటిని బంగారంగా మార్చే సూత్రం రసవాదం. ఈ రోజుల్లో ఇది సాధ్యం కాదు. కానీ దీనిని చేయగలరని నమ్మించి వారిని మోసం చేయడం ఒక అడ్డంకి.
 • రాజు / చక్రవర్తి / పాలకుడి దగ్గరి తమ సన్నిహిత్యాన్ని గొప్పగా చెప్పుకొని తద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. ఈ రోజుల్లో రాజకీయాల్లో ఇది చాలా సాధారణం కాబట్టి దీనిని మరింత వివరించాల్సిన అవసరం లేదు.
 • ప్రాపంచిక వార్తలను ప్రదర్శించడం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. కొంతమంది ఇతరులను విమర్శించి తద్వారా వారి మనుగడ సాగిస్తారు – అలాంటి వైఖరి ఖండించబడింది.
 • వివిధ జీవుల విష దాడులను నయం చేసే నైపుణ్యతతో సంపాదించడం. పాము, తేలు, కొన్ని రకాల కీటకాలు మొదలైనవి కుడితే శరీరంలో విషం వ్యాపిస్తుంది. కొన్ని మంత్రాలు, మందులను ఉపయోగించి ఇది నయంచేయవచ్చు. ఇది వ్యాపారంగా కాకుండా ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో చేయాలి.
 • భగవత్ విషయం బోధించడం ద్వారా సంపాదించడం. తిరువాయ్మొలి మరియు తిరువాయ్మొలి వ్యాఖ్యానాలను సమిష్టిగా భగవత్ విషయం అని పిలువబడుతున్నప్పటికీ, భగవాన్ గురించి విషయాలను సూచించడానికి ఇది ఒక సాధారణ పదం. ఇది ధన ప్రయోజనాల కోసం కాకుండా ఇతరులకు జ్ఞానోదయం చేయాలనే ఉద్దేశ్యంతో భోదించాలి.
 • ఎమ్బెరుమాన్ పట్ల వారికున్న భక్తిని ప్రగల్భాలుగా పలికి తద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. భగవాన్ పట్ల మన భక్తి ఏ బాహ్య ప్రేరణ లేకుండా చేయాలి. దీన్ని ప్రచారం చేయనవసరం లేదు.
 • దివ్య ప్రబంధాలను పఠించడం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. అరుళిచెయల్ (దివ్య ప్రబంధం) పఠనం కోసం ధనసహాయం కోరకూడదు.
 • ఇతరులను మరియు తమను తాము కీర్తించి మహిమపరచి సంపాదించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ధన ప్రయోజనాల కోసం ప్రాపంచిక వ్యక్తులను కీర్తించే అంశాన్ని ఆళ్వారులు ఖండించారు. భగవాన్ మరియు భాగవతులను మాత్రమే మహిమపరచడానికి నాలుక మనకు ఇవ్వబడిందని, ఏ ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని వారు గట్టిగా స్థాపించారు.
 • తమ త్యాగాన్ని గురించి గొప్పగా చెప్పుకుని సంపాదించడం ఒక అడ్డంకి. కొంతమంది మాటలతో డబ్బు ఇచ్చినప్పుడు “వద్దు” అని చెప్పడం సాధారణంగా కనిపిస్తుంది, కాని తీసుకోడానికి వారి చేతులు మాత్రం చాచి ఉంటాయి  – అలాంటి ప్రవర్తన ఇక్కడ ఖండించబడింది.
 • ఇతరులతో నమ్మకంగా / స్నేహంగా ఉన్నట్లు నటిస్తూ సంపాదించడం ఒక అడ్డంకి.
 • తమ నిస్సహాయ పరిస్థితిని చూపించి సంపాదించడం ఒక అడ్డంకి.
 • వేరే ఆశ్రయం లేదని నటిస్తూ సంపాదించడం అడ్డంకి.
 • భగవాన్ / ఆచార్యులకు కైంకర్యం చేసే పేరుతో సంపాదించడం, ఆ ధన సహాయాన్ని వ్యక్తిగత అవసరాలకి వాడుకోవడం ఒక అడ్డంకి.
 • సన్యాసిగా  నటిస్తూ సంపాదించడం ఒక అడ్డంకి.
 • ఎంబెరుమాన్  కోసం పూల తోటలు మొదలైనవాటిని నిర్వహణ చేస్తున్నట్టు నటించి సంపాదించడం ఒక అడ్డంకి.
 • ఎంబెరుమానుకి  పూల దండలు అర్పిస్తున్నట్లు నటిస్తూ సంపాదించడం ఒక అడ్డంకి.
 • తిరుమల (తిరుపతి)  మొదలైన వంటి దివ్య దేశాలకు సహాయం చేస్తున్నట్టు నటించి సంపాదించడం ఒక అడ్డంకి.  ఇప్పటి రోజుల్లో ఇది సాధారణంగా కనిపిస్తుంది.  ప్రజలు దివ్య దేశాలలో కైంకర్యాలు చేసే ముసుగుతో ధనమార్జిస్తునారు. ఇటువంటి ప్రవర్తనను ఇక్కడ ఖండించారు.
 • ఉత్సవాల సమయంలో శ్రీవైష్ణవులకి వసతి మొదలైన ఏర్పాట్లు చేసినట్లు నటిస్తూ సంపాదించడం ఒక అడ్డంకి.
 • ఉత్సవాల సమయంలో ప్రత్యేక సమర్పణలు మొదలైన వాటి ముట్టడి ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. ఉత్సవాల సమయంలో, “పోలిగ పోలిగ” (తిరువాయ్మొళి 5.2), “ఉలగముణ్డ పెరువాయ” (తిరువాయ్మొళి 6.10), “కంగులుం పగలుం” (తిరువాయ్మొళి 7.2), “నాఱు నఱుం పొళిల్” (నాచియార్ తిరుమొళి)   మొదలైనవి పారాయణం చేయబడతాయి, ప్రత్యేక ప్రసాదాలు ఎమ్బెరుమాన్ కి  అర్పించబడతాయి. స్థల పాసురం (ఉత్భవం జరుగుతున్న దివ్య దేశానికి సంబంధించిన ప్రబందం / పాసురం ) ఉన్నప్పుడు, ప్రత్యేక సమర్పణలు ఇవ్వబడతాయని కూడా సాధారణంగా చూడవచ్చు. అలాంటి పరిస్థితులను తమకు అనుకూలంగా చేసుకొని వాటి ద్వారా ధనం సంపాదించకూడదు.
 • సాత్తుముఱ చేయటానికి దివ్య ప్రభంధం పఠనం / అభ్యాసం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి.
 • తిరువారాధనం చేసినందుకు బదులుగా ధనాన్ని ఆశించడం ఒక అడ్డంకి. తిరువారాధనం అంటే ఉభయ వేద పారాయణం (సంస్కృత వేదం  మరియు ద్రావిడ వేదం) యొక్క పారాయణం మరియు పితృ కైంకర్యాలు (శ్రాద్దం) అని రెండింటినీ అర్ధం చేసుకోవచ్చు.
 • ఎమ్బెరుమానుకి తిరువారాధనం చేయడం ద్వారా సంపాదించడం ఒక అడ్డంకి. ఈ రోజుల్లో, తమ ఇంట్లో ఎమ్బెరుమానుకి  తిరువారాధనం చేయటానికి ఇతరులను నియమిస్తారు. ఇది సరైన వైఖరి కాదు. తమ ఎమ్బెరుమానుకి క్రమం తప్పకుండా  తిరువారాధనం సొంతంగా తమ చేతులతో చేయాలి. తమ సంద్యావందనం తామే చేయాలి కదా? అలాగే తమ  ఎమ్బెరుమానుకి తిరువారాధనం తామే చేయవలసి ఉంటుంది. తప్పించుకునే అవకాశం లేదు.
 • పొలం పనులతో  శారీరకంగా శ్రమించి సంపాదించడం మొదలైనవి అడ్డంకులు. వారి వర్ణాశ్రమం ప్రకారం వారికి ఏది సరితూగుతుందో చూసి అలాంటి పనులను మాత్రమే చేయాలి.

ఈ అంశంతో ప్రారంభించి ముష్తి కుడై (పిడికిలి) గురించి కొంచెం చర్చ జరుగుతుంది. వీటిలో కొన్ని అంశాలు చాలా కాలం నుండి వాడుకలో లేనందున, పెద్దలు కూడా వివరంగా చేప్పలేదు. నేను నా (శ్రీ వి.వి.రామానుజం స్వామి) అవగాహన ఆధారంగా రాస్తున్నాను. ఈ అవగాహనలలో కొన్ని లోపాలు ఉండవచ్చు. ఈ చర్చాంశాలలో, “ముష్తి”, “ముష్టి పుగురుగై”, “ముష్టి కూడై”, “మౌష్టిక వ్యావ్రుత్తి” మొదలైనవి ఉన్నాయి. ముష్తి అంటే సాధారణంగా ‘పిడికిలి’ అని అర్ధం – ప్రధానంగా ఇక్కడ పిడికిలి బియ్యం మొదలైన వాటి మీద దృష్టి కేంద్రీకరించబడింది.  వేదాంతాచార్యుల యొక్క శ్రీసూక్తి (దివ్య పలుకులు) ని గుర్తుచేసుకోవచ్చు. “యో సౌధాయాలుః పురాదానా ముష్టిముచే కుచేలమునయే దత్తేమ” – భగవానుడు వారి సహజ కారుణ్యభావంతో కుచేలుడిచ్చిన పిడికిలి అటుకులకు బదులుగా అతనికి గొప్ప సంపదను ప్రసాదించారు. భిక్షాటన అనే ఈ అంశం బ్రాహ్మణ వర్ణ ధర్మంలోని భాగం. వారి ఉదయ అనుష్ఠానాలు పూర్తి చేసిన తరువాత, ఎంచుకున్న కొన్ని ఇళ్లకు వెళ్లి, ఎంబెరుమాన్ నామాలను పఠించి, “భవతి భిక్షాం దేహి” అని భిక్షాటన చేయాలి. కొంత ధాన్యాన్ని సేకరించడం ద్వారా వారు తమ జీవనోపాధిని కొనసాగించాలి. మహాభారతంలో పాండవ యువరాజులు వనవాసంలో బ్రహ్మణులవలె మారువేషంలో ఉన్నప్పుడు, వారు భిక్షాటన చేసి జీవించారు.  కూరత్తాళ్వాన్ చాలా ధనవంతుడైనప్పటికీ, తమ సంపద మొత్తాన్ని వదులుకుని  శ్రీరంగం చేరుకున్నారు, శ్రీ రామానుజులను ఆశ్రయించి భిక్షాటన చేసి తన జీవనాన్నికొనసాగించారు. ఒకసారి, ఒక వర్షపు రోజున, భిక్ష కోసం బయటకు వెళ్ళలేక ఇంట్లోనే పడుకున్నారు. ఆ సమయంలో, ఆండాళ్ (అతని ధర్మపత్ని) తన భర్త ఆకలిని చూసి తీవ్రంగా బాధపడుతూ శ్రీరంగనాథుని ప్రార్థించింది. శ్రీ రంగనాథుడు వెంటనే తన అరవణై ప్రసాదాన్నిపంపుతాడు, ఆ ప్రసాదం ఆరగించిన తరువాత అళ్వాన్ / ఆండాళ్ జంటకు అనుగ్రహంగా దివ్యసంతానం పొందుతారు, వారు పరాశర భట్టర్ మరియు వేద వ్యాస భట్టర్ గా ప్రసిద్దులౌతారు. ఈ క్రింది అంశాల నుండి,  చాలా ముఖ్యమైన వివరాలను మనం అర్థం చేసుకోవచ్చు . భిక్ష (భిక్షాటన) ఇక్కడ “ముష్తీ” గా గుర్తించబడింది. బిక్ష పాత్ర  (భిక్షాటనకు ఉపయోగించే పాత్ర) ను “ముష్తి కుడై” అంటారు. ప్రతిరోజూ పిడికిలి ధాన్యాని వేడుకొని దానితో జీవించాలి. ఆ భిక్షతో ఎమ్బెరుమానుకి తిరువారాదనం చేసి, శ్రీవైష్ణవ అతిథులకు వడ్డించి, చివరికి తాము మిగిలిన ప్రసాదాన్ని తీసుకోవాలి. బ్రాహ్మణులు తమ భవిష్యత్తు కోసం ఎప్పుడూ సంపదను కూడపెట్టకూడదు. ఇలాంటి అనేక ఆంక్షలు ఉన్నాయి, పాత రోజుల్లో వాటిని ఖచ్చితంగా పాటించేవారు.

 • పెరియాళ్వారులు పెరియాళ్వార్ తిరుమొళి 4.6.3 “పిచ్చై పుక్కాగిలుం ఎమ్పిరాన్ తిరునామమే నచ్చుమిన్” – మీరు యాచిస్తున్నప్పటికీ, దయచేసి నా ప్రియమైన భగవానుడు శ్రీమాన్నారాయణుని నామమును ప్రేమతో స్మరించుకోండి – కాని భగవానుని నామములను గట్టిగా జపిస్తూ యాచించి సంపాదించడం ఒక అడ్డంకి. ఇక్కడ, మనం “భిక్షను ఈయమని బలవంతం చేయడం” అని అర్థం చేసుకోవచ్చు, అటువంటి వాటికి దూరంగా ఉండాలి.  అనువాదకుల గమనిక: ఈ పాసురము “కాసుం కఱైయుడై” పదిగంలోని భాగం. మాముణుల వ్యాఖ్యానంలో ఇలా వివరిస్తుంనారు, ఆళ్వారులు  ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు భగవాన్ పేర్లను పెట్టమని ప్రోత్సహిస్తున్నారు, పైగా అర్ధంలేని భౌతిక పేర్లకు బదులుగా యాచించడం ద్వారా వారి జీవనోపాధిని సంపాదించాలి. తమ పిల్లలకు భగవాన్ పేర్లను పెట్టడం ద్వారా, వారు భగవాన్ పేరును ఎప్పటికప్పుడు పిలవడం ద్వారా నిరంతరం ఆనందించవచ్చు. అలాగే, భగవాన్ పేర్లతో పిల్లలకు పేరు పెట్టడం ద్వారా, పిల్లల తల్లి కూడా నరకానికి వెళ్ళకుండా కాపాడుతుంది. ఈ 3 వ పాసురంలో ప్రత్యేకంగా, మాముణుల చేత ఒక సంఘటన కీర్తించబడింది, ఇది తిరువాయ్మొళి పిళ్ళై, నాలూరాచాన్ పిళ్ళైను ఉటంకిస్తుంది. ఒకసారి ఒక బ్రాహ్మణుని భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డకి అతను సకల సంపద,  శ్రేయస్సు తెచ్చే దేవత పేరు పెట్టాలనుకుంటున్నాడు. ఒక వ్యక్తి వైశ్రవావణాన్ (సంపదకు దేవత అయిన కుబేరుని పేరు) అన్న పేరు పెట్టమని సలహా ఇస్తాడు. అక్కడ ఉన్న ఒక ఆస్టికుడు, “అలాంటి అర్థంలేని పేర్ల సలహా ఇవ్వద్దు. అతనికి శ్రీమన్నారాయణ నామాలతో పేరు పెట్టండి – అతను జీవనోపాధి కోసం యాచనం చేసినా పరవాలేదు” అని అంటాడు. మాముణుల వివరిస్తూ, పిల్లలకి ఎమ్పెరుమాన్ నామంతో పేరు పెట్టినప్పుడు, తన జీవనోపాధి కోసం యాచించనవసరం లేని విధంగా అతన్ని రక్షించి, వారి పెంపు పోషణ ఎమ్పెరుమాన్ నిర్వహిస్తాడు –  అతను మనలను రక్షిస్తాడని ఎమ్పెరుమాన్ మీద గట్టి నమ్మకం ఉండాలి. అంతేకాకుండా, ఈ భాగం ఎక్కువగా భిక్షాటన గురించి మాట్లాడుతున్నప్పటికీ (ఇది బ్రాహ్మణుల జీవనోపాధి యొక్క ప్రధాన పద్ధతి), ఇది విరాళాలు, బహుమతులు మొదలైనవిగా మనకు లభించే ఏదైనా డబ్బు / సంపదతో సులభంగా సంబంధించ వచ్చు.
 • శ్రీవైష్ణవునిగా  భిక్షాటన చేయుటకు వెనుకాడటం ఒక అడ్డంకి. భిక్షాటన తమ సొంత వర్ణాశ్రమ ధర్మానికి (బ్రహ్మణుల / బ్రహ్మచారులు / సన్యాసులకు) కూడా ఇది సరైనది. అనువాదకుల గమనిక: భిక్షాటన చేసిన కూరత్తాళ్వాన్ను మనం గుర్తు చేసుకోవచ్చు. అలాగే, శ్రీ రామానుజులు కూడా సన్యాసి  కావడంతో, కొంతమంది దుండగులు అతన్ని విషమిచ్చి చంపాలని ప్రయత్నించే వరకు వారు స్వయంగా భిక్షాటన చేసారు. తిరుక్కోష్టియూర్ నంబి యొక్క ఆదేశం మేరకు, కిడంబి ఆచాన్ని  ఎమ్పెరుమానార్ యొక్క భిక్షను (ప్రసాదం) జాగ్రత్తగా చూసుకోమని నియమిస్తారు. పాత రోజుల్లో, గురుకులం కాలంలో సాధారణంగా  బ్రహ్మచారులు భిక్షాటన చేసేవారు, ముడి పదార్థాలను సేకరించి, వారి గురువులకు సమర్పించేవారు.
 • భిక్షాటన కేవలం కడుపు నింపుకొని, తద్వారా డబ్బును కూడబెట్టుకోవడం ఒక అడ్డంకి. భిక్షాటన మన ప్రాథమిక అవసరాలను చూసుకొని,  కైంకర్యాలను సులభతరం చేయడానికి చేయాలి.
 • భిక్షాటన తమ వర్ణాశ్రమం ధర్మానికి తగిన ధర్మమన్న అవగాహనతో భిక్షాటన చేయాలి. అలాంటి అవగాహన లేకపోవడం ఒక అడ్డంకి. ఇది మునుపటి చర్చా అంశాలకు సమానమైనది.
 • భిక్షాటన మన పూర్వాచార్యులు అనుసరించినదన్న అవగాహనతో చేయాలి, శారీరక అవసరాలను తీర్చడానికి ఇది సరైన పద్ధతి అని చేయాలి. అలాంటి అవగాహన లేకపోవడం ఒక అడ్డంకి.
 • పిడికిలితో ఇచ్చిన భిక్షతో సంతృప్తి చెందకపోవడం, తక్కువ భిక్ష పొందినందుకు చింతించుట ఒక అవరోధం. కొన్ని ప్రదేశాలలో, కొన్ని సమయాల్లో మాత్రమే భిక్షాటన చేసి ఇచ్చిన దానితో సంతృప్తి చెందాలి.
 • ఎక్కువ భిక్ష లభించినప్పుడు ఎక్కువ ఆనందించడం కూడా ఒక అడ్డంకి. భగవాన్ యొక్క దివ్య అనుగ్రహంతో ఈ రోజు ఎక్కువ భిక్ష లభించిందని, ఆ భిక్షను అదే రోజున అవసరమైన వారికి పంచాలి. అనువాదకుల గమనిక: భగవద్గీత, 2.14 లో, ఎమ్పెరుమాన్ “మాత్రా స్పర్సాస్ తు కౌంతేయ సీతోష్ణ సుక దుఖ దాః  ఆగమాపాయినో నిత్యాస్ తాం తితిక్షవ భారత” – ఓ కౌతేయ (కుంతీ పుత్ర – అర్జున), ఇంద్రియాల ద్వారా గ్రహించబడే వేడి / చలి, ఆనందం / దుఃఖం మొదలైన వాటితో బాధపడకూడదు. ఓహ్ భారత (భరత వారసుడు), నీవు అలాంటి వ్యత్యాసాలను తట్టుకొని వాటి కంటే పైకి ఎదగడం నేర్చుకోవాలి “. కాబట్టి, తాత్కాలిక సుఖాలు, దుఃఖాలు, నొప్పులు, బాధలన్ని అన్ని సమయాల్లో తట్టుకోవాలి / నియంత్రించాలి.
 • మునుపటి అంశం మాదిరిగానే ప్రతిరోజూ ఒక నిర్దిష్ట పరిమాణ భిక్షతో సంతృప్తి చెందాలి – ఎక్కువ పొందాలని అత్యాశ ఉండకూడదు.
 • భగవాన్ నామాలను “గోవింద! గోవింద!” అని గట్టిగా వినపడేటట్టు పఠించాలి, భిక్ష ఇచ్చేవారు భగవాన్ పేర్లను వింటారు. అలా చేయకపోవడం ఒక అడ్డంకి.
 • భగవాన్ నామాలను పఠించడం శిష్టాచారము (పెద్దల అభ్యసించినది) ప్రకారం జరుగుతుందన్న మనస్తత్వంతో మాత్రమే చేయాలి.
 • భగవాన్ నామాలను పఠించడం భిక్ష పొందేందుకు మార్గమని అనుకోకూడదు. మునుపటి వివరణకు సంబంధించినది – నామ జపం మన రాకను సూచించేదుకు కాని భిక్ష ఇవ్వమని వారిని బలవంతం చేసినట్టు కాదు.
 • అన్య దేవతలు (దేవతాంతరములు – భగవాన్ మరియు ఆళ్వారులు / ఆచార్యలు కాకుండా) పూజించే ఇళ్ళ వద్ద భిక్షాటన చేయడం ఒక అడ్డంకి. దేవతాంతరముల సంభందం ఉన్న వ్యక్తుల నుండి భిక్ష కూడా స్వీకరించకూడదు.
 • భగవత్ తిరువారాధనాన్ని తక్కువగా చూసే ఇళ్ళ నుండి భిక్షాటన చేయకూడదు.
 • శుక్రవారాలలో నేలను తుడిచే  (శుభ్రం చేయబడిన) ఇళ్ళ నుండి భిక్షను స్వీకరించడం. ప్రతిరోజూ కాకుండా శుక్రవారం మాత్రమే ఇంటిని శుభ్రపరిచే వ్యక్తులను ఖండిస్తున్నట్లు చూడవచ్చు. అనువాదకుల గమనిక: శుక్రవారం నేలను  తుడువకూడదని శాస్త్రంలో నిషేధం ఉండే అవకాశం ఉంది.
 • భగవాన్ నామాలను విని సంతోషించని ఇండ్ల నుండి భిక్షను స్వీకరించడం ఒక అడ్డంకి.
 • భగవాన్ / భాగవతులను అవమానించిన ఇండ్ల నుండి భిక్షను స్వీకరించడం ఒక అడ్డంకి
 • భిక్షాటన చేయుట శ్రీవైష్ణవుల సరైన చర్య అని అర్థం చేసుకోకుండా శ్రీవైష్ణవులను అవమానించిన వారి ఇండ్ల నుండి భిక్ష స్వీకరించడం ఒక అడ్డంకి. భిక్షాటన  శ్రీవైష్ణవుల సరైన ధర్మానుష్టానము  – దీనిని తక్కువగా చూడకూడదు.
 • దేవతాంతరములకు ప్రియమైన లేదా దేవతాంతరములను ఆరాధించే వారితో నిండిన గ్రామానికి / పట్టణానికి వెళ్లడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ప్రత్యేకంగా  దేవతాంతరములు ప్రాచుర్యం పొందిన అనేక పట్టణాలు ఉన్నాయి – శ్రీవైష్ణవులు  అటువంటి పట్టణాలకు వెళ్లకుండా ఉండాలి.
 • శ్రీమన్నారాయణుని ఆలయాలు లేని ఊర్లల్లో భిక్ష స్వీకరించుట ఒక అడ్డంకి.
 • భగవత్ తిరువారాదనం క్రమం తప్పకుండా చేయని ఇళ్ళలో భిక్షాటన చేయకూడదు.
 • ఒక ప్రపన్నుడు కావడం వల్ల, పండుగ రోజులలో మాత్రమే భిక్షాటనను వెళ్ళడం  దివ్య ప్రబందం పఠించడం ఒక అడ్డంకి. దివ్య ప్రబందం తప్పక పఠించి  ప్రతిరోజూ వాటి అర్థాలను గుర్తుచేసుకోవాలి – కాని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కాదు.
 • ఖాళీ సమయం ఉన్నప్పుడు, దివ్య ప్రబంద పారాయణం చేయడంలో మరియు అర్థాలను గుర్తుచేసుకోవడంలో నిమగ్నమై ఉండాలి. ప్రాపంచిక విషయాల గురించి చర్చించడంలో మన విలువైన సమయాన్ని వృథా చేయకూడదు. నమ్మాళ్వార్ పెరియ తిరువందాదిలో ఆశ్చర్యపోతూ ఇలా అన్నారు “మనుషులు ఎమ్పెరుమాన్ మరియు వారి దివ్య గుణాల గురించి ఆలోచించకుండా ఎలా వారి సమయం గడుపుతారు?”
 • రహస్య మంత్రాలు / గ్రంథాల గురించి బహిరంగంగా మాట్లాడటం/చర్చించడం ఒక అడ్డంకి. రాహస్య అర్ధాలను ఆచార్యుల నుండి వినాలి,  బహిరంగంగా చర్చించకూడదు.
 • చెడు సంఘంలో ఉండటం ఒక అడ్డంకి. చెడు సహవాసం అంటే దుర్మార్గపు వ్యక్తులు, అజ్ఞానపు మూర్ఖులు తో సహవాసం చేయడం, ఎవరైతే వారి నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోనివారు మొదలైనవారు. ఉపనిషత్తులు ఇలా ఘోషిస్తున్నాయి “అసన్నేవ స భవతి – అసత్ బ్రహ్మేది వేదచేత్” –  భగవంతుడు ఉన్నాడని గ్రహించని వారు కేవలం ఒక పదార్థం మాత్రమే.
 • ప్రాపంచిక ఆనందాల నుండి కళ్ళు మరలించకపోవడం ఒక అడ్డంకి. భగవత్ / భాగవత విషయాలపై దృష్టి పెట్టాలి, స్త్రీలు, రాజకీయాలు మొదలైన ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండాలి. తొండరడిప్పొడి ఆళ్వార్ తన తిరుమాలైలో ప్రాపంచిక ఆనందాలకు బానిసలాంటి వైఖరిని అతి తీవ్రంగా ఖండించారు.
 • మనం జాగ్రత్తగా అడుగులు వేసి, మన అంతిమ లక్ష్యంపై పూర్తిగా దృష్టి పెట్టాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి.
 • భిక్ష కోసం వెళ్ళేటప్పుడు శాంతియుతంగా ఉండకపోవడం ఒక అడ్డంకి.
 • అముదు పడి కూడై (భిక్ష పాత్ర)ని స్వీకరించి ఆచార్యులకు సేవ చేయకపోవడం ఒక అడ్డంకి.
 • అలాంటి పాత్రను తలపై కిరీటంలా ఆనందంతో మోయాలి.  భిక్ష పాత్రను తీసుకెళ్లడం తక్కువ పనిగా పరిగణించకూడదు. అలా చేయడం ఒక అడ్డంకి.
 • భిక్ష కోసం వెళ్ళేటప్పుడు ద్వయ మహమంత్రాన్ని నిరంతరం పఠించాలి / గుర్తుంచుకోవాలి. శ్రీవైష్ణవులకు, ద్వయం యొక్క నిరంతర పారాయణం సహజం. ద్వయం యొక్క లోతైన అర్ధాలను గుర్తుంచుకోవడంతో పాటు ద్వయ పఠనం చేయాలి. శ్రీరంగనాథుడు ఎమ్బెరుమానార్ని శ్రీరాంగంలో ఉండి ద్వయం యొక్క నిరంతర  పఠనం చేయమని ఆదేశిస్తారు – “ద్వయం అర్థానుసందేన సహ యావచ్చరీర పాదం అత్రైవ శ్రీ రంగే సుకమాస్వ” –  అర్ధాలను గుర్తుంచుకోవడంతో పాటు ద్వయ పఠనం చేస్తూ ఈ శ్రీరంగంలోనే తన జీవితాంతం సంతోషంగా ఉండిపో.
 • పంచ సంస్కారం కాని వారి నుండి భిక్ష స్వీకరించడం. పంచ సంస్కారం అనేది ఒక వ్యక్తిని శ్రీవైష్ణవ సత్ సాంప్రదాయంలోకి ప్రవేశింపజేసే ఒక  ప్రక్రియ. ఆ సంస్కారం అయ్యే వరకు, మనము వారి నుండి ఏదీ స్వీకరించలేము.
 • పాముల ఆకారంలో చెవిపోగులు ధరించే వారి నుండి భిక్ష స్వీకరించడం. సాధారణంగా శ్రీవైష్ణవులు సాధారణ చెవిపోగులు లేదా భగవాన్ యొక్క శంఖు చక్రాలు ఉన్న వాటిని ధరిస్తారు.
 • అహం మరియు అహంకార వైఖరితో నిండిన వారి నుండి భిక్ష స్వీకరించడం. తమను తాము దాసులు, అడియేన్ మొదలైనవిగా పరిగణించాలి, ఇది దాసత్వాన్ని సూచిస్తుంది.
 • భిక్షను స్వీకరించేటప్పుడు, ఒక భాగాన్ని ఆచార్యునికి, శ్రీవైష్ణవులకు మరొక భాగాన్ని, భగవాన్ కోసం మరొక భాగాన్ని ఉంచాలి. వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి భిక్షను స్వీకరించడం సరైన పద్దతి కాదు.
 • సేకరించిన ఏదైనా భిక్షను ఆచార్యుల దగ్గరికి తీసుకువెళ్ళాలి, వారు అనుమతించిన తర్వాత మాత్రమే తనకు అవసరమైన భాగాన్ని ఇంటికి తీసుకెళ్లాలి.
 • సేకరించిన భిక్ష (ముడి పదార్థాలు) బహిర్గంగా అందరికీ చూపించకూడదు. వాటిని సరిగ్గ కప్పి  ఇంటికి తీసుకెళ్ళి, వండి, ఎమ్పెరుమాన్కి అర్పించి తరువాత ప్రసాదంగా తినాలి.
 • సంసారులను (భౌతికంగా ఆలోచించే వ్యక్తులు) ప్రశంసిస్తూ భిక్ష సేకరించకూడదు.
 • ఏదైనా సంపాదించేటప్పుడు శ్రీవైష్ణవులను బలవంతం చేయకూడదు.
 • ఆచార్యుల యొక్క ఆస్తి / సంపదను దొంగిలించడం ద్వారా సంపాదించడం గొప్ప పాపం.
 • భగవాన్ యొక్క ఆస్తి / సంపదను దొంగిలించి సంపాదించడం. ఆలయ సంపద, ఆస్తులు మొదలైనవాటిని మళ్లించడం/ దొంగిలించడం లాంటి చర్యలను గొప్ప పాపాలుగా భావిస్తారు.
 • భగవాన్ ఆస్తి / సంపదను దొంగిలించే వ్యక్తుల నుండి యాచించి సంపాదించడం. అనువాదకుల గమనిక: శ్రీవచన భూషణంలో, పిళ్ళై లోకాచార్యులు వివిధ రకాల అపచారాల గురించి వివరిస్తున్నారు. భగవత్ అపచారం, భాగవత అపచారం మరియు అసహ్యాపచారం. భగవాన్ ఆస్తి / సంపదను దొంగిలించే ఈ అంశాన్ని భగవత్ అపచారంగా వివరించారు. అంతే కాదు, భగవాన్ యొక్క ఆస్తి / సంపదను దొంగిలించేవారికి  సహాయపడటం మరియు అలా  దొంగిలించిన సంపదను యాచించి పొందడం లేదా ఇచ్చినప్పుడు అటువంటి సంపదను స్వీకరించడం కూడా భగవత్ అపచారంగా గుర్తించబడుతుంది – అందువల్ల ఇటువంటి చర్యలకు దూరంగా ఉండటం మంచిది.

అనువాదకుల గమనిక: ఈ సుదీర్ఘ విభాగాన్ని ముగించడానికి, డబ్బు సంపాదించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుత వ్యవస్థలో మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము, ఇక్కడ మొత్తం వ్యవస్థ మన శాస్త్రం అందించిన ఆదర్శాలకు విరుద్ధంగా అయిపోయాయి.  శాస్త్రానికి ప్రత్యక్ష విరుద్ధంగా సంపాదించబడిన డబ్బు చాలా ప్రసరణలో ఉంది. ఇది మన అవసరాలను పూర్తిగా తగ్గించడానికి మరొక సూచన, ముఖ్యంగా ఈ ప్రాపంచిక ఆలోచనలు మరియు జీవనశైలిలో చిక్కుకోకుండా మనల్ని రక్షించడానికి ఎమ్పెరుమాన్ని నిరంతరం ప్రార్థించాలి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/02/virodhi-pariharangal-18.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s